యోచనాశీలురూ, సమాజ హితైషులు అయిన వారందరికీ,
మనలాంటి వారందరి ఆకాంక్షా సమాజం బాగుండాలన్నదే. బ్రతుకు అవసరాల గురించి, వాటి నెరవేర్పుకు సహజీవనావశ్యకత గురించీ ఒకింత అవగాహన ఏర్పడిననాటి నుండి వేల సంవత్సరాలుగా మంచి సమాజాన్ని రూపొందించుకునే యత్నాలు సాగుతూనే వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు అప్పటికున్న సమాజంలోని ఒడంబడికలోనూ, దానిని ఏర్పరచుకున్న సామాజికులలోనూ ఎక్కడోచోట, ఎంతో కొంత ఉండగూడనితనం చోటు చేసుకునే వుంటోంది.
ఏ సమాజాన్ని తీసుకున్నా దాని ఆవిర్భావానికి వెనుకనున్న సారభూతమైన భావన సమష్టి అభ్యుదయం అంటే, అందరికీ యోగక్షేమాలు అందుబాటులో వుండడం అన్నదే అని తీరాలి. అయితే ఆ ఆకాంక్ష ఈనాటికీ నెరవేరని కోర్కెగానే వుందన్నది మనందరి ముందున్న వాస్తవం. అందరి హితానికీ హామీ ఏర్పడాలంటే అటు ఒప్పందంలోగానీ, ఇటు వ్యక్తులలోగానీ వుండగూడనితనం వుండకూడదు. వుండవలసినదంతా వుండాలి. తాత్వికంగా చెప్పుకోవాలంటే మాత్రం అన్నింటా వర్తించే సూత్రం ఇదే.
ఈ సూత్రపు నేపథ్యం ఆధారంగానే, ఆయా కాలాలలో సామాజిక పరివర్తనకై అనేక యత్నాలు జరిగాయి. అప్పటికి వున్న వాటిలో ఏదో వుండకూడనిది వుందన్నా, మరేదో వుండవలసింది వుండకపోవడాన్ని దృష్టినిడుకునే అంటే సమస్యగా గణించే సరైన మార్పుకై యత్నాలు జరిగాయి. జరిగిన, జరుగుతున్న వివిధ ఉద్యమాలన్నింటి వెనకా ఈ మౌలికాంశమే కీలకమైన కారకంగానూ, ప్రేరకంగానూ వుంటూ వస్తోంది.
సమస్యలు లేని, లేదా అనివార్యంగా ఏర్పడుతుండే సమస్యల్ని ప్రవాహగతిన పరిష్కరించుకుంటూ వుండే శక్తియుక్తులు, సామర్థ్యాలు కల సమాజాన్నే (మంచి) ఆరోగ్యవంతమైన, బలమైన సమాజం అననాలి. చరిత్రలో మంచి సమాజం రూపొందించు కోవడానికి జరిగిన బహుముఖ యత్నాలన్నీ, సమస్యలూ బహుముఖంగా వుండడంవల్ల పుట్టుకొచ్చినవే. కాకుంటే ఒక్కోస్థాయి అవగాహన, అభిరుచి అన్నవి ఒక్కో సమస్యను ప్రధానంగా, అతిప్రధానంగా, అప్రధానంగా తలంచడంవల్ల, ప్రాధాన్యతా క్రమంలో మార్పులు చోటుచేసుకుని వివిధమైన ఉద్యమరూపాలు ఏర్పడ్డాయి. ఉత్తమ సమాజం గమ్యంగా ఎప్పటికప్పుడు అప్పటికున్నదానికంటే మెరుగైన పౌర సమాజం కొరకు పనిచేసుకుంటూ పోతుండడమే ఏ దేశ కాలాలలోనైనా, ఎవరమైనా చేయవలసిందీ, చేయగలిగిందీనూ.
ఇదెంత కీలకమైన భావనంటే; 'ఉత్తమ సమాజం'. 'మెరుగైన సమాజం' అన్న పదబంధాలను సజావుగా అర్థం చేసుకోకపోయినా, అంటే మెరుగైన సమాజం అవాంతర సాధ్యంగా, ఉత్తమ సమాజం అంతిమ సాధ్యంగా తలంచడమే సరైన వివేకం అన్న అవగాహన లేకపోయినా, ఆ క్రమానికి తగిన క్రమాభివృద్ధి కార్యాచరణను రూపొందించు కోలేకపోయినా చేసిన యత్నమంతా చివరకు వైఫల్యానికే దారితీస్తుంది.
సంపూర్ణ విప్లవ కార్యాచరణ అంటూ చేసేవన్నీ చేతలకు నోచుకోని ఆలోచనలే. సంపూర్ణ విప్లవం ఆదర్శంగా క్రమక్రమంగా యోగ్యమైన మార్పులు నిరంతరాయంగా చేసుకుంటూ పోతుండడమే సరైన అవగాహన కలవారు చేయగలపని. ఇంతకూ ఆ మార్పులకు శ్రీకారమెక్కడ?
1) సమాజమంటే (1) ఒడంబడిక, (2) దానిననుసరించాల్సిన, అనుసరిస్తుండే వ్యక్తులు అని అర్థం.
2) మరి సమాజంలో ఉండకూడనితనముండడమంటే ఒడంబడికలో లోటుపాట్లు వుండడం అనో, దానిని అనుసరించాల్సిన ప్రజల అనుసరణలో లోటుపాట్లు వుండడమనో అర్థం.
