Friday, November 1, 2013

హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు

యోచనాశీలురైన మిత్రులారా! హేతువాదం పై సిద్దాంత గ్రంథం లేకపోవడం హేతువాదోద్యమ కార్యాచరణాపరంగా దానికదే ఒక పెద్ద బలహీనత. కనుక ముందాబలహీనతనుండి హేతువాద ఉద్యమ పదాధికారులు (దిశా నిర్ధేశం చేస్తున్నవారు లేదా రథ సారధులు) బైటపడి, సిద్దాంత బలాన్ని పుంజుకుని, హేతువాదోద్యమానికీ నూతన జవసత్వాలను అందించాలి. త్రికరణ శుద్ధిగా ఈ దృష్టితోనే నేనీ ప్రయత్నాలనారంభించాను. సత్యాన్వేషణ మండలి ప్రాథమికాకాంక్షల్లో 'చూడనేర్పడం' అన్నది అత్యంత ప్రాధాన్యతకల అంశం. కనుకనే సత్యాన్వేషణ మండలి ప్రధాన కార్యక్షేత్రం లక్షణ ప్రమాణ విద్యను నేర్పడం (తెలపడం కాదు) ద్వారా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనాశీలతకల మేధావులుగా తయారు చేయడం అయ్యింది. కనుకనే మేము, తర్కవిద్య చదివి, వినీ సంపాదించగలిగింది కాదు, అది తర్కిస్తూ నేర్చుకోవలసిన విద్య (అట్టి వాటిని అభ్యాసక విద్యలంటారు) అనీ చెపుతూ, ఆ రకంగానే ఆ విద్యను మేథోశ్రమకు సిద్దపడినవారికి అందిస్తూ వస్తున్నాము. ఈ పని గత 40 ఏండ్లుగా చేస్తున్నప్పటికీ, సభ్యులను చేర్చుకోవాలనిగాని, సభ్యులకే నేర్పుతామనిగానీ, సంస్థగా దీనికో మూస (చట్రం) ఏర్పాటుచేయాలని గాని నియమాలు పెట్టుకోకుండా, అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసినంత, ఓపికున్నంత ఈ విద్యను నేర్పుతూ వచ్చాము. తాత్వికంగా మాతో విభేదిస్తున్న సంస్థలకు చెందినవారికీ, ఎట్టి అభ్యంతరాలూ పెట్టకుండా, వ్యత్యాసం చూపెట్టకుండా మా యోపినంత (మా దగ్గరున్నంత) విద్యను నేర్పాము. నేర్పుతూ ఉన్నాము. భావాలు, అవగాహనలలో తారతమ్యాలున్నా మిత్రులంగా కొనసాగగలుగుతున్నాము. ఒక్క వంచనా వృత్తి కలవారు తప్ప మిగిలిన వారెవరూ మాకు శతృపక్షం కాదని విస్పష్టంగా ప్రకటించి, నిజాయితీగా అలానే ప్రవర్తిస్తూ వస్తున్నాము. అడపాదడపా ఎప్పుడైనా, మానవికమైన ఆవేశకావేశాలకు లోనైనా ఒకింత గాడితప్పి ప్రవర్తించినా, వీలయినంత త్వరలో (వెంటనే) మరల సరైన దారిలోకి మరలి వివేక పథికులంగానే సాగుతూ వస్తున్నాము. వీలయినంతవరకు వ్యక్తిగత విమర్శలకు పోకుండా, విషయపరమైన విచారణకే ఎక్కువలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ భావజాల క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాము.

వెంకటాద్రి గారన్నట్లు; ఏదినాస్తికత? ఏది నాస్తికతకాదు? ఏది ఆస్థికత? అన్న విషయాలలో నాస్థికులం, హేతువాదులం, భౌతిక వాదులం అనుకునే వారిమధ్యనే అవగాహనల్లో వ్యత్యాసాలున్నట్లు , లోపాలున్నట్లు దాన్నే హేతువాదులం అనుకునేవారిలోనూ ఏది హేతువాదం; ఏది హేతువాదం కాదు. అన్న విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నై. ఇంకా సరిగా చెప్పాలంటే హేతువాదమంటే ఇదీ, దీనిలో ఈయీ భావాలుంటాయి. ఫలాని, ఫలాని అంశాలపై ఫలాని ఫలాని నిశ్చితరూపమైన అభిప్రాయాలుంటాయి. అన్న విషయంలో స్పష్టతగాని, ఏకాభిప్రాయంగాని నెలకొనిలేవు.

ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆగలేదు. ఆ క్షేత్రాల వారు భిన్నాభిప్రాయాలు ఏర్పరచుకుని కొన్నింట విరుద్ధాభిప్రాయాలు కలవారిగనూ కొనసాగుతున్నారు.  ఇది మాట వరుసకు అనుకుంటున్న లేదా అంటున్నమాట కాదు. గతంలో జరిగిన, ఇప్పటికీ జరుగుతూవస్తున్న వాస్తవం.

ఎలా ఆస్థిక క్షేత్రంలో వివిధ ఆస్థిక ధోరణుల మధ్య దేవుని విషయంపైనా, పరలోకాల విషయంపైనా, శరీర భిన్నమైన ఆత్మ ఉనికిపైనా, మరణానంతర జీవితంపైనా భిన్నాభిప్రాయాలేగాక, విరుద్ధాభిప్రాయాలూ ఏర్పడి ఉన్నాయో, అలానే వివిధ నాస్థికుల మధ్య, హేతువాదుల మధ్య, భౌతికవాదుల మధ్య భిన్నాభిప్రాయాలు  నెలకొని ఉన్నాయి. అట్టి వారిలో చాలా మంది, మనమంతా ఆస్థికేతరులం కనుక కోట్లాడుకోవద్దు, ఎవరిమానాన వారం పని చేసుకుంటూ పోదాం అన్న అంగీకారానికి (ఇలి బివీజీలిలి శిళి ఈరిరీబివీజీలిలి అనుకుంటూనే)వచ్చి శతృదృష్టికి రాకుండా వేరు వేరుగనే సాగుతూ ఉన్నారు. వెంకటాద్రిగారిలాంటి మరింత లోతైన అధ్యయనమూ, నిక్కచ్చితనము, నిష్కర్ష - మొగమాటమిలేనితనం - ఉన్న వాళ్ళు మాత్రం నాస్థిక సంస్థలలోని నాస్థికేతర వైఖరుల్ని, కొన్నింటి ఆస్తికవైఖరుల్ని, హేతువాద, భౌతికవాద సంస్థలలోని అహేతుక, అభౌతిక వాద రీతుల్ని కనుగొని సూటిగానూ, రచనల రూపంలోనూ కూడా విమర్శలు చేశారు.

నాకు తెలిసి, ఆంధ్రప్రదేశ్‌లో, వెంకటాద్రిగారిని; అధ్యయనం లేనివాడనిగానీ, అతని రచనలలో పసలేదనిగానీ, నాస్తిక, హేతువాద, భౌతికవాద పక్షాలకు చెందినవారెవరూ అనరు. అననడం కంటే అనడానికి సాహసించరనడం నిజానికి మరింత దగ్గరిమదింపుమాట. ఆయా ఇతర సంస్థలపైనా, వాటి సారధులపైనా వెంకటాద్రిగారు వెలయించినంత విమర్శ రూప సాహిత్యం, వెంకటాద్రిగారిపై ఆస్థికేతర పక్షాలకు చెందినవారైనా తయారు చేయలేదు. కానీ ఆస్థికేతర ధోరణులే అనదగ్గ నిడమర్రు చార్వాకాశ్రమ పోకడపైనా, గోరానాస్థిక్యంపైనా, మార్కిస్టులపైనా, మార్క్సిస్టు హేతువాదులపైనా, అంబేద్కరిస్టు హేతువాదులపైనా, ఇతరేతర నాస్తిక సమాజాలపైనా కూడా వెంకటాద్రిగారు విమర్శనాస్త్రాలు సంధించారు. దీన్నంతటినీ కాచి వడకడితే సారరూపంగా రెండు మూడు అభిప్రాయాలేర్పడతాయి.


