Saturday, August 1, 2009

స్వలింగ సంపర్కము - ఒక పరిశీలన-2



సామాజిక స్పృహకల యోచనాశీలురందరకూ,
మిత్రులారా! స్వలింగ సంపర్కులు, వారి తరఫున మద్దత్తుగా నిలబడ్డవారూ, స్వలింగ సంపర్కాన్ని మానవహక్కుల క్రిందికి తెచ్చి, స్వలింగ సంపర్కానికీ చట్టబద్ధత కల్పించాలంటూ కోర్టుకు వెళ్ళడం, ఇండియన్‌ పీనల్‌కోడ్‌ 377 ప్రకారం అమలులో వున్న, స్వలింగ సంపర్కం అన్నది శిక్షార్హమైన నేరం అన్నదానిని మార్పుచేసుకుని న్యాయాలయాన్ని కోరడం జరిగింది. ఆ యత్నాల పర్యవసానంగా జస్టిస్‌ ఎ.పి.షా, జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్‌ 2009 జులై 25, పిటిషన్‌దారులకు అనుకూలంగా స్వలింగ సంపర్కాన్నికి చట్టబద్ధతను కలిగిస్తూ ఒక తీర్పునిచ్చింది. దానిపై జులై వివేకపథం-156లో ఈ అంశంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదనీ, పలుకోణాల నుండి లోతైన విశ్లేషణ, విచారణ చేశాకనే ఒక ప్రయోజనకరమైన నిర్ణయానికి రావడం ఉచితమనీ చెపుతూ ఒక చర్చనారంభించాను.

వివేకపథం పాఠకులు, మండలికి మిత్రులూ, సన్నిహితులుగావున్న సైక్రియాట్రిస్టు డా|| సదానందంగారు ఆ వ్యాసాన్ని చూసిన వెంటనే ఫోన్‌చేసి, ఈ విషయం మాకూ సంబంధమున్న విషయం కనుక మీరొస్తే కొన్ని వివరాలివ్వగలను అని చెప్పారు. ఎలాగూ, ''యోగ్యమైన, తగినంత సమాచారం ఆధారంగనే విచారణలు, నిర్ణయాలు చేయవలసి వుంటుంది'' అన్న సూత్రాన్ని కలిగి వున్నవాళ్ళమేకనుక, సమాచార సేకరణ, విచారణ ఇక్కడనుండే మొదలెడదాం అనుకుని వారిని కలిశాం, మరునాడు మరో నలుగురు మానసిక వైద్యుల్ని కలిశాం. క్లుప్తంగా వారినుండి అందిన వివరాలు ఇలా వున్నాయి. వీటిని జాగ్రత్తగా పట్టిచూడండి.
1. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య þ ప్రచురించిన þ అనే ప్రామాణిక రచనలోని (పేజీ 1 నుండి 100) దగ్గర హోమోసెక్సువాలిటీ గురించి వ్రాయబడ్డ అంశాలాధారంగా...
1) 1973 వరకు స్వలింగ సంపర్కాభిలాష ఒక అసాధారణ స్వభావంగా చూడబడింది.
2) 1973-80ల మధ్య ఈ విషయంపైనే విచారణ, విస్తృతమైన చర్చా జరిగింది. వాటి ముగింపుగా, ఇది మానసిక అసాధారణ స్థితేమీ కాదు అన్న నిర్ణయానికి వచ్చారు.
3) ఆ రకమైన లైంగికేచ్ఛ þ అన్నది రోగలక్షణం కాదు.
4) స్వలింగ సంపర్కం అన్నది లైంగికంగా ఒక ప్రత్యామ్నాయ జీవనరీతేగాని, రుగ్మత మాత్రం కాదు.
5) సాంఘికంగా చూస్తే, అదొక వ్యక్తిగతమైన అభీష్టంగా చెప్పుకోవచ్చు.
