Friday, May 1, 2009

మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు


మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు
ముందుగా ప్రకటించినట్లుగానే సమావేశాలు 26-4-2009 ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రభావం, వేసవి వాతావరణ ప్రభావం సభ్యుల హాజరుపై ప్రభావం చూపింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా వున్న సభ్యులు కొందరు ఎన్నికల కార్యక్షేత్రంలో క్రియాశీలంగా ఉన్న మరికొందరు, వేసవి ఎండలకు ఆరోగ్యం సరిలేక మరికొందరు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఆ కారణంగా 20 మంది మాత్రమే హాజరయ్యారు.

26-4-09 ఉదయం 9 గంటల నుండి 10-30 గంటల వరకు ఎన్నికల సమీక్ష జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పార్టీలలో తులనాత్మకంగా చూస్తే 'లోక్‌సత్తా' బాగుందని, రాజకీయాలపట్ల నిర్లిప్తంగా వున్న విద్యావంతుల్లో కొంత కదలిక కనబడుతుందని, రాబోయే 2014 ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటినుండే ప్రణాళిక ఏర్పరచుకుని, కార్యకర్తలకు శిక్షణా, అవగాహన కలిగిస్తే మెరుగైన ఫలితముంటుందని అభిప్రాయాలు వ్యక్తమైనాయి.
ఆ తరువాత 'మండలి విస్తరణ' అంశముగా జరిగిన చర్చలో జిల్లాల పాఠకుల సమావేశములు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో జరిగాయని, వివరాలు ఆయా జిల్లా సమావేశాల రిపోర్టుల్లో వివేకపథం పత్రికలో చూడవచ్చు. తూర్పుగోదావరిజిల్లా, వరంగల్‌, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, త్వరలో జరుగుతాయని తెలయపర్చారు. జరిగిన సమావేశాల్లో ఇప్పటికి సుమారు 50కి పైగా సభ్యత్వాలు నమోదు అయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు జరిగాయి. అవి :
1. జిల్లా కమిటీలు, శాఖా కమిటీలు ఏర్పరచి సభ్యులకు సమావేశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి.
2. సభా సమావేశాలు, కనీసం 15 రోజులకొకసారైనా జరుపుకుని త్రైమాసిక సమావేశాలు కూడా జిల్లాల వారీగా జరుపుకోవాలన్నారు. ఈ జిల్లా త్రైమాసిక సమావేశాలు, మండలి కేంద్ర కార్యాలయంలో జరిగే త్రైమాసిక సమావేశాలకు ముందే నిర్వహించుకుంటే బాగుంటుందన్నారు.
3. పాఠక సమావేశాలు అనుకున్న సమయంలో ప్రారంభం కావటంలేదని ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు.
త్రైమాసిక సమావేశాలకు రాలేకపోయిన నారాయణరెడ్డిగారు గుంటూరులో, జి.వెంకటేశ్వరరావుగారు తణుకులో తదుపరి పరిచయ సమావేశాలు నిర్వహించగలమని కబురందించారు.
27-4-09న మండలి భావజాలంపై లోతైన పరిశీలన జరిగింది. క్లుప్తంగా చర్చించబడిన భావజాలం ఇలా వుంది :
1. వ్యష్టి సమష్టి శ్రేయస్సు ప్రధాన లక్ష్యం. వ్యష్టి ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు పోటీ యేర్పడినప్పుడు సమష్టి ప్రయోజనానికే విలువ యివ్వాలంటుంది. కాని లోకంలో ఇప్పటికే ప్రచారంలో వున్న వ్యష్టి ప్రధానవాదానికి, సమష్టి ప్రధానవాదానికి మండలి భావానికి వున్న తేడాను గమనించాలి. ఒక వ్యక్తిని సమష్టికోసం త్యాగం చేయమనే హక్కు సమష్టికీ వుండకూడదు. అలాగే సమష్టిని బలిచేసి వ్యక్తి ప్రయోజనం పొందటాన్ని అంగీకరించదు.
2. ఆస్తికమూ-నాస్తికము రెండూ అనిర్ధారితాలు.