  • 1. హేతువాద సంఘం పెట్టినంతమాత్రాన, దానిలో సభ్యుడైనంత మాత్రాన, హేతువాదినని చెప్పుకున్నంతమాత్రాన ఒకడు హేతువాది (దానిసరైన అర్థంలో) కాడు, కాలేడు.
  • 2. అలాగే నాస్తిక సంఘాలు పెట్టినంత మాత్రాన దానిలో సభ్యుడైనంత మాత్రాన, నాస్తికుణ్ణని చెప్పుకున్నంతమాత్రాన, దేవుని నమ్మనంత మాత్రాన, నాస్తికుడనడానికి సరిపోడు.
  • 3. అలాగే భౌతికవాదినన్నంత మాత్రాన, భౌతికవాదపునాదికల సంఘాలలో సభ్యుడైనంతమాత్రాన, అతడు భౌతికవాదేననడానికి సరిపోడు.
  • 4. కాబట్టి ఎవరికి ఆయా ధోరణులకు చెందిన భావజాలంపట్ల సరైన అవగాహన ఉంటుందో, తదనుగుణ్యమైన ఆచరణా ఉంటుందో, అట్టివారే ఆయా ధోరణులకు చెందిన వ్యక్తులనడానికి అర్హత కలిగిన వారవుతారు. ఆ స్థాయికలిగినవారు, ఆయా సంఘాలలో చేరకున్నా అలాగని గుర్తింపు పొందకున్నా, ఆ ధోరణికి చెందిన వ్యక్తులే అవుతారు.


మిత్రులారా! వెంకటాద్రిగారు ప్రధానంగా నొక్కుపెట్టిన, ఆయన రచనలలో అంతర్లీనంగా తొంగిచూచే అంశాలివి. ఎన్నో విషయాలపై అవగాహనపరంగా వెంకటాద్రిగారికీ నాకూ విబేధాలు, వ్యత్యాసాలు ఉన్నా ఈ వైఖరి వరకునేనాయనతో విభేదించడంలేదు. తటస్తంగానూలేను. వాటిని అంగీకరిస్తూ ఉన్నాను. పై నాలుగు భావాల విషయంలో మీ మీ అభిప్రాయమేమిటో ఎవరికి వారుగా ఆలోచించుకోండి. నిక్కచ్చిగా ఆ మాట బైటికి చెప్పండి.

వెంకటాద్రిగారు, చాలాసార్లు తన రచనలలో హేతువాదుల్లో హేతువాదులుకాని వారి గురించీ, నాస్తిక సముదాయాల్లో ఉన్న నాస్తికులు కాని వారిని గురించీ, భౌతికవాద పక్షీయులలో ఉన్న భౌతికవాదులు కానీ వారిని గురించి ప్రస్తావిస్తూ, విమర్శిస్తూ, హెచ్చరిస్తూవచ్చారు. ఇప్పటికీ ఆయన అలాంటివారిపట్ల అదే వైఖరి కలిగిఉన్నారనే అనుకుంటాను.

అలాగే ఈ మూడు కూటాల వాళ్ళకూ ఆయన ఒక హిత సూచన చేస్తూ వచ్చారు. ఆస్తికేతర పక్షీయులందరూ ఆధునిక విజ్ఞాన శాస్త్రావిష్కరణలాధారంగా తమతమ తాత్విక భావజాలాన్ని సరిచూసుకుంటూ, సరిచేసుకుంటూ కదులుతుండాలన్నదే ఆసూచన. ముఖ్యంగా ఈమాట ఆయన హేతువాదులంగా నుండదలచినవారి నుద్దేశించి అన్నదే. అలాగే మిగిలిన అన్ని ధోరణులూ, హేతువాదం చూపెడుతున్న మార్గాన పయనిస్తూ ఉండాలనే దృష్టినీ కనబరిచారు.

ఈ విషయాన్ని చెప్పేటప్పుడు 'హేతువాదవైఖరి' క్రింద ఏయే భావాలను ఆయన మనస్సులో పెట్టుకున్నారో నాకు పూర్తిగా తెలియకున్నా; ఒక్క అంశం వరకు నాకు ఆయనతో ఏకీభావం ఉంది. అదేమంటే హేతువాద ఉద్యమం పునాది ఉద్యమం. మిగిలిన అన్ని ఉద్యమాల వెనకనున్న తాత్విక క్షేత్రాల ఆవిర్భావానికిగానీ, వాటిని విచారించి సరిచూసుకోడానికి గానీ, సరిచేసుకోడానికిగాని అవసరమైన ప్రాతిపదికలను హేతువాద తాత్విక ధోరణి (సిద్దాంతం) అందిస్తుంది. ఈ విషయం ఆయనన్నారనో, నేనంగీకరించాననో విలువను సంతరించుకోలేదు. గతకాలపు తార్కికులూ, లేదు తాత్వికులలో కొందరూ ఈ విషయాన్ని గురించి చాలా విస్పష్టంగా ఒక సూత్రాన్నే ప్రకటించారు.
కాణిదం పాణానీయంచ సర్వశాస్త్రోపకారకమ్‌.

సాంప్రదాయంలో న్యాయవైశేషిక దర్శనాలను తర్కశాస్త్రం అంటారు. ఆపంథాననుసరించేవాళ్ళను నైయాయికులు - తార్కికులు - అనంటారు. అందులో 'కాణాదం' అంటే కణాదుని దర్శనం (వైశేషికం) అని అర్థం. అది ప్రధానంగా ప్రమాణ, పదార్థ వివేచన చేస్తుంది.

ఇక పాణినీయం అంటే వ్యాకరణ శాస్త్రం అని అర్థం. అంటే భాషా నియమాలను వివరించే శాస్త్రం అని అర్థం. ఈ రెండు మాటల అర్థాలను కలుపుకుని చెప్పుకుంటే, తర్క వ్యాకరణ శాస్త్రాలు, మిగిలిన అన్ని శాస్త్రాలకూ ఉపయోగపడేటివి అని అన్నట్లు అవుతుంది.

తర్కశాస్త్రమంటే 'సక్రమాలోచనా నియమాల శాస్త్రం' అని అర్థం. వ్యాకరణం భాషా నియమాల శాస్త్రం అని అర్థం. కనుక సక్రమాలోచనానియమాలు, భాషానియమాలు తెలియకుంటే ఏ ఇతర శాస్త్రాల రూపకల్పనకు ఆధారం ఉండదుకనుక, ఈ రెండు శాస్త్రాలూ అన్ని శాస్త్రాలకు ఉపకారకాలని చెప్పబడింది. నాటికేగాక ఈ నాటికీ, ఏనాటికీ కూడా మార్చుకోనక్కరలేని, కాలం చెల్లని సిద్దాంతమిది.

మన ప్రస్తుతాంశమైన హేతువాదం సిద్దాంతమా? కాదా?

రాష్ట్రంలోని వివిధ ధోరణులకు చెందిన హేతువాదులూ, హేతువాదం సిద్దాంతంకాదు. అదొక ఆలోచనా విధానం అని అనుకుంటున్నారు, అంటున్నారు. కానీ దానిపై వెంకటాద్రి గారు తప్ప తమదైన రీతిలో ప్రత్యేకించి 'సిద్దాంత స్థాయికల? రచన లేవీ చేయలేదు. ఆ విషయం వెంకటాద్రిగారూ ప్రస్తావించారు. తానే హేతువాదం పైనా, నాస్తికత్వంపైనా సైద్దాంతిక వ్యాసాలు వ్రాస్తూవచ్చాననీ అన్నారాయన. అయితే ఆయన కూడా, హేతువాదం సిద్దాంతం కాదు. అదొక ఆలోచనావిధానం అన్న భావాన్నే వెలిబుచ్చారు. తెలుగునేలలో హేతువాద ఉద్యమానికీ, హేతువాదులమనుకునేవారికీ ఆ విషయానికి సంబంధించి సాహిత్యరూపంలో అందుతున్న సమాచారమంతా లేదా దాదాపు 90% సమాచారం, వెంకటాద్రిగారి రచనలనుండే అందుతోంది. కనుకనే హేతువాదం ఒక సిద్దాంతం కాదు, అదొక ఆలోచనా విధానం మాత్రమేననడం పరిపాటిగా మారింది. దానిపై ఎంతో కొంత అధ్యయనం చేసినవారేగాక, కనీసవగాహనలేని వారుకూడా హేతువాదం సిద్దాంతం కాదు, అదొక ఆలోచనావిధానం మాత్రమే అంటూ బట్టీపట్టిన సూత్రాన్ని అప్పజెప్పినట్లు అప్పజెప్పడం జరుగుతోందీనాటికీ.

