Tuesday, August 9, 2016

మిత్రులుఫజులూర్‌ రహమాన్‌గారికి -- కోట ప్రసాద శివరావు లేఖ



మీకు 6వ తేది నాలుగు పర్యాయములు ఫోను ద్వారా వాట్సాప్‌కాల్‌ ద్వారా మాట్లాడటానికిప్రయత్నించాను. కాని మీతో మాట్లాడటము నాకు సాధ్యపడలేదు. అందువలన ఈ లేఖ ద్వారా నా భావాలను తెలియపరుస్తున్నాను.

మీరు ఫేస్‌బుక్‌లో వుంచిన సత్యాన్వేషణమండలి అనుచరులకు నా మనవి అంటూ తెలియపరచిన విషయాలు చదివాను. మీరు మన సమావేశాలలో విషయానికి ప్రక్కకు వెళ్ళి మాట్లాడేవారిని ప్రకరణభంగం చేసారంటుండేవారు. కాని మీరు ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయములు పూర్తిగా ప్రకరణ భంగం కలిగించేవే. విషయాన్ని విడచి పరనిందకు పాలుపడ్డారు. చిల్లర చిల్లరగ తెలిసి తెలియని ప్రచారాలు చేసేవారని, సొంత తల సరిగ పని చేయనివారని, ఇతరులపై ఆధారపడే బలహీనత గలవారని, తప్పుడు ప్రచారం చేసేవారని అన్నారు. ఇదంతా ప్రకరణ భగం కాదా?

చివరిసారి మన సమావేశంలో నేను ప్రసంగించేది విని తరువాత మాట్లాడండి అని మీరు ప్రసంగించారు. దానిలోని ముఖ్య అంశాలు 1) ఒక డినామినేషన్‌ (మతం) నుండి మరొక డినామినేషన్‌కు వెళ్ళటానికి పూర్తి స్వేచ్ఛ వుండాలన్నారు.

2. ఎవరికినచ్చిన విశ్వాసాన్ని (డినామినేషన్‌ను) వారు ప్రశాంతంగా, సావధానంగా అనుసరించవచ్చు అన్నారు. 3. ఒకరు తమ డినామినేషన్‌ను వదలి మరొక డినామినేషన్‌కు పోయినందుకు అతనిపై మొదటి డినామినేషన్‌వారు ఎలాంటి వత్తిడి తీసుకురా కూడదన్నారు. అలా చేస్తే అది అమానుషం అన్నారు. ఇవన్నీ రికార్డు కూడా చేసియున్నాము.

ఇంతకు మీరు ఋజువు పరచవలసింది అవిశ్వాసులపట్ల ఖురాన్‌ వైఖరి సరైనదే, అవిశ్వాస కారణంగా చంపమని లేదనేగదా! ఆ విషయాన్ని ఋజువు పరచటానికి అంత ప్రకరణ భంగం కలిగించాలా?

ప్రకరణ భంగం ఎప్పుడు, ఎవరు చేస్తారన్నది పరిశీలించేటప్పుడు, తేల్చవలసిన విషయములో పూర్తి పట్టు (తగినంత అవగాహన) లేనివారు విషయాన్ని ప్రక్కదోవ పట్టించటానికి చేసే పనేనని మీరు ఒప్పుకొంటారుగదా!

మరొక విషయము. మన చర్చలలో వాది బలము, వాద బలము విడదీసి చూడాలని చెప్పుకునేవారము కదా! వాద బలముండి వాది సరైన అవగాహన (సరిపడినంత అవగాహన) లేనివాడైతే మరెవరి సహాయంనైనా పొందవచ్చునని చెప్పకునేవారము. కాని మీరు వాద బలాబలాలను చూడకుండా మీ వాది పఠిమతో ప్రకరణ భంగం కావించి వ్యక్తులపై నిందలు మోపడం సరైన విధానమా? ఒక పరి పునరాలోచించండి.

ఇక విషయపరంగా చూస్తే. మీరే ప్రకటించిన మీ అభిప్రాయాలకు భిన్నముగ ఖురాన్‌ చెబుతున్నదనటానికి గొప్ప తర్కము (లాజక్‌) తో పని లేదనుకుంటా.

