గత సంచికలో వివేకానందుని అభిప్రాయాలను, గాంధీ భావాలను కొంతవరకు పరిశీలించాం. మత సమైక్యత నెలకొనకుండా స్వరాజ్యంరాదు అన్నది గాంధీ దృఢ విశ్వాసం. అతడు ప్రధానంగా ఈ దేశానికి సంబంధించినంతలో హిందువులు, ముస్లింలు ఈ దేశస్తులు. ఈ దేశ స్వాతంత్య్రానికై పోరాడుతున్న, పోరాడాల్సినవారు. కనుక వారిరువురూ సోదరులు అన్న దృష్టిని దృఢంగా ఏర్పరచుకుని వున్నాడు. ఆంగ్లేయులు (బ్రిటిష్‌వారు) ఈ దేశంలోని హిందువలలో అంతర్గత అనైక్యతను, వైషమ్యాన్ని నెలకొనజేయడానికీ, హిందూ, ముస్లింల మధ్య అనైక్యతను నెలకొనజేయడానికి రకరకాల పన్నాగాలు పనుతుంటారు. ఈ రెంటిలో ఏది జరిగినా స్వతంత్ర పోరాటం బలహీనపడుతుంది. అఖండ భారత్ స్వతంత్రం కాదు అన్న నిశ్చయంలో వున్నాడు అననిపిస్తుంది. అతననుసరించి వివిధ విధానాలను క్రోడీకరించిచూస్తే.
(1) హిందువులను కలిపి వుంచాలన్న దగ్గర హిందువులలోని, అణచివేతకు గురైనవారి బాధలను చూస్తూనే, వాటిని వుండకూడనివని నిరసిస్తూనే, వారిని పోరాట మార్గం పట్టనీయడు. వారి పోరాటానికి మద్దతుగా నిలవడు. ఆ నిమ్న మర్గాలపై గతంలో దౌష్ట్యాన్ని నెరపిన, ఇప్పుడూ అదేపనిచేస్తున్న అగ్రవర్గాలకు నచ్చజెప్పాలని చూస్తాడు. వారు చేసిన హింసకూ ప్రతిక్రియగా అవమానింపబడ్డ, హింసింపబడ్డ వర్గాలుగనుక ఉద్రేకచర్యలకు పూనుకున్నా, పూనుకోనున్నారని తెలిసినా వారిని నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు. వారు గనక ప్రతిచర్యకు పూనుకుంటే ఊరుకోననీ హెచ్చరిస్తాడు. అవసరమైతే అంతిమాయుధంగా నిరశన వ్రతానికి పూనుకుంటానంటాడు, పూనుకుంటాడు.
సాధారణ వివేకం, ఇంగితం పనిచేస్తున్న వారందరికీ అతని ఈ వైఖరి అసమంజసంగానూ, విడ్డూరంగానూ అనిపిస్తుంది. ఇక అవమానాలను, వివక్షకు, హింసకు గురైన ప్రజలకు వారి నాయకులకూనైతే ఈయన ప్రవర్తన అమానుషంగానూ, అప్పటివరకు హిందూత్వం పేరున జరిగిన కుల అసమానతల వైఖరికి అనుకూలమైనదిగాను, తమ విషయంలో శతృవు మాత్రమే అనుసరించగలిగిందిగానూ అనిపిస్తుంది. కనుకనే అంబేద్కర్‌లాంటివాడు కూడా గాంధీని శతృవుగనే చూశాడు.
మరోవైపు హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగి హిందువులవల్ల ముస్లింలకు కష్టనష్టాలు ఏర్పడినప్పుడు హిందువుల్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు. ముస్లింల ప్రతిచర్యలను సమర్థిస్తాడు. అదే ముస్లింలవల్ల హిందువులకు కష్టనష్టాలు కలిగినపుడు ముస్లింలను అంత ఖరాఖండిగా ఖండించడు సరికదా, హిందువుల్ని ప్రతిచర్యకు దిగవద్దనీ, హిందువులుగనక ఉద్రేక చర్యలకు దిగితే తాను ముస్లింలపక్షాన వుంటాననడమో, నిరాహారదీక్ష చేపడతాననడమో చేస్తుంటాడు.
హిందూ ముస్లింల విషయంలో గాంధీజీయొక్క ఈ వైఖరి హిందూనేతలకు జీర్ణమయ్యేదికాదు. గాంధీ ఖచ్చితంగా ముస్లింపక్షపాతేననిపించేది.
ఒక విడ్డూరమైన, సాధారణ ఇంగితానికి విచిత్రమనిపించే గాంధీ వైఖరిని ఈ రెండు సందర్భాలనూ కలిపిచూసి క్రోడీకరించాల్సి వుంది. లేకుంటే గాంధీని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం వుంది.
