Monday, December 1, 2003

చాపకింద నీరులా పాకిపోతున్న కల్కి వ్యాపారం



అజ్ఞానులూ, అంధ విశ్వాసాలలో ముందున్నవారూ అయిన నేతలు కొనసాగు తున్నంతకాలం దేవుళ్ళపేరా, దయ్యాల పేరా, అవతారాలపేరా జరుగుతుండే మోసాలకు అంతుండదు. ఆస్తిక ముసుగులో ఈ దేశంలో జరుగుతున్నంత దగుల్బాజీ వ్యవహారం ప్రపంచంలోనే వేరెక్కడా కనపడదు. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' అంటూనో, ''ఏ యధామాం ప్రపద్యంతే తాంస్థ ధైవభజామ్యహం, మమవర్త్మాను వర్తంతే మనుష్యాపార్ధ సర్వశః'' అంటూనో; 'ఏకంసత్‌ విప్రాబహుదావదంతి' అంటూనో, 'ఆరాధనానాం అనేకతా' అంటూనో, 'యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమయి పశ్యతి' అంటూనో అంశావతారాలు పూర్ణావతారాలు అంటూనో మందినెత్తిన పెట్టిన ఆస్థికభావనలు-వారే ఉద్దేశంలో పెట్టారోగాని-ఈనాడు వేషధారులు విచ్చలవిడిగా చలాయించుకుపోడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఏ దొంగతొత్తుకొడుకు ఏ దొంగ వేషం వేసినా అతనికి సరిపడే ఒక ఉపదేశం దొరుకుతుంది ఆస్తిక సాహిత్యంలో. దున్నపోతు ఆకారంతోనో, 'సుమో'ల రూపంలోనో దర్శనమిస్తున్నారు సన్యాసులు ఈ రోజుల్లో. సకల విలాసాలూ అనుభవిస్తూనే, వైరాగ్యాన్ని, పరమ స్వార్థులైయ్యుండీ త్యాగాన్ని బోధిస్తుండే వీరిని ఏమీ చేయలేని స్థితి - ఒక అధ్వాన్న స్థితి - రాజ్యాంగ నిర్మాణ లోపంవల్ల నిరాటంకంగా సాగిపోతోంది.

ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ప్రతివారికీ మత స్వేచ్ఛ వుంది, భావ ప్రకటనా స్వేచ్ఛా వుంది అన్న వాటిని అడ్డుపెట్టుకుని దొంగలు అమాయక జనాన్ని దండుకోవడంలో స్వైర విహారం చేస్తున్నారు. ప్రజలలో ప్రక్కవాడికేమైతేనేమిలే మనదాకా రాలేదుకదా అనే ఉదాసీన వైఖరి, తాత్సారవైఖరి బలంగా గూడుకట్టుకుని వుంది. వారిని చైతన్యపరచి పౌరబాధ్యతల నెరుకపరుద్దామంటే వారిలో పేరుకుపోయిన తంద్రత తట్టి లేపితే లేచే స్థితిలో వుండనీయడం లేదు. మంటపెట్టనైనా పెట్టాలి, ముల్లుగర్రతో పొడవనైనా పొడవాలి. అదుగో అంత చేస్తేనేగాని అతనిలో కదలిక రావడంలేదు. పోనీలే లేచాడుగదా అనుకుని మరోవైపు తిరిగేలోపే మళ్ళా మగతలోకి జారుకుంటున్నాడు.
మరోరకం బాధ్యతారాహితులైతే వారు చూస్తూ ఊరుకుందిగాకుండా అదేమిటన ్నవారిని నీకెందుకొచ్చిందోయ్‌! నీకేమైనా అన్యాయం చేశాడు అతడు. ఎవరి బ్రతుకు వారిది. ఎవరి విశ్వాసాలు వారివి అంటూ - అదేదో పెద్దరికం అనుకుంటూ ఆ దొంగ గుంపును వెనకేసుకొస్తుంటారు. అస్సలు దొంగలకంటే ముందు ఈ మందను కాటికీడ్చాలి. భారతీయ తాత్వికభాగంలోనే, అన్ని పాపాలకంటే అనుమోదిత పాపం (తప్పు జరుగుతన్నా చూస్తూ ఊరుకోవడం) పెద్దది. చెడ్డది అని చెప్పబడింది. మాటకు మాట కలిపితే వంచకుల ఆట కట్టించడం ఇట్టే అయిపోయేపనే, కానీ ఆ మాట మాత్రపు వత్తాసు - అదీ మంచికోసం - పలకడానికి తెగ యిదైపోతుంటారు జనం. నిజానికిది ధర్మపక్షానికి పట్టిన దురవస్థ. భారతంలోనైతే సమర్ధతకలిగీ ఎవడు అన్యాయాన్ని సహిస్తాడో వాడు వంశనాశనమైపోతాడని చెప్పబడింది.
వైశేషిక దర్శనంలో ధర్మపక్షానికి -నీకు-అధర్మం ఎదురైతే ఏమిచేయాలి? అని ప్రశ్నించి యుద్ధం చేయమంటాడు. అవతలివాడు బలవంతుడైతేనో అని సందేహం రాగా, అయినాసరే ప్రాణమున్నంతవరకు పోరాడు అంటాడు. మనమే బలవంతులమైతేనో అని ఆ పక్షాన్ని నిర్మూలించమంటాడు. సమబలం ఉంటేనో అని ప్రశ్నించి పోరాడుతూనే వుండు అనంటాడు. అది ధర్మ దృష్టి కలిగి వుండడమంటే ధార్మికునిగా జీవించడమంటే. అంతేగాని మనకెందుకులే అనో, మనదాకా రాలేదుకదా అనుకునో, ఉదాసీనుడవడం అధర్మపక్షానికి - మోసానికి - సహకరిచండమే అవుతుంది.
ఆమధ్య కుప్పం కల్కి ఒకడు బయలుదేరి నేనే దేవుణ్ణన్నాడు. వాణ్ణి ఉత్సవ విగ్రహం చేసి శంకర్‌ - శంకర భగవత్పాద - ఆ కథంతా నడిపాడు. దానిపై వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక పేరున మేము 6, 7 ఆస్తిక మరియు నాస్తిక సంఘాలూ కలసి వారి మోసాన్ని బట్టబయలు చేశాం. ఆ సందర్భంలో రాష్ట్రం మొత్తం పర్యటించి 24 జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజల్ని మేల్కొల్పాం. అదే సమయంలో మద్రాసులోనూ ఈ వంచకుల గుట్టు రట్టు చేస్తూ పెద్ద కార్యక్రమమే జరిగింది. విషయం కోర్టుదాకా పోయింది. కుక్కిన పేనులా కోర్టుకు సంజాయిషీ యిచ్చుకున్నాడీ కల్కి భగవానుడు. ఆస్తిక సాంప్రదాయపు రీతినెరిగిన మేధావులెందరో ఆస్తిక శాస్త్రాల ప్రకారం కూడా వీడు కల్పి అవతారం కాదు అని బహిరంగంగా ప్రకటించారు. మొదట్లో ఒక్కడే అవతారిగా మొదలెట్టి తర్వాత నెమ్మదిగా పెళ్ళాన్ని అమ్మవార్ని చేశారీ మంద. పిచ్చిమంద ఎవరెటు తోలితే అటు పడిపోడాని కలవాటు పడి వుండడంతోనూ, ఉన్న దేవుళ్ళు తమ కోర్కెలు తీర్చకపోవడంతోనూ ఇక్కడైనా పనవుద్దేమోననుకుంటూ వచ్చిన కొత్త వేషగాళ్ళెవరి వెంట పడిపోడానికైనా ఉరుకులెడు తున్నారు. అటు వారికీ - ఇటు వీరికీ సంథానకర్తలుగా తయారైన కొందరు దళారీలు పరమభక్తులల్లే నటిస్తూ కేంద్రాలు పెట్టి పలు ప్రలోభాలలో మందినాకట్టు కుంటున్నారు. జనం బుట్టలో పడడానికీ వీలుగా పరమ శాంతమూర్తులల్లే, పరహితైషులల్లే, నిస్వార్థులల్లే ప్రవర్తిస్తూ క్రమక్రమంగా ఆయా ప్రాంతాల వేరూనుకుంటూ ఒకటి తర్వాత ఒకటిగా డబ్బు దండుకునే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇట్టి వంచకులను ఎక్కడికక్కడ అడ్డగించాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.
ఈమధ్యకాలంలో కుంచనపల్లి, గుంటూరుజిల్లా తాడేపల్లి మండల ప్రాంతంలో ఒక హోమియో వైద్యుడు, ఆయన భార్య ఈ నాటకాన్ని ఆరంభించినట్లు తెలిసింది. ఫొటోలోంచి కుంకుమలు వస్తున్నట్లు, డబ్బులు ఎంతెంత పెడితే అన్నన్ని పాపాలు పోతాయని ప్రచారం చేశారట. 12 రోజుల్లో ముక్తి వస్తుందంటూ ముక్తి యజ్ఞంలో పాల్గొనండని ప్రక్క గ్రామాలలోనూ ప్రచారం చేస్తున్నారట.
అయితే అతగాడు పిచ్చిమాలోకమైనా అయ్యుండాలి. లేదా కమీషన్‌ ఏజంటైనా అయ్యుండాలి. ఎక్కువలో ఎక్కువ మోసగాడయ్యేందుకే వీలుంది. కాదు మేము నిజాయితీ పరులమేనని గనుక వారనేట్లయితే ఆ ప్రాంతపు పోలీసు అధికారులు, గ్రామాధికారుల సమక్షంలో అదంతా హంబక్‌ అని మేము రుజువు చేస్తాము. మోసమని తేలాక ఇక అక్కడ సిగ్గుంటే ఎలా బ్రతగ్గలడో అతడే ఆలోచించుకోవాలి. ఈ నెలలోనే ఈ కార్యక్రమం జరపబోతున్నాము. ఎవరైనా మా ఈ నిజనిర్ధారణకు ఆటంకం కలిగించ బూనుకుంటే ఆ తర్వాత వారిపై జరిపే న్యాయపరమైన చర్యలకు వారే బాధ్యత వహించాల్సి వుంటుంది.
ధర్మపక్షాన నిలబడగల సత్తా, నిలబడాలన్న హృదయమూ ఉన్నవాళ్ళు మాతో సహకరించండి. మా పక్షం సరైందికాదనీ, అక్కడ మహిమలున్నాయనీ తేలితే మీరు మమ్మల్ని ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా వున్నాము. అనవసరపు ఉద్రేకాలకు పోకుండా పరిశీలన పూర్తయ్యే వరకు ఓపికపట్టండి. పరిశీలన తరువాత ఫలితాలననుసరించి మాకో, వారికో తగిన గుణపాఠం చెప్పండి. ఉంటాను. సెలవ్‌.

సత్యాన్వేషణలో,
మీ సురేంద్ర.

No comments:

Post a Comment