Thursday, March 23, 2017

రంజిత్‌ ఓఫీర్‌ - నేను (సురేంద్ర)



ఓఫీర్‌గారిని, నన్నూ శ్రద్దగా పరిశీలిస్తున్న పాఠకమిత్రులారా!

ఈ మధ్య హైందవ క్రైస్తవంలోని వివిధ విషయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నై.

1. భారత్‌ టుడే - ఛానల్‌లో 'ఓ హిందూ మేలుకో అన్న పేరుతో ప్రసంగాలు, గోష్టులు జరగడం మెదలైంది. మరోవంక 'హిందూ ధర్మాచార్య ప్రతిష్టానమ్‌' పేరుతో ఆరంభమైన త్రిమతాచార్య పీఠాల మరియు వివిధ హైందవ సంప్రదాయాలకు చెందిన సాధు సన్యాసుల ఐక్యవేదిక నుండీ హైందవ క్రైస్తవం పుస్తకం పై విశ్లేషణాత్మక విమర్శ ఆరంభమైంది. హిం.ధ.ప్ర (హెచ్‌.డి.పి) సంస్ధ ఆరంభవేదిక నుండీ, చినజీయ్యరు స్వామివారు, సుభుదేంద్ర తీర్ధస్వామి వారు, పరిపూర్ణానంద స్వామివారూ హిందూ గ్రంథాలలో ఏసున్నాడు, మహమ్మదున్నాడు లాంటి రచనలన్నీ ఎవరు చేసినా అట్టివన్నీ అసత్యాలే, వంచనతో కూడుకున్న ప్రచారాలేనని బహిరంగంగా ప్రకటించారు. అలాంటి రచనలు చేసిన క్రైస్తవ, ఇస్లాం మత ప్రచారకులు సత్యాసత్య విచారణకు సిద్దపడితే పండిత సభను ఏర్పాటు చేస్తామనీ ప్రకటించారు. అలాటి రచనలు కొన్ని క్రైస్తవ సంస్ధలనుండీ ముఖ్యంగా 1. గుండా బత్తిని, 2. రంజిత్‌ ఓఫీర్‌ గార్ల నుండి వచ్చాయి. ఇతర క్రైస్తవ ప్రచారకులలో చాల మంది వీరి రచనలను ఎత్తి రాస్తున్న వారే. ఇక ముస్లింలకు చెందిన వారిలో 1) జాకీర్‌ నాయక్‌ 2) సత్య సందేశ కేంద్రం వారూ, వారిని అనుసరిస్తున్నవారూ ఈ రకమైన ప్రచారాలకు గడంగుతున్నారు. ఈ రకానికంతటికీ వేద ప్రకాశ్‌ ఉపాధ్యాయ గారి రచనలు, శ్రీ వాత్సవ గారి రచనలూ ఆధారంగా ఉంటున్నాయి.

ప్రస్తుతాంశం ఏమంటే, ఈ రకమైన పెడపోకడ పోతున్న వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరైనా ఆయా గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితులతో చర్చకుగానీ, పరిశీలనకుగాని సిద్దం కాకుండా, వాటి గురించి ఏమీ తెలియని అమాయక జనం ముందు విపరీతంగా వీటిని ప్రచారం చేస్తూ జనాన్ని తమతమ మతాలలోకి మరలించుకుపోయే పని చేస్తున్నారు. ఇక్కడికిదే ఒక అనైతిక చర్య. కుటిలపన్నాగం. గొప్ప ఆశ్చర్యకరమూ, హాస్యాస్పదమూ కూడా అయిన విషయ మేమంటే ఈ గుంపంతా సత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నట్లు మాట్లాడుతుంటారు. నటిస్తుంటారు. సామాన్య జనుల ముందరా, తాన అంటే తందాన అని వంతపాడే సొంతమంద ముందరా తెగపెట్రేగిపోతుంటారు. ఒకరు సత్యంలోకి రండంటారు. మరొకరు సత్య సందేశం అంటారు. ఇంకొకరు నిరంతర సత్య సంస్ధానాభి లాషి నంటారు. అంతా తామంతా సత్యం కోసమే పుట్టినట్లు తెగ ప్రదర్శించుకుంటుంటారు.

