సమాజహిత కాంకక్షులైన మిత్రులారా! ఏదైనా ఒక కార్యం నెరవేరాలంటే మూడంశాలు ముడిపడాల్సి వుంది. (1) దానికి సంబంధించిన సరైన అవగాహనతో కూడిన ప్రణాళిక, (2) దృఢ సంకల్పమూ, (3) క్రియా సామర్థ్యము. మన ప్రకరణాంశమైన 'మార్క్సిజం- శాస్త్రీయ విశ్లేషణ' అన్న కార్యం కూడా సక్రమంగా నెరవేరాలంటేనూ పై మూడూ అవసరమే. అందులో-
(1) అవగాహన అన్నది రెండు భాగాలకు సంబంధించి వుండాలి. (ఎ) ఆ సిద్ధాంత స్వరూపం ఏమిటన్నది కాగా, (బి) శాస్త్రీయ విశ్లేషణలో విశ్లేషణ స్వరూపం ఏమిటన్నదీ, విశ్లేషకుని రీతేమిటన్నది అయి వున్నాయి.
(2) దృఢచిత్తం : ఈ పని జరగాలి. ఈ అంశంలో సమాజానికి హితంకల రీతిలో సత్యాలు వెల్లడైతే బాగుండును. వెల్లడయ్యేంతవరకు శక్తిమేర కృషిచేయాలి అన్న ఆకాంక్ష తీవ్రంగా వుండడం. వాస్తవాలు వెలికి రావాలి, అవి నాకిష్టమున్న రీతిలో వున్నా లేకున్నా అన్న అభిలాషా, మానసిక సంసిద్ధతా శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా వున్న ఉద్దేశ్యంలో ప్రధానంగా వుంటుంది. మిగిలిన సందర్భాలలో మనిషి తనకు నచ్చినవే నిలబడాలని కోరతాడు.
(3) క్రియా సామర్థ్యం : నిజానికిదిచాలా కీలకమైన అంశం. పై రెండూ సక్రమం గానూ, శక్తివంతంగానూ ఉన్నప్పుడే ఇది అమలులోకొస్తుంది.లేనపుడు తన పక్షం ఆధిక్యంలో ఉన్నంతవరకు పరిశీలన జరగాలనే అంటాడు, విచారణ సాగిస్తూ వుంటాడు. ఎక్కడన్నా ఇబ్బందిగానీ ఏర్పడిందంటే ఏదొక వంకతో విచారణ నుండి విరమించికోడానికే చూస్తారు ముప్పాతిక మూడొంతులమంది.
ఆదినుంచి సమాజంలో జరుగుతున్న విపరీతం ఇదే. తెలిసిందానికీ, చేస్తున్నదానికీ మధ్య ఎంతో కొంత వ్యత్యాసం వుంటూనే వస్తోంది. తాత్విక విచారణంతా సత్యాసత్యాలకు సంబంధించే వుంటుందన్నది గతంలోనూ చెప్పుకున్నాం. గుర్తుచేసుకోండి. మరి ఈ సత్యాసత్యాలు తేల్చుకోవడంలో క్రియా సామర్థ్యం వుండడం లేకపోవడం అంటే ఏమిటో మీరూ ఆలోచించండి. ఏ పలుగో పారో పట్టుకుని బయలుదేరడంకాదు. అతికీ అతకని, పొసిగీ పొసగని, తెలిసీ తెలియని ఆధారాలతో విధానాలతో బుర్రకు తోచినట్లు మాట్లాడడం అంతకంటేనూ కాదు.
జ్ఞానభాగంలో క్రియా సామర్థ్యం వుండడమంటే, అదీ శాస్త్రీయ విశ్లేషణలో క్రియా సామర్థ్యముండడమంటే (1) సమగ్రమైన సిద్ధాంతావగాహన, (2) శాస్త్రీయ విచారణ పద్ధతి సక్రమంగా తెలిసి వుండడం, (3) సత్యాన్ని ఆవిష్కరించాలన్న తీవ్రమైన దుగ్ధతోపాటు విశ్లేషించే పనిలో అనుభవముండడం, (4) ఆవేశకావేశాలకు లోనుకాని విషయనిష్ఠమైన మనస్సు కలిగి వుండడం, (5) తగినంత సమయాన్ని కేటాయించి చిత్తశుద్ధితో విచారణ ముగిసే వరకు ముగించుకోకూడదన్న వైఖరి కలిగి వుండడం, మొదలైన మానసిక సామర్థ్యాలన్నీ సమకూడితేగాని సిద్ధాంత విచారణపరంగా క్రియా సామర్థ్యం ఒనగూడినట్లుకాదు. మిగిలిన అన్ని తరహాల కార్యాచరణకు, దీనికీ ఒక మౌలికమైన తేడా ఉంది.
