Friday, December 15, 2017

త్రైమాసిక సమావేశ విశేషాలు

 సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశములు ఏప్రియల్‌ 21, 22, 23 తేదీలలో కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో జరిగాయి. సమావేశమునకు 20 మంది లోపు వివిధ ప్రాంతాల నుండి హాజరైనారు. సమావేశము నుద్దేశించి పుట్టా సురేంద్రబాబుగారు మాట్లాడారు. సమావేశ మంతా చర్చారూపంలో సాగింది. వారి మాటల్లో మిత్రులారా! మీరంతా మానసికంగా సమావేశంలో పాల్గొన్నట్లేనా? ఎప్పుడు గాని బృందచర్చలో పాల్గొన్న వ్యక్తులలో జరుగుతున్న సంభాషణంతా (ప్రతిఒక్కరికీ) అందరిది అందరికి, తెలుస్తూ వుండాలి. ఎప్పుడైనా సమావేశంలో ఒక గొంతు మాత్రమే వినపడుతుండాలి. అప్పుడే దానిని సరైన బృంద చర్చ అనగలము. ఈ రోజు మనము తీసుకొన్న అంశమైన మత సామరస్యము, మత సహనమును అన్నదానిని పరిశీలించినట్లైతే ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవలసి వుంటుంది. మత సామరస్యము, మత సహనమునకు సరైన అర్ధములు మీకు తెలుసా? మతసామరస్యము మత సహనం ఒకే అర్ధాన్నిచ్చే పదములా? వేరు వేరు అర్ధములనిచ్చు పదములా? మతసామరస్యము మీ అనుభవంలో వుందా? మతము మనిషికి సమస్య ఎందుకయ్యింది? మతం సహజాతమా? ఆర్జితమా? మత గ్రంథాలు మత సామరస్యమును అంగీకరిస్తాయా? లేదా? ఈ రోజు దేశంలో ముస్లిము, హిందువు, క్రైస్తవుడు, మతేతరులు సోదరభావంతో వుండానికి కారణం ఏమిటి? ఆలోచించండి. ''మత్యుద్భవం మతం'' అంటే మతినుంచి పుట్టింది మతము అని. అనంతర కాలములో ఒక సెట్‌ ఆఫ్‌ ఐడియాస్‌ను మతం అని అన్నారు. మతం సహజాతము కాదు. అవి ఏర్పరచుకొన్నవి గనుక ఆర్జితములు మాత్రమే. సామరస్యం, సహనముల యొక్క అర్ధాలను పరిశీలించినట్లయితే, సామరస్యం అంటే సమరసత్వము, సహానుభూతి అని అర్ధము. సహానుభూతి వేరు సానుభూతివేరని గుర్తించాలి. సానుభూతి అంటే ఇతరులకు జరగకూడనిది జరిగిందని మనస్సు నొచ్చుకొంటే (అరెరె అంటుంటాం) దానిని సానుభూతి అంటాము. ఆ బాధతో ఏమైన సహాయము చేస్తే అది సానుభూతితో చేసే సహాయము అవుతుంది. సామరస్యం అంటే సహానుభూతి అనుకొన్నాం కదా! ఇద్దరి మధ్య సామరస్యం వుందంటే ఒకరికి బాధకలిగితే మరొకరికీ బాధ అనిపించాలి. అలాగే ఒకని సంతోషం మరొకరికీ సంతోషం కావాలి. సమరత కలిగినవారి మధ్య వుండేదే సామరస్యము. ''సమరస జన్యం సామరస్యం''. తాదాత్మ్యతా భావం కలిగిన వారి మధ్యే సామరస్యం వుంటుంది. వారిమధ్యే మమకారం కూడా వుంటుంది. ఇక సహనం అంటే సహించుకోవడం అంటే ఇష్టము లేకపోయినా భరించడం అన్నమాట. వీటి అర్ధాలు మన అనుభవంలో ఇలానే వున్నాయా? లేదా? కొన్ని ప్రశ్నలు వేసుకొని పరిశీలిద్దాం! 