జూలై 22, 23, 24 తేదీలలో ద్వారకుంటలో 6 జిల్లాలకు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ప్రధాన విచారణీయాంశంగా, రాబోయే 6 నెలల లోపు అంటే జనవరి 30, 31-2012 నాటికి సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక కార్యాచరణలో భాగంగా ఏమేమి పనులు పూర్తిచేయాలి? అందుకు కావలసిన సాధన సామగ్రి ఏమిటి? మొదలగు వాటిని తీసుకున్నాం.
ఐక్యవేదిక ఆరంభ దినాలలోనే ఉద్యమ వ్యాప్తికై, ఐక్యవేదికలోని భాగస్వామ్య సంస్థలు వారి వారి అవకాశాలు, వనరులననుసరించి తలా కొన్ని జిల్లాల్లో సంధానకర్తుత్వం, సమన్వయకర్తుత్వములను స్వీకరించి ప్రధాన బాధ్యత వహించితే బాగుంటుందని అనుకున్నాము. అయినా రకరకాల కారణాల వల్ల ఉద్యమం వేగవంతం కావడానికి తగినంత కృషి చేయలేకపోయాం. ఆ కృషిలోపం మొన్న జూన్ 4,5 తేదీలలో జరుపుకున్న మహాసభలో స్పష్టంగా కానవచ్చింది. ఆ వాస్తవాలు, మనమంతా పునరుత్సాహంతో మరింత ప్రణాళికాబద్దంగా, దీక్షబూని ఉద్యమ లక్ష్యాల దిశగా ఉద్యమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాం.
ఆ నేపధ్యం ఆధారంగా, సత్యాన్వేషణ మండలి ఒక ఆలోచనను ఐక్యవేదిక ముందు పెట్టి ఆ విషయమై తనవంతు కృషి చేయడానికి నడుం బిగించింది. ఐదు జిల్లాలను ఒక ప్రాంతంగా తీసుకొని, ఉద్యమ నిర్మాణానికై అందరినీ కదిలించి కలుపుకుపోయే బాధ్యత తాను తీసుకుంటానని చెబుతూ, వ్యక్తులుగా గానీ, సంస్థలుగా గానీ అలాంటి బాధ్యతలే తీసుకోవలసినదిగా కోరింది.
మండలి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గోదావరి, ఖమ్మం జిల్లాల బాధ్యులతోను మాట్లాడి వారి అంగీకారాన్ని తీసుకుని ఆ ఐదు జిల్లాల ప్రాంతీయ విభాగపు ప్రధాన బాధ్యత తాను తీసుకుంటోంది. ఈ ఆలోచనను గతంలోనే అంగీకరించిన డా. బ్రహ్మారెడ్డి గారు కర్నూలు జిల్లా బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వేణుగోపాల రెడ్డి గారు ఆదిలాబాద్ విషయం తాను చూస్తానన్నారు. జూలై మధ్యలో బ్రహ్మారెడ్డి గారు, వేణుగోపాలరెడ్డి గారు, నేను (సురేంద్ర) కలసి ఈ విషయంపై ఆలోచించి పై నిర్ణయానికి వచ్చాము. కడప, అనంతపూర్ జిల్లాలు కొద్దిగా కదిలితే వాటి విషయాన్ని ఒకింత పట్టించుకొనే యత్నం చేస్తానన్నారు బ్రహ్మారెడ్డి గారు. ఏదేమైనా ఈ 7 జిల్లాలను ఒక పద్ధతి ప్రకారం కదిలించి, వేగవంతం చేయాలనుకున్నాం. తామూ ఈ వ్యూహంలో భాగస్వాములవుతాం అనే వాళ్ళనూ కలుపుకుందామనుకున్నాం. ఎం.యు.ఎఫ్. నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల బాధ్యత వహిస్తామన్నారు. వాతావరణం ఉత్సాహకరంగానే ఉందనుకుని, జూలై 27న జైభారత్ సంస్థ ప్రధాన బాధ్యులను కలసి ఈ విషయాన్ని ప్రస్తావించాము.
జైభారత్ తరపున రమణమూర్తి గారు, లోకనాథ్ ఒక ప్రకటన చేశారు. జైభారత్ కూడా ఈ పనిలో తనవంతు కృషిచేస్తుంది. కడప, మెదక్ జిల్లాల బాధ్యత తీసుకుంటుంది. మిగిలిన జిల్లాలలోనూమావాళ్ళున్నంత మేర మిత్ర సంస్థలతో కలసి క్రియాశీలంగా పనిచేస్తుంది అనన్నారు వారు.
అటు తరువాత 28న లోక్‌సత్తా ప్రధాన బాధ్యులైన జె.పి. గారినీ, డి.వి.వి.ఎస్.వర్మ గారినీ కలసి ఇదే విషయం వారిముందు ప్రస్తావించి, వారేమేరకు ఇందులో పాలుపంచుకొంటారో స్పష్టంగా ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాము. రకరకాల పనుల వత్తిడి వల్ల ఇప్పటి వరకూ ఐక్యవేదిక కార్యక్రమం వైపు అంతగా శ్రద్ధపెట్టలేదు. ఇప్పటినుండి ఖచ్చితంగా క్రియాశీలంగా భాగస్వామ్యపు పాత్ర పోషిస్తాము. కొన్ని జిల్లాల బాధ్యత స్వీకరిస్తాము అని జె.పి. గారన్నారు. ఒక వారంలోగా అందరితో మాట్లాడి కలసి పనిచేయడానికి సంస్థను సమాయత్తం చేస్తామని వర్మగారూ అన్నారు.
ఈ క్రమమంతా చూస్తుంటే వాతావరణం నూతనోత్తేజాన్ని సంతరించుకున్నట్లే అనిపించింది. ఎన్.ఎ.పి.ఎం. బాధ్యులు, ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి అయిన రామకృష్ణంరాజు గారు హైదరాబాద్ బాధ్యత తాము తీసుకుంటామన్నారు, జె.వి.వి. కోర్ కమిటీలో మన ఐక్యవేదిక లక్ష్యాలు - కార్యాచరణ ప్రణాళిక అన్న దానిపై నిశితమైన, లోతైన చర్చ జరుగుతోంది. జె.వి.వి. ప్రధాన కార్యక్రమానికి ఆటంకం కాకుంటే కొంత కాలం దీనిని మరింత భాగస్వామ్యంతో చేయగలం అన్న యోచన దగ్గరుండి విచారిస్తున్నారు వాళ్ళు.
మిత్ర సంస్థలలో ఒకటైన 'కోవా' నూ సంప్రదించాల్సి ఉంది. 'సమత' మహిళామండలి వారూ మనతో సహకరించడానికి సిద్ధమైనారు.
22, 23, 24 తేదీల సమావేశ వివరాలు :
పైన చెప్పుకున్న కార్యాచరణకు ఆకృతినివ్వడానికై ఉద్ధేశించినవే దోరకుంటలో జరిగిన ఈ మూడురోజుల సమావేశాలు. మండలి బాధ్యత వేసుకున్న 5 జిల్లాలు, కర్నూలు జిల్లా లక్ష్యంగా ఏర్పరచుకున్న సమావేశమది. విజయనగరం, తూ. గోదావరి జిల్లాల నుండీ ప్రతినిధులు వచ్చారు. ఎంపిక చేసుకున్న ఆరు జిల్లాల నుండి జిల్లాకు 10 మంది చొప్పున సమావేశానికి రావాలన్నది సమావేశ లక్ష్యం. ఒక్క ప్రకాశం తప్ప మిగిలిన జిల్లాల నుండి జిల్లాకు 10 మంది చొప్పున హాజరయ్యారు. ఆరోగ్య కారణాల వల్ల, కోర్టు వాయిదాలు ఎదురవడం వల్ల ప్రకాశం నుండి మాత్రమే కొద్దిమంది (5గురే) హాజరయ్యారు.
ఈ ఉమ్మడి కార్యక్రమం ప్యాకేజీలో ఉన్న జిల్లాలు రాబోయే 6 నెలలలో పూర్తిచేయాలనుకున్న పనులు :
1. ప్రతి జిల్లాలో ఐక్యవేదిక ఇస్తున్న శిక్షకుల శిక్షణను పూర్తిచేసినవారు కనీసం 10 మంది ఉండాలి. 20 మందైతే మేలు. వీరు ప్రతి నెలా కనీసం రెండు రోజులు ఉద్యమానికి సమయాన్నివ్వడానికి సిద్ధమవ్వాలి.
2. మండలానికి ఇద్దరికి తగ్గకుండా శిక్షకుల్ని తయారు చేసుకోవాలి. వీరూ రెండు రోజులు సమయమివ్వాలి.
3. జిల్లాకు 500 మంది తగ్గకుండా 1000 మంది లక్ష్యంగా సభ్యత్వాలు చేర్చుకోవాలి.
4. మొత్తం మండలాలలోనూ మండల అవగాహనా సదస్సులు నిర్వహించాలి.
5. కనీసం సగానికి మించిన గ్రామాల ప్రాతినిధ్యం ఉన్న చోట్ల మండల కమిటీలు వేయాలి. అటుపైన మొత్తం గ్రామాల ప్రాతినిధ్యంకై కృషిచేయాలి. తగినన్ని గ్రామాలు ప్రాతినిధ్యం లేకుంటే సన్నాహక కమిటీ వేయాలి.
6. శిక్షకులుగా శిక్షణ పొందినవారు, శిక్షితులూ గ్రామాలలో సదస్సులు నిర్వహించేందుకు పూనుకోవాలి.
