యోచనాశీలత మాత్రమే కాక, సమాజహితకాంక్ష కల వారందరికీ వివేకపథం ఉద్యమాభినందనలు తెలుపుతోంది. కొన్ని సాంకేతిక కారణాలవల్ల పత్రిక ప్రచురణ రెండు మాసాలు వాయిదాపడింది. ఆలోటును పూడ్చుతూ, దేశమంతా నిరంతరం మననం చేసుకోవలసిన ఎంతో విలువైన భావజాలంతో ఇదిగో మళ్ళీ విూచేతిలో ఉంది పత్రిక. శ్రద్దతో మనస్సుపెట్టి ఈదేశసంక్షేమంకోసం తపించిన వెనకటి వారి హృదయాన్ని అందుకునేందుకు సిద్దపడండి.
1. If you want to destroy a nation destroy its history first" అది వలసపాలకుల తెలివైన సూత్రీకరణ. ఒకజాతిని (దేశాన్ని), నాశనం చేయాలంటే ముందుగా ఆ దేశచరిత్రను నాశనం చెయ్యాలి. అది ఆ దేశప్రజల్ని చరిత్రహీనుల్ని చేయడమన్నమాట.
2. ''పురోభివృద్దిని కోరువారు పూర్వవృత్తాంతమును మరువరాదు'' ప్రతివ్యక్తీ నిరంతరం గుర్తుంచుకోతగినంత విలువగల తాత్వికసూత్రీకరణ ఇది.
3. గతానికి చెందిన దానిలో కాలం చెల్లని మంచి భావనలను వెంటతెచ్చుకోకున్నా, కాలంచెల్లిన వాటిని విడిచి పెట్టకున్నా, వాటిలోని చెడ్డభావనల వల్ల జరిగిన కీడునుండి గుణపాఠాలు నేర్చుకొకున్నా, అవసరమైన నూతన భావజాలాన్ని, ప్రక్రియలను జతకూర్చుకోకున్నా, వర్తమాన సమాజం ఎన్నో కష్టనష్టాలకులోనవ్వడమేకాక, భవిష్యత్తరానికీ ఆచెడుగునే అందచేస్తుంది. బుధజనులందరిలోనూ ఇది నిర్వివాదాంశము. విజ్ఞులందరూ అంగీకరించే ఈసామాన్య అభిప్రాయపు నేపథ్యంనుండే ''ఎప్పటికప్పుడు అప్పటికి, పాతక్రొత్తల మేలుకలయికే ఉత్తమమైందవుతూ ఉంటుంది''. అన్న తాత్విక సూత్రీకరణ పుట్టుకొచ్చింది. ఈనాటికేకాదు. ఏనాటికైనా విలువతరగని భావనేఅది.
పైతాత్వికభావాల స్పూర్తిని, పూర్తిగా వంటబట్టించుకున్నా పెక్కురు సంఘహితైషులైన మేధావుల సమష్టి శ్రమఫలితమే వర్తమాన, భావితరాలకు అందిన భారత రాజ్యాంగము. మనగతానికి చెందిన చెడుగునేకాక, కాలంచెల్లిన భావాలను, ఆచరణలనూ విడచిపెట్టి, మేలునుకలిగించగల వాటిని అట్టేపెట్టుకొని తమ అనుభవాలాధారంగా మంచి వనదగ్గ వాటినీ వాటికి చేర్చి, ఇతరుల నుండీ స్వీకరించదగిన పెక్కింటినీ జతకూర్చి, మనందరి హితానికై శ్రమించి కట్టగట్టి అందించిన - రాజ్యాంగనిర్మాణంలో పాలుపంచుకున్న- వారందరూ మనకు ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులున్నూ.
అట్టివారిలోనూ ముందు చెప్పుకోతగ్గ బృందంలో నెహ్రూ ఒకరు.పైగా రాజ్యాంగనిర్మాణ యత్నంలో ఆయన నిర్వహించిన పాత్ర మరింత గణనీయమైనది. రాజ్యాంగ నిర్మాణ సభ ముందు, ఆశయాదర్శాల తీర్మానం పేరున ఆయన వెళ్ళడించిన భావాలే అటుతరువాత రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న వారందరి యత్నాలకు మార్గదర్శకాలైయ్యాయి.
గమనిక : ఆతీర్మానంపై జరిగిన చర్చ సందర్భంలో అంబేద్కర్ మాట్లాడుతూ తీర్మానం ఒకకోణంలో తనకు నిరాశకలిగించిందంటూనే తీర్మానంలో చోటుచేసుకున్న భావాలవరకు అది నిర్వివాదమైనది అనంటాడు. అంతకంటే ఒకడుగు ముందుకుపోయి, నెహ్రూని దృష్టిలోపెట్టుకునీ రెండు మాటలు చెప్పాడాయనే. 1. ప్రసిద్ద సోషలిస్టు అయిన నెహ్రూనుండి ఈతీర్మానం వచ్చిన మూలంగా ఇది వివాదరహితమైనది. 2. ఆర్యా, ఈ తీర్మానంలో కొన్ని రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మరియు న్యాయవిషయాలకు సంబంధించిన భావాలున్నాయి. ఇది ఒక ప్రముఖునిచే ప్రవేశపెట్టబడింది. కాబట్టి ఇందులో నిశ్చయంగా నిజాయతీఉంది.
నెహ్రూ సోషలిస్టు భావప్రేరితుడన్నది జగమెరిగిన సత్యం. సామ్యవాద ఆర్థిక విధానం ఆచరణలోకి రాకుండా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ న్యాయం చేకూర్చడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం అంటాడు అంబేద్కర్. ఈవిషయంలో నెహ్రూలానే, అంబేద్కరు సొషలిస్టేననాలి.
నెహ్రూ, అంబేద్కర్‌ల మధ్య వారివారి సమూహాలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో భిన్నాభిప్రాయాలు, విభేదాలు ఉంటే ఉండవచ్చుగానీ, వారి వ్యక్తిత్వాలు, నిజాయితీలపట్ల పరస్పరం సదభిప్రాయమే ఉన్నట్లు ఆయాసందర్భాలలో వారన్నమాటలను బట్టీ నిర్ణయించుకోవచ్చు. ఈ తీర్మానం పై చర్చ సందర్భంలో నెహ్రూ గురించి 1. అతడు వెళ్ళడించిన అభిప్రాయాలు 2. అతని నిజాయితీలగురించి అంబేద్కర్ అన్న పైమాటలే అందుకు గట్టి రుజువు. నెహ్రూ తీర్మానంలోని దేనిపైనా తనకు అభ్యంతరం లేదంటూనే, మరికొన్ని తప్పక ఉండాల్సినవి లేకపొవడం మాత్రం తనకు నిరాశనే కలిగించిందంటాడు. కనుక అంబేద్కర్ అన్న మాటలు మర్యాద కొరకు అన్నవిగా భావించనేకూడదు. లోపాలుంటే ఎత్తిచూపటానికి అంబేద్కర్ ఎన్నడూ వెనుకాడలేదు. కనుక నెహ్రూచేసిన తీర్మానప్రసంగంలో కాదనతగిన దేమీ లేదన్నదే అస్సలువిషయం.
భవిషద్భారతాన్ని నిర్మించుకునే విషయంలో నెహ్రూ, అంబేద్కర్‌ల వైఖరుల్లో కొన్ని మౌలికాంశాలదగ్గర ఎంతో సారూప్యత గోచరిస్తుంది.
1. మనలోఉన్న శతృవుల మూఢవిశ్వాసాలకూ రాయతీలిద్దాం, వారినీ మనలో కలుపుకుందాం, అలాచేయగలిగితే, మనమార్గంలో, మనతోకలసి నడవడానికి వారూ ఇష్టంతో ముందుకువస్తారు అనంటాడు అంబేద్కర్.
2. మనం మిత్రదృష్టితోనే ఈ ప్రపంచానికి దగ్గరవుదాం. అన్నిదేశాలతోటి మిత్రత్వం నెరుపుదాం. ఒకవేళ గతంలో మనకు ఎవరితోనైనా సంఘర్షణాత్మక సంబంధాలు కొనసాగిన దీర్ఘచరిత్ర కలిగి ఉన్నప్పటికి అట్టివారితోనూ మిత్రత్వాన్నే కోరుకొంటాం. చివరికి ఇంగ్లాండుతోనైనాసరే.
ఈరెండు మాటలు, గతానికి చెందిన శత్రుత్వాన్ని కూడా విడచి భవిష్యత్తంతా మిత్రసంబంధాలలో, సహకారసంబధాలతో, ఉమ్మడి సంక్షేమాకాంక్షతో కొనసాగుదాం అన్నవారి ఆకాంక్షను విస్పష్టంగా తెలియచేస్తుండగా, ఈనాటికీ మృతప్రాయమైన ఆపాత తప్పొప్పులనే పట్టుకొని కలిసి జీవించాల్సిన సమాజంలో విద్వేషాలతోకూడి గుంపులుగా రూపొందించేందుకు విఫల యత్నంచేస్నున్న వారిని వారి ప్రమాదకర పోకడలనుచూస్తే భయమేస్తోంది. గతాన్ని తవ్వి ఆ శవాలతో సహజీవనం చేయాలనుకునే మృతప్రాయులందరికీ ఎదిగిన మనుషుల ఇలాంటి మాటలవల్ల నైనా కనువిప్పుకలుగుతుందని ఆశిద్దాం. సమైక్యభారతిని రాజ్యాంగనిర్మాతలు చెప్పిన బాటలోనడచి నిర్మించుకోవడంకంటే మనం చేయగలిగిన గొప్పపని మరొకటి లేదన్నదృషితో, పెద్దఎత్తున స్వాతంత్య్రపోరాటంలో పాల్గొని, అనంతరం భావిభవ్యభారతానికి రక్షణ గోడలతోసహా దారులు చూపిన రాజ్యాంగనిర్మాతల సూక్తులను, ఉపదేశాలను వర్తమాన సమాజానికందించాలని ఐక్యవేదిక నిర్ణయించుకొంది. అందులో బాగంగా 2011 అక్టోబర్ నెలలో అంబేద్కర్ ప్రసంగాలను పుస్తకరూపంలో సమాజానికందించాము. అదేసందర్బానికి చెందిన నెహ్రూప్రసంగాన్నిదిగో ఇప్పుడు విూముందుంచుతున్నాము. త్వరలోఇదీ ఒకచిన్నపుస్తక రూపంలోరానున్నది.
