వరంగల్‌జిల్లా వివేకపథం పాఠకుల సమావేశం ది.28-6-2009న బాపూజీ స్కూలు, కిషన్‌పుర, హన్మకొండనందు జరిగింది. షుమారు 20 నుండి 25 మంది వరకు వివేకపథం పాఠకులు, మిత్రసంఘాల కార్యకర్తలు జనవిజ్ఞానవేదిక నుండి, మానవ వికాసవేదిక నుండి అలానే అంబేద్కర్ సంఘ జిల్లా అధ్యకక్షులు ఫ్రాన్సిస్ పాల్గన్నారు. ఈ సమావేశం టి.రాములు, బుచ్చిరాములు, ఎం.రాజుల ఆధ్వర్యంలో జరిగాయి.
సమావేశం కూన సమ్మయ్య, కూన మొగిలి, బత్తిన స్వాముల స్వాగతం సుస్వాగతం, సభికులకు స్వాగతం అన్న పాట వినిపించడంతో ప్రారంభమైంది.
పరిచయాల కార్యక్రమానంతరం మొదటగా శీలం నాగార్జున మండలిని సంక్షిప్తంగా పరిచయం చేశారు. వాటిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే చూడండి.
మండలి ప్రధాన లక్ష్యాలు కొన్ని ఉన్నత లక్ష్యాలతో సుమారు 30 సం||రాల క్రితం మొదలైంది. మానవుడు విశ్వమానవుడిగా ఎదగటము ప్రధాన లక్ష్యము కాగా, 5 ఉప లక్ష్యాలున్నాయి. వ్యక్తులలో స్వతంత్రాలోచనాశక్తిని పెంచడము ఒకటి. మండలి దగ్గర వున్న లక్షణ ప్రమాణవిద్య ద్వారా సక్రమాలోచనా పద్ధతులు నేర్పడము ద్వారా నెరవేర్చవచ్చు. రెండవది సరైన జీవితావగాహన కలిగించడము దేనిని వివిధ తాత్విక ధోరణుల తులనాత్మక అధ్యయనము మరియు జీవిత పరిశీలనములు ద్వారా నిర్వహణ. వివేకం చూపుతున్న మార్గంలో చేయడానికి యత్నించడము, మూడవది ఇక నాలుగవదిగా సమాజాభ్యుదయ శక్తులను సంఘటితపరచుట, అసాంఘిక శక్తులను రూపుమాపుటకు యత్నించుటలో బాగా ఉమ్మడి పోరాటాలను జరపటానికి ఐక్యమిత్రమండలుల ఏర్పాటు చేయడం; ఐదవదిగా సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి వ్యవస్థలోని కీలకస్థానాలలోకి ప్రవేశపెట్టుట దీనిద్వారా చిన్ని ప్రయత్నములతో ఎక్కువ లబ్ది సమాజానికి చిక్కే అవకాశముంటుంది.
మిత్రసంఘాలు ఐక్యతగా తమ తమ కార్యకర్తలను సమర్థులుగా రూపొందించుకోడానికి ఉమ్మడి శిక్షణా తరగతులు ఏర్పాటుచేసి అన్ని సంఘాల కార్యకర్తలకు శిక్షణగా (1) శాస్త్రీయ దృక్పథము, (2) లక్షణ ప్రమాణవిద్య; (3) తత్త్వశాస్త్ర చరిత్ర, (4) విజ్ఞానశాస్త్ర చరిత్ర; (5) నిత్యజీవితంలో హేతుబద్ధాలోచనావశ్యకత; (6) సామాజిక సంబంధాలు-వ్యక్తిపాత్ర; (7) మనోవిజ్ఞానశాస్త్రము; (8) నైతిక విలువలను ముఖ్యాంశాలుగా బోధించడము జరిగింది.
మండలి భావజాలంలో ముఖ్యంగా ఆచరించవలసినవి (1) సమయపాలన; (2) అన్నమాటకు కట్టుబడి వుండడము; (3) చేస్తానన్న పని మనసుపెట్టి చేయడం. విషయాన్ని పరిశీలించేటప్పుడు ఎవరు చెప్పారన్నది కాకుండా ఏమి చెప్పబడి వుందో పరిశీలించాలి. మనకు నచ్చినా, నచ్చకున్నా, ఇష్టమున్నా లేకున్నా సత్యానికే పెద్దపీట వేయాలి. పొగడొద్దు, పొగిడించుకోవద్దు, తెగడొద్దు, తెగిడించుకోవద్దు, అలానే గుర్తింపు కోరవద్దు, గుర్తింపుకై యత్నించవద్దు.
ఇలా అనేకానేక అంశాలను తడుముతూ వివేకపథం ముఖచిత్రంపై గల వృత్తంలోని ప్రతి పదాన్ని వివరిస్తూ వ్యక్తి, సమాజము, ప్రకృతి సంబంధాలను వివరిస్తూ ముగించారు.
