Friday, December 15, 2017

అద్దంకి రంజిత్‌ గారికో బహిరంగ లేఖ

 హైందవ క్రైస్తవం పుస్తక రచయితలైన అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారికి.. మనస్పూర్తిగా మిత్రమా అని పిలుచుకోగలిగిన వాస్తవ పరిస్థితి మన మధ్య నెలకొనిలేనప్పటికీ, మీరు మీ పుస్తకంపై పండితులతో సత్యాసత్య విచారణకు సిద్దమని ప్రకటించడం ద్వారా, సత్యావిష్కరణకు సిద్దపడిన వాళ్ళందరూ, వారు ఏఏ పక్షాలకు చెందినవారైనా, సత్యాన్ని ఇష్టపడేవాళ్ళుగా భావసారూప్యత కలిగిన వారవుతారు. కనుక ఈ రకంగా ప్రస్తుతం తాత్కాలికంగాను అయినా మిత్రదృష్టితో ఇక ముందు జరగాల్సినపనులగురించి ఆలోచించుకునే యత్నాలను ఆరంభించుకునే వెసులుబాటు కలిగింది. అలాటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు నా అభినందనలు.
 ముందుగా ఒక్కమాట 
 ''మిత్రస్యాహం చక్షుషా సర్వాణిభూతాని సమీక్ష్యే'' అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శప్రాయమైనది. అంతటి హృదయవిశాలత, మానసిక సామర్ధ్యం ఇప్పటికి నాకులేకున్నా, అవసరమైనప్పుడూ, అవకాశం ఉన్నప్పుడూ, శక్తిసరిపోయినంతలో అలా ఉండడానికే ప్రయత్నిస్తూ వస్తున్న వాణ్ణి నేను. కనుక మరో రకమైన అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉన్నంతకాలం, అవకాశం ఉన్నంతలో పరస్పరం మిత్ర దృష్టితో మెలగడానికే యత్నిద్దాం. నావైపు నుండి అలా ఉండడానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తాను. ఈ నాలుగు మాటలైనా ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులలో విషయపరంగా ప్రత్యర్ధులంగా ఉన్న మన మధ్య వ్యక్తిగతంగా అనవసరపు వత్తిడీ, ప్రతికూల దృష్టి ఏర్పడకుండా, విషయాన్ని విషయంగా చూడడానికి ఎంతో కొంత అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతాయనే ఉద్దేశంతోనే చెప్పాను. ఏ విధానాన్ననుసరించైనా, మిత్రులంగా ఉండిగానీ, వాది ప్రతివాదులుగా ఉండిగాని, కడకు వైరదృష్టి కలిగైనా సరే ''ఏనకేనాప్యుపాయేన సత్యమేవస్థాపనీయ మితి బుధజనోక్తిః'' అన్న దానిని త్రికరణ శుద్దిగా అంగీకరిస్తున్నవాణ్ణినేను. ఈ తాత్విక భావన ఆధారంగా చేసుకునే, ధర్మసాధనకు గానీ, సత్యస్థాపనముగానీ సామదానభేదదండములన్న చతుర్విధోపాయాలు పుట్టాయి లేదా ధర్మవేత్తల చేత అంగీకరింపబడ్డాయి. ఇదెంతో కీలకమైన విషయం. ఈ విషయాలేవీ మీకు తెలియనివని ఇక్కడ రాయడంలేదు. ఎవరో ఒకరిని అడ్డుపెట్టుకుని, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతోవిలువైన, ఇలాటి భావాలను మాటిమాటికీ గుర్తు చేసుకోవడం, గుర్తు చేస్తుండడం, సాధారణ ప్రజలకు తెలియజేస్తుండడం అన్న మూడూ కూడా మేధో భాగంలో అంటే భావజాల క్షేత్రంలో, పనిచేస్తుండే వారి బాధ్యత. సరైన పద్దతీ, పరికరాలు లేని ఏ పనీ సజావుగా నెరవేరదు. కనుకనే విజ్ఞులు యోగ్యమైన ప్రతి పనికీ అది సఫలం కావాలంటే సరైన పరికరాలు- సరైన, సమగ్రమైన విధానము అన్నవి ఉండి తీరాలనంటారు. దీనికే సంబంధించిన ఒక సర్వసాధారణ నియమం (విశ్వనియమం) ఉంది. సూ :- కర్త - ఉద్దేశము - పరికరాలు - విధానము - పని = ఉద్దిష్ట ఫలితము. వీటిని మన ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుంటే ఎలాగుంటుంది? 

 చర్చలు - చర్చల పేరున జరుగుతున్న రచ్చలు

 ఈ తరంలో అంటే గత రెండు మూడు దశాబ్దాలుగా అప్పుడప్పుడూ 'డిబేట్‌' ల పేరున జరిగిన, జరుగుతున్న వేదికలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అవెంత డొల్లతనంతో కూడుకుని ఉందీ ఇట్టే తెలిసిపోతుంది. ఇలాటి వేదికలకు ఈ తరంలో ఆద్యుడని చెప్పదగింది ఇస్లాం మత ప్రచారకుడైన అహ్మద్‌దీదాత్‌ గారినే. అదేవరవడిని అంది పుచ్చుకుని డా.జాకీర్‌ నాయక్‌ అన్నాయనా, 'డిబేట్‌'ల పేరునే చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరవాత్తరవాత పలు ఇస్లాం, క్రైస్తవ సంస్ధలవారూ ఇదే వరవడిన తామూ కొన్ని కార్యక్రమాలు చేస్తూవస్తున్నారు. అలాటి వాటిలో కొన్నింటిని ఉట్టంకిస్తాను. 
 1. పి.డి సుందర్రావు - దీదాత్‌గార్లు తలపెట్టింది (ఇది సజావుగా పూర్తికాలేదు) వివరాలకు పి.డి. సుందర్రావుగారి పుస్తకాలు, సి.డి.లు చూడండి. 
 2. జాకీర్‌ నాయక్‌ - రవిశంకర్‌ గార్ల మధ్య జరిగింది. 
 3. అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ - ఇమ్రాన్‌ల మధ్య జరిగింది. 
