''ప్రమాకరణం ప్రమాణం'' అన్న అర్థంలో దీనిని వాడారు. ప్రమ అనగా ఒప్పు జ్ఞానం అని అర్థం. కరణం అనగా అసాధారణ కారణం అని అర్థము. కనుక ప్రమాణం అంటే ఒప్పు జ్ఞానానికి అసాధారణ కారణం అని చెప్పినట్లయింది. ''అనధిగత అబాధిత విషయజ్ఞేయత్వం ప్రమాత్వం'' అని అన్నారు.
''తద్వతి తత్ప్రకారకో అనుభవం యథార్థం, యథార్థ జన్య జ్ఞానం ప్రమ''
''యథా అర్థో తథా జ్ఞానం యథార్థ జ్ఞానం ప్రమ''
ఉన్నది ఉన్నట్లే కలిగిన జ్ఞానమునకు పెట్టిన పేరే ప్రమ. అట్టి జ్ఞానమును కలిగించు కారణమును ప్రమాణం అంటారు. సత్యాన్వేషణ మండలి ఈ ప్రమాణం అన్న పదాన్ని యథార్థ జ్ఞాన సాధకం అన్న అర్థంలో కాక, జ్ఞాన సాధకం అన్న అర్థంలో వాడుతుంది. అలాగే ప్రమాకరణం అన్న దానిలో కరణం అన్న మాటకు అసాధారణ కారణం అన్న అర్థాన్ని అంగీకరిస్తూనే, వెనుకటి వాళ్ళు చెప్పినదానికంటే మరికొంత విస్తృత అర్థాన్ని చెబుతుంది. ఏదైనా ఒక ఫలితాన్ని పుట్టించటానికి పరికరము, పద్ధతి అన్నవి కూడా అసాధారణ కారణాలు అవుతాయి. ఆ పరికరాన్ని వాడడం వలన ఆ ఫలితం వచ్చింది అన్న సందర్భమూ, ఆ పద్ధతిని వాడటం వలన ఆ ఫలితం వచ్చిందన్న సందర్భమూ, ఈ రెండు సందర్భాలనూ బట్టి కూడా వాటికి అసాధారణ కారణత్వం సిద్ధిస్తుంది. భాషాపరంగా చూస్తే పరికరానికి, విధానానికి కూడా కరణత్వం సిద్ధిస్తుంది అన్నంతవరకూ, సాంప్రదాయక పండితులు అంగీకరిస్తూనే తాము ప్రస్తావిస్తున్న ప్రమాకరణం అన్న శబ్దంలోని కరణం అన్న మాటకు ''తస్మాత్ ఇంద్రియం ప్రమాణం'' అనే అర్ధాన్ని చెబుతూ పరికరాన్నే సూచించారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే, ప్రమాణ శాస్త్రంలోని ప్రమాణములు అన్న పేర్లు పరికరములను అనుసరించి పెట్టినవిగా కాక పద్ధతిని అనుసరించ పెట్టినవిగానే తేలతాయి. ప్రమాణ క్షేత్రంలోని కరణం అన్న మాటకు భాషాపరంగా రెండు రకాల వ్యుత్పత్తులున్నాయి.
''ప్రమీయతేయేన తత్ప్రమాణం'' ''ప్రమీయతే అనేన ఇతి ప్రమాణం'' యేన అన్న పదం దేనిచేత అని అర్ధాన్నిస్తూ, పరికరాన్ని సూచిస్తుండగా, అనేన అన్నది ఈ ప్రకారముగా అన్న అర్థాన్నిస్తూ విధానాన్ని సూచిస్తుంది. సాధనం అన్న పదము పరికరాన్ని సూచించేది కాగా, సాధకం అన్న పదము సాధించిపెట్టేది అన్న అర్థములో పరికరాన్ని, విధానాన్ని కూడా సూచించగలుగుతుంది. ఇందులో కరణం అన్నదానికి సాధకం అన్న అర్థం తీసుకుంటేనే జ్ఞాన సిద్ధాంతంలో పేర్కొనబడ్డ ప్రమాణాలను వివరించుకోవడం వీలుపడుతుంది.
అవగాహనా స్పష్టత కొరకు మరికొంత వివరిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. దీన్ని ఇంత విపులంగా ఎందుకు వివరించవలసి వచ్చిందంటే, ఈ సిద్ధాంత క్షేత్రానికి సంబంధించిన మౌలిక అంశాలలోనే వెనుకటి వాళ్ళతో మేము విభేదిస్తున్నాము. గనుక ఈ విషయంపై మీలో కొంత స్పష్టత రావడంకోసం మరికొంత వివరించవలసిన అవసరం ఉందనిపిస్తోంది.
