Tuesday, August 9, 2016

ఫజులూర్‌ రహమాన్‌ గారికి ఖుద్దూస్‌ రెండవ లేఖ


ఫజులూర్‌ రహమాన్‌ గారూ! మనమొకటి గమనించాలి. అసలు సత్యాన్వేషణ మండలి మీతో ఎందుకు చర్చలు చేస్తోంది? వారికేమి ప్రయోజనం? నాకు తెలిసినది ఏమిటంటే సమాజంలో ఉండకూడని (చెడు) భావాలు పోవాలి, ఉండవలసిన (మంచి) భావాలు పెరగాలి. ఉండవలసిన భావాలుగా వారు కొన్నిటిని భావిస్తున్నారు. వాటికి భిన్నంగా ఉన్నవాటితో సరైనవి తేలేవరకూ చర్చలు చేస్తూ ఉంటారు. తేలిన భావాల వైపునకు ఆచరణ ఉండేలా, వారు ప్రయత్నిస్తూ, మిగతా వారిని వత్తిడిచేస్తూ ఉంటారు.

మన సమావేశం కూడా అటువంటి ఉండకూడని ఒక భావం ఇస్లాంలో ఉన్నదా లేదా? చూడటం కోసం. ఆ ఉండకూడని భావం ఏమిటంటే ''ఒక మనిషి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, ఇస్లాం వ్యక్తులని అసమానులుగా చూస్తుంది. తనని నమ్మని కారణంగా ఇస్లాం ఆ నమ్మని వ్యక్తులను ద్వేషిస్తుంది. ఆ ద్వేషము యొక్క స్థాయి, ఆ నమ్మని వ్యక్తులని చంపమనే వరకూ ఉన్నది'' ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్న సురేంద్ర గారు, తనను ఒప్పుకోకపోతే (నమ్మకపోతే) చంపేయటం ఏంటండి? అని ప్రశ్నించినప్పుడు, మీరూ, ముస్తాక్‌ గారూ అలా ఉంటే ఇస్లాం వదిలేస్తాము అన్నారు.

ఖురాన్‌ అవిశ్వాసుల పట్ల ఎలా వ్యవహరించమంటున్నది అనేది అధ్యయనం చేయటానికి ప్రత్యేక సమావేశాలు పెట్టుకుందాం అనుకున్నాం. పూర్వ గ్రంథాల పట్ల ఇస్లాం వైఖరేమిటి? అంశంపై మొదట పెట్టుకున్నాం. తరువాత అవిశ్వాసుల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటన్న అంశం పెట్టుకున్నాం. అవిశ్వాసుల పట్ల ఇస్లాం వైఖరి అనే అంశం కొరకు వాస్తవానికి ఇస్లాం పక్షం వారు ప్రతి పాదన చేయాలి. ముస్తాక్‌ గారు ప్రతి పాదన కూడా చేశారు. దానిమీద చర్చచేశాక మరింత అధ్యయనం చేసుకొని వస్తాం అని మీరిరువురూ అనడం జరిగింది.

మలి సమావేశంలో ముస్తాక్‌ గారు హాజరు అవ్వలేదు. ఆ సమావేశం కొరకు మండలి అవిశ్వాసుల పట్ల ఇస్లాం వైఖరి అంశానికి సంబంధించినవి అధ్యయనం చేయటానికి 213 ఆయుతులతో కూడిన ఒక చిత్తు ప్రతి రూపొందించింది. దానిపైన ఒక్కొక్క ఆయుతు, అధ్యయనం చేస్తున్నాము. ఇస్లాంలో సరిగా లేని అంశాలు కనిపించ సాగాయి ఆ సమావేశంలో. మీరు ఒకేసారి ఆవేశపడి, నాకైతే ఈరోజు టైం వేస్టులాగా అనిపిస్తుంది. నేను కొన్ని నెలలుగా వేచిఉన్నాను. నాకు ఏ అంశమైతే సురేంద్ర బాబుగారు చూపిస్తాను అన్నారో ఆ అంశం చూపిస్తారు అని. కానీ మీరు ఆ పని ఇప్పటికి చేయలేదు. నేను ఎంత సీరియస్‌గా ఉన్నానో ఈ విషయం పట్ల, మీరు అంత సీరియస్‌గా లేరు అనిపిస్తోంది అని అన్నారు. మీరు చెప్పింది వాస్తవమే. 'ఆ విషయం మాత్రమే చర్చిద్దాం, అది మీకు చూపిద్దాం' అని అప్పటి వరకూ మిగతా వారము కూడా సీరియస్‌గా లేము. మీరు ఆ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నారని తెలియక అవిశ్వాసుల పట్ల మొత్తంగా ఖురాన్‌ వైఖరి ఏమిటి అనేది అధ్యయనం చెయ్యటం అనే ఉద్దేశ్యంలో ఉన్నాం. ఇక వెంటనే అవిశ్వాసులను, అవిశ్వాస కారణంగానే చంపమనటానికి ఏ ఆయుతులు సరిపోతాయో, అవి తీసి చూపించారు ఆరోజే సురేంద్ర గారు. కానీ సమయాభావం వలన ఆ రోజు చర్చ ముగియలేదు. ఇక మిగతా చర్చ 29 జనవరి 2016న జరిగినది.

ఇందులో సురేంద్ర బాబుగారు ముందే మీకు ఆ మూడు ఆయుతులు, మరియు హదీసులు ఇవ్వటం జరిగింది. మీరు ఆ రోజు ముందుగా మీ ప్రతిపాదనగా మూడు అంశాలను ఉండవలసినవిగా ప్రస్తావించారు. 1. రెండు ట్రెడిషన్స్‌ మధ్య ఉండవలసిన సంబంధంగా సావధానంగా, ప్రశాంతమైన వాతావరణములో వారి వారి దృక్ఫథాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇది ఆ ట్రెడిషన్స్‌ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడానికి కీలకమైన విషయం. 2. ఒక వ్యక్తి ఒక ట్రెడిషన్‌లోనుంచి ఇంకొక ట్రెడిషన్‌లోకి మారితే మొదటి ట్రెడిషన్‌ వారు ఆ వ్యక్తిపైన ఏ వత్తిడి పెట్టకూడదు. 3. ఒక ట్రెడిషన్‌ వారు ప్రచారం చేస్తున్నప్పుడు ఆ ప్రచారాన్ని విన్న వ్యక్తి ఆ ట్రెడిషన్‌ను నమ్మకపోతే అతన్ని చంపటం అమానుషం.

