Tuesday, November 1, 2016

మండలి జ్ఞాన సిద్దాంతము - ప్రమాణ - పదార్థ విద్య

 ఉపోద్ఘాతము :- యోచనాశీలురైన చదువరులారా!
మన జీవితాలను జాగ్రత్తగా గమనించితే, అది రెండు ప్రధాన విభాగాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి జ్ఞాన భాగం కాగా రెండోది కర్మభాగం. ఈ అంశాన్నే తాత్వికులు జ్ఞానకర్మ సముచ్చయం మానవ జీవితం అన్న సూత్రం ద్వారా చెపుతారు. ఎదురుపడిన మరియు అవసరమైన విషయాలను తెలుసుకుంటూ, అలా కలిగిన జ్ఞానాధారంగా అవగాహన పెంచుకుంటూ, దానిని జీవితానికి అన్వయించుకుంటూ, జీవితాన్ని సాగిస్తుంటాం మన మందరమూ. అంటే జ్ఞానం మన జీవితంలో మార్గదర్శక పాత్ర (నడిపించే పాత్ర)ను పోషిస్తుంటుందన్నమాట. ఇది ఎవ్వరమూ కాదనలేని, నిత్యమూ జరుగుతుండే వ్యవహారమే. గాఢనిద్రలోనూ, స్పృహ కోల్పోయినప్పుడు తప్ప ఇది ఒక నిరంతరాయ ప్రక్రియే. మన శరీరాన్ని పరిశీలించినా అది తల (మెదడు) చేసే పనీ, మిగిలిన శరీరం చేసే పని అన్న రూపంలో రెండుగా ఉంటుంది. అందులో ప్రస్తుతం మనం విచారణకు - అధ్యయనానికి - ఎంచుకున్న అంశం జ్ఞాన భాగానికి చెందింది. (పారిభాషికంగా దీనిని జ్ఞాన క్షేత్రానికి చెందింది అనీ అనవచ్చు) అందుకే దీనికి 'జ్ఞాన సిద్దాంతం' అన్న పేరు వచ్చింది. అంటే జ్ఞానంతో ముడిపడి ఉన్న అనేకాంశాలను గురించిన సిద్ధాంతం అని.
  • మన శరీర నిర్మాణంలోనే, తెలుసుకోడానికి, ఆ తెలుసుకున్నది నిలిపి ఉంచుకుని, తిరిగి ఉపయోగించుకోడానికి అవసరమైన పరికరాలు, వాటి అమరిక అవి పని చేసే (తీరు) పద్దతి అన్నవి పుట్టుకతోనే ఏర్పడి ఉన్నాయి. ఈ మొత్తాన్నే మెదడు, జ్ఞానేంద్రియాలు, నాడులు అన్న మూటితో కూడిన నాడీ మండల వ్యవస్థ అంటున్నాము. జ్ఞాన సిద్ధాంతం అన్నది జ్ఞానమనగానేమి? తో మొదలై, కలిగిన జ్ఞానం సరైందా? కాదా? అన్న సత్యాసత్య విచారణతో ముగుస్తుంది. దీనిని గుర్తులో ఉంచుకోండి.
  • జ్ఞానమేర్పడుతున్న క్రమమేమిటి? ఎన్ని రకాల జ్ఞానం కలుగుతుంది? జ్ఞానాన్నార్జించడానికి- ఆయా విషయాలు తెలుసుకోడానికి - ఎన్ని రకాల పరికరాలున్నాయి? ఎన్ని రకాల విధానాలున్నాయి? తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము (పారిభాషికంగా భ్రమ - ప్రమ అనంటారు వీటినే) అంటే ఏమిటి? శరీర నిర్మాణంలోనే పరికరాలు - విధానములన్నవి అమరి ఉండగా, కొన్నిసార్లు తప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? మరికొన్ని సార్లు ఒప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? తప్పు జ్ఞానం కలక్కుండా, ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఉండాలంటే తీసుకోవలసిన, తీసుకోగల జాగ్రత్తల మాటేమిటి? కలిగిన జ్ఞానం సరైందేనో కాదో తెలుసుకునే (నిర్ధారించుకునే) పద్దతేమైనా ఉందా? ఉంటే అదేమిటి? జ్ఞానం యొక్క పాత్రేమిటి? తప్పు జ్ఞానం వల్ల జరిగే ముప్పేమిటి? ఒప్పుజ్ఞానం వల్ల ఒనగూడే (మేలు) మెప్పేమిటి? లాటి వాటి నన్నింటినీ విచారించి వివరిస్తుందీ జ్ఞాన సిద్దాంత శాస్త్రం .ఆంగ్లంలో దీనిని థియరీ ఆఫ్‌ నాలెడ్జి అనీ ఎపిష్టమాలజీ అనీ పిలుస్తున్నారు.
