ప్రజాస్వామ్యాన్ని ఎలాగోలా బలపడకుండా చూస్తూ వుందాం, చూసుకుంటూ వుందాం అన్నంతవరకు ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సంఘటితంగా కృషిచేస్తున్న అన్ని పార్టీలూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అంటూ ప్రకటించడం దానికదే ఒక పెద్ద విడ్డూరం. ప్రజాస్వామ్యమంటే ఏమిటన్నది అంటున్నవాడికీ, వింటున్నవాడికీ కూడా తెలియనంతకాలం జనానికి ఇలాంటి విడ్డూరాలు పట్టిచూపించినా విడ్డూరాలుగానే కనిపించవు. చెవినిల్లుకట్టుకుని వినిపించినా వినిపించవు. ఇదో విషాదం.
ప్రజలే యజమానులు-స్వాములు-అన్నమాట పరిణతి చెందిన మరియు సమానత్వాకాంక్షకల వాస్తవవాదుల ఆలోచనల నుండి పుట్టింది. అదిన్నీ, అట్టివారు ఎటువంటి ఉద్వేగానికీ లోనుకాని, శాంతచిత్తంతో ఆలోచించగల మానసికస్థితిలో వున్నప్పుడు చేసిన ఆలోచనల పర్యవసానంగా రూపుదిద్దుకున్న ఊహ. అట్టిదానిని సాకారం చేయాలంటే ప్రజల మానసిక పరిపక్వతకై ఎంతో పెద్దయత్నం చేయాల్సి వుంటుంది. అయితే ఆ దిశగా సజావైన యత్నాలేమీ జరక్కుండానే, ఆ భావాలు బహుళ వ్యాప్తిలోకి వచ్చాయి. వేషధారులైన ఆధిపత్యాకాంక్షగల, నాయకస్వామ్య లక్షణాల్ని జీర్ణించుకుని వున్న వివిధ నాయక శ్రేణులకు అదో గొప్ప ముసురుగా పనిచేస్తూ వచ్చింది.
నాకధికారం కట్టబెట్టండి. మిమ్మల్ని జాగ్రత్తగా పరిపాలిస్తాను, అనని నాయకుడున్నాడా ఈనాడెవరైనా? నేటి రాజకీయాలలో 'పాలకులం మేము-పాలితులు మీరు' అనని, అనుకోని పార్టీలుగానీ, నేతలుగానీ వున్నారా?
నన్ను నిలబెట్టినవారికీ, నా వారనుకున్నవారికీ అండగా వుంటాను, ఈ సమయంలో అందరికీ వారనుకున్నవి ఇవ్వలేకపోతున్నా, ఇప్పుడు అవకాశాలుగాని వారందరకూ, రేపు పాలకుణ్ణయ్యాక ప్రత్యేక అవకాశాలు, వనరులూ కల్పిస్తానంటూ ప్రజాస్వామ్యం పేరునే నిస్సిగ్గుగా, బాహాటంగా వాగ్దానాలు కుమ్మరించేస్తున్నారు. ఇందుకు ఏ పార్టీకిగానీ, నేతలకుగాని మినహాయింపు లేదు. ప్రజాస్వామ్యమంటే, వాటికి, వారికి అర్థంకాలేదనడానికి, లేదా జీర్ణం కాలేదనడానికి ఇదో మచ్చుతునక.