మిగిలినవన్నీ అవగాహన, ఉద్దేశమునన్న రెండూ మానసికాలై, క్రియ అన్నది భౌతిక కార్యాచరణ రూపంలో వుంటుంది.
అదే మరి సిద్ధాంత విచారణలోనైతే అవగాహన, ఉద్దేశమన్న వాటితోపాటు క్రియా సామర్థ్యం కూడా మానసిక శ్రమ రూపంలోనే వుంటుంది. కనుక రాగద్వేషాలు లేకుండా విచారణ కార్యక్రమంలో శ్రమించడం, అదీ విచారణ ఒక ముగింపుకొచ్చే వరకు సమతౌల్యత కోల్పోకుండా తనవంతు శ్రమించడం అన్నదే ఈ విషయంలో క్రియా సామర్థ్యాన్ని సూచిస్తుంది. వేదికల్లో మూడు పక్షాలలో వున్న మిత్రులారా! ఇక్కడికాగి దీనిని జీర్ణం చేసుకోండి ముందు. ఈ విషయంలో మన మన పాత్రలను సక్రమంగా పోషించగలిగినంత వరకే ఈ భాగంలో వుండడానికి, కొనసాగడానికీ మనకు అర్హత లభిస్తుంది. లేకుంటే మనం అంగీకరించినా అంగీకరించకున్నా, ఇతరులు విషయాన్ని ఎత్తిచూపినా చూపకున్నా మనం మాత్రం దారితప్పినట్లే.
ఇక విషయానికొద్దాం. (1) గతితార్కిక భౌతికవాదంలోని మూడు గతి తార్కిక నియమాలు అంటున్నవి నిజానికి విశ్వంలో వున్నవా? రుద్దబడినవా? అంటే శాస్త్రీయంగా నిర్ధారింపబడ్డవా, కాదా? అన్నది విచారణకు స్వీకరించి ఒక కొలిక్కిరాని అంశం. (2) మార్క్సిజం అంగీకరించు జ్ఞాన సిద్ధాంతంలోని గతితార్కిక తర్కము (డైలెక్టికల్ లాజిక్) అన్నది నిజంగా వుందా లేదా అన్నదీ విచారణకు స్వీకరించిందీ, ఇప్పటికీ తేలనిదీ అయిన రెండో అంశము. (3) పై రెండంశాలల్లోనూ ప్రతిపాదకపక్షంవారు జరిగిన సమావేశాల నాటికి 1996 నుండి 2003, వాటిని ప్రతిపాదించి నిరూపించేటంత సమాచారం తమ దగ్గర లేదన్నది వారే తేల్చిన అంశం.
ఇకపోతే - పైవాటి విషయం తేల్చుకోవలసే వుందన్న నిజాన్నల్లా వుంచితే - ఆ సిద్ధాంతంలోని మరో భాగమైన చారిత్రక భౌతికవాదాన్ని, విశ్లేషణకై పట్టి చూడాల్సి వుంది. ఈ చారిత్రక భౌతికవాదాన్ని కొన్ని ఉప విభాగాలుగా వర్గీకరించుకుంటే అవగాహనా, విచారణా కూడా సబబుగా వుంటుంది.
(1) సాంఘిక నిర్మాణాల పరిణామక్రమం
(2) ఆర్థిక సంబంధాల పరిణామక్రమం
(3) భావజాల పరిణామక్రమం
(4) ఈ మూటి మధ్యా వున్న పరస్పర ప్రభావాల సంబంధక్రమం.
ఈ విషయాలను విచారించడానికి పూనుకునే ముందు ఈ అంశాలపై మార్క్స్, ఏంగెల్స్‌లు ఏమి వ్రాశారో నిర్ధారించుకోవడం ఒక వంతైతే, ఆ విషయాలు వారికెలా తెలిశాయన్నది మరోవంతు. మరో వంతనేకంటే మరింత అవసరమైన, ప్రధానమైన వంతు అన్నది అందరం ముందుగా గమనించాల్సి వుంది. ఎందుకని?