ఎందుకంటే ఇస్లాం నుండి బయటకు వెళ్ళినవారిని వధించమని ఖురాన్‌ చెబుతుంది. వందశాతం కరెక్టేనని మీరు అంగీకరించారు. మీరు మాట్లాడిన దానిలో ఒకరు ఒక డినామినేషన్‌ నుండి మరొక డినామినేషన్‌కు వెళితే మొదటి డినామినేషన్‌వారు, అతనిపై ఎలాంటి వత్తిడి తీసుకురాకూడదన్నారు. అలా చేస్తే అది అమానుషం అనీ అన్నారు. అంటే ఇస్లాం నుండి బయటకు వెళ్ళేవారిని వధించమని వందశాతం కరెక్టేనని చెబుతున్న ఖురాన్‌ అమానుషమనేగదా! ఇంత చిన్న విషయము మీకు అర్ధము కాలేనదనుకోవడము మా పొరపాటే. ఎందుకంటే మీది చురుకైన బుఱ్ఱ అని సురేంద్రగారు కొనియాడుతుంటారు అది మరిచారా?

అలానే ఎవరికి నచ్చిన డినామినేషన్‌ను (విశ్వాసంలో, మతంలో) వారు ప్రశాంతంగా సావధానంగా అనుసరించవచ్చు అన్నారు. కాని ఖురాన్‌లో అల్లాః నే నమ్మాలిఅని మరెవ్వరిని ఆయనకు సాటి కల్పించరాదని, అలా సాటి కల్పించేవాడు, ఎక్కడకు వెళతాడో, వాడితో ఎలా వుండమనో ఖురాన్‌లోనే వుంది గదా!

దీని ప్రకారం ఇస్లాంకు ఒక తలుపు మాత్రమే వుంది. అది లోపలికి వచ్చేదే. బైటకు వెళ్ళే అవకాశమే లేదని మీ ప్రతిపాదనే తెలియజేస్తుందికదా! ఇదేమైనా అత్యంత కష్టమైన అర్ధంకాని విషయమా?

ఇకపోతే మండలి చూపించిన 'అవిశ్వాసిని చంపమంటోంది ఖురాన్‌, అనటాన్ని' (18:80) ని పరిశీలిద్దాం. ఖురాన్‌ ప్రకారము ఖిజరు మహాజ్ఞాని, మోషే కంటే కూడా జ్ఞాని అని చెబుతుంది. అలాంటి జ్ఞాని ఒక బాలుని చంపిన ఉదంతం తెలిసిందే గదా! దానికి ఆ జ్ఞాని సమాధానము ఆ బాలుడు తన అవిశ్వాస కారణంగా అతని తల్లిదండ్రులను వేధిస్తాడని. ఆయన జ్ఞాని కనుక ఖచ్చితంగా తెలిసి వుంటుంది. ఆ బాలుడు తన అవిశ్వాస కారణంగా తన తల్లితండ్రులను వేధిస్తాడని. వేధించటానికి కారణము ఏమిటంటే అతను అవిశ్వాసి గనుక. కాబట్టి అతను మరణానికి అర్హుడని మహాజ్ఞాని తన చేతలద్వారా చెబుతుంటే  మనమెవ్వరము, మనమెంత అది కాదు అనటానికి, అల్లాః అంగీకరించిన గొప్ప జ్ఞాని చేసిన పని తప్పనటానికి మనజ్ఞానమెంత? ఎందుకు ఆలోచించడములేదు? కావున దివ్యఖురాన్‌ ప్రకారము, అల్లాః ప్రకారము జ్ఞాని అయిన ఖిజరు ప్రకారము అవిశ్వాసి మరణానికి అర్హుడని చెబుతుంటే, ఖురాన్‌ చెప్పలేదనడము ఏ విశ్వాసికైనా కుదురుతుందా? ఈ చిన్న విషయం అర్ధంకాలేదనుకోగలమా? తప్పు, తప్పు. నాకంటె చురుకైన బుఱ్ఱమీది. మరి ఒప్పుకోక పోవడానికి అడ్డంవచ్చిన విషయమేమిటంట? మీరే వివరించాలి.

గతంలో మీరు ఫోను చేసినప్పుడే చెప్పాను. ఖురాన్‌లో అవిశ్వాస కారణంగానే చంపమంటుంది అన్న విషయం మీకు కనపడదని, ఒకటికి రెండుసార్లు చెప్పాను మీకు కనపడదని. దానికి కారణం చెప్పకుండా కనపడదు అంటే సరిపోదుగదా! అని మీరు అడగవొచ్చు

గతంలో మండలిలో చాలా చర్చలు జరిగాయి. అన్ని సమావేశాలలో మీరు పాల్గొనేవారు మండలి ఇంటర్నల్‌ మీటింగుకు కూడా మీరు నేను రావచ్చా అంటే తప్పకుండా రండని నేనే ఆహ్వానించాను.

