'కల్కి భాగోతం' అలా అలా ప్రాకుకుంటూ మన గ్రామమైన కుంచనపల్లికి కూడా చేరి తిష్ట వేసింది. ఇక్కడ నుండి ప్రక్క ప్రక్క గ్రామాలకు ప్రాకడం మొదలైంది. కుంచనపల్లిలో ఒక హోమియో వైద్యుడు ఆయన భార్య యీ కల్కి భాగోతాన్ని ఆరంభించారు. ఫొటోలో నుండి కుంకుమ, తేనె వస్తున్నట్లు, డబ్బు ఎంతెంత పెడితే అంతంత పాపాలు పోతాయని, పళ్ళాలలో పాదాలు కనిపిస్తున్నాయని ప్రచారం చేసి అమాయకులను దోచుకుంటున్నారు. ఆ కల్కి పుట్టుపూర్వోత్తరాలు ఇవి :
ఈ కల్కి ఉద్యమ రథాన్ని లాగుతున్నది జోడు గుర్రాల్లాంటి ఇద్దరు. ఒకరిపేరు విజయకుమార్. ఇతణ్ణే ఇప్పుడు కల్కి భగవాన్ అంటున్నారు. రెండోవాడు శంకర్. ఇతణ్ణే ఇప్పుడు శంకర భగవత్పాద (పరమ గురువు) అంటున్నారు.
తల్లిదండ్రులు : విజయకుమార్ (కల్కి) తండ్రి వరదరాజులు; తల్లి వైదేహి, ఊరు అరక్కోణంలోని గుడియాత్తం దగ్గర నెత్తం అనే గ్రామం. వరదరాజులు అనే ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయి. విజయవాడలోనూ కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి-తిరుత్తనిల మధ్యగల నేమం అనే గ్రామంలో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు.
'కల్కి' అనబడే విజయకుమార్‌కు రవి, రమేష్ అనే ఇద్దరు తమ్ముళ్ళు వున్నారు. రవి లక్ష్మీ కమర్షియల్ బ్యాంక్, కోయంబత్తూరులో పనిచేస్తున్నారు. రమేష్ కల్కి సెంటర్‌కు ఇన్‌ఛార్జ్‌గా చేస్తున్నారు. అతడికి ఒక సోదరి వుంది. ఆమె భర్తపేరు రామ్మూర్తి. ఇటుకల వ్యాపారం చేస్తుండేవాడు ప్రస్తుతం 'రామభగవత్పాద' అన్న పేరు తగిలించుకొని కల్కి సంఘములో ప్రధానపాత్ర వహిస్తున్నాడు.
ఇతనికి ఒక కూతురు వుంది. ఆమెను తన బావమరిది కొడుకైన కృష్ణకిచ్చి పెండ్లి చేశాడు. కృష్ణ ఇంజనీరింగ్ చదివి విదేశాలకు (ఆస్ట్రేలియా) వెళ్ళారని తెలిసింది.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే అందరినీ భక్తులు కమ్మంటూ, అందరికీ ముక్తి ప్రసాదిస్తానంటున్న అతడు స్వయంగా కొడుకు, కోడలికి మాత్రం దాసదాసీల వేషం వేయించలేదు. లోకుల పిల్లల్ని మాత్రం ఏదో రీతిని లొంగదీసుకొని, లేదా ఆకర్షించి దాసులుగానో, దాసినులుగానో మార్చుతున్నాడు. ఈతని శిష్యుడే చాలాకాలం ఇతనితో కొనసాగి అనుపానాలన్నీ కనిపెట్టి ఈతని గుట్టు రట్టు చేశాడు. తమిళ పత్రిక నక్కీరన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (97 మార్చి 8, 10, 12) ఇతని భాగోతాన్ని బయటపెట్టినవి. బెంగుళూరు నుండి మరో పత్రికా ఇతగాడిపై ధ్వజమెత్తింది.
పురాణాల ప్రకారం అవతార పురుషుడైన కల్కి ఆ పురాణాల ప్రకారమే రావలసిన కాలంగానీ, పుట్టే చోటుగానీ ఈ దొంగ పుట్టిన చోటు, వచ్చిన కాలము కాకపోవడంచే పురాణ విశ్వాసుల్లోనే కొందరు ఆ పురాణాల ఆధారంగానే ఇతగాడు దొంగ కల్కేగాని, అసలు కల్కి కాదని తెగేసి చెప్పారు. ధవళేశ్వరం స్వామి బహిరంగంగానే ఇతడు కల్కి అయ్యే అవకాశం లేదని ప్రకటించాడు.