నాస్తికులు, మార్క్సిస్టులు, రాయిస్టులతో హేతువాదం విషయమై నాకున్న పరిచయాలాధారంగా, ఈ విషయంపై కొంత విచారణ అవసరమనిపించి, గతంలోనే ''సిద్దాంత'' పదార్థ విచారణ అన్న శీర్షికన ఒక వ్యాసం వ్రాసి వివేకపథంలో ప్రచురించాను. మొన్నటికి మొన్న సిద్దాంతమన్నమాట వివిధ వైజ్ఞానిక సామాజిక, తాత్విక క్షేత్రాలకు చెందిన రచనలలో ఏయే సందర్భాలలో ఏమి అర్థాలలో వాడబడిందో కొంత ఉదహరించాను. అయినా, హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలను గమనిస్తూ, ఒకింత అంటీముట్టనట్లే ఉంటూ పాల్గొన్న గౌరవ్‌ హేతువాదం సిద్దాంతం ఎందుక్కాదంటూ రెండు లేఖలు వ్రాశారు. వివేకపథంలో ప్రచురించమంటూ.
వెంకటాద్రి గారి ప్రకారం, హేతువాదమంటే నాస్తిక్యంకాదు, మార్స్కిజమూకాదు, రాయిజమూకాదు, నిజానికి మరేయిజమూకాదు. హేతువాదమంటే హేతువాదమే. హేతువాద ఆలోచనా విధానాన్ననుసరించి వారు వారు వారి వారి ఆలోచనా సామర్థ్యాననుసరించి, నాస్థికులుగ, మార్క్సిస్టులుగ, రాయిష్టులుగ రూపొందుతూ వచ్చారు. అందులో నాస్తిక్యం హేతువాద ఆలోచనా మార్గాన చేరిన, చేరాల్సిన మొదటి మజిలీ మాత్రమే కడమజలీ మానవ వాదం. కానీ హేతువాదమంటే నాస్తిక్యం కాదు. కాని కొంతమంది హేతువాద పద్దతిననుసరించే నాస్తిక్యం అన్న మజిలీని చేరి అక్కడితో ఆగిపోయారు. అటు తరవాత ఇంకా మలి మజిలీలకు నడిపించాల్సిన హేతువాద విధానం (వారు అనుసరించకపోవడం వల్ల) వారిని మరింత ముందుకు నడపలేకపోయింది. లేదా వారు నాస్తికత దగ్గరే ఆగిపోయారు. హేతువాద పద్దతిన ఎక్కడా ఆగకుండా సాగేవారు మొదట 'నాస్తికత' దగ్గరకూ, అనంతరం భౌతిక వాస్తవికత దగ్గరకు చేరి ఆ చివరకు మానవవాదం వరకు ప్రయాణిస్తారు అన్నది వెంకటాద్రిగారి అవగాహన. ఆయన లెక్కప్రకారం ఎం.ఎన్‌.రాయ్‌ అలా ప్రయాణించిన వారే. రాయిస్టులూ ఆ మార్గాన పోతున్నవారే. కనుకనే వారి సిద్దాంతం నవ్యమానవ వాదమైంది. కనుక సరైన రీతిలో హేతువాద విధానాన్ని అనుసరించిన వారెవరైనా అవస్యం మానవవాదిగా తేలాల్సిందే. ఈ అంశాల మేరకు ఈ క్రమాన్ని చేరుతూ, దాటుతూ సాగని వారెవరైనా హేతువాద విధానాన్ని పూర్తిస్థాయిలో అనుసరించనివారేనన్నదీ వెంకటాద్రి గారి అవగాహనే. వీటి వరకు వెంకటాద్రి గారిని నేను సరిగనే అర్థం చేసుకున్నానో లేదో, ఆయన గానీ, ఆయనను అర్థం చేసుకుని ఉన్నామనుకుంటున్నవారు గాని ముందు నిర్థారించండి. ఈ మేరకు ఆయనేమిటన్నది నేను సరిగ అర్థం చేసుకోలేననిపిస్తే, ఎక్కడ పొరబడ్డానో తెలియజేయండి.

ఎవరికివారు తామూ హేతువాదులమేననుకుంటున్న ఆస్థికేతరులైయ్యుండీ వివిధ ధోరణులకు చెందిన వీరంతా; 'నాస్థికత' అన్నది ఒక సిద్దాంతమేనని అంగీకరిస్తారా? అంగీకరించరా? భౌతికవాదమన్నది సిద్దాంతమేనా? కాదా? అలాగే మార్క్సిజము రాయిజములన్నవి సిద్దాంతాలా? కాదా? అలాగే వీరందరి ప్రకారం 'ఆస్థికత' సిద్దాంతమేగా?
ఈ విషయాలు విచారించాలన్నా, సరైన అవగాహన అనడానికి తగిన ముగింపుకు రావాలన్నా కొన్ని కీలకమైన, మౌలికమైన అంశాలపై లోతైన చర్చ (విచారణలేదాపరిశీలన) జరగాలి. అందుకు ఈ అంశాలపై తనదంటూ ఒక అభిప్రాయాన్ని కలిగిఉన్న, ప్రకటించిన వారంతా బాధ్యతతో సిద్దంకావాలి. అందరూ కాదన్న, ఆయా ధోరణుల రధసారధులుగ నున్నవారివరకైనా చిత్తశుద్ధితో పూనుకోవాలి.

ఎందుకంటే, ఇతరేతర ధోరణులననుసరించే వారి మాటెలా ఉన్న భావజాల క్షేత్రంలో పని చేస్తున్నామనేవారి వరకైనా తమభావాలను పరీక్షకిచ్చి, అవి సరైనవేనని నిర్థారించే బాధ్యత వహించడం, ఎదుటివారి (తమ భావాలతో విభేదిస్తూ అదే విషయాలపై వేరు వేరు భావాలను వ్యక్తీకరిస్తున్నవారి) భావాలను పరీక్షించి అవి దోషాలతోనో, లోపాలతోనో కూడి ఉన్నవేనని వారికి తెలియజెప్పడానికి సిద్దంకావడం అన్న రెంటినీ కాదనుకూడదు. ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెంకటాద్రిగారు స్పష్టంగా ప్రకటించిఉన్నారు.

క వివేకవంతుడి మిత్రుడు విమర్శకుడే. విమర్శకుణ్ణి శతృవుగా భావించేవాడు మత వాదికి తీసిపోని కన్ఫరమిస్టు అవుతాడు.
క చదవకుండానే విమర్శించే వారిని నేనెరుగుదును. మీరు ఆకోవకు చేరకండి.
క ఒక సత్యాన్ని మాత్రం మనం విస్మరించరాదు. సిద్దాంతాలు చెప్పే వారున్నపుడు వాటిని ఖండించేవారుండ కూడదు అని ఆశించడం సక్రమంకాదు. విమర్శను సహించలేనివాడు సిద్దాంతాలను వల్లించడం స్వాతిశయం.
క విమర్శకు లొంగే సిద్దాంతాలను సవరించుకోకపోవడం తప్పవుతుందికాని, విమర్శించడం తప్పుకాదు.
క సిద్దాంతాలలో ఏకీభావం లేకపోతే మీరు నేను కలసి 'మనం' కాము. ఒకరికి మనవారు అన్న ముద్రవేసి, వారు చెప్పిందానికీ, చేసిందానికీ తాళం వేయడం హేతువాద పద్దతికాదు. హేతువాది తందానతానకొట్టడు.
క ఒక సిద్దాంతం (నాస్తికత్వం) క్రింద ఏమి చెప్పాలి? ఏమి చెప్పకూడదు?... అనే అంశాలు స్పష్టంగా తెల్సుకోకుంటే సోషలిజంలాగే నాస్తికత్వమూ (ఏ సిద్దాంతమైనా) అర్థంలేని బిందెనాదమైపోతుంది... హేతువాద నాస్తికోద్యమాలు అలా మారకుండా ఉండాలంటే సిద్దాంతాలలో, లక్ష్యాలలో స్పష్టత ఉండాలి.
క ఒక సిద్దాంతాన్ని విమర్శించడంలో తన మన లేదు. అలా విమర్శించడమే హేతువాది ధర్మం... విమర్శను అర్థం చేసుకోలేనిది అజీర్ణహేతువాదం. సహించలేంది మతం.
క ప్రతిహేతువాదీ మార్కిస్టు కావాలనిలేదు. మార్క్సిజాన్ని విమర్శించకూడదనీలేదు.
క మార్క్సిజం యొక్కగానీ, మరో సిద్దాంతం యొక్కగాని ఉచితానుచితాలను పరిశీలించడానికి హేతువాదం, శాస్త్రజ్ఞానం కొలమానాలు కావాలిగాని, హేతువాదం యొక్క ఔచిత్యాన్ని పరిశీలించడానికి మార్క్సిజం కానీ (మరోటుకాని) ప్రమాణం కారాదు. మార్స్కు చెప్పాడు కాబట్టి, లెనిన్‌ చెప్పాడు కాబట్టి, మావో చెప్పాడు కాబట్టి అంటూ ఆ కాబట్టీల ప్రమాణంతో హేతువాదాన్ని పరిశీలించడం మతపద్దతి.
సురేంద్ర :- దీనిని మరికాస్త పొడిగిద్దాం. స్పష్టత కొరకు రావిపూడి చెప్పాడు కాబట్టి, గుత్తారాధాకృష్ణ చెప్పాడు కాబట్టి సురేంద్రో మరో సుబ్బయ్యో చెప్పాడు కాబట్టి అంటూ ఆ కాబట్టీల ప్రమాణంతో హేతువాదాన్ని పరిశీలించడమూ మత పద్దతే.

