Sunday, February 1, 2009

ఐక్యమత్రమండలి సమావేశం - వివరాలు



ముందుగా అనుకున్నట్లగనే ఐక్యమిత్రమండలి సమావేశము 1-12-2009 ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమయినది. సమావేశం ఐక్య మిత్రమండలిలోని సంస్థల ప్రతినిధులు మరియు సంస్థల సభ్యులు ఇతర మిత్రులు మొత్తం 50 మంది హాజరయ్యారు.
ముందుగా ఐక్య మిత్రమండలి కన్వీనర్‌ సురేంద్రబాబు మాట్లాడుతూ ''సుమారు 5, 6 సంవత్సరాల క్రితం మెరుగైన సమాజంకొరకు పనిచేస్తున్న అభ్యుదయ సంస్థలో 3, 4 సంస్థలు. ఉదా|| సత్యాన్వేషణ మండలి, లోక్‌సత్తా, జన విజ్ఞానవేదిక లాంటివి కలసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చి మొదటి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో జయప్రకాష్‌ పాత్ర ప్రధానమైనది. బ్రహ్మారెడ్డిగారూ సరేననటంతో మొదలైన ఐక్యమిత్రమండలిలో తదుపరి బి. సాంబశివరావుగారూ, ఈదర గోపీచంద్‌గారూ ముందుకొచ్చి వారి సంస్థలను కలిపారు. ఆ పిదప ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం, వాయిస్‌, ఎక్స్‌రే, హైద్రాబాద్‌ హేతువాద సంఘం కూడా తమ చేతులు కలిపాయి.
ఐక్యమిత్రమండలి స్ఫూర్తితోనే వాస్తు నిజనిర్ధారణ ఐక్యవేదిక ఏర్పాటు జరిగి సమాజంలో వాస్తుభూతం పట్టిపీడిస్తున్న విధానాన్ని వ్యాపారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. విద్యారంగ ప్రక్షాళనోద్యమమును మొదలెట్టి ప్రాంతీయ శిక్షణా తరగతులు జరిపారు. పిదప ప్రాథమిక విద్యారంగానికి పరిమితమై సుమారు 5, 6 సమావేశాలు జరిపారు.

1) కలవగలిగిన అంశాలల్లో కలసి పనిచేయాలి. 2) సంస్థలు ఒకటి మరొకదానిపైన ఈ వేదికలో సైద్ధాంతిక, ఆంతరంగిక వ్యవహారాలపై విమర్శలు చేసుకోరాదు, 3) విభేదాలు ఏవైనా వుంటే 'మనలో మనం' అని కూర్చుని తప్పులు సవరించుకోవచ్చు. తప్పుచేయని మనిషే లేడు వంటి అంశాలతో ఏర్పడింది. దీనిలో విశేషమేమంటే మిత్రసంస్థల సభ్యత్వ సంఖ్య పెరగటానికి ప్రతిసంస్థా ఇతర సంస్థలకు సహకరించటము. సంస్థలలో చేరాలను కార్యకర్తల అభిరుచులనుబట్టి వారికి ఏ సంస్థ అనుగుణంగా వుంటుందో సూచించడం ద్వారా మితృత్వం పెరిగింది.
అంతేకాక విడివిడిగా సంస్థలూ వాటి ప్రయోజనాన్ని పొందాయి. ఉదా|| లోక్‌సత్తా కార్యక్రమమైన-ఎన్నికల నిఘా ఉద్యమంలోనూ, ప్రజారాజ్యం కార్యకర్తల శిక్షణలోను జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సుమారు 5000 మంది పనిచేశారు. అలాగే అశ్లీల ప్రతిఘటనవేదిక కార్యక్రమమైన-లక్ష్మిని హత్యచేసిన మనోహర్‌కు శిక్ష వేయించే ఉద్యమంలో 23 జిల్లాల మిత్రమండలిలోని అన్ని సంస్థల సభ్యులు చేయందించారు.
