ముందుమాట
1) సమాజహితకాంక్ష, సత్యాసత్య వివేచనా చతురత, తత్వజిజ్ఞాస కలిగి సత్యాన్వేషణా తత్పరతతోనున్నవారికి,
2) ఏదో ఒక తాత్విక ధోరణిని భుజానికెత్తుకుని, దానిని సమాజం నెత్తికెత్తడానికి యత్నిస్తున్న ఆయా ప్రచారకులకు,
3) రకరకాల ప్రచారాల హోరును వింటూ, వారు జనింపజేస్తున్న గంద్రగోళంవల్ల అయోమయావస్థలోనున్నవారికీ,
4) వ్యక్తిగత, వర్గ, రాజకీయ, మతప్రయోజనాలనాశించి తమ సమూహాన్ని పెంపు చేసుకోవాలనుకుంటున్న స్వార్థపరులకు;
5) తాము గుడ్డిగా నమ్మిందే కాకుండా మరికొందరినీ నమ్మించడానికి నిజాయితీగానే యత్నిస్తున్న అంధానుసరణశీలురకు, వ్యాపారులకు,
సత్యాన్వేషణ మండలి, రండి! దీనిని సాకల్యంగా పరిశీలించండి! పరీక్షించి చూసుకుని సత్యాన్నాకళింపు చేసుకోండి! అంటూ ఆహ్వానిస్తోంది. అయితే అట్టివారందరికీ దీనిలోనికి ప్రవేశించబోయేముందు పరిశీలనకు, పరీక్షకు న్యాయం జరిగేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోండంటూ సూచిస్తోంది. అట్టి జాగ్రత్తలలో కొన్నివిగో, అవధరించండి.
1) పరిశీలనాంశపు ఎంపిక : అభిప్రాయాలు నిర్దిష్టరూపంలో వుండాలి. కలగాపులగంగా వుండకూడదు. కనుక ఒక సిద్ధాంతంగా చెప్పబడుతున్న దానిలో ఏయే విషయాలపై ఎట్టి అభిప్రాయాలు ప్రకటింపబడ్డాయో ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ భావజాలం క లో ఒక్కోదానిని దేనికదిగా విడదీసి దాన్ని దానిగా సత్యాసత్య పరీక్షకు లోనుచేయాలి. అందుకై సిద్ధాంత విచారణలో విహంగవీక్షణం కూడదంటున్నాం. స్థావీపులా
2) సత్యాన్వేషణా తత్పరత, సత్యస్థాపనోద్ధతి, సత్య స్వీకరణకై సంసిద్ధత అన్న మూడు లక్షణాలు కలిగి వుండాలి.
3) పరిశీలించే సందర్భంలో, పూర్వ నిశ్చితాభిప్రాయాలను ప్రక్కన పెట్టగలగాలి. రాగద్వేషాలుండకూడదు. తన పర భావాల ప్రభావం విచారణపై పడకుండా చూసుకుంటుండాలి.
4) ప్రకటితాభిప్రాయం దానికి సంబంధించిన వాస్తవానికి సరిగ్గా సరిపోతోందో లేదో చూసుకోడమే సత్య విచారణ, నిర్ధారణలో అత్యంత కీలకాంశం, చివరి అంశం కూడా. వేదికలో వున్న అన్ని పక్షాలకు ఈ విషయం తెలిసుండాలి.
5) ఏదైనా ఒక భావాన్ని, తప్పనిగాని, ఒప్పనిగాని ముందే నిర్ణయించుకుని వున్నట్లయితే, ఇక విచారణ, పరీక్షలకు అవకాశమే వుండదు. కనుకనే అర్థపరీక్షా శాస్త్రమైన (ప్రియతేః అర్థ పరీక్షణం న్యాయం) తర్కశాస్త్రం. సంశయించక విచారించడం కుదరదు'' అన్న నియమాన్ని ఏర్పరచింది. కనుక, మన పరిశీలనమంతా ప్రకటితాభిప్రాయం తప్పా, ఒప్పా, తేలిందా? తేలనిదా? మంచా, చెడా! పాక్షికమా? నిష్పాక్షికమా? దోషసహితమా; దోషరహితమా? సంపూర్ణమా, అసంపూర్ణమా? లాంటి ప్రశ్నలతోనే ఆరంభమవుతుంది. అవ్వాలికూడా. ఆ విచారణ చివరకు, ప్రకటితాభిప్రాయం సరైందేననో, సరికానిదనో, అనిర్ధారితమనో తేల్చి తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
గమనిక : ఈ మూడు నిర్ణయాలలో ఏ నిర్ణయం విచారణ పరిశీలన పర్యవసానంగా ఏర్పడుతుందో, ఆ అభిప్రాయమే అక్కడికి ఒప్పని నిర్ధారణైనట్లు. పరిశీలన ఫలితాలు. తప్పు (అసత్యము), ఒప్పు (సత్యము) అనిర్ధారితము. అన్న మూడు రూపాలలోనే వుంటాయన్నది అత్యంత ప్రధానమైన సూత్రము. దీనిని అంగీకరించక సక్రమ విచారణే సాధ్యపడదు.
6) ప్రయోం చేసి చూసుకోడానికి వీలున్న అభిప్రాయాలవరకే సత్యాసత్యాలు తేల్చుకోవడానికి వీలవుతుంది. అలాంటి అవకాశం లేని ప్రతిపాదనలన్నీ అనిర్ధారితాంశాల జాబితాలో చేర్చడమే సరైన పద్ధతి అవుతుంది. గత్యంతరం కూడా లేదు (ఈ విషయంలో మరో దారీలేదు).