గమనికలు :
1. పరిచయమున్న, అందుబాటులో ఉన్న మండలాల పని మొదట పూర్తిచేసేయాలి. కొద్ది అదనపు శ్రమతో గానీ చేయలేని మండలాల విషయం అటుపై మొదలుపెట్టాలి.
2. మండల అవగాహనా సదస్సులు అక్కడి పరిస్థితులను బట్టి ఒక పూట గాని, ఒక రోజుగానీ ఉండేలా చేయవచ్చు.
3. మండల అవగాహనా సదస్సులలో 1. ఐక్యవేదిక పరిచయం, 2. స.హ.చట్టం, దాని వినియోగం.3. రాజ్యాంగం - కనీసావగాహన (స్థానిక ప్రభుత్వాలకు అధికారాల బదలాయింపు - గ్రామ సభ నిర్వహణ) అన్న అంశాలపై అవగాహన కలిగించాల్సి ఉంటుంది.
4. ప్రాథమిక శిక్షణ తరగతులు : మండల అవగాహనా సదస్సులకు హాజరైన వారి నుండి, సభ్యులుగా చేరిన వారి నుండి, సిద్ధపడ్డ వాళ్ళను, అభిలాష ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళకు రెండు రోజులు గానీ, మూడు రోజులు గానీ ఒకింత లోతైన అవగాహన కలిగించేందుకు ఉద్ధేశింపబడిందీ శిక్షణ. ఇందులో శిక్షణ పొందిన వారు గ్రామాలలో, పట్టణాలలో పౌరులకు అవగాహన కలిగించే పనిచేస్తారు. స.హ. దరఖాస్తులు పెట్టించడం, సలహాలివ్వడం లాంటి పనులూ చేస్తుంటారు. మండలానికి కనీసం ఇద్దరు, జిల్లాకు వంద మందికి తగ్గకుండా ఉండేలా ఈ శిక్షణ ఇవ్వాలి. వారానికో గ్రామం, కనీసం పక్షానికో గ్రామం వెళ్ళిరావడం చేయగలిగి ఉండాలి వీళ్ళు. గ్రామాభ్యుదయ సంఘాల ఏర్పాటు లక్ష్యంతో పనిచేస్తుండాలి వీళ్ళు.
ఉద్యమ మిత్రులారా ! ఉద్యమ నిర్మాణ పరంగా జిల్లాల్లో ఆరునెలల ప్రణాళిక అర్థమైందా ?
1. 20 మంది వరకు 10 మందికి తగ్గకుండా శిక్షకులు.
2. మండలానికి ఇద్దరు, జిల్లాకు 100 మందికి తగ్గకుండా శిక్షితులు.
3. అన్ని మండలాలలో అవగాహనా సదస్సులు, మండల, పట్టణ కమిటీలు.
4. 500లకు తగ్గకుండా 1000 లక్ష్యంగా సభ్యత్వ సమోదు.
ఆర్థిక వనరులు
1. జిల్లాకు 2 లక్షలు ప్రారంభ నిధి.
2. 6 నెలలు గాని, 1 సంవత్సరం గాని నెలకింతని ఇవ్వగలవారి జాబితా.
ఎ) నెలకు 100కు తక్కువ కాకుండా ఇచ్చేవారు.
బి) వివిధ కార్యక్రమాలకు అయ్యే వ్యయాన్ని భరించేవారు.
సి) వివిధ సాధన సామగ్రికి అయ్యే వ్యయాన్ని భరించేవారు.
డి) ఒకింత ఆర్థిక స్తోమత ఉండి, మంచి పనులకు చేయూతనిచ్చే వారి జాబితా.
నిధి సేకరణకు మన విధానం 1వ పుస్తకంలో ప్రకటించి ఉన్నాం. దానిని చూడండి. ముఖ్యంగా మూడు రకాలుగ నిధి సేకరణ జరగాల్సి ఉంది.
1. ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థలు గానీ, సంస్థలలోని వ్యక్తులు గాని స్తోమత ఉన్నవాళ్ళుగా మనమే కొంత విరాళం ఇవ్వడం.
2. మన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను అడిగి మరికొంత నిధిని సేకరించడం.
3. సభ్యత్వ నమోదు ద్వారా కొంత నిధిని సమకూర్చుకోవడం.
ఇప్పటికున్న అంచనాలను బట్టి జిల్లాకు నెలవారీ ఖర్చు సుమారు 25 నుండి 30 వేల వరకు. పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యం జరగాలంటే జిల్లాకు నెలకు లక్ష రూపాయలు ఖర్చు కావచ్చు.
1. జిల్లా కార్యాలయం అద్దె, నిర్వహణలకు 10,000.00
2. ప్రచార వాహనాలకు 10,000.00
3. సదస్సులు నిర్వహించడానికి 10,000.00
4. ప్రచార సామగ్రిని రకరకాలుగ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రచార సామగ్రిని తయారు చేయించడానికి స్పాన్సర్సును (సిద్దపడే వితరణశీలురను) ఎక్కడికక్కడ సమీకరించుకోవడం మేలు.
ప్రచార సామగ్రి క్రింద అవసరపడేటివి :
1. పాటల, ప్రసంగాల, క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాల సి.డి.లు.
2. స.హ.చట్టం-2005 మూల రూపం పుస్తకాలు.
3. స.హ.చట్టం ముఖ్యాంశాలు, దానిని వినియోగంలోకి తేవడానికి ఐక్యవేదిక విధానం పుస్తకం.
4. ఐక్య వేదిక పరిచయం.
5. రాజ్యాంగం - కనీసావగాహన, 73, 74 రాజ్యాంగ సవరణల వివరాలు.
6. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్‌కిచ్చే సందర్భంలో అంబేద్కర్ చేసిన మహోపన్యాసం, పుస్తకం.
7. వాల్‌పోస్టర్లు తొలిథలో కనీసం రెండు.
8. 4,5 కరపత్రాలు, దరఖాస్తు నమూనాలు.
9. ప్రేరణ (మానవ విలువలు, సంఘ జీవితం, సమాజంలో వ్యక్తి పాత్ర వగైరాలు) పుస్తకం.
10. వనరుల లభ్యత ననుసరించి జిల్లాకో కళాబృందం.
11. రెండు జిల్లాలకో వాహనం.
గమనిక : ఇవండీ ఉద్యమ సాధన సామగ్రి వివరాలు. ఇందులో పుస్తకాలు ఒక్కొక్కటీ 25 వేల కాపీలు అవసరం. వాల్ పోస్టర్లు లక్ష నుండి రెండున్నర లక్షల వరకు అవసరం. గ్రామానికి 10 చొ||న కరపత్రాలు జిల్లాకు లక్షకు తక్కువ గాకుండా ఎన్నివేయగలిగితే అన్ని. సి.డి.లు కనీసం 5 వేలు. వాహనానికి ఒక్కొదానికి లక్షరూపాయలు.
ఒక్కొ పుస్తకం సుమారు 50 పేజీలు ఉంటుందనుకుంటే ముద్రణా వ్యయం సుమారు 10 రూ.లు ఉండవచ్చు. ప్రస్తుతానికి తక్షణం ముద్రించాల్సినవి 4 పుస్తకాలు. ఒక్కొ పుస్తకానికి 2,50,000 రూపాయలు కావాలి.
ఒక్కో వాల్ పోస్టరుకు రూ.2.50 లు అవుతుంది. లక్ష ప్రతులనుకొంటే ఆ ఒక్కదానికి 2,50,000 రూ.లు అవుతుంది.
వాహనానికో లక్ష రూపాయల చొప్పున తొలిథలో 5 వాహనాలు - 5 లక్షలవుతాయి.
3 రకాల సి.డి.లు చేస్తే ఒక్కొక్కటి 10 వేల కాపీలు అనుకుంటే మూటికి 3 లక్షలవుతుంది.
మొత్తం ప్రచార సామగ్రి వ్యయభారం :
1. 4 పుస్తకాలకు - 25 వేల కాపీల చొ||న = 4 þ 2,50,000 = 10,00,000.00
2. రెండు వాల్ పోస్టర్లకు = 2 þ 2,50,000 = 5,00,000.00
(భిత్తి చిత్రాలు, గోడపలకలు)
3. 5 వాహనాలకు = 5 þ 1,00,000 = 5,00,000.00
4. 3 సి.డి.లకు 10 వేల కాపీలకు కాపీ 10 చొ||న = 3 þ 1,00,000 = 3,00,000.00
5. కేంద్ర కార్యాలయ నిర్వహణకు నెలకు 30 వేలు = 12 þ 30,000 = 3,60,000.00
మొత్తం 26,60,000.00
యోచనాశీలురూ, వదాన్యులునైన మనసున్న మనుషులారా !
ఐక్యవేదిక ఒక థ కార్యక్రమాలకు ప్రచార సామగ్రికయ్యే వ్యయభారం సుమారుగా 30 లక్షల వరకు ఉంటోంది. ఇవికాక జిల్లాలో సభలు, సమావేశాలకు, వాహన ఖర్చులకు సుమారు నెలకు 30 వేలు అంటే సం||నికి ఒక మొత్తంగా సుమారు 4 లక్షల రూపాయలు అవసరం ఉంది.
సమాచార హక్కు చట్టం వినియోగం - ఐక్యవేదిక పద్ధతి
సమాచార హక్కు చట్టాన్ని తమదైన శైలిలో వినియోగించుకుంటున్న వారికి, సమాచార హక్కు చట్టాన్ని, ఆ చట్ట స్పూర్తికి అనుగుణ్యంగా వినియోగంలోకి తేవాలనుకుంటున్న స.హ.చట్ట ఉద్యమకారులకు, యోచనాశీలురైన సహచర మిత్రులారా !