ఈ భాగపు రచనంతా - అభిప్రాయ ప్రకటనలన్నీ - సమాజావిర్భావానికి ముందు నుండి ఇప్పటివరకు జరిగినవన్నీ - గతానికి సంబంధించినవై యున్నాయి. (వారి రచనలలోని మరి కొన్ని మార్స్, ఏంగెల్స్‌ల కాలానికి భవిష్యత్తులో జరగవలసినవైయుండి ఈనాటి మనకు జరిగిపోయిన వాటి క్రింద చేరినవైపోయాయి. మరికొన్నైతే మనకూ భవిష్యద్విషయాలే. దానినీ మనస్సులో పెట్టుకోండి. వారి కాలం వరకు జరిగిందంటున్న చారిత్రక పరిణామక్రమాన్ని వారెలా తెలుసుకున్నారు? అన్నది ముందు తెలుసుకు నుండాల్సిన విషయమనుకున్నాంకదూ?
అసలింతకూ గతాన్ని తెలుసుకోవడానికి మనిషికున్న మార్గాలేమిటి? (1) చారిత్రక రచనలు, (2) పురావస్తుశాఖ పరిశోధనలు, (3) అక్కడక్కడా మిగిలివున్న అనాగరిక జాతుల, తెగల జీవన విధానాలు. ఇంతేనా, ఇంకేమైనా మార్గాలున్నాయా? నాకు తెలిసినంతలో మరే మార్గాలు లేవు. మిస్సయ్యాననిపిస్తే తెలియజేయండి.
నోట్ : పై మూడు మార్గాలూ గతం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మనకున్న రెండు జ్ఞానార్జనా విధాలన్నమాట. జ్ఞానసిద్ధాంత పరిభాషలో చెప్పాలంటే ఒకటవది శబ్దప్రమాణం క్రిందికి రాగా, రెండు, మూడులు తార్కిక యోచనా విధానం క్రిందికి మా భాషలో అనుమాన ప్రమాణం క్రిందికి వస్తాయి. ప్రమాణ క్షేత్రాలు తెలిసినవారికో చిన్న పరీక్ష, మూడవది అనుమానంలోకి వస్తుందా? ప్రత్యక్షంలోకా?
ఈ విషయంలో మార్క్స్, ఏంగెల్స్‌ల ప్రధాన కృషి చారిత్రక రచనల నుండి సమాచారాన్ని సమకూర్చుకోవడమే. వారెన్ని రచనలను అధ్యయనం చేశారన్నది మనకంత అవసరం కాదు. వారు క్రోడీకరించి తమ రచనలలో పొందుపరచిన భాగమే గతాన్ని గురించి వారంగీకరించిన చిత్రమవుతుంది. వాటి సబబు బేసబబుల్ని విచారించడం మన రెండోథ కార్యక్రమంలో ముఖ్యాంశం.
ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, నిజానికి పాచిబట్టిన జారుడుబండ మీద నడవడమంత కష్టమైనది. ప్రత్యక్షంలో సరిచూసుకోవడానికి వీలున్న అంశాలలోనైతే అవెంత సంక్లిష్టమూ, సూక్ష్మమూనైన అంశాలైనప్పటికీ ఖచ్చితంగా నిర్ధారణకు రావడానికి వీలుండేది. మరి మన ప్రస్తుతాంశం గతానికి సంబంధించినది. అంటే ఈ భాగానికి చెందిన నిర్ణయాలన్నీ ఊహారూపాలుగా -అంచనాలుగా - మాత్రమే వుండగలవు. ఆ అంచనాలూ ఏమాత్రం సమగ్రతకు నోచుకోని పాక్షిక రూపాలుగా మాత్రమే వుండగలవు.
జ్ఞానసిద్ధాంతపు ప్రాథమిక నియమాల ప్రకారమైతే, లభించిన ఆధారాలతో ఊహించి చేసిన నిర్ణయాలుగానీ, ఆయా గ్రంథాలందించిన సమాచారం ఆధారంగా చేసిన నిర్ణయాలుగానీ అంతిమ నిర్ణయాలు కాజాలవు. అవి సత్యములే అనడం సాధ్యపడనే పడదు. అలా జరిగి వుండవచ్చు అనడానికి మించి వాటికి శక్తి లేదు. అందులోనూ గ్రంథాలాధారంగా చేసిన నిర్ణయాలు మరింత బలహీనమైనవి. అవి కేవలం విశ్వాస ప్రాతిపదికనంగీకరించి ఏర్పరచుకున్నది మాత్రమే. వాటిలో సత్యాలు (వాస్తవాలను ప్రతిబింబించే భావాలు) వుండకూడదని లేదుగాని, ఏవి సత్యాలో, ఏవి కావో కేవలం వాటిని వాటిగా చూపి నిర్ధారించడం అసాధ్యం, శబ్ద ప్రమాణానికి ఉన్న పరిమితి అది. ఆ పరిమితులనంగీకరించి మాత్రమే దానిని వాడుకోవాలి. వాడుకోగలం. అంతకు మించి దానివల్ల అదనపు ప్రయోజనం కలగదు. ఇకపోతే మొదటిదైన ఆధారసహిత ఊహ- అంచనా-కూడా సంభావ్యతా సూత్ర పరిధిని మించి అంటే జరిగి వుండవచ్చుననేంతకు మించి ముందుకు నడపలేదు.
