Wednesday, May 1, 2013

పి.డి. సుందర్రావు ప్రేలాపనలు

యోచనాశీలురైన పాఠక మిత్రులారా !

పి.డి.సుందర్రావుగారి మతిమాలిన మాటలతో గాయపడిన మనస్సులెన్నో అతనిపై నిరసనగళాన్ని విప్పాయి. పరోక్షంగా అంబేద్కర్‌ను, అన్యాపదేశంగా రాజ్యాంగరూపకల్పనలో పాలుపంచుకొన్న మేథావి వర్గాన్నీ, పనికిమాలిన వెధవులన్నట్లు, సొంత తెలివిలేని వాళ్ళన్నట్లూ, కాపీరాయుళ్ళ కాపీరాతలే రాజ్యాంగమన్నట్లు తెగవదరేశాడితగాడు. అరకొర జ్ఞానమూ, అజ్ఞానమూ, మిధ్యాజ్ఞానము కలగలవడంతో కన్నులకెగదట్టిన అహంభావంతో, గత రెండు థాబ్దాలుగా, బానిస మనస్థత్వంతో బోయీల మాదిరి అతని పల్లకీ మోస్తున్న మంద మధ్యలో తెగ ప్రగల్బించి న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను, విజ్ఞానాన్ని, వైజ్ఞానికతనూ, వివిధ భావ విప్లవ క్షేత్రములలో పనిచేస్తున్న సంఘహితైషుల్నీ ఎడాపెడా తెగనాడుతూ వస్తున్నా, ఎన్నంటున్నా ఎవరూ పట్టించుకొకపోవడం వల్ల తలకెక్కిన విపర్యయ దురాగ్రహము జతకూడి మదమెక్కిన ఏనుగులా కడకు రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ నిర్మాతలను, ప్రధాన సూత్రదారి అయిన అంబేద్కరునూ, జాతీయ జెండానూ కూడా అవమాన పరుస్తూ ఘీంకారాలు చేశాడు. అలాంటి అజ్ఞాన మదాంధులకు అంకుశం పోటుపడకుండా చూపు, నడకా సరికాదు.

ఆవు ఎక్కడో దూడ అక్కడే నన్నట్లు, అతని చేతిక్రింద తయారైన మందలోని ముఖ్యులందరూ అదే పోకడనందుకొని, అదరగండంగా మాట్లాడడం చేస్తూవస్తున్నారు. మొన్నటికిమొన్న జమినీ టి.వి. వాళ్ళేర్పరచిన కార్యక్రమంలోనూ, పి.డి. తరపున పాల్గొన్న 'సంతోష్‌కుమార్‌' పెడపోకడ ఆ ప్రసారాన్ని శ్రద్ధగా చూసినవాళ్ళందరికీ అనుభవానికి వచ్చింది. వందల ఫోన్లు - నిజానికి వేయి ఫోన్లు వచ్చాయి నాకు. అందరిదీ ఒకటేమాట, అతగాడు ఇతరులను మాట్లాడనీయడు, మిగిలిన వారు మాట్లాడుతున్నది వినడు, అడుగుతున్నది పట్టించుకోడు, అసలు విషయాన్ని విచారణకు రానీయకుండా  ఇతరేతరాంశాలను లేవనెత్తి చర్చజరగకుండా అడ్డుపడడమే పనిగాపెట్టుకున్నాడు. అతణ్ణి మీరదుపుచేయలేకపోయినా, సమన్వయకర్త 'సాయి' అదుపులోనూ ఉండకపోవడం, అతనిలోని తెగబడినతనాన్ని కళ్ళకు కట్టినట్లు పట్టిచ్చింది మాకు. అయినా 'సాయి' అతణ్ణి నిలువరించి ఉండాల్సింది అన్నదే ఆ మాట.

అట్టివారందరికీ నేనొక్కటే సమాధానం చెప్పాను. ప్రజలందరికీ ఆ విషయం మేము చెప్పకుండానే కండ్లకు కట్టినట్లు బోధపడటమే, ఆ రకంగా ఆ పక్షపు అడ్డగోలుతనాన్ని అతడే బైటపెట్టుకోవడమే ఆ కార్యక్రమం విజయవంతమైందనడానికి గుర్తు. ఆ గుంపు, విధం తెలిసిన వాళ్ళు కాదనీ, నిజం కొరకు నిలిచేవాళ్ళూ కాదనీ, నోటి తుత్తరతనంతో తమపెద్ద వదరిన దానికి సిగ్గుపడే నైజంకానీ, పశ్చాత్తాపపడే నైజం కానీ, తప్పులనొప్పుకొని సరిదిద్దుకునే నిజాయితీ గానీలేని వాళ్ళనీ, అందరికీ తెలిసిపోయింది. వారెంతటి అడ్డగోలు మనుషులో వారి ప్రవర్తన ద్వారా లోకానికి తెలియవచ్చినంత చక్కగా మనమే పూనుకొని తెలపాల్సివస్తే అది కొన్ని నెలలపాటు పెద్దఎత్తున ప్రచారం చేసినా అంతగా అయ్యేదికాదు. నిజానికా కార్యక్రమంలో సంతోష్‌కుమార్‌ పోయిన పోకడ వాళ్ళ చెప్పుతో వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నట్లయింది. ఆ విధంగా ఆ జెమినీ టి.వి. కార్యక్రమం గొప్పగా సఫలమైందనాలి.
ఇక జెండాను 'మసిగుడ్డ' అనలేదు. గుడ్డముక్కన్నారు, మసిగుడ్డని ఎక్కడన్నాడో చూపించని చాలాసేపు సాగదీస్తూ నానా యాగీ చేశాడు సంతోష్‌కుమార్‌. అక్కడికదేదో గుడ్డముక్కనడం తప్పుకాదు, మసిగుడ్డంటేనే తప్పు అన్నట్లు తెగ అదరగండంగా మాట్లాడాడు. మనం అంటే భారత జాతి అంతా ఇక్కడ పట్టిచూడాల్సింది. మసిగుడ్డన్నాడా, గుడ్డన్నాడా అన్నది కానేకాదు. జాతీయ జెండాను అవహేళన చేస్తూ మాట్లాడాడా లేదా అన్నదే మన ప్రశ్న. అస్సలు గుడ్డ, పుల్ల లాటి విరుపు మాటలెందుకన్నావురా - కొడకా? అన్నదే మనమడగాల్సిన ప్రశ్న. టి.వి.లో ఆ సందర్భంలో పి.డి. వాళ్ళు రికార్డు చేసిన సి.డి. క్లిప్పింగులో ఆమాటలంటున్న పి.డి. సుందర్రావు శరీర భంగిమకానీ, ముఖములో కనబరచిన హావభావాలు గానీ, గొంతులో కనబరచిన హేళన ధ్వనులు గానీ చూసిన జనం, ఆ నిముషానే అతన్ని ఈడ్చుకెళ్ళి పోలీస్‌ స్టేషన్‌లో పడేయాల్సింది. ఇంకా సరిగ్గా చేస్తే నేరుగా న్యాయాలయానికి (కోర్టుకు) లాక్కెళ్ళి జడ్డికి అప్పగించాల్సింది. ఆ పని చేయాలని ఆ క్షణంలో మన వాళ్ళకు తట్టకపోవడం వల్ల గానీ, సొంత మంద మధ్యలో ఉన్న అతన్ని ఈడ్చుకెళ్ళడానికి తగినంత సమూహబలం లేకపోవడం వల్లగనీ ఆరోజు జరగాల్సిన పని సరైనరీతిలో జరగలేదు. ఆవేశానికి లోనై అక్కడకు చేరిన దళిత సోదరుల దృష్టంతా అంబేద్కరును తిట్టాడన్న దానిపైనే వుందిగానీ, ఆ తప్పేగాక, ఇంకా పెద్దదైన మహాపరాధం చేశాడితడు అన్న దృష్టి ప్రధానం గాలేదు. అయితే క్రమంగా విషయాన్ని పరిశీలిస్తున్న వారినుండి, ఈ అంశాలూ ఆందోళనలో జతకూడాయి. పి.డి. చాలా ప్రమాద కరమైన పోకడపోయాడన్నది అర్థం కాసాగింది.