 4. విజయకుమార్‌కు - ఫజులు ర్రహ్మన్‌ గారికీ జరిగింది. 
 5. సత్యప్రకాశానంద - ముస్తాక్‌ అహ్మద్‌ గార్ల మధ్య జరిగింది. 
 6. కరుణాకర్‌ సుగ్గున - విజయకుమార్‌ల మధ్య జరిగింది. 
 7. కరుణాకర్‌ సుగ్గున - విజయ ప్రసాద్‌రెడ్డిల మధ్య జరిగింది. 
 గమనిక :- మొత్తం నెట్‌ను పరిశీలిస్తే ఇలాటివి ఎన్నో డిబేట్‌ల విషయం కనపడుతుంది. ఎన్ని అలా జరిగాయన్నది మనకంత ముఖ్యంకాదు. అవి ఎలా జరిగాయన్నదే అస్సలు విషయం- ఇవిగో అవి ఇలా ఉంటాయి. 
 1. ఏదో ఒక సంస్థవారు ప్రధాన బాధ్యత స్వీకరించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 
 2. సమావేశంలో వేదికపై నుండే వారు - వేదిక క్రింద ఉండేవారు అన్న విభజన ఉంటుంది.
 3. శోత్రలు (నిజంగా వేదిక క్రింద కూర్చున్నవారిలో శ్రోతలెందరు? ప్రేక్షకులెందరు? రెండు పాత్రలు పోషిస్తున్న వారెందరు అన్నది పరిశీలిస్తే గాని తేలదు) 
 4. సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారికి చెందిన మందే ఎక్కువమంది 60% నుండి 80% ఉంటారు. మిగిలిన 40% జనంలో రకరకాల ధోరణులవారుంటారు. 
 5. సభానిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ వగైరాలన్నీ ఏర్పాటు చేసిన వారి చేతిలోనే ఉంటాయి. 

 ఆవేదిక స్వరూపస్వభావాలు 

 1. ఒక నిర్ధిష్ట ప్రతిపాదనపై సత్యాసత్య విచారణ అన్నది ఉండనే ఉండదు. చర్చనీయాంశంగా ఒక విస్తారమైన భావాలున్న దానినిపెట్టుకుంటారు. దాంతో ఏ భావాన్నీ విడిగా విచారించడం సాధ్యంకాకుండా పోతుంది. 
 2. ఎ) ముందుగా ఒక పక్షం వ్యక్తి ఎంపిక చేసుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం వరకు ప్రసంగిస్తారు. అది సాధారణంగా 40, 45 నిముషాలుంటోంది (కొందరు 30 నిముషాలు పెట్టుకోవచ్చు) ఎ1) ఆ తరవాత రెండో పక్షం వ్యక్తి తానూ అంతే సమయం తన ప్రసంగం వినిపిస్తాడు. బి) మరల రెండో సెషన్‌లో 1వ పక్షం వ్యక్తి 15, 20 నిముషాలు ప్రసంగిస్తాడు బి1) అటు తరవాత రెండో పక్షం వ్యక్తి తానూ అంతే సమయం మలి ప్రసంగం చేస్తాడు. సి) చివరకు 1వ పక్షం 5, 10 నిముషాలు మాట్లాడతాడు. సి1) అటు పై 2వ పక్షం తానూ 5, 10 నిముషాలు మాట్లాడతాడు. ఓ గొప్ప హాస్యాస్పదమూ, విచిత్రమూ ఏమిటంటే, వేదిక సత్యాసత్య నిర్ణయం చేయదు సరికదా, కొన్ని వేదికలలోనైతే ముందస్ధుగా రాసుకునే నియమనిబంధనల ఒప్పంద పత్రంలోనే జడ్జిమెంటు చేయకూడదు. నిర్ణయాలు వేదిక నుండి ఉండవు. సత్యాసత్య నిర్ణయాన్ని సభకు వదిలేద్దాం. వింటానికి వచ్చిన వారే నిర్ణితలు, వారే నిర్ణయించుకుంటారు. అన్న నిబంధన కూడా చేర్చుతారు. ఓ ఇక సభాధ్యక్ష స్ధానంలోనైతే ఎక్కువసార్లు సభ ఏర్పాటు చేసిన పక్షంవారి మనిషే కూర్చుంటాడు. ఓ సభ ఏర్పరచిన పక్షం వారి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే పదే పదే చప్పట్లు, హర్షద్వానాలూ, అనుకూల స్పందనలు వినపడుతూ, కనపడుతూ ఉంటై, రెండో పక్షం వ్యక్తి మాట్లాడేటప్పుడు వాటి జోరు అంతగా ఉండదు. ఈయనగారి మందా కొందరున్న సందర్భాలలో నామమాత్రంగా ఉంటుంది. సభ జరుగుతుంది. ముగుస్తుంది. ఇంతటితో అగితే పెద్ద విశేషమేమీ ఉండదు. అస్సలు కథ ఇప్పటి నుండే మొదలవుతుంది. 1. ఆధునిక సాంకేతిక విజ్ఞానపు ఆసరా 2. తమతమ సొంతమందలో తాము రగిల్చిన ఆవేశము 3. ఇందుకోసమే ముందస్ధు పన్నాగంతోనే సమావేశం ఏర్పరచారు గనుక వారూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వాట్సప్‌, పేస్‌బుక్‌, యుట్యూబ్‌, వెబ్‌ల ద్వారా, ప్రత్యేక సి.