ఐనప్పటికీ ఐక్యమిత్రమండలి తగినంత ముందుకు సాగడంలా. కారణం ఏమంటే మిత్రసంస్థలు ఈ వేదిక ప్రాముఖ్యాన్ని తమ దిగువ శాఖలకు తెలియజేయకపోవడం. దీనికి కారణం ఏమిటోకూడా ప్రతిసంస్థా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇతరుల వత్తిడితోకంటే ప్రతిసంస్థ ఈ వేదికను తమదనుకుని పనిచేయాలి. తగినంత సంఖ్య, అవగాహన, ఉద్దేశ తీవ్రత సంస్థలకు లేకపోవడమే ఐక్యమిత్రమండలిలోని ప్రధాన లోపం. దీనిని సరిచేసుకోవలసిన, పూరించుకోవలసిన అవసరం వుంది. అంతర్జాతీయంగా కూడా హేతువాద ఐక్యవేదికలు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకెళ్దాం. పూర్వం కూడా ఈ సి.ఎం.పి. అమల్లో విజయాలకంటే అపజయాలే వున్నాయి. కారణం భాగస్వామ్య సంస్థలు తమ తమ వైయుక్తిక ప్రాధాన్యతలకే పరిమితమవడం.
ఉద్యమ క్షేత్రాలలోని కార్యకర్తలు 3 స్థాయిల్లో వుంటారు, (1) నా పబ్బం గడుస్తుంది అనుకునేవారు, (2) నేను కోరే ప్రత్యేరంగం లబ్దిపొందుతుంది, (3) సమాజం అంతా బాగుపడుతుంది, ప్రస్తుత సమాజంలో ఒకటిలోవారే ఎక్కువ వున్నారు. ఈ స్థాయిల్లోనుండే కార్యకర్తలను 1 నుండి 2 కు, 2 నుండి 3 కు చేర్చగలిగితే కోరుకునే సమాజం త్వరగా వస్తుంది'' అంటూ ఐక్యమిత్రమండలి నేపథ్యం వివరించారు.
డా|| వి. బ్రహ్మారెడ్డిగారు జన విజ్ఞానవేదిక, సెల్‌ 99598 28887 మాట్లాడుతూ మా సంస్థలో రోజువారీ బాధ్యతల నుండి నాకు రిలీఫ్‌ లభించింది. ఎక్కువ సమయం ఐక్యమిత్రమండలికి కేటాయిస్తాను. ప్రతి సంస్థలోని నాయకులు తమ దిగువ శ్రేణుల్ని తయారుచేసుకోవాలి. అలా చేసుకోలేని సంస్థలు ఎదగలేవు అనటానికి అనేక తార్కాణాలున్నాయి. మా జనవిజ్ఞాన వేదికలో కూడా ఆ లోపం వుంది. ఉండటానికి సభ్యత్వం వేలల్లో వున్నా, ముఖ్యులైన 20 మంది మరో 60 మంది మాత్రమే క్రియాశీలంగా వున్నారు. అంతేకాక యువకులు ఉద్యమాల్లోకి రావాలి. వారు భావజాల స్రవంతికి చెందిన ఉద్యమాలకంటే రాజకీయ స్రవంతికి చెందిన ఉద్యమాలవైపు ఉరుకుతున్నారు. మనం 10 సంవత్సరాలపాటు కాలేజీల్లో మనం అనుకున్న విషయాలు (1) శాస్త్రీయ దృక్పథం-శాస్త్రీయ పద్ధతి, (2) మానవీయ విలువలు, (3) సామాజిక సంబంధాలు-వ్యక్తిపాత్ర, (4) పొదుపు, ఆర్థిక అంశాలు-ను విద్యార్థుల్లో ప్రచారం చేయగలిగితే మార్పు వస్తుంది. వయసు ముదిరిన వారిని మార్చటంకంటే యువతను మార్చటం సులువు. అంతేకాక రాశికంటే వాసి ముఖ్యమని గ్రహించాలి. మేము ఇప్పటికీ శాస్త్రీయ దృక్పథం, పద్ధతి విషయంపై 15 పేజీల వ్యాసాన్ని జనవిజ్ఞాన సమాచారంలో వేశాం. సత్యాన్వేషణ మండలి తన తాత్విక కోణంలో వివేకపథంలో వ్రాసింది. ఏ సబ్జెక్టు అయినా చట్రంలో తయారుచేసుకొని అది దాటకుంటే సమాజానికందించాలి. వ్రాసేవాళ్ళు కావాలి. మా ప్రతిపాదన ఏమిటంటే - 4, 5 సెంటర్లలో తరగతులు జరుపుతున్నాం. కార్యకర్తలకు శిక్షణ యిస్తున్నాం. భోజన, వసతులు, ఖర్చులు భరిస్తున్నాం. సభ్యులను ఆహ్వానిస్తున్నాం.