అస్పృశ్యులుగా చూడబడ్డ కులాలు, హిందువులం మేము అనుకునే గ్రూపు, ముస్లింలూ కూడా (వారి వారి విషయాలను గట్టిగా పట్టించుకునే స్థాయిలోనున్న వ్యక్తుల వరకు) గాంధీని తమకు ప్రత్యర్థిగానే చూశారు. గాంధీజీ విషయంలో ఇది మరో విడ్డూరం.
అంబేద్కర్ - గాంధీని తమ ఆకాంక్షల నెరవేర్పుకు అడ్డుపడుతున్న వాణ్ణిగనే తలంచాడు. ఆ క్రమంలో గాంధీ పోకడలలో కుటిలత్వం వుందనేంతవరకు సాహసించాడతడు. ఇక హిందూత్వ వాదులైతే గాంధీని అడ్డు తొలగించుకుంటే తప్ప హిందువులకు శ్రేయస్సు లేదనేంతవరకు ఆలోచించుకుంటూ వచ్చారు. ఇక జిన్నాలాంటివారైతే గాంధీనే తమ ఆకాక్షకు ప్రధాన అడ్డంకిగా ఎంచారు.
1) గాంధీ మాటలను గనక పట్టిచూస్తే కుల అసమానతలు, అస్పృశ్యత హిందూ మతపు వాస్తవ రూపమే అయితే అట్టి హిందూమతంలో నేనుండను అన్నాడు. ఎవడూ వుండకూడదనీ అన్నాడు.
2) నేను హిందూ మతాన్ని సవ్యంగానే అర్థం చేసుకున్నాననుకుంటున్నాను, నన్ను నేను హిందువుగనే తలంచుతున్నాను. హిందువు ఇస్లామో, క్రైస్తవమో మరో మతమో స్వీకరించాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదనీ అంటాడు. రాముడే నాకు ఊతం, గీతే నాకు గురువు లాంటి మాటలూ తరచుగా మాట్లాడాడు.
3) హిందూ ముస్లింలు సోదరులన్నాడు, ఈశ్వర అల్లా తేరేనాం అన్నాడు, ముస్లింలమీద ఈగ వాలనివ్వలేదు. హిందువులే ముస్లింలన్న నమ్మకాన్ని సంపాదించాలన్నాడు. సమైక్య భారత్‌ను అంగీకరించాలేగాని, ఈ దేశ పాలనాధికారాన్ని జిన్నాకివ్వడానికీ సిద్ధమైనాడు.
ఈ దేశానికి స్వాతంత్య్రం ఎంత అవసరమో, హిందూ ముస్లిం ఐక్యత అంతే అవసరమన్నాడు. అంతే ముఖ్యమైనది అస్పృశ్యతా నివారణం అనీ అన్నాడు. వాటికోసం అంటే స్వాతంత్యం కోసం, హిందూ ముస్లిం ఐక్యతకోసం, అస్పృశ్యతా నివారణ కోసం తనదైన మార్గంలో శ్రమించాడు.
ఆశ్చర్యకరంగా, ఇటు అస్పృశ్యులూ, అటు హిందువులు, మరోవైపు ముస్లింలూ కూడా గాంధీ నిజాయితీని శంకించారు. గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు.
మరో విడ్డూరమేమంటే! అహింసకు ఆచరణీయతను కలిగించినవాడు గాంధీ అన్న ప్రసిద్ధి ఎంత కలిగిందో అంతకంత హింస ప్రతిచోటా జరుగుతూనే వచ్చింది. దెబ్బతిన్న దళితుల్ని ప్రతిచర్యకు పూనుకోవద్దన్నాడు. దెబ్బతిన్న హిందువుల్ని ప్రతిచర్యకు పూనుకోవద్దన్నాడు, దేశాన్ని ముక్కలు చేయొద్దని ముస్లింలకూ చెప్పాడు. ప్రతి మత ఘర్షణలలోనూ మైనారిటీలంటూ ముస్లింలకు అధిక నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఈ మూడు సందర్భాలలోనూ అతని విధానాలవల్ల జరిగిందేమిటి?
1) అస్పృశ్యత నిర్మూలనంకాలా. అగ్రవర్ణాల ద్వారా జరగాల్సినంత హింస, అణచివేత జరుగుతూనే వచ్చింది. ఆవేశమాపుకోలేకపోయిన సందర్భాలలో హింసకు, ప్రతిహింసా జరిగింది. ఇది కులపరంగా జరిగింది. కుల అసమానతల్ని సాధనంగా వాడుకున్న ముస్లిం, క్రైస్తవ మతాలు హిందువుల్ని, అణగారిన వర్గాలను యధేచ్ఛగా, మూకుమ్మడిగా తమ తమ మతాల్లోకి లాగేసుకున్నాయి. ఈ కోణంలో చూసినా, నేను హిందువును, హిందువు మతం మారఖ్ఖర్లా అన్న గాంధీ ఆలోచన ఆచరణలో నిలబడలేకపోయింది. ఈనాడు అలా ముస్లిం, క్రైస్తవాల్లోకి మారినవాళ్ళే హిందూ వ్యతిరేకులుగా, శత్రువులుగా తయారవుతున్నారు.