7) చదవటం, వినడం ద్వారా వచ్చిన అభిప్రాయాలు, ఊహద్వారా ఏర్పడ్డ అభిప్రాయాలు, ఆ వ్యక్తికి సంబంధించినంతలో అనిర్ధారితాలే అవుతాయి. మరో వ్యక్తికి అవి నిర్ధారితాంశాలైయ్యే అవకాశం వున్నప్పటికీ,
8) ఇంద్రియాతీత విషయాలు విశ్వంలో ఎన్నో వున్నై. ఇంద్రియాతీతాలంటే అభేదికాలని అర్థంకాదు.
9) జ్ఞానానికి-విశ్వానికి ఉన్న తేడాని స్పష్టంగా గ్రహించకుండా కొన్ని ముఖ్యమైన విషయాలలో సత్యాసత్య వివేచన సజావుగా సాగనే సాగదు.
తెలియని తనమున్నంతమేర వాటి జ్ఞానం కలిగిందనకూడదు. జ్ఞానం ఉందన్నంతవరకు తెలియనితనం వుండదు-విశ్వాసంలో అజ్ఞాన భాగం తప్పనిసరిగా వుంటుంది. జ్ఞానభాగంలో విశ్వాసాలుండవు. అంటే ఎక్కడ విశ్వాసమో అక్కడ అజ్ఞానముందని, ఎక్కడ జ్ఞానమో అక్కడ విశ్వాసం వుండదని అర్థం.
10) తేలిన విషయాలు, తేల్చుకోడానికి వీలున్న విషయాలతో క అన్న ముగింపు రానేరాదు. రాకూడదు. ఒచ్చిందంటే, నిజానికింకా ఆ విషయం తేలనిదైనా అయ్యుండాలి. విభేదించుకున్నవారిరువురికిగానీ, ఏ ఒక్కరికైనాగాని అదింకా తెలియని, తేల్చుకోనిదైనా అయ్యుండాలి. అదీకాదంటే తేల్చగల విధానాన్ని వినియోగించకుండా, తప్పుపద్ధతి పరిశీలన చేసుండాలి. ఎవరిలోగాని, ఎంతోకొంతమేర గుడ్డినమ్మకం పనిచేస్తూనైనా వుండాలి. శాస్త్రీయ దృక్పథం కలిగివుండి, శాస్త్రీయ పద్ధతి తెలిసి వినియోగించిన సందర్భంలో సత్యం దగ్గరకు చేరడం, దానిని సర్వులూ అంగీకరించడం అన్నదే ముగింపుగా వుంటుంది.
11) భాషపైన ఆధారపడే విచారణంతా వుంటుందిగనుక, ఎవరమైనా భాషాపరిమితులకు లోబడే అభిప్రాయాలను వెలిబుచ్చడం, అర్థాన్ని-భావాన్ని-గ్రహించడం చేస్తుండాలి. అన్నవాడు చెప్పదలచుకున్న అర్థానికి వేరైన అర్థం విన్నవాడు గుంజకూడదు. అది కుటిల వైఖరి అవుతుంది. తార్కిక నియమాలలో 'చలం' చేయడమంటారు దానిని. అది సత్యాన్వేషణా పదరిలోనున్నవారి లెక్కప్రకారం దుర్మార్గం కూడా.
12) ''అనుద్దిష్టార్థ పరికల్పనాఛలం'' క సరైన విచారణ దృష్టినుండి ఎన్నడూ ఎవ్వరూ చేయకూడనంత పెద్దతప్పు. సదుద్దేశం ఉన్నవారెవరూ ఆదారి పట్టరు. ఒకవేళ ప్రమాదవశాత్తుగాని ఆ తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకునేందుకు తొందరపడతారు. కనుక మిత్రులారా! ఆదారి మనకొద్దు.
13) విచారణే వ్యక్తి అవగాహనేపాటిది? అన్నదానికొరకే అయితే, వ్యక్తినొక్కనినే పరిశీలనకు లోనుచేయాలి. అతనికి వేరెవరూ సహాయపడకూడదు. సహాయపడనీకూడదు, సహాయం తీసుకోకూడదుకూడా.
14) అదేమరి విచారణ విషయ ప్రధానమైనదైనపుడు ఒక్కడే మాట్లాడాలి అన్న నిబంధన ఉండకూడదు. ఎందరు కలసైనా, విషయ ప్రతిపాదన చేయవచ్చు. ముందుగా ఒకరుచేసిన ప్రతిపాదన, మరింతమంది, మరింత తెలిసినవాళ్ళు సమకూడడంవల్ల సరిచేసుకోవలసినదని తెలిస్తే, సరిచేసుకునే అవకాశం-వెసులుబాటు-ఉండాలి. అయితే, అప్పుడైనా ఇదమిద్దంగా విషయ ప్రతిపాదన ఇది అని ప్రకటింపబడాలి. ఆపైనే విచారణ మొదలెట్టాలి.
15) ఏపక్షంవారైనా, ఏ విషయంపైనగానీ ఒక నిర్దిష్టరూపంలో ప్రతిపాదన-అభిప్రాయప్రకటన-చేసి, ఇది సత్యము అనంటున్నారంటే, ఆ విషయం తనకు తెలుసని, సరైందేనని తేల్చుకున్నాననీ, మీకూ తేల్చి చూపగలననీ అంగీకరిస్తున్నారన్నట్లే, సత్యాసత్య విచారణ వేదికలో ఇది అందరూ అంగీకరించి తీరాల్సిన నియమం.
16) ఒక విషయాన్ని విచారణకు స్వీకరించాక, అది ఒక ముగింపుకు వచ్చేంతవరకు మరో అంశాన్ని (ఇతరేతరాంశాలను) చర్చలోకి లాగకూడదు. ముఖ్యంగా ప్రతిపాదకపక్షంలోనివారు ఎదుటివారి విషయాలను ప్రశ్నించే పనికి పూనుకోరాదు.