నా వరకు నాకు రెండు ట్రెడిషన్స్‌ మధ్య ఉండవలసిన సంబంధాలుగా ఇంకా చాలా చూడవలసి ఉన్నప్పటికీ, మీరు ప్రస్తావించిన ఈ మూడు సిద్ధాంతాలను నేను సరైనవిగానే అంగీకరిస్తున్నాను. సురేంద్ర బాబుగారు కూడా అంగీకరించియున్నారు. అయితే ఈ మూడు అంశాలు మీరు కోరుకున్న విషయం తేల్చడానికి అవసరం లేనివి. కాని మేము కోరుకున్న దానికి పనికివచ్చేవిగా ఉన్నాయి. మొదటి రెండు విషయాలు కూడా ఇస్లాంలో లేవు అని మీరే అంగీకరించారు. అయినప్పటికీ ఇస్లాంను ఎందుకు పట్టుకొని కూర్చున్నారు. మీ మనసు చంపుకొని ఉంటున్నారా, ఇస్లాంలో?

ఇంకా ఆ రోజు చర్చలో సురేంద్రబాబుగారు ప్రతిపాదించిన మూడు ఆయుతులలో మొదటి రెండూ వేరే సందర్భానికి అని చెప్పుకుంటూ వచ్చి మూడవది మనం అవిశ్వాసి కారణంగానే ఆ బాలుడిని చంపినట్లు అంగీకరిస్తూనే, అది మనం ఎత్తుకున్న సందర్భానికి కాదు అంటూ మీరు చెప్పుకొచ్చారు. అప్పుడు ఇంకా జాగ్రత్తగా మన వీడియోలను పరిశీలించాను. అక్కడక్కడా, మీకు అవిశ్వాసులని చంపమనటానికి తగిన వాక్యాలు చూపిస్తున్నప్పుడు, మీరు మనం ఎత్తుకున్న సందర్భమిది కాదు, ఇస్లాం ప్రచారం చేస్తున్న సమయంలో ఇస్లాం అంగీకరించకపోతే చంపమంటున్నదా? అంటూ మనం ఎంచుకున్న అంశానికి ప్రక్కకు తీసుకెళ్ళేలా క్రొత్తదారులు సృష్టించారు. అంత పట్టిపట్టి చూస్తే తప్ప మీరు ఏ సందర్బం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసినంతవరకూ ఆ సభలో ఎవరికీ మీరు దేనిగురించి మాట్లాడుతున్నారో అది చేరలేదు.

ఫజులూర్‌ రహమాన్‌ గారూ! అంత సీరియస్‌గా మనం చర్చలు చేస్తున్నాం. మీరు ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారో అది మాకు చేరలేదు అని మీకు ఎందుకు తెలియలేదు? ఇస్లాం ప్రచారం సమయంలో ఒప్పుకోకపోతే ఇస్లాం అవిశ్వాసులని చంపుతుందా అని మీరు ఎత్తుకున్నానంటున్న సందర్భం. కాని అవిశ్వాస కారణంగా చంపమనే వరకూ ఇస్లాంలో ఉందా అని మనం అనుకున్న సందర్భం. ఇది స్పష్టం. 'మతమార్పిడులు - ముంచుకొస్తున్న మహోపద్రవం' అంశం సందర్భంగా ఆమాట వచ్చింది కాబట్టి ఇది ప్రచారం చేస్తున్నప్పుడు ఒప్పుకోకపోతే అన్నదానికి సరిపోతుంది అన్నట్టు అక్కడక్కడా మాట్లాడుకుంటూ వచ్చారు. అలా మాట్లాడటం కుతర్కం, ఛలం.(వక్త చెప్పని ఉద్దేశ్యాన్ని వక్తకు అంటగట్టడం) అవుతుంది.

మీరు తనని ఒప్పుకోకపోతే చంపివేయమని ఇస్లాంలో ఉంటే ఇస్లాంను వదిలేస్తాను అని అనేశారు కాబట్టి ఆ ఒక్కటి పెట్టుకొంటే ఇస్లాం నుంచి బయటపడవలసిన పరిస్థితి ఉందని గమనించి, మీరు అక్కడ ఉన్న సందర్భానికి మిగతావి జోడించి సవరించుకుంటూ పోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రచార సమయంలో తనని ఒప్పుకోని వాళ్ళని ఇస్లాం చంపమంటుంది అని సురేంద్ర బాబుగారు ఎప్పుడూ చెప్పలేదు. తరువాత కూడా ఆమాట అనలేదు. అవిశ్వాస కారణంగా చంపమంటుందా? లేదా? అన్నదే మనమధ్య అంశంగా సురేంద్ర గారు మాట్లాడారు. ఆ వేదికలో మిగతా వ్యక్తూలూ అదే అనుకున్నారు. నిజంగా మీరు మనం వేరే అంశం మాట్లాడుతున్నాం అని గమనిస్తే అప్పుడే మీరు సురేంద్రగారు ఏమంటున్నారో చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. ఎంత మనసుకి సర్దిచెప్పుకుందామని చూస్తున్నా కూడా మీరు అక్కడ సరిగ్గాలేరు, ఎత్తుగడ వైఖరిని అవలంభించారు అననిపిస్తూనే ఉంది మీ వైఖరిచూస్తుంటే.