  •  దీన్నంతటినీ మేము ప్రమాణ వివేచన అంటున్నాము. జ్ఞాన సిద్దాంతంలో ఒక పార్శ మిదికాగా, రెండో పార్శాన్ని పదార్ధ వివేచన అంటున్నాము. అందులో కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ ఎన్నిగా విడదీసి (ఉపరాశులుగ చేసి) పెట్టుకుని, వినియోగించుకోవచ్చు అన్నది ఇతివృత్తంగా ఉంటుంది. అందుకే మండలి దీనిని 'పదార్ధ వర్గీకరణ' అన్న పేరుతో వ్యవహరిస్తోంది. (పిలుచుకుంటోంది)
  •   కనుక మండలికి సంబంధించినంత వరకు మండలి జ్ఞాన సిద్దాంతంలో ప్రమాణ వివేచన, పదార్ధ వివేచన అన్న రెండు పార్శ్వాలుంటాయి.
జ్ఞాన సిద్దాంత క్షేత్రానికి సంబంధించినంతలో, గతంలో - ఇప్పటి వరకు - దీని విషయంలో జరిగిన పరిశోధనలూ, అందువల్ల వెలువడిన వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన తాత్విక ధోరణులకన్నింటికీ, వాటి వాటికి సంబంధించిన జ్ఞాన సిద్దాంతాలూ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకస్థాయి కలిగిన తాత్వికులందరూ, తమతమ సిద్దాంతాలను (తాత్విక భావజాలాన్ని) ప్రకటించే సందర్భంలో, తమదైన జ్ఞాన సిద్దాంతాన్నీ ప్రకటించారు. అంటే తామంగీకరిస్తున్న ప్రమాణాలనూ - పదార్ధాలనూ ప్రకటించారన్నమాట.

ఉదాహరణకు :- న్యాయదర్శనకారుడు తనకు నాలుగు ప్రమాణాలనీ, 16 పదార్ధాలనీ చెప్పగా వైశేషికుడు ప్రమాణాలు మూడనీ, పదార్ధాలు ఆరనీ ప్రకటించాడు. ఇక యోగదర్శన కారుడూ సాంఖ్యదర్శనకారుడూ తమకు ప్రమాణాలు మూడన్నారు. సాంఖ్యుల ప్రకారం పదార్ధాలు 25. సాంఖ్యయోగ దర్శనాలు రెంటినీ ఒక కట్టగా చూస్తుందీ దేశ సాంప్రదాయం, కనుక యోగుల పదార్ధాలూ సాంఖ్యాన్ననుసరించేనని అనుకోవచ్చు. పూర్వోత్తర మీమాంసాకారులు '6' ప్రమాణాలనంగీకరిస్తారు. జడచేతనాలన్న పదార్ధాలనంగీకరిస్తారు. శంకరుడు వ్యవహారంలో '6' ప్రమాణాలనూ, నాలుగు పదార్థాలను అంగీకరిస్తాడు. ఇక కొందరైతే, పదార్ధ వర్గాలను ప్రత్యేకంగా పేర్కొనకున్నా, వారి వారి ప్రమాణాలను మాత్రం పేర్కొన్నారు. మరికొందరు ప్రత్యేకంగా వాటి పేర్లను పేర్కొనకున్నా, వారి సిద్దాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తూపోతుంటే, వారూ ప్రమాణాలను, పదార్ధాలను ప్రస్తావించారన్న విషయం అన్యాపదేశంగా కనపడుతూనే ఉంటుంది.
           ఏదేమైనా ఈ విషయంలో స.మం తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని విస్పష్టంగా ప్రకటిస్తోంది. మండలికి ప్రమాణాలు మూడు. పదార్ధ వర్గాలు ఐదు అదనంగా పదార్ధాల ఉపవర్గీకరణొకటీ ఉంది మాకు. వివరాలు లోపలి పుటల్లో ఆయా శీర్షికల క్రింద విపులంగా వివరించాను. వాటిని అక్కడ గమనించండి.
