Wednesday, July 1, 2009

ఆస్తికక్షేత్ర విచారణ-పూర్వరంగం



యోచనాశీలురైన ఆస్థిక నాస్తిక పక్షీయులారా! తత్వాధ్యయనాభిలాషులారా!
ఏ తాత్విక సిద్ధాంతమైనా, తనదైన పారిభాషిక పదకోశాన్ని కలిగి వుంటుంది. ఆ పదాలకు తానంగీకరించే నిర్వచనాలను-నిర్దిష్టమైన అర్థాలను-చెప్పే, తన సిద్ధాంత ప్రతిపాదనలను, వాదనలను సమాజం ముందుకు తెస్తుంది.
గమనిక : ఆ నిర్వచరూపాలూ, భాషా పరిమితులకు లోబడే వుండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
కనుక ఆయా ధోరణుల పరిభాష గురించి అవగాహన లేకుండా, వాటిని ప్రతిపాదించి వాదించబూడనడంగానీ, తిరస్కరించి ప్రతివాదన చేయబూనడంగానీ అనుచితమైన పనే అవుతుంది. సిద్ధాంత ఖండనకైనా, మండనకైనా పరిభాష తెలిసి వుండడం తప్పనిసరి. ఈ సందర్భంలో అవసరమైన కొన్ని పారిభాషికాలను ఉదహరిస్తాను చూడండి.

