Friday, April 1, 2011

వాస్తు శాస్త్రీయతపై చర్చ


విజ్ఞలైన పాఠక మిత్రులారా ! వాస్తు, జ్యోతిషాలపై చాలా కాలంగా, పరస్పరం వ్యతిరేకించుకుంటున్న రెండు పక్షాలు కొనసాగుతున్నై. ఆ నేపధ్యాన్ని ఆధారం చేసుకొని సత్యాన్వేషణ మండలి, అనేక సంస్థలను కలుపుకొని 'వాస్తు నిజనిర్ధారణ ఐక్యవేదిక' అన్న ఒక వేదికను ఏర్పరచి ఈ రెండు పక్షాల వాదనలను చర్చకు పెట్టే యత్నం చేసింది. ఆ యత్నంలో భాగంగా వాస్తు శాస్త్రీయం అనే పక్షాలలో కొనసాగుతున్న వారిలో, అందుబాటులో ఉన్న వారందరితో సంప్రదించి, వాస్తు సిద్ధాంతాన్ని ప్రతి పాదించటానికి రమ్మని వారిని ఆహ్వానించింది. అదే సమయంలో వాస్తు అశాస్త్రీయం అనే పక్షానికి చెందిన వారిలో కొందరినీ పరీక్షకూ, పరిశీలనకు రమ్మని పిలిచింది. సమావేశం సీతానగరం (గుంటూరు జిల్లా) లోని చిన జియ్యరు స్వామి వారి ఆశ్రమంలో ఏర్పాటు చేసింది.
ఆ సమావేశానికి వాస్తు పక్షాన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి కుమారులు పాల శంకర శర్మ, మల్లిపెద్ది రామకృష్ణ, చిత్రాల గురుమూర్తి సిద్ధాంతి, భోగినేని వెంకటరత్నం, గణపతి కదిరప్ప, దంతూరి పండరీనాధ్‌, గౌరు తిరుపతిరెడ్డి గార్లు, వారి వెంట మరికొందరు పాల్గొన్నారు. పరిశీలక పక్షాన హేతువాద, మానవవాద, నాస్తిక పక్షాలకు చెందిన వారు, జె.వి.వి. ప్రతినిధులు పాల్గొన్నారు. బసవ పున్నారావు, ఈదర గోపీచంద్‌, టి.వి.రావు తదితరులు నిజనిర్థారణ ఐక్యవేదిక తరపున నేను సమన్వయకర్తగా వ్యవహరించాను. నా పాత్ర కేవలం సమన్వయకర్తగనే కాక, వాస్తు నిజనిర్థారణ ఐక్యవేదిక నిర్ధారణలకూ ప్రాతినిధ్యం వహిస్తుండడమూ జరిగింది. అయితే విచారణ వాస్తు శాస్త్రీయమేననే వాళ్ళ ప్రతిపాదనలను విచారించటం కొరకు ఏర్పరచుకున్నదవటంతో ''సంశయించక విచారించటం కుదరదు, నిర్దిష్ట ప్రతిపాదన లేకున్నా విచారించటం కుదరదు'' అన్న తార్కిక - న్యాయ - నియమాల ననుసరించి వాస్తు పక్షం వాళ్ళను మీ పక్షాన్ని ప్రతిపాదించండని చెపుతూ సమావేశాన్ని ఆరంభించాను నేను. ఆనాటి సమావేశం వివరాలు రికార్డు రూపేణా భద్రంగానే వున్నై. ఆనా మాటలకు సమాధానంగా వాస్తు పక్షంలో ఉన్న వారందరూ కలిపి 'ఇవిగో వాస్తు సూత్రీకరణలు' అంటూ ఏకోన్ముఖంగా ప్రకటించలా. పైగా ఒకరు చెప్పింది ఒకరు కాదంటూ, ఒకరు చెప్పింది మరొకరు తప్పంటూ వారిలో వారే వివాదపడుతూ వచ్చారు. ఒక థలో దంతూరివారు, శంకరశర్మ గారు వాస్తును విచారించడానికి ఏర్పరిచారా ఈ వేదిక, మామధ్య గొడవలు పెట్టడానికి ఏర్పరచారా లాంటి ప్రశ్నలు లేవనెత్తారు. అందుకు సమాధానంగా నేను, అయ్యా, వాస్తు శాస్త్రీయమైనదేనంటున్న మీ మధ్య నిజానికి ఈనాడు నేను రగడ పెట్టలేదు. ఆంతకు ముందే మీ మధ్య ఆ చిచ్చు ఉంది. అందరూ ఎదురుపడటంతో అది మరింత రగిలింది. కార్చిచ్చు అవుతుందనే భయంతో ఒకరికొకరు ఎదురుపడకుండా ఎవరి దారంట వాళ్ళు వెళుతున్నారు. ఇది నిజమో కాదో మీ అంతరంగాన్నడిగి చూడండి. ఒకవేళ ఇప్పుడు మీరా నిజాన్ని అంగీకరించడానికి సిద్ధం కాకున్నా, మీరంతా ఎవరికి వారు లోగడే పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా, వ్రాతపూర్వకంగా ప్రకటించి ఉన్న కొన్ని ఆధారాలు నేనైనా చూపగలను. ఉదా : గౌరువారి పుస్తకాలలో సాంప్రదాయక వాస్తు పండితుల కొన్ని వాదాలపై ఆయన చేసిన ఖండనం, మదుర వారు, మరికొందరు, గౌరువారిపైనా, ఆధునిక వాస్తు పండితులపైనా వారిని నిర్ద్వందంగా ఖండిస్తూ వ్రాసినవి మనకు అందుబాటులోనే ఉన్నై అనన్నాను. దాంతో ఆ చర్చను అది నిజమేనంటూ అంగీకరించి ఆపుచేశారు.

మధ్యాహ్నం వరకు జరిగిన ఆనాటి సమావేశంలో పరీక్షకు స్వీకరించడానికి తగిన రూపంలో ఒక్క ప్రతిపాదనా స్థిరంగా ఆవిష్కృతం కాలా. ఇదే ఈ నాటికీ ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే మా వేదిక పలు సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. అందులో భాగంగా 'వాస్తు శాస్త్రీయత' అన్న పేరున మేమొక పుస్తకం ప్రచురించి రెండు పక్షాలకు చెంది మాకు తెలిసి ఉన్న సంస్థలకు, వ్యక్తులకు పంపగలిగినంతలో ఆ పుస్తకాన్ని పరిశీలనకు పంపాము. ఆనాటి నుండి ఈనాటి వరకు అందులో మేము మావిగా ప్రకటించిన నిర్ణయాలకు కట్టుబడే ఉన్నాం. సరైన పరీక్షద్వారా అందేవి గాని సరికాదని తేలిన వెంటనే సభాముఖంగానూ, మా పత్రిక ద్వారానూ, మాధ్యమాల ద్వారానూ అలా తేలిన వాటి గురించిన ప్రకటన చేయడానికి, మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదంతా ఇప్పుడెందుకు చెపుతున్నానంటే..

ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల లోపు నుండి అడపాదడపా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల నుండి వాస్తు జ్యోతిషాలు తప్పనేటంతటి వాడివా అంటూ 1. ఛాలెంజ్‌లు, 2. అసభ్య భాషణలు, 3. బెదిరింపులు, 4. ఆవేశ ప్రసంగాలు వినబడటం మొదలైనై. బిగిలేని బుడంకాయల రగడలకు అంత ప్రాధాన్యతనివ్వడమెందుకులే అనుకుని వాటికి పత్రికలో స్థానమివ్వకుండా ఉదాసీనంగా వున్నాం. ఈమధ్య కాలంలో 'వాస్తు విద్యా విజ్ఞాన కేంద్రం' తాడేపల్లిగూడెం ప్రాంతం నుండి శ్రీరామక్రిష్ణ శర్మ గారి నుండి సత్యాన్వేషణ మండలి ప్రధాన కార్యదర్శి ప్రసాదుకు ఫోనులు వస్తున్నాయి. ఒక లేఖ కూడా అందింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు నాదాక ఒక లేఖా, ఒక కరపత్రము, ఒక చిరు పుస్తకము వచ్చాయి. పెట్టుకున్న పనుల వత్తిడి, అయిన ఆ లేఖలో కనబరచిన కొన్ని భావాలూ, ఆ విషయాన్ని నిదానంగా చూద్దాంలే అన్న ఆలోచనను కలిగించడంతో ఇంత దనుక తాత్సారం జరిగింది. ఒక వారం రోజుల క్రితం కొద్దిగా విరామం దొరికి ఇంటివద్ద ఉండటంతో లోగడ వచ్చిన ఉత్తరాలను తిరగేయడం మొదలు పెట్టాను. ఈ లేఖా ఎదురుపడింది. ఈ లేఖలోని మరికొన్ని భావాలు 'ధర్మో రక్ష్షతి రక్ష్షితః' మీ సోదరునిగా ఈ ఉత్తరం రాస్తున్నాను అన్న మరికొన్ని హెచ్చరిక రూపాలు, ''జ్యోతిషం వాస్తుల జోలికి రాకండి'' మన రచనలు ఆలోచింపజేసేవిగా ఉండాలి తప్ప - అనాలోచితంగా ఉండరాదు'' లాంటివీ కలసి - ఇలా వ్యాసం వ్రాయించాయి. ముందుగా ఆయన లేఖ యథాతథంగా వేస్తున్నాను. దానిని, ఆపై నా సమాధానాన్ని మీరు, ఆయనకూడా చూడగోర్తాను.

....... లేఖ ......

పుట్టా సురేంద్రబాబు, కె.ఎల్‌.కాంతారావులకు వ్రాయునది.

ఉభయకుశలోపరి-

మీరుభయులూ వ్రాసిన ''వాస్తు శాస్త్రీయత'' అనే పుస్తకం ఏమీబాగోలేదు. ఎంతసేపూ శాస్త్రం లేదనే వాదనే తప్ప ఇంకొకటిలేదు.

శాస్త్రము అంటే మీరు అనుకునే భౌతిక సైన్సుకు ప్రత్యక్షంగా కనపడాలనేది ఎక్కడాలేదు.

శాస్త్రానికి ముఖ్యంగా- ఆచారము, ఆచరణ, కట్టుబాట్లు, వ్యవహారాలు అనే పరిస్థితులకు లోబడి మన భారతీయ మహర్షులు ఎంతో విజ్ఞాన దృష్ఠితో శాస్త్రాలను రూపొందించడం జరిగింది. ఇట్టి శాస్త్రాలను ఆచరించి ప్రయోజనం పొందిన వారేతప్ప పాడయినవారు ఎవరూలేరు.

పైగా పదిమందికి ఉపాధిఅవకాశాలు కూడా దొరుకుతున్నాయి. ప్రతీ విషయమూ ల్యాబ్‌లో ఋజువు అవ్వాలని ఎక్కడాలేదు. అవ్వదు కూడా. ఉదాహరణకు భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది. ఈ విషయం ఎవరోచెప్తే దానిని నిజమని భావిస్తున్నాం తప్ప మీరూచూడలేదు, నేనూ చూడలేదు. ఇది ల్యాబ్‌లో నిరూపించగలమా?

అలాగే ప్రతీ విషయాన్ని ఆలోచించాలి. మీరు రాసిన పుస్తకాల్లో ఉండే విషయం నేను చెప్పగలను (1-2 విషయాలు తప్ప) ప్రతీ దానికి వివరణ యివ్వగలను. లేదు అని రాసేస్తే, చెప్పేస్తేకాదు. లేదని చెప్పడానికి కూడా ల్యాబ్‌ కావాలి.

ఇలాంటి పుస్తకాల వల్ల సమాజానికి కీడే తప్ప ఉపయోగం లేదు. ఇప్పటికే అసలు శాస్త్రం మూలపడిపోయింది. కారణం, చదవని పండితుల మూలకంగా ఉదా:- గౌరుతిరుపతి లాంటివాళ్ళ వల్ల.

ప్రజలకి మనం ఏదైనా పుస్తకం లాంటిదో- కరపత్రంలాంటిదో వేస్తే ఆలోచించేదిగా ఉండాలి తప్ప- అనాలోచితంగా ఉండరాదు.

ఇకనైనా మంచి శాస్త్రీయమైన పుస్తకాలు వేయండి, జ్యోతిషం- వాస్తు జోలికిరాకండి. వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు.

మీరుగనుక ప్రజలకి నిజంగా, ధైర్యంగా సేవ చేయాలంటే మద్యంపానంపై ఊరూరా అవగాహన కల్పించండి- మాన్పించండి దీనివల్ల మద్యంమత్తులో కొట్లాటలు, కుటుంబకలహాలు, హత్యలు, మానభంగాలు లాంటివిఆపొచ్చు.

ప్లాస్టిక్‌ నియంత్రణ చేయండి-చేసేలా ఉద్యమిద్దాం. ప్లాస్టిక్‌ కంపెనీలు మూతపడేలా ఉద్యమం చేయండి. ప్లాస్టిక్‌ వల్ల భూమికి అరిష్ఠం నిజమేకదా!

అలాంటప్పుడు పొల్యూషన్‌ కలిగించే చెత్తచెదారం ఎముకలులాంటివి ఉన్న స్థలంలో యిల్లు కట్టుకుని జీవిస్తే దుర్భరమే కదా సైన్సుపరంగా కూడా ఋజువయ్యింది కదా!

ఇటువంటివి చాలా వున్నాయి. ఇవన్నీ చెప్పవలెనంటే ఉత్తరంచాలదు ఒకమీటింగు ఏర్పాటు చేయండి. నేను సైన్సుపరంగా వాస్తును ఎలా ఆచరించాలో, ఏది శాస్త్రమో కాదోకూడా చెప్తాను. ఈ మీటింగుకు కనీసం 500 వందల మందికి తగ్గకుండా ఉండాలి. అప్పుడు మీరు ఏప్రశ్న అడిగినా వివరణాత్మకంగా ప్రత్యక్ష ఉదాహరణలతో నిరూపించి చెప్తాను.

అడగవలసినవి కూడా చాలా వున్నాయి. అవన్నీ ప్రజల మధ్యన అడిగితేనే అందరికీ మార్గదర్శకం. సమాజశ్రేయస్సే భారతదేశం భవిష్యత్తు. ముందు తరాలవారికి మంచి విజ్ఞానాన్ని పంచేటట్లుగా అందరం కృషి చేద్దాం.

''ధర్మోరక్షతిరక్షితః'' అన్నది వేదవాక్యం. నేను ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తని, నాకు నిర్మొహమాటంగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు చెప్పడం అలవాటు. తప్పునితప్పని చెప్పడం కూడా అలవాటు.

అందుకే మీ సోదరుడుగా ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నేను వేసిన ప్రామాణిక కర ప్రతాలు కూడా పంపుతున్నాను. చదువగలరు. మనం వేసే కరపత్రంగాని, పుస్తకం దమ్ముగా వుండాలి. ఇట్లు - రా.కృ.శర్మ.

దీనికితోడు ఒక కరపత్రము, ఒక చిరు పుస్తకము పంపారన్నాను కదా ! వాటిసారాంశం మాత్రం వ్రాస్తాను.

కరపత్రం : ఆధునిక వాస్తు పండితులకు సవాల్‌ అంటూ...

1. వాస్తుశాస్త్రం ప్రవక్ష్యామి లోకస్య పీడితాం మమ

2. ''వాస్తు శాస్త్రం ప్రవక్ష్యామిలోకానాం హితకామ్యయా'' అన్న రెండు వాక్యాలు వ్రాశారు.

రెండో వాక్యం విశ్వకర్మ ప్రకాశిక లోనిదన్నారు. దాని అర్థం సులభగ్రాహ్యంగానే ఉంది. లోకహితాన్ని కోరి వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నాను, అని ఆ వాక్యానికర్థం. దానికిముందే మన శర్మగారు మరో వాక్యాన్ని సంస్కృతంలో చెప్పారు. దాని అర్ధం 'లోకాన్ని పీడించడానికి వాస్తు శాస్త్రాన్ని చెపుతున్నాను' అని వారే అనువదించారు. వాస్తు శాస్త్రం ప్రవక్ష్యామి అంటే వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నాను అన్న అర్ధం వస్తుంది కాని, 'లోకస్య పీడితాం మమ' అంటే లోకాన్ని పీడించటానికే అన్న అర్థం ఎలా వస్తుందో శర్మగారే వివరించాలి. 'లోకపీడనార్ధాయ' అనిగాని, లోకాంనాం పీడనార్థాయ అనిగాని, అని ఉంటే ఆయనన్న అర్థం వస్తుంది. వానాకాలపు సంస్కృత భాషాభిజ్ఞుతే శర్మగారన్నది తెలుస్తూనే ఉంది. ఇక శర్మగారివి, వారి పలుకులివిగో పట్టిచూడండి.

1.శర్మగారు-మహర్షులచే చెప్పబడ్డ ప్రామాణిక, సశాస్త్రీయం సూత్రములను విడచి ఏమాత్రము ప్రామాణికతలేని విషయాలు ఆధునిక వాస్తు వ్యాపారులు చెప్తున్నారు.

సురేంద్ర- శర్మగారూ! మీరన్న ఆధునికులు చెప్పే వాస్తు సూక్తుల్ని మేమూ శాస్రీయాలని అనడంలేదు. నిరూపించండనే అంటున్నాము. ఈ విషయంలో మీరు మాకంటె ఒకడుగు ముందుకు వేసి అవి తప్పులతడికలని నిరూపిస్తాముఅని అంటున్నారు. ఇక్కడ మా వేదిక పక్షం, తప్పులని మీరుగానీ, ఒప్పులనివారుగానీ నిరూపించండి. ఏది నిరూపణయితే దానిని ముగ్గురం స్వీకరించి కలిసే సమాజానికి అందిద్దాం అన్నదే. ఇందుకు మీరుగానీ, వారుగానీ సిద్దమేనా?

2. ఆధునికులు చెప్పేఏవిషయానికీ ప్రామాణికతగానీ, గ్రంధముల ఆధారంగానీ ఉండవు. మరలాంటప్పుడు ఈ వాస్తు పండితులు శాస్త్రాన్ని ఎలా చెప్పుతున్నారు? అనేది జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతున్నది.

సురేంద్ర- శర్మగారూ! నిజానికిది ఒకవేళ మీరంటున్న వాస్తు పండితులలో కొందరికి జవాబు లేని ప్రశ్న కావచ్చునేమోగాని, అసలు జవాబేలేని ప్రశ్న (శేష ప్రశ్న!?) కానేకాదు. ఎలాగంటే మీరు ప్రామాణికమనిగానీ, వాస్తు శాస్త్రగ్రంధమనిగానీ మీ మాటలకు ఆధారంగా చూపుతున్న గ్రంధాన్ని చూపీ, ఇదే ప్రశ్న ఆ గ్రంథకర్తకూ వర్తిస్తుందికదా! దానికి మీ సమాధానమేమిటి? అని అడగవచ్చు. అడగాలికూడా. అప్పుడు ఆ ప్రశ్న ఇలా ఉంటుంది.

విశ్వకర్మ ప్రకాశిక పేరున వ్రాసిన విశ్వకర్మ వాక్యాలకు, ప్రామాణికతగానీ, గ్రంధాధారముగానీ ఏమిటి? అలాలేనప్పుడు విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని ఎలా చెపుతున్నాడు? మీరు ఆధునిక వాస్తు శాస్త్ర రచయితను లేదా పండితుని అడిగిన ప్రశ్ననే, నేను విశ్వకర్మ అనే పండితుణ్ణి, కాళిదాసుని, భోజుణ్ణి, నారదుణ్ణి, మయుణ్ణి, (ఏ గ్రంథం వ్రాసిన వాణ్ణైనా) అడుగుతున్నాను. అలా అడగవచ్చుకూడా. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే శాస్త్రీయ నిర్ధారణలకు కూర్చున్న సందర్భంలో ఆప్రశ్న అడిగే తీరాలి. అంతకంటే మార్గాంతరం లేదుకూడా.

ఇక్కడ అనవసరపుటావేశానికి లోనుగాకుండగలిగితే కొన్ని వాస్తవాలను గురించి కొంతవరకు వివరించుకోవచ్చు. మాటవరసకు, మయుడో, వరాహమిహిరుడో వాస్తు విషయాలను గురించి తను గమనించినది లేదా తనకు తెలిసింది ఇది అని వ్రాశాడనుకోండి. నీవీమాట అనడానికి నీకు ప్రామాణికతేంటి? శాస్త్రాధారమేమిటి? అని అతణ్ణీ అడగవచ్చా? లేదా?

శర్మగారూ ! ఈ ప్రశ్నకు మయుడుగానీ, మరొకరుగానీ ఏమి సమాధానం చెపుతారు? మీరైతే ఏమి సమాధానం చెపుతారు?

నాకు తెలిసి ఈ ప్రశ్నకు రెండు మూడు సమాధానాలు చెప్పవచ్చు.

1. నాకు అదిగో ఆ పెద్దలు, ఆదివాస్తువేత్తలు చెప్పిన మాటలు ఆధారం అనిగాని

2. మరొకరు నాకాధారమేమిటి? నేనే వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి, నేనే పరిశోధించి శాస్త్రాన్ని రచించాను.అనిగానీ,

3. గతంలో ఉన్న అనేకాన్నీ పరిశీలించి, తూర్పారబట్టి, కొంత అదనం చేర్చి నాఈ గ్రంథాన్ని రచించానని భోజునిలాగానీ, సమాధానం చెప్పవచ్చు. కనుక ఇందులో ఏది శర్మగారంగీకరిస్తారో, ఇవేవీ సబబుకాదని నాలుగో రకం సమాధానం చెపుతారో చూడాలి. ఈ విషయంలో వాస్తు వేత్తలైన ఇతరుల్ని కూడా ఇందుకు మీరేమంటారు? అని అడుగుతున్నాను.

శర్మగారు: కాబట్టే, ఏది అసలైన వాస్తు శాస్త్రమో ఏది కాదో నిరూపించేందుకే మా ఈ సవాల్‌. ఈ కరపత్రం వేయించడానికి పండితులే గాక, ఒక తాపీమేస్త్రి కూడా ఒక కారణం. చాలామంది ఆంథ్రరాష్ట్రంలో వాస్తు చెప్పే తాతముత్తాతలు ఉన్నారని అతడన్నాడు. ఎంతమంది ఉన్నారో ఈ కరపత్రం ద్వారా తెలుస్తుందని మా విశ్వాసం.

సురేంద్ర: తప్పుడు వాస్తు శాస్త్రాలు, వాస్తు పండితులు, ఒప్పువాస్తు శాస్త్రాలు, పండితులు ఉన్నారని శర్మగారంటున్నారు. ఆ వివరాలు ఈ కరపత్రం బయటికి తెస్తుందనీ అంటున్నారు. కరపత్రం ముద్రించిన తేదీ కూడా ముద్రించిఉంటే, ఎప్పటికి తేలుతుందనిగానీ, ఇప్పటికి ఏమి తేలిందనిగానీ శర్మగారిని అడిగేందుకుగానీ, ఆయనగారు స్పష్టంగా చెప్పేందుకుగానీ వీలైయ్యేది. నాకు తెలిసి అలాటివారొక్కరు ఇదిగో నేనున్నాను రమ్మంటు ఎదురు నిలవలేదిప్పటికీ. అనే శర్మగారి సమాధానం అవ్వవచ్చు. నిజమేమిటో ఆయనే చెప్పాలి.

శర్మగారు: తప్పుడు పండితులవల్ల సమాజం ఎన్నో ఇక్కట్లకులోనవుతోంది.

సురేంద్ర: ఈ విషయంలో మేము శర్మగారితో ఏకాభిప్రాయం కలిగిఉన్నాము. తప్పుడు పండితులు, పండితువేషాధారులైన వ్యాపారులు, శాస్త్రాలపేరన ప్రాచుర్యంలోకి వచ్చిన అశాస్త్రాలు, కుశాస్త్రాలు ప్రజలకు అపకారం చేస్తాయన్నదే మా వేదిక దృష్టికూడా.

శర్మగారు: అందరికీ ఒకటే వాస్తు అనే రీతిలో వాస్తుశాస్త్రం చెపుతున్నారు. ఇది తప్పుడు వాస్తు పండితుల రీతి.

