Friday, December 15, 2017

స్ధాయిల గొడవ - ఒక పరిశీలన

 యోచనాశీలురైన పాఠక మిత్రులారా! వివిధ తాత్విక ధోరణులకు చెందిన విజ్ఞులారా! ముందుగా నా గురించి నాలుగు మాటలు. సాంప్రదాయక ఆస్తిక కుటుంబంలో పుట్టిన నేను నా వయస్సు 17 సం||లో వ్యాసాశ్రమ పీఠాధిపతి విమలానంద స్వామి వారి నుండి ఉపదేశం పొంది చదువును కూడా వదిలి పెట్టి సాధనలు మొదలెట్టాను. 1968 నుండి 1976 వరకు సమాజానికి దూరంగా, ఏకాంతంగా ఉంటూ సాధన, అధ్యయనము చేస్తూ వచ్చాను. 1980 వరకు శాస్త్రము - గురువు అన్నవే మార్గదర్శకాలనుకుంటూ సాగింది నా అధ్యయనమూ, సాధనా కూడా. 1981లో సత్యజ్ఞాన సంఘాధ్యక్షులు పి.పెంచలయ్యగారితో బేటీ జరిగి, కొంత విచారణ సాగాక, విశ్వాసమార్గము - విచారణ మార్గములన్నవి పరస్పరం కలసి ఉండలేనివి, కలసి సాగలేనివి అన్నది తెలిసింది. అతి కొద్ది కాలంలో ఆ భావన సరైందేనని తేల్చుకున్నాను కూడా. విశ్వాసాలు- వాటిననుసరించిన సాధన, విచారణ - దాన్ననుసరించిన సాధన రెండూ వేరువేరని తేలాక, విశ్వాసాలు - వాటిననుసరించిన సాధన ప్రక్కన పెట్టేసి, విచారణ - తదనుగుణ్యాచరణ ప్రాతిపదికగా ప్రయాణం మొదలెట్టాను. ఇప్పటి వరకూ ఆ మార్గంలోనే సాగుతోంది నా ప్రయాణమంతా. ఇక్కడికి చేరి, విచారణ మార్గంలో నేను సాగించిన అధ్యయనము రెండు ముఖాలుగా సాగుతూ వచ్చింది. 1) స్వీయజీవితాన్ని అధ్యయనం చేయడం 2) వివిధ తాత్విక ధోరణులను అధ్యయనం చెయడం. ఇలా, రెండు రకాలుగా అధ్యయనం చేసే క్రమంలో, జీవితానికి సంబంధించిన ఏదేని ఒకే అంశంపై నా సొంత పరిశీలన నుండి ఏర్పడ్డ అభిప్రాయానికీ, ఎదుటివారి అభిప్రాయానికీ తేడా వచ్చినప్పుడు, తులనాత్మక పునఃపరిశీలన, సత్యాసత్య విచారణ చేయకతప్పని పరిస్థితి ఎదురయ్యేది. దాంతో క్రమంగా విచారణకు భాషా నియమాలు, వాద నియమాలు, నిర్ధారణ నియమాలు అవసర పడతాయని, తప్పని సరౌతాయని గమనించి, ఆ దిశగానూ కొంత అధ్యయనం చేస్తూ వచ్చాను. మరోవంక, ఆయా విషయాలపై నాతో విభేదిస్తున్న లేదా నేను విభేదిస్తున్న - వారితో శాస్త్రీయ చర్చలు చేయడం మొదలయ్యింది. ముఖ్యంగా నేనూ, పెంచలయ్యగారూ కలసి, వివిధ ఆస్తిక, నాస్తిక ధోరణులకు చెందిన విశేషజ్ఞులతో విస్త్రృతంగా చర్చలు చేస్తూ వచ్చాము. అదంతా సుమారు 20 ఏండ్ల పాటు సాగింది. ఈ దశలో, చాలా తరచుగా స్థాయికి చెందిన సమస్య ఎదురయ్యింది. కొన్ని మాత్రం మీ దృష్టికి తెస్తాను. 1) పండిత గోపదేవ్‌గారు ఆర్యసామాజికులు. తెలుగునాట దర్శనాలు, వైదిక సాహిత్యంలో అంతటి పట్టున్నవారు అరుదు. నాస్తిక, హేతువాదులతో చర్చించడానికి వారిని రమ్మనడానికి వెళ్ళినప్పుడు, సంస్కృతంలోగానీ, వైదిక వాజ్ఞ్మయంలోగాని, తర్కంపైగాని పొట్ట కొస్తే అక్షరమ్ముక్క లేనోళ్ళతో చర్చకు రమ్మంటావేంటయ్యా సురేంద్రా!? దేనికైనా అంతోఇంతో సమఉజ్జీ ఉండొద్దా అన్నారు. అంటుండేవారు ఆయన. 2) రావిపూడి వెంకటాద్రి గారు :- వీరు నాస్తిక, హేతువాద, మానవ వాద ఉద్యమాలకు చెంది ఈ శతాబ్దంలోనే అతి ముఖ్యులైన వారిలో ఒకరు. హేతువాద, నవ్యమానవ వాద ధోరణులకు చెందినంతలో పితామహులనదగ్గవారు. వీరినీ ఆస్తిక సిద్దాంత విచారణలో పాలు పంచుకోండని ఆహ్వానించిన సందర్భంలో అయ్యర్లూ, జియ్యర్లతో చర్చలకు రమ్మంటావేంటయ్యా, సంస్కృతశ్లోకాలు బట్టీ పట్టి వల్లించడం తప్ప వారికి వైజ్ఞానికాంశాలేమి తెలుసని వారితో చర్చకు కూర్చొమంటున్నావు? అన్నారు. వీరే, పి.