ఏ విశ్వాసికీ తాము విశ్వసిస్తున్న విషయాన్ని గురించి వాటికివేరైన వాటికి వేరైన గురించీ సత్యాసత్యాలంటూ మాట్లాడే అర్హతే ఉండదన్న ప్రాథమిక నియమమే అవగాహనలోలేని ఈ రకం వారి మాటలు మాత్రం మహా జ్ఞానుల మాటలనుమించి ఉంటుంటాయి. నిజంగా వైదిక సాహిత్యాన్ని చదవవలసిన రీతిలో, చదవవలసినంత చదవకుండానే తెలిసిన వాళ్ళమల్లే ప్రసంగాలలో తెగ రెచ్చిపోతుంటారు.

1. జాకీర్‌ నాయక్‌ - శాంతి సందేశం పేరిట ఎంత దుర్మార్గపు పాత్రపోషించిందీ నిఘా విభాగాలు ఈ మధ్య వెళ్ళడి చేశాయి. అయినా అతగాణ్ణి అల్లా రక్షించనూలేదు. తన తిప్పలేవో తానుపడుతూ తప్పించుకు తిరుగుతున్నాడతడు. అతగాని వెంట పడిపోయే మంద చాలా మంది ఇస్లాంలో ఉన్నారు. అలాగే అతణ్ణి అంగీకరించని సాంప్రదాయ ఇస్లాం. పండితులూ చాలా మంది ఉన్నారు. అతడూ పైన నేను చెప్పిన వేద ప్రకాష్‌ ఉపాధ్యాయ, శ్రీవాత్సవ పుస్తకాలను పట్టుకునే హిందూ గ్రంధాలలో ముహమ్మద్‌ ఉన్నాడంటూ ప్రసంగాలు చేశాడు. ఖురానును సాంప్రదాయంగా అధ్యయనం చేసిన వాళ్ళకు తెలుసు జాకీర్‌ నాయక్‌ చేస్తున్నపని, ఖురాన్‌ ప్రకారం చేయకూడనిదనీ, నరకానికి దారి తీస్తుందనీ అయినా వాళ్ళు వాస్తవాలు మాట్లాడరు. మౌనంగా ఉంటారు. ఎక్కడన్నా ఒకడు అదేమిటన్నా, వీరు దానిని పట్టించుకోరు. ఈనాడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలలో మీ గ్రంథాలలో మా ముహమ్మద్‌ అన్న ప్రచారం చేస్తున్న వాళ్ళున్నారు. ఒకరు జాకీర్‌ నాయక్‌ను అనుసరించేవాళ్ళు, మరొకరు సత్య సందేశ కేంద్రం నుండి వెలువడ్డ రచనలను ఆధారం చేసుకుని ప్రసంగాలు చేస్తున్నవారు షిరాజుఅహ్మద్‌, షఫీ, ఇమ్రాన్‌, ఫజులూర్‌ రహ్మాన్‌, ముస్తాక్‌ అహ్మద్‌లూ, వారి అనుయాయులూ ఈ ప్రచారం చేస్తున్నవారుగా ఇప్పటికి నా ఎరుకలోకి వచ్చారు. ఒకరిద్దరు పబ్లిషర్సూ ఈ రకమైన సాహిత్యాన్ని ప్రబోదిస్తున్నారు. ఆ వివరాలన్నీ రుజువు అవసరమైన రోజు అందిస్తాను.

ఇస్లాంకు చెందిన వీరందరికి స.మండలి పక్షం నుండి నేను చెపుతున్నదొక్కటే.

మీలో నీతి నిజాయితీగానీ మాటకు కట్టుబడి ఉండే నిబద్దతగానీ, సత్యస్ధాపనోద్దతిగానీ ఉంటే వేదాలలో పురాణాలలో ముహమ్మదు అనే విషయంపై వేద వేత్తలతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో పాల్గొని మీరంటున్నవన్నీ సరైనవేనని నిరూపించడానికి సిద్దంకండి.