సురేంద్ర: అంటే శర్మగారి ప్రకారంగానీ, సరైన వాస్తు శాస్త్రం ప్రకారంగానీ వేరువేరు వ్యక్తులకు వేరువేరు వాస్తు చెప్పాలి. అదే ఆయన మాటైతే, ఇంతకు వారు ప్రామాణిక వాస్తు శాస్త్రమని దేనినంటున్నారో నిక్కచ్చిగా ప్రకటించి, దానిపరిశీలనకు సిద్ధపడాలి. ఈ సందర్భంలో ఒక సూచన చేయడం అవసరం అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వివిధ ప్రాచీన వాస్తు గ్రంథాలనుండి వివిధాంశాలను ఎత్తి, గుదిగుచ్చిన మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారి సంకలనాలుగానీ, వాల్పాడిరాఘవచార్యుల లాటి వారి సంకలన గ్రంథాలనుగానీ ఉదహరించకూడదు. ఎందుకంటే, ఇలాటివన్నీ వారేమన్నారు, వీరేమన్నారు, మరొకరేమన్నారు అన్న సమాచారాన్నిస్తూ తన దృష్టేమిటో తెలిపేటివిగానే ఉంటాయి. కనుక వాస్తుకు ప్రామాణిక శాస్త్రం ఏది? (ప్రామాణిక శాస్త్రాలు అనకూడదు) అన్నది విచారణకు ముందే స్పష్టంగా నిర్ధేశించుకోవాలి. దానినే, విచారణకు ముందే అవసరపడిన విషయపు ఎంపిక అనంటాము. శర్మగారి ప్రకారమే, ''ఆధునికులు ఇంతమంది చెప్పే వాస్తు ఏదీ ప్రస్తుత ప్రామాణికం కాదు. ఆచరణీయం అంతకంటే కాదు''.

సురేంద్ర: ప్రస్తుత ప్రామాణికం కాదు అన్నది సరిగా అర్థంకావడంలా. 'వస్తుతః ప్రామాణికం కాదు' అని చెప్పాలనా? ప్రస్తుతం వాస్తు పేరన జరుగుతున్న వ్యాపార ధోరణివల్ల, తప్పుడు వ్యాపారం వల్ల సమాజం భ్రష్టుపట్టి పోతోందన్నది శర్మగారి ఆవేదన. ఈ విషయంలోనూ మా వేదిక వారితో సహానుభూతిని కలిగిఉంది.

శర్మగారు : ఈ వేళ లోకంలో వాస్తు శాస్త్రం చదివిన, తెలిసిన వారికంటే, చదవని తెలియని పండితులే ఎక్కువగా కనిపిస్తున్నారు....అస్సలు తెలియకుండా చెప్పేకంటే, నేర్చుకున్నది కొద్ది అయినా ప్రామాణికంగా, మహర్షిప్రోక్తమయిన మూల గ్రంథాల ఆధారంగా తెలుసుకొని చెపితే లోకానికి హితంచేసిన వారమవుతాము.

ఆధునిక వాస్తు పండితులు చెప్పే తప్పుడు విషయాలు .............

1. ప్రస్తుతం చాలామంది వాస్తు పండితులు స్ధలంలో ఈశాన్యమూల ఇల్లు కట్టరాదని చెప్తున్నారు.

2. ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉండరాదని చెప్పుచున్నారు.

3. తూర్పు-ఉత్తరాలకన్నా, దక్షిణ-పడమర దిశలలో ఎక్కువ ఖాళీస్ధలం ఉండరాదని వితండవాదం చేస్తున్నారు.

4. నైరుతిలో సెప్టిక్‌ట్యాంకు ఉండకూడదని ఉంటే చాలాబాధలని, దుఃఖాలని మూర్ఖత్వవాదం.

5. మేడపైన ఈశాన్యంలో ఓవర్‌హెడ్‌ట్యాంకు ఉండరాదని, నైరుతిలోనే ఉండాలని వాదం.

6. పడమర దిశ యందు నూతులు ఉండరాదని వాదము.

7. తూర్పు ఉత్తర గోడల మీంచి ఏ విధమైన నిర్మాణాలు చేయరాదని, ఈశాన్యంలో మెట్లు ఉండరాదని వాదము.

8. ఏ సింహద్వారముగల ఇంటికయినా ఆగ్నేయములోనే వంటగది ఉండాలని, ఈశాన్యగదిలో వంటచేయరాదని అవాస్తవవాదన.

9. వాస్తులో బరువు - తేలిక అనే అంశాలే ప్రధానం అని వితర్కవాదం.

ఇక మేము చెప్పే ప్రామాణిక వాస్తు విషయాలు

1. ఈశాన్యంలో ఇల్లు కట్టవచ్చని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఈ విషయంమేము ప్రామాణికంగా ఋజువు చేయగలము. ఈశాన్యంలో ఇల్లు కట్టుకుంటే ఎంత సుఖవంతముగా, కష్టంలేకుండా ఉండవచ్చో, పుత్రపౌత్రాదులచేత ఎంత ఆనందమైన జీవితాన్ని గడపవచ్చో మేము ఋజువు చేయగలము.

2. ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉండవచ్చని మేము సప్రమాణంగా, యదార్ధముగా, ప్రత్యక్షముగా రుజువుచేసి నిరూపిస్తాం.

3. దక్షిణ-పడమర దిశలలో తూర్పు ఉత్తరాలకన్నా ఎక్కువ ఖాళీస్ధలం ఉండవచ్చని, వాస్తు శాస్త్ర ప్రకారము అలాగే ఉండాలని మేము నిరూపిస్తాం. (ఋషి ప్రోక్తం)

4. నైరుతిలో సెప్టిక్‌ట్యాంకు ఉండవచ్చని సప్రమాణికంగా, ప్రత్యక్షముగా మేము ఋజువు చేసి నిరూపిస్తాం.

5. మేడపైన ఈశాన్యంలో ఓవర్‌హెడ్‌ట్యాంకు ఉండవచ్చని, నైరుతిలోనే కట్టరాదని మేము ప్రామాణికంగా, వివరణాత్మకంగా ఋజువు చేస్తాము.

6. పడమర దిశ యందు నూతులు ఉండవచ్చని, ప్రామాణికంగా, ప్రత్యక్షముగా మేము ఋజువు చేయగలం.

7. తూర్పు ఉత్తర గోడల మీంచి ఏ విధమైన నిర్మాణాలయినా చేయవచ్చని, ఈశాన్యంలో మెట్లు ఉండవచ్చని సప్రమాణికంగా, ప్రత్యక్షముగా మేము నిరూపిస్తాం.

8. కొన్ని (ఉత్తర-పశ్చిమ) సింహద్వారముగల ఇండ్లకే ఆగ్నేయంలో వంట పనికొస్తుందని, తూర్పు-దక్షిణ సింహద్వారముగల ఇండ్లకు ఆగ్నేయంలో వంట పనికిరాదని, ఈశాన్యగదిలో కూడా వంటచేయవచ్చని మేము శాస్త్రీయ పద్ధతిని అనుసరించి, వివరణాత్మకంగా ఋజువు చేయగలము. (ఆధునిక వాస్తు పండితులు చెప్పే సిద్ధాంతం ప్రకారం కూడా ఋజువు చేయగలము.)

9. అసలు వాస్తు శాస్త్రమందు బరువు-తేలిక అనే విషయము ఏ ప్రాచీన గ్రంథమునందు లేవు అని మేము నిరూపించగలము. ఉన్నాయని నిరూపిస్తే తగిన పారితోషికం లభించును.

సురేంద్ర: శర్మగారికీ, ఇతరులైన ఆధునిక మరియు ప్రాచీన సాంప్రదాయాలకు చెందిన వాస్తు పండితులను కూడ వాస్తు నిజ నిర్ధారణ ఐక్య వేదిక తరపునుండి ఇలా అడుగుతున్నాము.

1. సాంప్రదాయక వాస్తు పక్షంలోని పండితులారా! ఆధునిక వాస్తు పండితులు సాంప్రదాయక వాస్తులో తప్పని చెపుతున్న దానిని తప్పుకాదని, ఒప్పేనని బుజువుపరచండి. అలాగే మీరంగీకరించే వాస్తేమిటో, దానికి ఆధార గ్రంథమేమిటో ముందుగా ప్రకటించండి. దానిని శాస్త్రీయ పరిశీలనకు పెట్టండి. వాటి పరిశీలనకు, నిర్ధారణకు అవసరమైన నియమనిబంధనలు ఏర్పరచుకోవడానికి తగిన వేదికగా ఏర్పరచడానికి మా వాస్తునిజ నిర్ధారణ ఐక్యవేదిక సిద్ధంగాఉంది.

2. ఆధునిక వాస్తుపక్షానికి చెందిన పండితులారా! ప్రాచీన వాస్తుపక్షానికి చెందిన సాంప్రదాయక వాస్తు పండితులు మీరు చెపుతున్న వాటిలో వేటిని తప్పనంటున్నారో వాటిని, అవి తప్పులు కావని, ఒప్పులేనని నిరూపించండి. ఇంతకు మీరు చెపుతున్న వాస్తుకు ఆధారమేమిటో ముందుగా ప్రకటించండి.

3. శర్మగారు ఆధునిక వాస్తు పండితులకు ఒక సవాలు విసురుతున్నారు చూడండి. ఆధునిక వాస్తు పండితుల ప్రకారం ఇల్లు కడదాం.

గృహ నిర్మాణ సమయం దగ్గర నుండి మీరు చెప్పే గడువులోపల ఏదైన హాని జరిగితే, స్థలం మేమిస్తే స్థలాన్ని, స్థలంలో ఇల్లు కట్టేందుకు మీరు పెట్టే ఖర్చును తిరిగి మీకుఇచ్చి, మీరు చెప్పే శాస్త్రమే సరైనదని ప్రజలకు మేమే తెలియజేస్తాము.

సురేంద్ర: శర్మగారి ఈ ప్రకటనతో, ఆయన నిజాయితీని, వాస్తు విషయంలో ఆయనకున్న నిశ్చయాన్ని అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఆయన ఎందుకు సిద్ధపడతానంటున్నారో ఆ విషయం గుంజులాట లేకుండా ప్రకటించారు కనుక. అయితే ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాల్సింది ఉంది. ఇలాటి ప్రకటనే గౌరు తిరుపతిరెడ్డి గారూ చేసారు బహిరంగంగా. పుస్తకరూపంలో - వ్రాతమూలకంగా - ప్రకటించారుకూడా.

మేము చెప్పినచోట మేము కట్టించిన ఇంటిలో మూడేండ్లు నివాసముండి క్షేమంగా ఉండగల్గితే మేము చెప్పే వాస్తు సరైందికాదని అంగీకరించి, ఆ ప్రకటన చేస్తాము. ఆ ఇంటికైన వ్యయాన్ని వదులుకుంటాము లేదా ఇంత డబ్బుని ధరావతు కట్టుకుని దానిని గెలిచినవానిపరం చేద్దాము అన్నది ఆయన ప్రకటన సారాంశం.ఆయన నిజాయితీని శంకించటానికీ ఆధారాలేమీ లేవు. కానీ సమస్య ఎక్కడుందంటే, ఆయన్ని శర్మగారుగానీ, శర్మగారిని గౌరువారుగానీ కలవరు. కలసి తేల్చుకుందాం రండని పిలవరు. ఆయనో ప్రకటనా, ఈయనో ప్రకటనా చేసి ఊరుకుంటారు. ఇంకాస్త చొరవ తీసుకొంటే, మేము సవాలు విసిరాం. ఒక్కరు ఎదురొడ్డి నిలవలేదు. కాబట్టి మా పక్షం సరైనదేనని అనుకోవచ్చుకదా! అని తమ దగ్గరకొచ్చిన వాళ్ళకు చెపుతుంటారు. ఇద్దరికి తెలుసన్నమాట, ఇద్దరం ఎదురుపడే పరిస్థితి దాదాపు దాపురించదని. ఈ సందర్భంలో మా వేదిక వారిద్దరినీ నిర్ధారణకు సిద్ధంకండని సాదరంగా ఆహ్వానిస్తుంది.ఇరువురిని సంధానపరచడానికి, వారిద్ధరి మధ్యన నిర్ధారణ నిబంధనలు ఏర్పరచుకోడానికీ, అవి అమలయ్యేటట్లు చూడడానికి తగిన సంధాన కర్తుత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ రచనను వారిరువురికేగాక మా ఎరుకలోకి వచ్చిన, వారిరువురూ సూచించిన మరికొందరు వాస్తు పండితులకు చేరుస్తుంది. ఎవ్వరింటిలో వారు సవాళ్ళంటూ కూర్చోకుండ ఇరుపక్షాలు నిరూపణకు ఎదురుపడడానికి సిద్ధం కావడమొక్కటే వారి నిజాయితీకి రుజువు. నిర్ధారణకు ఎవ్వరు ఏఏ కారణాలు చెప్పి సిద్ధంకాకున్నా అట్టివారి మాటలన్నీ వ్యర్ధ ప్రలాపాలేననీ, వ్యాపారపు ఎత్తుగడలో ప్రచారపు జిమ్మిక్కులేనని అనుకోవాల్సివస్తుంది. మాకందిన లెక్క ప్రకారం శర్మగారు, ముక్కుసూటి మనిషని, ధర్మానికి కట్టుబడే మనిషని, ఉన్నదిఉన్నట్లు చెప్పటం, అంగీకరించడం అన్న స్వభావంకలవారని ఆయనే చెప్పినట్లు అయింది.

అయితే ఇక్కడ స్పష్టత కొరకు ఇరువురిని కొన్ని ప్రశ్నలు అడగాలి. వాటికి సమాధానాలు విస్పష్టంగా, సందిగ్ధతలేకుండా వారిరువురూ చెప్పాలి.

1. గౌరువారు, ఎంతకాలం ఎదుటిపక్షంవాళ్ళు నివాసం ఉండాలి? అన్నదానికి రెండేండ్లని, మూడేండ్లని, ఐదేండ్లని రకరకాలుగా అంటున్నారు. ఇక్కడ ఆయనే ప్రకటించిన అత్యల్ప సమయానికి కట్టుబడి ఉండాలి. లేదు ఈనాడైనా ప్రకటించాలి.

2. ఆయన వాస్తును ఒప్పని రుజువుచేయడమంటే ఏమిటో, తప్పని రుజువుచేెయడమంటే ఏమిటో ఆయనా, ఆయనకు వ్యతిరేక పక్షము, ఇద్దరిని సంధానపరుస్తూ, జరిగిందేమిటో పరిశీలించి నిర్ధారించే పక్షమూ (ఇందులో మా వేదికతోపాటు, మరికొందరు నిష్పక్షపాతులైన విజ్ఞులూ ఉంటారు) ఈ మూడు పక్షాలు వ్రాతమూలకంగా నిర్ధారించుకోవాలి.

3. నాకు తెలిసి ; ఇప్పటి సందర్భాన్ని బట్టి ఇప్పటికే కట్టబడిఉన్న నిర్మాణాలను చూపి వాటిని రుజువులుఅనరాదు. ఎందుకంటే ఈశాన్యాన మెట్లు, మరుగుదొడ్లు కట్టి, నైరుతి పల్లం ఉన్న ఒక నిర్మాణాన్ని చూపి గౌరువారు, అదిగో ఆ వాస్తు వల్లనే ఆ కుటుంబానికి ఇన్ని నష్టాలు జరిగాయి అని అన్నారనుకోండి. శర్మగారు అలాగా! అయితే మీ వాస్తు శాస్త్రీయమైనదేనని అంగీకరిస్తారా? నా లెక్కప్రకారం అంగీకరించనే అంగీకరించరు. అంతేగాక అలా నైరుతి పల్లం, ఈశాన్యం మెట్లు ఉన్న మరో గృహాన్ని చూపి అదిగో ఆ కుటుంబం శుభఫ్రదంగా జీవిస్తూనేఉంది. కనుక గౌరువాస్తు అశాస్త్రీయం అని అంటారు. అలా అన్నప్పుడు అలాగా! అయితే నా వాస్తు తప్పేనని అంగీకరిస్తున్నాను అని గౌరువారు అంటారంటారా?

నా లెక్కప్రకారం అంగీకరించనే అంగీకరించరు. నిజానికి అలా ఇరువురు చూపిన అప్పటికే ఉన్న నిర్మాణాలను బట్టి వారిరువురిలో ఎవ్వరి పక్షాన్నీ తప్పనిగానీ, ఒప్పనిగానీ, నిర్ధారించడం సబబు కాదు. అది శాస్త్రీయ నిర్ధారణ అనడానికి తగిందీకాదు. ఆ విషయం తెలిసే అన్నారో, యదాలాపంగా అన్నారోగానీ, వారిరువురూ ఎదుటి వారు చూపిన రుజువును సరిపోయిందిగా అంగీకరించనేలేరు. అంగీకరించడానికి సిద్ధంగానూ లేరు.

మరైతే ఏ పక్షంగానీ సరైందనో, సరికానిదనో నిర్థారణ అయిందని ఎప్పుడు చెప్పవచ్చు? చెప్పగలము? నా అవగాహన ప్రకారం -

1. ఇప్పుడు మరలా ప్రయోగం చేయాలి. మరలా మరలా చెయ్యాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరూ చేసినా ఆ ఫలితాలే వస్తాయి. కావాలంటే మేము ఎప్పుడు, ఎక్కడ, ఎవరైనా మళ్ళా పరీక్షించుదామన్నా సిద్ధమేనని ఇరువురూ అంగీకరించాలి. ఆ మేరకు వ్రాతమూలకంగా ప్రకటించాలి.

2. ప్రయోగం చేసి చూడాల్సిన అంశాలేమిటన్నది విస్పష్టంగా, నిర్దిష్టంగా, సిద్ధాంత ప్రతిపాదన రూపంగా ముందు ప్రకటింపబడాలి. దాని విషయంలో పరీక్షకు సిద్ధమేనని రెండో పక్షం అంగీకరించాలి.అంటే స్థలం, నిర్మాణం ఎలా ఉంటే ఏమి జరుగుతుందో ఇదమిద్దంగా ప్రకటించాలి. ఏ పక్షంవారైనా దీని విషయంలో రెండు ప్రతిపాదనలు చెయ్యాలి. 1. ఇదిగో ఇలా ఉంటే ఇంతకాలంలో ఇతనికి ఈ కీడు కలుగుతుంది. 2. ఇదిగో ఇలా ఉంటే ఇంతకాలంలో ఇతనికి ఈ మేలు చేకూరుతుంది.

గమనిక : ఇక్కడ గానీ నిక్కచ్చితనం లేకుంటే ఇక ప్రయోగం చేయడమన్నదే కుదరదు. వారు వారు చెప్పింది తప్పనో ఒప్పనో నిర్ధారించడమూ కుదరదు.

3(ఎ). ఈ సందర్భంలో గౌరువారు ఫలానా గ్రంథం ప్రమాణంగా అనిచెప్పనక్కర్లా. వారిదే వారికి ప్రమాణం కనక.

(బి) అదే మరీ రామకృష్ణశర్మగారు వాస్తు విద్యా విజ్ఞాన కేంద్రం వారు తన ప్రామాణిక గ్రంథం - గ్రంథాలు కాదు- ఏదో స్పష్టంగా ప్రకటించాలి. వెనకటి గ్రంథాలలో దానినుండి కొంత, దీనినుండి కొంత తెచ్చి కలపకూడదు.

గమనిక: అలాకాక రకరకాల పుస్తకాలనుండి కాస్తకాస్త తెచ్చుకొని అన్నీ కలిపి తన ప్రతిపాదన ఇది అని గనక చెప్పదలిస్తే చెప్పుకోవచ్చు. కానీ ఫలానా ఋషి చెప్పింది నాకు ఆధారం అనకూడదు. ఎందుకంటే మీరు కలగలిపింది మీదేకాని, వెనుకటివాళ్ళదెవళ్ళదీ కాదుగనుక.

గమనిక : అలా కలగలపకుండా వారి ఇష్టంవచ్చిన ఏదేని మూల గ్రంథాన్ని మొత్తంగా ప్రామాణికమంటూ చెప్పి పరీక్షకు సిద్ధపరచినప్పుడే ప్రాచీన వాస్తు శాస్త్రాల పేరనున్న వాటిలో వేటికవే ఎంతవరకు సరైనవో పరీక్షించడానికి వీలౌతుంది. ఇది అత్యంత కీలకమూ, మౌలికమూనైన నియమము. (కలగలుపును ఏదంటే అదంతా తనదేనని అంగీకరించడు. నిజమా ? కాదా?)

పై అంశాలకు సిద్ధమైతే, మిగిలిన కార్యక్రమం నిర్వహించడానికి తగిన రంగాన్నీ, పరిశీలక బృందాన్నీ ఏర్పరచడానికి ఆ రెండు పక్షాల తోడ్పటునూ తీసుకొని నిర్వహణ పాత్రను పోషించడానికి మా వేదిక సిద్ధంగా ఉంది.

ముఖ్య ప్రకటన

1. మా వేదిక ఇరుపక్షాలతోనూ ఒక నిబంధన చేసుకోడానికి సిద్ధంగాఉంది.

రెండు పక్షాలలో ఎవరు తాము చెప్పింది ఒప్పని నిర్దారించినా (ఎదుటి వాళ్ళది తప్పని నిర్థారించడం కాదు), అట్టి వారికి 10 లక్షలు పారితోషికం ఇవ్వడానికి అటుపై ఆ నిర్దారితాంశాన్ని శాస్రీయమైనదిగా ప్రకటించి ప్రచారం చేయటానికీ సిద్ధంగాఉంది. అయితే మాతో ఈ నిబంధనకు సిద్ధపడేవాళ్ళు వారిపక్షం సరైందేనని నిరూపించలేని పక్షంలో మాకు పదిలక్షలు ఇవ్వడానికి సిద్ధంకావాలి. వారి వాస్తు సరైంది కాదని ప్రకటించి ప్రచారం చేయాలి. ఇందుకు సిద్ధమైతే మన మూడు పక్షాలకు చెందిన ప్రతినిధులనూ, ఏ పక్షానికీ చెందని విజ్ఞులను కలుపుకుని నిర్ణేతల మండలినీ ఏర్పరచుకోవచ్చు. ఈ ప్రయోగంలో జరుగుతున్న దానిని రికార్డు చేయదగిన ప్రత్యాంశాన్ని రికార్డు చేద్దాము. రికార్డు రూపం 1. మన మూడు పక్షాలు ప్రయోగం మొత్తాన్ని వ్రాతరూపంలో చెప్పి అందరం సంతకాలు చేద్దాం. 2. జరుగుతున్న దాన్నంతటినీ, ఆడియో, వీడియో రికార్డు చేద్దాం. 3. ఈ అంశాలను సాధారణ న్యాయాలయాల పరిశీలనకు సాక్ష్యాలుగా అంగీకరిస్తామని ఒక ధృవీకరణ పత్రం రాసి మూడు పక్షాలవాళ్ళం- ముగ్గురం- సంతకాలు చేద్దాం. ఇవికాక ఇంకేమైన నిబంధనలు అవసరమని తేలితే అవి మీరిరువురూ సూచించవచ్చు.

2. ఒక్క ప్రయోగం చేతనే నిర్థారణైనట్లు ఏ శాస్త్రీయ క్షేత్రమూ అంగీకరించదు కనుక పలు ప్రయోగాలు చేయడం తప్పనిసరి అంశము. అయినా ఇందులో ఒక నియమముంది.

ప్రకటన తప్పనటానికి ఒక్కసారి చెప్పినట్లు జరగకపోయినా సరిపోతుంది. అదే మరి ఒప్పని తేలాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చేసినా అన్ని కొలతలకు తూగాల్సి ఉంటుంది. కనుకనే ఒప్పని నిర్ణయించడానికి పలుమార్లు ప్రయోగాలు చేయాలన్న నియమం శాస్త్రీయ పద్ధతిలో కీలకమైందిగా చూడబడుతోంది. కనుక మాతో పరీక్షకు నిలవాలంటే ఒప్పనడానికి పలుమార్లు ప్రయోగాలు చేయడమన్నది తప్పనిసరి నియమం. తప్పనడానికి ఒక్కసారి వీగిపోయినా చాలు.

3. విూరిరువురూ ప్రకటించుకున్న దానిని బట్టి విూకీ నియమం అక్కరలేదన్నట్లు తేలుతోంది. ఒకవేళ ఒక ప్రయోగానికి సిద్ధపడి విూరిరువురూ సన్నద్ధులైతే ఆ ప్రయోగానికి వేదిక గావడానికీ మేము సిద్ధమే. అప్పుడు 1. గౌరుతిరుపతిరెడ్డిగారు(మరెవరైనా ఆధునికులు సిద్ధపడినా శర్మగారికి అభ్యంతరం లేకపోతే మంచిదే) తాను ఏది ప్రతిపాదిస్తున్నదీ ఇదమిద్దంగా ప్రతిపాదనరూపంలో ప్రకటించాలి.శాస్త్రిగారి ప్రకారం ఆధునికులు చెప్పేవి, వారు ఒప్పనివి కొన్ని ఇలా ఉన్నవి.