డిల ద్వారా తెగచెలరేగిపోతుంటారు. ముందుగా ఇరు పక్షాలూ ఎవరికివారు విజయోత్సవ సమావేశాలు ఏర్పరచుకుంటారు. తామే గెలిచామని ప్రకటించుకుంటారు. అంతటితోనైనా ఆవేశాన్ని తగ్గించుకుని, తృప్తిపడి ఊరుకోరు. ఎదుటి పక్షంపైన దుమ్మెత్తిపోస్తారు. అతడెందుకూ పనికిరాడనీ, తమకు సాటి రాడనీ తెగ ప్రగల్భిస్తుంటారు. అక్కడితోనూ ఆగరు. వాట్సప్‌, పేస్‌బుక్‌, యూట్యూబులలో తామరతంపరగా అడ్డగోలు ప్రకటనలు చేస్తుంటారు. శృతిమించితే ఒకరినొకరు బండబూతులూ తిట్టుకుంటుంటారు. ఒక చిన్న వీడియో కెమారా సంపాదించుకుని, చిన్న చిన్న అంశాలుగా, ఖండాలుగా ఎదుటివాణ్ణి తొక్కేశాం, నలిపేశాం, విశిరేశాం, ఊదేశాం, బాదేశామంటూ ఒక వంకా, నేనంతోణ్ణి, ఇంతోణ్ణి, నా ముందు వాడెంత... ఇలా అంతూపొంతూ లేకుండా, అసభ్యంగా సంస్కారహీనంగా, బజారు మనుషుల పోకడకంటెనూ దిగజారుడు రూపంలో అస్సలు విషయాన్ని ప్రక్కన పెట్టి వ్యక్తిగత నిందాస్ధుతులతో మంది కాలాన్ని మింగేస్తుంటారు. అబ్బో, ఇదంతా, దానికదే ఒక పెద్ద తలనొప్పి. ఇలాటి సమావేశాలు చేసేవారిలో మరో రకం ప్రయోజనాలను ఆశించే గుంపూ ఉంది. వారిది విషయం తేల్చాలన్న దృష్టి కాదు. వారి దృష్టిలో ఒక పార్శ్వం సంపాదన - అత్యధిక సంపాదన, ప్రసిద్ది అన్నది కాగా మరో పార్శ్వం సామాన్య జనానికి వలవేసి పట్టుకోవడం. ఇది నిజం చెప్పవలసి వస్తే అత్యంత హేయమైన, దగుల్బాజీతనంతో కూడిన నికృష్టవైఖరి. ఇంతలేసి మాటలు ఎందుకనాల్సి వచ్చిందంటే, ఈ రకం గుంపు దేవుణ్ణి, విశ్వాసాలను, బలహీనతలనూ కూడా వ్యాపార వస్తువులుగా చూస్తూ వాడుకుంటూ ఉంటారు. నిష్టూరంగా ఉన్న ఈ విషయంలో నిజమేమిటంటే, ఆయా మత గ్రంధాల ప్రకారమే ఈ రకమంతా ముందస్తుగా నరకానికి పోతారు. అందులోనూ ప్రథమ శ్రేణిలో ఉంటారు. మరి ఆ భయం వీరికుండదా అంటే, వీళ్ళస్సలు స్వభావం బలమైన అవిశ్వాసంతో కూడుకునే ఉంటుంది. ఈ రకాన్నే ఏసు, వేషధారులు, అబద్దపు బోధకులు, అబద్దపు క్రీస్తులు అంటూ పదే పదే ప్రకటించాడు. ఖురాను దృష్టి నుండి కూడా ముస్లింలుగా గుర్తింపబడుతున్న వారిలోనే ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికే పోతారు. ఎంత ప్రధానమైన పెద్దదైన అంశమిది? ఈ నా మాటలు అవాస్తవాలుగానీ, అతిశయోక్తులు గానీ కావనేందుకు మీ మాటలూ, మీకు సూటిగా ప్రత్యర్ధిగా ఉన్న ఇతర క్రైస్తవుల మాటలనే ఉదహరించవచ్చు. విపుల పరిశీలన అవసరమైన రోజు అవన్నీ విచారణకు పెట్టుకుందాం. ఇక.... ''నిజం నిలకడ మీద తెలుస్తుంది''; ''ఏసే తీర్పు తీర్చుతాడు'' లాటి మాటలన్నీ వల్లించుకోడానికీ ఉదహరించడానికీ పనికొచ్చేవేగాని, మన మన జీవితాలలో అలాటివేమీ సాధారణంగా జరగనే జరగవు. నిజంగానే అలాటివి ఈ లోకంలోనే జరుగుతున్నట్లు మన అనుభవంలో ఉండుంటే ఈ రకం వారి పోకడ కనీసం సగానికి సగమైనా తగ్గిపోయేది. అదుపులోనూ ఉండేది. అలాటివేవీ కనీసంగానైనా మన అనుభవంలోకి రావడం లేదు గనకనే ఈ మాటల ప్రభావం మనలో ఎవరిపైనా అంతగా ఉండడంలేదు. ముఖ్యంగా ఈ పన్నాగ రాయుళ్ళకు ఆ నమ్మకాలేమీ లేవు. ఉండవు. ఈ మధ్యనే నేను పైన చెప్పుకున్నలాటి, చర్చలనడానికి తగని 'డిబేట్‌'లకు చెందిన కొన్ని క్లిప్పింగులు చూశాను. అందులో ఒక దానికి మధ్యవర్తిగా అంటే సభానిర్వాహకునిగా లేదా అధ్యక్షునిగా - ఫజులుర్రహ్మాన్‌గారు వ్యవహరించారు. దానిని ఏర్పాటు చేసింది విజయప్రసాద్‌ రెడ్డిగారు. ఆవేదిక నిబంధనల ననుసరించి సభాధ్యక్షుడు / మధ్యవర్తి, ఎట్టి నిర్ణయాన్ని ప్రకటించకూడదు. కానీ మన రహ్మన్‌గారు ఆ తరువాత వి. ప్రసాద్‌ రెడ్డిగారికి సంబంధించిన ఒక వ్యక్తితో విజయప్రసాద్‌ రెడ్డి దుమ్ముదులిపేశాడంటూ తెగ సంతోషాన్ని ముఖంలో కనబరుస్తూ ఒక వీడియో రికార్డింగులో దర్శనమిచ్చారు. ఇక విజయకుమార్‌ - కరుణాకర్‌ ల డిబేట్‌ ముగిశాక రెండు పక్షాలకు చెందిన అభిమానులూ విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారు. అందులో విజయకుమార్‌ గారి విజయోత్సవసభలోనైతే ఒకరిద్దరు పసిపిల్లల చేత కరుణాకర్‌ని నిందిస్తూ, హేళన చేస్తూ ప్రసంగాలు చేయించారు కూడా. ఇకపోతే, షఫీ, ఇమ్రాన్‌, జాకీర్‌నాయక్‌ వగైరా ఇస్లాం పక్షీయుల వేదిక గురించి చెప్పనే అక్కరలేదు. అసలు సభా నిర్వహణే ఒక పెద్ద సినిమా షూటింగా అన్నంత సీన్‌ క్రియేట్‌ చేస్తారు. అందులో అధ్యక్షునిగా ఒక ముస్లిమే ఉంటాడు. సభలో పైన నేనన్నట్లు 60%, 80% పాత ముస్లింలూ కొత్తగా ముస్లింలైన వారూ ముస్లింలు కావడానికి సిద్దం చేయబడిన వారూ కలసి ఉంటారు. మిగిలిన 40%, 20% రకరకాల వాళ్ళుంటారు. ఓఫీరుగారూ! ఈ వివరాలన్నీ జరిగిన వాస్తవాలను చూపేటివో కాదో మీకూ బాగానే తెలుసు. మరిచాను. ఆ డిబేట్‌లేని 'డిబేట్‌' వేదికల్లో జరిగే ఆఖరి అంకాన్ని గురించి చెప్పడం మరిచాను. ఆఖరి అంకం ప్రశ్నలు సమాధానాలు అన్నదిగా ఉంటుంది. అధ్యక్షుడు ప్రకటిస్తాడు. ఒక్కో పక్షంవారిని శ్రోతలు 3 లేక 4 ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్న సూటిగా, క్లుప్తంగా ఉండాలి. సమాధానం 1 నిముషంలోనో 2 నిముషాల్లోనో చెప్పాలి అన్న నిబంధన పెడతాడు. సభాసదుల్లోనుండి ఎవరో ఏదో అడుగుతాడు, దానికి సమాధానంగా ప్రశ్నించబడ్డాయన తనకుతోచిందేదో చెప్పబోతాడు. సమాధానం చెప్పడం పూర్తయినా, కాకున్నా సమయం అయిపోతే ఊరుకుండాల్సిందే. అలా ముగుస్తుందా డిబేట్‌ కార్యక్రమం. ఈ రికార్డింగులనన్నంటినీ సిద్దం చేసుకుని ఇలాటి కార్యక్రమాలు జరిపినవాళ్ళకు దండిగా ధనసాయం చేసే ఆయా మతాలకు చెందిన బడాబడా విదేశీ సంస్ధలకు చూపించి వాళ్ళతో ఒక అవగాహనకు వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహించినందుకుగాను పెద్ద మొత్తాలలోనే డబ్బు రాబట్టుకునే బ్రతుకుదెరవు + విపరీతమైన సంపాదనకు గడంగే వారు మరికొందరున్నారీ సంస్ధలలో. రంజిత్‌ ఓఫీర్‌గారూ! మీరూ ఆలోచించగలవారే. ఈ తరహా వేదికలనూ ప్రపంచాన్నీ చూస్తున్నవారే. ఇలాటి వేదికలేవీ సత్యాసత్య విచారణ లక్ష్యంతో చేస్తున్నవి కావు. ఎవరో ఒకరికి ఎక్కడో చోట సత్యం తేలాలన్న ఉద్దేశం నిజంగానే ఉందనుకున్నా, అట్టి సామర్ధ్యం వాటికి లేదు గనుకీ తరహా వేదికలు అందుకు ఏ మాత్రం సరిపోవు. కనుక అలాటి ప్రయత్నాలు నిజంగా సఫలం కావాలంటే ఉండాల్సిన కొన్ని సాధారణ సూత్రీకరణలు గురించి ప్రస్తావిస్తాను. అవి సబబైనవో కావో మీరూ పరిశీలించండి. 

 అనుకున్న ఏ పనైనా సఫలం కావాలంటే, 
 1. అన్నిటికంటే ముందుగా, అందుకుతగిన వాతావరణం ఉండాలి లేదా ఏర్పరచుకోవాలి. 
 2. అందులో - ఆ ఉద్దేశం నెరవేర్పు యత్నంలో పాల్గొనేవాళ్ళందరికీ ఎందుకా పని చేస్తున్నదీ, ఎలా చేయాలనుకుంటున్నదీ తెలిసి ఉండాలి. 
 3. తెలిసి ఉంటే చాలదు. ఆ పని నెరవేరాలన్న అభిలాష ఉండాలి. అందుకు తాను చేయగలిగినంత సహకారం చేయడానికి సిద్దపడాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం పనికి అడ్డుతగలకుండానైనా ఉండాలి. 
 4. ఆ పని, ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా గ్రంధం వెలిబుచ్చిన అభిప్రాయాల సత్యాసత్యాలను నిగ్గు తేల్చడం కొరకు ఏర్పడిందైతే, అందుకు తగిన వ్యక్తులతో కూడి ఉండాలి. 
 5. అలాటి వేదికలలో కనీసం ఇరుపక్షాలుండాలి. 
ఇరుపక్షాలలో ఒకటి పరీక్షకు తీసుకున్న ప్రతిపాదనలకు ప్రాతినిధ్యం వహించిందై ఉంటుంది. రెండోది, రెండు రకాల స్వభావాలతో ఉండవచ్చు. 
 1. మొదటి పక్షపు ప్రతిపాదనలను పరీక్షించేందుకు సిద్దమైన వారితో కూడి ఉన్నది కాగా 
 2. రెండోది మొదటి పక్షపు ప్రతిపాదనలకు విరుద్దమైన అభిప్రాయాలు కల వారితో కూడినదై ఉంటుంది.
