ఐక్యమిత్రమండలి
ఉద్యమ మిత్రులారా!
2, 3 సంవత్సరాలు ఎంతోమంది చేసిన సమష్టి కృషివల్ల ఏర్పడిందే మన ఐక్యమిత్రమండలి. ఈమధ్యకాలంలో ఏసంస్థకాసంస్థకు, తానెత్తుకున్న పనుల వత్తిడివల్ల, ఐక్యమిత్రమండలి పేరున జరుపుకోగల ఉమ్మడి కార్యక్రమాలు కొద్దిగా వెనకబడ్డాయి. ఐక్యమిత్రమండలి ఆవిర్భవించడానికి మనస్సుపెట్టి కృషిచేసినవారికీ, ఐక్య మిత్రమండలిలోని మిత్రసంస్థల సహాయ సహకారాలందుకున్న వారికీ ఆ వేదిక నిరంతరం చైతన్యవంతంగా వుండడం ఎంత మేలు కలిగించగలదో తెలుసున్న విషయమే. ఎంతో అవగాహన పునాదిగా ఏర్పరచుకున్న ఆ వేదిక, వివిధ సంస్థల మధ్య, ఆయా సంస్థలకు చెందిన సభ్యుల మధ్య బలమైన ఆత్మీయతాబంధాన్ని నెలకొల్పగలిగింది. అప్పటివరకు ఉద్యమ క్షేత్రాలలో నెలకొనివున్న ''ఎవరిపని వారిది, ఎవరికి వారం'' అనుకుంటుండే ధోరణి మారి, సామాజిక హితకరమైన ఏపనైనా మనందరిదీ, మనం ఎవరికి వారం కానేకాదు, అవసరమైన ప్రతిసారీ అవగాహన, ఆత్మీయతతో ఒక్కటవగల అందరం, అన్న ధోరణి ఏర్పడి బలపడుతూ వస్తోంది.
ఉద్యమాకాంక్షలపరంగా నిజానికిదొక గొప్ప ముందడుగే అయినా, ఇంకా సాగవలసింది చాలా ఉంది. పైకెక్కాల్సిన మెట్లూ చాలా వున్నై. ఐక్యవేదికలన్నవి కూడి వుండి, కార్యక్రమాలలో మునిగి వున్నప్పుడెంత శక్తివంతంగా వుండగలవో, అలాగే కార్యక్రమాలు లేకున్నా, వివిధ సంస్థలలోని వ్యక్తులకు ఐక్యవేదిక తమదేనన్న స్పష్టత లేకున్నా క్రమంగా స్థబ్ధతకు లోనై బలహీనపడిపోగలవుకూడా. కనుక ఐక్యవేదికల్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా నిలిపి వుంచుకుని, నడిపించుకుంటూ వుండే బాధ్యత అందరం స్వీకరించాల్సి వుంటుంది. పనిలోకి దిగాలేగాని ఐక్య కార్యాచరణలెంతో ఊపునిస్తాయి. అదే సమయంలో వాటిని నిలిపి వుంచడానికీ ఎంతో ఓర్పును, శక్తిని ఖర్చుపెట్టాల్సి వుంటుంది. అపోహలు, అపార్టీలు ఇట్టే పుట్టేస్తాయి. దానికితోడు కొందరు పనిగట్టుకుని వాటిని సృష్టిస్తుంటారు. వ్యక్తులు విడిపోడానికి చీమచిటుక్కుమన్నంత కారణం వుంటేచాలు. అదేమరి దానిని ఆరోగ్యంగా, బలంగా నిలిపి వుంచడానకి ఎన్నో సమకూడాల్సి వుంటుంది.
కార్యక్రమాలుంటే వేదిక చైతన్యంగా వుంటుందన్నది నిజమే అయినా, వేదికను నిలబెట్టుకోడానికి కార్యక్రమాలు చేయడం అన్నదికూడా తిరగబడ్డ వ్యవహారం క్రిందికే వస్తుంది. వేదిక సమాజహితానికి సాధనం కావాలేగాని వేదికను కాపాడుకోడానికే సామాజిక కార్యక్రమాలు తలపెట్టడం కాకూడదు. అలా జరిగితే సాధనము-సాధ్యములన్నవి తారుమారైనట్లన్నమాట. ఒకవంక దీనిని గుర్తిస్తూనే, వేదిక పుట్టిందే శక్తివంతంగా సమాజహిత కార్యాలు చేయడం కొరకే గనుక ఆ ఉద్దేశ్యం నెరవేర్పుకై, అవసరమైన సామాజిక కార్యక్రమాల్ని పెద్దయెత్తున చేపడుతూనే వుండాలి.