ఇంకా మీరు ప్రస్తావించిన మూడు అంశాలలో రెండు ట్రెడిషన్స్‌ మధ్య ఉండకూడని సంబంధాలుగా పేర్కొన్న మొదటి రెండూ ఇస్లాంలో ఉన్నట్లు మీరే అంగీకరించారు. ఉండకూడనివి ఇస్లాంలో ఉన్నాయి అని అంగీకరించినట్లే మీరు. మరి ఇంకా ఎందుకు అక్కడే ఉన్నారు? ఇంకా మీరు స్వతంత్రాలోచనాపరులని, సత్యాన్వేషణ దృష్టి కలిగి ఉన్నారని, వివేకవంతమైన విశ్వాసిగా ఉన్నారని మీరు అక్కడక్కడ ప్రకటించటం చదివి ఉన్నాను. అది నిజమే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

1. ఒక వివేకవంతుడు ఎప్పుడు విశ్వసించాలి. 2. ఒక వివేకవంతుడు ఎప్పుడు విశ్వసించనవసరం లేదు. 3. వివేకవంతుడు విశ్వసించవలసి వచ్చినప్పుడు, వ్యక్తిని (వ్యక్తిని విశ్వసించటం అంటే అతను చెప్పిన మొత్తాన్ని విశ్వసించడం) విశ్వసించాలా? లేక విషయం వరకు విశ్వసిస్తే సరిపోతుందా? 4. వివేకవంతుడు విశ్వసించిన విషయాల ఆధారంగా ఆచరణ ఎప్పుడు చేయాలి? మరియు మీరు నిజమైన ఇస్లాం విశ్వాసి అనికూడా అంటున్నారు. అయితే వీటికి మీ సమాధానం ఇవ్వండి. ఇస్లాం ప్రకారం 1. ఒక ముస్లిం ఏమి చూస్తే ఇస్లాంను విడిచిపెట్టవచ్చు. 2. ఒక ముస్లిం ఖురాన్‌లో ఏ విషయాన్ని అయినా సత్యమా, అసత్యమా, ధర్మమా, అధర్మమా అని పరిశీలించవచ్చా?3.ఇస్లాం స్వతంత్ర ఆలోచనను ఏమేరకు అంగీకరిస్తుంది.

నన్నడిగితే 1. ఒక వివేకవంతుడు విశ్వసించవలసి వచ్చినప్పుడు వ్యక్తి చెప్పిన మొత్తాన్ని విశ్వసించనక్కరలేదు. ఏ విషయమైతే విశ్వసించనవసరమైనదో ఆ విషయం వరకు విశ్వసిస్తే సరిపోతుంది. 2. ఒక విషయాన్ని విశ్వసించాలి అంటే ఆ విషయం నమ్మకం తప్ప ఇంకేమార్గం ద్వారా తెలియనిది అయి ఉండాలి. మరియు ఆ విషయం మనకి సంబంధించినది అయి ఉండాలి. 3. మనకు అసంబద్ధమైన విషయాలను మరియు ప్రత్యక్ష లేక తార్కిక పద్ధతి ద్వారా తెలిసే అవకాశం ఉన్న విషయాలను మనం విశ్వసించనక్కరలేదు. 4. వివేకవంతుడు తను విశ్వసించిన విషయం అవసరమైతే తప్ప అది ఆచరణలోకి తీసుకురానక్కరలేదు.

మరియు ఒక ఇస్లాం విశ్వాసి 1. ఏ పరిస్థితులలోను ఇస్లాం విడిచిపెట్టకూడదు, ఇస్లాం ప్రకారం. 2. సత్యమా, అసత్యమా? లేక ధర్మమా, అధర్మమా? అని ఇస్లాం విషయంలో ఆలోచించకూడదు. ఏదైనా అసత్యం అనిపిస్తే లేక అధర్మం అనిపిస్తే, అప్పటికి మనకే తప్పు అవగాహన ఉంది అని భావించి వేచిచూడాలి. ఏదో ఒక సమయానికి ఇస్లాం చెప్పినదే సత్యం లేక ధర్మం అవుతుంది అని. (మూస, ఖిజర్‌ ఉదంతం ఈ రకమైన ప్రేరణనే కలిగిస్తుంది.) 3. ఇస్లాం వ్యక్తి స్వతంత్ర ఆలోచనను పూర్తిగా అంగీకరించదు. ఎవరైనా ఇస్లాంకి అనుకూలంగా ఆలోచిస్తున్నారా? ఇస్లాంకి అనుకూలంగా చేసే ఆలోచనలను ఇస్లాం స్వీకరిస్తుంది. ఇస్లాం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఇస్లాం ఆ విధంగా ఆలోచన చేయవద్దు అంటుంది - ఖురాన్‌ 2:108.

నాకు తెలిసినంత వరకు సత్యాన్వేషణ దృష్టి, మరియు ఇస్లాం విశ్వాసం ఒకదానికి ఒకటి పొసగనివి. ఏదో ఒకటి కలిగి ఉండడం కుదురుతుంది కానీ రెండూ ఒకేసారి పూర్తిగా కలిగిఉండడం కుదరని పని.

మీరు ప్రసాదు గారికి రాసిన లేఖ చూశాను. అందులో వివేకముతో కూడిన విశ్వాస మార్గము దగ్గరకి చేరాను అన్నారు. పైన నా అవగాహన చెప్పాను. వివేకముతో కూడిన విశ్వాస మార్గము అంటే అది అసత్యము కాకపోవడం, సంబంధం కలిగి ఉండడం, అవసరం అయి ఉండడం వంటి వాటితో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి చెప్తే అతను ఏం చెప్పినప్పటికీ సరైనది అవుతుంది అనడం వివేకం కాదు. అవివేకమవుతుంది. ఇస్లాం సరిగ్గా ఇదే చెప్తోంది. అందుకే ఇస్లాం అన్నది ఎట్టిపరిస్థితుల్లో వివేకవంతమైన మార్గం కాజాలదు.

మీతో చర్చిస్తున్నప్పుడు, మీ ఉద్దేశం ఏమిటో, మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. మీరు కోరుకున్నది మీకు మేము అందజేయాలన్నా, లేదా మీరు ఇవ్వదలచింది మేము స్వీకరించాలన్నా కూడా. అందుకే నేను అంత పట్టీపట్టీ అడిగాను ఇదివరకు నేను రాసిన లేఖలో. మీ ఉద్దేశం ఏమిటా అని. కానీ మీరు అవన్నీ అవసరం అనిపిస్తున్నప్పటికీ విషయం తేలితే మిగతావి సర్దుకుంటాయి అన్నట్లుగా నేను మాట్లాడింది అసందర్భం అన్నట్లుగా రాసుకుంటూ వచ్చారు. నేను మాట్లాడింది ఖచ్చితంగా సందర్భోచితమే. కాదు అంటే మీరు నిరూపించండి.

ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది మీరేప్రకటించాలి. మీరు ప్రకటించకపోతే మీ గురించి రకరకాల ఊహలు చేసుకుంటూ ఆ దృష్టిలోనే మిగతావారూ మిమ్మల్ని చూస్తారు. వివేకపథంలో చదివాను. సురేంద్రగారితో పరిచయం ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ మీరు మిమ్మల్ని ఆయనకీ చూపించుకోలేదు అని ఆయన వ్రాశారు. మీ గురించి చాలామంది ముస్లింల వద్ద కూడా ఆమాట విన్నాను. నా ప్రశ్నలకి మీరు ఇచ్చిన సమాధానంతో అది నిజమే అనిపిస్తోంది. మిమ్మల్ని మీరు దాచుకోవలసిన అవసరం మీకేంటి? ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు చాలా పెద్దతప్పు చేస్తున్నారని అర్థం. మీ స్వభావం అలా ప్రేరేపిస్తుంటే ఆ అంశాన్ని మీరు తక్షణమే మార్చుకోండి. మీరు పరిశీలనా దృష్టి కలిగిఉన్నారా లేక ఇస్లాం దృష్టి కలిగి ఉన్నారా అన్నది నేను తేల్చుకోవాల్సిన అంశం. ఇక ఖురాన్‌ పూర్తిగా పరిశీలించిన ఇస్లాం విశ్వాసి అనకూడని మాట, ''ఇందులో ఏదైనా తప్పు ఉంటే ఇస్లాం వదిలివేస్తాను'' అని. ఆ మాట అనాలంటే ఎన్ని గుండెలు కావాలి ఒక ఇస్లాం విశ్వాసికి? ఒక విషయం తప్పు అని స్వయంగా అనిపిస్తున్నప్పటికీ అది తన జ్ఞాన పరిధికి తప్పనిపిస్తుంది, కాని వాస్తవానికి ఒప్పే అయిఉంటుంది అన్న సందేశాన్నిస్తుంది ఖురాన్‌. అందుకనే ఒక నిజమైన విశ్వాసి ఖురాన్‌లో తప్పుఒప్పులు చూడడు, చూడలేడు. అందులో తప్పుఒప్పులు మీరు చూడగలరంటే దాని అర్థం ఖురాన్‌తో సంబంధం లేకుండానే మీకు తప్పుఒప్పులు తెలుస్తాయని. ఖురాన్‌తో సంబంధం లేకుండానే మీరు తప్పు, ఒప్పులు తెలుసుకోగలిగితే మీకు ఖురాన్‌తో ఏం అవసరం అన్న ప్రశ్న వస్తుంది.

మన సమావేశాల వీడియోలు జాగ్రత్తగా గమనించిన నాకు మీరన్న ఒకమాట కనిపించింది. ''ఇస్లాం విశ్వాసమంటే దేవుడు ఉన్నాడా. లేడా? అన్నది కాదు. నీ భార్యతో ఎలా ఉండాలో, నీ పిల్లలతో ఎలా ఉండాలో, స్నేహితులతో ఎలా ఉండాలో, ప్రజలతో ఎలా ఉండాలో నీకు తెలియదు. నిన్ను సృష్టించిన, సమస్తాన్ని సృష్టించిన నాకు తెలుసు. నేను ఇచ్చిన ప్రకారం జీవిస్తే నీకు మంచిది. నేనిచ్చిన ప్రకారం జీవిస్తే వారికి మంచిది, ఈ రకంగా ఒక ఒప్పందం ప్రకారం జీవించటం అని. అంతేగాని దేవుడిని నమ్మటమా, నమ్మకపోవటమా అన్నది కాదు అసలు''.

ఖురాన్‌ చదవగానే మీరు చెప్పినట్లు అక్కడ ఉంది అని నాకనిపించటం లేదు. మీకు ఎందుకనిపించిందో చెప్పాలి. ఈమాట వింటుంటే మీరు అక్కడ ఉన్నది ఉన్నట్లు విశ్వసించటం లేదు అని. దానివెనుక ఏ ఉద్దేశ్యాలు ఉండి ఉంటాయో ఊహించుకొని మీ ఊహకు అందిన వాటిని పట్టుకొని, ఇస్లాం వెంట పడుతున్నారు అని తెలుస్తుంది. కనీసం మీరు చెప్పిన ప్రకారం మీ విశ్వాసం ఉండిఉంటే ఇస్లాంలో ఫలానా చూపిస్తే, ఉంటే ఇస్లాం వదిలివేస్తాను అనిచెప్పి ఉండేవారు కాదు. ప్రజలతో ఎలాఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇటువంటివి మీకు ఇస్లాంతో సంబంధం లేకుండానే తెలుస్తున్నాయి. అందుకే ఇస్లాంలో తప్పు ఉంటే చూడటానికి సిద్ధం కాగలిగారు. వీటిని బట్టి చూస్తుంటేనే మీరు నిజమైన విశ్వాసిగా లేరు అన్న విషయం అర్థమవుతోంది. ఇస్లాం ఏ విషయాలను అయితే సీరియస్‌గా విశ్వసించమంటుందో అది మీకు ముఖ్యమైన అంశంగా అనిపించలేదు.

వాస్తవానికి ఇంకో అవకాశం కూడా ఉంది. మీరు 100% ఇస్లాం విశ్వాసి అయిఉండి, సురేంద్రబాబుగారి నోటినుంచి 'ఈ విషయం ఇస్లాంలో లేదు అని మీకు అనిపించిన' ఒక్క మాట రాగానే, ఇక దొరికాడు, దీనిని పట్టుకొని సురేంద్రబాబుని ఓడించేద్దాం అనే ఉద్దేశంతో మీరు ప్రాణప్రదంగా భావించే మీ ఇస్లాంనే, మీ ఆత్మ విశ్వాసం కారణంగా పందెంపెట్టి ఉండవచ్చు. ఇలా గనక చేసిఉంటే మీకు ఉంది అని మీరు అంటున్న సత్యాన్వేషణ దృష్టి మీకు లేనట్టే. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలా గనక చేసిఉంటే మీకు ఇస్లాంలో నిజంగా తప్పుఉన్నా మీరు చూడరు, చూడలేరు. కానీ మీమీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. మీరు సత్యాన్వేషణ దృష్టితోనే ఉన్నారని, ఉండాలని ఆశిస్తున్నాను.