17) ఒక విషయాన్ని విచారణకు తీసుకుంటున్నప్పుడు, ఆ విషయాన్ని మొట్టమొదట ప్రకటించినవారి భాష వేదికకు తెలుసుండాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం వేదికలో ఆ పక్షాన్ని స్వీకరిస్తున్నవారు, వేదిక అంగీకరించిన భాషలో తమ..న్ని ప్రకటించాల్సి వుంది. లేదా ఆ ధోరణికి సాధికారిక ప్రతినిధులైన వారి అనువాదాల్ని తీసుకోవాలి. ప్రతిపాదకపక్షంలోని అనేకుల మధ్యనే అభిప్రాయ భేదాలు తలెత్తితే, దానర్థం ప్రతిపాదనే సిద్ధంకాలేదని. ఆ పక్షంలోనివారే ఒకరినొకరు ఒప్పుకోడంలేదని అవుతోంది. ప్రతిపాదనే సిద్ధంకానపుడు విచారణ దేనిపైన? కనుక సత్యాసత్య విచారణలో ఎంపికచేసుకున్న అంశానికెంత ప్రాధాన్యత వుందో, దాని విషయమై, నిర్దిష్ట ప్రతిపాదనకూ అంతే ప్రాధాన్యత వుంది. కనుక మునుముందు 'ప్రతిపాదనేమిటన్నది' తేలాలి. ఆపైనే ఏ విచారణైనా.
18) ఏ వాస్తవానికి సంబంధించైనా అనేక సత్యాలుండవు. ఇది సర్వులూ అంగీకరింపక తప్పని సర్వసాధారణ సూత్రము క . దీనిని ఏ విచారణీయాంశానికి వర్తింపజేసినా, ఒకే విషయానికి సంబంధించి అనేకాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు సత్యాలయ్యేందుకు వీలులేదు. అట్టి సందర్భాలలో అనేకాభిప్రాయాలలో ఏదోఒకటి సత్యంకావచ్చు. లేదంటే, అన్నీ అసత్యాలూ కావచ్చునన్నమాట కనుకనే శాస్త్రీయ విచారణ పద్ధతిలో నిర్ధారించుకోడానికి వీలైన అంశాలలో క అన్న ముగింపు రానేరాదు. ఆ ముగింపు అనిర్ధారితాంశాల విషయంలోనే సాధ్యపడుతుంది. విచారణ వేదికలో ఇదెంతో కీలకమైన అంశం.
19) వర్తమానంలో ప్రయోగించి చూసుకోడానికి వీల్లేని ఏ విషయంలోగాని సత్యాసత్యాలు తేల్చుకోవడం కుదరదు కనుక, అట్టి విషయాలపై ఎవరు సత్యాసత్య ప్రకటన చేసినా వాటికి చెల్లుబాటు (వ్యాలిడిటీ) లేదా ప్రామాణికత వుండదు.
నేపథ్యం
2007 జులై 24 హైదరాబాద్‌లో, సత్యసందేశం సంస్థకు చెందిన ఫజులుర్ రహ్మాన్‌గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన సమావేశం జరిగింది. సమావేశంలో ఆస్తిక, నాస్తిక ధోరణులకు చెందిన 10, 12 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ ఆస్తికపక్షం నుండి చిన్మయామిషన్‌లో శిక్షణ పొంది, విశ్వహిందూపరిషత్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న ప్రమోదచైతన్య ఇస్లాంపక్షాన, గీటురాయి సంపాదకులు మాలిక్‌గారు, రహ్మాన్, ఫరీద్‌గార్లు మరికొందరూ బైబిల్‌పక్షాన సుధాకర్ మరి ఒకరిద్దరు జైభారత్ నుండి రమణమూర్తిగారు ఆ సంస్థ కన్వీనర్ లోక్‌నాథ్‌గారు, మరికొందరూ, జనవిజ్ఞానవేదిక నుండి టి.వి.రావు, రాజేంద్రప్రసాద్ ప్రేమానంద్‌గార్లూ పాల్గొన్నారు. ఇంకా మానవ వికాసవేదిక, నవ్యమానవవాద సంఘం, హేతువాద సంఘాలు, సత్యాన్వేషణ మండలిలవైపు నుండి మేమంతా ఒక 20 మందిమి వున్నాం. మొత్తంమీద 50 మందిలో ఆ సమావేశం జరిగింది.
నిర్వహణ బాధ్యతను స్వీకరించిన ఫజులుర్ రహ్మాన్‌గారు వేదికలో పాటించవలసిన పద్ధతులను క్లుప్తంగా వివరించి, ఖురాన్ విషయంలో లోకంలో ఎన్నో అపోహలు, అపార్థాలూ వున్నాయని, దానిని రాగద్వేషాలు విడచి, తులనాత్మకంగా పరిశీలించి అర్థంచేసుకోవలసిన అవసరం వుందని, ఆ ఉద్దేశంతో ఆరంభించిందే ఈ వేదిక అనీ అన్నారు. మరోమాటగా తాము సత్యాన్వేషణ మండలి పరిచయంలోకి వచ్చాక, వారి గోష్టుల్లో పాల్గొన్నాక, వారినుండి ఎంతో తెలుసుకోగలిగామని, మరికెంతో తెలుసుకోవలసింది వుందనీ గుర్తించామని, ఆ రకంగా వారి పరిచయం తమకెంతో మేలు కలిగించిందనీ పేర్కొన్నారు.
