Tuesday, March 1, 2011

సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక-ఉద్యమం-ప్రస్తుత స్థితి

యోచనాశీలురైన ఉద్యమ మిత్రులారా! పాఠకులారా!
దీర్ఘకాలం పెద్ద ఎత్తున సాగించాల్సిన యత్నాలేవైనా నిర్ణీత అవధుల్లో సునిశితమైన సమీక్షకు లోనవుతూ ఉండాలి. సమీక్ష రాగద్వేష రహితంగా ఉండి, వాస్తవాలను గమనించాలన్న తీవ్రమైన ఆకాంక్ష గల యోచనాపరుల చేత చేయబడాలి. సమీక్షలక్ష్యం ముందనుకున్న ప్రణాళికననుసరించి అప్పటి వరకు జరిగిందేమిటి? జరిగిందాన్లో నుండి ప్రణాళికలో ఏమైన మార్పులు చేర్పులు అవసరమై యున్నాయా? అన్నది స్పష్టంగా గమనించుకుని, రాబోయే నిర్ణీత కాలానికి అవసరమైన ప్రణాళికను ఖరారు చేసుకుని, మళ్ళా అక్కడ నుండి పని ప్రారంభించడం. ఈ విషయంలో ఉద్యమనేతలకుగానీ, సమీక్షకు కూర్చున్న (పూనుకున్న) వారిలోగాని స్పష్టత, తపన లేకుంటే, ఆ సమీక్ష సమీక్ష సాధించాల్సిన ఫలితాన్ని సాధించిపెట్టదు. అందువల్ల ఉద్యమాలూ ఆరోగ్యంగా, బలంగా సాగలేకపోతాయి.
చరిత్రను జాగ్రత్తగా అవలోకించగలిగితే, గతాన్ని పట్టించుకోని, గుణపాఠాలు నేర్చుకోని వ్యక్తుల జీవితాలుగానీ, సంస్ధల జీవితాలుగానీ, ఎదుగూ బొదుగూ లేకుండా సాగుతుండడమో, వెర్రితలలు వేయడమో, క్రమంగా నీరశించి కునారిల్లిపోవడమో జరిగినట్లు స్పష్టంగా అగపడుతుంది. కనుక ఉద్యమ లక్ష్యాలు సాధించాలన్న తీవ్రమైన తపన, ఆవేశకావేషాలకు, ఉద్వేగాలకులోనుకాని తనంతో బాటు నిశిత పరిశీలనా సామర్ధ్యము కలవారు కూర్చుని థలవారీగా జరిగిన, జరుగుతున్న, జరగాల్సిన వాటి గురించి సమీక్షలు నిర్వహించుకుంటుండాలి.
అలా జరగకుంటే, అలాంటి యత్నాల పర్యవసానాలు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, పుట్టిమునిగాక ఈత నేర్చ మొదలెట్టడం లాంటివిగనే ఉంటాయి. సుదూర ప్రయాణానికి సమకట్టిన యాత్రికుడు వివిధ థలలో ఎప్పటికప్పుడు అప్పటికి ఎక్కడి వరకు చేరింది, ఇక ముందు ఎటు వెళ్ళాల్సింది, దానితోపాటు సామానుల విషయంలోనూ తిరిగి చూసుకుంటుండాలి. అలా పట్టించుకోని ప్రయాణాలు చేరవలసిన చోటికి చేరకపోవడంతో పాటు, ఉండవలసినవి ఉండకపోవడం కూడా జరిగే వీలుంటుంది. కనుకనే మనందరి జీవితాలలో మజిలీలు ఏర్పడ్డప్పుడల్లా పై రెండు జాగ్రత్తలు తీసుకోవడం సహజంగనే అలవడింది. కనుకనే అంతకంటే సంక్లిష్టమైన ఉద్యమ యత్నాలలో, తిరిగిచూసుకోవడం అన్న విధానం మరింత మరింత అవసరమై ఉంది అనంటున్నాను.
పై సాధారణ సూత్రాలాధారంగానే, మన ఐక్యవేదిక ఉద్యమాన్ని తిరిగి చూసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటికి జరగాల్సింది, జరిగింది అన్న రెండంశాలను నా దృష్టి కందినంతలో సమీక్షించే పని చేశానిందులో. ఉద్యమంతో మమేకమైన వాళ్ళూ, ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న వాళ్ళు ఈ సమీక్షా రూపాన్ని జాగ్రత్తగా పరికించి, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మన మంతా ఎవరి పాత్రను వాళ్ళం సక్రమంగా పోషిస్తేనేగాని సమష్టి మహద్యత్నాలు సక్రమంగా సాగవు.
ఉద్యమ పూర్వరంగం
ఉద్యమం ఆరంభించుకుని సం|| పైగా అయ్యింది. మొన్న జనవరి 30, 31న వార్షిక సమీక్షా సమావేశం కూడా జరుపుకున్నాం. ప్రధమవిడత లక్షంగా అటు ఉద్యమ నిర్మాణ పరంగా, ఇటు ఉద్యమ కార్యాచరణ పరంగా క్రింది పనుల్ని పెట్టుకున్నాం.
1. జిల్లా కమిటీల ఏర్పాటు
2. మండల కమిటీల ఏర్పాటు
ఈ రెండు పనులూ 1 సం||లోగా పూర్తి చేయాలనుకున్నాం. అయినా ఇప్పటికింకా ఆ రెండు పనులూ పూర్తి కానేలేదు.
జిల్లా కమిటీల ఏర్పాటుగానీ, మండల కమిటీల ఏర్పాటుగానీ ఉద్యమాశయాల నెరవేర్పుకు అనుగుణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాం. ఆ వివరాలను క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉన్నవారికీ, వారి మాతృ సంస్ధల బాధ్యులకు, ఐక్యవేదిక భాగస్వామ్య సంస్ధలకు, ప్రజాస్వామ్య పరిరక్షణదిశగా, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక చేపట్టిన ప్రజాఉద్యమం, అన్న పుస్తకం ద్వారా అందజేశాం. అదే వివరాలను ఆయా సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ నా వరకు నేను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చాను. వస్తున్నాను.
1. నా అవగాహన ననుసరించి ఉద్యమ లక్ష్యం సమాచారహక్కు చట్టాన్ని గురించి ప్రచారం చేయడం మాత్రమే కాదు.
2. సమాచార హక్కు చట్టాన్నుపయోగించి మన వేదికలోని వారు సమాచారం కొరకు విస్త్రృతంగా దరఖాస్తులు పెట్టడమూ కాదు.
3. వేదిక సాధించాలనుకుంటున్న అంతిమ సాధ్యం (లక్ష్యం) భారత దేశ ప్రజలందరికీ, భారత రాజ్యాంగం లక్షిస్తున్న - సాధించుకోమని చెపుతున్న - సాంఘిక, ఆర్ధిక రాజకీయ ప్రజాస్వామ్యం అందుబాటులోనికి తీసుకురావడం.
4. ఆ లక్ష్యసాధనకు ఆచరణ యోగ్యమైన పరిధిని నిర్ణయించుకోవడం అన్నిటికంటే కీలకమైనదవుతుంది. కనుకనే మన కార్య క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఒక మొత్తంగా ఎంచుకున్నాం. ఆ దృష్టితోనే, ఉద్యమానికి ''సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్‌'' అని పేరుపెట్టుకున్నాం.
5. ఉద్యమ ప్రధాన లక్ష్య సాధనకు, 2014 ఎన్నికల సమయాన్ని తాత్కాలిక కాలావధిగ నిర్ణయించుకున్నాం. అందుకొరకై మూడు థలుగా ఉద్యమ కార్యాన్ని నిర్వర్తించుకోవాలనుకున్నాం. ఇవిగో ఆ మూడంచెలు.
1. ఉద్యమ నిర్మాణ పరంగా
1. ప్రధమ థ ఉద్యమ నిర్మాణ పరమైనది. అది జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఏర్పరచడం.
2. జిల్లా కు 10 మంది, జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగల రీతిలో శిక్షకుల్ని తయారుచేసుకోవడం
3. మలిథ శిక్షణలో భాగంగా మండలానికి ఇద్దరు లేక ముగ్గుర్ని శిక్షితుల్ని తయారు చేసుకోవడం
4. ఉద్యమ కార్యాచరణ పరంగా 1 సం|| పాటు సమాచార హక్కు చట్టాన్ని వినియోగంలోనికి తేవకోడానికి గాను రెండు రూపాలుగా పనిచేయాలి.
1. సమాచార హక్కు చట్టాన్ని వినియోగంలోనికి తేవడానికి సంబంధించిన, చట్టంలోని 4వ సెక్షను, 26వ సెక్షన్లను అమలు చేయించేపనికై ఇటు కమీషన్‌ పైన, అటు ప్రభుత్వం పైనా వత్తిడిపెంచడం ద్వారా ఉదా :- సెక్షన్‌ 4.1(ఎ), 4.1(బి)ల అమలును తనిఖీ చేసి, అమలు కాని చోట దరఖాస్తులు పెట్టడం, ఫిర్యాదులు చేయడం ప్రజా సదస్సులు నిర్వహించడం, శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం మొ||న వాటి ద్వారా.
2. ఉద్యమ కార్యకర్తల తోడ్పాటుతో పౌరుల చేత వివిధాంశాలపై పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టించడం అన్న పని ద్వారా దరఖాస్తులు పెట్టడంలో ప్రజలకు తర్ఫీదునివ్వడం.
3. స.హ. చట్టంపై శిక్షణ పొందిన వారి ద్వారాను, మాధ్యమాలు, ప్రచార సాధనాల ద్వారా గ్రామస్ధాయి వరకు విస్త్రృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలిగించడం.
2. రెండో థ ఉద్యమ లక్ష్యం గ్రామాభ్యుదయ సంఘాలను, పట్టణాలలో పట్టణాభివృద్ధి సంఘాలను ఏర్పాటు చేయడం.
గమనిక : ఈ అభివృద్ధి సంఘాలు ఉమ్మడి లేదా సమష్టి కూటాలుగా ఉండాలన్నది అత్యంత కీలకము. ఈ సంఘంలో ఆయాగ్రామాల, పట్టణాలలోని అన్ని బృందాలు ఉండవచ్చు. ఇది ఏదో ఒక సంస్ధకు చెందిన విభాగంగా కాక, అన్ని సంస్ధలకు చెందిన ఉమ్మడివేదికగా ఉండాలి. ఆ గ్రామం లేదా పట్టణం మొత్తానికి కీలకమైన పాత్రినిధ్యం వహించేదిగా ఉండాలి. పెద్ద పట్టణాలు, నగరాలు, మహా నగరాలలో వార్డు అభివృద్ధి కమిటీలనూ రూపొందించుకోవచ్చు.
గమనిక : ఈ గ్రామ కమిటీలలో 1. ఐక్యవేదిక సభ్యులూ భాగస్వాములుగా ఉంటారు, ఐక్యవేదిక ద్వారా అవగాహన కలిగించుకున్న వారూ ఉంటారు. ఈ థలో ఐక్యవేదిక కార్యాచరణ ప్రణాళిక రెండు విభాగాలుగా ఉంటుంది. గ్రామాభ్యుదయ కమిటీ సభ్యులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి  (1) సమాచార హక్కు చట్టాన్ని, పౌర సేవా పత్రాన్ని వినియోగించుకోడాన్ని గురించి ఎరుకపరచి, ప్రోత్సహించడం, సాయపడడం చేస్తారు. (2) స్థానిక ప్రభుత్వాలకు అధికారాల బదలాయింపుకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయాల గురించి అవగాహన కలిగించి, అధికారవికేంద్రీకరణకై ప్రభుత్వం పై వత్తిడి తేవలసిందిగా వారిని ప్రోత్సహించడం, ప్రేరేపించడం చేస్తారు.
(3) గ్రామ సభలు సక్రమంగా జరిగేలా పంచాయితీ బాధ్యుల్ని, ప్రజల్ని సన్నద్దం చేసేందుకు కృషి చేస్తారు.
3. మూడో థలో ఉద్యమ కార్యాచరణ రెండు రూపాలలో ఉంటుంది.
(1) గ్రామాభివృద్ధి దిశగా గ్రామస్తులే పాల్గొనేలా ప్రోత్సహించే పని చేస్తుండడం.
(2) మంచి రాజకీయాలకు తగిన వ్యక్తుల్ని స్ధానిక క్షేత్రాలనుండే కనిపెట్టి అట్టి వారికి రాజకీయ శిక్షణా తరగతుల్ని నిర్వహించుతూ, మంచి వ్యక్తుల్ని రాజకీయాలలోకి చోరబెట్టడం.
 జరగాల్సిందేంతా? ఇప్పటికి జరిగిందెంత?
(1) జిల్లా కమిటీల ఏర్పాటు, 13, 14 జిల్లా కమిటీలు అక్టోబరు, నవంబరు నాటికి ఏర్పడ్డాయి. మిగిలిన జిల్లాలలో సన్నాహక కమిటీలు ఏర్పడ్డాయి. అటు పైన ఆ కార్యక్రమంపై గట్టి కృషి జరగలేదు.
గమనిక (1) ఐక్యవేదిక ఎంపిక చేసుకున్న విధానం ప్రకారం జిల్లా కమిటీ, ప్రతి మండలపు ప్రాతినిధ్యం కలిగి ఏర్పడాలి. కనీస పక్షం 60, 70 శాతం మండలాల ప్రాతినిధ్యమైనా ఉండాలి. అటు పై ఒకటి రెండు నెలలలో మిగిలిన మండలాల నుండీ ప్రతినిధులను ఎంచుకుని కమిటీని పూర్తి స్ధాయిలో రూపొందించుకోవాలి.
(2) సన్నాహక కమిటీలు ఏర్పడ్డ జిల్లాలలో ఒకటి రెండు నెలలలోగా శాశ్వత కమిటీకి అవసరమైన మండల ప్రతినిధులకై యత్నించి జిల్లా కమిటీని ఏర్పరచుకోవాలి.