        శరీర నిర్మాణంలోనే అమరి ఉండి, పుట్టిన దగ్గర నుండి పని చేస్తూ వినియోగపడుతూనే ఉన్న జ్ఞానేంద్రియ వ్యవస్థ స్వరూప స్వభావాలు మరియు దాని పనితీరు తెన్నుల గురించిన సిద్దాంతరాద్దాంతాల అవసరమేమొచ్చింది? వాటి వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి కదా? అన్నప్రశ్న వేసుకుని పరిశీలిస్తే ఆయా వాస్తవాల గురించిన ఎన్నో వివరాలు మన అవగాహనలోకి వస్తాయి. అలాగే ఆయా సందర్భాలలో ఈ వ్యవస్థను నేర్పరితనంతో ఎలా వినియోగించుకోవచ్చోనూ అర్ధమవుతుంది.
        జ్ఞానేంద్రియాల ద్వారా ఆయా విషయాలకు సంబంధించి మనకు కలుగుతున్న జ్ఞానం రెండు రకాలుగా ఉంటోంది. ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి అవెలా ఉన్నాయో అలానే తెలియడం, అవెలా ఉన్నాయో అలాకాక, మరోలా తెలియడం జరుగుతోంది. వీటినే యదార్ధ జ్ఞానం అయదార్ధ జ్ఞానం అంటారు. ఒప్పుజ్ఞానం - తప్పు జ్ఞానమన్నా, ప్రమ - భ్రమ అన్నా సత్యం - అసత్యం అన్నా ఉన్నది ఉన్నట్లు తెలియడం, లేనిది ఉన్నట్లో, ఉన్నది ఉన్నట్లు కాక మరోలానో తెలియడం అన్నా ఒకే అర్ధాన్నిస్తాయవన్నీ. అంటే జ్ఞాన సిద్దాంత క్షేత్రంలో వాటిని పర్యాయ పదాలుగా వాడవచ్చన్నమాట.
  •   వాడుకలో, వాస్తవం, యథార్ధం, సత్యం, నిజం అన్న పదాలు ఒకే అర్ధంలో వాడేస్తూ ఉంటారు. (వినియోగించడం కనపడుతుంది) కానీ జ్ఞానసిద్దాంతం ప్రకారం ఆ పదాలుదేని అర్ధాన్ని అవి కలిగి ఉన్నాయి. ఒక్కో పదం ఒక్కో దగ్గర మాత్రమే వాడవలసినదిగా ఉంటుంది. అంటే దేని అర్ధం దానిదేనన్నమాట.
  •   అలాగే మనమెవరమైనా ఒక విషయాన్ని గురించి, ఎవరో ఒక తను చెప్పింది విని, అది నీకెలా తెలిసింది అనిగానీ, అది నిజమేనని ఎలా చెపుతున్నావు అనిగానీ మరొకరు - మనం - అడిగామనుకోండి. దానికతడు, అది నేను స్వయంగా చూసి చెపుతున్నాననో, స్వానుభవం ద్వారా తెలుసుకుని చెపుతున్నాను అనో అనగానే, అతడు చెప్పింది సరైందేనన్న నిర్ణయానికి సాధారణంగా వచ్చేస్తుంటారు (ము). కానీ జ్ఞాన సిద్దాంతం, ఒక వ్యక్తి చూసి చెపుతున్నానన్నంత మాత్రాన, లేదా స్వానుభవం ద్వారా చెపుతున్నా నన్నంతమాత్రాన, అతనన్నది సత్యమేనని (యథార్ధమేనని లేదా ఉన్నదేనని) నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంలోనూ భ్రమలుండే అవకాశం ఉంది గనుక, కలిగిన జ్ఞానం సరైందో కాదో కూడా తేల్సుకున్నాకనే అంతిమ నిర్ణయానికి రావలసి ఉంటుందన్న జాగ్రత్తనూ జత చేస్తుంది. సరైన రీతిలో తెలుసుకోవడమంటే ఏమిటో, అలా తెలుసుకున్న దానిని, మరలా సరైన రీతిలో సరిచూసుకోవడమెలానో కూడా వివరించి, అభ్యాసరూపాన్నీ జోడించిన జ్ఞానసిద్దాంతమే సరైందీ, సమగ్రమైనదీ అవుతుంది. అత్యంత కీలకమైన ఈ సాధారణ సూత్రాన్ని అర్ధం చేసుకుని, ఆయా సందర్భాలకు అన్వయించగలిగే నైపుణ్యం - సామర్ధ్యం - సంపాదించుకోకుంటే, జీవితంలో ఎదురుపడే మౌలికమైన కీలకమైన సందర్భాలలో సరైన నిర్ణయాలకు రావడం కష్టమవుతుంది.