ఆయా సిద్దాంత చర్చలలో మీరు పాల్గొంటూ నాతో ఒక మాట అన్నారు. గుర్తుంది అనే అనుకొంటాను ''ఈ తర్కము ముందు ఏమత గ్రంధము నిలబడదని'' అలాంటి తర్కము చేయగల సత్తా వున్న మీరు అన్ని మత గ్రంధాల (క్రైస్తవం, హిందూ ముస్లిం)ను విమర్శించేటప్పుడు మీ నుండి ఎలాంటి రియ్షాను లేకపోతే నిజంగా సత్యాన్వేషిమార్గంలో మీరున్నారని నేను నమ్మాను. గతంలో ఎప్పుడూ మీరు అల్లాః మీకు హిదాయత్‌ ఇవ్వాలని నా ప్రార్ధన  అని అనలేదు. కాని ఇప్పుడు మీరు పూర్తి విశ్వాసిలాగా అల్లాః మీకు హిదాయత్‌ ఇవ్వాలని నా ప్రార్ధన అంటున్నారు. దీనిని మేము ఎలా అర్ధం చేసుకోవాలో మీరే వివరిస్తే బాగుంటుంది.

గతంలో మార్స్కిజం పై చర్చలు జరుగుతున్నప్పుడు ఒక మిత్రుడు మార్క్సిజం విశ్వాసిగా వుండేవాడు. ఆయన మాకు ముందే చెప్పేవాడు మార్స్కిజం పై నా వద్ద విమర్శించవద్దని. ఆయన్ని పూర్తి విశ్వాసిగా అంగీకరించవొచ్చు.

కాని మిమ్ములను విశ్వాసిగా (మీరు మాతో చర్చలలో పాల్గొన్న సమయాలలో చర్చించిన రీతిలో) భావించే అవకాశమే లేకుండా చేయగలిగారు. దానికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఇప్పుడు మిమ్ములను ఏమని అర్ధం చేసుకోవాలి? ఎలా అర్ధం చేసుకోవాలి?

నాకనిపిస్తుందేమిటంటే మీరు మొదట హిందువుగా వుండి, క్రైస్తవానికి, దాని నుండి ఇస్లాంకు మారుతూ వచ్చానని గతంలో చెప్పియున్నారు. అలానే సత్యాన్వేషిగా మారారేమోనన్న ఊహలో వున్నాను. ఇప్పుడు నాకు తేలిందేమిటంటే ఒక విశ్వాసము నుండి మరొక విశ్వాసమునకు మారటానికి స్వతంత్రాలోచన (సొంతబుద్ది) వుండవలసిన అవసరం లేదు. ప్రభావితం చేయకలిగిన వ్యక్తో, గ్రంధమోవుంటే చాలని. కాని సత్యాన్వేషిగా మారాలంటే స్వతంత్రాలోచనా పరుడైయుండాలి. అంటే తన సొంత ఆలోచనతో నడవగలగాలి (ఏ వ్యక్తో, ఏ గ్రంధమో ప్రభావం లేకుండా) అందుకనేనేమో సత్యాన్వేషి కావడం చాలా కష్టమైన పని అంటారు.

ఎందుకనో ఇప్పటికీ నాకు మీరు సత్యాన్వేషిగా వుండ కలిగే స్వతంత్రాలోచనా పరులు గానే కనిపిస్తున్నారు. నాయోచన సరైనదే అయితే మరెలాంటి అవరోధాలు మిమ్ములను ఆపుతున్నాయో మీరు చెబితేగాని తెలుసుకోలేము.

మరొక్క విషయము. వాదనియమాలు తెలిసినమీరు, ఇరుపక్షాలు ఒక విషయాన్ని నిగ్గుతేల్చాల(సత్యమ)ని కూర్చుంటే ఆ ఇరుపక్షాలలో ఏ ఒక్కరికి ఇది సత్యమని తేల్చాను అనే అధికారముండదు. ఇరుపక్షాలు అంగీకరించిన నిస్పాక్షులైన మేధావులకు మాత్రమే ఆ అధికారముంటుంది. ఈ నియమం మీకు తెలియనిది కాదనుకొంటా! మరి తెలియనట్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్దం కావడం లేదు.

గమనిక :- పూర్వనిశ్చితాభిప్రాయాలు పెట్టుకొని మాట్లాడకూడదన్న విషయాన్ని చక్కగా గుర్తించారు. కాని అది వాడకూడని తావులలో కూడా దానినివాడేస్తున్నారు. ఆలోచించండి. (విషయాన్ని గ్రహించడం ఎంత గొప్పవిషయమో దాన్ని ప్రయోగించే సమయ, సందర్భాలు అంత ముఖ్యము అని గ్రహించాలి)

రహమాన్‌ గారి స్పందన :-  ది.16-7-16న రహమాన్‌ గారు వాట్సాప్‌ ద్వారా పంపిన సమాధానము.

