Thursday, October 1, 2009

అమ్మాయిలపై యాసిడ్‌ పోత - గొంతుకల కోత : సంపాదకీయం




వర్తమానంలో స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఎంతగా పెరిగిపోయాయంటే - ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ప్రతిరోజూ ఒకటో, రెండో వార్తలు వినబడుతున్నాయి. ప్రేమ పేరుతోనో, కోరిక తీర్చమనో యువతులను వేధించటం, వారు నిరాకరించారనే కసితో వారిపై యాసిడ్‌ పోయటం లేదా మరోరకంగా వారిని గాయపర్చటం, అనేక సందర్భాల్లో వారిని హత్యచేయటం ఎక్కువగా వినబడుతున్నాయి. 2005లో శ్రీలక్ష్మిని మనోహర్‌ చంపిన మరునెలలోనే విజయవాడలోనే అదే తరహాలో మరో హత్యజరిగి భయోత్పాతాలకు నాంది పలికినట్లయింది. ఆనాటి నుండి, ఇప్పటివరకు ఇలాంటి హత్యలే సుమారు 60కి పైనే మన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో నమోదయ్యాయి. అసలు ఇది 'కోతల సీజనా?' అనికూడా అనిపిస్తుంది.

అంతేకాదు. ప్రేమించుకుని, పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంగా కొందరు ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, పెళ్ళిచేసుకుని కూడా కుల, మతాల, అంతస్తుల పట్టింపుతో పెద్దలు అంగీకరించలేదన్న కారణంగా నూతన దంపతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాను ప్రేమించినా ఎదుటివారు తనను ప్రేమించలేదని, కొంతమంది; ప్రేమించినవాడు మోసంచేశాడని, పెళ్ళికి నిరాకరించాడని మరికొంతమంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడడంచూస్తే, ఇది యువతుల అత్యాచారాల, హత్యల, ఆత్మహత్యల యుగమా? అనిపిస్తుంది. ఏమనిషైనా ఎంతకాలమైనా బ్రతకాలనుకుంటాడు. హాయిగానూ బ్రతకాలనుకుంటాడు. కాని ఆ బ్రతుకుకు, బ్రతుకులోని హాయిని దూరంచేసుకునే హత్య, ఆత్మహత్యల పరంపరకు మనిషి ఎందుకు పాల్పడుతున్నాడు? కిరాతకంగా, ఉన్మాదంగా, ఎదుటివారిని గాయపర్చే లేదా చంపివేసే వికృత, పైశాచిక ప్రవర్తన కొందరిదైతే, జీవితమంటే ప్రేమ తప్ప మరొకటి లేదనే తప్పు అవగాహనతో ప్రాణాలు తీసుకునే భగ్నప్రేమికుల కథలు మరికొందరివి. ఏమిటి ఈ దారుణాలకు కారణం? ఎక్కడుంది వీటికి పరిష్కారం? ప్రాణాలకు విలువ లేకుండా పోవటం సభ్యసమాజం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.
ఈ సందర్భంలో మనందరం ఒక ముఖ్యమైన విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. 'జాతస్య మరణం ధృవం'. అంటే పుట్టిన ప్రతిమనిషికీ మరణం తప్పదు. అయినా ఎవరి జీవితంపైన వారికి హక్కువుంటుందిగానీ, 'నా ప్రాణం, నా యిష్టం, బ్రతికితే బ్రతుకుతాను, లేకుంటే చస్తాను' అనే హక్కుఎవరికీ లేదు. అలాగే ఇతరుల ప్రాణాలు తీసుకునే హక్కునూ ఎవరికీ లేదు. చివరికి 'మేం కన్నాం. మా బిడ్డల ప్రాణం, మా యిష్టం' అనే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు. వఉరిఖీలి బిదీఖి ఉలిశి జిరిఖీలివ అంటే 'బ్రతుకు, బ్రతకనివ్వు' అనేదే మనందరం అనుసరించాల్సిన సూత్రం. అందువలన ఈ ఆసిడ్‌ పోయడాలూ, గొంతులు కోయడాలు, ఇంకా ఏ విధంగానూ ఇతరుల ప్రాణాలను హరించే హక్కు ఎవరికీ ఈ రాజ్యాంగం యివ్వలేదు.
ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి కేవలం ఉన్మాదం, ఆవేశం తప్ప, ఆ సమయంలో తాము ఏం చేస్తున్నదీ, ఎంత తప్పుచేస్తున్నదీ, దాని పర్యవసానం ఎలా వుండబోతున్నది అన్న ఆలోచన ఉండటంలేదు. ఎదుటివారిపై కసితీర్చుకుందామనుకుని కిరాతకాలకు పాల్పడుతున్నారుగాని, ఇలాంటి ఒక్కొక్క సంఘటన ఎదుటివారినేకాక మొత్తం సమాజాన్నే కుదిపివేస్తుందన్న ఆలోచన వీరికి ఉండటంలేదు. అందువలన ఇలాంటివి జరక్కుండా సమాజం అంతా ఆలోచించాలి. అన్ని కోణాల్లో విచారించి కారణాలు తెలుసుకోవాలి. ఇక విషయానికి వద్దాం.
ప్రేమ, ఆకర్షణ తప్పుకాదు. నిన్ను ఇష్టపడని వ్యక్తిని ప్రేమ పేరుమీద, యిష్టం పేరుమీద వేధించడం నేరం. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఎవర్నైనా ప్రేమించడమంటే అర్థం, వారు సంతోషంగా వుండాలని మనసారా తపించడం. వాళ్ళు సంతోషిస్తే ప్రేమించేవాడు సంతోషపడతాడు. వాళ్ళు బాధపడితే అతడూ బాధపడతాడు. మరి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారిది నిజమైన ప్రేమ అవుతుందా? కాదనే చెప్పాలి. మరేమిటి? అసలు వీరు తాము ప్రేమించిన వ్యక్తులు సంతోషంగా వుండాలని కోరుకోవటం కంటే వారినుండి వీరే సంతోషాన్ని పొందాలని తపిస్తున్నారు. అందుకని దాన్ని ప్రేమ అనటంకంటే మోహం అనాలి. కొంతమంది ఆ సంతోషం తమకు ఎప్పుడు దక్కలేదో అప్పుడు ఉన్మాద చర్యకు పాల్పడుతున్నారు.
దేనినన్నా ప్రేమించాలన్నా, మోహించాలన్నా దానిపట్ల ఆకర్షితులవటం సహజం, ఆకర్షణ ప్రేమకుగానీ మోహానికిగానీ దారితీస్తుంది. రెండింటిలోనూ తనదైతే బాగుండుననే అనిపిస్తుంది. ఒకసారి తనదైన తరువాత మోహానికి తొలగిపోయే అవకాశము ఎక్కువైతే, ప్రేమకు నిలచిపోయే అవకాశము ఎక్కువ. ప్రేమకాకుండా కేవలం ఆకర్షణ, లేదా మోహం అయితే ఆ వ్యక్తిలో ఏమిచూచి ఇష్టం కలిగిందో, అది లేనినాడు ఆకర్షణా లేదు. మోహమూ వుండదు. ఉదా|| అమ్మాయి అందంగా వుందని ఒకడు ఇష్టపడి, ప్రమాదవశాత్తూ ఆ అమ్మాయి అందం కోల్పోతే ఇష్టపడడం మానివేశాడనుకోండి. అంటే ఆ అమ్మాయిపట్ల అప్పటివరకు అతనికి కేవలం మోహం తప్ప మరొకటికాదు అని అర్థం. మరో కోణంలో విశ్లేషిద్దాం. | జిళిఖీలి రిశి అన్నా, | జిరిదిలి రిశి అన్నా సాధారణంగా ఒకే అర్థంలో వాడేస్తుంటారు. కాని అవి వేరువేరు. ఉరిదిలి అంటే ఆకర్షణ, ఉళిఖీలి అంటే ప్రేమ. నిజమైన ప్రేమలో ఎవరిపట్ల 'ప్రేమ' వుందో వారు తిరస్కరించినా సహిస్తారు. కాని వారికి అపకారం తలపెట్టరు. అందుకే ఇలా దాడులు చేసేవారిని 'ప్రేమోన్మాది' అనటం కంటే 'కామోన్మాది' అనటం ఉచితం అవుతుంది.