3) ఒడంబడికలోని లోటుపాట్లకు కారణాలు (1) అవగాహనా లోపం, (2) మారుతున్న పరిస్థితులు, (3) నిస్పాక్షికులు కానివారు స్వపరభేద దృష్టితో ఒడంబడికను రూపొందించి వుండడం.
నోట్ : ఒడంబడిక అన్నది జ్ఞానపూర్వకమైనది : అందులో వివేకము-ఇష్టాఇష్టాలు అన్న రెండు భాగాలుంటాయి. వివేకం లోపించడమో, ఇష్టాయిష్టాలే ప్రబలంగా వుండడమో కారణంగనే ఒడంబడికలో లోపాలు చోటుచేసుకుంటుంటై.
4) ప్రజలు అనుసరించడంలోని లోటుపాట్లకు కారణాలు : (1) సమాజం, పుట్టిన బిడ్డను సామాజికునిగ శిక్షణ గరపకపోవడం, (2) ఎంత శిక్షణ గరపినా నిరంతరం స్వభావజనితమైన స్వార్థానికి పెద్దపీట వేసే లక్షణం వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిందేనని వత్తిడి చేస్తుండడం, (3) బాహ్య వత్తిడి అంటే ఒడంబడికను అమలు చేసే స్థానాలలోని వ్యక్తులు నిస్పాక్షికులూ, సమర్థులూ, కార్యకుశలురూ కాకపోవడం, (4) ప్రక్కవాడు ఒడంబడికను అతిక్రమిస్తున్నా పట్టించుకోని జనం.
ఇవే సమాజం బాగుండకపోవడానికిగల కారణాలు. వీటిని తొలగించుకునే దిశలో గనక ఉద్యమాల కార్యాచరణ లేకుంటే సమాజంలోని ఉండగూడనితనం తొలగడం, ఉండవలసినతనం కలగడం జరగనే జరగదు.
వ్యక్తిచేత చేయకూడని పనులు చేయిస్తుండే అంశాలలో బ్రతుకవసరం కూడా బలమైనదే. అవసరాలు తీరని పరిస్థితుల్లోనూ మనిషిని నీతివంతుడిగా వుండమనడం తిండిపెట్టకుండా పనిచేయమనడం లాంటిదే. అదెలానూ జరగదు. అలాగే 'ఎదుగు బొదుగు లేనితనమూ-ప్రక్కవారి ఎదుగుదలా' కూడా మనిషిని ప్రక్కదారి పట్టించే ప్రేరకాలే. అవునో కాదో మీరూ ఆలోచించండి. సమాజం చేయవద్దంటున్న పనులు వ్యక్తి ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోకుండా, అవినీతి అక్రమాలను తొలగించేదెలాగన్నది నిర్ధారించలేము. ఇది చాలా కీలకమైన అంశం.
- ఒప్పందంలో దోషాలు-లోపాలు అన్న రెండు సరిచేసుకోవలసిన భాగాలుంటాయి. అందులోని దోషాలను తొలగించాలి. లోపాలను ఎప్పటికప్పుడు పూరించుకుంటూ వుండాలి. ఈ పనిని పర్యవేక్షించేందుకు ఒక సమూహం (మేథోభాగం) ఏర్పడి వుండాలి. సమీక్ష, సవరణలు-పూరణలు అన్నది ఒక నిరంతరాయమైన ప్రక్రియ.
- అయినా ప్రజలు ఆచరణలో చేస్తున్న, చేయకూడని పనులన్నీ ఒప్పందంలోని లోపాలవల్ల మాత్రమే జరుగుతున్నవి కాదు. అట్టి వాటిలో కొన్ని ఒప్పందాన్ని అతిక్ర మించడం - చట్టాన్నతిక్రమించడం, రూపంలోనూ జరుగుతుంటాయి. అంటే ఆ మేరకు ఒప్పందం సరిగనే వుందన్నమాట. దానిని అమలుపరచాలన్న వివేకంగానీ, అందుకు తగిన శిక్షణగానీ వ్యక్తికి అందలేదన్నమాట. అంతేగాక అతిక్రమణలను నియంత్రించే భాగమూ తగినంత శక్తివంతంగా లేదన్నమాట.
ఇందులోని మొదటిభాగం ఆత్మనియంత్రణను-తనపై తన అదుపును-సూచించేది కాగా, రెండవది బాహ్య అదుపును తనపై ఇతరాల అదుపును తెలియజేస్తుంది. బాహ్య అదుపు అన్నది అటు వ్యవస్థ ఏర్పరచిన నియంత్రణ స్థానాలలోనున్నవారు చేయవలసింది కాగా, మరొకటి ప్రజలు పట్టించుకోవలసింది.
నిజానికి ప్రజలు సామాజిక స్పృహ, స్పందించే లక్షణము తగినంతగా కలిగినవారైతే, ఈ బాహ్య అదుపు అన్నదానిలోని నియంత్రణ స్థానాలలోని వారికంటే, అత్యంత శక్తివంతమైనపాత్ర వీరిదే అవుతుంది.
1) ఒప్పందము, 2) పాలన నిర్వహణ, 3) మూర్తిమత్వ నిర్మాణము, 4) ప్రజలు. ఈ నాలుగంశాలతో ముడిపడే సమస్యలు పుట్టడం, సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ వుంటుంది.
పై నాల్గింటినీ రెండుగా కుదించుకోవచ్చు. (1) ఒప్పందం, (2) వ్యక్తి నిర్మాణం.
వ్యక్తి సాధారణంగా ఇతరులచే ప్రేరేపింపబడి, చూసి, చేయడం మొదలెట్టి అలవరచుకుంటాడు. ఈ క్రమానికి అతనికి ఆధారంగా వుండే స్థానాలు మూడు. (1) కుటుంబం, (2) విద్యాలయం, (3) అతని దృష్టి పరిధిలోకి వచ్చే పరిసరాలు పరిస్థితులు.
