Thursday, March 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? అందులో చెప్పబడ్డ దేవుడున్నాడా ?

పి.డి. సుందర్రావు అన్నాయన ప్రపంచానికి సవాలంటూ ప్రకటించిన దానికి సమాధానంగా సత్యాన్వేషణ మండలి నుండి సురేంద్ర బహిరంగ లేఖ

అనేకులను పేరుపెట్టి మరీ మొరటుగా, అసభ్యంగా, తొడగొడుతూ, మీసాలు మెలిపెడుతూ ఆయన చేసిన ప్రసంగాల సి.డిలను మూడింటిని నేను జాగ్రత్తగా విన్నాను.

ఆయన అభిమానో, అనుయాయో, శిష్యుడో, బిడ్డడో తెలియదుగాని, నేను కర్నూలుకు, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా సమావేశాలకు రాష్ట్ర బాధ్యునిగా హాజరైన సందర్భంలో, జగద్గురు అన్నాయన నన్ను కలసి బైబిలు విషయాల ప్రస్తావన తీసుకువచ్చారు. వాటి విషయంలో నాకూ ఉన్న అభిరుచికొద్దీ నాదైన శైలిలో కొద్దిసేపు ఆయనతో మాట్లాడాను. దాంతో మళ్ళా కలుస్తానని చెప్పి వెళ్ళారాయన. అటు తరువాత మరోక్రైస్తవ మిత్రున్నీ తొడ్కొనివచ్చి మళ్ళా కొంతసేపు బైబిలు విషయాలు మాట్లాడారు. ఆ సందర్భంలో భాషాపరంగా, పాత క్రొత్త నిబంధనల పరంగా నేను లేవనెత్తిన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పలేక పోవడం, కొన్నింటికి పొరపాటు సమాధానం చెప్పడం, కొన్నింటికి అరకొర సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన, ఆయన వెంట వచ్చినాయనా, వారికి వారే గమనించి మీకు ధైర్యముంటే, మాకంటే ఎంతో తెలిసినవారు, మీలాంటి బైబిలు విమర్శకులకు సవాలన్నవారు, ఎందరినో ఓడించిన వారు, ఎందరికో సింహస్వప్నం వంటివారు అయిన పి.డి. సుందర్రావు గారితో మాట్లాడవచ్చుగదా అనన్నారు. ఆ సందర్భంలోనే దమ్ముంటే, మగతనముంటే లాంటి మొరటుపదాలు కొన్ని ప్రయోగించారు. నిజానికి ఏ సిద్ధాంతవిచారణకైనా కావలసింది నిజాయితీతో కూడిన పట్టుదలేగాని దమ్ములు, కొమ్ములు, రొమ్ములు ఎందుకండీ?! అవసరం లేదు కదా! ఆమాటే ఆనాడు వారితో చెప్పాను.


ఆయా గ్రంథాలలో చెప్పబడ్డ (వ్రాయబడ్డ) అభిప్రాయాలు ఏమేరకు ఒప్పులో ఏమేరకు తప్పులో తెల్సుకోవడానికి నిజానికి ఏయిద్దరూ సవాళ్ళు విసురుకోనఖ్ఖరలేదనీ, ఆయా విషయాలు ఎవరికెంత తెలుసో తెలుసుకోడానికైనా సవాళ్ళు, తొడగొట్టడాలు, సంస్కారహీనంగా మాట్లాడుకోవడాలూ అవసరంలేదని, అందుకు నిజాయితీ, నిజాలు తెలియాలన్న తపన, తేలిన విషయాలను అప్పటి కవి తనకు నచ్చినవైనా, నచ్చనివైనా స్వీకరించడానికి ఏమాత్రం వెనకముందులాడని సంసిద్ధత లాంటి జ్ఞానార్జనాక్రమానికవసరమైన గుణాలుంటేచాలుననీ వారితో అంటూనే, ఎవరికివారు ఎవరివేదికలనుండి వారు సవాళ్ళు విసురుకోవడానికి పెద్దగా విషయం తెలిసుండవలసిన అవసరంగానీ, తెగసాహసంగానీ ఏమీ అవసరంలేదనీ చెప్పాను. ఉదాహరణకు మీరు, మీరనే ఆ సుందర్రావు, ఆయననే వాళ్ళ తండ్రికూడా ఎన్నో విషయాలలో బొడ్డూడనివాళ్ళేనని నేనన్నాననుకోండి, మీరు చేయగలిగిందీ ఏమీలేదు. ఆయనగాని, వాళ్ళ నాయనగానీ చేయగలిగింది కూడా ఏమీలేదు, అనంటూ, కావాలంటే ఇలా అన్నానని మీ జయశౌరిగారికి తెలియజేయండి. చేతనైతే నాదగ్గరకొచ్చి నన్నెదుర్కోమనండి, అనన్నాను.

వాళ్ళిద్దరూ ఒకింత కొపంతెచ్చుకుని, పైకి మాత్రం నవ్వుతూ, నీలాంటి చిన్నాచితకావాళ్ళతో ఆయన పోటీకిరాడు. దమ్ముంటే నీవేవెళ్ళి ఢీకొట్టు. ఏం జరుగుతుందో తెలుస్తుంది అనన్నారు. అప్పుడు వారితో నేను అయ్యలారా! నేనూ అదేగా చెపుతున్నది! ఊరికే ప్రగల్బించే ఆరకం వారితో పోటీపడటానికి నేనేమన్నా పనీపాటా లేనివాణ్ణా? వివేకం లేనివాణ్ణా? నాతో సమఉజ్జీ అనిపించినపుడు, ఆయన నాఎదుట పడ్డపుడు చూస్తాలే ఆయన మీసాల బలుపు, తొడబలుపు ఏపాటివో అని పంపించాను.

లోగడ కూడా గోదావరి జిల్లాలనుండి ఒకాయన, నేను బైబిలుపై చర్చలు జరపడాన్ని గురించి తెలుసుకుని, దమ్ముంటే పి.డి. సుందర్రావు గారిని ఎదుర్కొ, అక్కడితో నీదురద చల్లారుతుందంటూ ఒక లేఖ వ్రాశాడు. చేతనైతే నీపత్రికలో ఆయనకు పిలుపంటూ ప్రకటన చేయి, అన్నాడు. వాడిని ఢీకొట్టు, వీడిని ఢీకొట్టు అంటావెందుకయ్యా, నీకు వీలైతే నీవేరా ఢీకొడతాను. నీతీటనేతీరుస్తానో, నాదురద నీవు తీరుస్తావో తేలిపోతుందిగదా! నీవల్లాకాక, ఊరుకుండబుద్ది కాకుంటే, నీమాటవినేవాణ్ణో, నీదృష్టిలో నాదురద తీర్చగలవాడినో పట్టుకొచ్చుకో, నాఎదుటకొచ్చి యుద్ధమంటే మాత్రం అతడెంతవాడైనా వద్దులెమ్మనను అన్నాను. మా పత్రిక వివేకపథంలో ఒక చిన్న ప్రకటనా చేశాను. వాళ్ళనే ఆ పి.డి.సుందర్రావు అనే ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎవరితో ఏయే విషయాలపై యుద్ధంచేశారో, అవతలాయనేమన్నారో, ఈయనేమన్నారో వగైరా వివరాలను తెలియపరచమని ఆ సంచికలో వ్రాశాను. నాకు లేఖవ్రాసినాయనకు, సుందర్రావుగారికే గాక, అప్పటికి నాపరిచయంలోకి వచ్చి ఉన్న హిందూ, క్రైస్తవ, ఇస్లాం మాతానుయాయులకు, నాస్తిక హేతువాద ధోరణులవారికీ ఆసంచిక పంపాను. దానిపై అటునుండి స్పందనలేదు.

ఇదిగో ఇప్పుడు మళ్ళా ఈ 'జగద్గురు'వన్నాయన ఒక సంవత్సరం పైబడి అప్పుడప్పుడు పి.డి.సుందర్రావు గారి విషయం ఏంచేశారంటూ కదిలించడం, దమ్ముంటే, నిజాయితే ఉంటే ఎదురెళ్ళి ఛాలెంజ్‌ విసరొచ్చుగా అంటూ గిల్లడం, గిచ్చడం, ఆయనగారు సి.డిల రూపంలో బహిరంగ సవాలు విడుదల చేశారు, మీకేమైనా సత్తావుంటే మీరూ ఒక సి.డి. విడుదల చేయండంటూ రెచ్చగొట్టడం చేస్తూవస్తున్నారు. అలాటి సందర్భాలలో మీకు అవసరమనుకుంటే మీరెళ్ళి నావిషయం చెప్పి అయన్ను పిలుచుకొచ్చుకోండి. నాకుగా నేనాయన దగ్గరకెళ్ళి తొడగొట్టాల్సిన అవసరం నాకేమీ లేదు అనంటూవచ్చాను. మళ్ళా ఈనెలలో అంటే 2012 ఫిబ్రవరి 1,2 వారాలలో రెండు సి.డిలు పంపి దానితోపాటు ఒక లేఖా పంపారు అందులో.


1. మీరు బైబిలును విమర్శిస్తున్నారు కదా బైబిలు విమర్శకులకు సవాలంటున్న పి.డి.సుందర్రావు గారితో మాట్లాడరెందుకని?

2. ఆయన సి.డిల రూపంంలో ఛాలెంజ్‌ ప్రకటన విడుదల చేశారు, మీరూ సత్తాఉంటే అలాచేయండి.

3. మీలో నిజాయితీ ఉంటే, మీరు సత్యాన్వేషకులైతే మీ పత్రికలో బైబిలు విషయమై, సుందర్రావుగారినుద్దేశించిన ఒక ప్రకటన ప్రచురించండి అని ఉంది.



అంతటితో ఊరుకోక, ఫోనుచేసి, చేతనైతే సవాలుకు సిద్ధపడు, ఆయన నీలాంటి చిన్నవాళ్ళతో పెట్టుకోడు. నాసా సైంటిస్టుల్నే మట్టి కరిపించాడు. హేతువాద సంఘ పెద్ద వెంకటాద్రి తోకముడిచాడు. నీలాంటివాళ్ళపై పోటీకి తన శిష్యుడెవణ్ణో ఒకణ్ణి పంపుతాడు. అతడు చాలు మీలాటిస్థాయివాళ్ళకు అంటూ మాట్లాడారు. అప్పుడు నేనాయనతో, మాటల్లో నీవెంతోయ్‌ పిల్లకుంకవి అనడానికి పెద్ద సామర్ధ్యాలుండక్కర్లా. మీ పి.డి.సుందర్రావెంత నాముందు బచ్చాతో సమానం అని నేనన్నాననుకోండి ఏమవుతుంది? అంటూ, అలాంటి మాటలు ప్రగల్భాలో, పిల్లచేష్టలో, ఉలిపిచేష్టలో అవుతాయేగాని, యోధులుగానీ, విజ్ఞులుగానీ అలాంటి మాటలు మాట్లాడరు. అయినా ఇంతగా పారుకులాడే మీ అభీష్టాన్నెందుకు కాదనాలి, వచ్చే సంచికలో పి.డి.సుందర్రావు గారినీ దృష్టిలో పెట్టుకుని ఒక వ్యాసం రాస్తాను, ఆయన ఎలా స్పందిస్తారో చూద్దాం అన్నాను. అటు తరువాత జగద్గురుగారు పంపిన సి.డిలు మరోసారి విన్నాను. వాటిలోని పి.డి.సుందర్రావు గారి ప్రసంగంలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.

1. జాకీర్‌నాయక్‌, అతని గురువైన దీదాత్‌, పోపు, పరంజ్యోతి, అనిల్‌, కె.ఎ.పాల్‌, రంజిత్‌ ఓఫిర్‌, పెంతెకోస్తులు, స్వస్థత ఉందంటున్న వివిధ క్రైస్తవ ప్రార్ధనా సంఘాలు, దినకరన్‌, ఇమ్రాన్‌ఖాన్‌, బిన్‌లాడెన్‌, వీరప్పన్‌, స్టీఫెన్‌ హాకిన్స్‌, టి.వి.9, ఇతర టి.వి. చానళ్ళు, రావిపూడి వెంకటాద్రి, ఎన్‌.వి.బ్రహ్మం లాటి హేతువాదులు, ప్రపంచంలోని అనేక సైంటిస్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వగైరాలందరినీ తప్పుబట్టడం, నిందించడం చేశాడు పి.డి.సుందర్రావు.

2. మరోవంక తనగురించి తాను చెప్పుకుంటూ, ఇశ్రాయేలీయుల నాలుగు వందల సంవత్సరముల శ్రమల అనంతరం, తండ్రి ఎంచుకున్న మోషే వీరుడువచ్చాడు. అతని తరువాత 2000 సంవత్సరాలకు నాఅన్న ఏసు వచ్చాడు. తరువాత రెండువేల సంవత్సరములకు నేను వచ్చాను. క్రీస్తు తరువాత 100 ఏళ్ళకే పాడవడం మొదలెట్టి, సాతాను ప్రభావానికి లోనైన, క్రీస్తు సమాజంలో, 1900 ఏళ్ళ తరువాత మళ్ళా ఇదిగో ఇప్పుడు తానే విప్లవం తీసుకువస్తున్నట్లూ చెప్పుకున్నాడు.