జెలసీతోపాటు, మగవాడికున్న ఆధిపత్య భావజాలం, పొసెసివ్‌నెస్‌, అప్రజాస్వామిక మనస్తత్వము కూడా కారణాలు అవుతాయి - కాని ఇవి చలాయించే ముందు ప్రతి మగాడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ నిజంగా ప్రేమించినప్పటికీ, ప్రేమికురాలిపై తనకు ఎలాంటి హక్కులూ వుండవు. ఈ మరణాలన్నీ ఒక ఎత్తయితే మరో రకంగా కూడా స్త్రీలు హత్యలకు గురవుతున్నారు. అమ్మాయిల్ని ప్రేమించినట్లు నటించి, లోబర్చుకుని, తీరా పెళ్ళి ప్రసక్తి వచ్చేసరికి, వారిని ఎలాగోలా వదల్చుకోవాలని కొంతమంది అబ్బాయిలు హత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొన్ని సంఘటనల్లో పెళ్ళయిన స్త్రీలు కూడా అనేకమంది గృహహింసకు గురిఅయి హత్యకో, ఆత్మహత్యలకో గురి అవటమూ జరుగుతున్నాయి. కానీ ఎక్కువ కేసుల్లో నేరస్తులు, బాధితులు 14-25 సం||ల మధ్యనున్న వయసువారే కావటం గమనించాలి. అందువలన ఈ శీర్షికను టీనేజి బాలబాలికలకు, అవివాహితులకు మాత్రం పరిమితం చేద్దాం.
ఏదైనా ఇలాంటి ఒక్క సంఘటన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
1. బాధితురాలిపై : ఒక నిండుప్రాణం బలి అయిపోతుంది లేదా బ్రతికి బయటపడితే జీవితం ఛిద్రమయిపోతుంది. ఏ డాక్టరు కావాలనో, ఇంజనీరు కావాలనో, లేదా మరో గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలనో ఆశించిన యువతి భవిష్యత్తు ఏమవుతుందో చెప్పలేము. నేటి సామాజిక వ్యవస్థలో పెళ్ళికావడం కూడా కష్టమే. ఒక్కోథలో జీవచ్ఛవంగా బ్రతకాల్సి రావచ్చు.
2. నేరస్తుడిపై : నేరస్తుడి భవిష్యత్తు కూడా అస్తవ్యస్తమే. వాడి చదువు లేదా వృత్తి నాశనమయి పోతుంది. జైలుపాలయి వాడు సాధించేది ఏదీలేదు. ఒకవేళ శిక్ష తప్పించుకున్నా సంఘంలో గౌరవం వుండదు. వేరే ప్రాంతాలకు పోయి బ్రతకాలన్నా, తాను ఎలా జీవించాలని కలలు కన్నాడో ఆ జీవితం పొందటం కష్టం. తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరమై, సంతోషం కరువయిపోతుంది.
3. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబంపై : వీరికి కడుపుకోత మిగులుతుంది. కొన్ని సందర్భాలల్లో సానుభూతి కరువు అవుతుంది. కుటుంబం పరువు పోతుంది. అమ్మాయిని బ్రతికించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తుంది. వైభవంగా పెళ్ళిచేసి బిడ్డను అత్తారింటికి పంపించాలని వారు కన్న కలలన్నీ వమ్ము అవుతాయి. ఆ తరువాత పెళ్ళికూడా చేయలేని పరిస్థితులు రావచ్చు.
4. నేరస్తుడి తల్లిదండ్రులు, కుటుంబంపైన : నిందితుడి తల్లిదండ్రులదీ అటూ ఇటుగా అదే పరిస్థితి. కొడుకు ఎదిగివచ్చి తమకు అండగా వుంటాడని, మంచి పేరు తీసుకొస్తాడని ఆశించిన వీరికి ఆ కొడుకు ఉండీ లేనట్లే. దూరంగా ఎక్కడో కటకటాలు లెక్కిస్తూ వుంటాడు. ఒకవేళ పోలీసు ఎన్‌కౌంటర్స్‌లో ప్రాణాలే కోల్పోవచ్చు.
5. ఇదంతా ఒక ఎత్తయితే పోలీసు ఎంక్వైరీ పేరున ఆ రెండు కుటుంబాలూ ఎంతో క్షోభకు గురి అవుతాయి. ఆ కేసు ముగిసేవరకూ పోలీసు నీడ చూసినా వణికిపోతుంటారు. అంతేకాదు కోర్టులచుట్టూ తిరగాలన్నా, కేసునుంచి బయటపడాలన్నా ఎంతో డబ్బు, సమయమూ ఖర్చు అవుతుంది.
6. బాధితురాలు, నిందితుడు, వారి కుటుంబాలేకాదు. సంఘటన జరిగిన కాలేజీలోని విద్యార్థినీ విద్యార్థులుకానీ, ఆ వయసులో వున్న యువతీ యువకులుగానీ వాటి ప్రభావం పడకుండా వుండలేరు. నిద్రించేటపుడు, చదువుకొనేటప్పుడు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినపుడు కూడా ఎంతో భయాందోళనలకు గురి అవుతారు. వీళ్ళుకూడా పోలీస్‌ ఎంక్వయిరీకి గురికావచ్చు. జరిగిన సంఘటనలకు ఒక్కోసారి ప్రత్యక్షసాకక్షులుగా వుండాల్సి వస్తుంది. ఇలాంటివాటన్నింటినీ పెద్దవారు తట్టుకున్నంత త్వరగా ఆ లేత మనసులు భరించటం కష్టం.
