Tuesday, November 1, 2016

రహ్మాన్‌ గారినుద్దేశించి సురేంద్ర గారికి పంపిన లేఖ సారాంశము


సురేంద్ర గారికి మిత్రులు ఎం.ఎస్‌. అక్బర్‌ బాద్షా వ్రాయునది. ఉభయకుశలోపరి.
నేను కూడా ఖురాను తెలుగులో 30 అధ్యాయాలు పూర్తిగా క్షుణ్ణంగా చదివిన వాడినే, అందులో మీరు లేవనెత్తిన సందేహాలు మెదడున్న మనిషికి అనుకోకుండానే ఈ కాలంలోని వారికి తప్పక కలిగేటటువంటివే. అందులో ఏ మాత్రమూ సందేహమే లేదు.
వివేకపథం మొదలైనప్పటినుంచి మనసుపెట్టి చదివేవారిలో నేనొకడిని. దాని ముఖ్యోద్దేశము సత్యపక్షాన నిలవడం - ధర్మ బద్దంగా జీవించడము. కనుక చదివేవారు నిక్కచ్చితనము కలిగి మాట విడువలేని మానధనులై ఉండాలి. కానీ రహ్మాన్‌ గారు, ఆర్భాటం కోడి, ఇల్లెక్కి కూసి, చివరికి తోలుగుడ్డు పెట్టిన చందాన వ్యవహరిస్తున్నారు.
నేను హైదరాబాద్‌కు పోయి రహ్మాన్‌ గారితో 4,5 సార్లు ఫోన్‌లో మాట్లాడినాను. నేను ఆయన ఇంటికి కూడా వస్తానన్నాను. ఆయన వద్దని చెప్పి, ఆయనే ఈ విషయం మాట్టాడటానికి మా ఇంటికి వస్తానని చెప్పి మాట తప్పి రాకపోయినది కాక వివేకపథం సభ్యులను తూలనాడటము నాకు చాలా బాధ కలిగించినది. వియ్యానికైనా, కయ్యానికైనా సరి ఉజ్జీ ఉండాలి. పిచ్చుకపైన బ్రహ్మాస్త్రాలెందుకండీ సురేంద్ర గారూ.
సమాజానికి ఇతను ఏపాటి వాడో మీ వివేకపథం ద్వారా అందరికీ తెల్సిపోయినది. ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారో? ఇది మీ ఒక్కరితో అయ్యేపని కాదు. సత్యం ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేలోపల, అబద్దము ఊరు తిరిగి వచ్చే ఈ కాలంలో మాట నిలకడ గలవారెంత మంది? కనీసము సమాజానికి భయపడి చెప్పలేక పోతున్నాను అనన్నా చెప్పగలిగితే ఎంతోమేలు. కానీ అతనికి ఆ భావన కూడా లేదు. ఇందులో ఏ మంచి ఇమిడి ఉన్నదో ఆ ప్రకృతికే అర్థమవ్వాలి. బలవంతాలతో పని ముందుకు సాగదు. ఇలాటి వారి గురించి మాట్లాడునది, ఒక విధంగా గౌరవాన్ని ఆపాదించడమే అవుతుంది. మీకు ఎక్కువ చెప్పగల స్తోమత లేనివాడను. కాన క్షంతవ్యుడను. ఇది రాయవలసి వచ్చినందుకు బాధతప్త హృదయంతో
మీ శ్రేయోభిలాషి.

No comments:

Post a Comment