1. ఈశాన్యంలో ఇల్లు కట్టరాదు.2. ఈశాన్యంలో మరుగుదొడ్లు పెట్టరాదు. 3. తూర్పు ఉత్తరాలకన్నా దక్షణ పడమరలు ఖాళీస్థలం విశాలంగా ఉండరాదు. 4. నైరుతిలో సెప్టెక్‌ట్యాంకు ఉండరాదు. 5. మేడపైన ఈశాన్యంలో నీళ్ళట్యాంకు ఉండరాదు, నైరుతిలోనే ఉండాలి. 6. పడమర నూతులుండరాదు. 7.తూర్పు, ఉత్తర గోడలపైనుండి నిర్మాణం చేయరాదు. ఈశాన్యాన మెట్లుండరాదు. 8. ఏ సింహద్వారపు ఇల్లైనా ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. ఈశాన్యంలో ఉండరాదు. 9. కొన్ని దిక్కులలో బరువులుండాలి, కొన్ని దిక్కులలో బరువులుండరాదు. ఈ అంశాలన్నీ అశాస్త్రీయాలు అనంటున్నారు శర్మగారు. కనుక గౌరువారుగాని, మరొకరుగానీ వారి ప్రతిపాదనలో వీటిని దృష్టినిడుకుని వారి సిద్ధాంతాన్ని ప్రకటించాలి. అయితే ఇవి ఉండరాదు అన్న దగ్గర, ఉంటే ఏమౌతుందో, ఇవి ఉండాలి అన్న దగ్గర ఉండకుంటే ఏమౌతుందో నిక్కచ్చిగా చెప్పితీరాలి. అప్పుడే ప్రతిపాదన పూర్తియినట్లు. ఎందుకంటే దీనివల్ల ఈ కీడు, దీనివల్ల ఈ మేలు జరుగుతుందని అంటున్నామంటేనే అ రెంటిమధ్య కార్యకారణ సంబంధం ఉందని చెపుతున్నామన్నమాట. కార్యకారణ సంబంధం ఉందో లేదో పరీక్షించడమే మనందరి లక్ష్యం. దీనిని అందరమూ గమనించాలి. అవునంతేనని అంగీకరించాలి.

మరో ముఖ్య ప్రకటన

ఏదేని ఒక విషయంపై భిన్నాభిప్రాయాలు లేదా విరుద్ధాభిప్రాయాలు ఏర్పడ్డపుడు నీది తప్పంటే నీది తప్పనో, నాది ఒప్పంటే నాదే ఒప్పనో వాదులాడనేకూడదు. ఎందుకంటే నిర్థారించగల శక్తి - సత్తా- వాదనకు లేదు. ప్రయోగమొక్కటే ఎవ్వరికిగాని శరణ్యము. మిగిలిన వాళ్ళనలా ఉంచితే ప్రస్తుతం ఈ సూత్రం వరకు అంటే ప్రయోగం చేద్దాం అన్నంతవరకు అటు గౌరువారూ, ఇటు వాస్తు విద్యా విజ్ఞాన కేంద్రంవారు సిద్దమేనని ప్రకటించిఉన్నారు. మాకూ అది అంగీకారమేగనుక దీనిపై ఇక ఎవ్వరం వాదులాడినా అది గాడితప్పినట్లే అవుతుంది.పరీక్షకు సిద్ధపడడం, ప్రయోగానికి స్థలకాలాలను ఎంపిక చేసుకోడానికి, నిబంధనలను రూపొందించి ఒప్పందం ఖరారు చేసుకోడానికి అందరం కలవడమన్నదే ముందు చేయవలసిన పని అవుతుంది. ఈ సమావేశాన్ని 1. విజయవాడలోగాని 2. హైదరాబాదులోగాని 3. మా కేంద్రం కోదాడ దగ్గర ద్వారకుంటలోగాని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధము. ఏప్రియల్‌ 10వ తేదీ పైన ఒక తేదీని ఖరారు చేయ్యండి. ఆరోజు సమావేశం ఏర్పరుస్తాను. శర్మగారికి హైదరాబాద్‌ రావడానికి అభ్యంతరం లేకుంటే అక్కడ లేదా అటునుంచి అయన ఇటునుంచి గౌరువారు కదలి విజయవాడగానీ, కోదాడగానీ వస్తానంటే అక్కడ. నిర్ణయం మీదే ఆలస్యమూ మీదే.

ఈ కబురు మీ దృష్టిలో ఉన్న మరెవరికి పంపమన్నా పంపుతాము. వారిపేర్లు, చిరునామా, ఫోన్‌ నెంబర్లు ఇవ్వండి.

రామకృష్ణశర్మ గారి లేఖకు

సత్యాన్వేషణ మండలి నుండి సురేంద్రబాబు ప్రత్యుత్తరము.

శర్మగారికి, మీ లేఖలో 'వాస్తు శాస్త్రీయత' అన్న పుస్తకం చదివాను. ''అందులో ఎంతసేపూ శాస్త్రం లేదనే వాదనే తప్ప ఇంకొకటిలేదు'' అని వ్రాశారు. మీ ఈ ఆరోపణ నిజమోకాదో, ఆ మా గ్రంధంలో ఏమేమి ఉందో ఏమేమిలేదో కూర్చుని చూసుకుందాంరండి. వాస్తుకు ఒక ప్రామాణిక శాస్త్రమంటూ లేదు. వాస్తు శాస్త్రాల పేరిట వివిధ కాలాలలో వ్రాసిన పెక్కు గ్రంధాలున్నాయి. అని వ్రాశాను నేను. నా ఈ ప్రకటన తప్పనాలంటే ముందుగా మీరు ప్రామాణిక గ్రంథమిదేనని పేర్కొని, ఆ మీ మాట సరైందేనని రుజువుపరచాలి. ఇక నేనైతే అలాంటి గ్రంథమేదీ నిర్ణయింపబడిలేదు అనేక గ్రంథాలు, అనేక గ్రంథకర్తలు, ప్రవర్తకులు ఉన్నారన్నదే లభిస్తున్న ఆధారము అన్నది రుజువు పరచాల్సి ఉంటుంది. నా మాటను రుజువు పరచడానికి నేను సిద్ధం. మరి మీ మాటేమిటో చెప్పి దానిని రుజువు పరచడానికి మీరు సిద్దమంటే కలసి కూర్చుందాం. మధురకృష్ణమూర్తిగారినీ మన మధ్య కూర్చుండబెట్టుకోడానికీ నాకభ్యంతరం లేదు. అయితే వారు మీ నా పక్షాల వైపు మాట్లాడకుండా, వారి పక్షాన్ని ప్రతిపాదించకుండా ఉండాలి. ఎందుకంటే వారు పరిశీలక పక్షం, మన మిరువురం కక్షిదారులం, ఆవేదిక వరకు, గనుక.

2) శాస్త్రమంటే మీరనుకునే భౌతిక సైన్సుకు ప్రత్యక్షంగా కనపడాలనేది ఎక్కడా లేదు. అన్నది విూ మరోమాట.

ఇక్కడ నా మాటేమిటంటే, వాస్తుకు సంబంధించినంతవరకు స్థలం భౌతికమే, నిర్మాణం భౌతికమే- వాటి తీరుతెన్నులననుసరించి వ్యక్తులకు జరిగే మేలు, కీడులూ భౌతికమే గనుక మన ప్రస్తుత సందర్భానికి సంబంధించినంతవరకు చేసి చూసుకోవడం సాధ్యపడేదే. కనుక ఈ సందర్భానికి మీ పై మాటతో పనిలేదు. కనుకనే మీరు రుజువుకు సిద్దమంటూ ఆధునిక వాస్తు పండితులకు సవాలు విసిరారు. అభౌతికాల మాట మరో సారి పరీక్షకు పెట్టుకుందాం. ఈ భౌతిక నిర్మాణానికీ, ఆ గృహస్తుపొందే కీడు మేలులకు. ఏ భౌతిక శక్తులు కారణం అని మీరంటారు. దానిని ఎలా మీరు తేల్చుకున్నారో, మాకెలా తేల్చిచూపుతారో అదంతా మీరే ప్రకటించి నిరూపించాలి. ఈ విషయంలో నా ప్రతిపాదన అభౌతిక శక్తుల ఉనికి ఇప్పటికీ అనిర్ధారితమనే. అనిర్ధాంత మన్న నా మాటకు ఉపబలకంగానే ఉంది మీ ప్రకటనన్నూ. ఎలాగంటే, భౌతికంగా, ప్రత్యక్షంగా కనపడాలనేంలేదు అనేకదా మీరూ అంటోంది. నేనన్నదీ అదే కదా! విజ్ఞాన శాస్త్రం ఎన్ని రకాల ఆధారాలను శాస్త్రీయాధారాలుగ రుజువులుగ స్వీకరిస్తుందో అందులో దేనికి చెందిన రుజువూ లభించలేదనే నేనన్నమాటకు అర్ధం.

3) ప్రతి విషయంలోనూ ల్యాబరేటరీ రుజువుకావాలని ఎక్కడాలేదు. అంటూ భూమి గుండ్రంగా ఉందన్న దానిని ఏల్యాబ్‌ ద్వారా నిరూపించగలము అనన్నారు.

నిజానికీ మాట శాస్త్రీయ నిర్ధారణలన్నవి ఏయే అంశాలకు ఎలా జరుగుతుంటాయో మీ కెరుకైన విషయం కాదన్న నిజాన్ని పట్టిస్తున్నాయి. నా వరకు నేను అన్ని విషయాలు లేబరేటరీలో నిర్ధారణ కావాల్సిందే అని ఎక్కడా అనలేదు. అనంటే ఆ మేరకు నేను బుద్ది హీనుణ్ణ్డనే అర్ధము. నేననని అంశాన్నెందుకు మీరు లేవనెత్తారో మీరే చెప్పాలి. వక్త ఉద్దేశించని అర్థాలను గుంజాలనుకోవడం 'ఛలం' చేయడం అవుతుంది. అనుద్దాష్ఠార్ధపరికల్పనా ఛలం' అన్నది న్యాయం. ఆ సూత్రం నాకంగీకారమే. సత్యాన్వేషణాతత్పరత కలవాళ్ళు 'ఛలం' చేయరు సరికదా దాన్ని అశుద్ధంలా భావిస్తారు. నా ప్రతిపాదనంతా ప్రకటితాభిప్రాయం సరైందా కాదా అన్నది ప్రయోగం ద్వారా మాత్రమే తేల్చుకోవలసి ఉంటుంది అన్నదే. ఈ వాస్తు విషయంలో ప్రయోగానికి మీరు సిద్దమేనన్నారు గనుక ఇక్కడ నన్ను తప్పుబట్టేందుకేమీ లేదు. పైగా నాతో మీకు ఏకీభావం కూడా ఉంది.

4) ''ప్రతి విషయాన్ని ఆలోచించాలి. మీరు రాసిన పుస్తకాల్లో ఉండే విషయం నేను చెప్పగలను, (1,2 విషయాలు తప్ప) ప్రతి దానికీ వివరణ ఇవ్వగలను. లేదు అని రాసేస్తే, చెప్పేస్తేకాదు. లేదని చెప్పడానికీ కూడా ల్యాబ్‌ కావాలి.

ఇక్కడ ఈ మీ మాటలలో కొంత ఆత్మాధిక్యతాభావము, మరికొన్నింట కొంత స్వవచన వ్యాఘాతము చోటు చేసుకుంది. (1) 'మీరు చెప్పినవన్నీ నేను చెప్పగలను' అన్న మాట వెనక నేనూ తెలసినవాణ్ణే నీవే తెలిసిన వాణ్ణిని అనుకుంటున్నావు కాబోలు అన్న ధ్వని ఉంది. ఇది ఒక రకంగా ఆత్మన్యూనతనుండి పుట్టిన ప్రగల్భం క్రిందికి వస్తుంది. నేనేక్కడా, నేను చాలా తెలిసినవాగ్ధానిగాని, ఫలాని వారు నాకంటే తెలిసిన వారు కాదని గాని చెప్పే ఉద్దేశాన్ని కనబరచలేదు. విషయాన్ని విచారించక, ఇవి నాకూ తెలుసునంటూ ఎందుకు మొదలెట్టారు. అయినా 'ప్రతి విషయాన్ని ఆలోచించాలి' అన్నంతవరకు నేను మీతో ఏకీభవిస్తున్నాను. అదలాఉంచి, చివరకు లేదంటానికీ ల్యాబ్‌ కావాల్సిందేనన్నారు. పైన ప్రతి దానికీ ల్యాబ్‌ కావాలంటే ఎలా? అనన్నారు. ఇదేంటి?

5) 'వాస్తు శాస్త్రీయత' లాంటి పుస్తకాల వల్ల లోకానికి పీడేకాని ఉపయోగంలేదు'. ఇప్పటికే అస్సలు శాస్త్రం మూలన పడిపోయింది. కారణం చదవని పండితుల వల్ల, గౌరుతిరుపతి రెడ్డిలాంటి వారి వల్ల.

ఎ) మా రచనలోకానికి పీడ అనన్నారు. చాలా పెద్దమాట వాడారు. మాట వదిలేముందు దాని మంచి చెడ్డలకు బాధ్యత వహించడానికి సిద్దపడనివారిని బాలురని కానీ, వాచాలురని కానీ అనాలి. మీరట్టి వారు కాకుంటే మా రచన వల్ల లోకానికి ఏర్పడ్డ పీడేమిటో మీరు రుజువు పరచాలి. లేకుంటే నోటితుత్తరతనాన్ని వదలుకోడమో, తగ్గించుకోవడమో చేయాలి. మీరన్నది చిన్న మాట కాదని, ఒక తిట్టు లాంటిదని మాకెరుకవుతోందో లేదో చూడాలి.

బి) 'ఇప్పటికే అస్సలు శాస్త్రం మూలన పడిపోయింది. అంది మీ ఆవేదన. ఆ అస్సలు శాస్త్రం ఏదో, ఎప్పుడు, ఎవరు వ్రాసిందో వ్రాతమూలకంగా నాకు తెలియజేయండి. అనేకుల రకరకాల రచనలను ఉదహరించకండి. వాస్తు శాస్త్రాలు అన్న పదప్రయోగంలోనే దోషముంది. వాస్తుకు ప్రామాణిక శాస్త్రం అనాలి. మీరూ అస్సలు శాస్త్రం అన్నారు గనుక, అదేమిటో ప్రకటించండి. ఎందుకంటే అలాంటిది లేదు అన్న ప్రకటన చేసి ఉన్నాను నేను. నా ఈ ప్రకటన తప్పని మీరు నిర్ధారిస్తే, వినమ్రంగా నాకీ విషయం తెలిపిన వ్యక్తిగా, ఈ విషయంలో జ్ఞాన ప్రదాతగా గురుతుల్యులుగ నేను అంగీకరించి, ప్రకటించి, వెనకటి నా మాట తప్పనీ ప్రకటిస్తాను.

6) మన రాతలు ప్రజలలో ఆలోచన కలిగించేవిగ ఉండాలేగాని, అనాలోచితంగా ఉండరాదు అ న్నారు. వాక్యనిర్మాణంలో రెండో భాగంలో దోషముంది చూడండి. మన రచనలు ఆలోచన కలిగించేవిగా ఉండాలన్నంత వరకు నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

7) ''ఇకనైనా మంచి శాస్త్రీయ పుస్తకాలు వేయండి. జ్యోతిషం వాస్తు జోలికి రాకండి. వీటివల్ల ఏమీ ప్రయోజనంలేదు''.

ఇక్కడా మీ చివరి వాక్యం భావదోషం కలిగి ఉంది. అది వాస్తు జ్యోతిషాలవల్ల ఏమీ ప్రయోజనంలేదు అన్న అర్ధాన్నిస్తోంది. కానీ మీరు చెప్పదలచింది వాస్తు జ్యోతిషాలపై వ్యతిరేక రచనలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని కదా! వాక్యం ఆ అర్ధాన్నివ్యాలంటే, అందువల్ల అని అనుండాలి. అది సూటైన భాష. వీటివల్ల అన్నది సూటిదనం లేని, మనం అర్ధం గుంజుకోవాల్సిన భాష అవుతుంది.

8) మీరు గనుక నిజంగా ప్రజలకు ధైర్యంగా సేవ జేయాలంటే, మద్యపానంపై ఊరూరా అవగాహన కల్పించండి, మాన్పించండి. అందువల్ల వాటి వల్ల జరిగే అనేక అరిష్టాలను అరికట్టవచ్చు.

శర్మగారూ! నేనూ మిమ్మల్నిదేమాట అన్నాననుకోండి, వాస్తు జ్యోతిషాల వెంట పరుగెత్తి వాటిని మంది నెత్తికెత్తకండి. అందువల్ల ఇంతో అంతో అనర్ధమూ, వ్యర్ధ వ్యయప్రయాసలేగాని ప్రయోజనమేమీ లేదు. పైగా దొంగ వాస్తు పండితుల వల్ల అరిష్టాలూ ఉన్నై. మీరు మద్యం, అవినీతి, లంచగొండితనం, వ్యాపార దోపిడీ లాంటి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలపై పోరును సాగించండి. నిజంగా మీకు ప్రజాహితం లక్ష్యమైతే ఆ పని చేయండి అని. సరికదా దాన్ని అశుద్ధంలా భావిస్తారు. నా ప్రతిపాదనంతా ప్రకటితాభిప్రాయం సరైనదా కాదా !

1) మొదట మీరు వాస్తు జ్యోతిషాలను విడవరు.

2) ఒకవేళ సామాజిక రుగ్మతలపై ఎక్కడైనా పని చేస్తుంటే ఆ పనీ ఆపరు.

3) నేనో, మరొకరో చూపిన మరో సమస్యపై పోరాటానికి సిద్దమూకారు.

ఇంత వరకు నిజమోకాదో ఆలోచించండి. అలా ఏమిలేదు సురేంద్రా! మీరు రెడీనంటే కలసి కొన్ని సామాజిక సమస్యలపై పని చేయడానికి నా కభ్యంతరం లేదు అని గనక అంటే, పలు సామాజిక సమస్యలకు మూలకారణం అనదగ్గ అంశంపై ఇప్పటికే నేను, మరికొందరం కలసి సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక పేరున రాష్ట్రస్ధాయి ఉద్యమ నిర్మాణంలో తలమునకలై ఉన్నాం. మీరూ దానిలోకి రండి. బడుగు జీవితాలు బాగు జేసే యత్నంలో భాగస్వాములుకండి. పాలుపంచుకోండి.

అదేగాక మీరన్న మద్యపానంపై వ్యతిరేకోద్యమం మా మిత్ర సంస్ధల సారధ్యంలో నడుస్తోంది. అవినీతి వ్యతిరేక పోరాటోద్యమమూ మా అనుబంధ వేదికే. అలానే మరికొన్ని సంఘాభివృద్ధి నిరోధక శక్తులపైనా ప్రజా చైతన్య కార్యక్రమాలూ శక్తి వంచన లేకుండా నిర్వహిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ వేదిక పేరునా మా ఐక్య మిత్ర మండలిలోని ఒక విభాగం (బృందం) ఆ వైపు పని చేస్తోంది. మరో బృందం సెజ్‌లపేరిట జరిగే దోపిడీకి వ్యతిరేకంగా గ్రామీణులను సంఘటిత పరుస్తోంది. అలాంటి విభాగాలలో ఒక చిన్న విభాగం చేస్తున్న పనే వాస్తు, జ్యోతిషాలు, మహిమలు, మంత్రాలు, స్వస్ధత ప్రార్ధనలు లాంటి వాటి వాస్తవమెంత? అని నిగ్గదీయడమూ. మీరు మా వేదిక మొత్తంలో భాగస్వాములు కాగలిగినా సంతోషమే. లేదా మీకు అభిలాష ఉన్న విభాగంలో ఏదేని అంశంపై మాతో కలసి పని చేస్తానన్నా మాకు సంతోషమే.

అలా కాదని వాస్తు జ్యోతిషాల విషయంలో దొంగలను వెడలగొడదాం అన్నా మాకు సంతోషమే. ఆ రెంటిలోని నిజానిజాలను పరీక్షించుదామన్నా సంతోషమే. ఇక మీరేమిటో, మీ నిర్ణయమేమిటో ప్రకటించాల్సింది మీరే.

9) సమాజ శ్రేయస్సే భారతదేశ భవిష్యత్తు, ముందుతరాల వారికి మంచి విజ్ఞానాన్నిపంచేట్లు అందరం కృషి చేద్దాం. 'ధర్మోరక్షతి రక్షితః' సొదరునిగా ఈ లేఖ వ్రాస్తున్నాను.

ఈ వాక్యాలన్నీ నాకు శతధా ఆమోదయోగ్యాలు. మీరు ఈ మాట త్రికరణ శుద్ధిగా అన్నదైతే నేను వాగ్ధాన పూర్వకంగా, నేనందుకు సిద్దంగా ఉన్నానని ఈ ముఖంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను.

ఇవన్నీ అలా ఉంచుదాం. వాస్తు విషయంగా ఎలాగూ మొదలెట్టాం గనుక ఆ విషయంలో ఒక నిర్ధారణకు రావడానికి సిద్దం కండి. తేలిన విషయాలను అంగీకరించి ఆచరిస్తూ, ప్రచారం చేయాలన్నది నిబంధన.

మీ సోదరతుల్యుడు

సురేంద్ర

అభౌతిక శక్తులు - ఒక పరిశీలన

మిత్రులూ, యోచనాశీలురూ, సంఘహితైషులునైన కె.బి.రాజేంద్రప్రసాద్‌ గారు చాలా కాలం నుండి, అభౌతికశక్తుల ఉనికి అనిర్ధారితం అనంటిరిగదా! ఆ విషయాన్ని యోగ్యమైన ఆధారాలతో వివరణాత్మకంగా ఒక వ్యాసం వ్రాయండి. నాలాంటి వారికీ, అట్టివి ఉన్నాయి, లేవు అనుకుంటుండే ఇరు పక్షాలకూ పునరాలోచన రేకెత్తించడానికీ, అవగాహన కలిగించుకోడానికీ గూడా ఉపయోగపడుతుందది అని అడుగుతూ వస్తున్నారు. మళ్ళా 14-3-2011న మరో లేఖావ్రాసి మీరీ విషయంలో ఎందుకు సాచాతు చేస్తున్నారో, ఈ తాత్సారానికి అర్ధమేమిటో నన్న ధ్వని చేస్తూ ఒకింత నిఘ్ఠారంగా మాట్లాడారు. పాఠకుల కొరకు ఆ లేఖ యదాతధం ప్రచురిస్తున్నాను.

సురేంద్రబాబు గారికి, నేను లోగడ అడిగిన ప్రశ్ననే మరోసారి గుర్తు చేయడం కోసం వ్రాస్తున్నాను. ''అభౌతిక శక్తులు ఉన్నట్లు ఇప్పటి వరకు నిరూపణ జరగలేదు. ఇక ముందు నిరూపణ జరిగే అవకాశము లేదు(నిరూపణ సాధ్యం కాదు)'' అని మీరు ప్రకటించారు.

దీనికి ప్రమాణం ఏమిటి? దేవుడు కూడా అభౌతిక శక్తే కదా!

''అభౌతిక శక్తులు ఉన్నాయి. అవి ప్రజల బాగోగులపైన ప్రభావం చూపుతున్నాయి'', అనే భావజాలం సమాజంలో చాలా బలంగా ఉన్నది. అందువలన సమాజంలో చాల నష్టం జరుగుతున్నదని మీకు తెలుసుకదా!

తెలిసి ఉంటే, అలాంటి తప్పుడు భావజాలాన్ని సమాజం నుండి తీసి వేయడానికి సత్యాన్వేషణ మండలి ఎందుకు కృషి చేయడం లేదు? మీ మండలి దీనిని ఆబ్జెక్టివ్‌ (విషయం)గా ఎందుకు స్వీకరించలేదు.

ఈ విషయంపై మీ విపుల వివరణ వివేక పథంలో ప్రచురించగలరు. తద్వారా పెక్కురికి అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. అని వ్రాశారాయన.