విజ్ఞప్తి : ఆనాటిపెద్దలు, మనబాగుకొరకు సూచించిన భావాలను అందిపుచ్చుకొని మరింతమందికి అందించడం మనందరి కనీసధర్మం. కర్తవ్యం. కనుకనే విూలో ప్రతివక్కరు ఈ భావజాలాన్నంది పుచ్చుకుని, అనేకమందికి అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయవలసిందని ఈ ముఖంగా ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తోంది.
సత్యాన్వేషణలో
విూ
సురేంద్ర. సెల్ : 94404 74404.
లక్ష్యాలు, ఉద్దేశ్యాలకు - సంబంధించిన తీర్మానం
అధ్యకక్షుడు : తనపేరున ఉన్న తీర్మానాన్ని ఇప్పుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సభలో ప్రవేశపెడతారు.
గౌరవనీయులు పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ (యునైటెడ్ ప్రావిన్సెస్, జనరల్) :-
అధ్యక్షా !
ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కొద్దిరోజులుగా సమావేశంకాలేదు. ఈ సభ సాధారణ వ్యవహారాలను చాలావాటిని నడిపినప్పటికీ ఇంకా చాలా భాగం మిగిలేవుంది. రాజ్యాంగం అనే మహాసౌధాన్ని నిర్మింపతలపెట్టిన ప్రదేశంలోను, అక్కడికి చేరే మార్గంలోను ఉన్న తుమ్మల్నీ, తుప్పల్నీ నరుక్కుంటూ, దారి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ పని ప్రారంభించటానికి ముందే, మన మెక్కడికి వెళ్తున్నామో, ఏమి నిర్మింపతలపెట్టామో అన్న వాటిపట్ల స్పష్టమైన అవగాహన కలిగివుండాలి. ఇటువంటి సందర్భాల్లో లోతైన వివరాలలోకి పోవడం అనవసరం అన్నది అందరికీ తెల్సిన విషయమే. నిర్మాణం జరిగే సమయంలో మనం ప్రతి ఇటుకను పూర్తి అవగాహనతోనే వినియోగిస్తాం. సాధారణంగా భవననిర్మాణం తలపెట్టిన వాడు ఒక ప్రణాళికను సిద్దం చేసుకుంటాడు. అవసరమైన సామగ్రినీ సేకరించుకుంటాడు. స్వాతంత్య్ర భారతదేశానికి రకరకాల ప్రణాళికలు చాలాకాలంగా మన మనసుల్లో మెదలుతూనే వున్నాయి. అయితే ఇప్పుడు, మనమనుకున్న నిర్మాణాన్ని ప్రారంభించే సందర్భంలో ఆప్రణాళిక యొక్క స్పష్టమైన రూపాన్ని మనకుమనం దర్శించటమేకాకుండ, మనదేశప్రజలకూ, ఇంకా చెప్పాలంటే ప్రపంచమానవాళికీ చూపించాలి. ఈ విషయంలో విూరూ నాతో ఏకీభవిస్తారని ఆశిస్తాను. నేనుప్రవేశపెడుతున్న ఈ తీర్మానం, మనలక్ష్యాలను నిర్వచిస్తుంది. మన ప్రణాళికను రేఖా మాత్రంగా చూపిస్తుంది. మనఅడుగులు పడే మార్గమేదో సూటిగా చూపిస్తుంది.
ఈ రాజ్యాంగ నిర్మాణ సభ, మనలో చాలామంది ఉద్దేశించిన రీతిలో లేదన్నది విూకందరికీ తెలుసు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ సభ ఈవిధంగా ఉనికిలోకి రావడంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క హస్తం కూడా ఉంది. వాళ్ళు కొన్ని నిబంధనలు విధించారు. ఈ సభకు పునాదియనదగ్గ ఈ రాజపత్రాన్ని అనేక తర్జనభర్జనల తర్వాత, అంగీకరించాం. దాని పరిమితులకు లోబడి పనిచెయ్యడానికే గట్టిగా ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సభ దేన్నుండి బలాన్ని పొందిందో ఆమూలాధారాన్ని మనం విస్మరించకూడదు. కేవలం రాజపత్రాలవల్లనే ప్రభుత్వాలు ఉనికిలోకిరావు. నిజానికి ప్రభుత్వాలంటే ప్రజాభీష్ట వ్యక్తీకరణతే. ప్రజాశక్తి మన వెనకుంది కనుకనే మనం ఇక్కడ ఈ రోజు సమావేశమయ్యాం. ఒకపార్టీయో, ఒకసమూహమోకాకుండా ప్రజాబాహుళ్యం మొత్తం కోరుకున్నరీతిలో మనం ముందుకెళ్తాం. అందుచేత భారతదేశపు సామాన్యప్రజల హృదయాకాంక్షల్ని నిరంతరం గమనికలో ఉంచుకుని, వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి.
చాలామంది సభ్యులు గైర్వాజరయినందుకు విచారిస్తున్నాను. సభలో పాల్గోనే హక్కువుండీ, చాలా మంది ఈ రోజు ఇక్కడ లేరు. ఒక విధంగా ఇది మన బాధ్యతను పెంచింది. ఇతరులకు మనస్తాపం కలిగించేదేదీగానీ, ఏర్పరచుకున్న నియమాలను అతిక్రమించేదేదీగానీ మనం చెయ్యకుండా జాగ్రత్తపడాలి. సభకుహాజరు కాని వాళ్ళు త్వరలో మనతో కలిసి ఈ సభావ్యవహారాల్లో పాలు పంచుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే రాజ్యాంగం దాని వెనుకవున్నబలం దాన్ని నెడుతున్నంతవరకే ముందుకు పోగలదు. ఎల్లప్పుడూ దేశ ప్రజలంతా సమైక్యంగా ఉండాలన్నదే ప్రగాఢవాంఛగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలందరికీ ఆమోద యోగ్యమైన రాజ్యంగాన్ని నిర్మించుకోగలం. అదేసమయంలో విశదమయ్యే విషయమేమంటే - ఏగొప్ప దేశమైనా ప్రగతి పధం పట్టినపుడు దానిని ఏపార్టీగానీ, ఏవర్గంగానీ ఆపుచేయలేదనీ తెలుస్తుంది. ఈ సభ గతంలోనూ, భవిష్యత్తులోనూ కొంతమంది సభ్యులు లేకుండా సమావేశమైనప్పటికీ తన విధులను నిర్వర్తించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది.
నేను మీముందు ఉంచుతున్న ఈ తీర్మానం ఒక వాగ్థాన స్వభావాన్ని కలిగివుంది. ఇది వివాదరహితంగా ఉండాలని పరిపక్వచర్చలు, ప్రయత్నాలు చేశాకనే దీని ముసాయిదాను తయారు చేశాము. ఏ గొప్ప దేశంలోనైనా ఎన్నో వివాదాస్పదమైన విషయాలు ఉండక తప్పదు. అయినా మేము వీలయినంత వరకు వివాద రహితంగా ఈ తీర్మానాన్ని రూపొందించే యత్నం చేశాం. ఈ తీర్మానం సామాన్యంగా ప్రజలందరూ కలిగి వుండే, మరియు వారు అంగీకరించే మౌలిక విషయాలనే ప్రస్తావిస్తుంది.
ఈ దేశపౌరుడు అతడు ఏపార్టీకి - వర్గానికి చెందిన వాడైనప్పటికీ, అతనికి అంగీకారం కానిదేదైనాకానీ, అలాగే బ్రిటిష్ ప్రభుత్వం నిర్దేశించినా పరిమితులను అతిక్రమించేదేదైనా ఈ తీర్మానంలో ఉందని నేననుకోవడంలేదు దురదృష్టవశాత్తు మనదేశం విభేదాలతో నిండిపోయి ఉంది. అయినప్పటికీ కొద్దిమంది తప్ప ఈ తీర్మానం ప్రతిపాదిస్తున్న మౌలికాంశాలతో ఎవరూ విభేదించరు. ఈ తీర్మానము సార్వభౌమాదికారం గల భారత గణతంత్రవ్యవస్థ కావాలనే మనదృఢ సంకల్పాన్ని తెలుపుతుంది. ''రిపబ్లిక్'' అన్న మాటను ఇప్పటి వరకు మనం వాడలేదు. అయినా స్వతంత్ర భారతదేశం గణతంత్రరాజ్యంగానే తప్ప మరో విధంగా ఉండ బోదన్న విషయం విూరంతా బాగాఅర్థం చేసుకోవాలి.
