Sunday, February 1, 2009

ఫజురుల్‌ రహ్మాన్‌గారి లేఖకు ప్రతిస్పందన



యోచనాశీలురు ఫజురుల్‌ రహ్మాన్‌కు, గత సంచికలో పత్రికద్వారాకంటే మనం కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందేమోనన్న నా సూచనను అదీ మనమధ్యనున్న సత్‌సంబంధాలు బలహీనపడకుండా వుండాలన్న హితసూచనగా తలంచక దానిపైనే అనేక సందేహాలను, అభిప్రాయాలను వెలిబుచ్చారు.
(1) ఆ నా సూచనలో ఆలోచించాల్సిన అతిపెద్ద భాగమే ఉందన్నారు. (2) అదంతా అందరూ తెలియాల్సిన భాగము అన్నారు. (3) నా మాటలకు, వ్రాతలకు వైవిధ్యాన్ని చూశానన్నారు, (4) భిన్న ఆలోచనలుకల వ్యక్తుల మధ్య వ్రాతలు, పరిచయాలను బెడిసికొట్టేలా చేస్తాయా? అలాకాక మనలో మనం పత్రికలు, మీడియా ఉపయోగపడదా? అని అడిగారు, (5) నాలెక్కప్రకారమైతే మాట్లాడుకోవడంకంటే వ్రాయడం ద్వారానైతేనే చేస్తున్న విశ్లేషణలనుబట్టి వ్రాసిందేమిటో, వ్రాసినవారేమిటో సమాజం గ్రహిస్తూ వుంటుంది. కాబట్టి నామటుకు నాకు పత్రికద్వారా విశ్లేషణా మంచిదనిపిస్తోంది అని వ్రాశాను.