3. ప్రపంచంలో తానొక్కడే క్రైస్తవుణ్ణి, బైబిలు తెలిసినవాణ్ణి, క్రీస్తుకు ఈయుగపు వారసుణ్ణి అని చెప్పుకున్నాడు.

4. బైబిలుపైకి గాని, క్రీస్తుపైకిగాని ఎవరైనా వచ్చారా, తొక్కేస్తాను, చంపేస్తాను అనీ అనేశాడు.

5. తానెవరిపేరెత్తితే వాడు చావాల్సిందేనంటూ, బిన్‌లాడెన్‌, దీదాత్‌, సద్దాంహుస్సేన్‌, వీరప్పన్‌ లాటివాళ్ళు పోతారని తానన్నట్లు దాంతో వాళ్ళుచచ్చినట్లు చెప్పుకున్నాడు.

6. దీదాత్‌ తనతోపెట్టుకున్నాడు గనుకనే, నాతండ్రి వాణ్ణి కుళ్ళికుళ్ళి చచ్చేట్లు చేశాడని అన్నారు.

7. జాకీర్‌ నాయక్‌ గాడూ క్రీస్తుమీదకు వస్తున్నాడు. వాడిపేరెత్తుతాను చూస్కోండి వాడూపోతాడు అన్నాడు.

8. పోపు టోపీకోసం వేలాడబడుతున్నాడు. వాడు క్రీస్తువ్యతిరేకులపై పోటీకి సిద్ధపడడు. పదవికావాలి వాడికి అన్నాడు.

9. ఓఫిర్‌ కాదు అద్దంకి రంజిత్‌ పేరు. వాడొక ఓ ఫియర్‌గాడని గేలిచేశాడు.

10. అనిల్‌గాడెక్కడ? రమ్మనండి బైటికి, అరనిముషంలో మట్టికరిపిస్తాను, అంటూనే సభనుద్దేశించి (అనిల్‌ మనుషుల్ని దృష్టిలోపెట్టుకుని అనుకుంటా) మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే అనిల్‌గాణ్ణి నాఎదుటకు పట్టుకురండి అనన్నాడు.

11. క్రీస్తుపేరున ప్రచారంచేస్తున్న వాళ్ళంతా దొంగలు, అలాగే దేవుడు లేడంటున్న వాళ్ళు, నాతండ్రిని, అన్నను అంగీకరించనివాళ్ళు బచ్చాగాళ్ళు. సైంటిస్టులూ బచ్చాగాళ్ళే, వాళ్ళకేంతెలుసు. జ్ఞానం కలిగించుకోవాలంటే సైన్సు పుస్తకాలు చదవక్కర్లా, బైబిల్‌ చదివితే చాలు. నేనే బైబిలు మేధావిని. కాదన్నవాళ్ళను తొక్కేస్తాను, నాకవుట్‌చేస్తాను అన్నాడు.

12. తనజోలికి ఎవరైనా వచ్చారో వారు మట్టికొట్టుకుపోతారని శాపనార్ధాలు పెట్టాడు.

13. వాడు ప్రధానా? ప్రెసిడెంటా, పార్లమెంటా? వాడెవడైనా నన్నడ్డేవాడెవడూ లేడిక్కడ అన్నాడు.

14. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్నే తప్పుబట్టాను, బుద్ధిహీనుల్లారా అని తిట్టాను, వేలెత్తిచూపాను. ఇంతవరకు నన్నెవడూ అరెస్టు చేయలేదు. నన్నరెస్టు చేయడానికి ఖలేజా ఉండాలి. దమ్ము, దమ్ముంటే అరెస్టు చేయమనండి అనన్నాడు.

15. దేవుని చట్టంముందు మానవుడు వ్రాసిన చట్టం పనికిరాదన్నాడు.

16. నాకు దేవుడు లైసెన్సిచ్చాడు, వద్దంటానికి నీవెవడివి? అంటూ గద్దించాడు. అదేంటంటే, గద్దించుము అని బైబిల్‌లోనే ఉందన్నాడు.

17. గత 400 సంవత్సరములుగా బైబిలు ఎవరికీ అర్ధంకాక విచ్ఛిన్నమైపోతూ వచ్చింది. దేవుడు తన మాటలను యథాతథంగా చెప్పగలవాడు రావాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు నేను వచ్చాను అంటున్నాడు.

18. ప్రపంచ మీడియాకు సవాలన్నాడు, బైబిలు ప్రపంచ భవిష్యత్తు చెప్పిందన్నాడు.

19. ఓ తండ్రీ! మీరు కలలుగన్న ప్రపంచాన్ని భూమిమీద మరలా ప్రారంభించాననీ అన్నాడు.

20. ఆరిపోయిన 'ఏసువిప్లవాన్ని' మళ్ళా రగులుకొల్పుతున్నానని చెప్పుకున్నాడు.

21. ఈ సమాజానికి రక్షకుడు కావాలి, అడ్డువచ్చే ప్రతివానిని తొలగించండి అనన్నాడు.

22. తాను చెప్పినవాణ్ణి తండ్రి కుళ్ళికుళ్ళి చచ్చేలా చేస్తాడనీ ప్రకటించాడు.

23. బైబిలే దైవగ్రంథం, ప్రామాణిక గ్రంథం అనన్నాడు.

24. బైబిలుకు భిన్నంగా మీమాటలుంటే మీపని అయిపోయినట్లే అనీ అన్నాడు.

25. సైన్సుకు తెలియని ఎన్నోవిషయాలు బైబిలులో ఉన్నాయి అవి తనకు తెలుసంటున్నాడు. ఇప్పుడవి తనకు మాత్రమే తెలుసంటున్నాడు.

26. బైబిలుతో విభేదించే విషయాలవేవైనా, ఎవరుచెప్పినా, తప్పని అంటానంటున్నాడు.

27. దేవుడు లేడనువాళ్ళూ బుద్దిహీనులంటూ సరిపెట్టుకోవడం సరికాదని, శాస్త్రప్రకారం, మరోరకంగా, ఏరకంగా ఏవిధంగానైనా దేవుడున్నాడని రుజువు చేయడం క్రైస్తవుల బాధ్యత అని అన్నాడు.

జ 28. బైబిలు సకల శాస్త్రాలకంటే ఉన్నతమైనదని సుందర్రావు ప్రకటిస్తున్నాడని అంటున్నాడు.

29. బైబిలు చెప్పనిమాట క్రైస్తవులు ఎవరూ పలకకూడదని, తానూ పలకననీ అంటున్నాడు.

30. నేనెవరినైనా పేరెట్టిపిలిచి ఓడిపోతావని ముందే చెపుతాను. దాంతోవాడు భయపడి పోతాడు.

31. ఐన్‌స్టీన్‌ గాడికేం తెలుసురా విశ్వాన్నిగురించి. వాడో బచ్చాగాడు అనన్నాడు.

32. ప్రపంచములో దీదిన రహస్యం ఎవ్వడికీ తెలియదు. ఒకదినమనగా జాకీర్‌గాడికీ తెలియదు, నాసావాడికీ తెలియదు. 350కోట్లమందికీ తెలియదు.

33. బైబిలు మేధావి జయశాలి ఒక్కడే. ఒకేఒక్కడు.

34. నానోటి నుండి వచ్చిన ప్రతిమాటా దేవునిమాటే అనీ అన్నాడు.

35. ప్రపంచపు తొక్క తీసేయ్‌రా! అని నన్నుపుట్టించాడు దేవుడు.

36. ప్రపంచ శాస్త్రవేత్తలనే ఎడంకాలిక్రింద తొక్కేశాడీ సుందర్రావు.

పాఠకమిత్రులారా! ఈదఫా నేను విన్న రెండు, మూడు సి.డిలలో సుందర్రావు తనగురించి చెప్పుకున్నమాటలివి. ఇక ఇతరులగురించి,


సైన్సుగురించి వదరుబోతుతనంతో అతనన్నమాటలుకొన్ని వ్రాస్తున్నాను చూడండి.

1. రావిపూడి వెంకటాద్రి ఒక పనికిమాలినోడు, పోటీకిరాని పిరికిపంద

2. మరోచోట ఎన్‌.వి. బ్రహ్మం అన్నాయనపైనా ఇలాంటి తుత్తరమాటే అన్నాడు.

3. స్టీఫెన్‌ హాకిన్సు దేవుడులేడంటున్నాడు. వాడికి బుద్ధి చెప్పవద్దా

4. సైంటిస్టులక్కాదు శాస్త్రం తెలిసింది, అది క్రైస్తవునికే తెలుసు

5. భూదినం వేరు, అంగాకరదినం వేరు, నక్షత్రదినం వేరు.

6. సైన్సుకు కూడా చాలా తెలియదండీ పాపం

7. దీదాత్‌గాడు నోరెత్తాడు, చస్తావన్నాను. కుళ్ళికుళ్ళి చచ్చాడు

8. పరంజ్యోతి, అనిల్‌. కె.ఎ.పాల్‌, ఓఫిర్‌, పోపు, వగైరా వగైరా క్రైస్తవ బోధకులం, కాపరులం అని చెప్పుకుంటున్న వాళ్ళంతా తప్పుటోళ్ళు, పిరికివాళ్ళు, పదవులకోసం, డబ్బుకోసం వెంపర్లాడేవాళ్ళు.

9. దిక్కుమాలిన మాటలు రాసిన డిక్షనరీలు చదవకండి.

సైన్సంటూ సుందర్రావు ప్రకటించిన కొన్ని అంశాలు :

1. భూమిగురించి, సూర్యునిగురించి, చంద్రునిగురించి ఆలోచించడానికి సైంటిస్టులు కానక్కర్లేదు.

2. ఈరోజు సైన్సుకు తెలియని విషయాలెన్నో మాట్లాడుకుంటున్నాం.

3. ఏదైనా సిద్ధాంతంపుడితే అది సరైందోకాదో తెలుసుకోటానికి, దానిని బైబిలు దగ్గర పెట్టి చూస్తాను. అదిగాని బైబిలుతో విభేదిస్తుంటే ఆ సిద్ధాంతం తప్పంటాను.

4. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే విమానం చినిగిపోద్ది

5. ఆదికాండం 6 వేల సంవత్సరాల క్రితం సంగతుల్ని చెపుతోంది.

6. ఈభూమి నీళ్ళలో నానబెట్టబడుతోంది. ఎందుకో తెలుసా?

7. వస్తువులు కుళ్ళకుండా ఉండాలంటే చల్లని వాతావరణంలో, చీకటిలో ఉంచాలి. ఈ విషయం ఫ్రిజ్‌చూస్తే తెలియడంలేదా? ఇది సైన్సుకు ఇపుడు తెలుసు. దేవునికి ఎప్పుడో తెలుసు. అందుకనే భూమిని నీళ్ళలో ఉంచాడు.

8. వెలుగు గురించి ప్రపంచంలో ఏ ఒక్కరికీ తెలియదు సుందర్రావుకు తప్ప. వెలుగన గానే సూర్యుడనుకుంటున్నాడు పుండాకోర్‌. సూర్యుడు పుట్టకముందే వెలుగేంటి అంటున్నాడు దద్దమ్మ.

9. విశ్వం ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే ఉదయము, అస్తమయము మొదలవుతాయి. బైబిలులోని ఈదినం విశ్వదినం. ఇది ఎన్నో లక్షల సంవత్సరాల పరిమాణం కలది.

10. ద సీక్రెట్‌ ఆఫ్‌ ద యూనివర్సు (విశ్వరహస్యం); ఒక్కడే అయిన బైబిలు మేధావి సుందర్రావుకే తెలుసు.

11. యూనివర్సంతా నీళ్ళు నిండియున్నాయి. భూమిపైన తొట్టి బోర్లించినట్లు ఆ నీళ్ళున్నాయి.

12. ఒకప్పుడు పదార్ధమంతా నీళ్ళలో ఉండేది. అదిగో పైన మనకు నీలంగా కనబడుతుంది నీళ్ళే.

13. నక్షత్ర మండలాల కవతల జలరాశులున్నాయని ఈనాడు సైంటిస్టులంటున్నారు. ఆకాశగంగ అంటే అదే.

14. దేవుడైన యెహోవాను ఈ విశ్వంలోని నీటినంతటినీ ఒకచోటికి రమ్మనగా అలాగే వచ్చాయి.

15. ఏసుప్రభువు వస్తున్నాడు - విశ్వం నాశనం కాబోతోంది.

16. భూదినంవేరు, అంగారకదినం వేరు, నక్షత్రదినం వేరు.

17. ప్రపంచ మీడియాకు సవాల్‌, ప్రపంచదేశాల భవిష్యత్తు చెప్పింది బైబిలు.

18. 18 వందల కోట్ల సంవత్సరాల నుండి సూర్యుడు మండుచున్నాడు. అదెలాసాధ్య పండింది? అది దేవుడు చేసింది. ఆరని అగ్ని.