ఐక్యమిత్రమండలి బలంలోంచి పుట్టింది. బలహీనతనుండి కాదు. ఆ బలాన్ని మీమీ మిగిలిన సంస్థలకంటే ఎక్కువ ఉపయోగించుకున్నాం. మీరూ ఉపయోగించుకోండి.
సమాజాన్ని తప్పుదోవ పట్టించే సంస్థలు, నాయకులు కలసి పనిచేస్తున్నారు. సమాజాన్ని బాగుచేయాలని అనుకునే మనము, మన సంస్థలు కలవటంలేదు. మన ప్రయత్నము బలహీనంగా వుంది. ఫలితంగా బలహీనంగా వుంది. నాయకత్వానికి గుర్తింపు కోరే స్వభావం మోతాదుకు మించి ఉండడం కూడా ఈ ఉద్యమానికి బలహీనత. దానిని అదుపుచేసుకోవాలి. కార్యకర్తలకు నాలెడ్జ్‌ స్కిల్స్‌తోపాటు ప్రేరణ కూడా అందించాలి. ఉద్యమాల్ని మన ఇష్టప్రకారం కాక వివేక మార్గంలో నడపాలి. సత్యంవైపుకు నడవాలి'' అంటూ తాత్విక మరియు ఆచరణాత్మకంలో విలువైన విషయాలు చెప్పారు.
మానవ వికాసవేదిక తరఫున బి. సాంబశివరావుగారు మాట్లాడుతూ తమ సంస్థ భారత నాస్తిక సమాజం నుండి చీలిందే సమాజంలోని ఇతర సంస్థలతో కలసి పనిచేయాలనే ప్రాతిపదికపైన మరియు దాని ఆచరణ భాగంగానే ఐక్యమిత్రమండలిలో, మరియు þ లోనూ సభ్యులుగా ఉన్నాము. సమాజంలోనే ఐక్యస్వభావం తక్కువగా వుంది. ఐక్యతకు ఎక్కువ సమయం, విచ్ఛిన్నతకు తక్కువ సమయం సరిపోతాయి. ఎలక్ట్రానిక్‌ మీడియావారు రోజూ కనీసం 1 గంట మతపరమైన, కార్యక్రమాలకు, మరెన్నో డైలీ సీరియల్స్‌ ద్వారా మూఢనమ్మకాల ప్రచారాలకు కేటాయిస్తున్నారు. మనలాంటి అభ్యుదయ సంస్థలకు 5 ని||లు కేటాయించటంలేదు. ప్రింట్‌ మీడియా కూడా అంతే. కేవలం వ్యాపార దృష్టితోనే వారున్నారు. స్పాన్సర్స్‌ను తెచ్చుకోమంటున్నారు. దీని గురించి ఆలోచించాలి. వి.బి.గారు చెప్పిన కార్యక్రమం మా ప్రణాళికలో ఇప్పటికీ వుంది. నల్గొండజిల్లాలోని 10 డిగ్రీ కాలేజీల్లో మొదటి తరగతులు నిర్వహించబోతున్నాము. ఐక్యమిత్రమండలి సమావేశాలు దోరకుంటలో కంటే ఏదైనా నగరంలో జరుపుకుంటే బాగుంటుంది. ఎక్కువమందీ రాగల్గుతారు. మారుమూల ప్రాంతానికి రావాల్సిన కష్టము తప్పుతుంది'' అంటూ ముగించారు.