గమనిక : ఇక్కడికిదొక అంశం. వైద్యశాస్త్రపు కొలతల ప్రకారం, ఇది రోగంకాదు. అబ్‌నార్మలూ కాదు.
స్వలింగ సంపర్కులు ప్రధానంగా రెండు సమూహాలుగా చెప్పబడుతున్నారు.
1) ఆడ-ఆడతో జతకట్టిన వాళ్ళు. వీళ్ళను 'లెస్బియన్లు' అనంటారు.
2) మగ-మగతో జతకట్టినవాళ్ళు. 'గే'లు అనంటారు.
3) ఆడ+ఆడ కలుసుంటూ అప్పుడప్పుడూ మొగవాళ్ళతోనూ సంభోగంలో పాల్గొంటుంటే వాళ్ళూ; మొగ-మొగ కలుసుంటూ అప్పుడప్పుడ స్త్రీలతోనూ సెక్స్‌లో పాల్గొనేవాళ్ళు వుంటున్నారు. అంటే మామూలుగా వివాహమయ్యాక స్వలింగ సంపర్కం చేస్తుండే, ఆడవాళ్ళు, మగవాళ్ళూ కూడా వున్నారన్నమాట. వారిని ......... అనంటారు.
4) ప్రపంచంలో లైంగిక జీవితం గడిపేవారిలో 1 నుండి 3 శాతం వ్యక్తులు ఈ జీవనరీతిని అనుసరిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందులోనూ ఖచ్చితమైన స్వలింగ సంపర్కులుగా 10,15 శాతం మాత్రమే వుంటారు.
5) హోమో సెక్సువల్స్‌ ప్రపంచ దేశాలన్నిటా, అన్ని కాలాలలోనూ వున్నారు అనడానికి చారిత్రకాధారాలు దొరుకుతున్నై.
6) యూరప్‌ రాజ్యాలలో వీరి సంఖ్య అధికం. ఉదా : నార్వే 3.5%; బ్రిటన్‌ 6.1%, ప్రస్తుతం ఆ దేశాలలో దీనినో సాధారణ విషయంగనే పరిగణిస్తున్నారు.
7) మనోవిశ్లేషణతో పితామహుడైన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ స్వలింగ సంపర్కాన్ని మానసిక అస్వస్థతగా గుర్తించలేదు.
8) మానసికంగా లైంగికస్థాయిలు లేదా థలు, వాటి వాటి థల్లో వ్యక్తి ప్రవర్తన రీతులు అన్నదాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. ఆయా థలలో వ్యక్తిలో ఏర్పడే కొన్ని నిశ్చితాభిప్రాయాలు, అనంతర కాలంలో ఆ వ్యక్తి జీవనశైలిని అతిగా ప్రభావితం చేయవచ్చు.
ఉదా : ఒక బాలిక, పురుషాంగం తనకు లేకపోవడాన్ని గమనించి, దానిగురించే ఎక్కువగా ఆలోచిస్తుందనుకుందాం. క్రమంగా ఆ బాలిక ఒక హోమో సెక్కువల్‌గా మారే అవకాశాలు పెరుగుతాయి.
గమనిక : ఈ కోణంనుండేగాక, వైద్యశాస్త్రం వ్యక్తులు స్వలింగ సంపర్కులుగా రూపొందడానికి జన్మసిద్ధంగనే శరీరంలో భౌతిక నిర్మాణపరంగానే ఏమైనా మార్పులు జరుగుండే వీలుందా అన్న దృష్టినుండీ పరిశోధనలు చేశారు.
1) యండ్రోజెన్స్‌ అనే హార్మోను 'గే'లలో తక్కువగా వుంటున్నట్లు గుర్తింపబడింది.
2) మెదడులోని అతి ప్రధాన భాగాలలో ఒకటైన 'హైపోథాలమస్‌'లోని కణాల సంఖ్య మామూలుగా వుండాల్సిన దానికంటే తక్కువగా వుండడమూ గమనింపబడ్డది.