19. మండే సూర్యుడు, ప్రకాశించే చంద్రుడు, తళతళమెరిసే నక్షత్రాలు.

20. బిగ్‌బాంగ్‌ - అతిపెద్ద శబ్ధం అంటే యేసే.

21. బైబిలు అనన్యసామాన్యమైనది. బైబిలు మానవజ్ఞానానికి అందనిది

22. కాలం, శక్తి, పదార్ధం, అంతరిక్షం, పని ఈ ఐదింటిగురించి సైన్సుకు తెలియదు. ఎప్పటికీ వీటిని గురించి తెలుసుకోలేమని సైంటిస్టులే ప్రకటించారు.

23. 1) కాలం ఎపుడు పుట్టింది, ఎలాపుట్టింది? ఎలా అంతరించిపోతుంది?

2) సూపర్‌పవర్‌ - మహాకర్షకశక్తి అంటారు దీనిని శాస్త్రజ్ఞులు, దేవుడు అనడం నచ్చని పిచ్చోళ్ళు అలా అంటారు.

3) పదార్ధం అంటే మట్టే, మరి ఈమట్టి దేనితో చేయబడింది?

4) అంతరిక్షమంటే ఏమిటి? వీళ్ళకి తెలియదు, బైబిలు చెప్పింది.

5) పని అంటేనూ సైన్సుకు ఇప్పటికి తెలియదు. అంతేకాదు

24. ఎన్నటికీ వీటినిగురించి తెలుసుకోలేమనీ ప్రకటించారు శాస్త్రజ్ఞులు. అదిగో అక్కడ ఆరంభమైంది దేవునిజ్ఞానం. దానిని అధిగమించింది క్రీస్తు జ్ఞానం. దానిని చెప్పడానికే నేను వచ్చాను.

25. ఆదికాండం 1వ అధ్యాయం 1 వచనంలోనే దేవుడు ఈ అయిదు విషయాలు చెప్పాడు చూడండి. ఆది అంటే కాలం, దేవుడు అంటే మహాకర్షకశక్తి, భూమి అంటే పదార్ధం,ఆకాశం అంటే అంతరిక్షం, సృజించడం అంటే పని చూశారా మనుష్యులెప్పటికీ తెలిసికోలేనివానిని గ్రంథంలో ఎలా చెప్పాడో.

26. బైబిల్‌ మొదటి వాక్యమే తప్పన్నాడు రావిపూడి వెంకటాద్రి. నేనది సత్యమేనని రుజువు చేస్తానని కౌంటర్‌ వేశాను. 1-5-1990 చాలెంజ్‌ సమావేశం ఏర్పాటుచేశాము. రావిపూడి వెంకటాద్రి రాలేదు. వాడికి హార్ట్‌ఎటాక్‌ వచ్చిందని టెలిగ్రాం వచ్చింది. 'దేవునికి సవాలంటే రాదామరి?'

27. ప్రపంచములు ఆయన మాటవలన నిర్మాణమైనాయి. కలుగుము అంటే కలిగాయి.

28. కనబడని దాని నుండి కనబడేది వచ్చింది. క2ం వ నీరు. హైడ్రోజన్‌, ఆక్సిన్‌ వాయువులు కనపడనివి. వాటి కలయికతో కనపడే నీరు వచ్చింది.

దేవుడున్నాడు - చాలెంజ్‌ అన్న సి.డి. నుండి మరికొన్ని వివరాలు.

1. ప్రపంచమెరుగని మహాజ్ఞానాన్ని మీముందుంచుతున్నాను.

2. నేను బ్రతికున్నంతకాలం నన్ను జయించే మగాడు ఉండడని చెపుతున్నాను.

3. ఈ విషయాన్నెరగడానికి మానవనేత్రాలు సరిపోవు. మనోనేత్రాలు తెరవబడాలి.

4. గంటకు 6 వేల మైళ్ళవేగంతో పోతే 500 సంవత్సరములకు అల్ఫా సెంటారై వస్తుంది.

5. పాలపుంతలో 200కోట్ల నక్షత్రాలున్నై. అందులో సూర్యుడొక నక్షత్రం.

6. పాలపుంతను దాటి ఒక కోటి సంవత్సరాలు ప్రయాణంచేస్తే ఆండ్రోమెడా నక్షత్రంమండలం వస్తుంది.

7. విశ్వంలోని కోట్లాది నక్షత్రమండలాలలో పాలపుంత ఒకటి.

8. సూర్యునినుండి బుధుడు 5.79 కోట్లు, శుక్రుడు 10.82 కోట్లు, భూమి 14.95 కోట్ల మైళ్ళు దూరంలో ఉన్నాయి.

9. పాలపుంతను దాటాలంటే 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది.

10. భూమే విశ్వానికి కేంద్రం, ఇంత మహావిశ్వాన్ని దేవుడు ఎందుకుచేశాడో తెలుసా? మీకోసమే.

11. వీటి వేగాలేమిటో మీకు తెలుసా?

1) సూర్యకుటుంబం గుంటకు 1,11,600 కి.మీ. వేగంతో కదులుతోంది.

2) పాలపుంత 1 సెకండుకు 230 కి.మీ. వేగంతో అంటే గంటకు 8,28,000 కి.మీ. వేగంతో

12. అంత వేగంతో పోతున్నా మనమెంత ప్రశాంతంగా ఉన్నామో చూడండి. భూమిగాని ఒక్కరవ్వ అటూ ఇటూ కదిలిందా, భవంతులన్నీ పేకమేడల్లా కూలిపోతాయి.

13. పాలపుంత అండ్రోమెడా చుట్టూ గంటకు 1,44,000 కి.మీ. వేగంతో తిరుగుతోంది.

14. ఆండ్రొమెడా హైడ్రాసెంటారై చుట్టూ గంటకు 21,60,000 కి.మీ. వేగంతో తిరుగుతోంది.

15. వీటన్నింటినీ దాటాకనే మనకు కనిపించే ఆకాశం ఉంది.

ఎ) భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1,11,600 కి.మీ. వేగం

బి) సూర్యకుటుంబం పాలపుంత చుట్టూ తిరగడానికి, 8,28,000 కి.మీ. వేగం

సి) పాలపుంత ఆండ్రోమెడా చుట్టూ తిరగడానికి 1,44,000 కి.మీ. వేగం

డి) ఆండ్రొమెడా హైడ్రాసెంటారై చుట్టూ తిరగడానికి 21,60,000 కి.మీ. వేగంతో కదులుతున్నాయి. అవి అలా ఎంందుకు తిరుగుతున్నాయో శాస్త్రజ్ఞులకు తెలియదు. భూమిమీద నీబ్రతుకు సాగాలంటే విశ్వం అలా తిరగాల్సిందే.


16. నక్షత్రాలు కదులుతున్నాయని బైబిలు ఎప్పుడో (3405 సం||నాడే) చెప్పింది. ఆర్యభట్ట క్రీ.శ. 4లో నక్షత్రాలు కదలడం లేదన్నాడు. హెల్మండ్‌ హేలీ, హేలీ తోకచుక్కను బట్టి నక్షత్రాలు కదులుతున్నాయనడానికి ముందు, సైన్సుకు నక్షత్రాలు కదులుతున్నాయనే తెలియదు.

17. బైబిల్ని మతగ్రంధం అనుకుంటున్నారు మూర్ఖులు, సన్నాసులు, దేవుడులేడను కుంటున్నారు బుద్ధిహీనులు, నాస్తికులు. దేవుడులేడనే వానికి బుద్దిలేదు. వాడి జ్ఞానమంతా పుస్తకజ్ఞానమే, అదంతా చెత్తజ్ఞానం.

18. ఆకాశమండలాలన్నీ అలా ఎవరికట్టడికి లోనైవుంటున్నాయో, ఆకట్టడి భూమిమీద ఉంది. విశ్వానికి భూమే కేంద్రం.

19. నేనెవరితోనైనా పోటీపడాలంటే వాడు ఇంటర్నేషనల్‌ ఫిగరైయ్యుండాలి. ఇండియావాడు నాకు చాలడు.

20. వెంకటాద్రిని చాలెంజ్‌ చేశాను. బైబిలు బండారం అన్న గ్రంధంవ్రాసినోడొకడున్నాడు ఎన్‌.వి. బ్రహ్మమని. చీరాలలో వాడినీ చాలెంజ్‌చేశాను. వాళ్ళుమూర్ఖులు, వాళ్ళు నాముందు పురుగుతోసమానం, చీమలు.

21. ఆరనిఅగ్ని ఉందంటోంది బైబిలు. అట్టిది ఉన్నదంటారా? అని ఎందరికో సందేహ సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాడు బిడ్డా! అదలా ఎందుకుమండుతోందో నీకుతెలుసా? అంతజ్ఞానం నీకెక్కడిది. దానిలానే నక్షత్రాలూ మండుతున్నై.

22. మరిక నరకంంలో ఉండాల్సిన ఆత్మలను మండించాలంటే అంతకంటే గొప్ప ఆరని మంటకావాలి కదా.

23. పాతాళం ఎక్కడుందో తెలుసా? పాలపుంతలైన ఆండ్రోమెడా, దానిపైనహైడ్రోసెంటారై దానికి పైన ఆకాశం ఉంది. దాని అంచులు దాటాక పాతాళగుండం వుంది.

24. అయినా నరకానికి చేరాల్సిన ఆత్మలు అక్కడికి ఒక్క క్షణంలోనే చేరతాయి.

పాఠక మిత్రులారా!

పి.డి.సుందర్రావు తనకు తెలిసిన సైన్సంటూనూ, బైబిలులోని సైన్సంటూనూ చెప్పిన వాటిలో కొన్నింటినిక్కడ చూపించాను. ఇప్పుడిక ఆయనన్నవాటినన్నింటిని పట్టి చూస్తున్నపుడు ఆయనను గురించి నాకు అనిపించిందేమిటోనూ చెప్పడం సందర్భోచితంం.

ఆయనలో నాకు ఒకటిరెండు అంశాలు నచ్చినవి ఉన్నాయి.

1. క్రీస్తుపేరన, దేవుని పేరున చెలామణిలో ఉంటున్న దొంగలను, వ్యాపారస్తులను నిరసించారు. మోసాలను మోసగాండ్లను సహించకుండా ఎదుర్కొంటూవచ్చాడు.

2. ఆచరణ కొచ్చేటప్పటికి ఆయన నడక ఎలా ఉంటుందో తెలియదుగానీ, సాహసిగా, ఢీకొట్టడానికి రెడీగా ఉన్నట్లుగా కనబడ్డారు. కొన్ని సందర్భాలలో చాలెంజ్‌ల విషయంంలో సమావేశాలు ఏర్పాటు చేసినట్లూ కనబడుతోంది. ఆ సందర్భాలలో అవతలివాళ్ళే హాజరుకానట్లుంది,

3. నేను ఇతర మత గ్రంథాల జోలికిరాను. బైబిలు జోలికి వచ్చిన వాణ్ణి విడవను అన్నారు. ఈనాడు కపట వ్యాఖ్యాతలు కొందరు, వేదాలలోనూ మహమ్మదున్నాడు, పురాణాలలోనూ క్రీస్తుచెప్పబడ్డాడు లాటి తప్పుడు కూతలు కూస్తూ, అమాయక జనాన్ని ప్రలోభపెడుతున్నారు. ఈయనలా కాక ఇతర గ్రంథాలజోలికి నేనూ రాను అనడం నాకు నచ్చింది.

ఆయన చెపుతున్నదానిని బట్టి

ఇక అతనిలో నాకు నచ్చనివి చాలా ఉన్నాయి.

1. అతి మొరటుదనం, సంస్కార హీనత్వం, సభ్యతా రాహిత్యం.

2. ఆత్మస్తుతి పరనింద అన్న రెండైతే మరీ హద్దులుమీరి ఉన్నాయి. కరుడుగట్టిన ఆత్మాధిక్యతాభావం నరనరాన జీర్ణించుకుని ఉంది. (సుపీరియారిటి కాంప్లెక్స్‌ అన్నది దానికదే ఒక మానసిక వైకల్యం కదా!)

3. ఎన్నో విషయాలు సరిగా తెలియకుండగనే అంతా తెలుసుననే విపర్యయ దురాగ్రహం బాగా తలకెక్కిఉంది.

4. క్రైస్తవ్యాన్ని, బైబిలును కూడా రక్షించడానికే తానుపుట్టినట్లు, క్రీస్తు తరువాత 1900 ఏండ్ల వరకు ఆపని చేసినవారెవరూ లేనట్లు ప్రకటించడాన్నేమనుకోవాలి.

5. ఆదాము తరువాత మోషే, క్రీస్తు, తానే తండ్రి పనులు చక్కజేయడానికొచ్చినట్లు, అందులోనూ మోషేకూడా దైవాజ్ఞను అతిక్రమించి శిక్షకు గురైనట్లు చెప్పుకున్నా డీయన. మరైతే వారిద్దరూ ఎన్నో అద్భుతాలు చేశారు కదా! ఇప్పుడీ కడపటాయన ఏమిచేశారో, చేయగలరో చెప్పిఉంటే బాగుండేది.