మిత్రులారా! మనందరం మనం మనం చేయబోయే సామాజిక హితయత్నాలకు ముందు నేపథ్యంగా తెలిసుండాల్సిన తాత్విక చిత్రం ఇదే.
మనిషి స్వేచ్ఛాపిపాసి. అంటే తన ఇష్టం నెరవేరుతుండాలన్న ప్రగాఢ వాంఛ కలిగి వుంటాడని. పిపాస అన్నపదం ఎవరు వాడారోగాని అది చాలా సార్థకమైన ప్రయోగం. పిపాస అన్నపదం ఆరని దాహం (తీరని దప్పిక) అన్న అర్థాన్నిస్తుంది. అంటే స్వేచ్ఛ కావాలన్న కోర్కె ఆ జీవితం మనిషిని అంటిపెట్టుకునే వుంటుందన్నమాట. సహజాతమైన ఇష్టాఇష్టాలు, సమాజం నుండి తెచ్చిపెట్టుకున్న ఇష్టాయిష్టాలునని స్వఇచ్ఛ-స్వేచ్ఛ రెండుముఖాలుగా వుంటుంది.
అసలు సమస్య ఏమిటంటే ఒప్పందం, మనిషి స్వభావం అంగీకరించే, ఆకాంక్షించే స్వేచ్ఛకు అవసరమైన కొన్ని పరిమితులు విధిస్తుంటుంది. దాంతో వ్యక్తికి తనకు తానుగా ఇష్టపడే కొన్నింటి విషయంలో పరిమితులు ఏర్పడడం, ఇష్టపడని కొన్నింటి విషయంలో చేయక తప్పకపోవడం అన్న పరిస్థితి దాపురిస్తుంది. ఇదిగో! మౌలికమైన ఈ అంశమే వ్యక్తిని ఒప్పందాన్నతిక్రమించేందుకు పురికొల్పుతుంది. ఇక్కడ మార్పు లేకుండా మెరుగైన పౌర సమాజాన్ని రూపొందించుకోవడం సాధ్యపడదు.
1) తనకు తాను అదుపులో వుండేలా వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించడం.
2) అదుపు తప్పితే, ఏ యిష్టంకొరకు పనిచేశాడో అంతకంటే పెద్ద ఇష్టాన్ని కోల్పోవలసి వస్తుందన్నది అనుభవంలోకి తేవడం.
3) సాటి ప్రజల ఊరుకోని వైఖరి. అనుచితంపట్ల ప్రతికూలంగా, ఉచితంపట్ల అనుకూలంగా స్పందించే వైఖరిగల ప్రజల నిఘా.
మరోమాట
అవినీతి గురించిన చర్చ ఈనాడు చాలా ప్రధానస్థానాన్ని ఆక్రమించుకుని వుంది. అవినీతి విషయంలో రెండు నానుడులు జనానికి చక్కగా అన్వయిస్తాయి. 'పిల్లికి గంట కట్టేదెవరు?', 'తిలాపాపం తలా పిడికెడు' అన్న రెండూ, సమాజంలో మినహాయింపు ఘటనలుగా తప్ప ఎక్కువలో ఎక్కువ మందికి అన్వయించేవిగనే వుంటున్నాయి. అవినీతి గురించి గగ్గోలు పెడుతూనే వుంటారు. దానిని పోనాడడానికి తనవంతు పాత్రపోషణకు సిద్ధపడరు. చూస్తూనే స్థబ్ధంగా వుంటారు.
మరోవంక తన అవసరం సందర్భమైతే అవినీతిదారే తొక్కుతుంటారు. జాగ్రత్తగా పట్టిచూస్తే ప్రతి వ్యక్తిలోనూ ఇది అంతో ఇంతో చోటుచేసుకునే వుందన్న నిజం బైటపడుతుంది.
నిరోధం - నివారణం
అవినీతి విషయంలో పెద్దమార్పును తేగల మార్గం, సామాజికంగా జరిగే వ్యవహారాలన్నిటా పారదర్శకతను అమలు చేయడమే. అందువల్ల ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ఏమి జరుగుతోందన్నది బహిరంగమైపోతుందిగనుక, సవ్యాపసవ్యతలను ప్రతిఒక్కరూ తెలుసుకుంటూ వుండే అవకాశం ఏర్పడుతుంది. దీనికి ఉపబలకంగా స్థానిక న్యాయాలయాలు, సత్వర న్యాయము అన్నవి తోడైతే ఫిర్యాదు-పరిష్కారము అన్నవి ఆచరణలోకి వస్తాయి. అవినీతికి పాల్పడ్డవారికి తిరగదీసుకోలేని దండన అన్నది చట్టంచేసి, అమలు పరచాలి. పారదర్శకత వుంటుంది గనక అమలు చేయక తప్పనిస్థితి ఏర్పడుతుంది. మానవీయ విలువల దృష్ట్యా కఠిన శిక్షలూ, దీనికి కొంత దోషం వున్నా, అధిక జనులకు హితాన్ని కలిగించడానికి అవసరమైనదవడంవల్ల ఆ కనీస దోషాన్ని భరించడమే ఉచితం.
