Monday, June 13, 2016

ఫజులూర్‌ రహమాన్‌ గారికి పాఠకుల లేఖలు


లేఖ -1


మిత్రుడు రహమాన్‌ గారికి, రాజేంద్రప్రసాద్‌ వ్రాయునది.

మీరు బాగున్నారని తలుస్తాను. నాకు ఈ మధ్య అనారోగ్య కారణంగా దోరకుంటకు దూరంగా ఉండవలసి వచ్చినది.

నాకు సురేంద్రబాబు గారితో సాంగత్యం, సంబంధం దాదాపు 15 సంవత్సరాలుగా ఉన్నది. ఆయనతో నేను చాలా సమయాన్ని గడిపాను. ఆ సాంగత్యం మూలంగా ఆయనవద్దనుండి ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం కలిగినది. ఇంకా చెప్పాలంటే జ్ఞానం విషయంలో చాలా ప్రయోజనం పొందినాను. మీరు కూడా సురేంద్రగారితో నాకు తెలిసి దాదాపు 10 సం||లుగా సాంగత్యంలో ఉన్నారు. ఒక సందర్భంలో సురేంద్ర గారితో సాంగత్యం వలన మీరుకూడా ప్రయోజనం పొందినట్లు సభాముఖంగా వెల్లడించినారు. ఎవరైతే అంకితభావంతో, ఆలోచన చేశారో వారందరూ లాభపడినారని నా ఉద్దేశ్యము. ఆచరణలో పెట్టని, పెట్టలేని జ్ఞానం వృధా. ఇది తెలిసినా, తెలియకపోయినా ప్రతి మనిషి తనకు ఉన్న జ్ఞానాన్ని, అది ఒప్పు జ్ఞానమైనా, లేదా తప్పు జ్ఞానమైనా, తన వివేకము, వ్యక్తిత్వాన్ని బట్టి తన జీవితంలో వాడుకుంటూనే ఉంటాడు. కొందరు తప్పు జ్ఞానాన్ని వాడుకుంటారు. తప్పుజ్ఞానమని తెలిసికూడా వాడుకుంటారు. కొందరు తెలిసి తప్పు జ్ఞానాన్ని వాడుకోరు. ఎవరు ఏ విధమైన జ్ఞానాన్ని / ఏ జ్ఞాన భాగాన్ని, ఏ సమయంలో, ఏ ప్రయోజనం కోరి వాడతారో, అది వారికే తెలియాలి. కాని ఇతరులు కొంతవరకు ఊహించగలరు. సురేంద్రబాబు గారి కృషి ఉద్దేశ్యము ఏమిటంటే, సమాజాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించడం, వ్యక్తులను చైతన్యపరచడం, వివేకాన్ని పెంపొందించడం, తద్వారా సమాజంలో సుఖశాంతులు స్థాపన జరగడం.