మిత్రులారా! ఇవన్నీ మీలో కొందరికైనా ఎంతో స్పష్టంగా తెలుసున్నవే. మరికొందరికైతేనో ఎంతో కొంతమేర తెలుసుండవచ్చు. అయినా, క్రొత్తగా ఇటువైపు తిరిగిన వారికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం వుంది. అందుకే ఈ కొద్దిపాటి వివరణ చేశాను.
చాలాకాలంగా, అటు రాజ్యంగానీ, ఇటు ఉద్యమాలుగానీ ప్రజలదగ్గరకు చేరవలసినంతగా చేరలేదని వేదికలోని ముఖ్యులు అనుకుంటున్నదే. అందుకే (1) విద్యాలయాల ద్వారా యువతను కలుద్దామనీ, (2) గ్రామాభివృద్ధి కమిటీల నిర్మాణం చేస్తూ, ప్రజల దగ్గరకు ఉద్యమాన్ని తీసుకెళదామని అనుకున్నాము. ఆ రెంటినీ కలుపుకుని, అందుబాటులోకి వచ్చిన ఒక చట్టాన్నీ ఆధారం చేసుకుని, ఒక ఐక్య కార్యాచరణను రూపొందించుకుందాం, అన్న ఉద్దేశ్యంతోటే రేపటి ఆ సమావేశం ఏర్పాటవుతోంది. దానిలో భాగంగానే మీకూ ఆహ్వానం పంపుతున్నాము.
ఏ కలివిడి యత్నమైనా ముందుగా అనేకుల మధ్య మంచి సంబంధాలు ఏర్పరచుకోడంతోనే మొదలవ్వాలి. కనుక రేపటి సమావేశానికై ఎంపిక చేసుకున్న మీరంతా పూర్తి సంసిద్ధతతో సమావేశానికి రండి. తగిన ఏర్పాట్లు సక్రమంగా చేయడానికి వీలుగా ఒకింత ముందుగా (జనవరిలోపు) మీ రాక గురించీ, ఎంతమంది వస్తున్నారన్నదానిని గురించి సమాచారం అందజేయండి. మరొకరితో ముడిపడివున్న పనులలో 'సమయపాలన' అత్యంత కీలకమైనది. ప్రాథమికమైనదికూడా. కనుక సకాలంలో సమావేశానికి చేరండి. పూర్తి సమయాన్ని, మనస్సును విషయంపై పెట్టండి. సమావేశం 31వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12-30 గంటల వరకు - మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వుంటుంది.
30వ తేదీ రాత్రికే ఇక్కడకు చేరగలిగితే మంచిదే. లేదంటే 31వ తేదీ ఉదయం 8 లోపు కేంద్రానికి చేరవలసి వుంటుంది.
సమావేశ స్థలము - రావలసిన విధానము :
1) నల్గొండజిల్లా, కోదాడ సమీపంలోని దోరకుంట గ్రామం (సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయం)
2) ఇది విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై విజయవాడ నుండి 90 కి.మీ. దూరాన హైదరాబాద్ నుండి 190 కి.మీ. దూరాన వుంది. ఖమ్మం వైపు నుండి వచ్చువాళ్ళూ కోదాడ వచ్చి దోరకుంట రావచ్చును. కోదాడకు చేరి ఫోన్‌చేసినచో మిమ్మందుకోగలము. మా ఫోన్ నెంబర్లు : 94404 74404, 08683-217630, 98480 36063చ 9247118286, 94908 80543.
3) మండలి ఆవిర్భావానికి మొదటినుండి శ్రమించిన ఒకరిద్దరి క్లుప్త ప్రసంగం.
4) ఐక్యంగా అందరం కలసి-ఏదో ఒక్క విషయంపై కొంతకాలం పెద్దయెత్తున పనిచేయాల్సిన ఆవశ్యకత.
3) గ్రామాభ్యుదయోద్యమం, యువతను మేల్కొల్పుట, గ్రామాభివృద్ధి సంఘాల రూపకల్పన, ఏర్పాటు.
4) 'అవినీతిపై పోరు' నినాదంతో, సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా వినియోగంలోకి తేవడానికై 1 సం|| అవధిగా, ఐక్య కార్యాచరణ రూపొందించుకోవడం గురించి.
No comments:
Post a Comment