మిత్రులారా! అవినీతి నిరోధకంగా పారదర్శకత, నివారణా సత్వర న్యాయము- అవినీతికి కఠినదండన-నీతికి ప్రోత్సాహము అన్నవి బలంగా పనిచేయగలుగుతాయన్నది వ్యవస్థాపరంగా కీలకమైనవికాగా, వ్యక్తులను మూర్తిమత్వ నిర్మాణంలో భాగంగా విలువలపట్ల ఎక్కువ అలవాటయ్యేలా శిక్షణ, ఇంట్లో, బడిలో, వీధిలో తగిన వాతావరణము ఏర్పడి వుండటము అన్నవి బలమైన అంశాలవుతాయి. ఈ రెండూ పరస్పర పూరకాలుగా, దోహదకారులుగ పనిచేస్తున్నప్పుడే ఆ సమాజం (వ్యవస్థ-వ్యక్తుల ఉమ్మడి) మెరుగైందై, అభివృద్ధి పరిధిలో పయనించగలుగుతుంది.
సామాజిక సంస్కరణ దిశగా యత్నాలు చేద్దామనుకుంటున్నవారు ముందుగా ఈ తాత్విక భూమికను స్పష్టంగా అర్థం చేసుకుని, వంటబట్టించుకుని, వ్యక్తులుగా ఆ దిశగా తమని తాము సంస్కరించుకుంటూ, ఇతరులకు మంచి నమూనాగా అగుపడుతూ, వారిలో మార్పు తేవడానికి గట్టిపట్టుదలతో దీర్ఘకాలం శ్రమించడానికి ఉద్యుక్తులు కావలసి వుంటుంది.
ఈపని ఒక ఉద్యమంగా చేయదలచుకుంటే, ఉద్యమ కార్యకర్తల నిర్మాణం అత్యంత ప్రాథమికమైనదవుతుంది. జనంలేని ఉద్యమాలు, మనస్సు లేని ఉద్యమాలు - క్రమంలేని ఉద్యమాలు కడకు ఫలితంలేని పనుల క్రిందకు చేరిపోతాయి. అరకొర పనులతో అవస్థలు పడుతుంటాయి. కనుక అధ్యయనము-శిక్షణల ద్వారా అవగాహన, దృఢేచ్ఛ- నిపుణత్వము లన్నవాటిని పాదుకొల్పి, పనిబాటలో నిల్పగలిగిననాడే ఉద్యమాలు చైతన్యవంతంగా సాగగలుగుతాయి.
ఉద్యమాలకు రెండు పార్శ్వాలైన ఉద్యమనిర్మాణము. ఉద్యమ కార్యాచరణలన్న వాటిదగ్గర అవగాహన-దృఢేచ్ఛ-కార్యకుశలతలన్నవి సమకూడాలి. అంటే ఇటు కార్యకర్తల నిర్మాణంలోనూ, అటు కార్యకర్తలు చేయాల్సిన కార్యాచరణ క్షేత్రంలోని వ్యక్తుల నిర్మాణంలోనూ ఈ మూడంశాలు బలంగా వుండాలి.
మరో అత్యంత కీలకమైనదీ, ఆద్యంతమూ అమలులో వుండాల్సిన అవసరమున్నదీ ఏమిటంటే, ఉద్యమకారులు సామాజిక సమస్యల పరిష్కర్తలు కాకూడదు. సమస్యలను- పరిష్కారాలను కూడా భరించి, అనుభవించే ప్రజలే సమస్యా పరిష్కార శక్తులు కావాలి. అంటీముట్టనట్టుండే, భరిస్తూ వుండే ఆ జనాన్ని చైతన్యవంతంచేసి, పరిష్కార యత్నాలకు సన్నద్ధుల్ని చేయడం, ఆ క్రమంలో వారికి అవసరమైన, అవగాహన, శిక్షణ తోడ్పాటుల నందించడం అన్నవే ఉద్యమ కార్యకర్తలు చేయాల్సిన ప్రధానమైన కార్యం. పని నారంభించడానికీ, అలవరచడానికీ మాత్రమే ఆదిలోనూ, అటుపై తప్పనిసరైనపుడూ మాత్రమే ఉద్యమ కార్యకర్తలు జనంతో కలసి పనిచేయాల్సి వుంటుంది. ఈ విషయంలో స్పష్టత చేకూరాలంటే ఉద్యమకారులు చేయవలసిన, చేయగలిగిన పనులేమిటి? ప్రజలను కలుపుకుని ఉమ్మడిగా చేయాల్సినవేమిటి? జనమే చేసుకోవలసిన, చేయగలిగిన పనులేమిటి? జనం ప్రభుత్వంతో కలసి చేసుకోవలసినవేమిటి? ప్రభుత్వమే చేయాల్సిన పనులేమిటి? అన్నదగ్గర సరైన అవగాహన వుండాలి. ఈ అవగాహన ఉద్యమకారులకు ఉండాలి, ప్రజలకూ వుండాలి, పాలకులకూ వుండాలి. అయితే అవగాహన తాము కలిగించుకుని, జనానికీ పాలకులకూ కలిగించే పని ఉద్యమాలపైనే ఎక్కువగా వుంటుంది.