డి. సుందర్రావు గారి వాళ్ళతో చర్చ చేయాల్సిన సందర్భంలో, బైబిలు విశ్వాసులతో నాకు చర్చేమిటి? అంతగా కావాలంటే మా పిల్లల్లో ఒకర్ని పంపుతాను. అతనితో మాట్లాడితేచాలు. నమ్మకాలరాయుళ్ళకు అంతకంటే పెద్దతనాన్నంగీకరించడం సరికాదు అనీ అన్నారు. 3) పి.డి సుందర్రావు గారు :- బైబిలు విషయంలో క్రీస్తు తరువాత 1900 ఏండ్లకు మళ్ళా అంతటి వాణ్ణి నేను మాత్రమే అంటుండే వీరు, బైబిల్‌ యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ అన్న సంస్ధను స్ధాపించి అనేకులకు శిక్షణ నిచ్చారు. అనేకులపై ఛాలెంజి ప్రకటనలూ చేశారు. వాడెంత, వీడెంత అనీ, వాడునాకు చాలడు వీడు నాకు చాలడు అనీ, నాతో చర్చించాలంటే 'ఇంటర్నేషనల్‌ ఫిగర్‌' అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపబడిన వాడు, అయ్యుండాలి. అనీ రెచ్చిపోయారు. ఈయన గారూ, వెంకటాద్రి గారిలానే, కావాలంటే మా పిల్లల్లో ఆఖరివాణ్ణి పంపుతాను, వాడిని గెలవమనండి చాలు అంటూ సి.డి ప్రసంగాలూ విడుదల చేశారు. 4) ఇకవీరి శిష్యులూ, కొడుకులూ అయితే, వీరి కంటేనూ రెండడుగులు ముందుంటామన్నట్లు, వాడుమాకు చాలడు, వీడు మాకు చాలడు అనేగాక, వాడు పిల్లకుంక, వాడి కోసం పి.డి. గారు కావాల్నా వాడికి మేమే ఎక్కువ. ఎవడైనా సరే మమ్మెదుర్కోమను చాలు. మేమే కొండలం, ఇక ఆయనైతే (పి.డి సుందర్రావు) మహాపర్వతం. అంటూ ప్రసంగాలు చేసేశారు. 5) ఈ మధ్యరంజిత్‌ ఓఫీర్‌గారున్నూ ఈ యుగపు దేవునినోరు తానేననీ, ఈయుగానికీ ప్రపంచమంతటికీ కూడా దేవుడు తననే అపొస్తలునిగా ఎంపిక చేశాడని ప్రకటించుకున్నారు. వీరు కూడా, ఒక ప్రక్క ఎవరైనా చర్చకురండి, ఛాలెంజ్‌ అని ప్రకటిస్తారు. సరేనని ఎవరైనా సిద్దపడితే, మీ స్థాయేమిటి? నా స్థాయేమిటి? నా స్థాయికి తగి ఉండొద్దా నేను సిద్దపడాలంటే, అంటూనూ, నేను ఆకాశమంత ఎత్తులో ఉన్నాను, వాళ్ళు పెద్ద లోయంత దిగువన ఉన్నారు. వారికీ నాకూ చర్చేమిటండీ! చర్చకు సమఉజ్జీ ఉండవద్దా అనంటుంటారు. 6) ఇక విజయ్‌ కుమార్‌, విజయ ప్రసాద రెడ్డి, ఇమ్రాన్‌, షఫీ వగైరాలు కూడా, ఏదో సందర్భంలో తాము మామూలు వాళ్ళం కాదన్నట్టు, ఎదుటి వారు చిన్న వారన్నట్లు మాటలూ, హావ భావాలు వ్యక్తం చేస్తుంటారు.ఒకింత ఆశ్చర్యకరమూ, క్షేత్రస్ధాయి వాస్తవంగా అంటే, చర్చల విషయంలో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న విషయమూ అయిన ఈ స్ధాయిల విషయాన్ని ఒకింత విశ్లేషిస్తేనే బాగుంటుంది, అనిపించడంతో ఈ వ్యాసం మొదలెట్టాను. గత సంచికలోనూ కొంత చెప్పాను. ఈ విషయంలో నా వైఖరేమిటన్నది ముందుగా చెపుతాను. 1) విషయ విచారణకు కూర్చోడానికి నా వరకు నాకు ఈ స్ధాయిల గొడవలేదు. ఎందుకంటే, మాకు, ఎవరు చెప్పారన్నది పట్టించుకోవలసిన పనిలేదు, ఏమి చెప్పారో చూడడమే అవసరమూ, సరైంది కూడా. అన్న నియమం ఉంది. 