3. పదార్థం ముందు, చైతన్యం ముందా అన్నది, పుట్టుకకు ముందు ఏమిటి? మరణం తరువాత ఏమిటి? సృష్టికి ముందు, ప్రళయం తరువాత అన్న వాటికి సంబంధించిన విషయాలు అనేవి తేలేవికావు. మనిషి వాటి గురించి ఆలోచించటం కంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు మనయొక్క మరియు మనతో సంబంధింపబడినటువంటి బాగోగుల గురించి ఆలోచించటం మంచిది.
4. సమాజం బాగుండాలంటే సమస్యలని గుర్తించాలి. ఉమ్మడి సమస్యలన్నవాటిమీద ఉమ్మడిగానే ఉద్యమించాలి.
5. సిద్ధాంతకారులు, వివిధ సిద్ధాంతాలు అనుసరించేవారు. సత్యానికే పెద్దపీట వేయాలి. సత్యానికే ప్రాధాన్యత యిచ్చే ఆలోచనాపరులు మాత్రమే ఒక్కతాటిపైకి రాగల్గుతారు.
6. వ్యక్తులలో స్వతంత్రాలోచన, సక్రమాలోచనను పెంచాలంటే లక్షణప్రమాణ విద్య సాధనంగా వుంటుంది.
7. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలలో ప్రత్యక్ష ప్రమాణార్జిత జ్ఞానము బలమైనది. అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణార్జిత జ్ఞానాలు సరియైనదో, కాదో తేలాలంటే ప్రయోగము (ప్రత్యక్షమే) శరణ్యం. (అదీ సరైన ప్రయోగమే అనే అర్థం చేసుకోవాలి).
8. వ్యక్తులు సరియైన జ్ఞానం ఆర్జించేందుకు కొన్ని నియమాలు పాటించవలసి వుంటుంది. అవి :
ఎవరు చెప్పారన్నదికాక, ఏం చెప్పారన్నదానికి విలువ యివ్వాలి. పూర్వ నిశ్చితాభిప్రాయాల ప్రభావంతో విషయ పరిశీలన చేయరాదు. వాస్తవిక దృష్టితోనే సత్యాన్వేషణ చేయాలి. విచారణలో ఒప్పని నిగ్గుతేలినదాన్ని స్వీకరించాలి. తప్పని ఋజువైనదాన్ని వదిలేయాలి. తప్పో, ఒప్పో తేలని వాటిని పరిశీలనలో వుంచాలి.
సత్యము విషయంతోటే ముడిపడి వుంటుంది. మండలి సభ్యులు తమ వ్యక్తిగత జీవితాల్లో ముఖ్యంగా 3 నియమాలు తప్పక పాటించాలి. అవి : సమయపాలన, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, చేస్తానన్న పనిని మనసుపెట్టి చేయటం.
9. వ్యక్తులు జీవితంపట్ల సరియైన అవగాహన పొందాలి. శారీరక, మానసిక ఆరోగ్యములకు, సమతుల్య ఆహారము, పుష్టికరమైన ఆహారము, తగిన వ్యాయామము చేయాలి. నిత్య అధ్యయన శీలిగానూ, పరిశీలన స్వభావిగానూ వుండాలి. నైతికవర్గన కలిగి వుండాలి. భోగజీవితానికి అంటే విలాసాలకు జీవితంలో తావివ్వకుండాలి. గుర్తింపుకై తపన పడరాదు. గురువు వేషం వేయవద్దు. ఆ జీవితం సాధకుడిగా వుండాలి. పనిచేస్తూనే నిండు నూరేళ్ళు జీవించటానికి ప్రయత్నించాలి.
10. సమాజం మనకు ఏమి యిచ్చిందనేకంటే, సమాజానికి మనం ఏమి యిచ్చామన్నది ఆలోచించాలి. నేను నాది నుండి మేము మాదికి, ఆ తరువాత మనము-మనది స్థాయికి మనిషికి ఎదగగల్గాలి.