2) హిందూ, ముస్లిం ఐక్యత పేరున ఆయన చేసిన నిర్వాకంవల్ల హిందూ, ముస్లిం ఘర్షణలు, పరస్పర హింస ఆగలా. రెండు ధోరణులవారూ అంగీకరించని, ఆచరణకు సిద్ధంకాని విధానం ద్వారా అహింస సాధన మొదలెట్టారాయన. మత ప్రాతిపదికన చూస్తే అల్లాను, ప్రవక్తను అంగీకరించనివారంతా అవిశ్వాసులు, వారిపట్ల ఉదాసీనత పనికిరాదంటోంది ఇస్లాం. ఆ మతాదేశాలకు కట్టుబడి ఉన్నవాళ్ళకు హిందూమతంతో ఐక్యతకు సిద్ధంకాలేరు. కనుక గట్టి మత విశ్వాసులైన ముస్లింలు, బహుదేవతారాధన, విగ్రహారాధన బలంగా వున్న హిందువులతో సోదరభావంతో వుండడం సాధ్యంకాదు. ముస్లింలలోని మరో వర్గం తమకు తమదైన దేశంకావాలి. మరొకరి పాలనలోనూ అది వుండవచ్చు, ఉమ్మడి పాలనా మనకొద్దు అన్న దృష్టి కలిగి వున్నవాడు. వారి ప్రకారమూ హిందూ-ముస్లింల ఐక్యత అనవసరం. ఆ దిశగా జరిగే యత్నాలకు అడ్డుపడడమే సరైంది. ముస్లిం ప్రజలంతా కనీసం 80% పైగా ఈ రెండు నాయకశ్రేణుల అదుపులోనే వున్నారు. కనుకనే దేశవిభజనకు 80% పైగా ముస్లింల ఆమోదం లభించింది. ఇక నిజాంలాంటి రెండు మూడు సంస్థానాలైతే అవకాశముంటే స్వతంత్ర రాజ్యాలుగా వుండడంవైపే మొగ్గుచూపాయి తప్ప మరి దేనికీ అంగీకరించమనన్నారు. ఆ దిశగా సాగిన ముస్లింల యత్నాలన్నింటి పర్యవసానంగా మతకల్లోలాలు రగిలాయి. ఆరంభం చిన్నగనే సాగినా ప్రతీకారం పేరుతో హిందువులు సాగించిన దాడులు, హింస దానికి మారుగా ముస్లింల దాడులు వగైరాలలో గాంధీ ఆశించిన అహింస ఎక్కడా కలిక్కానిక్కూడా కానరాలా. ఒక దిశలో మురుగు కాలువలు రక్తంతో పారాయి అని చరిత్రకారులు వ్రాశారు. ఈయన అహింసను పాటించమని ఎవరికి బోధించినట్లు?
అదెంటలా అడిగావు? అందరికీగదా అని మీలో కొంతమంది అనవచ్చు. గాంధీ అహింసా విధానం అది కానేకాదు. హింసకు ప్రతిహింస చేయవద్దు, హింసను అనుభవించు అన్నదే గాంధీ అహింసా వ్రతంలోని స్వభావం.
1) బ్రిటిష్‌వాళ్ళు-భారతీయులు, 2) ముస్లింలు-హిందువులు, 3) అగ్రవర్ణాలు-అస్పృశ్యులుగ చూడబడ్డవారు.
ఈ మూడు సందర్భాలలోనూ ఒకటవ దానిలో ఆంగ్లేయుల్ని అహింస పాటించమనలా; రెండవ సందర్భంలో ముస్లింలను అహింసను పాటించమనలా, మూడవదానిలో అగ్రవర్ణాలను అహింసను పాటించమనలా. మడు సందర్భాలలోనూ (1) భారతీయుల్ని ప్రతిహింసకు పూనుకోవద్దన్నాడు, (2) హిందువుల్ని ప్రతిహింసకు పూనుకోకండన్నాడు, (3) అణచివేతకు అవమానాలకు గురైన దళితుల్ని ప్రతిహింసకు పూనుకోవద్దన్నాడు. ఒకటీ అరా మినహాయింపు సంఘటనలుంటే వుండవచ్చునేమోగాని, అతని అహింసాచరణ సాధారణ రూపాన్ని గురించి చెప్పాల్సివస్తే మాత్రం ఇదే చెప్పాలి.
