ముఖ్య గమనిక : ఈనాడు 146లో నేను మతస్తుల్ని దృష్టిలో పెట్టుకుని వెల్లడించిన అభిప్రాయాలకు, ఆనాడు ఆ ప్రత్యేక సందర్భంలో నేను చేసిన ప్రంగంలోని అభిప్రాయాలకు మధ్య వైరుధ్యం లేదు. సందర్భోచితమైన అర్థం చెప్పుకోవలసి వుందంతే. అక్కడ నా ప్రసంగంలోని ఒక ముక్కను విడగొట్టి ఉట్టంకించడం తెలిసిచేస్తే అది మీరు చేసిన తప్పు, లేకుంటే పొరపాటు. అర్థనిర్ణయం చేయాల్సిన సందర్భంలో విజ్ఞులు తెలిసిచేయకూడని తప్పది. 'సెలెక్టివ్ సైటింగ్ ఈజ్ ఎ ఫ్యాంసీ' అనంటారు తార్కికంగా దానిని. ఉద్దేశ్యపూర్వకంగాపూర్వాపర సంగతిని విడిచిన ఉట్టంకింపు లనంటారు వాటిని. వక్త ఉద్దేశించని అర్థాన్ని గుంజాలనుకోవడం వేరు అర్థాన్ని, దాని నెత్తిన బెట్టడం 'చలం' అనబడుతుంది. సత్యాన్వేషణుల దృష్టినుండి చెప్పాల్సివస్తే చలం చేయడం దుర్మార్గం అవుతుంది. తప్పనిసరైతే ఆనాటి నా మాటల వెనుకనున్న నా అభిప్రాయం ఏమిటన్నది మనం నేరుగా కలసినపుడుగానీ,ప్రయోజనకరమనుకుంటే పత్రికాముఖంగనే మరోసారిగానీ వివరిస్తాను. ఈ మాటా మీ తృప్తికొరకే చెపుతున్నాను.
ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా వుండాలనే భాషా నియమాల క్రింద విన్న మాటకు అర్థాన్ని అన్న వాడినుండే స్వీకరించాలని చెప్పుకున్నాము. అలాగే వక్త ఉద్దేశం ఇదీ అని నిర్ధారించడానికి వక్తకు తప్ప అన్యులకు అధికారం లేదు. ఈ అర్థం వస్తోంది. ఇదేనా మీరు చెప్పదలచుకున్నది అని అడిగి వక్త భావం ఫలానా అని స్థిరపరచుకోవాలి. ఆషామాషీ వ్యవహారాల్లోనైతే ఈ నియమాలకంత ప్రాధాన్యతనీయక్కరలేదుగానీ, కీలకమైన భావాల విషయంలోనూ ఆయా అభిప్రాయాల సబబు బేసబుబుల్ని విచారించే సందర్భాలలోనూ ఈ నియమాల్ని తప్పనిసరిగా పాటించాల్సింది. ఉదాహరణకు, ఆనాటి నా మాటల్లో, మత, దైవ భావనలు, ఆచారకాండ ఒక కోణంలో మంచినీ, మరో కోణంలో ఎంతో చెడునూ కలిగించాయి, కలిగిస్తున్నాయి'' అన్నదీ వుంది. దానికిలోబడే ఆస్థిక తత్వం అందించిన జీవన ప్రణాళికను అర్థంచేసుకోవాలి. అలాగే సత్యాన్వేషిగా ఆ మాటలన్నప్పుడు వచ్చే భావానికీ, క్రైస్తవుడిగానో, ముస్లింగానో, మరో మతస్తునిగానో ఉన్నవారు ఆ మాటలన్నపుడు వచ్చే భావానికీ చాలా తేడా వుంది. కనుక వారువారు ఆ మాటలు మాట్లాడినపుడు ఆ మాట క్రింద వారు వారు ఇచ్చే చిత్రం ఏమిటో చూసుకునే ఆ మాటకు నిలకడ వుందో లేదో నిర్ణయించుకోవాలి. ఆయా వక్తల యుక్తాయుక్తతలను విచారించే సందర్భంలో ఇదెంతో కీలకమైన విషయమవుతోంది. విషయం అర్థమవుతూనే వుందనుకుంటాను.