ది.9-7-16న మీరు వ్రాసినలెటరు అందినది. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. నేనెవరిని ఉద్దేశించి వ్రాసానో, వారు చేసిన, చేస్తున్న పనేమిటో మీకు తెలిసి వుంటే ప్రకరణ భంగమని, పరనింద అని నన్ను అనేవారు కాదు మీరు.

మండలి మనుషులమని చెప్పుకొనేవారందరూ మీలాగే ఉన్నారని అనుకొంటూ అలా వ్రాసి వుంటే అంతకు మించిన అమాయకత్వము మరొకటి వుండదుకదా!

ఒక మతం నుండి మరొక మతం మారడం, ఒక సంఘం నుండి మరో సంఘానికి,అలాగే ఒక సిద్దాంతం నుండి మరొక సిద్దాంతంలోకి స్వేచ్చగా వెళ్ళవచ్చని, వెళ్ళే వారిని ఆపడం గాని, ఏ విధమైన వత్తిడి చేసినా అది అమానుషమని ఒక్కసారికాదు చాలాసార్లు అన్నాను. భారత రాజ్యాంగానికి (ఒప్పందానికి) కట్టుబడి ఇప్పటికీ అదే విషయానికి కట్టుబడి వున్నాను. వుంటాను కూడా!

అయితే ఇస్లాంని 100% స్వాగతిస్తూ ప్రజలు దానికి పట్టంకట్టిన రోజున దాని సూరాప్రధాన సభ్యుల సలహా మండలి మేరకు పాలనా వ్యవస్థ వుంటుంది. అటువంటి వ్యవస్ధలో ఇస్లాంని నిర్వీర్యము, బలహీనపర్చడానికి వేసే అవిశ్వాసుల ఎత్తు గడలకు అవకాశం లేకుండా ''ఆ శాసనము'' అమలులోకి తెస్తారు. అదీ సలహా మండలి ఏకాభిప్రాయముతో ప్రభుత్వము తీసుకునే నిర్ణయమది! అది ఆ సమయానికి తప్పుకాదని 100% ఏకీభవిస్తున్నాం.

అప్పటి సందర్భానికి సంబంధించిన విషయాన్ని సాధారణ పరిస్థితులకు ముడిపెట్టి చూడడము తెలియని తనము, సందర్భ శుద్ధిలేని తనము అవుతుంది.

ప్రకరణ భంగం 100% సురేంద్రగారిది, మీది అవునో కాదో చూడండి

అంశం : మారణహోమానికి దారి తీస్తున్న మత మార్పిడులు

సందర్భం : నేడు ప్రపంచంలో అనేకచోట్ల జీహాద్‌ పేరుతో అనేక మందిని చంపుతున్నారంటే వారికి ఖురాన్‌ అర్ధం కాకగాదు. ఖురాన్‌లోనే తనను నమ్మనివారిని చంపమని ప్రేరేపించే 2 వాక్యాలున్నాయి. (అదిగో అక్కడ నుండి ప్రారంభమైంది.... తరువాత చూపుతామని... ఖురాన్‌ అధ్యయన తరగతులని ... మొ... వి)

ప్రకరణ భంగం కలగకుండా ఉండాలంటే సురేంద్ర గారు తాను ప్రకటించిన (ఆనాటి రికార్డు ప్రకారం) ఆ రెండు ఖురాన్‌ వాక్యాలేవో చెప్పివాటి కారణంగానే నేడు స్ఫూర్తి పొంది ప్రపంచంలో ఆయా చోట్ల అవిశ్వాసుల పట్ల మారణహోమం ముస్లింలు చేస్తున్నారని రుజువుచేయాలి. అలా ఎందుకు జరగలేదు?

ఖురాన్‌ 18:80 పైకి చేయడానికి కాస్త సందర్భానికి దగ్గరగా పైకి కనిపిస్తున్నా... వాస్తవానికి దాని సందర్భంగాని, దాని అవతరణ ఉద్దేశ్యముగాని 100% అది కాదని చూపినా, చెప్పినా మీకు కనపడడంలేదు. వినబడడమూ లేదు. దానిని సరిపెట్ట ప్రయత్నించినా సరిపోదు గదా! పూర్వ నిశ్చిత అభిప్రాయాలున్న వారు అన్వేషణ చేయలేరన్న సత్యాన్ని ఏకీభవిస్తూ... ఎటువంటి నిశ్చిత అభిప్రాయాలు లేకుండా చూడడం ప్రారంభించాను. తద్వారా ఎన్నో మజలీలు దాటుకొని చివరికి అంతిమ నిర్ణయంగా వివేకముతో కూడిన విశ్వాసమార్గమే. వ్యక్తీకీ, సమాజానికీ మేలు చేకూర్చేది అన్న దగ్గర ఆగాను. అందుకు కారణంగానే అటుగానే ఎవరైనా కదలక తప్పదు అని అదే సరైన శ్రేయస్కర మార్గమని మీ గురించి కూడా అల్లాఃని ప్రార్థిస్తున్నాను.