7. సమస్య అంతటితో ఆగదు. వారు చదువుతున్న కాలేజీలకు, పాఠశాలలకు కూడా చెడ్డపేరు వస్తుంది. కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఎంతోమందికి సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది. సంస్థల ప్రతిష్ఠ పరోక్షంగా ఎంతో దెబ్బతింటుంది. మామూలు పరిస్థితులు నెలకొల్పటానికి వారు చాలా కష్టపడవలసి వస్తుంది.
ఇంతేకాదు లోతుగా ఆలోచిస్తే సమాజంలో ప్రతి ఒక్కరిమీదా ఇలాంటి సంఘటనలు పరోక్షంగా భారం మోపుతాయి. ఈ కేసును నడుపుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి జీతభత్యాల రూపంలో అయ్యే ఖర్చు ప్రజలసొమ్మేగదా! విద్యార్థినీ విద్యార్థులకు చదువులకొరకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలాంటి సంఘటనలవల్ల వృధా అయిపోతుంది. అదీ ప్రజల సొమ్మేగదా! గమనించండి. ఒక క్షణం ఆలోచించండి. ఉన్మాదంగా, ఆవేశంలో చేసిన ఈ నేరం సమాజం మొత్తాన్ని ఎలా కుదిపేస్తుందో చూశారుగదా! అసలు దీనివలన ఎవరికి ఏం ప్రయోజనం కలిగింది? ఎవరు ఏం సాధించినట్లు? సమస్య ఇంత తీవ్రంగా వున్నది కనుక పరిష్కారమూ ఎంతో అవసరం. ఈ సమస్యకు కారణాలు, వాటికి తగిన పరిష్కారాల గురించి ఆలోచిద్దాం.
1) యువతీ యువకులలోని అవగాహనా రాహిత్యము
2) సినిమాలు, ఇంటర్‌నెట్‌, సెల్‌ఫోన్‌ల ప్రభావం
3) కుటుంబము-తల్లిదండ్రుల పెంపకం, ఉదాసీనత, భయాందోళనలు.
4) కాలేజీ మేనేజ్‌మెంటు, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం రాజకీయ నాయకుల ఉదాసీనత, బాధ్యతారాహిత్యం.
5) వినిమయతత్వం-వగైరాలు.
వివరాల్లోకి వెళ్తే -
యువతీ యువకులు వయసుతోపాటు తమలో వచ్చిన శారీరక, మానసిక మార్పుల ప్రభావంలో ఉద్వేగాలకు లోనై ఆపోజిట్‌ సెక్స్‌పట్ల ఆకర్షితులవుతారు. ఆ వయసులో నిజమైన ప్రేమకు, మోహంకు తేడా తెలియక ఆవేశితులవుతారు. ప్రేమ సంగతి అలా వుంచితే, ఈ ఆకర్షణ అయినా శ్రుతిమించితే క్రమంగా, మోహంగానూ, వ్యామోహంగానూ పరిణమించి వికృతచేష్టలకు మనిషిని సిద్ధపడేట్లు చేసింది. మీరునూ ఆలోచించి చూడండి. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారిది నిజమైన ప్రేమో,? ఆకర్షణో తెలిసిపోతుంది. సమాజంలో కట్టుబాట్లు ప్రభావంవలన ఇటువంటి ఉద్వేగాలను, ఆవేశాలను సాధారణంగా చాలామంది నియంత్రించుకుంటారు. కానీ కొందరు అలా మనసును అదుపుచేసుకోలేక, సాంఘిక వ్యతిరేక  చర్యలకు పాల్పడుతుంటారు. ఆకర్షణలే ప్రేమ అనుకుంటూ, ఆ ప్రేమే సర్వస్వం అనుకుంటూ, తాను ప్రేమిస్తున్నామని అనుకుంటున్న వారి ప్రేమను పొందకుంటే జీవితమే వృధా అనుకునేవారు కొందరైతే, తనను ప్రేమించకుంటే, మరెవరినీ ఇష్టపడకూడదు అనే కసిగా ఎదుటివారిపై దాడిచేసేవారు మరికొందరు. ఏ విధంగా చేసినా ఉన్మాదమే అవుతుంది. నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతాయి. చదువుకుని ఏదో అవుదామని కాలేజీలలో చేరి అది మర్చిపోయి, చదువుపై వుంచాల్సిన మనసుని ప్రేమ వంటి విషయాలపై నెట్టి, ధనాన్ని, కాలాన్ని వృధా చేసుకుంటూ, తమ భవిష్యత్తునీ అంధకారంలోకి తోసేసుకుంటారు. ప్రేమిస్తున్నామనే కారణంతో ప్రియురాలి అవసరాలు తీర్చడానికి తన పాకెట్‌మనీ ఖర్చుచేస్తూ, సినిమాలో హీరోల్లా ఊహల్లో తేలిపోతారు. ఆమె ప్రేమించటం లేదనే నిజం తెలిసి, కోపం, కసి పెంచుకుని, ఒక్కోసారి ఇలాంటి ఉన్మాదచర్యలకు పాల్పడుతుంటారు. ఆడపిల్లలు కూడా దీన్ని గుర్తించి అబ్బాయిల్ని కవ్వించే మాటలు, చూపులు సాగించడం మాని తమ చదువులపైనే దృష్టి నిలపాలి. హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్న ఇలాంటి సంఘటనలకు ఆడపిల్లల ప్రవర్తన కూడా కొంత కారణం అని చెప్పాలి. అంతేకాదు తమను ప్రేమ పేరుతోనో, కోరిక తీర్చమనో వేధించే కుర్రవాళ్ళు తారసపడినపుడు వెంటనే తల్లిదండ్రుల, విద్యాసంస్థల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాలి. వెంటబడే అబ్బాయిలకు వాళ్ల బాధ్యతల్ని గుర్తుచేసి ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుంచాలి. అబ్బాయిలతో సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ ఛాటింగ్‌లు సాగించేటపుడు హుందాగా వుండాలి. వీలైనంత వరకు వాటిని జుఖీళిరిఖి చేస్తే మంచిది.
అగ్నికి ఆజ్యము పోసినట్లు వయసుతెచ్చిన ఉద్రేకంలో యువతీయువకులు ఉంటే ఆ వయసులో వారికుండే బలహీనతలను రెచ్చగొట్టేటట్లు, నేటి టి.వి.సీరియల్స్‌, సినిమాలు, ఇంటర్నెట్‌లో నీలిచిత్రాలు మరియు బూతు పుస్తకాలు చేస్తున్నాయి. వీళ్ళు జరిపే వికృతచేష్టలు అన్నింటికీ దాదాపు ఇవే కారణాలు అనే చెప్పవచ్చు. శృతిమించిన స్వేచ్ఛవైపుకు యువతను పురికొల్పుతున్న ఈ విష సంస్కృతి ఆధునికత ముసుగులో విదేశాలనుండి దిగుమతి అయినదని చెప్పవచ్చు. టి.వి.ఛానల్స్‌ తమ రేటింగ్స్‌ను, పత్రికలు తమ సర్క్యులేషన్‌ను, సినీ నిర్మాతలు తమ కలెక్షన్లను పెంచుకోవటానికే ఆలోచిస్తున్నారేకాని, సామాజికంగా జరిగే నష్టాన్ని గురించి పట్టించుకోవటంలేదు. ప్రేమ ఇతివృత్తం లేని సినిమాలు, నవలలను, వేళ్ళమీద లెక్కించవచ్చు. ప్రజలు చూస్తున్నారని, చదువుతున్నారని, వారికేది యిష్టమో అదే వారికి అందిస్తున్నామని మీడియా సమర్థించుకొంటే వారికి సామాజిక స్పృహ లోపించినట్లే. వారికి మేలు కలిగించే వాటినే యిష్టపడేలా వినోదాన్ని, సమాచారాన్ని అందించటం తమ బాధ్యతగా భావించాలి.
నేటి సమాజంలోని యువతీ యువకుల ఈ విపరీత ధోరణికి తల్లిదండ్రుల పెంపకం తీరు, ప్రవర్తన, కుటుంబ సభ్యుల మధ్య వుండే సంబంధాలు కూడా ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. 'పిల్లల్ని స్వేచ్ఛగా పెరగనివ్వాలి' అనే సూత్రాన్ని పాటించడం మంచిదేకాని, అది విశృంఖల స్వేచ్ఛకు, వాళ్ళలో మొండితనానికి దారితీసేట్లుగా వుండకూడదు. పిల్లలకు మానసికంగా పరిపక్వంగాని థలో వాళ్ళకు జీవితంలో ముఖ్యమైన, విలువైన అంశాలపట్ల సరియైన అవగాహన వుండదు. విలువలు తెలియవు. మూర్తిమత్త్వ నిర్మాణథలో 'పూర్తి స్వేచ్ఛ' పేరుతో వారి యిష్టానికి వారిని వదిలేస్తే, వారి భవిష్యత్తునీ గాలికి వదిలేసినట్లే అవుతుంది. అది గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎదురయ్యే బాహ్య పరిస్థితులు, వాటిపట్ల ఎలా స్పందిస్తుండాలో కూడా తెలియజేస్తుండాలి. ముఖ్యంగా ఆపోజిట్‌ సెక్స్‌పట్ల ఎలా వుండాలో తెలియజేయడం వాళ్ళ బాధ్యత.