తరువాత వక్తగా చెరుకూరి వెంకట్రామయ్యగారు ప్రసంగిస్తూ ఉన్నత సమాజము కొరకు మండలి ఐక్యమిత్రమండలితో కలసి నడుస్తున్నదని, ఉన్నత సమాజము గ్రామాలనుండి మొదలవ్వాలని కనుక గ్రామీణాభ్యుదయ సంఘాలు ఏర్పాటు కావాలని, సమాజములో తాత్వికుల, ఉపన్యాసకుల కొరత వుందని ఆ కొరత తీర్చడానికి ఉత్సాహవంతులు మండలిలో చేరాలని కోరుతూ స్వాతంత్య్రము రాకముందు నుండి ఈరోజువరకు జరుగుతున్న రాజకీయాలను వివరిస్తూ మనము చేయవలసిన విధివిధానాలు తెలుపుతూ మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముగించారు.
మధ్యాహ్న భోజనానంతరం ప్రశ్నా-సమాధానరూపంలో సమావేశం జరిగింది. సభికులు అడిగిన ప్రశ్నలకు పుట్టా సురేంద్రబాబుగారు సమాధానాలు యిచ్చారు. అందులో ఒక ముఖ్యమైన ప్రశ్నగా మండలి అన్ని గ్రామాలస్థాయివరకు ఎందుకు విస్తరించలేదన్నది. దీనికి సమాధానంగా సురేంద్రగారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ అన్ని మూల గ్రామస్థాయివరకు విస్తరించింది ఏదైనా ఉన్నదా ఆలోచించమన్నారు. ప్రతిసంస్థా విస్తరిస్తున్నట్లు ఆ సంస్త పెద్దలు అనుకొంటున్నారా ఆలోచించాలన్నారు. సంస్థ విస్తరించడమంటే ఆ సంస్థ భావజాలం ప్రజలలో వ్యాపించటమని కేవలము మంది పెరిగితే సంస్థ పెరిగిందనలేమంటూ మూఢనమ్మకాలమీద పనిచేస్తున్నామన్నా వారిని నమ్మకము అంటే ఏమిటి? మూఢనమ్మకము అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనిస్థితిలో కార్యకర్తలుంటే ఆ సంస్థ తన భావజాలాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళిందని అనగలమా? విస్తరిస్తుంది సంస్థ అని అనగలమా ఆలోచించండి అన్నారు. మండలి పని, మనిషిలో బుద్ధిచేసే పని అని వివరిస్తూ మాష్టార్లని తయారుచేసే కాలేజీలు ఎన్ని వుంటాయి, ఎందరుంటారు అలానే మాస్టార్లు చెప్పే కాలేజీలు, స్కూళ్ళు ఎన్ని వున్నాయి, ఆ కాలేజీలు, స్కూళ్ళలో చదివే పిల్లలెందరుంటారు. ఈ తేడాను గ్రహించాలని సూచించారు. తరువాత నా ముగింపు వ్యాసాలతో సమావేశం ముగిసింది.
- రిపోర్టర్, కోట ప్రసాదరావు
ఉద్యమ సమాచారం
గ్రామాభ్యుదయ కార్యక్రమము పేర రామకృష్ణగారు 'మేలుకొలుపు' పేరున కొన్ని మిత్రసంస్థలతో కలసి ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూడాలన్న ఉద్దేశ్యముతో వచ్చి ఎన్నికలలోపున 1000 గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా చేయాలన్న లక్ష్యంతో మొదలైన కార్యక్రమానికి రెండవ విడతగా హైదరాబాద్‌లోని జనవిజ్ఞానవేదిక ఆఫీసులో 30-6-2009న సమావేశం జరిగింది. దీనికి మొదటి సమావేశము 8, 9 తేదీలలో జె.వి.వి. ఆఫీసులోనే జరగడము, ఆదర్శ గ్రామాలుగా పేరుపొందిన రెండు గ్రామాలను షుమారు 15 మందిమి మూడు వాహనాలలో కొండగడప గ్రామము, మోత్కూరు (మండలం, నల్గొండ) జిల్లాకు అలాగే గంగదేవిపల్లి గ్రామము, వరంగల్‌జిల్లాలోనిది సందర్శించడం జరిగింది.
ది. 24-6-2009న గ్రామాభ్యుదయ కార్యక్రమంపేర కర్నూలులో హోటల్ మౌర్యలో డా|| బ్రహ్మారెడ్డిగారి ఆధ్వర్యంలో జరిగింది. షుమారు 15 మంది అన్ని ప్రాంతాలనుండి హాజరైనారు.
ది. 21-6-2009న హైదరాబాద్, బేగంపేటలోని జీవనజ్యోతి హాలులో ఎన్నికల నిఘా రాష్ట్ర రివ్యూ సమావేశాలు జరిగాయి. షుమారు 150 మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాలనుండి విచ్చేశారు. అందులో ఐక్యమత్రమండలి నుండి అత్యధికులు హాజరు అవటం విశేషము.
ది. 28-6-2009 ఆదివారం కృష్ణాజిల్లా ఎన్నికల నిఘావేదిక రివ్యూ స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో జరిగింది. సుమారు 45 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment