Saturday, August 1, 2009

నూతన వివాహవిధిపై మిత్రుల స్పందనలు-ఒక పరిశీలన



వివాహ విధిపై అంతో ఇంతో స్పందన రావడం ఒకింత సంతోషాన్ని కలిగించింది. అందునా ఏదోఒకటి రాద్దాంలే అనుకునే వారినుండి కాక, సరైన మార్పునాశించే వారినుండే అవి రావడంతో, ఆ వివరాలనూ నా దృష్టికోణాన్ని మీ అందరి ముందుంచుతాను. ఇక పరిశీలించ మొదలెట్టండి.
1) పి. సుబ్బరాజుగారు, జిన్నూరు నుండి :  మా నూతన వివాహ విధిని ఒకింత సాకల్యంగానే పట్టిచూసి, సవరణలు పూరణల సందర్భంగా పట్టించుకోవలసిన అంశాలంటూ ఇలా చూపెట్టారు.

'నూతన వివాహవిధి' అంటున్నా దానిలో జగన్‌గారు తనని తాను 'పురోహితుణ్ణి' అని పరిచయం చేసుకోవడంకంటే, నిర్వాహకునిగనో, వివాహకర్తగనో పరిచయం చేసుకుని వుంటే బాగుండేదనిపించింది.
మా దృష్టి : పురోహితుడంటే, హితాన్ని కోరుతూ, దానిని పొందించేందుకు ముందుండి నడిపించేవాడని అర్థం. ప్రస్తుతం వాడుకలో వున్న, పెండ్లిండ్లు, శ్రాద్ధాలు, పిండాలు పెట్టించే వాడన్న అర్థం నిజానికామాట నుండి రాదు. మంచి పనులను-చేయవలసిన పనులను - సక్రమంగా నిర్వర్తింపజేసేవాడు అన్న అర్థాన్ని సూచించడానికే అది పుట్టింది. ఆస్థిక వ్యతిరేకత - సంస్కృత భాషా వ్యతిరేకతగా కూడా చోటుచేసుకుని వున్న నేటి పరిస్థితులలో; భాషపై వ్యతిరేకత అన్నది వివేకవంతం కాదు, సక్రమ యోచనా జనితమూ కాదన్న నిర్ణయంలో వున్నాం మేము. సంస్కృత భాషలోనున్న - ఏ భాషలోనున్నవైనా- మంచి భావాన్నిచ్చే పదాలను, భావాలనూ నిలిపి వుంచుకోవడం మేలు - అవసరమూ కూడా అనుకునే, ఉద్దేశ్యపూర్వకంగానే ఆ పదాన్ని వాడాము. భాషాపరమైన అనవసరపు వ్యతిరేకతలు లేనట్లయితే అట్టివారు ఈ వివాహవేదికపై సుబ్బరాజుగారన్నట్లు వివాహ నిర్వాహకునిగ తనను తాను పరిచయం చేసుకోవచ్చు. ఇక పెండ్లిపెద్ద, వివాహకర్త అన్న రెండు పదాలు సందర్భానికి, ఆ పాత్రకు తగిన అర్థాన్నివ్వవు - కనుక వాటిని విడచి మండలి విధానంలో పెండ్లి జరుపుకునేవారు; పెండ్లి జరిపించేవారిని, పురోహితుడు అనిగానీ వివాహ నిర్వాహకుడు అనిగాని సంభోదించవచ్చు.
2) 'నేటికాలంలో జరుగుతున్న వివాహ తంతు ఒక జాతరగానో, రణగొణధ్వనిగానో, సముద్రం ఘోషలానో మారి, శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తోంది' అని మండలి వారన్నమాట యదార్థాన్ని తెలిపేదే. అయితే మీరు నిర్వహించిన వేదికలోనూ ఆ లక్షణాలు కనిపించాయి.