ఒక సిద్ధాంతాన్ని ఎలా అధ్యయనం చేయాలో, వాటిలోని సబబు బేసబబుల్ని ఎలా విడదీసి చూడాలోనన్న విషయంలో మండలి అనుసరిస్తున్న విధానం నేనెరిగినంతలో అత్యంత శక్తివంతమైనది. ఖురానేగాక, ఏ సిద్ధాంతాన్నైనా అనుసరిస్తున్నవారూ, వ్యతిరేకిస్తున్నవారూ కూడా మండలి వద్దనున్న విచారణ, నిర్ధారణ పద్ధతుల్ని వినియోగించుకుంటూ, వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి వుంది. ప్రతి సిద్ధాంత పక్షపు జనంలోనూ అభ్యుదయవాదులేకాక, స్వార్థపరులు, దుష్టులూ కూడా ఉండే వీలుంది. ఆయా ధోరణులవారు అట్టివారిని వేరుచేసి మంచిని నిలబెట్టుకోవలసిన అవసరం వుంది. లోకంలో ఎప్పుడుచూసినా అధర్మపక్షం ఉన్నంత బలంగా ధర్మపక్షం వుండలేకపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకోవలసి వుంది. వివిధ ధోరణులకు చెందిన పెక్కు సంస్థలు కలసి కూర్చున్న ఈ సమావేశం సఫలీకృతం కావాలంటే మనమంతా ఎంతో సహనాన్ని, సమయమనాన్ని పాటించాల్సి వుంది. ఖురాన్‌కు సంబంధించిన కొన్ని విషయాలు మీముందుంచుతాను. వివరాలు మాలిక్‌గారు అందిస్తారు.
1) ఖురాన్‌ను దైవగ్రంథమని గుర్తించడం ఎలా?
2) ఏ కార్యానికైనా కర్త వుండక తప్పదన్నట్లే సృష్టికార్యానికీ కర్త వుండాలిగదా?
3) మానవ సృష్టి కాలానికి లోబడి వుంటుంది. దైవసృష్టి కాలాతీతమైనది.
4) మనిషి జ్ఞానం పరిమితమైనది, దేవుని జ్ఞానం అపరిమితమైనది.
5) మనిషి జ్ఞానం క్రమక్రమంగా కూడుతూ, పెరుగుతుంటుంది. దేవుని జ్ఞానం ఆదినుండీ పరిపూర్ణమైనదే.
6) నిజానికి, మన పరిమితజ్ఞాన సామర్థ్యంవల్ల ఖురాన్‌లోని ఎన్నో విషయాలు మనకు అర్థంకావడంలేదు.
7) కనబడనివన్నీ లేనివి అనకూడదు. మన అవగాహనలోనే కనపడనివి ఎన్నో ఉంటున్నాయి.
8) సృష్టి నిష్ప్రయోజనం అనకూడదు. ఈ సృష్టికి ఒక ప్రయోజనం వుంది.
ఇంతవరకు చెప్పి మల్లిక్‌గారిని మాట్లాడమనగా, నేను ఖురాన్ ప్రతిపాదించి, వివరించేటంతటివాణ్ణి కాదన్న వాక్యంతో మొదలెట్టారు మల్లిక్‌గారు.
ఇస్లాం అన్నది ఒక మతంకాదు. మతమన్నది మనిషి సృష్టించుకున్నది మాత్రమే. ఇస్లాం అన్నది దైవధర్మం. ఇది మానవుని సహజధర్మం కూడా. ఇస్లాం అంటే శాంతి అని అర్థం. మరో అర్థం లొంగి వుండడం-సరెండర్ కావడం-అని. తనని తాను దైవానికి అర్పించుకోవడం అని దానర్థం. ఆ విషయాలు సరిగా అర్థంకావాలంటే (1) ఖురాను, (2) ప్రవక్త ప్రవచనాలు (హదీసులంటాం వాటిని) అన్న రెంటినీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అర్పించుకోవడం అన్నది విధేయుడైయుండడం అన్న రూపంలో వుంటుంది. (1) దేవుడు, (2) గ్రంథం (ఖురాను), (3) ప్రవక్త (మహమ్మదు), (4) సృష్టి ప్రళయాలు, (5) పునరుత్థానమ్, (6) కర్మ ఫలితాలందడం అన్న ఆరంశాలను విశ్వసించి, వాటి సంబంధంలో ఎలా జీవించమని ఖురాన్ చెపుతుందో అలా జీవించడమే విధేయతకు లేదా స్వయం సమర్పణకు అర్థం.
ప్రవక్తలెందరో వచ్చారు. వారందరినీ విశ్వసించాల్సిందే. ముస్లింగా వుండాలంటే ఇదీ తప్పనిసరే. ప్రళయానంతర జీవితం గురించి నమ్మడం వినా మరో మార్గం లేదు. అయినా మన ఆలోచనకు అందే ఆధారం ఒకటుంది. ప్రపంచగతి వినాశం-ప్రళయం-దిశగా ప్రయాణిస్తోందన్నది ఈనాటి వైజ్ఞానికులూ అంగీకరిస్తున్న విషయం. మరోమాట-
ఇస్లాం కేవలం ముస్లిం ధర్మం అనడం సరికాదు. అది మానవ ధర్మం. మానవులందరి కొరకుగా ఇవ్వబడింది. చాలా ముఖ్యమైన ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇవే ఇస్లాంకు సంబంధించినంతలో మౌలికాంశాలు అంటూ ముగించారు.
గమనిక : అటుపైన శ్రోతల నుండి అనేక ప్రశ్నలు వచ్చాయి. ఖురాన్ పక్షంవారు రెండు మూడు ప్రశ్నలకు వారికి తెలిసిన సమాధానాలు చెప్పి, ఈ రకమైన చర్చలకు ముందు అస్సలు ఖురాన్ దైవ గ్రంథమా కాదా అన్నది తేల్చుకుంటే మేలు అనన్నారు.
