Thursday, January 1, 2009

మానవ వినాశనానికి దారులుతీస్తున్న మతమార్పిడులు



1) రగులుతున్న రావణకాష్ఠం :
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! మతాల సాంప్రదాయపు వరవడినపడి ఆయా మతస్తులుగ పరిగణింపబడుతున్న హేతుబుద్ధి కలిగి, మానవ విలువలకు పెద్దపీట వేయగల మనసున్న మనుషులారా!
అతి మతాభిమానం, పరమత సహనాన్ని ఛిద్రం చేసివేస్తుంది. ఏదోరూపంలో అసహనాన్ని పుట్టించి, పెంచి పోషిస్తూనూ వుంటుంది. ఏ మనిషీ తానున్న ఒక మతానికి పెద్దపీట వేయకుండా ఇతర మతస్తుల్ని వారి మతాన్ని విడచి తన మతంలోకి రమ్మని అనడు, అనలేడు. అదే సమయంలో ఇతర మతాలలో దోషాలు, లోపాలు వున్నాయని చెప్పక మానడు. కల్లబొల్లి కబుర్లు ఎన్ని చెప్పినా, బటికి ఇచ్చకోటి మాటలు ఎన్ని వల్లించినా, ప్రతి మతస్తునిలోనూ అంతర్గతంగా ఈ భావనే పనిచేస్తుంటుంది. ఆయా మతగ్రంథాలలోనే దీనికి ఆధారాలు దొరుకుతాయి. మచ్చుకు కొన్ని ప్రకటనలు చూడండి.

1) కణ్వంతు విశ్వమర్యం, నాస్తికో వేదనిందకః, యోþన్యాం దేవతా ముపాస్తే సపశురేవదేవనామ్‌. గుణహీనమైనా స్వధర్మాన్నే ఆశ్రయించు, పరధర్మాన్ని ఆశ్రయించకు. శివుడే పరమాత్మ, విష్ణువే పరమాత్మ.
2) నన్ను తప్ప ఇతరుల్ని ఆరాధించకూడదు. విగ్రహారాధన చేయకూడదు.
3) ప్రభువును (ఏసును) అంగీకరించనివాడు అవిశ్వాసి, నరకప్రాయుడు.
4) మహమ్మద్‌ ద్వారా అందిన సందేశాన్ని విశ్వసించనివాడు అవిశ్వాసి, అతనికి నరకమే.
5) దేవుడైన అల్లాకు సాటినిగాని, కుమారునిగానీ కల్పించినవారు అవిశ్వాసులు.
- కనుకనే ప్రతి మతపోకడలోనూ పరమత ఖండన స్వమతస్థాపన అన్నది అనివార్యంగా చోటుచేసుకునే వుంటుంది. బైబిల్‌, ఖురాన్‌లలోనైతే ఈ పోకడ మరింత మరింత తీవ్రరూపంలో వుంటుంది. ఆ రెండు గ్రంథాలలోని దేవుడు తననే విశ్వసించాలి, ప్రార్థించాలి, అనుసరించాలి అని పలుమార్లు ప్రకటిస్తాడు. విననివాళ్ళను ఈ లోకపు ఇక్కట్లు, పరలోకపు నరకయాతనల గురించి హెచ్చరిస్తాడు. అక్కడకూ వినకుంటే కౄరంగా దండిస్తాడు. కడకు నాశనం చేసేస్తాడు. తానెంచుకున్న మనుషులకూ అదే పురమాయించి, ఆ పనులే చేయిస్తాడు.
- దానితోపాటు ఆ మూలగ్రంథాలనుండే, అప్పటికున్న జనం ఆ దేవుడెంచుకున్న ప్రవక్తల్ని వ్యతిరేకించడం అవకాశం దొరికితే చంపేయడం చేసినట్లు సమాచారం దొరుకుతుంది. అబ్రామును ఆనాటి జనమంతా విశ్వసించలా, మోషేను విశ్వసించలా, క్రీస్తును విశ్వసించలా, మహమ్మదును విశ్వసించలా. ఇదంతా ఆ గ్రంథాలు (బైబిలు, ఖురాన్‌లు) అందిస్తున్న సమాచారమే. అటు తరువాత ఆ రెండు మతాలను నెత్తికెత్తుకుని వాటిని మందినెత్తికీ ఎత్తాలనుకుంటున్న ఆ మత ప్రచారకులలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. మార్టిన్‌ లూథర్‌ ఆనాటి రోమన్‌ కేథలిక్కుల్ని తృణీకరించాడు. వ్యతిరేకించి ప్రతిఘటించాడు. వారూ వీరిని నానా యాతనల పాల్జేశారు.
క్రైస్తవుల్ని క్రైస్తవులు, ముస్లింలను క్రైస్తవులూ, ముస్లింలను ముస్లింలూ, క్రైస్తవుల్ని ముస్లింలూ నాటి నుండి నేటివరకూ వ్యతిరేకించుకుంటూనే వస్తున్నారు. దీనిలోని ఒక భాగాన్ని మీలో చాలామందికి అంగీకరించబుద్ధిపుట్టదు, సరికదా అబద్ధపు ప్రచారంగానూ, దుష్టమైన ఆరోపణగానూ అనిపిస్తుంది. అందుకు, కారణం ఆయా మత గ్రంథాలను, ఆ మతానుయాయుల చరిత్రను వారు సాకల్యంగా పరిశీలించకపోవడమే. పై నా ప్రకటన సరైందేననడానికి ఒకటి రెండు ఉదాహరణలు (ఆధారాలు) చూపిస్తాను. మీరూ పరిశీలించండి.