ఇంతలేసి వికటాట్టహాసాలు చేస్తున్న ఈయన ఇంతకూ ఏనాడు ఎక్కడ ఎవరితో యుద్ధంచేశారో. అందులో అవతలివారడిగిన ప్రశ్నలేమిటో, ఈయనగారు చెప్పిన సమాధానాలేమిటో తెలిపితే బాగుండేదికదా! ఈయన చాలెంజ్‌ అన్నాడు, ఆయన రానన్నాడు, లేదా వస్తానని రాలేదు. దాంతో ఈయన సిద్ధాంతం సరైందని తేలినట్లెలా అవుతుంది? ఇలాంటప్పుడు కనీస ఇంగిత జ్ఞానమున్న ఎవరైనా, పోటీ జరగలేదనా ల్సిందేగాని, బైబిలు గెలిచింది అనలేడు, అనకూడదు. ఉదాహరణకు ఈయనగారు పురుగులు, చీమలు అంటూ ప్రస్తావించిన రావిపూడి వెంకటాద్రిగానీ, ఎన్‌.వి.బ్రహ్మంగాని అనుకున్న సమయానికి పోటీకి రాలేదనుకుందాం. ఈయనగానీ, నిర్వాహకులుగాని, ఆ రానాయనగాని పద్ధతి తెలుసున్నా, పట్టుదల ఉన్నా ఏమిచేసుండాల్సింది?

1. పోటీ సామాజిక అవసరమై ఉన్నా, పోటీదారులిరువురిలో ఇరువురూగానీ, ఏఒక్కరుగానీ బహిరంగంగా విజేత కావాలని అనుకుంటున్నా ప్రతికూల పరిస్థితులు తొలగిపోగానే, మరలా పోటీ ఏర్పాట్లకై యత్నించాలి. ఎందుకని పోటీజరగలా, ముగియలా, వాయిదాపడిందది అవునా? కాదా? వెంకటాద్రి ఆనాడు వాదనకు రాకపోవడానికి కారణంం 'హార్ట్‌ఎటాక్‌' రావడం. ఆవార్త అబద్ధంకాదు. కలెక్టరుద్వారా ఆ సమాచారం అందిందీయనకు. కావాలంటే అది వాస్తవమోకాదో మనమైనా కనుక్కోవచ్చు. అలాంటి సందర్భాలలో పి.డి.సుందర్రావుకు ఏమాత్రం ఇంగితజ్ఞానం పనిచేస్తున్నా, మానవత్వమున్నా ఏమి చేసుండాలి? ముందు వెంకటాద్రిని పరామర్శించుండాలి. పోటీదేముందిలే ఆరోగ్యం కుదుటపడ్డాక మరో సమయం అనుకుని నిర్వహించుకుందాము అనాలి. ఈరెండూ చేయకుండా, నాదేవుణ్ణి చాలెంజ్‌ చేస్తే హార్ట్‌ఎటాక్‌ రాదామరి అంటూ వికటాట్టహాసం చేశాడీయన. తండ్రి క్రూర వారసత్వాన్నే చిన్నకొడుకూ పుణికిపుచ్చుకున్నాడన్నమాట! బాగుంది.


అదలా ఉంచుదాం. పోటీ షరతుల్లో ముఖ్యమైన షరతేమిటి? వెంకటాద్రి ఓడితే అతడు ఇతనివద్ద బాప్తిస్మం తీసుకుని క్రైస్తవ ప్రచారం చేయాలి. ఇతడోడితే, బైబిలును విడచి హేతువాదిగా జీవించాలి. నిజానికి ఇరువురూ అంగీకరించిన ఆ షరతు సత్యానికి పెద్దపీట వేయడానికి ఇద్దరూ సిద్దమైనట్లు చెపుతోంది. అదిఎంత పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చే షరతో ఇరుపక్షాలకు అర్ధంఅవుతూనే వుంది గదా! నిజానికందులో ఏది జరిగినా సమాజానికి చాలామేలు జరిగి ఉండేది. నిజానిజాలు తెలియకనే గొర్రెల మందలా ఎవరోఒకరివెంట పడిపోయే పిచ్చిమంద, నిజాలు బైటపడడంతో సరైనదారిలో పయనించే అవకాశం కలిగేది. కానీ జరిగిందేమిటి?

రోగంతగ్గాక ఆయనగానీ, ఈయనగానీ, మరైతే ఎప్పుడు పెట్టుకుందాం పోటీ అనిఅడిగి, అందుకై గట్టియత్నం చేసుండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. నిజాయితీ నిబద్ధత ఉంటే, సమాజానికి నిజాలు వెళ్ళడికావాలన్న చిత్తశుద్ధి ఉంటే, ఇద్దరూ బ్రతికే ఉన్నారుగనుక ఈనాడైనా - చనిపోయేలోపే - అర్దంతరంగా ఆగిపోయిన ఆపనిని పూర్తిచేయడానికి సిద్ధపడాలి. అనేకమంది సామాన్యులను క్రైస్తవుల్ని చేయడంకంటే వెంకటాద్రిని క్రైస్తవుణ్ణిచేయడం పెద్దప్రయోజనాన్నిస్తుందని పి.డి.సుందర్రావుకుగానీ, అక్కడ, ఇక్కడా ప్రసంగాలతో బైబిల్‌నో, బైబిలు భక్తుల్నో చులకనగా మాట్లాడడం కంటే, సుందర్రావులాంటి వాణ్ణి హేతువాదిగా మార్చడం హేతువాద ఉద్యమవ్యాప్తికి ఎంతో ఊపునిస్తుందని వెంకటాద్రికిగాని అనిపించలేదన్నమాట. అదేమీకాదంటే, సభజరిగినా షరతుకు కట్టుబడక, ఈయనదారిన ఈయన, ఆయనదారిన ఆయన మూటముల్లె సర్దుకుని ఎవరిగూటికి వారు చేరడమే జరుగుతుందని ఇద్దరికీ ముందే తెలుసునేమో, అనైనా అనుకోవలసివస్తోంది.

ఆత్మాధిక్యతా భావన

ఆత్మాధిక్యతా భావన - సుపీరియారిటి కాంప్లెక్స్‌ - దానికదే, ఒక మానసిక సమతౌల్యం లేనితనాన్ని సూచిస్తుంది. కొంతవరకు నేనెరిగిన వెంకటాద్రిలోను, ఈయన సి.డి.లు వినగా ఈయన్నుగురించి నాకు తెలిసిందాన్ని బట్టీ పి.డి.సుందర్రావులోను ఆ జబ్బు తగినతంగానూ ఉంది. ఇద్దరు ఆత్మాధిక్యతా భావానికి లోనైన వ్యక్తులు తారసపడ్డపుడు వారిరువురి గురించి ఇద్దరకీ ఒకే భావన కలుగుతుంది. అక్కడికి తాను ఏనుగైనట్లు, ఎదుటివాడు చీమో దోమో అయినట్లుగా అనిపిస్తుంటుంది. ఈ విషయంలో ఆనాటి సభ ఆగిపోయిన అనంతరం వెంకటాద్రి ఏమన్నారో కనుక్కోవాలి. పి.డి.మాత్రం తానొక్కడే యోధుడినన్నట్లు, మిగిలిన వాళ్ళంతా దెబ్బకుచచ్చేవాళ్ళన్నట్లు చాలా అనేశారు. వెంకటాద్రిని, ఎన్‌.వి. బ్రహ్మాన్ని అయితే నేరుగా పురుగులు, చీమలు అనే అన్నాడు. బాగుందికదూ ఈ వరస. ఈ సందర్భంలో మరోమాట గుర్తుచేసుకోవాలి. ఈ ఇద్దరు పెద్దల వెంటా కళ్ళుమూసుకుని పరుగెట్టే గుంపులుంటాయి. వాళ్ళుమాత్రం ఎవరిపెద్దను వాళ్ళు భుజాలకెత్తుకుని మోస్తూ, కీర్తిస్తూ, జయంమాదే, జయంమ్మాదేనంటూ నినదిస్తుంటారు. అటునుండిగాని, ఇటునుండి గాని, ఒక్కడంటే ఒక్కడు అదేంటి గురూ! పోటీ జరగనేలేదు కదా! ఇప్పటికైనా పోటీపడి విజేత ఎవరో తేల్చితే బాగుంటుంది కదా! అని అడగనే అడగరు.

గమనిక : ఆ ఇద్దరు సిద్ధమంటే యోగ్యమైన వేదిక నేర్పాటుచేయించడానికి, నిర్వహణ బాధ్యతను, భారాన్ని వహించడానికి సత్యాన్వేషణ మండలి సిద్ధంగా ఉంది.

పి.డి. సుందర్రావు వెలిబుచ్చిన వాటిలో నేనంగీకరించే బావాలు కొన్ని ఉన్నై

1. స్వస్థత కూటాలు వ్యాపార దృష్టితో అమాయకుల్ని వంచిస్తున్న కపటులు చేస్తున్న తప్పుడు పనులు. (అయితే బైబిలు స్వస్థతలు కలిగించడాన్ని, కలగడాన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది వేరే విషయం)

2. ఈనాడు క్రైస్తవం పేర కాపరులం, బోధకులం అంటున్నవారిలో ఎక్కువలో ఎక్కువమంది విషయం తెలీనివారు, విశ్వాసంకూడా లేనివారే.

3. ఈరకానికి, క్రీస్తుఏమైనా పరవాలేదు, బైబిలుకేమైనా పరవాలేదు వాటిచాటున తమ ప్రయోజనాలు నెరవేరితేచాలు.

4. నిజాల్ని ప్రకటించడానికిగాని, అంగీకరించడానికి గాని నిర్భీతి (దమ్ము అంటాడాయన) ఉండాలి.

5. ఓడిన వాడు గెలిచినవాడి అనుచరుడిగానో, సహచరుడిగానో ఉంటూ ఆ విషయాలనే ప్రకటిస్తూ ఆమార్గానే జీవించాలి.

6. మీపిల్లల్ని పంపండి వారి బాధ్యతంతా స్వీకరించి వారిని సరైన వ్యక్తులుగా తీర్చిదిద్ది మీకప్పగిస్తాను.

7. తర్ఫీదుపొందిన వారైతేనే సంస్థ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించ గలుగుతారు.

ఇక నాగురించి నాలుగు మాటలు

1. సత్యానికి పెద్దపీట వేయాలనుకొంటున్నవాణ్ణి, అందుకుగాను ఆజీవితం సిద్ధపడగలవాణ్ణి కూడా.

2. ఒప్పనితేలిన వాటిని స్వీకరించి, ఆచరించడానికీ, ఆచరింపచేయడానికీ, తప్పనితేలిన వాటిని విసర్జించడానికీ, విసర్జనీయాలని నలుగురికీ చెప్పడానికీ; ఇంకా తప్పో, ఒప్పో తేలనివాటిని అనిర్ధారితాల జాబితాలో వుంచి, వాటిలో అవసరమైన వాటిని తెల్సుకునే కృషి చేస్తుండడానికి త్రికరణశుద్ధిగా సిద్ధపడేవాణ్ణి.

3. చిన్నవాడు చెప్పాడా, పెద్దవాడు చెప్పాడా, శతృవుచెప్పాడా, మిత్రుడు చెప్పాడా, మతస్తుడు చెప్పాడా, శాస్త్రజ్ఞుడు చెప్పాడా అన్నది పట్టించుకోకుండా, చెప్పింది సత్యానికి, ధర్మానికి అనుగుణ్యంగా ఉందా, లేదా? అన్నంతవరకే పట్టించుకునే స్వభావం కలవాణ్ణి. శతృవుచెప్పినా మంచిని స్వీకరించు, మిత్రుడుచెప్పినా చెడును స్వీకరించకు, అన్న నియమం పెట్టుకుని ఆ దిశగా సాధనచేస్తూ బ్రతుకుతున్నవాణ్ణి.

4. జీవితాన్ని గురించిన సరైన అవగాహన కలిగించుకుంటూ, కలిగిన మేర అలా జీవించడానికై నిజాయితీగా సాధనచేస్తూ, ఇతరులకు ఆ విషయాలు తెలిపి, వారినీ అలా జీవించేలా ప్రేరేపిస్తుండడమే సరైన సంఘ జీవితవైఖరి అంటున్న సత్యాన్వేషణ మండలి అన్న సంస్థకు చెంది ఆమార్గంలో నడవటానికి యత్నిస్తున్నవాణ్ణి.

ఇక ప్రస్తుతాంశానికి వస్తాను

1. బైబిలు దైవగ్రంధము అని నిరూపిస్తాను అంటున్న వాళ్ళతో చర్చించడానికీ, నిరూపణైతే వారివెంట నడవడానికి నేను సిద్ధము.

2. బైబిలులో వివేకవంతమైన మానవ సమాజం అంగీకరించకూడని, అనుసరించ కూడని అంశాలేమైన ఉన్నాయా? లేవా? అన్నది తేల్చుకోవడమూ చర్చ లక్ష్యాలలో ఒకటికావాలి.