దాంతో బైబిల్-క్రైస్తవ-ప్రచారకునిగనున్న సుధాకర్‌గారు, అదే నేనడుగుతున్నదీ. ఖురాన్ దైవగ్రంథమని నిర్ధారించుకోవడం ఎలా? అని ప్రశ్నించారు.
అందుకు ఖురాన్‌పక్షంవారు దైవగ్రంథమనాలంటే - అంటూ 4, 5 సూత్రాలను ప్రకటించారు. అవి :
1) మానవునికి మార్గదర్శనం ఇచ్చేదిగా వుండాలి. అదిన్నీ మూడు కాలాలకూ పనికివచ్చేదిగ వుండాలి.
2) మనిషిని స్వేచ్ఛగా ఆలోచించమని చెప్పివుండాలి. ప్రకృతి రహస్యాలను తెలుసుకోమని అనాలి.
3) అది అందరి మనుషులకు అందుబాటులో వుండాలి. ప్రజలకు అర్థమయ్యే భాషలో వుండాలి.
4) ఇది దైవగ్రంథం. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు అని తన గురంచి తానే తేల్చి చెప్పింది.
మిత్రులారా! ఒక రచనను-పుస్తకాన్ని-దైవగ్రంథమని నిర్ణయించడానికి పై లక్షణాలు సరిపోతాయో లేదో మీరూ ఆలోచించండి. దీని తరువాత పరలోకం అంటే మరో లోకం అనుకోనక్కర్లా, ఈ లోకంలోనే మరో వ్యవస్థ అనుకోవచ్చు అని మల్లిక్‌గారనగా, ఇస్లాంపక్షంలోనుంచే మౌలానాగారు అలాకాదు స్వర్గనరకాలు ఈ లోకంకంటే వేరుగా సృష్టింపబడి వున్నాయి. హదీసులలో మరణించి ఎక్కడకుపోతారో చెప్పబడి వుంది అనన్నారు. అటుతరువాత రహ్మాన్‌గారు అందరికీ అవసరమైనవంటూ కొన్ని ప్రతిపాదనలు చేశారు.
1) మానవత్వాన్ని బోధించని మతం మనకఖ్కరలేదు.
2) సైంటిఫిక్ టెంపర్ అంటే ప్రశ్నించడం, పరీక్షించి చూడడం అన్న విధానాన్ని అందరం అనుసరించాల్సిందే.
3) మతంగనుక, మనిషిలోని విచక్షణాశక్తిని అడ్డుకుంటే దానిని వదులుకోవడమే మంచింది. నేను వదులుకుంటాను.
4) ఉన్న లోపాలను తొలగించుకునే యత్నం అందరూ చేయాల్సిందే.
5) మౌఢ్యానికీ, అవినీతికి మతం ఆధారమవుతుంటే అది మనకఖ్కరలేదు.
6) మతంవల్ల మానవాభ్యుదయం ఏమీ జరగలేదన్నది ఒక తప్పభిప్రాయం.
7) మతం వ్యక్తిగతం, సామాజికం కారాదు. అన్నదీ తప్పభిప్రాయమే. ఎందుకంటే వ్యక్తి-సమాజము అవిభాజ్యాలు.
8) మతంపేరిట జరిగే అమానుష కర్మకాండను నిరశిస్తున్నాం, ఖండిస్తున్నాం.
గమనిక : సభ అంతా ఈ ప్రకటనలపట్ల తమ హర్షామోదాన్ని ప్రకటించింది. మతానుయాయుల్లో ఇటువంటి దృష్టి వుండుంటే ఇప్పటికి జరిగినంత మారణకాండ జరిగుండకపోనుగదా అనిపించింది నావరకు నాకు.
కలగాపులగంగా సాగిందానాటి విచారణంతా. ప్రథమ సమావేశం గనుక సర్దుకుపోదామనుకుని నిగ్గుతేల్చే పనికి పూనుకోలా. పై సమావేశం నుండి ఖచ్చితమైన రీతిలో విచారణ సాగించాలన్న నిర్ణయం చేసుకున్నాం. ఈ వివరాలను వ్రాస్తూ వివేకపథం-133 సంచికలో అధ్యయనానికి అవసరపడే కొన్ని సూచనలు చేశాను. మనం చేయబోయే పనికీ ఆ నేపథ్యం మేలు కలిగించేదే గనుక దానినిక్కడ ఎత్తి వ్రాస్తున్నాను. మీరూ గమనించండి.
