మిత్రులు ఫజులుర్ రహ్మాన్‌గారు బాధ్యత తీసుకుని సి.టి.ఎఫ్.వారితో సంప్రదిం చడం, వారొక రీతిలో స్పందించడం, దానిపై నావైపునుండి కొంత విశ్లేషన రావడం గురించి జులై సంచిక ద్వారా మీ అందరకూ తెలుసు. అందులో మన ప్రస్తుత చర్చావేదిక సందర్భానికి సంబంధించిన ఒక అంశం, నాస్తికులముందు, నాస్తిక సంస్థల ముందు, మేము మా బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి సిద్ధము. అయితే అటువైపు పాల్గొంటున్నది ఎవరో మాకు ముందే తెలుపాల్సి వుంటుంది. అని సి.టి.ఎఫ్.వారు రహ్మాన్‌గారి ద్వారా కబురెట్టడం అన్నది.
దానిపై రెహ్మాన్‌గారితో, మీరూ యత్నించండి నాస్తికపక్షాన పాల్గొనేవారికొరకై అని నేను చెప్పాను. అందుకాయన ఆ క్షేత్రాలతో నాకెక్కువ పరిచయము లేవు గనుక మీరేయత్నిస్తే బాగుంటుందికదా, అన్న సూచన చేశాను. కొంత యత్నంచేసి, నాలుగు పేర్లు ఖరారుచేసి రహ్మాన్‌గారికి తెలియజేశాను. వారి పేర్లు, వివరాలివిగో.
1) పి. సుబ్బరాజుగారు (పి.ఎస్.ఆర్. అనంటారు సంక్షిప్తంగా) భారత హేతువాద సంఘం, ఆం.ప్ర. అధ్యకక్షులు.
2) ఎస్.నాగేశ్వరరావుగారు, హేతువాద సంఘాలకు బైబిల్ను లోతుగా పరిశోధించిన వ్యక్తిగా సుపరిచితులు.
3) గుమ్మా వీరన్నగారు (అటు హేతువాద సంఘంలోనూ, ఇటు నవ్య మానవవాద సంఘంలోనూ కీలకమైనవారు. మన వేదికలో భౌతికవాద పక్షాన నిలిచి పరిణామ వాదాన్ని ప్రతిపాదించి వున్నారు)
4) పి. రాజేంద్రప్రసాద్‌గారు, జనవిజ్ఞానవేదికలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన వేదికలో వీరన్నగారితోబాటు వీరూ, తమదైన శైలిలో నాస్తికపక్షాన ప్రతిపాదకులుగా వున్నారు.
ఈ నలుగురూ రేపు సి.టి.ఎఫ్.వారు ప్రతిపాదించబోయే బైబిల్ సృష్టివాదాన్ని పరీక్షించడానికి, ప్రశ్నించడానికీ సిద్ధపడ్డారు. కనుక ఇక్కడికి సి.టి.ఎఫ్.వారడిగిన మేర మావంతు కర్తవ్య నిర్వహణ పూర్తయినట్లే. ఇక రహ్మాన్‌గారు ఒకింత చొరవదీసుకుని రెండు పక్షాలకు అనువైన స్థలకాలాల నిర్ణయం చేయాల్సి వుంది.
ఒక ముఖ్య గమనిక : ఈ వేదిక క్రొత్తదికాదు. వేదిక నియమ నిబంధనలూ క్రొత్తవికాదు. నూనూ, ఫజులుర్ రహ్మాన్‌గారు ఆరంభించి కొంతవరకు సాగించిన వేదిక క్రమపు కొనసాగింపుగా ఏర్పరుస్తున్నదే ఇది. దీనిని అన్నిపక్షాలూ తప్పనిసరిగా గమనికలోకి తీసుకోవాలి.
ఇప్పటికైనా సి.టి.ఎఫ్.వారు వారి సృష్టివాదాన్నిప్రతిపాదించి, నిరూపించడానికి సిద్ధమైనందుకు వారిని అభినందిస్తున్నాను. వైయుక్తికాంశాల జోలికపోకుండా, అన్యవిషయ ప్రస్తావనలు చేయకుండా, ఎంచుకున్న విషయానికి పరిమితమై సాగుదాం అన్న వారి సూచన సబబైందేగనక వేదిక అలాగే జరిగేలా చూడడంలో ఎవరి వంతు కృషి వాళ్ళు చేద్దామని చెపుతూ, క్రమంలో తేడాలు రానంతవరకు మేము, అట్లే ప్రవర్తిస్తామని బహిరంగంగా మాటిస్తున్నాను.