అనర్థము జరిగిన తరువాత విచారించడంకంటే, మంచి పెంపకం, మంచి పరిసరాల్లో పిల్లల్ని పెరగనిస్తే అనర్థాలు జరక్కుండా చూసుకోవచ్చు.
అంతేకాదు. బాల్యంలో పిల్లలు తల్లిదండ్రులతో, కౌమారథలో స్నేహితులతో ఎక్కువకాలం గడుపుతారు. అందువలన వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? వారు ఎక్కడ ఎక్కువకాలం కలుసుకుంటున్నారు అనే విషయంపైన తల్లిదండ్రులు దృష్టిసారిస్తుండాలి. తల్లిదండ్రుల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య వుండే సంబంధాలు సరిగా లేకుంటే పిల్లలు కుటుంబ సభ్యులతో గడపటంకంటే ఇతరులతో ఎక్కువకాలం గడుపుతూ వారిపై యిష్టాల్ని, అభిమానాన్ని, ఒక్కోసారి ప్రేమ విషయాలపట్ల ఆకర్షితులవుతారు. చదువు విషయంలో కూడా పరిమితికి మించి వత్తిడిచేసే తల్లిదండ్రులపట్ల వ్యతిరేకత పెంచుకుని, ఆ మానసిక వత్తిడినుండి బయటపడటానికి కూడా ఇంటికంటే బయట వాతావరణాన్నే పిల్లలు ఎంచుకుంటారు.
ఇంతేకాకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా పెంచాలనే తపనలో వారికి అవసరానికి మించిన సౌకర్యాలు అందించి అతి గారాబంగా పెంచుతారు. పిల్లలకు లేమితనం, తాను కోరుకున్నది అందకుంటే సర్దుకుపోయే గుణం అలవాటు చేయరు. తాను కావాలనుకున్నది, ఇతరుల మనోభావాలను పట్టించుకోకుండా మొండిగానైనా సాధించుకోవాలనే, తనకు అందకుంటే వేరెవరికీ అందకూడదనే మనస్తత్వమే ఈ ప్రేమోన్మాదులను ఇలాంటి దాడులకు పురికొల్పుతుంది అని చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ కలసి ఒకరికొకరు తమ తమ బాధ్యతలను, కుటుంబ విలువలను గురించి చర్చించుకుని అనుసరించే వాతావరణం అలవాటు చేసుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నరోజుల్లో ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా వుండేదికాదు. ఇంట్లో వుండే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇంకా ఇతర పెద్దవారు పిల్లలకు మంచీ, చెడూ విలువల్ని అనేక పద్ధతుల్లో నేర్పించేవారు.  ఇంట్లోనే ఎక్కువమంది సభ్యులతో కలసి వుండటం కారణాన సర్దుకుపోయే గుణమూ అలవాటు కావటానికి అవకాశము వుండేది. కాని ఈనాటి న్యూక్లియస్‌ కుటుంబ వ్యవస్థలో ఆ పరిస్థితులు లేకపోవటంవలన మరియు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే వారికి పిల్లల బయటి ప్రవర్తన గురించి పట్టించుకునే సమయం, ఆసక్తి వుండడంలేదు. అలాకాక పిల్లల పెంపకం ప్రాముఖ్యతను గుర్తించి ఎలాగోలా వీలు, తీరిక చేసుకుని పిల్లల కదలికలపై, ప్రవర్తనలపై దృష్టి పెట్టాలి.
