యోచనాశీలురైన మిత్రులారా!
మార్చి - 185 - సంచికతో మొదలైన, 'బైబిలు పక్షములతో బైబిలు పై చర్చకు మండలి సిద్దంగా ఉందన్న' ప్రకటనను మీరందరూ గమనించే ఉంటారు. ఆ సంచికలో ఎవరైనా బైబిలు జోలికివస్తే ఊరుకోను, అనేగాక దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిపై నేను నోరెత్తానంటే వాడు కుళ్ళి కుళ్ళి చస్తాడు అనీ, నేను వాణ్ణి మట్టి కరిపించేస్తాను అనీ, బహిరంగంగా తన ప్రసంగాలు, సి.డి. క్యాసెట్లు మరియు వ్రాతల మూలంగా ప్రకటించిన పి.డి సుందరావు గారితో చర్చకు బైబిలు పై విచారణకు మునుముందుగా మేము సిద్ధంగా ఉన్నామనీ, ఇక ఆయన వైపు నుండే జవాబు, కదలిక రావలసి ఉందనీ ప్రకటించాను.
ఆ సంచికలోనే, ఈ ప్రకటన కేవలం సుందరావుగారికే పరిమితమైందికాదు. బైబిలు మానవ సమాజం అంగీకరించదగిన, అనుసరించదగిన భావాలతోనూ, ఆచరణ ప్రణాళికతోనూ ఉందని, అందులో తప్పుడివిగానీ, కాలం చెల్లినవిగానీ, అనుసరించ కూడనివిగానీ, అజ్ఞాన రూపాలైనవిగానీ భావాలు ఏమీ లేవని నిరూపణ ఎవరు చేయగలిగినా, మండలి అలా నిర్ధారించిన వారి మార్గదర్శకత్వంలో బైబిలు వెంట నడవడానికి, మిగిలిన జీవితం గడపడానికి సంసిద్ధంగా ఉండగలదని, ప్రకటించాను. అంతేగాక,
ఈ అంశాన్నే మరికొంత పొడిగించి, నా ఈ ప్రకటన కేవలం బైబిలుకే పరిమితమైంది కాదనీ, ప్రపంచంలో ప్రధాన మతాలుగా చెప్పబడుతూ, వేదాన్ని, ఖురానును దైవగ్రంథాలని చెపుతున్న వైదిక, ఇస్లాం మతాలకూ వర్తిస్తుందనీ, ఆ రెండు గ్రంథాలననుసరిస్తున్న, అనుసరించమని జనానికి ప్రబోధిస్తున్న ఆ మత ప్రతినిధులెవరితోనైనా చర్చించడానికి, బైబిలు విచారణ సందర్భంలో ఏర్పరచుకున్న సాధారణ (ఎవరికైనా వర్తించగల) నియమనిబంధనలతోటే సిద్ధంగా ఉండగలదనీ ప్రకటించాను. ఈ ముఖంగా మరోమారు మళ్ళా మా సంసిద్దతను తెలుపుతూ దిగువ ప్రకటన చేస్తున్నాను.
సత్యాన్వేషణ మండలి తరఫున సురేంద్ర చేస్తున్న బహిరంగ ప్రకటన
వేదము, బైబిలు, ఖురాను అన్న గ్రంథాలలో ఏ గ్రంథాన్ని గానీ, (1) అదిదైవగ్రంథము (2) సత్యధర్మాల విషయంలో అంటే స్వీకరించదగినవీ మార్చుకోనక్కరలేనివీ అందులో చెప్పబడ్డ - ప్రకటింపబడ్డ - అభిప్రాయాలన్నీ సరైనవీ, అన్ని కాలాలకూ వర్తించేటివీ (3) ఆ గ్రంథంలో చెప్పబడ్డ దేవుడు, ఉన్నాడు. అతడే నిజమైన దేవుడు (4) అతడు (ఎ) సృష్టికర్త (బి) సర్వజ్ఞుడు (సి) సర్వశక్తిమంతుడు (డి) ప్రళయానంతరంగానీ జీవుల మరణానంతరంగానీ, వర్తమానంలోగానీ జీవులకర్మలకు ఫలితాలనిచ్చేవాడు. అన్న నాలుగంశాలు వాస్తవాలేనని నిరూపిస్తాము, అంటున్న వాళ్ళతో లేదా అనగలవాళ్ళతో మాత్రమే ఆ విషయాల సత్యాసత్యాలు పరిశీలించడానికే ఈ చర్చావేదికను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అందుకు సిద్దపడే వాళ్ళతో చర్చలో పాల్గొనడానికీ, ఏర్పరచుకున్న షరతులకులోబడి తేలిన దిశగా నడవడానికీ మేము సిద్దం.
ముఖ్యగమనిక : ఏదైనా ఉనికిలో ఉన్న పదార్థాన్ని లేదా వస్తువును గురించి సరిపడినంతగా తెలుసుకోవాలనుకుంటే (1) అదంటే ఏమిటి? (2) ఎక్కడుంది (3) ఎప్పుడుంది (4) ఎంతుంది (5) ఎలా ఉంది (6) దాని గుణాలు (లక్షణాలు) ఏమిటి (7) అది చేయు పనులేమిటి? (8) దానితో మనకున్న సంబంధమేమిటి? (9) అది నీకెలా తెలిసింది? నాకెలా తెలుస్తుంది? (ఏప్రమాణం ద్వారా తెలుస్తుంది) అన్న అంశాలకు చెందిన వివరాలు తెలియాలి. ఇది జ్ఞానార్జన విషయంలో అత్యంత సాధారణ నియమం(సూత్రం)
ఇక్కడికిది నిజమోకాదో పరిశీలించుకుని తేల్చుకోండి. నాకు తెలిసి ఇది, శాస్త్రీయ చర్చావేదికల గురించి సరైన అవగాహనకలవారిలో నిర్వివాదాంశము.
కనుక ఇప్పుడు మనం చేయబోయే ఆయా దైవ గ్రంథాల విచారణలో ఈ సూత్రాన్ని వినియోగించుకుంటూనే సిద్ధాంత విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఒక కీలకమైన సూచన చేయడం వేదిక శాస్త్రీయత దృష్ట్యా అవసరం. ఏదైనా ఒకదాన్ని గురించి అది ఉందనే వాళ్ళేకాక, లేదనే వాళ్ళూ, పై విషయాలకు తామంగీకరిస్తున్న సమాధానాలు చెప్పే, అలాటి వివరాలకు సరిపోయేది లేదు అనాలి. 'అంటే దేవుడున్నాడు', 'దేవుడులేడు', 'ఉన్నాడో లేదో తెలీదు' అనే మూడు పక్షాల వాళ్ళకు, దేనిని గురించి తామామాటని అంటున్నామో దానిని గురించి పై ప్రశ్నలననుసరించిన అభిప్రాయాలు ఉండితీరాలి. అలాంటిది లేదని గానీ, ఉందనిగానీ, ఫలాన వాళ్ళు అంటున్నారు అనిగాని, ఫలానా గ్రంథం చెపుతోందని గాని, ప్రతిపాదక పక్షం అన్నట్లైతే, ప్రశ్నించేవారుగానీ, పరిశీలించేవారుగానీ, వాళ్ళులేదా ఆ గ్రంథం అన్నది సత్యమోకాదో తేల్చుకోవడం ఎలా? వారన్నది సత్యమేనని నీకెలా తెలిసింది? మాకెలా తెలుస్తుంది? అనడగాలి. ఆ ప్రశ్నకు సరైన సమాధానం, ప్రతిపాదక పక్షాన ఉన్నవారు చెప్పి, దాని సత్యతను నిరూపించాలి.
శాబ్దీ ప్రమ విషయంలో వర్తించే, అనుసరించాల్సిన అనుసరించకతప్పని పద్దతి ఇది.
ఇక అలాంటిది ఉండకతప్పదు అనిగానీ, ఉండే అవకాశం లేదు అనిగాని ప్రతిపాదనచేయదలచుకుంటే, అది అనుమాన ప్రమాణ సంబంధమైన ప్రకటన అవుతుంది. అలాంటప్పుడు ఏ ఆధారాలతో ఆ అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నదీ ఆ ప్రతిపాదకుడు వేదికకు తెలియజేయాలి. అటు తరవాత ఆధార సహిత ఊహారూపమైన తన ప్రతిపాదన ఊహగానేగాక సత్యమనడానికి సరితూగుతుందని నిరూపించాలి.