2) విషయ విచారణ ప్రయోజనాన్ని గురించీ, పద్దతుల గురించీ వెనకటి మేధావులలోనూ కొందరు ఇలాంటి భావాన్నే వ్యక్తం చేశారు. యుక్తియుక్త ముపాదేయం వచనం బాలకాదపి! అన్యతృణమివ త్యాజ్య మప్యుక్తం పద్మజన్మనా!! సబబైన మాట పసివాడు చెప్పినా స్వీకరణ యోగ్యమే అవుతుంది. సబబుకాని మాట బ్రహ్మ చెప్పినా, (ఎంతవాడు చెప్పినా) విసర్జనీయమే అవుతుంది. బి) పురాణమిత్యేవ నసాధుసర్వం నచాపి కావ్యం నవమిత్యవధ్యం! సంత పరీక్ష్యాన్యతరద్భజంతే| మూడః పరప్రత్యయనేయ బుద్దిః! (ప్రాచీనులు) పెద్దలు చెప్పింది గనక అంతా మంచిదేనని గానీ, నవీనులు చెప్పింది కనుక సరైంది కాదని గాని విజ్ఞులు తలంపరు. దేనినైనా సరిగా పరీక్షించే స్వీకరించడమో, విడువడమో చేస్తారు. మూఢులు మాత్రమే అటూ ఇటూ ఇతరులననుసరించి మొగ్గుతుంటారు. సి) ......బాలాద -పి సుభాషితం!! అన్నది ప్రసిద్ది సూక్తేకదా! 3) తర్కశాస్త్రం :-తర్కం నేర్పేవాడు, విచారించి పరీక్షించే విధానాలను అభ్యసించేవారు,తనకంటే అధికులతోనూ, సములతోనూ, అల్పులతోనూ కూడా వాదిస్తుండాలి, అని చెపుతోంది.

 చర్చించాలన్న దృష్టి రెండు రకాలుగా ఉంటుంది

 1) జిజ్ఞాస, సత్యం తెలుసుకోవాలన్న దృష్టి, సత్యం ఆవిష్కరింపబడాలన్న దృష్టి కలిగిన వారు, సత్యావిష్కరణకై పక్ష ప్రతిపక్షాలను స్వీకరించి చర్చించడం. 2) జల్పదృష్టితో తాను గెలవాలి, తనది నిలబెట్టుకోవాలి, ఎదుటివాడు ఓడిపోవాలి, వానిది పడిపోవాలి, అన్న దృష్టి నుండి గానీ జరిపే చర్చా రూపం. నిజానికి ఈ రెండు సందర్భాలలోనూ విచారణకు ముందుగానే ఎవరి స్ధాయేమిటి? అన్నది పట్టించుకోనక్కరలేదు. 1వ రకంలో సత్యం తెలుసుకోవడం, సత్యమేదో తేల్చుకోడమన్నదే అందరి దృష్టీ కనుక, స్ధాయిల గొడవ అనవసరం. 2వ రకంలో ఎవరు గెలుస్తారన్నదే ఇరువురి దృష్టీ కనుక, ఎదుటివాని స్ధాయి ఏమిటన్నది ముఖ్యంగా అధికుడ్ననుకుంటున్న వాడు పట్టించుకోనక్కర లేదు. ఎదుటివాణ్ణి ఓడించడం, తాను గెలవడం అన్నదే వీని లక్ష్యం కనుక, ఎదుటివాడెంత తక్కువ వాడైతే - బలహీనుడైతే తనకంత మేలు గనుక. గెలవడం సులభమవుతుంది గనుక. అయితే గియితే, ఈ రెండవ రకంలో తన బలంపై అంతో ఇంతో అపనమ్మకం ఉన్నవాడికే స్ధాయి గురించి పట్టించుకుని, వాస్తవ పరిస్ధితుల్ని అంచనా వేసుకోవలసిన అవసరం ఉంటుంది. తేడావస్తే తానే ఓడిపోతాడుగనుక, అది చిన్న తనము - పందేలవీ ఉంటే నష్టదాయకము కూడా కనుక. గమనిక :- నిజంగా సత్యమేమిటన్నదే ఇరువురి దృష్టి అయితే ఎటువంటి వత్తిడులూ లేకుండా, స్ధాయి భేదాలంటూ మాట్లాడుకోకుండా విచారణకు- చర్చకు - సిద్దపడిపోతారు. అదేమరి! పైకి ఏమి మాట్లాడినా అంతరంగంలో తాను గెలవాలి. ఎదుటివాణ్ణి ఓడగొట్టాలి అన్న అభిలాష ఉంటే గెలుపోటములతో ముడిపెట్టి పందెమేమిటన్నదీ ఎంతన్నదీ కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలోనూ, తన శక్తి మీద తనకు సరైన అంచనా ఉన్నవాడు స్థాయీ భేదాల గురించి మాట్లాడనే మాట్లాడడు. అవకాశముంటే