ఖురాన్‌లో ఈ ముస్లింలంతా స్వర్గానికి పోతారా? అని ప్రశ్నవేసి, వెళ్ళరు అని సమాధానం చెపుతుంది ఆ గ్రంథమే. వెళ్ళే-వెళ్ళని వాళ్ళ నిష్పత్తి ఎంతో తెలుసా! '1 : 99'. అదన్నమాట సంగతి. ఎవరికి వారు సర్టిఫై చేసుకుంటే లాభంలేదు.
ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశింపడు; వేషధారులు దొంగ ప్రార్థనలు చేస్తుంటారు. ఆ రకం ఈనాడూ కనపడుతూనే వుంది. దండిగానే వుందా దండు. స్వస్థత ప్రార్థనలు, మత ప్రచారాలు గొంతులు చించుకుంటూ చేసేవారూ, బ్రతుకుతెరువు కోసం పొట్టకూటి వృత్తిగా ప్రచారకులైనవారూ వగైరాలంతా ఈ 1 : 99 లో 99 గ్రూపులోనివారే. క్రైస్తవులంతా, ముస్లింలంతా స్వర్గానికి చేరరన్నమాట గ్రంథాన్ని నిశితంగా పరిశీలించని వారికి తెలియకపోవడం విడ్డూరం కాదు. కానీ ఈ సంతలోనే మరో గుంపూ చొరబడి వున్నారు. వీరికి ఈ మాటలు గ్రంథంలో వున్నాయని తెలుసు. అయినా వీరు వాటిని మాటున పెట్టి ఈ పక్షంలో నాయకులుగ, ప్రచారకులుగ ప్రసిద్ధినందుతుంటారు.
నేడూ, అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారూ ఈ యుగానికి ఏసు ఎన్నుకున్న ప్రవక్తను తానేనని ప్రకటించుకున్నారు. మరోవంక ఆయనే నడుస్తున్న మినిస్ట్రీలలో కొన్ని (20 పైగా) దొంగ క్రైస్తవులతో కూడుకుని ఉన్నవనీ ప్రకటించారు. ఇంకోకాయన పి.డి.సుందర్రావుగారు, తానే బైబిలు సరిగా అర్థం చేసుకున్నవాడినంటూ రాతలద్వారా ప్రసంగాలద్వారా సింహగర్జనంటూ ఊదరగొట్టేస్తున్నాడు. వీరిద్దరూ ఎదురుపడో, అనుకుని కలిసి కూర్చుని ఇద్దరు ఎవరు ఏసు ఎంచుకున్న మనిషో తేల్చుకుని, రెండోవారు అతనివెంట నడుస్తూ ఇరువురూ కలసి ఉద్యమించవచ్చుకదా! నిజానికీ సూచన ఉనికిలో వున్న అన్న క్రైస్తవ మతాలకూ వర్తిస్తుంది. కాని ఎవరూ దీనిని పట్టించుకోరు, పట్టుకోరు.
ఎందుకని? ఎవడికి వాడికి, తన బ్రతుకు, తన గుర్తింపుకు, తన పెద్దరికానికీ పెద్దపీట వేసుకోవాలనే వుంది. ఆ కోర్కెకు అనుకూలంగానే వున్నంతవరకే ఎవరితోనైనా స్నేహం. దాదాపు అందరికీ ఏసు రెండో ప్రాధాన్యత కలవాడే, అందులోనూ కొందరికైతే తమ పబ్బం గడుపుకోడానికి ఉపకరణం మాత్రమే. ప్రతివాడు తనతో, తన అవగాహనతో పోల్చుకుంటే ఇతర మతస్తులేకాదు, క్రైస్తవులుకూడా తనకంటే తక్కువస్థాయిలోనే వున్నాడు అనే అనుకుంటుంటాడు.
ముఖ్య గమనిక : నా ఈ పోలిక ఒక్క క్రైస్తవానికి మాత్రమే వర్తించేదికాదు. ఇస్లాంకూ వర్తిస్తుంది. ఇంకా సరిగా చెప్పాలంటే ప్రతి మత ధోరణికి చెందిన సంస్థకూ, ప్రచారకునికీ వర్తిస్తుంది.
ఏ విషయంలోగానీ అతిపోకడ కోరదగిందే. అలాంటిది, కలసి, పరస్పరం సహకరించుకుంటూ సాగాల్సిన సమాజంలో ఈ రకమైన అతిపోకడలు సమాజకాయానికి క్యాన్సర్‌ లాంటివి. ఏ సమాజమైనా ఇటువంటి వాటిపట్ల ఉదాసీనంగానో, తటస్థంగానో వున్నట్లయితే అది తన ప్రాణంమీదికి తానే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు. ప్రస్తుతం మన సమాజం, మన పాలకుల పుణ్యమా అని ఆ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది.