1. వేదాలలో ముహమ్మదు 2. ఉపనిషత్తుల్లో ముహమ్మదు, 3. పురాణాలలో ముహమ్మదు ఇది పరిశీలనాంశం

క్రైస్తవ పక్షం


హిందూ గ్రంధాలలో ఏసు అన్న ప్రచారం ఈనాటిదికాదు. ఈనాడు దానికి ప్రసిద్ది కలిగించిన వారిలో పండిట్‌ సి.హెచ్‌. ఫ్రాన్సిస్‌, పరవస్తు సూర్యనారాయణ అన్నవార్లు పెద్ద తరం క్రిందికి వస్తారు. ఆ తరవాత గుండాబత్తిన, అటు పిమ్మట రంజిత్‌ ఓఫీర్‌గార్లు ఈ వాదాన్నెత్తుకుని, చాలా పుస్తకాలు రాసేశారు. అందులోనూ గుండా బత్తిన వారి పుస్తకాలను ఆధారం చేసుకుని చిన్న చితకా ప్రసంగీకులెందరో పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చేశారు. అట్టి వారిలో కణితి అబ్రహాం, సుధాకర్‌, జెపన్సాశాస్త్రి గారిలాటి కొందర్ని మా మిత్రబృందం కలిసి మాట్లాడగా ఆ విషయాలు తమకేమీ తెలియవనీ, గుండాబత్తిని వారి పుస్తకాలు చూసి రాసినవి మాట్లాడినవే అవన్నీ అని నోటిమాటేగాక, చేతివ్రాత ద్వారాను మా వాళ్ళకు తెలియజేశారు. అటు తరువాత మా మిత్ర బృందం గుండా బత్తిని వారిని నేరుగా కలసి, హిందూ గ్రంథాలు నుండి వారు ఉట్టంకించిన మంత్రాలు శ్లోకాల అర్ధం చెప్పమని నిలదీయగా ఆయన చెప్పలేకపోయారు. మరోసారి కూర్చుందామనీ అన్నారని మా మండపేట, రాజానగరం బృందం నాకు చెప్పారు. ఈ విషయంలో గుండా బత్తిని వారికి నేను చెప్పిదేమంటే, మీ రచనలలో మీరు చెప్పిన వాటిలో ఎక్కువ భాగం తప్పుడు వివరణలే అవి అ సత్య ప్రచారాలు మాత్రమే. నా ఈ మాట కాదలచుకున్నా, నిజం కొరకు నిలబడే నిజాయితీ ఉన్నా ఈ సమాచారం అందిన వెంటనే నాకు కబురు చేయండి. విజ్ఞులతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో మీ రాతలు సరైనవేనని నిరూపించండి. లేకుంటే తప్పైందని వప్పుకుని, క్షమాపణలూ చెప్పుకుని, ఆ పుస్తకాలనన్నంటినీ ఉపసంహరించుకోండి.

సూక్తి :- అసత్యాలు చెప్పమని, ప్రచారం చేయమని ఏమతమూ చెప్పదు. జనమే ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మతాల పేరున  అవి చెప్పనివీ ప్రచారం చేస్తుంటారు.

రంజిత్‌ ఓఫీర్‌గారు


మిగిలిన క్రైస్తవ ప్రచారకులకూ, ఓఫీరుగారికీ ఇలాటి రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం విషయంలో ఒక తేడా ఉంది. మీ గ్రంధాలలో మా ఏసు అన్న ఇతర రచయితలెవ్వరూ ఈయన గారిలా సవాళ్ళు తొడగొట్టడాలూ చేయలేదు. ఈయనంతలా, సొంత డబ్బా కొట్టుకునే వారూ అలాగే ముందేమన్నదీ పట్టించుకోకుండా పరస్పర విరుద్దమైన భావాలను ప్రకటించడంలోనూ ఈయనకీయనే సాటి. అలాంటి కొన్ని మాటలు చెప్పుకుంటేగాని, ఓఫీరుగారి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోడం కుదరదు.

