Friday, July 15, 2016

త్రైమాసిక సమావేశాల విశేషాలు

త్రైమాసిక సమావేశాల విశేషాలు


ముందనుకున్న ప్రకారం ఏప్రిల్‌ 18,19,20 తేదీలలో మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు జరిగాయి. సుమారు 20 మంది వివిధ ప్రాంతాల నుండి హాజరైనారు. ముందుగా పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ పలువిషయాలపై వివరణిస్తూ చర్చను సాగించారు. ఆ చర్చల సారాంశం క్లుప్తంగా...

నీకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేయాలన్నా, ఇతరులకు తెలిసినవి నీవు తెలుసుకోవాలన్నా భాషద్వారా తప్ప వేరొకమార్గము లేదు. అవునా కాదా ? చర్చించండి. చర్చానంతరం తేలిందేమిటంటే విషయం గ్రహించాలన్నా, గ్రహింపజేయాలన్నా భాషద్వారా తప్ప వేరే మార్గము లేదని అర్ధమైందనుకున్నాము. అలానే బృందచర్చల స్వరూప స్వభావాలు - వాటి తీరుతెన్నులపై చర్చించి 1. బృంద చర్చలో పాల్గొంటున్న వారందరూ కూడా బృంద చర్చలో పాల్గొంటున్నామన్న అవగాహన కలిగి అందుకు సిద్ధంగా వుండాలి. 2. బృంద చర్చలో ప్రశ్న ఎవరిని ఉద్దేశించి వేయబడిందో వారే స్పందించాలి. అలానే ప్రశ్న అర్ధమైందని నిర్ణయించుకున్నాకనే సమాధానము చెప్పటానికి ప్రయత్నించాలి. 3. ప్రశ్న ఏ విషయానికి ఎంత సమాధానం ఆశిస్తుందో ఆ విషయానికి అంత చెప్పినప్పుడే సరైన సమాధానము చెప్పినట్లు (అతనినే మితభాషి అంటారు) ఆ సమాధానము వీలైనంత క్లుప్తంగా దీర్ఘ ప్రసంగం కాకుండా ఉంటే బాగుంటుంది. 4. బృంద చర్చ ఎక్కువలో ఎక్కువ సఫలం అయిందనాలంటే చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చెబుతున్నది మిగిలిన అందరికీ తెలుస్తుండాలి. అలానే మిగతా అందరిదీ  అతనికి తెలుస్తుండాలి. అంటే ప్రతి ఒక్కరిదీ ప్రతి ఒక్కరికీ తెలుస్తుండాలి. ఇది జరగాలంటే చెప్పేవాడికి చెప్పడం చేతనైఉండాలి. వినేవాడికి వినడం చేతనైఉండాలి. అంటే బృంద చర్చలో పాల్గొనేవారికి చెప్పడము, వినడము చేతనై ఉండాలి. 5. బృంద చర్చలో ఆ విషయముపై అనేకానేక అభిప్రాయాలు వెల్లడి అయినప్పటికీ చర్చ ముగిసే సమయానికి చర్చనీయాంశము పట్ల సమానమైన అవగాహన కలిగించుకోగలగాలి. అప్పుడే ఆ బృంద చర్చ ప్రధానోద్దేశ్యము నెరవేరినట్లు.

ముఖ్యముగా జిజ్ఞాన, ఉత్సుకతల మధ్య తేడాపాడాలు తెలిసుండాలి. 'జ్ఞాతుం యిచ్చ జిజ్ఞాస' తెలుసుకోవాలనే గట్టి కోరిక. ఇట్టివారికి మాత్రమే తెలుసుకోదగిన విషయములో ఇప్పటికి ఎంత తెలిసింది, ఇంకెంత తెలియవలసి ఉందో తెలుస్తూ ఉంటుంది. ఉత్సుకత అంటే కుతూహలము అంటాము. అది ఏమిటో తెలుసుకోవాలన్న పైపై కోరికే గాని తెలియలేదన్న తపన ఉండదు. తగినంతగా కనుక విషయాన్ని తెలుసుకోగోరేవారికి ఆ విషయంపై జిజ్ఞాస ఉండిఉండాలి. కేవలం ఉత్సుకత వలన ప్రయత్నము ఉండదు, తెల్సుకోవడమూ జరగదు.