తనకంటే అల్పుడు పోటీకి సిద్దపడితేనే బాగుండుననుకుంటాడు కూడాను. మిత్రులారా! ఇంతవరకు నేను ప్రస్తావించిన విషయాలు సమంజసంగానే ఉన్నాయో లేదో ఆలోచించి చూడండి. ఇందులో ఏమైనా సబబుగా లేవనిపించినా, అర్ధం కాలేదనిపించినా, వెంటనే వివేకపథం స్పందనకు రాయండి. పై సంచికలో వాటిపై నా ప్రతిస్పందనేమిటో రాస్తాను. మరీ త్వరగా తెలుసుకోవాలనుంటే ఫోను చేయండి, వాట్సాప్‌ ద్వారానైనా మాట్లాడండి. నా ఫోను : 9440474404. ఇలా స్థాయిల గురించి మాట్లాడిన వారి కార్యకలాపాల గురించి ఒకింత సమాచారం రాబట్టాను. అదీ వారి వారి రచనలూ, ప్రసంగాల నుండీ. 1. పి.డి సుందర్రావుగారు :- గత 30 ఏండ్ల పై బడే వీరు వారికీ వీరికీ ఛాలెంజ్‌ ప్రకటనలూ, లేఖల రాతలూ జరిపినట్లు వారిచ్చిన సమాచారమే తెలుపుతోంది. అవి పదులసంఖ్యలోనే ఉన్నాయి. వీరికి తన స్ధాయికి తగిన వ్యక్తి కనపడినట్లుగానీ, వీరితో చర్చకు - యుద్దానికి - సిద్దపడినట్లుగానీ యుద్దం జరిగినట్లుగానీ, ఒక్కటంటే ఒక్క దాఖలా కూడా లేదు. వీరు మాత్రం, వాడిని తొక్కేశాను, వీడిని నలిపేశాను, వాడు పారిపోయాడు. వీడు ఓడిపోయాడు అంటూ చాలా సందర్భాలను ప్రస్తావించారు. మచ్చుకు 1) దీదాత్‌ 2) రావిపూడి వెంకటాద్రి 3) ఎన్‌.వి. బ్రహ్మం 4) నాసాసైంటిస్టులు 5) అద్దంకి రంజిత్‌ ఓఫీరు వగైరా వగైరా. 2) అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారు ఎందరితో చర్చకు సిద్దపడ్డారో పూర్తి సమాచారం నావద్దలేదు. గానీ 1) ఇమ్రాన్‌తో ఒక సమావేశం జరిగిందనుకుంటాను. మరి కొందరు ముస్లింలు వీరిని రా తేల్చుకుందాం అని చర్చకు పిలిచారు. 2) పి.డి సుందర్రావు గారితో వీరి గొడవ చిన్నదేమీకాదు. వీరిరువురూ తమతో సమానులెవరూ లేరని ప్రకటించేసుకున్నారు. వీరిరువురి మధ్యా చర్చ సాగలా. సవాళ్ళ వరకు పూర్తయ్యింది. నీవు సాతాను ప్రతినిధివంటే నీవు సాతాను ప్రతినిధివనీ పబ్లిగ్గా అనేసుకున్నారు. ఆ విషయాలను సి.డిలకూ ఎక్కించారు కూడా. ఒక్క విషయం చెప్పితీరాలిక్కడ. వీరిద్దరి మధ్య నున్న ప్రధాన వివాదం, నీకు బైబిలు అర్దం కాలేదంటే, నీకు బైబిలు అర్ధం కాలేదన్నదే. ఈ సందర్భంలోనే ఈ విషయాలు పరిశీలిస్తున్న వారందరికీ తెలుసుండాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకే ఒక్కటుంది. ఈనాటి బైబిలు ప్రసంగీకులలో, అంతో ఇంతో నోరుండి, గింత మంద వెంటనున్నవారందరూ లోకంలోని బైబిలు ప్రసంగీకులలో ఎక్కువలో ఎక్కువ మందికి బైబిలు సరిగా అర్ధం కాలేదని, ఏదో ఒక సందర్భంలో అన్నవారే. ఇది ఎంతటి విచిత్రమూ, విషాదకరము, హాస్యాస్పదమూ? వీళ్ళంతా కూర్చుని ఎంపిక చేసుకున్న ముఖ్యాంశాల వరకైనా ఇంతకూ బైబిలు ఏమి చెపుతోందన్నది తేల్చుకోవచ్చు కదా! ఒక్క నిజం చెప్పనా?! అదంత తేలిక్కాదని ఈ మందలో అందరకూ తెలుసు. ఈ విషయాన్ని మొత్తంగా వివరించడానికిది సందర్భం కాదు గనక ఇక్కడికి ఆపుతాను. ఈ అంశంపై 'బైబిలు - బైబిలు ప్రసంగీకులు' అన్న శీర్షికతో మరోసారి ఆ విషయాలు ప్రస్తావిస్తాను. ఇక మన స్ధాయిల వ్యవహారం దగ్గర కొద్దాం.