1) ఇద్దరి శత్రువుల మధ్య సామరస్యత వుంటుందా? వుండదా? 2) పరాయివాడి యెడ సామరస్యము కుదురుతుందా? కుదరదా? 3) శత్రువు పట్ల సానుభూతి కుదురుతుందా? కుదరదా? 4) పరాయివాళ్ళ పట్ల సానుభూతి కుదురుతుందా? కుదరదా? 5) అత్యంత ఆప్తుడి పట్ల సానుభూతి కుదురుతుందా? కుదరదా? 6) అత్యంత ఆప్తుడి పట్ల సహానుభూతి వుంటుందా? వుండదా? పై ప్రశ్నలకు మీరు స్వయంగా సమాధానాలు వ్రాసి పరిశీలించుకోండి. పై పదాల అర్ధాలు సరైనవో కావో తెలుస్తుంది. ఇద్దరి శత్రువుల మధ్య సామరస్యత వుండదు. పరాయి వాడి యెడ (శత్రువుగాకపోయినా) సామరస్యత వుండదు. శత్రువు పట్ల ఐతే సానుభూతి కూడా కలుగదు. పరాయివాళ్ళ పట్ల సానుభూతి కలుగవచ్చు. అత్యంత ఆప్తుడి పట్ల సహానుభూతే వుంటుంది కనుక సానుభూతి అన్న ప్రశ్నే వర్తించదు. ఇప్పుడు ఆలోచించండి. భిన్న మతముల మధ్య సామరస్యత వుంటుందా? సహనం వుంటుందా? మరైతే అందరూ కలసి మెలసి జీవిస్తున్నట్లు మనకు కనిపిస్తుందిగదా! దానికి కారణాలు ఏమిటి? అని పరిశీలించినట్లైతే 1) భౌతిక అవసరాలు తీర్చుకోవటానికి 2) మతం యందు గట్టి పట్టులేకపోవడం 3) సిద్దాంత భావజాలం కంటే వేరైన ఒత్తిడి వుండడం 4) కలసి జీవించడం వల్ల (పరస్పర సహాయం వలన) ఇరుగు పొరుగు సంబంధాలు ఏర్పడి వుండడం (భాయి, బెహన్‌, తమ్ముడు, అన్న అని సంభాషించుకోవడం). అయితే మత సామరస్యానికి కావలసిన ప్రాతిపదికలు మత గ్రంథాలలోనే వున్నాయా? లేవా? అన్న ప్రశ్నకు రెండు పోకడలు సమాజంలో మనకు కనిపిస్తాయి. ఒకరు మత సామరస్యము లేకపోవడానికి కారణము మత గ్రంథాలను యధాతథంగా అర్ధం చేసుకోలేకపోవడమే అంటుంటే, మత సామరస్యము లేకపోవడానికి కారణము మత గ్రంధాలను యధాతథంగా అర్ధంచేసుకోవడమేనని మరొకరంటుంటారు. దీనిని మనం పరిశీలించి చూద్దాం. ఒక మత గ్రంథము తననుసరించే వారినుద్దేశించి, మరొక మత గ్రంథాన్ని అనుసరిస్తున్న వారి పట్ల మిత్ర దృష్టి కలిగియుండమని ఆదేశించకుంటే అతను అవతలి వానిపట్ల సహానుభూతి కలిగుండలేడు. దీనికి వేరుగా ఆమత గ్రంథము తనననుసరించేవారి నుద్దేశించి, ఇతర విశ్వాసాలవారు నీకు శత్రువులుగా భావించమని చెప్పినట్లేౖతే అతను అవతలివారిపట్ల సహానుభూతి (సామరస్యము) కాదు గదా సానుభూతి కూడా కలిగి వుండడు. మత గ్రంథాలలోని ఆదేశాలే సామరస్యానికి దారి తీసేవిగా వుంటేనే తప్ప మత సామరస్యము సాధ్యపడదు. మత గ్రంధాలే ఏవైనా అలా చెప్పినాయా? వివిధ విశ్వాసాలవారు కలసి జీవించండి అనిగానీ ఆదేశించాయా? 'ఖురాను' ఇతర మత విశ్వాసులతో కలసి మెలసి జీవించండని చెప్పిందా? చెప్పలేదా? అవిశ్వాసులు, అన్యవిశ్వాసుల యెడ తటస్థముగా వుండమంటుందా? శత్రువైఖరి కలిగి వుండమంటుందా? మిత్ర వైఖరి కలిగి వుండమంటుందా? 