ఇటీవల కాలంలో ఖురాన్‌లో ఉన్న బోధనల గురించి మీరు సురేంద్రగారి అభిప్రాయంతో విభేదపడి ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. ఖురాను గ్రంథంలో ('ఇస్లామును ఎవరైతే తిరస్కరిస్తారో, ఎవరైతే ఇస్లామును స్వీకరించరో' అనగా) ఇస్లాము పరంగా అవిశ్వాసులుగా పరిగణించబడతారో వారిని అవిశ్వాసం కారణంగా వధించమని ప్రబోధం ఉన్నట్లు రుజువుచేస్తే ఇస్లామును విడిచిపెడతానని మీరు ప్రతిజ్ఞ చేసినారు. ఈ ప్రతిజ్ఞ ప్రేరణ వలన గత కొన్ని మాసాలుగా ఖురాను గ్రంథాన్ని ఎన్నో సమయాలలో విచారణకు లోనుచేసి ఖురానులో ఎన్నోచోట్ల హింసను ప్రేరేపించే బోధనలు, అవిశ్వాసులను వధించమని ఇస్లామీయులను వత్తిడిచేసే ప్రబోధనలు, ఎంతోమంది అవిశ్వాసులను దారుణంగా చంపినట్లు ఉన్న విషయాలను మీకు ఎత్తిచూపటం జరిగినది. ఉన్నది ఉన్నట్లు తెలిస్తే, ఆ తెలిసిన దాన్ని సత్యం అంటారని మీకు తెలుసు. ఖురానులో హింసాత్మకమైన ప్రబోధనలు ఉన్నాయని ఖురాను చదివిన వారికో, కనీస భాషా జ్ఞానం ఉన్నవారందరికీ బోధపడుతుంది. ఖురానులో శాంతిని ప్రబోధించే విషయాలు లేవని కూడా తెలుస్తుంది. ఖురాను పరిశీలనలో ఎవరైతే భాగస్తులో, వారందరికీ ఎంతోకొంత తెలుగు భాషా జ్ఞానము కలవారే. వారందరూ పైన చెప్పిన విషయాన్ని అంగీకరించారు. అందువలన ఖురానులో హింసాత్మక విషయములు ముఖ్యంగా అవిశ్వాసులను చంపమనే ఆదేశం ఉన్నదని మీరుకూడా అంగీకరించక తప్పదు. మీ ప్రతిజ్ఞను ఆచరణలో పెట్టడం తప్పదు. మీకు కావలసిన రుజువు చేయటం పూర్తిఅయినది కనుక. ఇప్పుడు మీరు ఇస్లామును విడిచిపెట్టవలసిన బాధ్యత మీకు ఉన్నది. ఖురాను పరిశీలనలో మీకు కూడా, మీతో వచ్చిన కొంతమంది ఇస్లామీయులకు కూడా తగినంత అవకాశం ఇవ్వటం జరిగినది. ఖురానులో అలాంటి బోధనలు లేవు అనే మీ వాదనను బలపరిచే ప్రతివాదము చేయలేకపోయినారు. ఖురాను పరిశీలన ముగిసింది. మీ వాదన వీగిపోయినది. సురేంద్ర గారి వాదన గెలిచినది. అందువలన మీరు మీ ప్రతిజ్ఞను నెరవేర్చి మీ వివేకాన్ని నిరూపించవలసినదిగా కోరుతున్నాను.

లేఖ -2


మిత్రుడు ఫజులూర్‌ రహమాన్‌ గారికి, మీరు ఎంతో కాలమునుండి సత్యాన్వేషణ మండలితో సంబంధాలు కలిగిఉన్నారు. సత్యాన్వేషణ ఎందుకు ఏర్పడినది, సత్యాన్వేషణ హృదయము ఏమిటో మీకు బాగ తెలుసు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ సిద్ధాంతాలను, వివిధ మత గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఆ గ్రంథాలను అధ్యయనం చేసేటప్పుడు అనుకూల, ప్రతికూల భావాలు లేకుండా ఆయా సిద్ధాంత గ్రంథాలని  అధ్యయనం చేస్తున్న విషయం మీకు తెలుసు.

మండలి ఆనాటి సిద్ధాంతాలలో సత్యమని నిర్ధారించిన వాటిని స్వీకరిస్తూ, అసత్యమని తేలిన వాటిని వదులుకుంటూ, ఇది ప్రతి ఒక్క జీవితానికి అవసరమనే తెలియజేస్తున్నది. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొంటుంది.

మండలిలో పాల్గొంటున్న మీరు ఒక దశలో మతములోనుంచి బయటకి రావాలని అనుకున్నట్లుగా వివేకపథములో నేను చదివాను. 2015 సం||లో ప్రధానంగా బైబిలు గ్రంథాన్ని, ఖురాను గ్రంథాన్ని విశ్వసించి ప్రచారము గావిస్తున్నటువంటి వారితో మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో చర్చా కార్యక్రమములు నాలుగైదు సమావేశాలు జరిగాయి.

బైబిలు గ్రంథములో ఉండే దోషాలని, ఖురానులో ఉండే దోషాలని వివిధ చర్చల సందర్భంగానే ప్రస్తావించారు.