ఇక్కడికిది అర్థమైందనుకుంటే, 94 నాటి నా మాటలను యథాతథంగా మీరంగీకరించినా, ఆ మాటల వెనకనున్న వివరాలు మీకుమీరుగా, నాకు నేనుగా ఎవరి లోపల వున్నది వారం బైటపెట్టి, ఆ రెండూ ఒకటో, వేరో చూసుకోవాలి. సారూప్యత, వైరూప్యత ఎక్కడెక్కడుందోనూ చూసుకోవాల్సిందే. అటుపైన ఎవరెవరి వివరాలు పై ప్రతిపాదనకు ఎంతెంత అనుకూలంగా వున్నాయోనూ పట్టిచూడాల్సిందే. అప్పుడుగాని విషయం ఒక కొలిక్కిరాదు. కాబట్టి మీరంగీకరించిన ఆ నా మాటలు మీరే జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తావించారో దానిని బైటపెట్టి పరీక్షకివ్వడం నిజాయితీతో కూడిన బాధ్యత అయి వుంది.
మీ మొదటి లేఖలోని 1వ అంశం సరైందేనని అంగీకరిస్తే మీరెండో అంశం యధాతథంగా అంగీకరించరాదు. దానికేమంటారు అని అడిగాను. దానిపై మీ సమాధానం ఏమిటో వ్రాయండి.
అదేమాట మీరూ నన్నడిగితే ఆనాటి నా మాటల్ని ముందూ వెనకా కలిపి చదువుకోండి. మీ 1వ అంశానికి, నాటి నా ప్రకటనకు మధ్య వైరుధ్యం ఏమీ లేదన్నది గమనించండి. అక్కడే ఆస్తిక ఆచార కాండలోనూ మంచి చెడు కలగలసివున్నాయి అన్న నా వాక్యాలు దాన్ని మినహాయించిన భాగాన్నే మంచిదిగా స్వీకరించాలని చెప్పకనే చెపుతున్నాయి. కనుక పాతలోని మంచి భాగాన్ని తీసుకుంటూ అవసరమైన కొత్తదాన్ని చేర్చుకుంటూ సాగుతుండడమే సరైందన్న భావానికి విరుష్టత లేకుండాపోయింది.
కనుక ఇప్పటికైనా ఇతరేతరాంశాలనావలబెట్టి, నేనడిగిన వాటినిగూర్చి మీరేమనుకుంటున్నది సూటిగా వ్రాయండి.
సమయోచిత ప్రశంస : ప్రశంసార్హమైన స్వేచ్ఛాలోచన పత్రిక
మిత్రులూ, యోచనాశీలురు, తానెంచుకున్న మార్గంలో నిబద్ధులు మానవ వికాసవేదిక స్థాపకులు, ప్రధాన కార్యదర్శి అయిన బి. సాంబశివరావుగారిని స్వేచ్ఛాలోచన పత్రిక విషయంలో వారు తీసుకుంటున్న శ్రద్ధను, యోగ్యమైన సమాచారాన్ని సేకరించి సమాజానికందించడానికై వెచ్చిస్తున్న శ్రమను గమనించాక వారిని అభినందించకుండా వుండలేకపోతున్నాను. మిత్రమా! స్వేచ్ఛాలోచన పత్రికశైలి, సంవిధానము, ఇతివృత్తము లన్నవి పరస్పర పూరకాలుగా వుండి పాఠకునికి అవగాహన పెంచుకోడానికి ఉపయుక్తంగా వుంటోంది. దానినలా తీర్చిదిద్దుటలో పాటుపడుతున్న మీకూ, సహాయకులకు కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలుపుతున్నాను. నాలుగు కాలాలపాటు పత్రిక ప్రజోపయోగకరంగా మనుగడ సాగించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ ముఖంగానే వివేకపథం పాఠకులకూ ఒక హితసూచన చేస్తున్నాను. స్వేచ్ఛాలోచన పత్రిక చందాదారులుగా చేరండి. దానిని తెప్పించుకోడానికీ, చదవడానికీ మీరు వెచ్చించిన వ్యయప్రయాసలకు నష్టంరాదని హామీ యిస్తున్నాను. మీలో తగినంత స్తోమత, అధ్యయనం చేయాలన్న దుగ్ధ వున్నవాళ్ళు ఉద్యమ క్షేత్రాలలోని ఇతర పత్రికలకూ చందాదారులుగ చేరండి. అది ఆ పత్రిక నిర్వాహకులకు ఆర్థిక, నైతిక మద్దతును ఇవ్వగలుగుతుంది.