జెమిని టి.వి.

సాధారణ ప్రజల దృష్టిలో చిన్నదిగా కనిపించే ఈ సమస్య చిన్నది కాదనీ, మొత్తం జాతికి జాతంతా కుల,మత, ప్రాంత, వర్గాలకతీతంగా స్పందించాల్సిన, ఖండించాల్సిన మౌలికాంశమని గుర్తించి దానికివ్వాల్సినంత ప్రాధాన్యతనూ ఇచ్చి, పి.డి.సుందర్రావు సొంత మంద నుండీ - వారితో సంబంధాలున్న మందనుండీ ఎంతో వత్తిడీ, బెదిరింపులూ, బేరసారాలు, బ్రతిమలాటలూ లాంటి చతుర్విద అభిప్రాయాల సంప్రదింపులు జరుగుతున్నా, వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి జాతి గౌరవాన్ని కించపరచిన పి.డి.పెడపోకడను, సంఘవ్యతిరేక వైఖరిని బట్టబయలు చేయడానికే సిద్దమైనందుకు మనమంతా జెమిని టి.వి. యాజమాన్యానికీ తగినంత సమాచారాన్ని సేకరించడంలో ఎదురయ్యే ఇబ్బందుల నన్నింటినీ సహించడానికి సిద్దపడిన ఆ చానల్‌ ఉద్యోగుల బృందాన్ని మనసావాచా కర్మణా అభినందించాలి. ప్రజలంతా వారికి నైతిక మద్దతును తెలపాలి. అనంతర చర్యల విషయంలో ఆ ఛానలు, ఇతర ఛానళ్ళూ, ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలి. పి.డి. సుందర్రావు శిక్షింపబడేంత వరకు ఊరుకుండరాదు. అలాటి సాహసానికి మరొకరు పూనుకోకుండా ఉండేలా విషపు మొక్కలాటి అతని పోకడ శిక్షంపబడాలి. సాధారణ ప్రజల ఆవేశం గడ్డిమంటలా వుంటుంది. క్షణకాలం ఉవ్వెత్తున లేచి చల్లారిపోతుంది. ఈ విషయం పి.డి.సుందర్రావు లాటి మందకు బాగా తెలుసు. నాలుగు రోజులు ఊరుకుంటే అదే సమసిపోతుందిలే అని అనుకుంటూ గమ్మునుండే ఎత్తుగడతో వుంటారు. కనుక భౌతికంగా ఆవేశకావేషాలకు లోనవడం, అంతటితో సరిపెట్టుకోవడం అనే విధానానికి స్వస్తిచెప్పి, పి.డి.సుందర్రావు పైనా, అతని పక్షంలో తప్పులేదంటూ పలుకుతున్న వారిపైనా కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పూనుకోవాలి. పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేసి కోర్టుకు అప్పగించాలి. లేదా న్యాయాలయాలే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అతనిపై న్యాయపరమైన విచారణకు ఆదేశించి సత్వరం అతన్ని శిక్షించాలి.

పి.డి.సుందర్రావుకు మతి సరిగనే వుందా?

లోకమంతా ఎవనికి పురుగుల్లా, దోమల్లా కనిపిస్తుంటుందో, అందరూ దొంగల్లానే కనిపిస్తుంటారో, తాను తప్ప సరైనవాడు మరెవ్వరూ లేడనిపిస్తుంటుందో, అలా అనిపించడంలో అనుకుని ఊరుకోక ఆ రీతిగనే ప్రేలాపిస్తుంటారో అతన్ని మతి మంచిగున్నవాడు అనడం కుదరదంటాను. మీరేమంటారు ?
ఏ ఒక్కనితోనూ, ఏ రకంగానూ పోరాడకుండగనే అందరినీ ఓడించేశాను, జయించేశాను, జయశాలిని నేను అనుకునే వాడిని, అనుకొని ఊరుకోక పైకి అంటుండే వాడికి బుద్ది శుద్దంగనే పనిచేస్తుందనుకోగలమా? అతని సంగతి సరే ఇంత విడ్డూరంగా ప్రవర్తిస్తున్న వాడ్ని సర్వజ్ఞుడంటూ నెత్తికెత్తుకుంటున్న వారి మానసిక స్థితినేమనుకోవాలి? నేను నోరెత్తబట్టే లాడెన్‌ చచ్చాడు, నేను తండ్రికి చెప్పబట్టే దీదాత్‌ కుళ్ళికుళ్ళి చచ్చాడు. నేను చెప్పబట్టే వీరప్పన్నూ చచ్చాడు. సద్దాం హుస్సేన్‌నూ ఉరితీయబడ్డాడు అంటూ సంధిప్రేలాపనలు చేస్తున్న వాడ్ని మామూలు జనం మధ్య ఉండనీయడం సబబంటారా?

తనను ఎదుర్కోబట్టే వెంకటాద్రికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందన్నాడు పి.డి. ఎన్‌.వి.బ్రహ్మాన్ని చీరాలలోనే ఓడించేశానన్నాడు. ఇలాంటి వాళ్ళపైన నోరెత్తకుండా ఊరుకుంటున్నది, తండ్రికి చెప్పకుండా ఊరుకుంటున్నది వాళ్ళమీద జాలి, కరుణలతోనేనని అంటున్నాడు. నాకు కోపం తెప్పించకండ్రా! కోపము వచ్చి ఏమైనా అన్నానా చచ్చిపోతారు అనీ అనేస్తున్నాడు. ఈరకంగా మాట్లాడే వానికి మతిచలించలేదు, బుద్ది గడ్డితినడం లేదు అని మనకు మనమైనా సర్ధిచెప్పుకోగలమా?

లోకంలో ఏసు తరువాత బైబిలు తెలిసినవాడ్ని తానేననీ, బైబిలుకు అపవ్యాఖ్యానాలు చేసే క్రైస్తవుల నందరినీ గదమాయించి మదమణిగించడానికే తండ్రి తనని ఎన్నుకొని పంపాడంటున్నాడు పి.డి.సుందర్రావు. నిజంగా బైబిలును నెత్తినెట్టుకున్న క్రైస్తవులైనా ఈ మాటలు సరైనవే, బుద్దున్నవాడు పలికినవేనని అంగీకరించగలరా? తన గుంపు వాళ్ళు కాని క్రైస్తవులందరినీ లేపెయ్యడానికే వచ్చానంటున్నాడు ఈ పి.డి.సుందర్రావు.
మన ముందున్న సమస్యలు రెండు

1. బైబిలు లోని ఆయా విషయాలకు చెందిన ప్రకటనల సబబు బేసబబులేపాటి వన్నదొకటి. 2. బైబిలు విషయంలోనూ, ఇతర ప్రాపంచిక మరియు విశ్వ సంబంధ విషయాలలో తనను తానే సర్వజ్ఞానినని ప్రకటించుకున్న పి.డి.సుందర్రావు అవగాహన లోని సబబు బేసబబులేపాటివన్నది మరొకటి.
గమనిక : ఆయా విషయాలపై అతని జ్ఞాన స్థాయి ఏమిటన్నది మాకేగాక, అన్ని థోరణుల వారికీ పరిశీలనాంశమే. ఈ విషయంలో ఆస్థికులు, నాస్తికులు, అన్వేషకులూ కూడా కలసి అతనేమిటో పరిశీలించవచ్చు. దీనితో ముడిపెట్టకుండా, దీనికి వేరుగా బైబిలు విషయాన్ని మరోసారి బైబిలు పక్షీయులూ, బైబిలేతరులూ కూర్చోని మాట్లాడు కోవచ్చు. ఆ వేదికపై ఒక్క బైబిలునే కాక ఆయా థోరణుల వారు గాని సిద్ధపడితే ఏ మత, తాత్విక థోరణినైనా పరిశీలనకు - పరీక్షకు స్వీకరించవచ్చు. అందుకవసరమైన నియమ నిబంధనలను, వాటిని అమలుపరచేలా చూసే నిష్పాకక్షుకులైన పరిశీలనా బృందాన్ని మునుముందుగనే అందరం అనుకొని ఎంపిక చేసుకోవచ్చు. అందులో

1. విజ్ఞాన శాస్త్ర సమాచారాన్ని అందించగలవారు.
2. వివక్షా రహితంగా విషయాల విచారణ చెయ్యగలవారు
3. ఆయా తాత్విక థోరణులకు చెందిన అధికారిక ప్రతినిధులు, ఉండేలా శ్రద్ధ తీసుకోవచ్చు.