కానీ మీ వైఖరి గమనిస్తుంటే, మీరు పూర్తిగా సత్యాన్వేషిగా కూడా లేరనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి ఏమంటున్నాడో సరిగ్గా గమనించకుండానే దూకుడుగా ప్రకటన చేశారు, అటువంటిది ఇస్లాంలో లేదు అని. తరువాత మళ్ళీ దానిని ఇస్లాం ప్రచారానికి జతచేసి మాట మార్చారు. ఇంకా ఫేస్‌బుక్‌ వంటి మాద్యమాలలో అయితే మీ దూకుడు అంతా ఇంతా కాదు. వ్యక్తిగత విమర్శలకు కూడా మీరు వెనుకాడటం లేదు. మునాఫిక్‌ లక్షణాలు నాలో కనిపించాయి అని ఫేస్‌బుక్‌లో పెట్టారు. నన్ను దగ్గరనుంచి గమనించిన వాళ్ళెవరూ ఆమాట అనలేదు. మీకు నా గురించి ఆ మాట అనేంత అవగాహన కూడాలేదు. ఎందుకంత తొందర? ఒక నిజమైన విశ్వాసి, ఒక వ్యక్తిపై అన్యాయంగా నిందవేయటానికి ఎంత భయపడాలి? ఆ భయం లేదు మీకు. ఇంకా నన్ను మిగతా వాళ్ళు తెలిసీ తెలియక తిడుతుంటే మీరు ఫేస్‌బుక్‌లో లైక్‌ చేస్తున్నారు. నిజానికి నా వ్యక్తిత్వంపై మీరే చేసే ఈ వ్యాఖ్యలు మీలో ఉన్న వత్తిడిని తెలియజేస్తాయే తప్ప నన్ను ఏమీ చేయలేవు.

ఇతరులు నియమాలు పాటించకపోతే వత్తి వత్తి అడిగే మీరు, ఎక్కడా కూడా నియమాలను అనుసరించినట్లు ఈ మధ్య మీ రాతల్లో కనిపించటం లేదు. వ్యక్తిగత విమర్శలు, విషయాన్ని ప్రక్కదారి పట్టించేయి అవుతాయేతప్ప వాస్తవాలను వెలికితీయలేవు. ఇప్పటికి నేను చూసిన వాటిని బట్టి చూస్తుంటే మీరు విశ్వాసం దగ్గర సరిగ్గాలేరు. సత్యాన్వేషణ దృష్టితో చూసే ప్రయత్నం కూడా సరిగా చెయ్యటం లేదు అనిపిస్తోంది. మిమ్ములను మీరు పునఃపరిశీలించుకొంటే మంచిదనిపిస్తుంది. నేను రాసిన రాతల్లో మీ గురించి చాలా ఊహలే చేశాను. వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉండవచ్చు, కొన్ని అవాస్తవాలు ఉండవచ్చు. మీ గురించి మీరు వ్యక్తంచేసుకోపోవటం వలన ఇంకా చాలా రకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని అపసవ్యమైన ఊహలను కూడా నేను విన్నాను. మిమ్మల్ని మీరు స్ఫష్టంగా వ్యక్తంచేసుకుంటే ఎవ్వరికీ ఇంత అవసరం ఉండేది కాదేమో. ఇప్పటికీ ఆలస్యం ఏమీలేదు. ముందు మిమ్మల్ని మీరు వ్యక్తపర్చుకోండి. మీ అభిప్రాయాలు ఏమిటి? వాటివద్దకు ఎందుకు వచ్చారు అనేది తెలుపండి. మీరు నిజంగా మంచిచోట ఉంటే, అవసరం ఉన్నచోట ఉంటే అక్కడికి మేమెందుకు రాలేదు అని అడగండి. అటువైపునకు మమ్మల్ని వత్తిడి చెయ్యండి. అందరం మంచి వైపునకు కదలాలన్నదే నా ఆశ. మనం కష్టపడి మంచి సమాజంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఇంతకన్నా మంచి సమాజాన్ని, ఉన్నత విలువలు కలిగిన సమాజాన్ని భవిష్యత్‌ తరాలకు ఇవ్వాలి.