ఆయనకూ, ఈ వ్యాసాన్ని పట్టి చూసే అవకాశం కలిగిన వారికీ ముందుగా కొన్న సూత్రప్రాయమైన అంశాలు చెప్పాలి.

1) అధ్యయన శీలత, సత్యాన్వేషణ తత్పరత, నిశిత మరియు శూక్ష్మదృష్టి కలిగిన వారికీ, ప్రత్యేకంగా ఈ విషయంలో ఒక నిర్ధారణకు రావాలన్న దుగ్దగలవారికీ మాత్రమే కొరుకుడుపడి, జీర్ణించుకునే అవకాశమున్న క్షేత్రమిది. విూరాకోవకు చెందినవారేనా ?

2) మానవుని హేతుబుద్ది వళ్ళు విరుచుకుని, కళ్ళు తెరచిన నాటి నుండే ఈ అంశంపై రెండు మూడు పక్షాలుగా చీలి కొట్లాడుతూనే వస్తోంది. అస్తి, నాస్తి విచికిత్స ఈ నాటిది కాదని కఠోపనిషత్కాలం నాడే ప్రకటింపబడింది. ఆధునిక తాత్వికులూ భావమా, భౌతికమా? ఏది ప్రాధమిక మన్నదే తత్వశాస్త్రం పరిష్కరించాల్సిన మౌలిక సమస్య లేదా ప్రశ్న అననుకుంటూ, అంటూ వస్తున్నారు.

3) ఆయా బృందాలు ఏవేవో అరకొర ఆధారాలతో, అవే ప్రమాణాలనుకుంటూ ఎవరి మానాన వారు, వారి వారివే సరైన వనుకుంటూ, దొరికిన అమాయకపు మందనెత్తిన వాటిని పెట్టి, ఎవరి ఓపికున్నంత మందిని వారు వెంట బెట్టుకుని తోలుకెళుతున్నారు.

4) అందరూ మాటకు మాత్రం సత్యాన్నికనుగొనాల్సిందే, స్వీకరించాల్సిందే, వచించాల్సిందేనని తెగ ప్రగల్భిస్తుంటారు. సత్యా సత్య నిర్ధారణ పద్ధతేమిటన్న దగ్గరగానీ, తేలిన దాన్ని తేలిన దానినిగా తేలని దానిని తేలని దానినిగా అంగీకరించి స్వీకరించి, అదే ఇతరులకు చెపుతాను అన్న దగ్గరకు వచ్చి నానలభై ఏండ్ల పై బడిన జీవితంలో నాకు ఎదురుపడి నిలబడలేదు. దానిసరైన అర్ధంలో సత్యాన్వేషులు అరుదు అన్నది నా జీవితానుభావ సారాంశంగా ఉంది.

5) సుమారు 20 ఏండ్లపాటు 'తత్వచర్చా వేదిక' పేరున వివిధ తాత్విక ధోరణులకు చెందిన ప్రసిద్ధులతో; 'చర్చా వేదిక నియమనిబంధనల పేరున', భాషానియమాలు, వాదనియమాలు, నిర్ధారణ నియమాలంటూ కొన్న కట్టడులను ఏర్పరచి మరీ ఆవేదికను నిర్వహించాము. ఒక గొప్ప విషయమేమంటే, ఆ వేదికలలో పాల్గొన్న ఏ సిద్దాంతానికి చెందిన వారుగానీ, ఆ నియమ నిబంధనలు అనవసరం అని గానీ, సరైనవి కావనిగానీ, సరిపోవనిగాని అనలేదు. అవిలేకుంటే సిద్దాంత విచారణ పెడదోవపట్టకుండా సాగించడం కుదరదని వారి వారికే అనిపిస్తూ వచ్చింది కనుక. ఎందుకంటే తాము ఎదుటి సిద్ధాంతాలను పరీక్షించడానికి అవి తప్పనిసరేనని, ప్రయోజనకరమేనని.

నా ఈ నేపధ్యం , ఆఁ దీని వల్ల పెద్దగా ప్రయోజనం కలగదులే, అనిపించడంతోనూ, ప్రస్తుతం పెట్టుకున్న సామాజిక కార్యక్రమపు వత్తిడి ఊపిరాడనీయక పోవడంతోనూ, మీ లేఖను (ఈ అంశాన్ని) ప్రక్కన పెట్టేశాను. మార్చి నెలాఖరున రెండ్రోజులు కొద్దిగా విరామం లభించడంతో ఈ సంచికను మీ లేఖాంశానికి, వాస్తు విషయంలో మీలానే చాలా కాలంగా సమాధానం చెప్పవేమిటి అంటూ వత్తిడి చేస్తున్న రామకృష్ణ శర్మ (వాస్తు విద్యా విజ్ఞాన కేంద్రం) వారికీ కేటాయించాను. నిజానికి సంచికను కేటాయించడమంటే సమయాన్ని శ్రమనూ వెచ్చించడమే గాక, 4, 5 దు వేల రూపాయలనూ ఖర్చు చేయడమనే అర్ధం. సరే, చూద్దాం. శ్రమైనా ప్రయోజనం కలిగితే మంచిదే కదా!

భౌతికం - అభౌతికం

వెనుకటి తాత్వికులు విశ్వాన్ని, విశ్వానికి ఉపాదాన కారణం అనదగ్గ ఆదిమ పదార్ధాన్ని ప్రకృతి అనన్నారు. లోకాను భవం ప్రకారం మనకు భూమిపైన, జడములు - చేతనములు, ప్రాణులు - అ ప్రాణులు అన్న రెండు ప్రధాన వ్యక్తులు (పదార్ధాలు, వస్తువులు, ద్రవ్యాలు అన్న మూడు మాటలూ వాడబడ్డాయి. ఉదా:- జడపదార్ధాలు, జడ ద్రవ్యము చేతన పదార్ధాలు, చేతన ద్రవ్యము) గా సమస్తం గోచరిస్తోంది. మానవ కృత సమ్మేళనాలతో ఎక్కడా, ఎన్ని జడ పదార్ధాలను, ఎన్ని రకాలుగా సమ్మిళితం చేసినా, ఆ మేళనం నుండి చేతనమో, ప్రాణమో రాకపోవడాన్ని బట్టి, జడం నుండి చేతనం పుట్టదు. చేతనం (ప్రాణము, తెలివి కల దానిని చేతనం అంటారు) దాని కదే స్వతంత్ర పదార్ధం, లేదా ద్రవ్యం అన్న నిర్ణయానికి వచ్చారు ఎక్కువ భాగం చింతకులు. ఆ నిర్ణయం నుండి పుట్టిందే ప్రకృతి - జీవుడు అన్న రెండు (జడము - చేతనము) రెండు వేరు వేరు ఆదిమ - అనాదియైన - పదార్ధాలేనన్న భావన. సాంఖ్యం వాటిని ప్రకృతి - పురుషుడు, అని పేర్కొనగా, భారతీయాస్తికులలోని సింహభాగం 'ప్రకృతి - జీవుడు- ఈశ్వరుడు' అన్న మూడు పదార్ధాలు (అవి అనాది నిత్యాలు అనన్నారు. అంటే అవి వాటిలో వేటికి ఏవీ కారణాలు కాదు, కార్యాలు కాదు కనుక అవి పుట్టవు, నశించవు అన్నట్లనన్నమాట) ఉనికి కలిగి ఉండడంలో వేటికవే స్వయం సత్తాకాలు అనన్నారు.

వేదకాలం నుండీ ఈ జడ చేతనాల విషయంలో ఏకోన్ముఖమైన ప్రతిపాదనంటూ ఏదీలేదు. కొందరు ముందున్నది చేతనమే దాని అభివ్యక్తే ఈ ప్రపంచమున్నూ అన్నగా, ముందు ప్రకృతే ఉంది పంచభూతాలే ఉన్నాయి వాటి వివిధ సమ్మేళనాలే జీవ, జడ జగతంతా అన్నది మరో బృందపు వాదన.

ఇందులోనే మరికొందరు 'బ్రహ్మం' అన్న పదం వాడి అది ఈ సమస్త ప్రపంచానికీ - విశ్వానికీ కూడా - అభిన్న నిమిత్తోపాదాన కారణం అనన్నారు. (ప్రపంచమన్న మాటకు ఐదు కూడి ఏర్పడిందనిగానీ, అయిదుగా అనుభవంలోనికి వస్తున్నదని గానీ అర్ధం చెప్పుకోవచ్చు, ఆత్మముందున్నదనీ, పరబ్రహ్మమే ముందున్నదనీ దానినుండే ఈ సమస్త జడాజడ జగత్తు ఆవిర్భవించిందని కొందరు అభిప్రాయపడగా, ఆత్మలేదా బ్రహ్మం అన్నదే ముందున్నదని అంగీకరిస్తూనే, జడా, జడ జగత్తు నిజానికి ఎన్నడూ ఆవిర్భవించలేదనీ, బ్రహ్మం ఎప్పుడూ నిరికవకారంగా ఏకరసంగా, పరిణామ రహితంగా యధాతధంగనే ఉందనీ, ఈ అనేకంగా కనిపించడం, మనకు అనిపించడం మాత్రమేనని తలంచారు. అద్వైతులు దానినే 'మాయ' అన్నారు.

యోచనాశీలురైన మిత్రులారా! ఇక్కడి వరకు చెప్పిందాన్ని సంక్షిప్తీకరిస్తాను. దానిని అర్ధం చేసుకోండి.

1) అస్తి నాస్తి విచికిత్స ఈ నాటిది కాదు. చాలా వెనకటి కాలం నుండే కొనసాగుతునే ఉంది.

2) వారి మధ్యనే నాటి నుండి నేటి వరకు ఏది సరైనదో, ఎవరన్నది సరైనదో నిర్ధారణ కాలేదు.

3) దాని పర్యవసానమే, కొనసాగింపే, ఈ నాటి వరకు ప్రపంచంలో సాగుతున్న వివిధ ఆస్ధికధోరణులూ, వివిధ నాస్ధిక ధోరణులున్నూ. రెండు బృందాలలోనూ వారిలో వారికే కొన్ని సమానాభిప్రాయాలు, కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటూ వస్తున్నై.

2. 1) ఆత్మ - చేతనం- ఉంది, జడమూ ఉంది రెండూ వేటికవి వేరు వేరు, రెండూ అనాది నిత్యాలుగా ఉన్నవి, ఉండేటివే (శాశ్వతాలు)

2) ఆత్మ నుండే అంటే చేతనం నుండే (చేతన మంటే ప్రాణము, తెలివి అన్న రెండు ధర్మాలుకల ద్రవ్యమని అర్ధం) ఈ జడమూ ఉద్భవించింది. మళ్ళా చేతనం నందే లయమవుతుంది. (అభిన్న నిమిత్తోపాదాన కారణం బ్రహ్మ)

3) జడ ద్రవ్యాల సంక్లిష్టసమ్మేళనం నుండే జీవం ఉద్భవించింది. ఆదిమ పదార్ధం చేతనం కాదు. (సఅసద్వాణడమగ్ర ఆసీత్‌)

4) ఉన్నదేదో ఉంది. అది మార్పులేకుండా ఉంది. అనేకంగా కనుపిస్తున్నదంతా భ్రాంతే అన్నది మరో పక్షం. వాచారంభకాం వికారాశనామధ్యేయం.

5) ప్రకృతి - ఆత్మ (జీవుడు) పరమాత్మ - (ఈశ్వరుడు లేదా సృష్టికర్త) అన్న మూడు పదార్ధాలు మొదటి నుండే ఉన్నాయి.

గమనిక : ఇంత వరకు భారతీయం. దీనికి ఒకింత వేరుగా యూదు (బైబిల్‌) మతము ఇస్లాం (ఖురాన్‌) మతమూ మరో వాదాన్ని ప్రవేశపెట్టాయి. వాటి ప్రకారం మొదట దేవుడొక్కడే ఉన్నాడు. అతడే సృష్టికర్త. జీవ, జడ జగత్తునంతా అతడే సృష్టించాడు.

6) బైబిల్‌ శూన్యం నుండి సృష్టిని చెపుతోంది. జీవులు కూడా సృష్టింపబడ్డవారే.

7) బైబిలుకు, ఖురానుకూ ఆరంభం సామాన్యమే. రెండు గ్రంధాలలోని సృష్టికర్త ఒకడే. సృష్టిని శూన్యం నుండే ఏర్పరచినట్లు రెండూ అంగీకరిస్తాయి. అయితే సృష్టి ఏర్పడిన క్రమంలో, ఆరంభంలో జరుగుతూ వచ్చిన ఘటనల వివరంలో అక్కడక్కడ వ్యత్యాసాలున్నై.

8) ఈ రెంటి ప్రకారం జీవులు దేవుని సృష్టే, అంటే మొదటలేరు. ప్రళయానంతరం స్వర్గ నరకాలలో వారంతా శాశ్వతంగా ఉంటారు.

మిత్రులారా! ఇంత వరకు అర్ధమైతే గాని భౌతికం, అభౌతికం అన్న పారిభాషిక శబ్ధాలను విచారించడం సాధ్యపడదు. లోకంలో ఉన్న వివిధ ఆస్ధిక పక్షాల వాళ్ళూ, వివిధ నాస్ధిక పక్షాల వాళ్ళూ రెండు రకాలుగా గొడవలు పడుతున్నారు. ఒకటి ఆస్ధిక - నాస్ధికతలపైన కాగా, రెండోది వారిలోవారు అంటే ఆస్ధికులూ, ఆస్ధికులూ, నాస్ధికులూ, నాస్ధికులూ నన్నమాట. (గొడవ అన్న మాట మీకు సరైన పదంగా అనిపించకపోవచ్చు, తేడా పడుతున్నారన్నదే నా అభిప్రాయం. మీ దృష్టి నటు త్రిప్పడం కొరకామాట వాడాను. కొద్ది పాటి ఆధారాలిస్తాను చూడండి.

ఈ మాటనగనే ఆస్ధికులలో ఆస్ధికులకు కొట్లాటలు మనకందరకూ తెలుస్తూనే ఉన్నాయి కనుక మీరన్నది నిజమేననిపిస్తోంది. నాస్ధికులలో నాస్ధికులకు గొడవలేమిటి అని మీరనవచ్చు.

ప్రాచీన నాస్ధికులలోనూ సిద్దాంత భేదాలున్నేౖ. ఐదు భూతాలనేవాళ్ళు, నాలుగు భూతాలనేవాళ్ళు, దేవుణ్ణంగీకరించకనే శరీర పతనానంతరం వ్యక్తి ఉనికిని అంగీకరించేవాళ్ళు, అంగీకరించనివాళ్ళు,

ఆధునికులలో గోరాగారు, చార్వాక రామకృష్ణగారు, రావిపూడి వెంకటాద్రిగారు వాళ్ళు ప్రకృతి విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగిఉన్నారు. వెంకటాద్రిగారు నాస్ధికులున్నారు జాగ్రత్త అన్న రచనను, అటు గోరా గారును దృష్టి నిడుకునివ్రాశారు. ఇక మార్క్సిజం విశ్వాన్ని, విశ్వ నియమాలను గురించి ఏమి చెపుతోందో, యాంటీ మార్స్కిస్టు భౌతిక వాదులు దానిని అంగీకరించరు. మార్క్సిస్టులు భావ వాదులతో పాటు ఇతర నాస్ధికుల్ని తమకు భిన్నంగా మాట్లాడే ఎవరినీ అంగీకరించరు.

ఇక ఆస్ధికులు సరే సరి ప్రతి ఆస్ధిక ధోరణీ తాను చెప్పిందాన్నంగీకరించని, అంగీకరించని అనే కంటే విశ్వసించని వారినందరినీ అస్సలు నాస్ధికుల కంటే, వ్యతిరేకించవలసిన నాస్ధికులుగనే నిర్ధ్వంద్వంగా ప్రకటించింది. అవిశ్వాసులంతా నాస్ధికులేనని ఆ గ్రంధాలు ఘంటా పధంగా ప్రకటించాయి.

మాది సత్యమంటే, మాది సత్యమంటూ, అక్కడితో నాగక మాదే సత్యం మిగిలినవన్నీ అసత్యాలేననీ అంటున్న ఇవన్నీ వెనకటి నుండి ఇప్పటిదాకా కొనసాగుతూనే వస్తున్నాయి. ఆ గుంపును ఈ గుంపులోకి, ఈ గుంపును ఆ గుంపులోనికి గుంజేయత్నాలు శక్తి వంచన లేకుండానూ, కొన్ని సార్లు వంచనా శిల్పంలోనూ కూడా చేస్తూనే వస్తున్నాయి. ఈ వివరాలు చాలుననుకుంటాను వాళ్ళెవరూ ఇదమిద్దమని తేల్చుకోడానికి ఇప్పటి వరకు పరస్పరం సిద్ధపడింది లేదని నిర్ధారించుకోడానికి. ఈ మధ్య మరో క్రొత్తరగడ (లోగడనుండే ఉన్నా) ఊపందుకుంది.

ఇస్లాం పక్షాన జాకీర్‌ నాయక్‌ అన్నాయన ఇస్లాం ప్రపంచంలోని మరికొందరినీ కలుపుకుని ప్రధానంగా క్రైస్తవం పైనా, ద్వితీయ ప్రాధాన్యంగా హిందూమతం పేరన చెప్పబడుతున్న నానాధోరణులపైనా దాడికి పూనుకున్నాడు. ఖురాన్‌లోని ప్రత్యక్షరం ఆధునిక విజ్ఞానం కనుగొన్నంతవరకు సరిపోతోందని, ఆధునిక విజ్ఞాన క్షేత్రం కనుగొనని అనంత సమాచారమూ ఖురాన్‌లో ఉందని తెగబుకాయిస్తున్నాడు. అటు క్రైస్తవ పక్షంలోని, ఇటు హైందవ మత పక్షంలోని పేరుపడ్డ వాళ్ళను బహిరంగ వేదికలపైకి ఆహ్వానించి వాళ్ళను నిలదీసి కొందర్ని పడదోస్తున్నాడు కూడాను. అతగానిపై హైందవం పక్షాన తొడగొట్టి నిలిచిన వాళ్ళెవరూ నా దృష్టికిరాలా. అందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. హైందవం అంటే ఇది అంటూ ఒకటి లేనే లేదు గనుకనూ, అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుకు చావడం ఈ దేశ మతాల అంతర్గత సాంప్రదాయమే గనుకనూ, తమను పేరెట్టి పిలిచి తిట్టేదాకా, కొట్టే దాక ప్రక్కవానికేమవుతున్న, మొత్తానికి పుట్టిమునుగుతున్నా పట్టించుకు చావదీమంద. పైగా తన దాకారాకుంటే బాసి సంతోషిస్తుంటుంది కూడా. కనుకనే ఆ జాకీర్‌ నాయక్‌ని గానీ, ఇటు క్రైస్తవ ప్రచారకుల్నిగానీ ఢీ కొనడానికి ఎవ్వరూ, ఎన్నడూ సర్వసన్నద్దంగాసిద్ధం కాలా..

జాకీర్‌నాయక్‌కుగానీ, ఆ తరహా ప్రచారం చేయాలనుకున్న ముస్లిం పక్షీయులకుగానీ, నాస్ధికులతో ఢీకొట్టే పని ప్రధానంకాదు. సరికదా! హిందువులూ వారికి ప్రత్యర్ధులు కారు. ఖచ్చితంగా వారికి ప్రప్రధమ ప్రత్యర్ధులుకు క్రైస్తవులు, యూదులే. 'హిందువులు - ముస్లిములు' యూదులు, క్రైస్తవులు - ముస్లిములు' హిందువులు - క్రైస్తవులు అన్న మూడుగా ఈ పక్షాలను చూస్తే, హిందువులు అటు క్రైస్తవులకుగానీ, ముస్లిములకు గానీ పరపక్షమేగాని, సూటైన శత్రుపక్షంకాదు. ఇంకా చెప్పాలంటే ఆ రెండు పక్షాలకు, (బైబిల్‌, ఖురాన్‌ పక్షాలకు) ఇతరులు మత వ్యాప్తికి అవసరమైన జనాలు కూడా కనుకనే బైబిలు, ఖురాను అన్న రెండు గ్రంథాలు పరస్పరం ఒకరికొకరు శత్రువులు అన్న సూత్రాలను ప్రకటించాయి. హిందువులను పేరు పెట్టి శత్రువులు అని చెప్పలా. విగ్రహారాధకుల్ని మాత్రం నాస్ధికుల క్రింద జమకట్టాయి. విగ్రహారాధకుల్ని హైందవం క్రిందకు చేరే మతాలలోనే కొన్ని ఖండించాయి. ఆర్యసమాజం (వేదమతం) విగ్రహారాధనను ఖండిస్తుంది.

పట్టున్న క్రైస్తవులకు ఈ విషయం తెలుసు. కనుకనే ఇస్లాం పేరున జాకీర్‌ నాయక్‌ లాంటి వాళ్ళ దాడికి, ప్రతి దాడి చేయకుంటే నష్టపోతాం. క్రమంగా పడిపోతాం అనుకుని జాకీర్‌నాయక్‌ వాదనలను త్రిప్పికొట్టాడానికి యుద్ధ ప్రయత్నాలు మొదలెట్టారు.

1) జయశాలి పి.డి సుందరావుగా తనని తానే పిలుచుకుంటూ, తొడగొట్టడాలు, మీసాలు మెలేయడాలు, అతిగా చేసే సుందర్రావుగారు జాకీర్‌ నాయక్‌ వాడెంత, వాడి గురువునే ఓడించుతానంటూ ప్రసంగాలు చేసి సిడి క్యాసెట్లు విడుదల చేశాడు. ఆయన వెంటనడుస్తున్న మందా ఆ మాటలను లోకానికి ఓపికున్నంత వినిపిస్తున్నారు. జాకీర్‌ నాయక్‌ వెంట పడిపోతున్న మందకూ ఆంధ్ర దేశంలో కొదవే లేదు. ఆ మందా, ఈ మందా పూనుకుని, ఆయిద్దరిని ఒకచోట నిలిపి ఎవడో ఒకడు మిగిలేదాక నిలబడకుంటే ఊరుకోమని, ఇద్దరూ ఇద్దర్నీ నిలేయవచ్చు కదా! ఎందుకా పని చేయరో అర్ధంకాదు. పోనీ ఈయనైనా (జయశాలి పి.డి సుందరావుగారైనా) జాకీర్‌ నాయక్‌ని యుద్ధానికి రమ్మని పిలువనంపి యుద్దం చేయవచ్చుగదా! ఆయనైనా ఈయనగారిక్కడ వేస్తున్నరంకెలు విని, యుద్దానికి రావచ్చుకదా! ఈయనిక్కడ గర్జనంటాడు, ఆయనక్కడ గాండ్రిస్తుంటాడు. ఇద్దరూ ఎదురుపడడానికి సిద్దం కాకపోగా, రాడేంటి మీ వాడు యుద్దానికని, తన మంద ముందరుస్తూ ఉంటారు. నిజానికి ఇద్దరిరంకెలూ ఇద్దరికీ వారి అనుచరులు చేరవేసే ఉంటారు.

ఒక్కనిజం చెప్పనా! మతక్షేత్రాలలో వెనకటినుండీ జరుగుతూ వస్తున్న తంతే ఇది. స్ధాయి పరిమాణంలో భేదమే తప్ప సూత్రం మాత్రం నాటి నుండి నేటి దాక ఎవరి గదిలో ఉండి వారు జబ్బలు చరచడమే. ఈ ధోరణిగాక మరో కుటిలపోకడ (ఉత్తర కుమార యుద్ద పద్ధతి) మరికొందరిదిగా ఉంది. ఈ మధ్యనే ఒక కర పత్రం 'తెలుసుకో' అన్న పేరున, ఏప్రియల్‌ 2న కర్నూలులో జాకీర్‌ నాయక్‌ సవాలుకు సమాధానాలు చెప్పబడునంటూ ప్రచురించబడింది.

జెర్రీధామస్‌ గారు, సుధాకర్‌ మొండితోకగారు, జాకీర్‌ నాయక్‌ సవాలుకు సమాధానాలు చెపుతారంటూ ఆ కరపత్రంలో ఉంది. సమాధానాలు ఎవరికి చెపుతారు? ఆ సమాధానాలు సరైనవో కాదో ఎవరు చూస్తారు? ఎవరు తేలుస్తారు?