    వెనుకటి తాత్వికులలో కొందరు ఈ విషయాన్ని నిర్వహించగల విలువైన పాత్రను సుస్పష్టంగా గమనించారుగనుకనే దీనికి సంబంధించిన ఒక సాధారణ సూత్రం ఉనికిలోకి వచ్చింది.  
      సూ :- 'కాణాదం - పాణినీయంచ సర్వ శాస్త్రోపకారకం'
      సాంప్రదాయంలో కాణాదం అంటే తర్కశాస్త్రమని, పాణినీయమంటే వ్యాకరణ శాస్త్రమని రూఢి. తర్కశాస్త్రము - వ్యాకరణ శాస్త్రములన్నవి సర్వ శాస్త్రాలకు ఆధారంగానూ, ఉపబలకంగానూ పని చేస్తాయన్నది సూత్రార్థం. అవి లేకుంటే ఏ సిద్దాంతాన్నీ రూపొందించలేమన్నది నిజం.
       వారెవరో సూత్రీకరణ చేశారనిగాక, మనలో ఎవరం, ఎప్పుడు, ఈ అంశాన్ని పరిశీలించి చూసినా, ఏరకమైన సిద్దాంతాలు రూపొందించాలన్నా, ఆ సిద్దాంతకారులకు తార్కిక శక్తీ, భాష మీద పట్టు తప్పనిసరి అన్నది తెలిసిపోతుంది.
       అంతేకాక, వ్యక్తి జీవితంగానీ, సామాజిక గమనం గానీ, వాటివాటికున్న జ్ఞానము, అవగాహనల ననుసరించే సాగుతుంటాయన్నది మనందరి అనుభవంలో ఉన్నదే. కనుక, కేవలం శరీర నిర్మాణంలో అమరి ఉన్న ఆయా జ్ఞానార్జనా పరికరాలు, అవి పని చేయగల తీరు వాటి సామర్ధ్యాలను సహజ స్థితిలోనే ఉంచితే వాటి వినియోగం చాలా పరిమితమైందిగానూ, దాదాపు జంతు దశతో సమానంగానే ఉంటుంది. ఎలా మనకున్న కరచరణాది అవయవాలను, ఒక క్రమ పద్దతిలో శ్రమకు, శిక్షణకు లోను చేస్తే అలాటి పరిశ్రమ చేయనివారికంటే, ఎన్నో పనులు, ఎంతో ఎక్కువ పని తక్కువ శ్రమతో, నైపుణ్యంతో (చక్కగా) చేయగలగడం జరుగుతుందో, అలానే, జ్ఞానక్షేత్రంలోనూ మనకున్న పరికరాలను ఒక క్రమ పద్దతిలో, శిక్షణకులోను చేస్తే అవీ అధిక సామర్ధ్యాన్ని నైపుణ్యతనూ సంతరించుకుని, తక్కువ శక్తితో ఎక్కువ పని, చక్కగా చేయగలుగుతాయి. కనుకనే జ్ఞానక్షేత్రానికి సంబంధించినవే అయిన ఏ సిద్దాంతాలకైనా మేధో సామర్ధ్యమూ, భాషావిజ్ఞత అన్నవి సహకార శక్తులవుతాయన్న సూత్రం ఏర్పడింది.
  •   మెదడు - జ్ఞానార్జనా వ్యవస్థ కంతటికీ ప్రధానమైనదీ, కీలకమైనదీ అయిన మెదడు - పనితీరు మరింత శక్తివంతం కావడానికీ, నైపుణ్యతను సంతరించుకోడానికీ, మేధో సామర్థ్యాన్ని పెంచే క్రమబద్ధమైన అభ్యాసం చేయాల్సి ఉంటుంది. జ్ఞాన సిద్దాంతంలో అందుకు కావలసిన విధివిధానాలు, అభ్యాస ప్రక్రియలూ చెప్పబడి ఉంటాయి.