3. తాత్విక సిద్ధాంత విచారణలో, అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమధ్య జరిగినా, ఆయా సిద్థాంత భావజాలంలోని సత్యాసత్యాలను, ధర్మధర్మాలను పరీక్షించడమన్నదే అసలు విషయంగా ఉంటుంది.

4. పి.డి. సుందర్రావు, వెంకటాద్రి గార్లమధ్యన ఏ నిబంధనైతే ఏర్పరచుకోవడం జరిగిందని సుందర్రావుగారు తన సి.డి. ప్రసంగంలో ప్రకటించారో, ఆ నిబంధనకు నేను 100% సిద్ధము. పి.డి.సుందర్రావు బైబిలు పరిశుద్ధ గ్రంథము అంటే దానిలో జ్ఞానపరంగా తప్పులులేవనీ, ధర్మపరంగా తప్పులు లేవని నిరూపించితే నేను ఆయన ద్వారా బైబిలు మార్గానికి మరల్చబడినట్లు బహిరంగంగా ప్రకటించి, ఆ పంథాను అనుసరిస్తూ, బ్రతికున్నంతకాలం ఆయన భావాలను ప్రచారం చేస్తాను.

అలా ఆయన నిరూపించలేకపోతే అంటే బైబిలులో జ్ఞానపరంగా తప్పులున్నట్లుగానీ, దానిలోని జ్ఞానం అరకొర జ్ఞానమేననిగానీ, అందులో అనుసరించిన, అనుసరించమంటున్న జీవన విధానాలలో లోపాలు, దోషాలు ఉన్నట్లుగాని తేలితే ఆయన బైబిలును విడచినట్లు ప్రకటించి నామార్గాన అంటే సత్యాన్వేషణమార్గాన నడుస్తూ, ఆ పంథాను అనుసరించవలసినదిగా ప్రజలకు ప్రబోధిస్తూ జీవించాలి.

5. ఉభయత్రా ప్రయోజనకరమైన మరోమాటా చెపుతాను. సత్యాసత్యాలు, ధర్మధర్మాలేమిటన్నది తేల్చుకోవడానికి మిత్రదృష్టితోనూ విచారించుకోవచ్చు. పోటీ దృష్టితోనూ, విచారించుకోవచ్చు. నావైఖరి ప్రధానంగా మిత్రదృష్టితో కూడిందే అయినా, పోటీఉంటేనే సిద్ధపడతాననే వారితో భేటీ అవడానికీ నాకు అభ్యంతరం లేదు. పి.డి. సుందర్రావుగారిది ప్రధానంగా గెలుపోటములు, సవాళ్ళపోకడ గనుక అందుకూ సిద్ధపడి మరో నిబంధననూ పెట్టుకుందా మంటున్నాను. ఇద్దరమూ సమాజంలో మార్పు తీసుకురావడానికి సమయాన్నీ, ధనాన్నీ వెచ్చిస్తున్న వాళ్ళమే గనుక, ఆరకమైన ప్రయోజనం చేకూరే నిబంధనా పెట్టుకుందాం. 1 కోటి రూపాయలు వీగిపోయిన పక్షంవారు రెండోవారికి చెల్లించాలి. అది అమలవడానికి వీలైన చట్టబద్ధమైన ఒప్పంద ఖరారు పత్రాలు పెద్దల సాక్ష్యంతో వ్రాసుకుందాము. నిజానికి ఈరకమైన పందేన్నీ సుందర్రావుగారూ ప్రకటించారు. తానోడిపోతే 2 కోట్ల విలువైన తన సంస్థభవనాన్ని ఇచ్చేస్తానన్నాడాయన. ఇలా పోటీకి సిద్ధపడే ఆయన స్వభావంలాంటి స్వభావం కలిగిన వాణ్ణే నేనూ. కనుక ఇప్పుడు నేనన్న ధనరూపమైన పందేనికి ఆయన వెనుకాడరనే అనుకుంటాను.

6. మరో విషయముంది, సత్యాన్వేషణ మండలి కార్యాచరణ ప్రణాళికలో శిక్షణా తరగతులకు చాలా ప్రాధాన్యత ఉంది. మా అధ్యయన శిక్షణ తరగతులు ప్రధానంగా మౌలికాంశాలతో కూడి ఉంటాయి. ఆయా విషయాలకు సంబంధించిన భావాలలో ఏవి, ఎన్ని తప్పులని తేలినవి, ఏవి, ఎన్ని ఒప్పులని తేలినవి, మరింకేవి ఇప్పటికి తేలనివని తేలినవి అన్న మూడు రకాలను ప్రజలకు తెలియపరిచేపని జరుగుతుంటుందందులో. పి.డి. సుందర్రావుగారికి, నాకు జరిగే చర్చ (పోటీ)లో ఆయన పక్షం వీగిపోతే ఆయనా నేను కూడా, మారెండు శిక్షణ కేంద్రాలలో వాటినే బోధించాలి. ఆయన పక్షం నెగ్గితే వారితోబాటు మాశిక్షణాలయంలో మేమూ వారి బోధనలనే శిక్షణ జరుపుతాము. ఈ మూడూ పోటీకి ప్రయోజనాలుగా ఒప్పందం చేసుకుందాము.

నిబంధనల సారాంశం (మరోసారి అనుకుందాం)

1. ఆయన గెలిస్తే నేను ఆయన విధానంలో బైబిలును స్వీకరించి అనుసరించాలి. ఆయన పక్షం వీగిపోతే బైబిలును విడచి ఆయన నామార్గంలో సత్యాన్వేషిగా ప్రయాణం సాగించాలి.

2. ఆయన గెలిస్తే నాకు, లోకానికి సత్యాన్ని ఎరుకపరచినందుకు నేనాయనకు కోటి రూపాయలు ధనం చెల్లించాలి. ఆయనాపని చేయలేకుంటే నాకాయన ఒకకోటి రూపాయలు చెల్లించాలి.

3. ఆయన తన పక్షం గెలిస్తే నేనూ నా సంస్థా ఆయన బోధనలను ప్రజలకు తెలిపే శిక్షణ కార్యక్రమం చేపట్టాలి.

ఆయన పక్షాన్ని రుజువు పరచలేకపోతే ఆయనా, ఆయన సంస్థా, నాపద్ధతిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.

జ పై మూడు అంశాలను చర్చకు ప్రతిఫలంగా అంగీకరించుకుని ఒప్పందం చేసుకుందాం.

ఇక చర్చావేదికకు నియమనిబంధనలు ఖరారు చేసుకోవాలి.

1. ఆయన ప్రసంగాలు విన్నదాన్ని బట్టి పోటీ సమావేశాలు మైదానాలలో, బహిరంగప్రదేశాలలో ఏర్పరచినట్లు తెలుస్తోంది. నాలెక్క ప్రకారం ఆవిధానం, ఆస్థలం, సిద్ధాంత విచారణలకు ఏరకంగానూ సరైందికాదు.

జ ఈ సందర్భానికి చెందిన ఒక సాధారణ సూత్రం ఏమిటంటే, ఏపనికైనా, అందుకు తగిన వాతావరణం ఉండడం లేదా ఏర్పరచుకోవడం తప్పనిసరి (అవునా, కాదా? మీ సమాధానం వ్రాతమూలకంగాపంపండి). కాగా, పైన పి.డి. సుందర్రావుగారు చెప్పిన సమావేశాలలో ఎటువంటి వారుండే అవకాశం ఉందో చూడండి.

1. పోటీలో పాల్గొనే ఇరుపక్షాల అనుయాయులు వారివారి వీరాభిమానులు, వ్యతిరేకులు, వీరవ్యతిరేకులూ,

2. ఏంజరుగుతుందో చూద్దాం అనుకుని ఉత్సుకతతో చూడవచ్చేవారూ,

3. ఆ సమయానికి తీరుబాటైతే - పనీపాటలేకపోవడంతో - కాలక్షేపంకోసం వచ్చేవారూ,

4. చర్చనీయాంశాన్ని గురించి ఎంతోకొంత పరిచయముండి, ఇంకేమైన విషయాలు తెలుస్తాయేమో నన్న దృష్టి కలవారూ,

5. విషయపరంగా ఎటువంటి ప్రత్యేకశ్రద్దాలేకుండానే ఏదో ఒక దోషందొరక్కపోతుందా ఆపై దానితో ఎంతోకొంత కాలక్షేపం చేయవచ్చుననుకునే రంధ్రాన్వేషణాతత్పరులు.

6. ఎదురుపడిన దాన్నల్లా తెలుసుకుంటుండే ఏదీగట్టిగాపట్టుకోరు, దేనిని ముట్టకుండా వదలరు తరహావాళ్ళు.

జ మొత్తంమ్మీద ఏమన్నట్లు? ఎక్కువమంది సామాన్యులుంటారు - ఎవరి మీదా ఎటువంటి నియంత్రణా ఉండదు. అనుకూల, ప్రతికూల వైఖరుల ఆవేశకావేషాలు, ఉత్సాహాలు, కేరింతలు దండిగాఉంటై. అదొకసంతన్నమాట, సంతల్లో, చౌరస్థాలలో రణగొణధ్వనులమధ్యన్నమాట, ఎంతోగాఢమైన, గంభీరమైన, విశాలమైన విచారణల అవసరమున్న సిద్ధాంతచర్చలు చేసేది? పరీక్షలు నిర్వహించేది!?!? నిజాయితీగా, కనీస ఇంగిత జ్ఞానంతో చెప్పాలన్నా ఆస్థలాలు, అటువంటి వాతావరణము సైద్ధాంతిక విచారణలకు ఒక్క శాతం కూడా (ఏమాత్రం) తగిందికాదు. అనితీరాలి.

జ మరైతే ఎలాటివి అందుకు యోగ్యమైన వవుతాయి?

చర్చావేదిక నియమనిబంధనల సాధారణరూపం

1. సిద్ధాంత విచారణలో నాలుగు ప్రధాన పాత్రలుంటాయి.

జ ఇక ఐదవ వారుగా ఈ సభను నిర్వహించే నిర్వాహకులుంటారు.

1. వాదులు 2. ప్రతివాదులు 3. నిర్ణేతలు 4. పరిశీలకులు

2. విచారణ ప్రధానంగా రెండు దృష్టులు కలిగి ఉంటుంది.

1. చర్చలో పాల్గొంటున్న ఇరుపక్షాలకు చర్చనీయాంశానికి సంబంధించిన అవగాహనౌతుంది అని తెలుసుకోవడానికి జరిపే విచారణ. అందునా ఇది ప్రతిపాదక స్థానంలో అంటే 'వాది' పాత్రలో ఉన్నవానికి తెలిసిందెంత? అన్నదృష్టితో చేసేదిగా ఉంటుంది. దీనినే పారిభాషికంగా 'వాది' బలమేపాటిది? అనంటారు. ఉదాహరణకు మనప్రస్తుతాంశమైన బైబిలునే తీసుకుంటే

బైబిలుపై చర్చంటూ మొదలెట్టాక ఇరుపక్షాలలో బైబిలు గురించి ఎవరికెంత తెలుసో పరీక్షించడం లక్ష్యంగా ఉంటుందన్నమాట అది.

గమనిక : బైబిలును తీసుకుని అది ఎవరికెంత తెలుసో పరీక్షిద్దాం అనుకున్నపుడు ఆ విచారణలో కూర్చున్న ఇరువురూ (1) బైబిలును అంగీకరించేవారై యుండొచ్చు. (2) ఒకరు అంగీకరించేవారు మరొకరు అంగీకరించనివారు అయ్యుండొచ్చు. (3) ఇరువురూ బైబిలును అంగీకరించనివారైయ్యుండవచ్చు (4) ఇరువురూ అన్వేషణాదృష్టికలిగి పరిశీలనకు సిద్ధపడినవారైయ్యీ ఉండవచ్చు. మన పి.డి. సుందర్రావుగారిని గానీ, మరో క్రైస్తవ ప్రచారకుడు రంజిత్‌ ఓఫిర్‌నుగాని తీసుకుని ఈ సందర్భానికి అన్వయిద్దాం, ఇద్దరూ క్రైస్తవులే, బైబిలును అంగీకరిస్తున్నవారే అయినా బైబిలు నీకెంత తెలుసంటే నీకెంత తెలుసని వాదించుకుంటారు, నాకే బాగా లేదా ఎక్కువ తెలుసంటే నాకే ఎక్కువ తెలుసని ప్రకటించుకుంటారు. పరస్పరం తేడాపడితే ఈమాట బైబిల్‌లో ఎక్కడుందో చూపమని అడుగుతుంటారు. ముఖ్యంగా పి.డి. సుందర్రావుగారు దొంగక్రైస్తవులారా, బైబిలు చదవకుండానే కాపరులం, బోధకులం అని పేరెట్టుకుంటారేమిరా? అని అడుగుతున్నారు. ఇలాటివారి మధ్యజరిగే విచారణంతా బైబిల్‌ నీకెంతతెలుసు, నాకెంత తెలుసు చూసుకుందాంరా అన్నదే.