గమనిక : మండలి అట్టి వేదిక నిర్వహణ భారాన్ని మోయడానికి సిద్ధంగా వుంది. వేదికలోని సంభాషణలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డుల ద్వారా భద్రపరచవచ్చు. వేదిక పక్షాన్నుండే కాక చర్చలో పాల్గొనే పక్షాలూ వారి వారి స్వంతంగాను చర్చనంతటినీ రికార్డు చేసుకోవచ్చు.

రాజ్యాంగము - మత స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్రము

రాజ్యాంగములో 14 నుండి 32 వరకు వివిధ ప్రాథమిక హక్కులు చెప్పబడి వున్నాయి. అందులో 25, 26, 27, 28 అధికరణాలు మతపరమైన స్వేచ్ఛకు సంబందించినవి కాగా, అధికరణం 19/1 ఆరు రకాల వ్యక్తిగత స్వేచ్ఛల గురించిన వివరాలున్నాయి. అటుపిమ్మట 19/2 నుండి 6 వరకు, 19/1 లో ప్రస్తావించబడ్డ స్వేచ్ఛలకు పరిమితులు చెప్పబడ్డాయి.

ఇకపోతే 51/ఎ అధికరణంలో 11 రకాల ప్రాథమిక విధుల వివరాలున్నాయి. ఈ మూడు విభాగాలకు చెందిన రాజ్యాంగ నిర్ధేశాలకు లోబడి ప్రవర్తించాల్సిందే ఏ పౌరుడైనా. అతడేమతస్తుడైనా, ఏ థోరణికి చెందిన, చెందని వాడైనా రాజ్యాంగానికి విధేయుడై ఉండడం, బద్ధుడై ఉండడం తప్పనిసరి. ప్రాథమిక విధులకు లోబడే ఎవరికైనా హక్కులు, ప్రాథమిక హక్కులు సంక్రమిస్తాయి. విధులకు లోనొల్లని వారికెవరికీ హక్కులు పొందే అర్హత, అధికారము ఉండదన్నది ఒప్పందాల ప్రాథమిక నియమాలనెరిగిన వారందరికీ తెలిసున్న విషయమే.

ఆధునిక భారతావనిలో అంటే ''భారత రాజ్యాంగం'' అనే ఒప్పందంక్రింద బ్రతుకుతున్న ప్రజలందరికీ అందే మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన హక్కులన్నీ ''లౌకిక రాజ్యమన్న'' భావనకు లోబడినవిగానే వుంటాయి. ఈ మధ్యకాలంలో రాజ్యాంగ స్ఫూర్తికి వేరుగా - అటు రాజ్యాంగం గానీ, ఇటు సాధారణ వ్యవహారంగానీ ప్రధాన మతాలుగా అంగీకరిస్తున్న లేదా తలంచుతున్న హిందూ, క్రైస్తవ, ముస్లిం సమూహాలకు చెందిన వారంతా తమది మతం కాదు, ధర్మము లేదా జీవన విధానము అన్న మాటలు అనడం మొదలుపెట్టారు. మత స్వేచ్ఛ క్రింద మనం విచారణ చెయ్యదలచుకున్న సందర్భాలలో ఈ మతమన్న మాటకు అందరంగీకరించే సమానమైన అర్థాన్నే చెప్పుకొని, ఒప్పుకొని తీరాలి. లేకుంటే రాజ్యాంగ ప్రకటిత మత స్వేచ్ఛకు అర్ధమే లేకుండా పోతుంది. ఇక్కడికిది నిజమో కాదో మనందరితో పాటు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షంగా వున్న పి.డి.సుందర్రావు, ఆయన సమూహమూ (మంద) కూడా నిక్కచ్చిగా, 'ఊగిసలాటలకు తావులేకుండా' తేల్చుకోవాల్సి ఉంది. ఈ విషయంలో పి.డి.సుందర్రావు పోకడ ఒకింత గందరగోళంగా, రెండు నాల్కల థోరణితో ఉంది.

నాకు తెలిసి, రాజ్యాంగం ప్రకారం హిందూ అన్న పేరు క్రిందకు చేరే వివిధ విశ్వాసాలు, ఆరాధనా థోరణులన్నీ హిందూ మతం క్రిందకే చేరతాయి. అందులో బౌద్ధము, జైనము, సిక్కు పంథా కూడా చేరివున్నాయి.
అలాగే హైందవేతరాల క్రిందికి వచ్చే మతాలుగా క్రైస్తవం, ఇస్లాం, యూదు సమూహాలు గుర్తింపబడ్డాయి. కనుక రాజ్యాంగాన్ననుసరించి చెప్పుకోవాల్సి వస్తే వివిధ హిందూ విశ్వాసాల క్రిందికి వచ్చేవారెవరు గానీ, బైబిలు, ఖురాన్‌లననుసరిస్తున్న సముదాయాల వారెవరు గానీ, మాది మతం కాదు, మేము మతస్తులం కాము అనడానికి వీలులేదు. కనుక అట్టివారంతా రాజ్యాంగం ప్రకారం మతస్తులే. వారువారు అనుసరిస్తున్నది ఆయా మతాలనే. ఇక్కడ మనమెవ్వరమూ గందరగోళపడటం గానీ, ఇతరులను గందరగోళ పరచటం గానీ చేయనేకూడదు.
ఇకపోతే మరో విషయాన్ని చెప్పుకుంటేగానీ లౌకిక దృక్ఫధం కలిగిన రాజ్యాంగం పేర్కొన్న మత స్వేచ్ఛను సరిగా అర్థంచేసుకున్నట్లు కాదు. అదెలాగంటే మత స్వేచ్ఛను కలిగి ఉండడమంటే ఒక గ్రంథం లేదా ఒక థోరణిని తయారుచేసి, వ్యాప్తిలోకి తెచ్చిన వ్యక్తి చెబుతున్న దానిపై విశ్వాసముంచడం, లేదా విశ్వాసముంచక పోవడం అన్న విషయంలో స్వేచ్ఛ కలిగి ఉండడం అని అర్థం. ఈ ఒక్కముక్క అర్థమైతేనే రాజ్యాంగం పేర్కొన్న మత స్వేచ్ఛకు అర్థం ఆచరణ రీత్యా పొసగుతుంది.

మత స్వేచ్ఛ అన్న మాటలో 1. ఏదేని ఒక మతాన్ని ఎంచుకొని దాన్ని అనుసరించడం, 2. కొంత కాలం అలాటి దేనినైనా అనుసరించీ అనంతరం ఏ కారణం చేతగాని, కారణం లేకనే గాని దానిని విశ్వసించక పోవడం వల్ల దానిని విడిచిపెట్టడం, 3. మరో మతాన్ని విశ్వసించి దానిని స్వీకరించడం, 4. ఏ మతాన్ని విశ్వసించక అవిశ్వాసిగా ఉండడం అన్న నాలుగు దృష్టులు చేరివున్నాయి.

రాజ్యాంగం కల్పించిన ఈ మతస్వేచ్ఛ అన్నది వారివారి మత గ్రంథాలలో వున్నదానిని యధాతధంగా అమలుచేయగలిగేదిగా వుండదు. రాజ్యాంగం అంగీకరించిన పరిమితులకు లోబడి మాత్రమే ఆ మత స్వేచ్ఛ ఉంటుంది. అదెలాగంటే బైబిలు పాత నిబంధనలోనూ, ఖురాన్‌ లోనూ దేవునికి మారుగా ఏ విగ్రహాన్ని ఆ మత విశ్వాసులూ తయారు చేసుకోకూడదు, ఆరాధించకూడదు అన్న నిబంధన ఉన్నది. బైబిలు, ఖురాన్‌ విశ్వాసులు విగ్రహాలను ఏర్పరచుకోకుండా ఉండే స్తేచ్ఛను భారత రాజ్యాంగంలోని ''మత స్వేచ్ఛ'' నిస్తున్న అధికరణం అంగీకరిస్తుంది.