స్వతంత్ర ఆలోచనే నన్ను సత్యాన్వేషణమండలికి దగ్గర చేసింది. ఎవరెన్ని అన్నా నన్ను కొనసాగేలా చేసింది మండలి భావజాలమే. అదే స్వతంత్ర ఆలోచనే నన్ను వివేకవంతమైన విశ్వాసిగా మలచింది. విన్న మాటకు అర్ధాన్ని అన్నవాడినే అడిగి తెలుసుకోవాలన్న అద్భుత నియమము మండలికి వుంది.

దానిపై మండలి నిజాయితీగా ఉంటే మత గ్రంధాలపై సరైనవే అన్నంతవరకూ విషయాలను తీసుకోవాలి. సమాజానికి అందివ్వాలి. ఆ పని చేయాలని ఎందుకనిపించలేదో! హిందూ మత గ్రంధాలనుండి కొంత వరకూ సురేంద్రగారు ఉటంకిస్తున్నా ఇతర గ్రంధముల నుండి లేశమంత కూడా ఎప్పుడూ ప్రస్తావించిన సందర్భాలు నేను చూడలేదు. అసలు అలాంటి ప్రస్తావనలు లేవో, ఉన్నా ప్రస్తావించాలని అనిపించలేదో లేక అధ్యయన లోపమో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది.

ఇక మత గ్రంధాల అధ్యయనంలో సరికాదు అని అనిపించిన విషయాలపై దూకుడు ప్రసంగాలు, ప్రగల్భాలతో కూడిన స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేకంటే సంబంధిత వ్యక్తిని గాని లేదా అతని అనుచరులలో యోగ్యులతో చర్చించి ఆ తరువాత ఒక నిర్ణయానికి రావాలన్న వాద నియమాలు తుంగలో తొక్కకుండా జాగ్రత్త పడాలి.

రోడ్డున పోయేదానయ్య ఉన్నతస్థానంలో వున్న వ్యక్తులను విమర్శిస్తే, ఉన్నత స్థానంలో వున్న ఆ వ్యక్తి తనస్ధానాన్ని విడిచి దిగివచ్చి అతనికి జవాబు చెప్పడం కనీసం అతని 2 నుండి 99వ కేటగిరి వ్యక్తుల వరకూ కూడా అతనికి జవాబు చెప్పాలనిపించదు.

సురేంద్ర గారి ప్రకటనలో ''నేను చెప్పేది వాస్తవమే అయినా అది చెప్పే అర్హత నాకు లేదట'' హేతుబద్ద ఆలోచనకి ఆయన చెప్పేది సరిపోతుందనిపించినా అదే స్థాయిలో నేను ప్రకటించాలంటే

ముహమ్మద్‌ (స) స్థాయికి సురేంద్ర గారు ఆయనపై ఆయన బోదనలపై సొంత ప్రకటనలు చేసే స్థాయి కాదని ప్రకటించవలసి వస్తుంది గదా! (చెప్పవలసినవి చాలా వున్నా అర్ధం చేసుకోడానికి మీరు ప్రకటిస్తున్న ప్రకటన 100% వాస్తవ ప్రకటన పూర్వనిశ్చితాభిప్రాయాలనుండి గాని ఎవరూ వాస్తవాలను గాని ఉన్నది ఉన్నట్లు చూడలేదన్నది మీకు 100% వర్తిస్తుంది. ఆ కారణంగానే సరిగా చూడలేకపోతున్నారేమో అని కూడా అనిపిస్తోంది).

ప్రతిస్పందన : మీరు ది 16-7-16 న వాట్సాప్‌ ద్వారా మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదములు. వాట్సాప్‌ ఇంతకు ముందు నేను ప్రయత్నించని కారణాన వివేక పధం ద్వారా నా భావనలు తెలియపరుస్తున్నాను.  మొదటగా మీరు ఎవరినో ఉద్దేశించి మండలి అనుచరులు అని సంభొదించడం, నిందించడం వ్రాయడంను బట్టి చెప్పాలనుకొన్నది చెప్పదలచిన వారికి కాకుండా అందరికి వర్తింపజేయడం గురించి ఏమనుకోవాలి? తెలిసిన తనమా ? తెలియనితనమా? అమాయకత్వమా? మీరు అమాయకులు కారు అని మాకు తెలుసుకదా! మరిదేమిటి?