ప్రపంచంలో ఉన్న జ్ఞాన సిద్ధాంత క్షేత్రాలన్నీ, ప్రమాణాలన్నవాటి పేర్లు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ది, సంభవము, ఐతిహ్యము అంటూ పేర్కొన్నాయి. పైన చెప్పుకున్నట్లు కరణం అన్న మాటకి ఇంద్రియం (పరికరం) అన్న అర్థాన్ని గనుక తీసుకొని పేర్లు పెట్టి ఉంటే, ఆ పేర్లు నేత్ర ప్రమాణం, శ్రోత్ర ప్రమాణం, ఘ్రాణ ప్రమాణము, త్వక్ ప్రమాణం, రసన ప్రమాణము అని ఉండాలి. ఎందుకంటే జ్ఞాన సాధనాలు ఇంద్రియాలే గనుక. కానీ ప్రపంచంలో ఎక్కడా, జ్ఞాన సిద్ధాంతంలో ప్రమాణాల పేర్లు అలా పెట్టబడి లేవు. కనుక పరికరాలను అనుసరించి కాక ప్రక్రియలను అనుసరించే ప్రమాణాల పేర్లు పెట్టబడ్డాయని రూఢి అవుతుంది. అంటే ప్రత్యక్ష పద్దతి, అనుమాన పద్ధతి, శబ్ద పద్ధతి అంటూ చెప్పటమే వాస్తవాన్ని చెప్పటం అవుతుంది. పద్ధతులననుసరించే ప్రమాణాల పేర్లు వచ్చాయి.
సత్యాన్వేషణ మండలి వెనుకటి వాళ్ళతో విభేదిస్తున్న మరోముఖ్యమైన అంశము ప్రమాకరణం ప్రమాణములో ప్రమ అన్న పదానికి సంబంధించినది. జ్ఞాన సాధకాలు అయిన పరికరాలను గాని, పద్థతులను గాని వాడినప్పుడు, ఉన్నది ఉన్నట్లు తెలియడము, లేనిది ఉన్నట్లు తెలియడము జరుగుతున్నాయి. వీటినే మనము ఒప్పుజ్ఞానము, తప్పు జ్ఞానము అంటున్నాము. ఒప్పు జ్ఞానం కలగడానికి, తప్పు జ్ఞానం కలగడానికి కూడా అవే పరికరాలు, అవే పద్ధతులు కారణాలు అవుతున్నప్పటికీ ప్రమాకరణం అన్న పదంలో ప్రమ అన్న పదానికి యథార్థజ్ఞానము అన్న అర్థం మాత్రమే నంటూ వెనుకటి వాళ్ళు చెప్పిన అర్థాన్ని గనుక స్వీకరించినట్లుయితే, తప్పు జ్ఞానాన్ని పుట్టించేదానికి, పరికరాన్ని, విధానాన్నీ వేరుగా చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మన అనుభవంలో అటువంటి వేరే పరికరాలు, విధానాలు లేవు. కనుక భాషను అనుసరించి ప్రమ, భ్రమ అన్న పదాలకి ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న అర్థం చెప్పుకుంటున్నప్పటికీ ప్రమాకరణంలోని ప్రమ అన్న పదానికి యథార్థ జ్ఞానం అనికాక, యథార్థజ్ఞానాన్నీ, అయ్యథార్థ జ్ఞానాన్నీ కూడా సూచించగల 'జ్ఞానం' అన్న అర్థాన్ని చెప్పుకోవడమే సరైనది అవుతోంది. వినియోగంలో సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వీలవుతుంది. ఒకవేళ ప్రమ అన్న పదానికి ఒప్పుజ్ఞానం అన్న అర్థం తప్ప, వేరే అర్థం చెప్పటానికి వీలులేదు అనిగనుక అన్నట్లయితే, ప్రమాణములు అన్న పదం స్థానే జ్ఞాన సాధకం అన్న అర్థాన్నిచ్చే పదం వాడటమే సరైనది అవుతుంది. అట్టి యోగ్యమైన పదమన్నా ఏర్పరచుకోవాలి. లేదా ఉన్న పదాన్నే వాడుకోక తప్పని స్థితి ఉన్నట్లయితే ఈ అర్థంలో వాడుచున్నామన్న వివరణ అయినా చేసుకోవాలి. మండలి ఈ విషయంలో ప్రమ, భ్రమ అన్న వాటికి ఒప్పుజ్ఞానం, తప్పుజ్ఞానం అన్న అర్థాలను అంగీకరిస్తూనే, ప్రమాకరణంలో ప్రమ అన్న మాటకు యథార్థ జ్ఞానము అనికాక, జ్ఞానము అన్న అర్థాన్ని కలిగి ఉంది. ప్రత్యక్షములోని వివిధ రకాలైన జ్ఞానం కలుగుతున్న సందర్భంలోనైతే, ఆ రకమైన ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి ఇంద్రియమే అసాధారణ కారణమని అంగీకరిస్తుంది. కనుక పైన చెప్పుకున్నట్లు నేత్ర ప్రత్యక్షము, శ్రోత్ర ప్రత్యక్షము మొదలైనవి ప్రత్యక్ష పద్ధతిలో కలిగే జ్ఞానములో వివిధ రకాలు అవుతాయి.
మిత్రులారా ! ఇక మా సిద్ధాంతాన్ని పరిశీలించబోతారు గనుక ప్రమాకరణంలోని ప్రమ అన్నదానికి, కరణం అన్నదానికి పైన మేము అంగీకరిస్తున్న అర్ధాలను మనసులో పెట్టుకొనే అధ్యయనం చేయండి.