1. 10 ఏండ్ల ప్రాయంనుండే ఏసుతో మాట్లాడడం మొదలెట్టానంటాడు. ఏసును వేదాలను తెనుగు చేయించమని 20 ఏండ్లుగా అదే ధ్యాసతో నిరంతరం ప్రార్థించానంటాడు.

2. ఏసు కృపవల్ల ఎన్నో భాషలు మాట్లాడుతున్నానంటాడు - సంస్కృతంలో ఉన్న వేదాన్ని అర్ధం చేసుకోలేక తెలుగు, తెలుగు అనిదేబిరించుకున్నానంటాడు.

3. ఎవరేమన్నా వేదాలు బ్రహ్మాముఖోద్దిష్టాలని నమ్మడమే నా కిష్టం అంటాడు - వేదాలను రుషులే రచించారంటాడు.

4. రంగాచార్యుల వారిని ఏసే పురమాయించి అనువాదం చేయించాడంటారు - రంగా చార్యులవారితో ఆ విషయంలో, ఈ విషయంలో తీవ్రంగా విభేదిస్తున్నానంటారు.

5. హైందవం - క్రైస్తవం నిజానికి రెండు కావంటారు - నీవైనా సత్యం చెప్పు నేను హిందువునవుతా, నేనైనా సత్యం చెపుతాను నీవు క్రైస్తవుడివికా అనీ అంటారు.

6. నేను సాత్వికుణ్ణి అని తన గురించి తానే చెప్పుకుంటారు - నేను చాలా చెడ్డవాణ్ణి నా జోలికి రాకండనీ అంటారు.

7. తనను చంపిన వాళ్ళనూ క్షమించాడు ఏసు అనంటారు - దిగిరాతండ్రీ! భూకంపాలు, ఇళ్ళు నేలమట్టాలు చేసేయ్‌ అనీ అంటారు.

8. ఒక ప్రక్క తెగ శక్తి ఉన్నవానిమల్లే శాపాలు పెడుతుంటారు - మరో ప్రక్క దిగిరాతండ్రీ! వచ్చి వీళ్ళను దుంప నాశనం చేసేయ్‌. నీవు రావాల్సిందే. రాకుంటే ప్రాణాలు తీసుకుంటాం అని దేబిరిస్తుంటారు.

9. దయానందుని మాటలను ఎత్తిచూపుతూ గుడ్డిగా దేనినీ నమ్మకూడదు. అనేక విధాల పరీక్షించుకున్నాక, నిగ్గుతేలినవాటినే స్వీకరించాలని ఒక చోట చెప్పి, మరో పుస్తకంలో నమ్మడం మినహా మరో దారిలేదు. నమ్మబుద్దికాకున్నా నమ్మాల్సిందే, అసంబద్దంగా అనిపిస్తున్నా నమ్మల్సిందేనంటూ పూర్తి విరుద్దమైన మరో పాటందుకుంటారు.

10. 1 గంట ప్రసంగం చేశారనుకుంటే 40 శాతం ఆత్మస్తుతి - సొంత డబ్బా- చేసుకుంటారు. మరో 40 శాతం అసందర్భము, అప్రస్తుతము, అప్రధానమూ అయిన విషయాలే మాట్లాడుతుంటారు. మిగిలిన 20 శాతంలో కూడా ఎక్కువభాగం చెత్తే ఉంటుంది.

11. సింహాన్ని నిద్రలేపుతున్నావ్‌, నిద్రలేపావ్‌, ఇక నేనూరుకోను, అది చేస్తాను ఇది చేస్తాను, సిద్దంగా ఉండండని అంటారు. నాకు టైంలేదు. అనొకసారి, మీరునాకు సరిపోరని ఒకసారి, మీ సంగతి పట్టించుకోనని ఇంకోసారి ఇలా రకరకాలుగా ప్రసంగిస్తుంటారు.

12. కుస్తీకి సవాల్‌ అనంటారు - సరేరమ్మంటే ముందు నన్ను కొడతానికి నీ దగ్గర ఏమేమిపట్లున్నాయో వివరంగా నాకు తెలియజేయి. వాటిని చూశాక నీతో పోట్లాడాలో లేదో తెల్చుకుంటానంటారు.