ఇతరేతరమైన రకరకాల రచనలు చదవడంవేరు. సమాజంలో బలంగా వేరూనుకుని వున్న మత-తాత్విక-ధోరణులకు చెందిన సిద్ధాంతాలను అధ్యయనము చేయడం వేరు. వీటి దగ్గరకొచ్చేటప్పటికి జనమంతా ఏదో ఒకధోరణికి చెందినవారుగ సాగుతుండే అవకాశాలే మెండు. అట్టివారికి తానంగీకరించిన దానిపైన వుండే మక్కువ ఇతర వాటిపై వుండకపోగా, వాటిపై పరాయిదన్న భావమూ చోటుచేసుకుని వుంటుంది. అట్టి దృష్టి ఎంత బలంగా వుంటే అంతగా సత్యాన్వేషణకు అడ్డంకిగా తయారవుతుంటుంది. ఎక్కడైనాగానీండి! కూలంకష విచారణ జరక్కుండా తప్పొప్పుల్ని నిర్ధారించడం సాధ్యపడదు. సరికాదుకూడా. కనుక ముందుగా, విచారణకు తీసుకున్న ధోరణిలో చెప్పబడ్డ విషయాలెన్నో, వాటిని గురించి ఏమని చెప్పబడిందో తేల్చుకోవాలి. అంటే, అక్కడికి పరిశీలనాంశం (ప్రతిపాదన) మనకు అందిందన్నమాట. ఇక పరిశీలనలో ముందుగా, వాటిలో తేలినవెన్నో తేలనివెన్నో విడదీయాలి. తేలినవాటిలో తప్పని తేలినవెన్నో, ఒప్పని తేలినవెన్నో చూడాలి, అటుపైన తేలనివానిలో తేల్చుకునే అవకాశం వున్నవెన్నో, తేల్చుకోడానికి అవకాశం లేనివెన్నోనూ వేరుచేయాలి. ఇంతవరకు పరిశీలన సజావుగా సాగిందనుకుందాం. ఆపైన వాటివాటి విషయంలో మన వైఖరి-ఆచరణరూపం-ఎలా వుండాలో ఆలోచించండి. నా లెక్కప్రకారం సత్యాన్వేషణా తత్పరత, చిత్తశుద్ది గనక వుంటే, ఒప్పని తేలినవాటిని స్వీకరించాలి, తప్పని తేలినవాటిని విడిచివేయాలి. తేలని వాటిలో తేల్చుకోడానికి వీల్లేని వాటినసలు పట్టించుకోనే కూడదు. తేల్చుకోగల వాటి విషయంలో అవసరమైనమేర తెలుసుకుంటానికి, తేల్చుకుంటానికీ యత్నించవచ్చు. మన అధ్యయనం మొత్తానికీ ఇదే ఆయువుస్థానం. ఈ లక్ష్యం లేకుండా చేసే యత్నాలన్నీ శ్రమదండుగ పనులే. ఈ విధానానికి సిద్ధపడి వుండగలగడమే అధ్యయనపరుని యోగ్యతలకు సంబంధించినంతలో ప్రధానార్హత. అటుపైన ఆవేశకావేషాలకు లోనుగానితనంతోబాటు, తార్కిక ప్రజ్ఞ అంటే హేతుబద్ధాలోచనా సామర్థ్యము, నిశితదృష్టి కూడా తోడుపడితేగాని అధ్యయనాలు సత్ఫలితాలనీయవు. మరోమాట, మన శ్రమంతా భాషనాధారం చేసుకునే యోచనపైనే ఆధారపడి వుంటుంది గనుక బాషపై పట్టుకూడా తప్పనిసరౌతుంది.
ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, భాషపై పట్టు, శాస్త్రీయ దృక్పథం (దీన్నే వాస్వఇకదృష్టీ అనవచ్చు), సత్యస్థాపనోద్ధతి, సత్యాసత్య నిర్ధారణాపద్ధతిని అమలు చేయగల వడుపు కలిగి నిబద్ధతతో చేసే పరిశీలనే అధ్యయనమంటే. ఆ దారిలో స్థిరంగా సాగగలవారినే అధ్యయనపరులు అననాలి.
సమష్టి అధ్యయనం, విచారణలాంటి అనేకులు కలసి చేయాల్సిన పనుల సందర్భంలో ముందుగా పాటించాల్సింది సమయపాలన. ఎంపిక చేసుకున్న చోటికి, అనుకున్న సమయానికి అందరూ చేరడం. దానితోబాటు మీటకు కట్టుబడి వుండడం, చేస్తానన్న పని మనస్సుపెట్టి చేయడం అన్న రెంటినీ ఆచరించడం జరగాలి. వీటిని మండలి మొదటి మూడు ప్రతిజ్ఞలు అనంటోంది. ఈ మూటిపైనా మనస్సుపెట్టి, ఆచరణలో చూపెట్టని వాళ్ళతో కలసి చేద్దామనుకున్న పనులేవీ ఒక కొలిక్కిరావు. విచారకరమైన విషయమేమంటే, సమాజంలో ఎక్కువలో ఎక్కువ మంది ఈ మూడంశాలను అంతగా పట్టించుకోకపోవడం. మామూలు జనం అలా ప్రవర్తించడాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలంగానీ, సమాజాన్ని బాగుచేయాలి, చేస్తాము అంటున్న వాళ్ళలోనూ ఇదే వైఖరి వుండడాన్నే అర్థం చేసుకోవడం కష్టమవుతోంది.
మన శీర్షికాంశమైన 'సృష్టివాదమా? పరిణామవాదమా?' అన్నది అటు విశ్వాసులదో, ఇటు వ్యతిరేకులదో కాదు. ఇది ఆస్తిక-నాస్తికపక్షాలదేకాక, వాటి సబబు బేసబబుల్ని పట్టిచూద్దాం, నిజమేమిటో కనుగొందాం అనే ఉద్దేశం కలవాళ్ళది కూడా. కనుక ఇందులోని ఏ పక్షానికి చెందినవారుగానీ, విచారించుకునే నమ్మమనో, దీనికింత విచారణెందుకు కొట్టేయమనో అననేకూడదు.
అలాగే సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి మూల గ్రంథాలను పట్టిచూడడమే సరైన విధానం. అదే దగ్గరి దారికూడా. వ్యాఖ్యానాల దగ్గరకు పోయామంటే వ్యాఖ్యాత భావాలనే సిద్ధాంత భావాలుగ పొరబడే అవకాశాలు కోకొల్లలు.
గమనిక : అనువాదానికి వ్యాఖ్యానికి చాలా తేడా వుంది. అనువాదం, రెండు భాషలూ తగినంతగా తెలిసనవారు చేసినపుడు దానినీ మూలగ్రంథమనే అనాలి. అదేమరి వ్యాఖ్యానమైతే అది మూలగ్రంథం మొదట వ్రాయబడ్డ భాషలో వున్నా వేరే భాషలలో వున్నా దానిని మూలగ్రంథం అనకూడదు. మూలంలో చెప్పినదానిని తన దృష్టికోనం నుండి వివరించడాన్నే వ్యాఖ్యానం అంటారు. విషయం అర్థమవుతునే వుందనుకుంటాను. భాషాపరంగా ఇక్కడో నియమం వుంది.