ఇండియన్ స్టేట్స్ యొక్క ప్రతినిధులు లేని ఈ తరుణంలో, ఈ తీర్మానం ఇండియన్‌స్టేట్స్‌ని ఎలా ప్రభావితంచేయబోతున్నదీ స్పష్టం చేయదలిచాను. కొన్ని సామాజిక వర్గాలప్రతినిధులు సభలో లేనందువలన ఈ సభ ఈ తీర్మానాన్ని ఆమోదించడాన్ని వాయిదా వేయవచ్చునని సూచించబడింది. ఆసూచన ఒక 'సవరణ'రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. ఇటు వంటి సవరణ ఈ సందర్భానికి తగినది కాదని నాఅభిప్రాయం. కానీ మనముందు, దేశం ముందు, విశాల ప్రపంచం ముందు మనం ప్రవేశపెట్టె మొట్టమొదటి లక్షాన్నే మనం అంగీకరించక పోయినట్లయితే, మన ఈ చర్చలన్నీ అర్థరహిత మవుతాయి. నిర్జీవమవుతాయి. మనకార్యకలాపాల పట్ల ప్రజలు ఆసక్తి చూపరు. కనుక స్టేట్స్ పట్ల మనవైఖరి తేటతెల్లంకావాలి. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఇండియన్ యూనియన్‌లో భాగస్వాములు అవ్వాలని ధృఢంగా కోరుకుంటున్నాం. అయితే ఏ విధంగా పాల్గొంటారు? ఎటువంటి ప్రభుత్వం ద్వారా పాల్గొంటారు? అన్నవివాళ్ళ అభీష్ట్టానికి చెందిన విషయాలు. ఈ తీర్మానం ఆవివరాల జోలికి పోదు. ఇందులో మౌలికమైన విషయాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యాల అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళపై దేనినీ బలవంతంగా రుద్దదు. వాళ్ళుమనతో ఎలా కలుస్తారు? ఎలాంటి పరిపాలనావిధానాన్ని కలిగి ఉండబోతున్నారు ? అన్నదే అక్కడ పరిగణించాల్సిన విషయాలు. దీనిపై నావ్యక్తిగత అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచదలుచుకోలేదు. అయినప్పటికీ ఏఒక్కరాష్ట్రము ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉండేరీతి పరిపాలన కలిగి ఉండలేదు. మరియు ఏ ఇతర ప్రాంతాల కంటే స్వేచ్ఛ తగ్గేటట్లుగా ఉండదని నేను చెప్పక తప్పదు. ఎటువంటిపాలనా వ్యవస్థను ఆస్టేట్స్ రూపొందించు కోవాలో లేక ఇప్పుడు ఉన్నట్లుగానే రాజులు, నవాబులే కొనసాగాలో అన్నవాటితో ఈ తీర్మానానికి సంబంధంలేదు. ఇవి స్టేట్స్‌లోని ప్రజలకుసంబంధించిన విషయాలు. ఆ ప్రజలు రాజులను కొనసాగించుకో దలుచుకుంటే కొనసాగించుకోవచ్చు. నిర్ణయం వారిదే. భారతదేశమంతా మన గణతంత్ర వ్యవస్థలో అంతర్భాగం. అందులోని ఒకభాగం తనకు ఒక తరహాపాలనావ్యవస్థ కావాలని కోరుకుంటే, దానికాస్వేచ్ఛ వుంటుంది.
ఈ తీర్మానానికి ఏమైనా కలపాలనిగాని, తీసివేయాలని గాని నేను కోరుకోవడంలేదు. ఈ సభ అనర్హమైందేదీ పేపర్లకెక్కే పని చేయవద్దని నేను కోరుతాను. ఈ రాజ్యాంగనిర్మాణంలో పాలు పంచుకోవాల్సి ఉంది. హాజరుకాలేక పోయిన సభ్యులు ''ఈ సభనియమరహితంగా ప్రవర్తించింది (మాట్లాడింది)'' అని చెప్పుకునే అవకాశం మనం కల్పించకూడదు.
ఈ తీర్మానం వివరాల్లోకి వెళ్ళదని స్పష్టం చేయదలుచుకున్నాను. ఇందులో పొందు పరచబడిన లక్ష్యాలను సాధించడానికి, మనం భారతదేశాన్ని ఎలా ముందుకు నడపించగలమో మాత్రమె ఈ తీర్మానం తెలపాలనుకుంటుంది. విూరు ఈ తీర్మానంలోని మాటలను మాత్రమె పరిగణనలోకి తీసుకొని, దాన్ని ఆమోదిస్తారు. కాని మాటలకంటే, తీర్మానం వెనక ఉన్న హృదయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. చట్టాలు మాటల కూర్పులు. కాని ఈతీర్మానం చట్టాలకంటే విలువైనది. విూరు న్యాయవాదులలాగ ఈ తీర్మానంలోని మాటలను మాత్రం పరిశీలిస్తే దానిలోని జీవాన్ని పట్టుకోలేరు. మనం ఈనాడు రెండు యుగాల మధ్య నిలిచిఉన్నాము. కొత్తదానికి తావిస్తూ పాతది త్వరగా మార్పుచెందుతూ ఉంది. ఈ సంధికాలంలో మనం మనదేశానికేకాక ప్రపంచానికీ ఒక సజీవమైన సందేశాన్ని అందించాల్సి ఉంది. ఆ తర్వాత మనకు ఇష్టమైన మాటలతో మన రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఏమి చెయ్యడానికి గట్టిగా సంకల్పించుకున్నామో దానిని సందేశరూపంగా బయటికి తెలియ పరచాల్సి ఉంటుంది. ఈ తీర్మానం లేక ఈ ప్రకటన అంతిమంగా ఏఆకారాన్నీ లేక ఏస్వరూపాన్ని సంతరించుకుంటుందో తర్వాత చూద్దాం. అయినప్పటికీ ఒక్కవిషయం స్పష్టం - ఇది చట్టంమాత్రమే కాదు. ఇది మానవమస్తిష్కాలకు ఊపిరినింపేది కూడా.
ప్రత్యేక స్వభావం కలిగిన ఈ తీర్మానాన్ని ఈ సభ ఆమోదిస్తుందని నా నమ్మకం. ఈ గొప్పదేశంలో నివసించే కోట్లాదిమంది సోదర సోదరీమణులమైన మనం పరస్పరంచేసుకున్న ఒప్పందమిది. దీన్ని మనం అంగీకరిస్తే, అది మనం నిర్వర్తించ వలసిన ఒకరకమైన ప్రతిజ్ఞ అవుతుంది. ఆ ఆపేక్షతో దీన్ని ఈరూపంలో విూముందు ఉంచుతున్నాను. ఈతీర్మానం హిందూస్థానీ ప్రతులు విూదగ్గర ఉన్నాయి. కనుక దీనిని ఈ సభకు చదివి వినిపించడానికి కాలాన్ని వృధా చెయ్యను. ఇంగ్లీషులో మాత్రం చదువుతాను. తర్వాత ఇంగ్లీషులో మాట్లాడతాను.
నేను ప్రతిపాదిస్తున్న ఈ తీర్మానాన్ని చిత్తగించండి :
1. భారతదేశము ఒక సర్వసత్తాక, స్వతంత్ర గణతంత్రరాజ్యముగా ఇకముందు స్వీయపరిపాలన సాగించుటకొరకు ఒక రాజ్యాంగమును తయారు చేసుకోవాలని ఈ రాజ్యాంగసభ ప్రకటించుటకు, ఒక దృఢమైన బలమైన తీర్మానాన్ని ప్రకటిస్తోంది.
2. ఆ స్వతంత్రసార్వభౌమ్య భారతదేశంలో 1. ఇప్పటి బ్రిటీష్ ఇండియా క్రింద ఉన్న భాగాలు 2. ఈ దేశంలోనే దానికి వెలుపల ఉన్న రాజ్యాలు 3. స్వతంత్ర భారతదేశంలో కలసి పోవడానికి ఇష్టపడుతున్న ప్రత్యేక భాగాలూ అన్ని ఒక్కటిగా కలసి పోతాయని.
3. అలా ఒక్కటైన దానిలోని ఆయాప్రాదేశిక భాగాలు, ఇప్పటికున్న హద్దుల ప్రకారమేగాని, రాజ్యాంగపరిషత్తు నిర్ణయించిన హద్దులననుసరించిగాని కొనసాగుతాయి. మరియు అవన్నీ రాజ్యాంగ శాసన బద్దంగా స్వయం నిర్ణయ హోదాకలిగి ఉండి, ప్రభుత్వపాలన, నిర్వహణలకు అవసరమైన అన్ని అథికారాలతో బాటు, నిశ్చితరూపంలో ప్రస్తావింపక మిగిలిన ప్రత్యేక అధికారాలనూ చెలాయించుకునే వెసులు బాటునూ కలిగి ఉంటాయి. అయితే, అవి యూనియన్ మొత్తానికీ ఇవ్వబడ్డ అధికారాలకులోబడే ఉంటాయి.
4. సర్వసత్తాక స్వతంత్ర భారతదేశమునకు, దానిలోని భాగాలకు అలాగే ప్రభుత్వంలోని వివిధ భాగాలకు దఖలైన అధికారాలన్నీ వాటివాటికి ప్రజలనుండి సంక్రమించినవే.
5. దేశప్రజలందరికీ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును. మరియు అవకాశాలలోను, హోదాలలోనూ శాసన దృష్టిలో సమానత్వమును, సామాజికనైతికతకు, శాసనాలకు ప్రతికూలంకాని - లోబడి - అభిప్రాయములను కలిగి ఉండే మరియు ప్రకటించే స్వేచ్ఛను, విశ్వాసము కలిగి యుండుటకు, విశ్వసించిన దానిని ఆరాధించుటకు స్వేచ్ఛకలిగి ఉండుట, నచ్చిన వృత్తిని ఎన్నుకొనుటకు,నచ్చిన సంస్థలో సభ్యులగుటకు స్వేచ్చకలిగి ఉండడానికి, హావిూ ఇవ్వబడుతుంది.
6. వెనుకబడిన తెగలకు, ప్రాంతాలకు మరియు అణచివేతకు గురైన ఇతర వెనుకబడిన తరగతులకు అల్పసంఖ్యాక వర్గాలకు తగిన రక్షణ కల్పించేవిధంగా.
7. ప్రపంచంలోని ఇతర నాగరిక దేశాల శాసనాలకు, న్యాయానికి ప్రతికూలంకాని రీతిలో గాలి, నీరు, భూమి అన్న వాటివిూద సర్వసత్తాక హక్కులు, అథికారం కలిగి ఉండి ఒకగణతంత్ర రాజ్యముగ సమగ్రతను కలిగి ఉండేటట్లుగానూ.
8. ప్రపంచంలో ఒక గౌరవనీయమైన మరియు సరైన స్థానాన్ని పొందుతూ, ఈ ప్రాచీనదేశం, ప్రపంచశాంతినీ, మానవజాతి సంక్షేమాన్ని పెంపొందించే కృషిలో పూర్తిస్థాయిలో, మనస్ఫూర్తిగా భాగస్వామి కావడానికి ప్రయత్నించాలి.