కొన్ని సందర్భాల్లో ఇటువంటి వేధింపుల విషయం తల్లిదండ్రుల దృష్టికి ఆడపిల్లలు తెచ్చినప్పటికీ, పెద్దలు సీరియస్‌గా తీసుకోకపోవటం, చిన్నపిల్లలు సర్దుకుపోతారులే అనుకోవటం, ఒకవేళ సీరియస్‌గా అనిపించినా రచ్చకెక్కడం యిష్టంలేక మౌనం పాటిస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులైతే ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లల్ని చదువులు కూడా మాన్పించటానికి సిద్ధపడుతుంటారు. అంతేకాని అలా తమ బిడ్డల్ని వేధిస్తున్న ఆకతాయిల ఆటకట్టించే ప్రయత్నం చేయరు. చదువు మాన్పిస్తారేమోననే భయంచేత అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాల్ని ఇంట్లోవారికి చెప్పకుండా అబ్బాయిల వేధింపుల్ని భరించటానికే మొగ్గుచూపుతుంటారు. చివరకు హత్యలకో, ఆత్మహత్యలకో, యాసిడ్‌ దాడులకో గురి అవుతారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవటమంటే ఇదేనేమో.
ఇటువంటి కిరాతకాలు జరగడానికి పరోక్షంగా విద్యాలయాల యాజమాన్య నిర్లక్ష్య ధోరణికూడా కారణమౌతుంది. తమ కాలేజీలోని స్టూడెంట్స్‌ బాగా చదువుతున్నారా? లేదా? మంచి ర్యాంకులు సంపాదించి కాలేజీకి మంచిపేరు తెస్తున్నారా? లేదా? అనే విషయాలపై తప్ప, విద్యార్థులను సత్‌ప్రవర్తకులుగా తీర్చిదిద్దటం కూడా తమ బాధ్యతేననే విషయం పూర్తిగా మర్చిపోతున్నాయి. విద్యార్థుల ప్రవర్తనలను పరిశీలించరు సరికదా, తమకు ఆడపిల్లలుకాని, వారి తల్లిదండ్రులు కాని ఎవరైనా ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోవడంలేదు. వేధించేవారిపై చర్యలు తీసుకోవటంలేదు. తమ కాలేజీ పరువుపోతుందనో, లేదా అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమేమీ కాదు అనో, మొత్తంమీద ఏదైనా దుర్ఘటన జరిగేవరకూ చలించటంలేదు.
ఇటువంటి ఘటనలు జరగకుండానూ, జరిగితే సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వ్యవస్థ కూడా సకాలంలో సరిగా స్పందించని సందర్భాలు వున్నాయి. కేసు బుక్‌చేస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనో, లేదా పిల్లలే తెల్సుకుంటారనో, కొన్నిసార్లు కేవలం మందలించి పంపిస్తుంటారు. కొన్నిసార్లు ఆడపిల్లల్నే సర్దుకుపోమని సలహాలిచ్చి పంపిస్తుంటారు. సమస్య చిలికిచిలికి గాలివాన అయినాక వారు కలుగజేసుకున్నా పరిస్థితి అప్పటికే నిండు ప్రాణాల్నే బలితీసుకోవచ్చు.
ప్రజాప్రతినిధులు కూడా అంటీ ముట్టనట్లుగానే వుంటున్నారు. సంఘటన జరిగినప్పుడు మాత్రం ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు అధికారపక్షాన్ని కొన్నాళ్ళు విమర్శించటం, ఆపై మర్చిపోవడం జరుగుతుంది. ఈ సమస్యపట్ల ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమంటే, 40 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజుకూడా, ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ విషయాల్ని ప్రస్తావించడం జరగలేదు.
నేటి సమాజంలో వినిమయ సంస్కృతిలో ఒక విపరీత ధోరణి ప్రబలింది. అదేమిటంటే వస్తువును వాడుకుని పారవేయటం దాన్నే ఏరీలి బిదీఖి శినీజీళితిశినీ అనో, లేదా ఈరిరీచీళిరీబిలీజిలి సంస్కృతి అనో పిలుస్తుంటాం. పురుషాధిక్య వ్యవస్థలో స్త్రీ కూడా ఒక వస్తువులాగానే పరిగణించబడుతున్నందువల్ల, స్త్రీని వాడుకుని వదిలేయటం అంటే కేవలం మోహం తీర్చుకోవటం గురించే మగవాడు ఆలోచిస్తున్నాడు. అందుకే స్త్రీకి మనసుంటుందనీ, దానికీ అభిప్రాయాలు వుంటాయనీ, వాటిని గౌరవించాలనీ ఆలోచించక, తనను తిరస్కరించిన ఆడదానిని ఏకంగా హత్యచేయటానికి కూడా సిద్ధపడుతున్నాడు.