జ్ఞానమనగా నేమి? :
ఏదో ఒక విషయాన్ని గురించిన అనుభూతి కలగటాన్ని జ్ఞానం (తెలియడం) అంటారు. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం : విషయం లేకపోయినా, జ్ఞానేంద్రియం లేకపోయినా, గ్రహించేవాడు లేకపోయినా, ఈ మూడిటితో ముడిపడి ఒక పద్ధతి ప్రకారం పని జరగకపోయినా అనుభూతి కలుగదు. అంటే తెలియడం జరుగదు. ఆ మూటితో ముడిపడి అనిపించడం అన్నది ఏర్పడే వరకూ జరిగేదాన్ని జ్ఞానం ఏర్పడే క్రమము అంటున్నాము. దానిని సూటైన మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు.
దీనినే అనుభూతి చెందడం అనిపించడం అంటున్నాము. ఈ విషయంలో వెనుకటి వాళ్ళతో సత్యాన్వేషణ మండలి ఒక విషయంలో విబేధిస్తుంది. భారత దేశంలోని ప్రమాణజ్ఞులు జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని ఇలా చెప్పారు.
ఆత్మ మనస్సుతో సంయుక్తమై, ఇంద్రియం ద్వారా విషయాన్ని చేరి విషయాకారాన్ని ధరిస్తుంది. అప్పుడే ఆ విషయంయొక్క జ్ఞానం కలుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశీలనలు, పై దానికి పూర్తి విరుద్ధమైన రీతిలో జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఉంటుంది అని పరిశోధనల ద్వారా రుజువుచేశాయి. మన అనుభవాలను పరిశీలించి చూసుకుంటే కూడా ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలకి సంబంధించి ఆయా ఇంద్రియాలు పట్టుకోగలిగిన మేర సమాచారమే తలకిచేరి, తెలుస్తూ ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. సత్యాన్వేషణ మండలికి దీనిని వివరించే ఒక ప్రక్రియ ఉంది. ''లోపలికి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నావా? బయట ఉన్న విషయాన్ని గమనిస్తున్నావా?'' అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే లోపల చేరిన దాన్ని గమనిస్తున్నామని తెలుస్తుంది. ఈ విషయాన్ని కొన్ని ఉదాహరణలు తీసుకొని పరిశీలించి చూద్దాము.
ఉదా 1 : కొద్ది దూరంలో ఒక వస్తువు ఉంది. భౌతిక నియమాలను అనుసరించి అది ఒక ఆకారంలోనూ, ఒక పరిమాణంలోనూ, ఏదో ఒక రంగును కలిగి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ వస్తువుకి మన కంటికి మధ్య వేరే రంగు అద్దాన్ని పెట్టిచూస్తే, ఆ వస్తువు మనం పెట్టిన అద్దపు రంగు కలిగినదిగా అనిపిస్తుంది. బూతద్దాన్ని పెట్టి చూపినట్లయితే వస్తువు పరిమాణము ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. వక్ర / గరుకు తలం కలిగిన అద్దాన్ని గనుక పెట్టినట్లయితే వస్తువు వంకర టింకరగా కనిపిస్తుంది. పుటాకార అద్దంలో నుంచి చూస్తే చాలాదూరం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగాలన్నీ వస్తువునుంచి కంటిద్వారా మెదడుకు సమాచారం ఏ రీతిలో చేరితే ఆ రీతిలోనే వస్తువు కూడా ఉంటుంది అన్న వాస్తవాన్ని చూపెడుతుంది. అలాగే మిగిలిన ఇంద్రియాలకి సంబంధించిన అంశాలనీ పరిశీలించి చూసుకోవచ్చు.
ఉదా 2 : ఒక శబ్దాన్ని గురించిన అనుభూతి (జ్ఞానం) కలగాలంటే పై పండితులు చెప్పినట్లు ఆత్మ మనస్సుతో కూడి శబ్దం పుట్టిన చోటుకి వెళ్ళి శబ్ద రూపాన్ని ధరించటం అనేది చాలా అసంబద్దంగా కన్పిస్తుంది. దానికి మారుగా శబ్ద తరంగాలు చెవిని చేరడము, అక్కడ నుంచి ఆ సమాచారము గ్రహణ కేంద్రానికి చేరటము సరైనదిగా అనిపిస్తుంది. మరో ప్రయోగం కూడా చేసి చూసుకోవచ్చు. హటాత్తుగా ఒక విపరీతమైన శబ్దం వినపడితే చెవులు గింగురు మనటము, కొన్ని సందర్భాలలో కర్ణభేరి పగలడము (చిల్లు పడటము) జరుగుతాయన్నది మన అనుభవంలో ఉన్న విషయమే.
