ఆదర్శ వివాహాలు, సంస్కరణ వివాహాల పేరిట జరిగిన, జరుగుతున్న పెళ్ళిళ్ళలో రెండు రకాల ఉండకూడనితనాన్ని గమనించాను నేను. ఒకటి సాంప్రదాయ పెళ్ళిళ్ళలోని కొన్ని లోపాలను, మరీ భూతద్దంలో పెట్టి చూపించడం, అది తెలియజెప్పడానికే ఈ వేదిక ఏర్పాటు చేశాం అన్నంతగా ప్రవర్తించడం, అనవసరపు, అసభ్యపు స్థాయిలో అశ్లీలమైన భాషణ, వర్ణనలనూ జోడించి మరీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం, రెండు వివాహాలలో మామూలుగా జరిగే అట్టహాసాలకు, ఆడంబరాలకూ, హోదా ప్రదర్శనలకు, విపరీత శబ్దకాలుష్యానికి దీటుగానే దుబారా చేస్తుండడం.
ఈ రెండంశాలదగ్గర వివేకవంతమైన మార్పు చేయకుండా, సంప్రదాయానికి వేరుగా చేసినంతమాత్రాన వాటిని ఆదర్శ, సంస్కరణ వివాహాలనలేం.
గాంధీగారు రామదాస్ గాంధీ వివాహం సందర్భంగా : బ్రహ్మచర్య పాలన, నేలపడక, ఖద్దరు వస్త్రధారణ ఆచరించాలనడం, కట్నకానుకలుగా నూలు, రాష్ట్రంలాంటి వివ్వడం చేశారు. అట్టివాటినీ ఆదర్శవివాహాలనిగానీ, సంస్కరణ వివాహాలనిగానీ అనలేము. మరోవైపు గోరాగారు కూరగాయలదండల పెళ్ళి, పూలదండలు వాడడం సరికాదులాంటి వాటినీ యోగ్యమైన ప్రత్యామ్నాయ వివాహపద్ధతులనలేం. అలాగే కేవలం 6 నిముషాలలో చెరిరెండు ప్రమాణాలు చేయించి, ప్రమాణపత్రాలపై సంతకాలు చేయించేదానినీ, ఆదర్శప్రాయమైన వివాహపద్ధతి అనకూడదు. చట్టబద్ధత చేకూరడంకొరకు చట్టపరమైన రిజిస్ట్రేషన్ చేయిస్తూనే ఉన్నాంకనుక, ఈ భాగానికి ప్రాధాన్యతేమీ లేదు.
వివాహమంటే కేవలం ఆ ఘటనను చట్టబద్ధం చేయడంకొరకు చేసే నమోదు కార్యక్రమమో, కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని, నాస్తికులు నాస్తికత్వాన్ని, హేతువాదులు హేతువాదాన్ని, పురాణ వ్యతిరేకులు పురాణ వ్యతిరేక ప్రసంగాల్ని, మరికొందరు సంస్కారహీనంగా అశ్లీల, బూతువర్ణనల ప్రసంగాలను చేసుకునే అవకాశవేదిక మాత్రమే కాదు.
అది అటు వధూవరులకు తెలియజేయాల్సిన విషయాలను వారికి తెలియజేయడానికీ, ఇటు సమావేశంలో వున్న మూడు తరాల వారికి మేలు కలిగించే విషయాలు తెలియజేసుకోడానికీ, బంధుమిత్రులంతా సంతోషాన్ని పంచుకోడానికీ ఉపయోగపడే, ఉపయోగించుకోవాల్సిన వేదిక. ఆ స్వరూపాన్ని, స్వభావాన్ని కలబోసుకున్న వాటినే ఆదర్శ లేదా సంస్కరణ వివాహాలనాలి. విషయాల విస్తారమైనదవడంతో ఇప్పటికాగుతున్నాను. మీ సూచనలలో అవసరమైన వాటిని తీసుకుని తగిన మార్పులు చేసే యత్నం చేస్తాను. మంచి సూచనలందించే పనిచేస్తూనే వుండండని కోరుతూ ప్రస్తుతానికి ముగిస్తున్నాను.
స్పం. : మండలికి సన్నిహితులు, మంచి పనికైతే నేనూ ముందుంటాను అనే నైజంకలవారునైన, గుత్తికొండ అహల్యాదేవిగారో వ్యాసం పంపి స్పందించండన్నారు. ప్రత్యుత్తరంగా ఆమెకే ఒక లేఖ వ్రాసి ఊరుకోవడంకంటే, ఆమె రచననూ, వారి అభిప్రాయాన్ని 'స్పందన-ప్రతిస్పందన' శీర్షికన వివేకపథంలో వేస్తే మా సాన్నిహిత్యానికి మరింత న్యాయం చేకూర్చినట్లవుతుందనిపించి ఇదిగో ఇలా మొదలెట్టాను. పాఠకులు ఉచితంగా స్పందించండి, యోగ్యమైన రీతిలో ఆచరణకూ పూనుకోండి.