వక్త హృదయం ఇదేనని నిర్ణయించే అధికారం ఏ వ్యాఖ్యానకారునికీ లేదు.
వివరణ : అయితేగియితే మూలంయొక్క భావాన్ని ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుందనో, నా దృష్టి ఇదనో అనగలరతడంతే. కనుక, ఆయా సిద్ధాంతానుయాయులు ప్రతివాదులు, పరిశీలకులు చూపిస్తున్న అనువాదాలు సరైనవికాదు అన్న వాదాన్ని లేవనెత్తరాదు. కావాలంటే మూలానికి అనుగుణ్యతలేని, మూలంతో సరిపోని అనువాద గ్రంథాలను ప్రకటించి నిషేధించాలి. అలాంటి అపసవ్యానువాదాలు చేసినవారిని కట్టడి చేసుకోవాలి. అన్నిపక్షాల వారికీ సమానంగా వర్తించే నిబంధనే ఇది.
ఈ నిబంధన ననుసరించి 'ఇస్లాం' సిద్ధాంత విచారణ సాగించాలంటే మనకున్న మూలగ్రంథాలు రెండే. (1) ఖురాను, (2) హదీసులు. ఇక్కడ కూడా ఖురానును దానికదిగా అర్థంచేసుకుని విచారించడమే ఉత్తమ మార్గం. ఆ దారిలో దాటటానికి వీల్లేని ఆటంకం ఏర్పడిందనిపించినపుడు హదీసుల్ని పట్టిచూడాలి. అదైనా ఎందుకంగీకరిస్తున్నామంటే, ఖురానే మహ్మదు జీవితం ఆదర్శనం అనంటోంది, ఇస్లాం ఖురానును ప్రవక్తనూ విశ్వసించమంటోంది. ఇస్లాం సాంప్రదాయం మహమ్మద్ సూక్తులను ప్రామాణికాలుగా స్వీకరిస్తూ వస్తోంది; కనుక. ఈ రెంటికి వేరుగా ఎవరు మాట్లాడినా, వివరణ యిచ్చినా వాటిని ఇస్లాం భావాలుగ పరిగణించనక్కరలేదు.
గమనిక : ఏ సిద్ధాంత విచారణ సందర్భంలోనైనా ఇదమిద్ధంగా, ఇదే ఆ సిద్ధాంత భావజాలం అని గిరిగీసితీరాలి. లేకుంటే విచారణ ఒక ముగింపుకేరాదు. అందుకే చర్చావేదిక నియమ నిబంధనలలో వాదప్రతిపాదన జరగాలి ముందుగా అన్న నియమం ఏర్పడింది. దీనిని విచారణకు సిద్ధమైన వారందరూ సదా గుర్తులో వుంచుకుని తీరాలి.
ఈ థలో రహ్మాన్‌గారు కల్పించుకుని, నా వరకు నాకు ఇవన్నీ అవసరమనే అనిపిస్తున్నాయి. ఇంకా సరిగా చెప్పాలంటే ఇవి లేకుండా అధ్యయనం సరిగా జరగదనీ అనిపిస్తోంది. ఇవి అక్కరలేదనేవాళ్ళుగాని, ఇంతకంటే మెరుగైన సూచనలున్నాయనుకునే వారుగాని ఆ వివరాలివ్వండి. వాటినీ చూసుకుని అవసరమైన వాటిని స్వీకరించుదాం. ఎందుకంటే ఇక్కడ ఏకాభిప్రాయం కుదరకుంటే విచారణే సరిగాసాగదు. అనంటూ ఆరంభానికి కావలసిన సరైన వాతావరణాన్ని స్థిరపరిచారు. సదస్యులంతా కొంతతడవు ఆలోచించుకుని, అంతా సవ్యంగానే వుంది. మాకంగీకారమే ఈ సూత్రీకరణలు అనన్నారు. 'అధ్యయనం' చేయడమెలాగన్నదానిపై ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనగా, అలాగేనన్నారందరూ.
'హేతువాదం-హేత్వీకరణ' అన్న వ్యాసంలోని మొదటి పేరాను తీసుకున్నాం. పాఠకులకు ప్రయోజనకరంగా వుంటుందని దానినిక్కడ పొందుపరుస్తున్నాను.
''హేతువు అనేదాన్ని ఆంగ్లంలో 'రీజన్' అనే పదానికి సమానార్థకంగా మనం వాడుతున్నాం. వాడుకలో హేతువంటే కారణం అనే అర్థంకూడా వుంది. కావున చాలామంది హేతువాదమంటే కార్యకారణ సంబంధంతో కూడిన వాదమని భావిస్తుంటారు. హేతువాదమంటే కేవలం కార్యకారణవాదం కాదు. కేవలం తర్కంకూడా కాదు. ప్రతిదానికీ కారణమున్నపుడు కారణానికి కూడా కారణం ఉండాలికదా? ఇలా పొడిగిస్తే ఆ కారణంవద్ద కార్యకారణవాదం స్థంభించిపోతుంది. అక్కడే మతస్తులు దేవుడిని కూర్చోబెట్టి దానిచుట్టూ తిరుగుతూ ఆగిపోతారు. హేతువాదం అలా ఆగిపోదు. ఆ కారణం ఎలా స్వయం కారణమో వివరిస్తుంది. ఆద్యంతాలనేవి అనంత విశ్వంలో లేవనికూడా విశదపరుస్తుంది. అందువల్ల హేతువాదమనేది ఒక వాదంకానీ, ఒక సిద్ధాంతంకానీ కాదని తెలుస్తుంది. అది శాస్త్రీయమైన ఆలోచనా విధానం. సక్రమమైన మానసిక వైఖరి''.