13. భారత దేశానికి సవాలంటూనే - నేను సవాళ్ళ మనిషినికాదు. సవాళ్ళెందుకండీ!! నిజాన్ని ప్రకటించండి నిజమైతే అంగీకరించి వాగ్దానానికి కట్టుబడి ఉంటానంటారు.

14. నేనేవరికీ భయపడను. నన్నెవరూ భయపెట్టలేరు అనంటూనే, నా జొలికి రావద్దు. నేను చెడ్డవాణ్ణి పులిని సింహాన్ని అది చేస్తాను, ఇది చేస్తాను, ఎవర్నీ వదల్ను అని భయపెడుతూ, బెదిరిస్తూ మాట్లాడేస్తారు.

15. వేదరుషులెరిగిన ఏసు అనంటారు - దేవుడెవరో తమకు తెలియదని రుషులే ప్రకటించారంటారు.

16. ముస్లింలతో గొడవ పడుతూ, బైబిలు, ఖురానులలో ఒకే దేవుణ్ణి గురించి చెప్పబడిందంటూ 99% వివరాలు సరిపోయినా అల్లా - ఎహోవా (ఎలోహిం) అన్నతేడా ఉన్న రెండు గ్రంధాలలోని దేవుడొక్కడేనని నేనంగీకరించను అంటాడు. వేదాల దగ్గర కొచ్చేటప్పటికి ఏసు, ఎహోవా పేర్లు ఎందుకుంటాయండీ? రెంటిలోని వివరాలు పోలుతున్నాయి కాని అని, వేదాల్లో చెప్పబడింది ఏసేనని రుజువు చేశానంటారు. అంగీకరించమంటారు.

17. తెలుగులో లేకుంటే అర్ధం చేసుకోలేనంటూనే, రంగాచార్యులకూ, వేదరుషులకు - భాష్య కారులకూ అర్ధం కాని - కనపడని - విషయాలూ తన కర్ధమైనయ్‌ అనంటారు.

పాఠకమిత్రులారా! ఈ రచన చదువుతున్న ఓఫీర్‌ భక్తులారా! ఇలాటివి ఇంకేన్నోఆయన రచనలు ప్రసంగాలనుండి ఎత్తి చూపవచ్చు.

18. ఏసు వేదాలలో ప్రతి పేజీలో దర్శనమిచ్చాడంటారు. అక్కడక్కడా ఉంది ఏరుకుని కూర్చుకోవాలని మరోమాటంటారు.

19. 30 సం|| తన తపస్సు ఫలితంగా ఈ సత్యాన్ని పరాత్పరుడు బయట పరచాడంటారు. వేదరుషులకు తన గురించిన సత్యాన్ని బయలుపరచకుండా ఎందుకుంటాడు అనీ అంటారు.

ఈ సంచిక వరకు ముగింపుగా రెండు మాటలు :

అయ్యా ఓఫీరుగారూ! అస్సలు మన మధ్య నున్న వివాదాంశం ఏమిటండీ? మీరు హైందవ క్రైస్తవంలో ఉట్టంకించిన 115 మంత్రాలకు వేదం తెలిసిన వారంగీకరించే అర్ధమేమిటి? అన్నదేకదా! లేదా! ఆ మంత్రాలకు మీరన్న అర్ధం వస్తుందా? రాదా? అనైనా చెప్పుకుని దానిని విచారణ చేయవచ్చు. ఇంత సరళమైన విషయాన్ని పరిశీలించడానికి, స్థాయిలు, సముజ్జీలు లాటి గొడవలెందుండీ! ఆ మంత్రాల అర్ధమేమిటన్నది ఎలా నిర్ణయించుకోవాలో, నిర్ణయించుకోగలమో మీరే తేల్చి చెప్పండి. ఇంత సులభంగా పరిష్కరించుకోగలిగిన దానిని పీటముడుల వ్యవహారంగా మార్చారెందుకు?