 గమనిక :- ఒకటవ విధానంలో ప్రతిపాదకులుంటారు. వారిని ప్రశ్నించే పృశ్చకులుంటారు. ఈ రెండో పక్షం ప్రతిపక్షం కాదు. ప్రశ్నించే పక్షం మాత్రమే. ఏదైనా ఒక సిద్దాంతాన్ని పరీక్షకు స్వీకరిస్తే సాగే విచారణ ఈ రకంగానే ఉంటుంది. ఇందులో పృశ్చకులకు తన పక్షమంటూ ఉండఖ్ఖరలేదు. ఇంకా సరిగా చెప్పాలంటే ఉండదు. ప్రతిపాదనల బలాబలాలను, సత్యాసత్యాలను పట్టిచూడడమే ఇక్కడ జరిగే పని. ఇక రెండవ విధానంలోనైతే, 1వ పక్షంవారి ప్రతిపాదనతో విభేదిస్తూనో, విరోధిస్తూనో తనకూ ఒక ప్రతిపాదన ఉంటుంది. దానినే ప్రతి పక్షం అనంటున్నాం. వాదము ప్రతివాదము అన్న రెండూ ఉండే సందర్భానికి సరిపోయే విధానమిది.
 అతిముఖ్య గమనిక :- ఈ రెండు విధానాలలోనూ, ఒక సమయంలో ఎవరిదో ఒకరి ప్రతిపాదననే విచారణకు స్వీకరించి విచారించాల్సి ఉంటుంది. అది 1వ వారి ప్రతిపాదనగానీ, 2వ వారి ప్రతిపాదనగానీండి, దానిని విచారించే సందర్భంలో ఆ ప్రతిపాదనపై మొదలైన విచారణ ఒక ముగింపుకు వచ్చే లోపు మరో ప్రతిపాదనను లేవనెత్తకూడదు. తీసుకోనే కూడదు. యోగ్యమైన చర్చావేదిక నియమాలలో ఇది అత్యంత కీలకమూ, మౌలికమూ అయిన ప్రాథమిక నియమం. విచారణకు స్వీకరించిన ప్రతిపాదనకు సంబంధించిన విచారణ పూర్తై, దానిపై ఒక నిర్ణయం ప్రకటించాకనే, మరో అంశాన్ని-ప్రతిపాదనను - విచారణకు తీసుకోవాలన్నమాట. దీనికి ఎక్కడ ఆటంకం ఏర్పడ్డా, దీనిని ఎక్కడ అతిక్రమించినా ఇక ఆ వేదిక సత్యాసత్య నిర్ధారణ సామర్ధ్యాన్ని కోల్పోయినట్లే, ఇప్పుడీనియమాన్ని పైన పేర్కొన్న రెండు రకాల విచారణకూ అన్వయించవచ్చో లేదో చూద్దాం. 1వ విధానంలో వాద ప్రతివాదులుండరు. ఎవరో ఒకరు చేసిన ప్రతిపాదన దాని పరీక్ష ఉంటుంది. ఆ ధోరణిలో ప్రతిపాదనలు అనేకం ఉండవచ్చుగాక, ప్రతి ప్రత్యేక సమయంలోనూ అంటే ఎప్పటికప్పుడు, అప్పటికి ఏదో ఒక ప్రతిపాదనే పరీక్షకు స్వీకరించడం జరుగుతుంటుంది. దాని సత్యాసత్యాలను పరీక్షించి నిర్ధారించడానికి మరొక ప్రతిపాదనగానీ, మరొకరి ప్రతిపాదనగాని అవసరంలేదు. 
 ఉదా :  5 x 5 = 27 అన్నాడొకడు. అది తప్పో వప్పో తేల్చడానికి, అతనిదే మరో ప్రతిపాదనతో గానీ, అదే విషయంలో మరొకరి ప్రతిపాదనతోగాని పనిలేదు కదా! ఇది నిజమా కాదా? ఆలోచించండి. 2వ విధానంలో ఒకే విషయంపై ఒకటికంటే ఎక్కువ (అనేక) ప్రతిపాదనలుంటాయి. అయినా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు వాటిలో ఏదో ఒకటే పరీక్షకులోను చేయబడుతూ ఉంటుంది. ఏకకాలంలో రెండు ప్రతిపాదనలనూ పరీక్షించడం సాధ్యపడదు. అనవసరం కూడా. చేయకూడదు. కనుకనే ఇలా. ఉదా :- 1వ పక్షం 5x5 = 27 అన్నాడు, 2వ పక్షం 5x5 = 29 అన్నాడు, 3వ పక్షం 5x5 = 25 అన్నాడు అనుకుందాం. ఇందులో ఏది వాస్తవాన్ని చూపుతుంది? (ఏది సత్యం లేదా ఏది సరైంది?) అన్నది పరిశీలించడానికి మరో దానిని జత చేయాల్సిన, ప్రకటించాల్సిన అవసరం లేదుగాక లేదు. లేదన్నదే కాదు. జత చేయకూడదు కూడా. ఒక్క సందర్భంలోనే రెంటినీ కలిపి చూసే అవసరం రావచ్చు. పరిశీలనే తులనాత్మక అధ్యయన రూపం అయిందైయ్యుంటే, అప్పుడైనా దేనికి దానిని పరిశీలించాకనే, పోల్చిచూడడం జరుగుతుంటుంది. 

యోగ్యమైన చర్చావేదిక గురించి మాట్లాడుకుంటున్నాం. 