ఒక చారిత్రక వాస్తవం చెప్పుకోవాలి. క్రైస్తవం, ఇస్లాం ఇక్కడికి రాకపూర్వమే ఈ దేశంలో రకరకాల తాత్విక, మత ధోరణులు ప్రబలివున్నా, పైన చెప్పుకున్నట్లు ఏ మతం మరో మతాన్ని తనతో సమానంగా చూస్తూ వుండనీలెమ్మని అనుకోకున్నా, ఇక్కడి మనీషావంతుల అనేక యత్నాల ఫలితంగా ఇవన్నీ దేశీయ మతాలుగా క్రక్రమంగా అంగీకరింపజేయబడ్డాయి. ఆ దృష్టికోణం నుండి చూస్తే క్రైస్తవం, ఇస్లాంలు పరాయివి. ఇది ఎవరూ కాదనడానికి వీల్లేని చారిత్రక సత్యం. కనుకనే ఈ దేశంలోని క్రైస్తవులూ, మహమ్మదీయులు ఇరువురూ తమ మూలాల్ని, ఆరాధ్య స్థానాల్ని వేరెక్కడో వున్నవిగా నిస్సందిగ్ధంగా తలపోస్తుంటారు. కనుకనే ఈ దేశంలో మతమార్పిడిలుంటే సాధారణార్థంలో అందరికీ తట్టేది హిందువులు క్రైస్తవులుగనో, ముస్లింలుగనో మార్పునొందడమే. వైష్ణవుడు శైవుడైనా, వెంకన్న భక్తుడు అయ్యప్ప భక్తుడైనా ఇలా నానా దేవతల నారాధిస్తూ పోయినా ఇటు హిందువులనబడేవాళ్ళుగానీ అటు క్రైస్తవులూ, ముస్లింలుగానీ వారిని మతం మారినవాళ్ళుగా తలంచరు. అంగీకరించరు. కనుకనే ఒకనాడు ఈ దేశంలో దేశీయ మత ఘర్షణలు ఎలా జరిగినా, ఈనాడు మత మార్పిడులన్నా, మత ఘర్షణలన్నా (1) బహుదేవతారాధనల కలగూరగా వున్న హిందువులనబడేవాళ్ళకూ, (2) క్రైస్తవ, మహహ్మదీయ సముదాయాల వాళ్ళకూ మధ్య జరిగేటివే. ఈ నిజానికి ఎవరుగానీ తమ తమ వాదపటిమను చూపి మరో రూపాన్ని చూపదలచుకుంటే అది వాస్తవాలకు మసిబూసి మారేడుకాయ చేయడమే.
మతస్వేచ్ఛ
మతస్వేచ్ఛ ఉండాలా వద్దా అని ఈనాడు విధం తెలిసిన వారిని అడిగామనుకోండి. ప్రజాస్వామ్యం మన ఆదర్శమైతే మతస్వేచ్ఛ వుండడమే మంచిది అనంటారు వాళ్ళు. ఉన్న మూడు మతాల ప్రతినిధుల్ని అడిగామనుకోండి. బైటికి మాత్రం వుండి తీరాల్సిందే అనంటారు క్రైస్తవులూ, ముస్లింలు మాత్రం లోలోన-లేదా వారి వారి దేవుని ఇష్టం ప్రకారం, ఇతరులంతా తమ మతంలోకి వచ్చే స్వేచ్ఛవరకే వుండాలనీ, తమ మతంలోనుండి ఇతర మతాలలోకి వెళ్ళే అవకాశం వుండకూడదనీ అనుకుంటుంటారు. ఇది ఒక నిప్పులాంటి నిజం.
నడుస్తున్న చరిత్రను జాగ్రత్తగా చూస్తే ఆశ్చర్యం కలిగించే ఒక నిజం బైటపడుతుంది. మత మార్పిడులు జరగకూడదు అని ఈ మూడు గుంపుల్లో ఒక్క హిందూ కూటమే గగ్గోలు పెడుతోంది. మిగిలిన రెండూ మతం మార్చే పనిని యుద్ధప్రాతిపదికన చేస్తూ, అదేమంటే మత స్వేచ్ఛను కాదంటున్నారంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? ఆ రెండు మతాలు మతమార్పిడిని రాకడా-పోకడా కల దారిలా తమలోకి రావడానికీ, తమ నుండి పోవడానికీ కూడా సమానంగా ఆమోదం తెలుపుతూ మతమార్పిడి జరగడానికి ఆమోదం తెలుపుతున్నాయా? ముమ్మాటికీ కాదు. ఒకవేళ ఎక్కడైనా తమలోనుండి ఇతర మతంలోకి ఎవరైనా వెళితే చూస్తూ వూరుకుంటున్నాయంటే అది వారి హృదయం అంగీచరించో, వారి మత గ్రంథం అంగీకరించో మాత్రం కాదు. ఏమీ చేయలేని నిస్సహాయతవల్లనో, అక్కడ దానిని అడ్డుకుంటే, తాము నిరంతరం చేయాలనుకుంటున్న మత మార్పిడుల పనిమొత్తానికే ఆటంకం కలుగుతుందనో మాత్రమే గమ్మునుంటున్నాయి. వాటి పోకడ విషయంలో ఇంతకంటే వేరేగా అర్థంచేసుకునే అవకాశంగానీ, చేసుకోవలసిన అవసరంగానీ ఏమీలేదు. ఆ మేరకైనా ఊరుకోడానికి మరోవంక వారి లెక్కలూ దోహదపడుతున్నాయి. ఎలాగంటే :
1) హిందువుల కూటమి దానికదే ఒక అనైక్యతా సూత్రంపై నిలబడి, తమ గుంపునుండే క్రైస్తవులుగా, ముస్లింలుగా మారిన, మారుతున్న, మార్చుతున్న వారిపట్ల ఉదాసీనంగా వుంటోంది. కనుక తమ గుంపు సంఖ్య తగ్గే ప్రమాదం లేదు.