2. అలా కాదనుకుంటే, ఎందుకన్నారో ఏమోగాని భారతదేశంలోని ధర్మాచార్యు లందరకూ సవాలన్నారు కనుక, బహిరంగ సవాలు విధివిధానాలననుసరించి పోటీకైనా సిద్దంకండి. పోటీకి తగినవారా కాదా నిర్ణయించాల్సింది మీరు కానే కాదు. అంతేకాక, పోటీలో నీవు ఎలా పోరాడతావో ముందే నాకు చెప్పమని మీరే అడగడమంత తెలివి తక్కువ తనం మరోటుండదు. మీసవాలులో అర్హతానర్హతల ప్రస్తావన లేదు సరికదా వేదం విషయంలో మీ పక్షపు పట్లన్నీ అనువాదకుని ఆసరాతో నిలబడినవే. కనుక స్వయంగా మీకు వేదార్ధ నిర్ణయంచేసే అర్హతగానీ, శక్తి సామర్ధ్యాలుగాని లేవని మీరే చెప్పుకుని ఉన్నారు. కనుక ఎవరి అర్హత లేమిటన్నదిగానీ, ఎవరు చెప్పింది సబబుగా ఉందన్నది గాని తేల్చవలసింది పోటీలో పాల్గొనే ఇరువురిలో ఎవరూ కాదు. వీరిరువురికి వేరుగా నున్న న్యాయ నిర్ణేతలకే ఆ అర్హత అధికారం ఉంటాయి. పోటీలకు సంబంధించిగాని, వాద ప్రతివాదాలకు సంబంధించి గానీ, ఇది సార్వత్రిక నియమం. ఇది మీకు తెలుసో లేదో మీరే తేల్చండి. చివరిమాట!

మిమ్ములను (మీ గ్రంధాలను, ప్రసంగాలను) జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తున్న నాకు,ఇప్పటికి నా గురించీ, మీ గురించీ అర్ధమైన దానిని బట్టి మీ ఆర్భాటాలు, అట్టహాసాలు, జబ్బలుచరచడాలు, శాపాలు పెట్టడాలు, మీ ఏసును రమ్మన్న మొత్తుకోలులు అన్నీ మనం తారసపడనంతవరకే బ్రతికుంటాయి.

1. యోగ్యులైన విద్వజ్జనుల మధ్యలో సత్యాన్వేషులంగా విషయ విచారణ చేద్దామన్నా;

2. కాదుకూడదంటూ పోరాటంలోనే తేల్చుకుందాం నువ్వోనేనో అని అనాలనుకున్నా నేను సిద్దం.

గమనిక : స్థాయి అర్హతలన్నవీ పరిగణించాలన్న నియమం పెట్టుకోవలసిందే అని మీరన్నా నా కభ్యంతరం లేదు. మనం ఎంచుకున్న నిర్ణేతల ముందు నా స్థాయి, సామర్ధ్యాలకు చెందిన సమాచారం నేను పెడతాను, మీ వివరాలు మీరూ ఇవ్వండి. న్యాయ నిర్ణేతలు తేలుస్తారు ఎవరి స్థాయి ఏమిటి మీ స్ధాయికి నేను తగను ఈ వివాదం వరకైనా అని వారు నిర్ణయిస్తే ఏమి చేయాలో అప్పుడాలోచిద్దాం. సరిపోతానంటే పోరాటం చేద్దాం. ఒకవేళ నా స్థాయికి మీరే సరిపోరని గాని వారు తేలిస్తే ఏమి చేయాలో, చేస్తారో మీరే చెప్పండి. నా వరకైతే స్థాయిల మాట ప్రక్కనపెట్టి మీతో అప్పుడూ విచారణకు కూర్చుంటాను.

ఎందుకంటే, మండలి విధానంలో, తనకంటే అధికులతోనూ, సములతోనూ, చిన్న వారితోనూ కూడా మాట్లాడుతుండాలన్న నియమం ఉంది కనుక. అనవసరపు ప్రస్తావనలనాపి, హైందవ క్రైస్తవం పై విచారణకు సిద్దం కండి.

సత్యాన్వేషణలో  - సురేంద్ర


No comments:

Post a Comment