3) ఎలా ఎడమచేతి వాటం ఏర్పడడానికి సాధారణంగా చేతివ్రాతను నియంత్రించే భాగం మెదడులో ఎడమభాగాన వుండడమో, అలానే హైపాథాలమస్‌లోని కణాల సంఖ్యలో వ్యత్యాసమూ, హార్మోన్‌లలో వ్యత్యాసము స్వలింగ సంపర్కంగా అయ్యేలా చేస్తుండుండవచ్చు.
గమనిక : ఈ పరిశోధనలేవీ ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణల థకు చేరిలేవు. హైపోథిసిస్‌ స్థాయిలో కొట్టివేయబడని థలలో వున్నాయి. అని మేము సంప్రదించిన వైద్యులలో ఒకరన్నారు. దీని విషయంలో లేటెస్ట్‌ సమాచారం ఏమిటన్నది సేకరించాల్సి వుంటుంది.
మరో కోణంనుండీ స్వలింగ సంపర్కులు తయారవడానికి కారణాలు ఊహించబడ్డాయి.
1) లైంగిక వాంఛను సహజరీతిలో నెరవేర్చుకునే అవకాశాలు లేనివాళ్ళలో ప్రత్యామ్నాయ పద్ధతులు చోటు చేసుకోవడం.
ఉదా : సైనికులు యుద్ధ సమయాలు, స్త్రీలు, భార్య అందుబాటులో లేని పరిస్థితులలో ఉన్న పురుషులే వారిలో వారు క్రమంగా సంభోగానికి అలవాటు పడడం జరగొచ్చు.
బ్రహ్మచారిణులు, అవివాహితలు, విద్యార్థినులు, బాలికల వసతి గృహాలలో కలిసి వుండడం లాంటి పరిస్థితులు, ఆ థలో వాళ్ళ దృష్టిలో పడిన రతి-శృంగార దృశ్యాలు, సాహిత్యం వగైరాలన్నీ వారిలోని లైంగిక స్వేచ్ఛను ప్రేరేపించగలిగేటివే. కొన్ని సందర్భాలలో కొందరు అతి ఉద్రేకానికీ లోనుకావచ్చు.
స్వలింగ మైధునానికి అలవాటుపడ్డ పెద్ద వయస్కులు, మధ్యవయస్కులు, లేత వయస్సువాళ్ళకు దానిని తమ అవసరం కోసం అలవరచనూవచ్చు.
అలాచేస్తే ఎలా వుంటుంది? అన్న ఉత్సుకత (కుతూహలం) కొద్దీ మొదలెట్టి, ఎట్టి అడ్డంకులూ, అంగీకారాలూ, సమయ, సందర్భాలు కలసిరావడాలు, విఫలమవుతామేమో, తిరస్కరింపబడతామేమోనన్న జంకుగొంకుల గొడవేమీ లేని స్వీయ మైథునం (హస్తప్రయోగం, కృత్రిమాంగ ప్రయోగం) లాంటి వాటికి అలవాటుపడొచ్చు.
మరికొన్ని వివరాలు :
1) వీరు నపుంసకులైయుండాల్సిన పనిలేదు. స్వలింగ సంపర్కులు.
2) స్త్రీత్వం పూర్తిగా వుండి, పురుషత్వం (సంభోగశక్తి, అంగస్థంభన) సరిపడా వుంటే స్వలింగ సంపర్కులు కావచ్చు.
3) పురుష వ్యతిరేకతగల స్త్రీలు, స్త్రీ ద్వేషంకల పురుషులు, ఈ రీతికి అలవాటుపడే అవకాశాలూ ఉన్నై.
