Wednesday, July 1, 2009

సంపాదకీయం - జూలై 2009 - 156



యోచనాశీలురైన పాఠకమిత్రులారా! ఏకాలానగానీ, ఆ కాలానికి సమీపంలో ఏర్పడివున్న ఉండగూడని పరిస్థితులను గమనించి వాటిని పోనాడనెంచిన ంచి మనుషులు వుంటూనే వున్నట్లు చరిత్ర సాక్ష్యం చెపుతోంది. మనతరంలోనూ అట్టివి పుట్టి, కొనసాగుతూనే వున్నాయని మీ అందరకూ తెలిసిందే. అదే వరవడిని అందిపుచ్చుకున్న వారిలో కొందరం ఈనాడు అలాంటిదే ఒకపెద్ద ప్రయత్నం చేద్దామనుకుని చిన్నగా మొదలెట్టి ఒక పథకాన్ని గురించిన వివరాలు ఈ వ్యాసం ద్వారా మీముందుంచుతున్నాను. సావధానంగా చిత్తగించి, ఆపై మించి మీవంతు పాత్రను పోషించి జరగబోయే పనికి ఊపందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

స్వతంత్రం వచ్చి 60 ఏండ్లు పైబడినా, స్వతంత్ర భారతాన్ని కోరుకున్నవారుగానీ, రాజ్యాంగ నిర్మాతలుగానీ ఆశించినరీతిలో, దేశం సాధించుకున్న సంపద, వనరులు ప్రజలందరకూ సక్రమంగా చేరలేదన్నది నిప్పులాంటి నిజం, అందరిహితం అన్నదృష్టికల వారికి మింగుడుపడకున్నా మ్రింగక తప్పని చేదునిజం.
ఈమధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎన్నెన్నో రకాల సమస్యలపై పరిష్కారదిశగా పోరునారంభించినా అవేవీ సంతృప్తికరంగా సత్ఫలితాలను సాధించిన దాఖలాలు లేవు. అందులో అవసరాల వత్తిడి తెచ్చిన తాత్కాలికావేశాల నుండి పుట్టుకొచ్చిన సంస్థలూ, యత్నాలే ఎక్కువ. అవసరపు వత్తిడి తగ్గడంవల్లనో, ఆవేశపు ఉధృతి నిమ్మళించడంపట్లా, అట్టి యత్నాలన్నీ క్రమంగా నీరసించిపోవడం, ఆయా సంస్థలు పేరుకు ఉన్నాయనుకునేలానే మనుగడ సాగిస్తుండడం జరుగుతూ వస్తోంది.
దాదాపుగా ప్రతి సామాజిక సమస్య పరిష్కారానికీ అవసరమైయున్న సమష్టి-సంఘటిత యత్నాలన్నవి, అందుకై పుట్టుకొచ్చిన సంస్థల, వ్యక్తుల అవగాహనాలోపంవల్లగానీ, వైయుక్తిక ప్రాధాన్యతలవల్ల చోటుచేసుకున్న అనైక్యతలవల్లగానీ-బలంగా సాగకపోగా, ఆరంభంలో ఒకటిగా గుమిగూడినవారిలోనూ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోవడం జరుగుతూ వస్తోంది.
వీటన్నింటినీ క్రోడీకరించిచూస్తే, నిశితంగా చూడగల ఒడుపున్న విచక్షణాశీలికి ఒక విషయం స్పష్టంగా గోచరిస్తుంది. ఈనాడు సమాజంలో ఒక సమగ్రమైన, బలమైన సామాజికోద్యమం రూపుదిద్దుకోవలసిన అవసరం వుంది.
అయితే, ఆ ఉద్యమం దాని సరైన అర్థంలో పై, సమగ్రమైన, బలమైన అన్న రెండు లక్షణాలను కలిగి వుండేలా ఆకృతి దాల్చాలంటే, అందుకు శాస్త్రీయ దృక్పథము, లోతైన అవగాహన, చూస్తూ ఊరుకుండలేని మానసిక తపన, కార్యకుశలత అన్న సామర్థ్యాలు కల అనేకమంది మేధావుల సమష్టి కృషి అవసరమై వుంది. ముందుగా సరైన సమగ్రమైన భావజాలాన్ని రూపొందించుకోవాలి. అందుకై ఎంతో మేధోమదన జరగాల్సివుంది. పిదప ఉద్యమనిర్మాణానికి అవసరమైన పథకరచన, పిదప ఉద్యమ కార్యాచరణకు చెందిన పథక రచన జరగాలి.