గమనిక :- రావిపూడి రచనలు - సం-3 'నాస్తికత్వం' గ్రంథాన్నీ, 1982లో రెండవముద్రణగా అచ్చేసిన 'హేతువాదం' పుస్తకాన్ని చదువుతూ పై వాక్యాలు ఎత్తిరాశాను. రచన ఇక్కడికి చేరేటప్పటికి (340నెం. నవంబరు 2013) హేతువాది అందింది. ప్రస్తుతం వివేక పథం ద్వారా నేను సాగిస్తున్న 'హేతువాద పునరుజ్జీవన యత్నాలు' అన్న శీర్షికకు సంబంధించిన విషయాలెన్నో దానిలో ప్రస్తావించబడడంతో, దానిని శ్రద్దగా చదవాను. గమనిక అంటూ ఇక్కడ నేను వ్రాస్తున్న ఈ మాటల కంటే ముందు, వెంకటాద్రిగారే విమర్శ గురించి వ్రాసిన వాక్యాలను ఉట్టంకించి ఉండడం, అవి చాలా విలువైనవిగా నేను తలుస్తుండడంతో ఆ భావాల ప్రాతిపదికనే ఈ నవంబర్‌ హేతువాదినీ ఒకింత విమర్శించుదాం అనిపించింది. ఇప్పటికే ఆ సంచికను అందుకున్న 'హేతువాది' పాఠకులు మరోసారి దానిని జాగ్రత్తగా పరిశీలించండి.

ఆ సంచికలో వెంకటాద్రి గారి పేరున ప్రకటింపబడ్డ వ్యాసాలు మూడు
1. ఎడిటోరియల్‌ క్రింద 'జ్ఞానమూ, సత్యమూ - సాపేక్షత'
2. హేతుత్వం - సంకల్పం (రాడికల్‌ హ్యూమనిస్టు ది. 24-12-1953 నాటి వ్యాసం)
3. హేతువాదం - కార్యకారణత - జ్ఞానం - సత్యం - స్వేచ్చ (బహుశా ఇది 1994 తరువాత నాతో వివాదం ఆరంభమైయ్యాక వచ్చి ఉంటుంది)

ఆ వ్యాసాలపై విమర్శ దృష్టి నుండి ఆలోచనకు, పునరాలోచనకు ఉపయోగపడతాయని నా కనిపించిన కొన్ని ప్రశ్నలను మీ ముందుంచుతాను. నేనిలా ఆరంభించడానికి ప్రేరణగా ఆ వ్యాసాలు విమర్శించవలసినవిగా ఉండడంతోబాటు వెంకటాద్రి గారు విమర్శకు సంబంధించి ప్రకటించిన అభిప్రాయాలూ తోడైనాయి.
హేతువాది నవంబర్‌ 2013 సంచిక ఎడిటోరియల్‌ గురించి

1. మొట్టమొదట, ఆ వ్యాసం మొత్తం పైన నాకనిపించిన ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తాను. అందులో నాకంగీకారమైన భావాలతో బాటు నాకంగీకారంకాని భావాలు భాషాదోషాలు, నన్నూ దృష్టిలో పెట్టుకుని అనవసరపు దూకుడును కనబరుస్తూ వ్రాసిన వ్యంగ్యోక్తులూ ఉన్నాయి.
2. శీర్షికగా 'జ్ఞానము, సత్యము - సాపేక్షత అన్న మూడు పదాలను వాడారు. కనీసం ఆ మూడు పదాలకు సూటిగా అర్థాన్ని చెప్పనేలేదు. అతి ముఖ్యమైన ఆ పదాలకు సరైన - ఖచ్చితమైన - అర్థాలను నిర్ధారించకుండా ఆయన చెప్పదలచుకున్నదేమిటో ఇదమిద్దంగా గ్రహించడం కుదరదు.
3. తెలుగులో నానార్థాలతో ఉన్న ఒక పదాన్ని వాడి, దాన్ని ఈ అర్ధంలో వాడానంటూ అనువాద రూపంలో ఒక ఆంగ్ల పదాన్ని వాడితే ఆ పదానికి అర్థం చెప్పినట్లు కాదు గదా! పైగా అనువాద రూపంగా వాడిన ఆంగ్ల పదమూ అనేకార్థాలను కలిగి  ఉన్నది కనుక పటిత ఏ అర్థాన్ని గ్రహించాలి? గ్రహించుతాడు? ఏ వస్తువును గురించిన జ్ఞానమైనా, అది ఉన్నదన్న స్పృహ మనలో జనించడంతోనే ప్రారంభమవుతుంది. ఎలా ఉందీ వాక్యం? ఆయన వాక్యాన్నే ఇలా రాస్తే ఎలా ఉంటుంది?
ఎ. 'దీన్ని గురించిన జ్ఞానమైనా అనిగాని ఏ విషయాన్ని గురించిన జ్ఞానమైనా అని గాని వ్రాస్తే ఏ వస్తువు గురించిన జ్ఞానమైనా అన్నదానికంటే విస్తృతార్థాన్నివ్వగలుగుతుంది. వివరించుకోడానికీ బాగుంటుంది. అవునాకాదా?
బి. అది ఉన్నదనే స్పృహ మనలో జనించడంతోనే ప్రారంభమవుతుంది. అన్న దానిలో 1. దాని ఉనికి మన ఎరుకలోకి రావడం అన్న భావము 2. జ్ఞానం ప్రారంభమవుతుంది అన్న భావము చోటు చేసుకుని ఉన్నాయి. నిజానికి దేని జ్ఞానమైనా ఏదో ఒక జ్ఞానేంద్రియంతో దానికి సన్నికర్ష ఏర్పడే కలుగుతుంది. అలాంటప్పుడు ఉత్త ఉనికి స్పృహ ఎన్నడూ కలగదు. ఆ ఇంద్రియం పట్టివ్వ గల గుణం ఉంది అని గాని ఆ గుణం కలది అక్కడ ఉంది అని గాని స్పృహ జనించడం, అనంతరం దానివెంబడే జ్ఞానం ప్రారంభకావడం అన్న క్రమం ఉండదు. పైగా జ్ఞానం పుడుతుందనో, కలుగుతుందనో అనాలిగాని, జ్ఞానం ప్రారంభమవుతుంది అన్న ప్రయోగం అంత సరైందికాదు. అలాంటి ప్రయోగాలు సరిపెట్టుకోడానికి పనికొస్తాయేగాని వాటికవిగా సరిగ్గాసరిపోవు. అలాంటి వాక్యాన్ని అర్థం చేసుకోడానికి మరికొన్ని పదాల్ని తెచ్చిపెట్టుకోవడమో, ఉన్న పదాల్ని పట్టించుకోకపోవడమో చేయాల్సి వస్తుంది.
దేన్ని గురించిన జ్ఞానమైనా దాన్ని తాకిన లేదా దాన్ని పట్టిచ్చిన ఇంద్రియాన్ననుసరించి ఫలానాది ఉందన్న స్పృహ రూపంలోనే కలుగుతుంది. నావైతే వెంకటాద్రిగారు చెప్పదలచింది ఇదేనని అనిపించింది. మరి మీకేమనిపిస్తోంది?
2. ''ఏ వస్తువూ మొత్తంగా ఒకేసారి మన జ్ఞాన పరిధిలోకి రాదు'' అన్నది అందులోని రెండో వాక్యం
విమర్శ :- వస్తువు అన్నపదం వల్ల ఏర్పడే సంక్లిష్టతే ఆ వాక్యపు అర్థాన్ని గ్రహించడం విషయంలో ఇక్కడా ఎదురవుతోంది.

ఉదా:- ఒక పండు యొక్క రుచేమిటో తెలుసుకోగోరామనుకోండి. ఆ పండును రుచిని కనిపెట్టే ఇంద్రియానికి తాకిస్తాం. వెంటనే దాని రుచేమిటో మన స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రావడం తెలియడం ఒక్కటే ననుకుంటేనే విషయస్పష్టత ఉంటుంది. (దాని రుచికి సంబంధించిన స్పృహజనించడంతోనే రుచి జ్ఞానం ఆరంభం అవుతుంది అనడం అంతసరైన భాష అనిపించడం లేదు కదూ!) పై వాక్యంలో వస్తువు అనగానే విషయమన్న సాధారణార్థం స్పురించకపోగా, ఒక ఆవరణ కలిగి (ప్రదేశరీత్యా మూడు కొలతలుండి) దృష్టికి అందులో కొంతే అందుతున్న పదార్ధం (ద్రవ్యం) అన్న అర్ధం వస్తోంది.

కానీ జ్ఞానార్జన ప్రక్రియ ద్వారా జ్ఞానం కలుగుతున్న తీరంతా ఆయా జ్ఞానేంద్రియాలు పట్టివ్వగల అంశానికి సంబంధించినదిగనే ఉంటుంది. ఉదా:- దాని రంగేమిటి? రుచేమిటి గట్టి మెత్తనలు, గరుకు, నునుపులు ఏమిటి? వాసనేమిటి? పరిమాణమెంత? ఆకృతేమిటి? ... ఇలా కలుగుతుంటుంది మనకు కలిగే ఐంద్రియక జ్ఞానమంతా. ఇక మనకు కలిగిన జ్ఞానం సరైందా? కాదా అన్నదీ ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకునే పరీక్షిస్తాము. నిర్థారిస్తాము.
ఏ వస్తువు ఒకేసారి మొత్తంగా 'మన జ్ఞానపరిధిలోకి రాదు' అన్నదాంట్లోని, మన జ్ఞాన పరిధిలోకి అన్న మాటలు, అప్పటికే మనకోజ్ఞానము, దానికో పరిధి ఉన్నవన్న అర్థాన్నిస్తున్నాయి. అలాంటి పదాలను అప్పటికే తెలిసున్న అంశాలను గురించి ప్రకటించేటప్పుడు మాత్రమే వాడాలి. ఉదా :- నీవంటున్న విషయం నా జ్ఞాన పరిధిలోలేదు, అనడంలాగన్నమాట.

వెంకటాద్రిగారెత్తుకున్న సందర్భాన్ని సరళంగా వ్యక్తం చేయాలంటే, వస్తువంటే పరిమాణము ఆకృతి కల ద్రవ్యం అన్న అర్థంలోనైతే, ఏ వస్తువుకు సంబంధించిన అన్ని విషయాల జ్ఞానమూ సమగ్రంగా ఒకేసారి కలగదు అనాలి. అదే మరి 'వస్తువు' అన్న దగ్గర విషయము అని గాని పదం వాడితే, ఇక ఆ విషయం వరకు కలగవలసినంత జ్ఞానమూ (ఆ ఇంద్రియం సరిగలేకుంటే తప్ప) కలిగేస్తుంది. ఇక ఆ విషయంలో ఏ అసంపూర్ణతో, సందిగ్థతో ఏమీ ఉండదు.
3) ''అది మన జ్ఞాన ప్రక్రియ వికసించేకొలది దాన్ని గురించిన సమాచారం వృద్ధి చెందుతుంది'' అన్నది మూడో వాక్యం.

విమర్శ :- ఈ వాక్యంలో మొదటి పదం 'అది' అన్నది అనవసరం. తరవాతి మాటలైన మన జ్ఞాన ప్రక్రియ వికసించేకొలది అన్నవాటికి, ఆయన చెప్పదలచుకున్న అర్థమేమిటన్నది స్పష్టం కావడంలేదు. ఎందుకంటే 'జ్ఞానప్రక్రియ' అంటే ఆయనర్థమేమిటి? లేదా లోకంలో వాడుకలో ఉన్న అర్థమేమిటి? అది వికసించడమంటే ఏమిటి?
ముఖ్య గమనిక :- కథలు, నవలలు లాటి సాహిత్యాన్ని చదివేటప్పుడు ప్రతి పదాన్ని అంతగా పట్టిచూడకున్న పరవాలేదు గాని, భావజాల క్షేత్రంలో, అదీతాత్వికాంశాలకు చెందిన కీలకమైన పదాలగురించి వివరించేటప్పుడూ, విచారించేటప్పుడూ మాత్రం ప్రతి పదాన్ని నిశితంగా పట్టిచూడాలి. లేకుంటే దానిని అధ్యయనం అనలేము. పైగా ఈ శీర్షికగా ఆయన ఎంచుకుంది మూడు ముఖ్యమైన పదాలనే.

ఇంతకూ వెంకటాద్రిగారు చెప్పదలచుకున్నది ఏమైయ్యుంటుంది?

మనం జ్ఞానాన్నార్జించడానికి వినియోగించే పరికరాల, విధానాల సామర్థ్యాలను పెంచుకోవడాన్ననుసరించి, అదే వస్తువుకు చెందిన మరింత సమాచారం మన ఎరుకలోకి వస్తుంటుంది, అనే కదా! అందుకు ఆ మాటలకంటే నా మాటలే స్పష్టత నిస్తున్నాయనిపిస్తున్నదా లేదా? ఆలోచించండి.

4. ''అందువల్ల మన జ్ఞానం అంచలంచలుగా పెరుగుతుంది. అంటే, మొన్నటి, నిన్నటి, నేటి, రేపటి, జ్ఞానపరిమితులకు తేడా ఉంటుంది. అన్నది అందులోని 4, 5 వాక్యాలుగా ఉన్నాయి.
ఇందులో 'జ్ఞానపరిమితి' అన్న పదబంధం ఉంది. పరిమితి అంటే హద్దు అని అర్థం. జ్ఞాన హద్దుల్లో తేడా ఉంటుందనేనా చెప్పదలచింది. నిన్నటికి దానికి సంబంధించిన ఇంతజ్ఞానమేఉంది. అది ఈ నాటికి ఇంతైయింది. రేపటికి మరింత అవుతుంది. అన్నదేనా రచయిత చెప్పాలనుకున్నది. జ్ఞానాన్ని 'స్థాయి' అన్న పదంచేత, పరిమాణం అన్న పదం చేత 'విస్తృతి, లోతు' అన్న అర్థంలో వాడడం ఎక్కువ వినియోగంలో ఉంది. జ్ఞానానికి 'పరిమితి' ఉందనడం తప్పు ప్రయోగం కాదు గాని, ఈ విషయంలో నా జ్ఞానమింతే అని చెప్పే సందర్భాలలో ఆ మాట అతికినట్లు సరిపోతుంది.

5. ''అయితే, 'సహజంగా' మొన్న, నిన్నటి జ్ఞానంకంటే నేటి, రేపటి జ్ఞానం పురోగతిలో ఉంటుంది.''
విమర్శ:- 'సహజంగా' అన్నమాటకు దాని అసలర్థంలేదు ముఖ్యార్థం 'కలసిపుట్టినట్లు' అని సహ=తోడ్తో లేదా జతగా జ(ఏ) = పుట్టిన అని సహజమన్నమాట అర్థం. కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి వెంకటాద్రి గారు చెప్పదలచింది సాధారణంగా, మామూలుగా, ప్రతిసారీ లేదంటే ఎక్కువసార్లు (తరచుగా) అన్న భావాన్నే నేమో అనిపిస్తున్నది. తరవాతి మరోపదం ''జ్ఞానం పురోగతిలో ఉంటుంది'' అన్నది.

పురోగతి అన్నపదం 'ముందు వైపుకు కదలిక'' అన్న అర్థాన్నిస్తుంది. 'నిరంతరం ఎక్కువవుతూ' అన్న అర్థాన్ని చెప్పాలని కాబోలు నిజానికి జ్ఞానం పురోగతిలో ఉండదు. జ్ఞాని అదనపు జ్ఞానం సమకూర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. జ్ఞానం విషయంగా చెపితే ఆ జ్ఞానం రాశిలోనూ, వాసిలోనూ పెంపొందుతూ ఉంటుంది. అదలా ఉంచి కాలాన్ననుసరంచి మొన్న నిన్న కలిగిన (గతంలోని) జ్ఞానం అనివార్యంగా మారుతుందనిగానీ, మారాలనిగానీ, అదిన్నీ మరింత ఉన్నతస్థాయి లేదా మెరుగైన రూపంలో జ్ఞానం ఏర్పడి తీరాల్సిందేనని గాని నియమం ఉందని నిర్ధారించలేము. అందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. మచ్చుకు ఈ సంచికలోని ఒక అంశాన్నే ఉట్టంకించవచ్చు. వెంకటాద్రి గారి రచనే అయిన 'హేతుత్వం - సంకల్పం' అన్నవ్యాసం 60 ఏండ్ల నాటిది. అది ఈనాడు మళ్ళీ ఎట్టి మార్పులూ చేయకుండా (మార్చక్కరలేదనుకునే) యథాతథం ప్రచురించారు. ఏనాడో చెప్పిన ఆ భావాలు నిన్నటికీ, నేటికీ గాకుండా రేపటికీ - కనీసం సమీప భవిష్యత్తు వరకైనా - అంటే ఎల్లుండి, ఆ తరవాతకీ కాదనుకున్నా, మార్చనక్కరలేదు. అనుకునే గదా ప్రచురించారు? వెంకటాద్రి గారే, గతకాలం నాటి అంటే నిన్న, మొన్నటికంటే వెనకటి కాలం నాటి వనడానికి వీలున్న; దర్శనాలలోని ప్రతిపాదనలను, అవి 2500 సం|| కంటే వెనకటివైనా వాటిని మార్చుకోనక్కరలేనివిగనే ఉన్నాయనంటూ స్పష్టంగా ప్రకటించారు.