4) మామూలుగా వివాహం చేసుకున్నవాళ్ళలో అప్పుడప్పుడూ స్వలింగ సంపర్కం, హస్తప్రయోగాలు చేస్తుండేవాళ్ళు అనేక పురుషులతో వుండనిచ్చగించే స్త్రీలు, అనేక స్త్రీలను వాంఛించే పురుషులు (వ్యభిచరించేవారు) ఉన్నట్లే స్వలింగ సంపర్కుల్లోను విలింగ సంపర్కం కలవాళ్ళూ, స్వలింగ సంపర్కంలోనే వ్యభిచరించేవారు, ఒక్కరితోనే గుట్టుగా, నీతిగా వుండేవాళ్ళూ వుంటారు.
గమనిక : ఈ ఒక్క లైంగిక విషయంలో తప్ప మిగిలిన జీవిత వ్యవహారాలలో మానసికంగా, శారీరకంగా అన్నివిధాలా అందరు మనుషుల్లానే ప్రవర్తిస్తుంటారు.
స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డ వాళ్ళలో మానసికంగా రెండు రకాల వైఖరులు కలవారుంటారు.
1) ఇదేమీ చేయకూడనిపనికాదు. నా అవసరం, నా శరీరం, నా ఇష్టం. మిగిలిన సామాజిక సంబంధాలలో ఎటువంటి అపసవ్యతా లేకుండా నేను చేయవలసింది చేస్తున్నప్పుడు, నా వ్యక్తిగత జీవితం, దానిలోని నా ఇష్టాఇష్టాలను గురించి ఎవరికీ సంజాయిషీ ఇవ్వఖ్కరలేదు. భయపడనూ అక్కరలేదనుకుంటూ నిర్భయంగా, ఎట్టి అలజడి, ఆందోళన లేకుండా, అవసరమైతే బహిరంగపడడానికి సిద్ధపడి వుండే వారొకరకం.
2) అయ్యో ఇలా పతనమై పోయానేమిటి? దీని నుండి ఎలా బైటపడడం? ఎంతగా మానుకుందామని అనుకున్నా దీనినుండి బైటపడలేకపోతున్నానే, ఎవరికైనా తెలిస్తే బ్రతుకేంగాను? నలుగురు గేలిచేస్తుంటే ఆ అవమానాన్ని భరించడంకంటే, చనిపోవడం మేలు. ఇలా ఆలోచించుకుంటూ ఏదో ఒక అఘాయిత్యానికి సిద్ధపడడమో, క్రమంగా ఆందోళనను పెంచుకుంటూ మానసిక రోగిగా మార్పుచెందడమో, అన్న వైఖరిగలిగినవారు.
గమనిక : మేము కలిసిన 5గురు మానసిక చికిత్సా నిపుణులు : (1) డా|| సదానందం, (2) డా|| కృష్ణమోహన్‌, (3) డా|| టి.ఎస్‌.రావు, (4) డా|| అయోధ్య, (5) డా|| సమరం గార్లు మరియు నాస్తిక కేంద్రం విజయంగారు కూడా దీనిని వైద్యశాస్త్రం ప్రకారం రోగమనడానికి వీల్లేదు అన్న అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.
అయినా, మా దగ్గరకు ఈ విషయమై వచ్చేవాళ్ళకు (1) కౌన్సిలింగ్‌ ఇవ్వడం, (2) బహేవియరిల్‌ థెరపీని అమలు చేయడం, వారిలో వున్న అనవసరపు భయాలు తొలగించే యత్నం చేయడం ద్వారా, మళ్ళా వాళ్ళని ప్రకృతి సహజ క్రమంలోకి తీసుకొచ్చే పనీ చేస్తున్నామని అందరూ చెప్పారు.
ఒకరిద్దరు, ఏదేమైనా ఇది సరిచేసుకోవలసిన పరిస్థితేనని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాము. కొంతవరకు నార్మల్‌ కాదనీ అనక తప్పడంలేదు. þ అన్నట్లు ఒకవేళ శరీర భౌతికనిర్మాణంలో వ్యత్యిసంవల్ల స్వలింగ సంపర్కులైనారనుకుంటే, వారికి చికిత్స ఎలానూ వుండదు. అట్టివారి విషయంలో ఎవరం చేయగలిగిందీ ఏమీలేదు. వాళ్ళు నేరగాళ్ళు అని అనకూడదనుకున్నా వాళ్ళ ద్వారా అట్టి తేడాలేని వాళ్ళకూ ఇది మిగిలిన కారణాలవ్ల అలవాటు అయ్యే ప్రమాదమూ వుంది గనుక చట్టబద్ధత కల్పించడం, మానవహక్కు క్రిందికి తీసుకురావడం ఎంతవరకు సబబన్నది ఆలోచించాలి.