భాష, భావాల గాంభీర్యతతో యోగ్యమైన రీతిలో విలువైన సమాచారం జనానికి పత్రికను అందిస్తున్నందుకు మిత్రులు సాంబశివరావుగారికి, వారి సహాయకులకు మరోమారు ఉద్యమాభినందనలు తెలుపుతున్నాను.
స్పం.-2 : యోచనాపరులైన మిత్రులకో విజ్ఞప్తి. అంటూ ఉద్యమ మిత్రులు కె.ఎల్.కాంతారావుగారిలా వ్రాస్తున్నారు. అనేక సర్వేల ప్రకారం, వాస్తువాదులుగానీ, జ్యోతిష సిద్ధాంతులుగాని చెప్పే విషయంలో నూటికి 6% మాత్రమే నిజమవుతున్నాయి. 94% అబద్ధాలవుతున్నాయి. కాని, దురదృష్టవశాత్తు, ఆ 6% కథల్ని సేకరించి ఒక పుస్తకంగా ప్రచురిస్తే, సత్యాన్వేషణాపరులకు, సామాన్య ప్రజలకు, ఈ వాస్తు దొంగలపై పోరాడే ఉద్యమకారులకు ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాటిని సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించాలని నిర్ణయించాము.
కనుక, మీవద్ద అలాంటి వివరాలు వుంటే, వీలయినంత వివరంగా (ఉటే ఫొటోలతోసహా) వ్రాసి ఈ క్రింది చిరునామాకు పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నా అడ్రస్ : కె.ఎల్.కాంతారావు, ప్లాట్ నెం. 103, చైతన్య రెసిడెన్సీ, పటేల్‌కుంట పార్కు ఎదురుగా, శుభోదయ కాలనీ, కుక్కట్‌పల్లి, హైదరాబాద్-500 072. నా సెల్ నెం. : 99594 41438.
'మండలి ప్రశ్నలు-అభిప్రాయాలు సి.టి.ఎఫ్. జవాబు' అనే పేరన ఆకాశరామన్న ఉత్తరం వ్రాసిన ప్రకాష్‌గారికి, ఆయ్యా, సత్యాన్వేషిని 'ని'కారత్రయం అంటే నిజాయితీ, నిబద్ధత, నిర్భీతి అన్నవి వుండితీరాలని అవిలేని వాడు సత్యాన్వేషణ చేయడం దుస్సాధ్యం అని గతసంచికలోనే వ్రాశాను. అవి మీలో తగినంతగా లేవేమోనన్న సందేహం కలుగుతోంది! మాది అనవసరపు అనుమానమేనంది ఆచరణ ద్వారా మీరే నిర్ధారించాల్సి వుంటుంది అనీ అక్కడే వ్రాశాను. ఈ థలోనూ నేను మీ గురించి ఒక స్థిర నిర్ణయానికి రాకపోవడంవల్లే అలా వ్రాశాను.
నేను ఆశ్చర్యపడేంత స్పష్టంగా, నీవు సందేహించడమెందుకయ్యా సురేంద్రా! నిస్సందేహంగా నాకా మూడూ లేవు అని ఆచరణ ద్వారా నిర్ధారించారు మీరు. జెర్రికున్నంత ధైర్యాన్నీ, ఆషాఢభూతికున్నంత నిజాయితీని ఎవరేమనుకుంటే మనకేమిలే నోటిమాటగా దానికింత పట్టెందుకు అన్న వైఖరితో కూడిన నిబద్ధతను కలిగి వున్నారు. మీరన్నది 29 సాయంత్రం ప్రసాదుతో మీరు మాటాడినాకగాని నిర్ధారణకాలా. నాకు ఎన్ని ధర్మపన్నాలు పలికారు! ఎంతగా ప్రగల్భించారు! జబ్బలు చరిచారు! అంతలోనే మూతి ఊడిన బెలూన్‌లా తుస్సుమనిపించారెందుకని? జారిపోయేటప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం! అబ్బో అలాంటి పోకడ మీలాటి వారికే చెల్లుతుంది మరి.