గమనిక : సత్యాన్వేషణ దృష్టితో వుండాలనుకుంటూనే, నాతో విభేదిస్తున్న వారెవరైనా వుంటే గాంధీజీని మరింత సాకల్యంగా కలసి పరిశీలించడానికి, నిజాలను అంగీకరించడానికి ఒక అన్వేషిగా నేను సిద్ధం. అందుకు సిద్ధపడ్డవారుంటే లోతైన అధ్యయనానికి సిద్ధంకండి. నాకు కబురెట్టండి.
మతాల విషయంలో గాంధీని (అతని అవగాహనను, పంథాను) తప్పుబట్టే నేను, ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు చెప్పాలి.
1) గాంధీని కుటిలుడు అనక తప్పడం లేదన్నాడు అంబేద్కర్ (ఒక ప్రత్యే సందర్భంలోనే అనుకుందాం)
2) గాంధీ ఒక జిత్తులమారి నక్క అన్నాడు జిన్నా (అదీ ఒక ప్రత్యేక సందర్భానికే వర్తించుతుందేమో)
3) ఖిలాపత్ ఉద్యమానికి వత్తాసివ్వడ విషయంలోనూ, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు (కమ్యూనల్ ఎవార్డు) విషయంలోనూ గాంధీ ముస్లింలకు అనుకూలంగా ఎందుకు వ్యవహించారన్నది సాధారణ ఇంగితానికి అంతుబట్టదు. ఈ రెండు సందర్భాలలోనూ ఆనాటి జాతీయ నాయకులెందరో వాటిని వ్యతిరేకించారు.
4) ఆలీ సోదరులు ముస్లింలీగ్ సోదరులు. గాంధీకి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించినవారు, గాంధీకూడా ఆనాడు ముస్లింలీగ్ నిర్వహించిన హింసాత్మక పాత్రను ప్రత్యక్షంగా చూస్తూనూ దానిని వెనకేసుకొచ్చారు. ఒక సందర్భంలో మహమ్మద్ ఆలీ, ఒక ముస్లిం అత్యంత శీలరహితుడు, దురాచీరీ అయినా కూడా గాంధీకంటే గొప్పవాడే. ఇస్లాం ప్రకారం అని బహిరంగంగానే ప్రకటించాడు. దానిపై గాంధీజీని వివరణ అడగ్గా, అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు. అతని విశ్వాసం ప్రకారం అది సరైందేకదా! అనన్నాడు. ఎంతటి విచిత్ర విషమ పరిస్థితి ఇది?
అదేమరి ఒక హిందూత్వ మనుస్మృతివాది, ఒక బ్రాహ్మణుడుగ పుట్టినవాడు అత్యంత శీలరహితుడు, దురాచారీ అయినా, అత్యంత ధార్మికుడూ విద్యావంతుడు అయిన అస్పృశ్యునికంటే లేదా ఒక శూద్రునికంటే ఉన్నతుడే అననుంటే, అందులో నాకేమీ తప్పు కనిపించడంలేదు. అతని విశ్వాసాన్నిబట్టి అది సరైనదేనంటారా? గాంధీని, అతని అభిప్రాయాలను పట్టిచూసేవారెవరూ అతడలా అనడుగాక అనడు అనే అంటారు. పుట్టుకలో అసమానతలను కల్పించడం అమానుషం. అట్టి మతంలో నేనుండను. ఆ రకమైన వివక్షతను తొలగించడంకోసం పోరాడ. స్వాతంత్య్రం కోసం చేసే పోరాటమంత అవసరమైంది అని అన్నాడాయన. అలాంటివాడు, ఆదర్శప్రాయుడైన గాంధీలాంటివానికంటే, దుర్మార్గుడైన ముస్లిమే గొప్పవాడనడంలో తప్పులేదనడాన్నేమనాలి. అలాంటి మాటలంటున్నప్పుడు ఇటు ముస్లింలచే కష్టనష్టాలకు గురైన హిందువులు, హిందువులచే వెలివేయబడిన అస్పృశ్యులనబడినవాళ్ళు గాంధీని నిస్సాక్షికుడు, తమకు మిత్రుడు అని ఎలా తలంచగలుగుతాడు?
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! ఇలాంటి అంశాలను-వివిధ సందర్భాలలో గాంధీ తీసుకున్న నిర్ణయాలను, ఆచరించిన తీరును గురించిన వాటిని-మరికొన్నింటినీ పేర్కొనవచ్చు. గాంధీ అంతరంగాన్ని వ్యతిరేక దృష్టి లేకుండా పట్టిచూడనివాళ్ళు అస్పృశ్యులు-సవర్ణ హిందువులు; హిందువులు-ముస్లింలు అన్న సంబంధంలో గనక గాంధీని పరిశీలిస్తే అతడు నిస్పాక్షికంగా లేడనే అనిపిస్తుంది. అందుకే సాధారణ ఇంగితానికి అతడు ఒకవైపు మొగ్గినట్లే అనిపిస్తుంది అని పైన రాశాను. ఈ విషయంలో నా అభిప్రాయం మాత్రం అతడు కపటికుడనే.
