ఆదిత్య ట్రైనింగ్ క్యాంపు నుండి వచ్చే అవకాశం లేదు. మళ్ళా మండలి సభ్యులం ఇద్దరం ముగ్గురం కూచున్నాం. ఏమి చేద్దామని? హిందూ వివాహ చట్టం క్రింద రిజిస్ట్రేషన్ పనిపూర్తి చేసేద్దాం అన్న నిర్ణయానికి వచ్చాం. కనుక ఆదిత్య సమతల వివాహ నమోదు కార్యక్రమం హిందూ వివాహ చట్టం క్రింద జరిగింది. ఇక్కడికిదొక నిజం.
వివాహానికి చట్టబద్ధత కలిగించడం మినహా రిజిస్ట్రేషన్ విషయంలో నాకంత పట్టింపు దృష్టిలేదు. నా దృష్టి కోణమంతా వివాహం నెపాన మండలి మంచివని భావిస్తున్న భావజాలాన్ని మంది ముందుకు తీసుకుపోవడం, అది కొనసాగేటట్లు చూడడం ఎలాగన్న దగ్గరే వుంది. దాంతో అంతగా పట్టించుకోలేదా విషయాన్ని. ''చాలా ప్రధానమైన ఈ అంశాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదో ఇప్పటికీ నాకర్థంకాలేదు'' అని రెండో లేఖలోని మరో వాక్యాన్ని చూశాకనూ దానిని అంత తీవ్రంగా పరిగణించాలనిపించడంలేదు నాకు.
ఇప్పటికే మీ స్పందన-నా ప్రతిస్పందన పత్రికలో చాలా స్థలాన్నాక్రమించాయి. మీరు లేవనెత్తిన ఏ అంశాన్నీ విచారించకుండా వదిలేయాలని నాకేమీ లేదు. అయితే అందుకు పత్రిక తగిన వేదిక కాదనిపిస్తోంది. పత్రిక (1) ఎంతో వ్యయప్రయాసలతో ముడిపడి వుంది, (2) సామాజిక క్షేత్రానికి సంబంధించిన అనేక అంశాలూ క్రమాన్ననుసరించి ఇందులో కొనసాగించాల్సిన అవసరం వుంది, (3) దీనిపై మనమిరువురమే మరింత సాగదీస్తూ, లోతుగా విశ్లేషిస్తూ అక్కడక్కడా ఖండన మండనలు చేసుకుంటూ చేసే శ్రమ ఇతరులకూ అంత అవసరమైందిగా, విలువైందిగా అనిపించక పోవచ్చు, (4) కాలహరణమూ అయ్యే అవకాశముంది.
ముగింపు : మీకభ్యంతరం లేకుంటే ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. మీరూ నేనూ, మరి ఒకరిద్దరూ కూర్చుని అవసరమైతే రెండు మూడు రోజులైనా వుండి, పూర్తి విచారణ చేద్దాం. విచారణలో సరైనవని తేలిన వాటిని స్వీకరిద్దాం. సరికానివని తేలిన వాటిని విడిచివేద్దాం. తేలనివి పరిశీలనలో వుంచుదాం. ఈ మొత్తాన్ని రికార్డు చేద్దాం. సారాంశాన్ని పత్రికలోనూ వేద్దాం. బాగనే వుందనిపిస్తే ఎప్పుడు కూచుందామంటారో తెలుపండి. మిత్ర సంబంధాలు దెబ్బతినకుండా, విషయ విచారణలో నిష్కర్షకు లోపం రాకుండా సాగడం సర్వదా వాంఛనీయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమ క్షేత్రాలలో క్రియాశీలంగా ఉన్నవారి మధ్య జరిగే చర్చలలో ఈ వైఖరి మరింత అభిలషణీయం. నా ఈ ప్రతిస్పందనలో ఎంతోకొంతమేర నిష్కర్షకంటే మిత్ర సంబంధాలకే అధిక ప్రాధాన్యత నిచ్చాను. కలసి కూచోగలిగితే విషయ నిష్ఠలో నిష్కర్షించుకోవచ్చు.