'బైబిలు' ఇతర మత విశ్వాసులతో కలసి జీవించండని చెప్పిందా? చెప్పలేదా? అవిశ్వాసుల, అన్యవిశ్వాసుల యెడ తటస్థముగా వుండమంటుందా? శత్రువైఖరి కలిగి వుండమంటుందా? మిత్ర వైఖరి కలిగి వుండమంటుందా? అలానే 'హిందూ' మత గ్రంథములు అవిశ్వాసుల పట్ల, అన్యవిశ్వాసుల పట్ల శత్రువైఖరి కలిగి వుండమంటాయా? మిత్ర వైఖరి కలిగి వుండమంటాయా? తటస్థ వైఖరి కలిగి వుండమంటాయా? బాగా లోతుగా పరిశీలించినట్లైతే, ప్రతిమతము తనకు సంబంధించిన సమూహములోనే నిజమైన విశ్వాసులు, కపటులు కూడా వుంటారని చెబుతుంటుంది. కనుక విశ్వాసులు కాకుండానే విశ్వాసుల గుంపులో కొనసాగుతున్న వ్యక్తులుగా ఏర్పడే పరిస్థితి ఎప్పుడువస్తుందో చూద్దాం! 1) ఒకడు తాను అవిశ్వాసినని గమనిస్తూనే విశ్వాసిగా కొనసాగడము వలన ఏదో ఒక ప్రయోజనం కోరి వుండి వుండవచ్చు. 2) విశ్వాసము, అవిశ్వాసము అన్న వాటికి సరైన అర్ధాలు తెలియకుండానే ఏ అంశాన్ని అంగీకరిస్తే ఆ మత విశ్వాసిగా అంగీకరింపబడతానన్న స్పష్టత (యోగ్యతకూడా) లేకుండగనే తనకు నచ్చిన ఒకటి, రెండు అంశాలను ఆధారం చేసికొని ఆ విశ్వాసంతో కొనసాగుతుండే పరిస్థితి ఏర్పడవొచ్చు. (సాధారణంగా ఇలాంటి వారే నిజానికి ఎక్కువ శాతం వుంటారు) 3) భయపడి మతములోకి వచ్చినవారు విశ్వసించినవారు కాకుండానే ఆ గుంపులో కొనసాగుతుండే పరిస్థితి వుండి వుండవచ్చు. కనుకనే ఖురాన్‌ ప్రతి 1000 మంది ముస్లింలలో 999 మంది నరకానికే పోతారు (సరైన విశ్వాసులు కాదు) అంటోంది. ఏ మత గ్రంథమైనా తాను చెబుతున్న ప్రధాన విషయాలను (అభౌతికాలను) నమ్మమంటుంది గాని పరీక్షించుకోమనదు. కారణము ఆ అభౌతిక విషయాలు పరీక్షించడానికి తగినవి కావని తెలుసు కాబట్టి. కనుక ఆ విషయాలలో తాను నమ్మడమో, నమ్మకపోవడమో తప్ప వేరు దిక్కులేదు. వివిధ మతాలు వివిధ నమ్మకాలను గురించి చెబుతూనే తనవే సత్యము అని మిగిలినవి అసత్యమనీ చెబుతుంటాయి. వాస్తవానికి ఏదైనా వుంటే గింటే ఒకటి వుండాలిగాని, అనేకములు, విరుద్దమైనవి అన్నీ సత్యాలని ఎవ్వరమూ ఒప్పుకోముకదా! వాటిల్లో ఒకటి సత్యమైయుండొచ్చు. లేకుంటే అదీ సత్యదూరమై యుండొచ్చు. ఒకటి సత్యముంటుందని భావించినా దానిని తెలుసుకొనేది ఎట్లా?. నిర్ధారించేది ఎట్లా? (పరీక్షించేదికాదాయే) దీనికి ముందు ఒక ప్రశ్నమనకు వస్తుంది అసలు మత గ్రంధాలు ఏమి చెబుతున్నాయో వున్నది వున్నట్లు మనకు తెలిస్తేనే గదా అది సత్యమో, కాదో పరిశీలించడానికి? భారతీయ సాంప్రదాయంలో గతంలో జరిగిన చర్చలన్నీ శాస్త్రార్దచర్చలే. అంటే శాస్త్రము ఏమి చెబుతోంది అని తెలుసుకోవడం కొరకు జరిగినవే. శాస్త్రార్ధము చేయటానికి కొన్ని నియమాలు