ఇలాంటివి ప్రతి జ్ఞానేంద్రియంతో ముడిపెట్టి ఈ క్రమము ఇలాగే ఉందో లేదో పరీక్షించి చూసుకోండి. చాలా విషయాలలో బాగానే ఆలోచించారు అనిపించే వెనుకటి వాళ్ళు ఈ విషయములో ఇంత బండ తప్పు ఎందుకు చేశారో ఒక పట్టాన అర్థం కాదు. వారెందుకు చేశారన్నది ఊహించటాన్ని ప్రక్కనపెట్టి, సాంప్రదాయ తర్కాన్ని పట్టుకున్న ఈనాటి ఆ పక్షపు అధ్యయనపరులను చూస్తే వారుకూడా, దానినే పట్టుకొని వేలాడడమూ, తమ వాదనా పద్ధతిలో నిలబెట్టబూనటం, విడ్డూరం కాకపోతే మరేమిటి? తమ పెద్దలు చెప్పింది నెత్తికి ఎత్తుకోవడం, అవకాశం ఉన్నంత మంది నెత్తికి ఎత్తడం అన్న దృష్టే తప్ప, సత్యాసత్యాలను అవగాహన చేసుకోవాలన్న దృష్టి ఈ విషయంలో వారికి కలగలేదన్నది స్పష్టంగా కనపడుతుంది కదా. ఈ మొత్తాన్ని క్రోడీకరించి చూసుకుంటే ఉన్నవాటి గురించి మనకి అనిపిస్తున్నది, 1. ఉన్నది ఉన్నట్లే అన్న రూపంలోనూ, 2. ఉన్నది ఉన్నట్లే కాకుండా మరో రూపంలోనూ కూడా ఏర్పడుతున్నట్లుగా రుజువవుతున్నది. మానవ జ్ఞాన వికాస పరిణామ క్రమంలో, ఉన్నది ఉన్నట్లే కాక, లేనిది ఉన్నట్లు కూడా అనిపించవచ్చు అన్న విషయం గమనింపులోకి వచ్చిన రోజు జ్ఞాన క్షేత్రానికి సంబంధించినంతలో ఒక పెద్ద మలుపులాంటిది. అక్కడి నుండే మనిషిలో ఆయా విషయాలకి సంబంధించి కలుగుతున్న జ్ఞానం సరైనదా కాదా పరిశీలించి చూసుకోవాలి అన్న దృష్టి ఏర్పడింది. అదే క్రమంగా జ్ఞాన సిద్ధాంత రూపకల్పనకు దారితీసింది. ఎప్పుడైతే; సహజ ప్రక్రియని అనుసరించే తప్పుజ్ఞానము, ఒప్పు జ్ఞానమూ కలుగుతూ వస్తున్నాయని గమనించాడో, ఒప్పుజ్ఞానం బ్రతుకు అవసరమని గమనించాడో అప్పటి నుండే ఈ జ్ఞాన క్షేత్రాన్ని నిశితంగా శోధించడం, స్ఫష్టంగా అర్థంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తప్పు జ్ఞానమంటే ఏమిటి? తప్పు జ్ఞానము ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అలాగే ఒప్పు జ్ఞానం అంటే ఏమిటి? ఒప్పు జ్ఞానం ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? ఒప్పు జ్ఞానమే కలుగుతూ ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అన్న వాటి జ్ఞానాన్ని సంపాదించుకొని వినియోగించుకోవటం బ్రతుకు అవసరంగా గమనించటం జరిగింది. ఈ పరిశీలన నుండే ఎన్ని రకాల జ్ఞానం ఏర్పడుతున్నది, ఆ జ్ఞానం ఏఏ పరికరాల ద్వారా, ఏఏ విధానాల ద్వారా ఏర్పడుతోంది అన్న అవగాహన కలిగింది.
అభ్యాసము : పైన మనం వివరించుకున్న జ్ఞాన క్రమము ప్రత్యక్ష ప్రమాణానికి సరిపోతుంది. అనుమాన ప్రమాణ క్రమము వివరించుకునేటప్పుడు మరికొన్ని దశలు కలపాలా? ఈ క్రమం సరిపోతుందా? అవసరం లేకుంటే ఈ క్రమంలోనే ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి మధ్య ఏ దశలో తేడా వస్తుంది? ఇంకొంత కలపాలి అనుకొంటే ఏమేమి ఎక్కడెక్కడ కలపాలి? వివరించండి.
జ్ఞానంలో రకాలు
ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అని జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. పరోక్ష జ్ఞానంలో అనుమాన ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము, శబ్ద ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము (భాష ఆధారంగా కలిగే జ్ఞానము) అనే ఉప విభాగము ఉంటుంది. ఈ మూడు రకాలుగా కలిగే జ్ఞానములోనూ మళ్ళా తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము అన్న విభాగము ఉంది. వీనినే ప్రమ, భ్రమ అనికూడా అంటారు. ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే ఆ జ్ఞానాన్ని ప్రమ అంటారు. లేనిది ఉన్నట్లుగా తెలియటాన్ని మరియు ఉన్నది ఉన్నట్లుగా కాక ఇంకొకలా తెలియటాన్ని భ్రమ అంటారు.