మండలి : ఒక క్రొత్త ప్రయోగం, అదీ మొదటిసారి చేశాం. అందరికీ అన్ని విషయాలూ క్రొత్తవే. అయితే ముందుగా చేయగలిగిన మార్పులు (ఉదా : బ్యాండు మేళం, రికార్డింగ్‌ డ్యాన్సులు, అనేక వాయిద్యాలతో చిల్లర పాటలు, చెవులు హోరెత్తించే డోలు, సన్నాయి వాయిద్యాలు ఎత్తివేశాం) చేశాం. ఎంపిక చేసుకున్న, మంచి సినిమా పాటల్ని (1) వాయిద్యాల హోరులేకుండా, (2) ప్రధాన వివాహతంతు నడిచే ముందూ, వెనకల వుండేట్లు ఏర్పరచాం. వివాహ విధి నిర్వహించే సమయంలో ఆయా ఘట్టాలకు చెందిన సందర్భోచితమైన 3, 4 పాటల నుండి ఒకటి రెండు చరణాలు ఆలపించమన్నాం, (3) సభకు నిశ్శబ్దంగా వుండండి అని ముందుగా, ఒకటి రెండుమార్లు సూచించాం, హెచ్చరించాం. మిగిలిన సాంప్రదాయ వివాహాలలో జరిగే రొదతో పోలిస్తే ఖచ్చితంగా 50, 60 శాతం శబ్దకాలుష్యం తగ్గిందన్నదే నిజం.
పిల్లల్ని వెంటేసుకురావడం, వచ్చినవారు గుంపులు గుంపులుగా పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటుగా మారిన థలో, శబ్దకాలుష్యాన్ని మొత్తంగా ఒక్కసారి తీసేయడం ఆచరణసాధ్యంకానిపని. అయినా మరిన్ని ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వుంది. మా వేదికలో మైకు సక్రమంగా వినియోగించలేకపోవడం పాడేవారికీ, వాయించే వారికీ మధ్య వుండాల్సినంత పొంతన లేకపోవడం లాంటివీ తోడై ఒకింత శబ్దకాలుష్యాన్ని కలిగించాయి. ప్రత్యామ్నాయంగా (1) ముందే మైకును ప్రయోగించి సరిగా వుండేలా శ్రద్ధ తీసుకోవడం, (2) నేరుగా కచేరీ బృందాన్ని పెట్టడంకంటే, అవసరమైన పాటల క్యాసెట్లు వేసుకోవడం బాగుంటుందనిపించింది. ఇకనుండి జరిపే వివాహాలలో ఆ శ్రద్ద తీసుకోవలసి వుంటుంది. (3) సర్వేజనా సుఖినోభవంతు, లోకా సమస్తా సుఖినోభవంతు లాంటివి మీరు నిర్వహించిన తరహా పెళ్ళిలో అనవసరం అనిపించింది.
మండలి : ఇది సంస్కృత భాషపై వ్యతిరేకత కాకుంటే, అందులో దోషమేమిటో చెపితే బాగుండేది. శుభకామన ఏరూపంలో వున్నా, అట్టివాటిని అంగీకరించడం, ఆదరించడమే మంచిది. భాషా వ్యతిరేకత వదులుకోవడం మేలు. మీవరకు మీరు భాషా వ్యతిరేకత దగ్గర వుండరనే అనుకుంటున్నాను.
4) పెండ్లి కుమార్తె తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భౌతికంగా లేనందున వారికి బదులుగా వారి దగ్గరి బంధువుల్ని వేదికపైకి పిలిచినా, అంతకన్నా ముందు తల్లిని వేదికపైకి పిలిస్తే బాగుండేది. చాలా ఆలశ్యంగా ఎవరో గుర్తుచేశాక పెండ్లికుమార్తె తల్లిని పిలవడం సబబుగా లేదు.