చట్టం వచ్చి ఆరేండ్లయినా అదింకా గణింపదగ్గ స్థాయిలోనైనా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేదు. చట్టం రాకముందునుంచీ కొందరు సమాచారాన్ని పొందటానికి ఎవరికి తోచిన రీతిలో వారు కృషిచేసేవారు. చట్టం వచ్చాక వారూ మరి కొందరూ చట్టాన్ని ఆసరాగా చేసుకొని మరింత శక్తివంతంగా సమాచారాన్ని పొందటానికీ, పాలన నిర్వహణ భాగాలలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికీ, దానిని ఒక బలమైన ఆయుధంగా ప్రయోగించడమూ చేస్తూవచ్చారు.
చట్టాన్ని గురించి ప్రజలకు అవగాహన కలిగించడమూ, పౌరులే దానిని ఎక్కడికక్కడ వినియోగించుకోగలిగేలా వారికి తర్ఫీదునివ్వడం అన్న అస్సలు పనిపై అంతగా శ్రద్ధపెట్టకపోవడం అన్న పెద్దలోపం అటు ప్రభుత్వం వైపునా, ఇటు కమీషన్ వైపునే కాకుండా స.హ.చట్టంపై పనిచేస్తున్న సంస్థలు, క్రియాశీల కార్యకర్తల (యాక్టివిస్ట్‌ల) వైపునా జరిగిపోయింది.
ముందుగా మనమంతా ఒక పక్కా నిజాన్ని స్పష్టంగా గమనించాల్సి ఉంది. ఒక వ్యక్తిగా స.హ. చట్టాన్ని కొద్దిగానో, గొప్పగానో వినియోగించుకోవడం వేరు, స.హ.చట్టం సమాజంలో వినియోగంలోకి రావడం వేరు. స.హ.చట్టం వినియోగంలోకి రావడం మన లక్ష్యం కావాలి గానీ, కొద్దిమంది అవగాహనాపరులు, ఏవోకొన్ని అవినీతి కుంభకోణాల వెలికితీతకై స.హ.చట్టాన్ని వినియోగించుకోవడం అన్న పని మన లక్ష్యం కారాదు. స.హ.చట్టాన్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో అలాంటివన్నీ అతి చిన్న పనులు మాత్రమే.
అందుకనే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, అధ్యయనంలో భాగంగా, దరఖాస్తులు పెట్టడం మన పనికాదు, ప్రజలకు దరఖాస్తులు పెట్టడం నేర్పడమే మనపని అని ప్రస్పుటంగా తెలియజెప్తున్నాం. ఎంతగా విడదీసి వివరంగా చెబుతున్నా, శిక్షణకు వచ్చిన వారిలోనూ, సమాజంలో స.హ.చట్టాన్ని వినియోగిస్తున్న యాక్టివిస్టులలోనూ ఎక్కువమంది ఈ రెంటి మధ్య ఉన్న తేడాలను గమనించడం లేదు. ఒకరిద్దరు గమనించినా పట్టించుకోవడం లేదు. ఎంతో కొంతమంది ఇంతకాలంగా (2005 నుండి ఇప్పటి వరకు) స.హ.చట్టాన్ని వాడుతూ వస్తున్నా చట్టాన్ని గురించిన అవగాహన పౌరులలో 2 నుండి 5 శాతానికి మించి కలగలేదు. దీనికంటేను విచారకరమైన చేదు నిజమేమంటే ఉన్న ఆ కొద్దిమందీ యాక్టివిస్టుల లోనూ ఎక్కువ మందికి ఇప్పటికీ చట్టాన్ని గురించి సరైన అవగాహన లేదు. దరఖాస్తు పెట్టడం, బలమూ, చొరవా ఉంటే ఆఫీసులకెళ్ళి భయపెట్టడం లేదా బ్రతిమిలాడో పనులు చేయించుకోవడం అన్న విధానానికి అలవాటు పడిపోయారు కొందరు. మరి కొందరైతే అవినీతిని అణచడానికి వినియోగించుకోవలసిన ఈ చట్టాన్ని, అవినీతిపరులైన అధికారులను, ఆ అవినీతికి కారకులైన వ్యక్తులను బెదిరించడానికే ఉపయోగించుకొన్నట్లూ ఆధారాలు (రుజువులు) లభిస్తున్నై.ఆ మధ్య ఒక మహానుభావుడు అన్ని కార్యాలయాలలోని, అన్ని రకాల సమాచారం, 20 ఏండ్లనాటిది ఇవ్వమని దరఖాస్తు చేశాడు. పౌర బాధ్యతలేమిటో తెలియని వాడు, మతిచలించిన వాడు తప్ప అంత పిచ్చిపని మామూలు మనిషి చేయలేడు.
చట్టం, అధికారుల్ని బాధ్యతాయుతంగా ప్రవర్తించమని చెపుతోంది. అలాగే ఆ చట్టాన్ని యజమాని తనంతో జాగ్రత్తగా వాడుకోమని పౌరులకూ చెబుతోంది. బాధ్యతలేని ఉద్యోగి కంటే, బాధ్యతలేని పౌరుడు చెడ్డవాడు, ప్రమాదకారి అవుతాడు. కనుక స.హ.చట్టాన్ని బాధ్యతారహితంగా వాడినా, దుర్వినియోగం చేసినా అది శిక్షార్హమైన నేరమే అవుతుంది. ఎలా విధినిర్వహణలో బాధ్యతారహితంగా ప్రవర్తించేవారిపట్ల మనం నిఘా కలిగి ఉండాలో, అలానే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగాను, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపట్ల నిఘా కలిగి ఉండాలి. ఇది మంచి సమాజాన్ని ఆశించే వారంతా మౌలికమైన విషయంగా పరిగణించాలి.
ఎందుకింతగా చెబుతున్నానంటే సమాజంలో ఎప్పుడో గాని, ఎక్కడో గాని, ఏదైనా (అది మంచైనా, చెడైనా) ఉండగలుగుతుందంటే అప్పటికి అక్కడ జనం దానిని ఉండనిమ్మంటున్నారనే అర్థం. అవినీతి ఉండగలుగుతోందంటే, జనమే దానిని ఉండనిమ్మంటున్నారని అర్థం. సమాజాన్ని సంస్కరించాలనుకునే రకానికి చెందిన వారంతా (మనలాంటి వారంతా) ఖచ్చితంగా తెలుసుకుని ఉండాల్సిన నిప్పులాంటి నిజం ఇది. ఈ విషయంలోగాని స్పష్టత లేకుంటే ఆపై జరగాల్సిన లేదా చేయాల్సిన కార్యక్రమం అంతా అరకొరగానే జరుగుతుంది. కనుక సమాజంలో అవినీతిని తొలగించాలన్నా, ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలన్నా ప్రజలు ఆ విషయాన్నెరిగి, దానిని ఇష్టపడాలి. రావలసిన లేదా తెద్దామనుకుంటున్న ఏ మార్పు విషయంలోనైనా ఇంతకంటే దగ్గరిదారి, సరైన దారి, సరళమైన దారి మరొకటి లేదు. ఉండబోదు కూడా. అందుకనే పెక్కురు అనుభవజ్ఞులైన సామాజిక పరిశోధకులు, ప్రజలు మేల్కొనకుండా, సమస్యా పరిష్కారంలో భాగస్వాములు కాకుండా, సామాజిక పరివర్తన అనేది జరగనే జరగదు అని తేల్చారు.
మిత్రులారా ! మన ఐక్యవేదిక కూడా, ఈ విషయంలో అట్టి నిర్ణయాన్నే కలిగిఉన్నది. అది స.హ.చట్టం అమలు విషయంలో గానీ, ప్రజాస్వామ్యం అమలు విషయంలోగానీ, మరొకటి, మరొకటి గానీ ప్రజలు సన్నద్దం కావాలన్నదే అత్యంత ప్రధానాంశం. కనుకనే ఇప్పటివరకు స.హ.చట్టం వినియోగ క్షేత్రంలో క్రియాశీలంగా పనిచేస్తున్న యాక్టివిస్టుల విధానం కంటె వేరైన విధానాన్ని ఎంచుకుంది. ఆ విషయాన్ని వ్యక్తంచేయడానికనే, దరఖాస్తులు పెట్టడం మన లక్ష్యం- ప్రదానం- కాకూడదు. ప్రజలకు దానిపై అవగాహన కలిగించి, వారే దరఖాస్తులు పెట్టి అవసరమైన సమాచారం రాబట్టుకునేలా వారికి తర్ఫీదునివ్వడమే మన లక్ష్యం కావాలి అనంటున్నాం. ఈ విధానాన్ని, దీని అవసరాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయడం మన ప్రచార లక్ష్యాలలో అతి ప్రధానమైనదై ఉంది. ముందీ విషయాన్ని గుర్తించండి.
స.హ.చట్టం వినియోగంలోకి తేవడం ఎలా ?
1. దానిపై పౌరులకు అవగాహన కలిగించి, దానిని వాడుకునే నేర్పును వారికి కలిగించడం.
2. స.హ.చట్టం ప్రకారం అధికార యంత్రాంగం చేయవలసిన పనుల విషయంలో వారిని వత్తిడి చేయాలి.
3. సమాచార కమీషన్ విధులు, బాధ్యతల విషయంలో స.హ.చట్టం చెబుతున్న దానిని అమలుచేయాలి.