మా వద్దకు వచ్చిన వాళ్ళలో కొంతమంది మేము చేసే వివిధ యత్నాలవల్ల మామూలు వరవడిలోకి చేరగలుగుతున్నారుకదా! అలా జరుగుతున్న కేసులున్న భౌతిక నిర్మాణంలోనే తేడాలున్నవారు కాదన్నమాటేగదా!
హోమో సెక్కువాలిటీని అతిగా వ్యతిరేకించేవారిని వైద్యశాస్త్రం గుర్తించింది. వారిలోని ఈ అతి వ్యతిరేకతకు వెనక భయం వుందని దానిని 'హోమోఫోబియా' అనాలని పేర్కొంది. ఈ తరహా మానసిక వైఖరి కలవాళ్ళు, స్వలింగ సంపర్కులవల్ల, దానికి చట్టబద్ధత చేకూర్చడంవల్ల మొత్తం మొత్తంగా సమాజంలో విచ్చలవిడితనం పెచ్చరిల్లుతుందనీ, అది క్రమంగా జంతువులతో రతి సల్పడానికీ దారితీయవచ్చుననీ, þ లాంటి రోగాలు అతిగా వ్యాప్తి చెందుతాయని, వ్యక్తులలో కుటుంబము-సంతానము, బరువు బాధ్యతలు వగైరాల బాధ్యతలు తీసుకునే లక్షణం తగ్గిపోతుందని అనుకుంటుంటారు.
ఒక సమస్యను అదెంతో అంతగా లెక్కించడం వరకు సరైన యోచన అవుతోందిగాని, దానిని భూతద్దంలో చూస్తూ, అతిగా భయపడడం ఒక రకంగా అది ఒక మానసిక అసాధారణలే అవుతుంది. సమాజంలోని వ్యక్తులూ, సమూహాలు హోమోఫోబియాకు లోనుకాకుండా వుండడం, జాగరూకత వహించడం అవసరం.
గమనిక : ఇంతవరకు వైద్యశాస్త్రంపరంగా, వైద్యునిగా ఈ క్షేత్రానికి సంబంధించి ఏమంటుంది అన్న వివరాలు చూశాం. ఇక దీనిని సామాజిక సంబంధాలు-ఫలితాలు అన్న దృష్టినుండే చూడాల్సి వుంది. కనుకనే మేము సంప్రదించిన మానసిక వైద్యుల్ని మొదటి, విషయాన్ని విడదీసి, మీరూ రెండు కోణాల నుండి చూసి మీ అభిప్రాయాలు చెప్పండని అడిగాం.
1) వైద్య విజ్ఞానం ఏమి చెపుతోంది? ఒక వైద్యునిగా దీని విషయంలో మీ వైఖరేమిటి?
2) సంఘజీవిగా, సామాజిక స్పృహ కలిగిన యోచనాపరునిగా, అవగాహనాపరునిగా మీ ఆలోచనలేమిటి?
పైన మనం చూసిందంతా మొదటి ప్రశ్నను దృష్టిలో వుంచుకుని చెప్పుకున్నాం. ఇక రెండో కోణం నుండి దీనిని విచారించాల్సి వుంది. ఆ పార్శానికి చెందిన కొన్ని వివరాలివిగో చూడండి.
సామాజిక దృష్టికోణం నుండి, ఒక సామాజిక స్పృహకల వ్యక్తిగా మీరేమనుకుంటున్నారు? అన్నది మేమడిగిన ప్రశ్న.