కనుక ప్రతి విషయానికి చెందిన జ్ఞానమూ, ప్రత్యంశానికి చెందిన జ్ఞానము మొన్నా, నిన్న, నేడు, రేపు అన్న కాలపు కొలతలనుండి మారి తీరుతుందనిగానీ, మారాల్సిందేననిగానీ, అదీ రాశి, వాసి పరంగా మెరుగైతీరుతుందనిగాని చెప్పనేకూడదు. ఎప్పుడో కలిగిన జ్ఞానం ఇప్పటికీ మార్పు నొందకుండా ఉండే వీలుందా లేదా? కొన్ని విషయాలవరకైనా? ఆలోచించి ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రండి. అలా చేసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించే బాధ్యత వహించండి. ఇది సబబబేననిపిస్తే, దీని కొనసాగింపిలా ఉంటుంది. ఒక వ్యక్తికి ఎన్నడో కలిగిన జ్ఞానం కంటే మరో వ్యక్తికి ఇప్పుడు కలిగిన జ్ఞానమే అల్పమైంది. దోషయుక్తమైందీ కూడా కావచ్చు.
6. మనకు లభించే వస్తుజ్ఞానం ఎప్పటికప్పుడు సాపేక్షం (ష్ట్రలిజిబిశిరిఖీలి) అవుతుందేకాని, పరమం (జులీరీళిజితిశిలి)  కాదు అన్నది ఆ పేరాలోని చివరి వాక్యం.

విమర్శ :- ఈ వాక్యంలో 'సాపేక్ష', 'పరమం' అన్న రెండు పారిభాషిక పదాలు వాడారు. ఇంతకూ ఆ రెండు పదాల అర్థం ఏమిటో చెప్పనేలేదు. నాకుతెలిసి సాపేక్ష మన్నమాట స+అపేక్ష అన్న రూపం కలది. అపేక్ష అన్న పదం కావాలన్న దృష్టి ఉండడాన్ని తెలుపుతుంది. ఏదైనా ఒకదానికి మరోదాని సంబంధం గానీ, మరో దాని అవసరంగాని ఉన్నప్పుడు దానిననాలి 'సాపేక్షికం' అని. ఇక్కడ వస్తుజ్ఞానం అన్న పద బంధం వస్తువుకు సంబంధించిన జ్ఞానం అనిగాని, వస్తువును గురించిన జ్ఞానం అనిగాని వస్తువు యొక్క జ్ఞానం అనిగాని అర్ధాన్నిస్తుంది. మరలాటపుడు వస్తుజ్ఞానం సాపేక్షం అన్నమాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వస్తువు యొక్క జ్ఞానం మరొకదాని సంబంధాన్ని అపేక్షిస్తోంది. (కోరుకుంటోంది) అని చెప్పాలనా? అలా అనుకుందాం మాటవరసకు అనుకున్నా, ఏ వస్తు జ్ఞానం లేదా వస్తువుకు సంబంధించిన ఏ జ్ఞానం, మరొక దేనిసంబంధాన్ని కాంక్షిస్తున్నట్లు

క ఇంతకూ జ్ఞానం పరమం కాకపోవడమంటే ఏమిటి? ఏదైనా వస్తువుని తీసుకుని దానికి సంబంధించిన ఏఏ రకాలైన ఎంత జ్ఞానం పొందవచ్చో వివరిస్తూ 'సాపేక్షం', పరమం అన్నవాటి అర్థాలను సరిపెట్టగలరేమో చూడండి.
గమనిక : వేటిగురించైనా తెలుసుకోవడానికి అవసరపడే నాకు తెలిసిన ఒక పరిశీలనా పద్దతిని మీ ముందుంచుతాను. సరిగా ఉందో లేదో చూడండి. దీనికంటే మెరుగైన పద్దతి మీకు తెలుసుంటే నాకు తెలపండి. ఇందులో దోషాలు, లోపాలు ఉన్నా ఎత్తిచూపండి.

1. అదంటే ఏమిటి? 2. ఎక్కడుంది 3. ఎప్పుడుంది 4. ఎలా ఉంది 5. ఎంతుంది 6. దాని గుణాలేమిటి 7. క్రియలేమిటి? 8. దానితో మనకున్న సంబంధమేమిటి? అన్న వీటిని విచారణ (పరిశీలనా) క్షేత్రానికి చెందిన ప్రశ్నష్టకం అనంటారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికై - అంటే ఆ వివరాలు తెలిసికోవడానికై, మనం 'జ్ఞానేంద్రియాలను బుద్ధిని ఉపయోగిస్తాము. ఆయా జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారాన్ని బుద్దితో క్రోడీకరించుకుని దానిని గురించిన అవగాహనకు వస్తాము. సాధారణంగా జరిగిపోతుండే ప్రక్రియ ఇదే.
ఉదాహరణకు ఏదైనా ఒక ద్రవ్యంతో చేయబడ్డ నిర్థిష్టాకృతి గల వస్తువును తీసుకున్నామనుకుందాం. వరసగా ప్రశ్నలు వేసుకుంటూ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
1. అదంటేఏమిటి? బంగారు ద్రవ్యంతో చేయబడ్డ ఉంగరం అనే పేరుతో పిలువబడుతున్న వస్తువు = బంగారు ఉంగరం.
2. ఎక్కడుంది 3 ఎప్పుడుంది ఈ రెండు ప్రశ్నలకు మనకు తెలిసి ఉన్నదాన్ని బట్టి ఇదిగో నా చేతివేలికుందనో, ఆ బల్లపై ఉందనో అది ఉన్న వాస్తవ ప్రదేశాన్ని, ఆ సమయాన్ని గమనిస్తాం లేదా చెపుతాం.
3. ఎలా ఉంది? బంగార మనడానికి తగిన లక్షణంతో కూడిన ద్రవ్యం ఉంగరం ఆకృతిలో ఉంది.
5. ఎంతుంది? ఈ ఎంతుంది అన్నది ద్రవ్య పరిమాణాన్ని (బరువును) అది ఎంత ప్రదేశాన్నాక్రమించి ఉందో ఆ వివరాన్ని చెపుతాం.
మిత్రులారా! మిగిలిన మూడు ప్రశ్నలకూ ఆ వస్తువును చూస్తూ సమాధానాలు రాబట్టగలరేమో చూడండి. ఇలా ఆయా వస్తువుల (విషయాల) గురించి జ్ఞానాన్ని ఆర్జించేటపుడు, 'వస్తుజ్ఞానం సాపేక్షం అన్నమాటను ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అన్వయించాలో ఆలోచించండి. జ్ఞానం పరమం అంటే ఏమిటి, జ్ఞానం పరమం కాదు అంటే ఏమిటోనో కూడా మీకెలా అర్థమైందో గమనించండి. అభ్యంతరం లేకుంటే ఆ వివరాలు నాకు తెలియజేయండి.
ఇక ఆ వ్యాసంలోని రెండో పేరా ఇలా ఉంది చూడండి.

ఇంగ్లీషులో థింగ్‌కు, ఆబ్జెక్ట్‌ కు తెలుగులో వస్తువు అనే అనువాదాన్ని అనుసరిస్తున్నాం. నిజానికి వస్తువు ఉనికి మొత్తంగా మనకు అందనిది ధింగ్‌ (ంబీశీలిబీశిరిఖీలి ష్ట్రలిబిజిరిశిగి) అందులో పాక్షికంగా అందేది దృశ్యవిషయక వాస్తవికత ....