బైబిలు ప్రతిపాదకులు మీరు విశ్వసిస్తున్న ఖురానులో అవిశ్వాసుల ఎడల ఎలా ప్రవర్తించమని చెప్పిందో (అమానుషంగా) ఏ సూరాలో ఏ ఆయుతులు చెప్పిందోకూడా వ్యక్తపరిచారు. దానిపై మీరు మేము అంత పరిశీలనగా చూడలేదు, మేము పరిశీలించుకొని వస్తాము అన్నప్పుడు మండలి అంగీకరించింది.

తరువాత జరిగిన చర్చలో అవిశ్వాసుల ఎడల ఇస్లాం మతం అమానుషంగా వ్యవహరిస్తుందని ఒక్కటైనా చూపితే నేను మతంలోనుండి బయటకి వస్తానని అన్నారు. అవిశ్వాసుల ఎడల అమానుషంగా ప్రవర్తించిన అంశాలని మీ ఎదుటనే చూపినప్పటికీ మీరు అట్లు చూడడానికి మీ మనస్సు సిద్ధంగా లేదని అనిపించింది.

భారతీయులందరికీ ప్రామాణికము రాజ్యాంగమే. రాజ్యాంగములో ఎవరి మతం వారు ప్రచారం చేసుకోవచ్చు. ఒకరి మతాన్ని ఒకరు విమర్శించకూడదు. ఎవరి విశ్వాసము వారిదే. మతం మార్పిడులకు ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా మీమీ గ్రంథాలలో ఏది ఉంటే అదే చెప్పుకోవాలని స్పష్టంగా చెపుతోంది. ఈ లోకములలో తప్పుచేసిన వారు ఇక్కడే శిక్షలు అనుభవించాలని, ఇక్కడే సంస్కరించబడాలని రాజ్యాంగ హృదయము, భారతీయులందరూ సహోదరులుగా మెలగాలని, రాజకీయ ఆర్థిక న్యాయం జరగాలని, సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి జరగాలని అఖండ భారతంగా ఉండాలని రాజ్యాంగ హృదయం.

అన్ని రంగాలలో వంచకులు, అపరమిత స్వార్థపరులు, అవకాశవాదులు, జవాబుదారీతనము లేనివారు, ప్రకృతిలో సంపదను లూటీచేస్తున్నారు. అనేక రంగాలుగా రాజకీయ రంగములోను, విద్యారంగములోను, వైద్యరంగములోను, మత ప్రచారకులలోను కులసంఘాల పేరుతో అనేక రకాలుగా ఇందులో జొరబడినారు.

మీలాంటి నిజాయితీపరులు, చక్కటి అవగాహన కలిగిన మీరు సమాజాన్ని దారితప్పిస్తున్న భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలను సరైన దిశవైపుకు నడిపించడానికి మేలుకొల్పడానికి మీలాంటి వాళ్ళు బయటకు రావడం మంచిదని నేను మనసారా కోరుచున్నాను. సమాజానికి ఎంతో మేలుచేస్తున్న విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజలలోకి తీసుకుపోవడానికి మతాన్ని వదిలి మాతో చేయి కలపడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

ఇట్లు మీ శ్రేయోభిలాషి

- ఎం.రామకృష్ణారెడ్డి, కర్నూలు.

రహమాన్‌ గారికి


వాట్సాప్‌లో మన మిత్రులు అడుగుతున్న వాటికి సమాధానాలుగా మీరు చెబుతున్నది గమనించాక ఎంతో కొంతైనా నేనూ మాట్లాడడం అవసరమూ, సందర్భోచితమూ అనిపించింది. అందుకే ఇది ఇలా.