ఏర్పరుచుకొన్నారు. మొదట భాషా నియమాలు తెలుసుండాలి, ఉపక్రమ ఉపసంహారాలు చూడాలి. పూర్వాపరసంగతి గమనించాలి. వ్యాకరణ సూత్రాల ప్రకారం అర్థం చెప్పాలి, సందోర్భోచితంగా ఉందా, లేదా చూడాలన్నారు. అవన్నీ అనుసరించి కూడా నాదే సరైనదనెవరికి వారు తేల్చారు. అంటే దీని అర్ధము మూల గ్రంథాల యొక్క అర్ధాలు తెలియలేదని అర్ధము. మూల గ్రంథము యొక్క అర్ధము ఒక్కటిగా వుంటుంది గాని అనేకములుగా వుండదు గదా! కనుక ఇప్పటికీ శాస్త్రమిది అని తేలలేదని తేలుతుంది. మత గ్రంథములు ఏమి చెప్పాయో తేల్చకుండా ఇవి సత్యాలు, ఇవి అసత్యాలు అని ఎలా చెప్పగలము? ఇలాంటి పరిస్థితులలో మతం మాకు బాగా అర్ధమైందనుకొన్న విశ్వాసులు, మత పెద్దలు యితర మతాల పట్ల సామరస్యతను కలిగి వుండాలన్నారా? సహనం కావాలన్నారా? అసలు చరిత్రలో వారు ఎట్లా ప్రవర్తించారు? అని మనం పరిశీలించినట్లైతే, మతం కోసం జరిగిన యుద్దాలంతగా (మారణకాండ) మరేయితర కారణాల వల్లా జరిగుండలేదని తేలిపోతుంది. మహమ్మదు చనిపోయిన కొద్ది కాలములోనే షియాలు, సున్నీలుగా ఏర్పడి ఇప్పటికీ 1400 సంవత్సరములుగా మారణకాండ సాగించుతూనే వున్నారు. క్రీస్తును, అతని అనుచరులను చంపింది మతేతరులుకాదు, ఆ మతములోని యూదులే. ఇక బైబిలులో వున్న మత యుద్దాలు (క్రూసేడులు) ఎన్నని చెప్పగలము? బౌద్దారామాలను ధ్వంసం చేసి గుళ్ళను కట్టించిన ఘటనలు ఇక్కడా జరిగాయి. వీర శైవులు, వీర వైష్ణవుల మధ్య యుద్దాలు జరిగినాయన్నది చరిత్రే కదా! కొన్ని దేశాలలో బౌద్ధులు దేవాలయాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయి. ఇప్పుడు మనముందున్న ప్రశ్న, ఏ మత ధర్మశాస్త్రమైనా 130 కోట్ల మంది ప్రజలకూ, ఘర్షణలు లేకుండా, ప్రశాంత జీవితాన్ని అందించగలదా! అని ఆలోచిస్తే అది అసాధ్యమని తేలుతోంది. అన్ని మత ధర్మశాస్త్రాల కంటే మన ఆధునిక రాజ్యంగమే ఎల్లరకు ఘర్షణలేని ప్రశాంత జీవితాన్ని ప్రసాదించగలదని అనిపిస్తుంది. ఎలా చెప్పగలమంటే.. 1) అన్ని మత గ్రంధాలు విశ్వాసమూలకాలే 2) అన్ని మత గ్రంధాలు బానిస వ్యవస్థను అంగీకరించి, ఆచరించినవే 3) ఏమత గ్రంధము స్త్రీకి సమానత్యము ప్రసాదించలేదు. 4) ప్రతి మత గ్రంథము సమాజాన్ని విశ్వాసులు, అవిశ్వాసులగా విడగొట్టే చూసింది అంటే తన వారు, పరాయివారు అన్న భావననే కలిగి వుంది. అంటే ఏ మత గ్రంథము అందరు మానవులు సమానులు అనడము లేదు. కనుక విశ్వాస పాత్రిపదికగల మతము అందరినీ సమానంగా చూడలేదు. ఘర్షణ రహితంగా చేయలేదు. మరి మన రాజ్యాంగమైతే 1) మన రాజ్యాంగం, తనని బండగా అనుసరించమనకుండా అవసరమైన సవరణలు - పూరణలు చేసుకోమన్నది. 2) మనుషులను అమ్మకూడదు కొనకూడదు అన్న ఒక్క ఆదేశంతో బానిస వ్యవస్థను లేకుండా చేసింది. 