ప్రమాణ శాస్త్ర నియమాల ననుసరించి ఇది ఎవరమూ కాదనరాని, కాదనలేని వాస్తవము. కనుక చారిత్రక భౌతికవాదంక్రింద మార్క్సిజంలో ప్రకటించబడ్డ అభిప్రాయాలు:
(1) మార్క్స్, ఏంగెల్స్‌లు పురాతత్వ శాఖ విధానాన్ననుసరించి స్వయంగా అన్వేషించిన ఆధారాల ననుసరించి ఏర్పడినవై యుండాలి.
(2) వారి కాలంనాటికి అందుబాటులో వున్న పరిశోధకుల రచనలాధారంగా ఏర్పరచుకున్న వైనా అయ్యుండాలి.
(3) ఈ రెండు రకాలుగా లభించిన సమాచారం ఆధారంగా ప్రకటించిన అభిప్రాయాల సత్యాసత్యాలు నిర్ధారించడమెలాగన్నది ఆ పక్షంవారికీ, మనకూ కూడా తెలిసి వుండాలి. చారిత్రక భౌతికవాదం ప్రధానంగా మూడంశాలను ముచ్చటిస్తుంది.
(1) సమాజ పరిణామక్రమం : దీనిలో ఆదిమ కమ్యూనిస్టు విధానంతో ఆరంభమై బానిస, యజమాని, భూస్వామి-కౌలుదారు; పారిశ్రామికుడు-కార్మికుడు అన్న వైరుధ్యాల కూడిక రూపాలైన మూడు వ్యవస్థలు నడిచాయన్నది వాళ్ళ ప్రధాన ప్రతిపాదన.
(2) ఆదిమ కమ్యూనిజం తరువాత ఇప్పటివరకు జరిగిన చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రేనన్నది అంతే ముఖ్యమైన మరో ప్రతిపాదన.
(3) విశ్వ నియమాల ననుసరించి అభావము నభావంచేస్తూ అభివృద్ధి చెందిన థలో తిరగి ఆధునిక కమ్యూనిస్టు సమాజం అనివార్యంగా వచ్చి తీరుతుందనేది మరో మూలభావన.
(4) అలాగే ఆర్థిక సంబంధాల పరిణామక్రమమూ ఈ సిద్ధాంత భాగంలోకే వస్తుంది. వాటి వివరాలు కొన్ని పై సంచికలో వ్రాస్తాను. మీరూ ఎవరికి వారుగా కొంత అధ్యయనం చేయండి.
మార్క్సిజంలోని 'చారిత్రక భౌతికవాదానికి' సంబంధించినంతలో ప్రామాణిక సమాచారాన్ని అందించే గ్రంథం ఏంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్థి, రాజ్యముల ఆవిర్భావము' అన్నదొక్కటే. మిగిలిన రచనల్లోఅక్కడక్కడా ఈ విషయమైన సమాచారం వుంటే వుండి వుండవచ్చు.
మీరూ దీనిని ఆమూలాగ్రం పరిశీలించడానికి ప్రేరణగా వుంటుందనే లెనిన్ మాటలను వ్రాస్తున్నాను.
ఏంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్థి, రాజ్యముల ఆవిర్భావము' అనే గ్రంథాన్ని మీరూ చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాదించిన మౌలికమైన గ్రంథాలలో ఇదీ ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యమూ అదేదో ఆషామాషిగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసిందనే నమ్మికతో ప్రమాణ వాక్యంగా మనం అంగీకరించవచ్చు - లెనిన్.
