Tuesday, September 1, 2009

స్వలింగ సంపర్కము - ఒక పరిశీలన-3



'స్వలింగ సంపర్కం'పై ఆగస్టు సంచికలో అందించిన వివరాలు చూసి విజ్ఞులెందరో, వ్యాసం చాలా తూకంగానూ, యోగ్యమైన సమాచారం అందించేదిగానూ వుంది అంటూ ఉత్తరాలు వ్రాశారు. ఒకరిద్దరైతే, వివరాలు బాగున్నాయి. అలాగే సామాజికావసరమైన విషయాలను వేటినీ విడవకుండా తడుముతుండే మీ సామాజిక స్పృహా అభినందనీయమే. అయితే మీతో వచ్చిన చిక్కేమంటే విషయాన్ని త్వరగా తేల్చరు. నాన్చుడెక్కువ. ఏదో ఒకటి తేలిస్తే పోతుందికదా! అంటూ వ్రాశారు. చాలా లేఖలు వచ్చాయి. అన్నింటినీ యథాతథంగా ప్రచురించడం కష్టం. కనుక లేఖలన్నింటి క్లుప్త రూపాల్ని (సారాంశాన్ని) చూపెడతాను. లేఖలు వ్రాసినవారు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకోండి.

1) బాపట్ల నుండి శాంతారాంగారు, సంచిక ఈ విషయంపై చాలా విలువైన సమాచారాన్ని అందించింది. సమకాలీన సమస్యలపై పరిశీలనలు, చర్చలు చేస్తూ జనానికి అవగాహన కలిగించే యత్నం చేస్తున్నందుకు అభినందనలు. రచనలోని వివరాలు ఒక అభిప్రాయానికి రావడానికి నాకు సహకరించాయి. మానసిక శాస్త్రం ప్రకారం స్వలింగ సంపర్కాభిలాష రోగరూపం కాకున్నా, దీనిని సామాజిక దృష్టికోణం నుండి పరిశీలించడమే మంచిది. ముందుగా ఒక్క విషయాన్ని గమనించడం మంచిది. స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించే వారంతా నైతిక విలువలు కలవారనో, సమర్థించే వారంతా అభ్యుదయవాదులనో ఒక అభిప్రాయాన్నేర్పరచుకుని విషయాన్ని పరిశీలించడంవల్ల ప్రయోజనం లేదు.
అలాగే వ్యక్తిస్వేచ్ఛా? సమాజశ్రేయస్సా ఏది ప్రధానమైనది? అన్న ప్రశ్న మండలి సమాధానమైన, ''వ్యష్ఠి-సమష్టి శ్రేయస్సు'' అన్న దృష్టినుండి పరిశీలిస్తే, ఈ విషయంలోనూ సరైన అభిప్రాయానికి రాగలమనుకుంటున్నాను. వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తే స్వలింగ సంపర్కానికి తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాల్సి వుంటుంది. కానీ ఈ స్వేచ్ఛ, వ్యక్తిశ్రేయస్సుకు సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుందా? ఆటంకంగా తయారవుతుందా అనేది చాలా ప్రధానమైన అంశం.
వ్యక్తిస్వేచ్ఛ, వ్యక్తి శ్రేయస్సుకు సమాజాభివృద్ధికి తోడ్పడేదైతేనే రాజ్యం దానికి హక్కుగా అంగీకరించాలి. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకునే, వ్యక్తి నా ప్రాణం, నా శరీరం అంటూ ఇష్టానికి ప్రవర్తించడాన్ని అంగీకరించక ఆత్మహత్యను, వ్యభిచారాన్ని నేరంగా పేర్కొంది.
స్వలింగ సంపర్కుల ద్వారా ఆ వ్యక్తికి లైంగిక అవసరం తీరి సంతృప్తి లభించవచ్చు గాని, అది ఆ వ్యక్తి శ్రేయస్సుకు తోడ్పడుతుందా? కాదనే సమాధానం వస్తుంది. పోనీ సమాజ శ్రేయస్సేమైనా కలుగుతుందా? అంటే దానికీ కలగదనే సమాధానం వస్తుంది.
నిజానికి, సరైన జీవితంలో, ప్రతివ్యక్తీ అనేక శారీరక స్పందనలను లేక కోరికలను వివేకం ద్వారా అదుపు చేసుకోవలసి వుంటుంది. అప్పుడు మాత్రమే సమాజ జీవితం సాధ్యపడుతుంది. సమాజ జీవితంలోనే యోగ్యమైన రీతిలో వ్యక్తి శ్రేయస్సు ఏర్పడుతుంది. మంచి సమాజం ఏర్పడితే వ్యక్తికి మరింత మేలు చేకూరుతుంది.
వీటన్నింటినీబట్టి, స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. న్యాయస్థానం ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నా అవగాహన, మీ సమాచారం కలగలిపి ఈ నిర్ణయానికి వచ్చాను. మరింత సమాచారం అంది, ఈ నిర్ణయాన్ని సరిచూసుకోవలసి వచ్చినా సరిచేసుకోవలసి వచ్చినా సిద్ధంగా వుంటాను.
