Sunday, May 6, 2018

మేలుకొలుపు 1-7


మేలుకొలుపు 7
స్వమంతవ్యము | నేనూ నా పత్రిక] -  సంపుటి - 1. -  సంచిక - 7       1-9-1991
గత సంచికలో ముఖచిత్రంలోని కొన్ని అంశాలు విపులంగా పరిశీలించాము. వాస్తవిక దృక్పధం కలవారలే సత్యాన్వేషణ చేయగలరనీ చెప్పాను. సత్యాన్వేషణ అన్న పదంలో తెలిసికోవాలనే, నిజం తెలిసికోవాలనే ఆకాంక్ష ఉంది. సత్యముంటే ఉన్నది అనీ, ఉన్నది ఉన్నట్లు అని అర్ధం చెప్పుకోవచ్చు. ఈ అర్థంనుండి - చూస్తే సత్యమన్న పదం ఏదో విషయానికి సంబంధపడే అర్ధమవుతుందన్నమాట. ఏది ఉన్నది? ఎలా ఉన్నది? ఎక్కడ ఎప్పుడు ఉన్నది? యిలా ఆయా సందేహాల కారణంగానే అన్వేషణ-తెలుసుకునే యత్నం-ప్రారంభమవుతుంది. నిస్సందేహస్థితి , ఏర్పడేవరకు కొనసాగుతుంది. పిదప ఆ విషయంలో అన్వేషణ ముగుస్తుంది. మరల - మరో విషయంలో సందేహం... అన్వేషణ... సమాధానము. అన్వేషణ ముగింపు. జీవితాన్ని గనుక సవ్యంగా పరిశీలించగలిగితే ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ కొనసాగు తూనే ఉన్నట్లు తెలుస్తుంది. :
ఇక్కడ సత్యాన్వేషణము అన్న పదాన్ని రెండు విధాలుగా ఉపయోగించే వీలుంది. అది వ్యక్తిపరంగానూ, విషయపరంగానూ, వ్యక్తిపరంగా సత్యాన్వేషణము అన్నది నిజం తెలిసికోవాలనే స్వభావాన్ని సూచిస్తుంది. దీనినే పూర్వసంచికలలో గవేషణా ప్రవృత్తి కలిగి ఉన్నాడు మనిషి అని చెప్పాను. 6వసంచిక లోనున్నూ ఏదో విషయాని చెందిన అన్వేషణ ముగించగలడేగాని మనిషి అన్వేషణే అక్కరలేని స్థితికి చేరలేడు. చేరకూడదు అనే అభిప్రాయాలు వ్యక్తం చేశాను. విషయపరంగా అన్వేషణము అన్న పదం ఆయా విషయాలకు చెందిన జ్ఞానంయొక్క అసమగ్రతను సూచిస్తోంది. నేను ప్రయోగిస్తున్న సత్యాన్వేషణేము అన్న పదం వ్యక్తి ఎట్టి స్వభావాన్ని కలిగి ఉండాలి? అన్న దృష్టినుండేగానీ, తాను చెప్పుతున్న విషయంలో తెలియనితనాన్ని వ్యక్తీకరించుటకై చెప్పుతున్నది కాదు. ఈ విషయాన్ని పత్రిక పేరూ, ముఖచిత్రంలోని మాటలుకూడా రూఢిపరుస్తున్నాయి. మేలుకొల్పాలన్న యోచన నిద్రించేవాడికి కాదు కదా!? మేల్కొన్న వాడు అన్న పదం ఏదో విషయానికి చెందిన జ్ఞానస్థితిని తెలుపుతోందికదా!? కనుక దీనినిబట్టి నా రచనలోని 'సత్యాన్వేషణ' పదం తెలిసికోవాలనే ప్రవృత్తి బోథకంగా గ్రహించాలి. అదిన్నీ ఎందుకు ప్రధాన విషయంగా చూడవలసి వచ్చింది? విజ్ఞాన చరిత్రను పరిశీలిస్తే యదార్థాన్వేషకులై కూడా ఒక దశలో, జీవితానికి చెందిన ఒక వాస్తవాన్ని గమనించి (గమనించామని భ్రమించైనా కావచ్చు) ఇక అన్వేషించ వలసిందేమీ లేదన్న నిర్ణయానికి (ఆయా కాలాలనాటి మేదావులే సుమండీ) వచ్చినట్లు కనబడుతోంది. ఈనాటి సహేతుకమైన పరీక్షలకు అందులో ఏ ఒక్కటీ పూర్ణంగా నిలుచుటలేదు. పాక్షికత చోటు చేసికుంటోంది. గజాంధ న్యాయంగా ఉందీ వ్యవహారాన్ని చూసే-కొంతమంది గృడ్డివాళ్లు ఒక ఏనుగును పరీక్షించి ఏనుగంటే ఎలా ఉంటుందో నిశ్చయించారనుకోండి. ప్రతి ఒక్కడూ అనుభవంలో చూసిన దాన్నే చెపుతున్నాడు. నిజాయితీగానే చెపుతున్నాడు. అయినా ఒకళ్ళదొకళ్ళకు సరిపడడం లేదు. ఒకరిదొకరంగీకరించడం లేదు. తాను పాక్షిక జ్ఞానాన్నే పొంది ఉన్నానని గానీ, మరింత పరిశీలించవలసి ఉందనిగానీ తలంచుటలేదు. (అన్వేషణ ముగిస్తు న్నాడు) యోచనాశీలురను ఈ విషయంలోనూ మేలుకొల్పాలన్న యోచననుండే అన్వేషణ ముగించుకోకు. అన్వేషించవలసిన విషయం మారుతుందేగానీ, అన్వేషణే లేకుండా పోవడం మంచిదికాదు అన్న మాట పుట్టింది నాలో. ఇక్కడ నేను చెప్ప దలచుకున్న ముఖ్య విషయమేముంటే ఎవ్వరైనా తనను తాను అన్వేషకుడినని చెప్పుకున్నా, కానని చెప్పుకున్నా వాస్తవంగా అతడు " ఏదో విషయంలో అన్వేషకుడిగానే ఉంటున్నాడు. అన్వేషిస్తూనే ఉంటాడు. ముఖచిత్రంలోని సత్యాన్వేషణము అన్న పదం వెనుక నా దృక్పధమిదే. ఇప్పటికే అనుభవంలో ఎన్నో విష యాలు మరింత తెలియవలసింది లేదన్నంతగా  తెలిసికొన్నా, ఎప్పటికప్పుడు ఏదో విషయం నన్ను గమనించావా ? అన్నట్లు ఎదురుపడుతూనే వుంది నా జీవితంలో. అలానే లోకాన్ని గమనిస్తున్నప్పుడు అనేకులు తమకు తామే పరిపూర్ణులం అన్న భ్రాంతిలో కొట్టుకుపోవడమూ కనబడింది. అలా అనేకంగా కలిగిన అనుభవాలనుండే, ఓ మనిషీ, అన్వేషించే స్వభావాన్ని చంపివేయకు. అన్వేషకుడిగానే ఉండు. నష్టమేమీ కాదు. అని చెప్పాలన్న భావన స్థిరపడింది నాలో. తెలుసుకునే యత్నం చేస్తూ ఉండు. ఇప్పటికి తెలిసింది తెలుపుతూ ఉండు. సత్యమని నిర్ణయించబడినదానినే తెలుపు. అయినా దానిని కూడా ఏ క్షణంలోనైనా మరల పరీక్షించుకొనుటకు సిద్ధంగా ఉండు. ఇదే నేననుసరిస్తున్న విధానము. ఆనుసరించమంటున్నది కూడా ఇదే.