మండలి : వివాహ వేదికకు ముందు జరిగిన సంఘటనలనూ కలిపి చూడాల్సింది విమర్శకుడు. తెలియకుంటే అడిగైనా తెలుసుకునుండాల్సింది. కొన్ని వారాల ముందే మేము వధువు తల్లిగారికి, వేదికపై మీరుంటేనే బాగుంటుంది. ముత్తైదువులే వుండాలి, వితంతువులుండరాదు అన్న ఆచారం అవివేకవంతమైనది. మీకుగా గట్టి పట్టింపు వుంటే మేము వత్తిడి చేయముగాని, మీరు కూర్చోడమే మాకిష్టం, సంతోషదాయకం కూడా అని చెప్పాము. మేము గమనించినంతలో వారు ఆస్థిక భావాలలోనూ, సాంప్రదాయక ఆచారాల పట్టులోనూ వున్నవారే. మరీ నియంతృత్వపు పోకడపోకుండా చేయగలంత మార్పులు చేస్తూ వచ్చాము మేము. ఆమె కూర్చోడానికి అంత సుముఖంగా లేరు. అటువైపు బంధువర్గమూ, బాబాయి-పిన్నిగార్లనే కూచోమన్నారు. రెండు మూడుసార్లు చెప్పిచూసి సరే మీ ఇష్టం అన్నాము మేము. వివాహానికి ముందు కూడా శ్యామల మళ్ళా సమత తల్లిగారిని, మీరే కూర్చోవచ్చుగా అని హెచ్చరించిందటకూడా. సంప్రదాయపు బలం, వారి ఒకపట్టాన అందుకు సిద్ధపడనీయలేదు.
ఇక ఎవరో సూచించాక ఆమెను పిలిచామనడం ఒకింత తొందరపాటు విమర్శే. అదలా వుంచి, ఎవరైనా అలాటిపని చేసి, వేదికమీద ఒక క్రమం నడుస్తుండగా, ఆమెను పిలవండి, ఆమెను పిలవండి అని అనడం వుండే, అది సందర్భశుద్ధి లేని తనాన్ని, తనను ప్రదర్శించుకునేతనాన్ని చూపెడుతుందంతే. అది ఆ విషయానికి అనవసరపు ప్రాధాన్యతనివ్వడం కూడా. అసలింతకూ, మనమిక్కడ పట్టించుకోవలసిన అస్సలు విషయం, ఏమిటి? ముత్తయిదువులు, వితంతువులు అన్నదృష్టి అసమంజసం. భర్తహీన అయినంతమాత్రాన ఒక తల్లి తన కూతురు పెళ్ళిలో వేదికపైనుండరాదు, శుభకార్యాలలో వారు పాలుపంచుకోరాదు అన్నది తప్పుభావన. దానిని విడిచిపెట్టడం అన్నివిధాలా వివేకవంతం అన్నది మాత్రమే. ప్రజల్ని ఒక తప్పుడు విధానం నుండి సరైన దారికి మళ్ళించే యత్నంలో కొంత ఘర్షణ, కొద్దోగొప్పో లోపమూ కూడా. కొంతకాలం వుంటూనే వుంటాయి ఇలాంటి వాటి విషయంలో శల్యపరీక్షలు చేయకుండా ఆ క్రొత్త యత్నాల దిశ ఎటుంది, గమనం ఎలావుంది అన్నది చూస్తూ సాగుతుండాలి. అయినా ఈ విశ్లేషణకు దోహదపడిన మీ విమర్శవల్ల మేలే జరిగింది.
5) వధూవరులూ వారి తల్లిదండ్రులూ పరస్పరం నూతన వస్త్రాలు బహూకరించుకోవడం, వధూవరులు నూతన వస్త్రాలు ధరించి రావడం అన్నది నా వరకు నాకు అనవసరం అనిపించింది. సదస్సులనుండీ పెదవి విరుపులు వినిపించాయి. నాటకంలోని ఒక అంకానికి, మరో అంకానికీ మధ్య కనిపించే విరామాన్ని జ్ఞప్తికి తెచ్చింది. ముందే నూతన వస్త్రాలు ధరించి వస్తే సరిపోయేదానికి మధ్యలో మళ్ళీ ఈ నూతన వస్త్రాల వ్యవహారం సాంప్రదాయ విధానంలోని భాగమేకదా! దాని అవసరమేమిటో, వదిలేస్తే ఇబ్బందేమిటో నాకర్థంకాలా!