సంపూర్ణ విప్లవం లేదా సమగ్ర సామాజికోద్యమంలాంటి శీర్షికలు, వాటిక్రింద చెప్పుకునే బహుముఖ లక్ష్యాలు-ఆ లక్ష్యసిద్ధి కార్యక్రమాలు లాంటివన్నీ కేవలం ఆదర్శప్రాయమైన ఊహల క్రిందికే వస్తాయి. ఎలా అనంతం అన్నది సంఖ్యలలో చేర్చి గణితంలో చెప్పుకుంటున్నా అనంతం అన్నదానికి ఇంతని నిర్ణయం వుండదో, చేయలేమో, చేయకూడదో అలానే సంపూర్ణం అన్నదానికీ నిర్దిష్టమైన రూపంగానీ, స్పష్టమైన భావనగానీ వుండదు. అనంతంగా ఊహించలేం. సంపూర్ణాన్నీ ఊహించలేం. ముగింపు లేనితనాన్ని అనంతం సూచిస్తుంటే మిగిలిలేదేమో అన్నదాన్ని లేదా లోటే లేదు అన్నదాన్ని సంపూర్ణం అన్నది తెలియజేస్తుంది. కనుక సమగ్ర, సంపూర్ణ అంటూ మొదలెట్టి ఎవరెవరం ఎన్నెన్ని చెప్పుకున్నా, అవి ఆ పదాలకున్న సరైన అర్థంలో సంపూర్ణాలుగాని, సమగ్రాలుగాని కాజాలవు. కనుక మనమెవరంగానీ, ఆరంభింపబోయే ఉద్యమాలను ఆ పేర్లతో పిలవడం అనవసరం.
గతంలో ఒకరిద్దరు అలాంటి భావన చేసి, యత్నాలు మొదలెట్టినా అవన్నీ చారిత్రక ఘటనగా చెప్పుకోవడానికి పనికొచ్చేవేకాని సార్థకరూపంలో అట్టివి కాలేకపోయాయి, విఫలమైపోయాయికూడా. వాటి వైఫల్యానికి యత్నలోపం కారణమనడంకంటే, ప్రాతిపదికలోనే ఆచరణసాధ్యం కానితనముంది అనడం ఉచితం. కనుక ఉద్యమక్షేత్రానికి సంబంధించి, దాని విస్తృతికి సంబంధించి స్పష్టతకలిగుండడం ఉద్యమం మొత్తానికీ పునాది భావన అవుతుంది.
ఆరోగ్యము-బలము
శరీరానికి ఆరోగ్యము, బలము ఎలా అవసరమో, అలాగే ఉద్యమకాయానికీ, సమాజానికీ కూడా ఆరోగ్యమూ బలమూ అవసరం. సామాన్య దృష్టినుండి ఆరోగ్యాన్ని బలాన్ని వేరుగా చూడడం జరగటంలేదుగాని, వాస్తవానికి ఆరోగ్యం వేరు బలం వేరు. ఆరోగ్యవంతుడు క్రమంగా బలాన్ని పుంజుకోగలుగుతాడు. అదే అనారోగ్యం పాలైన వ్యక్తి క్రమంగా బలహీనుడై నీరసించిపోతాడు. బలవంతునికి అనారోగ్యం రావచ్చు. ఆ రోగం వచ్చేటప్పటికి అతడు బలం కలిగే వుండవచ్చు. అలాగే ఒక రోగి చికిత్స ద్వారా రోగాన్ని నిర్మూలించి ఆరోగ్యవంతుణ్ణి చేసేటప్పటికి, అతనికి ఆరోగ్యం చేకూరినా బలహీనత వుంటుంది. ఆరోగ్యాన్ని పొందాక శరీరం ఆహారాన్ని, బలవర్థకాల్ని సక్రమంగా స్వీకరించి, బలాన్ని తిరిగి పొందగలుగుతుంది.
ఆరోగ్యము-బలము వేరువేరన్నది గుర్తించండి. అయితే ఆ రెండూ పరస్పరాధారితాలై పనిచేస్తుంటాయి. అయినా బలంకంటే ఆరోగ్యానికే ప్రథమ స్థానాన్నివ్వాల్సి వుంటుంది. ఆరోగ్యమంటే శరీరంలో ఉండాల్సినవి వుండడం, ఉండకూడనివి వుండకుండా వుండడం- శరీర జీవనక్రియ (వ్యవస్థ) సక్రమంగా సాగుతుండడం అని అర్థం. అందుకే వైద్యశాస్త్రం స్వస్థత-అస్వస్థత, అన్న పేర్లు పెట్టింది వాటికి. ఉండవలసినట్లే వుండడం-అట్లా లేకుండడం అని వాటర్థం. వుండవలసినట్లు లేకుండడాన్నే అనారోగ్యం అంటున్నామన్న మాట. న రోగమితి అరోగం-శరీరే అరోగ స్థితిః ఆరోగ్యం; అనీ అర్థం చెప్పుకోవచ్చు.
ఈ సూత్రాన్ని ఉద్యమానికి అన్వయిస్తే కర్త-ఉద్దేశ్యము-పరికరాలు-విధానము-పని, అన్న కారణ సామగ్రి సరిగా వుండి పని జరుగుతూ వుంటే ఉద్యమం ఆరోగ్యంగా వుందని అర్థం. కర్తుత్వం వహించేవారి సంఖ్య, క్రియా సామర్థ్యము పెరుగుతూ అందుకు తగిన రీతిలో వనరులూ పెరుగుతూవుంటే ఉద్యమం బలం పుంజుకుంటూ వున్నదని అర్థం.