భ్రమ : ''అతస్మిన్ తద్బుద్ధి మిధ్యా'' ''విపర్యయో మిధ్యాజ్ఞానం తద్రూప అప్రతిష్టితం'', ''తదభావవతి తత్‌ప్రకారకో అనుభవం అయ్యథార్థం తద్జన్యం జ్ఞానం భ్రమ'', ''తత్ అవిద్య తత్ దుష్టజ్ఞానం''
గమనిక : భ్రమ, మిధ్య, విపర్యయము, తప్పుజ్ఞానము, అసత్యము, అవిద్య, అబద్దము, బాధిత జ్ఞానము అన్న పదములన్నీ ఈ క్షేత్రములో సమానార్థకాలు.
ప్రమ : ''అసన్ని కృష్ణార్థ పరిచ్చిత్తిః ప్రమా''
అని వైశేషికం ప్రత్యక్షం గురించి చెపుతోంది.
జ్ఞానానికి సంబంధించి కొన్ని సాధారణ అంశాలు :
* విషయ రహితమైన జ్ఞానం ఉండదు.
* ఉన్నది తెలియడం అన్నది ప్రత్యక్ష పద్ధతి ద్వారానే సాధ్యము
* పరోక్ష జ్ఞానసాధకాలైన అనుమానశబ్ద ప్రమాణముల ద్వారా తెలిసింది, అనిపిస్తున్నది వాస్తవానికి ఇంకా తెలియవలసిందిగానే ఉంటుంది.
* అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానంలో రెంటి సంబంధం ఆధారంగా; ఇప్పుడు తెలియబడుతున్న దానితో సంబంధపడిన రెండవది ఉండిఉంటుంది అన్న ఊహాత్మక నిర్ణయాన్నే; అనిపించటం జరుగుతోంది గనుక జ్ఞానం అని పిలుస్తున్నాము. నిజానికి ఏది ఉంటుందన్న ఊహాత్మక నిర్ణయం జరిగిందో అది తెలియని స్థితే ఉంటుందక్కడ. కనుకనే దానిని పరోక్ష జ్ఞానం అని పిలుచుకున్నాము.
* అలాగే శబ్ద ప్రమాణంలో కూడా ఒక వ్యక్తో, ఒక గ్రంథమో ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారము అందించినపుడు లేదా అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు, అతనేమంటున్నాడన్నది తెలుస్తుందేగాని, అతను దేనిని గురించి అయితే సమాచారం అందించాడో అది తెలియనిది గానే, తెలియవలసినదిగానే ఉంటుంది. కనుకనే శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానాన్ని కూడా పరోక్షజ్ఞానం అనే అంటున్నాము.
ప్రత్యక్ష ప్రమాణం
జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని అనుసరించే పైన పేర్కొన్న ప్రత్యక్ష జ్ఞానమన్నది కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు విషయాలకి సంబంధించి తాము పట్టుకోగలిగిన మేర పట్టుకున్న సమాచారాన్ని గ్రహణ కేంద్రానికి చేర్చటం ద్వారా అందిన సమాచారం వరకు కలిగిన జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఇంద్రియం వెళ్ళి విషయాన్ని తాకిందా, విషయం వచ్చి ఇంద్రియాన్ని తాకిందా అన్నది ఖచ్చితంగా నిర్ణయించుకోనక్కర లేకుండానే ఇంద్రియార్థ సన్నికర్ష జరగటం అన్నది ప్రత్యక్ష ప్రమాణములో కీలకం అయి ఉంది. సన్నికర్షలో ఉన్నంత వరకు తెలియడం అన్నదే ప్రత్యక్ష ప్రమాణం యొక్క పరిమితి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కలిగే వివిధ రకాలైన జ్ఞానాలకు ప్రమాణ పద్ధతి సామాన్య కారణంగానూ, ఇంద్రియం (జ్ఞానేంద్రియం) అసాధారణ కారణంగానూ ఉంటుంది. కనుకనే తెలుసుకొనే మనకు /జ్ఞాతకు (గ్రహణకేంద్రానికి) వేరుగా ఉన్నవాటన్నిటి గురించి కలిగిన జ్ఞానాన్ని, ఆయా ఇంద్రియాలతో ముడిపెట్టి కలిగిన జ్ఞానంగా పేర్కొంటాము. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక మరియు అంతరింద్రియము అన్న ఆరు పరికరాలను అనుసరించి మనిషికి ఆరు రకాల ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంటుంది. వాటినే 1. నేత్ర ప్రత్యక్షము, 2. ఘ్రాణ ప్రత్యక్షము, 3. రసన ప్రత్యక్షము, 4. శ్రోత్ర ప్రత్యక్షము, 5. త్వక్ ప్రత్యక్షము, 6. అంతరేంద్రియ ప్రత్యక్షము అనంటాము.