అయ్యా! ఈనాటి ఈ మన సమావేశం రాజ్యాంగ నిర్మాణసభ యొక్క తొలి విడత సమావేశాల్లో ఐదవరోజిది. ఇప్పటివరకు మనం కొన్ని తాత్కాలికమైన మరియు విధానపరమైన అత్యవసర విషయాల గురించి శ్రమించాం. మనకార్యక్షేత్రము స్పష్టమే. కనుక అందుకు తగిన పరిస్థితుల్ని సిద్దం చేసుకోవాలి. కొద్ది రోజులుగా ఆపనే చేస్తూవచ్చాము. ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. రాజ్యాంగ నిర్మాణం దిశగా మనం తొలి అడుగు వేసే ముందే - అంటే, భారత జాతి కలలకు, అపేక్షలకు ఒక రూపాన్ని సంతరించి పెట్టే మహా సాహసాన్ని, అక్షరబద్దం చేయడమన్నదే రాజ్యాంగ నిర్మాణసభయొక్క అసలైన పని, ఆచరణలో ఆపనికి పూనుకునేముందే, అందుకవసరమైన కమిటీలను నియమించడం లాంటి పనులు పూర్తి చేయవలసి ఉంది.
అయితే, ఇప్పటికైనా ఈ థలో మనం మనకోసం, తమతమ వర్గాల ప్రత్యేకప్రయోజనాలకోసం ఈ సభపై ఆశలు పెట్టుకున్న వారికోసం, ఇంకా, దేశంలోనివసిస్తున్న కోట్లాది సామాన్యప్రజల కోసం అలాగే ప్రపంచానికంతటికీ, మనం ఏమి చేయబోతున్నామో, ఏమి సాధించాలనుకుంటున్నామో, ఎటు పోబోతున్నామో సూచన ప్రాయంగానైనా తెలియజేయడం వాంఛనీయం. ఆఉద్దేశంతోనే ఈ తీర్మానాన్ని సభముందుంచుతున్నాను. ఇదొక తీర్మానమే కాక, అంతకంటే మరి కొంత అధికం కూడా. ఇది ఒక ప్రకటన. ఇది మన దృఢ సంకల్పం. ఇదొక ప్రతిజ్ఞ అంగీకారపత్రం. విూరంతా అంకిత భావంతో, ఇది మనందరికీ చెందిన విషయంగా భావిస్తారని ఆశిస్తాను
ఈ తీర్మానాన్ని సంకుచితమైన చట్టపరిభాషలోనుండి చూడకుండా, దీని వెనక ఉన్న హృదయాకాంక్షను చూసి సానుకూలంగా పరిశీలించమని సభను గౌరవ పూర్వకంగా కోరుతున్నాను. పెక్కు సందర్భాలలో మాటలకెంతో సమ్మోహన శక్తి ఉంటుంది. అయినా, వాటికున్న ఆ సమ్మోహనశక్తీ కొన్నిసార్లు మానవుని అంతరంగాన్ని, జాతి ఆకాంక్షల్నీ వ్యక్తం చేయలేదు. కాబట్టి, దేశప్రజల హృదయాలలో, మనసుల్లో దాగి ఉన్న గాఢానురక్తిని ఈ తీర్మానం పూర్తిగా వ్యక్తంచేస్తుందని చెప్పలేను. మనం ఇంతకాలంగా సాగించిన ఆలోచనలను,కన్నకలలను, సవిూప భవిష్యత్తులో మనం సాధించదలచుకున్న లక్ష్యాలను, సరిగా ప్రపంచానికి ప్రస్పుటం చేయగల శక్తి ఈ తీర్మానంలోని మాటలకు లేదు. ఆరకమైన అవగాహనతోనే, ఈ తీర్మానాన్ని ఈ సభలో ప్రవేశ పెట్టడానికి సాహసిస్తున్నాను. అటువంటి అవగాహనతోనే ఈ సభా దీనిని స్వీకరిస్తుందని, అంగీకరిస్తుందనీ ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
అయ్యా, మర్యాద పూర్వకంగా విూకూ, ఈ సభకూ నేను చేసే సూచనేమంటే, ఈ తీర్మానానికి ఈసభ ఆమోదం తెల్పే సమయం వచ్చినపుడు, కేవలం మొక్కుబడిగా చేతులెత్తడంగాకాక, మరింత గౌరవభావంతో ప్రతిజ్ఞారూపంగా అంగీకారం తెలుప వలసిందిగా విూకు, ఈసభకు వినమ్రంగా సూచిస్తున్నాను.
చాలామంది సభకు గైర్హాజరైన విషయం సభకుతెలుసు. ఇక్కడకు రావడానికి వారికి హక్కున్నప్పటికీ చాలామంది రాలేదు. ఈ వాస్తవం మనల్ని బాధిస్తున్నది. ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాల వివిధ వర్గాల ప్రతినిధులు వీలైనంత ఎక్కువమంది. మనతో కలసి పని చేయాలన్నది మన ఆకాంక్షగా ఉండాలి. మనం చేయ తలపెట్టింది ఒక బృహత్తరకార్యము. దానికి అన్నివర్గాల, అన్నితరగతుల, అన్ని ప్రాంతాల ప్రజల సహకారాన్నీ ఆశిద్దాం. ఎందుకంటే, మనం ఆశించిన భవిష్యద్భారతం, ఒకవర్గానికో, ఒకప్రాంతానికో సంబంధించింది కాదు. అది 40 కోట్ల భారతప్రజలకు చెందవలసింది. ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉండటం చూస్తే, మనలో ఉండవలసిన సహచరులు ఇక్కడ లేనందుకు మాకెంతో విచారంగా ఉంది. వాళ్ళు త్వరలో సభకు వస్తారని, రాబోయె రోజుల్లో ఈసభకు వాళ్ళ సహకారం లభిస్తుందనీ విశ్వసిస్తున్నాను. అంతవరకు మనపై మోపబడ్డ గురుతర బాధ్యతను మనం మరచిపోకూడదు. కొందరు సభ్యులు హాజరుకాలేదన్న వాస్తవాన్ని సహించుకుంటూనే, మనం ఒకపార్టీ కోసమో, ఒక వర్గం కోసమో పనిచేయడం లేదనీ, దేశం యావత్తు శ్రేయస్సునూ, దేశంలోని 40 కోట్ల ప్రజల శ్రేయస్సును గురించీ ఆలోచించడం మనబాధ్యత అనీ గుర్తుంచుకొవాలి. ప్రస్తుతానికి మనమందరం మనమన పార్టీలకు, వర్గాలకు చెందిన వాళ్ళమే. వాటిలోనే పనిచేస్తున్నాము. ఇక ముందూ పనిచేస్తునే ఉంటాము. ఐనప్పటికీ సమయం ఆసన్నమైనప్పుడు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా, దేశంకోసమే ఆలోచించాల్సి ఉంటుంది. కొన్నిసంర్భాలలోనైతే ఈ దేశమూ ఒక భాగంగానే ఉన్న విశాలప్రపంచం కోసం ఆలోచించాల్సీ ఉంటుంది.
ఈ రాజ్యాంగ నిర్మాణసభ కార్యకలాపాల గురించి అలోచించినప్పుడు, అటువంటి సమయం,సందర్భం ఇప్పుడు ఆసన్నమైందని నాకు అనిపిస్తున్నది. మనకు శక్తి ఉన్నంతవరకు, మనంమన సాధారణ వ్యక్తిత్వాలకు, పార్టీతగాదాలకు అతీతంగా ఎదగాలి. అతివిశాల దృక్పథంతో, అతిసహనంతో, అత్యంతప్రభావంతంగా, మన ఎదుటనున్న జటిల సమస్యగురించి ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ధైర్యాన్నీ తెగువనూ ప్రదర్శించి మనం సాధించబోయేది, మనదేశ గౌరవానికే అర్హమైందిగాను, సాధించాల్సింది సాధించదగ్గరీతిలోనే సాధించామని ప్రపంచం గుర్తించేదిగనూ ఉంటుంది.
ఇక్కడ మరోవ్యక్తి లేరు. ఆయన మనలో చాలమంది మనసులో మెదలుతున్న వ్యక్తే. మనప్రజలకు గొప్పనాయకుడు, జాతిపిత, ఈసభనిర్మాత, గడిచిన చరిత్రంతా తానేననదగ్గ మరియు భారతాన్ని అతిగా ప్రభావితం చేయనున్న వ్యక్తాయన. ఆయన ఇప్పుడిక్కడలేరు, భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతంలో తానాశించిన సమాజానికై నిరంతరకృషిలో నిమగ్నమైఉన్నారు. కానీ ఆయన హృదయం (రీచీరిజీరిశి) మాత్రం ఇక్కడే సంచరిస్తూ, మనంతలపెట్టిన ఈ కార్యానికి తన ఆశీస్సుల నందజేస్తూనే ఉంటుంది.