ఒక మతం నుండిమరొక మతంలోకి స్వేచ్చగా వెళ్ళవచ్చని, వెళ్ళే వారిని ఆపడం లేకవత్తిడి చేయడం అమానుషమని, చాలాసార్లు అన్నానన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి వుంటాను. వున్నాను అని కూడా అన్నారు. ఇది తెలిసిన మీరు ఇస్లాం నుండి బయటకు వెళ్ళిన వారిని వధించమని ఖురాన్‌ చెబుతుంది. వందశాతం కరెక్టేనని అంగీకరించారు. దీని ప్రకారం మీరు ఖురానును అమానుషం అంటున్నారని అందరికి తెలుస్తుంది. తెలిసి ఖురాన్‌ అమానుషం అయినప్పుడు ఎందుకు అక్కడనుండి బైటకు రావడం లేదు?

దీనిని బట్టి రెండుగా అనిపిస్తుంది. ఒకటి అయితే మీరు ఊరికినే (ఉత్తనే) మతం నుండి మరొక మతంలోకి వెళ్ళే వారిని అడ్డుకోవడం, వత్తిడిచేయడం అమానుషం అంటున్నారని, లేక రెండవది అలా వెళ్ళే వారిని వధించమని ఖురానే చెబుతున్నా అది అనుసరించ తగినదేనన్న నిర్ణయం కలిగి వున్నారనాలి. (దీనిని ఇష్టంతో కూడిన విశ్వాసం అంటారు) ఈ రెంటిలో మీరు ఏమిటి?

భారత రాజ్యాంగానికిలోబడి వుండడమంటే, అయితే లౌకిక ప్రజాస్వామ్యము అంగీకరించి పరలోకాల గురించి మాట్లాడకుండడము, లేకుంటే రాజ్యాంగము అంగీకరించిన స్థాయిలో మతస్వేచ్ఛ కలిగి , విశ్వాసిగా జీవించడం (విశ్వాసి అంటే మీకు తెలియనిదికాదు, ఆ విషయంలో డైరెక్ట్‌ నాలెడ్జి లేక పోయినా, అది సరైందనో, సరికానిదనో అంగీకరించి అలానడుచుకోవడం అంటే విశ్వాసములో వున్న దానికి సంబంధించిన విషయము గురించి అజ్ఞానమే వుంది. (తెలియనితనమే వుందని అంగీకరించడమని అర్ధము). ఈ దృష్టితో మిమ్ములను మీరు విశ్వాసిగానే భావిస్తున్నారా?

తరువాత విషయము ఎప్పుడు అవిశ్వాస కారణంగా ఖురాన్‌ చంపమంటోంది (ముస్లీంగా అంగీకరించి తిరిగి నాన్‌ ముస్లిం అయిన వారిని చంపమంటోంది) అంటే 100 శాతము ఇస్లాంని ప్రజలు స్వాగతిస్తూ దానికి పట్టం కట్టిన రోజున, దానిని నిర్వీర్యము, బలహీనపరచడానికి అవిశ్వాసులకు అవకాశం లేకుండా ఆశాసనం అమలులోకి తెస్తారు (వస్తూంది) అది 100 శాతం సరైందేనన్నారు.

రహమాన్‌ గారు మీ తార్కిక బుద్దిని ప్రక్కన బెట్టారా? లేక ఏది మాట్లాడినా సరిపోతుంది లే అనుకొన్నారా? 100 % ప్రజలు స్వాగతించడం అంటే అర్ధం తెలిసేమాట్లాడుతున్నారా? అందరూ స్వాగతిస్తే నిర్వీర్య, బలహీనపరచేది ఎవరు? ఎందుకు; వారిని శిక్షించడం ఏమిటి? మీ ప్రకారం 100% ప్రజలు స్వాగతించకపోతే మతం నుండి బైటకి వెళ్ళిన వారిని వధించనక్కరలేదంటున్నారు. ఖురాన్‌లో ఎక్కడ వుందో చూపించగలరా?