పురాణాల ప్రకారం కల్కి : ఖడ్గము, తెల్లగుర్రము, కిరీటము ధరించి హిమా లయాలలోని శంబల గ్రామం నుంచి రావలసియున్నది. కాని నేనే కల్కినంటున్న ఈయనైతే పురాణాలు చెప్పే రీతిలో కాకుండా దానికి పూర్తిగా వ్యతిరేకమైన రూపములో పొట్టా, గడ్డమూ, ముసుగు, పెళ్ళాము, పిల్లలు వగైరాలతో దర్శనమిచ్చాడు. అంతకు పూర్వము మామూలు మనిషిగనే వుంటూ యోగాభ్యాస శిక్షణ తరగతులు, పాఠశాల నిర్వహిస్తూ పొట్టపోసుకునేవాడు. ఇవన్నీ ఇతడు భారతీయ అవతారాల వాదం ప్రకారం రావలసియున్న కల్కి కాదనటానికి ఖచ్చితమైన నిదర్శనాలు.
ఈమధ్య ఎక్కడకక్కడ బాబాలు, మాంత్రిక డాక్టర్లు వగైరాలు మోసగాళ్ళనే విషయం మీరూ పేపర్ల ద్వారా చదువుతూనే వున్నారు. ఉదాహరణకు ఆమధ్య విజయవాడ హాస్పిటల్‌లో ఆపరేషన్ లేకుండా శస్త్రచికిత్స చేస్తానన్న శంకరాచారి - నిన్న మొన్న హైదరాబాద్‌లో ఇలాంటి వైద్యమే చేస్తానంటూ పోలీసుల చేత చిక్కిన ముస్లీమ్. అలానే నిన్నటి పేపర్లో మంగళగిరికి చెందిన కూరగంటి చంథ్రేఖర్ (చంథ్రేఖర్ బాబా) అనే దొంగ బాబా 3,00,000 కాజేసి పోలీసులకు చిక్కిన ఉదంతము అందరకూ తెలిసిందే.
ఈ కల్కి భాగోతము ఆరంభమైన క్రొత్తలో నల్గొండజిల్లాకు చెందిన మరొక వ్యక్తి నేనే అసలు కల్కినంటూ పేపర్ ప్రకటన ఇచ్చి హైదరాబాద్‌లో ప్రత్యక్షమైనాడు. కొద్దికాలములోనే వాడి భాగోతము బైటపడి కటకటాలు లెక్కపెడుతున్నాడు. అదే సమయంలో శ్రీశైలం నుండి వేరొక వ్యక్తి నేనే కల్కినంటూ ప్రచారం చేసుకొన్నాడు. వాళ్ళిద్దరూ ఇతనంత కుటిల మేధావులు గాకపోవడం వలన త్వరలోనే తెరమరుగైనారు. పట్టి నిలబెట్టి చూడాలేగాని ఈ రకం వారంతా మోసగాళ్ళేనన్న సంగతి ఇట్టే తేలిపోతుంది.
ఈ కల్కి తన భార్యను కూడా దేవతను చేశాడు. చెప్పుకుంటే చాలా వుందిగాని విచక్షణాశీలురకు ఇంత మాత్రము చాలునని క్లుప్తముగా ముగిస్తున్నాను.
పైన చెప్పిన కుంచనపల్లి హోమియో డాక్టరు ఆయన భార్య పిచ్చి మాలోకమైనా అయ్యుండాలి లేదా కమీషన్ ఏజంట్లు అయినా అయివుండాలి. ఎక్కువలో ఎక్కువ కమీషన్ ఏజంట్లు అయ్యేందుకే వీలుంది. కాదు మేము నిజాయితీపరులమేనని గనుక వారనేటట్లయితే ఆ ప్రాంతపు పోలీసు అధికారులు, గ్రామాధికారుల సమక్షంలో అదంతా హంబక్ అని మేము ఋజువు చేస్తాము.
అధర్మము జరుగుతూ వుంటే చూస్తూ వుండడము (అనుమోదిత పాపం)
అన్ని పాపాలకంటే పెద్దదని మన ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి.
No comments:
Post a Comment