అయ్యా, నేనీసభలో నిలుచున్న ఈ తరుణంలో అనేకానేక విషయాలూ, ఎన్నో బరువుబాధ్యతలూ నన్ను ఆవరించుకుని ఉన్నట్లు అనుభూతి చెందుతున్నాను. మనమిప్పుడు ఒకశకపు ముగింపు థలో ఉన్నాం, సాధ్యమైనంతత్వరలో మరో శకంలోనికి అడుగిడబోతున్నాం. ఈక్షణంలో 5000 సం||ల ఘనమైన భారతదేశ చరిత్ర నా మనసులో మెదలాడుతూ ఉంది. ఏదైతే భారత దేశ చరిత్రగా ఉందో, మరియా దాదాపుగ మనవజాతి చరిత్రగా కూడా పరిగణింప దగిఉందో, ఆగతం అంతా ఒకవంకనన్ను చుట్టుముట్టి నాలో ఉత్యాహాన్ని నింపుతూ, అదేసమయంలో నన్ను కొంత కృంగదీస్తున్నది కూడా. నిజానికీ గతమంతటికీ నేను వారసుణ్ణి అనడానికి అర్హుడనేనా? శక్తి వంతమైన గతానికీ, గొప్ప భవిష్యత్తును కోరుకుంటున్నపుడు రాబోయే అంతకంటే శక్తివంతమైన భవిష్యత్తుకుమధ్య చోటు చేసుకుని ఉన్న వర్తమానం అనే ఈ కత్తి అంచున నిలబడిఉన్న నేను, భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు, మరింత గొప్ప భవిష్యత్తును ఆశిస్తున్నప్పుడు ఒకింత భయకంపితుడనవుతున్నాను. మనంతలపెట్టిన ఈ బృహత్తర కార్యం మోయలేనంత భారమైనదిగా అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలోనే ఒక చిత్రమైన ఘట్టానికి చేరుకున్నాం. నాకు స్పష్టంగా తెలియదుగాని, పాతక్రొత్తల సంధిలో ఏదోసమ్మోహన శక్తిదాగి ఉంది. అదెలాంటిదంటే, రాత్రిచీకట్లుతొలగి పగటివెలుగులు చోటుచేసుకుంటున్నప్పటిలా, లేదా, మేఘాచ్చాతమైన సూర్యుడు, ఆ మబ్బులు తొలగి వెలుగులు ప్రసరిస్తున్నప్పటిలా, ఉంటుందది. వీటన్నింటి కారణంగా ఈ సభలో ప్రసంగించడానికీ, నాఆలోచనలను సభముందుంచడానికీ కొంత కష్టపడుతున్నాను. వేలసం||ల చారిత్రక పరంపరలో, ఎంతో మహత్వపూర్ణంగా జీవించి కనుమరుగైన మహామహులు నామనోనేత్రం ముందు కదలాడుతున్నారు. అలాగే దేశస్వాతంత్య్రం కోసం శ్రమించిన సహచర మిత్రులూ నాకు కనబడుతునే ఉన్నారు. ఇప్పుడు మనం ఒక సంధిలో ఉన్నాం. క్రొత్తను స్వాగతించడానికి యత్నస్తూశ్రమిస్తున్నాం. ఇట్టి స్థితిలో, ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహత్తరమైన ఈ క్షణాలకున్న గాంభీర్యతను ఈ సభ గుర్తించి, అందుకనుగుణ్యమైన రీతిలోనే ఈ తిర్మానాన్ని గౌరవిస్తుందని చెప్పగలను.
అధికసంఖ్యలోనే దీనిపై సవరణలు సభముందుకు రావచ్చని నమ్ముతున్నాను. వాటిలో చాల వాటిని నేను చూడలేదు. ఈ సభకూ, సభలోని ఏ సభ్యునికైనా, ఎట్టి సవరణనైనా ప్రవేశపెట్టే స్వేచ్చ ఉంది. దానిని ఆమోదించడంగాని, తిరస్కరించడంగానీ సభ చెయ్యాల్సిన పని అయినా నేను సభకు సగౌరవంగా చేసే సూచన ఏమిటంటే.
మనమిప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సవాళ్ళను ఎదుర్కొనబోతున్నాం. గొప్పగొప్ప మాటలను చెప్పబోతున్నాం. గొప్పగొప్ప పనులనూ చేయబోతున్నాం. ఇలాంటి తరుణంలో సాంకేతిక మరియు న్యాయపరమైన దృష్టికోణంతో, చిన్న చిన్న విషయాలలోనూ కేవలం పదాలను పట్టుకుని వాదవివాదాలలోనికి చొరపడ వద్దని వినమ్రంగా సూచిస్తున్నాను. అలాగే ఈ తీర్మానాన్నీ తగినరీతిన ఆధారంతో విచారించమనీ సభను కోరుతున్నాను.
గతంలో జరిగిన పెక్కు రాజ్యాంగ నిర్మాణ సభలు నామదిలో మెదులుతున్నాయి. అమెరికా జాతి నిర్మాణ సందర్బంలో ఇప్పటికి 150 ఏండ్లక్రితం, ఆజాతినిర్మాతల సమష్ఠి కృషి ఫలితంగా ఒక గొప్పరాజ్యాంగం పుట్టింది. ఎంతో చేవగల ఆగొప్ప రాజ్యాంగం 150సం||పాటు ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని ఒకగొప్ప జాతినే నిర్మించింది. ఆ కాలంలోనే సంభవించిన మరో మహావిప్లవం కూడా నామనస్సులో మెదలాడుతూ ఉంది. స్వాతంత్య్రం కోసం ఎన్నేన్నో త్యాగాలు చేసిన అందమైన ప్యారిస్ నగరంలో సమావేశమైన (ఫ్రెంచ్) రాజ్యాంగ నిర్మాణ సభా, అది ఎదుర్కొన్నకష్టాలు, అప్పటిరాజు, అతని అధికార యంత్రాంగము ఆసభకు కల్పించిన అవరోధాలు అటువంటి వత్తిళ్ళ మధ్య ఆసభనడచిన తీరు మొదలైనవన్నీ ఈ సభకు గుర్తుండే ఉంటుంది. నాటిఫ్రెంచి రాజ్యాంగ నిర్మాణ సభ, సమావేశాలు జరుపుకోవడానికే వేదిక నిరాకరింపబడింది. అయినా వాళ్ళు ఒక బహిరంగ స్థలంలో టెన్నీస్ కోర్టులో సమావేశమై ప్రమాణ స్వీకారం చేశారు. కనుకనే అది టెన్నీస్ కోర్టు ప్రమాణస్వీకారం అనిపిలవ బడుతుంది. వాళ్ళు రాజు, అతని అనుచరులకు వ్యతిరేకంగా సమావేశంకొనసాగించి, వాళ్ళు తలపెట్టిన కార్యంపూర్తి అయ్యేంతవరకు అక్కడ నుండి తొలగిపోలేదు. అలాంటి దృఢమైన సంకల్పబలంతోనే ఈనాడు మనం ఈప్రాంగణంలో గాని, మరో ప్రాంగణంలోగాని లేక పొలాల్లోనయినా, మార్కెట్ స్థలంలో నయినా ఎక్కడోచోట సమావేశమవుతూనే మన కార్యంపూర్తి అయ్యేంతవరకు ఈకృషిని కొనసాగిస్తాం.
తర్వాత వినూత్నమైన రాజ్యానికి ప్రాణం బోసిన రష్యాలో సంభవించిన ఇటీవలి విప్లవం సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అవతరణకి దోహదం చేసిన విప్లవం నా మనస్సులో మెదలుతూ ఉంది. ప్రపంచంలో గొప్పపాత్ర నిర్వహిస్తున్న ఆ రష్యా ఒక బలమైన దేశమే కాకుండా, మనకు పొరుగు దేశం కూడా.
మనం ఈ గొప్ప దృష్టాంతాలను తలపుకు తెచ్చుకుని, విజయాలను మార్గదర్శకాలుగా, అపజయాలను హెచ్చరికలుగా తీసుకుందాం. బహుశా మానవ ప్రయత్నంలోనే కొంత దోషం చోటుచేసుకునే వీలున్నందున అట్టి యత్నాల వల్ల ఏర్పడ్డ వైఫల్యాలను మొత్తంగా మనం నివారించలేక పోవచ్చు. అయినప్పటికీ ఈ మన మార్గంలో ఎన్ని అవరోధాలు, కష్టాలు ఎదురైనా ఇంతకాలం కన్నకలలను సాకారం చేసుకోవడంలోనూ సాధించుకోవడంలోనూ మనం పురోగమిస్తాం. అనడంలో నాకు సందేహంలేదు. సభముందున్న ఈతీర్మానాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలే తీసుకుని రూపొందించాం. ఆక్రమంలో అతిఎక్కువ చెప్పడంగాని, అతితక్కువ చెప్పడంగాని జరగకుండా ఉండేలా యత్నించాం. ఇలాంటి తీర్మానానికి ఒక రూపం యివ్వడం కష్టం. మరీకొద్ది మాత్రమే చెపితే అది మొక్కుబడి తీర్మానం మాత్రమే అవుతుంది. అలాకాక ఎక్కువ చెబితే అది రాజ్యాంగం రచించబోయే వాళ్ళ విధుల్లోకి చొరబడి నట్లవుతుంది - అంటే ఈ సభవిధుల్లో కన్నమాట. ఈ తీర్మానం మనం రచించబోయే రాజ్యాంగంలో భాగంలేదు. కనుక భాగంగా మనం భావించకూడదు. రాజ్యాంగాన్ని రచించడానికి ఈ సభకు పూర్తి స్వేచ్చ ఉంది. అలాగే ఇతరులెవరైనా ఈ సభకు వచ్చినపుడు వారికి రాజ్యాంగాన్ని పరిపుష్టంచేసే పూర్తి స్వేచ్చవుంటుంది. అందుచేత ఈ తీర్మానం రెండు అతి పోకడలకు మధ్య మార్గంలో నడుస్తూ కొన్ని నిర్థిష్ట మౌలికాంశాలను మాత్రం కలిగివుంటుంది. అవి ఎలాంటివంటే వీటితో ఏ వర్గంకాని, ఏపార్టీకానీ, దేశంలోని ఏవ్యక్తికాని విభేదించడని నేను విశ్వసిస్తున్నాను. మనం దృఢంగా కోరుకుంటున్నది స్వతంత్ర సర్వసత్తాక గణతంత్రదేశాన్నేనని చెప్పవచ్చు.