ఇలానే నిజాయితీ కలిగి ఉండడానికి, నిజము తెలిసి ఉండడానికి ఏమైనా తేడా ఉందా? సంబంధం ఉందా? రెండూ ఒకటేనా, అన్న విషయము చర్చకు రాగా చర్చించి 1. నిజము తెలిసిన వాడు, నిజాయితీ లేనివాడూ ఉంటాడు. 2. నిజాయితీ పరుడై నిజము తెలియని వాడూ ఉంటాడు అని తేల్చాము. నిజాయితీని వివరిస్తూ లోపలా బైటా ఒక్కటిగానే ఉండటం అంటే అనిపిస్తున్న దానికి అనుగుణంగానే మాటా, చేతా కలిగి ఉండడం అని అర్థం అనుకున్నాము. ''నిజం తెలిసి నిజాయితీ పరుడైన వాని మాట స్వీకరించవచ్చు'' అనుకున్నాం. ఉద్దేశ్యపూరకంగా తప్పుచేసేవాడు, ఉద్దేశ్యపూరకము కాకపోయినా తప్పుచేసేవాడు ఉంటారు. నిజం తెలిసి నిజాయితీ లేనివాడు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేసేవాడని, తెలియని వాడుగా ఒప్పుకోవడం ఇష్టంలేక ఏదో ఒకటి చెప్పేవాడు తప్పుచేసేవాడే కాని అతనిది ఉద్దేశ్యపూర్వకం అనలేము అనీ అనుకున్నాము. అలానే విధానాల్లో కూడా వంద విషయాలలో నిజం చెప్పాడు కనుక నూట ఒకటవది కూడా నిజం అనుకోవటం తప్పువిధానమని, పది సార్లు అబద్దం చెప్పాడు కనుక పదకొండో సారీ అబద్దమే చెబుతాడనుకోవటం కూడా తప్పువిధానమేననీ అనుకున్నాం.

అసలు సత్యాన్ని ఆచరించాలి అంటే మొదట దాన్ని (సత్యాన్ని) వెతకాలి, గమనించాలి, అంగీకరించాలి, స్వీకరించాలి ఆ తరువాతే ఆచరించడము. పై ఐదు అంశాల మధ్య తేడాలున్నాయని ఒకింత సూక్షంగా పరిశీలిస్తేగాని తెలుసుకోలేము. సత్యాన్వేషిగా ఉండడమే అన్నిటికంటే కష్టము. వాస్తవిక దృష్టి కలిగి ఉన్నవారే సత్యాన్వేషిగా ఉండగలరు. స్వర్గము ఉందా? లేదా? అని ప్రశ్నిస్తే ఉందనే వాళ్ళో, లేదనే వాళ్ళో ఉంటారు గాని తెలియదు అనేవాళ్ళు చాలా తక్కువ. తెలియదు అనడమంటే ఉందనిగాని, లేదని కాని అంగీకరించటము లేదని అర్థము. ఉంది, లేదు అనుకునే వాళ్ళు తమకు తెలియకుండగనే తెలుసనుకుంటున్నామన్న సంగతి కూడా తెలియని వాళ్ళని అర్థము. అందుకనే వాస్తవిక దృష్టి కలిగి ఉండడము కష్టమని చెబుతున్నాము. పుస్తకము చదివి మాకు నిజం తెలిసిందనుకునేవాళ్ళు అలానే నిజం కాదని తెలిసింది అనేవాళ్ళంతా వాస్తవికులు కాదనే అర్థం. కారణము పుస్తకము చదివితే వారు ఏమంటున్నారో, వీరు ఏమంటున్నారో తెలుస్తుంది కాని అది నిజమో, కాదో తెలియదన్న విషయము కూడా వారికి తెలిసిలేదు కనుక. వాస్తవిక దృష్టి కలవారు సత్యం సార్వత్రికం అంటారు. సత్యం వ్యక్తిగతమని (వయక్తికం) అని ఎవరైనా అంటే సత్యాసత్యాలకు విచారణ స్థానం ఉండదని అర్థం. అనగా సత్యాసత్యాలు తేల్చలేమని అర్థం.

నోట్‌ : సత్యాలు మారతాయి అనేవారు సత్యాసత్యాలు తేల్చుకోగలమంటారో లేదో అడిగి చూడాలి. అసలు విజ్ఞాన శాస్త్రముయొక్క దృష్టి ఉన్నది ఉన్నట్లు గమనించడమే. సత్యాలు మారుతుంటే విజ్ఞాన శాస్త్రము ఎలా గమనిస్తుందో కూడా వారే చెప్పాలి (కోట ప్రసాదు).