ఒక మాట చెప్పనా! వ్యక్తిలోని మానసిక వంకరతనం, వాని మనస్సు రోగగ్రస్థమైందనడానికి గట్టి రుజువు. 'సి.టి.ఎఫ్. సభ్యుల జవాబు' అని శీర్షిక పెట్టడంలోనే మీలోని కుటిల వ్యూహం లీలగా కనపడిందినాకు. ఈ నెలలో 10, 15 రోజులుగా మీ నుండి రావాల్సిన వివరాలకై మేముచేసిన యత్నము, వత్తిడీ, మీరు కనబరచిన వైఖరి అన్నిటినీ కలిపి పరిశీలించి చూసుకుంటే మీరన్న సి.టి.యఫ్. గురించి రెండు మూడు ఆలోచనలు కలుగుతున్నాయి నాలో.
1) సి.టి.ఎఫ్. సభ్యులంటే... పంచపాండవులంటే మంచంకోళ్ళలా ముచ్చటగా... అన్న సామెతలాగా అంతా హుళ్ళక్కిగానీ కాదుగదా?
2) అలాకాక అందులో ఎంతోకొంతమంది వున్నారనుకున్నా, ఈ లేఖరాసినాయన (ప్రకాష్) వారందరికీ ఈ విషయం తెలియపరచకుండానే చర్చించకుండానే వారందరి ఆమోదం పొందకుండానే, తనమీద దెబ్బ పడకుండడం కోసం అందరం కలసి వ్రాసిన జాబుని, పన్నుగడగా పన్నారా?
3) అదీకాకుంటే, అట్టిసంస్థ ఒక్కటి ఉందనుకుంటే, అందులో వాళ్ళందరూ కలిసే ఈ ఆకాశరామన్న లేఖ వ్రాశారనుకుంటే, అబ్బో! అయితే ఆ సభ్యులందరూ ఇంతటి అడ్డగోలురకమేనన్నమాట?
నిజానికి, సహజంగా నిత్యము జరిగే వ్యవహారసరళి ఎలా వుంటుంది? లెటర్‌హెడ్ మీద లేఖ వ్రాసినా, మరొకరి తరఫున లేఖ వ్రాసినా క్రింద వ్రాసిన వారిపేరు - సంతకం - ఉండి తీరుతుంది. ఒక సంస్థ పేరున వ్రాసినా ఆ సంస్థలో రాసినవాడు ఏ బాధ్యతతో ఉన్నాడో దానినీ పేర్కొని సంతకం పెట్టడం రివాజు.
రీతిగానీ, రివాజుగానీ లేనివాళ్ళే సంతకం పెట్టకుండా, వివరాలివ్వకుండా దాపరికపు పోకడలు పోతారు. మీవైపునుండి ఇంత జరిగినా మేమెంత చెడుగా తలంచక, ఆ వివరాలు తెలపండంటూ పలుమార్లు మీకు కబురు చేశాము. ఒకసారి మెయిల్ ద్వారా పంపామన్నారు. మరోసారి లేఖ వేశామన్నారు. ఆ రెండూ జరగలేదు. చివరిసారి 29న నా సమక్షంలోనే ప్రసాద ఫోన్‌చేసి అడిగితే అడ్డదిడ్డంగా అరగంట అదీ ఏవగింపు కలిగేలా పొంతన లేకుండా మాట్లాడారు మీరే. నిజంగా అవన్నీ రికార్డుచేసి ఇరువురికీ చెందని నలుగురి ముందు పెడితే ఆ నలుగురే మీకు పెట్టాల్సిందింత పెట్టేవారు. అనవసరమైన యాగీ 6, 7 పేజీలకు వ్రాసి మొత్తం ప్రకటించు, స్థలం చాలదనుకుంటే నెలకింతని ప్రచురించమని తెగబడిన మీరు చివర్న సంతకం చేయకపోగా, ఇది మా ఉమ్మడి అని, వారిపేర్లు ఇవ్వకపోగా ఎన్ని కుటిల పోకడలు పోయినారోకదా! అభిప్రాయం తెచ్చినవారి పేరు ప్రకటించ లేనితనాన్నేమనుకోవాలి!