ప్రత్యక్షం ద్వారానే తానిట్టి జ్ఞానాన్ని పొందాననీ (తనకీవిషయం తెలిసిందనీ) వేదికకూ ఆ రీతిలోనే ఆ విషయాన్ని తెలియపరచగలనని చెప్పేట్లయితే ఆ విషయాన్ని గురించి నిర్థిష్ట ప్రకటన చేసి, ప్రయోగం ద్వారా సభకూ ఆ విషయాన్ని చూపించి (తెలియపరచి) రుజువు చేయాలి.
సిద్ధాంత విచారణలో ఏ ప్రతిపాదనలైనా పై మూడు రూపాలలోనే ఉంటాయి మరో రూపంలో ఉండే అవకాశమేలేదు. ఆ మాటనే క్లుప్తంగా చెపుతాను జాగ్రత్తగా గమనించండి.
(1) ఎవరో చెప్పగా వినో, గ్రంథం చదివో ఆ విషయం తెలుసుకున్నాను అనిగనక ప్రతిపాదకుడంటే, అలాగైతే ఆ విన్నమాట సరైందేనని ఎలా తేల్చుకున్నావు? అని అడగాలి, ఇదిగో ఇలా తేల్చుకున్నాను అని అతడు చెప్పగలగాలి. అది మనం గమనించడానికీ, సరిచూడడానికీ వీలైందిగా ఉండాలి. లేకుంటే ఆ ప్రతిపాదన సరైందో కాదో వేదిక నిర్ణయించలేదు.
(2) లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించాను అనిగనక అన్నట్లైతే, ఆ నీ ఊహసరైందో కాదో తేల్చుకున్నావా? ఎలాతేల్చుకున్నావు? ఆధారసహితంగా ఊహించింది తప్పో ఒప్పో ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? అతడాధారాలు అంటున్నవి, అలా జరగడానికి వీలున్న వేననడానికి తగిన సాధారణ సూత్రీకరణలు ఏమున్నాయి? అన్నది వేదిక పరిశీలించి చూడాలి. అలాంటి తార్కిక నిగమనాలన్నీ సరిచూడాల్సినవిగనే ఉంటాయన్నది నిర్ధారణ నియమాలలో అత్యంత కీలకమైనది. దీనిని గుర్తుంచుకోండి.
(3) ఇక మిగిలింది వక్త, ఆ విషయాన్ని నేరుగానే తెలుసుకున్నాను అన్నట్లైతే, ఆ కలిగిన జ్ఞానం ప్రమ రూపమో, భ్రమరూపమో తెల్చుకున్నావా? ఎలా తేల్చుకున్నావు? అనడిగి అతనెరిగిన రీతినే మనమూ ఎరగడానికి ప్రయత్నించాలి. ఆ మాటన్నవాడే మనకు విషయాన్ని ప్రత్యక్షం ద్వారా తెలియపరచాలి.
చర్చావేదికంతటికీ అత్యంత ముఖ్యమైనదీ, అంతిమ లక్ష్యం అనదగిందీ, ప్రకటితాభిప్రాయం సత్యమో, కాదో నిర్థారించుకోవడమే. ఆ దృష్టిని విడిచి చేసే సంభాషణలన్నీ అనవసరపు శ్రమ రూపాలే. (దండగమారి పనులే)
మన ఈ చర్చావేదిక లక్ష్యం, బైబిలు (ఖురాను, వేదము, మరేఇతర దైవ గ్రంథ మనబడుతున్న రచనలైనా) దైవ గ్రంథమా? కాదా? బైబిలు ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడా? బైబిలులో సమస్త విషయాలూ చెప్పబడ్డాయా? చెప్పబడ్డ విషయాలు సరైనవేనా? అన్నదే. మరి ఆ పని సక్రమంగా నెరవేరాలంటే వేదికలో, 1.భాషా నియమాలు, 2.వాద నియమాలు, 3.విచారణ నియమాలు, 4.నిర్థారణ నియమాలు అన్నవాటినీ, వాద ప్రతివాద పక్షాలు, పరిశీలకులూ, నిర్ణేతలు అన్న పక్షాలను ఏర్పరచుకుని, ఆయా ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చేంతవరకు, చర్చను సాగించాల్సి ఉంటుంది. బైబిలును శాస్త్రీయ విచారణకులోను చేయడమంటే, అది పి.డి. సుందర్రావుగారికీ, సురేంద్రకూ మాత్రమే పరిమితమైంది కాదు. కొన్నికోట్ల జీవితాలు, కొన్ని వందల (వేల) సంవత్సరాలుగా అనుసరిస్తున్న భావజాలాన్ని సరిచూడడమనేదానర్థం కనుక ఈ విషయంలో అంతటి సంసిద్ధత, నిబద్దత ఉండడం అవసరం.
ఈ వేదిక ప్రధానంగా ఉద్దేశించింది పి.డి. సుందర్రావుగారితో చర్చనే అయినా, ఆయనతో ముడిపడి ఉన్న ముఖ్యులకూ, ఆయనకూ మధ్యనడిచిందంటున్న లేఖల సమాచారాన్ని పాఠకుల ముందుంచడం, రాగ ద్వేషరహితంగా దాన్నంతటినీ పరిశీలించడం అవసరం. సందర్భోచితం కూడా. ఆ క్రమంలో పి.డి సుందర్రావుగారికీ రావిపూడి వెంకటాద్రి గారికీ మధ్య జరిగిందంటున్న దానిని, ఇంకా పి.డి సుందరావుగారికీ, అద్దంకిరంజిత్ ఓఫెర్‌గారికి జరిగిందనంటున్న దానిని, వారి ముగ్గురి నుండి అందిన సమాచారాన్ని సంగ్రహంగా మీ ముందుంచుతాను. ఈ వివరాలను ఆ ముగ్గురికీ, వీలైతే వారి అనుయాయులలో కొందరికీ కూడా పంపిస్తాను. వారిదిగా నేనందించిన వివరాలలో ఏవైన సవరణలు పూరణలు ఉంటే వాటిని ఆధారాలతో సహా నాకు తెలియపరచవలసిందిగా ఈ ముఖంగానే వారి మువ్వరకూ విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైన మేర ఆ వివరాలను మరుసంచికలో ప్రచురిస్తాను.
(1) పి.డి.సుందరావుగారు ప్రకటించిన వివరాలు (వెంకటాద్రిగారి గురించి)
విశాఖపట్నం
తేది : 30.3.1990
భారత హేతువాద సంఘ అధ్యకక్షులు రావిపూడి వెంకటాద్రిగారికి జయశాలి ఇచ్చిన రిజిష్టరు ఉత్తరం.
మహారాజశ్రీ భారత హేతువాద సంఘ అధ్యకక్షులు రావిపూడి వెంకటాద్రి గారికి
అయ్యా,
మీ 3.6.1989 ఉత్తరం ప్రకారంగా మే 1వ తేదీ 1990 సాయం కాలం, విజయనగరం స్టాన్‌పోర్టునగర్ బహిరంగ మైదానంలో విభిన్నవర్గాల ప్రజల మధ్య (ప్రజాకోర్టు) మన పోటీకి అన్ని ఏర్పాట్లు జరుగుచున్నవి. 2,3 జిల్లాలు అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంల నుండి అన్ని తరగతుల ప్రజల నుండి న్యాయమూర్తులు ఎంపిక చేయనున్నారు. ఇందు గౌరవనీయులైన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు, పత్రికాధిపతులు, మేధావులు మొదలగువారు న్యాయ నిర్ణేతలుగ వ్యవహరించెదరు.
మన ఇరువురి మధ్య ఎంపికైన భాగము ''ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను'' అనే పచ్చి అబద్దంతో ప్రారంభమైన బైబిలు అంటూ ఆగస్టు 1989 హేతువాద పత్రిక సంపాదకీయంలో మీరు వ్రాసిన మాట.
అదే మాటను నగ్న సత్యంగా సైన్సు ప్రకారం రుజువు చేయగలను. అని మీకు ముందుగా జూలై 7, 1989న నేను తెలియజేసిన ప్రకారం మనం పోటీపడగలం.
పోటీలో ప్రజలముందు ఎవరివాదం ఓడినా, ఓడినవారు గెలిచిన వారి వాదంలోకి మారి ఓడిన వారి స్వీయ రచనలను ప్రజల ముందు కాల్చగలం. అందువలన ఈ నోటీసు అందిన పది దినములలోగా మీ అంగీకారం తెలుపగలరు.