అతని ఈ రకమైన వైఖరికంతా అతని హృదయంలోని లోపం-పక్షపాతం-కాక, అతని అవగాహనలోని లోపమే కారణం అని నాకనిపిస్తోంది. హిందూ ముస్లిం ఐక్యత చెడినా, హిందువలోని అవర్ణుల-సవర్ణుల మధ్య ఐక్యత చెడినా, బ్రిటీషువాళ్ళు దానిని వాడుకుని ఆ వర్గాల మధ్య ఘర్షణలను రేకెత్తించి, కల్లోలాల్ని సృష్టించి దేశానికి స్వతంత్రాన్నివ్వకుండా చేస్తారు. అదీ కుదరకుంటే ఈ దేశంలో అంతర్యుద్ధాన్ని రగుల్కొల్పి కొట్టుకుచావండని ఉద్రేకాల్ని రెచ్చగొట్టి ఒక పైశాచికానందాన్ని పొందేపనో చేస్తారు. ఒక నిజాయితీగల జాతీయవాదిగా, అతనికి స్వతంత్రం రావడమన్నది హిందువులమధ్య అంతర్వర్గాల యుద్ధం లేకుండా, హిందూ ముస్లింల మధ్య మతకల్లోలాలు లేకుండా రావడమొక్కటే సరైంది అఖండ భారత్‌గా ఈ దేశం స్వతంత్రాన్ని పొందితే, నిదానంగా, క్రమక్రమంగా ఈ రెండు సమూహాల సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నదే అయ్యుండాలి, అని నాకనిపిస్తోంది.
నిజానికి ఈ రెండు సమస్యలు, పుట్టుకతోనే కుల అసమానతలను అంగీకరించే శాస్త్రాల పట్టునుండి హిందువులు బైటపడకుండా, ఖురాన్ బోధనల పట్టునుండి ముస్లింలు బైటపడకుండా పరిష్కారం కానేకావు. ఇక్కడే గాంధీ తప్పవగాహనలో వున్నాడని నేనంటున్నాను.
ఈ రెండు సమస్యల మూలాలను, వాటి వాటి ప్రవర్తనా రీతుల్ని గతంలోకి నిశితంగా చూడడం ద్వారా గ్రహించాల్సి వుంది. ఈ దేశంలో, అమానులవైదం, వివేకం అంగీకరించకూడనిది అయిన పుట్టుకతోనే సంక్రమించే సామాజిక తరతమ భేదాల్ని తొలగించాలనే యత్నాలు వేల సం||ల పూర్వనుండే జరిగాయి. అయినా ఈనాటివరకు అవి విజయాన్ని సాధించలా.
ఎలా మనుస్మృతిలో జన్మచేతనే ఒకడు శ్రేష్ఠుడు, మరొకడు అధముడు అవుతారని చెప్పబడిందో, అలానే ఆకాలంనుండే జన్మచేత అందరూ సమానులే, కర్మచేతనే తరతమ భేదాలేర్పడతాయి. గుణాత్మకతచేతనే తరతమ భేదాలేర్పడతాయి అనీ చెప్పబడింది. ఆపస్తంచ ధర్మసూత్రాలలోను వ్రజ్ర సూచిలాంటి కొన్ని ఉపనిషత్తులలోనూ ఈ వైఖరి కనపడుతాయి.
ఇక పురాణాలు, రామాయణ, భారతాలలోనైతే రెండు రకాల వైఖరులకూ చోటు కల్పించబడింది. వాటిని పట్టుకునే ఈనాడు ఏ పక్షంలోనివారైనా, రెండోరకపు శ్లోకాలను ప్రక్షిప్తాలంటూ వాదించుతున్నారు. ఇదెంత గంద్రగోళమంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసే రచనలు దండిగా వున్నై. శాస్త్రాన్ని అంగీకరించాల్సిందే అని బండగా మాట్లాడే వాళ్ళూ దండిగనే వున్నారు. అయినా వారంత అటు శాస్త్రాలను యధాతథంగా స్వీకరించరూ, ఎందుకులే అని అవి పారవేయరు. అంతా గంద్రగోళమే. ఎవరెవరి సామర్థ్యం మేర వారువారు మంద మనస్తత్వంలో వున్న సామాన్య జనాన్ని తమ గుంపులో కలుపుకుంటూ తోలుకెళుతుంటారు, అవసరమొచ్చినప్పుడో, అవకాశం దొరికినపుడో ఒకవంక శాంతి వచనాలు పలుకుతూనే, అంత కిరాతకంగా ఆ గుంపుల మధ్య కొట్లాటలు జరుపుతుంటారు. ఆవేశంలో రగిలిన ఈ మంద కోడిపుంజుల్లోనో, గొర్రెపొటేళ్ళలానో, ఆబోతుల్లానో పరస్పరం చంపుకునేంతవరకు పోట్లాడుకుంటుంటారు.