(3) అనంతరం 1 సం||లోగా పట్టణ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. ఆ కమిటీలలో మండల కమిటీలో ప్రతి గ్రామ ప్రాతినిధ్యం. పట్టణ కమిటీలో ప్రతి వార్డు ప్రాతినిధ్యం ఉండాలి. కనీసం 60, 70 శాతం ఉంటేగాని అక్కడా శాశ్వత కమిటీలు ఏర్పడడానికి వీలుకాదు. 50% కంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్నంత వరకు ఆ కమిటీలు సన్నాహక కమిటీలనే అనబడతాయి. 60, 70 శాతం పూర్తయి కమిటీలు ఏర్పడ్డ చోటైనా అనతి కాలంలో ఖాళీని భర్తీ చేసుకోవడం జరగాలి. సన్నాహక కమిటీలు మాత్రమే ఏర్పడ్డతావుల శాశ్వత కమిటీలకై యత్నించడం జరగాలి. కమిటీల ఏర్పాటు విషయంలో, ఉద్యమాలకు సంబంధించి గత పది, ఇరవై ఏండ్ల అనుభవాలను దృష్టినిడుకుని, ఒక సాధారణ విధానమును అమలు చేయాలనుకున్నాము. కమిటీలన్నింటిలోనూ ప్రధాన బాధ్యతలు తీసుకున్నవారు, ఆ కమిటీ పరిధిలోని ప్రాంతమంతా పర్యటించాలి. అంటే :-
(1) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా అంతటా తిరిగి జిల్లా స్ధాయిలో ఉద్యమాన్ని చైతన్యవంతం చేయాలి.
(2) డివిజన్‌ స్ధాయిలో ఉపాధ్యక్ష, కార్యదర్శులు డివిజన్‌ అంతా తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి.
(3) మండల బాధ్యులు, అంటే జిల్లా కమిటీ సభ్యులు మండల మంతా తిరిగి మండల కమిటీల ఏర్పాటుకు తగిన సన్నాహక యత్నాలు చేయాలి.
ఈ మూడు రకాల యత్నాల ఫలితంగా 1 సం||లోగా మండల కమిటీలు ఏర్పడాలి. ఉద్యమ కార్యాచరణ తొలి థ యత్నాలు జిల్లా కమిటీలు ఏర్పడ్డ వెంటనే ఆరంభించుకోవాలి.
13, 14 జిల్లా కమిటీలు ఏర్పడ్డ వెంటనే రాష్ట్ర కమిటీ అధ్యయన శిక్షణా తరగతులపై దృష్టి పెట్టింది. అపార్డుతో ఒక అవగాహనకొచ్చి ఒప్పందం కుదరడంతో మొదటి శిక్షణా తరగతిని 25 మందితో అక్కడ నిర్వహించుకున్నాం.
శిక్షణకు అవసరమైన బోధనాంశాలను ఒకటి రెండు నెలలు శ్రమించి రూపొందించుకున్నాం.
బోధనాంశాలు :-
(1) మంచి ప్రసంగీకుడు కావాలంటే,
(2) ప్రేరణ : - సమాజ కార్యం, ఉద్యమ కార్యం ఎందుకు చేయాలి?
(3) రాజ్యాంగం - కనీసావగాహన
(4) సమాచార హక్కు చట్టం - అవగాహన - వినియోగం.
వీటన్నింటికీ ఆధారమైన, ఐక్యవేదిక పూర్వాపరాల గురించీ ఏదో ఒక సమయంలో మాట్లాడుకోవడం.
3 నెలలలోగా జిల్లాకు 10 మంది చొ||న శిక్షకులు ఏర్పడేలా, శిక్షకులకు శిక్షణా ఇచ్చుకోవాల్సి ఉంది.
తగినంత మంది శిక్షకులు తయారవగనే మొదట అపార్డు వారి '5' ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలో తరగతులు ప్రారంభించాలి.
జిల్లా శిక్షణా తరగతులు నిర్వహించుకోడానికి తగినంత మంది శిక్షకులు ఏర్పడగానే జిల్లా శిక్షణా తరగతులూ ఆరంభించుకోవాలి. 1 సం|| పాటు శిక్షణా తరగతులు నిర్వహించాలి.
గమనిక :- 23 జిల్లాలలో శిక్షణా తరగతులు మలిథ కార్యక్రమం అనుకున్నా తొలిథ యత్నాలలో ప్రాంతీయ శిక్షణా తరగతుల వరకైనా జరుపుకుంటూ సుమారు 2,500 నుండి 3,000 మంది వరకు శిక్షకులను తయారు చేసుకోవాలి. ఇదంతా మానవ వనరుల్ని సమీకరించుకునే పని క్రిందికి వస్తుంది.
మరోవంక ఆర్ధిక వనరులు సమకూర్చుకునే పని చేయాల్సి ఉంది.
1. ఉద్యమాలలోని వారమే అయిన మనమే తలాకొంత నిధిని అందించడం.
2. జిల్లాకు 100 మందిని దాతలను గుర్తించి వారి నుండి విరాళాలు సేకరించడం.
3. జిల్లాకు 1000 మందిని సభ్యులను చేర్చుకుని అటు ఉద్యమానికి వ్యక్తులను, ఇటు నిధిని కూడా సమకూర్చుకోవడం.
సభ్యత్వం క్రింద వచ్చిన నిధి నుండి కొంత భాగం మాత్రం రాష్ట్రానికి జమచేసి, మిగిలిన  నిధినంతా జిల్లాలలోనే వినియోగించాలనుకోవడం జరిగింది.
ప్రచార కార్యక్రమాలు : -
శిక్షణ పొందిన వారి నుండి మంచి వక్తలను ఎంచుకొని రాష్ట్ర మంతటా విస్త్రృతంగా పర్యటిస్తూ ప్రచారం చేయాలి.
ప్రచార వాహనాలు సమకూర్చుకుని, ప్రచార సామాగ్రిని సిద్దం చేసుకుని ప్రచారం సాగించాలి.
ఉద్యమ పరంగా అసంతృప్తినీ, ఆందోళనను కలిగిస్తున్న అంశాలు కొన్నిఉన్నై.
1) ఉద్యమ ప్రధాన భావ జాలం (ఆశయాదర్శాలు, నియమనిబంధనలు) అన్న విషయంలో భాగస్వామ్య సంస్ధలన్నింటికీ సరిపడినంత అవగాహన ఉందా? లేదా? అన్నది చాలా కీలకాంశం.
2) అవగాహన ఉందనుకున్నా వారి వారికున్న చేయాల్సిన పనుల జాబితాలో ప్రాధాన్యతా క్రమంలో ఈ పని ఎన్నో స్ధానంలో ఉందన్నది మరో కీలకాంశం.
3) ఐక్య వేదికలోని భాగస్వామ్య సంస్ధలు, క్షేత్రస్ధాయిలోని తమ విభాగాలకు ఐక్యవేదిక గురించి తెలియజేయడంగానీ, ఎక్కడికక్కడ పాల్గొనవలసిందిగా నిర్ధిష్ట రూపంలో తెలియపరచడంగానీ దిశానిర్ధేశం చేయడంగానీ చేశాయా?