భవదీయుడు
సంతకం - పి.డి. సుందరావు
సురేంద్ర : ఇక్కడ విచారించాల్సిన అంశమేమంటే, ఇంతటి ప్రాధాన్యతగల అంశం విషయంలో పోటీ దారుడైన వెంకటాద్రి గారి అభిప్రాయాన్ని గానీ, పోటీకి సిద్దమన్న ఆయన అంగీకార పత్రాన్ని గానీ పి.డి.ఎస్.ఆర్. ప్రచురించకపోవడం. అందువల్ల పరిశీలనాసక్తికల చదువరికి ఆనాడు జరిగిన సంఘటనగానీ, దానికి పూర్వరంగంగా ఉన్న వీరిద్దరి ఉత్తర ప్రత్యుత్తరాలుగానీ పూర్తిగా చూడలేని పరిస్థితి ఏర్పడిఉంది. దానికితోడు, సుందర్రావుగారే వారి పుస్తకంలో ప్రచురించిన పత్రికా ప్రకటనలలో 'ఆంద్రభూమి మే 2, 1990 యందు ''చర్చిఫాదర్ పై హేతువాదుల ఫిర్యాదు'' అన్న సమాచారం ఉంది. ఆ ప్రకటన సారాంశం; 'ఇరుపక్షాలు కలసి ఏర్పరచుకున్న వేదిక కాదది' అని హేతువాదుల తరఫున రామ్మూర్తిగారన్నారన్నదే.
పి.డి సుందర్రావుగారి వైఖరిలో రెండు అతిపోకడలు కనిపిస్తున్నాయి. కనపడ్డవారి పైనల్లా, ఇంకా చెప్పాలంటే తలంపు కొచ్చిన వారిపైనల్లా సవాలంటూ ప్రకటించడం, సభావేదిక ఏర్పాట్లూ ఘనంగానే చేయడం, ఏ ఒక్క సభాజరక్కపోడం, అవతలి పక్షం ఓడిపోయారనో, పారిపోయారనో ప్రకటించుకోవడం, దానినే ప్రచారం చేయడం. ఇందులో ఎక్కడా రెండో పక్షం పాత్రే కనపడదు. ఈ విధానం రోషంగానీ, విజ్ఞతగానీ ఉన్నవారు అనుసరించదగింది కాదు.
ఒకింత నిష్ఠూరంగా ఉన్న దీనిని ఉత్తరకుమార ప్రగల్భాలనో; 'కురచబుద్దిపోకడ' అనో అని తీరాలి. ఒక్కటంటే ఒక్క చర్చేనా జరక్కపోవడం, చర్చావేదిక నియమనిబంధనల్ని ఇరుపక్షాలూ కలసి ముందుగా ఏర్పరచుకోకపోవడం, ఇరుపక్షాలూ అంగీకరించిన న్యాయనిర్ణేతల ఏర్పాటు, వగైరా లేమీ లేకుండానే ఈ ప్రహసనం నడవడం చూస్తే, అంతకంటే ఇంకేమీ అనబుద్దికావడంలేదు. ఇంతకూ ఆనాటి వేదికలో న్యాయనిర్ణేతలుగ ఉండడానికి అంగీకరించి, వేదిక పైకి వచ్చిన వాళ్ళెవరో తెలిపి వారి వివరాలైనా ఇచ్చుంటే గింతైనా ఆయన విజ్ఞతను అంగీకరించే వీలుండేది. ఈ నాడైనా పి.డి. సుందర్రావుగారు ఆ వివరాలిస్తే (ఇవ్వటం ఆయన బాధ్యత), ఒకింత వ్యయ ప్రయాసలలో కూడుకున్నదే అయినా, అవకాశాన్ని బట్టి వారిని కలిసి ఆనాడు జరిగిందాన్ని విచారించే పనీ పెట్టుకుంటాను.
గమనిక : జగద్గురుగారు ఒత్తిడి చేయడంతో సరేననుకుని, పి.డి.యస్.ఆర్‌తో చర్చకు సిద్దమైన నేను వెంటనే వెంకటాద్రిగారి నుండి ఆనాటి వివరాలున్న పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అలాగే పి.డి.యస్.ఆర్‌తో వివాదపడుతున్న రంజిత్ ఓఫెర్‌గారితో ముడిపిడివున్న సమాచారం కొంత సేకరించాను. ఆ వివరాలు క్లుప్తంగానైనా మీ కందించడం సమయోచితంగానూ, సముచితంగాను ఉంటుంది. (ఎన్.వి. బ్రహ్మంగారినీ కలిశాను)
వెంకటాద్రిగారి పుస్తకంలో 'బైబిలు గణాచారం' అన్న శీర్షిక క్రింద ఉన్న సమాచారమిది. చూడండి.
''........ it would be, more consistant that we called it the word of denon. Than the word of god :- Thomas paine" అన్న వాక్యంతో మొదలెట్టారా రచనను వెంకటాద్రి.
1989లో ఓ బైబిలు గణాచారి (పి.డి. సుందరావు) ఒళ్ళు తెలియని మైకంలో ఉండి, తనతో బహిరంగ చర్చకు రావలసిందిగా నన్ను సవాల్ చేస్తూ విశాఖపట్నం నుండి ఒక ఉత్తరం వ్రాశాడు. అతని నుండి ఆ ఉత్తరం రాగానే, అతణ్ణి మతిచెడిన వాడిగా నేను గుర్తించాను. అలా అని అతనికి ఆ తర్వాత వ్రాసిన ఉత్తరాలలో పేర్కొన్నాను కూడా. హేతువాదులతో చర్చించాలని అంతకుతూహలంగా ఉంటే, అందుకు మరో కుర్రవాణ్ణి పంపిస్తాననీ, నేరుగా అతనితో చర్చించే ప్రశ్నేతలెత్తదనీ రాశాను.
వెర్రి ఉన్మాదం అతణ్ణి ఊరుకోనీయలేదు. నా అంగీకారం, అనుమతిలేకుండానే, అతనికై అతను ఏకపక్షంగా తేదీ నిర్ణయించి, విజయనగరంలో పోటీ పేరుతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఒక పిచ్చి డాక్టర్ని వేదికపైకి తెచ్చుకుని, తనకు పిచ్చిలేదని సర్టిఫై చేయించుకుని, అక్కడి భారత నాస్తిక సమాజం వారు విసిరిన సవాలును స్వీకరించక తాను వెంకటాద్రిగారితో మాత్రమే పోటీ చేస్తానని, ఆయన సమావేశానికి రానందున తాను గెలిచినట్లు ప్రకటించుకుంటున్నాననీ; 'తానే తుమ్మి తానే తథాస్తు' అనుకొన్నాడని తెలిసింది. ఇదంతా అతడు తన 'భూతలక్రిందులు' మాసపత్రికలో కూడా ప్రకటించుకున్నట్టు సదరు బైబిలు పిచ్చోడు సంచారం చేస్తూ నాకూ అతనికీ పోటీ జరిగినట్లూ, తాను గెలిచినట్లూ, ప్రచారం చేసుకుంటున్నట్లు నాకు సమాచారం అందింది. అది కొంతమంది క్రైస్తవ మిత్రుల్లో, హేతువాద మిత్రుల్లో అపార్థాలకు తావిస్తున్నదని కూడా తెలిసింది...... అందుకే ఈ పుస్తకం ప్రచురించాల్సి వచ్చింది.
బైబిలులో ఎంతమురికి, క్రౌర్యం, కుళ్ళు, ద్వేషం ఉన్నాయో యిందులోని కొన్ని వ్యాసాల్లో పేర్కొనడం జరిగింది.
ఈ పి.డి సుందర్రావు లాంటి గణాచార్లు గిల్లిజగడానికి దిగేదాకా, బైబిలు మీద వ్రాయడానికి నాకు తీరికలేదు. వారు కదిలించాక తప్పలేదు.
(1) యావత్తు భారతదేశంలో మీ హేతువాద సంఘమును వచ్చే సం||లో తూర్పు గోదావరి జిల్లాలో తిరిగి ప్రజాకోర్టులో ఛాలెంజ్ చేయుటకు సిద్దపడుచున్నాను. (తెలుపగలను) అంటూ పి.డి. సుందర్రావుగారి వద్ద నుండి నన్ను ఉద్దేశిస్తూ 1-6-89 తేదీతో ఉన్న లేఖలో ఉంది. దానికి సమాధానంగా; మీ 1వ తేదీ ఉత్తరం అందింది. అందులో మీరేదో ఒక సం|| తయారు తిన్నాక బైబిలుపై కుస్తీ పడతామని వ్రాశారు. ఈ లోగా బైబిలు బాగా చదివి విశ్వాసాన్ని బలపరచుకోండి. మీరు కోరినట్లే సం|| తరవాత తిరిగి వ్రాయండి. అని 3.6.89 న తిరిగి లేఖ వ్రాశాను.