ఇక మీరు వివేకముతో కూడిన విశ్వాసము కలిగియున్నారని. అది వ్యక్తికి సమాజానికి మేలు చేకూర్చేది అన్న దగ్గర ఆగాను అన్నారు. ఆ పద బంధము బాగుందని వాడుతున్నారా? అర్ధం గ్రహించి అన్వయించుకునే మాట్లాడుతున్నారా? విశ్వాసము అంటే పైన వివరించాను. అజ్ఞానమే ప్రాతిపదికగా కలదని, మరివివేకం అంటే ఏది యుక్తమైనది, ఏది యుక్తము కానిది అని పరిశీలించి (పరిశీలనతెలిసిన విషయాలలోనే గాని తెలియని విషయాలలో కుదరదు. అంటే జ్ఞానం కలిగిన విషయంలోనే గాని అజ్ఞాన విషయంలో పరిశీలించటం కుదరదని అర్థము) నిర్ణయించుకొనేశక్తి కలిగి యుండడం.

అలాటి వివేకము మనము కలిగుంటే వేటి అమలుకు ప్రయత్నిస్తామో ఆలోచించండి.

- వ్యభిచారం చేసినా, దొంగతనము చేసినా, దేవునికి సాటి కల్పించనివారు స్వర్గంలో ప్రవేశిస్తారు. జీవితపు చరమ ఘడియల్లో షిర్కి చేయనివాడు (దేవునికి సాటికల్పించడం షిర్కి అంటే) స్వర్గనివాసి అవుతాడు'' మహితోక్తులు అ 38-59

- చట్టం ముందు అందరూ సమానులే'' రాజ్యాంగం ఆర్టికల్‌ 14

- మనుషులనకు అమ్మడం లేదా కొనడం, బలవంతంగా చాకిరీ చేయించుకోవడం నిషేధం. ఆర్టికల్‌ 23

- బాలకార్మిక వ్యవస్థ రద్దు ఆర్టికల్‌ 24.

ఇహంలో బానిస వ్యవస్థను, పరంలో బాలకార్మిక వ్యవస్ధను అంగీకరించేది ఈ మతధోరణి.

వివేకముతో కూడిన విశ్వాసమునకు, ఇష్టంతో కూడిన విశ్వాసమునకు తేడా తెలియకుండా, ఇష్టముతో కూడిన విశ్వాసమునే వివేకముతో కూడిన విశ్వాసము అన్న భ్రమలో కొందరుంటే, మరికొందరు దీనిని అడ్డం పెట్టుకొని పబ్బంగడుపుకునేవారూ ఉంటారు. మీరు ఏ కోవకు చెందుతారు?

నోట్‌ : నాకు తెలిసి వివేకముతో కూడి విశ్వసించదగినవి, విశ్వసించాల్సినవి రెండే 1. విజ్ఞాన శాస్త్రము ప్రయోగ పూర్వకంగా రుజువు పరచిన అంశాలమీదా 2. మన కొరకు మనం ఏర్పరుచుకొన్న ఒప్పందమైన నేటి ధర్మశాస్త్రము భారత రాజ్యాంగం మీదా మాత్రమే.

ప్రకరణ భంగం మీరు సురేంద్ర గారిదేనంటున్నారు. ఆ రోజు సురేంద్ర గారు సమావేశంలో ''నేను నమ్మకపోతే చంపటానికి మీరెవరండి అని రెట్టించగానే, అలా నమ్మకపోతేనే చంపమంటుంటే ఆ ఖురాన్‌ను నేను వదిలేస్తానని మీరు అదే స్పిరిట్‌తో వుంటే నేనూ వదిలేస్తానని ముస్తాక్‌ గారు వాగ్ధానం చేసారు. సురేంద్రగారు ఆ పదాలు అలానే కాదు అలాంటి భావాన్నిచ్చే విషయం అంటే అలాగేనని ఒప్పుకొన్నారు. ఇది రికార్డు కూడా అయ్యింది. ఆ తరువాత అలాంటి విషయాలు అని లిస్ట్‌ప్రిపేర్‌ చేసి సుమారు 200 పైన ఆయతులు మీకు అందిస్తే ఆ విషయాల చర్చల సందర్భంలో మీరు ఆ చర్చను ఆపవలసిందిగా కోరారు. దానికి మీరు చెప్పిన కారణము ఆ విషయాలన్నీ చర్చిస్తే ఖురాన్‌ పై వేరే అభిప్రాయానికి రావడానికి అవకాశమిచ్చినవారమవుతాము. కనుక సూటిగా ఒకటి చెప్పండి అంటే రెండు మూడంశాలు మీ ముందుంచడం జరిగింది.