గమనిక : అంతరింద్రియము అన్నదానికి వివిధ జ్ఞాన సిద్ధాంత కారులు మనసు అని ఒకరు,బుద్ధి అని ఒకరు, చిత్తమని ఒకరు ఇలా పేర్లు పెట్టారు. ఏ పేరు సరైంది అన్న విషయంలో వివాద పడకుండానే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా కలుగుతున్న జ్ఞానానికి వేరైన ఆరోరకం జ్ఞానమూ కలుగుతుందన్నది అన్నది మన అనుభవములో ఉన్న విషయమే. కనుక ప్రమాణ క్షేత్రాలను అధ్యయనం చేయదలచిన వ్యక్తికి ఏఏ ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తాయి అన్న విషయం స్పష్టంగా అవగాహనై ఉండాలి.
మిత్రులారా! ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తున్నాయో మీమీ అనుభవాలు పరిశీలించి రాయండి. ఆరవ రాశిగా ఏఏ విషయాలు తెలుస్తున్నాయోనూ రాయండి.
గమనిక: ప్రమాణ విద్యను నేర్వదల్చుకున్నవారు ఈ విషయములను ఇతరుల నుంచి స్వీకరించటం అంత మంచిది కాదు. క్షేత్ర దర్శనం చేస్తూనే వాటిని గురించిన అవగాహన పొందాలి. కనుక ఎవరికి వారుగా ఈ పరిశ్రమ చేయండి.
''యేనేంద్రియేణ యావ్యక్తిర్‌గృహ్యతే, తేనేంద్రియేణ తద్గతాజాతిః తదభావచ్ఛ'' అంటే ఏ ఇంద్రియముల ద్వారా ఒకటి ఉంది అని తెలుస్తుందో, అది లేదు అనికూడా ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంది. అది ఏ జాతికి చెందిందన్నదీ ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంటుంది.
భ్రమ :
భ్రమ అంటే తప్పు జ్ఞానమని అర్థం. ఉన్నది ఉన్నట్లు కాక మరోలా అనిపించటం, ఏమీ లేకుండానే ఏదేదో ఉన్నట్లు అనిపించటం అని భ్రమలు రెండు రకాలు. ఇందులో రెండో రకమంతా మానసిక భ్రమల క్రిందికే వస్తుంది. ఈ రకాన్ని ఆంగ్లంలో హెల్యూషినేషన్ అని తెలుగులో భ్రాంతి అని అంటున్నారు.
భ్రమ, మిధ్యాజ్ఞానం, విపర్యయం, భ్రాంతి, అవిద్య, అసత్యం, తప్పుజ్ఞానం, బాధిత జ్ఞానం లాంటి పదాలన్నీ ఒకే అర్థాన్నిచ్చే మాటలే.
మనో వైజ్ఞానిక క్షేత్రాలలో ఇల్యూషన్, హెల్యూసినేషన్, డెల్యూషన్ అన్న పదాలు వాడుతున్నారు. అవన్నీ కూడా పైన మనం చెప్పుకున్న అర్థాన్ని తెలిపేటివే. వాటన్నింటి సారాంశం తప్పు జ్ఞానం అన్నదే.
ఓ ఈ భ్రమలన్నింటినీ విపులంగా అర్థం చేసుకోవాలన్నా, విడివిడిగా అర్థం చేసుకోవాలన్నా ఆ భ్రమను అలా తప్పు జ్ఞానం కలగడానికి జ్ఞానం ఏర్పడుతున్న క్రమంలో ఇమిడిఉండే వాటిలో ఏది ముఖ్య భూమికను పోషిస్తున్నదో దాని కారణంగా కలుగుతున్న భ్రమ అనంటున్నాం. మండలి దృష్టినుండి తప్పు జ్ఞానం ఏర్పడడానికి కారణాలు నాలుగు గా ఉన్నాయి.
1. బాహ్య కారణాలు : ఇంద్రియాలు సరిగనే ఉండి, మనస్సూ సరిగనే ఉన్నప్పటికీ విషయాలు ఉన్నది ఉన్నట్లుగా అనిపించకపోడానికి గల కారణాలు, ఇంద్రియాలకు సమాచారం చేరేలోపునే ఉన్నట్లయితే అట్టి వాటిని ఆయా భ్రమలకు బాహ్యకారణాలు అనంటాము.
నేత్ర భ్రమలు : కంటి ద్వారా తెలియబడే ఎన్నో విషయాలలో బాహ్య కారణాల వల్లనూ భ్రమలు కలుగుతుంటాయి. ఉదా: 1. నీటిలో సగం వరకుముంచిన కర్ర వంగినట్లుండడం, 2. తారు రోడ్డుపైన మంచి వేసవి కాలములో మధ్యాహ్నం పూట నీరున్నట్లు కనిపించటం, 3. నదిలో ప్రయాణిస్తున్న వారికి గట్టుమీద చెట్లు కదులుతున్నట్లు అనిపించటం, 4. ఒక వస్తువును కుంభాకార, పుటాకార, అసమతల అద్దాలలో నుండి చూసినప్పుడు ఆయా వస్తువులు, దృశ్యాలు ఉన్నది ఉన్నట్లుగా కాక మరోలా కనిపించడం, 5. సమాంతర రేఖలు వంకరగాను, సమాన నిడివి ఉన్న రేఖలు చిన్నా పెద్దగా అసమానంగానూ, ఒక పెద్ద వృత్తంలో ఒక దానికంటే మరొకటి చిన్నగా ఉన్న అనేక వృత్తాలు, ఒకే సర్పిలాకారంగానూ అనిపించటం లాటివన్నీ బాహ్య కారణాల వల్ల కలిగే నేత్ర భ్రమల క్రిందకి చేరతాయి. రంగులకు సంబంధించిన భ్రమలూ ఈ కోవకు చెందినవి కొన్ని ఉన్నాయి.