3) స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు, సమానావకాశాలను ప్రసాదించింది. 4) తన, పర బేధాలను పాటించకుండా చట్టం ముందు అందరూ సమానులేనని ప్రకటించింది. అందరూ సమానులేనన్న ధర్మశాస్త్రం మాత్రమే అందరిని సామరస్యంగా ఉండమనగలదు. ముఖ్యవిషయమేమంటే, అన్ని మతాలు వాటిల్లోని ధర్మాలను మార్చకూడదంటూ, తూచాతప్పకుండా అనుసరించాల్సిందేనంటాయి. మన రాజ్యాంగ ధర్మశాస్త్రము అవసరమైన మార్పులు చేసుకోమంది. ఏ ధర్మశాస్త్రమైనా అన్ని కాలాలకు వర్తిస్తుందని ఎవరైనా అంటే, అది మృతప్రాయమైన ధర్మశాస్త్రమని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ నొక్కివక్కాణించాడు. ఇకపోతే మత గ్రంథాలన్నిటిలో నీ యిష్టమొచ్చిన దేవతను పూజించుకోమన్న స్వేచ్చనిచ్చింది హిందూ మతమొక్కటే. కనుకనే ఇదొక్కటే భారత రాజ్యాంగానికి అనుగుణ్యత కలదిగా ఉంది. మనమే ఏర్పరచుకొన్న (ఆర్జించుకొన్న) మత గ్రంథాలన్నీ ప్రక్కన బెట్టగలిగిన గాని, మనమందరము ఒక్కటి అవ్వలేము. గనుకనే భారత రాజ్యాంగం మత స్వేచ్చను ప్రసాదించింది. అది అందించిన స్వేచ్చను అనుభవిస్తూ మతాలు వ్యక్తిగతమైనవిగా భావించి మనందరి జీవితాలు ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా సాగటానికై, మన మందరము భారత రాజ్యాంగమనే ఆధునిక ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసి వుంది. అదే మన తక్షణ కర్తవ్యము. మరుసటి రోజు మధ్యాహ్నం నుండి సభ్యుల కోరికపై జ్ఞానసిద్దాంతాన్ని విచారణకు స్వీకరించాము. అదిన్నూ చర్చా రూపంలోనే సాగింది, జ్ఞాన సిద్దాంతం గురించీ ఆయనమాటల్లోనే వినండి. జ్ఞాన సిద్దాంతమంటే (థియరీ ఆఫ్‌ నాలెడ్జి) ఏమిటని ప్రశ్నించుకుంటే, జ్ఞానక్షేత్రానికి సంబంధించిన వివిధ విషయాలు తెలియజేసే సిద్ధాంతము అని అర్థము చెప్పుకోవచ్చు. ప్రతితాత్విక ధోరణీ తనదైన శైలిలో జ్ఞానసిద్దాంతాన్ని కలిగియున్నది. ఇది, జ్ఞానమనగా ఏమిటితో మొదలై జ్ఞానము ఏర్పడుతున్న క్రమము ఏమిటి? ఎన్ని రకాల జ్ఞానము ఏర్పడుతుంది. ఏ ఏ పరికరాల ద్వారా, ఏ ఏ విధానాల ద్వారా ఆ జ్ఞానం ఏర్పడుతుంది? తప్పుజ్ఞానం ఏర్పడటానికి కారణము ఏమిటి? దానిని నిరోధించడం ఎలా? అలానే ఒప్పు జ్ఞానము కలగటానికి కారణాలు ఏమిటి? దానిని అలానే కొనసాగించడం ఎలా? కలిగిన జ్ఞానం తప్పో, ఒప్పో సరి చూసుకొనే (పరీక్షించుకొనే) విధానమేమిటోతో ముగుస్తుంది. జ్ఞానం భౌతిక రూపంలో వుంటుందా? మెదడులో వుంటుందా? అని పరిశీలించితే మెదడులోనే జ్ఞానం ఏర్పడుతుందని తెలుస్తుంది. విషయ రహితమైన జ్ఞానముంటుందా? వుండదా? అని ప్రశ్నించుకుంటే విషయరహితంగా జ్ఞానం