జైభారత్‌ తరఫున జంగయ్య మంగలిగారు మాట్లాడుతూ, ''ఐక్యమిత్రమండలి కార్యక్రమాలు ఏమీ నిర్వహించడంలేదు. దేశంలో జరుగుతున్న సంఘటనలకు ప్రతిస్పందించటంలేదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎప్పుడు కార్యక్రమం జరిపినా కొద్ది గంటల ముందు మాకు కబురుచేసినా మేము చేరుకుంటాము.
లోక్‌సత్తా ప్రతినిధిగా మాల్యాద్రి ప్రసంగిస్తూ ''ఐక్యతవల్ల గతంలో కలగని ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఉద్యమాలకు ప్రతికూల వాతావరణం ఎలక్ట్రానిక్‌ మీడియా, సాంకేతిక అభివృద్ధులే కారణమా అనిపిస్తుంది. þ ఏర్పడ్డంవలన కష్టంగావున్నా, ఉద్యమాలకు ఊపు యివ్వడానికి దోహదం చేస్తుంది. ప్రజానాడిని పట్టుకోవాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల మధ్య సమన్వయం సాధించాలి. 150వ సంచిక (వివేకపథం) 8వ పేజీలో వ్రాసినట్లుగా తగిన సమయంలో తగిన పని అన్నదే సత్ఫలితాలకు మూలం అని సురేంద్రబాబు వ్రాసినదాన్ని అందరూ అనుసరించాలన్నారు.
సోషలిస్తు ఉద్యమకారుడు, ప్రజారాజ్యంపార్టీ అవగాహనా విభాగంలో బాధ్యుడు అయిన కె.ఎస్‌.రామ్‌గారు ఉద్యమాలు జరగాలి, కలసి పనిచేయాలనుకుంటున్నాం, కదలికలేదు. దాదాపు అన్ని సంస్థలు పై ధనప్రభావమే వుంది. మనం వరుసగా సమాజానికి, దేశానికి, పార్టీ, స్నేహితులకు, కుటుంబానికి, చివరిగానే వ్యక్తికి ప్రాధాన్యత యివ్వాలన్నారు. యువతవద్దకు అవినీతి, సామాజిక న్యాయం, స్వదేశీ, సంఘ సంస్కరణల్లోని వాస్తవాలు తీసుకెళ్ళాలి. గతంలో లోక్‌సత్తా సంస్థ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థుల వేదికను ఐక్యమిత్రమండలి నిర్వహిస్తే బాగుంటుంది'' అని అన్నారు.
వినియోగదారుల సమాఖ్య అధ్యకక్షుడు టి.వి.రమణయ్యగారు ''వినియోగదారుడు ప్రకటనలు చేసి మోసపోతున్నాడు, మోసపోయిన వినియోగదారుడు పొందే నష్టం, వినియోగదారుని ఫోరంకెళితే ఇంకా పెరిగిపోతుంది. న్యాయం జరగటంలేదు. టి.వి.మీడియాలో వస్తున్న 'నేరాలు' సీరియల్స్‌ ద్వారా నేర స్వభావం పెరుగుతుంది. నేర విధానమునూ ప్రజలు నేర్చుకుంటున్నారు. అలాగే ఆర్‌.టి.ఐ. చట్టం ఆధారంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు ఏఏ రంగాలకు ఎంత నిధులు అందజేస్తున్నాయో సేకరించి గ్రామస్తులకు అవగాహన కలిగించాలి. దళారీ కాంట్రాక్టర్స్‌ పాత్ర తగ్గించాలి'' అన్నారు.