ఒక వ్యక్తి చెప్పింది సక్రమంగా ఉందో లేదో తేల్చవలసింది అతడు చెప్పిందీ, అంతకంటే కించిత్తు అధికంగా తెలిసున్న విశేషజ్ఞులా? చెప్పిందానికల్లా గంగిరెద్దుల్లా తలలాడిస్తుండే మందనా? ప్రజలే పరీక్షకులూ, నిర్ణేతలూ అనడం ఎంత కపటత్వమో, ఎంత అడ్డగోలుతనమో ఈ సవాలు ప్రతి సవాళ్ళ గాళ్ళకు తెలీదనుకోవడం తప్పు. ఇక్కడైతేనే వాళ్ళ పప్పులుడుకుతై అని వాళ్ళిరువురకూ తెలుసు.

రాజేంద్ర ప్రసాద్‌గారూ! అభౌతికతను కూలంకషంగా విచారించే సందర్భంలో ఆ విచారణలో అనివార్యంగా వీటినీ పట్టి చూడవలసిన అవసరం ఉంది. ఆభౌతికతను శాస్త్రీయ విశ్లేషణ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఎన్నో విషయాలను, ఎన్నో ధోరణులను ఉదహరించుకుంటూ, ఎందరో ప్రచారకుల మాటలనూ ఉటంకించుకుంటూ, వాటిని తాత్విక సూత్రీకరణలతో ముడిపెట్టి వివరించుకుంటూ సాగితేగాని వివిధ అవగాహనా స్ధాయిలలో వుండే పాఠకజనానికి విషయం అర్ధంకాదు.

పూర్తిగా విశేషజ్ఞులున్న సదస్సులోనైతే రెండు మూడు ప్రకటనలతో సూత్ర ప్రాయంగా విషయాన్ని ప్రతిపాదించేయవచ్చు. ఆ చిత్రాన్ని చెపుతాను చూడండి.

భౌతికం అంటే భూతసంబంధమైన అని అర్ధం. 'భూతం' అన్న శబ్దం అనే కార్ధాలలో వాడబడింది. కనుక నిక్కచ్చిగా ఇదే అర్ధం అనడం కుదరదు. ఏ సందర్భంలో, ఏ ప్రకరణ పరంగా వాడబడిందో చూసి, ఆ మాట వాడిన వారు దానిని ఏ అర్ధంలో వాడారో మనమూ ఆ అర్ధాన్నే స్వీకరించి, దాని తప్పొప్పులను విచారించాల్సి ఉంటుంది. భాష ద్వారా మనకందిన భావాలను గ్రహించడానికి ఇంతకంటే మార్గాంతరం (గత్యంతరం) లేదు గాక లేదు.

ఒక భాషానియమముందిక్కడ :- వక్త హృదయమిదేనని నిర్ణయించే అధికారం వ్యాఖ్యాతలకు లేదు. వ్యాఖ్యానాలన్ని వ్యాఖ్యాత, వ్యక్తవ్యానికి తానంగీరిస్తున్న అర్ధమేమిటో చెప్పడమే స్వభావంగా కలిగి ఉంటాయి. వక్త హృదయం ఇదేనని చెప్పగలరోజున అనేక వ్యాఖ్యానాలకు తావుండదు. ఇది నిజమోకాదో తేల్చుకోండి. భౌతికమంటే భూత సంబంధమైన అని అర్ధమనుకున్నాంకదా! భూతములంటే పంచభూతాలుగ చెప్పబడ్డ ఐదూనని ఇక్కడర్ధం. అధవా, నాలుగు భూతాలనైనా అనుకోవచ్చు. ఆ మాటలన్న వాళ్ళు స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు అమంటామన్నారు. సూక్ష్మం అంటే చిన్నది. సూక్ష్మాతి సూక్ష్మం అన్న పదము ఉంది. అణువు అంటే చిన్నది అని. పరమాణువంటే చిన్న వాటిలో చిన్నది (అతి చిన్నది) అని. పంచభూతాలతో కూడినది భౌతికం (ప్రపంచం) వాటి సూక్ష్మ రూపం పరమాణువు. అంటే నిరవయవం అనదగ్గంతచిన్నది అనన్నారు ఆ మాటలన్న వాళ్ళు. అంటే అది ఏక ఖండం, అనేకం కూడింది కాదు. రెండుగా విభజించడానికి వీల్లేనిది. అని నిర్వచించారు. ఐదుగాగాని, నాలుగుగాగాని చెప్పుకుంటున్న భూతాల సూక్ష్మ పరిమాణం ఇక విభజించడానికి వీల్లేనంత చిన్నది అని అన్న వాళ్ళు దానికి పరిమాణం ఉంటుంది అనన్నారు. అంటే స్ధలాన్ని ఆక్రమించుకుంటుంది అది అని. (పరమాణువు కొలతా యిచ్చారు వెనకటి వాళ్ళు, సూర్యరశ్మిలో కనబడే చిన్న ధూళికణంలో అది విభాగం)

మిత్రులారా! ఈ ముక్క మీ కర్ధమై, అది సరైందేనన్న నిర్ణయానికి రాగలిగితేనే అభౌతికాన్ని గురించి విచారించుకోగలం, అర్ధం చేసుకోగలం. కనుక భౌతిక మనడానికి వీలైనదేదైనా స్ధలాన్ని ఆక్రమించి ఉండకతప్పదు. అంటే అలా సూక్ష్మమైన పరిమాణం కలది ఏదైనా- తానున్న స్థలంలో తానున్న కాలంలో మరోదానిని ఉండనీయదన్నమాట.

'తానున్న కాలంలో తానున్న ప్రదేశంలో మరో దానిని ఉండనీయదు.' అన్నది సార్వత్రికనియమం. భౌతికాలనదగ్గవేవైనా ఒకదాని ప్రక్క మరోటి ఉండాల్సిందేగాని, ఏకకాలంలో ఒకే తావున రెండు ఉండవు. ఉండలేవు. దీనినే రెండు భౌతిక పదార్ధాలు అవెంత సూక్ష్మపరిమాణంలో ఉన్నా సంయోగ సంబంధంలో మాత్రమే ఉండగలవు. దేని స్ధలంలో అవి మాత్రమే ఉండగలవు. ఇది విశ్వనియమం అనంటాము. భౌతిక విజ్ఞాన ప్రాతిపదికలలో ఇదీ ఒకటి.

దీనినే స.మండలి తాత్వికంగా 'ఏరెంటి మధ్య నిరోధ వ్యవస్ధ పనిచేస్తుందో ఆ రెండు భౌతికాలే' అని చెపుతోంది. ఈ సందర్భంలో ఆధునిక శాస్త్ర ప్రతిపాదనలనూ ఒకింత స్పృశించడం అవసరం.

ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి సహజంగా పరమాణువులు 92 రకాలున్నట్లు ధృవీకరించింది. వాటినే మూలకాలనంటున్నాం. ప్రయోగశాలలలో మరికొన్ని రకాల పరమాణువులను సృష్టించగలిగారు భౌతిక శాస్త్రజ్ఞులుఈ నాడు ఆ మూలకాలున్నూ పైన చెప్పుకున్న నిరవయవ ద్రవ్యాలు అన్న అర్ధంలో పరమాణువులు కావని తేలింది. పరమాణువు విభజింపబడింది. పరమాణు శకలాలు తొలిథలో మూడున్నట్లు కనుగొనబడింది. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అంటున్నారు వాటిని అనంతర పరిశోధనలు అవీ అత్యంత సూక్ష్మాలు, నిరవయవ ద్రవ్యాలు కాదని ప్రోటాను, న్యూట్రానులన్నవి అనేకం కూడి ఏర్పడినవేనని తేల్చారు. ఎలక్ట్రాను అనేకపు కూడిన అని తేలలేదు గాని, దానిపైనా సందేహముందీనాటి భౌతిక శాస్త్ర క్షేత్ర పరిశోధకులలో. దాన్నలా ఉంచుదాం. పరమాణు శకలాలన్న వాటికంటే చిన్నవీ, పరమాణు శకలాలకూ కారణమైనవీ అనేకం ఈ నాడు కనుగొనబడ్డై.అత్యంత సూక్ష్మకణం ఏమిటి? అన్న దానికి సంబంధించిన అన్వేషణ కొనసాగుతూ ఉందిప్పటికీ.

భౌతిక విజ్ఞాన శాస్త్ర క్షేత్రాలలో పరిచయం ఉన్న వారికి సూక్ష్మ భౌతిక ప్రపంచం దగ్గర కెళ్ళేటప్పటికి, 'కణము - తరంగము', 'పదార్ధము-శక్తి' అన్న పదబంధాలు ఎదురుపడతై. ఆదిమ పదార్ధం అటు కణరూపంలో గాని, ఇటు తరంగ రూపంలోగాని ఉంటుందన్నది ఒకనాటి భౌతిక విజ్ఞానం . కాగా, ఈనాడు అది ఏకకాలంలో రెండు ధర్మాలనూ కలిగి ఉంటుందని తలచబడుతోంది. అలాంటి ఊహాత్మక నిర్ణయానికి రావడానికి తగినన్ని అధారాలు ప్రయోగాల ద్వారా అందాయి. దాంతో శక్తి రూపమైన కాంతికే కణధర్మం ఉందని నిర్ధారణైంది. 'ఇంతకూ మూల పదార్ధమే దన్న విచికిత్స ఆ క్షేత్రంలో కొనసాగుతునే ఉంది.పరిశోధన అక్కడికి చేరేటప్పటికి తార్కికని గమనాల రూపంలో అనేక పరికల్పనలు చోటు చేసుకుంటున్నై.

ఒక్క విషయం అది ఏ క్షేత్రమైనా గానీండి, అక్కడ ప్రకటింపబడుతున్న నిర్ణయాలు తార్కికనిగమనాలై, పరికల్పనల రూపంలో ఉన్నంత కాలం అవింకా అనిర్ధారితాలే (నిర్ధారింపబడని అంశాలే) నని వైజ్ఞానిక క్షేత్రాలు నిర్ధ్యంద్వంగా ప్రకటిస్తాయి, ఏకోన్ముఖంగా అంగీకరిస్తాయి. 'నిర్ధారితం, అనిర్ధారితం' అన్న ప్రకటన శాస్త్రీయంగా చేయాలన్న సందర్భంలో ఇదెంతో కీలకమైన నియమం. దీనిని సదా గుర్తులో ఉంచుకోండి.అర్ధం చేసుకుని, వంట బట్టించుకోండి.

ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతికమని దేనినంటోందో చూద్దాం.

పై చెప్పిన 'పదార్ధము - శక్తి' వాటి ఆకృతులైన, 'కణము - తరంగము' లన్న నాలుగు మాటలచే ఏది సూచింపబడుతోందో దాన్నంతటినీ భౌతికం అంటోంది భౌతిక విజ్ఞాన శాస్త్రం. ఇది నిజమోకాదో తేల్చుకోండిముందు.

ఈ విశ్వంలో విశ్వంగా, విశ్వానికాధారంగా ఉన్న దేదైతే ఉందో అది 'పదార్ధము - శక్తి' అనడానికి వీలైన రూపంలో ఉంటుంది. అదిపుట్టదు. నశించదు. సృష్టించబడదు. నాశనం చేయబడదు. దీనినే భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రాతిపదికలలోనూ ప్రధమ సూత్రంగా చెపుతుంటారు.

'కన్జర్వేషన్‌ ఆఫ్‌ మాస్‌ ఎనర్జీ' శక్తీ పదార్ధ నిత్యత్వ సూత్రం అనంటారు దీనిని.

మేటర్‌ ఆర్‌ ఎనర్జీ, మేటర్‌ ఎనర్జీ, మేటర్‌ అండ్‌ ఎనర్జీ కెన్‌నైదర్‌ బిడ్‌క్రియేటెడ్‌ నార్‌ డిస్ట్రాయిడ్‌. అని పై దాని వివరణ సూత్రం. అంటే పదార్ధంగానీ, శక్తిగానీ సృష్టించబడదు, నశించదు అని.

మిత్రులారా! ఇప్పటికే మీలో చాలా మందికి ఒకింత విసుగు, అసహనం, అసంతృప్తి పుట్టి ఉండవచ్చు. ప్రసాద్‌ అన్నాయన అడిగిందేమిటి? ఈయన శీర్షిక పేరు పెట్టిందేమిటి? ఈ భారతం లేదా సొద, కాదంటే 'నస' ఏమిటి? అన్న దగ్గరకు కొంతమందైనా వచ్చి ఉంటారు. ఏంచేయను. ప్రకరణస్ధ విషయం అలాంటిది. దానిని గనక చెప్పవలసిన రీతిలో, చెప్పవలసినంతా చెప్పకుంటే, అటు రంధ్రాన్వేషణాతత్పరులు, ఇటు ఆయా ధోరణులకు చెంది ఆత్మరక్షణ స్ధితిలోకి నెట్టబడ్డవాళ్ళు బొక్కలెక్కడైనా దొరుకుతాయేమోనని దుర్భిణీలు పెట్టి వెదుకులాడే పని చేస్తారు. లేని బొక్కల్నిగానీ, ఎక్కడైనా ఏర్పడి ఉన్న భాషాపరమైన లొసుగుల్ని గాని, వివరణ పరంగా చోటు చేసుకున్న అసంపూర్తినిగాని అడ్డుపెట్టుకుని, లేదా ఆసరా చేసుకుని తెగ వీరంగమాడే అవకాశముంది. కేవలం అట్టి వారి కొరకేగాక, నిజాయితీగా, జిజ్ఞాసకల విచారణ పరుల కొరకు కూడా ఇంత వివరం అవసరమైంది. ఈ విషయంపై గానీ, వివరాలపైగాని అంత శ్రద్ధ లేనివాళ్ళు కూడా అనవసరపు వ్యాఖ్యల జోలికి పోకుండా వ్యాసాన్ని విడిచి పెట్టేయండి. విషయపరమైన జటిలత, గాఢత ఉన్న సందర్భాలలో ఈ సన్నివేశం ఏర్పరచక తప్పదు మరి. సరే మళ్ళీ విచారణలోకి వద్దాం. వెనక చెప్పిందంతా మరోసారి గుర్తుచేసుకోండి. లేదా తిరిగి చూసుకోండి.

1. భారతీయతాత్విక సాహిత్యం నుండి చూస్తే, భౌతికమంటే,

జగత్తుకాధారమైన మూల భూతాల సూక్ష్మాతి సూక్ష్మస్ధానంగా చెప్పబడ్డ నిరవయవ ద్రవ్యాలైన పరమాణువులు, వాటి సమ్మేళనంతో ఏర్పడ్డ విశ్వం, (జగత్తంటారు దానికే) భౌతికం అనబడుతోంది. ప్రసిద్దిగాభూతాలు ఐదు అన్నది అంగీకరింపబడడంతో పాంచభౌతికం, భౌతిక ప్రపంచం అన్న పదాలు వాడుకలో స్థిరపడ్డాయి.

2) ఆధునిక వైజ్ఞానిక క్షేత్రం చెపుతున్నదానిని బట్టి.,

పదార్ధము - శక్తి (కణము - తరంగము లేదా కణతరంగము) అన్న మాటలచే సూచితమవుతూ విశ్వంగానూ, విశ్వానికి ఆధారంగాను ఉన్న ద్రవ్యాన్ని - భౌతికం అనంటున్నాం. నిజానికి భౌతిక విశ్వం అన్న పదం వైజ్ఞానిక క్షేత్రానికి సంబంధించి నిర్ధుష్ట పదంగా వాడకూడదు. ఎందుకంటే విశ్వానికి భౌతికం అన్నది విశేషణంకాదు. విశ్వం భౌతికమే. అభౌతిక విశ్వం అన్నది భౌతిక విజ్ఞాన శాస్త్రక్షేత్రంలో (నిషిద్దపదం) ఉండదు. నిజానికా పదం భౌతికేతరాన్నంగీనరించే దృక్పధం కల వారి నోటి నుండి రాలిపడిన పదం. ఆ వివరాలు మరోసారి.

గమనిక :- ఈ రెండు ధోరణుల వారి ప్రకారమూ భౌతికానికి ఉనికి ఏర్పడాలంటే స్థలాన్ని ఆక్రమించడం అంటే పరిమాణం కలిగి ఉండడం తప్పనిసరి. దానినే తాత్వికంగా చెప్పుకోవాలంటే భౌతికంగా ఉనికి గల రెండు పదార్ధాల మధ్య నిరోధ వ్యవస్ధ పని చేస్తుంటుంది అని చెపుతాం. అలాంటి రెండూ పరస్పరం సంబంధంలోకి రావాలంటే ప్రక్కప్రక్కన మాత్రమే ఉండగలవు. దానినే సంయోగసంబంధం అనంటారు.

అభౌతికం

పై నియమం వర్తించని పదార్ధం - (పదస్యఅర్ధః కాదిక్కడ) ఏదైన ఉంటే అదిగో దానిననాలి అభౌతికమని. అభౌతికం అంటే భౌతికం కానిది, భౌతికం అనడానికి వీల్లేనిది. భౌతికాల మధ్య పని చేస్తున్న నియమానికి లేదా నియమాలకు లోబడనిది అని అర్ధం.

అర్ధమవుతోందా మిత్రులారా! చాలా జఠిలమైన విషయంలోనూ అత్యంత కీలకమైన స్థానం దగ్గర నిలబడి ఉన్నాం మనం. త్వరపడి ముందుకు పోతే మళ్ళా గందరగోళంలో పడిపోతాం. ఏమాత్రం తొందరపడవద్దు. తొందరేంలేదు. ముందుగా నేనంటున్నదేమిటో పరికించిచూడండి. అర్ధమైందనిపిస్తోందో లేదో చూడండి.ఆపై సబబోకాదో తెలుసుకోండి.

భారతీయ ఆస్థికతాత్విక ధోరణులకు సబంబంధించి కొందరి ప్రకారం మనోబుద్ధి చిత్తాహంకారాల పేరున చెప్పబడుతున్న అంతఃకరణం జడమే. భౌతిక పదార్ధమే. శరీరం పాంచ భౌతికం. అందులో జ్ఞానేంద్రియాలొకింత సూక్షపదార్ధనిర్మితాలు అయినా పంచీకృత పంచభూతాల సమ్మేళనాళే.

ఉదా:- శ్రవణేంద్రియం ఆకాశ భూత ప్రధానమైంది, నేత్రేంద్రియం తేజోభూత ప్రధానమైంది. మనస్సు ఆరోయింద్రియంగా కొందరు, అంతరిద్రియాల్ని రెండని కొందరు, నాలుగని కొందరు విభజించిచెప్పారు. అదొక ధోరణివారి పోకడ కాగా, మరి కొందరు.

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని, అభౌతికాత్మక శరీరాలు లేదా ఒరలు ఐదు అనన్నారు. ఈ ఐదూ భౌతిక పదార్ధాలే. ఈ అయిదింటికీ వేరైన ఆత్మ అభౌతికం.

ఆధునిక మానవ విజ్ఞాన శాస్త్రం కూడా శరీరంలో జరిగే సమస్ధమూ, విద్యుద్రసాయన చర్యాప్రతిచర్యలేనని ఇప్పటికి తెలిసిన దాన్ని బట్టి ప్రకటించింది. ఇటు మెదడుకాని శరీరంలోగాని, అటు మెదడులోగాని జరిగేదంతా ఈ రెండు రకాల చర్యా ప్రతిచర్యలు - వాటి ఫలితరూపాలేనని, అంతకు మించి ఇప్పటి వరకు ఇంకేమీ తెలియబడలేదనీ, చెపుతోంది. దీనిని బట్టి అటు స్థూల సూక్ష్మ విశ్వంలోగానీ, ఇటు ప్రాణుల శరీరాల పరంగాగానీ భౌతిక మనడానికి తగిన ఆధారాలే లభించినై. మరోరకమైన ఆధారాలు లభించలేదు. ఇంత వరకు నేను చెప్పినవి. ఆ రెండు క్షేత్రాలవాళ్ళు చెపుతున్నవా? కాదా? అన్నది ముందుగా నిర్ధారించుకోండి. అటుపైన వాటి సబబు బేసబబుల్ని పట్టిచూడగలిగితే చూడండి.

ఇంత వరకు నేను భౌతికం, అభౌతికం అన్న శబ్దార్దాన్ని, ఆ పదాలను ఉపయోగిస్తున్న పక్షాల వారి క్షేత్రాల నుండే ఆధారాలు చూపుతూ కొంత వరకు వివరించాను. ఇంత వరకు విచారణకు కూర్చున్న వారందరం ఏకాభిప్రాయానికి రాగలిగితేనే అభౌతిక పదార్ధాల ఉనికి అనిర్దారిత మిప్పటికీ, ఎప్పటికీ కూడా అని నేనన్న మాట ఎలాసరైందో గమనించడం కుదురుతుంది.

విశ్వంలో ఉన్న అందులోనూ మనకు ఎదురుపడుతున్న వాటిని గమనించడానికి మనకున్న పరికరాలు, విధానం అన్న వాటితో కూడిన వ్యవస్ధనే ప్రమాణాలు అనంటున్నాం. జ్ఞానేంద్రియాలు - గ్రహణ విధానాలు, కలబోసిన దానినే జ్ఞాన గ్రహణ వ్యవస్ధ అనంటారు. 'మా నాధీనామేయసిద్ధిః' అని జ్ఞానేంద్రియ వ్యవస్ధ యొక్క తీరుతెన్నుల నెరిగిన వారు. (ప్రమాణజ్ఞులు లేదా ప్రమాణ విద్య నెరిగిన వారు అనంటారువీరిని) అంటారు. అంటే ప్రమాణములకులోబడే ప్రమేయాల గురించిన జ్ఞానం కలుగుతుంది లేదా ఆయా విషయాలు తెలియబడుతుంటాయి, అని ప్రమాణాలకు అందని, ప్రమాణాలు పట్టుకోలేని విషయాలు మనకు తెలియబడే అవకాశమేలేదు.

అటు ఆస్ధిక పక్షం వారి ప్రకారమూ, ఇటు ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారమూ కూడా జ్ఞానేంద్రియాలు, మెదడు, దాని చర్య ప్రతి చర్యల రూపంలో అనుభవంలోకి వస్తున్న మనస్సు, లేదా మనోబుద్ది చిత్తాహంకారాలుగ పిలువబడ్డ అంతఃకరణ చతుష్టయము లన్నవి భౌతిక పదార్ధ నిర్మితాలే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అవి అత్యంత సూక్ష్మరూపాలైన పరమాణు శకలాల రూపాలు కావు.అంతకంటెనుస్తూలమైన రసాయన ద్రవ్యాల రూపాలు. కనుక అవి భౌతిక నియమాలకు లోబడి ఉనికిలో ఉన్న వాటిని మాత్రమే పట్టుకోగలవు. ఆ మేరకే మనం నుభూతి చెందగలము. ఈ విషయాన్ని అభౌతిక వాద పక్షపు సిద్ధాంతులూ గమనించారు.

కనుకనే, ఆత్మ అప్రత్యక్షం- అతీంద్రియం, అప్రమేయం, అజ్ఞేయం, అనన్నారు వాళ్ళు. ఆస్ధిక పక్షాలలోని సిద్దాంతాల లోతులు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం సరళంగా, సులభంగా ఉంటుంది. అరకొర జ్ఞానులూ, పుక్కిటి పురాణాల వెంట పరుగెట్టే వాళ్ళతోనే ఉన్న గొడవంతా. సరే.

మనముందున్న అస్సలు గొడవ, భౌతికం అభౌతికాన్ని పట్టివ్వగలదా? భౌతిక రూపాలే అయిన మనోబుద్దులు అభౌతికాన్ని గుర్తించగలవా? అన్నదే. దీనికి నా సమాధానం, విధమెరిగిన వారెవ్వరి సమాధానంగానీ అది అసాధ్యం అనే.

ఆత్మనుచూశాను, ఎరిగాను అనే వాళ్ళంతా సైద్ధాంతికంగా ఆత్మంటే ఏమిటో తెలియనివాళ్ళే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్న వాటిని మాత్రమే ఇంద్రియాలు పట్టివ్వగలవు. ఆత్మ ఈ అయిదూ కాదు. పైగా ఈ అయిదూ లేనిది కూడా ఈ అయిదూ భౌతిక పదార్ధాల గుణాలు లేదా లక్షణాలు మాత్రమే. ఇంతవరకు తెలుసుకనకనే అభౌతికం అతీంద్రియం అనన్నారు వెనకటి వాళ్ళు. గమనిక :- అభౌతికాలు, అతీంద్రీయాలు అన్నవి రెండూ వేరువేరు. భౌతికాలలోనూ అతీంద్రియాలుంటై. అతీంద్రియాలంటే ఇంద్రియ సామర్ధ్యాలకు లోబడనివి, అవతలివి అని అర్ధం. అతిసూక్ష్మమూ, అతివ్యాపకమూ అతీంద్రియాలే.