వెనుకటి తాత్వికులలోనూ ఈ భావన చోటు చేసుకునే ఉందనడానికి తగిన ఆధార మొకటుంది మనకందుబాటులో.అధ్యయన మధ్యాపనం బ్రాహ్మ్యం కర్మ స్వభావజం!తెలుసుకుంటూ ఉండడం తెలియజేస్తూ ఉండడం అన్న పనులు స్వభావంగా కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు అని పై వాక్యానికర్థం.
గమనిక : ఇక్కడ బ్రాహ్మణపదం శిరోభాగానికి-జ్ఞానానికి--ప్రతీకగా వాడబడింది మాత్రమే, నేటి మన అనుభవంలో చూస్తున్న కుళ్లు కులవ్యవస్థకు  చెందినది కాదా పదం. తెలుసుకోవడమూ- తెలియజెప్పడమూ ఎవనికి స్వభావకర్మలుగా ఉంటాయో అని అర్ధం. ఇది విద్యాసంప్రదాయానికి చెందిన అంశం. సహజ దేహంలో జ్ఞానభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారెట్టి దృక్పధం కలిగి ఉండాలి ? లేక ఉంటారు ? అన్న ప్రశ్నకు సమాధానరూపమై ఉంది పై శ్లోక భావం. (సత్యాన్వేషణ మండలి ప్రాధమిక నియమాలలో తెలియంది తెలుసుకుంటూ ఉండు. తెలిసింది తెలుపుతూ ఉండు అన్నది కూడా ఒకటి) పై వాక్యభావం దేనిని చూపెడుతోంది. ఇప్పటికెన్నో తెలిసివున్నవనీ, మరెన్నో తెలియవలసి ఉన్నవనే కదా! ఇదేమి భ్రాంతినుండి పుట్టిన భావం కాదు. ఎంతో లోతైన అవగాహననుండి, వాస్తవిక దృష్టినుండీ ఏర్పడ్డ నిశ్చయమిది. ఈ విషయం మీరూ. మీమీ యనుభవాలతో పోల్చుకొని ఒక నిర్ణయానికి రండి.
               లోకంలో రెండురకాల మనుషులు కనుపిస్తూంటారు. ఒక వర్గంలో ఆత్మ న్యూనతా భావం స్థిరపడి వుంటే, రెండోవర్గం వారిలో ఉండకూడనంత ఆధిక్యతా భావం పాదుకొని ఉంటుంది. నిష్కర్షగా చెప్పాలంటే ఈ రెండూ తప్పు అభిప్రాయాలే. అభివృద్ధి నిరోధకాలే. ఒక రకం వారు మనవల్ల కాదు అని యత్నించడం మానితే, మరోరకంవాడు ఏమిటి దానికై యత్నించేది అన్న దృష్టినుండి పని చేయడం మానతారు. రెండు దృష్టులనుండి ఏర్పడుతున్న ఫలితమొక్కటే.
  జీవితాధ్యయననమన్నది బహుముఖాలుగానూ, జాగరూకతతోనూ అధ్యయనం చేయవలసినదిగా ఉన్నదన్న వివేకం లోపించినప్పుడల్లా వ్యక్తి వికాసానికిగానీ సామాజిక వికాసానికి గానీ ఎంతో కొంత అపకారం జరిగి తీరుతుంది. ఏతావాతా నేచెప్పదలచినదేమంటె అన్వేషణా దృష్టిని విడువకు. అన్వేషించే క్షేత్రాలు చూరపచ్చు. అంతేకాదు. అన్వేషణ ముగించిన వాటిని కూడా ఎప్పుడు అవసరపడితే అప్పుడు పునఃపరీక్ష చేసికొనుటకు సిద్ధంగా ఉండు , అన్నదే ఈ భావం : మీలోనూ దృఢ పడుటకొరకు కొన్ని దృష్టాంతాలను చూపుతాను.
  1) శంకరరామానుజాది ఆస్థికులూ, మార్క్సు, సార్త్రే లాటి పదార్థవాదులూ, గోరా లాటి నాస్తికులూ ఇలా ఆయా సిద్ధాంత స్థాపకులూ, ప్రవర్తకులూ కూడా ఎవరికి వాళ్లు తాము గమనించ వలసింది గమనించేశామనే అనుకున్నారు.జీవితాన్ని అర్థం చేసుకున్నామనే అనుకున్నారు. అందరూ తాము గమనించామనుకున్న దానికి అన్యమైన వాటిని తప్పులుగానో, పాక్షికమైనవి (అసంపూర్ణ మైనవి)గానో కొట్టి పారేశారు. ప్రతివారు ఎదుటివారి గురించి దోషాలను సహేతుకంగా చూపే యత్నం చేశారన్న మాట. తమాషా ఏమంటే ఎదుటివారందరు దాదాపు అన్వేషణ చేయదగి యున్నారనే ప్రతివక్కరూ చెపుతున్నారు. తాము అన్వేషణ ముగించామని తలుస్తున్నారు. మేధావులు ఒకే వేదిక పైకి రాలేకపోవడానికి ఇదో అంతర్గతమైన (మౌలికమైన) కారణమన్నది మీకు  తట్టడం లేదా? వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు సాధించవలసినదిగా ఉన్నది. అనగా సాధ్యమన్న మాట. దానిని పొందుటకు గాను సాధన, సామగ్రీ కావలసి ఉంది. వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు ఎప్పుడు, ఎలా కలుగుతుంది ? అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే, సమిష్టి వ్యష్టి యోగ క్షేమములకు తగిన వ్యవస్థ నేర్పాటు చేసి అమలు పరచుటా, వ్యష్టిన్నీ స్వార్ధం ప్రధానం కాకుండా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుట ద్వారా సమిష్టి యోగ క్షేమములకు తనవంతు కృషి సల్పుటా అన్నది అమలు చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ?
వివేకము :- వాస్తవిక దృష్టి కలిగి, సత్యాన్వేషణద్వారా ఏర్పడ్డ జీవితావగాహన ననుసరించి ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు, ఎంత చేయాలి లాటి విచక్షణాజ్ఞానాన్నే వివేకమంటాము. ఇది జ్ఞానప్రియులలోనూ, శారీరక క్రియల లోనూ, సామాజిక సంబంధాలనుండి ఏర్పడిన బాధ్యతలూ, హక్కులపరంగాను పనిచేస్తూ ఉంటుంది. .
 ధర్మాచరణము :- పైచెప్పబడ్డ వివేకం  యొక్క మార్గదర్శనంలో ఆయా కర్మల నాచరిస్తూ ఉండడాన్ని ధర్మాచరణమంటారు. Note: - ధర్మమన్నది మరింత పరిశీలించ దగిన అంశముగా నున్నది కనుక దీనిని ప్రత్యేక సంచికగా ముందు ముందు మీ ముందుంచుతాను.