ఒకటి ''మూసాతన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. 'జనులారా' ఆవుదూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయము చేసుకొన్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టి కర్తను వేడుకోండి, మీలోని ఘోరపాతకులను సంహరించండి (చంపండి) మీ సృష్టికర్త దృష్టిలో ఇదేమీకు అత్యంత శ్రేయస్కరమైనది'' 2-54

ఏది అత్యంత శ్రేయస్కరం? అపారకృపాశీలుడు అనంతకరుణామయుడైన అల్లాః దృష్టిలో తన విశ్వాసి కాని (తనను నమ్మని వారి) నెవరినైనా చంప్పెయ్యండి,  వేరే యే కారణాలతో పనిలేదని ఆ సూరా అర్ధము అని తెలపడం లేదా? చూడబుద్ది కావడంలేదా? అందుకనే ముందే మీతో ఫోను సంభాషణలోనే అన్నాను. మీకు కనడపదు గాక కనపడదని. ప్రపంచానికందరకూ కనపడినా, అర్ధమైనా మీకు కనపడదు. అర్ధం కాదు. కారణం వెతకండి ఎందుకని?

రెండవది ''ఇకపోతే ఆ అబ్బాయి సంగతి, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసు తనంతో, తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది'' 18-80

మోషేకు ఖిజర్‌ (మహాజ్ఞాని) తను చేసిన పనులు అల్లాః సంకల్పమేనని తనంతటతాను చేసినవి గాదని, ఆ సంఘటనల వాస్తవికత గురించి చెప్పాడు.

ఆ ఖిజర్‌ (మహాజ్ఞాని) కి భయమేసింది ఆ బాలుడు (అవిశ్వాసి అవ్వడం వలన) తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో ఆయన తల్లిదండ్రులైన విశ్వాసులను వేధిస్తాడని. ఆ మహాజ్ఞాని విశ్వాసులనకు వేధిస్తాడన్న భయంతో అతనిని చంపివేయటమే తగినశిక్షగా భావించి అమలు పరచి అదీ అల్లాః సంకల్పమేనని ఆయనే చెబితే దాని అవతరణ ఉద్దేశ్యము వందశాతం అది కాదని చెప్పే సాహసము రహమాన్‌గారు చేశారు. అంటే మోషే, ఖిజర్‌, అల్లాః కంటే రహమాన్‌ గారికే ఖురాన్‌ బాగా అర్ధమైందనాల్సి వస్తుంది. (ఇచ్చట రహమాన్‌గారు వల్లించే విన్నమాటకు అర్ధాన్ని అన్నవారి నుండే గ్రహించాలి అన్న సూత్రాన్ని తుంగలో త్రొక్కారు ఆ సూత్రాలు ఎదుట వారినడగటానికే గాని తనకు వర్తించవన్నట్లు) పోని ఇది ఇస్లాం విశ్వాసులు అంగీకరిస్తామంటే మాకు ఏమీ అభ్యంతరం వుండదు. ఆ పని రహమాన్‌గారు చేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.

పై రెండు సంఘటనల వలన అవిశ్వాసకారణంగా చంపవచ్చని చంపమని ఖురాన్‌ విషయంలో ఋజవు అవుతుంటే, ఒక్కరుజువు చూపించండని అడగడం తన వాగ్దానాన్ని ఎలా తప్పించుకోవాలన్న కోరికతో ఉటంకించినవే.

సత్యాన్వేషి పూర్వ నిశ్చితాభిప్రాయాలు పెట్టుకోకూడదని, పరనింద కూడదని, ప్రకరణభంగం కావింపకూడదని, వివేకముతో కూడిన విశ్వాసాన్ని స్వీకరించాలని ఇతరులకు చెప్పడమే గాక తాను మొదట వీటిని ఆచరిస్తాడు. కాని సత్యాన్వేషి కాని రహమాన్‌గారు పై విషయాలు ప్రస్తావిస్తూ తానాచరించకుండా ఎదుటవారి నోరు మూయించటానికి అనవసరమైన శ్రమనంతాపడుతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే మిత్రులు రహమాన్‌గారు మానసికంగా డిస్ట్రబ్‌కులోనైయ్యారని అనిపిస్తుంది. ఎంతో చక్కగా లాజిక్‌ చేయగల, సూక్ష్మవిషయాలను కూడా పట్టుకో గల సమర్ధులు ఇంత పేలవంగా మాట్లాడము ఎలాకుదురుతుందో అర్ధము కావడము లేదు. అందుకనే డిష్ట్రబ్‌ గా వున్నారనిపిస్తుంది.

ఏదిఏమైనా మిత్రులు రహమాన్‌గారు తన మాట (నిజాయితి)ను నిలబెట్టుకొంటారనీ సత్యాన్వేషిగా మారే సత్తా గలవారు, మారతారని ఆశిస్తూ హృదయపూర్వక అభివందనములతో

ఇట్లు

సమస్సులతో

కోట ప్రసాద శివరావు


No comments:

Post a Comment