ఆపై దానిని సద్విమర్శకులైన, సూక్ష్మ విమర్శకులైన మేధావుల సమీక్షకు పెట్టాలి. పథక రచనలో చోటుచేసుకునే వివిధాంశాలకు చెందిన విశేషజ్ఞుల సహాయ, సహకారాలనూ తీసుకోవాలి. దీనిని తక్షణావసరమైన ముఖ్య కార్యక్రమంగా భావించి వీలయినంత ఎక్కువమందిమి ఇందుకు పూనుకుని, సాధ్యమైనంత త్వరగా భావజాలాన్ని రూపొందించాలి. ఇక్కడికిది సిద్ధాంత భాగమవుతుంది.
ఆపై దానిననుసరించి థలవారీ కార్యాచరణకు సిద్ధపడాల్సి వుంటుంది. సిద్ధాంత భాగంలోనే ఆచరణలో పాల్గొనేవారి గుణగణాలు, శక్తిసామర్థ్యాలకు సంబంధించిన అంశాలూ చోటుచేసుకునుండాలి.
'కర్త-ఉద్దేశము, పరికరాలు - విధానము - పని = ఫలితము' అన్న సాధారణ సూత్రానికి చెందిన ప్రతి స్థానానికి సంబంధించిన అవగాహనతో కూడిన వివరణ వుండాలి సిద్ధాంత భాగంలో. కర్త స్వతంత్రుడై వుండడం, ఉద్దేశం స్పష్టంగా, తీవ్రంగా వుండడం, పరికరాలు శుద్ధంగా శక్తివంతంగా వుండడం, విధానం సరైందీ, సమగ్రమైనదిగా వుండడం- పని తగినంతస్థాయిలో ముగింపుకొచ్చేదాకా సాగుతుండడం అన్నవాటిని కారణసామగ్రి అనంటాము. కారణ సామగ్రి సరిగా సమకూడితే అనుకున్న ఫలితాలు వచ్చితీరుతాయి. దీనినే కార్యకారణ నియమం అనంటారు. ఫలితాలు అనుకున్నట్లుగా రాలేదంటే కారణ సామగ్రిలో ఎక్కడోచోట లోపమేర్పడిందన్నమాటే. కనుకనే సిద్ధాంతభాగం సమగ్రంగా వుండాలి. సమ్యద్జాన పూర్వకా సర్వపురుషార్ధ సిద్ధిః అన్నది విధం తెలిసినవారిమాట. ఏది సాధింపబడాలన్నా ఆధారంగా ముందుగా సరైన జ్ఞానం మార్గనిర్దేశకంగా వుండితీరాలి అని ఆ మాటకర్థం-నిజానికిది ఎవరమూ కాదనలేని భావము.
కనుకనే మిత్రులారా! అట్టి కృషి ఇప్పటికే మొదలెట్టిన మేము కొందరం మరెందరో ఈ కృషిలో భాగస్వాములవడం మేలన్న సదాశయంతో విషయాన్ని నలుగురిముందుకూ తెస్తున్నాము. సామాజిక పరిణామక్రమగతిలో మేధావులపాత్ర అనితరసాధ్యమైనది. సమాజంలో మేధావులపాత్ర శరీరంలో తలపాత్రవంటిది. తల ఎలా మొత్తం శరీరంయొక్క యోగక్షేమాలపై దృష్టిపెడుతుందో, అలాగే మేధావులూ మొత్తం సమాజపు యోగక్షేమాలపై దృష్టిపెట్టాల్సి వుంది. అలాకాక మేధావులే గనుక ఏదోఒక భాగపు సంక్షేమానికి పూనుకుని, మొత్తం సమాజపు విషయాన్ని పట్టించుకోకున్నా, విస్మరించినా ఆ మేధ రోగగ్రస్థమైందన్నమాటే.