2) భువనగిరి నుండి మూర్తిగారి జనార్థన్‌ (హేతువాద సంఘం)గారు, స్వలింగ సంపర్కం-ఒక పరిశీలన-2 వివరంగా విజ్ఞానదాయకంగా వుంది. దీనిని గురించి మిత్రులు లోతుగా చర్చించాలి. ఇది మానవ హక్కులకు, ప్రజారోగ్యానికీ సంబంధించిన విషయమై వుంది.
3) పందిళ్ళపల్లి నుండి కె.ఎ.వి.ప్రసాద్‌గారు, స్వలింగ సంపర్కం అన్నది అతి కొద్దిమంది తమ కామవాంఛను తీర్చుకోవడానికి ఎంచుకున్న మార్గం. వారైనా అలాంటి మార్గాన్నెందుకెంచుకున్నారన్నది తెలుసుకొనాలంటే, ఆ క్షేత్రంతో ప్రత్యక్ష సంబంధం వున్నవారు మాత్రమే చేయగలరు. సంబంధిత క్షేత్రం వైద్యరంగమే. వైద్యశాస్త్రం ప్రకారం-
1. ఇది పుట్టుకతో వచ్చే శారీరక లోపాలు, పెరిగే వయస్సుతో శారీరక ధర్మాలలో వచ్చే అసాధారణ మార్పులు.
2. కుంటి, గుడ్డి, మూగ, చెవుడు లాగానే ఇది సెక్స్‌పరమైన వైకల్యం. కనుక కుంటి, గుడ్డి వారిలానే వీరూ అంటే సెక్సుపరమైన లోపం కలవారు చాలా మనోవేదనకు లోనవుతుంటారు.
3. శారీరక లోపాలు కలవారిని ప్రక్కన పెడితే, శారీరక ధర్మాలలో వచ్చే అసాధారణ పరిస్థితిని కొంతవరకు సరిచేయవచ్చు. ఆపని ప్రభుత్వమూ, శాస్త్రజ్ఞులు చేయవలసి వుంది.
4. మానవత్వం కలవారు ఇలాంటివారియొక్క అసాధారణ స్థితిని అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరిస్తారే తప్ప వారిని తప్పుపట్టరు.
5. ఇతరులకు అపకారం కలగనిరీతిలో స్వీయ అవసరాలు తీర్చుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులూ పౌరులే. అలాంటి ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడం దుర్మార్గం.
4. బాపట్ల నుండి ఇక్కుర్తి సుబ్బారావుగారు, స్వలింగ సంపర్కాన్ని నిషిద్ధ క్రియల క్రింద చేర్చాల్సిందే. అస్సలు ప్రకృతి సహజంకాని వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదలా వుంచి, ప్రతి దేశానికీ దానికంటూ ఒక సాంస్కృతిక వారసత్వం, కట్టుబాట్లు, ఆచారాలు విలువల రూపంలో వుంటాయి. వాటిని పట్టించుకోకుండా, వైద్యశాస్త్రం రోగమంటోంది కనుక చికిత్స చేయాలేగాని శిక్షించకూడదనో, రోగం కాదంంటోందికనుక అలా ప్రవర్తించటం తప్పుకాదనో దానికి చట్టబద్ధత కల్పించడం సరికాదు.
5. బాపట్ల నుండి వి. హరిప్రసాద్‌గారు అది నిషిద్ధ క్రియలలోకి చేర్చాల్సిన అవసరముంది. దానికి చట్టబద్ధత కల్పించటం అనుచితం.
6. వేమూరు నుండి హజరత్‌ ఆలీగారు, సురేంద్రజీ, మీరు ఏ విషయాన్ని పట్టుకున్నా దానిని కూలంకషంగా విచారిస్తూ ఆ వివరాలను నిర్భయంగా నలుగురికీ అందజేస్తూ వస్తున్నారు. అందుకు అభినందనలు. ఇక స్వలింగ సంపర్కం విషయానికి వస్తే, రైల్వే గార్డులు, సైనికులు, ఖైదీలు, బ్రహ్మచర్యం పాటించే సన్యాసులు, సన్యాసినులు, మత బోధకులు వగైరా సమూహాలలోకి దీని వేళ్ళు విస్తరించుకుని వున్నాయి.
అన్ని మత గ్రంథాలు పైకి దీనికి నిషేధించినా, ఆ మత బోధకులే వీటికి అలవాటు పడే పరిస్థితులున్నాయి. ఖురానులో వీటిని ఖండిస్తూ ఎన్నో వాక్యాలున్నాయి. మతాలు స్త్రీ సాంగత్యం పాపమంటున్నాయి కానీ, దీనిని పాపమనడంలేదు అని సరిపెట్టుకుంటారేమో భక్త శిఖామణులు! అట్టివారంతా సమాజానికి చీడపురుగులే. వీరికి దైవభక్తి అధికమేగాని, తమని అలా ఎందుకు పుట్టించావని అడగలేని అశక్తులు వీళ్ళు.
157 సంచిక 7వ పేజీలో విలింగ సంపర్క విధానంవల్ల తలెత్తే సమస్యలకు మించి స్వలింగ సంపర్కులవల్లనూ అదనపు సమస్యలేమీ ఉత్పన్నంకావు అని 'సి' సమాధానంగా వ్రాశారు. అదేమిటి? మీతో వచ్చిన గొడవే ఇది. 'పామూచావదు, కర్రా విరగదు' అన్న చందాన వుంటుంది మీ వరస. స్వలింగ సంపర్కం చెడ్డదేననో, కాదనో తేల్చక ఈ అనిశ్చిత స్థితేమిటండీ బాబు! ఇంకా సత్యాన్వేషణ చేస్తున్నట్లుగనే వుందీ విషయమూ. ఈ మాటన్నానని నాపై విరుచుకుపడకండి, నేను మీరు పడుతున్న శ్రమరీత్యా మీ అభిమానినే.

No comments:

Post a Comment