2) ఈమధ్యకాలంలో మనమంతా హిందువులం అంటూ ఒక నినాదాన్ని ముందుకు తెచ్చిన కొన్ని సంస్థలు (ఆర్‌.ఎస్‌.ఎస్‌., విశ్వహిందూపరిషత్‌, దాని అనుబంధ సంస్థలు) మాత్రం పునరాగచ్చేత్‌, స్వస్థానమాగచ్చేత్‌ అంటూ పిలుపిచ్చినా వాటి ఉధృతి పనిరూపంలో అంతగా ఏమీలేదు. కనుక మొత్తంగా చూస్తే మన సంఖ్యే పెరుగుతూ వుంటుంది.
3) మతస్వేచ్ఛ వుండాలని మాటవరసకు అంగీకరించడమే మంచిది. అప్పుడు చేసే యత్నాల తీరువల్ల ఎక్కడైనా ఒకరిద్దరు తిరిగి హిందువులుగ మారినా, మనలోకి మనం హిందువులను తెచ్చుకునే సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది.
4) ఒకవేళ ఇటొచ్చినవాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళినా మనకు పోయేదేమీ లేదు. వచ్చినవాళ్ళలోనేకదా ఒకరిద్దరు తగ్గేది. కడకు ఎంతమంది మిగిలినా అది మనకు మిగులేకదా! వగైరా లెక్కలన్నీ మతమార్పిడుల్ని అడ్డుకోకూడదు అన్న వైఖరిని - కుటిల ఎత్తుగడగా - అవలంబించేటట్లు చేస్తున్నాయి. ఎవరంగీకరించినా అంగీకరించకున్నా అస్సలు వాస్తవాల్లో ఇదీ ఒకటి.
రాజకీయ పార్టీలకూ, నేతలకూ వారివారి రాజకీయ ప్రయోజనాలు నెరవేడమే లక్ష్యం తప్ప, మానవ సంక్షేమంగానీ, అలజడుల్లేని సామాజిక జీవనం అమలవుతుండాలన్న హృదయంగానీ వుండనే వుండదు. ఇక క్రైస్తవ, ముస్లిం మతాధిపతులు వర్తమానంలోనైతే ముఖ్యంగా ముస్లిం సంస్థల నేతలు తమకు వ్యతిరేకంగా తమ అమానుష చర్యల్ని ఖండించినవారిపైగానీ, తమ మత గ్రంథాలలోని కౄరమైన వైఖరులను ఎత్తిచూపిన వారిపైగాని, అట్టివారిని చంపండి, తలతెచ్చి మాకివ్వండి, బహుమతులిస్తాం అని నిస్సిగ్గుగా, నిర్భయంగా ప్రకటించడమేగాక, మతస్తులందరూ పాటించాల్సిందిగా 'పత్వా'లూ జారీచేస్తున్నై.
మా మతం శాంతిస్థాపనకే పుట్టింది, మేము శాంతికాముకులం, పరమతాలయెడ సహనమూ, సహజీవనమూ, సహకారము అన్నది మా మతపు ప్రధాన వైఖరి అంటుంటే ఇస్లాం ప్రతినిధులు, ఒక్కరోజూ మినహాయింపు లేకుండా పైశాచికానందంలో మృత్యుహేలను సృష్టిస్తున్న తమ మతంలోని ఉగ్రవాదుల కౄరచర్యలను ఖండించనే ఖండించరు. ఖండించామన్న రికార్డు (ఆధారాల్ని అవసరానికి చూపడానికై) జన్మకో శివరాత్రన్నట్లు చిన్నా చితకా ప్రకటనలుచేసి రుజువుల క్రింద పెట్టుకుంటున్నా; అవకాశమున్నపుడల్లా ఆ జరిగిన సంఘటనల్ని అభూతకల్పనలు, మీడియా సృష్టి, అంటూ కొట్టేయడానికో, చిన్నదిచేసి చూపడానికో, మభ్యపెట్టడానికో తెగ ఉబలాటపడిపోతుంటారు. నిజంగా వారి మతం ఎటునుండి ఎటుకైనా మత మార్పిడులను, భావ ప్రకటనా స్వేచ్ఛను అంగీకరిస్తుంటే, పత్వాలెందుకు? ఉగ్రవాదుల ఉన్మాద చర్యలెందుకు? అట్టివాటిని ఒక్కపెట్టున ఖండించకుండా, తప్పించుకునే నానిముచ్చు ప్రకటనలెందుకు?
ఈరకం శాంతిసందేశ హరులందరూ ఒక్కటై ఆ ఉన్మాద మందను పట్టిచ్చినవారికిదిగో ఇస్లాం బహుమానంతో, అట్టివారిని కడతేర్చినా ఇస్లాం దానిని జిహాద్‌ క్రిందనే పరిగణిస్తుంది. ఆ పని చేయండనో పత్వా జారీ చేయొచ్చుకదా! దేశం మొత్తం ముస్లిం సమాజమంతా ఒక్కటై ఉగ్రవాదుల్ని, దాని ఉన్మాద చర్యను నిర్ద్వందంగా ఖండిస్తూ ఒకే ఒక్క ప్రకటన చేయమనండి చూద్దాం.