మనం కలిగిఉన్న విశ్వాసం వలన సమాజానికి ప్రమాదం జరగనక్కరలేదు. జరిగే అవకాశం ఉంటే చాలు అది విడచి బయటకు వచ్చేయటానికి. నేను ఇస్లాం విశ్వాసిగా ఉన్నంతకాలం ఖురాన్‌ పరిశీలన పూర్తిచేయలేదు.అప్పట్లో ఇస్లాంలో సరిగ్గాలేని అంశం కనిపించగానే దేవుడు సరిగ్గానే చెప్పాడు, నేనే సరిగ్గా అర్థంచేసుకోలేకపోతున్నానేమో అని నాకున్న పూర్వ నిశ్చితాభిప్రాయాల మూలంగా సరిగ్గా చూడలేకపోయాను.ఇస్లాంలో ఉండకూడని ఒక అంశం ఉందని విన్నాను. ఇస్లాంలో నుంచి బయటకి వస్తే వారిని చంపమని ఇస్లాం అంటున్నది అని. అప్పటి వరకూ ఇస్లాంలో ఒక్క తప్పుకూడా ఉండదు, ఎవ్వరికీ కూడా కనిపించదు. వ్యక్తులు వారివారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఇస్లాం వద్దకు రారు అని భావించాను. ఆ మాట విన్నాక వెంటనే విశ్వాస దృష్టి (పూర్వ నిశ్చితాభిప్రాయాలు) ప్రక్కన పెట్టి పరిశీలనా దృష్టితో చూశాను. అలాగే ఉన్నది. తనని నమ్మని కారణంగా చంపటం అమానుషం. అప్పుడే అల్లాహ్‌ యొక్క వ్యక్తిత్వాన్ని గమనించనారంభించాను. తన గురించి తాను చెప్పుకున్న గుణాలకి సరిపడని పనులు కనిపించాయి. వెంటనే ఇస్లాం వీడి బయటకు వచ్చేశాను. ఒక వ్యక్తి ఒక ట్రెడిషన్‌లో నుంచి ఇంకొక ట్రెడిషన్‌లోకి మారితే మొదటి ట్రెడిషన్‌లోని వారు ఆ వ్యక్తిపైన ఏ వత్తిడీ పెట్టకూడదు. అలా చేయటం అమానుషం అన్న మీరు ఇస్లాంలో నుంచి బయటకి వెళితే చంపివేయమని ఇస్లాం అంటున్నదని అంటున్నారు. మరి అంత అమానుషం అయిన పనులు ఇస్లాంలో ఉన్నప్పుడు ఇస్లాంలో ఎందుకు ఉన్నారు? నన్ను ఇస్లాం బయటకి రావటానికి ప్రేరేపించిన అంశం మిమ్ములని ఎందుకు ప్రేరేపించటం లేదు? ప్రసాదు గారికి మీరు రాసిన లేఖలో దానికి సంబంధించి మీరు ఇచ్చిన వివరణ చూశాను. ఇస్లాం పాలన వచ్చాక అది సలహా మండలి అభిప్రాయంతో జరిగే విషయం అంటున్నారు. ఇస్లాం బలహీనపర్చటానికి అవిశ్వాసులు ఇస్లాంలోకి వచ్చి బయటకు వెళ్ళటం గమనించారు కాబట్టి, ఇస్లాంలోనుంచి బయటకు వెళితే చంపివేయటం సమంజసమే అన్నట్లుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. రహమాన్‌ గారూ మీరు చెప్పిన ఉద్దేశం సరైనదా కాదా తరువాత చూద్దాం. ముందు ఎత్తుగడగా ఇస్లాంలోకి వచ్చివెళితేనే చంపాలి అని తెలిపి ఉండాలి కదా ఇస్లాం సాహిత్యంలో. ఎక్కడ ఉంది? మీరు చెప్పిన ఉద్దేశం నిజమే అయితే ఇస్లాంలోనుంచి బయటకు వెళ్ళిన వారిని చంపటానికి కారణం అవిశ్వాసం కానట్లయితే ఇస్లాంలోనుంచి బయటకి వెళ్ళే వ్యక్తి నిజంగా ఎత్తుగడతో లోపలికి వచ్చాడు అని నిరూపణ జరగాలి కదా. అలా నిరూపించి చంపిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఇస్లాం సాహిత్యంలో చూపించండి. ఇక ఎత్తుగడతో లోపలికి వచ్చాడు అనుకుందాం. అలా రావడం వల్ల ఇస్లాంకు వచ్చే నష్టం ఏమిటి? ఇస్లాంలోని విషయం బలమైనదే అయితే అందులోని వ్యక్తులు బయటకు వెళ్ళటం వలన ఇస్లాం ఎందుకు బలహీనం అవుతుంది? అందులో కొందరు వ్యక్తులు బయటకి వెళ్ళినంతమాత్రాన బలహీనపడిపోతుందా? అంత బలహీనమైనదా మీరు ఎన్నుకున్న విశ్వాసం? పైగా ఆ పనికి మీరు వేసే శిక్ష మరణశిక్షా.

ఇస్లాం చెప్పిన ధర్మాలు ఇంత అసమంజసంగా అనిపిస్తున్నప్పటికీ మీరు దాన్ని సమర్ధించేపని, జనాలలోకి తీసుకెళ్ళే పని పెట్టుకున్నారు. నిందలు వేయటం మాని ముందు నాకు తెలపండి మీరు పట్టుకున్నది సత్యమే అని.