4. స.హ.చట్టాన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికై, చట్టం ప్రభుత్వం చెయ్యాల్సిన పనులుగా వేటిని గురించి నిర్ధేశిస్తున్నదో, ఆ పనులు చేయమని ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.
5. అవసరమైతే పై మూడు విషయాలలో న్యాయసహాయం కొరకై న్యాయస్థానాలను ఆశ్రయించాలి.
6. పై వాటితో పాటు ఎక్కువలో ఎక్కువ బహుళ ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకై దరఖాస్తులు చేస్తుండాలి.
7. అలాగే సంపాదించిన (రాబట్టిన) సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి పాలన, నిర్వహణలలో అవకతవకలు జరగకుండేలా పర్యవేక్షించుకుంటుండాలి. న్యాయం జరుగుతుండేలా కృషిచేయాలి.
పై విషయాలకు సంబంధించిన సెక్షన్ల వివరాలివిగో. జాగ్రత్తగా అర్థం చేసికొని వీటివరకు బట్టీపట్టేయండి.
1. సెక్షన్ -4 : ఇందులో నాలుగు ఉప విభాగాలు (సబ్ సెక్షన్లు) మళ్ళా వాటిలో కొన్నింటికి ప్రత్యేకాంశాలు (క్లాజులు) ఉన్నాయి. అందులో 1ఎ, -1బి అన్నవి ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్చందంగా ప్రకటించాల్సిన సమాచారపు వివరాలున్నై. చట్టం అమలులోకి వచ్చిన 120 రోజులలోపు ప్రతి కార్యాలయంలోనూ పై రెండు అంశాలకు చెందిన సమాచారం ముద్రించి ప్రజలకు తెలిసేటట్లు వారిక అందుబాటులో ఉండేట్లు చూడాలి.
4/సి : చట్టం అమలులో లేదా సెక్షన్ 4(1)/ఎ & బి లను అమలు పరిచే విషయంలో ఏదైనా ముఖ్యమైన విధివిధానాలను రూపొందించేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.
4/డి : న్యాయనిర్ణయ రూపమైన తీర్పులిచ్చే సందర్భంలో, అలాంటి నిర్ణయం చేయడానికి గల కారణాలను, ఆ నిర్ణయాల ప్రభావానికి లోనయ్యే వ్యక్తులకు వివరించాలి.
వివరణ : సాధారణంగా ఆ వ్యక్తులు అధికార యంత్రాంగం గానీ, దరఖాస్తు దారుగానీ, తృతీయ పక్షంగా ఉన్నవారు గానీ అయ్యుంటారు.
సెక్షన్ - 4/2 : సమాచారం పొందడానికై ప్రజలకు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం వీలైనంత తక్కువగా ఉండేలా ఇవ్వగల సమాచారాన్నంతటినీ అంటే సెక్షన్ 4/1ఎ & బిల క్రింద నిర్దేశించబడ్డ సమాచారాన్ని, వాటి విషయంలోనూ వీలైనంత ఎక్కువ సమాచారాన్ని, ప్రతి అధికార యంత్రాంగమూ ఎవరూ కోరకుండానే స్వచ్చందంగా, ఇంటర్నెట్‌తో సహా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా (వీటి వివరాలకై సెక్షన్ 2/ఎఫ్ ను జాగ్రత్తగా పరిశీలించండి) క్రమానుగతంగా (అంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని జతపరుస్తూ) ప్రజలకు అందించే కృషిచేయాలి. (అంతేగాకుండా)
సెక్షన్ - 4/3 : ప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండే రూపంలో, రీతిలో విస్తృతంగా వ్యాప్తిచేయాలి.
సెక్షన్ - 4/4 : సమాచారాలను వ్యాప్తిచేసేటప్పుడు 1. వీలైనంత చవకగా 2. స్థానిక వాడుక భాషలో 3. సమాచార వ్యాప్తికి స్థానికంగా బాగా ఉపకరించే పద్ధతుల ద్వారా సిద్ధం చేయాలి. అధికార యంత్రాంగాలు సమాచారమంతటిని వీలైతే ఎలక్ట్రానిక్ రూపంలోనూ పౌరసమాచార అధికారికి అందుబాటులో ఉండేలా శ్రద్ధతీసుకోవాలి.
వివరణ : సెక్షన్ 4 స.హ.చట్టమంతటికీ ఆత్మవంటిది. స.హ.చట్టపు హృదయమంతా ఇందులో పొందుపరచబడిఉంది. 1, అధికార యంత్రాంగం వీలైనంత ఎక్కువ సమాచారాన్ని స్వచ్చందంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలైన అన్ని పద్ధతుల ద్వారా ప్రకటించాలి. 2. అదెంత విస్తారంగా ఉండాలంటే, దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం ఎప్పుడో కానీ రాకూడదు. 3. ప్రతి అధికార యంత్రాంగమూ పూర్తి సమాచారాన్ని తేలికైన విధానాల ద్వారా పొందుపరచి పౌర సమాచార అధికారికి అందుబాటులో ఉంచాలి.
గమనిక : మిత్రులారా ! ఒక ఉద్యమంగా, స.హ.చట్టం శక్తివంతంగా అమలులో ఉండేలా చేయాలంటే సెక్షన్ 4ను అమలు చేసేలా ప్రభుత్వంపైనా, కమీషన్ పైనా, అధికార యంత్రాంగం పైనా వత్తిడి తేవడం మొదట జరగాల్సిన పని అవుతోంది. కనుక 4/1 ఎ & బి అమలు అయ్యేలా చూడండి. ఆ విషయంపై సమాచారం కోరుతూ దరఖాస్తు చేయడం, తనిఖీ చేయడం అన్న రెండూ చాలా కీలకమైన పనులు.
అధికారులు వారి వారి విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుండాలన్నది ప్రపంచమంతా అంగీకరించిన సూత్రం. (నియమం) దీనికి మినహాయింపు లేదు. ఈ సూత్రాన్ని స.హ.చట్టం పరిధిలోకి వచ్చి అధికారులకు వర్తింపజేస్తే దాని రూపం ఇలా ఉంటుంది.
సెక్షన్ - 5/1 : చట్టం అమలులోకి వచ్చిన 120 రోజులలోపు ప్రతి కార్యాలయం లోనూ విధిగా సమాచార అధికారుల్ని నియమించాలి.
వివరణ : ఈనాడు ఏ కార్యాలయంలో గానీ పౌరసమాచార అధికారి లేడన్న మాట వినపడకూడదు. ఈ విషయం గుర్తుంచుకోండి. అవసరమైతే అధికారులకూ గుర్తుచేయండి.
సెక్షన్ - 5/2 : ప్రకారం 100 రోజులలోగా, అంటే పౌర సమాచార అధికారి నియామకాలు పూర్తవడానికి 20 రోజుల ముందుగానే సహాయ పౌర సమాచార అధికారుల్ని నియమించాలి.
సెక్షన్ - 5/3 : 1. సమాచారం కొరకు వచ్చిన ప్రతి అభ్యర్థననూ పౌర సమాచార అధికారి పరిశీలించాలి. 2. అంతేగాక, సమాచారం కోరుతున్న వ్యక్తులకు సహేతుకమైన స్థాయి వరకు సహకారం అందించాలి. ఈ రెండో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సెక్షన్ 6/1బి ని కలిపి చదువుకోండి.
వివరణ : స.హ. చట్టంలోని కీలక సూత్రీకరణలలో ఇది ఒకటి. ఇది పౌర సమాచార అధికారి విధిగా చేయాల్సిన పనులను నిర్దేశిస్తోంది. స.హ.చట్టం ప్రకారం ప్రతి దరఖాస్తునూ విధిగా స్వీకరించాలి. దరఖాస్తు పెట్టుకునే పౌరునికి దరఖాస్తు పెట్టుకునే విషయంలోనూ చేయగల సాయమంతా బాధ్యతగా చేయాలి.
గమనిక : ఈ మధ్య కాలంలో కొన్ని కార్యాలయాలలో పౌ.స. అధికారులు నాకు పనిభారం ఎక్కువైందంటూ, సిబ్బంది లేరంటూ ఎగవేత థోరణి కనబరుస్తున్నారు. అట్టి వైఖరిని అవలంభించకూడదంటోంది సెక్షన్ 5/4. అందులో పౌర సమాచార అధికారి తన విధిని సక్రమంగా వినియోగించడానికై మరొకరి సహాయం అవసరమని భావించిన పక్షంలో ఇతర అధికారుల సహాయం కోరమంటోంది. అలా కోరినప్పుడు ఆ ఇతర అధికారి సహాయం విధిగా అందించాలని సెక్షన్ 5/5 చెబుతోంది. అలా సహకారం అందించనిచో ఆ ఇతర అధికారి స.హ.చట్టం ఉల్లంఘించినట్లే అవుతుందనటానికి వీలుగా, సహాయం కోరబడ్డ అధికారి ఆ సమయంలో పౌర సమాచార అధికారిగానే పరిగణింపబడతాడని చెబుతోంది.
మరో ముఖ్య గమనిక : అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ కార్యాలయంలో పి.ఐ.వో., ఎ.పి.ఐ.వో.లిరువురూ లేకున్నా కార్యాలయంలో ఉన్న ఎవరో ఒకరు విధిగా దరఖాస్తును స్వీకరించి, అది ముట్టినట్లు ధృవీకరించాలన్న ఆదేశాలు కార్యాలయాలకు ఇవ్వబడ్డాయి. ఆదేశం వివరం ...
కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తు స్వీకరించకపోవడమన్నది చేయకూడదు.