ఉద్యమం ఆరోగ్యంగా వుండడాన్ని మరికొంత వివరంగా చెప్పుకుందాం. ఉద్యమానికి తల భాగం ఒకటుండాలి. అది అవగాహన కలిగి వుండడం-అవగాహనను సరిచూసు కుంటూ, అవసరమైనమేర సరిచేసుకుంటూ, చేర్చుకుంటూ ఉండడంతోబాటు, ఉద్యమా న్నంతటినీ తనదిగా చూసుకుంటూ, ఉద్యమ గమనంపై నియంత్రణ కలిగే వుండాలి. నియంత్రణ అల్పరూపంలో వుండకూడదు. అలాగే ఉద్యమ క్షేత్రంలో ఏయే భాగాలలో ఉన్నవారు ఆయా భాగాల పనిని సజావుగ చేస్తూ మొత్తం ఉద్యమంలో విడదీయరాని భాగంగా మెసలుకోగలగాలి. అంటే మొత్తం కార్యకర్తల వ్యవహారశైలి ఉద్యమాశయాలకు ప్రతికూలం కానిరీతిలో వుండాలి. వారివారికి పనుల కేటాయింపు-వనరుల కేటాయింపు కూడా అవసరమైన మోతాదులోనే అందుతుండాలి. ఈ విధానం సక్రమంగా అమలవుతుంటే ఉద్యమం ఆరోగ్యంగానే వుందని, అయినా ఉద్యమాశయసాధనకు తగినంతమంది కార్యకర్తలు వారందరికీ తగినంత ఆధ్యయన శిక్షణలు, అందుకవసరమైన పరికరాలు, విధానంతో కూడిన తగినన్ని స్థానిక కేంద్రాలు లేనప్పుడు బలంగా లేదంటాము. ఇవి పెరుగుతూ వుంటే ఉద్యమం బలం పుంజుకుంటూ వుందంటాము.
అవెంతగా పెరిగినా అందులోని వ్యక్తులలో ఉద్యమాశయాలకు ప్రతికూలమైన ఆలోచనలు, ప్రవర్తనగనక చోటుచేసుకుంటే ఉద్యమారోగ్యం దెబ్బతింటున్నదని అర్థం. కార్యకర్తకుండవలసిన లక్షణాలు లేకున్నా, కార్యకర్తల మధ్య వుండాల్సిన సహకార సంబంధాలు కొరవడినా, కార్యకర్తలలో తనని ప్రత్యేకించుకోవాలన్న దృష్టీ, వర్తన చోటు చేసుకున్నా ఉద్యమారోగ్యం దెబ్బతింటున్నట్లే. ఆరోగ్యానికే భంగం వచ్చేట్లుంటే బలం విషయం తాత్కాలికంగా ప్రక్కనబెట్టి, ఆరోగ్యం విషయంపై దృష్టిపెట్టడమే సరైన పద్ధతి. ప్రయత్న సాఫల్యతకు-గట్టిపనికి-బలమే ముఖ్యమైనా, ముందు జాగ్రత్తపడవలసింది ఆరోగ్యం విషయంలోనే. ఈ సూత్రాన్నే ఒక ఉద్యమారంభ విషయానికి అన్వయిద్దాం.
ఈ సందర్భంలో; ''సర్వోద్యమాల లక్ష్యము వ్యష్టి సమష్టి శ్రేయస్సేననుట నిర్వివాదాంశము''అన్న మండలి తాత్విక భావనను గుర్తుచేస్తున్నాను. ఇక్కడ ఉద్యమమన్నమాటను, సరైన దిశలో సాగే సమష్టి గట్టి యత్నము అన్న అర్థంలో వాడాను. వివేకం-సరైనజ్ఞానం-సూచించే లేదా అంగీకరించే యత్నాలవేవైనా 'అందరి బాగు' అన్న సాధ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వుంటాయి. అవునా? కాదా? ఆలోచించండి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరం రోగగ్రస్థమై యున్నప్పుడుగానీ, కొన్ని అవయవాలు మిగిలిన వాటంత బలంగా లేనపుడుగానీ వాటిపట్ల ప్రత్యేకశ్రద్ధ, కేటాయింపులు చేపట్టినా అదీ 'వ్యష్టి సమష్టి శ్రేయస్సు' అన్న సాధ్యాన్ని సిద్ధింప జేసుకోవడానికే అయ్యుంటుంది.
సమాజంలో కొందరికి అందకూడనివి అందుతున్నా, అందవలసినవి అందకున్నా సమాజం రోగగ్రస్థమైయ్యిందనే అనాలి. అలానే అందవలసినవి అందవలసిదానికంటే కొందరికి అధికంగానూ కొందరికి అల్పంగానూ అందుతుంటేనూ అనారోగ్యంగా వుందనే అనాలి. పోవలసినవి పోతుండడం, రావలసినవి వస్తుండడం, ఇవ్వవలసినవి ఇవ్వవలసి నంతా యిస్తుండడం, తీసుకోవలసినవి తీసుకోవలసినంతా (తే) తీసుకుంటుండడం అమలులో వుంటే ఆ శరీరం (సమాజం) ఆరోగ్యంగా వున్నట్లే. అందుకవసరమైన వ్యవస్థ, సక్రమంగా వుండి, వనరులు సరిపడా వుంటే సమాజం బలంగానూ ఉందని అర్థం. శరీరానికి ఆరోగ్యంతోపాటు బలమూ వుంటే, రోగాన్ని దరిచేరనివ్వని శక్తీ అధికంగా వుంటుంది. ఆరోగ్యం బలాన్ని సంపాదించడానికి ఆధారమైనట్లే, బలం ఆరోగ్యాన్ని కాపాడడానికీ పనికి వస్తుందన్నమాట. ఇవి రెండూ సరిపడా వున్న స్థితిలో పరస్పరపూరకాలై ఎదుగుదలకు దారితీస్తాయి.