ఒకింత ఆవేశంగా వ్రాస్తున్న ఈ సందర్భంలో నా అంతరంగాన్నీ మీ ముందుంచాలి. ఇలా అంటున్నాను కనుక మత కూటాలలో మానవత్వం ఉన్నవాళ్ళు, శాంతికాముకులూ, నిజాయితీగా ఇట్టి పనులు జరక్కుండా వుంటే బాగుండును అనుకునేవాళ్ళూ అస్సలుండరని కాదు. అట్టివారు కొద్దిమంది ప్రతి మతంలోనూ వుంటారు. అయితే ఆ మేరకు వారు మతం పట్టునుండి బైటపడి జాలి, కరుణ, ఇరుగుపొరుగు సంబంధాలు, మైత్రి వగైరాలకు ప్రాధాన్యతినిచ్చే మానసిక స్థితిలో ఉన్నవారై వుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. చెపుతోంది అర్థమవుతోందా? ప్రతి మతంలోనూ దానిననుసరిస్తున్న వాళ్ళలో కొందరు శాంతస్వభావులు, కొందరు ఆవేశపరులు, మరికొందరు ఉన్మాదులూ వుంటారు. ఇక్కడే మరో నిజాన్ని చెప్పుకోవాలి. ప్రతి మతంలోనూ సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువ మంది మత విషయాలలో శాంతంగా వుంటుంటారు. వారి వైఖరి మరింత ఖచ్చితంగా చెప్పుకోవాలంటే వారు మతం పరమతం అన్న విషయాలలో తీవ్రత లేనివాళ్ళు, ఎవరి బ్రతుకు, పనుల్లో వారు పడిపోతున్నవాళ్ళు. కనుకనే వాళ్ళు ఉదాసీనులై వుంటారు. ఈ రకానిది పట్టించుకోనితనాన్నుండి పుట్టిన నెమ్మదితనం (శాంతం) మాత్రమే. అదేమరి ధీశాలురూ, క్రియాశీలురు అయినవారిలోని శాంతస్వభావం వారిని ఊరికినే కూర్చోనివ్వదు. ఆందోళనకర పరిస్థితుల్లో అట్టివారు తన పర అన్న దృష్టిని విడిచి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తుంటారు. అట్టివారు అప్పటికి తామేమతంతో వుంటున్నా, ఆ ఘర్షణకు కారకులైన ఉన్మాదుల్ని, ఆవేశపరులైన సమూహాలను శాంతింపజేయడానికీ, వారిపాలబడిన, పడనున్న వారిని కాపాడడానికీ యత్నిస్తుంటారు. ఈ రకాన్ని ఫలాని మతంవారు అనడంకన్నా మంచికి, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిచ్చే రకం అనడం సరైందవుతుంది.
ఇప్పటికి ముగింపు
యోచనాశీలులారా! దీనిపై చాలా విస్తృతంగా, లోతుగా చర్చించాల్సి వుంది. సమాజహితంకోరే వివిధ క్షేత్రాలలోని మేధావులంతా పూనుకుని అందుకై పెద్ద శ్రమ చేయాల్సి వుంది. అందుకు మీనుండీ కొందరైనా సిద్ధపడితే జనవరి నాటికి దీనిపై ఒక స్థాయిగల సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రయత్నం చేయగలను. ఆపై ఏం చేయాలన్నది అప్పుడే ఆలోచించుకోవచ్చు. సంసిద్ధతకలవాళ్ళందరూ మండలితో సంప్రదించండి. ఆనాటికి తగినంత అధ్యయనము అవగాహనతో రావడానికి వీలుగా కొన్ని వివరాలు మీముందుంచుతాను. చూడండి.
1) గతంలో మత మార్పిడులు వద్దంటూ హిందూ సమూహాల నుండి అంతగా ప్రతిఘటన లేదు. ఇప్పడది మొదలైంది.
2) ముస్లిం మత ప్రచారకులు ఇప్పుడంత పకడ్బందీగా లోగడ మతమార్పిడుల యత్నాలు చేయలేదు.
3) క్రైస్తవులు మతమార్పిడులకై పెద్దయెత్తునే పనిచేసుకుంటూ వచ్చినా అదంతా చాపక్రింద నీరులా సాగేది. అప్పుడుకూడా అనేక సేవా కార్యక్రమాలతో ముడిపెట్టి ఆ పనులు చేస్తూ వచ్చారువాళ్ళు. దాంతోపాటు హిందువుల పండగల పబ్బాల జోలి పోయేవారు కాదు వాళ్ళు. పైగా కొంతమేర హిందువుల ఆచార వ్యవహారాల్ని తాము పాటించే విధానాన్ని అవలంబించారు. నిజానికిది కుటల యెత్తుగడలో భాగమే. హైందవీకరణ పొందిన క్రైస్తవమన్నమాట.
