Friday, December 15, 2017

స్థాయిల గొడవ - ఒక పరిశీలన

ఈ మధ్య ఇస్లాం క్రైస్తవ మత ప్రచారకుల్లో అంతో ఇంతో నోరున్న ప్రతివాడూ స్థాయిల గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతోంది. ఆ రకం వాళ్ళు ఎవరికి వారే తాము మామూలు వాళ్ళం కాదన్నట్లు, అసాధారణుల మన్నట్లు మాట్లాడేస్తున్నారు. కొందరైతే మరికొంత అతికి పోయి ఎదుటివాళ్ళు తమ స్థాయికి తగరనీ, వాళ్ళు నలుసుల్లాటి వారనీ, ఈగలు, చీమలు, దోమల్లాటి వారనీ, వారితో మాకు పోటీఏమిటి? బేటీ ఏమిటి? అంటూ తెగ రెచ్చిపోతూ ప్రకటనలు చేసేస్తున్నారు. ఆత్మస్ధుతీ - పరనిందా చేయకు! వీలైతే ఆత్మ విమర్శ చేసుకుంటుండు! అన్నది ప్రసిద్ది చెందిన బుధజనోక్తి (బుద్దిమంతుల మాట). చక్కగా ఆలోచించి చూస్తే నా ప్రకారం అది సార్వకాలీనమైన విలువ కలిగిన మాట కూడా. మీకే మనిపిస్తోందో ఆలోచించుకోండి. తర్కశాస్త్రంలో ఒక హిత సూచన ఉంది. తర్కాన్ని అభ్యసించే (తెలుసుకునే కాదు) వారు తనకంటే ఉన్నతులతోనూ, సములతోనూ, నిమ్నులతోనూ తర్కిస్తూ ఉండాలి అన్నదే ఆ సూచన. ఏ విషయం పైన అధ్యయనం సాగించే వారైనా పై మూడు స్ధాయిలకల వ్యక్తులతో తన అధ్యయనాంశం పై చర్చ సాగిస్తున్నట్లైతే, తాను ఒక్కడుగా సాగించే అధ్యయనంకంటే ఎంతో లోతైన, విస్తృతమైన స్పష్టతతో కూడిన అవగాహన కలుగుతుంది. విషయాలు తెలుసుకోవాలని గానీ, నేర్చుకోవాలనిగాని నిజంగా తలపోస్తున్న వాళ్ళకీ సూచనలు దివిటీల్లాటివి. తమని చేపట్టిన వారిని దారి తప్పకుండా గమ్యానికి చేర్చేస్తాయవి కానీ ఆత్మాధిక్యతా భావానికి లోనై ఉన్న అహంభావులకివిరుచించవు. కనుక ఈ విషయంలో బ్యాలెన్సులో ఉన్నవారికీ, బ్యాలెన్సుతప్పినవారికీ కూడా వర్తించే విధంగా నాతో ముడిపడిన కొంత సమాచారం అందిస్తాను. మీరూ పరిశీలించి చూసుకొండి. 1. సత్యాసత్యాలు తెలుసుకోడానికి గానీ, తేల్చుకోడానికి గానీ స్థాయీ భేదాలు పట్టిచూడాల్సినపని లేదు. తరతమ భేదాలున్నవారైనా అట్టి విచారణ సాగించి సత్ఫలితాలు రాబట్టవచ్చు. 2. గెలుపు ఓటములు ప్రధాన లక్ష్యంగా చర్చలకు కూచుందామనుకునే వాళ్ళూ స్థాయీ బేధాలను పట్టించుకోనక్కరలేదు. ఎందుకంటే స్థాయిలేని వారు పోటీకి సిద్దమైతే అట్టి వారు పడడమూ మనం గెలవడమూ సులభమే అవుతుంది కనుక. గమనిక :- పై రెండూ వాస్తవాలే అయినా, ఆవేదిక ఎవరెవరిస్థాయి ఎంతెంత? అన్నది ముందే ప్రకటించుకోవాలి అన్న నియమంగాని పెట్టుకుని ఉన్న వేదికైతే, ఇరుపక్షాలూ వారి వారి గతానికి చెందిన సమాచారాన్ని ముందే ప్రకటించడం తప్పేమీ కాదు. తప్పని సరికూడా. ఆ నియమం పెట్టుకుంటేనే చర్చకు కూర్చుంటాను అనే వారెవరైనా ఉంటే ఆ నియమాన్ని స్వీకరించడానికి నా వరకు నాకెట్టి అభ్యంతరమూ లేదు. మన ప్రస్తుతాంశం ఎంపిక చేసుకున్న విషయానికి సంబంధించీ చర్చలకు సంబంధించీ మన మన స్థాయేమిటన్నది సమాచార రూపంలో ప్రకటించడం, పరస్పరం అందించుకోవడం ముందుగా చేయాలన్నదే. అయితే మనం ప్రకటించిన సమాచారం సరైందేననడంగానీ, ఆ సమాచారాన్ని బట్టి ఎవరిస్థాయి ఏమిటన్నది గాని ఎవరు నిర్ణయిస్తారు? ఏ పద్దతిన