ఇప్పడు నా గత లేఖకు మీరు పెట్టిన స్పందనకు నా ప్రతిస్పందన 


రహ్మాన్: ప్రతి స్పందనకు ధన్యవాదములు !
# మీరు వ్రాసిన అనేక విషయాలు పట్టి చూసేవే అయినా "విషయ పరమైనది" తేలితే మిగిలినవి సర్ధుకునే అవకాశం ఉందని తలంచి అసలు విషయమును గూర్చి మాత్రమే స్పందిస్తున్నాను.
ఖుద్దూస్: అన్నీ పట్టి చూసేవే. ఒకటి తేలితే మిగతావి ఏమీ కూడా తేలవు. నేను అడిగిన వాటన్నిటికీ మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది
రహ్మాన్: # మీకు సందర్భశుద్ది తెలియడం లేదనిపిస్తోంది !
ఖుద్దూస్: నిరూపించండి. గాలి మాటలు చెప్పటం కాదు.
రహ్మాన్: # అర్ధాన్ని గుంజి ఎత్తుకున్న అంశానికి జొప్పిస్తున్నారనిపిస్తోంది !
ఖుద్దూస్: ఎత్తుకున్న అంశం ఏమిటో మీకు స్పష్టత లేకపోవటమూ లేక కావాలని దారి తప్పించే ప్రయత్నమో జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనం ఎత్తుకున్న అంశం అవిశ్వాస కారణంగా చంపమనేంతవరకూ ఇస్లాంలో ఉందా లేదా? అన్నంత వరకే. ఆ పరిధిలోకి ఈ వాక్యం వస్తుంది అని మీరే అంగీకరించారు.
రహ్మాన్: # ఖురాన్ లో మీరు రుజువుగా చూపుతున్న ఆయాత్(18:80) - దాని సందర్భముగాని, చెప్పిన వాని ఉద్ధేశ్యముగాని, దానిని వివరించి బోదించిన వాని లక్ష్యములోగాని ఇసుమంత ఉన్నా చూపించాలి !
ఖుద్దూస్: మీరు రాసింది సరిగ్గా అర్ధం కావట్లేదు. అర్ధం అయ్యేలా చెప్పండి.
రహ్మాన్: # మీపూర్వ నిశ్చితాబిప్రాయం లో నుండి చూస్తూ మీకు నప్పిన అర్ధాన్ని దానికి జొప్పించి మీకు తెలియకుండానే తప్పు వాఖ్యానము చేసిననూ,ఆ తరువాత అయినా అదిమీకెందుకు అర్ధం కావడం లేదో నాకు అర్ధం కాలేదు.
ఖుద్దూస్: అబద్ధం చెప్తున్నారు. మీరు నిరూపించలేని విషయం.
రహ్మాన్: # కనీసం విన్న మాటకు అర్ధాన్ని అన్న వానినుండే తెలుసుకోవాలన్న సూత్రాన్ని పట్టించుకున్నా ఇలాంటి వాఖ్యానాన్ని చేసియుండకపోదురేమో అనిపిస్తోంది.
ఖుద్దూస్: నా సంగతి పక్కన పెడదాం. మీరు ఎంత గట్టిగా పట్టించుకున్నారు? ఆ సూత్రం నిజంగా మీకు అర్ధం అయ్యి ఉంటే, ఇస్లాం వెంట ఉండరు. బయటకి వచ్చేస్తారు. ఇస్లాంకు సంబంధించిన ఏ విషయం కూడా అసలు అర్ధం మీకు తెలియనిదే. అన్న వాడినుంచి తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇంక నిజమైన ఇస్లాం అనుసరించే అవకాశం మీకు లేనే లేదు. ఇక నేను చెప్పేది కూడా అదే. అన్న వాడి నుంచి దాని అర్ధం ఇది అని తెలుసుకునే అవకాశం లేదు. ఎవరికి నప్పిన అర్ధం వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు. ఖురాన్ గ్రంధం పట్టుకుని తీవ్రవాదులకి ప్రేరణ ఇచ్చేలా దాని అర్ధం చెప్పారు అనుకోండి, అది తప్పు అని అతను భావించటానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువే. అందుకే గ్రంధాన్ని, వ్యక్తిని ప్రామాణికం చెయ్యటం మానితే, మన జీవిత అనుభవాలు ఉన్నాయి, మనల్ని మార్గదర్సకత్వం చెయ్యటానికి. జాగ్రత్తగా పరిశీలిస్తే అవే బోలెడన్ని పాఠాలు నేర్పుతాయి.
రహ్మాన్: # "మారణహోమానికి దారితీస్తున్న మతమార్పిడులు" అనే అంశము సందర్భముగా సురేంద్రగారు నేటి ప్రపంచములో పలుచోట్ల జరుగుతున్న సంఘటనలకు కారణం చూపుతూ "వారు ఖురాన్ ద్వారా ప్రేరేపింపబడే అలాచేస్తున్నారు" అన్న దానికి జవాబుగా ఇది సరిపోతుందని మీకు అనిపిస్తే ఆవిషయంలో అదెలా సరిపోతుందో తెలుపడానికి నాకు చెప్పాలని మీరనుకొంటే తెలియజేయండి !
ఖుద్దూస్:  ఈ అంశం కూడా ముఖ్యమైనదే అయినప్పటికీ, మనం ఎత్తుకున్న అంశం ఇది కాదు. దీని గురించి మాట్లాడుదాం. ముందు మీరు ఏ విషయం వద్ద ఇస్లాం నుంచి బయటకి వస్తాను అన్నారో, ఆ విషయం స్పష్టంగా తెలియజేసారు. మీరు బయటకి వచ్చేయండి. తరువాత మనం చర్చించవలసినవి అన్నీ కూడా మాట్లాడుదాం.
రహ్మాన్: # "ఇద్దరమే కూర్చుందాము విషయం రికార్డ్ చేద్దాము".
ఖుద్దూస్: మంచిది. అలాగే చేద్దాం. ఇప్పుడున్న విషయం తేలితే కాని వేరే విషయాన్ని చూసే ఆసక్తి మీకు లేదని తెలిసి, మన మధ్య నడుస్తున్న విషయాలను వాయిదా వేసాను. ఇది త్వరగా ఒక ముగింపుకు తీసుకురండి. నాకు కూడా మిగతా విషయములు మీతో చర్చిద్దామని ఆసక్తిగానే ఉన్నది.
రహ్మాన్ : నోట్: సురేంద్ర గారు ఎత్తిన సందర్భము,ఇచ్చిన సందేశము, నేటి సందర్బానికి పోల్చి చెప్పిన విధానము పట్టి చూడండి !
అలాగే, ఖురాన్ వాక్య సందర్భము,ఇచ్చిన వాని సందేశము మరియు విధానము, దానిని నేటి సందర్భానికి వివరించి పోల్చి చెప్పిన వారి విధానము పట్టి చూడండి !
ఖుద్దూస్: నేటి సందర్భం ఏమిటి అన్న దగ్గర మీరు లేని విషయాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున చేసి ఉంటె గమనించండి. సురేంద్రగారు చెప్పని మాట, మీరు తగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
రహ్మాన్: (బహుశా మీరు మార్గ బ్రష్టత్వం నుండి బయట పడే అవకాశం లేకపోలేదు.ఇన్షా అల్లాహ్ కరీమ్!)
ఖుద్దూస్: నిరూపించండి. ఊరికే మాట్లాడటం కాదు. మీరన్న మాటని నిరూపించే భాద్యత మీదే. నిరూపించలేకుంటే మాట్లాడమాకండి. కళ్ళు మూసుకుని నడిచే/నడిపించే మీరు కళ్ళు తెరిచి చూసుకుని నడుస్తున్న నన్ను తప్పు దారిన ఉన్నానటం మీ అహంకారాన్ని తెలియజేస్తుంది.