4) క్రైస్తవాన్ని ఒకస్థాయిలో ఇక్కడి కుల, వర్ణ వ్యవస్థ నిలిపివేయగలిగింది. క్రైస్తవం కేవలం దైవ విషయానికి పరిమితమై, సాంఘికంగా రెడ్డి రెడ్డిగానే, కమ్మ కమ్మగానే, మాదిగ మాదిగగానే... ఇలా నిలబడి ఎవరి కుల పరిధుల్లో వారే వుంటూ వచ్చారు. అందువల్ల స్థూల దృష్టికి హిందూ మతానికి ప్రమాదమేమీ రాలేదనే అనిపిస్తూ వుండేది.
ఎ) ఈమధ్యకాలంలో ముస్లిం మతసంస్థలు మరింత నిర్దిష్టంగా, తీవ్రంగా, ప్రణాళికాబద్ధంగా అన్యుల్ని తమ మతంలోకి మార్చే యత్నాలు మొదలెట్టాయి. వారిలోని కట్టుదిట్టమైన మతాచరణవల్లా, నిబంధనలవల్లా, వారికివ్వబడ్డ మతాదేశాలవల్ల వారు హిందువులయెడ క్రైస్తవులంత నిమ్మళంగా వుండలేకపోయారు. కనుకనే మత కార్యక్రమాలలో హిందూ, మహమ్మదీయుల మధ్యనే ఎక్కువలో ఎక్కువ ఆవేశాలు, దాడులు, అల్లర్లు జరుగుతూ వచ్చాయి. ఆశ్చర్యమేమంటే, ఒకవంక తామూ కొన్ని బండాచారాలను పోషించుకుంటూనే, హిందువుల్ని కదిలించిమరీ, జుట్టెందుకు, గాజులెందుకు, మట్టెలెందుకు అంటూ ఈసడించడం, గేలిచేయడం, నిరచించడం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ హిందూత్వ పక్షాన నిలబడాలన్న, నిలబడివున్న వారిలో ఉద్రేకాన్ని రగిల్చి, ఊరకుండనీకుండా చేస్తూ వచ్చాయి; వస్తున్నాయి. రెంటికీ వున్న తేడా బాగా కనపడసాగింది.
ఆఖరిగా ఒక మాట : హిందువులు-క్రైస్తవులు-ముస్లింలు మూడుకూటాలవాళ్ళ పనులతీరెలా వుంది? క్రైస్తవులు ఇక్కడివారిని (హిందువుల్ని) తమవైపుకు లాక్కుంటున్నాడు; ముస్లిములూ హిందువుల్ని తమవైపు లాక్కుంటున్నారు. దాంతోపాటే పరస్పరం వారిలో వారూ రెండోవారిని తమవైపు లాక్కునే పనీ చేస్తున్నారు. వీరిద్దరి యత్నాలవల్ల చివరకు జరుగుతున్నదేమిటి? హిందువుల సంఖ్య క్రమంగా తరుగుతూ వస్తోంది. క్రైస్తవ, మహమ్మదీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. క్రైస్తవ-మహమ్మదీయులిరువురి మధ్య సంఖ్యానిష్పత్తుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయేగాని, మొత్తంమీద హిందువుల రాశినుండి ఆ రెంటివైపుకు మార్పిడి జరుగుతుందన్నమాట. మొత్తంగా నష్టపోతున్నది హిందువులనబడే గుంపే. ఇదే హిందువుల కడుపుమంటకు అస్సలు కారణం. అస్సలు నిప్పురగిలిందిక్కడే. ముట్టుకున్నదానిని రావణకాష్టంలా ఆరకుండా రగులజేస్తుందీ ఈ అంశమే. మతస్తులందరికీ నేను చేస్తున్న హెచ్చరికేమంటే, ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది. ఇక అలా జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నై, హిందువులూనూ మరికొంత ఐక్యతగానీ పెరిగి, కడుపుమంట రగిలిందా పర్యవసానం ఈ దేశంలో రక్తపాతము, మారణకాండే!


(147వ సంచిక తరువాయి)
అదే సమయంలో ఈ మూడు రకాలవాళ్ళూ కూడబలుక్కున్నట్లు ఇతర మతాలవాళ్ళు మాత్రం పచ్చి హింసాత్మక వాదులన్నట్లు మాట్లాడుతుంటారు. ప్రపంచవ్యాపితంగా క్రైస్తవులకు-యూదులకు-ముస్లింలకూ మధ్య యుద్ధాలు జరిగాయి అన్నది చారిత్రక సత్యం. ఇప్పటికీ జరుగుతూనే వున్నాయన్నది వాస్తవం. ఈ దేశంలో క్రైస్తవులు ముస్లింలు మతమార్పిడులు చేస్తున్నారు. వారిరువురూ అలా చేస్తున్నారంటూ హిందూ సమాజాలు గగ్గోలు పెడుతున్నాయి. మత మార్పిడి నిరోధానికై చతుర్విధోపాయాలు ప్రయోగిస్తున్నాయి. ఈ దేశంలోనే క్రైస్తవులు మెజారిటీగా తయారైన ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రం కావాలన్నవాదాలు మొదలయ్యాయి. ఆ దిశగా ఉద్యమాలూ జరుగుతున్నై. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా, జనానికి చూసే శక్తి లేదనుకుంటూ, మా మతం హింసను ప్రేరేపించదు. హింసచేసేవాళ్ళు మావాళ్ళు కాదు. అంటూ నమ్మబలకడాన్నేమనుకోవాలి?