11. కుల, మత, లింగ, వివక్షతలకు దూరంగా వుండాలి. వసుధైక కుటుంబ భావన ఆదర్శంగా మెలగాలి. ఉత్తమ సమాజం ఆదర్శంగా, మెరుగైన సమాజంకోసం ఉద్యమకారులు ప్రయత్నించాలి.
12. సుశిక్షితులైన కార్యకర్తలను ప్రభుత్వంలోని కీలకరంగాల్లోకి ప్రవేశపెట్టాలి. రాజకీయాలపట్ల అవగాహన కలిగి వుండాలి. క్రియాశీలంగా వుండాలి. కాని అధికార రాజకీయాలకు దూరంగా వుండాలి.
13. విశ్వాసము లేక మనిషి జీవించటం కష్టం. కాని వ్యక్తికీ మత గ్రంథాలలో వుండే విషయాలపట్ల వుండే విశ్వాసానికి, సైన్స్‌ విషయాలపట్ల వుండే విశ్వాసానికి తేడా వుంటుంది. అవసరమైతే, అవగాహన చేసుకోగల సమర్థత వుంటే సైన్స్‌, వెలిబుచ్చు అభిప్రాయాలు ఋజువుకు అందుతాయి. కాని మత గ్రంథాలు చెప్పే విశ్వాస సంబంధమైన విషయం ఋజువయ్యేవికావు.
14. కుతర్కం, కేవల తర్కంలకు తావివ్వక, అనుభవాంగ తర్కాన్ని అనుసరించాలి. సత్యాసత్యాల వివేచనకు లక్షణ ప్రమాణ విద్య నేర్వడమొక్కటే మార్గం.
ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రాతిపదికల్ని సమావేశం చర్చించింది.
సాయంత్రం సురేంద్రగారు రచించిన నూతన వివాహ విధిని నిర్వహణను రిహార్సల్‌ చేశారు. జగన్‌ నిర్వాహకునిగా ఈ ప్రాక్టీస్‌ జరిగింది.
28-4-2009న ముందు మండలి సభ్యులంతా మండలి భావజాలాన్ని క్లుప్తంగా, కొత్తవారికి 5, 10 నిమిషాల్లో ఎలా వివరిస్తారో ప్రసంగించారు. ఈ సందర్భంగా సురేంద్రగారు ప్రసంగీకులు తమను కేటాయించిన సమయాన్ని, విషయాన్ని వక్తలు దాటిపోకుండా చూడాలని సూచించారు. బట్టీయంపట్టి చెపుతున్నట్లుకాక, తమతమ సొంత మాటల్లో ప్రసంగ పాఠాన్ని తయారు చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రసంగాల అనంతరం సభ్యులు తమ అభిరుచిమేర విషయాన్ని ఎంచుకుని ఒక్కొక్కరు సుమారు 15 నిమిషాలసేపు ప్రసంగించారు- ముఖ్యమైనవి ప్రస్తావిస్తాను.
కోట ప్రసాద్‌గారు : శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై ప్రసంగించారు. క్లుప్తంగా-శాస్త్రీయ దృక్పథం అంటే సరైన, తగిన, నిర్ధారించుకున్న అభిప్రాయం. అనుభవం-అభిప్రాయానికి-అభిప్రాయానికి ఊహ జోడై దృక్పథానికి దారితీస్తుందని చెప్పారు. ప్రతి అభిప్రాయము దృక్పథానికి దారితీస్తుందనిచెప్పారు.ప్రతి అభిప్రాయము దృక్పథము కాదు. కాని ప్రతి దృక్పథమూ అభిప్రాయమే.
అభిప్రాయాలు స్థిరీకరణే దృక్పథము అనవచ్చు. ఒక్క అనుభవంలో కూడా దృక్పథం ఏర్పడవచ్చు. కాని దానికి పూర్వం వున్న అలాంటి అనుభవాలే వాటికి ఆధారం. దృక్పథాలు ఏర్పడటానికి ఆధారం స్వీయానుభవాలు లేదా వినికిడి ద్వారానూ కావచ్చు. ఒక్కసారి వినడం ద్వారా కూడా దృక్పథం ఏర్పడవచ్చు. అది చెప్పినవారిపై వున్న దృక్పథంపై ఆధారపడి వుంటుంది. మనపై మనకు కూడా దృక్పథం ఏర్పడవచ్చు. దృక్పథానికి మరో వేరే గట్టి నమ్మకం అనవచ్చు.