మండలి : ఇలాంటి విమర్శలన్న ఆ సంఘటనను చూస్తున్నవారు ముందుగా ఏర్పరచుకున్న భావాలలోనుండి - వేరు వేరు రంగద్దాలలో నుండి చూడడంవల్ల పుట్టుకొస్తుంటాయి. ఒక్క మాటడుగుతాను. పి.ఎస్‌.ఆర్‌.నేగాక మీ అందరినీ కూడా! పెళ్ళికి వందలమందినో, వేలమందినో పిలవాల్సిన పనేముంది. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయించేస్తే సరిపోతుందికదా! ఇందువల్ల ఏర్పడే లోటేమిటి?
ఈ ప్రశ్నకు సక్రమమైన సమాధానం ఒక్కటే, సిద్ధాంతపరంగా చెప్పుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ ఒక్కటే సరిపోతుంది. కాని పెళ్ళంటే కేవలం చట్టబద్ధత కల్పించడమొక్కటేకాదు. అదొక వేడిక కూడా. బంధుమిత్రులందర్నీ పిలుచుకోవడం మన ఆనందాల్ని వారితో కూడా కలసి పంచుకోవడం. స్వభావంలోని సుందరతను (కళాహృదయాన్ని) సంతృప్తిపరచడం అన్నదీ అందులో కలిసుంది. ఒక్కొక్కరు ఒక్కోదానికి ప్రాధాన్యతనిచ్చి మిగిలిన వాటిని అప్రధానం అంటూనో, అనవసరం అంటూనో మొదలెడితే చివరికి వేడుకగా అందులో మిగిలేదేమీ వుండదు. వేడుకను వేడుకగా చూడలేనితనాన్ని మార్చుకోవడమే మంచిది. కాని, అక్కడ మనం మారాల్సిన అవసరం లేదు.
6) ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడం ద్వారానే మనిషి జీవితాకాంక్షల నెరవేర్పులో సఫలతనందుతాడు. ఈ సఫలత అన్నది ప్రధానంగా స్త్రీ పురుషులు అవగాహనాపరులూ, ఆత్మనియంత్రణపరులూ అయి, పరస్పర పూరకాలుగా వుండే రీతిని మసలుకోవడంపై ఆధారపడి వుంటుంది. ఇది మండలి అభిప్రాయమేననుకోవచ్చు.
మండలి : ఇది సత్యాన్వేషణ మండలి అభిప్రాయంగా భావించడమే సబబు. (మండలిలో వుంటూ దీనిని కాదనేవారుంటే మండలి అంతర్గత సమావేశాల్లో చర్చించడం అవసరం) ఆత్మ అన్నమాట సంస్కృతం నుండి వచ్చింది. దానిని ఆ భాషనెరిగినవారు పలు అర్థాలలో వాడారు. సంస్కృతభాష నెరిగిన ఆనాటి చార్వాకులు, నాస్తికులూ కూడా ఆత్మ అన్న పదాన్ని ఎటువంటి డోలాయమానత (ఊగిసలాట) లేకుండా వాడుకున్నారు. ఆస్థిక సిద్ధాంత తాత్విక గ్రంథాలలోనూ ఈ ఆత్మపదం శరీర భిన్నమైన ఏదో పదార్థం అన్న అర్థంలోనే కాకుండా, వివిధార్థాలలో వాడబడింది. ఆస్థికులూ, నాస్తికుల్ని (చార్వాకులూ, లోకాయతులు, బార్హస్పత్యులు, నిరీశ్వరవాదులు అని పిలువబడ్డ సమూహాలను) దేహాత్మవాదులు అని తరచుగా సంబోధించారు. ఈనాడు నేను, 'అహం' అన్న పదాలు ఏ అర్థంలో వాడబడుతున్నాయో ఆ అర్థమే ఆత్మ అన్న పదానికి సాధారణార్థం. కనుక ఆత్మ నియంత్రణ అన్న పదానికి సెల్ఫ్‌ డిసిప్లేన్‌ () అన్నదికాక మరో అర్థం గుంజడం