మరో అంశం చెప్పుకోవాలిక్కడ పరస్పర నిరోధ వ్యవస్థ పని చేయని దగ్గర స్పర్శ అన్నదే సాధ్యపడదు. మనకు తెలిసి స్పర్శ ఏర్పరకుండా మన ఐదు జ్ఞానేంద్రియాలు తాము పట్టుకోగల గుణాలను పట్టుకోలేవు. ఏ గుణమైనా అది ఉన్న ద్రవ్యాన్ని విడిచి ఉండలేదు. రాలేదు కూడా. 'గుణ గుణినో సంబందః సమ వాయః' అన్నది నియమం. నిత్య సంబంధ సమవాయః అని ఆ సంబంధ వివరం. అంటే గుణం గుణిని విడిచి ఉండదు అని పై అయిదు గుణాలు, భౌతిక ద్రవ్యాలలో ఉండేటివే. అభౌతికానికి, భౌతికానికి సంబంధం చెప్పాలంటే అభౌతికమూ స్థలాంన్నీక్రమించిదైతే సంయోగం అని చెప్పాలి. అలా ఆస్ధిక శాస్త్రాలలో చెప్పబడలా. ఆ రెంటీకీ 'వ్యాప్యవ్యాపక సంబంధం' అని చెప్పబడింది. అంటే ఈ సందర్భంలో, భౌతిక ద్రవ్యం ఉన్న చోటునే అభౌతిక ద్రవ్యమైన ఆత్మావ్యాపించి ఉంది అని. చెప్పావు సరేనయ్యా నీకది ఏ ప్రమాణం ద్వారా తెలిసింది. అని ఆ మాటన్నవారికి నా మలి ప్రశ్న. అతీంద్రియమన్నావుగనుక ప్రత్యక్షంకాదు. ప్రత్యక్ష పూర్వకం కాని అనుమానం లేదు. ఆత్మకు హేతుదృస్టాంత వర్జితం' అన్న విశేషలక్షణం చెప్పబడింది. అంటే హేతువూ లేదు. ఉదాహరణమూ లేధని దానర్ధం. ఏ ప్రతిజ్ఞ హేతుదృష్టాంత వర్జితమో అది అతార్కికం కనుక అనుమాన ప్రమాణాంతర్గతం కాజాలదు. ఈ విషయమూ ఆస్ధిక వేత్తలలో కొందరికి తెలుసు. కనుకనే ఏ విషయాలు ప్రత్యక్షానుమానాల వల్ల తెలియబడవో అట్టి వాటిని తెలియడానికి వేద- శాస్త్ర -వాక్యమే ఆధారం అనన్నారువాళ్ళు.

కనుకనే వేదాన్నిగాని, బైబిల్‌నుగానీ, ఖురాన్‌నుగాని ప్రశ్నించే అవకాశం లేదు అభౌతికాల విషయంలో అవి చెప్పినట్లు విశ్వసించడం, (తెలియబడకున్నా అవి ఉన్నాయని అంగీకరించడాన్నే ఇక్కడ విశ్వసించడం అనంటున్నాం) వినా మార్గం లేదని అవే చెపుతున్నాయి. వాటిని ప్రశ్నించకూడదని ఆ మూడూ అంటున్నాయి.

యోచనాశీలురైన పాఠక మిత్రులకు, ఈ వ్యాసానికి కారకులైన రాజేంద్ర ప్రసాద్‌గారికి,

1) మన జ్ఞానేంద్రయాలు - మెదడూ భౌతిక పదార్ధనిర్మితాలే.(ప్రాచీనులూ- ఆధునికులూ దీనినంగీకరించారు.)

2) అభౌతికాన్ని భౌతిక పరికరాలు పట్టివ్వలేవు.(ఈ మాటా ఇరువురూ అంగీకరించిందే.)

3) అభౌతికం భౌతికంతో నిరోధ వ్యవస్ధకులోబడదు.

4) వివిధాస్ధిక పంధావాళ్ళు దేవుని ఉనికిని, అతని సృష్టికర్తుత్వాన్ని, విశ్వసించడం తప్పమార్గంలేదన్నారు.

కనుకనే అభౌతిక పదార్ధపు ఉనికి ఇప్పటికీ అనిర్ధారితమే. దానికి ఆ పక్షం వాళ్ళిచ్చిన అర్ధాన్ని బట్టే అది ఎప్పటికీ అనిర్ధారితం కూడా. దాని ఉనికిని నిర్ధారించగల సాధన సంపత్తి మనకు లేదు.

నా ఈ వాదనను కాదన దలచుకున్న వాళ్ళుంటే నాతో (మాతో) సంప్రదించవచ్చు.

ఆయా ఆస్ధిక పక్షాలలో ఉండి తెగ వదరుతుండేవాళ్ళకు, ఆయా గ్రంథాల నుండి వాక్యాలను ఉట్టంకిస్తుండే వాళ్ళకు, వాళ్ళే మాత్రమైనా ఆలోచించగలిగితే నేను చెప్పగలిగిన మాటలు నాలుగున్నాయి.

1) బైబిలు, ఖురాను, వేదం లేదా మరే ఆస్ధిక గ్రంథమైనా అభౌతికాన్ని గురించి చెప్పినప్పుడు, ఆ గ్రంధం చెప్పింది సరైందేనని నీకెలా తెలిసింది? అని ఆ పక్షం వాళ్లనడిగినప్పుడు, మళ్ళా అదే గ్రంథంలోని మాటలో, మరో గ్రంథంలోని మాటనో ఉటంకించనేకూడదు.

వాదనియమాలననుసరించి అట్టి ఆధారం 'సాధ్యసమహేత్వాభాస' అవుతుంది. ఉదా :- వేదంలోని ఒక ప్రకటన సరైనదేనని ఎలా చెప్పగలవు అని అడిగితే ఖురాన్‌లోనూ చెప్పబడి ఉంది కనుక అనడమన్న మాట అది. వేదవాక్యం ఎలా సత్యమని అడిగిన వాళ్ళం, ఖురాన్‌ వాక్యమెలా సత్యమో చెప్పమని అడిగినట్లేకదా. గ్రంథవాక్యం సరైందా కాదా అన్నడు సరైందనడానికి గ్రంథవాక్యాన్నే ఆధారం అనరాదు.

'అప్పీల్‌టు అధారిటీ ఈజ్‌ఎ ఫ్యాలసీ' అంటున్నది పాశ్చాత్య తర్క శాస్త్రం కూడా. ఒక వాక్యం తప్పో ఒప్పో నిర్ణయించడానికి మరో వాక్యాన్ని ఆధారమనడం తప్పుడు విధానము. ఈ నియమం అర్థంకానోళ్ళు శాస్త్రమేది, అశాస్త్రమేది అన్నది నిర్ధారించలేరు.

ఈనాటి జాకీర్‌ నాయక్‌ కానీ, జయశాలి పి.డి. సుందరరావుగాని, సుధాకర్‌ మొండితోక గాని మరొకరు మరొకరు గాని అదరగండంగా మాట్లాడేదంతా ఇదే వరస క్రిందికి వస్తుంది. పైగా ఆరకం అడ్డగోలు వాదానికి తోడు పామర జనుల చెంత ఆధునిక విజ్ఞాన శాస్త్ర వాక్యాలు వల్లించడం వారి వంచనా వృత్తికి తార్కాణం.

మొత్తం మీదనేనేమి చెప్పినట్లు, మానవ మాత్రులమెవరం గానీ, మనకున్న భౌతిక పరికరాలతో అభౌతికపదార్ధపు ఉనికిని కనుగొనలేము. కనుకనే అభౌతిక పదార్ధపు ఉనికి అనిర్ధారితం.

దీనిపై ఎవరు గాని అసందర్భంకాని రీతిలో స్పందించవచ్చు. సత్యాన్వేషణలో

మీ సురేంద్ర.

ఇక వాస్తు జ్యోతిషాలకు సంబంధించి అభౌతిక శక్తుల ప్రస్తావన ఏమిటన్నదీ కొంత తడిమిచూస్తే మీకూతృప్తిగా ఉంటుంది. అటు వాస్తు, జ్యోతిష పక్షాలకూ, ఆలోచించుకోడానికి వీలవుతుంది.

జు వాస్తు శాస్త్రాలలోకి వెళితే ఎదురుపడే అభౌతిక శక్తులు.

1) అష్టదిక్పాలకులు - ఇంద్రాగ్ని యమనిరుత వరుణ వాయు కుబేర ఈశానులు

2) నవ గ్రహాధిపతులు - సూర్యచంద్ర బుధకుజ గురు శుక్ర శని రాహు కేతువులు

3) వాస్తు పురుషాంగ దేవతలు

గమనిక : ఈ మూడు విభాగాలకు చెందిన దేవతలు రాక్షసులు కలిపి మొత్తం సుమారు 40 మంది ఉంటారు. వీరు ఆయా స్ధానాలకు అభిమాన, వ్యతిరేక శక్తులుగ ఉంటారు.

ఔ జ్యోతి శాస్త్రంలో ఎదురయ్యే అభౌతిక శక్తులు

1) నవ గ్రహాలు

2) నక్షత్రాల అధిదేవతలు

గమనిక:- సాంప్రదాయక వాస్తు పక్షంలోనే జ్యోతిషం ప్రధానంగా చూడబడే వాస్తు. జ్యోతిష్యం అ ప్రధానంగా చూడబడే వాస్తు అన్న రెండు వైఖరులున్నాయి. అయినా ఏదో రూపంలో అధి దేవతల ప్రస్తావన, ప్రమేయం ఉందనే వారంతా అంగీకరిస్తారు. మధుర వారి ప్రకారం జాతకాన్ననురించే వాస్తు ప్రాప్తిస్తుంది కూడాను. కనుక వారి వాస్తు జ్యోతిషాధారితమైనది.

3) వాస్తు జ్యోతిషంతో పనిలేనిదనే వాళ్ళలో గౌరు తిరుపతిరెడ్డిగారు ముందు చెప్పుకోవలసివారు.

అయితే ఆయన తాను హేతువాదినని, జ్యోతిషాదులు మూఢనమ్మకాలని, ఉన్నది పంచభూతాలేనని అంటారు.

ఇక్కడ నా ప్రశ్నమంటే పంచభూతాలన్నవి భౌతిక పదార్ధాలు. జడాలు. వాటికి దృష్టిగాని, ఇష్టాయిష్టాలు గానీ ఉండనే ఉండవు. మరలాంటపుడు ఈ శాన్య పెరిగితే ఈ మేలు, ఖాళీ ఉంటే ఈ మేలు అంటూ కలిగించే దెవరు? పంచభూతాలకు చేతన లేదా అభౌతిక అధిదేవతలు, అగ్ని, వాయువు, వరుణుడు వగైరాలూ నిరుతి, యముడు, ఇంద్రుడు, ఈశుడు అనబడే వాళ్ళు ఉన్నారాలేదా? అన్నది ఆయనే తేల్చి చెప్పాలి. వారున్నారంటే వారి ఉనికిని ఎలా కనుగొన్నారో, నిర్ధారించగలరో రుజువు పరచాలి.

ఈ మేరకు జ్యోతిష్‌ శాస్త్ర పక్షం వాళ్ళు, జ్యోతిర్వాస్తుపక్షం వాళ్ళూ, వాస్తు పక్షం వాళ్ళు, వాళ్ళంగీకరిస్తున్న అభౌతిక శక్తులేమిటో విస్పష్టంగా పేర్కొని, వాటి ఉనికిని నిర్ధారించే లానోవారే తేల్చి చెప్పాలి. అనవసరపు రగడలకు తెరతీయకుండా శాస్త్రీయ విచారణకు సత్యస్ధాపనోద్దతిన సిద్దపడడం వివేకవంతం. నా అవగాహన ప్రకారం పంచభూతాలు అన్న భావనే దోషదూషితం. అట్టి మూలభూతాలు లోకంలో లేనేలేవని చెప్పవచ్చు. నాలుగు మాత్రం, మూల భూతాలు కాకుండా, మూడు సంయోగ ద్రవ్యాలుగ, ఒకటి శక్తి రూపంగా మనకీనాడు ప్రయోగాత్మకంగా తెలుసు. ఇక అట్టి వాటి అధిదేవతల మాటా వారికే తెలిసిన దేవునికే తెలియాలి.

మరో మారు, నిర్ధారణలకు సిద్దంకండని అన్ని పక్షాలకు సత్యాన్వేషణాతత్పరతతో అఅఅరాజ్యాంగవిజ్ఞప్తి చేస్తున్నాను. ఉంటాను సెలవ్‌.

రాజ్యాంగపు ముసాయిదా పూర్తి చేసి రాజ్యాంగ శాసనసభ ముందుంచినపుడు

25-11-1949 న డా.బి.ఆర్‌. అంబేద్కరు ఇచ్చిన ఉపన్యాసం

ఆర్యా! రాజ్యాంగ సభ పనిని వెనక్కి వెళ్ళి చూస్తే, అది మొదటిసారి సమావేశమయిన 9 డిశంబరు 1946 నుండి ఇప్పటికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులయ్యాయి. ఈ కాలంలో రాజ్యాంగ సభ మొత్తం విూద 11 సమావేశాలు నిర్వహించింది. ఈ 11 సమావేశాల్లో, మొదటి 6 సమావేశాలు ''లక్ష్యాల'' పై తీర్మానం చేయడానికి, ప్రాథమిక హక్కులపై కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడానికి, కేంద్ర రాజ్యాంగమూ, దాని అధికారాలూ, రాష్ట్రాల రాజ్యాంగమూ, మైనార్టీలు, షెడ్యూల్డు, ఏరియాలు, షెడ్యూల్డు తెగలు పై తీర్మానాలు చేయడానికి వినియోగమయ్యాయి. 7 నుండి 11వ సమావేశాలు వరకు రాజ్యాంగ ముసాయిదాను పరిశీలించడానికి వినియోగింపబడ్డాయి. రాజ్యాంగ సభ ఈ 11 సమావేశాలకు 165 రోజులు వాడుకొంది. వీటిలో సభ రాజ్యాంగ ముసాయిదా పరిశీలనకు 114 రోజులు ఉపయోగించింది.

ఇక ముసాయిదా కమిటీ విషయానికి వద్దాం. 29 ఆగస్టు 1947న రాజ్యాంగ సభవారిచే ఇది ఎన్నుకోబడింది. ఈ కమిటీ 30 ఆగస్టున తన మొదటి సమావేశం జరుపుకొంది. 30 ఆగస్టు నుండి ఇది 141 రోజులు సమావేశమయింది. ఈ సమయంలో రాజ్యాంగ ముసాయిదా తయారీలో ఇది నిమగ్నమయింది. రాజ్యాంగ సలహాదారు తయారు చేసిన రాజ్యాంగ ముసాయిదా, ముసాయిదా కమిటీకి ఒక పాఠంలా అందజేయబడింది. ఇందులో 243 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు ఉన్నాయి. వీటిపై ముసాయిదా కమిటీ పనిచేయాలి. ముసాయిదా కమిటీ తయారుచేసి సభకు ఇచ్చిన మొదటి రాజ్యాంగ ముసాయిదాలో 315 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌ ఉన్నాయి. దీని పరిశీలన సమయం ముగిసిన తరువాత రాజ్యాంగ ముసాయిదాలో ఆర్టికల్సు 386కు పెరిగాయి. దీని తుది రూపంలో రాజ్యాంగ ముసాయిదాలో 395 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు చోటు చేసికొన్నాయి. ఈ రాజ్యాంగం ముసాయిదాకు వచ్చిన సవరణల సంఖ్య దాదాపుగా 7635. వీటిలో సభలో ప్రవేశపెట్టబడిన సవరణల మొత్తం సంఖ్య 2473.

ఈ వాస్తవాలు నేను ఎందుకు చెపుతున్నానంటే ఒక సందర్భంలో తన పని పూర్తి చేయడానికి సభ చాలాకాలం తీసుకుంటూ వుంది అని ఆరోపించారు. ఇది చాలా తీరకగా పని చేస్తూ వుందనీ, ప్రజాధనం దుబారా చేస్తూ వుందని ఆరోపించారు. రోము నగరం తగలబడిపోతుండగా నీరో పిడేలు వాయిస్తూ కాలంగడుపుతున్నట్లుగా వుందని ఆరోపించారు. ఈ పిర్యాదు న్యాయమైనదేనా? ఇతర దేశాల్లో రాజ్యాంగ సభలు తమ రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ఎంతకాలం తీసికొన్నదీ గమనించాలి. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. అమెరికన్‌ కన్‌వెన్‌షన్‌ 25 మే 1787 సమావేశమయింది. 17 సెప్టెంబరు 1787 అంటే నాలుగు నెలల్లో తన పని పూర్తి చేసింది. కెనడా దేశపు రాజ్యాంగ సభ 10 అక్టోబరు 1864న సమావేశమయింది. రాజ్యాంగం, 1867 మార్చి నెలలో చట్టం ఆమోదింపబడింది. 2 సంవత్సరాల 5 నెలలు పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగ సభ 1891 మార్చి నెలలో సమావేశమయింది. రాజ్యాంగం 9 జూలై 1900న చట్టంగా ఆమోదించబడింది. 9 సంవత్సరాలు పట్టింది. దక్షణాఫ్రికా 1908 అక్టోబరులో సమావేశమైనది. రాజ్యాంగం 20 సెప్టెంబరు 1909న చట్టమయింది. ఒక సంవత్సరం పట్టింది. అమెరికన్‌, దక్షిణాఫ్రికను సభలకంటే, మేము ఎక్కువ సమయం తీసికొన్నమాట నిజమే. కాని కెనడా సభవారికంటే ఎక్కువ సమయం తీసికోలేదు. ఆస్ట్రేలియా సభకంటే చాలా తక్కువ సమయం తీసుకొన్నాము. పట్టిన సమయాలపోలిక చేసేటప్పుడు, రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి : అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రాజ్యాంగాలు, మన రాజ్యాంగం కంటే చాలి చిన్నవి. మన రాజ్యాంగంలో, నేను ముందుగా చెప్పినట్లుగా 395 ఆర్టికల్సు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగంలో 7 ఆర్టికల్సు మాత్రమే. వీనిలో మొదటి నాలుగింటిని విభాగాలుగా చేసారు. ఈ విభాగాలు సంఖ్య 21. కెనడా రాజ్యాంగంలో 147, ఆస్ట్రేలియా దానిలో 128, దక్షిణాఫ్రికా దానిలో 153 విభాగాలు ఉన్నాయి. రెండవది : అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రాజ్యాంగ నిర్మాతలకు సవరణల సమస్య లేదు. ప్రవేశపెట్టిన వెంటనే ఆమోదింపబడ్డాయి. ఈ రాజ్యాంగ సభ 2473 సంవరణలతో వ్యవహరించవలసి వచ్చింది. ఈ వాస్తవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొంటే - కాలయాపన అనే ఆరోపణ పూర్తి ఆధారరహితం అనిపించకపోదు. ఇంత తక్కువ సమయంలో ఇంత బృహత్కార్యాన్ని పూర్తి చేసినందుకు ఈ సభ తనను తాను అభినందించుకోవచ్చు.

ముసాయిదా కమిటీ చేసిన పని విశిష్టతను గమనిద్దాం. నజీరుద్దీన్‌ అహ్మద్‌ గారు దీనిని సమూలంగా ఖండించడమే తన విధిగా భావించారు. ఆయన అభిప్రాయంలో ముసాయిదా కమిటీ చేసిన పని మెచ్చుకోదగినది కాదు. పైగా అందుకు చాలా దిగువుగా ఉంది. ముసాయిదా కమిటీ చేసిన పని గురించి ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగివుండే హక్కు వుంది. నజీరుద్దీన్‌ గారు కూడా తన అభిప్రాయం కలిగి వుండడం ఆహ్వానించదగిందే. నజీర్‌ అహ్మద్‌ గారు, ముసాయిదా కమిటీలోని ఇతర సభ్యుల కంటే తనే ఎక్కువ తెలివితేటలు కలవానినని భావిస్తారు. ఆయన భావాన్ని ముసాయిదా కమిటీ సవాలు చేయడానికి ఇష్టపడడం లేదు. రాజ్యాంగ సభ ఆయనను ఈ కమిటీకి తగినవాడని నియమించినపుడు, ముసాయిదా కమిటీ ఆయనను తమ మధ్యకు స్వాగతించి తీరుతుంది. రాజ్యాంగ నిర్మాణంలో తనకు స్థానం లేదంటే - అది ముసాయిదా కమిటీ తప్పుకాదు.

సశేషము

గమనిక: సత్యాన్వేషణమండలి త్రైమాసిక సమావేశములు మండలి కేంద్ర కార్యాలయమైన ద్వారకుంటలో ఈ నెల 16,17 తేదీలలో జరుగును. కనుక మండలి సభ్యులు ఆ సమావేశమునకు హాజరుకావలసిందిగా కోరుచున్నాము.










నజీరుద్దీన్‌ అహ్మద్‌గారు, ముసాయిదా కమిటీ పట్ల తన అసహ్యాన్ని చూపించడం కోసం, దీనికొక కొత్తపేరు పెట్టారు. డ్రాఫ్టింగు కమిటీకి బదులు డ్రిప్టింగు కమిటీ అన్నారు. ఈ ఆక్షేపణతో ఆయన నిస్సందేహంగా ఆనందించి వుండాలి. అదుపు లేక కొట్టుకుపోవడానికి, అదుపుతో కొట్టుకుపోవడానికీ తేడా వున్నట్లు ఆయనకు సరిగా తెలిసివుండదు. (ఈజీరితీశి అంటే ప్రవాహానికి కొట్టుకుపోవడం) ముసాయిదా కమిటీ కొట్టుకుపోయినట్లయితే దానికి పరిస్థితులపై అదుపు లేక కాదు. చేపను పట్టే అదృష్టానికి, సాధారణంగా గేలం వేయడం లాంటిది కాదు ఇది. మనం వెదికే చేపను పట్టడం కోసం, మనకు పరిచితమయిన నీళ్ళలో పరిశోధించడంం వంటిది. నజీరుద్దీన్‌ అహ్మద్‌గారు ముసాయిదా కమిటీకి ఇదొక ప్రశంసగా ఇవ్వనప్పటికీ - ముసాయిదా కమిటీకి ఇదొక ప్రశంసంగా స్వీకరిస్తున్నాను. సవరణలను వెనక్కి తీసి వేయడంలో ధైర్యాన్ని నిజాయితీని చూపించి ఉండకపోతే, ముసాయిదా కమిటీ, లేనిపోని వ్యర్థ అభిమానానికి కర్తవ్య వైఫల్యానికి లోనయివుండేది. తనకు ఉత్తమమనిపించినవి తప్ప లోపభూయీష్టమైనవీ. పునరుక్తులుగా వచ్చినవి వెనక్కి తీయించింది. ఇది పొరబాటు అంటే - ఇటువంటి పొరబాట్లు చేయడానికి ముసాయిదా కమిటీ సిగ్గుపడదనీ - వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళుతుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.