రాజీవ్‌ గృహకల్ప బాధితుల సంఘం అధ్యకక్షుడు, ఆర్‌.ఎస్‌.నాయుడు, మాట్లాడుతూ, ''తాను కేవలం ఆటో డ్రైవర్‌నని, రాజీవ్‌ గృహకల్ప బాధితుడినని ఐక్యమిత్రమండలి స్ఫూర్తితో బాధితుల్ని సమీకరించి, సంఘటితపరచి, పోరాడడం ద్వారా న్యాయం పొందామన్నారు. ఈ పోరాటంలో సహకరించిన జంపా కృష్ణకిషోర్‌గారికి సభాముఖంగా కృతజ్ఞతలు. మద్యపానం, గుట్కాలపై కూడా ఉద్యమించాలి'' అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం నాయకుడు భానుప్రసాద్‌ మాట్లాడుతూ, ''తన ఉద్యమ ప్రస్థానంలో అనేక మజిలీలున్నాయి. పూర్వం వున్నంత వేడి ప్రస్తుతం లేదు. మా ఉద్యమ జీవితం సరైన దిశానిర్దేశం లేకుండా గడిచింది. నాకు వ్రాసే సమర్థత లేకున్నప్పటికీ అనేకమంది హేతువాద నేతలకు పత్రికలకు వ్యాసాలు వ్రాయమని అర్థించేవాడికి ఫలితంలేదు. పుట్టాసురేంద్రబాబు, గుత్తారాధాకృష్ణగార్లు వచ్చేదాకా మాకు సిద్ధాంతాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇప్పుడూ తీస్తున్నాం పడుతున్నాం. అయినా ఆర్‌.ఎస్‌.నాయుడులాగా ఒకే పాయింట్‌ ఎజెండాగా ముందుకెళ్తే ఫలితాలు వస్తాయి. యువతరంలో ప్రేమోన్మాదం పెరిగిపోతోంది అనటానికి ఋజువు ఏమిటంటే పూర్వం 10వ తరగతి దాటిన ఆడపిల్లలు అబార్షన్‌ల కోసం మా దగ్గరకొస్తే, ఈ కాలంలో 7వ తరగతి దాటినవాళ్ళే ఎక్కువ వుంటున్నారు.
మహిళల తరఫున విజయా బక్ష్‌ మాట్లాడుతూ, ''మాది మానవ వివాహం. మంచి పనులు చేయటానికి రాజకీయాలు అవసరం లేదు. లోక్‌సత్తా ఉద్యమంలో బాధ్యురాలిగా వున్నాను. ఈ సమావేశం గురించి ప్రెస్‌వారికి తెలుపక పోవడం విచారకం. ఏ ఉద్యమానికైనా ప్రచారం లేనిదే వ్యాప్తిచెందదు. విద్యార్థుల దగ్గరకేకాదు ఉద్యమాలు మహిళలవద్దకు చేరాలి. వివేకపథంలో ఇతరులచేతకూడా వ్రాయించండి'' అంటూ ముగించారు.
ఈదర గోపీచంద్‌ (అశ్లీల ప్రతిఘటనావేదిక) మాట్లాడుతూ, ''అ.ప్ర.వే. ఒక నైతిక ఉద్యమ సంస్థ. అన్ని రంగాల్లో నైతిక విలువల అవసరము వున్నప్పటికీ 'మీడియా రంగంలో నైతిక విలువలు'కోసం మా సంస్థ మొదలైంది. 2000 సం||లో సామరస్యపూర్వక సహకార సంబంధాలు అనే విషయంపై చర్చలో పాల్గొన్నప్పటినుండి సామరస్యం - అంటే మనమధ్య తేడాలున్నా గౌరవించుకోవడం, సహకారం - అంటే మనమధ్య తేడాలున్నా సామరస్యంతో కలసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. ఐక్యమిత్రమండలి ఏర్పాటుకు ముందే ఇది జరిగింది. ఐక్యమిత్రమండలిలో మేము పూర్తిగా క్యంగా తాము కొన్ని ప్రత్యేక కారణాలవల్ల అవి అప్రస్తుతం.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. మన సమస్యల్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళాలి. దీనికోసం మనం మన స్వంత లక్ష్యాల్ని ప్రక్కన పెడదాం. జె.పి.ని. ఒకప్పుడు నియంత అనుకున్నాను. ప్రస్తుతం నేను నా అభిప్రాయం మార్చుకున్నాను. జె.పి.కి దూరంగా వుండి తప్పుచేశానేమో అనిపిస్తుంది. మా కార్యక్రమాల ప్రాధాన్యత కూడా అశ్లీలత నుండి సెజ్‌ సమస్యవైపుకు మారింది. రాబోయే మూడు నెలల్లో ఎవరు ఏ కార్యక్రమం చేస్తారో ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది. మార్చి 1వ తారీఖున అశ్లీల ప్రతిఘటన వేదిక 20 వ వార్షికోత్సవం విజయవాడలో జరుపుతున్నాం. దానికి ఐక్యమిత్రమండలి సభ్యులందరూ తప్పక రావలసినది. అంతేకాదు ఐక్యమిత్రమండలి సాహిత్యం తయారుచేసుకోవాల్సిన అవసరం వుంది'' అంటూ ముగించారు.