    మానవ స్వభావాన్ని వీక్షించితే ప్రతి మనిషీ తనది కాని దానిని తనదిగా చేసికుంటానికీ, తన దానిని - నాదిని - బలపరచడానికి నిరంతరం యత్నిస్తున్నాడు. ఇదో 'తాత్వికాంశము. కనుక ఎంత పరిధిలో నా అన్న భావన పెట్టుకోగలడో దాని యోగక్షేమాలకై యత్నిస్తున్నాడన్న మాట. సామాజిక సమస్యల పట్ల వేదన కలిగి, పరిష్కారాలు వెదుకుతున్న వారు ఖచ్చితంగా అవగాహన చేసికోవలసిన విషయాలలో ఇది ఒకటిగా ఉంది. మనం సృష్టి, సమిష్టి శ్రేయస్సును సాధ్యంగా పెట్టుకున్నాం. అదెట్లు నెర వేరుతుంది. అంటే వ్యష్టి సమిష్టిలు ఒకరిపట్ల ఒకరు నా అన్న భావన దృఢంగా కలిగి ఉండాలన్న సూట. అప్పుడు హృదయ గతంగా పరస్పర యోగ క్షేమాలను కాంక్షించే స్థితి ఏర్పడుతుంది. సూత్రప్రాయంగా చెప్పాలంటే మూల సమస్యకు మౌలిక పరిష్కారమన్న మాట ఇది -- వసుధైక కుటుంబ భావన మన్న పదం దానినే సూచిస్తోంది. (సమిష్టి అన్న పదంచే సామాజిక వ్యవస్థా, దానిని నడపు రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థా, రక్షణ వ్యవస్థా, ప్రభుత్వమూ అన్నది సూచింపబడుతున్నాయి. వ్యష్టి అన్న మాటచే వివేకమూ, బాధ్యతలూ, ప్రజలూవక్తిగత హక్కులూ అన్నని సూచితములు.) ఒకే కుటుంబంలో ఉన్న అందరూ, అందరనూనావారు' అనే భావిస్తారు. మనమంతా ఒక్కడి అనే భావనే వారిలో ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాన్ని నడుపుతున్న - నియంత్రిస్తున్న వారిలో ఈ భావన ఉంటుంది. ఉండాలి. చిన్న వారిలో ఈ భావన లేకున్నా వారు, పెద్ద వారి - ఈ భావన కలిగియున్న వారి అదుపులో ఉండాల్సి ఉంది. అలానే సమాజాన్ని నియంత్రించే అన్ని శాఖలకు చెందిన మేధాపులలోనూ ఈ భావనవుండాలి. సామాన్యులలో అట్టి భావన లేకున్నా, అట్టి భావన కలిగి -యున్న వారిచే ఏర్పాటు చేయబడ్డ విధి విధానముల నాచరించునట్లు వారిని అదుపు చేయాలి. అప్పుడు ఒకే పెద్దకుటుంబం ఏర్పడుతుందన్న మాట. నిజమైన వ్యష్టి సమిష్టి శ్రేయస్సు అప్పుడే సాధ్యమవుతుంది. అంతవరకు అన్నీ చిలక పలుకుల మాదిరే అవుతాయి.
   వసుధైక కుటుంబ భావన పొందాలి, వీలయినంత ఎక్కువ ప్రజలలో దీనిని కలిగించాలి. అట్లేర్పడిన వివేకంచే నిర్మితమయిన ప్రణాళికను అందరూ అనుసరించేట్లు వత్తిడి చేయగల వ్యవస్థ నేర్పాటు చేయగలగాలి. మొత్తం మీద ఏమన్నట్లయింది ?  ప్రతి మనిషి ఆత్మ నియంత్రణ నన్నా కలిగి ఉండాలి, లేక వ్యవస్థచే నియమితుడన్నా కావాలి. ఇప్పటికి ముఖచిత్ర వృత్తంలోని అంశాలను పరిశీలించి ఇట్లయింది. 1. వాస్తవిక దృష్టి, 2. సత్యాన్వేషణా ప్రవృత్తి, 3. వివేకము, 4. వివేకాన్ననుసరించిన కార్యాచరణము. వీటన్నిటి బలిమిచే ఏర్పడ్డ వ్యవస్థ, వసుదైక కుటుంబ భావన వల్ల ఏర్పడే వ్యవస్థ అవుతుంది. తద్వారా వ్యష్ట సమిష్టిల  శేయస్సు, సాధింపబడుతుంది.
 వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు అనవలసిన పనేముంది. సమిష్టి చేయస్సు అంటే  సరిపోతుంది గదా అన్న ఆక్షేపణ రావడానికి వీలుంది యిచ్చట. దీనినర్దం చేసికోవడానికి నిషయాన్నీ, జీవితాన్నీ మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. విశ్లేషిస్తాను పరిశీలించండి.
సమాజంలోని ఆయావ్యక్తులచే చేయబడుతున్న పనులు 3 రకాలుగా ఉన్నాయి.
1. ఒక్కడి ప్రయోజనం కోసం ఎక్కువమంది నష్టానికో, ఇబ్బందికో గురిఅయ్యేట్లు చేసేవి.
2. ఎక్కువ మంది ప్రయోజనం కొరకు ఒక్కొడికి నష్టాన్నో యిబ్బందినో కలిగించేవి.
8. అందరకు ఎవరి విదులు వారికీ, ఎవరి హక్కులు వారికి అందేట్లు చేసేవి.
మరో రకంగా చెప్పుకుంటే 1. ఎవరేమైతే నేమి నావరకు బాగుంటే చాలు ననుకునే రకం.
2. నేను బాగుండాలి. నలుగురూ బాగుండాలి అని ప్రవర్తించే వారు. 8. నేనేమైతేనేమి నలుగురకూ మేలు జరిగితే చాలు ననుకునేవారు.
1వ వారు స్వార్ధం ప్రధానమైనవారు, 2వ వారు ధార్మికులు, 3వ వారు త్యాగులు. ఇక్కడే మనం గమనించవలసిన ప్రధానాంశముంది. 1, 3 స్వభావాలూ ప్రవర్తనలూ కోరదగినవి కాదు. అందులోని భావాలలో తేడా ఉన్నా జరుగుతుంది కొందరకు జరుగకూడనిదే. 1వ రకం బలపడి సమాజము అధార్మికమైనప్పుడు 3వ రకం వ్యక్తుల అవసరం ఏర్పడుతుంది. ఎందుకొరకు ? సమాజాన్ని రెండవ స్థితిలో నిలిపి ఉంచుటకు, అంటే 1వ రకం బలపడడమంటే సమాజ శరీరానికి రోగం రావడం అన్న మాట. 3వ రకం చికిత్సా ఔషదమూ అవుతుంది. స్వస్థత రెండవ స్థితి అవుతుంది. పైన నేను పేర్కొన్న వ్యష్టి సమిష్టి  శ్రేయస్సు అన్నది అప్పుడే సాధ్యమవుతుంది. 1వరకం వారు సమాజాన్ని కాల్చుకు తింటుంటే, 3వ రకం సనూజం కొరకై తాము కాలిపోతుంటారు. వారు చిన్న వారని కాదుగానీ వారి అవసరం (త్యాగుల అవసరం)లేనిస్థితే నిజంగా కోరదగిన స్థితి. ఇంత ఆలోచించే వ్యష్టి, సమిష్టి అన్న రెండు పదాల్నీ వాడాను. వాస్తవిక దృష్టి నుండి వీటిని పరిశీలించండి. -