విశ్వాసపు పొర అడ్డుపడుతున్నంతకాలం కన్నులుండీ మనిషి వాస్తవాలను చూడలేడు. రకరకాల యత్నాల వల్ల ఆ పొర తొలగడానికి తగిన వాతావరణం ఏర్పడ్డా కొందరు రకరకాల కారణాల వల్ల దానిని, అది ఒదులుతానంటున్నా ఒదులుకోడానికి సిద్ధపడరు. కొందరి విషయంలో వ్యక్తి వదులుకుందామనుకున్నా రకరకాల కారణాలు - ప్రతికూల పరిస్థితుల వల్ల - అది వదలదు. మీరేమిటో మీకు తెలుసు, నేనేమిటోనూ మీకు నేను కనిపించినంతవరకైనా మీకు తెలుసు. అదే సమయంలో నేనేమిటో మొత్తంగా మీకు తెలిసుండకపోవచ్చు. అలాగే నేనేమిటో నాకు తెలుసు, మీరేమిటో మీరు అవకాశమున్నంత వరకైనా నాకు చూపించలేదు గనుక మీరంటే ఇది అని అనుకునేంతగా మీరు నాకు తెలియదు. జరుగుతున్న దాన్నిబట్టి మీ గురించిన రకరకాల ఊహలు ఏర్పడుతున్నాయి ప్రస్తుత దశలో. అయినా సరైన, సరిపడినంత ఆధారాలు లేకుండా అభిప్రాయాలకు రాకూడదన్నది మండలి ప్రవర్తనా వైఖరికి సంబంధించిన కీలక సూత్రం కనుక మీ గురించిన అనుమానాలు తప్ప ఒక నిర్ణయానికి నేనింకా రాలేదు.

ఇక మన విచారణీయీంశానికి వస్తే, నేను చూపిస్తానన్న అభిప్రాయాలను సుస్ఫష్టంగా చూపించాను. ఆ వాక్యాల అర్థం అదికాదు అనిగానీ, మాకు ఖురాను అర్థం కాలేదు అనికానీ నిర్ణయించాల్సింది మీరుకాదు. మాటవరసకు - వాదనకొరకు - మీరన్నది నిజమే అయినా కూడా ఆ మాట అనే అధికారం మీకుండదు. అందుకే వాదప్రతివాదాలు జరిపేటప్పుడు కొన్ని సాధారణ నియమాలననుసరించి ఎంచుకున్న వారిని, ఒకరిని గానీ, బృందాన్నిగానీ నిర్ణేతలుగా పెట్టుకుంటాం. అది మొన్న జరిగిన సమావేశాలలో జరగలేదు. మనం ఎందుకని ఆ ఏర్పాటు ప్రక్రియను అనుసరించలేదు? నా లెఖ్ఖప్రకారం ఒకటి మనం మిత్రులం, సత్యాన్వేషులం, సత్యస్థాపన, సత్యస్వీకరణ అవసరాన్ని గమనించుకొని ఉన్నవాళ్ళం. పైగా దీర్ఘకాలంగా ఖురానును పరిశీలిస్తున్న అనేకులం కూడి ఉన్నాం. అందరం కలసి సత్యావిష్కరణ చేసుకోగలం అన్న దృష్టితో నేనుండటం వల్లనే మిమ్ములను గానీ, మీ పక్షం వారిని గానీ నేను ప్రతిక్షకులుగా 1% కూడా భావించలా. ఇంకా ఇప్పటికీ మిమ్ములను ప్రత్యర్థిగా చూడడమే సరైందన్న నిర్ణయానికి నేను రాలేదు. అనివార్య పరిస్థితులు అక్కడికి చేరిస్తే అలాటి వేదికపైనే కలవాల్సి వస్తుందేమో. అది జరక్కుండా సత్యాన్ని గుర్తించేపని జరిగితేనే మంచిదనిపిస్తుంది నావరకు నాకు.

ఖురాను దైవగ్రంథం కాదనడానికి ఏది తేలితే సరిపోతుందని మన ఇద్దరికీ తెలుసో ఆ కారణానికి సంబంధించి వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్న మూటినుండీ కొన్ని ఆధారాలు మీకందించాను ఈ రెంటిలో దేనిని బట్టైనా ఖురానును వదిలేయక తప్పదు.

No comments:

Post a Comment