ఇంద్రియ లోపాల కారణంగా కలిగే భ్రమలు :
1. రాత్రిపూట దూరాన ఉన్న లైట్లు, అవి ఉన్నవి ఉన్నట్లుగా కాక, రెండుగా గాని, పొడుగ్గానో, వెడల్పుగానో గాని కనిపించటం.
2. దూరదృష్టి, హ్రస్వదృష్టి కారణంగా కలిగే భ్రమలు.
3. రంగుల్ని యథాతథంగా గమనించలేక పోవడం - కంటి అద్దాల వల్ల నేల ఎగుడుదిగుడుగా అనిపించడం.
4. సినిమా తెరపై మనకు రకరకాల కదలికలు కనిపిస్తుంటాయి. నిజానికక్కడ స్థిర చిత్రాలే ఉంటాయి కనుక చలనచిత్రంలోని చలనరూపాలన్నీ భ్రమ రూపాలే.
శ్రోత్ర భ్రమలు : 1. స్టీరియో శబ్దాలు వింటున్నప్పుడు రెండు వైపుల నుండి శబ్దాలు వస్తున్నా తలపై నుండి శబ్దాలు వస్తున్నట్లుండడం, ఒక వైపునుండి వచ్చే శబ్దాలు మరోవైపు నుండి వస్తున్నాయనిపించడం, బాహ్య కారణం వల్ల కలిగే శబ్ద భ్రమే.
2. చెవుల్లోని వినికిడి శక్తి లోపాలు, తేడాల వల్ల ఒకవైపు నుండి వస్తున్న శబ్దం మరోవైపు నుండి వస్తుందనిపించడం ఇంద్రియ కారణంగా కలిగే శబ్ద భ్రమ అవుతుంది.
3. బయట ఎటువంటి శబ్దాలూ లేకుండానే చెవుల్లో హోరు ధ్వనులు వినిపించడం.
4. తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించడం, తానెవరితోనో మాటాల్లడుతున్నట్లు అనిపించటం. వశీకరణలో ఉండి హిప్నాటిస్టు ఏదేది వినిపిస్తుందంటే అదంతా వినిపిస్తున్నట్లే అనిపించడం మానసిక కారణంగా ఏర్పడే శబ్ద భ్రమలు. దేవుళ్ళు, దెయ్యాలు మాట్లాడినట్లనిపించటం ఇలాంటిదే.
* త్వగింద్రియానికి సంబంధించిన భ్రమలు :
1. చూపుడు వేలు - మధ్య వేలును మడిచి, రెండు వేళ్ళ కొనల మధ్య ఒక బఠాణీ గింజంత గుండ్రని వస్తువును దేనినైనా ఉంచితే, రెండు వస్తువులున్నట్లు అనిపిస్తుంది. అలాగే చూపుడు వేలు మాత్రమే వస్తువును తాకేట్లు ఉంచితే, మధ్యవేలు వస్తువును తాకుతున్నట్లు అనిపిస్తుంది.
2. ఒక చేతిని అధిక ఉష్ణం కలిగిన నీటిలోనూ, మరో చేతిని అతి శీలంగా ఉన్న నీటిలోనూ కొద్దిసేపు ఉంచి తరువాత ఒక బకెట్టులోని నీళ్ళలో ఆ చేతులనుంచితే ఒక చేతి స్పర్శ ద్వారా బకెట్లో చల్లని నీళ్ళున్నట్లు, మరో చేతి స్పర్శ ద్వారా వెచ్చని నీళ్ళున్నట్లూ అనిపిస్తుంది. ఇదీ స్పర్శకు చెందిన భ్రమే.
3. హిప్నటైజ్ చేసిన వ్యక్తిని మేకుల పడకపై పరుండబెట్టి నీ విప్పుడు పరుపుమీద పడుకున్నావని ఆదేశమిస్తే, అతనికి పరుపుమీద పడుకున్నట్లే అనిపిస్తుంది. ఇది స్పర్శకు సంబంధించిన మానసిక కారణంగా ఏర్పడ్డ భ్రమ (భ్రాంతి అవుతుంది).
* జిహ్వ భ్రమలు (రుచుల భ్రమలు) :
1. పడపత్రి ఆకు నమిలి కొద్దిసేపయ్యాక పంచదార తింటే, తీపి అనిపించదు. చప్పగా ఉందనిపిస్తుంది. నాలికపై ఇసుక ఉన్నట్లనిపిస్తుంది.