అనైక్యతనూ, శతృత్వాన్నీ పుట్టించి, పెంచి, పోషించగల మూలాలున్న ఆ గ్రంథాలను అలాగే వుండనిచ్చి, వాటిని నెత్తిన పెట్టుకోనిచ్చి, వారిమధ్య ఐక్యతను, మితృత్వాన్ని, సమానత్వాన్ని సాధించాలనుకునే, సాధించగలమనుకునే బుద్ధితోనే అస్సలు లోపముంది.
మనుస్మృతిని, అలాంటి వైఖరేగల శాస్త్రాల ప్రామాణికతనూ అలానే వుంచి, కుల అసమానతలను తొలగించమనుకునే ఆర్యసమాజ స్థాపకుడైన దయానందుడు, వివేకానంద నేటి గాంధీజీ లాంటివారి అవగాహనలోని లోపాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఆ అవగాహనా లోపాన్ని వాళ్ళ హృదయాకాంక్షిగా అన్వయించకూడదు.
అలాగే ఖురాన్‌ని ప్రమాణిక-దైవ-గ్రంథంగా అంగీకరించవచ్చునంటూనే, బహుదేవతరాధకులు, విగ్రహారాధకులు, అన్య దేవతరాధకులకు, ముస్లింలకు మధ్య సోదరభావాన్ని నెలకొల్పవచ్చుననే వారి అవగాహనలోని లోపాన్ని గుర్తించాలి, వ్యతిరేకించాలిగాని, ఆ అవగాహనా లోపాన్ని వారి హృదయం సరైందికాదు అనడానికి రుజువుగా చూపకూడదు. వారు కుటిలురుకాదని అంగీకరించడం సమాజంపట్లా, దాని బాగుపట్ల వారు పడిన శ్రమకు కనీస కృతజ్ఞత చూపడం. కనుక గాంధీలాంటి వారిని కపటులు అనడంకంటే, వారి అవగాహనలో లోపముంది అనటం అలాంటి వారి విషయంలో కనీస న్యాయాన్ని కనపరచడం.
లోకంలో తప్పుభావాలు ప్రచలితం కావడానికి నలుగురు వ్యక్తులు కారణం కాగలుగుతారు.
భ్రమ, ప్రమాదం, కరణాపాటవం, విప్రవిప్స అన్న నాలుగంశాలతో ముడిపడి అది జరుగుతుంది.
(1) భ్రమలో వున్నాడు, అంటే అవగాహనలో లోపం, (2) ప్రమాదం : తొందరపాటువల్లా, పరధ్యానంవల్లా ఒకటి చెప్పబోయి మరోటి చెప్పడం, (3) ఇంద్రియ సామర్థ్య లోపంవల్ల. ఈ మూడు రకాల కారణాలవల్లా తప్పుభావాలు లోకంలోకి పోవచ్చు. కానీ ఈ కారణాంశాలు కలవాళ్ళు దొంగలుకాదు. వాళ్ళు గ్రహించి, దానిలో లోపముందనాలేగాని, వాళ్ళ ఉద్దేశంలో కపటముంది అనకూడదు. ఇక నాల్గొది విప్రవిప్స. ఇది ఉద్దేశంతోనే కుటిలత్వం వుండడాన్ని సూచిస్తుంది. నా లెక్క ప్రకారం గాంధీ ఈ నాల్గో రకానికి చెందినవాడు కాదు. మొదట ముటి ప్రభావంలో వున్నవాడైయుండాలి.
ఏదేమైనా! గాంధీ ఆలోచన, అతడనుసరించిన విధానము అటు కుల అసమానతల్ని తొలగించడానికిగానీ, ఇటు హిందూ ముస్లిం సమైక్యతను సాధించడానికిగానీ పనికిరాలేదు-పనికిరావు కూడా.
భారతీయ మత, తాత్విక, సాహిత్యాల పరంగా వివేకానందునిలో ఎలా తాత్విక గంద్రగోళం వుందని అన్నానో అలానే గాంధీకి కూడా వాటి విషయంలో గంద్రగోళముందనే అంటున్నాను.
