Thursday, October 1, 2009

స్పందన-ప్రతిస్పందన



స్పం.-1 : మిత్రులు సురేంద్రబాబుగారికి అంటూ పి.ఎస్‌.ఆర్‌. ఇలా వ్రాస్తున్నారు.
వివేకపథం సెప్టెంబరు సంచికలో మీ ప్రతిస్పందన గమనించాను. మీరు ప్రస్తావించిన అంశాలలో కొన్నింటిపై నాకు ఏకీభావం లేకున్నా, మన స్నేహ సంబంధాలపై దాని ప్రభావం ఏమాత్రం పడరాదన్న భావం నాలోనూ గాఢంగానే వుంది. అదీగాక ''పెళ్ళి వేదికలో (ప్రయోగంలో) ఏమేమి లొసుగులున్నాయో తెలుపమని ఎవరినీ అడగలా'' అని మీరు ప్రకటించాక ఈ విషయం మీద నేను సాగదియ్యడం వివేకవంతమైన చర్య అవదు. నాకున్న ఉద్యోగ, ఇతరత్రా తీరికలేని కార్యక్రమాలవల్ల సెలవుపెట్టి వచ్చి మీతో చర్చించేటంత తీరుబడి నాకులేదు. మీరు అవసరముందని భావిస్తే లేఖారూపక వ్యక్తిగత చర్చకు నాకు అభ్యంతరం లేదు.

ప్ర.స్పం.-1 : యోచనాశీలురైన పి.ఎస్‌.ఆర్‌.గారికి,
మన మన అవగాహనల్లోని వ్యత్యాసాలవల్ల ఆయా విషయాల గురించిన మన మన అభిప్రాయాలలో తేడాలు వుండడం సాధారణంగా చోటుచేసుకుంటుండేదే. ఇది ఒకే సంస్థలో వుండే అనేకుల మధ్యా, వివిధ మిత్ర సంస్థలలో వుండే అనేకుల మధ్యా పరస్పరం శతృదృష్టి వున్న వారి మధ్యా కూడా ఏర్పడే వీలుంది. అయినా ఈ అభిప్రాయాలలోని తేడాపాడాలననుసరించి అందులోని ఎవరు ఎవరి నిజాయితీనిగానీ శంకించకూడదన్నది వివేకం చెపుతున్నమాట. అదలా వుంచి, ఉద్యమ క్షేత్రాలలో క్రియాశీలంగా వున్నవారి మధ్య మిత్ర సంబంధాల ఆవశ్యకత మరి దేనితోనూ ముడిపెట్టి చూడరానంత ప్రధానమైనది. మామూలు జీవితాలలోనే తప్పనిసరి పరిస్థితులేర్పడితేతప్ప, భావాలలో విభేదాలున్నా పరిచయాలు, స్నేహాలు వదులుకోం మనం.
ఒక్క దుష్టపక్షం, లేదా కుటిలత్వం వున్న పక్షం విషయంలో మాత్రం మైత్రిని సాగించకూడదు ఎవరూ. 158 సంచికలోని సూచనలను సరైనరీతిలో స్వీకరించి మన ముఖ్య అవసరమైన, ఉద్యమానికి ప్రయోజనకరమైన రీతిలో మితృత్వానికి తగినంత ప్రాధాన్యతనిచ్చిన మీ విజ్ఞతకు అభినందనలు.
ఇహపోతే విషయ విచారణకు సంబంధించి, వ్యక్తి నడవడి, సమాజగతి అన్న రెంటి విషయంలో భావజాలం నిర్వహిస్తున్న పాత్రను గమనించిన వారెవరూ, భావజాలాన్ని పరిశీలించుకుంటుండడం, పరీక్షించుకుంటుండడం, నిర్ధారించుకుంటూ నిగ్గుతేలినమేర మార్పులు చేర్పులూ చేసుకుంటుండడం అన్న విధానాన్ని వదులుకోరు. శ్రద్ధగా అమలు చేసుకుంటూనే వుంటారు. కనుక అవసరమైన ప్రతి విషయంలోనూ అంటే సామాజిక స్థితి, గతులను ప్రభావితం చేస్తున్న, చేయగల ఏ విషయంలోనైనా మన మన అవగాహనల్లో తేడాలు చోటుచేసుకుని వుంటే అక్కడంతా మరింత సరైన అవగాహన కొరకుగా శాస్త్రీయ విచారణలు చేసుకుంటూ సాగుతుందాం. ఉద్యమాల ఆరోగ్యానికీ, బలానికీ, మనమన పాత్రల సముచిత పోషణకు కూడా ఇది అవసరం. కనుక సత్యావిష్కరణ కొరకుగా మనం మిత్రులంగానే భావసంఘర్షణకు సిద్ధపడదాం. ఆ విచారణలో నిగ్గుతేలినమేర స్వీకరిస్తూ, సమాజానికీ అందించే పనిచేద్దాం.
సహ ఉద్యమకారుల్లోనూ ఈ స్ఫూర్తిని చొరబెడదాం. పెంపొందించేయత్నం చేద్దాం. నావరకు నాకు, నేను వేసే ప్రతి అడుగు విషయంలోనూ, 'ఇది ఉద్యమ ప్రయోజనాలను అనుకూలమా? ప్రతికూలమా?' అన్న దృష్టీ వుంటుంది. ఒక్క విషయం చెప్పి ఇప్పటికాగుదాం. హేతువాద, మానవవాద ఉద్యమ క్షేత్రాలలో మీపైనా, బి. పున్నారావుగారిపైనా నాకొక ప్రత్యేక దృష్టి వుంది. అది మీరు ఎంపిక చేసుకున్న క్షేత్రాలలో మాటలకు పరిమితంకాక చేతలవరకు సాగి పనిమంతులై వుంటారన్నదే. అలాగే, ఈ మధ్యకాలంలో నాస్తిక, హేతువాద, దృష్టికల మరికొందరితోనూ సాన్నిహిత్యం పెరగడం, ఒకరినొకరం దగ్గరగా చూసుకోవడంవల్ల, ఇంతవరకు మామధ్య ఏర్పడి వున్న ఎడం నిజానికి అవసరమైన ఎడం కాదన్న నిజం గమనింపులోకి వస్తూ వుంది. నన్ను, సత్యాన్వేషణ మండలిని ఈనాడు వారంతా అనుకూల దృష్టితో చూడడం మొదలెట్టారు.
ఇదంతా మీ ఒక్కరికొరకు చెపుతున్నదికాదు. మనమధ్య ఏర్పడ్డ ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని మరింతమంది దగ్గరకు విషయాన్ని తీసుకెళ్ళడానికే ఇదంతా. అభ్యుదయశక్తుల మధ్య అభిప్రాయ భేదాలెన్ని వున్నా వారందరిమధ్యా స్నేహము, సామరస్యపూర్వక సహకార సంబంధాలు నెలకొనడం ఉద్యమావసరం. తద్వారా సామాజికావసరం. కలసిమెలసి వుంటూ, చర్చించుకుంటూ చేయగలపనిచేస్తూ సాగుదాం. సెలవ్‌!

No comments:

Post a Comment