  •   మెదడు చేసే పనుల్ని ప్రధానంగా ఐదుగా చెప్పుకోవచ్చు.
         1. గ్రహణ 2. ధారణ 3. స్మరణ 4. చింతన 5. సృజన అనంటారు వాటిని, ఈ ఐదు రకాల పనులను ఒక క్రమంలో అభ్యాసం చేయించితే మేధోసామర్ధ్యం పెరుగుతుంది. జ్ఞాన క్షేత్రంలో మెదడు చేయాల్సిన పనుల విషయంలో దీర్ఘకాలం పాటు వ్యాయామం - పరిశ్రమ చేయించగలిగితే మేధావిత్వం సిద్ధిస్తుంది. అంటే గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం గుర్తుకు తెచ్చుకోవడం, చక్కగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, ఊహాశక్తి పెరగడం జరుగుతాయి. వీటినే మేధోసామర్ధ్యాలనేది.
కనుకనే 'లక్షణ ప్రమాణ విద్య' అనేది అభ్యాస విద్యల కోవకు చెందిందైయ్యింది.
గమనిక :- జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచనా అన్న రెంటినీ కలిపే మేము లక్షణ ప్రమాణ విద్య అనంటున్నాము. అది అభ్యాసిక విద్య కనుక, వింటేనో చదివితేనో, చూస్తేనో రాదు. నేర్పితేనే అలవడుతుంది. అభ్యాసిక విద్యలనదగ్గవేవైనా పనితో ముడిపడి, పని ద్వారానే తెలియడం, చేతనవడం జరుగుతుంది. కనుకనే సాంప్రదాయం తర్క విద్యను నేర్చడానికి (తెలుపడానికి కాదు, నేర్పడానికి) దీర్ఘ కాలం నేర్పేవాని దగ్గరుండి నేర్వాలి అనంటోంది. గతంలో 10, 15 ఏండ్ల నుండి 20, 30 ఏండ్ల పాటు దీనిని అభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు.
అనేక మంది తాత్వికులు వారివారి దృష్టి కోణం నుండి ఎవరి జ్ఞాన సిద్దాంతాన్ని అంటే ప్రమాణాలను పదార్ధాలను, వారు ప్రకటిస్తూ వచ్చారు. అవన్నీ లభ్యమవుతుండగా, ఈనాడు మళ్ళా నేను మండలి జ్ఞాన సిద్దాంతమంటూ మరోదాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న అధ్యయన పరుల్లో కొందరికైనా వచ్చే అవకాశం ఉంది. రెండు రకాలుగా దీనికి సమాధానం చెప్పుకోవచ్చు.
1. ప్రతి తాత్వికుడూ లేదా తాత్వికులెందరో అప్పటికే అంతకు ముందటివారు రూపొందించిన జ్ఞాన సిద్దాంతాలున్నప్పటికీ, తానూ తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని ఎందుకు తయారు చేసి సమాజం ముందు పెట్టినట్లు? ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరచన చేసినట్లు?
శాస్త్రీయ రచనలు చేసే సందర్భాలలో, ఒక సాంప్రదాయం అమలవుతోందీ దేశంలో, రచయిత తన రచన యొక్క అవసరాన్ని తెలిపే సందర్భం అది. రచనలో అపూర్వత - అప్పటి వరకు లేనిదేదో ఉండడం - ఉండాలి.
గమనిక :- ఈ అపూర్వత - ఇంతకు పూర్వపు వాటిలోలేని కొత్తదనం - అనేక రూపాలలో ఉండవచ్చు. ఉదా :- వెనకటి వాటిలోని దోషాలను - లోపాలనూ ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసే రూపం అయ్యుండవచ్చు. భాషా పరంగా, ఒక స్థాయి భాష నుండి మరోస్థాయి భాషలోనికి మార్చడం రూపంలోనూ ఉండవచ్చు. తులనాత్మక పరిశీలన రూపంలోనూ ఉండవచ్చు. అలా అపూర్వత అంటే అప్పటి వరకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో లభ్యంకానిది ఏదో ఉండడం, అది మనకు ఉపయోగపడగలిగి ఉండడం లేదా అవసరమైందై ఉండడం జరిగితే, అపూర్వత అన్న లక్షణాన్ని కలిగి ఉందనే అర్ధం. ఆ దృష్టి నుండి గనక చూస్తే మండలి జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచన అన్న విభాగాలలో వెనకటివాటిలో చోటు చేసుకుని ఉన్న కొన్ని దోషాలు లేకుండా ఉండడం కొన్ని లోపాలను సరిచేసుకున్న సమాచారంతో ఉండడం అన్నదే కాక, ఆనాటి వాటిలోని జఠిల పదాలు, సమాసాలను చాల వరకు సరళమైన రీతిలో చెప్పడం జరిగింది. తర్కం కర్కశమైంది అన్నమాట నుండి, అంతేమీ కర్కశమైంది కాదులే అన్న దృష్టిని కలిగించే రీతిలో ఉందిది.