వుండదు అనీ తెలుస్తుంది. అలానే పని జరగకుండా ఫలితం పుట్టదు. ఫలితం పుట్టిందంటే పని జరిగిందని అర్ధము. పరికరము లేకుండా పని జరగదు. పద్దతి లేకుండా అనుకొన్న ఫలితాలు పుట్టవు. అంటే ఏ పనైనా ఏదో పరికరము, ఏదో పద్దతీ లేకుండా జరగదు అని అర్ధము. మానవ జీవితాన్ని కదిలిస్తున్నది జ్ఞానమే. అలా ఏర్పడిన జ్ఞానం తప్పు, ఒప్పు అని రెండు రకాలుగా వుంటుందని అనుకొన్నాము. ఇలా రెండు రకాలుగా కాక ఏదో ఒక్క రకంగానే జ్ఞానం ఏర్పడుతుంటే మనం వాటి గురించి పరిశీలించాల్సిన అవసరమే వుండేదికాదు. జ్ఞాన సిద్దాంతము యొక్క ఆవశ్యకతే వుండేది కాదు. తప్పు జ్ఞానం వలన తప్పు ఫలితం వస్తుంది. అంటే అనుకోని ఫలితాలు పొందుతుంటాము. అలానే ఒప్పుజ్ఞానం వలన ఒప్పు ఫలితమే వస్తుంది, అంటే అనుకొన్న ఫలితమే పొందుతాము. కనుక మనకు సరైన జ్ఞానము ఎప్పుడూ కలుగుతుంటేనే సరైన (కోరుకున్న) ఫలితం పొందుతుంటాము. జ్ఞానమేర్పడుతున్న క్రమంలో దోషాలు, లోపాలు ఏర్పడుతుండవొచ్చు. వాటిని తొలగించుకోవాలంటే ముందు అవి మనకు తెలిసుండాలికదా! కనుక దోషం అంటే వుండకూడనిది వుంది అని అర్ధము. ఇలాంటి వాటిని తీసివేయాలి. అలానే లోపాలు అంటే వుండవలసినదే గాని వుండవలసినంత లేదు అని అర్ధము. ఇలాంటి వాటిని పూరించుకుంటుండాలి. మనిషి వర్తమానం నుండి ఆపటానికి వీలులేని రీతిలో భవిష్యత్‌లోకి కదులుతున్నాడు. భవిషత్‌ మన జ్ఞానంలో ఉన్న విషయం కాదు. అంటే భవిష్యత్తు గురించిన మన నిర్ణయాలన్నీ ఊహలూ, అంచనాల రూపంలోనే ఉంటుంటాయి.. గత కాలానికి చెందిన అవగాహనలోని సాధారణ సూత్రాలనాధారం చేసికొని భవిషత్‌కు సంబంధించిన ఊహలు ఏర్పరచుకొని, ఆ ఊహలననుసరించి భవిషత్‌లోకి అడుగులు వేస్తుంటాడు ఏ మనిషైనా. కనుక గతములోకి చూడాలన్నా, భవిషత్‌లోకి అడుగు వేయాలన్నా హేతుబద్ద యోచనే తప్పని సరి. ఇక్కడ ప్రత్యక్షానికి అవకాశమేలేదు. కారణం గతాన్ని గాని, భవిషత్‌ను గాని ప్రత్యక్షీకరించుకొనే అవకాశమే లేదు గనుక. మిత్రులారా! ఇదంతా మరొకసారి, మరొకసారి మీమీ అనుభవాలతో సరిపోల్చి చూసుకోండి. చివరిగా ఆస్తిక నాస్తిక సిద్దాంతాలపై సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. వాటినన్నిటిని వ్రాయడం కుదరదు గనుక సంక్షిప్తంగా ప్రతిపాదనల రూపంలో, ఆయన మాటల్లోనే మీ ముందుంచుతాను, గమనించండి. పూర్వీకులు అభిప్రాయాల సంపుటిని మతము అన్న అర్ధంలో వాడారు. కనుకనే ఆనాడు నాస్తికులు, చార్వాకులు, బౌద్దులు, జైనులు కూడా మతస్థుల క్రిందనే చలామణి అయినారు. ఆస్తికత, నాస్తికతలను విచారించే ముందు వాటి అర్ధాలు తెలుసుండాలి. ఆస్తికత అంటే ఏమిటి? ఎవరిని ఆస్తికులు అనాలి అని ప్రశ్నించుకుంటే, ఎవరైతే, సృష్టి, సృష్టికర్త, మరణానంతర జీవితము, పరలోకములనకు అంగీకరిస్తారో వారిని ఆస్తికులు అంటున్నాము. వారు చెప్పే సిద్దాంతాన్ని ఆస్తిక సిద్దాంతము అంటారు. ఆస్తికతలో అంతర్గతంగా ఎన్ని తేడాలు వున్నా ఈ క్రింది అంశాలు మాత్రం తప్పక వుండి వుంటాయి. అవి 1) సృష్టికర్త వుంటాడు. 