వాదము-వాదన : ఇవి రెండూ సమానార్థాలు కావు. ఒక విషయంపై, ఒకపక్షంవారు చేసే ప్రతిపాదనను వాదము అనంటారు. 'ప్రతిజ్ఞ', 'ప్రపోజిషన్‌' అనన్నమాట. ఆ ప్రతిపాదనను (వాదాన్ని) నిలబెట్టుకోడానికి భాషద్వారా ఆ పక్షంవారు చేసే పనిని వాదన అనంటారు. ఈ పని చేయు వానిని 'వాది' అనంటారు.
ప్రతివాదము-ప్రతివాది : ప్రకటిత వాదాన్ని అంగీకరించక, సందేహించడమో, దానికి వేరైన ప్రతిపాదన చేయడమో చేయువానిని ప్రతిపక్షము అనంటారు. ప్రతిపక్షం ప్రకటించిన వేరైన అభిప్రాయం ప్రతివాదం. దానిని స్థాపించడానికి అతడు చేసే సంభాషణం ప్రతివాదన అవుతుంది. వాదము þ ప్రతివాదము; వాదన þ ప్రతివాదన, వాది þ ప్రతివాది.
గమనిక : చర్చలలో ఇది ఒక కీలకమైన అంశము. ఇరుపక్షాలు, పరిశీలకులూ కూడా దీనిని గుర్తించి వుండడం అవసరం.
చర్చ : ఏదేని ఎంపిక చేసుకున్న అంశము లేదా అంశాలపై సరైన నిర్ణయాలకు రావడానికై ఒక క్రమంలో సాగించే వాద ప్రతివాద రూపమైన విచారణనే చర్చ అనంటారు.
ఒకవంక ఎంపిక చేసుకున్న అంశము, దానిపై స్పష్టమైన అభిప్రాయ ప్రకటన (ప్రతిపాదన) దానిని నిలబెట్టుకోడానికి చేసే ఆధారసహితమైన వాదన; మరోవైపు దానితో విభేధించే అభిప్రాయము, దానికీ ఆధారసహితమైన వాదన అన్నవి లేకుండా అనేకుల మధ్య సాగేవాటిని చర్చలు అనకూడదు. అట్టివాటిని రచ్చలనో, పిచ్చాపాటి కబుర్లనో మాత్రమే అనాలి. మిత్రులారా! ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే, నేడు వ్యవహారంలో, రచ్చలకు, రగడలను, పిచ్చాపాటినీ, కాలక్షేప కబుర్లనూ కూడా 'చర్చ' అనే పేరునే పిలుస్తున్నారు. ఆ తప్పుడు అభిప్రాయం ఏర్పడి వుండడంవల్లనే చాలా ప్రధానమైన, కీలకమైన అంశాలపై లోతుగా విచారించుకోవలసిన సందర్భంలోనూ, చర్చలనవసరమండీ, చర్చలలో కాలహరణమే తప్ప జరిగేదేమీ వుండదు, అంటుండడం కనబడుతోంది. చర్చకు-రచ్చకు-పిచ్చాపాటీకీ తేడా తెలియకపోవడంవల్ల వచ్చిన రాకూడని పరిస్థితి ఇది.
చర్చను ఇష్టపడు-రచ్చను ఇష్టపడకు, చర్చకు సిద్ధపడు, కాలక్షేపానికి సిద్ధంకాకు, చర్చలో చోటుచేసుకునే కాలహరణాన్ని సహించు-తదితర భాషణలకై జరిగే కాలహరణాన్ని సహించకు. ఇవి వివేకవంతులంగీకరించాల్సిన సూత్రాలు.
సందర్భశుద్ధి లేనివాడు చేసేంద కాలహరణం ఇతరులు చేయలేరు. అనేకానేక విషయాలు చర్చించి ఎంతోకొంత సమాచారం వున్న వ్యక్తికి గనుక సందర్భశుద్ధి లేకుంటే-కొరవడితే, ఆపై అతడు చేసే కాలహరణం-టైం కిల్లింగ్‌-మరొకడు చేయలేడు.
తెలియవనే తెలుసనుకుంటూ, తనకు తెలీని విషయాలపైనా తెలిసినవాడల్లే అతిభాషణం చేసేవానిని వివేక సహించకూడదు, సహించలేడు కూడా. దానినే ఇంటలెక్చ్యువల్‌ ఇన్‌టాలరెన్స్‌ (బుధజనా సహనం) అనంటారు. అది చాలా విలువైనది. కీలకమైన విషయాలపై లోతైన చర్చ జరగాలనుకునే సందర్భాలలో విలువైనదేకాక, తప్పనిసరైందికూడా.
చర్చలు చర్చలుగా సాగడానికే, రచ్చలుగా మారకుండడానికే చర్చావేదిక నియమ నిబంధనలన్నవి ఉనికిలోకి వచ్చాయి. మిత్రులారా! తాత్విక అధ్యయన క్షేత్రాలలో వుండేవారికి, ఉండాలనుకునేవారికీ, చాలా ప్రయోజనాన్ని కలిగించగల భావాలివి. మీరూ వీటిని మరోసారి మరోసారి గుర్తుచేసుకుంటూ, అవసరమైన వారికి అందిస్తూనో, గుర్తుచేస్తూనో వుండండి. ఇక మన ప్రకరణాంశమైన ఆస్థిక-నాస్తిక క్షేత్ర విచారణకు అవసరమయ్యే కొద్ది మాటలు చెపుతాను, పరికించండి.
ఆస్థిక సిద్ధాంత పరిభాష :
సృష్టి, కర్త, దేవుడు, జీవుడు, ఆత్మ, ప్రకృతి, శూన్యము, పదార్థము, జడము, చేతనము, జన్మ, కర్మ, లోకము, స్వర్గము, నరకము, ఆది, అంతము, సాధన, ముక్తి, జ్ఞానము, అజ్ఞానము, తప్పుజ్ఞానము, ఒప్పుజ్ఞానము, సత్యము, అసత్యము, ధర్మము-అధర్మము, సుఖము-దుఃఖము, నియమమ, స్వతంత్రము, అస్వతంత్రము, స్వేచ్ఛ, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, ఆకారం, పరిమాణం, సంబంధం, గుణం, ధర్మం, ఈలోకము, పరలోకము.
అజ్ఞుడు, అల్పజ్ఞుడు, అధికజ్ఞుడు, సర్వజ్ఞుడు, శక్తిహీనుడు, అల్ప శక్తిమంతుడు, అధికశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు.
ఆస్తికతి-నాస్తికతలు :
సృష్టికర్త వున్నాడంటూ మొదలెట్టే ఏ ఆస్థికధోరణులవారైనా వారంగీకరించే ఆ సృష్టికర్త (దేవుడు) గురించిన వివరాలు ఒక క్రమంలో అందించాల్సి వుంటుంది. వారంగీకరించే, దేవుడంటే ఏమిటి? ఎక్కడుంటాడు? ఎప్పుడున్నాడు? ఎంతున్నాడు? ఎలా వున్నాడు? అతని గుణగణాలేమిటి? కర్మలేమిటి? అతనికి ప్రకృతిలోనూ, మనిషితోనూ ఉన్న సంబంధాలేమిటి?
- సృష్టిగురించి : సృష్టి అనగానేమి? దేనితో సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు (ఎవరికొరకు)? సృష్టికి ఆరంభం వుందా? వుంటే దానికి ముందు ఏమిటన్నదానికి ఆధారం వుందా? సృష్టి చేయకపూర్వం ఎంతకాలం నుండి దేవుడున్నట్లు అంతకాలంగా అతడేమి చేస్తున్నట్లు?
- ప్రళయం గురించి : అంటే ఏమిటి? ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ప్రళయానంతర పరిస్థితి ఏమిటి? స్వర్గ నరకాలు సృష్టిలో భాగమా కాదా? సృష్టి అంతం పిదప స్వర్గ నరకాలుంటాయా? వుండవా?
- స్వర్గ నరకాలు సృష్టిలో భాగమేనంటే, అవి దేనితో చేయబడ్డాయి? స్వర్గనరకాలకంటే వేరైన లోకాలున్నాయా?
- స్వర్గాది లోకప్రాప్తికంటే వేరుగా మానవుడు సాధించాల్సింది లేదా పొందాల్సింది ఏమైనా వుందా? దాని వివరాలేమిటి?
రెండు ధోరణులకు చెందిన వాద ప్రతివాదులిరువురికీ ఈ పదాలు, విషయాలపైన అవగాహన వుంటేగాని వాదమో, ప్రతివాదమో చేయడం సాధ్యపడదు. వీటి వివరం తెలీకుండగనే పరస్పరం ఒకరినొకరు నిరసించుకుంటూనో, నిందించుకుంటూనో సాగేదంతా తాత్విక విచారణ క్రిందికి రాదు. అదంతా అడ్డగోలు వ్యవహారమే.
ఈనెల 11, 12, 13 తేదీలలో దోరకుంట మండలి కేంద్ర కార్యాలయంలో ఈ విషయమై విశేష పరిశీలన జరుగుతుంది. ఈ అంశాలలో తగినంత అధ్యయనముండి, మరింత లోతుగా వీటి విషయంలో అవగాహన కలిగించుకొనగోరువారు ముందుగా మాకు తెలిపి వేదికలో పాల్గొనవచ్చు. ఆమోదం పొందినవారి వరకే ప్రవేశం వుంటుంది. ఆస్తిక నాస్తికతల గురించి కొంత అవగాహన కలిగినవారై, అప్పటికి వారికున్న అవగాహనను గురించి వివరించగలవారికే ఆ అవకాశమైనా వుంటుంది. మరీ క్రొత్తగా వాటిని గురించి తెలుసుకోవాలనుకునేవారికిందులో ప్రవేశము లేదు. ఈ సూచనను గమనించండి.

No comments:

Post a Comment