అదే మరి ఆ రెండు గ్రంథాలలో విగ్రహాలను ధ్వంసం చేయమనీ, విగ్రహారాధకుల్ని కొట్టివేయమని ఆదేశించే వాక్యాలూ ఉన్నాయి. అలా ఉన్నాయి గదా అని మా మత గ్రంథం చెప్పినట్లు నడుచుకునే స్వేచ్ఛ మాకుంది అంటూ విగ్రహాలను, విగ్రహారాధకుల్ని వ్యతిరేకించే స్వేచ్ఛ ఆ రెండు గ్రంథ ప్రజలకూ ఈనాడు భారత రాజ్యాంగం ప్రకారం లేదు. అంటే రాజ్యాంగం నీ కిచ్చిన మత స్వేచ్ఛ నీ మత గ్రంధాలలో నిన్ననుసరించ మన్నందంతటికీ వర్తించేది కానేకాదు. అది ఇతర మత విశ్వాసాలలో జోక్యం చేసుకోనిదిగా ఉండితీరాల్సిందే. ఇక్కడ ఎవరికీ ఏరకమైన మినహాయింపూ లేదు. విషయం అర్థమవుతోందా? ఇది ఒకింత సున్నితము, సంక్లిష్టము అయిన విషయమగుటచే, మరికొంత వివరించుకోవడం మంచిదనిపిస్తోంది.

బైబిలు, ఖురాను లను జాగ్రత్తగా పరికించిచూస్తే వాటి వాటి కాలాలలోని సమాజాలు లేదా వివిధ విశ్వాస థోరణులకు చెందిన సమూహాలు - తామనుసరిస్తున్న విశ్వాస పంథాకు చెందని వాళ్ళందరికీ మత స్వేచ్ఛ ఉండకూడదన్న వైఖరినే అనుసరించినట్లు తేలిపోతుంది. అటు బైబిలు దేవుడు గానీ, ఇటు ఖురాన్‌ దేవుడు గానీ, తనను మాత్రమే విశ్వసించాలనీ, అన్యమైన విశ్వాసాలు కలిగి వుండరాదనీ విస్పష్టంగా ప్రకటించారు, ఇతరులనందరినీ అవిశ్వాసులగనే పరిగణించాలనీ ఆదేశించారు. విశ్వాసుల సమూహానికి బలం చాలని సందర్భాలలో తప్ప అవిశ్వాసుల్ని విశ్వాసులుగ మార్చడమో, అంతం చెయ్యడమో అన్న రెండు పనులూ ధర్మకర్మల క్రిందకే చేరతాయని చెప్పారు. ఆ రెండు గ్రంథాలలోనూ ఈ క్రింది వివరాలు కావలసినన్ని దొరుకుతాయి.

1. బైబిలులో, దేవుడు తానెంచుకున్న స్వజనులు - అన్యజనుల మధ్య యుద్ధాలు, చంపుకోవడాలు, లొంగదీయడాలు.
2. ఇశ్రాయేలీయులుగా పేరు పెట్టబడిన తరువాత ఇశ్రాయేలీయులనబడేవాళ్ళు - అలా అనడానికి వీలు లేని జనాల మధ్య జరిగిన వ్యవహారము.
3. ఇశ్రాయేలీయుల పరంపరనుండి యూదులుగ ప్రసిద్ధినొందిన సమూహం యూదేతరులతో ప్రవర్తించిన తీరుతెన్నుల వివరాలు.
4. యేసును క్రీస్తుగా అంగీకరించిన సమూహం విషయంలో యూదులు వ్యవహరించిన తీరు.
5. అనంతర కాలంలో మహమ్మదు చేత స్థాపింపబడి ఇస్లాంగా పేరు పొంది 'ఖురాన్‌' గ్రంథవచనాలకు లోబడి జీవించే ముస్లింలతో అటు యూదయ సమూహాలు, ఇటు క్రైస్తవ సమూహాలు ప్రవర్తించిన తీరు.
6. మహమ్మదునంగీకరించి ఇస్లాంను స్వీకరించిన వారు ఆరంభకాలంలో, అనంతర కాలంలో యూదుల విషయంలోనూ, క్రైస్తవుల విషయంలోనూ, విగ్రహారాధకుల విషయంలోనూ ప్రవర్తించిన తీరు.

ఇవన్నీ ఒకే సామాన్య లక్షణాలు కలిగి ఉన్నాయి. తామనుసరిస్తున్న విశ్వాసానికి వేరైనవారందరినీ అవిశ్వాసుల క్రిందనే జమకట్టి వారిపట్ల పరాయి భావనను, శతృవైఖరినే కలిగి ఉన్నాయి. ఉండాలనీ ఆదేశించాయి. ఇదంతా ఆ రెండు గ్రంథాలాధారంగానూ, అనంతర కాలంలో లభించిన చారిత్రక రచనలాధారంగానూ కూడా వాస్తవమేనని నిర్థారించగలం.

అంటే ఏమని, ప్రతి మతమూ ఇతరులను తమ మతములోకి చేరమంటూనే తమ మతం నుండి బైటకు పోవడాన్ని నిరశించడమూ, తిరస్కరించడమూ, నిరోధించడమూ అన్న వైఖరినే కలిగి ఉంటున్నాయన్న మాట. ఇదర్థమైతే గాని భారత రాజ్యాంగం ప్రస్థావించిన 'మతస్వేచ్ఛ' స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛలో ఒక మతాన్ని విశ్వసించడం, దానిని విశ్వసించడం మాని మరో మతాన్ని విశ్వసించడం, ఏ మతాన్నీ విశ్వసించకుండా ఉండడం అన్న మూడు రకాల స్వేచ్చలూ ఇమిడున్నాయి. దానితోపాటు ఆ మత స్వేచ్చకున్న పరిమితులను బట్టి తాను విశ్వసించని థోరణులను విమర్శించకుండటమూ తప్పనిసరి. అంతేగాక తమ విశ్వాసములో వున్న వాటిలోనూ ఇతర విశ్వాసులను ఖండించిన, తిరస్కరించిన భావాలను ప్రకటించకుండడమూ తప్పనిసరే అయివుంది. దానర్థం ఏమిటో తెలుస్తోందా మిత్రులారా !?

ఒక ఆస్థికుడు మరొక ఆస్తికతను గానీ, ఆస్థికుడు నాస్తికతను గానీ, నాస్తికుడు ఏ ఆస్తికతను గానీ విమర్శించకూడదన్నదే భారత రాజ్యాంగంలోని మతస్వేచ్చ- దానికున్న పరిమితులు అన్నదాని అసలర్థం. ఇది సరైన వివరణే అయితే, ఆస్థికులు నాస్తికులను గానీ, నాస్తికులు ఆస్థికులను గానీ విమర్శించకుండా ఎవరికిష్టమైన రీతిని వారి వ్యక్తిగతాంశంగా తలకెత్తుకొని సాగుతుండటానికి పరిమితమై పోవాలి. ఎలా ఒక ఆస్థిక థోరణి వారు మరొక ఆస్థిక థోరణి వారి మనో భావాలను గాయపరచరాదు, దెబ్బతీయరాదు అనంటున్నారో, నాస్తికులూ, ఆస్తికుల మనోభావాలను దెబ్బతీయరాదు అంటున్నారో, అలాగే ఏ ఆస్తిక థోరణికి చెందిన వారూ, ఏ నాస్తిక థోరణికి చెందిన వారి మనో భావాలనూ గాయపర్చరాదు. దెబ్బతీయరాదు, నిజానికి మన రాజ్యాంగంలోని ''మత స్వేచ్చ'' అన్న మాటకు అర్థమిదే.

కనుక ఈనాడేమత థోరణివారైనా మరోమత థోరణిని హేళన చేసినా, మతేతరులను (నాస్తిక, హేతువాదులను) కించపరుస్తూ మాట్లాడినా రాజ్యాంగ నిర్ధేశాలను అతిక్రమించి నట్లే. ఈ విషయంలో రాజ్యాంగ నిర్ధేశాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారిపైన ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చో సిపిసి-295 నుండి 298 వరకున్న వివిధ శిక్షాస్మృతి నిబంధనలు వివరిస్తున్నాయి. ఆ లెక్కన మన పి.డి.సుందర్రావు మాట్లాడిన వాటినన్నింటినీ విచారణకు స్వీకరించి న్యాయవిచారణ జరిపి అతన్ని చట్టబద్దంగా శిక్షించి తీరాలి. అతగాడిప్పటికే...


  • 1. న్యాయ వ్యవస్థను, అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను కించపరుస్తూ మాట్లాడాడు.
  • 2. విజ్ఞాన శాస్త్రాలను, వైజ్ఞానికుల్ని, వారి పరిశోధనలను అవహేళన చేస్తూ మాట్లాడాడు.
  • 3. నాస్తిక, హేతువాద భావజాలాన్ని, ఆ థోరణులకు చెందిన వారినీ దూషిస్తూ మాట్లాడాడు.
  • 4. కొంతమందినైతే నేరుగా పేరుపెట్టి దూషిస్తూ వారి పరువుకు భంగం కలిగేలా మాట్లాడాడు.
  • 5. ఇక టి.వి.ఛానళ్ళ వారినైతే వ్రాయనలవిగాని మాటలతోదూషిస్తూ, అవహేళన చేశాడు.
  • 6. వీటన్నింటినీ అంతర్జాలంలోనూ పెట్టాడు, సి.డి.ల రూపంలోనూ ప్రచారం చేస్తున్నాడు.


ఇంతచేసినా, వ్యవస్థ థాబ్దాల కాలంగా అతన్ని అదుపు చెయ్యకపోవడం, దండించకపోవడం, అస్సలు పట్టించుకొనకనే పోవడాన్ని ఏమనుకోగలం?

ఇంత జరుగుతున్నా ఎవరూ ఏమీ అనకపోవడంతో, మరింతగా చెలరేగి ఈనాడు భారత జాతినే అవమానించే రీతిగా, అంబేద్కరును, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మేథావులందరినీ, రాజ్యాంగాన్నీ, జాతీయ పతాకాన్నీ కూడా పనికిమాలినవన్నట్లు అవహేళనగా, బహిరంగ సభలో మాట్లాడేశాడు. ఈ దేశానికున్న అత్యంత దుర్లక్షణాలలో స్థబ్దత - ఉదాసీసత - మొట్టమొదటిది. మన వరకు రాకుంటే, మొత్తం మునిగినా పర్వాలేదనుకునే దిక్కుమాలిన స్వభావం ఈ దేశంలో బలంగా పాదుకొని ఉంది. ఈ దేశ జనాభా అలసత్వములో ఉండడమే గాక, అకర్మణ్యతతోనూ, చైతన్య రహితంగానూ ఒకింత నిద్రాణస్థితిలో వుంటూనే, ఎక్కడోచోట ఎవరో ఒకరిద్దరు ఇదేమి అన్యాయం? అంటూ అరవడం మొదలిడగానే ఎవరికీ లేంది నీకెందుకొచ్చింది దురద? అంటూ ఈసడించడం, వెనక్కి గుంజడం లాటి వాటి వరకు వెంటనే స్పందిస్తుంటారు. ఇదో విచిత్రమూ - విషాదమూ.

మిత్రులారా !

వ్యక్తిగా పి.డి.సుందర్రావును శతృవుగా చూడాల్సినంత అవసరం లేదుగానీ, అటువంటి థోరణుల్ని ఎదుర్కొనాల్సిన, అరికట్టాల్సిన, వీలైతే రూపుమాపాల్సిన అవసరం, బాధ్యత సమర్ధులైన వారందరిపైనా ఉంది. మాయీ ప్రయత్నమంతా ఆ బాధ్యత చేస్తున్న వత్తిడి నుండి పుట్టుకొస్తున్నదే. ప్రతి భారతీయుడూ ఆ విధమైన పోకడలను ఆపుచేసే కృషిలో పాలుపంచుకొని తీరాలి. ఎక్కడికక్కడ, ఎవరికి వారుగా పి.డి.సుందర్రావు పోకడలను నిరసిస్తూ సమావేశాలు నిర్వహించండి, ప్రకటనలివ్వండి. మాట్లాడుకుందాం రమ్మని పట్టుబట్టండి. అతడన్న వాటినన్నింటినీ, అవి సరైనవేనని రుజువుచేయమని వత్తిడి చేయండి.

బైబిలులో కనపడు లైంగిక సంబంధాలు

మొన్నటికి మొన్న జెమిని టి.వి. వారు పి.డి.సుందర్రావు అనుచిత వ్యాఖ్యలపై చర్చను నిర్వహించిన సందర్భంలో ఆయన తరుపున పాల్గొన్న సంతోష్‌ కుమార్‌ అదరగండపు తనాన్ని, అడ్డగోలు వాదనను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ప్రధాన చర్చనీయాంశాన్ని ప్రక్కద్రోవ పట్టించడానికి అతగాడు తొక్కని తిక్కదారులేవీ లేవు. అలాంటి సందర్భాలలో ఒకటి ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన, స్త్రీ, పురుషులిరువురి అంగీకారంతో సాగే శృంగారానికి వయోపరిమితిని నిర్ణయించడాన్ని గురించిందిగా వుంది. అది 16 సంవత్సరములుగా ఉండొచ్చని కొందరు, ఆ వయస్సు సరిపోదని, 18 సం||లుగా ఉండాలని కొందరు వాదించి కడకు 18 సం||లు దాటిన స్త్రీ పురుషు లిరువురూ పరస్పరంగీకారంతో శృంగారంలో పాల్గొన వచ్చని నిర్ణయించినట్లు వార్తల్లో వచ్చింది. దాన్నెత్తుకున్నాడు మన పి.డి. ప్రతినిధి సంతోష్‌ కుమార్‌. అది వ్యభిచారమేనని, అలా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న న్యాయవ్యవస్థను తప్పుబట్టవద్దా అనంటూ, పి.డి. రాజ్యాంగం పైనా, రాజ్యాంగ నిర్మాతల పైనా, జాతీయ పతాకం పైనా చేసిన అనుచిత వ్యాఖ్యలపై సాగాల్సిన చర్చను దారిమల్లించే పని మొదలెట్టాడు. బైబిలును నెత్తికెత్తుకొని అశ్లీలత గురించి, అనుచిత లైంగిక సంబందాల గురించి సుద్దులు చెప్పబోవడాన్ని చూసి, బైబిలులో లైంగిక సంబందాల అంకచండాలాన్ని తట్టెడు పెట్టుకొని ఇప్పుడు సమాజంలో చర్చకు, ప్రజాభిప్రాయానికి లోనుచేసిన శృంగార విషయాన్ని వ్యభిచారమనడానికి సిగ్గుపడాలని, ఆ సందర్భంలో వెంటనే అనేశాను నేను. బైబిలులో అసమంజసమైన లైంగిక సంబంధాలు లేనేలేవన్నాడాయన. తెలిసి తెలిసీ ఆ గజ్జినంతటినీ గజ్జి కాదంటున్న అతగాణ్ణలా వుంచి, చూడగల మతిమంతుల వరకైనా వాస్తవాలు చూపిస్తే మంచిదనిపించి, బైబిలులోని లైంగికతకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ఈ వ్యాసం ద్వారా మీ ముందుంచడానికి పూనుకున్నాను. పూర్తి వివరాలకు బైబిలును ఆసాంతం చదవడమే మంచిది.

బైబిలులోని ఆదాము, హవ్వల పుట్టుకపైనే రెండు రకాల వివరాలనందిస్తోంది ఆదికాండం.
ఆది కాండం 1:27లో స్త్రీనిగాను, పురుషుని గాను వారిని సృజించెనని చెప్పబడింది.
ఆది కాండం 2 :7 లో ముందు ఆదామును సృష్టించినట్లు, అతనికి గాఢనిద్రను కలుగజేసి (2 : 21) అతని ప్రక్కటెముకను తీసి దానినుండి స్త్రీని సృష్టించినట్లు చెప్పబడింది.
వివరణ : ప్రక్కటెముక నుండి సృష్టించబడిందన్న వాక్యానికీ విస్తృత ప్రచారం వచ్చింది. ఆ లెక్కన ఆదాము నుండి పుట్టిన హవ్వ, ఆదాముకేమి కావాలి? అదలా వుంచుదాం.
ఆదాముకు సరైన తోడు లేకపోయిందని తలచిన యెహోవా, ఎలాగోలా శరీరము నుండో, విడిగానేనో హవ్వను సృజించాడనుకున్నా వారిరువురినీ భార్యా భర్తలుగ ఉండడానికంగీకరించాడు. కనుక వారిరువురు లైంగికంగా కలిశారు అనుకుందాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవముగల ప్రతి వానికీ ఆమె తల్లికనుక అంటుంది బైబిలు.
నాలుగవ అధ్యాయంలో, ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై 'కయీను' ను కన్నది. అనంతరం రెండవ సంతానంగా 'హేబేలు' ను కనింది.
మొదటి హత్య : ఆదాము హవ్వల మొదట ఇద్దరు సంతానంలో పెద్దవాడైన కయీను తమ్ముడైన హేబేలును చంపటంతో మొదలైందన్న మాట.
4 : 16 - అప్పుడు కయీను ఏదేనుకు తూర్పు దిక్కున వున్న నోదు దేశానికి వెళ్ళి అక్కడే కాపురమున్నాడట. అక్కడే కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భము ధరించి 'హొనోకు' ను కన్నదట. బాగుందండీ ! ఇంతకూ నోదు దేశం ఎక్కడి నుండి వచ్చింది ? అక్కడి జనం ఏ దేవుని సృష్టిలోని వారు ? కయీనుకు పెండ్లెప్పుడయింది. ఆయనకు భార్య ఎక్కడనుండి లభించింది?
4 : 16 -24 వరకు కయీను వంశ వృద్ధికి చెందిన సమాచారం ఉంది.
కయీను - హనోకు - ఈరాదు - మహూయేలు - మతూషాయేలు - లెమకు -
యూబాలు, యాబాలు, తూబల్కయీను, చెల్లినయమా (ఏడు తరాలు).
4 : 25 - ఆదాము మరలా తన భార్యను కూడగా ఆమె 'షేతు'' ను కన్నది.
ఐదవ అధ్యాయములో ఆదాము 130 ఏండ్ల ప్రాయంలో 'షేతు'' ను కన్నట్లు అనంతరం బ్రతికిన 800 ఏండ్లలో అనేక మంది కుమారులను, కుమార్తెలను కన్నట్లు చెప్పబడి వుంది.
ఇక్కడ మనకొచ్చే ప్రశ్న ఏమంటే షేతును కనక పూర్వం ఆదాము కుమార్తెలను కననే లేదు. మరి నోదు దేశపు జనాంగము, ఖయీను భార్య, వారి కుమారుల కుమారులకు భార్యలు ఎక్కడనుండి వచ్చారన్నదే ? దీనికి బైబిలు పక్షం ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.
ఆరవ అధ్యాయంలో నరుల జన సమూహము విస్తరించింది, అనంతరం వారికి కుమార్తెలు పుట్టారు. వారి అందాన్ని చూసి ఇష్టపడిన 'దేవుని కుమారులు' వారి వారికి నచ్చిన వారిని వివాహం చేసుకున్నారని వుంది. దేవుని కుమారులు నరుని కుమార్తెలతో పోయినప్పుడు వారంతా పిల్లలను కన్నారట. అప్పటికే నెఫేలు లనువారు భూమిమీద వున్నారని 6 : 4 వచనం చెబుతోంది. ఆ థలో యెహోవా, నరుల ఆయుర్ధాయము 120 ఏండ్లవుతుందని నిర్ణయిస్తాడు (6 : 3).
బైబిలు ప్రకారం నోవహు కాలానికి అతడొక్కడే నీతిపరుడుగా దేవునిచే తలచబడ్డాడు. అతడు దేవునితో కూడా నడిచాడంటోంది బైబిలు (6 : 9, 7 : 1).
బైబిలు ఎటువంటి లైంగిక సంబంధాలు కూడదంటుందో వాటిని అతిక్రమించిన వారికి శిక్షలేమిటో ఇలా చెబుతోంది. ఈ వివరాలు 'లేవీ' కాండంలో వున్నాయి.

1. తండ్రి భార్య, సహోదరి, స్వంత అక్కా, చెల్లెళ్లైనా వరసైనా, తండ్రి కుమార్తెగానీ, తల్లి కుమార్తె గానీ సహోదరే అవుతుంది. వారిని కూడకూడదు.
2. కుమారుని కుమార్తెతోనూ, కుమార్తె కుమార్తెతోనూ నీతండ్రి భార్య కుమార్తె నీకు సహోదరి కనుక ఆమెతోనూ సంభోగం జరుపరాదు.
3. నీ తండ్రి రక్త సంబంధులతో గాని, నీ తల్లి చెల్లెలితో గాని సంబోగం కూడదు. నీ తండ్రి సోదరుని భార్యతోనూ కూడకూడదు.
4. నీ కోడలిని కూడకూడదు. నీ సోదరుని భార్యను కూడకూడదు. తల్లీ కూతుళ్ళను కలయకూడదు.
5. నీ భార్య బ్రతికి ఉండగా ఆమె సహోదరిని పెండ్లి చేసికొన కూడదు. (లేవీ 18 : 6-20)
ఇక ఈ విధులనతిక్రమించిన వారికి విధించాల్సిన శిక్షలివిగో...
1. తండ్రి భార్యతో సంభోగించిన వారిరువురుకూ మరణదండన.
2. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆమెకు మరణ దండన.
3. కోడలితో కూడిన వారిరువురుకు మరణ దండన.
4. స్వలింగ సంపర్కానికి మరణ దండన.
5. ఒక స్త్రీని, ఆమె తల్లిని కూడినచో వారి ముగ్గురునీ అగ్నిలో కాల్చి చంపివేయాలి.
6. జంతువులతో రతిచేసిన వానికి (ఆమెకు) మరణ శిక్ష వేయాలి. ఆ జంతువునూ చంపేయాలి.
7. తండ్రి కుమార్తెను గానీ, తల్లి కుమార్తెను గాని (చెల్లెలిని) కూడినచో అట్టి వారికి బహిరంగంగా మరణ శిక్ష విధించాలి.
8. బహిష్టు అయిన స్త్రీతో కూడినచో వారిరువురనూ ప్రజల నుండి కొట్టివేయాలి.
9. తల్లి సోదరి (పిన్ని,పెద్దమ్మ), తండ్రి సోదరి (మేనత్త)లను కూడిన వారు శిక్షింపబడాలి.
10. అన్న భార్యను గానీ, తమ్ముని భార్యను గానీ కూడిన వారు సంతాన హీనులవుతారు. (20 : 10-21)
విచారణ : పాఠక మిత్రులారా ! ఒక పురుషుడు ఎవరెవరితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదో, పెట్టుకొంటే ఎట్టి శిక్షలు విధించాలో పైన స్పష్టంగా ప్రకటింపబడింది కదూ! అస్సలు విషయమేమంటే దేవుడెన్నుకున్న వారిలోనే కొందరీరకమైన నిషిద్ధ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. కాని వారికెటువంటి శిక్షలూ అమలు కాలేదు. సరికదా, యెహోవా అట్టివారిని ఆశీర్వదించి తన వారిగనే అంగీకరించాడు.