ప్రజాస్వామ్యంలో, ఎన్నికలవేళ అభ్యర్థిగానీ, పార్టీలుగానీ తనగురించి, తాను చేయదలచుకున్నవాటిని గురించి ఏమేమి చెప్పుకున్నా, అవన్న అందరి ప్రజలకు ప్రతినిధిగా మాత్రమే చేయాల్సి వుంటుందన్న కనీస పరిజ్ఞానం కూడా లేని మందే ఈనాడు నాయకులవ్వటానికీ, అధికారం పొందడానికీ యత్నిస్తున్నారు. కొన్ని సందర్భాలలోనైతే తాను గెలిచి పదవినీ పొందాక, తన వద్దకు వచ్చిన సమస్యలతో ప్రజలనుద్దేశించి, నీవు నాకు ఓటేశావా? వేయనప్పుడు నేను నీపనెందుకు చేయాలి? అని ఈసడించుకోడం, తనవాళ్ళెవరు? పరాయివాళ్ళెవరు? అటోళ్ళా ఇటోళ్ళా తేలనివాళ్ళెవరు? అంటూ వివరాలూ సేకరించి పెట్టుకుంటున్నారు. కొందరు నేతలైతే అక్కడితో ఆగక, మరో అడుగు ముందుకేసి, పర అనుకున్నవాళ్ళకు ప్రభుత్వం నుండి మాములుగా అందే అవకాశమున్నవాటినీ అందకుండా అడ్డుకోవడం, వ్యక్తిగతంగా అట్టివారికి చేయగలిగినంత కష్టమూ చేస్తుండడం, మొదలగు వాటిద్వారా ఓటరులో ఒక భయానక పరిస్థితిని సృష్టించేంతవరకూ తెగిస్తున్నారు. కొద్దిమందినలాంటి కష్టనష్టాలకు గురిచేయడం, ఆ ఘటనలు నలుగురికీ తెలిసేలా చేయడం ద్వారా ప్రజలలోనూ ఎందుకొచ్చిన తంటా అనుకునే భయం స్థిరపడిపోయింది. దాంతో ఏ నాయకుడెదురుపడ్డా లోలోపల లేని నవ్వును ముఖంనిండా పులుముకొని నేను మీవాణ్ణే, నా ఓటు మీకేనంటూ నాటకమాడడానికి అలవాటుపడ్డాడు ఓటరున్నూ.
అవగాహన కలిగి, స్వేచ్ఛ, స్వతంత్రాలతో కూడి తన అభిమతాన్ని ప్రకటించినప్పుడే ప్రజాస్వామ్యం పేరిట జరిగే ఎన్నికలలో ఓటు వేయడమన్నది సక్రమంగా జరిగినట్లు. అవగాహన లేకుండా వేసిన ఓటు జడప్రాయమైనది. అది యాంత్రికంగా సంఖ్యను లెక్కించడానికి మాత్రమే సరిపోతుంది. నీ అభిప్రాయమేమిటి? అనే ఓటువేయడమనడమంటే. ఏ విషయంలో? అన్నది లేకుండా నీ అభిప్రాయమేమిటి? అని అడడగడంగానీ, నా అభిప్రాయమిది అని చెప్పడంగానీ ఎన్నికలలో ఓటువేయడమన్న ఉద్దేశాన్ని నెరవేర్చవు.
నా కులంవాడు గనక, నా మతంవాడుగనక, నా బంధువుగనక, మావూరివాడుగనక లాంటి వివక్షతోకూడి వాటినిబట్టి ఓటేయడం-వాటికి ప్రతికూలమైన వాటినిబట్టి ఓటేయకుండడం అన్నదంతా ప్రజాస్వామ్యంలోని ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమైనదే. అలాగే నీకు ఓటేస్తే నాకేమిస్తావు? నాకు ఓటేస్తే నీకిదిస్తాను అని వైయక్తికంగా జరిగే లావాదేవీలన్నీ కూడా ఎన్నికల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవే.
వివేకవంతుడైన సంఘజీవి సాధారణదృష్టి, సమష్టి అభివృద్ధితోనే తన అభివృద్ధి అన్నదిగా వుంటుంది. సమష్టి లాభనష్టాలలో, కష్టసుఖాలలో యోగ్యమైన మేర పాలుపంచుకోడానికి, స్వీకరించడానికి సిద్ధపడి వుంటుంది. ఇందుకు వేరుగా తన ప్రయోజనాలకే పెద్దపీట వేసుకుందామనుకుంటే, అది ఒక సంఘజీవిగా అతడు ఆరోగ్యంగా లేడనే. రోగగ్రస్తుడైనాడనే చెప్పితీరాలి.
1. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందుకున్న లేదా సామాజికస్పృహ కలిగి వున్న వ్యక్తి సమాజపరమైన సమస్యలు-పరిపాఠాలు, అభివృద్ధి అన్న విషయాలలో ఎలాంటి వైఖరి కలిగి వుంటాడు?
ముందుగా, అందరికీ వర్తించే సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తాడు. తరవాత ఎక్కువమందికి చెందిన అన్నదానికీ, ఆపైన అనేకులకు చెందిన అన్నవాటికీ, కడకు వ్యక్తిగతమైన వాటికి అన్న క్రమాన్ని కలిగి నిజాయితీగా తదనుగుణ్యంగా ప్రవర్తించేందుకు సుముఖంగా వుంటాడు. అవసరమైనపుడల్లా, ఆ దిశగా కదలండంటూ సమాజాన్నీ చైతన్యపరుస్తుంటాడు.