ఇక పి.డి. సుందర్రావు గారికీ, వెంకటాద్రి, ఎన్‌.వి.బ్రహ్మంగార్ల లాంటివారికీ మధ్య జరిగేది బైబిలు సరైందేననే వాళ్ళకు, సరైంది కాదనేవాళ్ళకు మధ్యజరిగే విచారణరీతికి చెందేదవౌతుంది. ఇక్కడా అంటే వాది బలపరీక్ష సందర్భంలో బైబిల్‌ నీకెంత తెలుసంటే, నీకెంత తెలుసన్నదే విచారణీయాంశంగా ఉంటుంది. అలాగే పైనన్న 3,4 పక్షాలకు చెందిన వ్యక్తులమధ్యా బైబిల్‌ ఎవరికెంత తెలుసో తెల్సుకుందాం అన్న చర్చ జరగవచ్చు. వాది బలాబలాలేపాటివి? అన్న పరిశీలన ఇందులో ప్రధానంగా ఉంటుంది. చర్చావేదికలో పాల్గొన్న నిర్ణేతలు, పరిశీలకులు కూడా బైబిల్‌ లేదా ఆ సిద్ధాంతం, వాదికెంత తెలుసో (ఎవరికెంత తెలుసో) చూడడమే ప్రధానం అన్న దృష్టిలోనే వారివారి పాత్రలను పోషిస్తుంటారు.

మరైతే వాదపరీక్ష తీరుతెన్నులు ఎలాగుంటాయి?

1. ఈ విచారణ వేదికలో వాది, ప్రతివాదులిద్దరి దృష్టీ ఆ సిద్ధాంతం తమ ఇద్దరిలో ఎవరికెంత తెలుసో అన్నదృష్టితో కాకుండా, ఆసిద్ధాంత బలాబలాలేపాటివో చూడడం లక్ష్యంగా ఉంటుంది. ఈ సూత్రాన్ని బైబిల్‌కు అన్వయిస్తే, వాది-ప్రతివాదులిరువురికి బైబిల్‌ ఎంత తెలుసన్నదానిలో మనకు పనిలేదు. బైబిల్‌ ఏమిచెపుతున్నదో ఆవిషయాన్ని వాదైనా ప్రకటించవచ్చు ప్రతివాదైనా ప్రకటించవచ్చు. వారిరువురి తరఫున మరెవరైనా ప్రకటించవచ్చు. అదేదీ సరిగా సరిపోలేదనుకుంటే నేరుగా బైబిల్‌ను తీసుకుని, ఆయా విషయాలపై బైబిల్‌ ఏమంటోందోనూ చూసుకుని నిర్ధారించుకోవచ్చు. నిజానికి వాదిప్రతివాదులు గానీ, వారి పక్షాన మరొకరు గాని బైబిల్‌ ఇలా చెపుతోందిఅన్నపుడు ఆమేరకు వారన్నది సత్యమా కాదా తేల్చుకోవడానికి బైబిల్‌ను తీసిచూడడం మినహా గత్యంతరం లేదు. మనమెవరమైనా సాధారణంగా చేసే పని అదే ఎవరుగాని బైబిల్‌ ఇలా అంటుంది అన్నపుడు, అలా ఎక్కడుందో చూపమనడంగాని, అలాఉందోలేదో చూడడంగానీ చేస్తాము. అవునాకాదా? నాకు తెలిసి ఇది నిర్వివాదాంశం, మరోదారికూడా లేదు.

కనుక ఈనాడు బైబిలు దైవగ్రంధమనడానికి గాని, బైబిలులో అసత్యజ్ఞానంగానీ, అధర్మకర్మలుగాని ఉన్నాయా లేదా చూడడానికి గాని, బైబిలు ఎవరికెంత తెలుసో, అందులోనూ ఎవరెవరు ఎంతెంతగా, చూడకుండానే బైబిలు వల్లించగలరో అన్నది అనవసరపు వ్యవహారం (అది బైబిలు ఎవరికెంత తెలుసన్నదే పరీక్ష అయినపుడు మాత్రమే అవసరమైన అంశమవుతుంది). మన ప్రస్తుతాంశం, బైబిలు చెప్పింది అటుజ్ఞానపరంగా తప్పావప్పా? ఇటు పనులపరంగా తప్పాఒప్పా? రెంటికి సంబంధించి కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులు చెప్పబడ్డాయా అన్నది తెల్సుకోవడమే.

కనుక ఈవిచారణ శాస్త్రీయ మనదగ్గరీతిలో ఆరంభించి ముగించాలంటే ముందుగా

1. ఎంపికచేసుకున్న అంశాలవరకైనా బైబిల్‌ ఏమిచెప్పిందో ఇతమిద్దంగా ప్రకటించాలి. దీనినే సాంకేతికంగా 'ప్రతిపాదన' అంటారు. ప్రతిపాదన ఏమిటి? సరైన ప్రతిపాదన ఎలా ఉండాలి?

1. ప్రతిపాదనంటే ఏదో ఒక విషయానికి సంబంధించి ఎవరోఒకరు వెళ్ళడించిన అభిప్రాయమని అర్ధం. కనుక అభిప్రాయం చెప్పాలంటే ఏదో ఒక విషయముండాలి. ఎందుకంటే విషయంలేకుండా అభిప్రాయప్రకటననేదే ఉండదుకనుక. దానిని వెల్లడించేవాడో, దానిపక్షాన మాట్లాడడానికి సిద్ధపడినవాడో వాది అవుతాడు. అతడు ఆయావిషయాలపై వెల్లడించిన అభిప్రాయం 'వాదము' అవుతుంది. తనవాదము లేదా ప్రతిపాదన సరైందేనని రుజువుచేయడానికి అతడు హేతు ఉదాహరణలతో ప్రకటించేదంతా వాదన అవుతుంది. అలా ఒక అంశంపై వాది ప్రకటించిన అభిప్రాయంపై ప్రశ్నలు లేవనెత్తడంగానీ, దోషాలుఎత్తి చూపడంగాని చేసేవానిని అంటే వాటితో విబేధించేవానిని ప్రతివాది అంటారు.

ముఖ్యగమనిక : చర్చావేదిక నియమాలన్నిటిలోకి ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని నిరూపించాల్సి ఉంటుందన్నది అత్యంత మౌలికము, కీలకము, మినహాయింపులు లేని నియమమూ అయిఉంది. ఉదాహరణకు రెండురెళ్ళు నాలుగన్నాడు ఒకడు, కాదనదలచుకుంటే ఎలా తప్పోనిరూపించు అని ఎదుటివాణ్ణి అడిగాడనుకోండి. అది పైనియమాన్ని ఉల్లంఘించినట్లే. రెండురెళ్ళు ఎలా నాలుగో అన్నవాడే నిరూపించాలి అన్నదే సరైన విధానానికిచెందిన నియమం. దీనినే దేవునికి అన్వయిద్దాం. ఒక ఆస్థికుడు దేవుడున్నాడు. అని ప్రతిపాదించాడు. కాదనదలచుకుంటే ఎలా లేడో నిరూపించమని ఇతరుల్ని అడిగాడనుకోండి. అది సక్రమవిచారణ పద్ధతికాదు. ఇతరులు, ఇదిగో ఇందువలన, ఇలా దేవుడులేడు అని చెప్పబూనడమూ సరైందికాదు. సరైన పద్ధతైతే మాత్రం పైననేన్న నియమాన్ననుసరిస్తూ దేవుడున్నాడన్నవాడే దేవుడున్నాడన్నదానిని నిరూపించాలి.

ఒకవేళ ప్రతిపాదకుని స్థానంలో ఒకనాస్థికుడుండి, దేవుడులేడు అని ప్రతిపాదించా రనుకుందాం అటుపైన అతడు ఉంటే చూపించుఅనో, రుజువు చేయమనో ఆస్థికుల్ని అడగడమూ నియమాన్నతిక్రమించడమే. దేవుడులేడన్నవాడే తానన్నమాట సరైందేనని రుజువు చేయాల్సివుంటుంది.

నిజానికి ఎంతో కీలకమైన ఈనియమం తెలియకుండా గానీ, తెలిసిపాటించకుండా గానీ విచారణలపేర చేసేవన్నీ విచారణలనడానికి తగినవి కావు. వాటిని చర్చలు అని గాక రచ్చలని అనడం మేలు. పిచ్చి గొడవలన్నా తప్పులేదు.

చర్చావేదిక నియమనిబంధనల్లో చోటుచేసుకునే ప్రధానాంశాలు.

1. భాషానియమాలు : చర్చ అన్నామంటేనే వాదప్రతివాదాలు, వాదనలు ఉంటాయి. అదంతా భాషని ఆధారం చేసుకునే చేయాల్సి ఉంటుంది. మరో ప్రత్యామ్నాయం లేదు. కనుక వేదికలో పాల్గొనే నాలుగు బృందాలకు చర్చకు అవసరమైన ఎవరికైనా భాషానియమాలు తెలిసుండాలి. కనీసం పాల్గొనే సమయానికైనా దీని విషయంలో ముఖ్యమైన మేరనైనా ఏకాభిప్రాయం ఉండాలి.

2. వాదనియమాలు : (దీనినేతార్కిక నియమాలంటారు) ప్రతిపాదన, ప్రతిపాదనకు మనకున్న ఆధారాలు, రుజువు చేయడానికి అవసరమైన అంశాలు, వాటి యోగ్యతాయోగ్యతలకు సంబంధించిన వివరాలు, మొ||వాటిపైనా నాలుగు బృందాలకు ఏకాభిప్రాయం కుదరాలి. ప్రతిపాదించడానికీ, ఆధారాలు చూపడానికి, నిర్ధారించడానికీ ఉన్న సంబంధాలు, తేడాలు తెలిసుండాలి. ఉదాహరణకు ఆధారాల స్థానంలో, బలమైన ఆధారాలు చూపడం బలహీనమైన ఆధారాలు చూపడం, ఆధారాలుగ పనికిరానివాటిని ఆధారాలుగా చూపడం, అన్నమూడు పోకడలు పోయేవీలుంది. అలాంటపుడు యోగ్యమైన ఆధారమాకాదా నిర్ణయించుకునేదెలా అన్నదానికి అందరూ ఒకపద్ధతి నెంచుకోవాలి. అట్టివాటినే వాదనియమాలు అనంటారు.

ప్రతిపాదన అభిప్రాయాన్ని సంపూర్ణంగా ప్రకటిస్తున్న రూపంలో ఉండాలి. అస్పష్ట ప్రకటనను ప్రతిపాదన అనకూడదు. అన్నది వాదనియమాలలో ప్రతిపాదనలకు సంబంధించిన ఆరంభ నిబంధన అవుతుంది. ఉదా : ఒకరు దేవుడున్నాడన్నవాళ్ళకి ఉన్నాడు, లేడన్నవాళ్ళకిలేడు అన్న అభిప్రాయాన్ని చెప్పాడనుకోండి. దానిని విచారణకు పనికివచ్చే ప్రతిపాదనగా స్వీకరించనేకూడదు. ఎందుకంటే 'ఉన్నాడు లేడు' అన్నది ఉనికికి సంబంధించిన విషయం కనక అక్కడ ఉండడమో, లేకపోవడమో ఏదోఒక్కటే వాస్తవమయ్యే అవకాశముంటుంది. దీనినే తార్కిక భాషలో మధ్యేమార్గ నిషేధ నియమం అనంటారు.

3. అలాగే విచారణ నియమాలు, నిర్దారణ నియమాలు ఉన్నాయి. వేదిక వీటివిషయంలో ఒక నిబంధనావళిని రూపొందించుకుంటే తప్ప, వాదప్రతి వాదులలోఎవరైనా తామన్నది సరైందేనని నిరూపించారో నిరూపించలేదో నిర్ధారించడం కుదరదు.

ఇవేవి పట్టించుకోకుండా, అలా నిర్ణేతలు, పరిశీలకులు ఉన్న రెండు పాత్రలను ఎంపిక చేసుకోకుండా, సంతలలాటి బహిరంగ సమావేశాలలో మాట్లాడేవి, కాట్లాడుకునేవి వాదనలుకావు, విచారణలూ కావు, చర్చలూకావు. కనుక సిద్ధాంత చర్చలు అందుకు తగిన వాతావరణంలో తగిన (సమర్ధులైన) వ్యక్తులతోకూడి ఎటువంటి అవరోధకాలు లేని రీతిలో సాగించాలి. ఇంకా చాలా చెప్పాలనిపిస్తున్నా, మడమతిప్పను, వెనుకడుగేయను, వెన్నుచూపను, విచారణ ఒక ముగింపునకు వచ్చేంతవరకు వేదికను విడవను అని ఇరుపక్షాలు నిర్ణయించుకుని ఆమేరకు ప్రాధమిక ఒప్పందం చేసుకుని, ఆపైన నియమనిబంధనల రూపకల్పన కొరకే ఒక ఆరంభ సమావేశం ఏర్పరచుకున్నాక; అప్పుడు వీటి గురించి విపులంగా మాట్లాడుకుని, ఖరారు చేసుకోవచ్చు.

నా ప్రకటన : బైబిలుపై విచారణకు నేను సిద్ధమని ఇందుమూలముగా ప్రకటిస్తూ, సిద్ధపడమని పి.డి. సుందర్రావుగారిని పిలుస్తున్నాను.