4) ఏయే విషయాలలో ప్రజలకు అవగాహన కల్గించుదామని అందరం కలిసి ఐక్యవేదికను ఏర్పరచుకున్నామో, ఆయా విషయాలపై తమ కార్యకర్తలకూ, సభ్యులకు, సానుభూతిపరులకు ముందుగా అవగాహన కలిగించుకోవడం అవసరం అని గుర్తించామా? అందుకు పూనుకున్నామా?
గమనిక : తమకు, తమ కార్యకర్తలకు, తమకు పరిచయాలున్నవారికీ ఐక్యవేదిక గురించి ఇంతగా తెలియ చెప్పనక్కర లేదనుకోవడం ఏరకంగానూ సరి కాదు. ఆ వైఖరి వారి వారి అవగాహనా లోపాన్ని, నిజాయితీలోపాన్ని తెలియజేస్తుంది.
ఈ సందర్భంగా ఒక సూక్తి గుర్తుకొస్తోంది.
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టెనేని బిగియబట్టవలయు.
పట్టి విడుచుట కంటే బాటకంటే పరగి చచ్చుట మేలు... ||విశ్వ||
కార్యసాధకులకుండాల్సిన అత్యంత మౌలికమైన వైఖరి ఇది. ఉద్యమ క్షేత్రంలో ప్రస్తుతం మీ వైఖరి అత్యంత బలహీనంగా ఉంటోంది.
లెక్కకు మిక్కిలిగా సంస్ధలు పుట్టుకు రావడం మరో విషాదం. ఈ మధ్య ఐక్యవేదికల ఆవిర్భావమూ తామరతంపరగా జరుగుతోంది.ఎన్ని ఐక్యవేదికలు పుట్టుకొచ్చినా అన్నింటా కనపడేది ఆ నలుగురే అనడం కంటే హాస్యాస్పదమూ, విషాదమూ ఇంకేముంటుంది?
అసలు ఐక్యవేదికల అవసరమేమిటి?
ఒక సంస్ధ తాను తలపెట్టిన పని తనొక్క దానివల్ల అవదు అని గుర్తించాక, ఆ పనిని చేయడానికి అనుకూలతకల సంస్ధలేమైన ఉన్నాయోమోనని వెదుకుతుంది. ఉద్యమ నిర్మాణంలో, భావసారూప్యతగల వ్యక్తులను వెదకి పట్టుకుని, సమీకరించి, సంఘటిత పరచడం ఎంత ప్రాధమిక సూత్రమో, ఐక్యఉద్యమాలలో భావసారూప్యతకల సంస్ధలను వెదకి పట్టుకుని సమీకరించి సంఘటితపరచడం అంతే ప్రాధమిక సూత్రం. సాధారణ మానవుడైనా సరే తాను చేయాలనుకున్న, మొదలెట్టిన పని తనవల్ల కాదని గుర్తించిన మరు క్షణం చేస్తున్న పనినాపి అవసరమైన సాయం కొరకు యత్నిస్తాడు. అలా కాక ఎవరైనా సాయం కొరకు యత్నం చేయకుండా అవదని తెలిసే ఒక్కడే శ్రమిస్తుండడం గానీ, సాయం తెచ్చుకునే పని చేయకుండడం గానీ చేస్తుంటే అట్టి వానిని తెలివి తక్కువవాడు, వ్యర్ధ శ్రమ చేస్తున్నాడు అని అంటామా? అనమా? అదే మాదిరి తెలివి తక్కువ పని యోచనాపరులం, సంఘటితైషులం అనుకుంటున్నవాళ్ళు చేస్తుంటే ఇక దానినే మనుకోవాలి?
ఐక్య ఉద్యమాలు పుట్టిందే కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఎంచుకుని కలసి కట్టుగా ఒక్క పనినైనా పూర్తి చేయడం కొరకు. అందుకనే ఐక్యవేదికల లక్ష్యంలో '్పుళిళీళీళిదీ ళీరిదీరిళీతిళీ ఆజీళివీజీబిళీ' మాత్రమే ఉంటుంది. ఉండాలి. ఆ పని నెత్తికెత్తుకున్నప్పుడు ఎప్పుడోసారి, ఎంతో కొంత మేర అందరూ వారి వారి పనులనాపుకుని, ఈ ఉమ్మడి కార్యక్రమానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఒక్కరివల్లో కొద్ది మంది వల్లో కాదని గుర్తించేకదా అందరం కలసి ఆ పని చేద్దామనుకున్నది అలా అనుకునికూడా ఏ నాడూ అందరం కలసి పనికి పూనుకోకపోతే అది ఐక్య ఉద్యమ స్వభావానికే విరుద్దం కాదా!?
ఐక్యవేదికలలో సభ్యులై యుండి ఐక్య కార్యాచరణలో పాలుపంచుకోవడం లేదంటేనూ, లేదా పాలు పంచుకోలేక పోతున్నారంటేనూ, (1) అవగాహన లేదనైనా అనాలి. (2) అంత అవసరం అనిపించలేదనైనా అనాలి. (3) మరో ప్రయోజనం కోరో, మొహమాటానికో ఐక్య వేదికలో చేరారేకాని ఇష్టంతో కాదనైనా అనాలి.
ఇవన్నీ ఒక ఎత్తైతే, అనేక ఐక్యవేదికలు పుట్టుకొస్తుండడం, అన్నింటిలోనూ ఆ నలుగురే ఉండడం మరో ఎత్తు. అంతేకాదు. ఈ వైఖరి ఏ వేదిక పనీ సక్రమంగా, శక్తివంతంగా జరగనీకుండా అడ్డుపడుతుంటుంది. కూడాను. ఇక్కడ చేదు నిజాన్ని చెప్పుకోవాలి. ఎక్కువలో ఎక్కువ, ఐక్యవేదికలు స్ధాపించేవారికి పబ్లిసిటీ  గొడవేగాని, సమస్య, దాని పరిష్కారం అన్న విషయంలో ఉండాల్సినంత శ్రద్ధ, మదన ఉండడం లేదు. కనుకనే ఇన్ని, మరిన్ని ఐక్యవేదికలు రాగలుగుతున్నై, రికార్డుల్లో మనగలుగుతున్నై.
నిజానికి ఏదేని ఒక ఐక్యవేదిక దాని అవసరాన్ని గుర్తించిన వారిచే ఏర్పడి ఉంటే, ఆ లక్ష్యం నెరవేరే వరకు దానిలోని వారందరికీ మరో పని కానరాదు. చేయడానికీ వీలుపడదు. ఎందుకంటే ఈ పని ఆరంభించి సాగిస్తూనే ఉండవలసి ఉంటుంది గనుక. ఈ విషయంలో గానీ ఫలానప్పుడు ఫలానిపని మన నలుగురం కలసి చేద్దామన్నకున్నట్లైతే, ఆ మేరకు వారి సొంతపనులాపుకుని ఆ పని అయ్యేంతవరకు అందరూ అదే పని చేస్తారు. ఇది సర్వానుభవ సిద్దమైన., నిర్వివాదాంశం. అవునంటారా? కాదంటారా? కానీ ఈ నాడు ఈ విధానం అమలవడం లేదు. దీనికి తోడు ఉద్యమాలంటే, వివిధ ప్రాంతాల, వారిని ఒక చోట సమావేశ పరిచి సెమినార్లు, చర్చా వేదికలు, నిర్వహిస్తూ, పదవుల్ని పంచుకోవడమేననే ఒక తప్పుడు సంస్కృతి సాంప్రదాయంగా  తీరికూర్చుంది.