గమనిక : పాఠకమిత్రులారా! చూడగల వడుపూ, చూడాలన్న వివేకపుటదుపూ గనక మీకుంటే, ముందుగా నా ఈ పై మాటలు వాస్తవాలో కాదో తేల్చుకోండి. ఇక్కడ ఒక నిర్దిష్టమైన, నిర్దుష్టమైన అభిప్రాయం లేకుండా ప్రజాస్వామ్య సార రూపాల గురించిన విచారణకు న్యాయం చేయలేము.
ఇంతవరకిది ప్రజాస్వామ్యవాదులు కాదనడానికి వీల్లేని నిర్వివాదాంశము. సామాజిక ఒడంబడికలోని అంతస్సారమూ ఇదే.
2. 'నియోజకవర్గ ప్రతినిధిగా' అన్న ఉద్దేశ్యంతో ఏర్పరుపబడ్డ శాసనసభ్యునిపాత్ర ఎలా వుండడం సబబు? అతడు ఏదో ఒక పార్టీ తరఫున అందుకు సిద్ధపడ్డా, స్వతంత్ర అభ్యర్థిగా తనను తానుగా నిలబడ్డా, ఒక్కో నియోజకవర్గానికి అనేకులు నిలబడ్డా వారంతా ముందుగా ప్రకటించాల్సిందీ, తరవాత ప్రవర్తించాల్సిందీ మొత్తం నియోజకవర్గానికి ప్రతినిధిగనే ప్రజాస్వామ్యాన్ని గురించిన 'ఓనమాలు' తెలిసినా, అవునదంతే అనేస్తారు.
ప్రజా ప్రతినిధిగ ఎన్నికైనవాడు, ఏ కారణాలు చూపిగాని తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతపు ప్రజలపట్ల తన, పర అన్న వివక్షను-పక్షపాతాన్ని-చూపినట్లయితే అతడు ప్రజాస్వామ్యపు దారినుండి ప్రక్కకు తొలగినట్లే. ఈ తన పర అన్నవి తనకు ఓట్లేసిన-ఓట్లేయని అన్నదగ్గర మొదలెట్టి, శతృ-మిత్ర; ఇరుగుపొరుగు; ఊరువాడ, బంధుత్వం, కులం, మతం, ప్రాంతం, పార్టీ, వగైరా వేటితో ముడిపెట్టి పరిగణించినా అతడిక ప్రజాస్వామ్య సూత్రీకరణల ననుసరించి ప్రజాప్రతినిధిగ పనికిరాడనే అర్థం.
ఇదే సూత్రాన్ని ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రికి, మంత్రులకూ వర్తిస్తుంది-కేంద్ర ప్రభుత్వంలోని వారికీ వర్తిస్తుంది. జిల్లా, పట్టణ, మండల, గ్రామస్థాయి ఎన్నికైన వారందరకూ వర్తిస్తుంది.
మిత్రులారా! నేను చెప్పదలచుకున్న భావన చాలా విస్తృతమైనది. మరింత వివరిస్తేగాని అందరికీ అవగతం కాదనిపిస్తోంది. ముందే ఈ వివరం తెలిసున్నవాళ్ళు విసుగుపడకుండా, ఇంతగా చూడనివాళ్ళు మరింత నిదానంగా ఈ వివరాల్ని పట్టిచూడండి.
ఉదా. : ముఖ్యమంత్రి అన్న స్థానంలో వున్నవాడు ముందుగా రాష్ట్రం మొత్తానికీ ప్రతినిధిగా తనను తాను తలంచాలి. ప్రవర్తించాలి. కనుక అతని ప్రజాకార్యక్రమాల ప్రాధాన్యతాక్రమం, మొత్తం రాష్ట్రానికి వర్తించే అంశాలకు ఒకటవస్థానం, ఎక్కువమందికి వర్తించే అంశాలకు ద్వితీయస్థానం, అనేకులకు వర్తించే వాటికి తృతీయస్థానం ఒక్కొక్కరికి వర్తించే వాటికి చివరిస్థానం ఇవ్వాలి.
గమనిక : హఠాత్తుగా వచ్చి పైబడ్డ, తాత్కాలికంగా చేయక తప్పని అత్యవసర-ఎమర్జెన్సీ-పనులకు ఎప్పుడూ అన్నింటికంటే ముందు అన్న అసాధారణ సూత్రమే పనిచేస్తుంటుంది. అయితే ఇట్టి ఆపద్ధర్మపు పనులు నిరంతరాయంగా చేస్తుండే పరిస్థితి వుండరాదు.
ముఖ్యమంత్రి అనుసరించాల్సిన రీతిలోనే మరో కోణముంది. అది; అన్ని జిల్లాలకు వర్తించే అంశం మొదట, ఎక్కువ జిల్లాలకు వర్తించేవి, తరువాత, కొద్దిజిల్లాలకు వర్తించేవి అటు తరువాత ఏదో ఒక జిల్లాకు వర్తించేవి కడమకు అన్న క్రమం వుండాలన్నమాట.
అలాగే ప్రభుత్వంలో ఒక శాఖకు మంత్రి అయిన ఒక నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు మంత్రిగా తన శాఖతో ముడిపెట్టి, అందరకూ వర్తించే వాటికి 1వ స్థానాన్ని, ఎక్కువమందికి.... 2, 3, 4 స్థానాల్ని యిస్తూ పనిచేస్తూ పోవాలి.
ఒక మంత్రి స్థానంలో వున్నవానికి మూడు బాధ్యతలన్నాయి. (1) మంత్రిగా అతడు తన శాఖకు సంబంధించినంతవరకు రాష్ట్రమంతటికీ బాధ్యుడు, (2) శాసనసభ్యునిగనూ అతడు మొత్తం రాష్ట్రానికి వర్తించే శాసనానికి-రాజ్యాంగానికి-వాటిని అమలయ్యేలా చూడడంతో మొత్తం రాష్ట్రానికి బాధ్యుడు, (3) అతణ్ణెంచుకున్న నియోజకవర్గ ప్రజలందరికీ బాధ్యుడు. ఇద్దరమైతేగాని, ఒక వ్యక్తి మంత్రిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటున్నాడంటే అర్థమేమిటో, శాసనసభ్యునికి సక్రమంగా ప్రవర్తిస్తున్నాడంటే అర్థమేమిటో, తన నియోజకవర్గానికి ప్రతినిధిగా సరైన రీతిలో ప్రవర్తిస్తున్నాడంటే అర్థమేమిటో బోధపడదు.
ఉదాహరణకు ఒక ఎం.ఎల్.ఏ. రాష్ట్ర ప్రయోజనాలు, అందరికీ వర్తించే అంశాలను పట్టించుకోకుండా, ఒక్కసారి వాటిని తన పలుకుబడితో ప్రక్కకునెట్టి తన నియోజకవర్గ ప్రయోజనాలకు ప్రథమస్థానం యిచ్చాడనుకోండి. అప్పుడితడు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నట్లు కాదా? అలాగే అన్నిజిల్లాలకు వర్తించేవో, ఎక్కువ జిల్లాలకు వర్తించేవో సమస్యలున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా తన జిల్లాకే ప్రాధాన్యతనిచ్చాడనుకుందాం. అపుడూ అతడు ప్రజాస్వామ్యాన్ననుసరించి ప్రజల తరఫున పనిచేయనట్లే.
జిల్లాకు పరిమితమై చూద్దాం. జిల్లా మొత్తానికీ వర్తించే అంశాలున్నా, వాటిని విడచి తన నియోజకవర్గానికే ప్రాధాన్యతనిచ్చినా, నియోజకవర్గానికంతటికీ వర్తించే అంశాలుండే తన మండలానికే పెద్దపీట వేసినా నియోజకవర్గంలోనే అందరికీ వర్తించే సమస్యలుండీ, తన ఓటర్లకే అనుకూలంగా ప్రవర్తించినా... అతడు ప్రజాస్వామ్య విధి విధానాల్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నట్లే.