ముందే ఏర్పడ్డ అభిప్రాయాల నుండే దృక్పథాలు ఏర్పరచుకోవడం అనేదాని పట్టునుండి మనిషి బయటపడాలి. ఇది దానంతటది రాదు. మనిషి అలవర్చుకోవాలి. వివేచనా పూర్వకంగా ఏర్పరచుకునే దృక్పథాన్నే శాస్త్రీయ దృక్పథం అంటాము -అంటూ ముగించారు.
తరువాత మోషే 'ప్రజాస్వామ్యం' గురించి ప్రసంగించారు. దాని సారాంశం : ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే అమల్లో వుంది. ఈ సమాజాన్ని మనిషే ఏర్పరచుకున్నాడు. ఆపై అనేక విధాలుగా మార్పుచెందుతూ వచ్చింది. చివరకు ప్రజాస్వామ్యం దగ్గరకొచ్చి ఆగింది. ప్రజాస్వామ్యం అంటే సర్వస్వతంత్రమైన ప్రజలచే నడపబడే వ్యవస్థ. ప్రజలచే ఎన్నుకొన్న ప్రతినిధి ప్రజలపై పెత్తనం చెలాయించడం నేడు జరుగుతుంది. రాజకీయపార్టీలు కూడా గెలుపు గుర్రాలనేపేరుతో అంగబలం, ఆర్థికబలం ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. అంతేకాక పార్టీకో, పార్టీ నాయకుడికో ఎవరు అణకువగా వుంటే వారికే టిక్కెట్లు యిస్తున్నారు. చివరిగా ఓటుకు ఓటు విలువ తెలియజెప్పే ఒక సినిమాపాటపాడి ముగించారు.
సిహెచ్‌.వెంకట్రామయ్యగారు భారతదేశ పరిస్థితులను, దేశ స్వాతంత్య్రంకాలం నుండి నేటి థకు క్రమంగా ఎలా మారుతూ వచ్చాయో వివరించారు. భూస్వామ్య వ్యవస్థ బలంగా వున్న రోజుల్లో స్వాతంత్యం వచ్చిందని క్రమంగా రాజ్యాంగాన్ని కూడా సెక్యులర్‌, సోషలిస్తు, వ్యవస్థ ఆదర్శంగా సవరించుకున్నదని తెలిపారు. కులాన్ని దాటి ఆలోచిస్తే సంఘమని, మతము దాటి ఆలోచిస్తే మానవత్వమని, దేశం దాటి ఆలోచిస్తే విశ్వశాంతియని చెప్పారు. 1976 ఎమర్జెన్సీ వరకు సుస్థిర ప్రభుత్వము కేంద్రంలో వుంటూ వచ్చిందని ఆ తరువాత జనతా ప్రభుత్వము, ఆపై నేషనల్‌ ఫ్రంట్‌, ఆపైన అన్ని సంకీర్ణ ప్రభుత్వాలేనని, అంటే ప్రభుత్వము స్థిరంగా లేదని పాలకపక్షము ఒకటంటే, ప్రతిపక్షము మరోటి అంటుందని, అభివృద్ధి అంతా అతలాకుతలమవుతుందని చెప్పారు. దేశంలో ప్రతిచోటా అవినీతి వ్యాపించి వుందని చెప్పారు. ఇలా అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ ముగించారు.