భారతదేశం సార్వభౌమాథికారంగల శక్తిగా ఉండితీరాల్సిందే. స్వతంత్రగానూ, రిపబ్లిక్ గానూ, ఉండి తీరాల్సిందే. రాచరికంఇత్యాదుల వాద ప్రతిపాదనలలోనికి నేను వెళ్ళను. అయితే రాచరిక మన్నది శూన్యంలోనుండి ఊడిపడదని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. అది ఇక్కడలేదు. ఒకవేళ మనదేశం స్వతంత్ర సార్వభౌమదేశం అయితే పరాయి రాచరికం మనకుండదు. స్థానిక రాజరికాలపైనా పరిశోధనలు చెయ్యలేము. ఈదేశం తప్పక గణతంత్రరాజ్యం అయితీరాల్సిందే. ఇప్పుడు కొందరు మిత్రులు విూ రెందుకు ''ప్రజాస్వామ్యం అనే మాటను ఇక్కడ వాడలేదు''. అన్న ఒ ప్రశ్నను లేవదీశారు. నిజమే గణతంత్ర వ్యవస్థ ప్రజాస్వామ్యం కాకుండానూ ఉండవచ్చునన్నది, ఊహించ దగిందే. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థల కొరకే మనం కట్టుబడి వున్నాం అనడానికి మనగతమంతా సాక్ష్యంగా ఉంది. మనం ప్రజాస్వామ్యాన్నే లక్షిస్తాం. అంతకంటే తక్కువైన దేనినీ లక్షించము. ఏతరహాప్రజాస్వామ్యం? అది ఏరూపం ధరించబోతొంది అన్నదివేరే విషయం చాలా యూరప్ దేశాల్లోనూ మరియు ఇతరత్రా చోట్ల ఉన్నటువంటి ప్రజాస్వామ్యాలు ప్రపంచగతికి ఎంతో తోడ్పడ్డాయి. వాటి రూపురేఖల్ని ఆలశ్యం కాకుండా కొంతవరకు మార్చుకోకుంటే అవి పూర్తిగా ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగ గలవారన్నది సందేహమె. మనం ప్రసిద్ది పొందిన ఏ ప్రజాస్వామ్యపు దేశవ్యవస్థనుకాని, నిర్థిష్ట విధానాన్ని గాని అనుకరించ బోవడంలేదని ఆశిస్తాను. ఏది ఏమైనా మనదేశంలో మనం స్థాపించదలచిన పాలనావ్యవస్థ ప్రజల స్వభావానికి తగ్గట్టుగాను వారికి ఆమోద యోగ్యంగానూ ఉండేలా దాన్ని మనం ఉన్నతీకరించాలి. ప్రజాస్వామ్యం కొరకే మనం నిలబడదాం. నేను ఆశిస్తున్న పూర్ణరూపంలోని ఆప్రజాస్వామ్యానికి ఏరూపం ఇవ్వాలన్నది ఈ సభనిర్ణయిస్తుంది.
రిపబ్లిక్ అన్న పదంలోనే ప్రజాస్వామ్యం స్పష్టంగా నిక్షిప్తమై ఉందని మనం భావించినందు చేత. ఈ తీర్మానంలో ''ప్రజాస్వామ్యం''అనేపదం వాడలేదు. అనవసరం, అతిశయం అయ్యేమాటల్ని వాడకూడదనుకున్నందుచేత. అయినా ఆపదాన్ని ఉపయోగించినదానికంటే ఎక్కువే చేశాం. ఆరకంగా ఈ తీర్మానంలో ప్రజాస్వామ్య సారాంశాన్ని పొందుపరిచాము. అంతే కాకుండా ఆర్థిక పరమైన ప్రజాస్వామ్య భావనని కూడ జతపరిచాము.
సోషలిస్టురాజ్యాంగం పేర్కొన లేదని కొందరు దీనిపై వ్యతిరేకతచూపవచ్చు. నేను సోషలిస్టుభావాలవైపు నిలిచేవాడిని. మనదేశం సోషలిజంవైపేవుంటుంది. మనరాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగంగానే ఉంటుంది. ప్రపంచమంతా సోషలిజం వైపుకే అడుగులు వేస్తుందనే నానమ్మకం. ఏతరహా సోషలిజం అన్నది మీరు నిర్ణయించవలసిన మరోవిషయం. అయితే మరో ముఖ్యవిషయమేమంటే ఇలాంటి తీర్మానాల విషయంలో మనకు సోషలిస్టు రాజ్యమేకావాలి అనినేను ఉటంకిస్తే అది చాలామందికి రుచించవచ్చు. కొందరికి రుచించకపోవచ్చు. ఇలాంటి విషయాల వల్ల ఈ తీర్మానం వివాదాస్పదంకాకుండా ఉండాలని కోరుకుంటాం. కాబట్టే సిద్దాంత పరమైన మాటల్ని సూత్రాలను ఉటంకించకుండానే మనం కోరుకునే విషయంసారాంశాన్ని అందులో పొందుపరచాము. అది ముఖ్యం. దీనిపై వివాదం ఉండబోదని నేను బావిస్తున్నాను. మనం వాడిన రిపబ్లిక్ అనేమాట భారతసంస్థానాల పాలకులకు రుచించక పోవచ్చునని కొందరు నాకు సూచించారు కావచ్చు. వాళ్ళకది అసంతృప్తి కలిగించవచ్చు. రాచరికవిధానం ఎక్కడవున్నా దానిపై నాకు నమ్మకంలేదన్న విషయాన్ని నేటి ప్రపంచంలో శీఘ్రంగా అంతరించి పోతున్నవ్యవస్థ అన్న విషయాన్ని, నేను వ్యక్తిగతంగా స్పష్టం చేయదలిచాను. ఈ విషయాలు సభకు తెలిసున్నవే. ఏది ఏమైనా ఈ విషయంలో నావ్యక్తిగత నమ్మకం ప్రధానంకాదు.
చాలాకాలంగా భారత సంస్థానాలగురించి మన అభిప్రాయం ఏమంటే అన్నింటి కంటే ముందు ఆసంస్థానాల ప్రజలు మనం పొందే స్వాతంత్య్రంలో పూర్తిగా భగస్వాములు కావాలి. ఆ ప్రజలకీ మిగిలిన భారత ప్రజలకీ మధ్య వాళ్ళు అనుభవించే స్వాతంత్య్రం విషయంలో తేడాలుండడం నేను అంగీకరించలేను. ఆసంస్థానాలు ఏవిధంగా మన యూనియన్‌లో మమేకం కావాలన్న విషయాన్ని, ఈ సభ, ఆ సంస్థానాల ప్రతి నిధులు కలసి ఆలోచిస్తారు. వాటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఈ సభకు ఆ సంస్థానాలలో అర్హులైన ప్రతినిధుల మధ్యనే వ్యవహారాలు సాగుతాయి. ఈ విషయాలన్నింటిలో ఆ పాలకులతోనయినా, వారి ప్రతినిధులతోనయినా వ్యవహరించడానికి మాకు పూర్తిగా అంగీకారమే. అయితే రాజ్యాంగాన్ని తయారుచేసుకునే సమయంలో, దేశంలో తతిమ్మా ప్రాంతాల్లోలాగానే, ఆ సంస్థానాలలో ప్రజాప్రతినిధులతోనే వ్యవహరించవలసివస్తోంది. మనము భారతదేశములోని రాష్ట్రాల ప్రతినిధులతోటి మాత్రమే పరిపాలన ఉండేటట్లుగా అంతిమంగా మనరాజ్యాంగాన్ని తయారు చేసుకుందాం. అలాగే పరిపాలకులు వారి ప్రతి నిధులతోటి కూడా వారికి సంబంధించిన విషయాలలో వ్యవహరిస్తాము. ఏ రాష్ట్రములో అయినప్పటికీ స్వాతంత్య్రం ఒకే కొలతకు సరితూగేలా ఉండడాన్ని మనం అంగీకరిస్తాం. అలానే ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉపకరణాల విషయంలోకూడా ఒకేరకమైన కొలబద్ద ఉండడం సాధ్యమే. వ్యక్తిగతంగా నేను దాన్నే ఇష్టపడతాను. ఐనప్పటికీ ఇది రాష్ట్రాలతోటి జరిపేచర్చలకు, వాటిమధ్య సహకారానికి సంబంధించిన విషయంగా పరిగణించవలసి ఉంటుంది. ఈ రాష్ట్రాల ఉద్దేశాలకు వ్యతిరేకంగా వాటిపై బలవంతంగా రుద్దాలని నేను కోరుకోను. ఈ రాజ్యాంగసభ దేనినిగాని ఏదైనా ఒకరాష్ట్ర ప్రజలు ఒక పరిపాలనా విధానాన్ని కోరుకొన్నట్లైతే అది ఒకవేళ రాచరిక విధానమైనప్పటికీ ఆ నిర్ణయాన్ని దాని ఇష్టానికే వదిలివేస్తాను. బ్రిటీష్ కామన్‌వెల్త్‌లో భాగంగా వుంటూనే ఐర్ (ఇ.ఐ.ఆర్.ఇ) ఒక గణతంత్ర వ్యవస్థగ ఉండడాన్ని ఈనాడు ఈ సభ గుర్తుతెచ్చుకోవచ్చు. కావున అది అంగీకరించబడనిదేవిూ కాదు. మనకు సంబంధించినంత వరకు ఈ విషయం ఈ సభ అంగీకారం విూద కొంత, ఇతరుల నిర్ణయం విూద కొంత వున్నది గనుక ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ప్రజలకీ అసలైన పాలకులుగా ఉండి పూర్ణ స్వాతంత్య్రంలో బాధ్యతగా ప్రవర్తించగల ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలలో పరిపాలన నిర్థిష్ట రూపంలో ఉండడం అసాధ్యమేవిూ కాదు. ఏదైనా ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రజలు రాచరికపాలన కోరుకుంటే నాకిష్టమైనా కాకున్నా నేను దానిలో జోక్యం చేసుకోను. భవిష్యత్‌లో జరిగే ఎలాంటి చర్చలకు సంబంధించి ఈ రాజ్యాంగ సభ యొక్క భవిష్యత్ కార్యక్రమం ఏదైనప్పటికీ ఈ తీర్మానం లేదా ప్రకటన వాటితో ఏవిధంగానూ జోక్యం చేసుకోదని నేను స్పష్టం చేయాలను కుంటున్నాను. ఒకరకంగా చెప్పుకుంటే విూరు యిష్టపడితే, ఈ ప్రకటనలో పొందుపరిచిన నిర్థిష్ట మౌలిక ప్రాతిపదికలకు మనం నిబద్దులమై ఉండాలి అన్నదే మన పనికి పరిమితులు విధిస్తోంది. మౌలికప్రాతిపదికలు ఏవీకూడా మాటవరసకైనా వివాదాస్పదమైనవిగావని నేను విన్నవించుకుంటున్నాను. భారతదేశములో ఎవ్వరూ వాటిని సవాలు చేయరు, చేయలేరు. ఒకవేళ ఎవరైనా సవాలు చేసినప్పటికి, ఆసవాలును స్వీకరించి మనము మన స్థానాన్ని నిలబెట్టుకొగలము.