ప్రాతినిధ్య వ్యవస్థ పనిచేస్తున్న అత్యల్ప భాగం నుండి అత్యధిక భాగానికి లేదా మొత్తానికి సంబంధించి కూడా అన్వయించి చూడాల్సిన అత్యంత ప్రధానమైన, ఆద్యంతమూ వర్తించే అస్సలు సూత్రీకరణ ఇదే. ఇద్దరమైతే, ఎప్పటికప్పుడు అప్పటికది ప్రజాస్వామ్యపు పూర్తి స్వరూప స్వభావాల్ని సంతరించుకోకున్నా ఎంత సారూప్యత కలిగి వుంది ఏ దిశగా సాగుతోంది, క్రమంగా ఏమికాబోతోంది అన్నది పట్టిచూసుకునేందుకు వీలవుతోంది.
గమనిక : ఇదే క్షేత్రంలో మరికొన్ని చూడాల్సినవీ వున్నాయి. అయినా మనమంతా ప్రజాస్వామ్య క్షేత్రంలోనే తిరుగాడుతున్నాం గనుక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరమైన మరికొన్ని మీ దృష్టికీ వస్తున్నాయేమో చూసి స్పందనకు వ్రాయండి.
పంచాయతీల నుండి మొదలుపెట్టి పాలనలో ప్రజాస్వామ్యం అమలవ్వడమంటే ఏమిటో చూద్దాం.
ప్రజా ప్రతినిధులుగాని, పాలన పనిచూస్తున్నవాళ్ళుగానీ ఎవరిననుసరించి నడుస్తుండాలి?
ప్రజాస్వామ్యంలో దీనికి నిర్వివాదమైన సమాధానం ప్రజలందరి ననుసరించి, లేదా అది కుదరని సందర్భాలలో అధికజనుల అభిమతాలననుసరించి అని మాత్రమే. 'అందరి లేదా అధిక జనుల' అన్న మాటలు విడచి అల్పజనుల (కొద్దిమంది లేదా ఒక్కరి) అన్న పదాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్యం అమలవడం లేదనే దానర్థం. కనుక పంచాయతీ ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం అమలు చేయాలంటే కార్యక్రమం ఎక్కడనుండి మొదలెట్టాలి?
(1) గ్రామ సభలు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా, ఆరోగ్యంగా, బలంగా జరుగుతుండడమన్నదే గ్రామంలో ప్రజాస్వామ్యం సజీవంగా, శక్తివంతంగా వుందనడానికి గుర్తు.
(2) ప్రతి చిన్న విషయానికి గ్రామసభే నిర్ణయం తీసుకోవడం అన్నది ఆచరణలో అధికశ్రమకు దారితీస్తుందికనుక దాదాపు అసాధ్యం అనడానికి సరిపోతుందిగనుక, పంచాయతీ పరిధిలో ఎంపికైన ప్రజాప్రతినిధులందరూ నిర్ణయించినమేర అమలవుతుండడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యపు రీతి.
గ్రామసభ జరగాలి. ఓటర్లుగా అర్హులైన వారంతా గ్రామసభకు హాజరుకావాలి. హాజరైనవారంతా ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను ప్రకటించాలి.
మళ్ళా ఇక్కడి పైన నేను వివరించిన ప్రమాణాలననుసరించే నిర్ణయాలు జరగాలి. ముందుగా అందరికీ వర్తించే అంశాలు, అందరి అంగీకారం, ఎక్కువమంది అంగీకారం....
పిదప ఎక్కువ మందిక సంబంధించిన అంశాలు అందరూ అంగీకరించినవి, ఎక్కువమంది అంగీకరించినవి... ఇలా.
ప్రజా ప్రతినిధికి ప్రధానంగా రెండు బాధ్యతలుంటై. ఒకటి ప్రజాసమస్యలను పాలకుల ముందుకు తీసుకుపోవడం, పాలనను ప్రజలవద్దకు తెచ్చే యత్నం చేస్తుండడం. మూడో పని పాలనపరమైన విధి విధానాలలో ప్రజాస్వామ్య ప్రయోజనాలను అనుగుణ్యంగా ఏవైన మార్పులు చేర్పులూ అవసరమైతే అందులో నిస్పాక్షికంగా పాల్గొనడం.
ప్రజాస్వామ్యం అమలవ్వాలని నిజాయితీగా తలంచేవాని ఆచరణ ఎలా వుంటుంది? వుండాలి?
ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో ఏకాభిప్రాయం ఏర్పడలేదనుకుందాం. రెండోపక్షమేమిటి? ఎక్కువమంది అభిప్రాయాన్ని అమలు చేయదగిన నిర్ణయంగా స్వీకరించడం. ఇక్కడే నిగ్రహంతో, నిబద్ధతతో ఆలోచించాల్సిన, పనిచేయాల్సిన అవసరముంది. చాలా సందర్భాలలో ప్రజాస్వామ్యం అమలవకపోవడమన్నది ఇక్కడే జరుగుతుంటుంది.
ఉదాహరణకు, ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదరలా. ఎక్కువమంది ఒకే అభిప్రాయాన్ని ప్రకటించారు. వారిలో చేరినవారు అంటే మెజారిటీ అభిప్రాయంతో విభేదించినవారు ఏమిచేయాలిప్పుడు? మెజారిటీని మీ యిష్టం వచ్చినట్లు చేసుకోండి, మేం అభ్యంతరం పెట్టము అనాల్నా? అది తమకు అంగీకారం కాదుగనుక శక్తి వున్నంతలో దాన్ని అమలుకాకుండా చూడాల్నా? ఎక్కువమంది నిర్ణయించింది అమలు చేయాలిగనుక, అందులో తామూ ఇష్టంలేకున్నా నిజాయితీగా తమవంతు కృషిచేయాల్నా?
ప్రజాస్వామ్య సూత్రం నిర్ద్వందంగా చెప్పగలిగేదేమంటే, మెజారిటీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి, ఆచరించాలి అనే. కనుక మీ పని మీరు చేసుకోండి మేమభ్యంతర పెట్టము అనడంగానీ, వీలుంటే అడ్డుపడదాము అన్నదిగాని ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. విధిగా బాధ్యతతో ఎక్కువమంది నిర్ణయించినదానిని తనదిగనే స్వీకరించి తనవంతు పాత్రను శక్తివంచన లేకుండా పోషించడమే ప్రజాస్వామ్యాన్ని అమలు పరచడమంటే.
నాయకులు-అనుచరులు, నాయకులు-సహచరులు
లోకంలో అతిసాధారణంగా మనకు ఎదురుపడే చిత్రం - 'నాయకుడు-అనుచరులు' అన్న పోకడే. చోటా నాయకుడి దగ్గరనుండి బడాబడా (మోటా) నాయకుల వరకు ఒకటే వరస. నాయకత్వస్థానంలో ఉన్నవాడికి అతణ్ణి తమ నాయకుడుగా అంగీకరించే ఎంతో కొంత సమూహం వుంటుంది. వారు ఎక్కువలో ఎక్కువమంది, ఎక్కువలో ఎక్కువసార్లు మా నాయకుడేమి చెపితే మేమిదే చేస్తాం. మా నిర్ణయం చేయాల్సింది, చేయగలిగింది, చేసేది నాయకుడే అన్న దృష్టితోనే వుంటారు. దాన్నే అమలు చేస్తుంటారుకూడా. ఇది గతంనుండి సంక్రమించిన రాచరిక వ్యవస్థ-నియంతృత్వ వ్యవస్థ-అవశేషమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్నవాడే పెద్ద నాయకుడు. అతడు ఎప్పటికప్పుడు ప్రజాభీష్టాన్ని అమలు చేస్తుండడమే కర్తవ్యంగా కలిగి వుండాలి, వుంటాడు. నిర్ణయాలు నాయకుడు తీసుకుంటూ, మిగిలినవారు దానిని అమలు చేస్తున్నంతకాలం దానిని ప్రజాస్వామ్యం అనలేము, అనకూడదు. అధికారులు, నిర్ణేతలు ఆ సమూహపు సభ్యులే, దానిని అమలు చేసేందుకు ఆ సమూహం ఏర్పరచుకున్న ప్రతినిధే, ఆ విధి నిర్వహణాధికారే-నాయకుడు, పాలకుడు అనంటే.