       వెనకటి కాలంలో తర్కము, తర్కవిద్య ఎవరో కొందరు మేధావులకు అవసరమైంది మాత్రమే నన్న దృష్టి బలంగా ఉండేది. సిద్దాంతరాద్ధాంతాలకు, వాద ప్రతి వాదాలకు చెందింది మాత్రమే అది. పండిత ప్రకాండుల కొరకే ఆ విద్య అన్నట్లుండేది. కాని, స.మండలి, తర్కం ప్రతి మనిషికీ అవసరమైందనీ, ఏదో ఒక సందర్భానికి గాక, నిత్యజీవితంలో, నిరంతరం అవసరపడుతుండేదేనన్న వాస్తవన్ని బలంగా ప్రతిపాదించి, దానిని అందరికీ అందుబాటులోనికి తేవాలని ప్రతిపాదిస్తోంది. తర్కించడమంటే ఎడ్డిమంటే తెడ్డెం అనడం కాదనీ, నందంటే పందనడం కాదనీ, అవునంటే కాదనడం కాదనీ ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. తర్కశాస్త్రమంటే సక్రమాలోచనా నియమాలను, శాస్త్రీయ పద్ధతిలో వివరించి, అభ్యాసమూ చేయడానికి వీలైన సూత్రాలున్న సిద్దాంత గ్రంధమనీ చెపుతుంది. అది మేధోసామర్ధ్యాల పెంపుకు, తప్పనిసరైన విద్య అనీ, ప్రతి మనిషికీ అతడు శిక్షణ పొందే వయస్సుకు చేరినప్పటి నుండి ఆయా వయస్సులకు తగిన రీతిలో తార్కికశక్తి ఇనుమడించేలా విద్యా విభాగం ద్వారా తెలిపి, నేర్పి, అలవడజేయడం, ఏ సమాజానికైనా తప్పనిసరి అనీ చెపుతుంది.
జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన మెర్పడుతున్న క్రమమేమిటి? ఏయే పరికరాల ద్వారా, ఏయే విధానాలలో జ్ఞానం కలుగుతుంటుంది. ఎన్ని రకాల విషయాలకు చెందిన జ్ఞానం కలుగుతుంటుంది? ఒప్పుజ్ఞానము, తప్పుజ్ఞానములంటే ఏమిటి? అవి ఎందుకెర్పడుతున్నాయి? తప్పు జ్ఞానం కలక్కుండా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? తప్పు జ్ఞానం వల్ల కలిగే అనర్ధమేమిటి? ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? ఒప్పు జ్ఞానం వల్ల కలిగే మేలు ఏమిటి? కలిగిన జ్ఞానం సరైందో కాదో నిర్ణయించుకునేదెలా? వగైరా, వగైరా జ్ఞాన క్షేత్రానికి సంబంధించిన పలు విషయాలను ఒక క్రమ పద్ధతిలో వివరించి, దానిని అభ్యాసం చేయడమెలానో తెల్పి, మనిషి, యోగమైన జ్ఞానంతో జీవించేందుకు అవసరమైన భూమికను అందిస్తుందీ జ్ఞానసిద్దాంతం.

1 comment:

  1. తర్కంలో ఒక విషయాన్ని ప్రతిపాదించడానికి ఎన్ని రకాల ప్రమాణాలు ఉన్నాయి?ఉదాహరణకి అనుమాన ప్రమాణం,మొదటి స్థాయి.మొత్తం ఎనిమిది ఉన్నాయని తెలుసు.వాటిని గురించి చెప్పగలరు.

    ReplyDelete