ఉద్యమ కార్యకర్తల సంఖ్య పెరిగింది. వారు పనిచేయడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక వనరులు పెరగలేదనుకోండి. ఉద్యమం బలహీనపడే పరిస్థితి ఏర్పడినట్లే. ఆర్థిక వనరులు ఇబ్బడి ముబ్బడై, కార్యకర్తల సంఖ్య తగినంత లేదనుకోండి, అప్పుడూ ఉద్యమం బలహీనపడే వీలుందనే అర్థం. కనుక ఉద్యమం బలంగా వుందనాలన్నా, బలం పుంజుకుంటోందనాలన్నా కార్యకర్తలు - వనరులు-పని అవసరమైన నిష్పత్తిలో పెంపొందుతూ వుండాలన్నమాట. ఆరోగ్యవంతమైన శరీరంలో క్రమాభివృద్ధి అన్నదీ ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతునే వుంటుంది. ఆరోగ్యం వుందనడానికి అదొక పైకి కనిపించే లక్షణం.
ఉద్యమ మిత్రులారా! ఏ ఉద్యమానికైనా సిద్ధాంతము-ఆచరణ అన్నది సజావుగ వుంటేనే అది ఆరోగ్యంగా వున్నట్లు. పని సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ బలం పెరుగుతున్నట్లు. పని సామర్థ్యం పెరగడమంటే, పనిచేసేవాళ్ళ సంఖ్య, నిపుణత పెరుగుతుండడం, వాళ్ళకు నేటికీ, రేపటికీ కావలసిన వనరులు అవసరమైన పరిమాణంలో అందుబాటులోకి వస్తుండడం అని అర్థం. అలా సాగుతున్న ఉద్యమ కార్యక్షేత్రంలో ఆ గమనానికి ప్రతికూలాంశం ఎదురుపడితే రోగకారకం ప్రవేశించినట్లు-ఉద్యమ గమనంపై ప్రభావం చూపితే రోగం వచ్చినట్లు. అదెంత ప్రభావం చూపగలిగితే అంతగా రోగోధృతి ఉన్నట్లు. ఇదే సూత్రం సమాజానికీ వర్తిస్తుంది.
సమాజ ప్రధాన లక్ష్యమైన వ్యష్టి సమష్టి శ్రేయస్సుకు ప్రతికూలాంశం వ్యవస్థలో వున్నా, వ్యవస్థ నిర్వహణ భాగంలో వున్నా, వ్యక్తులలో వున్నా ఆ సమాజం రోగగ్రస్థమై వుందని అర్థం. మిగిలిన అంశాలు మీరూ ఎవరికి వారుగా ఆలోచించి అన్వయించే ప్రయత్నం చేయండి. అది మీ అవగాహనలో స్పష్టతను, గాఢతను పెంచుతుంది.
ఇక ఇప్పుడొక ముగింపు వాక్యం చెప్పి దీనినిప్పటికి ఆపుతాను.
ఉన్న సమాజం పై సూత్రపు కొలతల నుండి చూస్తే ఆరోగ్యంగా లేదు. రోగగ్రస్థమైయ్యే వుంది. కనుక బలంగా లేనట్లే. లేదా క్రమంగా బలహీనపడే అవకాశాలే వున్నై అనైనా అనాలి. కాబట్టి ముందుగా ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. కొంతకాలంపాటు ఆరోగ్యాన్ని పొందడానికవసరమైన ఔషధాన్ని, బలాన్ని అందిస్తూ పోవాలి. ఉద్యమాలు ఆరోగ్యంగా వున్నాయని చెప్పడానికి కుదరదు. పై సూత్రాన్ని ప్రామాణిక కొలతగ తీసుకుంటే ఉద్యమాలు చాలావరకు రోగగ్రస్థమయ్యే వున్నాయి. దాంతో బలహీనపడుతూ వస్తున్నాయికూడా. ఇది వాస్తవ పరిస్థితి. ఈ గతానుభవాల నేపథ్యం నుండి వివేకంపొంది, ఇప్పుడు, ఇక ముందు రూపొందించబోయే ఉద్యమాలు ముందుగా ఆరోగ్యంగా వుండేట్లు చూసుకోవడం, ఆపై అవి బలాన్ని పుంచుకునే యత్నం చేయడం జరగాల్సి వుంది.
సరైన అవగాహన-భావసారూప్యత-సమైక్యత-పరస్పర సహకారవైఖరి, తగిన వనరుల సేకరణ, ప్రతికూల వైఖరులు లేని కార్యకర్తలు, వారికి వారివారి క్షేత్రాలకు సంబంధించిన, అవగాహన శిక్షణ, పనుల కేటాయింపు-అంతటినీ కలిపి నడపగల వ్యవస్థ, నిర్వాహక మండలి-ఇదీ ఉద్యమం ఆరోగ్యంగా బలంగా వుండడమంటే. అదన్నమాట అస్సలు విషయం.
వీటినేమీ పట్టించుకోకుండా, ఆవేశంతోనూ, అనాలోచితంగానూ, అతి విశ్వాసం తోనూ ఉద్యమాలంటూ మొదలెట్టే పథకాలు, పనులన్నీ కడకు ఒక ముగింపుకు రాకుండానే ముగిసిపోతాయి. లేదా ఉద్యమానికి అవసరమైన ఆరోగ్య లక్షణాలను కోల్పోయి భావసమైక్యత, యత్న సమైక్యతల నుండి విడిపోతూ చీలికలకు దారితీయడమో, స్థబ్ధతకు లోనవడమో జరుగుతుంది. గతంలోని వాటిని సాకల్యంగా పట్టిచూడగలిగితే ఇదెంత వాస్తవమో స్పష్టంగా తెలిసిపోతుంది.
