Friday, May 1, 2009

గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం


గుంటూరుజిల్లా
గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం 29-3-2009 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు బాపట్లలో రామానుజ కూటములో జరిగింది. పాఠకులు గుంటూరు, నర్సరావుపేట, పొన్నూరు, బాపట్ల, ఏటిగట్టుపాలెం, కర్లపాలెం, గవినివారిపాలెం మొదలగు ప్రాంతాల నుండి వచ్చారు. ఈ సమావేశమునకు ఉన్న ప్రత్యేకత ఏమంటే, కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లాలలో జరిగిన పాఠక సమావేశాల్లో అక్కడి స్థానికులే ఎక్కువమంది రాగా, ఈ సమావేశాలకు జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చారు. అంతేకాక వచ్చిన సభ్యులు విషయం వినటంతోపాటు వారి వారి అభిప్రాయాలు నిక్కచ్చిగా వెలిబుచ్చటంలో ఆసక్తి కనబరిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే -

మొదటి ఇక్కురిస్తు సుబ్బారావుగారు సభికులకు స్వాగతం పలికి వేదికపై యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు, శీలం నాగార్జునరావు, పెరికెల మోషేల గార్లను ఆహ్వానించారు. తదుపరి మోషే మండలి గీతం 'సత్యాన్వేషణ మండలీ రయి రయిమని నిను రమ్మందిరా' అంటూ సామాజిక స్పృహ కలిగినవారు సత్యాన్వేషణ మండలిలోకి చేరాలని పాటద్వారా పిలుపిచ్చారు. పాట తర్వాత మండలి భావజాలాన్ని వివరించారు. సారాంశం ఏమంటే (1) సమాజంలో వున్న, వుండకూడనితనానికి, ఉండవలసినతనానికి వ్యక్తులే కారణం; (2) స్వార్తం ప్రధానంగా ఎక్కువమంది వున్నారు. అది మారి సమాజం మనకోసమే అనే అవగాహన పెరగాలి; (3) జ్ఞానానికనుగుణంగానే పని, దానిననుసరించి ఫలితం వుంటాయి కనుక సరియైన జ్ఞానం మనిషి పెంచుకోవాలి, దానికి అవసరమైన లక్షణ ప్రమాణ విద్యను మండలి నేర్పిస్తుంది; (4) మనిషి ధర్మబద్ధంగా అంటే తనకూ, ఇతరులకూ, మేలు కలిగించే పనులు చేయాలి. అలా చేయటానికి అవసరమైతే వత్తిడికూడా సమాజం చేయాలి; (5) తాను ఆర్జిస్తున్న జ్ఞానాన్ని తన జీవితంలోని అనుభవాలతో పోల్చిచూస్తే సరియైన జ్ఞానమా, కాదా అన్నది ప్రతి మనిషికీ అర్థం అవుతుంది; (6) సత్యాన్వేషణ మండలి వంచనా ప్రతిఘటన వేదిక, లౌకిక ఐక్యవేదిక, వాస్తు నిజనిర్ధారణ ఐక్యవేదికలాంటి ఐక్యవేదికలలో క్రియాశీల పాత్ర వహించింది- ఇలా అనేక విషయాలను స్పృశిస్తూ విస్తృతంగా సాగింది. తదుపరి నాగార్జునరావుగారు మండలి లక్ష్యాలను కార్యక్రమాలను, నియమాలను, ఉమ్మడి శిక్షణా తరగతుల్లో సిలబస్‌ అయిన 8 విషయాలను, భిన్న తాత్విక ధోరణుల చర్చల్లోని విషయాల జాబితాను ఒక క్రమంలో వివరించారు.
తరువాత రిటైర్డు లెక్చరర్‌ శ్రీ శాంతారామ్‌గారు మాట్లాడుతూ : (1) తాను అధ్యయనం చేసిన అనేక తాత్విక భావజాలాల్లో, సత్యాన్వేషణ మండలి సిద్ధాంతము ఉన్నతమైందని; (2) సోక్రటీస్‌, ప్లేటో లాంటి తాత్వికులు అనుసరించిన ప్రశ్న, సమాధానము లేదా సంభాషణ రూపంలో బోధనా విధానాన్ని మండలి ఎంచుకుందని, (3) సామాజిక సమస్యలపట్ల పౌరులకు పట్టనితనము (ఉదాసీనత) ఉందని, అది పోవాలని; (4) దానికి కారణం మనిషి తనకు అన్నీ తెలుసని అనుకుంటూ అహంకరిస్తున్నాడని, ఇతరులు చెప్పేదాన్నీ వినటం నేర్చుకోవాలనీ, అహంకారాన్ని తొలగించుకోవాలనీ, (5) ముఖ్యంగా జీవితాన్ని తప్పుమార్గంలో నడిపిస్తున్న తప్పుజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనీ వీటి విషయంలో మండలి సమాజానికి బాగా ఉపయోగపడుతుందని వివరించారు.