ఇంతకూ ఈ స్ధాయిల వ్యవహారం ఏమిటి? 

అనేకుల మధ్య నున్న హెచ్చు తగ్గుల గురించి, తర తమ భేదాల గురించి విచారించే సందర్భంలో వాడేమాట ఇది. ఈ స్ధాయిల విచారణలో ఒక వ్యక్తినుద్దేశించి అతని స్ధాయేమిటి? అని గానీ వారిద్దరిలో ఎవరి స్థాయేమిటి అనిగానీ ప్రశ్నించుకుని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ రెండు సందర్భాలలోనూ ఏ విషయంలో అని గానీ, ఏయే విషయాలలో అని గాని స్పష్టంగా అనుకుంటేనే, స్ధాయికి సంబంధించిన విచారణ ప్రక్రియ సక్రమంగా సాగుతుంది. ఉదా : 1) చదువులో అతడి స్థాయేమిటి? 2) నిజాయితీలో అతని స్థాయేమిటి? 3) సంపదలో అతని స్థాయేమిటి? 4) సంస్కారంలో అతని స్ధాయేమిటి? 5) సభ్యతలో అతనిస్ధాయేమిటి? 6) ఓరిమిలో, 7) బలంలో 8) జ్ఞానంలో 9) ఆచరణలో 10) విచక్షణలో ..... ఇలా ఏదో ఒక అంశాన్ని చెప్పుకోకుండా స్థాయేమిటి? అన్న ప్రశ్నే పుట్టదు. ఇంతవరకు నిజమో కాదో తేల్చుకోండి. నా అవగాహన ప్రకారం ఇది నిర్వివాదాంశం. ప్రస్తుతం నా స్థాయేమిటి? అతని స్ధాయేమిటి? అంటూ మాట్లాడుకుంటున్నది ఆయా మత లేదా తాత్విక ధోరణులకు చెందిన వాళ్ళే. కనుక ఈ క్షేత్రాలకు చెందిన వాళ్ళ మధ్య స్థాయేమిటి? అన్నది ఏయే అంశాలకు చెంది ఉండే అవకాశం ఉంది?  ఉదాహరణకు :- హైందవ క్రైస్తవంలోని, ఓఫీరుగారి వ్యక్తీకరణలు (ఆయన తనవిగా వెళ్ళడించిన అభిప్రాయాలు) సరైనవా? కావా? అన్నదే పరిశీలనాంశం అనుకుందాం. లేదా, ఓఫీరుగారే ప్రకటించిన ఛాలెంజ్‌ ప్రకటన విని, ఛాలెంజ్‌కి నేను రెడీ! అని ఎవరో ఒకరు ప్రకటించారనుకోండి. అప్పుడు ఓఫీరుగారు, నీవు రమ్మంటే రావడానికి నీస్ధాయేమిటి? నాస్థాయేమిటి? అనిగానీ, నా స్థాయి ఆకాశమంత - నీ స్థాయి పాతాళమంత అనిగానీ అన్నారనుకోండి. 1) నా గ్రంధాన్ని తప్పుబట్టేవాడుంటే రావచ్చు ఎవరైనా? అయితే వాళ్ళు ఓడితే బాప్తిస్మం తీసుకోవాలి. నేనోడితే హిందు నవుతా. అన్నాయన, అందుకు సిద్దమై వచ్చిన వాళ్ళను నీ స్థాయెంత? నా స్థాయెంత? అనిగానీ నీవు నాకు చాలవు అని గానీ అనవచ్చా, అనకూడదా? 2) స్థాయేమిటన్నది తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడ్డా, ఎదుటివాని స్థాయేమిటో నేను నిర్ణయిస్తానని ఓఫీరుగారు అనవచ్చా? అనకూడదా? 3) ఆ వచ్చిన వాడున్నూ, నీస్థాయేమిటో నేనే తేల్చుతానని ఓఫీర్‌గారితో అన్నాడనుకోండి! అందుకు సరే తేల్చు అని ఓఫీరుగారు ముందుకొస్తారా? రారా? గమనిక :- అసలింతకూ ఏయే విషయాలలో స్థాయి గురించి విచారించాలో, ఏ కొలతల ప్రకారం విచారించి నిర్ణయించాలో నిర్ధారించేదెలా? ఎవరా పని చేస్తారు? చేయాలి? అలా కాక, ఎవరికి వారే నేనింతటోణ్ణి, నువ్వంతటోడివి, అంటూ ప్రకటించేస్తే అది సరైన విచారణే అవుతుందా? అదీకాక, పోటీలో పాల్గొనే ఇరుపక్షాలే ఎవరి స్థాయెంతో నిర్ణయం చేస్తామనడం సరైందేనా? కాదా? నా అవగాహన ప్రకారం అది సరికాదు గాకకాదు. ఎవరి స్థాయెంతన్నది తేల్చుకోవలసివస్తే, 1) ఏ విషయంలోనో అది స్పష్టంగా ప్రకటింపబడాలి. 