గమనిక : రాజకీయాలు-పాలకులులాంటి పదాలు గత వ్యవస్థల నుండి సంక్రమించిన పదాలు. వ్యవస్థ స్వరూప స్వభావాలు మరొక దాంతోపాటే పదాలూ మార్చుకునుంటే గంద్రగోళం లేకుండేది. రాజులేని స్థితిని అరాచకం అన్నారు. రాజు నిర్వహించే వ్యవహారాన్ని రాజకీయం అనన్నారు. రాజ్యం అన్న శబ్దమూ ఆ సంబంధం నుండి పుట్టిందే, పాలకుడు-పాలితులు అన్నదీ రాజు-ప్రజలు, ప్రభువు-ప్రజలు అన్న అర్థంలో వాడబడ్డమాటే. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతినిధికి ప్రభుత్వ నిర్వహణాధికారం కట్టబెడితే అతడు నేను పాలకుణ్ణి మిమ్ము పాలిస్తాను అననకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీకాని వ్యక్తిగానీ, పదవిగానీ వుండడానికే వీల్లేదు. మౌలికమైన ఈ అంశాల్ని జాగ్రత్తగా పట్టిచూసి ఆకళింపు చేసుకోండి.
ఎంపికయ్యాక, ఎవరికీ జవాబుదారీగా వుండక్కర్లేదన్న వైఖరికి పీఠం-పదవి-దక్కినవాడు చేరవచ్చునన్న ముందు చూపుతోనే రాజ్యాంగ నిర్మాతలు లేదా ప్రజాస్వామ్య సిద్ధాంతవేత్తలు ఎన్నికల ద్వారా అనివార్యంగా ప్రజలు కోల్పోతున్న అధికారాన్ని ఏదోరూపంలో వారి చేతుల్లో వుంచాలన్న వాస్తవిక దృష్టితో చొరబెట్టబడ్డవే రిఫరెండం, రీకాల్ అన్న పద్ధతులు. కానీ సూత్రాలెన్ని చేసినా 'అనుచరులు-నాయకులు' అన్న వైఖరి అమలులో ఉన్నంతకాలం అధికారం ప్రజలకు దఖలవదు. మాటవరసకే 'ప్రజలే ప్రభువులు' అన్నది వినిపిస్తుంటుంది. అందుకే ప్రజాస్వామ్యానికి ఆధారపీఠం-ఓటరుకు అవగాహన - స్వేచ్ఛ, స్వతంత్రము అన్న మూడు సమర్థతలు వుండడం-అనంటున్నాం.
ప్ర. : ఓటరుకు చెందినంతలో అవగాహన వుండడమంటే ఏమిటి?
1. ఇది ఏ క్షేత్రానికి పరిమితమై తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి వుందో ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు-కారణాలు, పరిష్కారాలు అన్నవాటి విషయమైన అవగాహన.
2. అప్పటివరకు ఆయా పార్టీలు, వ్యక్తులు ఆయా సమస్యలపై అనుసరించిన విధానాల తీరుతెన్నులకు సంబంధించిన అవగాహన.
3. ప్రస్తుతమా అభ్యర్థి, ఆ పార్టీ తాను, తాము ఏవి సమస్యలంటున్నాయి? వాటికి కారణాలేమంటున్నాయి? తాము వేటికి ఎలాంటి ప్రాధాన్యత నిస్తున్నామంటున్నాయి? వాటికి పరిష్కారాలెలా చేస్తామంటున్నాయి?
4. అభ్యర్థి కార్యక్షేత్రం ప్రజల పరోక్షంలో ఎక్కువగా వుండేదా? ప్రజలు నిరంతరం గమనించడానికి, ప్రశ్నించడానికి వీలుగా వుంటున్నదా? అన్నది స్పష్టంగా గుర్తించాలి. అభ్యర్థి కార్యక్రమం తమకు పరోక్షంగా వుండేదైతేనూ, మరింత మంది కూడి నిర్ణయాలు తీసుకునేదిగా వుంటేనూ, అభ్యర్థి గుణగణాలకు రెండోస్థానమిచ్చి, పార్టీ విధి విధానాలకు మొదటి స్థానం యివ్వడం మేలు. అలాగే స్థానిక పరిపాలనలలో అభ్యర్థి గుణగణాలకు మొదటిస్థానమచ్చి, విధివిధానాలకు రెండోస్థానం కేటాయించవచ్చు. ఎందుకంటే మహాసభ-గ్రామసభల పర్యవేక్షణ ఎలానూ విధివిధానాల నిర్ణయంలో నేరుగా వుంటుంది గనుక.
5. అధికార వికేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. అధికారం ఎక్కడికక్కడ ప్రజలకు చేరువలో వుండాలి. ఏ పార్టీ, ఏ అభ్యర్థి అధికారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా వుంటుందో అట్టివారిని ఎంచుకోడానికి సిద్ధపడాలి.
6. పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం చేసే ప్రచారమంతా ఈ విషయాలపట్ల ప్రజలకు ప్రామాణిక సమాచారాన్నందించేదిగా వుండాలి. వారు వారు ప్రచారంలో చెప్పినవాటి నిజానిజాలకు వారిని బాధ్యులను చేసే చట్టాలుండాలి.
7. ప్రచారంలో ఎవరు? ఏ రూపంలోగాని వ్యక్తులలోని ఆశా-భయాలను ప్రభావితంచేసే, తన-పరి దృష్టులను జనిపంచేసే ఎటువంటి వాగ్దానాలు చేసినా, వ్యక్తి బలహీనతలను సొమ్ముచేసుకోవాలనుకున్నా అదంతా ఓటరు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ప్రభావితం చేస్తుంది. అట్టి ప్రభావాలకు లోనై వేయబడ్డ ఓటు ప్రజాస్వామ్యం ఆశిస్తున్న ఓటుస్థాయి కలిగి వుండదు.
8. ప్రజాస్వామ్యపు దాని ఆదర్శరూపంలో ఒకరు చెబితే వేసే వోటు ఓటరులో ప్రజాస్వామ్యం ఆశించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేనితనాన్ని చూపిస్తుంది. ఒక పౌరుడు, మరొక పౌరుణ్ణి ఫలానివానికి ఓటేయమనడమూ ప్రజాస్వామ్య మౌలిక స్వభావానికి విరుద్ధమైనదే. అవగాహన కలిగించడం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రభావితం చేయడం అన్న రెంటికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గ్రహించగలగడం ఓటరు సామర్థ్యాలకు సంబంధించినంతలో అతికీలకమైన అంశం.
- స్వతంత్రాలోచనాశీలత, సక్రమాలోచనా సామర్థ్యము వున్న వ్యక్తే అభిప్రాయ వ్యక్తీకరణరీత్యా లెక్కింపదగినవాడు. సక్రమాలోచనకు అవగాహనే పునాది. మరొకరి ప్రేరణతో ఒక వ్యక్తి ఓటేశాడంటేనూ, ఆ ప్రేరణ ఓటు వేయడానికిగాక, ఫలాన వానికి ఓటు వేయడానికి ప్రేరణైందంటేనూ, ప్రజాస్వామ్య సిద్ధాంతాలరీత్యా రెండు తప్పులు జరిగాయి. ఒకటి నీవు ఓటేయలా-రెండు మరొకడు తన ఓటుతోపాటు, వేరొకని ఓటునుకూడా వినియోగించుకున్నాడు.
మిత్రులారా! ప్రజాస్వామ్య సౌధంలోని మరో మందిరాన్ని మీముందుంచే యత్నంచేశాను. దీని వెలుగులో మొన్న ఎన్నికలలో ప్రజాస్వామ్యం ఏయే పార్టీల, అభ్యర్థుల కార్యాచరణలో ఏమేరకు చోటు చేసుకుని వుందో, అందులో ఎన్నింటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంతంతగా పనిచేశాయో, మరి వేటి కార్యక్రమాలు కనీసం ప్రజాస్వామ్యం దిశగానైనా కదిలేవిగా కనిపించాయో జాగ్రత్తగా పట్టిచూడండి. చైతన్యవంతులైన పౌరులుగా మీమీ స్పందనలను మాకు తెలియజేయండి. వాటినీ పరిగణనలోకి తీసుకుని, మరో కోణాన్ని మీముందుంచే యత్నం చేస్తాను. ఇప్పటికి ఆగుదాం...
ఎన్నికల కమీషన్, పోలీసు వ్యవస్థ, మద్య నియంత్రణ విభాగం, ఎన్నికల నిఘావేదిక, పలు స్వచ్ఛంద సంస్థలు మాధ్యమాలు మొన్న ఎన్నికలలో నిర్వహించిన పాత్రలేమిటన్నదీ గమనించారా? అయితే మీ దగ్గరున్న సమాచారాన్ని మాకు పంపండి. ఆయా రాజకీయుల పక్షాన చోటుచేసుకున్న అప్రజాస్వామిక పోకడల వివరాలు, సరైన ఆధారాలతో వుంటేనేసుమండీ-మాకందించండి-వాటిని ఆ పనులు చూసే అధికారులకు అందిస్తాము.
No comments:
Post a Comment