దరఖాస్తు స్వీకరించకపోవడమన్నది స.హ.చట్టాన్ని అతిక్రమించడంలో మొదటి థ. దరఖాస్తును గడువులోపల పరిష్కరించకపోవడం చట్టాన్నతిక్రమించడంలో రెండో మెట్టు. ఇలా జరిగినప్పుడు చట్టాన్నుల్లంఘించిన సమాచార అధికారిపై చట్టాన్ననుసరించి శిక్షలు, జరిమానాలు విధించడం, ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసిందిగా సంబంధితాధికారులకు కమీషన్ సిఫారసు చేయడం మొదలెడితే, పౌరసమాచారం అలసత్వం, బాధ్యతారాహిత్యం తగ్గుముఖం పట్టి చట్టం అమలు కావడంలోని ప్రధానాటంకం తొలగిపోతుంది. చిత్తశుద్ధి ఉంటే ప్రధాన సమాచార కమీషనర్ ఒక్క కలం పోటుతో విధానానికి తెరతీయవచ్చు. కమీషన్ దృష్టికి విషయాన్ని ఎంత బలంగా తీసుకెళ్ళగలిగితే అంతగా మనం ఉద్యమించినట్లు. దీనిని అర్థం చేసుకుని ప్రధాన సమాచార కమీషనర్ గారికి ఫిర్యాదులు చేయండి. అభ్యర్ధిస్తూ లేఖలు వ్రాయండి.
జన్నత్ హుస్సేన్ గారు :
ప్రస్తుతం ప్రధాన సమాచార కమీషనర్‌గా నియమితులైన జన్నత్ హుస్సేన్ గారు, నిర్వహణాధికారిగా అనుభవజ్ఞులు. మంచి అధికారిగా మన్నన పొంది ఉన్నవారు. ఆయన గారు మన ఐక్యవేదికతో మిత్ర సంబంధాలను కొనసాగిస్తున్నారు. స.హ.చట్టాన్ని వినియోగంలోకి తెచ్చే విషయంలో మనతో సహకరించటానికి, మన సహకారం తీసుకోవటానికి కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు. రాష్ట్రానికి స.హ.చట్టం అమలు విషయంలో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలపాలన్న లక్ష్యం తనకుందని ఐక్యవేదికలో సభాముఖంగానే ప్రకటించి ఉన్నారు. ఆయన చేస్తున్న శ్రమ, తీసుకొంటున్న నిర్ణయాలు అందుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి. అయినా ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితులలో ప్రభుత్వం ఆయన మాటనూ వెంటనే అమలుచేసేందుకు సిద్ధపడటం లేదనిపిస్తోంది. ఆయనతోపాటు పదిమంది వరకు కమీషనర్లను నియమించవచ్చని చట్టం చెబుతున్నా ప్రభుత్వం కమీషనర్ల నియామకం విషయమై నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటోంది. కనుక కమీషనర్ల నియామకం విషయంలో ఆయనతో కలిసి ప్రభుత్వంపై వత్తిడి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఐక్యవేదిక తనకు తానుగా ప్రభుత్వంపై న్యాయస్థానం ద్వారా పోరాడటానికి సిద్ధమవుతోంది. సందర్భం ముఖ్యం గనుక, ప్రజల మనిషిగా ఉండేందుకు సిద్ధపడిన జన్నత్ హుస్సేన్ గారిని ఐక్యవేదిక ఈ ముఖంగా మనస్పూర్తిగా ఉద్యమాభినందనలు తెలుపుతోంది. అందుకోండి మిత్రమా ! ఐక్యవేదిక అభినందనలు. స.హ.చట్టం అమలుకు తెచ్చేవిషయంలో మేమూ మీతోపాటున్నాం అని సంతోషంతో మాటిస్తున్నాం.
మళ్ళీ చట్టం విషయంలోకి వద్దాం. దానిపై దృష్టిపెట్టండి. దరఖాస్తు స్వీకరించడం, పరిష్కరించడం అన్న రెండు పౌర సమాచార అధికారికి తప్పనిసరి అన్నది గమనించాం కదా! ఏ కారణాలు చెప్పి (చూపి) గానీ, దరఖాస్తు స్వీకరించకుండడం గానీ, దరఖాస్తుకు గడువులోపల సమాధానం చెప్పకుండడం గానీ ఆయన చేయనే కూడదు. ఈ సందర్భంగా పౌరసమాచార అధికారుల దృష్టికి చట్టానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని తీసుకువస్తున్నాం. ఆచరణలో దరఖాస్తు దారునకు సమాధానం చెప్పడం గానీ, సమాచారం ఇవ్వడానికి గానీ ఎక్కువసార్లు 30 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారు. నిజానికి చట్టం 7/1 ద్వారా వీలైనంత త్వరగా సమాచారం అందించాలని, తప్పనిసరైతే తప్ప 30 రోజుల వరకు పొడిగించరాదని తెలుపుతోంది. కొద్దిమంది అవకాశమున్నంత త్వరగా సమాధానం - సమాచారం- అందిస్తున్నా, చాలామంది త్వరగా ఇవ్వగలిగిన సమాచారం విషయంలోనూ జాప్యం చేస్తున్నారు. ఉద్యోగులలోని ఈ వైఖరి, ఉద్యోగులను ప్రజలు శతృదృష్టితో చూసేలా చేస్తోంది. స.హ.చట్టాన్ని పౌరులు ఎక్కువగా వాడుకోవటానికి అలవాటైన కొద్దీ, ఇది ఉద్యోగులకే నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఇప్పటికైనా పౌరసమాచార అధికారులు సమాచారాన్ని ఇవ్వగలిగినంత త్వరగా ఇవ్వడానికి సిద్ధపడడం ద్వారా ప్రజలలోని వ్యతిరేక భావాన్ని తొలగేటట్లు యత్నించాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో మరో విషయమూ ఐక్యవేదిక దృష్టికి వచ్చింది. కొంతమంది సమాచార అధికారులూ గడువులోపల సమాచారం ఇవ్వకపోవడమేగాక, మొదటి అప్పీలు థలోనూ సమాచారాన్నివ్వకుండా తాత్సారం చేస్తున్నారు. లేదా రెండవ అప్పీలు విచారణకొచ్చాక, అప్పుడు సమాచారాన్ని ఇచ్చి పనిపూర్తయిందనిపిస్తున్నారు. రెండవ అప్పీలు థలో సమాచారాన్నిచ్చిన సమాచార అధికారులకు అలా ఇవ్వదగిన సమాచారం సకాలంలో ఇవ్వనందుకు జరిమానాలు విధించడం, క్రమశిక్షణాచర్యలకు సిఫారసు చేయడం కమీషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అది వారి నైతిక బాధ్యత. చట్టం ఎరిగిన వారి ప్రకారం ఇవ్వకూడని సమాచారమైతే రెండవ అప్పీలులోనూ ఇచ్చే పరిస్థితి రాదు. ఇవ్వగూడనిదైతే అప్పీలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు. ఈ విషయాలలో ఎట్టి వత్తిడి లేకపోవటంతో, సమాచారం ఇవ్వడమన్నది ఒక ఆటగా, ప్రహసనంగా మారిపోయింది.
ఈ విషయంలోనూ మనం కమీషన్‌పై వత్తిడి తేవలసి ఉంది. కమీషన్ ఈ విషయంలో సెక్షన్ 20/1 & 2 లను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది. (సెక్షన్ 20/1 జరిమానాను, 20/2 క్రమశిక్షణా చర్యలను గురించి తెలుపుతున్నాయి.)
ఇక స.హ.చట్టాన్ని రోడ్డు కెక్కించి పరుగుపెట్టించడానికి ఉద్యమ సంస్థ చెయ్యాల్సిన మరో రెండు ముఖ్యమైన పనులున్నాయి. అవి సెక్షన్ 25, సెక్షన్ 26లు అమలయ్యేలా యత్నించడం. అవేమి చెబుతున్నాయంటే
సెక్షన్ - 25 : 25/1 కమీషన్ ఈ చట్టం అమలు జరిగిన, జరుగుతున్న తీరుకు సంబంధించి ప్రతి సం|| ఒక వార్షిక నివేదికను రూపొందించాలి. ఆ నివేదిక కాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి. కమీషన్ ఆపనిని సక్రమంగా నిర్వహించటానికి వీలుగా...
25/2 ప్రకారం ప్రతి మంత్రిత్వ శాఖ తన పరిధిలోని అధికార యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కమీషన్‌కు పంపాలి.
25/3 ప్రకారం కమీషన్ రూపొందించాల్సిన తప్పనిసరి అంశాల జాబితా ఉంది. వాటిని చట్టం దగ్గర చూడండి. ఆ అంశాలలో రెండు ఉద్యమ రీత్యా మనం గమనించాల్సినవి ఉన్నవి, అవి 25/3లోని ఎఫ్ & జి సూత్రీకరణలు.
25/3ఎఫ్ : ఈ చట్టం స్ఫూర్తిని, ఉద్ధేశాలను అమలులో పెట్టేందుకు అధికార యంత్రాంగం తరపున ఏదైనా కృషిజరిగి ఉంటే ఆ వివరాలను నివేదికలో పొందుపరచాలి.
గమనిక : అధికార యంత్రాంగం తరపున జరగాల్సిన కృషిని గురించే సెక్షన్ 13, 16లలో 6వ ఉప విభాగం (సబ్‌క్లాజ్) లోనూ, 19/8ఎ/5 లోనూ చెప్పబడి ఉంది.
13,16లలో, చట్టం క్రింద నిర్వహించాల్సిన కార్యాలను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు అవసరమైన అధికారులను, ఉద్యోగులను, వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రధాన కమీషనర్లకు అందించాలి అన్న ఆదేశం ఉంది.