జ మరొక్కమాట :

పి.డి. సుందర్రావుగారి ప్రసంగాలలో చాలా దూకుడు కనబడింది.

1. నేను వాదనకు రావాలంటే ఇండియావాడు చాలడు, ఇంటర్నేషనల్‌ ఫిగర్‌కావాలి అన్నారాయన.

2. అంతలోనే దమ్మున్నవారెవరైనా సరే చాలెంజ్‌, రెడీగావున్నాను రావచ్చన్నాడు.

3. రమ్మనండి ఎవరొస్తారో, వారికి నేనక్కర్లేదు నాబిడ్డల్లో ఆఖరివాణ్ణి, చిన్నవాణ్ణి పంపుతాను చాలు అనీ అన్నాడు.

4. నాతోపోటీలో 10 రౌండ్లు, 14 రౌండ్లు ఉండవ్‌, ఒకే సెకండ్‌, ఒకే రౌండ్‌, నాకౌట్‌ అంతే అనీఅన్నాడు.

జ పాపం ఇంకాచాలా, చాలా అన్నాడు అవన్నీ తెలియాలనుకున్నవాళ్లు ఆయన ప్రసంగాలను విని తెలుసుకోవచ్చు. నావరకు నాకలాంటి అతిశయమేమీలేదు. పోటీకి - సత్యాసత్య విచారణకు సిద్ధపడ్డవాడు పెద్దవాడా, చిన్నవాడా అన్న వివక్ష నాకేమిలేదు. 'సరియైనమాట పిల్లవాడు చెప్పినా స్వీకరించబడదగిందే అవుతుంది. అలా కానిది ఎంతవాడు చెప్పినా గడ్డిపరకతో సమానం' అన్న సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకునిపోతున్న వాణ్ణినేను. సత్యాన్వేషణ మండలి పోకడకు ఆధారపీఠం ఆ సూత్రమే.

సూత్రం : యుక్తియుక్త ముపాదేయం వచనం బాలకాదపి !

అన్యతృణమివత్యాజ్యమప్యుక్తం పద్మజన్మనా !! దీనర్ధం పైన చెప్పిందే.

పి.డి. సుందర్రావు ఒక ప్రసంగంలో అనిల్‌ బృందానుద్దేశించి, మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టినవారైతే మీ అనిల్‌ని నాతో పోటీకి సిద్ధంచేసి తీసుకురండి! అని ఎంతో అసభ్యంగా, సంస్కారహీనంగా, బహిరంగంగా అనేశాడు. అంతటి దిగజారుడు భాష మాట్లాడినందుకు ఆయనకుగానీ, ఆయన బృందానికి గాని చిన్నతనమనిపించకపోవడం నాకైతే ఆశ్చర్యమే. ఏమిటాభాష? అనిల్‌ని పట్టుకురాలేకపోతే వీళ్ళంతా ఒక అమ్మకు అబ్బకు పుట్టినోళ్ళుకాకుండా పోవడమేమిటి? ఆయన బృందంలో ఒక్కడికీ అది తప్పనిపించకపోవడమేమిటి? అలా అనడంలో ఏమీ తప్పులేదని ఆయన, ఆయన బృందము ఇప్పటికీ అనుకుంటుంటే అదేమాట, ఆయన బృందాన్నుద్దేశించి నేనూ అన్నాననుకోండి ఏమిచేస్తారు ఆయన బిడ్డలూ, అభిమానులంతా. ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళం కాకుండా పోతామేమోనని భయపడి ఆయన్ను నాతోపోటీకి ఆయన రానన్నాసరే కట్టేసి పట్టుకొస్తారా?

నాతో చర్చలో బైబిలు పక్షాన ఎవరు పాల్లొనాలన్నది పి.డి.సుందర్రావుగారే నిర్ణయించుకోవచ్చు. ఆయన ఆఖరి శిష్యుడు నాకుసరిపోతాడనుకున్నా, ఆయన పెద్దకొడుకు సరిపోతాడనుకున్నా, ఆయనే రావాలనుకున్నా నాకెట్టి అభ్యంతరం లేదు. అయితే ఆయన పంపిన వారు నాతో పోటీలో నిలబడ లేకపోతే దాంతో పి.డి.సుందర్రావుగారు తానే ఓడిపోయినట్లు అంగీకరించి ఒప్పందాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోవాలి. అలాకాక, ఆయన పంపినవాడు ఒకడు పడిపోగానే, అయితే వీడితోపోరాడు,ఆపైన మరోడితో పోరాడు ఆఖరున నేను వస్తాను లాటి మాటలు మాట్లాడకూడదు. వేదిక నియమాలన్నింటిలోనే ఇది ప్రధానమైనది. ఈ విషయంలో నావైపునుండి నేను చెప్పేదేమంటే, పోటీలో నేనే నేరుగా నిలబడతాను. మీపక్షం సరైందేనని నిర్ధారణైతే మారు మాట్లాడకుండా పైన నేను సూచించిన ప్రయోజనాలకు సంబంధించిన మూడు అంశాలతో కూడిన పందెపుఒప్పందాన్ని అమలుచేస్తాను. పందెపు ఒప్పందం క్రింద ఇంకా ఏమైనా కూడా కలిపే పెట్టుకుందామనుకుంటే అదేమిటో మీరే చెప్పండి, పరిశీలిస్తాను.

జగద్గురుగారికి అభినందనలు

చాలాకాలం వివిధ తాత్విక ధోరణులను, తత్వ చర్చావేదిక పేరున నిర్వహించి ఆచర్చల సందర్భంగా, దీర్ఘకాలంపాటు వివిధ ధోరణులకు చెందిన వేత్తలుగ ప్రసిద్ధులైన వారితోనూ, ప్రచారకులు, గురువులుగా చలామణి అవుతున్నవారితోనూ చర్చలు, గోష్ఠులు, సిద్ధాంత విచారణలు చేస్తూవచ్చిన నేను, ఆయా పక్షాలవారిలో సత్యాన్ని స్వీకరించడానికి నిజాయితీగా సిద్ధపడే వారు ఎదురవకపోవడంతో, ఆకార్యక్రమాలను తాత్కాలికంగా ప్రక్కనపెట్టి సామాజిక హితక్షేత్రాలలో పనిచేస్తున్న మంచివాళ్ళతో కలసి సామాజిక సమస్యల పరిష్కారయత్నాలు చేస్తూవస్తున్నాను. అలాంటి నన్ను ఒక సంవత్సర కాలంగా ఇటు జగద్గురుగారు, అటు రంజిత్‌ ఓఫిర్‌గారి మార్గంలో ప్రయాణిస్తున్న జగదీష్‌ అన్నవారూ క్రైస్తవం విషయంలో మా మార్గదర్శితో, పెద్దతో మాట్లాడవచ్చు కదా అని మాటిమాటికీ కదిలిస్తూ వత్తిడిచేస్తూ వచ్చారు. జగదీష్‌ వత్తిడివల్ల 3,4 నెలల క్రితం సరే ఓఫిర్‌గారిని సిద్ధపడమనండి కూర్చుని మాట్లాడుకుందాం అని వారికి చెప్పాను, ఇంతలో మళ్ళా జగద్గురుగారు ఒకింత రెచ్చగొట్టేలానూ మాట్లాడుతూ, సరైన వారితో పోటీపడితేగదా, మీరేమిటో, మీసత్తాఏమిటో తెలిసేది, అనంటూనే అసలు మీలాంటి చిన్నవారితో మాట్లాడడానికి సుందర్రావుగారఖ్కర్లే, ఆయన శిష్యుణ్ణెవణ్ణోఒకర్ని పంపుతారు అన్నారు. అక్కడితోను ఆగక ఆయన బచ్చాగాళ్ళతో మాట్లాడరు లాంటి నోటితుత్తర మాటలూ మాట్లాడేశారు. వాడు బచ్చాగాడు, వీడు బచ్చాగాడు అనడానికి పెద్ద తెలివిగాని, సాహసంగాని అక్కరలేదండి, మీ పి.డి. సుందర్రావు బచ్చాన్నర అని నేనన్నాననుకోండి ఏమవుతుంది? ఏమీకాదు అని చెప్పి అలాంటి మొరటుభాష, సిద్ధాంత చర్చల స్థాయిలో ఉండేవాళ్ళకు శోభించదు కనుక ఆదారి మనకొద్దు అని చెప్పాను. ఏదేమైనా తాత్కాలికంగా ప్రక్కనపెట్టిన సిద్ధాంత విచారణ కొరకైన తత్వ చర్చావేదికను మళ్ళా ఆరంభింపచేసిన జగద్గురు గారికి అభినందనలు తెలుపుతున్నాను. ఆ విషయంలో మళ్ళా నేను కదలడానికి తనవంతు కృషిచేసిన జగదీష్‌నూ అభినందిస్తున్నాను.

ముఖ్య గమనిక

'బైబిలు సిద్ధాంత విచారణ'కై ఆరంభించిన ఈ యత్నాన్ని అటు బైబిలు పక్షీయులేగాక, ఏ ఆస్థిక పక్షీయులైనా వినియోగించుకోవచ్చు. అంతేగాక ఆస్థికేతర పక్షాలవారూ ఈవేదికను తమతమ సిద్ధాంత ప్రతిపాదన నిర్ధారణలకై వినియోగించు కోవచ్చు. సత్యాన్వేషణ మండలి, ఒప్పని తేలిన అంశాలను స్వీకరించడానికి, తప్పని తేలిన అంశాలను విడిచిపెట్టడానికి, ఇంకాతేలని అంశాలను తేలనివిగా అంగీకరించ డానికి సిద్ధంగా వుంది అంటుంది.

సిద్ధాంత విచారణ ప్రాతిపదికలు కొన్ని ఉన్నాయి.

1. బైబిలును ఆమూలాగ్రం పరిశీలించాలి.

2. అక్కడో ముక్క అక్కడో ముక్క పట్టిచూడ కూడదు. దానిని తార్కిక భాషలో సెలెక్టివ్‌ సైటింగ్‌ (ఏరి ఎంచుకున్న మాటలు) అనంటారు. అది సిద్ధాంత విచారణ నియమాలకు విరుద్దం. అయితే;

3. ఏయే అంశాలపై బైబిలు ఏమి చెప్పిందో చూద్దాం అని కొన్ని అంశాలపట్టిక ముందుగా ఏర్పరచుకోవచ్చు. అవసరమని వేదికలోని 4 సమూహాలలో ఎవరు అన్నా మలి జాబితాను పెట్టుకోవాలి. అందుకు ఎవరమూ అభ్యంతరం పెట్టకూడదు. కొంత పరిశీలించాక అందరం చాలనుకుంటే లేదా కనీసం వాదప్రతివాదులిద్దరూ చాలనుకుంటే సరేగాని, లేకుంటే మొత్తం బైబిలు వాక్యాలను పరిశీలించి చూడడమే సరైన పద్ధతి. విచారణ సరైన ముగింపుకు రావడానికి ఎంతకాలం పట్టినా అంతకాలం సాగించాల్సిందే అర్ధంతరంగా ఆపకూడదు. ఎవరూ విరమించుకోకూడదు. ఎందుకంటే

వాదనియమాలలో విప్రతిపత్తిర ప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానం అన్నసూత్రం ఉంది. అంటే, సందర్భాన్ని విడచి వేరు విషయాలు మాట్లాడినా, అడిగిన దానికి సంబంధించిన సమాధానం కాక, వేరు విషయాలు మాట్లాడినా, అసలేవిషయం మాట్లాడకా, సమాధానం చెప్పకా, ఊరుకున్నా అతడు ఓడిపోయినట్లేనని దానర్ధం. అన్య విషయ ప్రస్తావన (ప్రకరణభంగం అంటారు దీనినే) ఎవరూ చేయరాదు. సమాధానం చెప్పకుండా ఊరుకుండరాదు. అర్ధాంతరంగా చర్చను విరమించుకోవడం ఒకరకంగా సమాధానం చెప్పకపోవడంతో సమానం. కనుక అదీ ఓటమికి గుర్తే.

ఉజ్జాయింపుగా విచారణీయాంశాల జాబితా

1. బైబిలు ప్రకారం దేవుడన్నమాటకు అర్ధమేమిటి?

2. ఆ అర్ధంతో చెప్పబడుతున్నవాడు, బైబిలు దేవుడు. (చెప్పబడుతున్నది) ఎపుడుంది; ఎక్కడుంది, ఎంతుంది? ఎలా ఉంది? దాని గుణాలేమిటి? అది (వాడు) చేయు పనులేమిటి? అతనితో- దానితో మనకున్న సంబంధం ఏమిటి?

3. బైబిలు ఫలానా అనిచెపుతున్న దానినిగురించి తెలుసుకోవడం ఎలా?

గమనిక : ఒక వ్యక్తిని గురించి వివరాలు సేకరించేటపుడు మూడుకోణాలలో నుండి విచారిస్తే ఆవ్యక్తిని గురించి ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. అవేమంటే.