(2) నా ఉత్తరం ఆయనకు అర్ధం కాలేదని అననుగానీ, మరల ఆయన నాకు 15-6-89 వ్రాసిన ఉత్తరంలో ''నా ఛాలెంజ్ కి మీరు నిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ స్వీయరచనలలో, బైబిలు క్రీస్తులకు భిన్నంగా వ్రాసిన పుస్తకమునుగానీ, మరేయితర పుస్తకమునుగానీ, దయచేసి నాకు పంపండి.... అదే పుస్తకంపై కొత్తపేటలో మన యుద్దమును ప్రారంభించగలము'' అని ప్రస్తావించారు.
పై ఉత్తరంలో అర్థం ఉన్నదని అననుగానీ, దానితోపాటు 'భూతలక్రిందులు' మాసపత్రిక 1989 మే నెల సంచికనూ పంపారు. ఈ లేఖ, ఆ పత్రిక చూశాక వారు భూమి మీద తలక్రిందులుగ తపిస్తున్నట్లు అర్థమైంది.... ''నన్ను ఆపగలిగే వాడు ఈ ప్రపంచంలో ఏ మూలనున్నాడా అని ఎదురు చూస్తున్నాను. కనుక ప్రజల మధ్యస్వైరవిహారం సాగిస్తూయున్నాను'' లాటి ప్రకటనలు చేస్తూ, ఆయన ఉత్తరాలకు సమాధానాలు గాని రాయకుంటే వారంతా ఓడిపోయినట్లు, తాను గెలిచినట్లు, తన తలక్రిందుల పత్రికలో అచ్చువేసుకుంటున్నారు. అందుకనే ఆయన మానసిక సమతుల్యత గురించి అనుమానం వచ్చి, 17-6-89న ఆయన కిలా వ్రాశాను.
మీ 15వ తేదీ ఉత్తరం అందింది.... నా పుస్తకాల లిస్టు పంపిస్తున్నాను. అందులో మీకు కావలసిన వాటికి డబ్బు పంపించి తెప్పించుకోండి.
మీ మొదటి ఉత్తరంలో, మీరు ఒక సం||లో పోటీకి సిద్దపడుతున్నట్లు వ్రాసి, అప్పుడు తెలపండి అని నేను వ్రాస్తే, మీ చాలెంజ్‌కి నేను నిలవడం వల్ల మీరు ఆనందించినట్లు వ్రాశారు. ఏ విషయం మీద మీరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలిస్తే, మీ ఛాలెంజ్‌ని ఎదుర్కోడానికి మా కుర్రవాళ్ళనెవరినైనా పంపిస్తాను. కానీ, మీ యోగ్యతలు, లక్ష్యాలు, చర్చ తీరు ముందుగా తేలాలి. ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి పెద్దలతో మాట్లాడి, అక్కడే మీకు కావలసిన చర్చకు ఏర్పాట్లు చేయండి.
''ఇంతకూ మీరు, క్రైస్తవాన్ని విమర్శించిన గ్రంథాలపై విమర్శలు వ్రాయలేక ఈ పద్ధతిని అవలంభిస్తున్నారా?''
గమనిక : ఈలేఖ సుందర్రావుగారికి వ్రాశాక, హేతువాదిలోనూ ప్రచురించారు వెంకటాద్రిగారు. దాన్ని ఆయన, ''ఈ విషయాన్న 'హేతువాది' పాఠకుల దృష్టికి ఎందుకు తెస్తున్నానంటే, అజ్ఞానానికి ఎన్ని తలలుండగలవో, అది ఎంత మూర్ఖంగా అహంకార పూరితంగా ఉండగలదో గుర్తుచేయడానికే''. అనీ ప్రకటించారు.
కొత్త బిచ్చగాళ్ళు కొందరు హడావిడి పడుతుంటారు. ఒడిలో పెడదామా? దడిలో పెడదామా? అని..... క్రైస్తవం విజ్ఞాన శాస్త్రంతో చేసిన యుద్దాలన్నింటిలోనూ అది ఓడిపోయింది. దానికెంతో సాక్ష్యం చరిత్రలో లభిస్తుంది. చీకటిలో ఉండేవారు చీకటిలో ఉండే పోరాటం చేస్తారు. చీకటి వారి పోరాటానికి బలాన్నిస్తుంది (జూలై 1980) అనవసరంగా హేతువాదులపై కాలుదువ్విన పి.డి సుందర్రావుగారి వుద్వేగం క్రమంగా చల్లబడుతున్నట్లుంది. వారి కుతూహలం నెరవేర్చడానికి మా కుర్రవాళ్ళనెవరినైనా పంపిస్తానని నేను వాస్త్రే, ఓటమిని మీకు రుచిచూపిద్దామనుకుంటే కుర్రవాళ్ళెందుకండీ? అని 7-7-89న సమాధానం వ్రాశారు.
ఈ విషయం మా కుర్రవాళ్ళకు చెపితే, ''బజారు ప్రచారకులతో మీ కేటి చర్చ? తేగలిగితే ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతిపోపునే తీసుకురమ్మనండి ఢీ కొంటాం'' అనంటున్నారు. మరిక ఇది తేలేది ఎట్లా?
యూనివర్శిటీ అంటే వారికి జంకెందుకో అర్ధం కావడం లేదు. పోనీ మరో తరగతి మేధావులో, లేక న్యాయ శాస్త్ర ప్రవీణులో, లేక వేర్వేరు మత సిద్ధాంతులో అయినా ఫరవాలేదు. అటువంటి మధ్యవర్తుల కోసమైనా ఆయన ప్రయత్నిస్తారని ఆశిద్దాం.
సుందర్రావుగారు ప్రవర్తిస్తున్న తీరుకు వెనక ఏమైనా విశేష మున్నదేమో అర్ధం కావడం లేదు. ఎందుకంటే, పండితునికీ, నిజాయితీ పరులకీ అలాటిబలహీనత ఉండదు.
''Before anything can be admitted as proved by the Bible; the Bible itself must be proved to be true.’’ అన్నాడు ధామస్‌పెయిడ్.
''ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను'' అన్న పచ్చి అబద్దంతో ప్రారంభమయ్యే బైబిలు పై చర్చకు, ఒక క్రైస్తవ మిత్రుడు ఛాలెంజ్ చేయడం నిజంగా విడ్డూరం. బైబిలు ప్రారంభవాక్య నిర్మాణం చేసినవారికి అందులోని ఐదు మాటల్లో ఒక్కదానికీ అర్థం తెలియదని హేతువాదుల భావన. ఆ వాక్యంలోని అజ్ఞానానికి అర్ధం చెప్పడానికి ''మతజిజ్ఞాసువులు'' వేల సం||ల నుండి ప్రయత్నం చేస్తూనేఉన్నారు. అయినా వారికది సాధ్యం కాలేదు. More statments are not proofs అన్న అవాకులన్నీ రుజువులు కావు. బైబిలు అబద్దాలను నిజాలని రుజువు చేసుకోలేకనే వైజ్ఞానిక పక్షంపై వారు వివిధ రకాలుగా ప్రతికూలత కనబరిచారు. అయినా శాస్త్ర జ్ఞానం పెరగకుండా ఆగలేదు.
... చర్చకు రాగల యోగ్యులుంటే వారితో చర్చించడానికి హేతువాదు లెప్పుడూ సిద్దమే. అయితే వారి షరతులకు లోబడి మాత్రం కాదు. కానీ సుందరావుగారు ఆదిలోనే హంసపాదం చేశారు.
నా జూన్ 17నాటి ఉత్తరం తనకు అందలేదని జూలై 7న వ్రాశారు. అలా అనే అవకాశం ఉండకపోదనే ఉద్దేశంతో, నేనా ఉత్తరాన్ని జూలై హేతువాదిలోనూ ప్రచురించాను. నేను 17-6-89 ఉత్తరంతో పాటు అదే కవరులో మా సాహిత్యం అచ్చులిస్టు కూడా పంపాను. ఉత్తరం చేరలేదుట కాని, 17-6-89న అదే కవరులో పంపిన లిస్టు 3-6-89న చేరిందట. వారునన్ను పుస్తకాలు అడిగింది. 15.6.89 నైతేనేను 3-6-89న లిస్టు పంపిస్తానా? అయినా, 3-6-న నేను లిస్టు పంపితే, బైబిలు, క్రీస్తులకు వ్యతిరేకంగా వ్రాసిన పుస్తకాన్ని గానీ, మరే ఇతర పుస్తకాన్ని గానీ పంపమని వారు నాకెలా వ్రాశారు? లిస్టు '3' నే అంది ఉంటే, లిస్టులోని ఫలానా పుస్తకం పంపమనిగదా '5'న వ్రాయాలి?
ఆదిలోనే హంసపాదమా? ఇలాంటి వారితోనా, నాలాంటి వారు చర్చకు దిగాలి?