గమనిక : శరీరంలో ఏదేని ఒక భాగానికి అందవలసినవందకున్నా, ఆ భాగానికేదైన జరక్కూడనిది జరిగినప్పుడు దానిని సరిచేయడానికై, తల ఆ భాగంపై ప్రత్యేకదృష్టి కనబరచడం వుందే అది అనారోగ్య సూచకంకాకపోగా, ఆరోగ్య సూచకంకూడా. ఆ ప్రత్యేకత కనబరచడం వెనక లక్ష్యం శరీర సమగ్రాభివృద్ధిని కాంక్షించడమే అవుతుంది. అలాకాక, ఆ ప్రత్యేకశ్రద్ధ ఆ భాగాన్నే తనదిగా తలచడంగా పరిణమించి, మిగిలిన భాగాలకు అందాల్సినవి అందుతున్నాయో లేదో పట్టించుకోనితనంవరకు సాగితే మాత్రం అది బలమైన రోగరూపమే అవుతుంది. శ్రుతిమించని-అతికాని-అవసరమైన ప్రత్యేకశ్రద్ధ అన్నంతవరకు ఆ శరీరం విషయంలో ఆ తలభాగపు బాధ్యతేగాక, విధికూడా అవుతుంది. అదే మరి ఆ హద్దుదాటితే ప్రమాదకరమైన రోగకారణం అవుతుంది. ఇది చాలా సూక్ష్మమైనదీ, కీలకమైనదీ కూడా.
ముగింపు : భారత సమాజం సమగ్రాభివృద్ధినందలేదన్నది వాస్తవం. అభివృద్ధిచెందినంతమేరనైనా ఆ ఫలాలు ప్రజలందరికీ యోగ్యమైనరీతిలో అందలేదన్నది అంతకంటే ముఖ్యమైన నిజం. ఏ మేరకు అభివృద్ధినందినా ఆమేరకు ప్రజలందరికీ భాగం అందాలన్నది వివేకవంతమైన ఏ సామాజిక ఒప్పందంగానీ నూరుశాతం అంగీకరించాల్సిన షరతు. దీనినే నేను, రాజ్యం ప్రజలదగ్గరకు చేరలేదు' అన్న వాక్యంద్వారా చెపుతున్నాను. ఆ పని సక్రమంగా జరగాలంటే ఒక బలమైన సామాజికోద్యమం నిర్మాణమై ఉద్యమించాల్సి వుంది.
ఈమేరకు అవగాహన కలగడం వేరు, అది ఎలా వుండాలి, ఎలా కదలాలి అన్నది నిర్ణయించడం వేరు. దానికో సిద్ధాంతము-ఆచరణలు కలబోసుకున్న ఆకృతినివ్వడానికి ఎందరో మేధావుల సమష్టి కృషి అవసరం.
సమాజం బాగుండాలన్న గుండె, అందుకు నావంతు పాత్ర పోషణలో వెనకుండను అన్న సంసిద్ధత, మేధోసామర్థ్యము ఉన్నవారందరినీ మండలి, ఐక్యమిత్రమండలి తరఫున సాదరంగా ఆహ్వానిస్తోంది. మేధోభాగంలో సమర్ధులైన వారందరూ ఇందుకు పూనుకోండని విజ్ఞప్తిచేస్తోంది.
1) బలమైన సామాజికోద్యమం అంటే ఏమిటి?
2) ఈనాడు దాని అవసరముందా? అంటే అదెందుకు?
3) దానిని నిర్మించుకోవడం ఎలా?
4) దానిలో చోటుచేసుకుని వుండాల్సిన ప్రధానాంశాలేమిటి?
5) ఉద్యమ చట్రంలోని అంశాలు, ఉద్యమకారులకు చెందిన అంశాలు ఏమిటి?
అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని మీమీ భావాలను ఒక వ్యాసరూపంలో మాకు పంపండి. జులై 15, 20 తేదీలనాటికి మాకందేలా పంపగలిగితే కొనసాగింపు కార్యక్రమానికి అనువుగా వుంటుంది. అంతా సవ్యంగా సాగి అలాంటి ఉద్యమ వేదిక ఆరంభమైతే అందులో భాగస్వాములు కాగోరు, కాగలిగినవారూ వారి వివరాలను మాకందించండి.
మంచి సమాజం లక్ష్యంగా, ఉద్యమాభినందనలతో మీ సురేంద్ర

No comments:

Post a Comment