1. అతని జ్ఞానమేపాటిది? అజ్ఞానా? కించిజ్ఞుడా? అధికజ్ఞుడా? సర్వజ్ఞుడా?

2. అతని స్వభావం అంటే ఇష్టాయిష్టాలు ఎలాటివి? కోపిష్టా, శాంతమూర్తా, జాలి, దయ కలవాడా? కఠినుడా? క్షమాగుణం ఉన్నవాడా లేనివాడా? స్వార్ధపరుడా, స్వార్ధరహితుడా? న్యాయకారా, అన్యాయకారా? హింసాత్మకుడా? అహింసాత్మకుడా? సమదృష్టికలవాడా? స్వపరబేధాలున్నవాడా? వగైరా వగైరాలతో ముడిపెట్టి, ఆయా సందర్భాలలో అతని ప్రవర్తన వెనక పనిచేసిన గుణాలేమిటో ఆలోచించాలి.

3. బలహీనుడా, బలవంతుడా, సర్వశక్తిమంతుడా, పరిమితశక్తివంతుడా? పరులసాయం అవసరమైనవాడా, అక్కరలేనివాడా? అనుకున్నది చేయగలవాడా, చేయలేనివాడా? ఇలా అతని క్రియా సామర్ధ్యము, క్రియాకౌశలము లేపాటివో పట్టిచూడాలి.

ఇక దేవుని అంటే సృష్టికర్త అనబడుతున్నవాని విషయమై పరిశీలించాల్సినవి.

1. సృష్టి అంటే ఏమిటి? సృష్టిని ఎందుకు చేసినట్లు?

2. ఏదో ఒక కాలాన సృష్టిని ఆరంభించాడనుకున్నా అంతకుముందు, అప్పటివరకు ఏమిచేస్తున్నట్లు?

3. సృష్టి చేయకమునుపు, ఆయనతోపాటు ఎవరైనా ఉన్నారా? ఎవరెవరున్నారు? ఏమేమి ఉన్నాయి?

4. సృష్టిలోని వివిధాంశాలలోనూ వైవిధ్యం, వైరుధ్యం ఎందుకున్నాయి?

5. సృష్టి ఎలా ఆరంభించాలి? ఎలా సాగించాలి? ఎలా ముగించాలి? అన్నదంతా ఆయన ముందుగా అనుకుని చేసిందేనా? స్వర్గ నరకాలు ఉండాలనీ, అవన్ని శాశ్వతంగా ఉండాలనీ, ఆయన ముందుగా అనుకున్నదేనా? ఎందుకలా అనుకున్నట్లు?

ఏతాత్వికధోరణైనా, వ్యక్తి, సమాజము, ప్రకృతి అన్నవాటిని గురించి తన అభిప్రాయమేమిటో చెపుతుంది. ఇంతకూ బైబిలు ఈమూడిటి గురించి ఏమి చెపుతోంది.

ప్రకృతి :

1. మీరు బైబిలును విమర్శిస్తున్నారు కదా బైబిలు విమర్శకులకు సవాలంటున్న

1. మనకు తెలిసి ప్రకృతి (1) జీవప్రకృతి (2) నిర్జీవ ప్రకృతి అని రెండుగా కనబడుతోంది.

2. అందులో ఖగోళవిజ్ఞానం క్రింద, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు మొదలగునవి, సూక్ష్మ ప్రపంచం క్రింద అణువులు, పరమాణువులు, పరమాణు శకలాలు, వాటికంంటే భిన్నవైన ప్రాధమిక కణాలు, వివిధ తరంగాల రూపంలో శక్తి క్షేత్రాలు మొదలగునవీ విజ్ఞాన శాస్త్రానికి ఎదురైన నిర్జీవ విశ్వాన్ని గురించిన కొన్ని వివరాలు.

3. జీవమంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది. దేనితో ఏర్పడింది? ఏర్పడి ఎంతకాలమైంది? వగైరాలన్నీ జీవ ప్రకృతికి సంబంధించినవి.

4. వ్యక్తి : మనిషంటే ఏమిటి? ఎలా ఆవిర్భవించాడు? ఎపుడు ఆవిర్భవించాడు? ఏయేమార్పులకులోనై ఇపుడిలా ఉన్నాడు? అతని ఆవిర్భావానికి ప్రయోజనమేమైనా ఉందా? అతడేమి సాధించాలి? ఎందుకు సాధించాలి? ఎలా సాధించాలి? అలా సాధించాల్సినవి ఎప్పటికి సాధిస్తాడు?

5. పరిణామవాదం తప్పన్నారు. పరిణామవాదమంటే ఏమిటి? అదెలా తప్పు? రుజువు చేయండి.

సమాజం :

1. సమాజమంటే ఏమిటి? అది ఎపుడు ఉనికిలోకి వచ్చింది? ఎందుకు ఏర్పడింది? దానిని ఎవరేర్పరిచారు. ఎట్టి సమాజము కోరదగిన సమాజమవుతుంది?

2. ఆదిమ సమాజంగాని, అనాగరికి సమాజంగానీ గతంతో ఉన్నాయా? ఉంటే వాటి తీరుతెన్నులేమిటి? అది ఆధునిక సమాజంగా ఎందుకు మారుతు వచ్చింది? విజ్ఞానం పెరగడమంటే ఏమిటి? వెనుకటి సమాజంకంటే అనంతరం వచ్చిన సమాజాలలో జ్ఞానం పెరిగిందా, తరిగిందా? అలానే ఉందా?

3. 1. వ్యక్తి తనకొరకు తానెలా జీవించాలి? అదే సరైందనడం ఎలా?

2. సమాజం కొరకు ఎలా జీవించాలి? అదే సరైందనడం ఎలా?

3. వ్యక్తి ప్రకృతి కొరకు ఎలా జీవించాలి? అదే సరైందనడం ఎలా?

4. వ్యక్తి దేవునికొరకు ఎందుకు జీవించాలి? ఎలా జీవించాలి? అదే సరైందనడం ఎలా?

మొత్తం మానవజాతినంతటినీ ఉద్దేశించి మాట్లాడే సిద్ధాంతాలను ఇలా అడగ గలిగినన్ని ప్రశ్నలడిగి, వాటికి ఆ సిద్ధాంతం ఎన్నింటికి సమాధానాలు చెపుతుందో, ఏమని సమాధానం చెపుతుందో చూడాలి ముందు. ఆపైన ఆ సమాధానాలు సరిగా ఉన్నాయోలేవో పరీక్షించాలి. అలా చేయాలి సిద్థాంత పరీక్ష.

బైబిలు విషయంలోనూ మనముందున్న లక్ష్యం అదే. ఆయా విషయాలపై బైబిలు అభిప్రాయాలేమిటి? వాటి సబబేపాటిది? అన్నదే మన విచారణ క్షేత్రమంతా! ఇందుకు అంగీకరించకున్నా, అంగీకరించీ అన్యవిషయాలు మాట్లాడినా సిద్ధాంత విచారణ జరుగుతున్నట్లు కాదు.

బైబిలు ఇటు జ్ఞానపరంగాగాని, అటు జీవితాచరణపరంగాగాని దోషరహితమైనది అని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత బైబిలు పక్షానిదే. దానిని పరిశీలించడం దోషాలున్నాయనిపిస్తే ఎత్తిచూపడమో, ప్రశ్నించడమో రెండో పక్షపుపని. బైబిలు దైవ వాక్యమనిగాని, స్వీకరించదగిందనిగాని అంటున్నామంటే అది అన్నివిధాలా దోషరహితమని అంటున్నామని. ఆ విషయాన్ని రుజువు చేయడమే ఆ పక్షాన్ని స్వీకరించినవారు చేయాల్సింది. అప్పుడే వారు గెలిచినట్లు.

(చివరగా నేను ప్రకటిస్తున్నదేమంటే)

సత్యం స్థాపించబడాలని కోరుకుంటున్నవారందరికీ ఈప్రకటన వర్తిస్తుంది.

1. ముఖ్యంగా ఈ వ్యాసాన్ని రాయడానికి కారణమైన పి.డి.సుందర్రావు గారికిది వర్తిస్తుంది. అందుకే ఆయనను పేరుపెట్టి సత్యాసత్య విచారణకు సిద్ధంకమ్మని పిలుస్తున్నాను.

బైబిలును దైవగ్రంథంగా నిలబెట్టాలనుకుంటూ, జనుల్ని అటువైపు మరల్చాలను కుంటున్న పి.డి.సుందర్రావుగారికి అయ్యా,

దేవుడున్నాడని, అదిన్ని బైబిలులో చెప్పబడ్డదేవుడే నిజమైన దేవుడని, బైబిలు దైవవాక్యమని, అందులో విశ్వానికి చెందిన సమస్థజ్ఞానం ఉందని, ఆ విషయాలన్నీ మీకు తెలుసుననీ, ఆ విషయాలు తెలిసినవారు మీరొక్కరేనని, మీ ప్రసంగాల ద్వారా ప్రకటించి ఉన్నారు. అలా మీరన్నవాటినన్నింటిని నిజాలేనని నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. బైబిలు సత్యవేదము, బైబిలులో చెప్పబడ్డవన్ని సరైనవి, స్వీకరించదగినవి అని గనక మీరు నిరూపిస్తే నేను మీనుండి క్రైస్తవం స్వీకరించడానికి అటుపైన జీవితాంతం మీఅనుచరునిగా మీమార్గంలో నడవడానికీ, నాలో అంతటి మార్పుకు కారణమైనందుకు మీకు ఒక కోటిరూపాయలు కృతజ్ఞతా సూచకంగా చెల్లించడానికి నేను సిద్ధము. నాలానే మీరున్ను, మీరన్నవి నిరూపించలేకపోయినట్లైతే మీరు మీక్రైస్తవ మార్గాన్ని విడచి నావెంట సత్యాన్వేషణ మార్గంలో నడవాలి. ఆ జీవితం సత్యాన్వేషణ మండలి భావజాలాన్ని ప్రచారం చేస్తు జీవించాలి. మిమ్ములనలా మా అన్వేషణా పథంవైపుకు మరల్చినందుకు ప్రతిఫలంగా మీరునాకు ఒక కోటి రూపాయలు చెల్లించాలి. ఇందుకు మీరు సిద్ధమైతే ఈ విషయాలను, విచారణకు అవసరమైన ఇతర విషయాలను కలుపుకుని ఒక ఒప్పందపత్రం వ్రాసుకుని రిజిష్టరు చేద్దాము. నాతో చర్చలో పాల్గొనడానికి ఎవరు సిద్దపడతారన్నది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నావైపు నుండి నేను మాత్రమే పాల్గొంటాను. నావైపు నుండి ఈ విషయంపై మనం అనంతరం కార్యక్రమాలను ఆరంభించుకోడానికి ఈ క్షణం నుండే సిద్ధంగా ఉన్నాను. ఇది నేను పూర్తి స్పృహతోనూ, ప్రశాంత చిత్తంతోనూ వ్రాతమూలకంగా తెలుపుతున్న సమ్మతి.

సత్యాన్వేషణలో..

మీ,

సురేంద్ర

ముఖ్యగమనిక : మీప్రసంగ ధోరణి విన్నాక మరో నిబంధనా చేసుకుందామనిపిస్తోంది నాకు. ప్రసంగంలో అనవసరపు విషయాలు ఏరూపంలో ఎవరు మాట్లాడినా ఎప్పటికపుడు అలా గాడితప్పినందుకు శిక్షగా, గాడితప్పినవారి చెంపపై రెండోవారు చెప్పుతో ఒకటిచ్చుకోవాలన్న నియమాన్ని పెట్టుకుందాం. మొత్తం జరిగేదాన్నంతటిని వీడియోలో రికార్డు చేద్దాం. వాటిని సి.డిలలోకి ఎక్కించి ప్రపంచానికందిద్దాం. ఈపని భవిష్యత్తులో చర్చలుచేసుకునేవారికి ఎంతోకొంత మేలు కలిగించగలుగుతుంది. నేను పొరపాటుగా మాట్లాడినప్పుడల్లా మీతోగాని, నాతో చర్చకు సిద్ధమైన వారితోగాని చెప్పుతో కొట్టించుకోడానికి నేను సిద్ధము. ఇక ఉచితమైన ప్రత్యుత్తరం మీవైపునుండే రావాలి. ఈవ్యాసాన్ని నాకు తెలిసిన వివిధ ధోరణుల వారికి పంపుతాను. మీరుపంపమన్నవారికి పంపుతాను. మీ సమాధానాన్ని వివేకపథంలో ప్రచురిస్తాను. ఈ ప్రకటనను మీకో పత్రికుంటే దానితోనూ ప్రచురించండి. నాకు తెలిసిన మరికొన్ని పత్రికలకూ పంపుతాను. విూరూ అలా చేయవచ్చు. సమాధానం మార్చినెల 25 లోపు నాకు చేరాలి. ముద్రించాలికనుక. ఉంటాను. సెలవ్‌.

మిమ్మల్ని అర్ధంచేసుకోడానికి వీలుగా ఒకసెట్టు మీ రచనలు, సి.డిలు పంపగలిగితే వెంటనే పంపండి.

No comments:

Post a Comment