బాగుందండీ రహ్మాన్‌గారూ మీరు చివరిగా అన్నమాట. 100కి 100% వాస్తవమే అయినా, ఇరువురు వ్యక్తులు వారి వారి అవగాహనలను మిత్రదృష్టితో పరస్పరం వెలిబుచ్చుకుని సరిచూసుకుందామనుకున్నప్పుడు పదిమంది మధ్యలో సరియైనదనుకుంటారో? తమలో తాము కూర్చుని మాట్లాడుకోవడం సరియైనదనుకుంటారో ఒకసారి ఆలోచించి చూడండి. నా అవగాహన ప్రకారమైతే మిత్ర స్వభావం కలవారు, అందునా ఎదుటివారిలో లోపాలున్నాయి అనిపించినపుడు ఆ వైఖరిని యిష్టపడడు. ఉదాహరణకి తన కుటుంబ సభ్యుల్లో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడుగాని, సంస్థ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు వచ్చినపుడుగాని సహజంగా మనము ఏ విధానాన్ని అనుసరిస్తాము. మన కుటుంబ సభ్యుల్ని పదిమందిలో పెట్టి కేసు విచారిస్తామా; వాళ్ళు రోడ్డు పడతానన్నా సమదాయించో, గదమాయించో ఇంట్లోకి తీసుకువస్తామా? అలాగే సంస్థాగత విభేదాలనైనా బహిరంగ విచారణకు పెడతామా లోపల కూర్చుని తేల్చుకోడానికి యిష్టపడతామా...
మనమధ్య వాతావరనం మరింత వేడెక్కకుండా వుండాలనుకుని నేను మిత్రదృష్టితో చేసిన సూచన మీకంత వికటంగా కనిపించడాన్ని ఏమనుకోగలను. పైగా నా మాటలకు, వ్రాతలకు మధ్య విభేదము కనిపిస్తుందని అనేశారు. అదెంత అనకూడని మాటో మీకేమి పట్టదు. అదేమంటే నా భావం అదికాదు. నా భావాన్ని చెప్పగల భాష నాదగ్గర లేదు అనో, మీరు బాధపడితే క్షమార్పణ అడిగితే, కావాల్సిందేనంటే క్షమించమనో, విచారపడుతున్నాననో చెపుతాను అంటారు.
అంతేగాని అయనన్నదేమిటి? నీవన్నదేమిటి? ఎందుకలా తొందరపడి అన్నాను అని వెనుక తిరిగి చూసుకోరన్నమాట. ఈ మీ పరిసి&థతిని అర్థం చేసుకొనే వ్రాతల ద్వారా (అదీ నలుగురికీ తెలిసే పత్రిక ద్వారా) కంటే మనవరకే పరిమితము చేసి మాట్లాడుకుంటే సరిపోతుందిగదా అనుకునే నా సూచన చేసాను. మీ గురించి నేనుగానీ, నా గురించి మీరుగానీ మనలో చోటుచేసుకుని వున్నవనుకున్న లోపాలను నలుగురికీ తెలియచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నా దానిని యిష్టపడుతున్నామన్నా, మన సంబంధాలు అంత సంతోషించదగ్గవిగా లేవనే అర్థం. నిజానికిప్పటివరకూ మీమీ మధ్య మాటల వ్రాతల ద్వారా జరిగినదంతా మీరు జాగ్రత్తగా గమనించుకుని వుండుంటే మీవైపునుండే 'మనం పత్రికద్వారా కూడా మనలో మనమే మాట్లాడుకుంటే బాగుంటుందండీ అనే ప్రతిపాదన వచ్చి వుండాల్సింది ఆశ్చర్యం! అలాంటి ప్రతిపాదన సహృద్భావంతో నేను చేశాననో అదేదో త్రికరణశుద్ధి లేనితనమన్నట్లో, నలుగురిలో పెట్టడానికి నేనేదో వెనుకాడుతున్నట్లు వ్రాయడం నిజంగా ఆశ్చర్యపడవలసిందే! లేదంటే నేనైనా మీ ఆలోచనా సామర్థ్యం గురించైనా పునరాలోచించుకోవాలిమరి.
అదే నేను సి.టి.ఎఫ్‌. వారి విషయంలో అది నలుగురిలో చర్చించాల్సిన విషయంగా తలంచాను గనుకనే పత్రికద్వారా విమర్శ, ప్రతివిమర్శలు ఎందుకని ఎందరంటున్నా ఆ విధానాన్నే కొనసాగిస్తూ వస్తున్నాను. ఆరంభంలో సూటిగా ఆ విషయం తెలియజేశానుకూడా. ఎదుటి వ్యక్తి పొరపడితే ఒకటికి 4 సార్లు విడిగా ఆ స్థితి వివరించి చెప్పడం ప్రశాంతంగా వున్న సందర్భంలో అనుసరించే పద్ధతి ఇది విజ్ఞులందరిలో నిర్వివాదాంశము. అదేమరి అతడు పొరపాటున కాకుండా, తెలిసే తప్పు చేస్తున్నాడనుకోండి, అప్పుడైనా సూచనమాత్రంగా చెప్పిచూడడమో, వినకుంటే నలుగురి ముందు పెడతాననడమో, అప్పటికీ అతనిలో మార్పు రాకుంటే నలుగురి ముందు పెట్టడమో, పద్ధతి తెలిసినవాళ్ళు అనుసరించే విధానము. సి.టి.ఎఫ్‌. వాళ్ళకూ, నాకూ మధ్య ఆ పరిస్థితి వుంది. మీకూ నాకూ మధ్య ఇంకా ఆ పరిస్థితి రాలేదనే ఇప్పటికీ నాకనిపిస్తోంది.
మనమధ్య ఖచ్చితమైన మిత్రదృష్టి వుండీ అలా మన వాదాన్ని నలుగురి ముందు పెడదామని గనుక ఇద్దరం అనుకుని చేసే సందర్భం ఒకటుంటుంది. అక్కడ మన ఉద్దేశం మనమన భావాలు సరిచూసుకోవడమన్నదికాక ఇద్దరమూ అనుకుని రెండు వాదాలను 10 మందికీ తెలియజేద్దాము అనుకుని రెండు పాత్రలను పోషించడమన్నమాట. ఈ నా మాట అర్థమవుతుందనుకుంటా. ఇద్దరమూ అంగీకరించిన ఏదేని ఒక విషయాన్ని సమాజానికి తెలియజెప్పాలనుకుని, దానిని చర్చారూపంలోకి మార్చి, కావాలనే చెరిఒక పక్షాన్ని స్వీకరించడమన్న మాట అది. అట్టి సందర్భాల్లో అడిగే ప్రశ్న, చెప్పే సమాధానమూ ఇద్దరికీ తెలిసేవుంటుంది. నిజానికి మనమధ్య ఆ పరిస్థితిగానీ, ఆ ఏర్పాటుగానీ లేదు.
నా అవగాహనబట్టి ఈ మీ లేఖాంశాలలోనూ, కొన్నింటి దూకుడూ, కొన్నింటి దోషమూ చోటుచేసుకుని వుంది. అయినా అదంతా విశ్లేషించి మీరేమిటో, మీ భాషేమిటో, మీ అవగాహనేమిటో, నలుగురికీ తెలియజేయటం ఇప్పటికీ నా ఉద్దేశం కాదుకనుక లేఖనంతా విశ్లేషించే పనిచేయలేదు.
ఒకమాట చెప్పి ఆగుతాను. మాతోగానీ, మీరు తీసుకొచ్చి పరిచయం చేసిన మీ ఇస్లాం పక్షం మిత్రులతోగానీ ముఖాముఖి మాట్లాడిన సందర్భాలలో ప్రతిసారీ తానన్న మాటలలోని దోసాలను, లోపాలను సున్నితంగానే ఎత్తిచూపుతూ, భాష సరిచేసుకోండనీ ఈ భావంపై ఈ ప్రశ్నలు వస్తాయి ఆలోచించుకోండనీ చెపుతూ వచ్చానేగానీ నిగ్గదీయలేదు. తప్నని కొట్టేయలేదు. ఓడగొట్టాలని ఉబలాటపడతాడు. ఆ సందర్భాలన్నింటినీ మీరూ ఒకసారి గుర్తుచేసుకోండి. మీలాగ అసీఫద్దీన్‌ గారితో వారి కేంద్రంతో మీ మసీదులో కూర్చున్న సందర్భం, మస్తాన్‌గారితో మీదగ్గరా, కాకినాడలో కూర్చున్న సందర్భం ఇలా జరిగిన ప్రతిసారీ వారిని పడగొట్టాలనిగానీ, నేను నెగ్గాలనిగానీ ఎక్కడా ప్రయత్నించలా. మరోసారి మరోసారి ఆలోచించుకోవాలీ, లోపరహితంగా అభ్యాసం చేయమనీ చెపుతూవచ్చాను. ఈ మీ లేఖలోని ఈ ఆఖరి అంశంవరకూ చూస్తున్నా శత్రువును కూడా మిత్రునిగా చేసుకునేదిగా వుందో, మిత్రునికూడా ఎడం చేసుకొనేందుకు పనికివచ్చేదిగా వుందో మరొకసారి పరిశీలించి చూడండి. తదా మీ ఆత్మీయులలో నిష్పాక్షికులు, ఆలోచనపరులు వుంటే ఈ మొత్తాన్నీ వారితో కలసి విచారించండి.

No comments:

Post a Comment