అనవసరం. భాషప్రకారం మరో అర్థం రాదుకూడా. మీరే అన్నట్లు స్వీయ నియంత్రణాపరులు (తన అదుపులో తానున్నవారు) అన్న అర్థమే దానిది. అయినా స్వీయ నియంత్రణాపరులు అన్నపదం ఆ సందర్భానికి అంతగా నప్పదు. మీరనుకుంటున్నట్లు ఆత్మాభిమానం, ఆత్మ నియంత్రణ వంటి మాటలు ఆత్మవాదం నుండి పుట్టినవికాదు. అసలు, ఆత్మవాదం అన్నపదం దానికదిగా ఆస్తికతను చూపదు. అది అనంతరకాలంలో ఆ అర్థంలో స్థిరపడింది. 'అనాత్మవాదం' అన్నది దేహాత్మవాదానికి ప్రత్యామ్నాయంగా రూఢిపడింది. స్వాభిమానం, ఆత్మాభిమానం అన్నవి అన్నివిధాలా సమానార్థకాలే. వాటిమధ్య వేరర్థాల్ని లాగాల్సిన పనిలేదు. లాగినా ఆ రూపానికది సాగదు.
ఇక ధర్మార్థ కామమోకక్షుల విషయం. నిజానికి పెళ్ళి మంత్రాలలో ధర్మేచ, అర్థేచ, కామేచ నాతి చరితవ్యా, నాతి చరామి అన్న మాటలే వున్నాయి. మోహమన్న మాటకు తాత్వికంగా 'బంధరాహిత్యం' విడుదల అనే అర్థం. ఈ పదమూ సందర్భాన్నిబట్టి రకరకాల అర్థాలలో వాడబడింది. భాషానియమాన్నిబట్టి, ఒకటికంటే ఎక్కువ అర్థాలను కలిగివున్న శబ్దాలు వాడబడ్డప్పుడు, ప్రయోక్త ఏ అర్థంలో వాడాడన్నడి గమనించడం తప్ప, ఎవరిష్టమొచ్చిన అర్థం వాళ్ళు చెపకుండదు. ఎక్కడైనా, అలా వాడకూడదు అనాలంటే, అక్కడ ఆ అర్థాన్ని భాష అంగీకరించరాదన్న ఆధారంగా చూపారు. కనుక మండలి ప్రస్తావించిన అర్థం సాంప్రదాయక వివాహంలోనిదికాదు. అదలా వుంచితే, మండలి తాత్విక క్షేత్రం, ధర్మార్థ కామమోక్షాల భావనను తనదైన అర్థంలో ఇముడ్చుకునే వుంది.
వ్యష్ఠి సమష్టి శ్రేయస్సుకు అనుకూలమైన, ప్రతికూలంగాని పనుల ద్వారా ఇష్టాఇష్టాల్ని, అవసరాలను ఆకాంక్షలను నెరవేర్చే వాటిని ఆర్జించుకుని, వాటిని పొందడం ద్వారా సమస్యల నుండి విడుదల పొందడం అన్న అర్థంలో ఆ పదబంధాన్ని వాడుతున్నాము మేము. వెనుకటి తాత్వికులలోనూ కొందరీ అర్థాన్ని కలిగి వున్నారు. 'జీవన్ముక్తి' అన్న పదం అలా పుట్టిందే. ప్రాచీనులలోని భౌతికవాదులు ముక్తి, మోక్షం అన్న పదాల్ని వాడకుండా లేరు. నిర్భయంగా, నిర్దిష్టంగా ఆ పదాలు ప్రయోగించారు. దానర్థం ఇది అంటూ; ఈ లోకంలోనే ముక్తి అనన్నారు. కొందరైతే మరణమే ముక్తంటే అనేంతవరకు సిద్ధపడ్డారు. ధర్మవిరుద్ధమైన అర్థసంచయనము-కామభోగములతో కూడి పూర్ణాయువును అనుభవించి, అన్నది ధర్మార్థకామాలకు వర్తించగా, అలవోకగా ప్రాణం విడవడం-రోగమూ రొష్ఠులూ లేకుండా మరణించడం అన్న దృష్టితో ఈ పదాల్ని వాడినవారూ వున్నారు. దీనిని మరింతగా విచారించాల్సిన అవరమున్నా, ఇది తగినసందర్భం కాదుగనుక ఇక్కడికి ఆపుతాను.
