Friday, December 15, 2017

వివరణ - విజయ ప్రసాదరెడ్డి గురించి

 యోచనాశీలురైన పాఠక మిత్రులారా! ది 27.4.2017 సాయంత్రం 5 గం||ల ప్రాంతంలో విజయ ప్రసాదరెడ్డిగారు ఫోనుచేసి, సురేంద్రగారూ, మీ వివేకపథం 231 సంచికలో విజయకుమార్‌నీ నన్నూ కలిపి ఒకే గాటన కట్టేశారేమిటండీ! మీకూ నాకు మధ్య ఎట్టి గొడవలూ లేవు. మీరు నన్నుగానీ, నేను మిమ్మల్నిగానీ ఏమీ అన్నదీ, అనుకున్నదీ లేదు. కానీ మీ సంచికలోని ఆ భాగాన్ని చదివే పాఠకులకు, మన మధ్య కూడా ఏదో గొడవ జరిగి ఉండవచ్చుననీ, నేను మిమ్మల్నేదో అసభ్యంగా మాట్లాడి ఉంటాననీ అనుకునే అవకాశం ఉంది కదా! అలా ఎందుకు రాశారు? అని అడిగారు. దానిపై నేను వారితో, ఆ పుటలోని ''లుచ్చాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు బచ్చాగాళ్ళు'' అనిరాసింది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాదు. నిజానికి ఆ మాట వరకు అది విజయకుమార్‌ గారికీ వర్తించదు. ఆ మాటలు 'నీ అమ్మ, నీఅక్క, నీ పెళ్ళాం' అంటూనో, వచ్చేస్తున్నా, ఇరగదీస్తా అంటూనో మాట్లాడిన వాళ్ళనుద్దేశించి అన్నవి మాత్రమేనని వివరణ ఇచ్చాను. అలాగే, విజయప్రసాదరెడ్డిగారికీ, నాకూ మధ్య వ్యక్తిగత వైషమ్యాలేవీలేవు. ఆయన పర్సనల్‌గా నన్నేమీ అనలేదు. అని వివరణ ప్రకటన చేసి వివేకపథం 232లో ప్రచురిస్తాననీ వారికి మాటిచ్చాను. ఈ మేరకు, 231 లోని నా వక్తవ్యాల నుండి విజయప్రసాద్‌ రెడ్డిగారిని మినహాయించి ఆభాగాన్ని అర్ధం చేసుకోవలసిందిగా పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ---------------------------------------------------- విజయప్రసాద్‌ రెడ్డి గారితో మాట్లాడినాక, 28.4.2017న కరుణాకర్‌కు ఫోను చేసి మన పుస్తకం విషయంలో విజయప్రసాద్‌రెడ్డి గారేమైనా కామెంట్‌ చేశారా? ఆ వివరాలేమైనా ఉంటే పంపమని అడిగాను. 10 నిమిషాల నిడివిగల విజయప్రసాద్‌రెడ్డిగారి ప్రసంగానికి సంబంధించిన క్లిప్పింగొకటి పంపాడు కరుణాకర్‌. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నిజం ఒప్పుకోవాలి అన్న సూత్రం అందరికీ వర్తించే సూత్రమేగనుక, ఆ ప్రసంగంలో విజయప్రసాద్‌రెడ్డి గారున్నూ నియంత్రణ కోల్పోయి ఆ పుస్తకం పైనా, దానిని రాసిన వారిపైనా చాలా అనుచిత వాఖ్యలు చేశారు. అలాటి పుస్తకాలు రాసేవారు పంది, కుక్కలలాటివారనీ పందిపెంట, కుక్కపెంట లాటివా పుస్తకాలనీ, ఇలాటి వారికోసం బైబిలు దేవుని కొడవలి సిద్దంగా ఉందనీ, దేవుడు వీళ్ళని అడ్డంగా కోస్తాడనీ, అసలిలాటి చెత్తగాండ్లను పట్టించుకోనవసరంలేదనీ... ఇలా ఉందా ప్రసంగం. ఇంతకూ ఆ పుస్తకంలో మేము ఏమి చెప్పాము? బైబిలు విశ్వాసులుగానీ, వ్యతిరేకులుగానీ సత్యాన్వేషకులుగాని, బైబిలును ఎవరికి వారుగా ఆ మూలాగ్రం చదవండి. ఆ తరవాతే ఏమి చేయాలో ఆలోచించుకోండి. పై మూడు రకాలవాళ్ళలో ఎవరు కోరినా, ఇష్టపడినా, వారితో కలసి బైబిలును అధ్యయనం చేయడానికి మేమూ సిద్దంగా ఉంటాము అనే కదా! ఇంత విలువైన నిజాయితీతో కూడిన మా ప్రకటనవారికి చెత్తలా ఎందుకు కనపడింది? ముగింపు :- రెండంశాలు చెపుతాను 1) ఆ 231లోని లుచ్చాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్న బచ్చాగాండ్లన్న మాట, విజయప్రసాద్‌రెడ్డి గార్నిగానీ, విజయకుమార్‌ గార్ని గాని ఉద్దేశించింది కాదు. 2) ఏ సిద్దాంత గ్రంధ విచారణలోనైనా, వ్యక్తుల్ని నిందాత్మకంగా మాట్లాడడం అనవసరం. తగదు. అది వారికైనా, నాకైనా ఎవరికైనా వర్తించే సభ్యతా సంస్కారాలకు సంబంధించిన నియమం. కనుక సంస్కారహీనమైన ఆబాట మనకెవరికీ వద్దనేవద్దు. 

No comments:

Post a Comment