 ఓ ఏ పనికైనా అనుకూల వాతావరణం ఉండాలన్నది మొట్టమొదటి నియమం. ఓ విధం తెలిసిన, విజ్ఞత కలిగిన రెండు పక్షాలుండాలన్నది రెండో నియమం. ఓ పరిశీలనాంశం ఏమిటన్నది నిర్ధిష్టరూపంలో ప్రకటింపబడాలన్నది మూడో నియమం. ఓ ఇరు పక్షాల వాదనలు సరైన రీతిలో జరుగుతున్నాయోలేదో పరిశీలించే విశేషజ్ఞులుండాన్నది నాలుగో నియమం. ఓ ఇరుపక్షాలకు అభ్యంతరం లేకుంటే పరిశీలక బృందాన్నే నిర్ణీతలుగ ఏర్పరచుకోవచ్చు. లేదా వారిని - నిర్ణేతల బృందాన్ని పరిశీలకుల బృందంకంటే వేరుగానూ ఏర్పరచుకోవచ్చు. ఈ రెండు పేర్ల క్రింద ఉన్నవారు వివాదాంశపు విషయంలో విశేషజ్ఞులై (పండితులై) ఉండడం, వేదిక ఏర్పరచుకున్న నియమ నిబంధనల్ని పూర్తిగా అర్ధం చేసుకుని ఉండడం, వీలైనంతలో నిస్పక్షపాతంగా వ్యవహరించగలిగి ఉండడం అన్న సామర్ధ్యం కలవారై ఉండాలి. వీరిని రెండుగా ఏర్పరచుకుందామంటే అందులో పరిశీలక పక్షం విషయజ్ఞులూ, విధానం తెలిసినవారు, నిజాయితీ పరులైతే చాలు. విధిగా నిస్పాకిక్షులవ్వాలన్న నియమం ఉండక్కర్లా. ఇక నిర్ణేతలకైతే విషయజ్ఞతా, విధానం తెలిసుండడం, నిజాయితీ పరులై (పెద్ద మనిషి తరహాగా) ఉండడంతో పాటు నిస్పాకిక్షులై యుండడం నియమం. నిర్ణేతలకు విచారణీయాంశంలో లోతైన అవగాహన ఉండి తీరాలన్న నియమం లేదు. నిస్పాకిక్షులై యుండాలన్నదే నియమం. అవసరమైతే వారు విశేషజ్ఞుల నుండి విచారణీయాంశానికి చెందిన సమాచారాన్ని వివిధ రీతులలో సేకరించుకుంటారు. న్యాయమూర్తులు వివాదాంశాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలలో నిపుణులతో సంప్రదించి వారి నుండి ధృవీకరించిన నివేదికలను సేకరించుకుంటున్నట్లన్నమాట. 
 కనుక యోగ్యమైన చర్చావేదికలో
 1. అనుకూలవాతావరణం 2. విధి విధానాలెరిగి సత్యావిష్కరణ లక్ష్యంగా కల ఇరు పక్షాలు, 3. విషయజ్ఞులైన పరిశీలక పక్షం, 4. నిస్పాకిక్షులైన నిర్ణేతల పక్షం ఉండాలన్నమాట. దీనితో పాటు అట్టి వేదిక ఏర్పడాలంటే ఉండకూడనివేమిటో తెలిసి అవి లేకుండానూ చూసుకోవాలి. 1. సాధారణ ప్రజలుండరాదు. 2. వందమాగధులు, అనుకూల ప్రతికూల దృష్టులుకల అనుచరగణము ఉండరాదు. 3. శబ్దకాలుష్యం ఉండరాదు. 4. ఆరంభం నుండి కార్యక్రమం పూర్తయ్యేంత వరకైనా పై నాలిగింటి ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఓ నిజమేమిటన్నది నిర్ధారించుకోడానికి అవసరమైన వారే ప్రతికూల దృస్టిలేని వారే ఆవేదిక క్షేత్రంలో ఉండాలి. విచారణలో పాలు పంచుకోవలసిన వారు తప్ప ఇతరులెవరూ ఉండరాదు. విచారణ పర్యవసానం అంటే ముగింపు స్థితిలో ఏర్పడే నిర్ణయం - మూడు రకాలుగా ఉంటుంది. 1. ప్రతిపాదన సరైందికాదని తేలింది 2. సరైందేనని తేలింది. 3. ముగించే సమయానికి తేలలేదని తేలింది. గమనిక : ఏవైన ప్రతిపాదనలు ఈ వేదికలో తేల్చరానివనీగానీ, ఏ వేదికలోనైనా తేల్చరానివేనని గానీ తేలవచ్చా? ఆలోచించండి. అలాటివి మీ దృస్టి కొస్తే చెప్పండి. 
  వీటి తరవాత చెప్పుకోవలసిన నియమాలు మరొకొన్ని ఉన్నాయి.
 1. వివాదాంశంపై విచారణ ముగిసేంత వరకు ఏ పక్షమూ అర్ధాంతరంగా వేదిక నుండి విరమించుకోరాదు. మన ప్రస్తుత వివాదాంశం హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా వివిధాంశాలపై మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు సరైనవా? కావా? అన్నది మాత్రమే. దీనికి పరిమితమయ్యే పైన చెప్పుకున్న రెండు విధానాలలో ఏదవసరమైతే దానిని తీసుకుని ఆయా ప్రతిపాదనలను విచారించాల్సి ఉంటుంది. 2. అన్య విషయ ప్రస్తావనలు ఎవరు చేసినా, ఆ సందర్భంలో తన పాత్ర విషయంలో మౌనం వహించినా ఆ విచారణాంశం వరకు ఆ పక్షం ఓడిపోయినట్లే నిర్ణయించాలి. 3. విషయాన్ని విచారించే సందర్భంలో ఆత్మస్తుతి - పరనింద అన్న రెండూ అనవసరమైనవే గనుక, వాటిని లేవనెత్తరాదు. దీనికి సంబంధించిన సూత్రం : ఎవరు చెప్పారన్నది విచారణకు అనవసరం. ఏమి చెప్పారన్నదే విచారణీయాంశం. చిన్నవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా చెప్పింది దేనిని గురించో దాని విషయంలో అది సరిపోతుందా? లేదా పరీక్షించడమే వేదిక దృష్టై ఉండాలి. 