1) ఆడపిల్ల పుట్టగనే, కొత్త వస్త్రాలతోబాటు అలంకరణ (బొట్టు, కాటుక, గాజులు వగైరాలు, కాస్త ఎదిగాక పూలు, ఆభరణాలు వగైరాలు) చేసి ఆనందిస్తాము.
2) ఆడపిల్లలకు సంబంధించి ప్రతి వేడుకలోనూ, పూలు, పసుపు, కుంకుమ, గంథము, ప్రథమస్థానం వహిస్తాయి. అదే మరి అమ్మాయి వివాహ వేడుకలోనైతే పూలు, పసుపు, కుంకుమ, గంథాలతోపాటు మంగళసూత్రాలు, కాలిమట్టెలు, మంగళప్రదమైన అలంకారాలుగా మారుతాయి. అలంకారం స్త్రీకి జన్మహక్కు.
3) కానీ, దురదృష్టవశాత్తు భర్త చనిపోతే ఏం జరుగుతోంది?
పూలు, పుసుపు కుంకుమ ధరించకూడదనీ, మట్టిగాజులు వేసుకోకూడదనీ, ఉదయాన్నే, ఎవరికీ కనిపించకూడదని ఎదురు రాకూడదనీ, అక్షింతలు వేసి ఆశీర్వదించకూడదనీ, ఆంక్షలు విధిస్తున్నారు. ఇది దురాచారం కాదా? దీనినింకా ఇలాగే కొనసాగనిస్తుండాల్సిందేనా?
4) స్త్రీకి పుట్టుకతో వచ్చిన అలంకరించుకునే హక్కును భర్త చావు బ్రతుకుల్తో ముడిపెట్టడం ఎంతవరకు సబబు? ఒక స్త్రీ అలంకారమంతా భర్తకు ఆనందింపజేయడానికేనా? భర్తలేకుంటే అలంకారంతో పనిలేదా? అత్యంత శోచనీయమైన విషయమేమంటే, భర్త చనిపోయిన స్త్రీ అలంకారం చేసుకుంటే ముందుగా స్త్రీలే వెక్కిరింతగా చూస్తారు. మొగుడు పోయినదానికి సోకులెందుకంటూ ఎద్దేవా చేస్తారు.
ఒకవేళ స్త్రీ అలంకరించుకుంటే పరపురుషులచేత ఆకర్షింపబడి నైతికంగా పతనమవుతుందని ఈ కట్టుబాటు విధించారనన్నా, 'కామాతురాణా నభయం నలజ్జ' అన్న అనుభవజ్ఞుల సూక్తినేమిచేద్దాం. కామం హద్దుమీరితే అలంకరణ ఉందా లేదా అన్నది లెక్కలోకి రాదన్నది నిజంకాదా?
అనేకమంది సంస్కర్తల గట్టియత్నాలవల్ల గతంలో వున్న ఎన్నో దురాచారాలు రూపుమాశాయి. అలాగే ఈనాటికి అమలవుతున్న భర్త చనిపోతే, గాజులు, పూలు, పసుపు, కుంకుమలు తీసేయాలి, ధరించకూడదు అన్న దురాచారాన్ని రూపుమాపుకోలేమా? అందుకు మళ్ళీ ఎవరో సంస్కర్తలు పుట్టుకురావలసిందేనా?
మన ఇరుగుపొరుగు ఇండ్లలోనూ భర్తపోయిన స్త్రీలు తారసపడితే, వారిపట్ల మన ప్రవర్తన ఎలా వుంటోంది? పురుషులు భర్తపోయిన స్త్రీపట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఆత్మావలోకనం చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. భర్తలేని స్త్రీని హీనంగా, జాలాగా చూడాల్సిన పనిలేదు. సాటి మనిషిగా గుర్తించి, గౌరవించడం మేలు.
ఈ దురాచారాన్ని రూపుమాపే విషయంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ప్ర.స్పం.-4 : అహల్యాదేవిగారికి, మంచిదమ్మా! ఒకింత ఆవేశంతో కూడివున్నా అనుచితాన్ని అంగీకరించలేని మీ వైఖరి ఆహ్వానించదగిందే. అందుకోండి; నా అభినందనలు.
పెద్దగా విశ్లేషించాల్సిన పనేమీ లేకుండానే, ఏమాత్రం ఇంగితం పనిచేస్తున్నా భర్త చనిపోయిన స్త్రీ, వాస్తవ జీవితానికి సంబంధించిన ఏ అవసరాన్ని కోల్పోకూడదు అని తీర్మానం చేయవచ్చు. ఆ లెక్కన, ఆమె అలంకరణలను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మరో వివాహం చేసుకోకుండా వుండాల్సిన అవసరం లేదు. వయస్సు మీరిన థలోనూ వివాహం చేసుకోవడమే సరైనది. సమాజం దానిని ప్రోత్సహించాల్సి వుంది.
