ధర్మాచార్యులారా! నేను ఇప్పటి నా మానసిక పరిస్థితిని బట్టి ఏమతానికీ చెందినవాణ్ణి కాదు. అయినప్పటికీ హైందవ క్రైస్తవం అన్న పుస్తకం విషయంలోనూ (అలాటిమరికొన్ని పుస్తకాల విషయంలోనూ) అవన్నీ సత్యాలు కావు సమంజసాలూ కావన్న అభిప్రాయంతో ఉండి మీతో కొంత మేర భావసారూప్యత కలిగి ఉన్నాను. ఈ విషయం మీకూ తెలిసున్నదే. కనుకనే, అలాటి రచనలను తప్పుబట్టే, వాటి విషయంలో అభ్యంతరపడే వ్యక్తులను గమనించి, వారందరినీ హైందవ క్రైస్తవం లాటి రచనలను ఖండించడమో, సత్యాసత్య విచారణకు రమ్మని ఆ రచయితకు కబురెట్టడమో చేయండని నచ్చ జెప్పే పని, నా యోపినంత చేస్తూ వచ్చాను. ఆ క్రమంలోనే మీ సంస్థా, ఆర్య సామాజికులు, జె.వి.వి. నుండి డా.బ్రహ్మారెడ్డిగారు, క్రైస్తవ విశ్వాసంలో ఉంటూనే ఇలాటివి సరైనవి కావని తలంచే పి.డి సుందర్రావు, విజయ ప్రసాదరెడ్డి, జాక్‌రాజు, కనకరాజు గారిలాటి వారూ హైందవ క్రైస్తవం అభ్యంతరకరమైందని బహిరంగంగా ప్రకటించారు. ఆ విషయాన్ని ప్రజలందరకూ తెలుపాలనే సదుద్దేశంతోనే మీ సంస్ధ 'ఓ హిందూ మేలుకో' పేరున ఓఫీరు గారి పుస్తకం పైనే కాకుండా, ''మీ గ్రంధాలలో మా మహమ్మదు'' అంటూ వ్రాసిన ముస్లింలపైనా అభ్యంతరాలను లేవనెత్తి పలు పండిత ప్రకాండులచేతా, మేధావులచేతా ప్రసంగాలు చేయించింది. వీటన్నింటి పర్యవసానంగానే ఈనాడు రంజిత్ ఓఫీరుగారు సత్యనిర్ధారణకుగాను పండితులతో చర్చించడానికి సిద్దపడ్డారు. ఈ విచారణీయాంశం ఎంతో కీలకమైనదీ, సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేయగలదీకూడా అవడం చేత, దీనిపై యోగ్యమైన స్ధాయిలో సమగ్రంగా చర్చ జరగడం దేశ భవిష్యత్తు దృష్ట్యానూ అవసరమైనదవుతోంది. కనుకనే, వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న నాకు, నా బుద్దికితోచిన అభిప్రాయాన్ని మీ దృష్టికి తేవాలనిపించింది. హైందవ క్రైస్తవం పుస్తకంలో రంజిత్ ఓఫీరుగారు ఆయా శీర్షికల క్రింద వెలిబుచ్చిన అభిప్రాయాలలో కొన్నింటిని ఎంపిక చేసుకుని వాటిని శాస్త్రీయ పద్దతిన విచారణకు పెట్టి చూసుకుందాం ఓఫీరుగారు ఒప్పని నిరూపించాల్సిన అంశాలు కొన్ని, ఓఫీరుగారివి తప్పని మనం నిరూపించగల అంశాలు కొన్ని అనుకుని వాటిపై నా వాదనేమిటో మీ మందుంచుతాను. దానిని మీరూ పరిశీలించి చూసుకుని ఓఫీరుగారితో చర్చకు కూర్చొడానికి నేను సరితూగుతానోలేదో చూసుకుని పరవాలేదనిపిస్తే మీ తరఫున చర్చలో నేను (నేనూ) పాల్గొంటానని ప్రకటించండి. నేను లేవనెత్తిన అంశాలలో గానీ, మీరు చర్చించాలనుకున్న మరికొన్ని అంశాల విషయాల్లోగానీ నాకేమైనా సూచనలు చేయాలనిపిస్తే చేయండి. ఆయనతో చర్చకు సిద్దం కావడానికై ముందస్తుగా మనం ఒక సమావేశం ఏర్పరచుకోగలిగితే బాగుంటుంది. ఇదంతా ఎందుకంటే, ఓఫీరుగారి సవాలు ప్రకటన ప్రకారం ఆయన గారితో చర్చకు ఎవరు సిద్దమన్నా, ఆ గ్రంధంలోని ఎంతమేరకు- ఏ విషయంపైన-చర్చకు సిద్దపడినా వారు కాదనకూడదు. అయినా అనేకులు గనక చర్చకు సిద్ధమైతే అదంతా కాలహరణకు, రకరకాల పోకడలకూ దారితీయవచ్చు గనుక, వీలయినంత తక్కువ మందితో చర్చ జరిగితేనే బాగుంటుంది. చర్చలో పాల్గొనే వ్యక్తులు సంస్ధకొకరుంటే సరిపోతుందని నా భావన. అందరూ కలసి యోచించుకుని ఉమ్మడి ప్రతినిధిగా ఒకరిద్దరిని ఎంపిక చేసినా మంచిదే. ఒక పరిశీలక పక్షంలో మాత్రం మీకు అభిరుచి ఉన్న ఈ విషయాలలో సమర్ధులైన పండితుల్ని కూర్చోబెట్టవచ్చు. ఆలోచించి మీ నిర్ణయాన్ని ప్రకటించండి. హైందవ క్రైస్తవం పై చర్చకు స.మండలి నుండి పాల్గొనే నేను మీ తరఫు ప్రతినిధిగా మాట్లాడడానికీ సంసిద్దుడను. ఉంటాను. సెలవ్.
సత్యాన్వేషణలో - మీ సురేంద్ర
No comments:
Post a Comment