అసతోమా సద్గమయ : -తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఆన్న దాడిలో మౌలిక మైన జీవి ఆకాంక్షలు వ్యక్తం చేయబడ్డాయి. ఇవి సార్వజనీనమూ, సార్వ కాలీనులైన విషయములుగాన తాత్విక విలువ కలిగి యున్నవి.
అసతోమా సద్గమయ - అసతః, మా, సత్, గమయ అన్న పదాల కూడికగా నున్నది.
లేమి నుండి కలిమి లోనికి పోవాలన్న కోర్కెకు సంకేత మీ వాక్యము. ఇది ఎదుగుదలకు చెందిన అభిలాషను వ్యక్త పరుస్తోంది. అసమర్ధతనుండి బైటపడి సమర్ధతను పొందాలనీ లేక అపరిపూర్ణత నుండి పూర్ణతలోనికి చేరాలనీ, భావన వ్యక్త పరుపబడింది. జీవి ఆకాంక్షలలో ఒకటైన ఎదగాలనుంది అన్న ప్రవృత్తినీ స్వభావాన్ని వ్యక్తం చేసే సూత్రమిది. ప్రతి మనిషికీ అలా ఉందో లేదో ఆలోచించుకోండి. ఏ విషయంలో ఎదగాలి అని చూస్తే వ్యక్తుల్ని బట్టి విషయాలు మారతాయేగానీ, ఎదగాలని లేకపోవడం మాత్రం జరుగదు.
తమసోమా జ్యోతిర్గమయ : తమస: మా జ్యోతి: గమయ :- చీకటినుండి వెలుగులోనికి, తెలియని తనాన్నుండి తెలిసిన స్థితికి చేరాలన్న  కోర్కెను తెలుపుతున్నదీ వాక్యము. మనిషిలోని తేలిసికోవాలన్న స్వభావానికి - చెందినదీ సూత్రార్ధము. ఇవన్నీ ప్రతిమనిషి స్వభావమో కాదో పరికించండి. ఈ విషయంలోనూ తెలియవలసింది మారుతుందే కానీ తెలిసికోవాలన్నది మారదన్న మాట.
 మృత్యోర్మాఅమృతంగమయ: -  మృత్యు:మా, అమృతం, గమయ అన్న శబ్దాల కూడికే ఈ వాక్యాము. ఇది జీవన పోరాటానికి చెందిన అంశము. ఇది మిగిలిన రెండు వాక్యములకూ ముగింపు వాక్యంగానూ ఉంది. ఉండాలనుంది అన్న స్వభావానికి సూచనగానున్న సూత్రమిది. Straggle for Existence. అన్న సూత్రమునే యిది వ్యక్త పరుస్తోంది. ఇది ప్రధమ కోర్కెగానున్నది. ఉండాలనుంది అన్నామంటేనే అది యిష్టమనీ, ఆటంకాలెదురౌతున్నాయనీ అర్థం వస్తున్నది. ఆ ఆటంకాలేమిటో అనుభవంలో చూస్తే 1. తరగిపోవడంగా నున్నది. అది యిష్టంలేదు. కనుక ఆశయసిద్ది - ఉండాలన్నది - నేరవేరాలంటేనే తరుగుదల - ఉండరాదన్నది తెలియబడింది. కనుకనే ఎదగాలన్న కోర్కె ఏర్పడింది. జీవితాన్ని చూస్తే నడిపించేది జ్ఞానంగా ఉంది. ఆశయం వైపుకే నడక సాగించాలన్నా , ఆశయసిద్ధిని గమనించాలన్నా జ్ఞానం అవసరంగా ఉంది. . కనుక 2వ కోర్కెగా  అజ్ఞానము లేక భ్రాంతి జ్ఞానం నుండి జ్ఞానం, లేక సత్యజ్ఞానంలోని కదలాలన్న కోర్కె ఏర్పడింది. పైశ్లోక భావం యిదే. మూడవమాటగా చెప్పబడిన అమృతత్వం సాధ్య నిషయంగా ఉంది. అది సాదించు కొనుటకు బలమూ, దానిని సరిగా వినియోగింపజేయు సరైన జ్ఞానమూ అవసరమైనాయి. అవే 1, 2 వాక్యాలలో చెప్పబడింది.
   సారాంశమేమంటే ప్రతి మనిషి ఉండాలనీ, బలంగా ఉండాలనీ, తెలుస్తూ ఉండాలనీ కోరుకుంటున్నాడనియే. ఇది ఒక మతానికి చెందిన విషయం కాకుండా జీవ ప్రవృత్తికి చెందిన అంశమై తాత్వికవిలువ కలిగి ఉంది. యదార్థంగా తాత్వికత మతపరిధిని దాటి సర్వ మానవాళినీ ఉద్దేశించి సర్వ కాలాలకూ చెందినదిగా ఉంటుంది. ఇది ఎప్పుడూ గమనింపులో ఉంచుకోవాలి. Note ధర్మానికీ, తత్వానికే ఉన్న తేడానూ, సంబంధాన్నీ ఎరగడమన్నది జీవితాధ్యయనంలో అత్యంతప్రధానమైన అంశమై యున్నది.
ముఖపత్రంలో క్రింది భాగాన వున్న శ్లోకం కూడా ఇది మతపత్రిక అను కునేందుకు వీలుగా ఉంది. అయితే దానినిన్నీ విశ్లేషించి చూద్దాము..
నమోబ్రహ్మధిభ్యః :- బ్రహ్మా మొదలగు వారికి నమస్కారం, భారతీయ యోచనలో బ్రహ్మ ప్రధమ జీవుడూ, ప్రథమ జిజ్ఞాసువు, ప్రధమవేత్తా, ప్రధమ గురువూ కూడా. కనుక విద్యాసంప్రదాయాన్ని బట్టి ప్రధముడూ, పెద్దవాడూ అయిన బ్రహ్మకూ, అదే మార్గములో నున్న తదనంతరం వారికీ, (ఆది శబ్దంచేత పరంపర బోధింప బడింది) నమస్కారమన్న భావంవిద్యా భోధకులా, ప్రవర్తకులా ఎడ నినయాన్ని :- ఈనాడు జిజ్ఞాసువులో ప్రవేశ పెట్టేయత్నమే, ఇక్కడ చేయబడుతోంది.
           బ్రహ్మవిద్యాసంప్రదాయ కర్తృభ్యః :-- ఈ వాక్యాన్ని రెండుగా అర్ధం చేసికోవచ్చు. 1. మొదటి వాక్యంతో కలిపి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ప్రారంభించి, కాపాడుతున్న బ్రహ్మ మొదలైన వారలకు నమస్కారము. 2. దీని వరకే అర్థం చెప్పుకుంటే బ్రహ్మవిద్యా -- (పెద్ద విద్య -- లేక అన్ని విద్యలకూ ఆధారమని చెప్పదగ్గ విద్య ఏదో అది) పరం పరను [తరంనుండి తరానికి అందించే పద్ధతిని] ఏర్పరచి, కొనసాగేట్లు చేస్తున్న వారు సాంప్రదాయ కర్తలనబడతారు. అట్టివారిని  విద్యార్థిచే స్మరింపజేస్తున్నారు. వారియెడ వినయాన్నీ, వినమ్రతను అభ్యాసిలో ప్రాదుకొల్పుతున్నారు గురువులు.