ఇలా ఈ సమస్యలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజంలో అందరూ బాధ్యులయినప్పటికీ బలిఅవుతున్నది మాత్రం ఆడపిల్లలే. ఇలాంటివి జరక్కుండా చూడడం మనందరి కర్తవ్యం. ముఖ్యంగా టీనేజిలో వుండే యువతీయువకులు ఈ విషయంపట్ల అవగాహన పెంచుకుని, తమ చదువు గురించి, తమ భవిష్యత్‌ గురించి, తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి తప్ప, ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుని, ఆ ప్రేమ పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడకూడదు. అసలు చదువులు పూర్తయి వాళ్లు ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో ఆర్థికంగా స్వయం పోషకులుగా తయారయ్యేవరకూ ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలు అబ్బాయిల ఇలాంటి ప్రవర్తనను గమనించినపుడు ఆదిలోనే అభ్యంతరపెట్టాలి. పెద్దవారికి తెలియజెయ్యాలి. భయపడకూడదు. సెల్‌ఫోన్‌ల అందుబాటు కూడా యువతీయువకుల ఈ ధోరణికి కారణంగా అనిపిస్తుంది. ఇంటర్నెట్‌లో నీలిచిత్రాల ప్రసారాలు కూడా యువతీయువకుల ఉద్రేకాన్ని రెచ్చగొడుతుంటాయి. అందువలన తల్లిదండ్రులు పిల్లల చదువులు, సౌకర్యాల గురించేకాక వారి ప్రవర్తనలలో వస్తున్న మార్పులను కూడా పరిశీలిస్తుండాలి. కాలేజీ యాజమాన్యాలు కూడా తమ విద్యార్థినీ విద్యార్థులకు చదువేకాకుండా వారి లక్ష్యంగురించి, నైతిక విలువల గురించి, సత్‌ ప్రవర్తన గురించి, ఆవేశం, ఉద్రేకాల నియంత్రించుకోకుంటే జరిగే నష్టాల గురించి, మానసిక శాస్త్రజ్ఞుల (సైకాలజిస్టులు) చేత క్లాసులు చెప్పిస్తుండాలి. మహిళా హోమ్‌ మినిస్టర్‌ ఉన్న మన రాష్ట్రంలోనే ఇది నియంత్రణ కాకుంటే దేశంలో మరెక్కడా, మరింత ప్రగతిని ఈ విషయంలో ఊహించలేము. అందువల్ల పోలీసులు తమ దృష్టికి వచ్చిన ఇలాంటి వ్యవహారాలపట్ల ఉపేక్షగా వుండరాదు. సకాలంలో స్పందిస్తే కొన్ని ప్రాణాలు పోకుండా ఆపవచ్చు.
ఇప్పుడు ఇలాంటి వేధింపులు జరుగుతున్నప్పుడు మనం పోలీసులకు సమాచారం లేదా ఫిర్యాదు చేయటానికి ఈ ఫోన్‌ నెంబర్లు యిస్తున్నాం. రెండూకూడా టోల్‌ఫ్రీ నెంబర్లు. అంటే ఈ కాల్‌చేసిన వారికి పైసా ఖర్చు కూడా వుండదు.
పోలీసు కంట్రోల్‌ రూం : 100;  క్రైమ్‌ స్టాపర్‌ : 1090
ఇలాంటి కేసుల్లో నేరస్తులుగా ఋజువు అయితే శిక్షలు ఈ క్రింది విధంగా వుంటాయి :
1) ప్రేమ పేరుతో వేధిస్తే సెక్షన్‌ 509 క్రింద 2 ఏళ్ళు జైలుశిక్ష
2) స్త్రీలను అవమానపర్చడం, హింసించడం లేదా యాసిడ్‌ దాడులువంటివి చేసి గాయపర్చడం చేస్తే సెక్షన్‌లు 509, 354, 324ల క్రింద 10 ఏళ్ళ కఠిన కారాగారశిక్ష.
3) ప్రేమ పేరుతో అమ్మాయిని మోసంచేసి, ఆమె డబ్బు వాడుకుంటే సెక్షన్‌ 420 క్రింద 1 నుండి 5 ఏళ్ళ జైలుశిక్ష.
4) ప్రేమ పేరుతో కిడ్నాప్‌ చేస్తే - మేజర్‌ యువతినైతే 7 ఏళ్ళు, మైనర్‌ బాలికనైతే 10 ఏళ్ళ జైలుశిక్షలు పడతాయి.
ఈ సమస్య తీవ్రతను గుర్తించి సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్పందిస్తూ తగినవిధంగా, వీలైనంత వరకు ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ సమస్య పరిష్కారానికి తమవంతు కృషిచేస్తారని ఆశిద్దాం.
- యర్రంశెట్టి జగన్‌ మోహనరావు

No comments:

Post a Comment