డా|| ఆనంద్ : ఇతడు ఆ మీ సి.టి.ఎఫ్.లో సభ్యుడో కాదో మాకు తెలీదు. అతనికి ఫోన్‌చేసి పత్రికలో వ్రాసిన విషయాన్నే అతనికీ చెప్పి సి.టి.ఎఫ్. సభ్యుల పేర్లు, వివరాలు పంపించమన్నాం. అప్పటికి అలాగేనని మాకు చెప్పి గమ్మునున్నారు.
ఒకసారా! రెండుసార్లా!! ఎన్నిసార్లడగాలి? మొదటినుండీ ఈ వేదికలో క్రైస్తవుల పాత్రపోషణ వెనుక కీలకపాత్ర పోషిస్తున్న అతనికైనా గింత బాధ్యత వుండొద్దా? పైగా అతడు మాకు తెలిసినవాడు, మా గురించి తెలిసినవాడు. సక్రమంగా తనవంతు బాధ్యతను నిర్వహించాల్సిందిపోయి, మీ సంఘ సభ్యుడు శీలం నాగార్జునకు ఫోన్‌చేసి మీ వివేకపథం పాఠకుల జాబితా మొత్తం మాకు పంపండి! అనడిగాడట. మా నాగార్జున నాకు ఫోన్‌చేసి చెప్పాడు. అవసరమేమిటో కనుక్కోండి! సరైన కారణం చెపితే పంపించండి. లేకుంటే నన్నో ప్రసాదునో అడగమనండి. స్వతంత్రించి లిస్టు పంపడం నా పరిధిలో లేదని చెప్పండి. అని నాగార్జునకు నేను చెప్పాను.
డా|| ఇన్నయ్య : నేను ఒకప్పుడు సి.టి.ఎఫ్. సభ్యుణ్ణి. ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను అంబేద్కరిస్టును. అయినా వారు నాకు మిత్రులే. ఆ ప్రశ్నలలో రెండు నావీ వున్నాయి అని ప్రసాద్‌తో అన్నాడట. అంటే సి.టి.ఎఫ్. సబ్యులు కానివారి ప్రశ్నలూ అందులో వున్నాయన్నమాట. అదిసరే ఆ ఇన్నయ్యగారు రెండే నా ప్రశ్నలు అనన్నారు. అలా అయితే మిగిలినవాటికి ఆయన బాధ్యుడా? కాదా? ఇలానూ జరిగే అవకాశం వుందని ఊహించే సభ్యుల్లో కొందరు అన్నీ అంగీకరించకుంటే ఎవరెవరు వేటివేటిని అంగీకరించాలో ఆ వివరాలూ తెలపండి. అంతవరకే వారు బాధ్యులవుతారు అనీ వ్రాశారు 146వ సంచిక ప్రతిస్పందనలో.
ఆరోజు సత్యోదయంలో పరిణామవాదానికి ప్రతికూలంగా మాట్లాడడానికి క్రైస్తవ పక్షం నుండి నిర్ణయింపబడ్డ సుధాకర్‌గారు, తన పాత్రోచితిని మరచి భార్గవగారు రానందుకు తెగ నిందాత్మకంగా మాట్లాడారు. నేనైతే ఇలా జరిగితే పీక కోసుకునే వాణ్ణన్నట్లూ ధ్వనించారు. అస్సలు విషయం అప్పటికి మాకు తెలియకపోవడంవల్లా; అయ్యో! ఇంత ప్రయత్నం చేశారే, వీరి శ్రమంతా దండగై పోయిందే అన్న ఆలోచనతోనూ రానివాళ్ళపై కోపాన్నే పెట్టుకుని ఉన్నాను నేను. ఆ ఆవేశం నుండే ఇటు విజయంగారు, అటు భార్గవ్‌గారు రాకపోడానికి కారణాలేమిటన్నది విచారించాను. గొప్ప విడ్డూరమూ, అంతకంటే మరింత ఎడ్డెతనమూ ఏమిటంటే భార్గవగారితో ఈ సి.టి.ఎఫ్. నిర్వాహకులు ఎవరూ మాట్లాడడంగానీ, ముందుగా వారి అనుమతి తీసుకోవడంగానీ చేయలా! అప్పటికి తానేదో పత్తిత్తన్నట్లు సభలో వెనుకముందు ఆలోచించకుండా సుధాకర్‌గారు భార్గవ గారిని ఎంతగా తెగనాడారు? నిజంగా ఆయనలో సభ్యత సంస్కారముండుంటే అటు తరువాతైనా వారో సభపెట్టి తానలా తొందరపడినందుకు సిగ్గుపడుతున్నానని సభాముఖంగా క్షమాపణ కోరుతున్నానని ప్రకటించి వుండాల్సింది. తిట్టడం, తిట్టించుకోడం అన్న రెంటి విషయంలోనూ పట్టింపులు లేవేమోమరి!