1) ఎ. సమాధానం : అది నిషిద్ధ క్రియల క్రిందికి చేర్చాల్సిందే. అసలు ప్రకృతి సహజంకాని వైఖరిని అవలంభించాల్సిన అవసరమేమొచ్చింది. ప్రతి దేశానికీ దానికంటూ ఒక సాంస్కృతిక వారసత్వం, ఆచారాలు, కట్టుబాట్లు, విలువల రూపంలో వుంటాయి. వాటిని విడచి వైద్యశాస్త్రం రోగమంటోంది గనుక చికిత్స చేయాలేగాని శిక్షించకూడదనో, రోగం కాదంటోంది గనుక, అలా ప్రవర్తించడం తప్పుకాదనో, చట్టం మద్దత్తు తెలపడం సరికాదు.
2) బి. సమాధానం : ఇది ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమై విషయంకాదు. చారిత్రక పూర్వ థనుండి ప్రతి సమాజంలోనూ ఇది చోటు చేసుకుని వున్నట్లు దాఖలాలున్నై. ఈనాటి పరిస్థితిని చూస్తేనూ సుమారు 120 దేశాలకు పైనే దీనినో సాధారణ విషయంగా పరిగణిస్తూ, నిషిద్ధం కాదంటూ, అదో విధానం, విలింగ సంపర్కంలానే అంటూ చట్టబద్ధతను కల్పించాయి. వారంతా సామాజిక దృష్టికోణం లేనివారేమీ కాదుగదా?
నా లెక్కప్రకారం, విలింగ సంపర్క విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందో, అంతకంటే మించి స్వలింగ సంపర్క పద్ధతివల్లనూ సమస్యలు ఉత్పన్నంకావు.
3) సి. సమాధానం : వైద్యశాస్త్రం ఏదో చెప్పిందిగదా అని, దీనిని ప్రోత్సహించడం మంచిదికాదు. దీనివల్ల సమాజానికి మేలేమీ కలుగదు.
- వ్యాధులు పెరగడానికీ, వ్యాప్తి చెందడానికీ అంతో ఇంతో అవకాశాలు ఎక్కువవుతాయి.
- వివాహితులూ దీనివైపుకు ఆకర్షితులైతే మామూలు కుటుంబ సంబంధాలలో సమస్యలు పుట్టుకొస్తాయి.
- సిగ్గు బిడియం అధికంగా వున్నవారు, సామాజిక కట్టడికి వెరచి ఇటువైపు అడుగిడనివారు ఈ చట్టబద్ధతవల్ల స్వలింగ సంపర్కులుగా మారే అవకాశం వుంది. క్రమంగా ఈ సంఖ్య పెరిగితే పరిస్థితులెలా వుంటాయో ఊహించడం కష్టం. ఇప్పుడంత కట్టుబాటు, నియంత్రణ మాత్రం వుండదని చెప్పవచ్చు.
- మానవీయ సంబంధాలు అన్న దృష్టికోణం నుండి చూస్తే మంచిది కాదనే, కట్టడి అవసరమనే అనిపిస్తోంది.
4) డి. సమాధానం : వీరు ఇదొక సెక్సువల్‌ పర్వర్షన్‌ అనే చెప్పారు. నా వృత్తి అనుభవంలో ఈరకం వారినెందరినో వివిధ మానసిక చికిత్సా పద్ధతుల ద్వారా చక్కజేయగలిగాను. కొద్దిమంది మాత్రం వైద్యానికి లొంగరు. వారు అటు శరీర నిర్మాణంలోనే తేడా వున్నవారైయుండొచ్చు. లేదా బరితెగించినవారైనా అయ్యుండవచ్చు. అదిగో అట్టివారే చట్టబద్ధతంటూ పోరాడుతున్నారు.
