Friday, December 15, 2017

మతసామరస్యం - మత సహనం

 మత సామరస్య మన్నది చాలా చాలా పెద్ద మాట. వద్దికతో మనస్సుకు ఎంత బుద్ది చెప్పుకున్నా ఆచరణ సాధ్యం కాని మాట. ఎందరో దేశభక్తులైన మేధావులు మత వైషమ్యమనే వాస్తవ సమస్యను గుర్తించి దానికి పరిష్కారంగా మత సామరస్యం అన్న భావనను ప్రవేశపెట్టారు. ప్రజల హృదయాలలో ఆ భావన దృఢంగా నాటుకునేలా చేయాలని శక్తికిమించిన ప్రయత్నాలెన్నో చేస్తూ వచ్చారు. గట్టిగా కృషి చేస్తే అది సాధ్యమేనన్న భ్రమను మాత్రం కొందరు ఆలోచనా పరుల్లో కలిగించగలిగారు. వారలా భ్రమకు లోనవడానికి కొన్ని వాస్తవ పరిస్థితులూ దోహదపడ్డాయి. కారణాలయ్యాయి. అందులో అతిబలమైంది భారతీయ బహుదైవారాధన సంస్కృతి. భారతీయ ఆస్తిక చింతనలోనే అనేక దేవీదేవతలున్నారు. వారికి ఎవరిస్థాయిలో వారికి తరతమ భేదాలతో శక్తులుంటాయి. పైగా ఒక్క దేవత ఒక్కొరకమైన ఇష్టాఇష్టాలతో కూడి కొన్ని రకాల పనులకు అభిమాన దేవతగా ఉంటారు. వారంతా మిత్రులుగానే ఉంటూ పరస్పరం సహకరించుకుంటూ ఎవరి పనుల్లో వారుంటుంటారు. వారిలో వారు ఒకరికొకరు ఉత్తరోత్తరా అధిక సామర్ధ్యము ఈశ్వరీయ విశ్వవ్యవస్థలో అధిక హోదా కలిగి ఉంటారు. లాటి భావాలు (విశ్వాసాలు) పోతపోసిన ఉక్కులా గట్టిబడిఉన్నాయి. నూటొక్క దేవుళ్ళకు నూటక్క దండాలు అన్న దృష్టి బలంగా నాటుకుపోయి ఉంది. దైవం వివిధ అవసరాల రీత్యా వివిధ రూపాలలో అవతారాలనుధరిస్తుంది. అంశావతారాల పేరున చిన్న చిన్న చిల్లర దేవతలూ పుట్టుకొస్తుంటారు లాటి భావాలన్నీ ఈ దేశ ఆస్తిక జన సమూహపు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. కనుకనే, ప్రకృతినీ దేవతగా ఆరాధించారు, రకరకాల జీవజాతుల్ని దేవతలుగ ఆరాధించారు, అసాధారణ లక్షణాలను, సామర్ధ్యాలను కనబరచిన మానవులనూ అవతారులుగ భావించి పూజించారు. ఒక వంక దేవుడొక్కడే అంటూనే, ఈ వివిధత్వాన్ని జీర్ణించుకుని, మనమంతా ఒక్కటే, విశ్వాసాలు ఎవరిష్టంవారిది అన్న పోకడకు అలవాటు పడిపోయారు. అదిగో ఆ అలవాటే, వారిలో మతసామరస్యం ఆచరణ సాధ్యమేనన్న భ్రమకుకారణమైంది జరిగిన పొరపాటెక్కడంటే, బహుదైవారాధన సరైందేనన్న భావాన్ని అంతస్సూత్రంగా అంగీకరించిన వారి మధ్య మత వైషమ్యానికి తావుండదు. మత సహనానికే గాక, పరమతాలను గౌరవించడానికీ అడ్డు ఉండదు. బహుదేవతలువాస్తవం అనుకుంటూ ఒక్కొక్కరూ, ఒక్కో కుటుంబము కూడా అనేక దేవతలను పూజించడానికి అలవాటుపడ్డ భారతీయుని హృదయం రక్త సంబంధీకులలో, కుటుంబ సంబంధీకులలో, ఇరుగుపొరుగు సంబంధీకులలో నెలకొని ఉన్న వివిధ దైవారాదనలను గమనిస్తూనే జీవిత సంబంధాలలో, సామాజిక సంబంధాలలో సామరస్య ధోరణి అలవరచుకోడమేగాక, అదొక సాంప్రదాయంగా, సంస్కృతిగానూ వంటబట్టించుకుని ఉన్నారు ఇక్కడి సామాన్యజనం కూడా. ఈ సామరస్య ధోరణే మత సామరస్యం సాధ్యమేనన్న భ్రమకులోను చేసింది వారిని. నిజానికిక్కడ జరిగింది మత సామరస్యం కానే కాదు. మన ప్రస్తుతాంశం, బహుదైవారాధన సరైందేనని అంగీకరించి, ఆ అనేక దేవతలమధ్యనూ స్నేహ సంబంధాలున్నట్లున్న గ్రంధ్రాలను చదివి, ప్రసంగాలను విని, ఒకే కుటుంబంలో ఈ కుటుంబంతనది ఇందులోని వాళ్ళు తన వాళ్ళు అనుకుంటూ, వారి సుఖం తన సుఖంగా, వారి దుఃఖం తన దుఃఖంగా తలంచుతూ బ్రతుకు సంబంధాలలో