మిత్రులు రహ్మాన్‌గారికి, మరీ ఎక్కువదూరం కాకుండా, త్వరలో బహుశా ఆగస్టునెల మధ్యలో వేదిక ఏర్పరిస్తే బాగుంటుంది. నాస్తికపక్షం నుండి అంగీకరించిన పై నలుగురూ రెండు మూడంశాలు ప్రస్తావించారు.
1. వేదిక సమయాన్ని గురించి 10 రోజులు ముందుగా మాకు తెలుపండి. వీలు చూసుకోవాలి.
2. బైబిలు సృష్టివాదపు ప్రతిపాదన ప్రతిని ముందుగా మాకందజేయగలిగితే మేలు. మేమూ దానిని ఒకింత పరిశీలించుకుని రావడానికి వీలవుతుంది. అది విచారణ లోతుగా సాగడానికీ దోహదపడుతుంది.
3. సమావేశస్థులం అందరికీ అనువుగా, అభ్యంతరం లేనివిధంగా వుంటే బాగు.
మరో గమనిక : యధావకాశం ఈ క్షేత్రాలలో ప్రవేశము, అభినివేశము వున్నవారి వరకు సదస్యులుగ వుండేట్లు చూద్దాం.
ఇష్టాగోష్టి - విశేషాలు
జులై 11, 12, 13 తేదీలలో జరిగిన త్రైమాసిక సమావేశాలలో మామూలుగా రాత్రిపూట జరిగే ఇష్టాగోష్టిలో; స్వేఛ్ఛ, త్యాగము అన్న రెండు పదాలపై ఒకింత వివరంగా విచారణ జరిగింది.
స్వేచ్ఛ అంటే ఏమిటి? అన్నదానికి గోష్టిలో పాల్గొన్నవారు రకరకాలుగా అర్థాలు చెప్పుకొచ్చారు. అనుకున్నట్లు ప్రవర్తించగలగడం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించగలగడం, ఏ బంధనాలు లేకుండడం, అన్నదే వాటన్నింటి సాధారణ రూపంగా అనిపించింది.
అలా అయితే స్వేచ్ఛంటే విశృంఖలత అనే అనుకోవచ్చు అనడిగాను. కొందరు మళ్ళా ఆలోచనలో పడ్డారు. రెండూ సమానార్థకాలు అనకూడదు. విశృంఖలత వుండకూడనిది, స్వేచ్ఛ వుండవలసింది అనడమే సబబుకదా! అని కొందరన్నారు. అలా అయితే ఆ రెంటి అర్థాలు చెప్పి తేడా ఏమిటో చెప్పండి అనడిగాను.
1. స్వయిచ్ఛ = స్వేచ్ఛ అవుతుంది. అంటే తన ఇష్టం వచ్చినట్లుండగలగడం అనేకదా దానర్థం.
2. విశృంఖలత = బంధనాలు లేకపోవడం, విరహిత సృంఖలత : తొలగిన బంధనత్వం - బంధన రాహిత్యం.
ఇలా చెప్పుకుంటే రెంటికీ ఒకే అన్వయం ఏర్పడుతోందిగదా! ఎట్టి అవరోధకాలు లేకపోవడం, తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం అన్న రెంటి అర్థమూ ఆచరణలో ఒకటే అవుతోందికదా! అనగా మళ్ళా ఆలోచనలో పడ్డారందరూ.
'స్వేచ్ఛా స్వాతంత్య్రాలు' అన్న పదబంధం వినేవుంటారుకదా! స్వేచ్ఛ, స్వతంత్రము అన్న రెండు మాటలకూ వేరువేరర్థాలున్నాయా, ఒకే అర్థమా అనడిగాను.
ఒకే అర్థమాత్రం కాదు. 'సైంధవాశ్వం' కప్పు, గిన్నె, పేపర్ కాగితం లాంటి మాటలా అనిపించడంలేదు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అన్నది ప్రసిద్ధంగా వాడేమాటే. అంటే వాటికి ఏ అర్థాలు చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డారు.
'పరతంత్రత, పరతంత్రుడు, పారతంత్య్రము' అన్న మాటలు విన్నారుగదా! వాటి అర్థం ఏమిటంటారని అడగ్గా.
పరతంత్రత అంటే పరాధీనత అని, పరతంత్రుడు అంటే పరాధీనుడు అని తెలుస్తోంది, అలాగే పారతంత్య్రము అంటే పరాధీనమైన అని అర్థం వస్తోంది అనన్నారు అందరూ.