ఈ విషయంలో ఏంగెల్సిలా అన్నాడు. చరిత్రను భౌతికవాద దృక్పథం నుంచి పరిశీలించి మార్క్స్ (కొన్ని పరిమితులకు లోబడి మేము అని కూడా చెప్పవచ్చు) కొన్ని నిర్ధారణలకు వచ్చాడు. మోర్గన్ పరిశోధనా ఫలితాలను ఆ నిర్ధారణలకు జోడించి వాటి ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపించాలని ఆయన ఒక పథకం వేసుకున్నాడు. చరిత్రను భౌతికవాద దృక్పథం నుంచి పరిశీలించే పద్దతిని మార్క్స్ 40 ఏండ్ల క్రితమే కనుగొన్నాడు. దానినే అమెరికాలో మోర్గన్ తన సొంత పద్దతిలో మళ్ళీ కనుగొన్నాడు.
కీర్తిశేషుడైన నా మిత్రుడు మార్క్స్ రాయదలచుకున్నా కూడా పూర్తిచేయలేకపోయిన గ్రంథస్థానాన్ని నా పుస్తకం స్వీకరించలేదు. ఆలోటునది స్వల్పంగా మాత్రమే తీరుస్తుంది. అయినా ఆయన మోర్గన్ పుస్తకంలోనుండి ఎత్తి రాసిపెట్టుకున్నవీ, వాటిమీద రాసిపెట్టుకున్న సవిమర్శక వ్యాఖ్యలూ నావద్ద వున్నాయి. సాధ్యమైనచోటల్లా వాటిని యథామాతృకగా పేర్కొంటాను.
మోర్గన్ ప్రధాన రచన పురాతన సమాజం (1817) యొక్క ప్రాధాన్యత యిక్కడే వుంది. దానిని ఆధారం చేసుకునే నేనీ పుస్తకం వ్రాశాను.
జీవశాస్త్రానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎంత ముఖ్యమో, ఆర్థిక శాస్త్రానికి మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం ఎంత ముఖ్యమో, నాగరిక ప్రజలలో కన్పించే తండ్రి హక్కు గణాలకు పూర్వ తల్లిహక్కు గణాలు వుండేవని మోర్గన్ కనిపెట్టిన విషయం కూడా అంతే ముఖ్యం.
మోర్గన్ రచన వెలువడిన పిదప 14 ఏండ్లకే ఎన్నో నూతన విషయాలు వెలుగులో కొచ్చాయి. మానవజాతి విజ్ఞాన శాస్త్రజ్ఞులు, యాత్రికులు, ప్రాచీన చరిత్ర పండితులేగాక, వేర్వేరు కాలాలలోని న్యాయశాస్త్రాల్ని పోల్చి అధ్యయనం చేస్తున్నవారుకూడా రంగంలోకి దిగారు. అనేక క్రొత్త సంగతులను, ఆలోచనలనూ మనముందు పెట్టారు. దీని ఫలితంగా కొన్ని విషయాలలో మోర్గన్ ఆలోచనలు తప్పని తేలింది. కానీ ఆ క్రొత్త విషయాలేవీ ఆయన చెప్పిన ప్రధానాంశాలను త్రోసివేయలేదు. ప్రాచీనకాలపు చరిత్రకు ఆయన అమర్చిన పద్ధతే మొత్తంమ్మీద ఈనాటికీ చెల్లుబాటవుతుంది. (నాల్గవ ముద్రణకు ఉపోద్ఘాతంలో).
మిత్రులారా! విషయం చూశారుగా! నిదానంగా అర్థంచేసుకోండి. ఇది మామూలు పాఠకులకూ, మషాలా కావలసిన వాళ్ళకూ విసుగనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా సిద్ధాంత స్వరూప స్వభావాలు అర్థం చేసుకోవాలనుకుంటేనూ, దాని బలాబలాలు పరీక్షించి తేల్చుకోవాలనుకుంటేనూ పై రచనలోని ప్రత్యంశమూ విలువైందీ, కీలకమైందీ కూడా. ఎందుకంటే ఈ కోణంలోనుండి అందిన సమాచారంపైనాధారపడే వారి చారిత్రక భౌతికవాద స్వరూపమంతా రూపొందించబడింది. దానిని శాస్త్రీయ విశ్లేషణకు లోను చేయడానికి ముందు దానిని గురించి సమగ్రమైన అవగాహన తప్పనిసరి. సిద్ధాంతపు లోతులు తెలుసుకుందా మనుకున్న వాళ్ళవరకైనా ఆషామాషీగా కాకుండా నిబద్ధతతో ఈ విషయాలను అధ్యయనం చేయండి.
No comments:
Post a Comment