పిదప సాయిగారు మాట్లాడుతూ : (1) ప్రజాస్వామ్యంలో ప్రజలపాత్ర నేతిబీరకాయలో నెయ్యిలాగా వుంది; (2) అలాకాక పౌరులు విధిగా ఓటుచేయాలి; (3) మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి; (4) మద్యం, డబ్బు పంపిణీలకు వ్యతిరేకంగా, చురుకుగా పాల్గొనాలి; (4) నేరచరితులను తెలికొనేహక్కు, అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటుచేయకుండా వుండే హక్కులు పౌరునికి వుండాలని చెప్తూ ఎన్నికల నిఘావేదికలో అందరూ చురుకుగా పాల్గొనాలని, ఈ నెలరోజులు అందరూ దీనిమీద పూర్తి దృష్టిని కేటాయించాలనీ కోరారు.
సీనియర్‌ సిటిజన్‌ సుధాకరరావుగారు మాట్లాడుతూ : భగత్‌సింగ్‌వంటి స్వాతంత్య్ర యోధుల పోరాట ఫలితాలను మనం అనుభవిస్తున్నామని కాని సమాజంపట్ల, దేశంపట్ల బాధ్యతకలిగి లేమని, అలాకాక ఈ విషయంలో అందరూ సత్యాన్వేషణ మండలిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
జైభారత్‌ సభ్యుడైన నాళం సుబ్బారావుగారు ప్రసంగిస్తూ తమ సంస్థ జైభారత్‌, సత్యాన్వేషణ మండలి మిత్రసంస్థలని, సత్యాన్వేషణ మండలిలో సభ్యులుగా అందర్నీ చేరమని సూచించారు.
నర్సరావుపేట నుండి వచ్చిన వెంకటరెడ్డిగారు తాను తెలుగు, హిందీ, సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యత కలవాడినని, సామాజిక సేవపట్లమనవనీ, కానీ సంస్థల నిర్వాహకుల్లో నిజాయితీ వుండటం లేదనీ అందువలన నర్సరావుపేటలోని ఏ సంస్థలోనూ చేరలేదనీ, సత్యాన్వేషణ మండలి నిబద్ధత గురించి విని సంస్థలో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు.
కర్లపాలెం నుండి వచ్చిన వెంకటరెడ్డిగారు మాట్లాడుతూ తాను వివేకపథం పత్రిక పాఠకుడినని శ్రద్ధగా చదువుతుంటానని, ఇలాంటి సమావేశాలకు హాజరయితే అందరికీ మంచిదని చెప్పారు.
ఇలా అనేకమంది ప్రసంగాలతో సమావేశం సాగింది. సత్యాన్వేషణ మండలి నేటి సమాజంపట్ల ఎలా ఆవేదన చెందుతుందో వివరించే 'అలమటించుతోందిరా అమ్మ భారతావనీ' గీతాన్ని మోషే ఆలపించగా ఉదయపు సమావేశము ముగిసింది.
భోజనానంతరం అసలు సమావేశ లక్ష్యము అయిన 'పాఠకులతో ముఖాముఖి' కార్యక్రమం సాగింది. వచ్చిన సూచనలు - మండలి తరఫున జగన్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా వున్నాయి :
సూచనలు : 1) సభ్యులచేత నిబద్ధతతో, నిజాయితీతో సామాజికసేవ చేయిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తే బాగుంటుంది.
2) ఇతర అభ్యుదయ పత్రికల చందా, చిరునామాల వివరాలుకూడా పత్రికలో ప్రకటిస్తే వాటిద్వారా కూడా పాఠకులకు మరింత అవగాహన కలుగుతుంది.
3) మండలి కమిటీలు, జిల్లా కమిటీలను వాటి బాధ్యులను సత్యాన్వేషణ మండలి ఏర్పాటుచేస్తే కార్యక్రమాలు మరింతగా జరుగుతాయి.
4) న్యూస్‌ పేపర్ల ద్వారా మండలి గురించి ప్రచారం చేయాలి. అలాచేస్తే ఎక్కువమందికి సమావేశం గురించి తెలుస్తుంది.
5) లక్షణ ప్రమాణ విద్యకు పత్రికలో ఎక్కువభాగము ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది. ప్రమాణ వివేచన విషయాల్ని ఒక పుస్తకంగా తీసుకువస్తే సౌకర్యంగా వుంటుంది.
జగన్‌ సమాధానాలు : త్రైమాసిక సమావేశాల్లోగాకున్నా, అప్పుడప్పుడు సభ్యులలో మరింత నిబద్ధత, క్రియాశీలత పెంచడంకోసం ప్రతిజ్ఞలు చేయిస్తుంటామని ఇకముందు అది ఒక నియమంగా పాటిస్తాము. మాకు తెలిసినంతలో ఇతర పత్రికలను, గ్రంథాలను సూచిస్తున్నాము. మీరు కూడా మీకు తెలిసినంతలో వివరాలు పంపిత వేటి అధ్యయనం సమావేశానికి మేలు కలుగుతుందనుకుంటామో వాటి వివరాలు ప్రచురిస్తాము. మండలి మొదటినుండి పబ్లిసిటీకి దూరంగా వుంటూ వచ్చింది. గుర్తింపు కోరే స్వభావాన్ని మనిషి అదుపుచేసుకోవాలనే దాని వెనుకనున్న ఉద్దేశ్యము. కాని పబ్లిసిటీ అవసరమనిపిస్తోంది. కాని పేపర్లో మన ఫొటోలు, పేర్లు పడాలనే తపనకంటే విషయ అవగాహనపైన, కార్యక్రమాలకే సభ్యులు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. తోసుకు వస్తున్న అనేక కార్యక్రమాల వత్తిడిలో మండల ప్రధాన విషయమైన లక్షణ ప్రమాణ విద్యపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం జరిగింది. అది మేమూ గమనిస్తున్నాము. పత్రికలో ఎక్కువభాగం కాకున్నా, కనీసం 3, 4 పేజీలు కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రమాణ వివేచన, పదార్థ వివేచనల భాగాలు ఒకే పుస్తకంగా తీసుకువస్తే పాఠకుల స్వతంత్ర ఆలోచనకు ఎక్కువ అవకాశం లేకుండా, విద్యార్థులకు షార్ట్‌కట్‌ మార్గంలో ఉపయోగపడే గైడ్లలాగా వుంటుందేమోనని భావిస్తూ పాఠకుల నుండి అనేక సమావేశముల్లో వచ్చిన ఈ సూచనను అంగీకరించలేక పోతున్నాము. లక్షణప్రమాణ విద్య పుస్తకం ద్వారా నేర్చుకోవడంకంటే అభ్యసనం ద్వారానే నేర్చుకుంటే వంటబడుతుంది. కాకుంటే ప్రత్యామ్నాయంగా ఈ విషయాలు వుండే సంచికల్ని కలుపుకుని ఒక పుస్తకంగా పాఠకులే తయారుచేసుకుని చదివితే ఆయా విషయాల్లో పాఠకులు వెలిబుచ్చిన కీలక ప్రశ్నలు, సురేంద్ర సమాధానాలు పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించేవిగా వున్నందున ఉపయోగముంటుంది. గుంటూరు, నర్సరావుపేటల్లో సభ్యులు, పాఠకులు స్పందించి సమావేశాలు ఏర్పాటుచేస్తే మేమూ వస్తాం. కమిటీలను, కన్వీనర్లను ఏర్పాటువలన సమావేశాలు నిరంతరాయంగా జరగటానికి అవకాశం వున్న ఒక మెలకువను పెట్టేయక అందరూ ఆ బాధ్యతలను ముందుంచుట మంచిది.
పశ్చిమగోదావరిజిల్లా రిపోర్టు
ది. 5-4-2009 ఆదివారంనాడు వివేకపథం పశ్చిమగోదావరిజిల్లా పాఠకుల సమావేశం తణుకు మండలంలోని ఉండ్రాజవరంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠకులు, మండలి పరిచయంపట్ల ఆసక్తి కలిగి సమావేశానికి హాజరైన వారిలో నిర్వాహకులు జి.వెంకటేశ్వరరావు దంపతులు, సమీర, సాంబశివరావుగారు, పార్వతిగారు, నాస్తిక భావాలున్న ప్రసాద్‌ దంపతులు, హరికిరణ్‌గారు, ఎం. సత్యనారాయణగారు, ఆకివీడు వాస్తవ్యులు బి.వి.సత్యనారాయణగారు, మరికొంతమంది సుమారు 25 మంది వున్నారు. నిర్వాహకునిగా యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు, వక్తలుగా మోషే, నాగార్జునగార్లు పాల్గొన్నారు.