       వంశ ఋషిభ్యః :- వంశ ఋషులన్న మాటకు వ్యవహారంలో కుల గురువులు అన్న అర్దం చేయబడుతోంది. అయితే ఈశ్లోకము, విద్యార్థికి , గురువులూ, విద్యా సంప్రదాయ రక్షకులూనైన వారి ఎడల ఉండదగ్గ భావానికి చెందినదై యుండుట వలన, వంశ ఋషులు అన్నమాట పూర్తి భిన్నభిన్న శాఖలుగా నున్న విద్యా బోధకులనూ, ప్రవర్తకులను సూచించునదిగా స్వీకరించుట ఉత్తమము. అప్పుడు లోకంలో ప్రవర్తిల్లుతూ మానవ వికాసానికి పనికి వచ్చు అన్ని విధ్యలకు చెందిన బోధకులూ ప్రవర్తకులూనైన వారలనున్నూ విద్యార్ధి విసయ పూర్వకంగా స్మరించు నట్లు చేస్తున్నారన మాట.
  మహద్బ్యో నమోగురుభ్యః :- మహనీయులైన అట్టి జ్ఞానప్రధాతలకు గురువులకు అందరకూ సమస్కారమన్నది ముగింపు వాక్యం.
మొదటి సాధకుడూ, బోధకుడూ, పరం పరను ప్రారంభించి తానెరిగిన విద్యను సమాజానికి అందించి, వారున్నూ అట్లే అందించునట్లు ఒక బాట నేర్పరచిన బ్రహ్మకూ, తదితరులకున్నూ అంటూ ప్రారంభించి ఆద్యాత్మ విధ్యా -- బ్రహ్మ విధ్యా - సాంప్రదాయ ప్రవర్తకులును పిదప స్మరిస్తూ, అన్ని విద్యాశాఖా ప్రవర్తకులను కూడా స్మరిస్తూ, అట్టి మహనీయులైన గురువులందరకూ నమస్కారమను భావన ఎంత ఉదాత్తమంగా ఉందో గమనించండి. నిజంగా విద్యార్థికిగానీ, విద్యాబోధకులకుగానీ - బోధకులు కూడా ఒక నాటి విద్యార్థులేకదా- ఈ శ్లోక భావం వంటబట్టి తదనుగుణ్యంగా విధ్యా ప్రధానమూ, విద్యార్థనా, కొనసాగిన అట్టి విద్యావ్యవస్థ సమాజమంతకీ మేలొనగూర్చగలదు కదా?
          Note: - దీనికి భిన్నంగా ఉన్న నేటి విథ్యాలయాలూ, బోధకులూ, విద్యార్ధులూ,విద్యాలయ నిర్వాహకులూ అన్న, మొత్తం విద్యావిభాగాన్ని పరిశీలిస్తే పై శ్లోక భావం. నేడు ఆ విభాగంలో ఎవరికీ పట్టకుండా ఉండడం కొట్ట వచ్చినట్లు కనబడుతుంది.
మేలుకొలుపు :- పత్రికను ప్రారంభించాలనుకున్న వెంటనే ఏ పేరు పెట్టాలన్న ఆలోచన బయలుదేరింది.మేలుకొలుపు" అన్నది సంస్థ ఆశయాన్ని సమాజంలో ప్రస్తుత ప్రధమావసరాన్నీ సమగ్రంగా చాట గలిగి ఉండాలన్న భావంతో ఆలోచించడం జరిగింది. పిలుపు, సమాలోచన, అంతర్మధనం, జ్యోతిర్మయి మొదలగు అనేక మాటలను కూడా  పరిశీలించాము. మేలుకొలుపులో జ్ఞానం - చూపు కలిగి యుండడం, అజ్ఞానం తోలగించుకోవడం అన్నది ప్రధానంగా ఉన్నా, మానవ జీవితం, దానితో ముడిపడి యున్న సమస్త విషయాలలోనూ, ఉండకూడని స్థితిని గమనించి తొలగించుకోవడమూనన్నది కూడా, వ్యక్తం చేయవీలుంది. కనుక మేలుకొలుపు కావలసిన కార్యానికి తగిన స్ఫూర్తి నివ్వగల నామంగా ఎంచి స్థిరపరచాము.
    ముఖ్య గమనిక :- ముఖ చిత్రంపై కొన్ని విషయాలు వివరణాత్మకం గానూ, మరికొన్ని సంగ్రహంగానూ పాఠకుల ముందుంచడం జరిగింది. ఈసారి సంచిక, స్వమంతవ్యంపై చర్చా వేదికకుచెంది ప్రత్యేక సంచిక అవుతుంది. కనుక మేధావులూ, వివేచనా శీలురూ, నిష్పాక్షికులూనైన వారెల్లరూ వారివారి యభిప్రాయములను నిష్కర్షగా పంపగోరుతున్నాము. వీలయినంత వరకు అన్నింటినీ ప్రత్యేక సంచికలో ప్రకటించగలము. సెప్టెంబరు 15వ తేదీలోపుగా చర్చా వేదిక ప్రత్యేక సంచికకు మీ మీ యభిప్రాయములను పంపండి
అభ్యాసక్రమము :-  రెండవపాఠం
ప్రధమ పాఠంలో నేను చెప్పిన అంశములను క్షుణ్ణంగా పరిశీలించిన పిదపనే ఈ పాఠం చదువదగి యుంది. అనేకులలో ఏవేవో కొద్ది కొద్ది సాధనలుసల్పి తానిక సాధనలు చేయవలసిన స్థితిని అధిగమించానని ఎంచుట జరుగుచున్నది. అది సాధనను గూర్చి ఉండవలసినంత అవగాహన లేకపోవడాన్ని సూచిస్తూందేగాని, సాధనలు చేయనక్కర లేని స్థితిని తెలుపదు. ఎందుకంటే మార్పు అన్నది సాధనకు ఆలంబనగా నున్న విషయము. నిజంగా ఆత్మ విమర్శ చేసికోగలిగితే తన మనస్సు ఏదో కోణంలో మార్పును కోరుతున్నదీ లేనిది తెలియ గలదు. ఏ విషయంలో ఏరకమైన మార్పు అన్నది స్పష్టంగా గమనించగలగాలి. అసలు రహస్యమంతా అక్కడనే ఉంది. ఎందుకంటే. .
అస్థిత్వ పోరాటమూ, ఎదుగుదల, గుర్తింపూ, భోగప్రాప్తి అన్నవాటినీ, వాటి నుండి ఏర్పడవలెననుకుంటున్న ఆనందస్థితినీ మనస్సు యిష్టపడుతోంది. క్రమబద్ధమైన, నిరంతర యత్నంలేక అవి లభించుటలేదు. క్రమబద్ధమైన, యత్నాన్నే సాధన అంటామన్నది గమనించితే సాధన ఆ జీవితం చేయవలసినదిగా తెలుస్తుంది. అయితే సాధన రెండు స్థాయిలు కలిగి ఉంటుంది. 1. అభ్యాసస్థాయి, 2. పరిణితిచెందిన - సిద్ధ - స్థాయి. ఇంత మాత్రమే తేడా, సాధనలు అవేన్నైనా ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు తరిగిపోకుండానూ, పెరిగేట్లున్నూ చేసుకునేందుకే ఉద్దేశించి ఉంటాయి. అభ్యాస స్థాయిలోని వ్యక్తులలో సాధన అపరిపూర్ణంగాసూ, సిద్ధస్థాయిని పొందిన వారిలో పరిపూర్ణంగానూ (లోపరహితంగా అనే ఈమాట కర్ధం) ఉంటుంది. సిధ్ధావస్ధలో అది అలవాటుగా - సహజంగా - సాగుతుంటుంది. అభ్యాస స్థాయిలో కష్టంతో కూడుకుని సాగుతుంటుంది.