అయితే సమాజంలోని సాధారణ ప్రజల మనస్తత్వం ఒక వరవడిని అనుసరించడానికి అలవాటుపడి వుంటుంది. 'గతానుగతికో లోకః' అన్న నానుడి అలా పుట్టిందే. కనుక దానినో సాంప్రదాయంగా తలంచి, అలవాటుగా ఆ ప్రవాహాన పడిపోతున్న వారిని నిరసించడానికో, విమర్శించడానికో మన శక్తియుక్తుల్ని ఖర్చుపెట్టడం అనవసరం. మార్పు అవసరమై, మార్పుకై యత్నిస్తున్న ఆరంభ సమయంలో, మనలాంటివారికి, ఆచారంలో పడిపోతున్నవారినుండి ఘర్షణ ప్రతికూలత ఎంతో కొంతమేర వుండనే వుంటుంది. అది సహజం కూడా. అది వారు తెలిసి చేస్తున్నపని అనేకంటే అదే సరైందనుకుంటా, అలవాటుపడి చేస్తున్నది అనడం సరైంది. అట్టివారిపట్ల శతృభావన పెట్టుకునేకంటే జాలిపడడం ఉచితం కనుక వారినలా వుంచుదాం.
ఈనాటినుండే మనం సిద్ధపడి, మనలాంటివారిని కలుపుకుని, చేయందించితే అందుకోగలవారికీ ఈ సందేశాన్నందిస్తూ సాగిపోతుందాం. క్రమానుగతంగా మార్పు జరుగుతూ వస్తుంది. దురాచారాలను రూపుమాపడంలో దానిని విమర్శించుకుంటూ, ఎవరినో ఒకరిని నిందించుకుంటూ సాగేకంటే, ప్రత్యామ్నాయంగా వివేకం, మానవత్వం అంగీకరించే విధానాలను మళ్ళా ఆచారాలనబడేట్లు, చేసుకుంటూ పోవడమే సరైనది. మార్పు అవసరమైన ఎన్నో సందర్భాలకు వర్తించే సాధారణ సూత్రమది. కనుక ప్రస్తుతానికీ విషయంలో మనం కదులుతూ, మరింతమందిని కదిలిస్తూ సాగుతుందాం.
మరోమాట, ఈనాడు పునర్వివాహానికి చట్టబద్ధత ఉన్నట్లే. అస్సలు ఏదైనా ఒక పనిపై చట్టపరంగా నిషేధం లేనంతకాలం దానిని చట్టం అంగీకరిస్తున్నట్లే పరిగణించాలి. కనుక భర్త చనిపోయిన స్త్రీ అలంకరించుకోవడం తప్పుకాదు, దానిపై నిషేధం లేదు. ఉన్నదంతా సాంప్రదాయపు ప్రతికూలత మాత్రమే. గట్టి ప్రయత్నంచేస్తే సమాజం ఇట్టే నోరుమూసుకుంటుంది. ఆపనిచేద్దాం మరి.
గతంలో ఏదో వంకపెట్టినా ఒకరిద్దరు తాత్వికులు ఈయత్నం చేశారు. (1) పోతులూరి వీరబ్రహ్మం తాను సమాధి అయ్యాక ముత్తైదువుతనానికి చిహ్నాలైన వేటినీ విడవద్దన్నాడు. భార్య గోవిందమాంబను. తాను బ్రతికే వున్నానన్న నెపంతోనైనా, ఆ నిర్ణయం చేయడం ఆనాటికో విప్లవాత్మకమైన చర్యే, వెదికితే మరికొన్ని ఆధారాలు దొరుకుతై, వెదకండందరూ!
ఇదిగో ఇప్పుడు నేనో అడుగువేస్తున్నాను. ఒకవేళ నా మరణం, నా భార్యకంటే ముందే సంభవిస్తే నా శ్రీమతి శ్యామల తనకిష్టమైన ఎట్టి అలంకరణలను విసర్జించనక్కరలేదు. నా కుటుంబీకులకు, బంధుమిత్రులకూ, నా సలహాలను పరిగణనలోకి తీసుకునే వారికీ కూడా ఈ విషయంలో, ఎట్టి అరమరికలూ లేకుండా భర్త మరణానంతరం స్త్రీ తనకభీష్టమైన ఎట్టి అలంకరణలను (పూలు, గాజులు, బొట్టు, కాటుక, ఆభరణాలు వగైరాలను) విడవనక్కరలేదని బహిరంగంగా, నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. ఇందుకు సిద్ధపడలేని ఛాందసుల్ని, బలహీనుల్ని పట్టించుకోకండి. మనం సరైన దారి నిర్మించాలేగానీ, ఏదోనాటికి వారూ ఈ దారినే నడవమొదలెడతాడు. పదండి ముందుకు.
అహల్యగారి అడ్రసు : గుత్తికొండ అహల్యాదేవి, జంగంగూడెం పోస్టు, నూజివీడు మండలం, కృష్ణాజిల్లా-521 201.
వివేకపథ పథికునిగా, మీ సురేంద్ర.
No comments:
Post a Comment