మనము భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోబోతున్నాం మిగిలిన ప్రపంచాన్ని మొత్తాన్ని మనం ప్రభావితం చేసేవిధంగా, మనం భారతదేశాన్ని నిర్మించుకో గలుగుతున్నామన్నది స్పష్టం. ప్రపంచంలోకి కొత్త స్వేచ్చా స్వతంత్రమైనదేశమొకటి ఆవిర్భవించడమే కాక సువిశాలమైన దేశంగా, ఎక్కువ జనాభాతోనేకాకుండా, ఎక్కువ వనరులతో, ఆవనరులను ఉపయోగించుకోగల సమర్థత కలిగి యున్న దేశంగా నిర్మిస్తున్నాం. అందు వలన రాజ్యాంగ నిర్మాతలు ఈ విశాలమైన అంతర్జాతీయదృష్టి కోణాన్ని తమమనసులో వుంచుకోవడం సరైనదవుతుంది.
మనము మిత్ర దృష్టితోనే ఈ ప్రపంచానికి దగ్గరౌదాము. అన్నీ దేశాలతోటి మిత్రత్వం నెరుపుదాం. ఒకవేళ గతంలో మనము ఎవరితో నేనా సంఘర్షణాత్మక సంబంధాలు కొనసాగిన దీర్ఘచరిత్ర కలిగివున్నప్పటికీ అట్టివారితోనూ మిత్రత్వాన్నే కోరుకుందాం. ఇంగ్లాండుతో నైనాసరే. ఇటీవల నేను ఇంగ్లాండు యాత్ర చేయడం ఈసభకు తెలిసిందే. నిజానికి అక్కడికి వెళ్ళటానికి నాకు ఇష్టంలేదు. దానికి కారణాలు కూడా ఈ సభకు బాగా తెలుసు. అయినప్పటికీ గ్రేట్ బ్రిటన్ ప్రధాన మంత్రి యొక్క వ్యక్తిగత అభ్యర్థన కారణంగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్శిన ప్రతిచోటానేను మర్యాద పూర్వకంగా వ్యవహరించాను. ప్రపంచం నుండి ముఖ్యంగా చాలా కాలంగా ఘర్షణ సంబంధాలతో కొనసాగుతూ వచ్చిన ఇంగ్లాండు నుండి కూడా ప్రోత్సాహకం, మిత్ర, సహకార సందేశాలకై ఆశగా ఎదురు చూస్తున్న ఈ ఉద్విగ్నభరిత సమయంలో దురదృష్టవశాత్తూ నేను అవేవిలేకుండానే నిరాశతో తిరిగి వచ్చాను. బ్రిటీష్ మంత్రివర్గము, దానిఅధికారులు చేసిన కొన్ని ప్రకటనలవల్ల మనకు కొత్త ఇబ్బందులు వచ్చాయి. అది ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ, ఇక్కడికి హాజరయిన, హజరుకాని వారందరి సహకారంతో మనం విజయపథంలో ముందుకు సాగేక్రమంలో అవేవి మనదారికి అడ్డుపడలేవు. మనం అభివృద్ది మార్గంలో గెంతబోయే ఈ తరుణంలో పూర్వం ప్రస్థావనకు రాని కొత్త పరిమితులు, ప్రక్రియలు, ఇబ్బందులు మనకు విధించబడ్డాయి. ఆప్రక్రియ నన్ను దెబ్బకొట్టింది. మనసును గాయపరిచింది. అయినా వాటిని నిర్దేశించిన ఏవ్యక్తి నిజాయితీని సవాలు చేయాలని నేను కోరుకోవటంలేదు. కాని దేశమంతా, పెల్లుబికిన స్వాతంత్ర పిపాసతో ఉన్నప్పుడు అటువంటివాటి విషయంలో న్యాయపరమైన పద్దతులపై ఆధారపడటం బలహీనమైన పోకడే అవుతుంది. మనలో చాలా మంది ఒక తరంలేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు భారతస్వాతంత్య్ర పోరాటంలో భాగం పంచుకున్న వాళ్ళమే. మనము ఆకష్టాలలోతులు అనుభవించిన వాళ్ళమే అట్టివాటికి అలవాటు పడిపోయాము. ఒకవేళ అవసరమొస్తే మరలావాటిని అనుభవిద్దాం. దీర్ఘకాలంగా ఇన్నికష్టాలు పడుతున్నప్పటికీ, మనము పోరాడడానికి లేదా విధ్వంసానికి కాక, సృష్టించడానికి మరియు నిర్మించడానికి గల అవకాశములకోసం ఎదురుచూస్తున్నాం. ఆవిధంగా నిర్మించాలనే యత్నానికి సమయం వచ్చేసిందనుకుంటున్న ఈ తరుణంలో కొత్త సమస్యలు మనమార్గంలో ఎదురవుతున్నాయి. దీనివెనుక ఉన్న శక్తులు ఏవైనప్పటికీ మన ప్రజలు తెలివైన వారు, సమర్దులు, మేధావులు. అయినప్పటికీ పదవిలో వున్న వారికి ఉండవలసిన ఊహాత్మక శక్తితో కూడిన సాహసంవారిలో లోపించింది. నీవు ప్రజలతో వ్యవహరించాలంటే, వారిని ఊహాత్మకంగానే కాక, వారి ఉద్వేగాలను, వారి తెలివితేటలను కూడా అర్థం చేసుకోవాలి. గతంనుండి వెంటాడుతున్న మన వారసత్వంలో ఉన్నదురదృష్టమేమంటే భారతీయ సమస్యలను ఊహాత్మకంగా అర్థం చేసుకోలేకపోవటం. ఈ రోజున నిర్మితమైన భారతదేశానికి ఎవరి సలహాగాని, వారి ఆలోచనలను బలవంతంగా రుద్దడంగానీ అవసరంలేదన్నది అర్థం చేసుకోకుండానే తరచుగా సలహలివ్వటానికి ప్రజలు చొరబడుతుంటారు. భారతదేశాన్ని స్నేహ సహకార సంబంధాల ద్వారా మాత్రమే ఎవరైనా ప్రభావితం చేయగలరు. బలవంతంగా రుద్దాలనుకునే ఎట్టి చిన్న ప్రయత్నాల నైనా తిరస్కరించాలి, తిరస్కరించబడుతుంది. నిజాయితీగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురు అయినప్పటికీ మేము కొద్దినెలలుగా సహకారపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడానికే ప్రయత్నించాము, ఈ కృషినే మేము కొనసాగిస్తాము. అయితే ఇతరులనుండి తగినంత స్పందన లేకుంటే ఆ వాతావరణానికి భంగము కలుగుతుందని భయపడుతున్నాను. అయినప్పటికీ మనం ఈ బృహత్ కార్యక్రమాల వైపు మొగ్గివున్నాం కనుక, ఇదే కృషిని కొనసాగిద్దామని విజయం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడైనా మనదేశస్తులతోనే వ్యవహరించాల్సి వచ్చినప్పుడు వారిలో ఎవరైనా తప్పుదోవ అనుసరిస్తున్నప్పటికీ మనము వారితో సత్సంబంధాల్ని కొనసాగిద్దాం. ఎందుకంటే ఈరోజు కాకుంటే రేపైనా వారితో అనివార్యంగా సహకార దృష్టితో కలిసి పనిచేయవలసే ఉంటుంది. మనం ఏ భవిష్యత్తుని సృష్టించుకోవడానికి యత్నిస్తున్నామో దాని విషయంలో కొత్తఇబ్బందిని సృష్టించేది వర్తమానంలో వుంటే వాటిని తొలగించుకోవాలి. కాబట్టిమనదేశస్తులకు సంబంధించినంత వరకూ వారి నుండి పెద్దమొత్తంలో సహకారం పొందటానికి పూర్తిప్రయత్నంచేయవలసి వుంటుంది. వాని సహకారమంటే మనం ఇప్పటి వరకు ఏ విలువల కోసం నిలబడ్డామో, దేనికోసం నిలబడ్డామో దాన్ని వదులుకోవమనడం కాదు. మనం మన జీవితాలకు విలువ నిచ్చేవాటిని వదులుకోవడమే సహకారం కాదు. ఒకరినొకరం అనుమానించుకుంటున్న ఈథలో కూడా ఇంగ్లండ్ సహకారాన్నే మనం కోరుకుందాం.మనం ఈవిధంగా సహకరించుకోకుంటే మనకూ నష్టం. ఇంగ్లండుకు ఖచ్చితంగా మరింత నష్టం. ప్రపంచానికి కూడా ఎంతో కొంత మేర నష్టదాయకమే. మనం ఇప్పుడే ప్రపంచయుద్దం నుండి బయటపడ్డాం. కొత్త యుద్దాల ప్రసక్తి వచ్చినప్పుడల్లా ప్రజలు చాలాక్రూరంగా పాశవికంగా మాట్లాడు కుంటారు. అలాంటి సమయంలోనే శక్తి వంతంగా, భయరహితంగా మన నవభారతదేశం అవతరిస్తుంది. ప్రపంచం సంక్షోభం నుండి కొత్త జన్మఎత్తడానికి అదే తగిన సమయం కావచ్చు. రాజ్యాంగాన్ని నిర్మించడమనే మహాయత్నంలో మనం ఈ తరుణంలో ఈ సమూహానికో లేక మరొక సమూహానికో చిన్ని చిన్ని ప్రయోజనాలనాశిస్తూ కొట్టుకు పోకుండా వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ సాధించాల్సిన గొప్ప అభివృద్ది కొరకు మనం ఆలోచించాలి. మనగతమూ, ప్రపంచమంతా మనలను చూస్తుంటుంది. ఎందుకంటే ప్రపంచవేదిక మీద మనం క్రియాశీలంగా వున్నాము. మనము ఏంచేస్తున్నామన్న దానికి మన చరిత్ర సాక్ష్యం. అయినప్పటికీ భవిష్యత్ కూడా మనవైపే చూస్తుంటుంది. అందువలన శక్తి వంతమైన గతాభివృద్దిని, రాబోయే భవిష్యత్‌ని, వర్తమాన సంక్షోభాన్ని దృష్టిలో వుంచుకుని ఈ తీర్మానాన్ని గురించి ఆలోచించండి. నేను దీనిని ప్రతిపాదిస్తున్నాను.