సురేంద్ర : - ఇదండీ వెంకటాద్రిగారు, పి.డి. సుందర్రావుగారికీ తనకూ మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలంటూ నాటి హేతువాది ద్వారానూ, ఈనాటి 'మతజాఢ్యాల మచ్చుతునకలు' అన్న రచనలోని 'బైబిలు గణాచారం' శీర్షిక ద్వారానూ ప్రకటించిన అంశాలు. ఇక్కడ మనం గమనించాల్సినవీ, పి.డి. సుందరావుగారు సమాధానం చెప్పాల్సినవీ కొన్ని అంశాలున్నాయి.
(1) రావిపూడి వెంకటాద్రిగారు ఎప్పుడు, ఏ రూపంలో తన సవాలుకు అంగీకారం తెలిపారో, ఓడినవారు వారి రచనలను తగలెట్టాలన్న షరతుకు ఎక్కడ అంగీకరించారో, అలాగే ఓడిన వారు తన విధానాన్ని విడచి గెలిచిన వారి పక్షాన్ని స్వీరించాలన్న షరతుకు ఎక్కడంగీకరించారో ఆ వివరాలన్నింటినీ పి.డి. సుందర్రావుగారు వెంటనే నిజాయితీగా బయలుపరచాలి. అది ఆయన కనీస బాధ్యత. బాధ్యతేకాదు వెంకటాద్రిగారి నుద్దేశించి ఎన్నో మాటలనేసిన ఆయనకది విధికూడా. ఈ పని ఆయన చేయకుంటే, నిష్పాక్షిక పరిశీలకులెవరైనా పి.డి.సుందర్రావుగారు నేరస్తుడనే అనాల్సి ఉంటుంది.
సురేంద్ర :- ఈ సందర్భానికి పరిమితమై పి.డి. సుందరావుగారి, మరియు వెంకటాద్రి గార్ల రాతలు, మాటలను తీసుకుంటే వెంకటాద్రి గారి శైలిగాని, అభిప్రాయాలుగానీ చాల వరకు విజ్ఞులంగీకరించదగిన రీతిలో ఉన్నాయి. అదే మరి పి.డి.యస్.ఆర్ గారివి, ఆ రీతిగాగానీ, ఆ స్థాయిగాగానీ లేవు.
(1) తాత్విక ధోరణికి చెందిన కీలకాంశాలపై, ఒక మతం వెలువరిస్తున్న అభిప్రాయాల తప్పొప్పుల విషయం పై వివాద పడే సందర్భంలో ఏర్పరచుకునే వేదిక, అది ఎవరు ఏర్పరుస్తున్నదైనా, ఇరువురుకూ ఆమోదయోగ్యమైన అవగాహనా పరులూ నిస్పాక్షకులూ ఐన నిర్ణేతల పక్షాన్ని మునుముందుగా సిద్ధం చేసుకుని తీరాలి. ఆ పని పి.డి. సుందరావుగారు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు వారి ప్రకటనల నుండి లభించడం లేదు. ఇప్పటికైనా ఆనాడు వారు పెద్దఎత్తున ప్రచారం చేసి ఏర్పాటు చేశామంటున్న వేదిక కొరకు ఏర్పరచిన, అంగీకరించి వస్తామన్న (వచ్చిన) న్యాయనిర్ణేతల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు బయలుపరచాలి.
ఇక పి.డి సుందరావుగారికీ, అద్దం కిరంజిత్ ఓఫిర్‌గారికీ సంబంధించిన వివాదం
గమనిక :- వీరిరువురి మధ్య నడుస్తున్న వివాదపు ప్రధాన రూపం రెండు మూడంశాలకు ముడిపెట్టుకుని ఉంది.
(1) ఇరువురిలో ఎవరు దేవునిచేత ఎంపిక చేయబడ్డవారు?
(2) ఎవరి బోధ (బైబిలు పై వివరణ) బైబిలుకు అనుగుణ్యత కలిగి ఉంది?
(3) ఇరువురిలో ఎవరు బైబిలు బాగా తెలిసినవారు?
ఒకటవ అంశానికి సంబంధించి ఇరువురూ తమను తాము దేవునిచే ఎంపిక చేయబడ్డవారమేనని ప్రకటించుకున్నారు. పి.డి. సుందరాగారైతే మోషే తరవాత క్రీస్తు, ఆ తరవాత తానే దేవుని ప్రకటించడానికి వచ్చిన వారమని, ప్రకటించారు.
ఇక రంజిత్ ఓఫెర్ గారైతే; ఈ యుగానికి ఏసునోరును తానేనని ప్రకటించారు. అక్కడితో ఆగక, పరస్పరం ఎదుటివాడు నిజమైన క్రైస్తవుడుకాడనీ ప్రకటించేసుకున్నారు. ఒకరు చెప్పిందాన్ని మరొకరు ఖండించుకున్నారు కూడా.
నిజానికి, బైబిలు ప్రామాణికతను అంగీకరించిన ఇద్దరి మధ్య వివాదమేముంటుంది? సాధారణ హేతుదృష్టిననుసరించి అసలలాంటిదేమీ ఉండకూడదుకదా? కానీ అలా ఉందంటే దానర్ధంఏమిటి? వారు ఒకరినొకరు బైబిలు నీకు తెలీదంటే నీకు తెలీదు అనిగాని బైబిలుకు నీవు చేస్తున్న వ్యాఖ్యానం సరికాదంటే నీవు చెప్తున్న వ్యాఖ్యానం సరికాదని గానీ, అనుకుంటున్నారన్నమాటేగదా!
మన ప్రస్తుతాంశమైన పి.డి. సుందర్రావుగారికీ, అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికీ మధ్యనడుస్తున్న వివాదం (రగడ అనందామా?) అదే. అయితే పి.డి. సుందర్రావుగారిది మొరటు - బడిత - భాష. ఓఫిర్‌గారిది ఒకింత మృదు భాష. 'తంతానుకొడకా! అని సుందరావుగారంటే 'దండన తప్పదు కుమారా! అని ఓఫిర్‌గారంటారు. ఇద్దరూ దృఢంగా, ఖచ్చితంగా నీవు తప్పుటోడివంటే నీవు తప్పుటోడివని రికార్డెడ్‌గా ప్రకటించుకున్నారు (పుస్తకాలు సి.డిలద్వారా)
పి.డి. సుందరావుగారు రంజిత్ ఓఫిర్‌గారిని గూర్చి ఓఫిర్‌కాడతడు, 'ఓ ఫియర్'. అతడు చేస్తున్న బోధ సాతానుబోధేననగా, రంజిత్ ఓఫిర్‌గారు, పి.డి. సుందర్రావు కాడతడు, బందర్రావు, జయశాలికాదతడు భయశాలి అనేశారు.
ఈనాడున్న మానవులలో బైబిలు తెలిసిన వాణ్ణినేనొక్కణ్ణేనని, బైబిలు స్థాపించడానికై క్రీస్తుతరవాత, తానే దేవుని తరపున వచ్చానని, క్రీస్తు తరువాత, తానే దేవుని తరపున వచ్చానని, క్రీస్తు తనకు అన్నలాటివాడని, పి.డి. సుందర్రావుగారు ప్రకటించుకున్నాడు.
బైబిలు సత్యాన్న అన్వేషకులకు అందించమని, ఆసర్వశక్తుడు నన్నాదేశించాడు. ఆయన అదేశానికి లోబడి పరిశుద్ధాత్మవశుడనై నేను మాట్లాడుతున్నాను. 'ఈ యుగానికి ఏసునోరును నేనే' అని ఓఫిర్ గారు ప్రకటించుకున్నారు. అంతటితో ఆగక, ఓఫిర్‌గారైతే సుందర్రావుగారినీ తనను ప్రస్తావిస్తూ ఇరువురమూ దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళమన్నమాట నిజమయ్యే అవకాశంలేదు. అనేక విషయాలలో అతడు చెపుతున్నది తప్పని నేనంటున్నానుకనుక. ఎవరో ఒకళ్ళమే దేవుని వాక్కు చెపుతున్నవాళ్ళం కాగలం. ఇక రెండోవారు సాతాను ప్రతినిధి మాత్రమే అవుతారు. అంటూ ఒక హేతుబద్ద వివరణ ఇచ్చారు. అందులోనూ తానే దేవుని ప్రతినిధి ననడానికి రుజువంటూ, వెయ్యేండ్ల పాలన వచ్చిందంటున్నారు పి.డి.సుందర్రావుగారు. అది రానున్నది ఇప్పటికి రాలేదు, అనినేనంటున్నాను. ఈ రెంటిలో ఏది బైబిలు ప్రకారం సరైనదో తేల్చుకుందాం రమ్మంటే చర్చకు రావడం లేదు సుందర్రావుగారు. వాస్తవానికాయన భయశాలేగాని జయశాలికానేకాదు. ఆయనను విషయం తేల్చుకోడానికి వేదికు తీసుకురాగలిగిన వాళ్ళుంటే తీసుకురండి. ఆ పని చేసినవాళ్ళకు లక్షరూపాయల పారితోషికం కూడా ఇవ్వగలను. అనీ ప్రకటించారు ఓఫిర్‌గారు.