తరువాత క్రాంతికార్‌ (ఆంధ్రప్రదేశ్‌ హేతువాదసంఘం అధ్యకక్షులు) మాట్లాడుతూ, ''నేటి సమాజంలో మంచికి విలువ తగ్గుతూ వస్తుంది. ఉగ్రవాదము పెరిగిపోతోంది. ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో ఒక మతంవారు మరొకమతం వారిపై దాడులు చేసి హత్యలకు, మానభంగాలకు పాల్పడ్డారు. మనదేశం మతోన్మాదం, మత ఉగ్రవాదం, మత ఫాసిజానికి గురికాబడుతుంది. ప్రజలు నష్టపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. విద్యార్థుల్లో లౌకికతత్వం పెంపొందించాలి. అంతేకాక ప్రేమ పైశాచికత్వం, ప్రేమోన్మాదంవల్ల యువతులు జీవితాలు కోల్పోతున్నారు. వారికి ఆత్మరక్షణోపాయాలు నేర్పించాలని కాలేజీ యాజమాన్యాలను కోరాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు సహకారంతో పనిచేయాలి'' అని ముగించారు.
నర్రా రామారావుగారు జనవిజ్ఞానవేదిక ప్రసంగంలో ''ప్రశంస అవసరము. పొగడ్త అనర్థము. ఒకే విషయాన్ని పదేపదే చెప్పుకోవడం ద్వారా ఆ విషయానికి బలం చేకూర్చవచ్చు. సమాజంలో ఎన్నో సమస్యలున్నా, అన్నింటికీ ఉమ్మడిగా ఉపయోగపడే విషయమే శాస్త్రీయ దృక్పథము. మన ఐక్యమిత్రమండలికి ఒక þ అవసరం. మనందరికీ శిక్షణకూడా అవసరం. ప్రస్తుత ఉద్యమాల ఫలితం సమాజంపై ఏమీ వుండడంలేదు. ఎందుకంటే జీవపరిణామ సిద్ధాంతము. టెలిస్కోపు ఆవిష్కరణ జరిగి సూర్యునిచుట్టూ భూమి తిరుగుతున్నదని సైన్స్‌ ఋజువుచేసినా, ఇంకా సూర్యగ్రహణంలాంటి మూఢనమ్మకాలు ప్రజల్ని శాసిస్తున్నాయని తెలుస్తుంది. సమస్యల విశ్లేషణకు, పరిష్కారానికి అవసరమైన శాస్త్రీయ దృక్పథమును ప్రజల్లో పెంపొందిద్దాం'' అని చెప్పారు.