నిజానికి సమావేశాలు అదిన్ని అడపాదడపా సంస్ధల కేంద్రాలలో జరిగే సమావేశాలు, అవి ఆరంభ సమావేశాలైతే, ఉద్యమాన్ని గురించి నలుగురికీ తెలియ జెప్పడానికీ, కలసి రాగల వాళ్ళెవరిని గుర్తించడానికీ, కార్యక్రమాలు రూపొందించుకోడానికీ, బాధ్యతలను - పదవులు కానేకాదు - అప్పగించుకోడానికి లేదా స్వీకరించడానికి ఉద్దేశించినవిగానే ఉండాలి. ఉంటాయి. కూడా. అటు పైన నిర్ణీత అవధులో జరిగే అనంతర సమావేశాలన్నీ ఆ ఉద్యమ సంస్ధ అప్పటి వరకు చేసిన పనుల్ని సమీక్షించుకోడానికి, అంతకు ముందున్న పనులలో ఏవేవి ఎంతెంత సఫలమైనాయి? మరి ఏమి పనులు విఫలమైనాయని ఇంకేవేవి మధ్యలో ఉన్నాయో, చూసుకుని, మలివిడత చేయాల్సిన వాటికై, అవసరమైన మార్పులు చేర్పులతో మలిథ కార్యక్రమాలు రూపొందించుకుని, పనులను వర్గీకరించుకుని, బాధ్యతలు స్వీకరించడానికి ఉద్దేశించినవిగా ఉండాలి. వివేకవంతమైన అంటే అవగాహన పునాదిగా గల కార్యక్రమాలన్నీ అలానే ఉంటాయి.
వివిధ ఉద్యమ సంస్ధలకు చెందిన పెద్దలారా! మిత్రులారా! గత 5, 6 ఏండ్లుగా (పదేళ్ళను లెక్కలోకి తీసుకుందామనుకున్నా పరవాలేదు) ఐక్యవేదికల పేరున ఉనికిలోకి వచ్చిన వాటిని గురించి పరిశీలించి చూడండి. ఏయే వేదికలు ఎప్పుడేపుడు పుట్టాయి? వాటిని ఏర్పరచిన వారెవరు? ప్రారంభ సమావేశంలో అందులోని వారు వారు మాట్టాడిందేమిటి? అటు తరవాత ఆ వేదికల కొనసాగింపు కార్యక్రమం లేమిటి? వేదికపై మాట్టాడిన వారు అటు పైన పోషించిన పాత్ర  ఏమిటి? అన్న వాటిని పరిశీలించి వాస్తవాలను గుర్తించండి. నాకు తెలిసి ఐక్యవేదికలుగ ఏర్పడ్డ వాటిలో కొన్ని అదే మొదటి సమావేశం, అదే చివరి సమావేశం కూడా. మరి కొన్నింటిలో అయితే గియతే ఏడాదికో రెండేండ్లకో మలి సమావేశాలు జరిగుండవచ్చు. అప్పడైనా ఈ సంవత్సర కాలంలో ఆవేదిక సమాజంలోఅంటే క్షేత్రస్ధాయిలో చేసిన కార్యక్రమాలు దాదాపు ఏమీ ఉండవు.
సమస్య నేమి చేద్దాం? అని ఆరంభ సమావేశంలో ప్రస్తావించి, ఎవరికితోచింది వారు ప్రకటించి వెళ్తారు. మలి సమావేశం ఒక వేళ గాని జరిగితే, మళ్ళీ అప్పుడు కలసిన నలుగురు వాళ్ళా సమస్యనేమి చేద్దాం? అన్న అంశాన్ని లేవనెత్తి, ఎవరికి తోచింది వారు ప్రకటించి, మీడియాకు కబురందించి, చేతులు దులిపేసుకుంటారన్న మాట. గొప్ప విచిత్రము, హాస్యాస్పదమైన నిజాన్నొక్కదానిని చెపుతాను. చూడగలిగితే మీరు చూడండి. వాస్తవమేమిటో.
బాధ్యతలా  - పదవులా?
ఒక క్రొత్త సంస్ధ ఉనికిలోకి వచ్చింది. కమిటీ ఏర్పడింది. అధ్యకక్షుడు, ఉపాధ్యకక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, సభ్యులు ఇదీ దాని ఒకసాధారణ చిత్రం. ఇదే చిత్రం అటు కేంద్రకమిటీలోనూ, ఇటు జిల్లా, మండల కమిటీలలోనూ ఉంటుంది.
ఎక్కువలో ఎక్కువ భాగం అప్పటికే ఏదో ఒక సంఘంలో ఏదో పదవి? (బాధ్యత)లో ఉన్నవారే. ఇందులోనూ ఏదో బాధ్యతలో జొరబడతారు. ఉదా: - ఒకటి తన సొంత సంస్ధ. అందులో అధ్యకక్షుడో, ప్రధాన కార్యదర్శో తానై ఉంటాడు. ఏదో ఒక కార్యక్రమం చేయాలి గనుక తనకు తెలిసిన నలుగుర్ని, నాలుగు సంస్ధల వాళ్ళను పిలుస్తాడు. అలా నలుగురికీ పరిచయమవుతాడు. ఈ తరహా వ్యక్తుల్లో కొందరికి ఏదో ఒక కోణంలో ఎంతో కొంత సామర్ధ్యం ఉంటుంది. దాంతో ఇతర సంస్ధల వాళ్ళు అడపాదడపా ఇతణ్ణి వారి కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. పరిచయాలు, పరస్పర సహకారము ఇక్కడికి పరిమితమైతే ఎలా గుండేదో గాని, ఈ నాడు సామాజిక క్షేత్రాలలో రకరకాల కారణాల వల్ల ప్రాచుర్యంలోకి వచ్చిన వారిలో ఎక్కువ మంది అనేక సంస్ధలలో రకరకాల పాత్రలలో ప్రవేశించి ఉంటున్నారు.
నేనీమధ్య ఐక్యవేదిక ఉద్యమ నిర్మాణం కొరకుగా అన్ని జిల్లాలు (1,2 మినహాయించి) తిరిగాను. ఆయా సమావేశాల కొచ్చిన వారిలో కొందరు పరిచయ కార్యక్రమాల సందర్భంలో తమను గురించి తాము చెప్పుకుంటూ, ఒక సంస్ధకు జిల్లా అధ్యకక్షుణ్ణనీ మరో సంస్ధలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణనీ, ఇంకొక సంస్ధలో జిల్లా ్ల కోశాధికారిననీ, రోటరీ మెంబర్ననీ, వినియోగదారుల ఫోరం ఉపాధ్యకక్షుణ్ణనీ, ఇంకో దానికి గౌరవ సలహా దారునని ఇలా 5, 6 సంస్ధల పదవుల గురించి చెప్పుకొచ్చారు. పరిచయ పత్రం (ఐడెంటిటీ కార్డు) పంచారు.