1. ఆదాము - హవ్వ ల వరసేమిటి? యెహోవా తండ్రి అయితే వీరిద్దరూ అన్నా చెల్లెల్లు కారా ? ఆదాము నుండి తీయబడ్డదన్నట్లయితే తండ్రీ కూతుళ్ళు కారా ?
2. కయీను కు, షేతు కు భార్య భర్తలెక్కడ నుండి వచ్చారు ? ఆదాము హవ్వల సంతానం కాక అప్పటికి ఇతరులు లేరుకదా ! అంటే చెల్లెళ్ళనే చేసుకొని ఉండాలి.
3. అబ్రహాము తన చెల్లెలిని చేసుకొన్నాడు (తన తండ్రి భార్య కూతుర్ని).
4. ఒకనికి అతని భార్యతోబాటు దాసీలుగా వున్నవారందరూ పడకసంబంధంలోని వారే నన్నట్లు చాలా సందర్భాలలో చెప్పబడి ఉంది.
5. అబ్రహాము శారయి దాసి అయిన హాగరుతో శయనిస్తాడు. అది తప్పుగా పరిగణింపబడలేదు.
6. పుట్టిన ఎనిమిదవ నాడు ప్రతి పురుషుని సంతానానికి సున్నతి చేయాల్సిందేనని యెహోవా ఆజ్ఞ. సున్నతి చేయబడనివాడు జనం నుండి కొట్టివేయబడాలి. (కొట్టివేయడమంటే చంపేయడం కాదా?).
7. లోతు తన కూతుళ్ళను అక్కడి ప్రజలకు అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ఆనాటికి స్వలింగ సంపర్కం విపరీతంగా వ్యాప్తిలో ఉందనిపిస్తోంది. వారెవరికీ శిక్షలు పడినట్లు లేదు.
8. లోతు తో అతని ఇద్దరి కూతుళ్ళు శయనించి గర్భవతులవుతారు.
9. ఇస్సాకు కూడా తన భార్యను చెల్లెలని చెబుతాడు. వారి పూర్వ సంబంధం ఎట్టిదో మరి.
10. యాకోబు అక్కచెల్లెళ్లయిన లేయాను, రాహేలు ను, దాసి జల్పాను, తన దాసీయైన బిల్లాను కూడా ..... ఇస్తాడు. అతడు వారితోనూ శయనిస్తాడు.
11. లేయాకు యాకోబుకు పుట్టిన దీనా ను షెకెము బలవంతంగా అనుభవిస్తాడు. ప్రతీకారంగా యాకోబు కుమారులు షెకెము సంబధితులందరిని వధించి వారి స్త్రీలను చెరబడతారు.
12. రూబేనను వాడు తన తండ్రి భార్యతో శయనిస్తాడు.
13. యూదా అన్న వాడు తన కోడలైన తామారు తో వ్యభిచరిస్తాడు.
14. తామారు యూదా పెద్ద కొడుకు ఏరు అను వాని భార్య. ఏరు ను యెహోవా చంపేస్తాడు. అప్పుడు యూదా తన రెండో కొడుకు ఓనానును వదినయైన తామారుతో శయనించమంటాడు. అతడామెతో సంభోగించీ, రేతస్సును బయట విడుస్తాడు. అందుకు యెహోవా వాడ్ని చంపుతాడు. అప్పుడు యూదా తన మూడవ కొడుకైన షెలా పెద్దవాడయ్యే వరకు పుట్టింట్లో ఉండమని తామారుతో అంటాడు. షెలా పెద్దవాడైనా యూదా తామారు దగ్గరకు అతన్ని పంపడు. అలా జరిగిపోతున్న కాలంలో తానే తామారును వేశ్య అనుకొని ఆమెతో సంబోగిస్తాడు.
గమనిక : ఆనాటి సమాజం ఎన్ని రకాలైన లైంగిక సంబందాలు కలిగి వున్నదో లేవీ కాండంలో విపులంగా వివరింపబడి ఉంది. శిక్షాస్మృతిలో మాత్రం దాదాపు అప్పుడు జరుగుతున్న లైంగిక సంబంధాలలో చాలా వాటికి మరణ దండన విధించమని చెప్పబడి ఉన్నది. మిగిలిన జనుల విషయమేమో గాని, యెహోవా తన వాళ్ళని అంగీకరించిన వాళ్ళూ ఆ అపసవ్య సంబంధాలను కొనసాగించారు. వారికెవరికీ శిక్షలు పడనేలేదు. ఇలాటి వాక్యాలన్నింటినీ దేనికవిగా చదువుతూ పోతే చాలా సమాచారం పోగుపడుతుంది. ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావించి దీనినిక్కడికి ఆపుతాను.

దేవుడంటున్నాడు చూడండి :

1. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకప్పగించితిని.... నీవు చూచుచుండగనే నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును (2 సమూ 8 : 12).
2. వారి భార్యలను అన్యులకప్పగింతును. వారు యెహోవా వాక్యములను నిరాకరించిన వారు. (ఇర్మియా 8 : 10). ఏమియూ మిగుల కుండా వారి ఇండ్లను, పొలములను, వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడెదరు. (ఇర్మియా 6 : 12).
3. బైబిలు బహుభార్యత్వమును, వేశ్యావృత్తిని, దాసీలతో శయనాన్ని అంగీకరిస్తోంది.
4. దావీదు హిత్తీయుడైన ఊరియా భార్య బత్షేబ ను ఇంటికి పిలిపించి ఆమెతో సంభోగిస్తాడు.
5. దావీదు కుమారుడైన అబ్షాలోము చెల్లెలు తామారన్నామెను, దావీదు మరో కుమారుడైన అమ్నోసు బలవంతంగా అనుభవించి వెళ్ళగొట్టేస్తాడు.
6. సోలోమను ఫరో కుమార్తెనే గాక, మరొక 700 మందిని భార్యలనుగా, 300 మందిని ఉప పత్నులుగా చేసికొంటాడు. అతడు సమస్తమైన వారికంటే జ్ఞానవంతుడు అంటోంది బైబిలు.
7. (ఎస్తేరు 2 : 2, 12 : 14) ష్వేరోషను రాజుకు రోజుకొక కన్య సంభోగానికి కావాలి. ఆమె మళ్ళా ఎప్పుడైనా రాజు పిలిస్తే తప్ప అలా ఒంటరిగా ఉండిపోవలసిందే.

గమనిక : పరమగీతం లోనూ యెహెజ్కేలు పుస్తకంలోనూ యెహోవా కూడా అంగాంగ వర్ణన చేస్తూ శృంగార సన్నివేశాన్ని గురించి మాట్లాడతాడు. ఇంతోటి గబ్బు పెట్టుకొని మన పి.డి.సుందర్రావు శిష్యుడు సంతోష్‌ కుమార్‌ బైబిలంతా బంగారమే నంటున్నాడు. పవిత్ర శృంగారమే నంటున్నాడు. సిగ్గొదిలేసినోళ్ళకు ఎగ్గేముంటుంది ? భేష్‌ సంతోష్ కుమార్ భేష్. గురువుకు తగ్గ గురువింద శిష్యుడివే.


పారా హుషార్‌ ! వినరండి - అప్రమత్తులు కండి !


భారతరత్న అంబేద్కర్‌ను, ఆయనతో కలసి రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకొన్న మేథావుల బృందాన్ని, రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడిన పి.డి. సుందర్రావును, అతడ్ని వెనుకేసుకొస్తున్న మందను చట్టబద్దంగా వెంటనే శిక్షించాలి.

అతగాని అడ్డగోలు మాటలు :

1. సుప్రీంకోర్టును, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను చులకనగా మాట్లాడారు. ఇంతలేసి మాటలంటున్నా ఎవరూ ఏమీచేయలేకపోయారు. నన్ను అరెస్టు చేయడానికి దమ్ములుండాలి జడ్జీలకు అంటూనే తెగరెచ్చిపోయాడు. ఆ వివరాలన్నాంటినీ యూట్యూబ్‌ ద్వారా అంతర్జాలంలోనూ పెట్టేశాడు. ఏకంగా దేశ న్యాయవ్యవస్థ పరువును మంటగలిపాడు.

2. అంబేద్కర్‌ను, అతని బృందాన్ని తలకాయలేనివాళ్ళన్నాడు, కాపీరాయుళ్ళు అన్నాడు. మనది కాపీ రాజ్యాంగమన్నాడు. ఇంతోటి రాజ్యాంగాన్ని తానే రాయగలనన్నాడు.