నేడు దాదాపు అన్ని రకాల సంఘాలలోనూ మరచిపోబడిన,విడిచి పెట్టబడినఅంశమిది. ఎవరికి వారు తాము పరిణితి చెందే ఉన్నానన్న భావన. ఎదుటి వారి నుద్దరిద్దామనో, ఉద్దరిస్తు న్నామనో భ్రాంతభావన దృడంగా వేళ్ళూనుకుని ఉంది. సాధన ప్రారంభించాలను కుంటున్న, ప్రారంభించి కొనసాగిస్తున్న, పరిణితి చెందినస్థితిలో నున్న వివేక వంతులారా! సాధన ఆ జీవితం చేస్తూ, యితరులున్నూ చేయునట్లు ప్రేరేపిస్తూ ఉండడం సరైన విధానమనీ, అది మనకూ, యితరులకున్నూ మేలొన గూర్చగల ఆధార స్థాసమనీ గమనించండి. మేల్కొండి. మేలుకొలపండి; కదలండి. కదిలించండి. యధార్థ సాధకులుకండి. అయితే యిక్కడోవిషయం మరల గుర్తు చేసికోవలసి ఉంది. మార్పుకోరుతున్నా రాలేదా ? ఆలోచించి పత్రికకు వ్రాయండి. .
స్పందన - ప్రతి స్పందన.
1. స్పందన:- తిరుపతి నుండి రఘపతిరావుగారు మేలుకొలుపు పడుతున్న శ్రమను అర్థం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో శ్రమతోనూ, వ్యయం లోనూ కూడుకొని ఉంటాయి. పైగా సహేతుకంగా ఉన్న దానిని సమ్మతించడం గానీ, మార్పు చెందడం గానీ చాలా చాలా అరుదు. ఆ స్థితికి సమాజం వచ్చేదాకా మీరు ఒంటరిగా పెనుగులాడ వలసిందే కదా ! అంటూ వ్రాశారు.
ప్రతి స్పందన :-- సహృదయం తో వ్రాసిన మీ భావాలను అర్ధం చేసికున్నాను. సమాజపు ప్రస్థుత పోకడ ఎలా ఉందో అర్ధం చేసికున్నారన్న విషయం మీ లేఖవల్ల తెలుస్తోంది. అది నిజమే అయినా మార్పు రావలసింది ఉన్న సమాజంతోనే కదా! మరియు మార్పు తేవడానికి యత్నించేవారు రావలసింది ఉన్న సమాజం నుండే. మీలానే మార్పు అవసరాన్నీ , మార్పు తెచ్చుటకై వెచ్చించ వలసిన శ్రమనూ, కాలాన్ని గమనించిన వారున్నూ ప్రస్తుత సమాజంలోనే ఉన్నారు. ఏకీకృతం కాగలిగితే ఒక సంఘటిత శక్తి ఏర్పడి యత్నారంభం కాగలదు అనుకోవడం వరకు, సమస్యను చాల మందిని గమనించే ఉన్నాను. ఇకపై మరికొంత క్రియాత్మకంగా కదలవలసి ఉంది. అంతే.
స్పందన :- 2. వారే, వారి గురించి పరిచయం చేసికుంటూ నేను చాలా మారాను. అయినా వెలుగు ఎక్కడలభిస్తే అక్కడకు చేరడానికి వెనుకాడను. పత్రిక లోని విషయాలను కలసినప్పుడు చర్చించగలను. నకై సంచికలు వెచ్చించకండి. వీలైనప్పుడు కలవడానికి యత్నిస్తానుఅని వ్రాశారు.
ప్రతి స్పందన :- ఈ విషయమై వారికి లేఖ ద్వారా ప్రత్యుత్తర మొసగినా ఇట్టి యభి ప్రాయమే గల పాఠకులు మరి కొందరుండవచ్చునని ఎంచి, ఈ విషయాన్ని గూడా పత్రికలో వేస్తున్నాను.
మీలానే మార్పు చెందిన వారూ, సరైన మార్పు చెందడానికి ఇష్టపడేవారు లోకంలో ఉన్నారు గనుకనే మేలుకొలుపు అవసరమూ, ప్రయోజనమూ కూడా కలుగుతున్నాయి. అట్లుగాక మేల్కొడానికి (సరైన మార్పుకు) యిష్టపడనివారి విషయంలో - నిజాయితీ లేని వారి విషయంలోనూ, మేల్కొల్పు నిరుపయోగమే. నిజాయితీ పరులైన సాధకులెల్లరూ ఈ విషయం గమనించగలరని ఆశిస్తాను. నాకై సంచికలు వెచ్చించకండి అన్నారు. నిష్కర్షగా చెప్పాలంటే, మరే మార్పుని అంగీకరించి స్వీకరించే, మీలాటి - మనలాటి అంటే, మరింత సబబుగా ఉంటుంది. వారి కొరకే మేలుకొలుపు పుట్టింది. కనుక ఈ విషయంలో, వెచ్చించడం అనడం కంటే, సద్వినియోగ పరచడం అన్న మాట బాగుంటుంది. మనం కలవాలన్నదే నా ఆకాంక్ష. ఇట్టిభావాలే ఉన్న ఇతరులనున్నూ ఈ లేఖా ముఖంగానే ఆహ్వానిస్తున్నాను. మనం కలిసే యత్నం మీనుండిన్నీ చేయండని.
2. స్పందన:-.యుద్దనపూడి శ్రీనివాస్ పత్రిక 6వ సంచిక చాలా స్పూర్తి దాయకంగా ఉంది. నా మిత్రులు మరి కొందరున్నూ సంచికలు కావాలన్నారు. అలాగే సత్యాన్వేషణా మండలిలో సభ్యునిగా చేయుటకు కలనియమ నిబంధనలు తెలుపగలరు అంటూ వ్రాశారు.
 ప్రతి స్పందన :-- మంచిదండీ, పత్రికలు పంపుతున్నాను. వీటిపై మీలో మెదలిన భావాలు నిష్కర్షగా పత్రికకు పంపండి. నలుగురకు ఉపయోగించవచ్చు. పోతే సభ్యులగుటకు ప్రత్యేక నిబంధనలేమీలేవు. నిజాయితీగా, సరైన మార్పును కోరే స్వభావమూ, సత్యజ్ఞానాన్ని ఆర్జించి, అమలులో పెట్టుకోవాలనే తపన, భ్రాంతి జ్ఞానాన్నీ, విశ్వాసాల్ని విడువగల తెగువా ఇవే సత్యాన్వేషణ మండలిలో సభ్యులగుటకు అసలైన అర్హతలు. ఇవిపున్న వాళ్ళంతా సత్యాన్వేషణ మండలిలో చేరవచ్చు. ఈ గుణాలు కలవాళ్ళకు తగిన సాధన క్రమముంటుంది. దానిని సాధన చేయాల్సి ఉంటుంది.
3. స్పందన: - ఎ. పుల్లారావు. వైజాగ్ నుండి. ఓం ప్రకాశ్ గారి లేఖపై. మీ ప్రతి స్పందన తగినట్లు లేదన్న భావాన్నీ , వారి లేఖను యథాతథంగా ప్రచురిస్తే, పాఠకులకు నిస్పాక్షికంగా విషయాన్ని గ్రహించేందుకు అవకాశముండేదన్నభావాన్ని వ్యక్తం చేశారు.
