సమాచారహక్కు చట్టాన్ని వినియోగంలోకి తేవడానికై....
1) ఐక్యవేదికగా ఉద్యమనిర్మాణం చేయాలి. 1 సం||పాటు పూర్తి సమయాన్నివ్వగలవారిని ఉద్యమ నిర్మాణ మరియు చాలక మండలిగ ఏర్పరచుకోవాలి.
2) ప్రచార విభాగాన్ని ఏర్పరచుకుని, వారికి అవగాహన, కుశలతల నలవరచడానికై శిక్షణ కేంద్రాన్ని ఆరంభించుకోవాలి. మొత్తమ్మీద 200 మందిని ప్రసంగీకులుగ మలచుకుని ప్రచారంలో వినియోగించాలి. అందుకు తగిన ప్రచార సాధనాలను సిద్ధంచేసుకోవాలి.
3) మిత్రసంస్థలూ, ఉద్యమాభిలాషకల మిత్రులూ పూనుకుని అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరుల్ని సమకూర్చుకోవాలి.
గమనిక : ఈ విషయంలో సత్యాన్వేషణ మండలి తనవంతు బాధ్యతను, భాగస్వామ్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా వుంది.
4) ఉద్యమాలలో పనిచేయడానికీ, స్థానికంగా కార్యక్రమాలలో పాల్గొనడానికీ యువతను రాబట్టే పనిచేయాలి. అందుకై విద్యాలయాలలో ప్రసంగాలు, గోష్ఠులు ఏర్పాటుచేస్తూ వుండాలి. యువతలో సామాజిక స్పృహను, ఉద్యమాభిలాషను కలిగించాలి.
5) జిల్లాలు, పట్టణాలలో ఉద్యమకమిటీలను ఏర్పరచుకుని వారికీ అవగాహన, ఆచరణలో శిక్షణ గరపాలి.
6) వనరులు సమకూరుతున్నంతమేర ఆయా కార్యాలయాలవద్ద సేవ, నిఘా కేంద్రాలను ఏర్పరచుకుని, సమాచారాన్ని పొందడాన్ని ప్రజలకు, సమాచారాన్ని ఇవ్వడానికి ఉద్యోగులకు అలవరచాలి.
గమనిక : మన ఈ ఉద్యమానికంతటికీ ఆయువుపట్టు వీటిని విస్తృతంగా, శక్తివంతంగా నిర్వహించడంలోనే వుంది.
7) వీటి నిర్వహణకై పెద్దతరాన్ని సిద్ధంచేసుకోవాలి. ఉద్యోగవిరమణ చేసినవారూ, సీనియర్ సిటిజన్సు, స్వతంత్ర సమరయోధులు, విశ్రాంత సైనికులు (ఎక్స్-మిలిటరీ) అన్న సమూహాల నుండి యోగ్యులను ఎంపిక చేసుకోవచ్చు.
8) దీర్ఘకాలం ఈ కేంద్రాల నిర్వహణ అవసరం కొంతమేర వాటి ఖర్చులనూ ఉద్యమం భరించే ఏర్పాట్లు చేసుకోవాలి.
గమనిక : ఉద్యమం మొత్తంలో పెద్దసంఖ్యలో వ్యక్తులు అవసరపడే స్థానం ఇదే. మనం రాశి, వాసిని సమకూర్చుకోవడంలో పెద్దయెత్తున పనిచేయాల్సిన చోటూ ఇదే. నా లెక్కప్రకారం మొదటిథలో వందలలో, మలిథలో వేలలో వీరు అవసరమవుతారు.
9) సమాచార సేకరణకై, రాష్ట్ర, జిల్లా, పట్టణ, గ్రామపాలన, నిర్వహణాలయాలపై దృష్టిపెట్టి దరఖాస్తులు పెట్టే, పెట్టించే పనికి పూనుకోవాలి.
10) సత్వరం స్పందించని బాధ్యులపై కేసులు వేయడానికై ఒక న్యాయ విభాగాన్ని ఏర్పరచుకోవాలి. న్యాయవాదుల సేవలను తీసుకుంటూ, వ్యాజ్యానికయ్యే ఖర్చులు మాత్రం ఉద్యమమే భరించేలా ప్రణాళిక రచన వుండాలి.
11) సలహా మరియు సహాయ మండలిగ ప్రసిద్ధుల్ని, అభ్యుదయాకాంకక్షుల్ని కూర్చుకుని ఉద్యమానికి ప్రధాన వెన్నుదన్నుగ వారిని ఏర్పరచుకోవాలి.
యోచనాశీలురైన మిత్రులారా! పై అంశాలలో విపులమైన, స్పష్టమైన అవగాహన కలిగించుకోడానికీ, దృఢమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోడానికీ మనమధ్య కొంత-ఎంతో-మేధో మధన జరగాల్సి వుంది. అందుకొరకే ప్రాథమిక సమాచారంగా ఈ అంశాలను మీముందుంచాను. ప్రజల్ని చైతన్యపరచాలంటూ మొదలైన ఉద్యమాలూ చైతన్యవంతంగా లేకపోవడం నిజానికి దానికదే ఒక పెద్ద వివాదం. ముందు మనం ఈ స్థబ్ధత నుండి బైటపడాలి. చైతన్యవంతులం కావాలి.
'అవగాహన, క్రియాశీలత, కార్యకుశలత' అన్న మూడూ సమకూడి వున్నపుడే ఉద్యమాలు చైతన్యవంతంగా ఉన్నట్లు. అది జరగాలంటే మనసున్న మనుషుల్ని వెదకిపట్టుకుని వారికి అవగాహన, ఆచరణలకై శిక్షణనిచ్చుకోవాలి. 'అధ్యయనము, శిక్షణ'ల నిరంతరాయతకై శిక్షణాలయం తక్షణావసరం. శిక్షణ, శిక్షణ, శిక్షణ ఇదే ముందుపని.
No comments:
Post a Comment