నిర్ణయించాలి? అన్నదీ తెలియాలికదా! నా అవగాహన ప్రకారం, ఎవరిస్థాయి ఏమిటన్నది తెలుసుకునే పద్దతులు రెండున్నాయి. అందులో తేల్చుకునే పద్దతి ఒకటుంది. తేల్చుకునే పద్దతి దేనికైనా ఒకటే, అది నిర్ధారణ నియమాల ప్రకారం పరీక్షించి నిర్ణయించడమే. వీటికి సంబంధించిన కొద్దిపాటి సమాచారం మాత్రం ఇప్పుడు చెపుతాను. విపుల రూపాన్ని అవసరమైనపుడు - మరోసారి - చెప్పుకోవచ్చు. నీస్థాయేమిటి? నీస్థాయేమిటి? అనే వాళ్ళు, ఎవరికి వారుగా మొదట తన స్థాయిని గురించిన వివరాలను రాత మూలకంగా తెలియపరచుకోవాలి. వాటిని పరస్పరం మార్పిడి చేసుకోడమో, రెంటినీ పరిశీలించి నిర్ధారించే బృందం ముందు పెట్టడమో చేయాలి. నియమం : 1) స్థాయికి చెందిన విచారణంతా సజావుగా జరగాలంటే, ఏ విషయంలో లేదా ఏయే విషయాలలో స్థాయిని గురించి తేల్చుకో గోరుతున్నారో స్పష్టంగా అనుకోవాలి. వివరణ :- మన ప్రస్తుతాంశం 1) చర్చకు కూర్చోడానికి నా స్థాయేమిటి? అతని స్ధాయేమిటి? అన్నదే పి.డి సుందర్రావుగారుగానీ, అతని అనుయాయులుగానీ, రంజిత్‌ ఓఫీర్‌గారు గాని అతని అనుయాయులుగానీ, విజయకుమార్‌, విజయప్రసాద్‌ రెడ్డి మొదలగువారుగానీ ఇస్లాం పక్షంలో జాకీర్‌ నాయక్‌గానీ, అతని అనుచరులుగానీ ఫజులు ర్రహ్మన్‌గారు గానీ షఫీ, ఇమ్రాన్‌, సిరాజుర్రహ్మన్‌ మొ||గు వారుగాని చెపుతూ, అడుగుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఇంతవరకు తీసుకుని చర్చకు సిద్దమవడానికి ఏయే విషయాలలో స్థాయి పరీక్ష జరగాలో చెప్పుకుంటే సరిపోతుంది. ఎ. ఖురాను, బైబిలు, మరో మత గ్రంథం పై చర్చించడానికి, లేదా ఏదైనా సిద్దాంత చర్చ చేయడానికి అని మరికాస్త వివరణ ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇంకాస్త స్పష్టతా వస్తుంది. 1. ఆ గ్రంధాలను అర్ధం చేసుకునేంతవరకు అవసరమైన భాషా పరిజ్ఞానం ఉందా? లేదా? 2. భాషా నియమాల గురించి అతని అవగాహనా స్థాయేమిటి? 3. వాద నియమాల గురించి అతని అవగాహన, అభ్యాసాల స్థాయేమిటి. 4. సత్యాసత్య నిర్దారణకు సంబంధించిన విషయంలో అతని అవగాహనా స్థాయేమిటి? 5. జ్ఞాన సిద్దాంతం విషయంలో అతని అవగాహనా స్థాయేమిటి? అనుభవస్థాయేమిటి? ఎ. ఇంతవరకు వేదిక ఏర్పాటు వేదికలోని పక్షాలు అనుసరించాల్సిన విధి విధానాలు అన్నవాటి విషయంలో ఎవరి అవగాహన స్ధాయి ఏమిటన్నది పరిశీలనాంశాలవుతున్నాయి. 2. ఇక ఎంపిక చేసుకున్న వివాదాంశం, విచారణీయాంశం విషయంలో ఎవరి అవగాహనేపాటిది? అన్నది పట్టిచూడాలి. అయితే ఈ విషయాన్ని ముందస్తుగా ప్రకటించనేకూడదు. ఎందుకంటే ఇదే కదా చర్చా వేదికలో నిగ్గుతేల్చాల్సింది. కాకుంటే వారి వారి వాదానికి, వాదనకు చెందిన కొద్దిపాటి సమాచారాన్ని రెండు పక్షాలూ పరిశీలక పక్షానికి అప్పగించవచ్చు. గమనిక : తమ తమ స్థాయికి చెంది ఇరుపక్షాలూ అందించిన సమాచారం సరైందో కాదో, ఆ సమాచారానికి తగిన స్థాయి వారికి ఉందో లేదో పరీక్షించి నిర్ధారించాకే ఎవరి స్థాయేమిటన్నది తేలుతుంది. స్ధాయిల గురించిన సమస్యకు ఇంతకంటే మంచి ఉపాయం ఉంటే ఎవరైనా చెప్పండి.

No comments:

Post a Comment