4. ఒకే విషయంపై ఇరుపక్షాలలో ఎవరు గానీ, విరుద్ద ప్రకటనలు చేసినా స్వవచన వ్యాఘాతాలంటారు వీటినే. ఆ విషయం వరకు ఆ పక్షం ఓడినట్లే లేదా సరైంది కాదని తేలినట్లే. అదే మరి దైవ గ్రంధంగా చెప్పబడినదాంట్లో ఒక వైరుధ్యం ఉందని తేలిన అది దైవగ్రంధం కానట్లే. 5. ఒక ప్రతిపాదన తప్పని రుజువు చేయాలన్నా, ఒప్పేనని రుజువు చేయాలన్నా చేయాల్సింది ఒక్కటే, ప్రతిపాదన దేనికి సంబంధించిందో అది అలాగే ఉందో లేదో చూడడమే. అంటే ఇద్దరు చూపేది ఒక్కదానినే. ఉన్నదానితో సరిపోతే సరైందంటాము. సరిపోకుంటే సరైంది కాదంటాము. అదొక్కటే తప్పొప్పులు చూసే విధానము. ఓ వేదికలో తప్పనిసరిగా చోటు చేసుకునే అంశాలు - వాటికి చెందిన నియమాలు. 1. ప్రతిపాదనతో మొదలై నిర్ణయం ప్రకటించేవరకు మనం వాడుకునేది భాషనే - కనుక చర్చావేదికకు సంబంధించినంతలో అవసరపడే భాషానియమాలను చర్చా వేదికలోని వారంతా తెలుసుకుని ఉండాలి. 2. అభిప్రాయాన్ని ప్రకటించిన వ్యక్తి, తానాఅభిప్రాయానికి రావడానికి గల కారణాలను గానీ, తన అభిప్రాయం సరైందేననడానికి తగిన ఆధారాలను గానీ తెలుపడానికి మాట్లాడతాడు. దానినే వాదన (ఆర్గ్యుమెంట్‌) అనంటారు. ప్రతిపాదనను 'వాదము' అంటారు. దానిని నిరూపించడానికి చేసేది వాదన. కనుక దీనికి సంబంధించిన నియమాలూ ఉండాలి. వేదికంతటికీ అవి తెలిసుండాలి. వీటిని వాద నియమాలనంటారు. 3. ఇక చివరి అంకం నిర్ధారించడానికి చెందింది. నిర్ణీతలు చేయాల్సింది. వారున్ను ఎవరికి తోచినట్లువారు కాకుండా కొన్ని నియమాలనుసరించే నిర్ణయాలను ప్రకటించాల్సి ఉంటుంది. వీటినే నిర్ధారణ నియమాలు అనంటారు. వీటినిగురించి కూడా వేదికలోని అన్ని పక్షాలకు తెలిసుండడం అవసరం. సరైన నిజనిర్ధారణ వేదిక ఏర్పాటులో 1. భాషా నియమాలు 2. వాద నియమాలు 3. నిర్ధారణ నియమాలు అన్నవి ప్రత్యేకమైనవి. అత్యంత కీలకమైనవి. ఇవి లేకుండా జరిగే వాటిని చర్చలనరు, రచ్చలో, రగడలో అనంటారు అని పౖౖెన నేనన్నాను. ఆనా మాట సబబో కాదో చెప్పండి. చర్చనీయాంశాలుగా సాధారణంగా రెండు విషయాలుంటాయి. వాద బలపరీక్ష, వాది బలపరీక్ష అంటారు వాటిని. వాటిని విడివిడిగా చూడడమే సరళమైన సరైన విధానం. రెంటి విషయాలలోనూ వ్యక్తిగత నిందలు అనవసరం. 1. వాద పరీక్ష చేసే సందర్భంలోనైతే ప్రతిపాదకునికి ఎంత తెలుసు అన్నది అప్రధానంగా ఉంటుంది. ఆ విషయం తెలిసిన ఎవరుగాని, ఎందరుగానీ ఇరుపక్షాల ప్రతినిధులకు సహాయకులుగా ఉండవచ్చు. అట్టి సందర్భాలలో ఒక సమావేశంలో ఆ పక్షాన్ని స్వీకరించినవారు తమ అవగాహనలోపాన్ని గురించి మరింత అధ్యయనానికి సమయం కోరితే ఆ విచారణ వేదికను వాయిదా వేసి, మళ్ళా కూర్చునే వీలుంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తికెంత తెలుసన్నది విచారణీయాంశం కాదు. ఆ విషయం అలా ఉందాలేదా అన్నదే విచారణీయాంశం కనుక. 2. ఇక వాది బలపరీక్షైతే పై విధానానికి పూర్తి వేరైనది. ఇందులో ఎవరి బలాన్ని పరీక్షకు తీసుకున్నామో అతడొక్కడే విచారణకులోను కావాలి. ఇతరుల సాయం తీసుకోకూడదు. పరీక్షకుల పక్షంలో ఎవరైనా ఉండవచ్చు. ఎంతమందైనా ఉండొచ్చు. ఎందుకంటే పరీక్షకునిగా ఉన్నవాడు పరీక్షించలేకపోవడాన్ని బట్టి పరీక్షితుడు బలవంతుడేనని తేల్చకూడదు. కనుక మరెవరైనా ఎంపిక చేసుకున్న అంశం వరకు వాదిని పరీక్షించవచ్చు. పై రెండు సందర్భాలకు అంతటి వ్యత్యాసం ఉంది. చర్చా వేదికలో చర్చనీయాంశం ఏమిటన్నది సుస్పష్టంగా తేల్చుకుని ఉండాల్సిన కీలకాంశమిది. ఇక్కడ గాని స్పష్టత లేకుంటే, ఇక ఆ వేదిక పనికిరాని వేదికన్నట్లే. ఓఫీరుగారూ! చర్చావేదిక నియమ నిబంధనల గూర్చి ముందుగా వేదికలో పాల్గొనే మూడు లేదా నాలుగు సమూహాలలో ఎవరెవరుంటారన్నది నిర్ణయించుకుని, ఆ తరువాత అందరూ కలసే వేదిక నియమ నిబంధనలనూ ఏర్పరచుకోవడం అన్నది ఒక పద్ధతి అలా కాక మన ఇరుపక్షాలే ముందుగా సమావేశమై వేదిక నియమ నిబంధనలను రూపొందించుకుని వేదికలో ఎవరెవరు పాల్గునాలోనూ ఆలోచన చేసి ఒక అవగాహనకు రావడం మరోపద్దతి. రెంటిలో ఏదైనా పరవాలేదు. అస్సలు విషయం ఇరుపక్షాలకు సత్యస్ధాపన జరగాలని ఉందా? లేదా అన్నదే. 