దానితోపాటు సెక్షన్ 19/8ఎ/5 ప్రకారం కమీషన్‌కు, అధికార యంత్రాంగంలోని అధికారులకు సమాచార హక్కు చట్టంపై శిక్షణ నిచ్చే సదుపాయాలను హెచ్చించేందుకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.
వివరణ : సెక్షన్ 25 ప్రకారం కమీషన్ చట్టంలోని పై సెక్షన్ల ప్రకారం చేయాల్సిన, చేయగల పనుల విషయమై, కమీషన్‌పై వత్తిడి తీసుకురావడమన్నది మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పని.
అలాగే సెక్షన్ 20/1,2ల ప్రకారం జరిమానాలు, క్రమశిక్షణ చర్యలు అవసరమైన ప్రతిసారీ అమలు చేయాల్సిందిగా కమీషన్‌పై వత్తిడి తేవాలి.
స.హ.చట్టాన్ని సమర్థవంతంగా వినియోగంలోనికి తేవడానికి ఒక ఉద్యమంగా మనం చేయాల్సిన మరో ముఖ్యమైన అంశం సెక్షన్ 26ను ఖచ్చితంగా అమలు చేయమని ప్రభుత్వంపై వత్తిడి తేవడం.
సెక్షన్ 26 : 26/1ఎ. ప్రజలకు ముఖ్యంగా అణగారినవర్గాల ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలి.
26/1బి : అటువంటి కార్యక్రమాలు నేరుగా తామే చేయడం, అట్టివాటినే చేయడం కొరకు ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాలను ప్రోత్సహించడం చేయాలి.
వివరణ : ఉద్యమ వాప్తిరీత్యా 26/1బి చాలా కీలకమైనది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాధికారులు అవగాహనా సదస్సులు ఏర్పరచవచ్చని, ఏర్పరచేలా ప్రభుత్వమే వారిని కదిలించాలనీ చెబుతోందీ సూత్రం. దీనిని చూపి అటు ప్రభుత్వంపైన అలాంటి ఆదేశాలు దిగువ కార్యాలయాలకు జారీచేయమని, అలాంటి పనులు చేయమని దిగువ కార్యాలయాలపైన ఉద్యమం వత్తిడి తేవాలి. ప్రజలచేత ఆ మాట అడిగించాలి.
గమనిక : ఉద్యమ మిత్రులారా !
ఈ వక్కపని సమర్ధవంతంగా చేయగలిగితే. స.హ.చట్టాన్ని గురించి ప్రజలందరకు వెంటనే ఎంతో కొంత తెలుస్తుంది. తర్వాత్తర్వాత దాని వినియోగ సామర్ధ్యాన్ని పెంచుకునే పనిచేసుకోవచ్చు.
26/1సి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగాలు తాము చేపట్టిన కార్యకలాపాలను గురించి సరైన సమయంలో, సమర్థవంతంగా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకందించేలా చూడాలి.
26/1డి ప్రకారం ప్రభుత్వమే కేంద్ర, రాష్ట్ర సమాచార అధికారులకు శిక్షణనివ్వడం, అధికార యంత్రాంగాలు ఉపయోగించుకోవడం కొరకు శిక్షణ సామగ్రిని రూపొందించడం విధిగా చేయాలి.
వివరణ : ఈ భాగంలో ప్రచార సామగ్రీ అంతర్భాగంగా ఉంది. 1. స.హ.చట్టం పుస్తకాలు, 2. శిక్షణ ప్రణాళిక, 3. వాల్ పోస్టర్లు, కరదీపికలు ఇలా చేయగలిగినన్ని రూపాలూ ఈ సూత్రం క్రిందకు వస్తాయి. మరిన్ని వివరాలకు 26/2,3లు కూడా చదువగలరు.
26/3డి ప్రకారం పౌరసమాచార అధికారి దరఖాస్తుదారునకు ఏ మేరకు సహకారం అందించాలన్నది గైడ్‌లో పొందుపరచాలి.
గమనిక : స.హ.చట్టం క్రియాశీల కార్యకర్తలు (యాక్టివిస్టులు) ఈ గైడ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వమని దరఖాస్తు చేయండి.
అతి ముఖ్య గమనిక : సెక్షన్ 30/1 ప్రకారం చట్టంలోని నిబంధనల అమలుకు ఆచరణలో ఏదైనా అవరోధాలు ఎదురైతే వాటిని, అతిగమించడానికి చట్టం వచ్చిన రెండేళ్ళలోపే అవసరమైన నిబంధనలు రూపొందించుకోవాలి. చట్టం వచ్చిన రెండేళ్ళ తరువాత చట్టంలోని ఏ నిబంధననూ సవరిస్తూ ఉత్తర్వులు చేసేందుకు వీలులేదు. చట్టాన్ని రూపొందించిన విజ్ఞులకు ముందుగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చట్ట నిబంధనలకు ప్రతికూలంగా ప్రభుత్వాలైనా ఇప్పుడు క్రొత్త ఉత్తర్వులు ఇవ్వకూడదనడం వల్ల చట్టానికి వారు ఎంతో స్థిరత్వాన్ని కల్పించారు. వారికి మరోమారు కృతజ్ఞతలు చెప్పుకుందాం.
ముగింపు :
యోచనాశీలురైన పౌరులకు, స.హ.చట్టాన్ని శక్తివంతంగా వినియోగంలోకి తేవాలనుకుంటున్న ఉద్యమ సహచరులకు ! మిత్రులారా !
1. కేవలం కొద్దిమంది, కొన్ని కుంభకోణాలకు చెందిన సమాచారానికై దరఖాస్తులు పెట్టినంతమాత్రాన స.హచట్టం పూర్తి స్థాయిలో- చట్ట స్ఫూర్తిననుసరించి - వినియోగంలోకిరాదు. చట్టం పూర్తిస్థాయిలో వినియోగంలోనికి రావాలంటే..
2. ఎ) పౌరులు దీనిని గూర్చి అవగాహన కలిగించుకుని దరఖాస్తులు పెట్టి సమాచారం సేకరించుకునే పని మొదలుపెట్టాలి.
బి) అధికారయంత్రాంగం సెక్షన్ 4 ను తు.చ తప్పకుండా అమలుపరచాలి.
సి) పౌర సమాచార అధికారులు సెక్షన్ 5/3/1 ప్రకారం విధులు నిర్వర్తిస్తూ, 6/1బి ప్రకారం పౌరులకు సహకరించాలి.
డి) కమీషన్ సెక్షన్ 25 ప్రకారం తన అధికారాలను - విధులనూ నిర్వర్తిస్తుండాలి.
ఇ) ప్రభుత్వం సెక్షన్ 26 ప్రకారం తన అధికారాలను - విధులను నిర్వర్తిస్తుండాలి.
3. ఉద్యమ సంస్థలు పై రెండులోని ఐదు అంశాలు అమలయ్యేలా ఆయా స్థానాలలోని వారిని చైతన్యపరచే పనిచేయాలి. స.హ.చట్టాన్ని వినియోగంలోకి తేవడానికి మనలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఇదే. అందుకనే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక స.హచట్టం విషయంలో ఈ అయిదు అంశాలపై దృష్టి పెట్టి, వాటిని క్రియాశీలం చేయడానికై నడుంబిగించింది. ఆ దిశగా జరుగుతున్న పనిలో పాలుపంచుకోండని సమాజహితం కోరే వారందరినీ ఆహ్వానిస్తోంది. కలసి కదులుదాం రండి. మంచికి చేయూతనివ్వండి. విూ. స.హ.ప్ర.ఐక్యవేదిక.
స.హ.చట్టానికి సంబంధించిన మరికొన్ని వివరాలు :
ఎ) దరఖాస్తు ఎలా చేయాలి ? దానికో నిశ్చితరూపం ఉందా ?
సమాధానం : దరఖాస్తుకు అధికారిక నమూనా అంటూ లేదు. సరళంగా ఒక తెల్ల కాగితం తీసుకొని
- ఎక్కడ నుండి సమాచారం కోరుతున్నారో ఆ కార్యాలయం పేరు, ప్రాంతం వ్రాసి, దానిక్రింద ఆ కార్యాలయ పౌర సమాచార అధికారి గారికి.
- సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు అని మొదలు పెట్టండి.
- కావలసిన సమాచారపు వివరాలు క్లుప్తంగా, స్పష్టంగా వ్రాయండి.
- ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి విూ చిరునామా వ్రాయండి. ఉంటే ఫోన్ నెంబర్ గానీ, సెల్ నెంబర్ గానీ వ్రాయండి. (అంతే దరఖాస్తు పెట్టడం పూర్తయింది) నే చెప్పింది అర్ధమైతే దరఖాస్తు పెట్టడం ఎలా అని ఇంకెవరినీ అడక్కండి. వెంటనే ఒకటైనా దరఖాస్తు పెట్టండి.
బి) గడువుల సాధారణరూపం : దరఖాస్తును పరిష్కరించే సందర్భం వరకు గడువులు.
1. దరఖాస్తు చేసుకున్న రోజునే సమాచారం ఇవ్వవచ్చు. ఎక్కువలో ఎక్కువ 30 రోజులలోపు ఇవ్వాలి.
2. దరఖాస్తు సహాయ పౌర సమాచార అధికారికి అందిస్తే అదే రోజు ఇవ్వవచ్చు. ఎక్కువలో ఎక్కువ 35 రోజులలోపు ఇవ్వాలి.