2) ఎవరికి వారు ఆ విషయంలో వారి స్థాయిని తెలిపే సమాచారాన్ని బైట పెట్టాలి. 3) వాటన్నంటినీ పరీక్షించి నిర్ణయించే విజ్ఞులు నిస్పాకిక్షులను సిద్దం చేసుకోవాలి. 4) వారున్నూ, ఆ విషయంలో స్థాయిల్ని నిర్ణయించడానికి అవసరమైన విధి విధానాలననుసరించి వారి వారి స్థాయిల్ని నిర్ణయించాలి. అదెలాగంటే, ఫలాని గ్రంధం విషయంలో నీ అవగాహనేపాటిది? అన్నది స్థాయికి చెందిన పరిశీలనాంశం అనుకుంటే 1) అతనెంత వయస్సు కలవాడు? అన్నది అవసరమా? 2) అతడెంత చదువుకున్నాడు, ఏమి చదువుకున్నాడు? అవసరమా? 3) అతడెంత ప్రసిద్దుడు? అన్నది అవసరమా? 4) అతని కెంత ఆస్తి ఉంది అన్నది అవసరమా? 5) అతడే కులానికి లేదా మతానికి చెందినవాడు? అన్నది అవసరమా? 6) అతనికి అనుచరణ గణం ఎంతుంది? అవసరమా? 7) అతడెన్ని ప్రసంగాలు చేశాడు? ఎన్ని రచనలు చేశాడు అవసరమా? 8) అతనికి ఎన్ని భాషలు వచ్చు అన్నది అవసరమా? 9) అతడెన్ని దేశాలు తిరిగాడు అన్నది అవసరమా? గమనిక :- నిజానికి అవసరమైన నాలుగంశాలను ప్రక్కన పెట్టి, ఇలా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. ఎందుకంటే, ఆ విషయానికి సంబంధించిన కొద్దిపాటి వివరాలు తప్ప ప్రపంచంలోని ఇంకేదీ అవసరంలేదు ఆ విషయంలో అతని స్థాయి ఏమిటన్నది నిర్ణయించడానికి. విషయం అర్ధంమవుతుందా? ఈ సందర్భానికి చెందిన కొందరు అడ్డగోలు రాయుళ్ళ పోకడ మరోరకంగా ఉంటుంది. ఒక పోలిక చెపుతాను చూడండి. ఒక చదువుకున్న కుర్రాడు ఒక పల్లెటూర్లో ఉన్న నిరక్షరాస్యుడైన మోతుబరి రైతును, ఫ్యాక్షన్‌ నాయకుణ్ణి ఒకలెక్కకు సమాధానం చెప్పగలరా? అని పదిమందిలో అడిగాడు. ఈయన, అది అవమానంగా భావించి నేనెవర్నో తెలుసా? నన్నే ప్రశ్నలడిగేంతటివాడివా? పెద్దా చిన్నా చూసుకోవద్దా? నీలాంటి కుర్రనా ... అడిగితే చెప్పేస్తానా? ఇంకోసారి నీ స్థాయేమిటో, నా స్థాయేమిటో తెలియకుండా ఇలాగే మాట్లాడితే, నీకో మంచి పాఠం చెపుతాను. అంటూ గదమాయించి పంపేడు. అక్కడే ఉన్న అతని బంట్లు, పాలేళ్ళు, మా అయ్యగారంటే ఏమనుకున్నారు. ఆ పిల్ల కాకిగాడడిగిందానికి, మళ్ళా అతడి జీవితంలో అలాటి వడగకుండా, ఏకబిగిని నోరుమూయించి పంపిండు, అని జేజేలు పలికారు. మరికొందరైతే ఆడు ఓడిపారిపోయిండు మన దొర గెలిచి మీసాలు మెలేసిండు అని తెగ చెప్పుకున్నారు. పాఠక మిత్రులారా! ఒకింత పెద్దది చేసి చెప్పినట్లున్నా, జరుగుతున్న వాస్తవాన్ని పట్టిచ్చే అంశాన్నే పైన చూపించాను. కావాలంటే ఈ పోలిక సరైందేనని సందర్భం వచ్చినప్పుడు ప్రయోగం చేసి చూపిస్తాను. సరేదాని విషయమలా ఉంచుదాం. ఇంతకూ మన ఓఫీరుగారి సంబంధంగా గానీ, పి.