- చట్టబద్ధత కొరకు పోరాడడం వెనక వారసత్వపు హక్కుల గొడవా, సామాజిక వ్యతిరేకత నుండి భద్రత నాశించడం అన్న అంశాలు చోటుచేసుకుని వుండవచ్చు.
- స్వలింగ సంపర్కులలో 70, 80 శాతం మంది ఇది సరైన విధానం కాదని, దురలవాటని అనుకొంటున్నారు. అట్టిస్థితిలో దీనికి చట్టబద్ధత కల్పించడం ద్వారా వారలాగే కొనసాగుతూ మరికొందరినీ అటువైపు ప్రోత్సహించే అవకాశం వుంది. చట్టబద్ధత కల్పించుకుంటే ఇందులో చాలామంది మామూలు దారికి మరలవచ్చు.
- సంతానం కలగకుండా పోతోందిగదా అన్నదానికి, మనదేశానికి అందువల్ల పెద్ద నష్టమేమీ లేదుకదా అని సమాధానం చెప్పుకోవచ్చు. అయినా సాంఘిక రూపురేఖల్లో, కొంత అనుచిత రీతి చోటు చేసుకోవచ్చు.
5) ఇ. సమాధానం : చట్టబద్ధత కల్పించడం మానవహక్కులరీత్యా సరైనదేననిపిస్తోంది. ఎందుకంటే....?
- మన దేశంలో స్వలింగ సంపర్కులు 80 లక్షల మందిదాకా వున్నారు. మరి వారికి మానవహక్కులు, ప్రాథమిక హక్కులూ లభించాలికదా?
- అసహజంగా వుండాలని ఎవరూ అనుకోరు. పుట్టుకలోనే అంతో ఇంతో తేడా వుండబట్టే అలా వుంటున్నారు. కనుక, నపుంసకులెలానో, అలానే వీరినీ మరో కేటగిరీ-సమూహం గా పరిగణించడం మంచిది.
- వైద్యునిగా-మానవీయ విలువలెరిగినవాణ్ణిగా వారిని మనతోపాటు సహజీవనం చేయనీయడమో మంచిదనిపిస్తోంది. అయితే అలా భావిస్తూనే, అట్టివారిని మళ్ళా సమాజ మార్గంలోకి మరల్చే గట్టియత్నం, నిరంతరాయంగా, పెద్దయెత్తున చేస్తుండడమూ అవసరమేననిపిస్తోంది.
- చట్టబద్ధత కలిగించడంవల్లే విపరీతాలెన్నో పుట్టుకొచ్చేస్తాయంటూ అతిగా భయపడేవాళ్ళ భయం సరైందేననడానికి తగిన ఆధారాలు ఇప్పటికి లభించలా.
- అలాగే నిషేధంపెట్టి, మరణశిక్షలాంటి పెద్దపెద్ద శిక్షలు ఏర్పరచిన సమాజాలలోనూ ఇవి ఆగిపోయినట్లు, పూర్తిగా రూపుమాసిపోయినట్లు చారిత్రకాధారాలు లేవు.
- ఎలా వ్యభిచారంపై నిషేధం వున్నా అది వుంటూనే వచ్చిందో, అలానే దీనిపై మరింత కఠినమైన శిక్షలున్నా సమాజంలోనూ ఇది వుంటూనే వచ్చింది.
- కనుక వాస్తవాలాధారంగా ఏమిచేయాలన్నది మరింతగా ఆలోచించి అడుగేయడం మంచిది.
పై సంచికలో మరికొన్ని వివరాలతోపాటు నా దృష్టికోణాన్ని కొంతవరకు మీముందు పెడతాను.
గమనిక : పాఠకమిత్రులారా! మీరూ స్పందించండి. స్పందించకపోవడం జడత్వానికి గుర్తు. అందునా సామాజిక రీతి రివాజులపై ఉచితంగా స్పందించడం ప్రతి పౌరుని విధి, కర్తవ్యం, హక్కు కూడా. ఈ విచారణలో భాగస్వాములు కండి.

No comments:

Post a Comment