మరైతే స్వతంత్రత అంటే పరాధీనత లేకపోడమేనా! స్వాధీనత=స్వ+అధీనత, తన అధీనంలో తానుండుట అనేకదా దానర్థము- అనడగ్గా అవునలా అనడమే బాగుంది - అన్నారు.
స్వ అంటే 'తన' అనేట్లయితే ఈ 'తన' దేనిని సూచిస్తుంది? అని, సొంత అభిప్రాయాల్నేకదా, అంటే తాననుకుంటున్నట్లు (ఇష్టమో, వివేకమో రెండూ కూడానో ఈ సొంత అభిప్రాయమన్న దాని క్రిందికి వస్తాయా లేదా ఆలోచించండి) అనేకదా! అలా అయితే తాననుకుంటున్నట్లు తానుండడం స్వతంత్రత కలిగి వుండడం అన్నట్లయింది. అంటే స్వేచ్ఛకు మీరిచ్చిన అర్థానికి సరిపోతోందికదా! రెండు వేరర్థాలు కలిగున్నాయి అనడమే సబబంటిరికదా! ఏం చేద్దాం. స్వేచ్ఛకు ముందు మీరు చెప్పిన అర్థమన్నా మార్చాలి, లేదా దానికింకో అర్థమన్నా చెప్పాలి. రెండూ కాదంటే ఈ రెంటి అర్థం ఒక్కటేననాలి. ఏంచేద్దామో ఆలోచించి చెప్పండి అని ఆగారు.
పాఠకమిత్రులారా! ఉద్యమ మిత్రులారా! ఈ రెండు పదాలు, త్యాగమన్న పదము కూడా భావజాల క్షేత్రంలో చాలా మౌలికమైన పారిభాషికాలు. కనుక వీటి అర్థాలు విస్పష్టంగా, దోషరహితంగా తెలుసుకుని వుండడం చాలా అవసరం. కనుక మీరు ఎవరికి వారుగా వీటి అర్థాలు తెలుసుకునే పనిచేయండి. మాతో కలసి కదలాలనిపిస్తే స్పందనకు వ్రాయండి.
త్యాగం
త్యాగమంటే ఏమిటన్నది ప్రశ్న.
ఇవ్వడం అని ఒకరన్నారు. మరి దానమంటేనో అని నా ప్రశ్న. ఇవ్వడమనే దానర్థం కూడా అనన్నారు వాళ్ళు. అంటే త్యాగం-దానం ఒకే అర్థాన్నిచ్చే పర్యాయ పదాలా? అనడిగాను. కాదు, కాదు అన్నారు ఎక్కువమంది. ఋణం కూడా ఇవ్వడాన్ని తెలిపే మాటేకదా! అలాగే ధర్మం చేయడం అన్నది కూడా ఇవ్వడాన్ని తెలిపే మాటేకదా! వ్యాపారంలో కూడా ఇరువురు (అమ్మకందారు, కొనుగోలుదారు) పరస్పరం ఇచ్చుకోవడం వుంటుంది కదా! మీరైతే త్యాగం, దానం, ధర్మం, ఋణం, అమ్మకం, అన్న మాటలన్నింటి అర్థాలలోనూ 'ఇవ్వడం' అన్న సామాన్య లక్షణం కనపడుతూనే వుంటుంది. అయినా ఆ పదాలన్న పర్యాయపదాలు - సమానార్థకాలు - అనకూడదని స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఏ రకమైన ఇవ్వడాన్ని ఏ పదం సూచిస్తుందో స్పష్టంగా తెలిసి వుండాలి.
అప్పిస్తున్నాడు. దానిని త్యాగమంటామా? తీసుకున్న అప్పు తిరిగి యిస్తున్నాడు దానిని త్యాగమంటామా? పొందిన హక్కులకు మారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. దానిని త్యాగమంటామా? కర్తవ్యం నెరవేరుస్తున్నాడు అనదగ్గ దేనినైనా త్యాగం అనవచ్చా- వ్యాపారంలో ఇచ్చేదానిని త్యాగమనవచ్చా.
మిత్రులారా! ఇంతకూ త్యాగమంటే ఏమిటి? ఆలోచించి మీ మీ అభిప్రాయాలను స్పందన ద్వారా మాకు చేర్చండి. క్రమంగా మరికొన్ని పారిభాషికాలనూ కలుపుకుంటూ జిజ్ఞాసను సాగిస్తూ వుందాం -
No comments:
Post a Comment