డి సుందర్రావుగారి సంబంధంగాగానీ, అలాటి, మీలెవలేమి? మీ లెవలేంటి? అనే ఎవరి సంబంధంగానైనా ఎవరి స్థాయి ఏమిటన్నది సరైన పద్దతిలో విచారించి నిర్ధారించాలంటే, పట్టి చూడాల్సిన అంశాలేమిటి? 1. విషయం జ్ఞాన క్షేత్రానికి సంబంధించిందా? పనుల - కర్మ - క్షేత్రానికి సంబంధించిందా? విడగొట్టుకోవాలి. 1. జ్ఞాన క్షేత్రానికి చెందిందైతే ఏ విషయానికి సంబంధించిన జ్ఞానమన్నది తేల్చుకోవాలి. ఉదా :- బైబిలులోని ఫలాని వాక్యానికి అర్ధమేమిటి? అన్నది తేల్చుకోవలసిన సందర్భమైతే 1. ఓఫీరుగారి భాషా పరిజ్ఞానమేపాటిది? అర్ధ నిర్ణయ పద్దతుల విషయంలో అతని అవగాహనేమిటి? మరో వ్యక్తి (సురేంద్ర అనుకుందాం మాటవరసకు) భాషా పటిమ ఏపాటిది? అతని కున్న అర్ధ నిర్ణయ సామర్ధ్యం ఏపాటిది? అధ్యయన పద్దతి తెలిసినవాడేనా? దానిని వినియోగించే వడుపున్నవాడేనా? శాస్త్రీయ భాష తెలిసినవాడేనా? ఆలంకారిక భాష వాడా? ఇలా భాషాపరంగా అతని స్ధాయేమిటి? ఇరువురిలో ఎవరి స్థాయేమిటి? పట్టి చూడాలి.

అత్యంత ప్రధానాంశంఏమంటే 

ఆయా విషయాలలో వారి స్థాయేమిటో పరిశీలించాలన్నా, నిర్ణయించాలన్నా, ముందుగా, అందుకు అవసరమైన వారి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎవరికి వారు నిర్ణేతలకు అందించాల్సి ఉంటుంది. 1) ఆ సమాచారమున్నూ అప్పటి వరకు ఆ విషయంపై వారు కనపరచిన సామర్ధ్యాలకు చెందినదై ఉండాలి. 2) అవసరమైతే భాషా పరమైన ప్రయోగ పరీక్షా జరిపి, ఆ పైనే వారి వారి స్థాయేమిటో నిర్ణయించాలి. ఇక పోతే, చర్చకు సిద్దపడేవాళ్ళ స్థాయేమిటన్నది పరిశీలనాంశమైతే. అట్టి చర్చ. 1) చర్చనీయాంశం పై అతని స్థాయి 2) భాషా పటిమ 3) వాదన పరంగా అతని స్థాయి 4) నిరూపణ విధి విధానాలకు చెందిన అతని స్థాయి, అన్నవి పట్టి చూడాల్సిన అంశాలవుతాయి. ప్రస్తుతం మన మధ్య ఏర్పడి ఉన్న వివాదం లేదా చర్చకు సంబంధించినంతలో పై నాలుగంశాలూ ముడిపడి ఉంటాయో లేదో ఆలోచించండి. అలాగే స్థాయి ఏమిటన్నది చూసుకోవలసిన మరేమైన విషయాలున్నాయేమో చెప్పండి. అట్టి వాటన్నింటికి సంబంధించి, ఎవరి స్థాయేమిటన్నది తేల్చుకోడానికే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే, నా వరకు నేను సిద్దం. గమనిక : చర్చల సందర్భాలలో ఈ స్థాయిల గొడవ ప్రధానాంశంగా లేవనెత్తబడుతున్నది గనుక, ఆ స్థాయిల గొడవ గురించి పైన వివరించిన విషయములలో ఏవైనా సవరణలు, పూరణలు, సలహాలు ఉంటే వివేకపథంకు స్పందన ద్వారా తెలియజేయమని కోరుతున్నాము. ముఖ్య గమనిక నాతో భేటీకి సిద్దపడే ఎవరికైనా నా ఈ ఆహ్వానం సమానంగా వర్తిస్తుంది. ఏ విషయంలో లేదా ఏయే విషయాలలో ఎవరికెంత తెలుసు అనిగానీ, ఎవరిది సరైంది అన్నది గానీ, నిర్ధారించుకోవడమే మన మధ్యనున్న వివాదాంశపు సాధారణ రూపం. ఆ పరిశీలనా వేదికకు లేదా ఆ చర్చా వేదికకు అవసరమైన అంశాలు ఇవిగో ఇవే. 