నా మనస్సూరకుండబట్టక, అయ్యా, మీరధ్యకక్షులుగ నున్న సంస్ధ కార్యక్రమాలు ఈ సం||లో ఏమి చేశారు. అనడిగాను. సంస్ధ రాష్ట్ర నాయకత్వం బాగలేదండీ. కార్యక్రమాలేమీ చేయడం లేదు. అనన్నారు. అలాగా సర్లేండి మీరు సలహాదారుగ ఉన్న సంస్ధ జిల్లాలో ఏమి చేస్తుంటుంది. ఈ సం||లో అది చేపట్టిన పనులేమిటి? అనడిగాను. ఆ ఏముందిలేండి సం|| కోసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. రాను పోను చార్జీలు వాళ్ళే పెట్టుకుంటారు. హైద్రాబాద్‌ కదా! మనకూ ఏదో పనీ ఉంటూనే ఉంటుంది. రెండూ కలసి వచ్చినట్లుంటుందని వెళ్ళి వస్తుంటాను. ఏదో ఊరకుండలేక చేసే పనులేగాని, సమస్యలు పరిష్కారాలు గొడవెందుకులెండి. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటుంది. ఎందుకొచ్చిన పదవిరా! అని అన్నారు. ఈ అనుభవం కలిగాక, అలా నాలుగైదు సంస్ధలలో నాలుగైదు పదవుల్లో కూర్చున్న వాళ్ళను వీలుచిక్కినప్పుడల్లా ఇలాగే అడగడం మొదలెట్టాను. ఈ శోధన- పరిశీలన - గొప్ప అనుభవాన్నే చేకూర్చిపెట్టింది నాకు.
సామాజిక సమస్య - దానిని చూస్తూ ఊరకుండలేని మనస్సు, దాంతో ఆ సమస్యా పరిష్కారానికై గట్టి యత్నము ... ఈ వరవడినబడి నడిచేటి వాళ్ళు, నాకైతే అగుపడలా. పదవులిష్టిస్తారు, పనులు చేయరు. పనులేమీ చేయడంలేదని తనకే అనిపిస్తున్నా, ఆ పదవిని వదులుకోరు. మరొకణ్ని రానీయరు. సంస్ధలోని వేరెవరైనా అదేమిటనంటే, వారిని వ్యతిరేక వర్గంగా భావించి, చిత్రించి, వీలైతే వారి పై వీరు, వీరి పై వారు బురద జల్లుకునే పనులూ మొదలెడతారు. ఇవీ, యిలాంటి మరికొన్ని అనుభవాల నుండే మన ఐక్య వేదిక కమిటీల ఏర్పాటులో కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టుకున్నాం. అదేమిటంటే.
1) మనకు క్షేత్ర స్ధాయిలో పని చేసే కార్యకర్తలే అత్యంత ప్రధానమైనవారు. కీలకమైనవారు.
2) ఆయా కమిటీలలోని ఆయా స్ధానాలు పదవులు కాదు. బాధ్యతలు మాత్రమే. ఎవరు ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించే అవకాశమేలేదు. ఉదా : నేను .. అధ్యకక్షుణ్ణి నేను చెప్పినట్లు వినాల్సిందేలా మాట్లాడనే కూడదు. ఎందుకంటే నీవు జిల్లా అధ్యకక్షుడివైనా, రాష్ట్ర అధ్యకక్షుడివైనా కార్యకర్తకూ నీకూ ఉన్న సంబంధమేమిటి? అతని పై నీ కున్న అధికారం ఏమిటి? నూటికి నూరు శాతం ఏమీ లేదు. పైగా అతడు క్షేత్రస్ధాయిలో  పని చేస్తేనే ఉద్యమం సాగుతుంది. అతనికీ, నీకు మధ్య ఉండాల్సిన సంబంధం ప్రేమ, అభిమానాలతో కూడిన అవగాహనేగాని అంతకంటే  ఏ కారణం చూపి అతని పై పెత్తనం వెలగబెడతావు. సగం ఉద్యమాలు ఈ కారణం వల్ల కుదేలవుతున్నాయి.
మంచి సమాజం లేదా మెరుగైన సమాజం మాలక్ష్యమంటూనే, మెరుగైన సమాజంలో మనిషే ఉంటాడు, ఉండాలి అన్న దాన్ని పట్టించుకోకుండా, సాటి ఉద్యమకారుణైనా సమానంగా చూడనొల్లక వారే నాయక స్ధానాలలో ఆయా పదవుల్లో ఉంటున్నారు. స్వచ్చందంగా, తన పనులాపుకుని ఉద్యమంలో పని చేయడానికి సిద్దమైన వ్యక్తి నీకు పనులు చేసిపెట్టే వానిలా, ఆజ్ఞలు పాటించే వానిలా కనిపించటంలోనే ఉంది అసలు లొసుగంతా. నాయక స్వామ్యమేనడవాలన్న కోర్కె నీకే వదలలేదన్నామాట. ఇక నువ్వు చేయగలిగింది పల్లకీ ఎక్కడమో, వెనకుండి సతాయించడమో మాత్రమే. దీన్నుండి ఉద్యమాలు బైటపడాల్సి ఉంది.
ఈ రకంగుంపు పోయి, నాయక స్థానాలలోనికి మొనగాండ్లు (మొగాళ్ళు కాదు ఆడాళ్ళలోనూ మొనగాళ్ళు ఉండవచ్చు) రావాలి. మొనగాళ్ళంటే ముందుండి నడిపే వాళ్ళని అర్దం. ఎలా రాజకీయాలలో, ప్రజాస్వామ్యం పేరనే రాజరిక ధోరణి. (నియంతృత్వపోకడ) చలామణి అవుతోందో, అలానే స్వచ్చంద కార్యకలాపాలుగా ఉండాల్సిన ఉద్యమాల పేరునా నాయక స్వామ్యమే (నియంతృత్వమే) చలామణి అవుతోంది. ఇదెంత విషాదకరం!? స్వచ్చందంగా పది మంది కోసం పనిచేయడానికి  సిద్దపడ్డ వారిని అనుచరులుగ, ఆజ్ఞలు పాటించాల్సిన వారుగ చూడటమంత పొరపాటు పని ఇంకేముంటుంది? ఉద్యమాలలో తక్షణం మార్పు రావలసిన చోటిది.