రెండవ రోజు సమావేశం 19వ తేదీ ఉదయం 9 గం.లకు మొదలైంది. శాస్త్రీయ దృక్ఫధం అంటే ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? గురించి మాట్లాడుకోవటం జరిగింది. ముందుగా దృక్ఫథాలు ఎలా ఏర్పడతాయో పరిశీలించటం జరిగింది. మనకు అనేక విషయాలు ఆయా ఇంద్రియాల ద్వారా తెలుస్తూ ఉంటాయి. అలా తెలిసిన దానినే అనుభూతి అంటాము. ఇలాంటి కొన్ని అనుభూతులు ఒకే రకంగా ఏర్పడడాన్ని బట్టి ఒక సాధారణ సూత్రాన్ని రాబడతాము. దాన్ని అభిప్రాయము అంటాము. అలా ఏర్పడ్డ అభిప్రాయాన్ని అనుసరించి దానిపై మరొక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాము. దాన్నే దృక్ఫథం అంటాము. మొదటి అభిప్రాయం ఏర్పడుట వలన ఆ అభిప్రాయం ఏర్పరచి వారిపట్ల మన వైఖరి ఏమిటి? మనము వారిఎడ ఎలా ప్రవర్తించాలి అన్న రెండు రూపాలలో దృక్ఫథము ఉంటుంది. అన్ని దృక్ఫథాలు అభిప్రాయాలే కాని, అన్ని అభిప్రాయాలు దృక్ఫథాలు కావని గమనించాలి.

శాస్త్రీయ ధృక్ఫథము అంటే సరైన దృక్ఫథము అని అర్థము. శాస్త్రీయ దృక్ఫథము అలవడాలంటే ముందేర్పరచుకున్న అభిప్రాయాలలో నుండి చూడకూడదు. రాగద్వేషరహితుడవై చూడాలి. అంటే సూత్రప్రాయంగా నువ్వు నువ్వుగా ఉండి దాన్ని దాన్నిగా చూడాలి అంటాము.శాస్త్రీయ దృక్ఫథము విషయము గమనించేవారు ఎలా ఉండాలో చెబుతుంది. అంటే ఆయా విషయాలు పరిశీలించే వ్యక్తి ఎలాంటి చూపు కలిగి ఉండాలో తెలిపేదే శాస్త్రీయ దృక్ఫథం.

ముందేర్పరచుకున్న అభిప్రాయాలను ప్రక్కనబెట్టి చూడగలగాలి. దీనినే పూర్వనిశ్చితాభిప్రాయాలు విడిచిపెట్టి చూడడం అంటాము. ఈ పూర్వ నిశ్చితాభిప్రాయాలు అన్నమాట క్రింద అప్పటికి ఏర్పడియున్న అభిప్రాయాల జాబితా అంతా వస్తుంది. శాస్త్రీయ దృక్ఫథము ఆ జాబితాను కొన్ని రాసులుగా విభజించింది. వాటిని అనుకూల దృష్టి, ప్రతికూల దృష్టి అనవచ్చు. శాస్త్రీయ ధృక్ఫథము ఇప్పుడున్నదానిని పరిశీలించే సందర్భములో ఈ రెండు దృష్ఠులను విడిచిపెట్టమంటుంది. ఎందుకంటే ఈ రెండు దృష్టులు పరిశీలనాంశాన్ని లోగడ పరిశీలించడం ద్వారా ఏర్పడినవి గనుక. మన ఉద్దేశ్యము పరిశీలనాంశము ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసుకోవడమే. ఇప్పటికి ఏర్పడియున్న దృష్టులు గతంలో అవి ఎలా ఉన్నాయో దానిని అనుసరించి పుట్టినాయి గనుక. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో గమనించడానికి అవి 1. అనవసరము, 2. ఆటంకము (కొన్ని సందర్భాలలో). కనుకనే శాస్త్రీయ దృక్ఫథము ఆయా విషయాలను పరిశీలించే సందర్భంలో ఈ రెండు దృష్టులను విడిచిపెట్టమంటుంది. ఇవి విడిచిపెట్ట వలసిన దృష్టులైతే కలిగి ఉండవలసిన దృష్టి అన్నదాన్ని గురించి కూడా శాస్త్రీయ దృక్ఫథము చెబుతుంది. దానినే ''తటస్థ దృష్టి'' అంటున్నాము. విషయాన్ని యథాతథంగా గమనించడంలో తటస్థ దృష్టి కలిగి ఉండాలి. ఉదాశీన దృష్టి అంటే పట్టించుకోనితనము. అది అన్నింటికంటే ప్రమాదకరమైనది కూడా. శాస్త్రీయ దృక్ఫథము, విషయము ఎవరు చెప్పారో అనిగాక, ఏమి చెప్పారో చూడమంటుంది. ఇలానే శాస్త్రీయ పద్ధతి కూడా వివరించుకోవడం జరిగింది. రాజ్యాంగము 51ఎ(హెచ్‌) లో, శాస్త్రీయ దృక్ఫథము ప్రజలకు అలవరచుకోవాలన్న నిర్దేశం ఉంది. అంటే దాని ఉద్దేశము మూఢనమ్మకాలనుండి ప్రజలను దూరం చేయాలన్నదే. చెప్పాము గనుక చేయడం కంటే ఎందుకు చేయాలో తెలిసి చేయడం సరైన పద్ధతి.