ముసాయిదా కమిటీ చేసినపని, ఒకే ఒక రాజ్యాంగ సభ సభ్యుడు మనిహా, అందరూ ఏకగ్రీవంగా సంతృప్తి ప్రకటించారు. ఇందుకు ఆనందిస్తున్నాను. ఇంత మంచి మాటలతో తన సేవలకు తక్షణ గుర్తింపు లభించినందుకు ముసాయిదా కమిటీ వారు సంతోషపడుతున్నారని నమ్ముతున్నాను. ముసాయిదా కమిటీలోని నా సహచరలూ, రాజ్యాంగ సభలోని సభ్యూలూ నా పై కురిపించిన ప్రశంసల వర్షానికి, నేను ఉప్పొంగిపోతున్నాను. వీరికి కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు. ఎస్‌.సి.ల ప్రయోజనాలను కాపాడాలని తప్ప మరే పెద్ద ఆశతోనూ, నేను రాజ్యాంగ సభలోనికి రాలేదు. ఇంత బాధ్యతాయుతమైన పనిని నాకు అప్పగిస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. రాజ్యాంగ సభ నన్ను ముసాయిదా కమిటీకి ఎన్నుకొన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ముసాయిదా కమిటీ నన్ను అధ్యకక్షునిగా ఎన్నుకొన్నప్పుడు మరీ ఆశ్చర్యం కలిగింది. ముసాయిదా కమిటీలో నా మిత్రుడు సర్‌ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్‌ గారితో, నా కంటే పెద్దలూ, శ్రేష్ఠులూ, సమర్ధులూ ఉన్నారు. నాపై ఇంత పెద్ద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి నన్ను తమ పనిముట్టుగా ఎన్నుకొని, దేశానికి సేవ చేసే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, రాజ్యాంగ సభ, ముసాయిదా కమిటీ వారికి నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను, (హర్షధ్వానాలు)

నాకిచ్చిన గౌరవం నిజానికి నాకు చెందదు. ఈ గౌరవంలో కొంత సర్‌. బి.ఎన్‌.రావు గారిది. వీరు రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా పని చేసారు. ముసాయిదా కమిటీ పరిశీలనకు వీరు ఒక రాజ్యాంగపు చిత్తుప్రతిని తయారు చేసారు. మిగిలిన గౌరవం ముసాయిదా కమిటీ సభ్యులకు చెందాలి. లోగడ నేను చెప్పినట్లుగా, ఈ సభ్యులు 141 రోజులు సమావేశమయ్యారు. కొత్త సూత్రాలను రూపొందించే బుద్ధి కుశలత వారికి లేకపోయినా, వివిధ అభిప్రాయాలను సహనంతో ప్రోదిచేసే శక్తి లేకపోయినా, రాజ్యాంగ నిర్మాణ బాధ్యత ఇంత విజయవంతంగా ముగింపుకు వచ్చేదికాదు. ఈ రాజ్యాంగానికి ముఖ్య లేఖరి ఎన్‌.ఎన్‌. ముఖర్జీ గారి, ఈ గౌరవంలో ఎక్కువ భాగం చెందుతుంది. చాలా క్లిష్టమైన ప్రతిపాదనలను, అది సులభంగా, అతి స్పష్టమైన చట్టరూపంలో పెట్టే ఆయన శక్తి అసమానమైనది. ఆయనలో కష్టపడే గుణం కూడా అసమానమైనదే. ఆయన రాజ్యాంగ సభకు పెన్నిధి వంటివాడు. ఆయన సహాయం లేకపోతే రాజ్యాంగ సభ రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడానికి ఇంకా ఎన్నో ఏళ్ళు తీసికొనేది. ముఖర్జీ గారి చేతికింద పని చేసే సిబ్బందిని పేర్కొనకుండా వుండలేను. వారు ఎంత కష్టపడి పనిచేసారో నాకు తెలుసు. ఒకోసారి అర్ధరాత్రి తరువాత కూడా పని చేస్తూనే వుండేవారు. వారి కృషికీ, వారి సహకారానికీ, వారందరికీ ధన్యవాదాలు చెపుతున్నాను. (హర్షధ్వానాలు)

రాజ్యాంగ సభ రకరకాల మనుషుల గుంపుగా, సిమ్మెంటు చేయబడని రాళ్ల పేవ్‌మెంటుగా, ఇక్కడొక నల్లరాయి. అక్కడొక తెల్లరాయిగా ఉన్నట్లయితే ఈ ముసాయిదా కమిటీ బాధ్యత చాలా కష్టసాధ్యమైవుండేది. ఇందులో ప్రతి సభ్యుడే లేదా ప్రతి గ్రూపూ తమ కోసం తమకొక చట్టం అంటే ఇది కష్టసాధ్యమే కాదు. అసాధ్యం కూడా. గందరగోళం తప్ప మరేమీ జరిగివుండేది కాదు. రాజ్యాంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ వలననే ముసాయిదా కమిటీ, కో ఆర్టికలుకూ, సవరణకు ఏం జరుగుతుందో తెలిసికూడా, రాజ్యాంగాన్ని సభలో నెగ్గించగలిగింది. సభలో ఈ రాజ్యాంగ ప్రతి సవ్యంగా నెగ్గుకురావడానికి, ఘనత అంతా కాంగ్రెసు పార్టీదే.

సభ్యులందరూ పార్టీ క్రమశిక్షణా పగ్గాలకు లొంగి వుంటే రాజ్యాంగ సభలో చర్చలన్నీ చాలా చప్పగా, పేలవంగా జరిగి వుండేవి. పార్టీ క్రమశిక్షణ, ఈ సభను నిర్దయగా తాచేదార్లకూటమిగా మార్చివుండేది. అదృష్టవశాత్తూ కొందరు తిరుగుబాటుదారులున్నారు. వారు కామత్‌ గారు, డా. పి.ఎస్‌.దేశ్‌ముఖ్‌గారు, సిధ్వాగారు, ప్రొ. సక్సేనా గారు మరియు పండిట్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవగార్లు. వీరితో పాటుగా నేను ప్రొ.కె.టి.షా గారిని మరియు పండిట్‌ హృదయనాథ్‌ కుంజ్రు గారిని పేర్కోనితీరాలి. వారు లేవనెత్తిన అంశాలు చాలా వరకు సిద్ధాంతపరమైనవి. వారి సలహాలను నేను ఒప్పుకోనంత మాత్రాన వాటి విలువ తగ్గదు. సభా కార్యక్రమాన్ని జీవవంతం చేయడంలో వారిసేవ ఏ మాత్రం తక్కువ కాదు. వారికి నేను కృతజ్ఞణ్ణే. ఏ సూత్రాల పై రాజ్యాంగం ఆధారపడివుందో - వాటిని వారికి వివరించే అవకాశం నాకు లేకుండాపోయింది. ఈ రాజ్యాంగాన్ని పాస్‌ చేయించడం లాంటి యాంత్రిక కార్యం కంటే ఇది చాలా ముఖ్యం.

అధ్యక్షా! ఈ సభ కార్యకలాపాలను నిర్వహించిన తీరునకు చివరగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సభా సభ్యుల పట్ల మీరు చూపించిన సౌజన్యము, మర్యాదా, ఈ సభా కార్యకలాపాల్లో పాలుపంచుకొన్నవారెవరూ మర్చిపోలేరు. ముసాయిదా కమిటీ సవరణలు పూర్తిగా సాంకేతికపరంగా ఉన్నాయని వాటిని త్రోసిపుచ్చాలనే సందర్భాలు ఏర్పడ్డాయి. అవి నాకు చాలా ఆందోళన కలిగించిన సమయాలు. రాజ్యాంగ నిర్మాణ కార్యాన్ని న్యాయ సాంకేతికత ఓడించకుండా చూసినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

రాజ్యాంగాన్ని ఎంత ఎక్కువగా సమర్ధించవచ్చునో అంత ఎక్కువగా నా మిత్రులు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యరుగారు టి.టి. కృష్ణమాచారి గారు సమర్ధించారు. కాబట్టి, ఈ రాజ్యాంగ యోగ్యతల గురించి నేను మాట్లాడను. ఎందుచేతనంటే నాకొకటి అనిపిస్తుంది. ''రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్ళయితే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం; రాజ్యాంగం ఎంత చెడ్డదయినా దానిని అమలుపరిచే వాళ్ళు మంచివాళ్ళయితే - అది మంచిదవడం కూడా అంతే ఖాయం''. రాజ్యాంగం పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపం పై మాత్రమే ఆధారపడి వుండదు. రాజ్యాంగం దేశానికి శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలను మాత్రమే అందించగలదు. ఈ మూడు శాఖలు, ప్రజలపైనా, వారు ఏర్పాటు చేసికొన్న రాజకీయ పార్టీలపైన ఆధారపడి పనిచేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజల కోరికలకు, వారి రాజకీయాలకు పనిముట్లుగా వుంటాయి. భారత ప్రజలూ, వారి పార్టీలు ఎలా నడుచుకొంటాయో ఎవరు చెప్పగలరు? అవి తమ ఆశయాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలను అనుసరిస్తాయా? లేదా వాటిని సాధించుకోవడానికి విప్లవ విధానాలను అనుసరిస్తాయా? వారు విప్లవ విధానాలను అనుసరిస్తే - రాజ్యాంగం ఎంత మంచిదయినా - ఇది విఫలమయిపోతుందని చెప్పడానికి ఏ జ్యోతిష్కుడు అవసరం లేదు. ప్రజలూ, వారి పార్టీలు ముందు ముందు ఎటువంటి పాత్ర పోషిస్తాయో తెలియకుండా, రాజ్యాంగం పై తీర్పు చెప్పడం వృధా.

ఈ రాజ్యాంగానికి ఖండన ముఖ్యంగా రెండు స్ధానాల నుండి వచ్చింది. ఒకటి కమ్యూనిస్టు పార్టీ. రెండు సోషలిస్టు పార్టీ. వారు ఎందుకు రాజ్యాంగాన్ని ఖండిస్తున్నారు? ఇది నిజంగా చెడ్డ రాజ్యాంగమైనందువల్లనా? ''అందుకు కాదు'' అని చెప్పడానికి సాహసిస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీ వారు కార్మిక నియంతృత్వ సిద్ధాంతం పై ఆధారపడిన రాజ్యాంగం కావాలంటున్నారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పై ఆధారపడిన రాజ్యాంగం వారు కోరుకునేది. వారు అధికారంలోకి వస్తే ప్రయివేటు ఆస్తులన్నింటిని పరిహారం చెల్లంచకుండా, సంఘపరం కాని, జాతీయం కాని చేసే స్వేచ్ఛ, రాజ్యాంగం వారికివ్వాలి. వారి రెండో కోరిక రాఆజ్యంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా వుండాలి. వాటి పై ఏ విధమైన పరిమితులూ ఉండరాదు. అలావుంటే - ఒకవేళ వారు అధికారంలోకి రాకపోతే - వారు అంతులేని స్వేచ్ఛ కలిగివుంటారు, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే కాదు, దానిని తిరగబెట్టడానికి కూడా.

ఈ ముఖ్య కారణాలతోనే రాజ్యాంగ ఖండన జరుగుతూ వుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతమే రాజకీయ ప్రజాస్వామ్యానికి ఒకే ఒక ఆదర్శమని నేను చెప్పడం లేదు. పరిహారం లేకుండా ప్రయివేటు ఆస్తులకు స్వాధీనం చేసుకోకూడదు అనే సూత్రం చాలా పవిత్రమైనదనీ - ఈ సూత్రాన్ని ఉల్లంఘించకూడదని నేను చెప్పడం లేదు. ప్రాథమిక హక్కులు ఎప్పుడూ పరిపూర్ణంగా వుండవనీ - వాటి పై పరిమితులు ఎప్పుడూ ఎత్తివేయబడవనీ - నేను చెప్పడం లేదు. నేను చెప్పదలచుకొన్నదేమిటంటే - రాజ్యాంగంలో పొందుపరచిన సూత్రాలు, ఈ తరం వారి అభిప్రాయాలని మాత్రమే ఇది అతిశయోక్తి అని మీరు అనుకొంటే ఇవి ఈ రాజ్యాంగ సభ సభ్యుల అభిప్రాయాలని చెపుతాను. వాటిని రాజ్యాంగంలో పొందుపరచినందుకు ముసాయిదా కమిటీని ఎందుకు నిందించాలి? రాజ్యాంగ సభ సభ్యుల్ని మాత్రం ఎందుకు నిందించాలని అడుగుతున్నాను. జాపర్సన్‌ అమెరికాలో పెద్ద రాజకీయ వేత్త. అమెరికా రాజ్యాంగ నిర్మాణంలో చాలా పెద్ద పాత్ర తీసికొన్నాడు. ఆయన చాలా విలువైన కొన్ని అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. వీటిని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ మరిచిపోరానివి. ఒక చోట ఆయన ఇలా అంటాడు.

''మనం ఒక్కొక్క తరాన్ని ఒక ప్రత్యేక దేశంగా భావించవచ్చు. మెజారిటీ కోరికకు కట్టుబడే హక్కు ఆ తరానికి ఉంది. కాని తరువాతి తరాన్ని కట్టుబాటు చేసే హక్కు మాత్రం లేదు. ఇతర దేశవాసుల్ని కట్టుబాటు చేసే హక్కు లేదు''. మరొక చోట ఆయన ఇలా అంటాడు.

''దేశం ఉపయోగం కోసం స్ధాపించిన సంస్ధలను ముట్టుకోరాదు. మార్చకూడదు వాటి అంతానికి జవాబు దారిచేయరాదు అనేది బహుశా ఒక రాజు యొక్క అధికార దుర్వినియోగం నుండి రక్షణగా తీసికొన్న చర్య కావచ్చు. ఎందుచేతనంటే ప్రజల పట్ల ధర్మాధికారులుగా వ్యవహరించడానికి వీటికి ఎన్నో ఉచిత హక్కులు కల్పించబడ్డాయి. కాని దేశం పట్ల ఈ భావం పూర్తిగా తప్పు. ఇంకా మన న్యాయవాదులూ, మత గురువులూ సాధారణంగా ఇదే భావాన్ని బోధిస్తున్నారు. మన పూర్వ తరాలు మన కంటే ఎక్కువగా ఈ భూమిని స్వేచ్ఛగా ఉంచాయని ఊహిస్తున్నారు. మన పై మనం చట్టాల్ని విధించుకొనే హక్కువుంటే దాన్ని మనం మార్చకూడదంటే - అదే కుదిరి మనం భవిష్యత్తు తరాలకు బరువు బాధ్యతలు విధిస్తూ చట్టాలు చేయవచ్చు. వాటిని మార్చే అధికారం భవిష్యత్తు తరాలకు లేదు అంటే - ఈ భూమి శవాలకు మాత్రమే చెందుతుంది. సజీవులకు మాత్రం కాదు''.

జాఫర్సన్‌ చెప్పినది కేవలం సత్యమే కాదు. సంపూర్ణ సత్యంగా నేను భావిస్తున్నాను. ఇందులో వివాదానికి తావులేదు. రాజ్యాంగ సభ జాఫర్సన్‌ చెప్పిన ఈ సూత్రాన్ని పాటించకపోయినట్లయితే - ఈ సభ నిందార్హమవుతుంది. శిక్షార్హం కూడా అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇది అలా చేసిందా? (పాటించలేదా) ఎంత మాత్రం చేయలేదు. రాజ్యాంగ సవరణకు చేసిన ఏర్పాటును ప్రతి ఒక్కరూ పరిశీలించాలి రాజ్యాంగానికి ఇదే తుది రూపం. ఇక మార్పులుండవు అని ఈ సభ దీని పై తమ ముద్ర వేయలేదు. దీనికి సవరణలు చేసికొనే అధికారాన్ని ప్రజలకు కెనడాలో మాదిరిగా నిరాకరించలేదు. ఆస్ట్రేలియా, అమెరికాలలో మాదిరి అసాధారణ షరతులకూ నిబంధనలకూ లోబడి సవరణలు చేయాలని అనలేదు. మన రాజ్యాంగ విమర్శకులకు నేనొక సవాలు చేస్తున్నాను. ఏ రాజ్యాంగ సభ అయినా, ప్రపంచలో ఎక్కడైనా, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో - రాజ్యాంగ సవరణకు ఇంత సులభ విధానాన్ని ఏర్పాటు చేసిందేమో రుజువు చేయమని ఈ విమర్శకుల్ని కోరుతున్నాను. రాజ్యాంగంతో అసంతృప్తి చెందిన వారు మూడు వంతులలో రెండు వంతుల మెజారిటీతో సవరణ చేసుకోవచ్చు. వయోజన వోటింగు పై ఎన్నిక కాబడిన పార్లమెంటులో తమకు అనుకూలంగా రెండు వంతుల మెజారిటీ లేకపోతే - రాజ్యాంగం పట్ల వారి అసంతృప్తి సామాన్య ప్రజానీకం పంచుకోవడం లేదని అర్ధం.

రాజ్యాంగ ప్రధానమైన ఒకే ఒక అంశం గురించి, ఇక్కడ నేను ప్రస్తావించాలనుకొంటున్నాను. ఇందులో కేంద్రాధికారం ఎక్కువగా వుందనీ - రాష్ట్రాలు పురపాలక సంఘాల స్థాయికి దిగజారాయని ఒక తీవ్ర ఆక్షేపణ వుంది. ఇది అతిశయోక్తి కాదు. కాని దురవగాహన పై ఆధారపడిన ఆక్షేపణ. రాజ్యాంగం సరిగా ఏది చేయడానికి ఏర్పాటు అయిందో అది అర్ధం చేసుకోని దురవగాహన కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి, ఏ ప్రాథమిక సూత్రం పై అవి ఆధారపడి వున్నాయో దృష్టిలో వుంచుకోవాలి. ఫెడరిలిజంలో ప్రధాన సూత్రం ఏమిటంటే - శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారం, కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ కావాలి. ఈ పంపిణీ కేంద్రం చేసే చట్టాల వల్ల కాదు. రాజ్యాంగం ద్వారానే జరగాలి. ఇదే రాజ్యాంగం చేస్తూ వుంది. మన రాజ్యాంగంలోని రాష్ట్రాలు, తమ శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారాలకు కేంద్రం పై ఆధారపడవు. ఈ విషయంలో కేంద్రమూ, రాష్ట్రాలూ సరిసమానంగా వున్నాయి. ఇటువంటి రాజ్యాంగం, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఎలాకట్టుబెడుతుంది? రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ రంగాల్లో శాసన నిర్మాణ, కార్యానిర్వాహక అధికారాలను అప్పగించి వుండవచ్చు. ఇతర పెడరల్‌ రాజ్యాంగాలలోని వాటికంటే ఇవి ఎక్కువ కావచ్చు. ఇంకా మిగిలిపోయిన అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి. రాష్ట్రాలకు కాదు. కాని ఈలక్షణాలు ఫెడరలిజమ్‌ తత్వాన్ని రూపొందించవు. ఫెడరలిజానికి ప్రధాన గుర్తు ఏమిటంటే - నేను ముందుగా చెప్పినట్లుగా - రాజ్యాంగం ద్వారానే కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య శాసన నిర్మాణ, కార్య నిర్వాహక అధికారాలు పంపిణీ, ఇదే సూత్రాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచాం. ఈ విషయంలో ఎంత మాత్రం పొరబాటు లేదు. అందుచేత రాష్ట్రాలు కేంద్రానికి దిగువగా ఉంచబడ్డాయని చెప్పడం తప్పు. కేంద్రం తన యిష్టానుసారం ఈ పంపిణీ హద్దుల్ని మార్చలేదు. న్యాయశాఖ కూడా మార్చలేదు. ఎందుకంటే, ఈ దిగువ విధంగా చెప్పాము. ''కోర్టులు మార్పులు చేయవచ్చు. ప్రత్యామ్నాయాలు ఇవ్వలేవు. క్రొత్త వాదనలూ, క్రొత్త దృక్పథాలూ ముందుకు వచ్చినపుడు, అవి పాత భాష్యాలను పునర్విమర్శచేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సరిహద్దు రేఖను కొంచెం మార్చవచ్చు. అయినా కోర్టులు ఉల్లంఘించరాని హద్దులున్నాయి. ఖచ్చితంగా చేసిన అధికార పంపిణీని అవి తిరిగి కేటాయించలేవు. అవి ఉన్న అధికారాలను విస్త్రృతం చేయవచ్చు. అంతేకాని, అవి ఒక దానికి స్పష్టంగా ఇచ్చిన అధికారాలను మరొకదానికి ఇవ్వలేవు.

కాబట్టి ఫెడరలిజాన్ని భంగపరుస్తూ కేంద్రానికి ఎక్కువ అధికారాలు కట్టుబెట్టామనే మొట్టమొదటి నిందారోపణ అర్ధరహితం. రెండవ ఆరోపణ ఏమిటంటే - కేంద్రానికి రాష్ట్రాలను లెక్కచేయకుండా వ్యవహరించే అధికారలున్నాయనడం. ఈ ఆరోపణను అంగీకరించాలి. ఇంత మితిమీరిన అధికారాలను కలిగివున్నందుకు రాజ్యాంగాన్ని అభిశంసించే ముందు, కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే - ఈ మితిమీరిన అధికారాలు రాజ్యాంగానికి సాధారణ లక్షణంగా వుండవు. ఈ అధికారాల వాడుక, ఆచరణ ఆత్యయిక పరిస్ధితులకు మాత్రమే ఖచ్చితంగా పరిమితం చేయబడ్డాయి. రెండవ విషయం ఏమిటంటే - అత్యయిక పరిస్ధితి ఏర్పడినప్పుడు కేంద్రానికి మితిమీరిన అధికారాలు ఇవ్వకుండా తప్పించుకోగలమా? ఆత్యయిక పరిస్ధితిలో కూడా, కేంద్రానికి మితిమీరిన అధికారాలు ఇవ్వడాన్ని సమర్ధించలేని వాళ్ళు. దీనికి మూలకారణాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారన్న మాట. ది రౌండ్‌ టేబిల్‌ అనే ప్రసిద్ధ పత్రికలో ఒక రచయిత ఈ సమస్యను అతి స్పష్టంగా చర్చించాడు. ఈ పత్రిక డిశంబరు 1935 నాటిది. దాని నుండి ఈ దిగువ భాగాన్ని ఉదహరిస్తున్నాను. రచయిత ఇలా అంటున్నాడు.

''రాజకీయ విధానాలు హక్కులకూ విధులకూ చెందిన సమస్య. పౌరుడు ఎవరికి లేదా ఏ అధికారానికి తన విధేయతను చూపించాలి అనేది ప్రధాన సమస్య. సాధారణ వ్యవహరాల్లో ఈ సమస్య రాదు. ఎందుకంటే చట్టం తన పని సజావుగా చేసుకుపోతుంది. మనిషి, ఇక్కడ ఒక అధికారానికి విధేయుడై తన పని చేసుకొంటాడు. కాని సంక్షోభం వచ్చినపుడు, హక్కులమధ్య సంఘర్షణ ఏర్పడవచ్చు. అప్పుడు అంతిమ విధేయత విభజింపరానిదిగా కనిపిస్తుంది. నిబంధనలకు న్యాయపరంగా అర్ధం చెపుతూ, ఆఖరి ప్రయత్నంగా, ఈ విధేయతా సమస్యను నిర్ధారించలేము. లాంఛనాలు ఎగిరిపోయిన పిమ్మట ప్రధాన ప్రశ్న ఏమిటంటే - ఏ అధికార శక్తి పౌరుని చివరి విధేయతను శాసిస్తుంది? అది కేంద్ర ప్రభుత్వమా? లేక రాష్ట్ర ప్రభుత్వమా''? ఈ సమస్యకు ఈ ప్రశ్న అతికీలకమైనది. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఇచ్చే జవాబు పై ఈ సమస్య పరిష్కారం ఆధారపడి వుంటుంది. ఆత్యయిక సమయంలో పౌరుడు కేంద్రానికే విధేయత చూపించాలి. రాష్ట్రాలకు కాదు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇందులో సందేహం లేదు. ఎందుచేతనంటే కేంద్రం మాత్రమే సమష్టి లక్ష్యాల కోసం పనిచేయగలదు; మొత్తం పై దేశం యొక్క సాధారణ ప్రయోజనాల కోసం పని చేయగలదు అందుచేతనే, ఆత్యయిక పరిస్ధితిలో ఉపయోగించుకోవడానికి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆత్యయిక అధికారాల వల్ల, ఇంతకూ రాష్ట్రాల పై విధించిన బాధ్యత ఏమిటి? ఈ దిగువ చెప్పిన దానికంటే ఎక్కువేమీ కాదు - ఆత్యయిక పరిస్ధితిలో రాష్ట్రాలు తమ స్వంత స్థానిక ప్రయోజనాలు, అభిప్రాయాలతో పాటు, దేశ ప్రయోజనాలను కూడా పరిగణనలోనికి తీసికోవాలి. ఈ సమస్యను అర్ధం చేసుకోని వారు మాత్రమే - ఇందుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తారు.