మనిషికి వివేకం అంగీకరించేమేర స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందడాన్ని వుండకూడని బంధనాల నుండి విడుదల పొందడాన్ని మోక్షం అన్నమాటతో తెలియజేయవచ్చు. కనుక మోక్షం అనగానే ఆస్థికతంతా వచ్చికూచుంటుంది అనఖ్కర్లా. ఒకవేళ ఎవరైనా అట్టి అభిప్రాయంలో గనక ఇప్పటినుండే వారే దానిని వదులుకుని మరింత సరైన భావాలవైపుకు కదలడం మంచిది.
7) ''సువర్ణహారధారణ, దానివెంటనే, నా జీవిత సఫలితకు ఆధారమైన నీవు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించఆలిలని కోరుకుంటున్నాను''.
ఈ ఘట్టం మంగళసూత్రధారణను గుర్తుకు తెస్తోంది. ఇంతకుముందే ఇదే తరహా మాటలు చెప్పించి ఉంగరాలు మార్పించారు. ఒకరి మెడలో వేస్తే మంగళసూత్రధారణలా వుంటుందని ఇరువురికీ సువర్ణహారాలు వేయించినట్లు అనిపించింది.
మండలి : కొన్ని భావనలకు ప్రతీకల్ని, కొన్ని సంఘటనలకు స్మృతిచిహ్నాల్ని, ఇంకొన్ని స్మరణీయులకు సంకేతాలను ఏర్పరచుకోవడం మానవ సమాజంలో ఎప్పుడూ వున్నదే. అది అలాగే కొనసాగించుకుంటూ వుండాల్సినంత విలువైంది కూడా.
కనుక కొన్ని ప్రత్యేక సంఘటనలకు సంబంధించి స్మృతిచిహ్నాల్ని, ఇంకొన్ని స్మరణీయులకు సంకేతాలను ఏర్పరచుకోవడం మానవ సమాజాలలో ఎప్పుడూ ఉన్నదే. అది అలాగే కొనసాగించుకుంటూ వుండాల్సినంత విలువైంది కూడా. కనుక కొన్ని ప్రత్యేక సంఘటనలకు సంబంధించి స్మృతి చిహ్నాలను పదిలపరచుకోవడం విజ్ఞులంగీకరించేదే. కేవలం ఒక ఘటనకు సంబంధించిన స్మృతి చిహ్నంకంటే, ఒక ఉదాత్త భావనకు సంబంధించిన స్మృతి చిహ్నాలను ఏర్పరచుకోడం మరింత వివేకవంతంకదా. నాకు తెలిసి మంగళసూత్రధారణ అన్నది వైదిక వివాహ పద్ధతిలో చోటుచేసుకుని లేదు. ఇతరమైన దేశాచార పద్ధతులలోనూ ఎక్కువ ప్రాంతాలలో ఇది లేదు. కనుక దానికదిగా మంగళసూత్రధారణ భారత సాంప్రదాయ వివాహ పద్ధతిలో తప్పనిసరేమీ కాదు. అయినా, మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవశ్శరదం శతమ్‌|| అన్న శ్లోకం చాలా ఉదాత్తమైన భావన కలిగిందే. కనుక ఎవరైనా దానినెందుకు తృణీకరించాలి? నా అభిప్రాయం ప్రకారం ఆ ఘట్టం, ఆ భావన కూడా వుంచుకోవలసినదే.