అధ్యయనం ఎలాచేయాలన్న విషయంపై ఒక ప్రయోగము చేయుట జరిగినది. ఎంపిక చేసుకున్న రెండు పుస్తకాల నుండి రెండు పేరాలు ఇచ్చి, ఈ పేరాలలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఎన్ని అభిప్రాయ ప్రకటనలు ఉన్నాయి? అందులో మీకు ఎన్ని అర్థమైనాయి? మీరు ఒప్పనుకొంటున్నవి ఎన్ని? తప్పు అంటున్నవి ఎన్ని? తేల్చుకోలేకపోతున్నవి ఎన్ని అనిపిస్తున్నాయి? అలానే అర్థం తెలియని పదాలు ఎన్ని? అవి ఏవి? సభికుల సమాధానాలు విన్నాక ఒక విషయం తెలిసింది. రచయితలందరము గమనించవలసిన ముఖ్య విషయము ఒకటుంది. ఒక రచన చేసో, ఒక ఉపన్యాసము ఇచ్చో మనకు తెలిసింది ఎదుటి వారికి చెప్పామని తృప్తిపడుతుంటాము చాలామందిమి. కానీ మన రచన ఎప్పుడైనా కొద్దిమందికి ఇచ్చి మీకు ఏమి అర్థమైందో చెప్పమని చూశామా? ఇలాంటి ప్రయోగము ఎప్పుడైనా చేశామా? చాలామందిమి చేసిఉండము. కారణము మనము చెప్పడము, వ్రాయడము ఏమిటి, ఇతరులకు అర్థము కాకపోవడం ఏమిటి? అర్థం చేసుకోలేక పోతే వారి స్థాయికి విచారించడం తప్ప ఏమీచేయలేము అని మనలను మనం సమర్థించకుంటాం. మనం ఎందుకు ఈ రచన చేశామో? అది నెరవేరిందో లేదో? అన్న యోచనే కానరాదు. నిజంగా మనం రాసింది ఎదుటి వారికి అర్థము కావాలి, వారు దానినుండి ఉపయోగం పొందాలి అన్న ఎరుకగానీ ఉండి ఉంటే, వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉందన్న ఆలోచన వచ్చేది. ఇది గమనించాకైనా అలాంటి ప్రయోగము చేయకపోవడం (తెలియకో, అనుకోకో) జరిగిందంటే, మన  రచనలు, మన ఉపన్యాసాలు ప్రజలకు ఉపయోగపడాలన్నదానికంటే మనకెంత పేరుప్రతిష్టలు తెచ్చాయో అన్నదానికో, ఆత్మసంతృప్తికో పనికివస్తాయి అంతే. అసలు విషయమేమిటంటే, అలా ఆత్మ సంతృప్తి పొందడానికో, పేరుప్రతిష్టల కొరకో అలాటి రచనలు చేసేవారు కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు, తమకలాటి ఆలోచన లేదనీ, జనం కోసమే ఈ రచన చేశానని అంటుంటారు. ఆ భ్రమనుండి  బైటపడతారని ఆశిస్తాను. (కోటప్రసాదు).

మండలి భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశిస్తూ మరిన్ని సభ్యత్వాలు చేర్పించాలని, మరిన్ని మండలి శాఖలు విస్తరింపచేయాలని నిర్ణయించుకోవటం జరిగింది. కొంతమంది నూతన సభ్యులను చేర్పించుకోవటం కూడా జరిగింది.   - రిపోర్టర్‌, కోట ప్రసాద శివరావు.

No comments:

Post a Comment