మొదటగా మోషే ప్రసంగిస్తూ మండలి ఆవిర్భావాన్ని, భావజాలాన్ని తెలియజేశారు. ప్రసంగ సారం - సమాజాన్ని వివిధ కోణాల్లో పరిశీలించిన పుట్టా సురేంద్రబాబు సత్యాన్వేషణ మండలిని స్థాపించారు. మొదట మేలుకొలుపు పత్రికను ప్రారంభించారు. అదే ఇప్పుడు వివేకపథం పత్రికగా పాఠకుల చేతుల్లో వుంది. సరియైన జ్ఞానమే మనిషికి సత్ఫలితాలనిస్తుంది. సరియైన జ్ఞానము ఏర్పడాలంటే శాస్త్రీయ దృక్పథం కావాలి. అంటే సరిగా చూడగల నేర్పు కావాలి. సరిగా చూడగల నేర్పును లక్షణ ప్రమాణ విద్యద్వారా పొందవచ్చు. దానిని సత్యాన్వేషణ మండలి అందిస్తుంది. సామాజిక బాధ్యతలపట్ల మనిషి ఎలా వుండాలో సమాజానికి మనిషి ఎన్నిరకాలుగా ముడిపడి వున్నాడో మండలి చూపిస్తుంది. అంటే మనుషుల్లో సామాజిక స్పృహ కల్గించడం మండలి తన కార్యంగా ఎంచుకున్నది. స్వతంత్ర ఆలోచనాపరుల్నిగా తయారుచేయటమే మండలి లక్ష్యం - అంటూ మండలి భావజాలంలోని అనేక అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు.
తరువాయి శీలం నాగార్జున మాట్లాడుతూ - ''అన్నీ తెలుసు అనుకునేవారు, మేమే ఎక్కువ చదువుకున్నవారం అనుకున్నవారు నూతన విషయాలు తెలుసుకోలేడు. ప్రతిమనిషికీ తెలిసింది, తెలియనది, తెలుసుకోవలసిన అవసరమున్నది అనేవి వుంటాయి. ఉన్నది ఉన్నట్లుగా తెలిపే వాస్తవిక దృష్టి లక్షణ ప్రమాణ విద్యద్వారా అలవర్చుకోవచ్చు.
బిడ్డలు ఎదగాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకోవటంలో తప్పులేదు. కాని పనిచేస్తూ ఎదగడం నేర్పాలి. పని సంస్కృతి అలవర్చాలి. విలాసాలకు పిల్లల్ని దూరంగా వుంచాలి. మంచి భావాల్ని వారి బుర్రల్లోకి చొప్పించాలి. సామాజిక సమస్యలు వ్యక్తుల సామూహిక ప్రయత్నాలు అంటే ఉద్యమాలద్వారానే తీరతాయి. సరియైన వ్యక్తుల నిర్మాణం బాల్యం థనుంచే జరిగితే సమాజం క్రమంగా మెరుగైన థల్లో నడుస్తుంటుంది - అంటూ పౌరుల సామాజిక బాధ్యతల్ని వివరించారు.
ఇంకా ఇతర సభ్యులు స్థానిక సమస్యలు గురించి ప్రస్తావించారు. స్థానిక సమస్యలు అందరూ కలసి పరిష్కరించుకోవాల్సినవని, కాకుంటే అందరూ దానికి చొరవగా ముందుకు రారని, సామాజిక స్పృహకలవారు, ముఖ్యంగా మండలి కార్యకర్తలు దానికి మార్గదర్శకులు కావాలని జగన్‌ సూచించారు. శ్రీమతి సమీర మాట్లాడుతూ-సంస్థలన్నీ ఒకేరకంగా చెప్తుంటాయని, సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు కావలని, అలాగే పసలేని ఉపన్యాసాలు నిష్ప్రయోజనమేమని ప్రజల్ని కదిలించే రీతిలో ప్రసంగాలు వుండాలనే సద్విమర్శ చేశారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసేవారు, సమాజంలో మేధావులు అనే రెండు రకాల ప్రజలకు మండలి తన భావజాలాన్ని అందించే ప్రయత్నం చేస్తుందని, సామాన్యజనం ఈ రెండు రకాల ప్రజల్ని అనుసరించి పోతుంటారని జగన్‌ వివరించారు.
సమావేశం బాగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, పాఠకులుగా సమావేశం గురించి కబురందుకున్నవారు ఎక్కువమంది రాకపోయినప్పటికీ, వచ్చిన కొద్దిమందీ, మరియు కొత్తవారూ చర్చలో ఆసక్తిగా పాల్గొని ఉత్సాహం కనపరిచారు. సమావేశం ఈ విధంగా మిశ్రమ ఫలితాన్నిచ్చిందని చెప్పవచ్చు.

No comments:

Post a Comment