8. ప్రతి స్పందన:- ఓం ప్రకాశ్ గారి లేఖ మొత్తంగా ప్రచురిస్తే బాగుండేదన్న సూచన బాగుంది. కానీ సంచికకు సంబంధించని వాక్యాలను కూడా కలుపుకుని ప్రచురించడం సాధ్యపడదు. ఎందువల్లనంటే స్థలాభావమొకటి. (సుధీర్ఘమైన లేఖలు ఉండవచ్చు) 2. అవసరం లేకపోవచ్చు. పాఠక మిత్రులూ, పుల్లారావు గారూ. ఈ విషయాన్ని అర్ధం చేసికోగలరని భావిస్తాను. అయితే లేఖలోని సంబంధితాంశములనేమీ విడువలేదు. ఏ లేఖకుల విషయంలోనైనా ఈ నియమాన్ని పాటించడం జరుగుతుంది.
4. G. పాండవులు M. A. గారు పొదిలనుండి ప్రశంసాత్మకంగా లేఖ వ్రాస్తూ, మీ వ్రాతలు బుద్దీ ప్రచోదితములనుట నిస్సందేహము. నిజము నిష్ఠరము అనుమాట నిత్య సత్యము అన్నారు.
ప్రతి స్పందన :- ప్రశాంసాత్మకమైన మీ లేఖను ప్రోత్సాహకారకంగా స్వీకరించాను. ధన్యవాదములు. మేలుకొలుపు కార్యక్రమంలో భాగస్వాములుకండి. అన్నదే నానినాదము. గమనించి తిగిన విధంగా స్పందించగలరని ఆశిస్తాను..
 ఇంకను అనేక ఔత్సాహిక, సాధక పాఠక మిత్రులనుండి క్రొత్త చిరునామాలు కూడా అందుతున్నాయి. డా. C. నారాయణ రెడ్డిగారి నుండి ఓ అభినందన లేఖ అందినది. -
-: ముఖ్య గమనికలు:--
                 1. 6, 7 సంచికలు స్వమంతవ్యం (నేనూ, నా పత్రిక) అన్న అంశానికి చెందినవి. వీటిపై పాఠకులందరినుండి స్పందన కోరుతున్నాము. అభిప్రాయములూ, విమర్శలూ, సూచనలూ, దోషాలూ పంపగలరు. 8వ సంచిక స్వమంత్రవ్యం [6, 7 సంచికల] పై, విమర్మా, సమీక్షల కొరకుగా ప్రత్యేకించబడింది. అవసరాన్ని బట్టి 9వ సంచికను కూడా ఇందుకై వినియోగించగలను. అయితే సెప్టెంబరు 15 - లోపుగా మీమీ స్పందనలు వంపవలసి ఉంటుంది.
2. అభ్యాసక్రమాన్ని గూర్చి, సాధనలు చెప్పమొదలిడే ముందుగా జిజ్ఞాసువులూ, సాధకులు, గమనించవలసిన కొన్ని విషయాలను సాధనకు ప్రాతిపదికగా (వేదికగా) ఉండగలవి చెప్పుచున్నాను. గమనించి వీటిపైన మీ మీ అభి ప్రాయాలు తెలుపండి.
  3. అక్టోబర్ 16, 17, 18, తేదీలలో, ప్రతి మూడు మాసాలకూ జరుగవలసిన సమీలోచన శిబిరం జరుగుతుంది. మేలుకొలుపు కార్యక్రమంలో పాలుపంచు కుంటున్న , పంచుకోవాలను కుంటున్న వారందరూ విధిగా కార్యక్రమానికి రావలసి ఉంటుంది. ఈ విషయం పైననూ అవసరమనుకున్న వారు ఉత్తర ప్రత్యుత్తరాలు ర్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. పాఠకులందరూ తమతమ పూర్తి చిరునామాలతో లేఖలు వ్రాయ గోడ చున్నాను.
పాఠకుల పరిచయం :-- 91. శ్రీ స్వామి చిదానందపురి. హరిద్వార్, 92. A. శివరామకృష్ణ – హైదరాబాద్, 93. స్వామి రామకృష్ణానంద. యల్లంపల్లి, 94. స్వామి బోధానందపురి. చింతలపూడి, 95. ప్రొ. G. నాగేశ్వరరావు. తిరుపతి, 96. M.త్రివేది. M. A. నర్సీపట్నం,97. G. B. S. శేషగిరి, 98. శ్రీమతి. T. ఇందిరమ్మ. నెల్లూరు, 99. శ్రీ M. V. నారాయణ రెడ్డి నెల్లూరు, 100. శ్రీ CH. రమణయ్య. విజయవాడ. 101. వసంత నాగేశ్వరరావు. హైద్రాబాద్, 102.  G. విజయలక్ష్మి. పాలకోడూరు, 103.  రఘపతిరావు. తిరుపతి, 104 . డా. M. గురవయ్య  మదనపల్లి, 105. పణ్వానంద స్వామి అగరం, 106. ఆచార్య శంకరానంద. శ్రీ కాళహస్తి, 107. పూర్ణానందస స్వామి. కారంచేడు, 108. భూమానందస్వామి. కళ్యాణ దుర్గం. 109. నిర్విశేషానందస్వామి. ఖమ్మం, 110 రమణానంద స్వామి. ముండూరు, 111. బుమత్ మనందస్వామి, న్యూబోంబే, 112. విద్యాప్రకాశానందగిరి, శ్రీకాళహస్తి, 113. మహేశానందస్వామి, నెల్లూరు, 114. శ్రీ కృష్ణానందగిరి, ఇనుమడుగు,115. సత్యానంద ఆశ్రమం, ఇనుమడుగు, 116. పరి సుధానందజీ, హైద్రాబాదు, 117. అశేషానంద స్వామీజీ, వెలిమనేడు, 118. ప్రసన్నానంద స్వామీజీ, గాంధీపాలెం, 119. ప్రసన్న చైతన్యజీ, మద్రాసు, 120. స్వామి జ్ఞానానంద, మద్రాసు, 121. శ్రీ రామకృష్ణ మఠ్, రాజమండ్రి, 122. శ్రీరామ కృష్ణానందజీ, కడప, 123. శ్రీ వాసుదేవానందజీ, 124. పూర్ణానంద స్వామి, నెల్లూరు, 125. గంగాధరానందజీ, వైకుంఠపురం. 126. సత్యనారాయణ, గిద్దలూరు. 127. స్వామి శివానంద బ్రహ్మచారి, జీవారణాసి. 128. సి. గంగులయ్య, కర్నూల్, 129. రామమూర్తిజీ, శ్రీకాళహస్తి, 130. మాధవ చైతన్య, వారణాసి, 131. దువ్వూరు రమణయ్య, 132. బ్రహ్మ నిష్టా సట్ స్వతి, గుంటూరు, 138. ప్రభాకరశర్మ, ప.గో. జిల్లా, 134. సరాత్మ చైతన్య, ప.గో. జిల్లా, 135. సదానంద బ్రహ్మచారిజీ, వారణాసి, 186. బి. కే. రావు, బొంబాయి-14.
Book-Post చూ చిరునామా: మేలుకొలుపు C/o సత్యాన్వేషణ మండలి సీతానగరం, పోలకంపాడు (P...) గుంటూరు జిల్లా, పిన్ 522515.