నాయకత్వ ధోరణులు రెండు రకాలు. అనుచరనాయకత్వం, సహచర నాయకత్వం. ఎల్లకాలము నడిపే వాడిగ తానే ఉండాలి, మిగిలిన వాళ్ళు నడిచే వాళ్ళుగానే ఉండాలి అన్న మానసిక వైఖరి అనుచర నాయకత్వ లక్షణాలలో ప్రధానంగా ఉంటుంది. అట్టి పోకడ కలవాళ్ళకు, ఉద్యమ క్షేత్రాలలో ఉండే వారికి సొంత తల ఏర్పడాలన్న దృష్టి ఉండదు. పైగా తాజెప్పినట్లే ఉంటే చాలుననిపిస్తుంటుంది. దాదాపుగా అన్ని చోట్లా ఈ వైఖరే ప్రబలంగా ఉంటూవస్తోంది.
సహచర నాయకత్వం మాత్రమే స్ధిరంగానూ, దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించిపెట్టేదిగానూ ఉంటుంది. సహచరుల్ని తయారు చేసుకోవడం వొకింత కష్టమైన పని. అందుకు కార్యకర్తలకు విషయావగాహన కొరకు గాను, తగినంత అధ్యయనము, కార్యకుశలత కొరకు గాను శిక్షణ (అభ్యాసం) తప్పనిసరి అవుతాయి. అధ్యయనము - శిక్షణ లేనంత కాలం సహచరులు తయారు కానేకారు. ఈనాడు ఉద్యమ క్షేత్రాలన్నిటా సహచరుల్ని తయారు చేసుకునే యత్నాలే జరగడం లేదు. ఉద్యమాలన్నీ ఇక్కడెంతో లోపంగా ఉంటున్నాయి. అధ్యయన శిక్షణ తరగతులకు ప్రాధాన్యతనిచ్చి, ఒక ప్రణాళికాబద్ధంగా, ఉద్యమ ప్రణాళికలో వాటిని ఒక అవి భాజ్యమైన నిరంతరాయమైన ప్రక్రియగా ఏర్పాటు చేసుకున్న సంస్ధలే కరవయ్యాయి.
అడపాదడపా సమావేశాలు ఏర్పరచి నలుగురైదుగురి చేత ప్రసంగాలు చేయించి, చేతులు దులిపేసుకోవడమే అరుదుగా జరిగే అధ్యయన తరగతుల్లోనైనా జరుగుతోంది. ఇక అదీ చేయని సంస్ధలు ఒకటీ అర సమస్యలపై ప్రసంగాలతో తృప్తిపడిపోతున్నాయి. తమ తమ లక్ష్యాలకనుగుణ్యమైన కార్యకర్తను తయారు చేసుకునే పనిగానీ, ప్రజలకు అవగాహన కలిగించే పని గానీ శ్రద్ధ పెట్టి చేయడమేలేదు. ఉద్యమ క్షేత్రాలలోని ఏదో ఒక అంశంపై అంగీకారం కుదిరి ఉద్యమాలలోనికి వస్తున్నవాళ్ళున్ను, అధ్యయనానికి, శిక్షణకు సిద్దపడడంలా. వారి దృష్టంతా వారికి నచ్చిన విషయంపై ఏవైన కార్యక్రమాలు జరుగుతుంటే పాల్గొనడం వరకే పరిమితమవుతోంది.
ఇవన్నీ ప్రస్తుతం ఉద్యమ సంస్ధలుగా తెరమీదికి వచ్చిన వాటిల్లో పెక్కు సంస్ధలలో కనబడుతోంది. మరోరకం సంస్ధలున్నై, ఎదుగూ బొదుగూ లేకుండా, పనీపాటాకూడా లేకుండానే ఏండ్ల తరబడి సాగుతుంటాయవి. ఒకే కుటుంబం సంస్ధగా ఉండడం లేదా, నలుగురైదుగురు నామమాత్రపు సభ్యులతో సంస్ధలుగా ఉండడం జరుగుతుంటుందలాటి వాటిల్లో. ఒక్క చేదు నిజం చెప్పుకోవాలిక్కడ. ఈనాడున్న సంస్ధల్లో ఎక్కువలో ఎక్కువ ఉద్యమ స్వరూప స్వభావాలకు అనుగుణ్యత లేనివే. ఏమి చేయాలనుకున్నాం. ఏమి చేస్తున్నాం. సాధించుదామనుకున్న దిశగా జరిగిందేంత, జరగాల్సిందెంత అన్న స్పృహలేకుండా థాబ్దాలు గడిపేసిన సంస్ధలూ నా అనుభవంలో ఉన్నై. ఎంతటి  శోచనీయమైన విషయమంటే ఉద్యమ సంస్ధల కార్యక్రమాలను గురించి, ఉద్యమ సంస్ధలలోని వారి నుండే ఒక నానుడి పుట్టింది.ఉద్యమాలంటే ఏముందండి మాసికాలు, తద్దినాలేకదా! అన్నదే ఆ నానుడి. నిజానికి సిగ్గు పడాల్సిన ఈ విషయాన్ని విని, హాయిగా నవ్వేసుకునే వారినీ నేనెరుగుదును. మిత్రులారా! ఈ అశాస్త్రీయమైన అనుచితమైన, డాంబికమైన వైఖరి నుండి ఉద్యమాలు ఎంత త్వరగా బైటపడితే అంత మంచిది.
రెండు రకాల మనుషులు మంచిపనులు చేస్తుంటారు. సహాయ, సేవా రంగాలలో కనపడుతుంటారు. అందొకరకం బడుగు వర్గాల వేదనా పూరితమైన జీవితాలను చూసికలత చెంది. వారి బాదోపశమనానికి ఏదో ఒకటి చేయకుండా ఉండలేనివారు. ఇట్టి వారి హృదయం అట్టి వారి విషయంలో ఏదో ఒక స్ధాయిలో సహానుభూతిని పొందుతుంటుంది. కనుక వారికి మేలు కలగాలన్న దృష్టితోనే ఆ పనులు చేస్తుంటారు.
మరోరకం కీర్తి కాంక్షతో ఉంటారు. అవసరమైన దానికంటే ఎక్కువగ సంపద ఉంటుంది. అవసరాలకేగాక భోగాలకకు కూ మించిన ఆసంపద గుర్తింపు వైపు వారిని గుంజుతుంటుంది. సమాజంలో వారి వారి అవగాహన ననుసరించి ఏయే పనులు చేస్తే ప్రసిద్ది ఏర్పడుతుందో చూసుకుంటుంటారు. ఎదురుపడిన మంచి పనులను చేస్తుండడమో, మంచి పనులను చేయిస్తూ సన్మానాలనూ జరిపిస్తుండే వృత్తిలో ఉన్న వాళ్ళ పాలబడడమో, ఆశ్రయించడమో చేస్తూ పేరు ప్రఖ్యాతుల కొరకు పాటు పడుతుంటారు. ఈ రకానికి బడుగు జీవితాల బాధలంతగా పట్టవు సరికదా, ఆ రకం జనం ఉండడం తమ డాబుదర్పానికి అవకాశంగానూ పరిగణిస్తుంటారు. విషయం అర్ధమవుతుందనుకుంటాను.