తరువాత రహ్మాన్‌గారు 'సంబంధాలు' అన్న అంశంపై మాట్లాడుతూ-సంబంధాలు అనేకం. అన్నింటి గురించి ఒక ప్రసంగంలో చెప్పలేమని, సమాజంలో స్నేహ, కుటుంబ, రక్తసంబంధాలు వంటి అనేక సంబంధాలు వున్నాయి. మనమంతా ఉద్యమకారులం అన్నదాంట్లో సందేహంలేదు. కావున మనకు ఈ సంబంధాలు గురించి తెలిసి వుండటం, మంచి సంబంధాల్ని కలిగి వుండడం చాలా కీలకం. మనం సమాజహితులమేనని ఇతరులకూ అనిపించేలా మన ప్రవర్తన వారితో వుండాలి. సంబంధాలు ఏర్పరచుకోవటమేకాదు. వాటిని పటిష్టపరచుకోవడం కూడా చాలా ముఖ్యము. వ్యక్తులందరూ ఒకేరకంగా వుండరని, ఎన్నోరకాల వ్యక్తులున్నారన్నది గ్రహించకుంటే సత్సంబంధాలు నెలకొల్పుకోవటం కష్టమవుతుంది. ఒక పని చేయటానికి నీకు కేటాయించినదానికంటే ఎంత అల్పమైనా ఎక్కువ తీసుకోవటానికి సిద్ధపడితే నీలో అవినీతి విత్తనం మొలకెత్తినట్లే. ఎదురయ్యే వ్యక్తులలో తెలిసినవారు, తెలియనివారు, తెలియకనే తెలుసు అనుకుంటున్నవారుంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్కవిధంగా ప్రవర్తించాలి. ఎదుటివారి భావాలకు దెబ్బతగలకుండా వుండేరీతిలో ప్రవర్తిస్తేనే సంబంధాలు నిలకడగా కొనసాగుతాయి. వ్యక్తుల్లో స్వార్థులు, ధార్మికులు, త్యాగులు అనే రకాలుగానూ వుంటారు. వీరితో మన ప్రవర్తన కూడా వేరువేరుగానే వుండాలి. సాధారణంగా మనం చెడ్డ వ్యక్తులకు దూరంగా వుండాలి అంటారుకాని సమాజ సంస్కరణ కోరేవారు బాగుచేయాల్సిన చోటుకు దూరంగా వుండకూడదు. అంటే త్యాగులతోనూ, ధార్మికులతోనేకాక, స్వార్థులతోకూడా మనం సంబంధాలు కొనసాగించాలి. సమాజంలో ఎవరితోనూ మనం సంబంధాలు తెగతెంపులు చేసుకోకూడదు అని ముగించారు.
తరువాత శీలం నాగార్జునగారు వక్తాశ్రోతల నైపుణ్యతలపై మాట్లాడారు. ఒక్కొక్కసారి శ్రోతలు విన్నట్లుగా కనబడతారు; వింటున్నట్లు తలాడిస్తూ వుంటారు. కానీ పూర్తిగా విన్నారని చెప్పలేము.
ఇది కేవలం ఏదో విని చెప్పటంలేదు. అనుభవాలున్నాయి. సరిగా వినకపోవటానికి కారణాలేమిటి అంటే - అన్యమనస్కత, పూర్వనిశ్చిత అభిప్రాయాలు పెట్టుకోకపోవటం, ఏమి చెపుతున్నారో అర్థంకాకపోవటం, ఇలా అనేకం వున్నాయి. సరిగా వినటంలాగే సరిగా మాట్లాడటం కూడా కళే. చక్కగా ప్రసంగిచాలంటే భాషమీద పట్టు, విషయంపై అవగాహన కావాలి. ఈ రెండూ అధ్యయనం మీద, సాహిత్యాభినివేశంమీద ఆధారపడతాయి. మాట్లాడే వ్యక్తి స్పష్టంగా, స్ఫుటంగా మాట్లాడడం, నిర్దిష్టమైన పదాలు వాడటంలో నైపుణ్యత సాధించాలి. దీనికి తగినంత అభ్యసనం, సాధన కావాలి. అంతేకాక స్వరస్థాయికి సంబంధించిన అవగాహన, స్పృహ, క్రియాకౌశలం వుండాలి-అంటూ వివరించారు.
మిగిలిన సభ్యులందరూ అనేక విషయాలపై క్లుప్తంగా ప్రసంగించారు. స్థలాభావంవల్ల ప్రచురించలేకపోతున్నాం. సమావేశాలు సాయంత్రం 4 గంటలకు ముగిశాయి.

No comments:

Post a Comment