ఇక్కడ నేను దీనిని ముగించవచ్చు. కాని నా మనస్సు మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. మన దేశ భవిష్యత్తు పై కొన్ని ఆలోచనలను మీ ముందు ఉంచడానికి ఈ అవకాశాన్ని నేను తీసుకోవాలనిపించింది. 26 జనవరి 1950 నాడు ఇండియా స్వతంత్ర దేశమవుతుంది. (హర్షధ్వానాలు) ఈ దేశ స్వాతంత్య్రానికి ఏమి జరుగుతుంది? ఈ దేశం తన స్వాతంత్య్రాన్ని కాపాడుకొంటుందా? మళ్ళీ పోగొట్టు కొంటుందా? ఇది నా మనస్సులోనికి వచ్చిన మొదటి ఆలోచన - అంటే భారతదేశం ఎప్పుడూ స్వతంత్రంగా లేదని చెప్పడం కాదు. తనకున్న స్వాతంత్య్రాన్ని తాను ఒకసారి పోగొట్టుకొంది అని నా భావం. మరోసారి కూడా దీనిని పోగొట్టుకొంటుందా? ఈ దేశ భవిష్యత్తు గురించి ఈ ఆలోచన నన్ను చాలాకలవరపరుస్తూ వుంది. నన్ను బాగా బాధిస్తున్నదేమిటంటే - ఇండియా తన స్వాతంత్య్రాన్ని లోగడ ఒక సారికోల్పోయిందన్నది కాదు; తన ప్రజల్లోనే కొందరు చేసిన ద్రోహం. అవిధేయతల వలన ఈ దేశం స్వతంత్య్రాన్ని కోల్పోవడం. మహమ్మద్‌ చినకాశిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించినపుడు, దాహర్‌ రాజు యొక్క సేనాధిపతులు, మహమ్మద్‌ చినకాశిం ఏజంట్లు నుండి లంచాలు తీసికొన్నారు. రాజు తరుపున పోరాడడానికి నిరాకరించారు. మహమ్మద్‌ ఘోరీని, ఇండియాను ఆక్రమించమనీ, పృధ్వీరాజుతో పారాడమనీ, సోలంకిరాజుల సహాయమూ, తన సహాయమూ అందిస్తాననీ - ఆహ్వానించింది జయచందు - శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతుంటే - ఇతర మహారాష్ట్ర పెద్దలూ, ఇతర రాజపుత్రరాజులూ మొగలాయి చక్రవర్తుల పక్షాన యుద్ధం చేసారు. బ్రిటీషు వారు సిక్కు ప్రభువుల్ని నాశనం చేస్తూవుంటే - సిక్కుల ప్రదాన సేనాధిపతి గులాబీసింగు మౌనంగా వూరుకొన్నాడు. సిక్కు రాజ్యాన్ని కాపాడడానికి ఎంతమాత్రం సహాయపడలేదు. 1857లో భారతదేశంలో చాలా భాగం ఆంగ్లేయుల పై స్వాతంత్య్ర యుద్ధాన్ని ప్రకటిస్తే - సిక్కులు మౌన ప్రేక్షకులుగా నిలబడి వేడుక చూసారు.

చరిత్ర పునరావృత్తమవుతుందా? ఈ ఆలోచననే నాకు ఆందోళన కలిగిస్తూ వుంది. కులాలు, తెగల రూపంలో ఉన్న మన పాత శత్రువులతో పాటు వివిధమైన పరస్పర విరోధమైన రాజకీయ తత్త్వాలతో అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాము. ఈ వాస్తవం నన్ను మరీ కలచివేస్తుంది. భారతీయులు తమ తత్త్వాలకు అతీతంగా దేశాన్ని చూస్తారా? లేక దేశానికి అతీతంగా తమ తత్వాలను చూస్తారా? నాకు తెలియడం లేదు. కాని ఒకటి నిశ్చియం. దేశానికి అతీతంగా పార్టీలు తమ తత్త్వాలను చూసినట్లయితే మన స్వాతంత్య్రం తప్పక కోల్పోగలదు. ఇది నిశ్చయం - స్ధిర నిశ్చయంతో మనమీ ప్రమాదాన్నుంచి దేశాన్ని కాపాడాలి. మన చివరి రక్తపు బొట్టువరకూ మన స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడానికి కంకణం కట్టుకోవాలి.

26 జనవరి 1950న ఇండియా ప్రజాస్వామిక దేశమవుతుంది, అంటే ఆ రోజు నుండి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ఇండియా కలిగి యుంటుందని అర్ధం. ఇదే ఆలోచన నా మనస్సుకు వచ్చింది. తన ప్రజాస్వామిక రాజ్యాంగానికి ఏమి జరుగుతుంది? దీనిని మన దేశం నిలబెట్టుకోగలదా? దీనిని మళ్ళీ కోల్పోతుందా? ఇది నా మనస్సులోకి వస్తున్న రెండో ఆలోచన. మొదటి ఆలోచన కలిగిస్తున్నంత ఆందోళనా ఇదీ నాకు కలిగిస్తుంది.

ఇండియాకు ప్రజాస్వామ్యమంటే తెలియదు అని చెప్పడం నా భావం కాదు. పూర్వం ఒకానొకప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలుండేవి. రాజరికాలు ఉన్నప్పటికీ ఇవి వుండేవి. ఈ ప్రభుత్వాలు ఎన్నుకోబడేవి. పరిమితంగా వుండేవి. అవి సర్వాధికారాలతో వుండేవి కావు. అంటే ఇండియాకు పార్లమెంటులు లేవనీ - పార్లమెంటరీ విధానం తెలియదనీ నా ఉద్దేశం కాదు. బౌద్ధ సంఘాలంటే పార్లమెంటులే. ఈ సంఘాలకు పార్లమెంటరీ విధాన నిబంధనలు అన్నీ తెలుసు. వాటిని పాటించాయి. ఆధునిక కాలానికి తెలిసిన విధానాలు వాటికీ తెలుసు. సీట్ల సర్దుబాటు గురించి వాటికి నిబంధనలున్నాయి. చట్టాలు ప్రవేశపెట్టడం గురించి నిబంధనలున్నాయి. తీర్మానాల గురించి ''కోరం'' గురించి, విప్ప్‌ గురించి ఓట్ల లెక్కింపు గురించి, బాల్లెట్‌ బాక్సులో వోటు వేయడం గురించి, అభిశంసన తీర్మానం గురించి, క్రమబద్దీకరణ గురించి వగైరాల గురించి వారికి నిబంధనలున్నాయి. పార్లమెంటరీ విధానానికి ఈ నిబంధనలను బుద్ధుడు సంఘ సమావేశాలకు ఆచరణలో పెట్టినా - బుద్ధుడు ఆనాడు దేశంలో పని చేస్తున్న రాజకీయ సభల నిబంధనల నుండే, వీటిని గ్రహించి వుండాలి.

ఈ ప్రజాస్వామిక విధానాన్ని భారతదేశం కోల్పోయింది. రెండోసారి కూడా దీనిని కోల్పోతుందా? నాకు తెలియదు. ఇండియా వంటి దేశంలో ఇది అసాధ్యం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం చాలా కాలంగా వాడుకలో లేని మూలంగా ఇది ఏదో కొత్తగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వుంది. ఇప్పుడే పుట్టిన మన ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అలా వుంచుకొంటూనే ఆచరణలో నియంతృత్వానికి దారితీయవచ్చు. ఈ దిగజారుడు ప్రారంభమయితే - రెండో ప్రమాదం మరీ పెద్దదిగా వుంటుంది.

స్వరూపంలోనే కాదు ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో కూడా మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నా దృష్టిలో మొట్టమొదట మనం చేయవలసింది. మన సాంఘిక, ఆర్ధిక లక్ష్యాలను సాధించుకోవడానికి మనం రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండడమే. రక్తపాతంలో కూడిన తిరుగుబాటు పద్ధతులను మనం విడిచిపెట్టాలి. సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి పద్ధతుల్ని విడిచిపెట్టాలి. సాంఘిక, ఆర్ధిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగబధ్ద పద్ధతులు లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంభించడంలో అర్ధం వుంది. కాని రాజ్యాంగ పద్ధతులు అందుబాటులో ఉండగా, రాజ్యాంగేతర పద్ధతుల్ని అవలంభించడంలో అర్ధం లేదు. ఈ రాజ్యాంగేతర పద్ధతులు అరాచకత్వానికి వ్యాకరణం లాంటివి. వీటిని మనం ఎంత త్వరగా వదలుకొంటే మనకు అంత మంచిది.

మనం చేయవలసిన రెండో పని జాన్‌స్టువర్టు చేసిన హెచ్చరికను పాటించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఆసక్తి కలవారందరికీ ఆయన ఈ క్రింది హెచ్చరిక చేసారు. తమ స్వాతంత్య్రాలను ఏ గొప్ప మనిషి పాదాల వద్ద సమర్పించకూడదు. తమ సంస్ధలన్నింటిని తిరగబెట్టగలిగే అధికారాలు అతనికివ్వకూడదు. దేశానికి జీవితాంతం సేవలు చేసిన మహాపురుషులకు మనం కృతజ్ఞులమై వుండడంలో తప్పులేదు. కాని కృతజ్ఞతకు కూడా కొన్ని హద్దులున్నాయి. ఐరిష్‌ దేశ భక్తుడు డేనియర్‌ ఓ కాన్నెల్‌ చెప్పినట్లుగా తన ఆత్మగౌరవానికి భంగకరంగా ఏ మనిషీ కృతజ్ఞుడుగా వుండలేడు. తన శీలానికి భంగం కలిగేలా ఏ స్త్రీ కృతజ్ఞురాలుగా ఉండలేదు. తన స్వాతంత్య్రానికి భంగం కలిగేలా, ఏ దేశమూ కృతజ్ఞతగా ఉండలేదు. ఈ హెచ్చరిక, ఇతర దేశాల విషయంలో కంటే - మన దేశం విషయంలో చాలా అవసరం. ఎందుకంటే ఇండియాలో భక్తి లేదా భక్తి భావం లేదా వీరపూజ - రాజకీయాల్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో ఇతర దేశాల రాజకీయాల్లో అది పోషించే పాత్రకంటే, మన దేశంలో చాలా ఎక్కువ. మత విషయంలో భక్తి - ఆత్మ విముక్తికీ ఒక మార్గం కావచ్చు. కాని రాజకీయాల్లో - భక్తి లేదా వీరపూజ - దివాళా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికి సూటిదారి.

మనం చేయవలసిన మూడోపని కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో మనం సంతుష్టిపడరాదు. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాంఘిక ప్రజాస్వామ్యం చేయాలి. సాంఘిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే - రాజకీయ స్వాతంత్య్రం నిలబడదు. సాంఘిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? స్వతంత్రం, సమానత్వం, సోదరత్వములను జీవన సూత్రాలుగా గుర్తించిన జీవనశైలియే సాంఘిక ప్రజాస్వామ్యం. స్వతంత్ర సమానత్వ సోదరత్వ సూత్రాలను, ఈ త్రయంలో విడివిడిగా చూడకూడదు. ఈ మూడింటి సమన్వయ రూపమే సాంఘిక ప్రజాస్వామ్యం. ఒక దాని నుండి మరొక దానిని విడదీస్తే - ప్రజాస్వామ్య, లక్ష్యాన్నే కూలద్రోసినట్లు స్వతంత్రం, సమానత్వం నుండి ఎన్నడూ వేరు కాలేదు. అలాగే సమానత్వం కూడా స్వతంత్రం నుండి వేరుకాలేదు. అదే మాదిరి స్వతంత్ర, సమానత్వాలు సోదరత్వం నుండి వేరు కాలేదు. సమానత్వం లేకుండా స్వతంత్ర మనేది ఎక్కువమందిపై తక్కువ మంది ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వతంత్ర సమానత్వాలు సహజరీతిలో వుండవు. వీటిని అమలు చేయడానికి ఒక కానిస్టేబులు అవసరమవుతాడు. భారతీయ సమాజంలో రెండు అంశాలు పూర్తిగా లేవని మనం గుర్తించాలి. వీటిలో ఒకటి. సమానత్వం సాంఘిక రంగంలో అసమానతలని శ్రేణి అనే సిద్ధాంతంపై, మన సమాజం ఏర్పడింది. ఇందులో కొందరికి ఔన్నత్యం, మరికొందరికి అధమత్వం ఆర్ధిక రంగంలో కొద్దిమంది మహాధనవంతులు, చాలా మంది మహాదరిద్రులు ఉన్న సమాజం. 26 జనవరి 1950న, మనం పరస్పర వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాల్లో మనం సమానత్వాన్ని కలిగి వుంటాము. సాంఘిక ఆర్ధిక జీవితంలో అసమానతను కలిగి వుంటాము. రాజకీయాల్లో ఒక మనిషికి ఒకే వోటు, మరియు ఒక వోటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాము. మన సాంఘిక ఆర్ధిక జీవితంలో, మనకు గల సాంఘిక ఆర్ధిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒకే విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే వుంటాము. ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటాము? మన సాంఘిక, ఆర్ధిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటాము? మనం చాలా కాలం దీనిని నిరాకరిస్తూ పోతే - మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తున్నామన్న మాట. ఈ వైరుధ్యాన్ని వీలయినంత తొందరలో మనం తొలగించాలి. లేనట్లయితే అసమానతలతో బాధపడేవారు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్ధను విధ్వంసం చేస్తారు. ఈ రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంది.

మనలో లేని రెండో అంశం. సోదరత్వ సూత్రానికి గుర్తింపు, సోదరత్వం అంటే ఏమిటి? సోదరత్వమంటే అందరు భారతీయుల మధ్య ఒక సమష్టి సహోదర భావం. భారతీయులందరూ ఒకే ప్రజ అనే భావం. సాంఘిక జీవితానికి ఈ సూత్రం ఐక్యతనూ, సహానుభూతినీ కలిగిస్తుంది. దీనిని సాధించడం కష్టమే. అమెరికా సంయుక్త రాష్ట్రాల గురించి అమెరికన్‌ కామన్‌ వెల్త్‌ అనే గ్రంధంలో జేమ్సు చ్రైస్‌ చెప్పిన కథ ఇది ఎంతకష్టమో తెలియజేస్తుంది.

ఆ కథ ఇది : ఈ కథను నేను చ్రైస్‌ మాటల్లోనే చెపుతున్నాను. అది ... కొన్ని సంవత్సరాల క్రింతం అమెరికన్‌ ప్రోటెస్టాంట్‌ ఎపిస్కోపల్‌ చర్చివారు మూడు సంవత్సరాల కొకసారి జరిగే సమావేశం తమ ప్రార్ధనల పై పునర్విమర్శచేసారు. ఒక చిన్న వాక్యంతో కూడిన ప్రార్థనల్లో - తమ ప్రజలందరికీ ఒక ప్రార్ధన ప్రవేశపెట్టడం మంచిదని భావించారు. ఒక ప్రసిద్ద న్యూ ఇంగ్లాండు దైవ భక్తుడు ఈ ప్రార్ధన ప్రతిపాదించాడు. ''ఓ ప్రభువా! మా దేశాన్ని దీవించు'' పరిస్ధితుల ఒత్తిడిలో ఒక మధ్యాహ్నం ఆ ప్రార్ధన అంగీకరించబడింది. ఈ వాక్యాన్ని మర్నాడు పునః పరిశీలనకు పెట్టారు. దానిపై మతాభిమానవహితులు ఎన్నో అభ్యంతరాలు లేవదీసారు. దేశం అనే మాట జాతీయ ఐక్యతపై వదిలివేసారు. దానికి బదులుగా ప్రార్ధన ఇలా మారింది. ఓ ప్రభువా! ఈ సంయుక్త రాష్ట్రాలను దీవించు''

ఈ సంఘటన జరిగినప్పుడు అమెరికా ప్రజల్లో సహానుభూతి లేదు. అమెరికా ప్రజలు తామందరూ ఒకే దేశమని అనుకోలేదు. సంయుక్త రాష్ట్రాల ప్రజలు తామందరూ ఒక దేశమని అనుకోలేకపోయినప్పుడు భారతీయులు తామందరూ ఒకే దేశమని అనుకోవడం ఎంత కష్టమో ఊహించండి రాజకీయ స్పృహకల భారతీయులు!! భారతదేశ ప్రజలు'' అన్న మాటను కోపగించుకొన్న రోజులు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. భారతదేశము అనే మాటను వారు అభిమానించారు. మనం ఒకే దేశమని నమ్ముతూ ఒక పెద్ద భ్రమకు లోనవుతున్నామని నా అభిప్రాయం. ఎన్నో వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒకే దేశం ఎలా కాగలరు? సాంఘిక, మానసిక రంగాల్లో మనమింకా ఒకే దేశం కాదని ఎంత త్వరగా మనం గ్రహించితే - అంత మేలు. అప్పుడు మాత్రమే మనం ఒకదేశంగా ఉండవలసిన ఆవశ్యకతను అర్ధం చేసుకొంటాము. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా కష్టమే అవుతుంది. సంయుక్త రాష్ట్రాలలో జరిగిన దానికంటే కూడా చాల కష్టం. సంయుక్త రాష్ట్రాలకు కులం సమస్య లేదు. ఇండియాలో కులాలున్నాయి. కులాలు దేశ వ్యతిరేతికమైనవి. ఇందుకు మొదటి కారణం సాంఘిక జీవితంలో ఇవి వేరుపాటును తీసుకువస్తున్నాయి. కులాల మధ్య విద్వేషాన్ని, అసూయను వృద్ధి చేస్తున్నాయి కనుక ఇవి దేశ వ్యతిరేకమైనవంటున్నాను. నిజంగా మనం ఒక దేశంగా మారాలంటే - మనం ఈ కష్టాలన్నింటినీ అధిగమించాలి. ఒక దేశం అన్నప్పుడు, అక్కడ సోదరత్వం ఉండాలి. సోదరత్వం లేకపోతే - సమానత్వం స్వాతంత్య్రం అనేవి లోతుకు వెళ్ళని పై పై రంగుపూతలు మాత్రమే.

మనముందున్న కర్తవ్యాల గురించి, ఇవి నా భావాలు. ఇవి కొందరికి రుచించకపోవచ్చు. ఈ దేశంలో రాజకీయాధికారం చాలా కాలంగా కొందరికీ ఏకస్వామ్యంగా వుందనడంలో అబద్దం లేదు. చాలా మంది బరువుమోసే పశువులుగానే కాదు, బలిపశువులుగానూ ఉన్నారనడంలో అబద్దం లేదు. ఈ ఏకస్వామ్యం కేవలం వీరి అభివృద్ధి అవకాశాలను నిర్మూలించడమే కాదు. వారికి జీవితమంటే అర్ధమే తెలియకుండా చేసింది. ఈ అణగద్రొక్కబడిన వర్గాలు పాలితులుగా ఉండి ఉండి అలసిపోయాయి. తమని తాము పాలించుకోవాలని చాలా అసహనంగా వున్నాయి. అణగద్రొక్కబడిన వర్గాల్లో తమ సొంత గుర్తింపుకై పడే ఆరాటం ఒక రకపు పోరాటంగా కాని లేదా ఒక వర్గ పోరాటంగా కాని మారనివ్వకూడదు. అది ఇంటిని ముక్కలు చేయడానికి దారి తీస్తుంది. అది నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తం అవుతుంది. అబ్రహం లింకన్‌ చెప్పినట్లుగా ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా తానే చీలికలయితే - అది ఎక్కువ కాలం నిలబడలేదు. వారి ఆశను నెరవేర్చడానికి ఎంత త్వరగా ప్రయత్నం జరిగితే కొద్ది మందికైనా అంతమంచిది. దేశానికి అంతమంచిది. ఈ స్వాతంత్య్ర రక్షణకు అంత మంచిది. ఈ ప్రజాస్వామిక రక్షణకు అంత మంచిది. జీవనరంగాలన్నింటిలో, సోదరత్వమూ, సమానత్వమూ ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యం. అందువల్లనే, నేను వాటి గురించి ఇంత నొక్కి వక్కాణిస్తున్నాను.

ఇంకా ఎక్కువ సేపు మాట్లాడి ఈ సభకు విసుగు కలిగించదలచుకోలేదు. స్వాతంత్య్రం అనేది, నిస్సందేహంగా ఒక సంతోషకర విషయం. కాని ఈ స్వాతంత్య్రం మనపైన, పెద్ద పెద్ద బాధ్యతలను పెట్టిందన్న విషయం మరిచిపోకూడదు. ఏదైనా మనకు చెడు జరిగితే దానికి ఆంగ్లేయులే బాధ్యులు అని నిందించే అవకాశం ఇక మనకు లేదు. ఇక మీదట ఏదైనా చెడు జరిగితే - మనల్ని మనం తప్ప మరెవర్నీ నిందించలేము. కొన్ని విషయాలు చెడును కలిగించే - పెద్ద ప్రమాదం వుంది. కాలం త్వరగా మారిపోతూ వుంది. మనతో పాటు ప్రజలు కొత్త సిద్ధాంతాలవైపు కదులుతున్నారు. ప్రజల చేత నడపబడే ప్రభుత్వమంటే విసుగు చెందుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతున్నారు. అది ప్రజల యొక్క ప్రభుత్వమైనా, ప్రజల చేత పడపబడే ప్రభుత్వమైనా, వారు పట్టించుకోవడం లేదు. ఈ రాజ్యాంగంలో, ప్రజల యొక్క, ప్రజల కొరకు, ప్రజల చేత నడపబడే ప్రభుత్వ సూత్రాన్ని పొందుపరచడానికి ప్రయత్నించాము. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించడంలో మనం లసించకూడదు. అలా ఆలసించినట్లయితే - ప్రజల చేత నడపబడే ప్రభుత్వానికి బదులుగా ప్రజల కొరకు ప్రభుత్వాన్ని వీరుకోరుకొనేలా చేస్తుంది. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి తీసికొనే చొరవలో మనం ఎంతమాత్రం బలహీనంగా ఉండరాదు. దేశానికి సేవచేసే మార్గమిదొక్కటే. ఇంతకు మించినది నాకు కానరావడం లేదు.

......................................................................................

గమనిక : 
ముద్రణా లోపాల కారణంగా ఏప్రియల్‌ 2011 (177) సంచికలో పేజీల ముద్రణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. దయచేసి అపార్థం చేసుకోకుండా ఆ క్రమంలో పేజీలను చదువుకోగలరు. అక్కడక్కడా కొన్ని అక్షర దోషాలు కూడా దొర్లినవి. వాటిని సహృదయంతో అర్థం చేసుకోగలరు.
- ఎడిటర్‌.
1. 21వ పేజీ కొనసాగింపు 26వ పేజీలో ''గమనిక'' నుండి ప్రారంభమైనది.
2. 25వ పేజీ కొనసాగింపు 28వ పేజీలో ''సూచితమవుతూ విశ్వంగానూ'' నుండి ప్రారంభమైనది.
3. 27వ పేజీ కొనసాగింపు 22వ పేజీలో ''లాంటి వాళ్ళ దాడికి'' నుండి ప్రారంభమైనది.
కొన్ని ముఖ్యదోషాలు : 
1. 15వ పేజీలో క్రింద నుండి 7వ లైనులో ''అనిర్థారిత'' కి బదులుగా 'అనిర్ధాంత' అని ముద్రితమైనది.
2. 16వ పేజీలో పై నుండి 6వ లైనులో ''అనుద్ధిష్ఠార్థ పరికల్పనా'' కు బదులుగా 'అనుద్ధాష్ఠార్థ పరికల్పనా' అని మరియు క్రింద నుండి 3వ లైనులో ''విూకెరుకవుతోందో'' కి బదులుగా 'మా కెరుకవుతోందో' అని ముద్రితమైనది.
3. 17వ పేజీలో క్రింద నుండి 8వ లైనులో ''సరికదా నుండి సరైనదా కాదా'' వరకు తొలగించుకోవలెను.
4. 21వ పేజీలో పైనుండి 11వ లైనులో ''నిర్వకారంగా'' బదులుగా 'నిరిరవకారంగా' ను మరియు క్రింద నుండి 5వ లైనులో ''అసద్వా ఇదమగ్ర ఆసీత్‌''కు బదులుగా 'సఅసద్వాణడమగ్ర ఆసీత్‌' గాను, క్రింద నుండి 3వ లైనులో ''వాచారంభణం వికారో నామధ్యేయం'' కు బదులుగా 'వాచారంభకాం వికారాశనామధ్యేయం'' గాను ముద్రితమైనది.
5. 22వ పేజీలో పైనుండి 5వ లైనులో ''ఓడించానంటూ''కి బదులుగా 'ఓడించుతానంటూ' అని ముద్రితమైనది.
6. 25వ పేజీలో పైనుండి 9వ లైనులో ''బి క్రియేటెడ్‌'' కి బదులుగా 'బిడ్‌ క్రియేటెడ్‌' అని ముద్రితమైనది.

No comments:

Post a Comment