ఉన్నవారి మధ్య నెలకొన్న సామరస్యాన్ని గురించింది కాదు. తమ దేవుడే అసలు దేవుడు. మిగిలిన వాళ్ళు దేవుళ్ళంటున్నది దేవుళ్ళు కాదు. దయ్యాలు. పైగా తమ దేవుణ్ణో, తమ ప్రవక్తనో, తమ బోధకుణ్ణో అంగీకరించనివాళ్ళు తమకు శతృపక్షంలోని వారే. వారు తమ మార్గంలో కన్నా రావాలి, లేదా అణగిమణిగైనా ఉండాలి. లేదా చావుకు సిద్దపడాలి అని బండగా, మొండిగా నిలబడి ఉన్న మతం వాళ్ళతో సామరస్యం సాధ్యమా కాదా అని మాట్లాడుతున్న సందర్భం ఇది. ఖురాను ప్రకారం యూదులూ, క్రైస్తవులూ ముస్లింలకు శతృపక్షం. ఇక బహుదైవారాధకులు, విగ్రహారాదకులైతే ఖురానుకూ, బైబిలుకూ కూడా శతృపక్షమే. ఈపచ్చి నిజాన్ని గమనిస్తేనే పై శీర్షికాంశం అర్ధమవుతుంది. మత సామరస్యం సాధ్యమేననుకున్న వాళ్ళలో అప్జల్‌ గురు - అస్పుల్లాఖాన్‌ లాటి వారూ, కులదీప్‌ నాయర్‌, సరిహద్దు గాంధీగా పేరుగాంచిన వాళ్ళూ ఉన్నారు. ఇక గాంధీ అయితే, హిందూ ముస్లింల మధ్య సోదర బావాన్ని నెలకొల్పడానికి, సమన్యాయమన్న దానినీ ప్రక్కన బెట్టి, ముస్లింలను బుజ్జగించేపనినీ హిందువులను కట్టడి చేసే పనికీ కూడా సిద్దపడ్డాడు. గాంధీ అయితే తన అంతిమ దినాల్లో తాను విఫలమయ్యానన్న విషయాన్ని గమనించాడు కూడా. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోడానికే చాలా మనోవేదననుభవించాల్సి వచ్చిందాయనకు. అటు తరవాత ఈ యత్నంలో విఫలమైనానని గుర్తించిన వారు కులదీప్‌ నాయర్‌. అయినా, ఈ వాస్తవాల నేమీ పట్టించుకోకుండా పడికట్టుపదంలా మత సామరస్యాన్ని గురించి మాట్లాడే కుహనా మేధావులెంత మందో తయారయ్యారీనాడు. కొద్ది మందైతే నిజాయితీగానే ఇంకా మత సామరస్యం సాధ్యమేనన్న భ్రమలోనే సాగుతున్నారిప్పటికీ. మనుష్యుల మధ్య సామరస్య భావన చాలా బలమైన ఆత్మీయానురాగ బంధాలు నెలకొని ఉంటే గాని సాధ్యపడదు. 'మమ' అన్న భావన అంతరంగంలో - పైపై మాటలలో కాదు - ఘనీభవించి ఉంటేనే సామరస్యం - (సమరసత్వం) ఆచరణలో ప్రకటమవుతుంది. ఇక కరడుగట్టిన రీతిలో 'పర' అన్న భావాన్ని నూరిపోసిన మతాలను నెత్తికెత్తుకున్న వాళ్ళకు స్వమతస్థులకంటే వేరైన మతం వాళ్ళతో సామరస్యం ఎలా కుదురుతుంది? ఇవన్నీ లోతుగా, నిశితంగా పరిశీలించే, ఈ దేశస్థులు ఉమ్మడి విషయాలలో లౌకిక దృష్టి కలిగి ఉండడం, భారత రాజ్యాంగానికి విధేయులై అలా మసలుకోవడం వినా గత్యంతరంలేదన్న వాస్తవాన్ని గ్రహించే మత విశ్వాసాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు చెందిన ప్రాథమిక హక్కుగానూ, ఉమ్మడి తనంలో భారతీయత అన్న దానిని జాతిగా పరిగణించాలన్నది విధిగానూ రాజ్యాంగ సూత్రీకరణల్లో పొందుపరచారు. కనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ, బైబిలు, ఖురాన్‌ ఆధారిత మత ధోరణికి చెందినవారు, తమ గ్రంథం చెపుతున్న దాని ప్రకారం అన్యులైన వారిలో మత సామరస్యం కలిగి ఉండడం సాధ్యంకాదు. కనీసం మత సహనం కలిగి ఉండాలన్నా 1) వారిపై ఖురానుకు వేరైన రాజ్యాంగపు వత్తిడి బలంగా ఉండాలి. 2. లేదా, ఈ విషయం వరకైనా వారు ఖురాను ఆదేశాన్ని ఈనాడు ఆచరణ సాధ్యంకాదని సడివించుకునైనా ఉండాలి. కనుక :- మొదట మత సామరస్యం సాధ్యమన్న భ్రమ నుండి బైటపడితేనే పరిష్కారాలకై వెదకనైనా వెదకవచ్చు ఆలోచించండి.

No comments:

Post a Comment