తానాశించిందానికి పూర్తి విరుద్ధంగా జరిగిన దేశవిభజన, ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లింలలో పెద్ద భాగం ఆమోదించడం, మతకల్లోలాలు పెచ్చరిల్లి, విచ్చలవిడిగా సాగిన పరస్పర హనన రూపంలోని మారణకాండ. అందులో ముస్లింల పెద్దపాత్ర వగైరాలన్నింటినీ గమనించిన గాంధీ, స్వయంగనే, తాను విఫలమైనానని ప్రకటించాడు. ఆధ్యాత్మికత నుండి అలవడిన నిరాసక్తతతో ఆ కల్లోల ప్రాంతాలలో తిరుగాడాడు.
గాంధీ హింసను కోరుకున్నాడు అనడం దుర్మార్గం. అయితే అహింసను స్థాపించడానికి అతనెంచుకున్న ప్రతిచర్య-ప్రతిహింస చేయవచ్చు. చనిపోయే పర్యంత్రం హింసను భరించండి, సహించండి అన్న విధానం అత్యంత దోషభూయిష్టం.
చాలాకాలం క్రితం గాంధీని అలా అలా చదివే పనిచేశాను. ఈ శీర్షిక క్రింద ఆయా విషయాలను ఖరాఖండిగా విశ్లేషించాల్సి రావడంతో ఒకింత జాగరూకతతో ఇప్పుడు మళ్ళా వాటిని పట్టిచూడాల్సి వచ్చింది. మొత్తంగా గాంధీని గురించి కొద్ది మాటలతో చెప్పాల్సివస్తే, అతడొక ఆధ్యాత్మిక సాధకుడు. భారతీయ ఆధ్యాత్మిక సాధనలలోని ఒక విధానాన్ని నెత్తికెత్తుకుని తనను తాను తరింపజేసుకోడానికి చేసినపనే ఇదంతా అనిపిస్తుంది. అతని వివిధ కార్యక్రమాల వెనుక పనిచేసిన సూత్రం : 'అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం' అన్నదేననిపిస్తోంది నావరకు నాకు.
అహింసా ప్రతిష్ఠాయం తత్సన్నిధే వైరత్యాగః | అహింస సిద్ధికలవాని సన్నిధిలో ఆగర్భశత్రువులు-సహజ శతృత్వం కలవి-కూడా వైరభావాన్ని విడచి సఖ్యంగా వుంటాయి. అని ఈ వాక్యానికర్థం. గాంధీ, తాను అహింస సాధకుణ్ణనుకున్నాడు. అది సిద్ధించిందో లేదో చూసుకోడమో, సిద్ధించింది అనుకుని కనుక హిందూ ముస్లింలు పరస్పరం వైరభావాన్ని విడుస్తారు అనుకునో ప్రయోగాలు చేశాడు.
ఒకవంక బలవంతుడు సహించుకునేదే అహింసలో భాగమవుతుందంటూనే, ప్రతిసారీ బలహీనుల సహనాన్నే అహింస క్రింద కూచోబెట్టాడు.
(1) బ్రిటీష్‌వాళ్ళు తంతుంటే భారతీయులు తిరగబడకుండా సహించుకోడాన్ని బలవంతుల సహనంగా భ్రమపడ్డాడు.
(2) ముస్లింలు మతహింసను ఆరంభిస్తే హిందువుల్ని సహించుకోమని బోధిస్తూ హిందువులు సహించుకోడం బలవంతులు అహింసను పాటించడం అనుకున్నాడు.
(3) అగ్రవర్నాల దుర్మార్గుల్ని నిమ్నవర్గాలు సహించుకోవడం బలవంతులు అహింసను పాటించడం అనుకున్నాడు. ఈ మొత్తం విషయంలోనూ గాంధీలో అవగాహనా లోపం- తప్పు అవగాహనే (భ్రమజ్ఞానం) వుంది. ఎలాగంటే అహింస సిద్ధిస్తే శతృవులు శతృదృష్టిని విడుస్తారన్న సూత్రంపై గుడ్డి నమ్మకం పెట్టుకోడంతో మొదలైందతని అవగాహనా లోపం. ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రతిసారీ విషలమవుతున్నా అదే సరైంది అన్న నిర్ణయంలో వుండడాన్ని అతడో బండ, మొండి విశ్వాసి, అనడానికి వీలుకల్పిస్తోంది.
భారతీయులు బలవంతులు-బ్రిటిష్‌వాళ్ళు బలహీనులు అని తీర్మానించుకుని భారతీయులు ఆంగ్లేయులు చేసే హింసను చచ్చేవరకు భరించడమే అహింస పాటించడం. తన ఈ ప్రయోగంలో బ్రిటిష్‌వాళ్ళు హింసను వీడతారని అహింసా సాధనను గుడ్డిగా చేస్తున్న గాంధీ నమ్మకం - ఇదో భ్రాంతి.