ఇక్కడ మా వైఖరి అంటే మండలి వైఖరి ఏమిటంటే, అయ్యలారా! ఇంతకూ బైబిల్ ఏమి చెపుతోంది? అన్నదగ్గరే ఇంతలేసి విభేదాలు, వైరుద్యాలు కూడా చోటు చేసుకుని ఉన్నాయికదా! అదేరకంగానూ సమర్థనీయం కాదన్న కనీస ఇంగితాన్నైనా కనపరచి బైబిల్ వారమంటున్న వారంతా కూర్చుని, కనీసం బైబిలు ఏమి చెపుతోంది అన్న దగ్గరైనా ఏకాభిప్రాయం కుదుర్చుకునే పనికి పూనుకోక పోగా, నీవు సాతాను ప్రతినిధివంటే, నీవు సాతాను ప్రతినిధివంటూ ప్రకటనలు గుప్పించుకుంటూ ప్రచారం చేస్తుండడం జరగుతోందికదా? ఇదమిద్దం గా మీరందరి వైపు నుండి, బైబిలు ఏయే విషయాలలో ఏమేమి చెపుతోందన్న వరకైనా ఆధారాలతోసహా ఖచ్చితమైన ప్రకటనే వెలువడకపోతే, ఇక బైబిలు చెపుతోంది సరైందా?కాదా? అన్న ప్రశ్నకే ఆస్కారం లేదుకదా! దీనినే చర్చావేదిక నియమనిబంధనలలోని వాద నియమాల క్రింద 'ప్రతిపాదనే నిర్ధిష్టరూపంలో లేనప్పుడు వాదనే అరంభంకాదన్న' సూత్రం చెపుతోంది.
అయితే ఇక్కడ వారిరువురి నుండీ ఇతరులకు ఒక ప్రశ్న రావచ్చు. అయ్యా, ఇతరుల విషయం నాకనవసరం. నా వరకు నేను బైబిలుకు ప్రతినిధిని, బైబిలు పక్షాన ప్రతిపాదించి, వాదించి, స్థాపించడానికి వచ్చినవాణ్ణి. నాతో మీరేమి మాట్లాడదలచుకుందో అది మాట్లాడండి. అంతేగాని బైబిలు పట్టుకున్న మరో వ్యక్తి చెపుతున్నదానికీ, నేను చెపుతున్న దానికి తేడా ఉంది కనుక, ముందు మీరది తేల్చుకోండి అనడం సబబుకాదు. క్రైస్తవులు పరస్పరం విభేదించుకుంటున్నారు కనుక అందులో ఎవరిదీ సరికాదు అనడం అహేతుకం. అందులో ఎవరితో ఒకరిది బైబిలుకు సరైన వివరణే అయ్యుండి. మిగిలిన వారిది సరికానిది అయ్యే అవకాశం ఉంది కదా! అని అనవచ్చు.
నాకు తెలిసినవిచారణ నియమాల ప్రకారం అది సరైన మాటే, కనుక నా వరకు నాకు, 'బైబిలు సత్యమనడానికి, ధర్మమనడానికీ తగిన ప్రకటనలే చేసింది'. అనంటున్న ఎవరితో చర్యకు కూర్చోవడానికైనా ఎలాటి అభ్యంతరమూ లేదు. బైబిలు పక్షీయులందరికీ ఇది నా బహిరంగ అంగీకార ప్రకటనే అయినా ఇది ప్రధానంగా ముందుగా పి.డి. సుందర్రావు గారికీ అటు తరువాత రంజిత్ ఓఫిర్‌గారికీ వర్తిస్తుంది. అందులో సవాళ్ళ గొడవేలేని, ఒకింత హేతుబుద్ధితో కూడి, సభ్యతా సంస్కారాల భాష కలిగియున్న ఓఫిర్ గారితో సవాళ్ళ దృష్టి నుండి గాక సత్యస్థాపనోద్ధతితో చర్చిండానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే సత్యాసత్యవివేచన అన్నది సామాజికావసరం. ఈ విషయం స్పష్టంగా గమనించగలిగితే ఇహ అప్పుడు అక్కడ వ్యక్తులు అహాన్ని చొరబెట్టి, అవసరపు పట్టుదలలకు పోయి తన పక్షాన్ని నెగ్గించుకోవడమన్న వత్తిడి ఉండదు. తాను అనుసరించడానికీ తక్కిన వాళ్ళను అనుసరింపజేయడానికీ పరిశీలన కెత్తుకున్న అంశాలు తగినవా? కావా? అన్న దృష్టి కలిగి ఉంటుందది. ఈ విషయంలోరంజిత్ ఓఫిర్‌గారు తాను నిరంతర సత్యాన్వేషిననీ, సత్యసంస్థాపనాభిలాషిననీ స్పష్టంగా ప్రకటించుకుని ఉన్నారు గనుక, నేను సత్యాన్వేషిననే, సత్యస్థాపనోద్దతి కలవాడిననే, నాగురించే తలంచుతున్నాను గనుక, మా మధ్య బైబిలును పరిశీలించడానికి ప్రత్యేకమైన అడ్డంకిలేవీలేవనే, ఉండనఖ్ఖరలేదనే నేను తలంచుతున్నాను. ఈ సందర్బంలో ఎవరమూ కాదనడానికి వీల్లేని ''ఉనికిలో ఉన్న సిద్ధాంతాలన్నింటినీ నిర్ధాక్షణ్యంగా విమర్శించు'' అన్న మార్క్సు అభిప్రాయాన్ని గుర్తు చేస్తున్నాను. అందరం ఆదరించదగిన, అనుసరించదగిన ముఖ్యంగా సత్యస్థాపనాభిలాషులు అనుసరించి తీరాల్సిన పోకడ అది.
వివేకపథం 185, 186 సంచికల ద్వారా నేను ప్రకటించి, పి.డి. సుందర్రావు గారిని చర్చకు పిలిచిన దానికి జవాబుగా, పి.డి. సుందర్రావు గారి నుండి ఎట్టి సమాధానమూ నాకందకపోవడంతో (ఏఫ్రియల్ నాటికి) ఆ రెండు సంచికలను రిజిష్టర్ పోస్టు ద్వారా మళ్ళా వారికి పంపాను. దాంతోపాటు, నన్నాపనికి పూనుకొమ్మని పదే పదే వత్తిడి చేసి, కదిలించిన జగద్గురు గారికీ ఫోను చేసి, ఎక్కడండీ మీ సుందర్రావుగారు, సమాధానం చెప్పలేదేమిటి? నన్ను వత్తిడి చేసిన మీకు, ఆయనను చర్చకు తీసుకురావాల్సిన బాధ్యతలేదా? అనడిగాను.
జగద్గురు గారు రెండు మూడు సమాధానాలు చెప్పారు.
1. నేను పి.డి. సుందర్రావు గారికి లేఖ వ్రాశాను. ఆయన నా ఉత్తరానికి తిరిగు సమాధానం వ్రాయలేదు. వివేక పథం వారి బహిరంగ ప్రకటనకు సిద్దం కమ్మని మళ్ళీ లేఖ వ్రాస్తాను.
2. పి.డి. సుందర్రావు గారికి మీ స్థాయి చాలలేదేమో? వెంకటాద్రి గారిని పిలిపించితే చర్చకు వస్తారు.
3. మీరు చేసిన ప్రకటన క్రింద సంతకం లేదుకదా! మీరే వ్రాసినట్లు ఆధారంలేకుండా ఆయనెలా సమాధాన మిస్తారు? కనుక మీ సంతకంతో కూడిన లేఖ వ్రాయండి.
ఆనాటి ఫోనులో ఆయనన్న పై మాటలకు అప్పుడే నేనిలా చెప్పాను.
1) అయ్యా జగద్గురు గారూ! సుందర్రావుగారిని ఎదుర్కోండి అని నన్ను కదిలించేముందే, నేను సిద్దపడితే ఆయన గారిని పట్టుకురావలసిన బాధ్యత మీ పైనే ఉందన్నది గమనించుకుని ఉండాల్సిందిమీరు. ఇప్పటికైనా, ఆయనగార్ని బ్రతిమాలుకుంటారో, భయపెట్టుకుంటారో, ఏమి చేసుకుంటారో మీ ఇష్టం, సుందర్రావుగారిని చర్చావేదికపైకి తీసుకురావలసిన పని మాత్రం మీదే.