2) అదిన్నీ అతడు అభౌతిక శక్తి రూపంలో వుంటాడు. 3) అతడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడై యుంటాడు 4) ప్రళయముంటుంది. 5) పరలోకాలుంటాయి 6) మరణానంతర జీవితాలు వుంటాయి. ఈ విషయాలు మనకు ఏదో గ్రంథము ద్వారానో, లేక పెద్దల ప్రసంగాల ద్వారానో మాత్రమే తెలుస్తాయి. అంటే ఆ విషయాలు వినో, చదివో మాత్రమే తెలుసుకోగలము. ఇక నాస్తికత అంటే ఆస్తికతను వ్యతిరేకిస్తూ ఉనికిలోకి వచ్చిందే. కనుక ఆస్తికత అంటే ఏమిటో తెలియకుండా నాస్తికుడు కాలేడు, నాస్తిత గురించి చెప్పలేడు. ఇక ఆస్తికులు, నాస్తికులూ ఉమ్మడిగా అంగీకరించేవి కొన్ని ఉన్నాయి. లోకంలో జడచేతనాలు రెండూ వున్నాయి. జడపదార్దాలకు తెలుసుకునే లక్షణం ఉండదు. చేతన పదార్ధాలకు తెలుసుకునే లక్షణం ఉంటుంది. మరి ఆస్తిక, నాస్తికుల మధ్య తేడా దేని విషయంలో? 1. కొన్ని జడ పదార్ధాల కలయిక నుండే తెలుసుకొనే లక్షణం కలిగిన చేతన పదార్ధం ఏర్పడిందన్నది నాస్తికుల వాదన కాగా, ఎన్ని జడపదార్ధాలు కలసినా తెలుసుకునే లక్షణం కల చేతన పదార్ధం పుట్టదు. చేతన పదార్ధం స్వతంత్రమైనది. జడం కంటే వేరైనదీ అని ఆస్తికులంటారు. 2. ఇప్పటికీ ఎప్పుడైనా, జడ పదార్ధాలను మిళితంచేసి చేతన పదార్ధాన్ని రూపొందించటం జరిగిందా అని ఆస్తికులడుగుతారు. అట్టిది ఇప్పటి వరకు ప్రయోగరీత్యా జరగలేదంటుంది సైన్స్‌. 3. తెలుసుకునే లక్షణం కలిగిన చేతన ద్రవ్యం (పదార్ధం) ఉందని ఆస్తికులూ రుజువుచేయలేదిప్పటికీ. అలాగే ఇదిగో ఈ జడపదార్ధాల కలయిక నుండే తెలుసుకునే లక్షణం కలిగిన చేతన పదార్ధాం పుట్టిందని నాస్తికులూ రుజువుచేయలేదిప్పటికీ. ఓ నిజానికీ రెండు పక్షాలకు, వారంటున్నది వాస్తవమేనని రుజువుచేసే సామర్ధ్యము లేదు. ఉండదు కూడా. అయితే ఒక్క విషయం చెప్పుకుని తీరాలి. పై రెండు వాదనలలో ఏదో ఒక్కటే సత్యమయ్యే వీలుంది. రెండూ సత్యమవడం గానీ, రెంటికీ వేరైన మూడోదేదో సత్యమవడం గాని జరగదు (అసంభవం). అయినా, ఇప్పటికీ ఆ రెంటిలో ఏది సత్యమన్నది అనిర్ధారితమే. అంటే తేలలేదనే. కనుక ఆ విషయంలో ఏది సత్యమో తేలలేదన్న ప్రతిపాదనే వైజ్ఞానికంగా సరైనదవుతోంది అంటూ ముగించారు సురేంద్ర గారు. మీరూ దీనిపై ఎవరికి వారుగా ఆలోచించి స్పందించండి.
రిపోర్టర్‌ : కోట ప్రసాదశివరావు

No comments:

Post a Comment