ఇంత, ఇంకొంత కచ్చాట తమవైపు పెట్టుకుని 'సహసత్యాన్వేషులం' అని తమకు తామే కితాబిచ్చుకోవడం మామూలు వాళ్ళకూ, మాలాటివాళ్ళకూ సాధ్యమయ్యేపనికాదు.
చివరిమాట! ప్రకాష్‌గారికి! అయ్యా ఇప్పటికీ మేము మిమ్మల్ని ప్రత్యర్థులుగా రూఢిపరచుకోలా! మరో ప్రయత్నంగా మితృత్వం నిలబడుతుందేమో, అలా అయితేనే బాగుండు, అనుకుంటూనే, మీరూ మైత్రినే కోరుతున్నట్లయితే, నా ఈ నిష్కర్ష రూపంలోని చేదు నిజాన్ని కష్టమైనా మ్రింగి మీలోని వక్రతను విడచి సక్రమంగా విషయ విచారణలోకి రండని పిలుస్తున్నాను. నా ఈ పిలుపులోని యదార్థత మీకూ కనపడినట్లయితే.
1) మీ సభ్యుల వివరాల జాబితా వెంటనే పంపండిప్పటికైనా.
2) బైబిల్ సృష్టివాదాన్ని ప్రతిపాదించి పరీక్షకివ్వడానికీ, బైబిల్ ఆమూలాగ్ర విచారణ చేయడానికీ సిద్ధపడండి.
గమనిక : ఈ రెంటికీ మీరు సిద్ధపడితే సరే! సిద్ధపడకుంటే మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు రికార్డు రూపంలో మా దగ్గర ఏమేరకున్నాయో వాటినన్నింటినీ ఒకటొక్కటిగా ప్రచురించి, విమర్శించి పాఠకుల ముందుంచుతాను. ఆ థలో మీకు మా సంచికలో తావుండదు. ఒకవేళ పై రెండు ప్రశ్నలకు ఉచితంగా సమాధానం వ్రాతమూలకంగా మాకందితే, దానికనుగుణ్యంగా ఆచరణకూ మీరు సిద్ధపడితే అప్పుడు పత్రికలో కొంత చోటుకు మీకు మళ్ళా హక్కు ఏర్పడుతుంది. అప్పుడైనా హక్కునంటిపెట్టుకుని వుండే విధులు బాధ్యతలన్న వాటికి లోబడే సుమండీ!
డా|| ఆనంద్‌కు, ఆనంద్ చాలాకాలం మండలితో సన్నిహితంగా వున్నావు. అంతో ఇంతో మండలి గురించిన అవగాహనా వుందినీకు. నాకు తెలిసి నీ జీవితంలో రకరకాల మార్పులు చేసుకుంటూ ఈ స్థితికి చేరావు. ఇప్పటికైనా నీవేమిటో, ఒకసారి ఒంటరిగ కూచుని ఆత్మవిమర్శ చేసుకుని ఒక నిర్ణయానికి రా. తేలని విషయాలను తలనెత్తుకున్నా తేలిన విషయాలను మరుగు పెట్టాలనుకున్నా అట్టి జీవితాలు పెద్దగా సాధించుకునేదేముండదు, అయితే గియితే మరికొంతమందిని అయోమయంలోకి నెట్టడంతప్ప. ఆలోచించుకో. నిజంగనే వాస్తవాలను ఎరగాలనుకుంటే వాస్తవిక దృష్టితో సత్యాన్వేషణకు సిద్ధంకా. ఏమనికీ వున్న చిన్న జీవితంకొరకు ఇంతగా బలహీనపడక్కర్లా. నీవు బలహీనపడ్డావనే అనిపిస్తోంది. నా అంచనాను నిజంగా తప్పితే ని యిష్టం. ఉంటాను. సెలవ్, సత్యాన్వేషణలో మీ సురేంద్ర.
No comments:
Post a Comment