(4) హిందువులు ముస్లింలు చేసే హింసను చచ్చేవరకు భరిస్తూ వుంటే ముస్లింలు హింసచేయడం మానేస్తారని గాంధీ అహింసా సాధన సిద్ధాంతం. ఇదీ వెనకటి వాటంతటి భ్రాంతేకదా!
(5) అగ్రవర్ణాలు చేసే దాడుల్ని, అమానుష అత్యాచారాల్ని 'బలవంతులైన దళితులు' చచ్చేవరకు సహిస్తూ పోతే అగ్రవర్ణాలు హింసను మాని అసమానతల్ని వీడి అందరూ మైత్రితో మెలగుతారన్న పిచ్చి భ్రమ.
గాంధీజీ, అహింసయొక్క ప్రభావం అంతగా వుంటుందని గుడ్డిగా నమ్మాడనే నాకనిపించింది. అయితే ఆ సూత్రం దానికదే ఒక పెద్ద భ్రాంతి అనదగ్గది. అయితే తత్వశాస్త్రంలో కొన్ని హితభ్రాంతుల్ని జొప్పించి వుంచాల్సిన అవసరం వుంది. అయితే వాటిని యధాతథంగా సత్యాలనుకుని ఆచరింపజూస్తే కొంప మునుగుతుంది. నా అవగాహన ప్రకారం గాంధీకి ఈ వివేకం లేదు. బండగా, మొండిగా ఆ సూత్రాన్ని తలకెత్తుకున్న గుడ్డి నమ్మకంతో కూడిన ఆధ్యాత్మిక సాధకుడతడు. నిశితంగా నిదానంగా, లోతుగా అతని మొత్తం వ్యవహారాన్ని పట్టిచూస్తే అతని కార్యక్రమమంతా తన జీవిత సాఫల్యతకొరకు తాను చేస్తూ వచ్చిన ఆధ్యాత్మిక సాధనేనన్నది లీలగా బుద్ధికి గోచరమవుతుంది. కనుక అతణ్ణి కపటి, దొంగ, జిత్తులమారి అనడంకంటే ఆధ్యాత్మిక విశ్వాసంతో కూడిన మొండి సాధకుడు అనడం సత్యానికి దగ్గరి మాట అవుతుంది. గాంధీజీ పోషించిన పాత్రకు కనీస న్యాయం చేయడమవుతుంది.
గమనిక : గాంధీ గురించి మరింత విచారణకు సిద్ధమంటూ నాతో విభేధించే వాళ్ళుంటే అట్టివాళ్ళతో కలసి సమష్టి అధ్యయనం చేయడానికి నేను సిద్ధం. అట్టివారు నాతో సంప్రదించండి. విచారణలో తేలిన విషయాలను అంగీకరించి స్వీకరించడానికి సిద్ధమైతేనే అందుకు తయారవ్వండి. నావరకు నేను అందుకు 100% సంసిద్ధం.
పై సంచికలో మత విషయాలను లోతుగా పరికించిన అంబేద్కర్‌ను కొంతవరకు పట్టిచూద్దాం. అభిలాషకలవాళ్ళు అంబేద్కర్‌ను చదవండి. ప్రధానంగా ఈ అంశాలు అంబేద్కర్ రచనలు : 8 సంపుటంలో వున్నాయి. 'పాకిస్తాన్ లేదా దేశ విభజన' అన్న పేరుతో వుందా సంపుటం.
ముఖ్య గమనిక : మత సామరస్యం సాధ్యమే అన్న పక్షాన్ని స్వీకరించి నిజాయితీగా, తీవ్రంగా అందుకై శ్రమిస్తున్న వారికి ఒక విజ్ఞప్తి. అదంటే ఏమిటో వివరించి, దానిని సాధించడమెలాగో విపులంగా చెప్పండి. నేను మత సామరస్య వ్యతిరేకిని కాదు. మానవుల మధ్య సామరస్యానికి ప్రధానావరోధకంగా మతం వుంటోంది అన్న దృష్టిలో వున్నవాణ్ణి. మానవుల మధ్య సామరస్యపూర్వక సహకార సంబంధాలు నెలకొనాలన్నంతవరకు మనమంతా ఏకలక్షీయులమే. దానిని ఆచరణాత్మకం చేయడమెలాగన్నదగ్గరే మనం వేరువేరుగా ఆలోచిస్తున్నాం.
మతం వుండి మానవుల మధ్య సయోధ్య, మతం పోయి మానవుల మధ్య సయోధ్య ఏది సరైన భావన? అన్నదే మనమధ్య విచారణీయాంశం. ఇక్కడ మనకెవరికీ అభ్యంతరముండక్కర్లేదనుకుంటాను.
No comments:
Post a Comment