7 comments:

  1. అబ్దుల్ ఖుద్దూస్ గారు...మీ వివరణ చాలా బాగుంది...ఇలాంటివి మరెన్నో చేసి శాంతి సమాజ స్థాపన చెయ్యవలసినది గా నాప్రార్ధన...ఖురాన్ లో ఉన్న వ్ఫాక్యాలు నేను కూడా చదువుతూ వచ్చాను..ప్రశ్నిస్తే చంపేస్తారేమో అన్నభయం కూడా నాకు ఉంది అనేది కాదనలేని సత్యం...!ఏది ఏమైనా ప్రజలను మానవత్వం తో చూడని ఏ మతమైనా ఈ నాగరిక సమాజానీకి పనికిరాదు అన్నది సత్యము...మహమ్మద్ అమీనా అమీర్ (హైదరాబాద్ )

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన నాకు ప్రోత్సాహకంగా ఉంది. మన దేశం ఛాందసులకు, చంపివేసేంత స్వేచ్చ ఇవ్వలేదు లెండి. అదృష్టవంతులం. ఇస్లామీ దేశాలలో ఇప్పటికీ, ఇస్లాంని విమర్శించిన వారిని చంపిన వార్తలు వస్తున్నాయి.
      ఇస్లాంలో ఉన్న అపసవ్యతలను గమనించిన, ఆ వర్గంలో పుట్టిన మనం స్పందించి, మరి కొందరిని ఆ ప్రమాదంలో పడకుండా చెయ్యటం సముచితం.
      నాకు వీలైనంత నేను ఆ ప్రయత్నం చేస్తాను.
      మీరు కూడా చెయ్యండి.
      --అబ్దుల్ ఖుద్దూస్

      Delete
    2. Manavatvam mundu matham tharwatha.manavatwam marichina ye matham yekkuva kalam nilavadhu

      Delete
    3. అబ్దుల్ ఖుద్దూస్ గారికి ధన్యవాదములు...మీకో చిన్న విషయం చెప్పాలి...మీరు అనుకున్నట్టు ఇక్కడ వాస్తవానికి ఇస్లాం ధర్మమును విడిచిపెట్టిన వారు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉన్నారు అనేదానిలో సత్యం చాలావరకు లేదు..ఇస్లాం ను ప్రశ్నించిన వారు ఇస్లామిక్ మత చాంధసవాదులచే దాడులు చేయబడుతున్నారు...నేను పలుమార్లు ఇస్లాంను ప్రశ్నించినందుకు దాడులు ఎదుర్కొన్నాను..కొంతమంది ద్వారా బహిష్కరణకు కూడా గురయ్యాను..నా ప్రాణ మిత్రుడు ఇస్లాం ను ప్రశ్నించినందుకు సంఘం చే బహిష్కరించబడినాడు...ప్రాణ భయం తో వేరొక గ్రామం లో తల దాచుకున్న అతనిని PFI కేరళ రాష్ట్రం మలప్పురం లో వారు హత్య చేసారు..మన దేశం లో ఈ స్వాతంత్రం కాగితాలకే పరిమితమైంది...కాని ఎప్పుడూ మత చాందసవాదులచే ముప్పు ఉంటూనే ఉన్నదీ..ఏది ఏమైనా నేను వాటికి భయపడను లెండి..సత్యం మాట్లాడం కోసం,నిజాన్ని నిజంగా అందరి ముందుపెట్టడం కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యను...

      Delete
    4. అబ్దుల్ ఖుద్దూస్ గారు...నేను మీ ఫేస్బుక్ పోస్ట్ కి శ్రీమాన్ ఫజ్లూరు రేహ్మాను గారి జవాబు చూసాను..అందరు ముస్లిములు,ముల్లాలు,ఇస్లామిక్ వహాబీ భావజాలపు వ్యక్తుల జవాబు ఇచ్చేవిధముగానే దాటివేత దొరణి నాకు కొట్టోచ్చె విధం గా స్పష్టంగా కనిపించింది..వీరు సత్యాన్ని గ్రహింపక,ఉన్నదీ ఉన్నట్టు ఒప్పుకోలేక,చరిత్రను పరిశీలింపక,వాస్తవాన్ని అంగీకరించలేక సతమవుతున్నారు..కేవలం ఖురాన్ గ్రంధాన్ని ప్రామాణికం గా తీసుకొని చరిత్రని మార్చేయలేము కదండి..! ఇస్లాం ఎప్పటినుండో ,భూమి పుట్టిన దగ్గరినుండి ఉంది అంటున్నారు..! మరి శాస్త్రీయమైన పురతత్వసాస్త్రవేత్తల తవ్వకాలలో ఇప్పటివరకు బయటపడిన శిలాజాలను ,కట్టడాలను ,నాగరికతలను పరిశీలించిన మీదట విగ్రహారాధకుల నాగరికతలే భయటపడుతున్నాయి కాని ఇస్లామిక్ సంస్కృతికి చెందినవి ఒక్కటీ లభించలేదు అన్నది కాదనలేని సత్యం....మహమ్మద్ ప్రవక్త చనిపోయిన ౩౦౦ సంవత్సరాలవరకు సౌది లో విగ్రహారాధకులు ఉండేవారు అనేది కూడా సత్యం...ఆఖరి ప్రవక్త గారి సమయం లో కూడా విగ్రహారాధన ఉండేది...దైవవాక్యం గా చెప్పబడుతున్న ఖురాన్ ప్రవక్త గారు చనిపోయిన తరువాత రాసినదే అనేది కాదనలేని సత్యం...అందులో ప్రవక్త గారు చెప్పిన వాక్యాలు ఉండొచ్చు...సొంత పైత్యంతో కొన్ని వాక్యాలు కొందరు వ్రాసి ఉండొచ్చు అనేది కూడా కొట్టి పారెయ్యలేము..అసలు షరియా చట్టం కూడా ప్రవక్త గారి తదనంతరం వచ్చిందే గాని ప్రవక్త గారు చెప్పలేదు అనేది కాదనలేని సత్యం.,,పైన నేను పెర్కొన్నవన్ని చరిత్ర ఆధారం గా సత్యాన్వేషి గా పరిశీలించి రాసినవి తప్ప , ఎదో అభాండాలు వెయ్యాలని మాత్రం చెప్పలేదు...

      Delete
    5. మీరు నా వ్యక్తిగత ఇన్బాక్స్ కు మెస్సేజ్ చేయండి. మీతో మాట్లాడాలి.
      khuddus1@gmail.com

      Delete
  2. http://www.rajobs.in/search/label/Telangana

    ReplyDelete