ఒకవంక ఇతర మతగ్రంథాలను యడాపెడా విమర్శిస్తూనే, తమ గ్రంథమైన ఖురాన్‌పై ఎవరైనా ఇంత విమర్శ చేసినా మూకుమ్మడిగా ఆందోళనలు, దాడులు చేస్తూ ఫత్వాలు జారీచేస్తుండే వారినేమనాలి? ఈ ఫత్వాలు జారీ చేసేందుకు తగిన అవకాశం ఎక్కడనుండి పుట్టుకొచ్చినట్లు? ఒక గ్రంథంలో ఈనాటి సమాజం అంగీకరించడానికి వీల్లేని భావజాలం ఉంటే దానిని నిరసించడం తప్పెలా అవుతుంది? నాకు తెలిసి, ప్రతి మత గ్రంథంలోనూ అలాంటి భావజాలం చోటుచేసుకునే వుంది. ఆయా మతగ్రంథాలను అక్కడో ముక్కా, ఇక్కడోముక్కా చదవడంగా కాక ఏ వాక్యాన్ని వీడకుండా ఆమూలాగ్రం చదువుతూ విచారించడానికి సిద్ధపడగలగాలి. వారిలో నిజాయితీ వుంటే ఆ పనికి సిద్ధమంటే, ఏ మతగ్రంథాన్నైనా శాస్త్రీయ విచారణకు లోను చేయడానికి మండలి సిద్ధంగా వుంది. తగినంత మంది సమర్థుల్నీ కలుపుకుని ఒక వేదికను ఏర్పాటు చేయడానికీ సిద్ధంగా వుంది.
మతగ్రంథాలు మత సామరస్యాన్ని, పరమత సహనాన్ని బోధిస్తున్నాయంటున్నవాళ్ళంతా ఆ గ్రంథాల గురించి సరిగా తెలియనివాళ్లైనా అయ్యుండాలి. తెలిసే దానిని మరుగు పరచాలనుకుంటున్న వాళ్ళైనా అయ్యుండాలి. దానిని మరుగు పరచాలనుకుంటుండే వాళ్ళలో పరిస్థితుల్ని ఉద్రేకపూరితం కాకుండా చూద్దామనే సహృదయం కలవాళ్ళు వుండవచ్చు. లోలోపల మత దురభిమానం పెట్టుకునే, ఈ విషయం బైటపడితే సమాధానం చెప్పుకోడం అసాధ్యమవుతుందనే ఆలోచనలో వున్నవాళ్ళయినా కావచ్చు. ఇద్దరిలో హృదయాల రీతిలో తేడా వున్నా వారిరువురూ వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారన్నది మాత్రం నిప్పులాంటి నిజం.
ముగింపు : ముఖ్యమైన 4, 5 అంశాల్ని మీముందుంచి ఇప్పటికి ఆగుతాను. వచ్చే సంచిక నుండి బైబిల్‌, ఖురాన్‌ల నుండి; ఆ గ్రంథాలు 'పరమత సహనం, అసహనం' విషయాలు ఏ సమాచారం అందిస్తున్నాయో ఎత్తిచూపే పని ప్రారంభిస్తాను.
1. ఖురాన్‌లో మతయుద్ధాలకు సంబంధించిన సమాచారం ఉందా? లేదా?
2. బైబిల్‌లో, మతయుద్ధాలు జరిగిన దాఖలాలు దొరుకుతాయా? దొరకవా?
3. అవిశ్వాసుల విషయంలో ఆయా దేవుళ్ళు, వారి ప్రవక్తలు, ఆనుయాయులు ఎలా ప్రవర్తించారు?
4. వేదంలో అవిశ్వాసులపట్ల వ్యతిరేకత కనబరచిన దాఖలాలున్నాయా? లేదా?
5. ఈనాడు 'హిందూమతం' అంటున్నదానికి ప్రామాణిక గ్రంథమేమిటి? అందులో పరమతాల యెడ ఎట్టి వైఖరి వుంది?
6. అవిశ్వాసి సంఘం నుండి కొట్టివేయబడాలి, విశ్వాసులైనవారే అవిశ్వాసుల్ని చంపేయాలి లాంటి మాటలు బైబిల్‌, ఖురాన్‌లలో వున్నాయా? లేదా?
7. బైబిలు నిర్గమకాండలోని దేవుడు ఏ రకం స్వభావం కలవానిక్రిందికొస్తాడు?
8. ''జాతులకు జాతుల్నే నాశనం చేశాము'' అని ఖురాన్‌ దైవం అన్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
9. ఈనాడు ముస్లింలు క్రైస్తవుల్ని, ఇతర మతాలవాళ్లను ముస్లింలుగ మార్చాలనుకోవడం వెనక పనిచేస్తున్నదేమిటి?
మిత్రులారా!
1. చరిత్రలో మతం నిర్వహించిన పాత్రలో పెద్దభాగం రక్తాక్షరాలతో లిఖించదగిందే. దాన్ని మరుగున పెట్టి మిగిలిన కొద్దిభాగంలో అక్కడక్కడా చోటుచేసుకుని వున్న మంచిని భూతద్దంలో చూపించబోవడం అసలుకు మసిబూసి మారేడుకాయ చేయబూనడం వంటిది కాదా?