స.హ. ప్రచార ఐక్యవేదిక ప్రాంతీయ సదస్సు - సమావేశ విశేషాలు
ముందనుకొన్న ప్రకారము అక్టోబరు 29,30,31 తేదీలలో సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాంతీయ సదస్సు జరిగింది. ఆసదస్సుకు సుమారు 50 మంది హాజరైనారు. ఈ సమావేశమునకు ఆయాజిల్లాల బాద్యులు, టి.ఒ.టి. ట్రైనింగు తీసుకొన్న వారు. ట్రైనింగ్ తీసుకొనుటకు ఆసక్తిగల వారిని పిలవడము జరిగింది.
ముందుగా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ సంస్థాగత విషయాలు కార్యక్రర్తలందరికి సమంగా తెలిసుండాలి గనుక సంస్ధను గురించి తెలియడ మంటే ఏమిటి? అని ప్రశ్నించి సంస్థ ఆశయాదర్శాలు తెలిసుండాలి, నియమ నిబంధనల గురించి తెలిసుండాలి. సంస్థ లక్ష్యాలను సాధించుకోటానికి ఏర్పర్చుకొన్న కార్యాచరణ ప్రణాళిక గురించి తెలిసుండాలి మరియు ఇష్టపడి వుండాలి అంటూ సంస్థ ఆశయాదర్శాలను, ప్రణాళికను గురించి కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఆప్రశ్నలు
1. 1/8/2011 నుండి 31/1/2012 వరకు కొన్ని జిల్లాలు కలసి పనిచేద్దామనుకొన్న విషయం తెలుసా?
2. స.హ. ప్రచార ఐక్యవేదిక కొన్ని సంస్థలు కొన్ని కొన్ని జిల్లాలను దత్తత తీసుకొన్నాయన్న విషయం మీకు తెలుసా?
3. ఏ ఏ సంస్థలు ఏ ఏ జిల్లాలు దత్తత తీసుకోన్నాయో తెలుసా?
4. ఐక్యవేదికలోని భాగస్వామ్య సంస్థలు విూకు తెలుసా ?
5. ఐక్యవేదిక అంతిమ లక్ష్యం, థలవారీ లక్ష్యాలు, ఈ వివరము విూకు తెలుసా ?
6. ప్రస్తుత సమావేశ ప్రత్యేకత విూ దృష్టిలో వుందా ?
ఇలా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడము వలన హజరయిన వారందరి అవగాహన ఏ స్థాయిలొ ఉన్నదో ఎవరికి వారు పరిశీలించు కొటానికి అవకాశం ఏర్పడింది. ఆ ప్రశ్నలకు సమావేశము నుండి వచ్చిన సమాధానాల సంపుటి ఇలా వుంది. దోరకుంటలో ఆగస్టులో జరిగిన సమావేశములో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సత్యాన్వేషణ మండలి కొన్ని జిల్లాలను దత్తత తీసుకోవడము, ప్రతినెలా సవిూక్షా సమావేశాలు జరుపుకోవాలనుకోవడం, జనవరి చివరిలో వార్షికోత్సవ మహాసభ ఏర్పాటు చేసుకోవాలను కోవడం జరిగింది.
సత్యాన్వేషణ మండలి '5' జిల్లాల బాధ్యత స్వీకరించింది. 1. ప్రకాశం 2. గుంటూరు 3. కృష్ణా 4. పశ్చిమగోదావరి 5. ఖమ్మం జిల్లాలు కాగా, డా|| బ్రహ్మారెడ్డి..... గారు కర్నూలు జిల్లా, యం.వి.ఎఫ్. నల్గొండా, రంగారెడ్డి జిల్లాలు, జై భారత్ మెదక్, కడప జిల్లాలు ఏకలవ్య పౌండేషన్ ఆదిలాబాద్ జిల్లా బాద్యతలు తీసుకొన్నాయి.
ఐక్య వేదిక అంతిమ లక్ష్యం భారతరాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోడానికి అవసరమైన 73,74 రాజ్యాంగ సవరణ చట్టం అమలుకు కృషిచేయడం ఆ అందిన అధికారం దుర్వినియోగం కాకుండా గ్రామసభలు, వార్డు సభలు జరుగులాగున ప్రజలను చైతన్యపరచడం మన అంతిమలక్ష్యం కాగా వీటిని సాధించుకోటానికి జిల్లాలనుండి మండల స్థాయివరకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం, మండల కమిటీలు ఎక్కువ గ్రామాల ప్రాతినిధ్యంతో ఏర్పాటు చేయడం అలా అవగాహన కలిగిన ప్రజలనుండి 2014కు ప్రజాప్రతినిధుల ఎదుట ఒక డిమాండ్, అదేమంటే ఏపార్టీ తమ మ్యానిఫెస్టోలో 73,74 రాజ్యాంగ సవరణ చట్టం అమలు పరుస్తానని పెట్టుకొంటుందో ఆ పార్టీకే మా ఓటు అన్నది దీని నుండి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం అమలవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మన గ్రామంయొక్క వాటానిధులు మన గ్రామానికి చేరతాయని అర్ధము. ఆ నిధులు ప్రక్కదారిపట్టకుండా ప్రజలు చేత గ్రామసభల్లో, వార్డు సభల్లో వారి అవసరాలకు తగ్గట్టు తగునిర్ణయాలు తీసుకొనేటట్లు ప్రజలకు అడగడం నేర్పడం కొరకు స.హ.చట్టం ద్వారా అధికారులను ప్రశ్నించడం, పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచితే తద్వారా అవినీతిని తగ్గించడము ఉపలక్ష్యంగా పెట్టుకొని గ్రామస్థాయి వరకు స.హ.చట్టాన్ని తీసుకెళ్ళాలనుకొన్నాము.
ఏ ఉద్యమమైనా చైతన్యవంతంగా పని చేస్తూవుండాలంటే నిర్ణీత అవధుల్లో సవిూక్షా సమావేశాలు జరుపుతూ వుండాలి. రాబోయె కాలానికి లక్ష్యాలు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పరుచుకోవాలి కనుక మనము ప్రస్తుతసమిక్షా సమావేశాలు జరుపుకొంటున్నాము.
ఆయా జిల్లాల్లో జరిపిన కార్యమ్ర వివరాలు ఆయా బాధ్యులు వివరించిన తరువాత టి.ఒ.టి శిక్షణ పొందాలన్నకుతూహలంతో వచ్చిన కార్యకర్తలనుద్దేశించి ఐక్యవేదిక అధ్యయనాంశాలు, శిక్షణాతరగతుల గురించి వివరించారు. సమర్దుడైన కార్యకర్త నిర్మాణము కొరకు, ఐక్యవేదిక లక్ష్యాలు సాధించడానికి కార్యకర్తలు తెలుసుకొని వుండాల్సిన అంశాలు 1. సంస్థకు సంబందించిన అవగాహనకొరకు ఐక్యమంత్రిమండలి పరిచయము. 2.సమాజం కొరకు తను ఎందుకు పనిచేయాలో తెలిసుండడంకొరకు ప్రేరణప్రసంగం, 3.తనుప్రేరణ పొంది తెలుసుకొన్న విషయాలను తెలియజెప్పే ప్రసంగాలనైపుణ్యాలను 4. సబ్జెక్ట్‌గా భారతరాజ్యాంగము- కనీస అవగాహన 5. సమాచారహక్కు చట్టం గురించి నేర్పబడతాయి. అలానే అభ్యాసము చేయించబడతాయన్నారు.
తరువాత సభకులలో చాలా మంది పై అధ్యయనాంశాలపై ప్రసంగించారు. వారిలో జగన్, మోషే, ప్రసాదు, మాధవి, విజయలక్షి, నర్శింహం, స్వర్ణ ప్రసాద్, రహీం, గోపాల్, రామకృష్ణారెడ్డి, సి.మాధవి, నారయ్య గార్లు ఉన్నారు. శివరాజ్ గారు అయా ప్రసంగాలపై లోతైన అవగాహన కొరకు అనేక ప్రశ్నలు వేసి సభను చైతన్యవంతం చేసారు.
భవిష్యత్‌లో ప్రాంతీయసదస్సులో సాధించవలసిన అంశాలు నిర్ణయించుకోవడం జరిగింది.
1. ప్రతిజిల్లాలో టి.ఒ.టి శిక్షణ 10మంది 15రోజులలోపల జరగాలి.
2. జనవరి 31 నాటికి 500 సభ్యత్వాలు చేర్పించాలి.
3. ఆయా జిల్లాలలో 50% మండలాల్లో అవగాహనా సదస్సులు జరగాలి.
4. ప్రతి నెలా 1వ తేదిన రాష్ట్ర. కార్యాలయానికి ఆయా జిల్లాల నుండి చేపట్టిన కార్యక్రమాల నివేదిక పంపాలి.
5. 30/1/12 నుండి 3/2/12 వరకు ఆయా జిల్లాలలో జిల్లా వార్షికోత్సవాలు, ఆయా జిల్లాలోని బాధ్యులు, కార్యకర్తలు, సభ్యులతో 300 మందికి తక్కువ కాకుండా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.
చివరగా పుట్టా విమలాదిత్య కేరళ రాష్ట్రములో 73,74 రాజ్యాంగ సవరణ చట్టము ఎలా జరుగుతుందో సవివరంగా వివరించటంతో సభను ముగించారు.
రిపోర్టర్ :
కె.ప్రసాద శివరావు
No comments:
Post a Comment