2. అతి తీపి పదార్థాలు, అతి ఉప్పని పదార్థాలు తిన్నాక వెంటనే సాధారణ మధుర పదార్థాలు లేదా కాఫీ టీ లాటివి తీసుకుంటే చప్పగానో, అతి తీపిగానో ఉన్నట్లు అనిపించడం రుచికి సంబంధించిన భ్రమలే.
3. హిప్నటైజ్ చేసి ఒక వ్యక్తిచేత మిరపకాయ తినిపించి అది తీపిగా ఉందన్న ఆదేశమిస్తే అతనికది తీపిగానే అనిపిస్తుంది. అది రుచివిషయమైన మానసిక భ్రమ (భ్రాంతి) అవుతుంది.
4. జ్వరం వచ్చినప్పుడు ఏదితిన్నా చేదుగా అనిపించడం ఇంద్రియం కారణంగా జరిగే భ్రమే.
5. ఉసిరి కాయ తిన్నాక మంచినీల్ళు తాగితే అవి తియ్యగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది రసాయనిక భ్రమ.
ఘ్రాణ భ్రమలు :
1. ముక్కు చెడిపోయినప్పుడు వాస్తవంగా ఉన్న వాసనలు లేనట్లు అనిపిస్తుంటుంది.
2. హిప్నటైజ్ చేసి వేరువేరు వాసనలున్నట్లు భ్రమలు కల్పించవచ్చు.
మానసిక భ్రమలు : దేవుడు కనపడడం, దయ్యాలు కనపడడం, మాట్లాడడం, లాటివన్నీ మానసిక భ్రమలే.
ఉదా :- 1. దినకరన్ గారికి హాస్పటల్ పార్కులో ఏసుకనపడి ప్రక్కనే కూర్చుని అనేక విషయాలు మాట్లాడాడనిపించడం.
2. రంజిత్ ఓఫీర్‌గారికి నిత్యం ఏసు మాట్లాడుతున్నాడనిపించడం
3. పోలేరమ్మలు, దేవరలు పూనడం లాటి పూనకాలన్నీ మానసిక భ్రమలే.
ఓ రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలు :
1. గంజాయి, నల్లమందు లాటి మాదక ద్రవ్యాల వల్ల గాలిలో తేలిపోతున్నట్లు, దారి ఎగుడుదిగుడులుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అలాటి వాటిని రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలంటారు.
గమనిక :- భ్రమలకు ఎన్ని రకాల కారణాలుండే వీలుందన్న విషయంపై శాస్త్రీయ పరిశోధనలెన్నో జరిగాయి. జరుగుతున్నాయి కూడా. కనుక ఈ జాబితాకు ముగింపంటూ పెట్టుకోనక్కరలేదు. ఎన్ని రకాలుగ భ్రమలుండే వీలుందో అర్ధం చేసుకుని, అవి ఏర్పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్త లేమిటో తెలిసికుని, వినియోగించుకోవడం అలవరచుకుంటే జీవితంలో తరచుగా తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉంటుంది.
* 'భ్రమలు - వాటికి కారణాలు' అన్న వాటి గురించి కొంత వరకు విచారించు కున్నాం. ఇక వాటి నివారణోపాయాలను గురించి తెలుసుకోవలసి ఉంది.
1. బాహ్య కారణాల వల్ల కలిగే భ్రమలు కలక్కుండా చూసుకోవడానికి 1. ఇంద్రియార్థ సన్నకర్షను బలంగా, ప్రగాఢంగా ఉండేలా చూసుకోవడం 2. పెక్కింద్రియాలను వాడడం ద్వారా తెలియబడే దానిని గురించిన స్పష్టత ఏర్పరచుకోవడం 3. ఆయా విషయాలలోని గుణాలననుసరించి వాటికి ఉండే సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకుని (అర్ధక్రియా కారిత్వ మంటారు దీనినే) అట్టివి ఉన్నాయో లేదో చూసుకోవడం వలన, బాహ్య పరిస్థితులను చక్కజేయడం వలన వాటిని నివారించుకోవచ్చు.
2. ఐంద్రియిక దోషాలనే కారణాలను, ఇంద్రియాలు దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఐంద్రియిక కారణాలను పరిష్కరించుకోవచ్చు.
3. రసాయనాలవల్ల ఏర్పడే భ్రమలనైతే రసాయనాల ప్రభావం పడకుండా చూసుకోడం ద్వారా సరి చేసుకోవచ్చు.
4. మానసిక భ్రమలకు అనేక కారణాలుండే వీలుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా ఉండడం, మూఢనమ్మకాలు లేకుండా జాగ్రత్తపడడం, అతి ఆవేశానికి లోనుగా కుండడం, ఆత్మాధిక్యతకుగానీ, ఆత్మన్యూనతాభావానికి గానీ లోను కాకుండడం లాటి వన్నీ మానసిక భ్రమలు కలగకుండా ఉండేందుకు పనికి వచ్చేటివే. శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవడం, శాస్త్రీయ పద్దతిని వినియోగించుకోవడం అన్నరెండూ మానసిక భ్రమలు ఏర్పడకుండా ఉండేందుకు దోహదపడుతాయి.
No comments:
Post a Comment