మిత్రులారా! మొదటి పేరా ద్వారా; అధ్యయనము - విచారణ ఎలా చేయాలో, నేనైతే ఎలా చేస్తానో వివరించాను.
రెండవపేరాను మీరూ అలానేకాని, మీదైన రీతిలోకాని అధ్యయనం చేసి విచారించండి. దానిలో భాషా దోషాలుగానీ, భావపరమైన దోషాలు, లోపాలుగానీ ఉన్నాయో, లేదో పరిశీలించి ప్రకటించండి. ఒక్క విషయం సైద్దాంతికస్థాయికి చెందిన ఏ రచనలనైనా ఇలాగే పరిశీలించాలన్నది నా నిశ్చితాభిప్రాయము. అధ్యయనానికి పనికి వచ్చే కొన్ని మార్గదర్శకాలను మీముందుంచుతాను. జాగ్రత్తగా అర్థం చేసుకుని, అమలు చేసి చూడండి. ఈ విషయన్నంతగా ఎందుకు చెపుతున్నానంటే, చూడవలసినంత జాగ్రత్తగానూ, నిశితంగాను చూడకుండా చదివేసుకుంటూ పోవడం ఉందే అది పాయసంలో తెడ్డులాటి దవుతుంది. పాయసానికి అతి దగ్గరగా ఉండేది, దాని గురించి ఏమి తెలిసికోనిది అనే అర్థంలో ఈ సామెతను వాడతారు. 'దర్వీ పాకరసం యథా' అన్నది నానుడి. అర్థాన్ని గ్రహించకుండ ఊరకే చదువుకుంటూ పోయే వారినీ, అర్థాన్ని పట్టించుకోకుండా బట్టీ పట్టే వాళ్ళనీ ఉద్దేశించి వ్యంగ్యంగా చెప్పుకునే సామెత ఇది.

1. నీవు అధ్యయనం చేయదలచుకున్న పాఠాన్ని గాని, పాఠభాగాన్ని గాని మొదట ఎంపిక చేసుకో.
2. అందులో ఎన్ని వాక్యాలున్నాయోగమనించు (లెక్కించు).
3. ఆ వాక్యాలలో ఎన్ని అర్థమైనాయో గమనించు. ఏమి పదాలు అర్థం కాలేదోనూ గమనించు. ఎందుకంటే పద పదార్థ జ్ఞానం లేనివానికి (ఈ పదానికిదీ అర్థం అని తెలియనివానికి) వాక్యార్థజ్ఞానం కలగదు, అన్నది సార్వత్రిక విలువ కలిగిన భాషానియమం. దాన్ని గాని పట్టించుకోకుంటే ఆపై చేసేదంతా నేలవిడిచిన సామే.
4. వాటి ద్వారా ఎన్ని అభిప్రాయాలు (వీటికి సంబంధించి) ప్రకటింపబడ్డాయో గమనించు.
5. అర్థమైందనుకున్న భావాలలో సత్యాసత్య వివేచనా పద్దతిననుసరించి
1. తప్పులెన్నో 2. ఒప్పులెన్నో 3. ఇంకా తేలనివెన్నో గమనించు
ఇది. ఇదే నాకు తెలిసినంతలో అధ్యయనం సార్థకరూపంలో (దానిసరైన అర్థంలో) కొనసాగించే క్రమవిధానం. ఆవేశకావేషాలకులోనుకాకుండా, రాగద్వేషాలు లేకుండా చేసే అధ్యయనమే సత్ఫలితాలనందిస్తుంది.
గమనిక :- హేతువాదినిగానీ, వివేకపదాన్నిగానీ, మరే రచనైనా ఇలా చదవాల్సిందే. కూలంకుష పరిశీలనకు ఇదొక్కటే మార్గము.

గమనిక  2:- సరైన విమర్శకుడు రచయితకు (వక్తకు) మితృనివంటివాడన్నమాట వాస్తవాన్ని తెలిపేటిదే ఆ విషయాన్నే మరింత గంభీరంగా చెప్పుకోవాలంటే విమర్శకుడు శతృవైనా, మితృడైనా, అతని విమర్శ సరైనదే అయితే, అది రచయితను ఆ రచనను విమర్శతో కలిపి చూస్తున్న పాఠకులకూ కూడా హితాన్నే కలిగిస్తుంది. కనుక స్నేహితుని పాత్రనే పోషిస్తుంది. అనడం బాగుంటుంది. ఇది నిజమా? కదా? ఆలోచించండి.
'హేతువాది' సంపాదక వర్గానికి మరోసారి విజ్ఞప్తి

మరల మరో గెలుకులాటా అంటూ శీర్షిక పెట్టి మీరు ప్రచురించిన వ్యాసం చూసిన వెంటనే వ్యంగ్యోక్తులూ, వ్యక్తిగత విమర్శల జోలికిపోకుండా విషయపరమైన విమర్శకు సిద్దపడడం సరైన దవుతుంది. అలాటి విమర్శకు పూనుకోండి అని వివేక పథం ద్వారా మీకు తెలియజేశాను. ఈ సంచిక చూశాక, మీరు ఆ నా విజ్ఞప్తిని అంతగా పట్టించుకోలేదని అర్థమైంది. అయినా దానికి తగిన రీతిలో ప్రతిస్పందిచకుండా, ఇదిగో మలి విజ్ఞప్తి చేస్తున్నాను మరోసారి. ఈ సంచికలో వెంకటాద్రి గారి పేరన వచ్చిన రెండు రచనల్లోనూ, వ్యంగ్యంతో కూడిన విసుర్లు కొన్ని చోటు చేసుకుని ఉన్నాయి. సంపాదకీయంలో -1. సత్యానికి అర్థమేమిటి? అని అడుగుతూనే శంకరాచార్యుడి సత్యానికి అర్థమేమిటి. పెళ్ళాం బిడ్డల్ని అమ్ముకుని అప్పుతీర్చాడన్న పోర్జరీ హరిశ్చంద్ర నాటకంలోని సత్యానికి అర్థమేమిటి? సత్యాన్వేషణ పేరుతో నానా తంటాలు పడుతున్న వారి సత్యానికి అర్థమేమిటి? సత్యం గోపన్న గొంగళికాదు. నాటకాలతో బూటకాలతో దానితెరలేవదు? అన్నమాటలున్నాయి.

సత్యమంటే ఏమిటన్న విషయంలో మీరూ నేనుగానీ, మరెవరెవరుగానీ చర్చించుకోడానికి, ఇలాటి భాష అవసరమా? విమర్శ, విమర్శకుడూ రచయితకు మిత్రుడే నన్న మీ మాటలకు చేతలకు అనుగుణ్యత ఉందా ఇక్కడ?!

విజ్ఞప్తి :- వ్యంగ్యం మనకొద్దు, వ్యక్తిగత విమర్శలూ అనవసరం. విషయ విమర్శ ఎంత ఘాటుగా, సూటిగా ఉన్నా మేలే.

ప్రత్యేక ప్రకటన :- శాస్త్రీయ దృక్పథము తెలుసుకోవాలన్న కుతూహలం మానవ స్వభావంలోనే ఉంది. అది ఒక ఉద్దేశపూర్వకమైనదిగా మారి నిర్ణీత విషయానికి సంబంధించిందిగా మారినపుడు దానినే మనం జిజ్ఞాస అంటున్నాయి. కుతూహలంలోనూ జిజ్ఞాసలోనూ తెలుసుకోవాలనే అభిలాష సామాన్యమే అయినా, జిజ్ఞాసస్థాయిలో అది ఒకింత ప్రత్యేకతను, తీవ్రతను, నిర్థిష్టతను సంతరించుకుని ఉంటుంది. ప్రకృతిని పరిశీలించడం తొలిదినాలలో ఆశ్చర్యంతో కూడిన కుతూహలం వల్ల ఆరంభమైనా, ప్రకృతి సంబంధంగా ఏర్పడుతూ ఉన్న సుఖ, దుఃఖాల అనుభవం కారణంగా ఆయా విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలించడం మొదలైంది. అది క్రమంగా ఒక క్రమ పద్దతి పరిశీలనకు దారి తీస్తూ వచ్చింది. ఈ థకు చేరాక దానిని కేవలం కుతూహలం అనికాక, జిజ్ఞాస అనడమే సరైంది అవుతుంది.

అందుకే ఈ థకు చేరిన తరవాత చేసే తెలుసుకునే పనికి అన్వేషణ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆ అన్వేషణ కూడా క్రమక్రమంగా ఎప్పటికప్పుడు అప్పటికి అనుసరిస్తున్న పరిశీలనా పరిస్థితిలోని గమనికలోకి వచ్చిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అదనపు సామర్థ్యాలను జతచేసుకుంటూ ఈనాటికి ఒక స్పష్టమైన, సమర్థవంతమైన విధానాన్ని రూపొందించుకోగలిగింది. దానినే మనమిప్పుడు శాస్త్రీయ (పరిశీలనా) పద్దతి అనంటున్నాం. దానికి అనుబంధంగా మానవికమైన తప్పిదాలు జరక్కుండా ఉండేందుకు తగిన దృక్పధాన్ని కూడా అలవరచుకోవడం అవసరమన్న గమనింపూ కలిగి, పరిశీలకుడు ఎట్టి వైఖరిని కలిగి ఉండాలోనూ స్పష్టంగా నిర్ధారించుకోవడం జరిగింది. దానినే ఈనాడు శాస్త్రీయ దృక్పథం అనంటున్నాము.