మంచి కోసం మంచి పనులు చేస్తుండడం, మంచివాడనిపించుకోడం కోసం మంచి పనులు చేస్తుండడం. నిజానికీ రెండు వ్యక్తిత్వాలూ పరస్పర భిన్నమైనవి. అయినా నా దృష్టి నుండి వీరురువురూ మంచివాళ్ళే. మంచి పనులు చేస్తున్నారు కనుక. ఒకడు కీర్తిని ప్రతిఫలంగాకోరి మంచి పనులు చేస్తున్నాడు. అట్టి వారిని ఉద్యమకారులని గానీ, నిస్వార్ధులనిగానీ అనము. అనకూడదు కూడా. వారు ఒక రకంగా వ్యాపారం చేస్తున్నారు. సమాజంలోని కొందరు వ్యక్తులకు అవసరమైందిచ్చి, వారికవసరమైంది తీసుకుంటున్నారు. మరోరకం వారినే ప్రతిఫలరహితంగా సమాజం కొరకు పని చేస్తున్న వారనాలి. అట్టి వారిని మాత్రమే ఉద్యమ కార్యకర్తలు అనాలి. అదే న్యాయం కూడా. అయినా ప్రతిఫలాన్ని - కీర్తిని - కోరి మంచి పనులు చేసే వారినీ అభ్యుదయ శక్తుల క్రిందనే జమకట్టాలి.
సరే, ఇంకా ఎన్నో విషయాలు మీతో ముచ్చటించాలనే అనిపిస్తున్నా స్థలాభావం వల్ల ఇప్పటికిక్కడికాగుతాను. ఈ వ్యాసస్ధవిశ్లేషణంతా ఐక్యవేదిక మరియు ఇతర ఉద్యమక్షేత్రాలు కూడా కొన్నికీలకమైన అంతసంస్కరణలు చేసుకోవలసి ఉంది (1) అది ప్రధానంగా, అవగాహన, సంసిద్దత, కార్యకుశలతగల - దకక్షులంటారు వీరినే - కార్యకర్తల నిర్మాణ ప్రక్రియను - అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహించుకోడాన్ని - ఆరంభించుకుని, నిరంతరాయంగా కొనసాగేలా చూసుకోవాలి.
(2)  ఎక్కడికక్కడ సుశికక్షుతులైన కార్యకర్తలనే నాయక స్ధానాలలో ప్రవేశపెట్టుకుని వారంతా సమయమిచ్చి వారి వారి ప్రాంతాలలో , తిరగగలిగేలా, ఉద్యమ విస్తరణకు పెద్ద పీట వేసేలా ఉత్తేజపరచాలి. పనే పదవికి కొలమానం అన్న సూత్రాన్ని ఖచ్చితంగా అమలు పరచాలి.
(3) ఎక్కడికక్కడ మరిన్ని సంస్ధలను కూడగట్టుకుంటూ, సమాజం నుండి క్రొత్త వ్యక్తుల్ని ఉద్యమంలోనికి చేర్చుకుంటుండాలి.
(4) ప్రజాప్రతినిధుల స్ధానంలోనికి, పాలన నిర్వహణ భాగాలలోనికి  మంచివ్యక్తుల్ని ప్రవేశపెట్టుకోడమే అసలు సిసలు పరిష్కారమార్గం. ఆపని చేయగల సాధికారత పౌరులకు ఏర్పడేలా వారిని తట్టిలేపి, చైతన్య పరచాలి.
(5) ఎక్కడికక్కడ ఏ విషయంలో చూసినా కనీస స్ధాయిలో మాత్రమే ఉంటున్న మహిళలనూ చైతన్య పరచి ప్రజాఉద్యమ నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. యువతకూ దిశానిర్ధేశం చేయాలి.
(6) అధికార వికేంద్రీకరణ, చైతన్య వంతులైన ప్రజల పర్యవేక్షణ అన్న రెండూనే సామాజిక సమస్యల కన్నింటికీ ఏకైక పరిష్కారం. అన్న నిజాన్ని గుర్తించి, ప్రజలకూ ఎరుకపరచాలి.
అందరం కలసి, ఏకతాటి పై నిలచి, కొద్ది కాలంపాటు, సర్వశక్తులనూ కూడగట్టుకుని చిత్తశుద్ధితో పని చేయగలిగితే, ఆర్ధిక, సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యానికి దారులు ఏర్పరచుకోవచ్చు. భావితరానికి వివేకవంతమైన, మంచిమనసున్న వర్తమానతరంగా మనం చేయగల మంచి పని మరోటిలేదు.
ఈ మహాత్కార్యంలో మీరు ఎక్కడెక్కడ ఎంతెంతగా ఇమడగలరో నిర్ణయించుకోండి. పని, పని పని, జ్ఞానపూర్వకమైన స్వచ్ఛందంగా ఇష్టపడి చేసే పనిమంతులు కావాలీనాడు. ఇదిగో నేనున్నానన గల నిజాయితీ, గుండె నిబ్బరము కలవాళ్ళు కలసి రండి.
అభ్యుదయ శక్తుల ముసుగులో వేషధారులూ, సంఘ వ్యతిరేక శక్తులూ ఉద్యమాలలో చొరబడుతున్నారు. అట్టి వారి పట్ల మనమందరమూ అప్రమత్తంగా ఉండవలసి ఉంది.
ఉద్యమం బలంగా ఉండకున్నా అంత ప్రమాదం లేదుగాని, ఉద్యమం అనారోగ్యం పాలైతే మాత్రం అంతా అరిష్టమే. ఇప్పటికే ఉద్యమకారులన్నా, ఉద్యమ సంస్ధలన్నా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నమ్మకాన్ని వదిలేశారు. స్వార్ధపరశక్తులు ఉద్యమాల పేరిట, సేవా సంస్ధల పేరిట కొనసాగుతుండడమే అందుకు కారణం. ఈ రకమైన, మరెన్నోరకాలైన సామాజిక సమస్యలకు ఏకైక పరిష్కారం.
ప్రజలు నిద్రలేచి రాజ్యాంగం అందించిన నిర్ణయాధికారాన్ని, పర్యవేక్షణాధికారాన్ని సమర్ధవంతంగా వినియోగించుకునే పరిస్ధితుల్ని ఏర్పరచుకోవడమే. అందుకొరకు   ఉద్ధేశించిందే మన ఈ ఐక్య వేదిక ఆరంభించిన ప్రజా ఉద్యమం.
కలసిరండి, మరికొందరినీ కలుపుకురండి. అభ్యుదయ శక్తులు సంఘటితం కావడమొక్కటే, అసాంఘిక శక్తులను నిర్మూలించగల ఏకైక మార్గం.
ఇంత పని చేస్తానని చెప్పండి చెప్పినంత పని ఖచ్చితంగా చేయండి. ప్రగల్భాలరాయుళ్ళకు సమాజంలో ఏ నాడూ కొరతలేదు. మాటకు చేతకు పొంతన గల మనుషులే ఈ నాడు మనకు కావలసింది. ఇదిగో నేనున్నానంటూ ముందుకు రాగలరేమో ఆలోచించండి.
ఉద్యమాభినందనలతో
మీ , సమాచార హక్కుప్రచార ఐక్యవేదిక.


No comments:

Post a Comment