కనుక ఎంత పెద్ద ఉద్యమాన్ని ఆరంభించబోతున్నామా అన్నదిగాక, ఎంత ఆరోగ్యవంతమైన ఉద్యమాన్ని మొదలెట్టబోతున్నామా అన్నదే అత్యంత కీలకమైనదవుతోంది. అదే భవిష్యత్తులో ఫలితరూపంలో అందబోయే సాఫల్య వైఫల్యాలకు పునాది లేదా విత్తనం అవుతుంది. ఎవరుగానీ ఉద్యమం అనగానే నా ఆలోచనంతా దీనిచుట్టూతనే తిరుగుతుంటుంది. ఆరోగ్యవంతమైన ఉద్యమానికి ఊపిరిపోయడమే సమాజ పునర్నిర్మాణ కార్యక్రమాలలోకెల్లా క్లిష్టమైనది. మున్ముందుగా చేయవలసినదీ అదే. మనందరి ముందున్న పెద్ద బరువైన పని అదే.
ఉద్యమాలు సఫలంకావటానికి మొదట ఆరోగ్యము పిదప బలము ఎంత అవసరమో, అది కనీస ఉమ్మడి కార్యక్రమంగా ఉండడమూ అంతే అవసరం. విస్తృత కార్యక్రమం రూపు ధరిస్తున్నంతమేర ఉద్యమం బలహీనపడుతూనే వుంటుంది. అందరు కలసి ఏకోన్ముఖంగా యత్నించడం అదీ ప్రణాళికాబద్ధంగా, నిబద్ధతతో, కార్యకుశలతతో దీర్ఘకాలం చేస్తేగాని సత్ఫలితాలు సాధించడానికి వీలవని వాస్తవ పరిస్థితులలో, అవేవీ తగినంతగా సమకూర్చుకోకుండానే మొదలెట్టే, మొదలెట్టేద్దాం అనుకునేవన్నీ సఫలతను దూరంచేసే అంశాలే.
ఉద్యమానికి-నిజానికి ఏ ప్రయత్నానికైనా-సిద్ధాంతం చూపులాంటిది. అది ఉద్యమ గమనాన్ని పర్యవేక్షిస్తూ, నడిపిస్తూ వుంటుంది. రెండోది ఆచరణ. ఈ రెండూ కలిస్తేనే సక్రమమైన నడక ఏర్పడుతుంది. సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డి నడకతో సమానం. ఆచరణ లేని సిద్ధాంతం కుంటివాని చూపుతో సమానం. ఈ రెండూ నిరర్ధకాలే. అందు లోనూ చూపులేని నడకైతే ప్రమాదకరం కూడా. అది నిరర్ధకం దగ్గర ఆగక దురర్ధకం కూడా అవుతుంది. రెండూ సరైన పాళ్ళలో అవసరమే అయినా, ముందు సిద్ధాంతం- జ్ఞానభాగం-సిద్ధంకావాలి. దానిననుసరించి కార్యాచరణ ప్రణాళిక రూపొంది-ఆచరణకు రావాలి. అది సక్రమమైన రీతి.
అయితే ఆ క్రమం సమక్రమంగా శక్తివంతంగా అమలవ్వాలంటే, యోగ్యమైన సిద్ధాంతంతోబాటు, దానిని జీర్ణం చేసుకున్న దృఢచిత్తులైన వ్యక్తులు, నిపుణత, పనికి అవసరమైన వనరులుండడం-పని నిరంతరాయతకు అవసరమైన వనరులు వస్తూ వుండడం, వాటి సక్రమ వినియోగం, ఈ మొత్తాన్ని నిర్ణీత అవధుల్లో సమీక్షించుకుంటూ, సరిచూసుకుంటూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ వుండే ఏర్పాటు, అన్నవి సమకూడాలి. ఈ మొత్తాన్ని గుదిగుచ్చడమే ఉద్యమారంభకుల, నేతల ప్రధాన కర్తవ్యం. మిత్రమండలిలోగానీ, మిత్ర సంస్థలతోగాని ఉద్యమాల గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడల్లా నేను దీనినే ప్రధానంగా చూస్తూ, ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఈ వ్యాసంలోనూ ఈ సారాంశాన్ని మీకు స్పష్టపరచాలనే అనేక కోణాల నుండి దీనిని మళ్ళా మళ్ళా వివరించే పనిచేశాను. అవధారణావశ్యకతకల, అర్హతకల అంశాల విషయంలో ద్విరుక్తి- పునరుక్తి దోషంకాదని విషయజ్ఞులంటారు.
సిద్ధాంతంలో తాత్వికభాగమూ-ఆచరణకవసరమైన కార్యాచరణ ప్రణాళికాభాగము అన్న రెండు ప్రధాన భాగాలుంటాయి. సిద్ధాంతభాగంలో సమస్య, దానివల్ల ఏర్పడుతున్న ముప్పు, సమస్యకు కారణము, నివారణోపాయము, నివారణ ద్వారా ఒనగూడే మేలు అన్న అంశాలు చోటుచేసుకుని వుంటాయి. నివారణోపాయం క్రిందనే లక్ష్యము- ఉపలక్ష్యాలు అందుకవసరమైన కార్యక్రమ విధానములతో కూడిన ప్రణాళిక వుంటుంది. ఇదంతా జ్ఞానభాగానికి చెందిందే. కనుక ఈనాడు ఏదైనా ఒక సామాజిక ఉద్యమాన్ని ఆరంభించదలచిన వారెవరైనా మొదటిపని ఇక్కడ మొదలెట్టాల్సిందే.
సమాజం బాగుకోసం నడుం బిగించిన సహ ఉద్యమ మిత్రులందరినీ ఇక్కడ మనస్సు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికి ముగిస్తున్నాను. చెప్పిందే చెప్పడం అన్నదాన్ని విడచి, మార్పులు-చేర్పులు వుంటే సూచించండి.
No comments:
Post a Comment