సిద్ధార్థబక్ష్‌ (రాడికల్‌ హ్యూమనిస్టు) తాను రావడానికి ఆలస్యం అయినందుకు 'సారీ' చెపుతూ, ముందుగా మాట్లాడినవారి ప్రసంగాలు వినలేకపోయినందుకు విచారం వెలిబుచ్చుతూ ''ఈ ఐక్యమిత్రమండలి ఏర్పాటుకు ముందుకూడా ఐక్యవేదికల నిర్మాణానికై ప్రయత్నం చేశాం. కాని నాయకుల 'ఈగో'ల వల్ల అవి విజయవంతంకాలేదు. ఈగో వుంటే కార్యక్రమం జీరో. అందువల్ల ఈగో వదిలేద్దాం. అలా అని భట్రాజులుగా వుండక్కర్లేదు. బానిసలుగా బతకొద్దు. గతంకంటే ఘనంగా దరిద్రాన్ని మన నెత్తిన పెట్టుకోవద్దు. చెడింది వ్యక్తేకాని సమాజంకాదు. ఉద్యమాల్లో కుటుంబసభ్యుల పాత్రను తప్పనిసరిగా తీసుకురావాలి. భావాలలో వికాసం రావడమే ఉద్యమం. మనము ఇతరులకు ఆదర్శంగా తయారవ్వాలి. మన భావాలను ఆచరించి చూపించాలి'' ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
విశ్వేశ్వరరావుగారు మాట్లాడుతూ ''మనం భానుప్రసాద్‌గార్ని, విజయాబక్స్‌గార్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలోని సున్నితత్వాన్ని పెంచాలి. మన ఉద్యమాల్లోనూ కలుపుమొక్కలుంటాయి వాటిని తొలగిస్తుండాలి. రాబోయే ఎలక్షన్స్‌ ద్వారా మంచి గవర్నెను తెచ్చుకోవాలి. స్విస్‌ బ్యాంక్‌లో మూల్గుతున్న భారతీయుల నల్లధనాన్ని బయటకు తీసుకొస్తే ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు. వాటికోసం కేంద్రంపై వత్తిడి తెద్దాం'' అని చెప్పారు.
జైభారత్‌ ''కష్టసమయాల్లో ఐక్యమిత్రమండలి మాకు ఎంతో సహకారమందించింది. మా సంస్థ ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా విస్తరించింది. 26-11-2008 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడి తరువాత సాధారణ ముస్లిమ్‌లను కూడా విశ్వసించలేని స్థితిలో ఇతరులున్నారు. అందువలన మతసామరస్యాన్ని పెంపొందింప వలసిన తక్షణ అవసరాన్ని గుర్తించి హిందూ-ముస్లిం మతఛాందసవాదులను నేరుగా కలసి వారి వారి గ్రంథాలలో మతంలో సంబంధం లేకుండా మనిషిని ఎలా గౌరవించాలని వ్రాసివుందో, మత సామరస్యాన్ని ఎలా పాటించాలో చెప్పాము. మత సామరస్యాన్ని చాటిచెప్పే చారిత్రక సంఘటన ప్రింట్‌చేసి 16/12 నుండి 31/12/2008 వరకు 1,50,000 ప్రతులు పంచాము. 2004 ఎన్నికల తరువాత బి.సి.ల పరిస్థితి గురించి పుస్తకం ప్రచురించి తెచ్చాము. తదుపరి ఐక్యమిత్రమండలి సమావేశం మా 'జైభారత్‌' హైదరాబాద్‌లో నిర్వహించటానికి సిద్ధంగా వున్నాము'' అని సభ్యుల్ని ఆహ్వానించారు.
అలాగే ఫిబ్రవరి 14న, 15న గోగినేని బాబు సహకారంతో హైద్రాబాద్‌లో నిర్వహించబడుతున్న విజ్ఞాన శాస్త్ర సమావేశానికి సభ్యులు హాజరై సైన్స్‌ అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవానికి కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకున్నారు. వివరాలకు టి.వి.రమణయ్యగార్ని సంప్రదించగలరు. చివరిగా జైభారత్‌ సత్యంగారు సభికులకు ''బి.సి. కులాల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళు'' అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయటంతో కార్యక్రమం ముగిసింది.

No comments:

Post a Comment