2. ఆయా మత గ్రంథాలేమి చెపుతున్నై? ఆయా మతానుయాయులు ఏమిచేస్తున్నారు? మతానుయాయుల్లో కొందరు శాంతిగా, కొందరు అశాంతిగా, ఇంకొందరు హింసాత్మకంగా, మరికొందరు అహింసాత్మకంగా, సహనంతో, అసహనంతో ఇలా రకరకాలుగా వుండడానికిగల కారణాలేమిటి? అన్న వాటిపై స్పష్టత, నిర్దుష్టత ఏర్పడితేగాని మనమెత్తుకున్న విషయాన్ని సక్రమంగా విచారణ సాగించలేము. కనుక ఈ విషయంపై మీ అభిప్రాయాలెలా వున్నాయో; మతపక్షీయులారా! మునుముందుగా విస్పష్టంగా ప్రకటించండి.
మతక్షేత్రంలో వేషధారులు, నాటకాలరాయుళ్ళు
మతాలు రాజకీయ రంగు పులుముకున్నా, రాజకీయాలు మతాల్లోకి చొరబడ్డా ఏమి జరుగుతుందో అదంతా కళ్లకు కట్టినట్లు అగుపడుతోంది నేడు.
క్రైస్తవమతం పుచ్చుకున్నాయన హిందూ దేవాలయాలకు బొట్టు, కట్టూ మార్చుకుని వాటికి తగ్గట్టు తయారై వెళుతున్నాడు. ఆయా హిందూ దేవుళ్ళ, దేవతల దయవల్లే చాలా చాలా జరుగుతున్నై అని పలుకుతున్నాడు. అతడే ముస్లిం దర్గాలకు, మసీదులకు వెళ్ళి ప్రార్థనల్లో పాల్గొంటున్నాడు. ముస్లిం వేషధారణలో మీడియా ద్వారా ప్రజల ముందుకొస్తున్నాడు. ఆయా మతప్రముఖుల, ప్రతినిధులు కూడా ఈ నేతలకు తమ తమ మత వేషధారణను కట్టబెట్టి స్తుతి పాఠాలు వల్లిస్తున్నారు. అదేంపోయే తెగులోగాని ప్రతినాయకుడూ ముస్లింల దగ్గర ముస్లింలాగా, హిందువుల దగ్గర హిందువులాగా, క్రైస్తవుల దగ్గర క్రైస్తవునిగా, సిక్కుల దగ్గర సిక్కుగా వేషాలు కడుతున్నాడు. వారి భాషలో మాట్లాడడానికి యత్నిస్తున్నాడు. గొల్లల దగ్గర గొల్లవానివేషం, కుమ్మర్ల దగ్గర కుమ్మరి వేషం, ఇలా ఇలా సిగ్గు ఎగ్గులు లేకుండా రకరకాల వేషభాషణలలో నటిస్తున్నాడు. అమాయక ప్రజల్ని వంచిస్తున్నాడు.
ఈ మత ప్రతినిధులు మరో గొప్ప తార్కిక ప్రజ్ఞనూ కనబరుస్తుంటారు. ఏ మతానికామతం ప్రతినిధుల్ని జరిగిన, జరుగుతున్న మత కల్లోలాలకు కారణమేమిటిరా? అని నిగ్గదీసినపుడల్లా, ఆ జరిగిన సంఘటనను జరగలేదనడం ఎలాగూ కుదరదుగనుక, ఆ ఘటనకు కారణం అవతలి మతంవాళ్ళు రెచ్చగొట్టడమో, అగ్గి రగలజేయడమోనే కారణం అంటూ పరస్పరం నెపాన్ని ఎదుటివాళ్ళపై రుద్దే పనిచేస్తుంటారు. నేనిక్కడ చెప్పదలచుకున్నది, ఏ మతంవాడు మొదలెట్టాడన్నది తేల్చుకోవలసిందే అయినా, ఏదో ఒక మతంవాడేకదా మొదలెట్టింది. మతేతరులెవరూ మత ఘర్షణలను ప్రోత్సహించిన దాఖలాలు లేవుగదా? అన్నదే పైగా ఎక్కడికక్కడ అప్పటికి బలంగా వున్న మతంగానీ, దృఢచిత్తుడైన మతప్రతినిధిగాని మాత్రమే అన్యమతస్తులతోబాటు మతేతరులపైనా వత్తిడిచేస్తూ వచ్చారనడానికి దాఖలాలు చాలా దొరుకుతై. ఇక్కడ విచారించాల్సిన మరో పార్శ్వమూ వుంది. భౌతికవాదులు (నాస్తికులు, హేతువాదులు వగైరాలు) మత వ్యతిరేకతను కనపరచడానికి కారణాలుగ జూపుతున్నదేమిటి? మతాలలో చొరబడివున్న మూఢనమ్మకాలు ఈనాటికీ పనికిరాని ఆచారాలు, ఏనాటికీ అంగీకరించదగని కట్టుబాట్లు, పరస్పర వ్యతిరేకతలకు దారితీస్తున్న భావాలు అన్నవాటినేకదా! వీటి విషయంలో ఏ మతస్తులైనా వారి వారి గ్రంథాలనాధారంగా సరైన సమాధానాలు చెప్పగలరా? చెప్పగలమంటే దానికొరకూ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవచ్చు మనం. మనసుంటే ఇది అసాధ్యమేమీ కాదు. దీనిపై మీరూ స్పందించండి.     (సశేషం)

No comments:

Post a Comment