1 comment:

 1. కలియుగాంతం ఎలా అవుతుంది ?
  ---------------------------------------------
  కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".

  రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో  పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.

  అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే

  చిన్ని శ్రీ కృష్ణుల నుంచి
  -------------------------------
  2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.

  గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి )
  --------------------------------------------------
  ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.

  నా జన్మ రహస్యం తెలిసింది.
  నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.
  నన్ను " తథాగతుడు" అని అంటారు.

  గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి )
  ------------------------------------------------
  ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.

  ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.

  ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.

  తథాగతుడు అంటే
  --------------------------
  యదా రాజా - తథా ప్రజా
  యదా భగవంతుడు - తథా భక్తులు
  యదాగతుడు - తథాగతుడు

  యదా భగవంతుడు - శ్రీ రాముడు
  తథా భక్తులు - పాండవులు
  యదాగతుడు - శ్రీ కృష్ణుడు
  తథాగతుడు - గౌతమ బుద్ధుడు

  అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి
  అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు
  త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.

  త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.

  యదా భగవంతుడు
  --------------------------
  త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.

  తథా భక్తులు
  -----------------
  ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.

  యదాగతుడు
  ------------------
  శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.

  తథాగతుడు
  ----------------
  కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.

  తదుపరి
  చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.

  తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.

  వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.

  కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.

  కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?
  -------------------------------------------------
  కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.

  మహాయుగం ఆయుష్షు    :    43,20,000

  కృతయుగం ఆయుష్షు      :   17,28,000
  త్రేతాయుగం ఆయుష్షు     :    12,96,000
  ద్వాపరయుగం ఆయుష్షు  :      8,64,000
  కలియుగం ఆయుష్షు.       :      4,32,000

  కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరములకు కొంచెం అటు ఇటుగా.

  ReplyDelete