అయితే, మంగళసూత్రం ఐదవతనానికి గుర్తుగానో, మగవాని దౌష్ట్యానికి ఆధారంగానో చూడబడడాన్ని పోనాడాలి. స్త్రీ మెడనుండి తీసేయనే కూడదన్నంత పవిత్రత దానికేమీ లేదు. అస్సలు పవిత్రత నాపాదించే వేటి విషయంలోగానీ, నా అవగాహన ప్రకారం అనవసరమైన పోకడ వుంది. 'పవిత్రత' అన్నపదం దానికదే ఒక బలహీనమైన పదం - నిర్దిష్టార్దిమంటూ లేనిపదం. సాంప్రదాయంలో, మంగళసూత్రానికి వస్తున్న ప్రాధాన్యతను ఎత్తివేసి, వివాహక్రమంలో ఆ సందర్భంలో ప్రకటిస్తున్న భావనను మాత్రం ఆ జీవితం నిలిపి వుంచుకోవడం యోగ్యమైన పని. ఆ భావనకు అంత విలువుందని అనిపించడంవల్లే ఒక్కసారి అవి ఊరుకోవడంగాకుండా, ఆ సందర్భాన్ని పునరావృతమయ్యేలా చెరొక హారాన్ని వేయించి రెండుసార్లు చెప్పించాము.
కాకుంటే ఆ మాటలను పాఠం అప్పచెప్పినట్లు కాకుండా, విడమరచి అర్థం మరోసారి పురోహితునిచేతా చెప్పించి, దానికి ఒక పత్రంపై ముద్రింపించి వధూవరుల, తల్లిదండ్రుల, పెద్దల సంతకాలూ పెట్టించి ఫ్రేమ్‌ కట్టించేంత పనిచేస్తే బాగుండేది.
ప్రశ్న : ఇక ఈ విషయంలో మరికొందరు మిత్రుల నుండి మరో సూచనవచ్చింది. 'బంగారపు గొలుసు' అన్నది విధానంలో వుంచితే స్తోమత లేనివాళ్ళకు భారమవుతుందికదా? అని.
మండలి : ఒక కోణం నుండి చూస్తే ఇది కొంతవరకు సబబేననిపిస్తోంది. అయితే దీనికి మరో కోణమూ వుంది. ఏదో ఒక నెపం, వత్తిడి పెట్టుకుంటే పేద బ్రతుకుల్లో అలంకరణ, ఆభరణాలపరంగా కనీసాకాంక్ష తీరే అవకాశాలు కూడా అంతగా వుండవు. అలా ఏర్పడిందే మట్టెలు, పట్టెలు, దిద్దులు, ముక్కుపుడక, పెండ్లి వుంగరం, సూత్రాలు అన్నంతవరకైనా వెండి, బంగారాలతో చేయించాలనే ఆచారం. అప్పోసప్పో చేసిగానీ, దగ్గర బంధువులు తలా ఒక చేయివేసిగానీ కనీసస్థాయిలోనైనా, నగలు నట్రా, బట్టలు, ఇంటి సామగ్రి సమకూర్చడం జరుగుతూ వస్తోంది కుటుంబంలో. ఉన్నవాళ్ళ విషయంలో ఇదెలానూ సమస్యకాదు, లేనివాళ్ళకు ఈ సాకుతోనైనా వాటిని సమకూర్చడం మేలు, అవసరం కూడా. ఆత్మతృప్తికీ, హఠాత్తుగా వచ్చే అవసరాలకూ కూడా అవసరపడగల ఆభరణాలను అంతో ఇంతో సమకూర్చిపెట్టడం మంచిదేకదా! అయినా, ఇక్కడ సువర్ణహారం నియమంకాదు. స్మృతిచిహ్నమే నియమం - స్తోమతనుబట్టి అదేదన్నది ఎవరికి వారుగా నిర్ణయించుకోవచ్చు.
8) ''మాకు సెలవిప్పించండిక'' అన్న భాగం ఎబ్బెట్టుగా వుంది అన్నది మీ మరో ప్రస్తావ.
మండలి : హాస్యం కోసం అనుకున్న దానిని గురించి మరికొద్ది మంది విచారించి, దానిని తొలగించాలో లేదో ఆలోచిస్తాను. నావరకు నాకు మాటలు తీసయడానికెట్టి అభ్యంతరం లేదు.
9) ఒక ఐ.పి.ఎస్‌. అధికారిని, మరో డాక్టర్‌ను పెళ్ళి పేరుతో వేదిక ఎక్కించి నాటకంలోని పాత్రలు స్క్రిప్ట్‌ చదివినట్లు చదివించడం బాగాలేదు.
మండలి : ఒక్కవిషయం అందరూ గుర్తించాలి. విధానం క్రొత్తది, ప్రయోగం మొదటిది. రీతి, భావజాలము, ప్రకటనలు, ప్రసంగాలు అన్నీ అందరికీ క్రొత్తే. 'అందరూ క్రొత్తవారే. అంతా క్రొత్తే!' అన్న పరిస్థితులవల్ల ఏర్పడ్డ ఇబ్బంది ఇది. దీనంతటినీ ఎలా నైపుణ్యంతో నిర్వహించాలా అన్నది, మార్పులు చేర్పులేమిటన్నది ఇంకా చూడాల్సివుంది. అయినా ఒక్కమాట! ఎప్పటికప్పుడు ప్రతి వవాహంలోనూ వధూవరులకు, వారి తల్లిదండ్రులకూ ఇది క్రొత్తగనే వుంటుంది గనుక చదివించడమో, అనిపించడమో చేయక తప్పదు. పెళ్లినాటి ప్రమాణాలు-వాగ్ధానాలు ముద్రింపించి పటం కట్టించడం ఒక ప్రత్యామ్నాయం. కొద్దిరోజుల ముందే వేదికపై చెప్పాల్సిన వారి వారి సంభాణలు ముఖ్యులవరకైనా అందించడం మరో ఉపాయం. సప్తపది పేరున గుదిగుచ్చిన 7 ప్రతిజ్ఞలూ వైయక్తిక, కౌటుంబిక, సామాజిక స్పృహను, అవగాహన పెంచే తప్పనిసరి భావనలు. వాటిని తీసేయాల్సిన పనిలేదు. ఉంచాల్సిన అవసరం వుంది. కాకుంటే ఒకింత భాష మార్చి, కుదించి రూపొందించడం చేయొచ్చు. ఆ దిశగా మీరూ వాటి మెరుగైన రూపాల్ని తయారుచేసి పంపండి. రాబోయే పుస్తకంలో వాటినే చేర్చుదాం.
10) చప్పట్లు : ఇది కొంత అతిగా అయ్యిందేమో! కుదించే పనిచేద్దాం. ఇక మీరు లేవనెత్తిన చిన్నాచితకల గురించి అవసరమైన మార్పులు చేసేందుకు యత్నిస్తాను.
11) వివాహం ఆడంబరంగా వుందన్నది మరో విమర్శ : చాలావరకు తగ్గించాం. మీ చేతుల్లో లేకుండాగానీ, ఇతరుల వత్తిడివల్లగానీ, ముందే సరిచూసుకునే వీలులేకగానీ, అట్టివాటిని గురించి వివాధ విధిలో ప్రస్తావిద్దాం.
పి.ఎస్‌.ఆర్‌.గారికి, మిత్రులకు-ఇలాంటి విమర్శలవల్లా, విశ్లేషణలవల్ల అంతో ఇంతో విషయం మెరుగుపడుతుందేగాని, నష్టమేమీ వుండదు. అలాగే మనమన అవగాహనలు, దృష్టికోణాలు కూడా మరికొంత సక్రమపడనూవచ్చు. కనుక లోకహితం లక్ష్యంగా మరింత ఆలోచనకు చోటిస్తూ సాగుదాం.

No comments:

Post a Comment