ఇకస్థాయి చాలలేదేమోనన్న మాటకు (ఎ) ఆ విషయమూ ముందే ఆయనతో సంప్రదించి తెలుసుకున్నాకనే నన్ను కదిలించి ఉండాల్సింది. (బి) పి.డి.సుందర్రావుగారే ప్రకటించినట్లు, లేదా ఆయన కుమారులో, అనుచరులో ప్రకటించినట్లు, నా స్థాయికి తగిన వాళ్ళనే పంపండనీ నేను నా ప్రకటనలో తెలిపాను కదా! అయితే నాతో చర్చలో పాల్గొనడానికి వారెంచుకున్న వ్యక్తి ఓడిపోతే. తామే ఓడినట్లు సుందర్రావుగారు అంగీకరించి ఒప్పందాన్ని అమలు పరచాల్సి ఉంటుందనీ అక్కడే వ్రాశాను. కనుక స్థాయి గొడవ లేవనెత్తడం అనవసరం. సుందర్రావుగారలా అనరనే అనుకుంటాను. ఒక వేళ అలానే గనక అనదలచుకుంటే మాత్రం అది పారిపోతూ నిలు నిలు అనడం చందమే అవుతుంది. (సి) ఇక వెంకటాద్రిగారిని పోటీకి పిలుచుకురమ్మని మీరు నాకు సూచిచండం, ఇలాంటి విషయాలలో మీకు అనుభవంగానీ, సామర్థ్యం గాని లేవన్న నిజాన్నీ, విధం తెలియని వారే మీరన్న నిజాన్ని పట్టిస్తున్నాయి. కుస్తీకి నేను సిద్దమని చెపుతుంటే, నన్నెళ్ళి మరో వస్తాదును పిలుచుకురమ్మని అనడమంత తప్పుపని, అడ్డగోలుపని, కప్పదాటు వ్యవహారం మరోటుండదు. (డి) స్థాయికి కొలతేమిటి? అయినా నా ప్రకటనలో, మూడంశాలు ఒకింత స్థాయిని చూపేవీ కలిసి ఉన్నాయి చూడండి.
(1) కోటి రూపాయలు గురుదక్షణగా ఇస్తాను. ఇంకేమన్నా అనుకుందామన్నా మాట్లాడుకుందాం.
(2) నా జీవితాంతం ఆయన పంథాలో నడుస్తూ, మా సంస్ధనూ ఆయన బోధనలకు కేంద్రం చేస్తాను.
(3) ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, అనవసరపు మాటలాడినా ఎడమకాలి చెప్పుతో కొట్టించుకోవాలి. చర్చకు సిద్దమయ్యాక మధ్యలో ఎవరాగినా అతడు ఓడినట్లే పరిగణించి, ఒప్పందాన్ని అమలు చేయాలి.
ఇవి నా స్థాయిని గురించి కొంతవరకైనా అంచనావేయడానికి పనికి వచ్చేవేకదా!
స్థాయిని గురించి మాట్లాడుకునే ముందు లెక్కలోకి తీసుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
(1) ఏ విషయానికి సంబంధించిన స్థాయి గురించో నిర్ణయించుకోవాలి.
(2) ఆ విషయంలో స్థాయిలలోని తరతమ భేదాలను గుర్తించడానికి ఉన్న సాధారణ స్థాయి కొలత పద్ధతేమిటి?
(3) పోటీకి సిద్దమన్న వారు, పోటీకి అర్హులో కాదో నిర్ణయించాల్సింది, పోటీపడేవారు కాదు. అవసరమైతే అర్హతానర్హతల పరిశీలనా కమిటీ ఒకటి ఉండి, ఆ సందర్భానికి అవసరమైన అంశాలపై ఇరువురినీ వారు పరీక్షించాలి. అలా కాకుంటే ఇలాగే వుంటుంది మరి. ఉదాహరణకు వెంకటాద్రిగారైతే నేను పోటీకి సిద్దమని పి.డి. సుందర్రావు గారనగా, సుందర్రావుకాస్థాయి లేదు. అతనితో వాదానికి మా కుర్రవాణ్ణొకనిని పంపుతానని వెంకటాద్రిగారంటున్నారు. ఏమి చేయాలప్పుడు? అదే పద్దతిలో పి.డి. సుందర్రావు గారు, వాడు నాకు చాలడు, వీడు నాకు చాలడు అంటువస్తున్నారు గదా? ఏమి చేయాలిప్పుడు?
(4) ఇంతకూ మీ పి.డి. సుందరావుగారికి గాని, మీకు గాని నా గురించి ఏమి తెలుసు? నేను స్థాయి కలిగినవాణ్ణిని గానీ, లేనివాణ్ణినిగాని నిర్ణయించడానికి అవసరమైన అంశాల వరకైనా నా గురించి మీకు తెలిసి ఉండాలికదా? ఒక వ్యక్తి జ్ఞాన సామర్థ్యానికి గీటురాయి లోకంలో అతడెంత ప్రసిద్ది పొందాడన్నదేనా? పేరు ప్రఖ్యాతలతో పనిలేని సమర్ధులుండే అవకాశం లేదా లోకంలో ? లోకాన్ని చూసిన వారెవరైనా అలాంటి అవకాశం తగినంతగానూ ఉందనే చెపుతారు.
ఇక జగద్గురు గారు లేవనెత్తిన మరో సందేహం, నేను నా ప్రకటన క్రింద సంతకం చేయలేదు గనుక, అది మీరు చేసిన ప్రకటనేనన్న నమ్మకమేమిటి? అన్నది.
బాగుందండీ జగద్గురుగారూ! వివేకపథం పత్రిక మాది, సంపాదకుణ్ణినేను. 185వ సంచికలో 28వ పేజీలో నిర్థిష్టంగా నా ప్రకటన ముద్రించి, క్రింద సత్యాన్వేషణలో మీ సురేంద్ర అనీ వ్రాశాను. ఇవేమీ ఆ ప్రకటన నాదేననడానికి మీకు సరిపోలేదన్న మాట. పి.డి. సుందర్రావుగారూ మీలానే విధం తెలియని వారైయున్నా, మీ సంతకంలో కూడిన లేఖ నాకు పంపండి ముందు అని కబురు చేయొచ్చు గదా. అయినా మీ మా టెందుకు కాదనాలి, ఈ వంకకు ఆస్కారమెందుకివ్వాలి అనుకుని ఈ మూడో సంచిక (187)తో బాటు 185లోని నా ప్రకటన క్రింద నా సంతకమూ పెట్టి పంపుతున్నాను. ఆనకలు మీకూ అందేలా చూస్తాను. ఇకనైనా ఆయనగారు చర్చకు సిద్దం కావడమో, మీరైనా పూనుకుని ఆయనను చర్చకు సిద్దపరచడమో జరుగుతుందని ఆశిస్తాను.
పి.డి. సుందర్రావుగారే ఒక ప్రసంగంలో 'అనిల్' అన్నాయనను సవాలు చేస్తూ, సభాముఖంగానే అనిల్ అనుయాములనుద్దేశించి మీరు గాని ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే, అనిల్‌ను నాతో చర్చించడానికి పట్టుకురండని అసభ్యంగా, కుసంస్కారిలాగా మాట్లాడాడు. అంత అవసరమే మొచ్చిందో తెలియదుగాని, అలాంటి మాటలు, తిరిగొచ్చి తనకేతగులు తాయేమోనన్న ఊహకూడా ఆయనకు లేనట్లుంది. తమ స్థాయి గురించి తెగ ప్రగల్భించేవారికి ఇలాంటి మాటలు ఏరకంగానూ శోభనీయవు. అర్థమవుతోందా నేనంటున్నదేమిటో!? పి.డి. సుందర్రావుగారు ఇతరుల విషయంలో అనుసరించిన విధివిధానాలే తనకూ వర్తిసాయని అంగీకరించడం కనీస న్యాయం. అలా కాకుండా తనకో న్యాయం ఎదుటివాళ్ళకో న్యాయం అన్నట్లైతే తప్పుడు పోకడ అవుతుంది. కనక ఆయన విధిగా నాతో బైబిలు పై చర్చకు సిద్దంకావాలి. లేదా ఓడినట్లు వప్పుకోవాలి. ఈ రెంటికీ ఆయన గాని సిద్ధం కాకుంటే ఆయనే అన్నట్లు ఆయన అనుయాయులు ఒక అమ్మ అబ్బకు.... వారైతే, ఆయన్ను నాతో చర్చకు సిద్దం చేసి తీసుకురావాలి. ఇదంతా ఆయన పోతున్నపోకడే. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు (రాజు, ఓఫిర్ లాంటివాళ్ళు) 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా' అన్న చందాన పి.డి.సుందర్రావుకు సవాలంటూ చర్చకుపిలిచి, సభనూ ఏర్పాటు చేసి, సుందర్రావుగారు రాలేదు కనుక ఆయన ఓడిపోయినట్లేనని ప్రకటించారు కూడాను. ఓఫిర్ గారైతే, ఒకింత సభ్యతా సంస్కారాలున్నవారు గనక అబ్బా అమ్మకు పుట్టారా లాంటి మాటలనక, సుందర్రావుగారిని చర్చకు పట్టుకొచ్చిన వాళ్లకో లక్షరూపాయలు బహుమానం ఇస్తాననీ ప్రకటించారు. విషయం అర్థం కావట్లేదా?