ఈ వాక్యాలను అందరూ చదివారుకదా! అయితే అందులో ఎన్ని అభిప్రాయాలు ప్రకటింపబడ్డాయంటారు? ఏయే విషయాలపై ఏయే అభిప్రాయాలను వెలిబుచ్చాడు ఆ గ్రంథ రచయిత? నిర్దిష్టంగా చెప్పండి మీరున్నూ.
ఆనాటి సభలో వున్నవారు ఒకరు 4 అంటే, ఒకరు 11 అన్నారు. 9 అన్నారు మరికొందరు, 8 అనీ, అన్నవారూ వున్నారు. మొత్తమ్మీద ఉన్న పదిమందిలో ఆ చిన్న వ్యాసభాగంలో చెప్పబడ్డ అభిప్రాయాలెన్ని అన్నదానికి 4, 6, 8, 9 11 అన్న సమాధానాలు వచ్చాయి. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు చూడలేకపోతున్నారు జనం అన్నది నిర్ధారణైనట్లే కదా! మరలాంటపుడు యింటివాళ్ళే సిద్ధాంత విచారణకు పూనుకుంటే, ఆ విచారణ ఎంత సొబగుగా సాగుతుందంటారు? అదలా వుంచుదాం. మన ప్రస్తుతాంశమైన 'సృష్టివాదమా? పరిణామవాదమా?' అన్న దానిని విచారణను ఏమిచేద్దాం? ఎలా చేద్దాం? అన్నది ఆలోచించాలి.
- సంశయించక విచారించడం కుదరదు. నిర్దిష్ట ప్రతిపాదన లేకనూ విచారణ కుదరదు. విషయపు ఎంపిక లేక ప్రతిపాదనా వుండదు.
- వక్త హృదయం మనదగ్గరకు చేరిందని నిర్ధారించుకున్నాకనే దాని సబబు బేసబబుల్ని గురించి ఆలోచించడం మొదలెట్టాలి. అందుకుగాను, ప్రతిపాదనలోని ప్రతి పదాన్ని, వాక్య నిర్మాణాన్ని సావధానంగా గమనించాలి.
- ఇక్కడా ఒక నియమం వుంది. పదపదార్థ జ్ఞానం లేనివానికి వాక్యజ్ఞానం కలగదు. అప్పుడూ పదపదార్థ జ్ఞానమేకాక, వ్యాకరణ జ్ఞానమూ వుంటేగాని, ఆ పదాల పొందిక, సందర్భం సరిగా అర్థంకావు. కొన్ని సందర్భాలలో పదోచ్ఛారణ వెనకనున్న ధ్వనికూడా అర్థాన్ని నిర్ణయిస్తుంటుంది.
- మనలో ఏర్పడే అభిప్రాయాలన్నా లేదా మనం ఏర్పరచుకునే అభిప్రాయాలన్నీ ప్రత్యక్ష జ్ఞానక్షేత్రానికి సంబంధించినవిగానో, ఆధారసహిత యోచనకు (తార్కిక జ్ఞానానికి లేదా అనుమాన ప్రమాణానికి) సంబంధించినవిగానో, వినడం, చదవడం ద్వారా ఏర్పడ్డ శబ్ద ప్రమాణజ్ఞానానికి సంబంధించినవిగానో వుంటుంటాయి. కనుక సిద్ధాంత విచారణకు పూనుకున్నపుడు, ఆ సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న అభిప్రాయాలు ఏయే ప్రమాణ క్షేత్రానికీ సంబంధించినవో విడగొట్టుకోవాలి. అప్పుడు మన విచారణ చాలా సులభమవుతుంది. ఈ అంశాన్ని కొద్దిగా విశ్లేషిస్తాను చూడండి.
1) సిద్ధాంతకారునికి ఆ అభిప్రాయం ప్రత్యక్షజ్ఞానం నుండి ఏర్పడిందనుకుందాం. అతడు తెలిసే ఆమాటన్నాడని దానర్థం.
1-ఎ) దానినిప్పుడు వేదికలో ప్రతిపాదిస్తున్నవానికి అదింకా ప్రత్యక్షంగా-సిద్ధాంతకారునికి తెలిసిన విధంగా-తెలియ లేదనుకుందాం. దానర్థం ఈ ప్రతిపాదకునికది శబ్దప్రమాణం ద్వారా-భాషద్వారా అందిన సమాచారమన్నట్లు. అంటే, ప్రతిపాదించే సమయానికి అతనికి సిద్ధాంతకారుడేమంటున్నాడన్నంతవరకే తెలుసుగాని, దాని వాస్తవం ఇతనికింకా తెలిసి లేనట్లే, తెలియదన్నట్లే.
గమనిక : ఇక్కడికిది నిజమోకాదో తేల్చుకోండి.
2) సిద్ధాంతకారునికి అది తార్కిక యోచన నుండి ఏర్పడ్డ అభిప్రాయం అనుకుందాం. దానర్థం ఏమిటి? ప్రతిపాదితాంశం ప్రత్యక్షంగా అతనికి తెలియలేదనేకదా! అంటే ఆధారసహితంగా ఊహించి ఏర్పరచుకున్న అభిప్రాయమే అది అని తీరాలి.
గమనిక : అట్టివాటిలోనూ శాస్త్రీయ ఊహలు, అశాస్త్రీయ ఊహలు (పరికల్పనలు) అన్న రెండు రకాలుంటాయి.
2-ఎ) ఈనాడు వేదికలో ఆ విషయాన్ని ప్రతిపాదిస్తున్నవానికి అది మొదటిదానిలానే శబ్దప్రమాణజన్య అభిప్రాయమే అవుతోంది.
గమనిక :
No comments:
Post a Comment