స్పం. : శ్రీమతి గుత్తికొండ అహల్యాదేవిగారు ఆకేటి సూరన్నగారి లేఖకు జవాబిస్తూ, సురేంద్రగార్కి లేఖ ప్రతిని పంపించారు. లేఖాసారాంశం - స్త్రీకి జన్మహక్కుగా సంక్రమించిన అలంకారం స్త్రీకి బ్రతికియున్నంతకాలం అలాగే వుండాలి. పునర్వివాహం చేసుకోవడమూ, మానడమూ అన్నది స్త్రీ వ్యక్తిగత విషయం. పురుషుడు పునర్వివాహం చేసుకోవడం తనకు సేవ చేయించుకోవడం కొరకే. ఉన్న ఊరు వదిలి బిడ్డల దగ్గర గడిపితే కాలక్షేపం కాదనో, పిల్లలు తమను సరిగా చూడరనో ఉద్దేశ్యంతో పురుషుడు బిడ్డల దగ్గర గడపడానికి యిష్టపడడు. అలాకాక స్త్రీ పునర్వివాహం చేసుకోకుండా బిడ్డలదగ్గరో, లేక ఒంటరిగానో బ్రతకగలదు. ఇకపోతే సురేంద్రబాబుగారి దంపతులు
వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నారుకనుక వారికి పునర్వివాహాల విషయంలో మీరు చేసిన సలహా వర్తించదు. మీరు మీ భార్యతో పునర్వివాహం గురించి చెప్పడం అభినందనీయమే. కాని పెళ్ళయిన రెండోరోజునే అలా చెప్పారంటే మిమ్మల్ని ఎలా అర్థంచేసుకోవాలో అంతుబట్టడంలేదు. హేతువాది అయినంత మాత్రాన కొత్తగా పెళ్లయిన శుభవేళ భార్యతో సంభాషించవలసిన అంశం అదేనా?
స్పం. : తూ.గో.జిల్లా నుండి జిల్లా హేతువాద సంఘాధ్యకక్షులు ఆకేటి సూరన్నగారు : మిత్రులు సురేంద్రగారికి, నమస్తే! అంటూనే ''మీ వివేకపథం జులై 2009 సంచికలో మీరు వ్రాసిన వ్రాతలకు-మీ ఆచరణకు పొంతనలేదు'' అంటూ ఒక దోషారోపణతో లేఖ మొదలెట్టారు.
జులై సంచికలో అహల్యాదేవిగారి వ్యాసంపై స్పందిస్తూ నేను వెలిబుచ్చిన అభిప్రాయాలను 'చక్కటి వివరణ' అంటూ ప్రశంసిస్తూనే, నీ మాటలకూ-చేతలకూ పొంతన లేదంటూ నిందవేసి, నేను చూసుకో, నా వివాహమైన రెండోరోజునే నా భార్యతో, నేను నీకంటే ముందే చనిపోతే నీ అభీష్టం మేరకు అలంకరణలతోబాటు, రెండవ వివాహం చేసికోమనీ సలహాయిచ్చాను అని తానెంత ఆచరణ పురుషుడో చూసుకోమంటూ స్వోత్కర్షను ప్రదర్శించారు.
నిజానికి పెళ్ళైన రెండోరోజునే ఆ సమయ సందర్భాలలో మాట్లాడుకోవలసిన వాటిని విడచి నేను చస్తే నీవు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వుండేవు. రెండో పెళ్ళి చేసుకో అంటూ మీచేత మాట్లాడించిన మీ హేతుబుద్ధికీ, దానికున్న సందర్భశుద్ధికీ జోహార్లు అర్పించితీరాలి. విషయ విమర్శ సందర్భానికీ, వ్యక్తి విమర్శ సందర్భానికీ తేడా చూడని (చూడలేని) ఎదుటివాడిలో ఎక్కడోచోట ఏదో లోపాన్ని చూపకుండా వుండలేని రంధ్రాన్వేషణాతత్పరతను చూసి నేనైతే జాలిపడతాను. వీలుంటే ఒక దెబ్బవేసి తట్టి లేపేపని చేస్తాను.
అహల్యగారి వ్యాసం దేనిని ఉద్దేశించిందో పట్టుకోలేనితనమూ వుంది మీలో. అది ఎక్కడోచోట తప్పు కనిపెట్టాలన్న తొందరలో జరిగిన పొరపాటైనా అయ్యుండాలి. లేదా, ఆమె ఆశించినదానికంటేను చాలా ఎత్తులో వున్నాను నేను అని మిమ్ము కనబరచు కోవాలన్న తొందరవల్ల జరిగిన పొరపాటైనా అయ్యుండాలి. ఈ రెండూ కాదంటే ఇక ఆ వైఖరి ఆత్మస్తుతి, పరనిందలకు అలవాటుపడడం వల్ల ఏర్పడిందైనా అవ్వాలి.
నాకు తెలిసి అహల్యగారి దృష్టి స్త్రీకి పుట్టుకతో-చిన్ననాటినుండీ- అందిన అలంకరణలు-భర్త చనిపోయాక ఉండకూడదనడం తప్పు అని చెప్పాలన్నదే. ఆమేరకు నేను సందర్భోచితంగా స్పందిస్తూ నేను నా భార్యకేగాక, బంధుమిత్రులకూ, నా మాటను, పట్టించుకునే వారందరికీ అనంటూ ఈ విషయంలో నా దృఢనిశ్చయం ఇది అంటూ అలంకరణలు తీసేయక్కరలేదు అని వ్రాశాను. మంచిగా వ్రాశాడని ఒకవంక మీ మనస్సు చెపుతున్నా, సురేంద్రపట్ల ముందేర్పరచుకుని వున్న అభిప్రాయం ఎక్కడోచోట లోపాన్ని కనిపెట్టాలని, లేకుంటే అంటగట్టాలనీ ఉబలాటపడుతోందన్నమాట.