3. దరఖాస్తు తృతీయ పక్షానికి చెందిన సమాచారాన్ని అడిగితే, ఆ విషయం తృతీయ పక్షానికి తెలపడం, అక్కడ నుండి సమాధానం రావడం ఎంతకాలంలో జరిగిందన్న దానిని బట్టి తక్కువ సమయం నిర్ణయమవుతుంది. 2. దరఖాస్తు అందిన 40 రోజులలోగా సమాచారం ఇవ్వదలచింది లేనిది నిర్ణయం ప్రకటించాలి. 3. తృతీయ పక్షానికి అభ్యంతరముంటే అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువియ్యాలి. 4. 30 రోజులలోపు అప్పీలు చేయకుంటే ఆ మరుసటి రోజు సమాచారం ఇవ్వవచ్చు.
కనుక పౌర సమాచార అధికారి పాత్ర తృతీయ పక్షానికి చెందినంతలో తొలిథ ఎక్కువలో ఎక్కువ 40 రోజులలోపు పూర్తవ్వాలి. తక్కువలో తక్కువ నాలుగైదు రోజులలో పూర్తిచేయవచ్చు. సమాచారం ఇవ్వడమన్నది 1వ అప్పీలుతో ముడిపడి ఉంది కనుక ఎక్కువలో ఎక్కువ 40+30=70 రోజులు పడుతుంది. తక్కువలో తక్కువ 5+30=35 రోజులు పడుతుంది. (గమనిక : ఈ లెక్కను సెక్షన్ 11/1,2,3,4 చదివి సరిచేసుకోండి) సహాయ పౌర సమాచార అధికారి ద్వారా ఈ దరఖాస్తు అందితే మరో 5 రోజులు పెరుగుతుందన్నది విూకు తెలుసు.
సారాంశం : పౌర సమాచార అధికారి తక్కువలో తక్కువ ఒక రోజు లోపు, ఎక్కువలో ఎక్కువ 45 రోజులలోపు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. తృతీయ పక్షంతో సంబంధంలేని సందర్భాలలో 30 గానీ, 35 గాని ఎక్కువలో ఎక్కువ సమయం అవుతుంది. దరఖాస్తు తొలి థ పరిష్కార సమయాలివే.
1వ అప్పీలు :
- పౌర సమాచార అధికారి సమాధానం ఇచ్చిన రోజున గాని, మరునాడు గాని అప్పీలుకు వెళ్ళవచ్చు. ఎక్కువలో ఎక్కువ సమాధానం వచ్చాక 1వ అప్పీలుకు 30 రోజులుగా ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో అప్పిలేటు అధికారి గడువుదాటినా కూడా అప్పీలును స్వీకరించవచ్చు.
1 అప్పీలు అందిన వెంటనే అప్పిలేటు అధికారి దానిని పరిష్కరించవచ్చు. కుదరకుంటే 30 రోజులలోపు ఎప్పుడైనా పరిష్కరించవచ్చు. అంటే తక్కువలో తక్కువ దరఖాస్తు పెట్టిన నాటినుండి 5వ రోజునే అప్పీలు పరిష్కరించే వీలుంది. ఎక్కువలో ఎక్కువ 30+30+30=90 రోజులు సాధారణ పద్ధతి. అసాధారణ సందర్భాలలో 90+15+15=120 రోజులు పట్టే అవకాశం ఉంది.
(వివరణ : అసాధారణ పరిస్థితుల్లో సమాచార అధికారి మరో 15 రోజులు 1వ అప్పీలేట్ అధారిటీ 15 రోజులు సమయం తీసుకోవచ్చు. ఈ తేడాని విూరూ గుర్తించి ఉన్నారా ?)
2వ అప్పీలు :
1వ అప్పీలు పరిష్కారమైనాక రెండో అప్పీలు చేసుకోవడానికి దరఖాస్తుదారునికి 90 రోజుల గడువుంది. కనుక తక్కువలో తక్కువ 6,7వ రోజు 2వ అప్పీలు చేయవచ్చు. ఎక్కువలో ఎక్కువ 90+90=180 రోజుల నుండి 120+90=210 రోజులలో 2వ అప్పీలు పని పూర్తవుతుంది.
-ప్రత్యేక కారణాలుంటే అవధి దాటినాకనూ 2వ అప్పీలును స్వీకరించే అధికారం కమీషనర్‌కు ఉంది.
ముఖ్య గమనిక : రెండవ అప్పీలును ఎంత గడువులోపల పరిష్కరించాలన్న నిబంధనేదీ స.హ.చట్టంలో లేదు. స.హ.చట్టపు బలహీన స్థానాలలో ఇదీ ఒకటి. కమీషన్ స్వభావం ప్రజలకు న్యాయం చేకూర్చవలసిందిగా ఉండడం వల్ల న్యాయ విభాగపు నైతిక సూత్రీకరణయైన సత్వర న్యాయం అందక పోవడం అన్యాయం జరగడంతో సమానమన్న దానిని బట్టి, రెండవ అప్పీళ్ళు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడడం కమీషనర్ల బాధ్యత అవుతోంది. ఈ విషయాన్ని గమనికలో ఉంచుకోండి. సత్వర న్యాయం ఆ థలో జరగనప్పుడు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే వెసులుబాటుంటే బాగుంటుంది.
స.హ.చట్ట యంత్రాంగపు ఆకృతి (పరిధి)
1. సహాయ పౌర సమాచార అధికారి 2. పౌర సమాచార అధికారి, 3. 1వ అప్పిలేటు అధికారి, 4. 2వ అప్పిలేటు అధికారి లేక కమీషనర్ అన్న ఐదుగురు అధికారులతో కూడిన చట్రమది. ఇందులో పౌర సమాచార అధికారి స్థానానికి తప్ప సమాచారం ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. అతనిపై స్థానాలలోని వాళ్ళు అతనిచే సమాచారం ఇప్పించగలుగుతారు. అతనికి క్రిందనున్న సహాయ పౌర సమాచార అధికారి గానీ మరో నియుక్త అధికారి ఎవరైనా గాని దరఖాస్తును పౌర సమాచార అధికారికి చేరవేయగలడంత మాత్రమే. అయితే పౌర సమాచార అధికారిచే సమాచారం ఇవ్వడం విషయంలో సహాయం కోరబడిన ఉద్యోగి, ఆ అభ్యర్ధన విషయంలో తాత్కాలిక పౌర సమాచార అధికారిగా పరిగణింపబడతాడు. (సెక్షన్ 5/4,5 చూడండి).
2. మరో కార్యాలయంలోని సమాచారాన్ని ఇవ్వమని వేరే కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పుడు ఆ దరఖాస్తును సంబంధిత కార్యాలయానికి పంపి ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలని చట్టం సెక్షన్ 6/3లో చెప్పబడింది. ఆ వివరాలు అక్కడ చూడండి. ఈ సెక్షన్ 6/3 ప్రకారం అలా మరో కార్యాలయానికి దరఖాస్తును పంపడం కూడా 5 రోజులకు మించకుండా వీలయినంత త్వరగా జరగాలి.
3. సమాచార హక్కు చట్టం యొక్క స్ఫూర్తి అంతా బడుగు బలహీన వర్గాలకు (నోరువాయి లేని వాళ్ళకు) కూడా సమాచారం సరళంగా, సులభంగా అందుతుండాలన్నదే ఎవరో కొందరు యాక్టివిస్టులకు, సత్తా - తెలివితేటలు - బలం ఉన్నవాళ్ళకు మాత్రం సమాచారం అందుతున్నంత మాత్రాన స.హచట్టం బాగా వినియోగంలోకి వచ్చినట్లు కానేకాదు. ఈ అస్సలు సిసలు వాస్తవాన్ని 1. పౌరులు, 2. మనము, 3. సమాచార అధికారులు, 4. కవిూషనర్, 5. ప్రభుత్వమూ కూడా గమనించి బాధ్యతతో మసలుకోవాలి.
4. మరో ముఖ్యవిషయం చెపితేగాని దీనికి అంతో ఇంతో సమగ్రత రాదు. ప్రభుత్వం యంత్రాంగంలోని అధికారులు, పౌరులకు శతృవులు కాదు, వారిపై చట్టం ఉంది కదా అని అనవసరపు సమాచారాన్ని ఇవ్వమంటూ అదనపు భారం వేయడం అనుచితం, బాధ్యతా రాహిత్యం. ఉద్యోగ స్థానములో ఉన్నవారు భారత పౌరులే. మన అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లే, తండ్రీ, బిడ్డలు, బంధువులే, నిజాయితీగా ఈ విషయాన్ని గమనించి బాధ్యతతో నడుచుకొందాం మనము.
ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి టి.వి. ఛానల్‌కు అభినందనలు :
ఈ మధ్య కాలంలో వివిధ మాధ్యమాలు ఆర్థికత ముసుగులో జరుగుతున్న మోసాలను వెలికితీసే ప్రయత్నం చేయటం మొదలుపెట్టాయి. ఇది మంచివాళ్ళంతా సంతోషించదగ్గ విషయమే. అయితే మోసాలను వెలికితీసే యత్నంలో అందిన సమాచారాన్ని కనుగొన్న గుట్టును జూపి అవతలివాళ్ళను భయపెట్టి సొమ్ము చేసుకునే ప్రమాదమూ లేకపోలేదు. అట్టిపనులు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయన్న వార్తలూ వినవస్తున్నాయి. ఏది ఏమైనా లక్షలాది గుడ్డిమంద తెగబడి రక్షిస్తుండగా అత్యంత రక్షణ స్థానంలో ఉన్న మోసగాళ్ళు, వేషధారులు, వంచకులునైన పెక్కురు బాబాలు, అమ్మలు, స్వాములు, యోగులు, అవతారులు అనబడే వాళ్ళపై పోరుకు సిద్ధపడటం, ఒకింత సాహసోపేతమైన చర్యేననడం సబబు. అందుకు ముందుగా మనం ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి టెలి ఛానల్ యాజమాన్యానికీ, సిబ్బందికీ కూడా అభినందనలు తెలుపుకోవాలి. మాధ్యమాల పాత్రకు వన్నెతెస్తున్న ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బృందమా అందుకోండి అభ్యుదయవాదుల అభినందనలు.