1) వివాదాంశపు ఎంపిక, దాని క్రింద వారు వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు. 2) వేదిక నిర్మాణం. వేదికలో తప్పక ఉండాల్సిన పక్షాలు, వాటి స్వరూపస్వభావాలు. ఎ) పక్షం - బి) ప్రతిపక్షం సి) పరిశీలన (విజ్ఞుల) పక్షం డి) నిర్ణేతల పక్షం గమనిక :- 1) వేదిక లక్ష్యం ఒక సిద్దాంతాన్ని పరిశీలించి నిర్ణయించడమన్నదైతే అలాటి వేదికలో ప్రతి పక్షం ఉండక్కర్లేదు. ప్రతిపాదకుడు, పరిశీలకులు ఉంటే చాలు. పరిశీలకులే నిర్ణేతలుగనూ సరిపోతారు గనుక. అలాకాదనుకుంటే, మూడవదిగ నిర్ణేతల పక్షం ఉండవచ్చు. 2) అలాకాక వేదిక లక్ష్యం ఎవరిది సరైందో పరీక్షించడం అన్నదిగా ఉంటే, అలాటి వేదికలో ఎ) పక్షం బి) ప్రతిపక్షం సి) విజ్ఞుల పక్షం డి) నిర్ణేతల పక్షం అన్న నాలుగు పక్షాలుంటాయి. సి.డి లను ఒక్క పక్షంగానే అయినా పెట్టుకోవచ్చు. యోగ్యతలు :- 1) అన్ని పక్షాలకూ వివాదాంశాన్ని అర్ధం చేసుకోడానికీ, విచారించడానికీ తగిన భాషా పరిజ్ఞానం ఉండాలి. భాషా నియమాలు తెలిసుండాలి. 2) పరిశీలనలో వాద,ప్రతివాదులు, వారి వాదనను వినిపించి అది సరైందేనని నిర్ధారించే పని చేస్తారు కనుక, అన్ని పక్షాలూ అవసరమైన వాద నియమాలను ఏర్పరచుకుని ఒక అంగీకారానికి రావాలి. 3) అంతిమంగా ఆ ప్రతిపాదన - దానిని నిలుపుకునేందుకు ఆ ప్రతిపాదక పక్షం వినిపించిన వాదన, భాషా నియమాలకు, వాద నియమాలకు లోబడి సరిగా ఉందో, లేదో నిర్ధారించేపని ఉంటుంది కనుక, నిర్ధారణ నియమాలు ఏర్పరచుకోవాలి. పై అంశాల వరకు, ముందుగానే ఎవరిస్థాయి ఏమిటో తెలుసుకునే, చర్చకు కూర్చుందాం అన్న నిబంధన పెట్టుకున్నప్పుడే స్ధాయిల విషయం ముందుకొస్తుంది. అదిగో అలాటి సందర్భంలో కలిసే నాతో భేటీకి సిద్దపడతాను అనేవాళ్ళను దృష్టిలో పెట్టుకునే, నేను సిద్దం పై విషయాలలో ఎవరి స్థాయేమిటో తెల్సుకునే చర్చకు కూర్చుందాం అనంటున్నాను. ఈ అంశం ఇప్పటికే ఏర్పడి స్థాయిల గొడవా తెరపైకి తెచ్చిన పి.డి సుందర్రావు గారికీ, అద్దంకి రంజిత్‌ ఓఫీరు గారికీ ప్రధానంగా వర్తిస్తుంది. స్థాయేమిటోనూ తేలాల్సిందేననే ఎవరికైనా వర్తిస్తుంది. నాతో చర్చకు సిద్దపడే ఎవరితోనైనా, స్థాయి విషయం పరిశీలించుకోడానికి నేను సిద్దం. ఇది రాతరూపంగా అంగీకరించి ధృవపరుస్తున్నాను. - సురేంద్ర 

No comments:

Post a Comment