3. జాతీయపతాకాన్ని కించపరుస్తూ అదొక గుడ్డముక్కని, ఆ గుడ్డను ఒక పుల్లకు తగిలిస్తే గొప్పదైపోతుందా?  అని ఈసడింపుగా మాట్లాడాడు.

ఈ విషయంలో రాజ్యాంగం ఏమిచెబుతోంది ?

రాజ్యాంగం అధికరణం 51/ఎ ద్వారా  ప్రతి భారత పౌరునికి కొన్ని ప్రాథమిక విధుల్ని నిర్దేశిస్తున్నది. అందులో మొట్టమొదటిది...

రాజ్యాంగానికి బద్దుడై, విధేయుడై ఉండడం. అందలి ఆశయాదర్శాలపట్లా, జాతీయ పతాకము, జాతీయ గీతముల పట్ల గౌరవభావము కలిగియుండడము ప్రతి పౌరుని ప్రాథమిక విధి.

స్వాతంత్య్ర పోరాట యోధులు అనుసరించిన ఆదర్శాల స్ఫూర్తితో వ్యవహరించుట ప్రాథమిక విధి.
వాస్తవాలిలా ఉండగా మన పి.డి. సుందర్రావు భావిభారత జాతి ఉజ్వల భవిష్యత్తుకై తమ శక్తియుక్తులన్నింటినీ ధారపోసిన పెద్దలెందరినో హేళనచేస్తూ మాట్లాడేశాడు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకనూ చులకనచేస్తూ మాట్లాడాడు. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులనూ అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ జాతి ప్రజలెవ్వరూ అంగీకరించరాని, నిరశించవలసిన విధంగా ప్రవర్తించిన అతడ్ని చూసి చూడనట్లు, పట్టీపట్టనట్లు వదిలేస్తే, మరికొందరున్నూ ఎవరినేమన్నా ఏమీకాదులే అన్న థోరణితో మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంది. కనుక, అతనికి, అతనిలాంటి మరికొందరికి కూడా కనువిప్పు కలిగేలా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంది. మనమందరం ప్రభుత్వంపైనా వత్తిడి తెచ్చి, న్యాయవ్యవస్థ ద్వారా అతడ్ని శిక్షింపచేయాలి. జాతీయ జెండాను, జాతిస్ఫూర్తి ప్రదాతలను అవహేళన చేసే బుద్ధిహీనులకు తగిన విధంగా బుద్దిగరపాలి.

శాస్త్రీయ పద్ధతిలో ఒక సిద్ధాంతాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు వైజ్ఞానికులు, తామెంచుకున్న విషయంలో అప్పటికి అందుబాటులో వున్న సమాచారాన్ని సేకరిస్తారు. అందుండి పనికివచ్చే దానిని, పనికిరాని దానిని విడదీస్తారు. పనికివచ్చేదాని నుండి తమ సిద్ధాంతానికి అవసరమైనమేర స్వీకరించి కొంతేమైనా ఉంటే దానిని తాముగా పూరించి సిద్ధాంతాన్ని తయారుచేస్తారు. అది శాస్త్రీయ పరిశోధనాపద్ధతి, అధ్యయనానికీ ఉన్నదాన్నంతటినీ పరీక్షించి పనికొచ్చే భాగాన్ని, పనికిరాని భాగాన్ని వేరుచేసి చూడడానికీ, ఉన్నదాన్ని ఉన్నట్లు ఎత్తిరాసుకోవడానికీ తేడాతెలియని పి.డి.సుందర్రావు రాజ్యాంగ ముసాయిదా రూపకర్తల బృందాన్ని, రాజ్యాంగ నిర్మాణములో పాలుపంచుకున్న 22మంది నిపుణుల కమిటీలనూ, అనంతరం ముసాయిదా ప్రతిలోని ప్రతి అధికరణాన్ని, అందులోని ప్రతి మాటను విచారించి అవసరమైన సవరణలు, పూరణలతో సుసంపన్నం చేసిన రాజ్యాంగ నిర్మాణసభ సభ్యులను, దానిపై సుమారు 7,500 సూచనలు చేసిన సమాజంలోని మేథావి వర్గాన్నీ, వీరందరినీ అహంకార మదాంధకారంతో, ఒక్కమాటలో పనికిమాలినవాళ్ళంటూ ఈసడించేశాడు.
పాతికేండ్లుగా బైబిలు మాటల్ని బట్టీపట్టితిరిగి చెప్పడమే పనిగాపెట్టుకొని అక్కడికదే సర్వజ్ఞానమనుకొంటూ, మరికొందరి గుడ్డిమంద మధ్య చూపున్న వాడుగా చెలామణి చేసుకొంటూ, వాళ్ళంతా సమకూర్చిన సంపదతో బ్రతుకును సౌకర్యవంతంగా గడిపేస్తున్న ఇతగానికి, ఈ రకానికి రాజ్యాంగ నిర్మాతలు, ఈ జాతి భవితవ్యం కోసం పడిన శ్రమ, వేదన ఎలా అర్థమవుతాయి.

పి.డి. సుందర్రావుకు సత్యాన్వేషణ మండలి చేస్తున్న సవాలు


అయ్యా! ఒక పాతికేండ్లుగా నీవు ఎవరెవరిని, ఏఏ విషయాలలో దమ్ముంటే రండిరా! సవాలంటూ  పిలిచావో, వాటన్నింటినీ విచారణకు స్వీకరించడానికి గానీ, అందులో ఎంపిక చేసుకొన్న ఒక్కో అంశంపై విచారణకు గాని కూర్చోడానికి సత్యాన్వేషణ మండలి సిద్ధంగా వుంది. నా దృష్టికి వచ్చిన నీ చాలెంజ్‌ అంశాలు ఇవిగో...

1. వెంకటాద్రి గారితో చాలెంజ్‌ అంటూ నీవు ప్రస్తావించిన ''బైబిలు సృష్టివాదం సరైందేనని శాస్త్రీయంగా రుజువుచేస్తాను'' అన్న నీ ప్రతిపాదనపైన కూర్చుందామా?
2. ''బైబిలే దైవగ్రంథము, బైబిలే దైవగ్రంథము'' అంటూ తొడలు కొట్టిన దానిపై కూర్చుందామా?
3. ''బైబిలును దొంగిలించిన మిలీనియం మహనీయులు'' అన్నదానిని రుజువుచేస్తారా? దానిపై కూర్చుందామా?
4. ''బైబిలు తెలిసినవాడెవడూ లేడిప్పటికీ నేనుతప్ప'' అన్నదానిపై కూర్చుందామా?
5. విజ్ఞాన శాస్త్రాలు, వైజ్ఞానికులపై మీరు ప్రకటించిన అభిప్రాయాలపై కూర్చుందామా?
6. బైబిలుకు వైజ్ఞానిక అంశాలేమి తెలుసు? 1. విశ్వం గురించి, 2. ఖగోళం గురించి, 3. ఉష్ణగతి సిద్ధాంతం గురించి, 4. అణు పరమాణు గర్భాల గురించి, 5. జీవ పదార్థం గురించి.

పైన పేర్కొన్న అంశాలలో వేటిపైన చర్చచేద్దామన్నా సత్యాన్వేషణ మండలి సిద్ధంగా ఉన్నది. 1. వేదిక ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేసుకుందామన్నది కలసికూర్చొని నిర్ణయించుకుందాము. 2. విచారణ ఒక కొలిక్కి వచ్చేదాకా ఎంతకాలమైనా కొనసాగించాల్సిందే.

చర్చా వేదిక, నియమనిబంధనల్ని ఇరుపక్షాలు ముందుగా ప్రకటించాలి. అందులో ఎవరు ప్రకటించిన విధి విధానాలు సరైనవో విజ్ఞుల సమక్షంలో నిర్ణయించుకోవాలి. నియమ నిబంధనల గురించిన అవగాహనలోనే లోపముంటే ఆ ప్రక్షం చర్చకు తగిన అర్హత కోల్పోయినట్లే.


No comments:

Post a Comment