ఈ మొత్తాన్ని క్రోడీకరించుకుంటే అన్వేషణ సజావుగా జరగాలంటే అన్వేషకుని మానసిక వైఖరి ఎలా ఉండాలన్నదొకటి, అన్వేషణ ఏ విధానంలో సాగించాలన్నదొకటి కలగలిసి, వైజ్ఞానిక క్షేత్రాలు అనుసరిస్తున్న తీరుతెన్నుల క్రింద చెప్పుకోవడం జరుగుతోంది. ఆ రెంటినీ మనమీనాడు శాస్త్రీయదృక్పథం, శాస్త్రీయ పద్దతి అన్న పేర్లతో పిలుచుకుంటున్నాము.

అన్ని ఉద్యమ క్షేత్రాలలో ఉన్న కార్యకర్తలకూ ఈ రెంటి విషయమై తగినంత అవగాహన కలిగించడానికి అధ్యయన తరగతులను, వినియోగ సామర్థ్యాలు పెరగడానికి అవసరమైన అభ్యాస రూపమైన శిక్షణను కలిగించాల్సిఉంది. ఏయే కారణాల వల్లనైతేనేమి, ఏ ఉద్యమ క్షేత్రాలలోనూ, ఏ సంస్థా తన కార్యకర్తలకు ఈ రెంటినీ అందించడం విషయంలో తగినంత శ్రద్ధ పెట్టడమే లేదు. అసలుకైతే ప్రభుత్వమే పూనుకుని దేశపౌరులందరికీ ఈ దృష్టినలవరచడానికీ, శాస్త్రీయ పద్దతిని గురించిన అవగాహన కలిగించడానికీ తగిన ఏర్పాట్లు విస్తృతంగా చేయాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం అది ప్రభుత్వ విధుల్లో ఒకటి కూడా ఎలాగంటే, రాజ్యాంగం పౌరుల ప్రాథమిక విధులంటూ అధికరణం 51/ఎ ద్వారా 11 అంశాలను పొందుపరచింది. వాటిలోని 'హెచ్‌' సూత్రీకరణం ప్రకారం, ప్రతిపౌరుడూ, 1 శాస్త్రీయ దృక్పధాన్ని  2. మానవ వాదాన్ని 3. శోధనాతత్వాన్ని (ఊనీలి ఐచీజీరిశి ళితీ లిదీవితిరిజీగి) 4. సంస్కరణ తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

మరి ప్రతిపౌరునికీ అత్యంత కీలకమైనవీ, విలువైనవీ అయిన ఇవ్వన్నీ ఎల తెలుస్తాయి? ఎలా అలవడతాయి? ఎలా అభివృద్ధి చెందుతాయి.

ఖచ్చితంగా ప్రభుత్వం పట్టుబట్టి అన్ని ప్రాయాలవారికీ పనికివచ్చేలా వివిధ రీతులలో ఈ విషయాలను తెలియజేయడానికీ, అలవరచడానికీ పెద్ద ఎత్తున పూనుకుంటే తప్ప ఈ లక్ష్యం నెరవేరదు. ఒక వంక ప్రాథమిక విద్యా స్థాయి నుండే క్రమానుగతంగా భావిపౌరులుగ రూపొందాల్సిన బిడ్డలకు ఈ రెంటినీ అందిస్తూ రావాలి. మరో వంక విద్యార్థిగా లేనివాళ్ళకూ, వయోజన విద్యాకేంద్రాల లాంటి వాటి ద్వారానూ, వివిధ స్వచ్చంద సంస్థలతో కలిసి అధ్యయన శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం ద్వారానూ, ప్రభుత్వ పరమైన శిక్షణాలయాల ద్వారానూ, గ్రామ అవగాహనా సదస్సుల ద్వారానూ, వివిధ ప్రసార మాద్యమాలద్వారానూ ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా ప్రతి పౌరునికీ వీటిని అందించాలి. వ్యవస్థ పూనుకుని అందించకుంటే పౌరులకీ విషయంలో అవగాహనెలా కలుగుతుంది? అభ్యాసమెలా జరుగుతుంది? నిపుణత్వమెలా ఏర్పడుతుంది? మంచి సమాజాన్నాకాంక్షించే ఏ ఉద్యమ సంస్థ అయినా, ఈ విషయంపై పట్టుబట్టి ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సి ఉంది. వివిధ స్వచ్చంద సంస్థలు ఐక్యమై కూడా ఈ విషయం వరకైనా కలసి ఉద్యమించడం అవసరం. మంచి పౌరులు ఏర్పడకుండా మంచి సమాజం ఏర్పడడమన్నది ఏ నాటికీ జరగదు. కనుక మంచి పౌరులను రూపొందించుకునే కృషిలో ఎవరివంతు వారు పాలుపంచుకోవడం బుద్దున్న వారందరి కర్తవ్యము.

ఆ కర్తవ్యంలో భాగంగానే, నవంబర్‌ 24న రాజమండ్రిలో జరిగిన హేతువాద మిత్రుల అవగాహనా సదస్సులో వచ్చే సమాజానికి - డిశంబర 22 నాటికి - అందరమూ ఎవరికి వారుగా 'శాస్త్రీయదృక్పథం' అన్న దానిపై కనీసం '5' ఎ4 సైజు పేజీలకు తగ్గకుండా వ్యాసాలు రాసుకురావాలన్న నిర్ణయం చేసుకున్నాము. ఈ విషయాన్ని వివేకపథం పాఠకులకూ తెలియజేస్తే, వారున్నూ శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఇతరులనడిగిగానీ, తగిన సమాచారమున్న గ్రంధాలను చదువుకునిగానీ, సొంతంగా ఆలోచించుకునిగానీ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకుంటారని భావించి ఈ సమాచారాన్నీ ప్రచురిస్తున్నాము. జనవరి సంచిక నూతన సంవత్సర శుభాకాంక్షలతోనూ, సంక్రాంతి విప్లవాభినందనలతోనూ శాస్త్రీయ దృక్పథం అన్న అంశాన్నీ ఇముడ్చుకుని ప్రత్యేక సంచికగా మీ ముందుకు వస్తుంది. కనుక మీలో అవగాహన, అభిలాష, సమాజశ్రేయో కాంక్ష ఉన్నవారు, మీ యోపినంత శాస్త్రీయ దృక్పధాన్ని గురించిన వివరాలను డిశంబర్‌ 25 లోపు నాకు చేరేలా లేఖలు వ్రాయండి.
నా చిరునామా:- పుట్టా సురేంద్రబాబు, సత్యాన్వేషణ మండలి, దోరకుంట గ్రామం, కోదాడ మండలం, నల్గొండ జిల్లా.
శాస్త్రీయ దృక్పథం పై అవగాహనకు కొన్ని సూచనలు


  • 1. దృక్పథం అన్న మాటకు అర్థమేమిటి?
  • 2. అది ఆత్మాశ్రయమా? వస్త్వాశ్రయమా? అంటే వ్యక్తిపరమైనదా? విషయపరమైనదా?
  • 3. శాస్త్రీయ మన్న మాటకు అర్థమేమిటి?
  • 4. శాస్త్రీయ దృక్పథానికి పరిశీలనాత్మకత (ఊనీలి ఐచీజీరిశి ళితీ లిదీవితిరిజీగి) కు ఉన్న సంబంధమేమిటి?
  • 5. వైఖరి, మానసిక వైఖరి అన్న మాటలకు అర్థమేమిటి?
  • 6. సంస్కరణ - పునర్నిర్మాణము .... అన్న మాటల అర్థమేమిటి?
  • 7. శాస్త్రీయ దృక్పథంతో ముడిపడి ఉన్న అంశాలేమిటి? దాని క్షేత్ర విస్తృతిఎంత?
  • 8. సత్యాన్వేషణ ప్రక్రియలో శాస్త్రీయ దృక్పథం యొక్క పాత్రేమిటి?
  • 9. శాస్త్రీయ దృక్పథం - వైజ్ఞానిక దృక్పథం అన్న మాటలు ఒకే అర్ధాన్నిస్తాయా?
  • 10. నిష్పాక్షిక దృష్టి అంటే ఏమిటి? తులనాత్మక దృష్టి అన్నమాటకు అర్థమేమిటి?

No comments:

Post a Comment