'తానెవరితోనూ వాదించనే లేదంటున్నారా పిచ్చి వెధవలు' అంటూ సుందర్రావుగారే తన గురించి లోకులేమనుకుంటున్నారో చెప్పుకునికూడా!? తొడగొట్టడాలు, మీసాలు మెలెట్టడాలు, వాడెంత గొట్టంగాడు, వీడెంత బుడితడంత అనడాలు, వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మంలు చీమలు, దోమలు అనడాలు వింటుంటే మీకేమీ అనిపించడంలేదా? సిగ్గెగ్లు లేనివాళ్ళకిలాటి సందర్భాలలో చీమకుట్టినట్లైనా ఉండకపోవచ్చునేమోగాని, అవివున్న రోషగాండ్లకు మాత్రం తలకొట్టేసినట్లే ఉంటుంది. ఉత్తర కుమార ప్రగల్బాలంటాం ఇలాంటి వాటినని లోగడే చెప్పివున్నాను. మనస్సాక్షి ఉంటే ఈ మాటలు నిజమో కాదో ఆలోచించండి.
సంభావితస్య చాకీర్తిర్మరణాద తిరిచ్యతే. సమ్మానింపబడ్డవాళ్ళకు అవమానం చావుకంటే బాధాకరం ఇది నిజమేకదా!
సంతకంపెట్టావా? నేరుగాపిలిచావా? రుజువుకోసం రిజిష్టర్‌పోస్టు చేశావా? లాంటి మాటలన్నీ పసలేనిజారుడు మాటలు మాత్రమే. గత సంచికలలో నేనేమని ప్రకటించాను? పి.డి. సుందరావుగారు గానీ, మరెవరైనాగాని బైబిలు (ఖురాన్, వేదాలు) దైవగ్రంధం అందులో అన్నీ ఉన్నాయి, ఉన్నవన్న సరైనవిగనే ఉన్నాయ్ అనేట్లయితే, అట్టి వారితో చర్చకు మండలి - నేనూ - సిద్దం, వారూ సిద్దమంటే కలసి కూర్చుని ఒప్పందం వ్రాసుకుని రిజిష్టర్ చేసుకుందాం. అని కదా? అదీ అర్ధంకాలేదా? సరిపోలేదా నా సంసిద్దతను అంగీకరించడానికి?
పలుమాటలొద్దు, పొల్లుమాటలొద్దు, పెచ్చుమాటలూవద్దు. నా ఈ సంసిద్దతతో కూడిన ప్రకటన సుందరావుగారికి ముందుగా వర్తిస్తుంది. పిదప రంజిత్ ఓఫిర్ గారికి, బైబిలు, ఖురాన్, వేదములన్నవి దైవగ్రంథాలు, సర్వజ్ఞకల్పాలు, సర్వకాలాలకూ వర్తించేటివి అనే పక్షాలవాళ్ళందరకూ వర్తిస్తుంది. నాదృష్టంతా ముఖ్యంగా వ్యక్తులను దృష్టిలో పెట్టుకున్నదికాక, విషయ ప్రధానమైనది మాత్రమే అన్నది గమనించండి. కాదు కూడదంటే వ్యక్తినీ పట్టి చూడాల్సిందేనని పట్టుబడితే అందుకూ నేను సిద్దమే. అయితే అలాటి సందర్భాలకు, అందుకు తగిన నిబంధనావళి రూపొందించుకోవలసి ఉంటుంది.
శ్రీ పి.డి.సుందర్రావు గారికి
సత్యాన్వేషణ మండలి అధ్యకక్షులు
ఛాలెంజ్ చేస్తూ పంపిన బహిరంగ లేఖ ప్రతి
తేది : 10-05-2012
శ్రీ పి.డి.సుందర్రావు గారికి
డో.నెం.49-35-26,
అక్కయ్యపాలెం,
విశాఖపట్నం - 530 016.
బైబిలును దైవగ్రంథంగా నిలబెట్టాలనుకుంటూ, జనుల్ని అటువైపు మరల్చాలను కుంటున్న పి.డి.సుందర్రావుగారికి అయ్యా,
దేవుడున్నాడని, అదిన్ని బైబిలులో చెప్పబడ్డదేవుడే నిజమైన దేవుడని, బైబిలు దైవవాక్యమని, అందులో విశ్వానికి చెందిన సమస్థజ్ఞానం ఉందని, ఆ విషయాలన్నీ మీకు తెలుసుననీ, ఆ విషయాలు తెలిసినవారు మీరొక్కరేనని, మీ ప్రసంగాల ద్వారా ప్రకటించి ఉన్నారు. అలా మీరన్నవాటినన్నింటిని నిజాలేనని నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. బైబిలు సత్యవేదము, బైబిలులో చెప్పబడ్డవన్ని సరైనవి, స్వీకరించదగినవి అని గనక మీరు నిరూపిస్తే నేను మీనుండి క్రైస్తవం స్వీకరించడానికి అటుపైన జీవితాంతం మీఅనుచరునిగా మీమార్గంలో నడవడానికీ, నాలో అంతటి మార్పుకు కారణమైనందుకు మీకు ఒక కోటిరూపాయలు కృతజ్ఞతా సూచకంగా చెల్లించడానికి నేను సిద్ధము. నాలానే మీరున్ను, మీరన్నవి నిరూపించలేక పోయినట్లైతే మీరు మీక్రైస్తవ మార్గాన్ని విడచి నావెంట సత్యాన్వేషణ మార్గంలో నడవాలి. ఆ జీవితం సత్యాన్వేషణ మండలి భావజాలాన్ని ప్రచారం చేస్తు జీవించాలి. మిమ్ములనలా మా అన్వేషణా పథంవైపుకు మరల్చినందుకు ప్రతిఫలంగా మీరునాకు ఒక కోటి రూపాయలు చెల్లించాలి. ఇందుకు మీరు సిద్ధమైతే ఈ విషయాలను, విచారణకు అవసరమైన ఇతర విషయాలను కలుపుకుని ఒక ఒప్పందపత్రం వ్రాసుకుని రిజిష్టరు చేద్దాము. నాతో చర్చలో పాల్గొనడానికి ఎవరు సిద్దపడతారన్నది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నావైపు నుండి నేను మాత్రమే పాల్గొంటాను. నావైపు నుండి ఈ విషయంపై మనం అనంతరం కార్యక్రమాలను ఆరంభించుకోడానికి ఈ క్షణం నుండే సిద్ధంగా ఉన్నాను. ఇది నేను పూర్తి స్పృహతోనూ, ప్రశాంత చిత్తంతోనూ వ్రాతమూలకంగా తెలుపుతున్న సమ్మతి.
ఇట్లు
పి. సురేంద్రబాబు, అధ్యకక్షులు
సత్యాన్వేషణమండలి మరియు
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కమిటి
...................................................................................................................................................................
ముఖ్యగమనిక :
ఒక గ్రంథస్థ భావజాలాన్ని శాస్త్రీయవిచారణకు లోనుచేయడానికి, మంచివని తేలిన విషయాలను స్వీకరించడానికి, అలాంటివి కానివాటిని విడవడానికీ, ఒక నిర్ధారణకు రాని, రాలేనివాటిని అనిర్ధారితాల జాబితాలో ఉంచడానికీ ఇంత రభస, రచ్చ, రొచ్చుభాష అవసరమా?
నా లెక్క ప్రకారం సత్యాన్వేషణ తత్పరతగానీ, నిజాయితీతో కూడిన విధం తెలిసిన తనంగానీ ఉంటే, ఎటువంటి పొరపొచ్చాలు, వైషమ్యాలు లేకుండగనే సత్యాసత్యాల కొరకై మిత్రులంగానే కృషి సలుపవచ్చు. నా అభీష్టం మాత్రం సత్యావిష్కరణ, ధర్మాచరణలన్నవే. ఉంటాను
సెలవ్.-సురేంద్ర
..............................................................................................................................................................
No comments:
Post a Comment