ఎదుటివానిని మిత్రునిగా మనస్సు అంగీకరిస్తే ఎలా ప్రవర్తించమంటుంది? అమిత్రునిగా పరిగణిస్తే ప్రతిపక్షంగా చూస్తే, శతృవుగా భావిస్తే ఎలా ఎలా ప్రవర్తించ మంటుంది? అన్నది వాస్తవాల దృష్ట్యా ప్రవర్తన దృష్ట్యా చాలా కీలకమైనదవుతోంది. నిజంగా మీరు నన్ను మిత్రునిగా స్వీకరించారా? లేదా? అన్నది మీరే నిర్ధారించాలి. కనీసం సమాజహితైషిగనైన నన్నంగీకరించగలుగుతారా? సంఘ వ్యతిరేకశక్తిగనే చూడాలనిపిస్తుందా? మీ మనస్సు ఎటు మొగ్గుతోందో ఒకపరి తిరిగి చూసుకోండి.
పాఠకులందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యాంశాన్ని మీ లేఖనడ్డుపెట్టుకుని చెపుతాను. అందరూ పరిశీలించవచ్చు. విషయాన్ని విచారించే సందర్భంలో వ్యక్తిని వెనుకకు పెట్టి, వ్యక్తిని విచారించేటప్పుడు విషయాన్ని రెండునబెట్టి విచారించాలన్నది, విచారణ నియమాలలో చాలా కీలకమైంది. వాటినే పారిభాషికంగా వాద పరీక్ష, వాది పరీక్ష అనంటారు. వాదాన్ని పరీక్షించేటప్పుడు వాది ప్రవర్తనేమిటి? నైజమేమిటి? అన్నది అనవసరాలు, అసందర్భాలు కూడా. అలాగే వ్యక్తి వర్తనే విచారణీయాంశమైనపుడు వాదపు విచారణ అనవసరం.
ఏంచేద్దాం! హేతువాద ఉద్యమాలలో అధ్యయనము-శిక్షణలన్నవి మృగ్యమయ్యాక, ఊకదంపుడు ప్రసంగాలు, వార్షికోత్సవాలే ఉద్యమాచరణగా చూడడం మొదలయ్యాక ఇట్టి మెలకువలు నేర్వాలని సభ్యులకుగానీ నేర్పాలన్న ఇంగితం నేతలకుగాని వుండడంలా. ఉద్యమాలు నామమాత్రావశిష్టంగా మారుతూ వుండడానికిదో ప్రబల కారణం ఆలోచించండి.
మరోమాట! నా స్పందనపై మీ అభిప్రాయం తెలప మొదలెట్టి ఆ లేఖ ఆమెకు ఎందుకు పంపినట్లు? ఇదిగో! సురేంద్రఅయితే ఇంతే, మేమైతేనో ఇంత అని చెప్పుకోవాలనిపించా! మరేదైనా కారణముందా?
తప్పుడు వ్యాఖ్యానం చేయని, తప్పులు దొర్లని రీతిలో మీదికాని, ఏదేని ఒక తాత్విక ధోరణిని విచారిస్తూ ఒక వ్యాసం రాయండి చూద్దాం. నా ఈ వత్తిడివల్లనైనా పట్టుబట్టి సక్రమ విచారణ (విశ్లేషణ-విమర్శ-సమీక్ష) చేసేందుకు యత్నిస్తారనే, ఈ మాట చెపుతున్నాను.
మరోమాట! మీ లేఖలోని మొదటి ఆరోపణను కొంత విచారించాల్సి వుంది. మాటకు చేతకు తగినంతగా పొంతనలేనితనం, అసలే పొంతనలేనితనం అన్నది ఎప్పుడేర్పడు తుంటుంది?
1) ఏ మనిషీ తెలిసిందంతా చేయలేడు. గట్టిపట్టుదలగలవాడైతే తెలిసిందాంట్లో అవసరమైనదనిపించినంతమేర ఆచరించే యత్నం మొదలెడతాడు. శక్తిననుసరించి అందులో అంతానో, ఎంతోకొంతనో చేసుకుంటూ పోతుంటాడు. ఈరకంవారి నిజాయితీని శంకించకూడదు. ఇట్టివారినీ నిజాయితీ లేనివానిగా పరిగణించబూనడం మతిసెబ్బరి తనం.
2) తెలిసినవాటిలో కొన్నింటిని అంత ప్రధానమైనవిగ తలంచక పోడంవల్ల వాటిని పాటించకపోవడం జరుగుతుంటుంది. ఈరకంవారినీ నిజాయితీ లేనివారిగ తలంచ గూడదు. వీరి అవగాహనలోని తేడాపాడాలను పరిశీలించాల్సి వుంటుంది. నిజంగా అతని అవగాహనలో లోపం వున్నట్లయితే, వ్యక్తిత్వాన్ని నిందించకూడదు. అవగాహనలోని లోపాన్ని ఎత్తిచూపాలి.
No comments:
Post a Comment