1. విచారణీయాంశం మీ రచన హైందవ క్రైస్తవమేగనక ప్రతిపాదన పక్షంలో మీరే ఉంటారు. 2. రెండవ పక్షం - ఇది ఎ) పరీక్షించే వారుగానీ బి) మీ అభిప్రాయాలకు మారుగా భిన్నాభిప్రాయాన్ని ప్రకటించేందుకు సిద్దమైన ప్రతిపక్షం వారుగానీ అన్న రెండు రకాల వ్యక్తులతో ఉంటుంది. అయితే అందులో పాల్గొనే వారికి మీ పుస్తకంలో వారికి తెలిసిన భాగం వరకు మిమ్ము పరీక్షించే లేదా మీకు ప్రతిపక్షంగా ఉండే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే. సైద్దాంతిక విచారణలో ప్రతిపాదకుణ్ణి ప్రశ్నించే వారిలో ఎవరైనా ఉండవచ్చు. ఎందరైనా ఉండవచ్చు అన్నది విచారణ నియమాలలో కీలకమైనది. అక్కడ మీ ప్రతిపాదన సరైందా కాదా పరీక్షించడమే ప్రధానమై ఉంటుంది గనక, ఒకరు దానిని పరీక్షించలేకపోయినంత మాత్రాన మీ సిద్దాంతం సరైందని తేలనట్లు కాదన్నదే ఆ నియమ సారాంశం. కనుక మరోకరెవరు పరీక్షస్తానన్నా పరీక్షించుకోవచ్చు. అయితే ఇది అనంతంగా సాగిపోకుండా మన వేదిక వరకు పరిమితికి సంబంధించీ ఒక నియమాన్ని ఏర్పరచుకోవచ్చు. నా ఈ అభిప్రాయం సరైందో కాదో కూడా రేపటి నియమ నిబంధనల కొరకై కలిసే సమావేశంలో విచారించుకోవచ్చు. 3. ఇకపోతే మీకు ప్రతిపక్షంగా ఉండి, మీ ప్రతిపాదనను తప్పని నిరూపిస్తానని గానీ, ఒప్పిది అంటూ తానే మరో ప్రతిపాదన చేసినా గానీ, ఆ విషయం వరకు ఆ వ్యక్తి ప్రతిపాదకునిగా పరిగణింపబడతాడు అంటే 1వ పక్షం వాడుగానన్నమాట. అలాంటి సందర్భాలలో మీరు, మిగిలినవారేవరైనా అతనిని 1వ పద్దతి ప్రకారం పరీక్షించనూ వచ్చు. 2వ పద్దతి ప్రకారం ప్రతి పక్షంగాను నిలబడవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఇలా అనంతంగా సాగిపోకుండా ఒక పరిమితి విధించుకోవాలి. 

ఇప్పటికి ముగింపు


 నిజానికి చర్చకు సిద్దమన్న మీ లేఖ మీడియాకు చేరి వారి ద్వారా దీనితో సంబంధమున్న వారిందరికీ తెలియపరిచాక, అతిసూటైన ప్రతిస్పందన - బాగుందండీ ఓఫీరుగారు. చర్చకు ముందుగా చర్చావేదిక నియమనిబంధనలు రూపొందించుకోడానికి ఒకసారి కలవాల్సి ఉంది. ఎప్పుడు ఎక్కడ కలుద్దామో చెప్పండి. మాకైతే ఈ యీ తేదీలలో అవకాశం ఉంది. స్థలం భారత్‌ టుడే అయితేనే మంచిది. అన్న ఒక్కముక్క రాసి మాకు చేరిస్తే సరిపోతుంది. కానీ, నేను గమనించినంతలో 99%, 100% అన్న తప్పుకాదేమో డిబేట్‌ల పేరున జరిగినవన్నీ చర్చావేదిక స్వభావం కలిగినవిగానీ, తగిన నియమనిబంధనలతో కూడినవిగానీ కాదు. కనకనే నిరంతర సత్యాన్వేషిననీ, సత్య సంస్ధానాభిలాషిననీ ప్రకటించుకున్న మీరూ, సత్యాన్వేషినని ప్రకటించుకున్న నేనూ, సత్యాన్ని స్వీకరించడానికీ, అసత్యాన్ని విడిచి పెట్టడానికి సదాసంసిద్దులం అంటున్న ఆర్య సామాజికులు, సత్యాన్నాస్తిపరోధర్మః అంటున్న హిందూ ధర్మాచార్యులు, సత్యజ్ఞానం ఆర్జించాలి, పంచాలి అంటున్న జె.వి.వి వ్యవస్ధాపక అధ్యక్షులు డా. బ్రహ్మారెడ్డిగారు లాటివారం వేలుపెట్టి, పట్టుబట్టి పూనుకున్నాంగనక మనమైనా సత్యాసత్యవిచారణ వేదికకు సరైన రూపాన్నివ్యగలిగితే భవిష్యత్తులో జరిగే నిజనిర్ధారణ యత్నాలకు మార్గదర్శిగా, ఆధారంగా ఉండగలుగుతుందన్న ఆలోచనతోనే, ముందస్తుగా నా దృష్టి కొచ్చిన వాటిలో కొన్నింటిని మీ దృష్టికీ, అలానే మా ఈ ప్రతిక ద్వారా ఎంతో మంది దృష్టికీ తేవాలనే వ్యాసాన్నిలా తయారు చేశాను. సత్యాసత్య విచారణకు యోగ్యమైన వేదిక నిర్మాణమే అన్నింటికంటే ప్రాథమికమైనది. కీలకమైనదీ. ప్రధానమైనదున్నూ. కనుక వీలయినంత త్వరలో హిం.ధ. ప్రతిష్టాన్‌వారూ, వారిద్వారా మీ రచనపై స్పందించినవారూ మీరూ నేనూ కలసి కూర్చుని చర్చావేదిక నియమ నిబంధనలు సిద్దం చేసుకోడానికై తేదీని నిర్ణయించి, భారత్‌ టుడే ఛానల్‌ వారి ద్వారా మిగిలినవారినీ ఆహ్వానించండి. నేనూ పాల్గొంటాను. నా వరకు నేను మీ కబురు కొరకై ఎదురుచూస్తాను. దయచేసి అన్యవిషయప్రస్తావనలు చేయకండి. ఎందుకంటే అలాటివి ఎటువైపు నుండి జొరబడ్డా సరైన వేదిక ఏర్పరచడం కష్టమైపోతుంది. 
 సత్యాన్వేషణలో - మీ సురేంద్ర 

No comments:

Post a Comment