మొన్నటి జూలై 30 శనివారం సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం చేసిన బహిరంగ చర్చను ఆసాంతం శ్రద్ధగా పరికించాను. అందులో సంధానకర్త పాత్ర వహించిన ఆ ఛానల్ ఎండి గారు మా పోరాటం మతంపై కాదు, దేవునిపైనా కాదు ఆ రెంటి ముసుగులో ప్రజలను పట్టిపీడించుచున్న వంచకులపై మాత్రమే నంటూ వేదికనారంభించి, సమన్వయకర్త పాత్రకు న్యాయం చేశారు. మాధ్యమాలు నిర్వహించాల్సిన పాత్రకూ న్యాయమే చేశారు. ఇంతవరకు ఒక భాగం కాగా,..
''బహిరంగ చర్చ'' పేరున సాగిన ఆ సమావేశం ''చర్చ'' స్వభావాన్ని సంతరించుకోలేక పోయింది. అది విభిన్న వ్యక్తుల అభిప్రాయ ప్రకటనల సమాహారంగా మాత్రమే తీరికూర్చుంది. ఏ ఒక్క విషయం విూద పూర్తి స్థాయిలో చర్చ సాగలేదు. ఇది వంకపెడతానికి కాదుకాని, జరిగిందదే. అయితే, ఆరంభ సమావేశంలోనే, అంతా సవ్యంగా, పకడ్బందీగా, తగినంత స్థాయిలో చర్చ జరగడం అంత సులువుకాదు. అయినా ఈ వంచనాపరుల విషయాన్ని పట్టుబట్టి ఒక ముగింపుకు తీసుకురావాలన్న సంకల్పం, సంసిద్ధత సంస్థ ఎండి రాధాకృష్ణ గారిలో కనపడింది.
చర్చా వేదికకు కొన్ని నియమ నిబంధనలుంటాయి. అందొకటి నిర్ధిష్ట రూపంలో ఎంపిక చేసుకొన్న విషయం లేదా విషయాల జాబితా సిద్ధం చేసుకోవడం. వాటినే చర్చనీయాంశము, చర్చనీయాంశాలు అనంటాం. వాటిని వేటికి వాటినిగా సమగ్ర విచారణకు లోనుచేయాలన్నది చర్చలో కీలకమైన సూత్రం. మొన్నటి సదస్సులో ఈ సూత్రం అంతగా పాటింపబడలా.
1996 ప్రాంతంలోనే ''వంచనాప్రతిఘటన ఐక్యవేదిక'' పేరున కొన్ని సంస్థల వాళ్ళం ఆస్థికత పేరున జరుగుతున్న మోసాలను వెలికితీసే పనికి సన్నద్ధమై, మొదటి లక్ష్యంగా కల్కి మోసాలను బహిర్గత పరిచే కృషి చేశాం. ఆ పనిలో భాగంగా దాదాపు రాష్ట్రమంతటా తిరిగాం. కనుకనే అదే పనిని బుజాలకెత్తుకున్న మీ ప్రయత్నం ఆ వేదికలోని వాళ్ళందరకు సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ వేదిక ఆవిర్భావానికి పెద్దగా కృషిచేసిన సత్యాన్వేషణ మండలికి ఇది మరింత ప్రమోదాన్నిచ్చింది.
చిన్న సూచన : (సలహా అనుకున్నా పర్వాలేదు) వేదిక చర్చస్థాయి మరింత లోతును, గాంభీర్యతను సంతరించుకోవలసి ఉంది. అందుకై దారినపోయేవాళ్ళందరను, గుడ్డి అనుయాయులను, డబ్బుతీసుకొని వాళ్ళపక్షాన వాదించే కుటిల తార్కికుల్ని విడిచి ఆయా సంస్థల అధికార ప్రతినిధులనదగ్గ వారితో నిర్థిష్టమైన చర్చనీయాంశంతో ఈ వేదికను కొనసాగించగలిగితే బాగుంటుంది. ఈ విషయంలో ఒకసారి కలిసి మాట్లాడుకుందా మంటే సత్యాన్వేషణ మండలి తరపున నేను సంతోషంగా సిద్ధపడతాను. నా వివరాలు విూ వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా.
సత్యాన్వేషణలో
విూ
సురేంద్ర. సెల్ : 94404 74404.
కృష్ణాజిల్లాలో ఉద్యమించిన కార్యకర్తలు - వెల్లువెత్తిన విద్యార్ధిలోకం
జూలై 22,23,24 తేదీలలో ద్వారకుంటలో చేసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాలుస్తున్నాయి. 3-8-11న అవనిగడ్డలో రెండు విద్యాసంస్థల్లో 1. ప్రగతి పబ్లిక్ సూల్లో ప్రిన్సిపాల్ సనకా పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో సుమారు 650 మంది విద్యార్ధినులు హాజరు కాగా, 2. ఎస్.వి.ఎల్. క్రాంతి జూనియర్ కాలేజిలో ప్రిన్సిపాల్ దుత్తా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 1400 మంది విద్యార్థినీ విద్యార్ధులు హాజరు కాగా..
''ప్రజాస్వామ్యంలో యువత పాత్ర'' గురించి కృష్ణాజిల్లా స.హ.ప్ర. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కోట ప్రసాద శివరావు గారు, ''భారత రాజ్యాంగము - కనీస అవగాహన'' గురించి స.హ.ప్ర. ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ మెంబరు శ్రీమతి మంచినేని మాధవి గారు, ''స.హ.చట్టం గురించి'' ఐక్యవేదిక క్రియాశీలక కార్యకర్త కుమారి డి. సౌమ్య ప్రసంగించారు. కొండవీటి ఈశ్వరరావు, ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ అధ్యక్షత వహించారు. ఈ రెండు కార్యక్రమాలు తుర్లపాటి రామమోహనరావు గారు, డా|| చేబ్రోలు సూర్యం గారి పర్యవేక్షణలో జరిగాయి. వక్తల ప్రసంగాలకు విద్యార్థినీ విద్యార్ధుల నుండి విశేష స్పందన కనపడింది.
త్వరలో తుర్లపాటి రామమోహన రావు గారి ఆధ్వర్యంలో సుమారు 30 మందితో టి.వో.టి. (శిక్షకులకు శిక్షణ) కార్యక్రమము కూడా అవనిగడ్డలో జరగబోతున్నదని ప్రకటించటానికి సంతోషిస్తున్నాము.
పశ్చిమ గోదావరి జిల్లా కార్యక్రమాలు :
ది. 2-8-11న నిడదవోలు పెరోసియా విద్యాసంస్థలో ప్రధానోపాధ్యాయులు ఆర్. సోమరాజులు గారు అధ్యకక్షులుగా స.హ.ప్ర. ఐక్యవేదిక ఆధ్వర్యములో స.హ.చట్టం పై అవగాహనా సదస్సు జరిగింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు 125 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ది 30-7-11న చేబ్రోలు గ్రామములో గ్రామాభ్యుదయ కమిటి టి.ప్రసాదు గారు అధ్యకక్షులుగా, 11 మంది కార్యవర్గ సభ్యులతో ఏర్పడింది. ఈ కార్యక్రమములో కొండా నిర్మల గారు, విద్యార్ధి నాయకుడు వి. సురేష్ గార్లు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా కార్యక్రమాలు :
ది. 1-8-11న నర్సీపట్నములో వై.మాకిరెడ్డి గారి ఆధ్వర్యములో స్థానిక ఎన్.జి.వో. హోమ్‌లో స.హ.చట్టంపై అవగాహనా సదస్సు జరిగింది. సుమారు 25 మంది పాల్గొన్న ఈ సదస్సులో కోట ప్రసాద శివరావుగారు స.హ.చట్టం గురించి, శ్రీమతి మంచినేని మాధవి గారు రాజ్యాంగము - కనీస అవగాహన గురించి ప్రసంగించారు.
మరో మూడు మండలాల్లో అవగాహనా సదస్సులు జరపటానికి కార్యకర్తలు ముందుకొచ్చారు.
ది. 1-8-11న అనకాపల్లి ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ అధ్యకక్షులైన పి.ఎస్. అజయ్ కుమార్ గారి ఆధ్వర్యములో ఆదివాసీయుల హక్కుల విూద పోరాడే వివిధ సంస్థల, సుమారు 20 మంది ప్రతినిధులతో స.హ.చట్టంపై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సమావేశములో మార్కాపూర్ నుండి వచ్చిన నటుకుల శ్రీనివాసరావు గారు స.హ.చట్టమును వివరించారు.
ఆగస్టు 5 నుండి 15 వరకు వైద్య, విద్య శాఖలకు సంసబంధించిన సమాచారం అధికార యంత్రాంగాల దగ్గర నుండి పొందటానికి దరఖాస్తులు పెట్టాలన్న నిర్ణయం చేశారు.
- కోట ప్రసాద శివరావు
రిపోర్టర్
No comments:
Post a Comment